Site icon Sanchika

పారబోసుకున్నాను

[శ్రీ జాని తక్కెడశిల రచించిన ‘పారబోసుకున్నాను’ అనే కవితని అందిస్తున్నాము.]

ఎప్పుడు పారబోసుకున్నానో కానీ
పారబోసుకొని చాలా కాలమైంది.
పారబోసుకున్న ప్రతిసారి
వెతికి వెతికి నాలోకి వంపుకోవాలనే అనుకున్నాను
ఇప్పటికీ దొరకడం లేదు.

నీకు తెలుసా?
ఎన్ని సందర్భాల్లో ప్రకటించలేని భావోద్వేగాలను
నా ముఖంలోనే ఒత్తి పట్టుకున్నానో!
లోలోపల విరిగిపడుతూనే
బయటకి గంభీర తెరలను మోసానో!

నా కన్నుల్లోని సముద్రం;
తంతూనే ఉంటుంది
నేనేమో వంతెనలు నిర్మించి
దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంటాను.
చీకటి గట్టిపడిన తర్వాత
సముద్రం ఒళ్లు విరుచుకుంటుంది.
తెల్లవారగానే దిండు కింద
విరామం ఎరుగని ఉప్పెన.

ఔను,
నా ఒక్కగానొక్క జీవితాన్ని
ఏనాడో పారబోసుకున్నాను.

ఇప్పుడు గడుపుతున్నది
నా జీవితం ఎలా అవుతుంది?
దశలను మార్చుకున్నాప్పుడల్లా
ఎవరి ఆకాంక్షలో, కోరికలో, వివక్షో
నాపై రువ్వి
జీవితాన్ని లాగేసుకున్నారు.

భయపడుతూ, బాధపడుతూ, నటిస్తూ, నన్ను నేను చంపుకుంటూ, నాతో నేను గొడవ పడుతూ, నాకు నేను శత్రువునై, కనపడే తప్పులన్నీ ఒప్పులేనని అంగీకరిస్తూ, సర్దుకుపోతూ నా జీవితాన్ని అన్యాక్రాంతం చేసేశాను.

చివరిగా
మీ జీవితం మీలో ఉందో లేదో వెతుక్కున్నారా?

ఎవరూ వారి వారి జీవితాలను గడపడం లేదు
అంకెల కోసమో, అనుబంధాల కోసమో,
తనలోని అడవిని వదిలి పరిగెడుతున్నారు.

జీవితమే లేని పరుగు అవసరమా?

Exit mobile version