Site icon Sanchika

పాము

[dropcap]ఆ[/dropcap]ఫీసు నుండి ఎప్పుడూ నీరసంగా వచ్చే ఆయనగారు ఇవాళ ఆరుంబావుకే ఇంటికొచ్చేశారు హుషారుగా.

“ఏవిటి విశేషం?” అనడిగా.

చిర్నవ్వుతో బ్రీఫ్ కేస్ టీపాయ్ మీద పెట్టి స్నానానికి వెళ్లారు.

లంచ్ బాక్స్ కోసం బ్రీఫ్ కేస్ తెరిస్తే పేపర్ పేకెట్ ఏదో కనిపించింది. తెరిచి నివ్వెరపోవడం నా వంతయింది.

“ఏమిటిదంతా?” అని అడగలేదు బైటికొచ్చిన తరువాత కూడా.

పిల్లలిద్దరూ తండ్రి తెచ్చిన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ అక్కడే ఉన్నారు. పసిబిడ్డల ముందు సీరియస్ సీన్లు నా కిష్టం ఉండదు.

పేకెట్ బెడ్ రూంలో భద్రం చేసొచ్చా. కానీ, మనసంతా దాని చుట్టూతానే!

ఒకటా.. రెండా.. ఏకంగా.. ఆరు లక్షలు.. ‘రెండువేలు’ డినామినేషన్‌లో మూడు బ్యాంక్ కట్టలు!

ఎట్లా చూసినా అంత పెద్ద మొత్తం ఒకే దఫా ఇంటికి తెచ్చే అవకాశం లేదు. ఉండే 2 H K ప్లాట్ తప్ప చెప్పుకో దగ్గ వస్తువులేవీ ఇంట్లో లేవు. ఆయన ఎక్కి తిరిగే సెకెండ్ హ్యాండ్ బైక్ కూడా రిపేర్ కని షెడ్డులో ఉంది.

ఎవరైనా ఫ్రెండ్ భద్రం చేయమని ఇచ్చారేమో అని సర్టి చెప్పుకుందామనుకున్నా. ఆయన మొహంలోని ఆ ఆనందం పరాయి సొమ్ము వల్ల వచ్చేదైతే కాదు. అందుకే ఆందోళన.

రాత్రి బెడ్ రూంలో ఆయనగారు రహస్యం విప్పారు.

అది రహస్యం కాదు. బాంబ్ ! పెద్ద బాంబ్!!

భయభయంగా పాకెట్ పెట్టిన సేఫ్ వంక చూస్తూ అడిగా. “ఇలా చెయ్యచ్చా! అందునా.. మీ బోటి వెల్ ఎడ్యుకేటెడ్?!”

“చేయకూడదు.. నిజమే! నీకు లాగా నేనూ గుంజాటన పడ్డా. మరో దారి లేకపో యింది శశీ ఆ టైమ్‌లో” అన్నారు సంజాయిషీగా.

ఆఫీసు నుంచి తిరిగొస్తుంటే ల్యాండ్ రిజిష్ట్రేషన్ ఆఫీసెదుట ఒక ముసలాయన నిలబడున్నాడుట దేని కోసమో ఎదురు చూస్తో.. చేతిసంచీతో. బండి ఆపి లిఫ్ట్ అడిగితే.. పెద్దాయనగదా అని ఈయనగారే బండిలో ఎక్కించుకున్నారుట.

“మాటల సందర్భంలో ఆయనదీ వూరు కాదని తెలిసింది. పిల్ల పెళ్లికని అవసరార్ధం ఓ రెండెకరాల కొండ్రను అమ్మాడుట. “అంత డబ్బు పెట్టుకుని ఒంటరిగా సిటీలో తిరగడమేంటి! పెద్దాయనా! తొందరగా ఇంటి కెళ్లి పో” అంటున్నానో లేదో.. ఆగిన బండిలోంచి గభాల్న కిందకి దూకినట్లే దిగి పక్క నున్న సందులోకి పరుగెత్తాడాయన ! అతని వెనకాలే ఓ ఇద్దరు కుర్రాళ్లు తరుముకుంటూ.. ! హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనకు షాక్ అయాను. తేరుకునే లోపలే గ్రీన్ సిగ్నల్ పడ్టం, ట్రాఫిక్ కానిస్టేబుల్ అదిలించడంతో.. బండి ముందుకు మూవయింది. అక్కడికీ ఓ టెన్ మినిట్స్ బండిని రోడ్డు పక్కన పెట్టించి వెయిట్ చేశా.. ముసలాయన తిరిగొస్తే జూబ్లీ దాకా అయినా దింపేద్దానుని. ఆటోవాడి నస భరించలేక వచ్చేశా. దారిలో ఆయన కూర్చున్న సీటు సందులో కనిపించిందీ పేపర్ పేకెట్. ఆటోవాడి కంటబడితేనో.. మరో పాసింజర్ దృష్టి పడితేనో.. ఏమవుతుందో తెలుసు! ముసలాయన కూతురు పెళ్లి సంగతి గుర్తుకొచ్చింది..! నిదానంగా వంగి ఆ పేకెట్ నా జేబులోకి తోసేశా! వీలు దొరికితే ఈ సొమ్ము తిరిగిచ్చేద్దామనే ఇప్పటికీ ఆలోచన” అన్నారాయన.

