[box type=’note’ fontsize=’16’] గతంలోని శాల్తీలని వర్తమానంలోకి పిలవకూడదని ఎందుకు నిర్ణయించుకోవలసి వచ్చిందో వివరిస్తున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి “రంగుల హేల” కాలమ్‌లో. [/box]
[dropcap]ఒ[/dropcap]కోసారి జీవితం బొత్తిగా విసుగెత్తుతుంది. అలాంటప్పుడు మనం బాగా బతికిన బాల్యపు రోజుల్నిగుర్తు చేసుకుంటాం. ఆనాడు మనల్ని ముద్దు చేసి గోరుముద్దలు తినిపించిన అప్పటి పెద్దవాళ్ళు ఇప్పుడెవరూ బతికి ఉండరు కాబట్టి మిత్రులు గుర్తొస్తారు. అప్పుడు మనకి బాగా దగ్గరి మిత్రుల్ని (ఒకర్నో, ఇద్దర్నో) గుర్తు చేసుకుని వాళ్ళనొకసారి కలిసి ఇన్ని దశాబ్దాలూ ఏం జరిగిందో వివరించి చెప్పాలని, వారినుంచి వినాలని మనసు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది.
అలా మనసుకు నచ్చిన ప్రియనేస్తాల్ని కలిసే అదృష్టం చాలా కాలం వరకూ నాకు పట్టలేదు. పట్టాక అది అదృష్టమేనా? అన్నది ప్రశ్నార్ధకమయ్యింది. నాతో బియ్యే చదివిన మిత్రురాలు వైశాలి అంటే నాకు ప్రాణం. ఇద్దరం చెవులు నిరంతరం కొరుక్కుంటూ పక్కవాళ్ళ మొహం కూడా చూసేవాళ్ళం కాదు. మిగిలిన అమ్మాయిలు కోపంగా అమర ప్రేమికులని మమ్మల్ని వెక్కిరించినా సరే మేం పట్టించుకునేవాళ్ళం కాదు. అంతటి తాదాత్మ్యం మా స్నేహంతో మాకు.
తర్వాతేముంది? ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. సాగర సంసారంలో ఈతలు కొడుతూ ఎటో కొట్టుకుపోయాం. ఒకరికొకరు పత్తా లేకుండా పోయాం. ఒకసారి…. అందరి నంబర్లూ మైంటైన్ చేసే మహానుభావి, మా కాలేజ్ జూనియర్ అమ్మాయి ఫోన్ చేసి “మీ ప్రియ నేస్తం వైశాలి ఒక పెళ్లిలో కనబడ్డారు మీ గురించి అడిగారు. ఆవిడ నంబర్ మీకు మెసెజ్ చేస్తున్నా” అని చేసింది. వెంటనే ఎగిరి గంతేసి వైశాలిని ఫోన్లో వాటేసుకుని ఆటో ఎక్కి సికింద్రాబాద్ అంతా తిరిగి అడ్రస్ కనుక్కుని వైశాలిని గట్టిగా కౌగలించుకున్నాను. మూగకు మాటొచ్చినట్టు కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా ఏవేవో మాట్లాడేసుకున్నాం. ఓ అరగంటకి తెప్పరిల్లి వైశాలి మంచినీళ్ళిచ్చి, టీ కూడా ఇచ్చినట్టుంది.
ఆ తర్వాత “ఇన్నేళ్లూ మనమిద్దరం ఒకరినొకరు వదిలి ఎలా ఉన్నామో తల్చుకుంటే సిగ్గుగా ఉందే!” అన్నాను నేను ఎమోషనల్ అయిపోతూ .
