పాపం పసివాడు

0
2

[dropcap]1.[/dropcap]
నస పెడుతున్నాడనో
నష్టపోతున్నాడనుకునో
వసతి బళ్లకు మళ్లకు
పిల్లోడు బాధ్యత కాదు
దింపేసుకోడానికి
వాడే బంధం
నీకూ, నీ భావితరాలకి
వాడికి బాగా తెలుసు
ఎలా నిలవాలో
ఎలా గెలవాలో

~ ~

2.
ఇంటికి దూరంగా
పసి కూనల చదువులు
బ్రతుకు బాటకు
బాలారిష్టాలు
అక్కరకొచ్చేవి రానివి
బట్టీ కొట్టి ఆయాసంతో
బైటపడ్డా వీడని నైరాశ్యం
ఏదో కోల్పోయిన భావనలు
జీవితపాఠపు లంకె తెగిపోయింది
అతికీ అతకని అనుభవాలతో
అంతరంగానికి సవాళ్ళు

~ ~

3.
అవును నిజమే!
వసతి బళ్ళలో క్రమశిక్షణ
పుష్కలంగా ఉంటుంది
తొట్టిలో చేపల్లా
చేతులు కట్టుకున్న బాల్యం
పెట్టిందే తింటూ
నచ్చినా నచ్చకున్నా తలూపుతూ ..
అవి పరుగెత్తవు, పోరాడవు
ప్రవాహంలో పడ్డాయా
కొట్టుకుపోతాయో
లేదా బలైపోతాయో

~ ~

4.
అక్కడ అన్నీ ఉంటాయి
ఏసీ ఏర్పాట్లు ఎన్నో వసతులు
ఐనా తీరని శోకం
అమ్మపై కాళ్లేసి,
నాన్న గుండెను చుట్టేసి
హాయిగా చెప్పే కబుర్లతో
వచ్చే నిద్ర ఇక రాదు
నిద్రలో నేనే భయపడి
నేనే ధైర్యం చెప్పుకోవాలి
ఒంటికి, రెంటికి తెల్లారేదాకా
ఉగ్గబెట్టుకోవాలి తెల్లారేదాకా
తీసుకెళ్లేందుకు అమ్మ లేదుగా
నాకు చీకంటే భయమన్నాను
అందుకని నన్ను హాస్టల్లో పడేసారు
ఇష్టమైతే కష్టముండదట
మరి కష్టంపై ఇష్టమెపుడు పుడుతుందో!

~ ~

5.
ఘుమఘుమలు
గుబాళిస్తున్నాయి
తరగతి గది కిటికీల్లోంచి
గంట కొట్టగానే పరుగెత్తా..భోజనానికి

నచ్చింది మళ్ళీ పెట్టరు
ఎంత బతిమాలినా
మూతలేసి దాచేస్తారు
అందరికీ చాలదట

వద్దన్నదాన్ని వదలనివ్వరు
ఎంత గుంజుకున్నా
బెదిరించి మరీ మింగిస్తారు
మిగిలిపోతుందట

నాన్న చెప్పాడు
తిండికోసం బతకొద్దని
అమ్మ గుర్తుకొస్తోంది
ఏం చేసేది..అదంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here