ఆయనగారి మొహం చూస్తే అబద్ధం ఆడుతున్నట్లనిపించలేదు కాని, జరగరానిదేదో జరిగిందన్న భావన మాత్రం వదల్లేదు.

“మనసుంటే మార్గం దొరక్కపోతుందా! మీరక్కడే ఇంకాస్సేపు ఉంటే మర్చిపోయిన మనిషి తిరిగొచ్చేవాడేమో! రాకపోయినా, గంటో , అరగంటో వెయిట్ చేసి.. ఆనక పోలీస్ స్టేషను కెళ్లుండాల్సింది!” అన్నా కొద్ది బాధగా‌.

“అన్ని ఆప్షన్సూ ఆలోచించా శశీ! ఏ ప్రయత్నమూ చెయ్యకుండానే ఎగేసుకు తెచ్చేసాననుకున్నావా?” ఆయనగారి గొంతులోని నిష్ఠురాన్ని పసిగట్టా. విషయం ఇంకా పొడిగిస్తే సీన్ సీరియస్ అయే ప్రమాదం ఉంది.

కాసేపాగి కామ్‌గా అటు తిరిగి పడుకున్న నామీద చెయ్యేసి “నా గురించి అంత మీన్‌గా ఆలోచించబాక. తెల్లారింతరువాత ఆలోచిద్దాం ఏం చెయ్యాలో! నీ మాటెప్పుడన్నా కాదన్నానా” అన్నారు.

తెల్లారి ఆదివారం. కాఫీ తాగుతూ “పోలీస్టేషను కెళ్లి రానా?” అని అడిగారాయన.

“వద్దొద్దు! వాళ్లే పెద్ద దొంగలు. ఎటూ కాకుండా పోతుందా సొమ్ము. అసలు మనిషి ఎన్ని తంటాలైనా పడి రాకుండా ఉండడు! అప్పుడు చూద్దాంలేండి ఐడెంటిటీని బట్టి!” అన్నా నేను.

“పేకెట్ ఇంటికి తెచ్చేటప్పుడు నా ఆలోచనా అదే. నా హుషారుకు కారణం మీ కజినొస్తున్నాడని.. మన బాకీ తీరుస్తాడేమోనని. ఆ న్యూస్ చెప్పే లోపే ఈ డర్టీ థింగ్ మూడ్ పాడుచేసింది.” అన్నారాయన.

అది నిజం కాదని నాకు తెలుసు. మా కజిన్ రావడం ఇదేం మొదటి సారి కాదు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన టైములో ఈయనకీ ఎగ్జైట్‌మెంటేంటో!

“మనీ ముందు బ్యాంకులో వేసి రండి! లాకరన్నా తీసుకోండి!” అని ఎలర్ట్ చేస్తే

“అక్కౌంటంటే లెక్కలడుగుతారు తల్లీ! లాకర్లకు ఇప్పుడు చాలా టైట్ గా ఉంది!” అన్నారు.

“మరేం చేద్దాం! వాడున్నన్ని రోజులూ పన్లు మానుక్కూర్చోవాలా నేను!”

నా బుంగమూతి మీద చిటికేస్తూ “డోంట్ బి సిల్లీ! సొంత కజిన్ మీదే అంత అనుమానం తగదు! అయినా ఓ రెండు రోజులేగదా! కొడుక్కేదో సంబంధం సెటిలయిందట. ఆ పిల్ల తండ్రి ఇక్కడే ఏ.జీ.ఆఫీసులో యూడీసీ అన్నాడు” అన్నారాయన.

మంత్లీ ట్వంటీ థౌజండొచ్చే ఐఎల్టీడీ స్టోర్ కీపరుద్యోగాన్నే ఆఫ్ర్ట్రాల్ ఓ యాభై వేలకు కక్కుర్తి పడి ఇబ్బందుల్లో పెట్టుకున్న మహానుభావుడు వాడు. కొడక్కొచ్చే కట్నం నుంచి బాకీ తీరుస్తాడని ఈయనగారి కలలు!

