పాటే మంత్రము: ఉమ్రావ్ జాన్

0
2

[‘ఉమ్రావ్ జాన్’ సినిమాలోని గీతాలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]గ[/dropcap]జల్ అనే ప్రక్రియ ఉర్దూలో చాలా ప్రసిద్ధమైనది. తెలుగులో సినారె, గజల్ శ్రీనివాస్ ఆ ప్రక్రియని నిలబెట్టారు. హిందీ చిత్రాలలో గజల్స్ చాలా వచ్చాయి. పల్లవి లోనూ, ప్రతి చరణంలో రెండు పాదాలలో భావగర్భితంగా విషయాన్ని చెప్పటం గజల్ ప్రత్యేకత. అంత్య ప్రాసలతో కట్టిపడేస్తుంది. విన్న వారు ‘వాహ్ వాహ్’ అనకుండా ఉండలేదు. ఇలాంటి గజల్స్‌తో రూపొందిన చిత్రం ‘ఉమ్రావ్ జాన్’ (1981). క్లుప్తంగా కథ చెప్పాలంటే 1840లో అమీరన్ అనే అమ్మాయి తల్లి, తండ్రి, తమ్ముడితో ఫైజాబాద్‌లో నివసిస్తూ ఉంటుంది. ఆమె తండ్రి సాక్ష్యం వల్ల జైలుకి వెళ్ళిన ఒకతను కక్ష కట్టి అమీరన్ ని అపహరిస్తాడు. ఆమెని రామ్ దాయి అనే ఇంకొక అమ్మాయితో కలిపి బంధిస్తాడు. అమ్మాయిలని అమ్ముతాడు. అమీరన్ చామన చాయలో ఉండటం వలన ఆమెని ఎవరూ కొనరు. రామ్ దాయిని ఒక కుటుంబం కొంటుంది. అమీరన్ చివరికి లఖనవూ లోని ఒక కోఠా (నాట్యకత్తెలు ఉండే చోటు) కి అమ్ముడుపోతుంది. ఆమె పేరు ఉమ్రావ్ జాన్‌గా మారుతుంది. హుస్సేనీ అనే ఆమె సంరక్షణలో పెరిగి పెద్దదవుతుంది. ఆమెకి కవిత్వం మీద మక్కువ పెరుగుతుంది. గజల్ రూపంలో ఉన్న ఆమె కవితలు ప్రసిద్ధమవుతాయి. ఆమె నృత్యం కూడా చేస్తుంది. ఆమె మీద నవాబ్ సుల్తాన్ అనే అతను మనసుపడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అయితే అతను కుటుంబం అతని వేరే పెళ్ళి చేస్తుంది. ఉమ్రావ్ దుఃఖపడుతుంది. ఆమెకి ఒక బందిపోటు పరిచయమవుతాడు. అతను బందిపోటని ఆమెకి తెలియదు. ఆమె అతని ప్రేమలో పడి అతనితో వెళ్ళిపోతుంది. పోలీసు కాల్పుల్లో అతను మరణిస్తాడు. ఆమె కాన్పూర్ వెళ్ళిపోయి అక్కడే నాట్యం చేస్తూ, కవిత్వం రాస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకి ఒకామె పరిచయమవుతుంది. ఆమే రామ్ దాయి. ఇద్దరూ ఒకరినొకరు గుర్తు పడతారు. రామ్ దాయి మంచి కుటుంబంలో ఉంటుంది. విధివైచిత్రి ఏమిటంటే ఆమె భర్త నవాబ్ సుల్తాన్. కొన్నాళ్ళకి హుస్సేనీ ఉమావ్ ని వెతికి పట్టుకుంటుంది. తిరిగి లఖనవూకి రప్పిస్తుంది. బ్రిటిష్ సైన్యం లఖనవూని ఆక్రమిస్తుంది. అప్పుడు ఉమ్రావ్, మరికొంతమంది కలిసి ఊరు విడిచి వెళ్ళిపోతారు. వారు మజిలీ చేసిన చోటు ఉమ్రావ్ స్వస్థలమైన ఫైజాబాద్. అక్కడి వారు ఆమెని నృత్యం చేయమంటారు. ఆమె తన ఇంటి బయటే నృత్యం చేస్తుంది. ఆమె తల్లి ఆమెని గుర్తుపట్టి ఆమెని కౌగిలించుకుంటుంది. కానీ ఆమె తమ్ముడు ఆమె వేశ్య అని ఆమెని వెళ్ళగొడతాడు. ఆమె తిరిగి లఖనవూ వస్తుంది. అప్పటికి కోఠా శిథిలమై ఉంటుంది. ఆమె బతుకు లాగే.