“నేను మాత్రం ఒక వ్యక్తి ప్రేమలో సర్వం మరిచిపోయాను” అంది వైశాలి నిదానంగా. నేను అవాక్కయ్యాను. “అవును. ఆ వ్యక్తి వల్లనే ఈ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను” అంది. నేను బిక్కమొహం వేసాను అర్థం కాక. “నిజమేనే మొద్దూ! ఆయన రాక నా బతుకును స్వర్గమయం చేసింది” అంది. “మరి మీ వారు?” అన్నాను అర్థం పర్థం లేకుండా. “ఆయనకి కూడా ఆయనంటే ఇష్టమే” అంది. నేను మొహం ఎలా పెట్టుకోవాలో తెలీక నేల చూపులు చూసాను.
“నువ్వు కళ్ళుమూసుకో! ఆయన్ని పరిచయం చేస్తా” అంటూ తానే నా కళ్ళు మూసి పక్క గదిలోకి నడిపించుకుని వెళ్ళింది. “కళ్ళు తెరు” అంటూ నన్ను వదలగానే ఆసక్తిగా కళ్ళు తెరిచి చూశా. ఎదురుగా నిలువెత్తు మనిషి విగ్రహం అభయ హస్తం చూపిస్తూ కనబడింది.. “ఎవరీయన?” అన్నాను ఒకడుగు వెనక్కి వేసి.
“ఈయనే మా గురువుగారు. ఎలా ఉన్నారు?” అడిగింది ఆనందంగా, ఆతృతగా. తలూపుతూ ఆ గదిలోంచి వచ్చేసాను. తాను అయిష్టంగా నా వెనకే వస్తూ “మా పిల్లల పేర్లు దగ్గర్నుంచీ ప్రతి పనీ ఆయన చెప్పినట్టే చేస్తుంటాము. అంతా శుభమే మాకు, ఆయన దయ వల్ల” అంటూ ఆ గురువు గారి గొప్పతనాన్ని చెవులు వాచిపోయేలా చెబుతూనే ఉంది అనర్గళంగా. నేను అతి కష్టం మీద తప్పించుకుని పారిపోయినట్టే వచ్చేసాను.
ఒక నెల ఆ షాక్‌లో ఉండిపోయాను. ఒక ఆదివారం సాయంత్రం వైశాలి భర్తను తీసుకుని మా ఇంటికి వచ్చింది. “మా ఆయన, ప్రైవేట్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్” అని చెప్పి మావారికి, నాకు పరిచయం చేసింది. నేను టీ స్నాక్స్ అందించే లోపు తాను డైనింగ్ టేబుల్ మీద తమ గురువు గారి లామినేటెడ్ చిన్న ఫోటో పెట్టి, పక్క స్వీట్ బాక్స్ పెట్టింది. టీ లయ్యాక మమ్మల్నందరినీ పిల్చి బాగ్ లోంచి హారతి కర్పూరం, అగ్గిపెట్టె తీసి వెలిగించి ఆ ఫోటోకి చూపించి సుదీర్ఘమైన గురువుగారి స్తోత్రం పాడింది. అనేక దణ్ణాలు పెట్టింది. మేమంతా బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయాం.
వైశాలి భర్త, తాను మర్నాడు కర్నూల్‌లో ఉన్న ఆ గురువు గారి ఆశ్రమానికి వెళుతున్నానని, అక్కడ మంచి అకామడేషన్ ఉంటుందని మా వారిని వెళదాం రమ్మని బలవంతం చెయ్యడం ప్రారంభించాడు. ‘నా కసలు ఇలాంటి గురువులమీద నమ్మకం లేదని’ ఈయన కుండ బద్దలు కొట్టగానే హర్ట్ అయినట్టు మౌనంగా కూర్చున్నాడు. వైశాలి అది గమనించి “మనం మరోసారి నలుగురం వెళదాం” అని సర్దింది. నేను నవ్వి ఊరుకున్నాను. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. నేనే “మీ అమెరికా అమ్మాయి ఎలావుందీ?” అనడిగాను. వైశాలి “తన డెలివరీకి అత్తగారు వెళ్ళింది. మూడు నెలలయింది ఆవిడ వెళ్ళిపోతుందిట. నన్ను రమ్మంటోంది, నాకు వెళ్లాలని లేదు. నేను రోజూ స్వామి భజన చేసుకోవాలి కదా! అక్కడెక్కడ కుదురుతుంది చెప్పు?” అంది. భర్త అవును కదా అన్నట్టు తలూపుతున్నాడు. నాకు మిడిగుడ్లు పడ్డాయి.