ఎందుకైనా మంచిదని ఈ ఆరు లక్షల పేపర్ పేకట్ అటక మీది పాత ఎయిర్ బ్యాగ్‌లో బట్టల కింద కుక్కేశా.

కజిన్ ఉన్న రెండు రోజులూ ఇంటికి కుక్క కాపలానే నాది. ఆయనటు ఆటో ఎక్కాడో లేదో, ముందు బ్యాగ్ కిందికి దింపి చూశా. ఎక్కడి వస్తువు అక్కడే ఉంది. గండం గడిచిందనిపించింది.

***

సెకండ్ సాటర్ డే శెలవు. తీరిగ్గా లంచ్ చేసుకుని టీ. వీ చూస్తుంటే డోర్ దగ్గర చప్పుడయింది.

కానిస్టేబులొకతను.. ఎస్సైగారితో సహా లోపలి కొచ్చాడు! వెనకనే ఓ ముసలాయన. మావారిని చూసి అతను “సార్! గుర్తున్నానా? ఆ రోజు ఆటోలో.. మీతో పాటే వచ్చా. అదేదో కూడలి కాడ.. “

“..దిగిపోయాట్ట గదా.. మేనళ్లులిద్దరు వెంటబడుతుంటే! ఆ గత్తర్లో తన చేతి సంచి ఎక్కడో పడిపోయిందనీ.. వెతికి పెట్టమని రోజూ స్టేషను కొచ్చి గోల! ఒకసారి కేస్ రిజిష్టరయితే క్లోజయిందాకా మా ఫాలో అప్ తప్పనిసరి. ఆ హెడేక్ ఎందుకని ఎఫ్‌ఐఆర్‌ రాయక ముందే.. “

అర్థమయింది. ఇంట్లో చెకింగ్ కన్న మాట ఈ తిప్పలన్నీ..! వద్దంటే మాత్రం వదిలేస్తారా పోలీసోళ్లు!

కాని, ఉన్న ఒక డౌటూ అడక్కుండా ఉండలేకపోయా. “మా ఇల్లే అని ఎట్లా తెలిసిందీ? అసలీయనే ఆ మనీ పోగొట్టుకున్న మనిషని గ్యారంటీ ఏంటి సర్‌?”

“సి.సి ఫుటేజి ఉంటుందిగా మేడమ్! సనత్ నగర్ జంక్షన్ దగ్గర ఈ ముసలాయన ఆటో దిగాడు. ఆ బండి నెంబర్ని ఫాలో చేస్తే బండిలో ఉన్న రెండో మనిషి.. ఇదిగో.. ఈ అపార్ట్‌మెంట్ ముందు దిగాడు. ఆ ఆటో డ్రైవర్ని పట్టుకు విచారిస్తే ఈ ఫ్లాట్ చూపించాడు! సర్, ఈ మనిషిని మీరు గుర్తు పట్టగలరా?.. కేర్‌ఫుల్‌గా చూసి చెప్పండి!” అన్నాడు ఎస్సై కాస్త దర్పంగా.

మావారు తటపటాయిస్తూ అన్నారు “కరెంటు పోయి డిమ్‌గా ఉందండీ రూటంతా! సిగ్నల్ దగ్గర ఒకే గానీ, అక్కడయినా అట్టే సేపు బండాగిందెక్కడా.. గుర్తు పట్టడానికి?..”

“ఈ ఓల్డ్ మ్యాన్ స్టేషను కొచ్చి రోజూ గోల.. ఇట్లా మనీ పోయింది.. వెదికించి పెట్టరమని. ఈ కానిస్టేబుల్ జస్ట్ ఓ ఫైవ్ మినిట్స్‌లో అంతా చూసొస్తాడు.. అదీ, ఈ ముసలాయన శాటిస్‌ఫేక్షన్ కోసం” అంటూండంగానే ఆ కానిస్టేబుల్ వెదుకులాటలో పడిపోయాడు.

అతగాడికి అటక మీది ఎయిర్ బ్యాగ్‌లో పేపర్ పేకట్ దొరకనే దొరికింది!

ఎస్సైగారికి నేనే కలగజేసుకుని వివరంగా చెప్పాల్సొచ్చింది జరిగిందంతా.