ఉమ్రావ్ విధి వంచితురాలు. అపహరణకి గురైంది. రామ్ దాయిలా ఆమె కూడా మంచి కుటుంబంలోకి వెళ్ళి ఉంటే ఆమె బతుకు వేరేలా ఉండేది. ఉమ్రావ్ కోఠాలో పడింది. ప్రేమించినవాడు వంచించాడు. మరొకరిని నమ్ముకుంటే అతను మరణించాడు. ప్రేమించినవాడు మళ్ళీ తారసపడ్డాడు. రామ్ దాయి భర్త రూపంలో. పుట్టిన ఊరికి వెళితే తమ్ముడు చీదరించాడు. చివరికి కోఠా కూడా మిగలలేదు. చిత్రంలో ఉమ్రావ్ ముజ్రాలు (గజల్ పాడుతూ చేసే నృత్యం) రెండు ఉంటాయి. ఇవి జావళీలలా ఉంటాయి. ‘నను విడనాడకురా’, ‘ఎప్పటి వలె కాదురా’ లాంటి పాటలన్నమాట. వీటిని కవిత్వం కోసం ఆస్వాదించటం పరిపాటి. ఇంకో రెండు గజళ్ళు కథకి సంబంధించినవి. నాయిక బాధని ఆవిష్కరిస్తాయి. ఈ గజళ్ళన్నీ షాహర్యార్ రాశారు. సంగీతం ఖయ్యాం అందించారు. ఖయ్యాం కి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు వచ్చింది. పాటలు పాడిన ఆశా భోంస్లేకి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు వచ్చింది. ఉమ్రావ్ పాత్ర పోషించిన రేఖకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వచ్చింది. ఈ చిత్రం యూట్యూబ్ లో లభ్యం.

ఉమ్రావ్ తొలిసారి కవిత్వం రాసినపుడు రాసిన గజల్ ‘దిల్ చీజ్ క్యా హై’. ఆమె విటుల ముందు నాట్యం చేస్తూ ఈ గజల్ పాడుతుంది.

దిల్ చీజ్ క్యా హై ఆప్ మెరీ జాన్ లీజియే

బస్ ఏక్ బార్ మేరా కహా మాన్ లీజియే

మనసేం ఖర్మ, నా ప్రాణమీయగలను

ఓసారి నే చెప్పింది వింటే చాలును

విటులని ఆకర్షించటానికి రాసిన పల్లవి ఇది. ‘నా మాట వింటే ప్రాణమే అర్పిస్తాను’ అంటే విటులు ఎగబడరూ? అయితే ఉమ్రావ్ ఇందులో కవిత్వాన్నే ఎక్కువ ఆస్వాదిస్తుంది.

ఇస్ అంజుమన్ మేఁ ఆప్ కో ఆనా హై బార్ బార్

దీవార్-ఒ-దర్ కో గౌర్ సే హెహచాన్ లీజియే

ఈ రసికసభకి రావాలి తమరు మళ్ళీ మళ్ళీ

బాగా గుర్తుంచుకోండి ఈ పరిసరాలను

విటులని మళ్ళీ మళ్ళీ రప్పించే మాట ఇది. విటులు రాకపోతే కోఠా నడిచేదెలా?

మానా కె దోస్తోఁ కో నహీఁ దోస్తీ కా నాజ్

లేకిన్ యె క్యా కె గైర్ కా ఎహసాన్ లీజియే

నిజమే స్నేహమంటే లెక్క లేదు నేస్తగాళ్ళకి

అలాగని అడుగుతారా అపరిచితుల ఉపకారాలను?

‘స్నేహితులు ఎల్లప్పుడూ పక్కన ఉండరు. ఎవరి జీవితాలు వారివి. అందుకేగా మీరు ఇక్కడికి వచ్చారు. అపరిచితుల పొందు కోరుతున్నారు’ అని కవ్విస్తోంది.

కహియే తో ఆస్మాన్ కో జమీఁ పర్ ఉతార్ లాయేఁ

ముష్కిల్ నహీఁ హై కుఛ్ భీ అగర్ ఠాన్ లీజియే

మీరానతిస్తే నింగిని నేలకు దించుతాను

పట్టుదలతో ఏదైనా సాధించవచ్చును

‘నీ కోసం నింగిని నేలకు దించుతాను. అదేం కష్టం కాదు’ అనే అతిశయోక్తితో ముగిస్తోంది. ‘జాన్ లీజియే’, ‘మాన్ లీజియే’, ‘పెహచాన్ లీజియే’, ‘ఎహసాన్ లీజియే’, ‘ఠాన్ లీజియే’ అనే అంత్యప్రాసలతో కవిత్వం రక్తి కట్టింది.