మరి కొంత సేపయ్యాక దంపతులిద్దరూ లేచారు. మేం వీడ్కోలు చెప్పాము. వాళ్ళు వెళ్ళాక ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్ మీద జోకులేమీ వెయ్యకుండా సీరియస్‌గా మొహం పెట్టుకుని మేనేజ్ చేశాను. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అమ్మయ్య! అనుకుని నిద్రపోయాను. పిల్లలకి దిష్టి తీసే తల్లులను “ఓయబ్బో! ఎంతందంగా ఉన్నారో నీ సంతానం!” అని పగలబడి నవ్వేసే వైశాలి ఇలామారి పోవడాన్ని జీర్ణించుకోలేక ఆ రాత్రి నాకు అజీర్తి కలిగింది.
వైశాలి తర్వాత మరో మంచి మిత్రురాలు, డిగ్రీ క్లాసుమేట్ సావిత్రి గుర్తొచ్చింది. ఇద్దరం కలిసి రహస్యంగా మాట్నీ సినిమాలు తెగ చూసేవాళ్ళం. మారిన వైశాలిని గురించి సావిత్రికి చెబితే బావుండు అనుకున్నాను. కానీ సావిత్రిని కూడా కలిసి పాతికేళ్లయ్యి ఉంటుంది. అర్జెంటుగా ఎలా దొరుకుతుందిప్పుడు? అనుకుని నవ్వుకున్నాను. ఊహలని కూడా తధాస్తు దేవతలు దీవిస్తారన్నట్టుగా ఒక రోజు సావిత్రి నుంచి కాల్ వచ్చింది. కొంతసేపు ఒకరినొకరు క్షేమాలడిగే సీన్ అయ్యాక “నీ నంబర్ నాకెలా దొరికిందనుకున్నావే పిల్లా?” అంది సావిత్రి. “అవునే, ఎలా?” అన్నాను. నీ కథ పత్రికలో పడిందికదా, అక్కడ మొబైల్ నంబర్ ఇచ్చారు, నువ్వేనా కాదా అనుకుంటూ చేసానే” అంది.
“అబ్బ! నా కథ నిన్ను నాకు కలిపిందే” అని ఆనందంగా అన్నాను.
“ఇంతకీ నాకథ ఎలా ఉందే?” అడిగాను ఉత్కంఠగా
“నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా బ్యాంకులో?” సీరియస్ గా అడిగింది.
“అవును” అంటూ ఉత్సాహంగా నా బ్యాంకు పేరు చెప్పాను.
“నీకు అక్కడ పనేమీ ఉండదా? కథ లెందుకు రాస్తున్నావే? ఎవరు చదువుతారు ఈ కథలు? నీకు టైం వేస్ట్ కాదా?” అంటూ ప్రశ్నల వర్షం కురిసింది. నాకు కళ్ళు గిర్రున తిరిగాయి. నా చేతిలో మొబైల్ జారి మంచం మీద పడింది.
ఆ తర్వాత గతంలోని శాల్తీలని వర్తమానంలోకి పిలవకూడదని ఒట్టేసుకున్నాను. వాళ్ళు అక్కడ అలాగే చిత్రాలుగా మారిపోయి ఉండాలంతే! అనుకుని తక్షణం ఒక నిర్ణయం తీసుకున్నాను. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నా వంతు బాధ్యతగా వైశాలి నంబరూ, సావిత్రి నంబరూ బ్లాక్ చేసి నిట్టూర్చాను.