“ఐ కెన్ అండర్‌స్టాండ్ మేడమ్! మా డిపార్ట్‌మెంట్ గురించి తెల్సినవారెవరైనా చేసేది అదే! కానీ, మీరు చెకింగ్‌కు ముందే చెప్పుంటే మాకీ తిప్పలు తప్పుండేవి కదా” అన్నాడాయన అదోలా నవ్వి.

“మాకీ ఐడెంటిటీని గురించే వర్రీ సర్! మనీ పోయిన మనిషి.. కూతురు పెళ్లికని పొలం అమ్ముకున్న సొమ్మిది” అన్నారీయన గిల్టీగా.

“ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అట్లాగే ఆలోచిస్తుంది. మా నాన్నగారూ పల్లెటూరి మాష్టారే. మీ కొచ్చిన డౌటే నాకూ వచ్చింది. సి.సి. ఫుటేజినే అల్టిమేట్ ప్రూఫ్ అనలేమనుకోండి. సాలిడ్ ప్రూఫ్ అవసరమే!..” అంటూ ముసలాయన వంక తిరిగి “ఏం పెద్దాయనా.. గ్యారంటీగా ఈ సొమ్ము నీదేనని రుజువేంటీ?” అన్నాడా ఎస్సై కాస్త కటువుగానే.

“రుజువా దొరా! ఇయి సూడండి!” అంటూ కూతురు వెడ్డింగ్ కార్డూ.. ఒక న్యూస్‌ పేపర్ ముక్కా సంచీలోంచి తీసి అందించాడా ఎస్సై గారికి.

“ఈ పేపర్ ముక్కా ప్రూఫు?!” ఆశ్చర్య పోవడం నా వంతయింది.

“ఔౌబిడ్డా! ఇది ఆ పైకం చుట్టిన కాయితానిదే! బండి దిగే గత్తర్లో సంచీ అడుగున ఇరుక్కున్నాది.”

ముసలాయనిచ్చిన పేపర్ పీస్ కేష్ చుట్టిన కాగితం చిరుగుకి సరిగ్గా సెట్ అయింది!

సొమ్ము అందిస్తుంటే అందులోంచి ఓ మూడు నోట్లు పెరికి మా ముగ్గురికి ఇవ్వబోయాడు ముసలాయన.

“మీరే మా డిపార్ట్ మెంటును ఇట్లా చెడగొట్టేది” అని నవ్వుతో మందలించాడాయన్ని పోలీసాఫీసర్.

గంజాయి వనంలో తులసి మొక్కను చూసినట్లుంది నాకైతే!

పాములాంటి పరాయిపొమ్ము క్షేమంగా గడపదాటడంతో మనసు కుదుటపడింది.

***

రెండు వారాల తరువాతనుకుంటా మా కజిన్ మళ్లీ వచ్చాడు.

“బావగారూ! కాస్త లేటయింది. ఏమనుకోవాకండి” అంటూ రెండేళ్ల కిందటనగా తీసుకున్న యాభై వేలు, వడ్డీ కింద మరో ఆరువేలు చేతిలో పెట్టాడు. వడ్డీ తీసుకొనేందుకు మా వారు ససేమిరా అంటే “అలాక్కాదు! అప్పటి కండిషన్లో మీరెంతో పెద్ద మనసు చూపించారు. లేకుంటే నేనీ పాటికి జైల్లో చిప్పకూడు తింటుండేవాణ్ణి. ఆఫీసులో నా కొలీగొకడు డబ్బు కొట్టేసి నా మీదకు నెట్టాడు. ఖర్చుకు వెరవకుండా కోర్టుల చుట్టూ తిరగబట్టి తప్పు సరిదిద్దుకుని కంపెనీ ఎరియర్సుతో సహా నా ఉద్యోగం నాకిచ్చింది. పరాయిసొమ్ము పామని తెలిసీ రోగ్స్ కొద్ది మంది దానివెంట బడ్డమే ఆశ్చర్యంగా ఉంటుంది!” అంటూ కన్నీళ్ల పర్యంతం అయాడు మా కజిన్.

వాణ్ణి తప్పర్థం చేసుకున్నందుకు నాకే సిగ్గనిపించిందా క్షణంలో.

“మనీ కోసమే అయితే మీరొచ్చినప్పుడే చేతిలో పెట్టుండేవాణ్ణి. అవసరానికి నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన మీ దంపతులిద్దరిని స్వయంగా పిలుద్దామనే అర్జంటు పనులెన్నున్నా స్వయంగా వచ్చింది” అంటూ కొడుకు వెడ్డింగ్ కార్డ్ నా చేతికందించాడు కజిన్.