***

నవాబ్ సుల్తాన్ తొలిసారి ఉమ్రావ్ ని చూసే సందర్భంలో వచ్చే ముజ్రా ‘ఇన్ ఆంఖోఁ కీ మస్తీ కే’.

ఇన్ ఆంఖోఁ కీ మస్తీ కే మస్తానే హజారోఁ హైఁ

ఇన్ ఆంఖోఁ సే వాబస్తా అఫ్సానే హజారోఁ హైఁ

ఈ కనుల మాయకి మతిపోయిన వారు కోకొల్లలు

ఈ కనులతో అల్లుకున్న కల్పనలు కోకొల్లలు

‘ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడోయ్’ అన్నట్టు ఆమె తన కనులు చేసే మాయని వర్ణిస్తోంది.

ఇక్ తుమ్ హీ నహీఁ తన్హా, ఉల్ఫత్ మేఁ మేరీ రుస్వా

ఇస్ షహర్ మేఁ తుమ్ జైసే దీవానే హజారోఁ హైఁ

నీవొక్కడివే కాదు నా మోజులో భ్రష్టుడైనది

ఈ వూళ్ళో నీలాంటి పిచ్చివాళ్ళు కోకొల్లలు

ఆమె మోజులో పరువు కూడా లెక్క చేయని వారు కోకొల్లలు. ఆమె అందం, నాట్యం ఒక ఎత్తయితే ఆమె కవిత్వం ఒక ఎత్తు.

ఇక్ సిర్ఫ్ హమీ మయ్ కో ఆంఖోఁ సే పిలాతే హైఁ

కెహనే కో తో దునియా మేఁ మయ్ ఖానే హజారోఁ హైఁ

నేనే కదా మధువును కనులతో అందించేది

పేరుకి ఈ లోకంలో మధుశాలలు కోకొల్లలు

ఈ చరణం పాటకే తలమానికం. చెప్పుకోవటానికి ఎన్నో మధుశాలలున్నా కళ్ళతో మధువుని అందించేది ఆమె మాత్రమే అట. అంటే ఆమె కళ్ళు చూస్తేనే మత్తెక్కుతుందన్నమాట.

ఇస్ షమ్మె ఫరోజాఁ కో ఆంధీ సే డరాతే హో

ఇస్ షమ్మె ఫరోజాఁ కే పర్వానే హజారోఁ హైఁ

ఈ మిరుమిట్ల దీపానికి తుఫాను భయమా

ఈ మిరుమిట్ల దీపానికి శలభాలు కోకొల్లలు

దీపపు పురుగుల్లా ఎంతో మంది తన చుట్టూ ఉండగా తనని ఏ తుఫానూ ఏమీ చేయలేదని ధీమాగా ఉంది. ఇది ముందు ముందు రాబోయే ఒడిదుడుకులకి సంకేతం. ఎంత విర్రవీగినా విధి ముందు అందరూ తల వంచాల్సిందే.

***

నవాబ్ సుల్తాన్, రామ్ దాయి దంపతుల ఎదుట తన కవిత్వం వినిపించినపుడు ఉమ్రావ్ పాడే పాట తర్వాతి పాట.

జుస్తజూ జిస్కీ థీ ఉస్కో తో న పాయా హమ్నే

ఇస్ బహానే సే మగర్ దేఖ్ లీ దునియా హమ్నే

కోరుకున్నవాణ్ని పొందలేకపోయా నేను

కానీ ఈ వంకన లోకం చూసేశా నేను

‘లోకం చూసేశా’ అనటంలో లోకం తీరు తెలిసిపోయింది అనే అర్థం ఉంది. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపాలను తాపత్రయాలు (మూడు తాపాలు) అంటారు. ఆధ్యాత్మిక తాపం అంటే మనిషి జీవితంలో వచ్చే కష్టాలు. ఆధిభౌతిక తాపం అంటే సమాజంలో వచ్చే అలజడులు. ఆధిదైవిక తాపం అంటే ప్రకృతి వైపరీత్యాలు. ఉమ్రావ్ కి ఆధ్యాత్మిక తాపం పలుసార్లు ఎదురయింది. ఆధిభౌతిక తాపం బ్రిటిష్ సైన్యం ఆక్రమణ రూపంలో వచ్చింది. ఈ విధంగా ఆమె ఎన్నో చేదు అనుభవాలు చూసింది. ఒక తోడు ఉంటే ఎన్నైనా తట్టుకోవచ్చు. ఆమెకి తోడు కూడా దొరకలేదు.