శుభలేఖ చూస్తే కళ్లు తిరిగినట్లయింది. ఆ రోజు డబ్బు కోసమని రెండు సార్లు పోలీసుల్తో వచ్చిన ముసలాయన ప్రూఫ్ కింద చూపించిందీ ఇదే కార్డుని!

మా ఇంట్లో జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి “మరి మీ వియ్యంకుడు ఏ.జి.లో యూడీసీ అంటివే? ” అనడిగా కజిన్ని ఆశ్చర్యంగా.

రెండు కార్డులూ చూసి “అదీ సంగతి!.. మా కాబోయే వియ్యంకుడు ఎందుకంత హఠాత్తుగా పోయాడో ఇప్పుడర్థమవుతోంది! పిల్ల పెళ్లికని ఊళ్లోని ఇల్లు అమ్ముకున్న సొమ్ము.. రిజిస్ట్రేషనాఫీసు దగ్గరే మిస్సయిందనుకున్నారు అప్పట్లో. మనిషి పోవడానికి ఏదో హార్టెటాకూ అదీ ఇదీ అన్నారు.. ఇదీ కారణమన్న మాట. పరాయి సొమ్ము పాము అన్న భీతన్నా ఉండదు కొద్ది మంది త్రాష్టులకు. ఆ పామే మీ ఇంటికీ వచ్చి.. పోయిందన్న మాట!” అన్నాడు కజిన్.

కజిన్‌ మాటల్తో షాక్ కొట్టి నట్లయింది మాకు!

పోలీసుల్నే వెంటబెట్టు కొచ్చాడా ముసలాడు! మేమంటే సరే! పోలీసులు కూడా ఆ ఫోర్ ట్వంటీ గాడి బుట్టలో ఎట్లా పడ్డట్లో!

“ఆ పోలీసోళ్లూ ఈ ఫోర్ ట్వంటీగాడి బ్యాచేనని అర్థమవడంలా ఇంకా!” అన్నారు మావారు.

“నేను పేపర్ పేకెట్ పికప్ చేయడం ఆ ఆటో డ్రైవర్ చూసుంటాడు. మన ఫ్లాట్ నెంబర్ చూడ్డానికే చిల్లర లేదని బొంకాడా రోజు దరిద్రుడు. నా కప్పుడే డౌటొచ్చిందోయ్ ఇంటికొచ్చిన ఈ ముసలాడి మీద కూడా! అంత డబ్బు పోయిన దిగులేమన్నా వాడి ముఖంలో కనిపించిందా? ” అన్నారిప్పుడు మహా ఘనంగా.

“పదండి! పోలీస్ కంప్లయింటిచ్చొద్దాం!” అంటూ ఆవేశంగా లేచా నేను.

నన్నాపి “నో యూజ్ మై డియర్ మేడమ్ గారూ! కాకీగాళ్ళూ కుమ్మక్కయిన ఈ కేసుని కాకీలు కూపీ తీస్తారనేనా నీ ఆశ!” అన్నారు మిస్టీరియస్‌గా నవ్వేస్తూ.

బిత్తరపోయి చూసే నా బుగ్గ మీదో చిటికేసి “ఆ ఆటోగాడే.. తనకు తెలిసిన పోలీసులకీ సంగతి చెప్పుండాలి. హెవీ ఎమౌంటు కదా! టెమ్టయ్యారీ కాకీ కుంకలిద్దరూ! ఎస్సై ఆడించిన డ్రామాలో ఈ నకిలీ ముసలోడు జస్ట్ ఓ కేరెక్టరు మాత్రమే సఖీ నా లెక్క ప్రకారం. ఆటోగాడి చేతిలో ఆ పేపర్ పీస్ పడ్డమే ఈ ఫోర్ ట్వంటీ స్టోరీ మొత్తానికి కలిసొచ్చిన మెగా ప్లస్ పాయింట్” అన్నారు పెద్ద షర్‌లాక్ హోమ్స్ పోజు పెట్టి!

“ఏమైనా.. డబ్బు పోయిన దిగులుతో పాపం ఆ ఏజీ ఆఫీసాయన ప్రాణాలు పోవడమే పెద్ద విషాదం!” అనిపించిందా క్షణంలో.

ఆ మాటే అంటే “అందుకే గదా.. మీ కజిన్ పైసా కట్నం లేకుండా.. పెళ్లి ఖర్చులు కూడా ఎదురు పెట్టుకుని ఆ ఏ. జీ ఆఫీసాయన కూతుర్నే రేపు కోడలుగా చేసుకునేదీ!” అన్నారీయన గారు.

Exit mobile version