తుఝ్ కో రుస్వా న కియా, ఖుద్ భీ పషేమాఁ న హుయే

ఇష్క్ కీ రస్మ్ కో ఇస్ తరహ్ నిభాయా హమ్నే

నీ పరువు తీయలేదు, నిన్నెందుకు వలచానా అని వగవలేదు

ఈ రీతిన ప్రేమ తంతును ముగించా నేను

అందరూ ప్రేమిస్తారు. కొందరి ప్రేమ సఫలమవుతుంది. కొందరిది విఫలమవుతుంది. విఫలప్రేమలో తల్లడిల్లిపోతారు కొందరు. కానీ ఆమె అతను మోసం చేసినందుకు అతని పరువు తీయలేదు. అలాగని ప్రేమించినందుకు బాధపడలేదు. ‘It is better to have loved and lost than never to have loved at all’ అని ఆంగ్లంలో ఒక నానుడి. ప్రేమించటమే ఒక యోగం. ఆ ప్రేమ సఫలం కాకపోయినా. అసలు ప్రేమించపోవటమే విషాదం. అదే భావం ఇక్కడ ధ్వనిస్తుంది. ప్రేమ అనే తంతు అందరి జీవితాల్లోనూ ఉంటుంది. ఆమె ప్రేమ అలా ముగిసింది.

కబ్ మిలీ థీ కహాఁ బిఛడీ థీ హమేఁ యాద్ నహీఁ

జిందగీ తుఝ్ కో తో బస్ ఖ్వాబ్ మేఁ దేఖా హమ్నే

ఎప్పుడు అందావో, ఎప్పుడు చేజారావో గుర్తే లేదు

ఓ జీవితమా! నిన్ను కేవలం కలలో చూశా నేను

కల ఎవరికైనా పూర్తిగా గుర్తుంటుందా? లేదు. ఆమె కలల్లోనే జీవితాన్ని చూసింది. వాస్తవంలో ఆమె జీవితం దుఃఖాల మయం. సుఖం అందినట్టే అంది చేజారిపోయింది. అందరూ ఆమెని వంచించినవారే.

అయ్ అదా, ఔర్ సునాయే భీ తో క్యా హాల్ అప్నా

ఉమ్ర్ కా లంబా సఫర్ తయ్ కియా తన్హా హమ్నే

ఓ అందమా! నా గోడు ఇంకేం చెప్పను

సుదీర్ఘమైన ఈ బతుకు పయనం ఒంటరిగా చేశా నేను

అందరికీ ఎవరో ఒకరు తోడుంటారు. కుటుంబమో, స్నేహితులో, ప్రేమికులో. పైగా ఆమె అందమైనది. మంచి కవిత్వం రాయగలదు. కానీ ఆమె జీవితం ఒంటరి జీవితం.

***

చివరి పాట తన సొంత ఊరిలో తన ఇంటి బయట ఉమ్రావ్ పాడే పాట. గుండెల్ని పిండేస్తుంది.

యే క్యా జగహ్ హై దోస్తోఁ, యే కౌన్ సా దయార్ హై

హద్-వ్-నిగాహ్ తక్ జహాఁ గుబార్ హీ గుబార్ హై

మిత్రులారా! ఏ చోటిది, ప్రాంతమిది

కనుచూపు మేర ధూళి తప్ప ఏం లేదు

పుట్టిన ఊరికి వచ్చిన ఆమెకి కన్నీళ్ళ కారణంగా అంతా మసక మసకగా ఉంది. అందరిలా తలిదండ్రుల పంచన పెరిగి ఉంటే ఆమె బతుకు ఎంత బావుండేది?

యే కిస్ ముకామ్ పర్ హయాత్ ముఝ్ కో లేకే ఆ గయీ

నా బస్ ఖుషీ పే హై యహాఁ, నా గమ్ పే ఇఖ్తియార్ హై

జీవితం నన్ను ఎక్కడికి తీసుకువచ్చింది?

ఇక్కడ సంతోషానికి అవధి లేదు, దుఃఖానికి అడ్డుకట్ట లేదు

చాలా కాలం తర్వాత పుట్టిన ఊరికి వస్తే మనఃస్థితి ఎలా ఉంటుంది? మరి ఆమె లాంటివారి మనఃస్థితి గురించి చెప్పాలా? ఒక పక్క అంతులేని ఆనందం, ఒక పక్క ఆపుకోలేని దుఃఖం.

తమామ్ ఉమ్ర్ కా హిసాబ్ మాంగ్తీ హై జిందగీ

యే మేరా దిల్ కహే తో క్యా, యే ఖుద్ సే షర్మ్ సార్ హై

ప్రతిరోజుకీ లెక్క చెప్పమంటోంది జీవితం

నా మనసు ఏం చెప్పగలదు, సిగ్గుతో నోరు పెగలలేదు

తల్లి అక్కడే ఉన్న ఇంట్లో ఉందని ఆమెకి తెలుసు. కానీ ఆమె మనసు సిగ్గుతో కుంచించుకుపోతోంది. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావంటే ఆమె ఏం చెబుతుంది?

బులా రహా క్యా కొయీ చిల్మనోఁ కే ఉస్ తరఫ్

మెరే లియే భీ క్యా కొయీ ఉదాస్ బేకరార్ హై

పరదాల చాటుకి రమ్మనే పిలుపా అది?

నాకై ఎవరికైనా చింతా ఆతురతా ఉన్నాయా, తెలియదు

ఇంటి పరదాల చాటున తల్లి నీడా ఆమెకి కనపడుతూ ఉంటుంది. తల్లి ఇంకా తన గురించి బెంగ పడుతోందా? తనకి అక్కున చేర్చుకుంటుందా? ఉమ్రావ్ ఒక నాట్యకత్తె అని ఆ నోటా ఈ నోటా తల్లి వినే ఉంటుంది. తనని మళ్ళీ ఇంటిలోకి రానిస్తుందా? ఇదే ఆమె వేదన. ఇక్కడ ‘పరదాల చాటు’ అంటే ‘గౌరవమైన జీవితం’ అనే అర్థం కూడా వస్తుంది. గౌరవమైన ముస్లిం స్త్రీలు పరదాల మాటునే ఉండే రోజులవి. తనకి మళ్ళీ గౌరవమైన జీవితం దక్కుతుందా అని ఆమె మథనపడుతోంది.

చివరికి తల్లి ప్రేమ అన్ని కట్టుబాట్లని పక్కన పెట్టి ఆమెని చేరదీస్తుంది. అయితే పురుషాధిక్య సమాజం కదా. తమ్ముడు ఆమెకి బహిష్కరిస్తాడు.

***

ఈ చిత్రంలో నవాబ్ సుల్తాన్ ఉమ్రావ్ కోసం పాడే గజల్ ఒకటి ఉంటుంది. ఈ పాటని తలత్ అజీజ్ పాడారు. చాలా ప్రజాదరణ పొందిన గీతం. సంగీతం అద్భుతంగా ఉంటుంది. సాహిత్యం తరచి చూస్తే మామూలు ప్రేమ గీతం లాగే ఉంటుంది కానీ గజల్ లో ఉండే చమక్కులు ఉంటాయి.

జిందగీ జబ్ భీ తెరీ బజ్మ్ మేఁ లాతీ హై హమేఁ

యే జమీఁ చాంద్ సే బెహతర్ నజర్ ఆతీ హై హమేఁ

సుర్ఖ్ ఫూలోఁ సే మెహక్ ఉఠతీ హైఁ దిల్ కీ రాహేఁ

దిన్ ఢలే యూఁ తెరీ ఆవాజ్ బులాతీ హై హమేఁ

యాద్ తేరీ కభీ దస్తక్ కభీ సర్గోషీ సే

రాత్ కే పిఛలే పెహర్ రోజ్ జగాతీ హై హమేఁ

హర్ ములాకాత్ కా అంజామ్ జుదాయీ క్యూఁ హై

అబ్ తో హర్ వక్త్ యహీ బాత్ సతాతీ హై హమేఁ

జీవితం నీ సమక్షంలోకి నన్ను చేరవేసినపుడు

ఈ భూమి జాబిలి కన్నా అందంగా అగుపడేను

ఎర్రని పూలతో గుండె దారులు పరిమళించేను

పొద్దు గుంకితే నీ గొంతే నన్ను పిలిచేను

నీ ఙాపకం మెలమెల్లగా గుసగుసగా

ప్రతిరోజూ నడిరేయి నన్ను నిదుర లేపేను

ప్రతి కలయికకి ముగింపు ఎడబాటేనా?

ఇపుడు ఈ ప్రశ్నే సదా నన్ను వేధించేను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here