పావులు – The Scape Goats

2
3

[dropcap]తు[/dropcap]పాకి పేలిన చప్పుడు.

నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ చలి రాత్రి ఊహించని విధంగా వినిపించిన ఆ శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. అప్పుడు సమయం రాత్రి రెండు దాటి ఉంటుంది.

నేనెక్కడ ఉన్నది కాసేపు అర్థం కాలేదు. లేత నీలిరంగు కాంతి గది అంతా మంద్రంగా పరచుకుని ఉంది. ఆ కాంతిలో గదంతా ఒకసారి పరికించి చూశాను.

ఖరీదైన ఫర్నిచర్, ఖరీదైన తెరలు, ఐశ్వర్యం ఉట్టిపడుతున్న వాతావరణం, తగుమాత్రం ఉష్ణోగ్రతను అందిస్తూ చలి వాతావరణం నుంచి కాపాడుతూ ఉన్నఆధునిక ఎయిర్ కండిషనర్లు. ఇది మా ఇంట్లో నా గది కాదే.

గాఢమైన నిద్రనుంచి దిగ్గున లేవడం వల్ల నాకేమర్థం కావడం లేదు.

డబల్‍కాట్‌పై నా పక్కనే పడుకుని ప్రశాంతంగా నిదురిస్తున్న కవితని చూశాక క్రమంగా గుర్తువస్తోంది మేము క్రితం రోజే ముంబాయికొచ్చాము అని, తాజ్ హోటల్లో ఉన్నాం మేము ఇప్పుడు అని. మాకు పెళ్ళయి ఇంకా నాలుగు రోజులు కూడా అవలేదు. నిద్రలోనే కవిత ఎందుకో చిరునవ్వు నవ్వుకుంటోంది, ఏమి గుర్తు వచ్చిందో తనకు.

లేచి కూర్చుని తన దుప్పటిని సవరించాను. తన నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, మంచంపై నుంచి దిగాను. నాకు నిద్రమబ్బు పూర్తిగా వదిలిపోయింది.

సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న కవిత అన్నయ్యలు ఇద్దరూ మాకు ఇచ్చిన సర్‍ప్రైజ్ గిఫ్ట్ ఇది. వాళ్ళు మా హనీమూన్‍ని ఇలా ప్లాన్ చేసి మమ్మల్ని ముంబాయి ఫ్లయిటు ఎక్కించి పంపారు. మొదట ముంబాయిలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ పక్కనే ఉన్న అతి ఖరీదైన అయిదు నక్షత్రాల తాజ్ హోటల్లో ఓ మూడు రోజులు బస చేసిన అనంతరం, ఇట్నుంచి ఇటే స్విట్జర్లాండులో ఓ వారం గడిపేలా ప్రణాళిక చేశారు.

పగలంతా బీచ్ వగైరాలు చూసి అలసిపోయి పడుకున్నాం.

తిరిగి తుపాకి పేలిన చప్పుళ్ళు వినిపించాయి. ఆగకుండా వరుసగా మిషన్ గని పేలిన చప్పుళ్ళుగా పోల్చుకోగలిగాను. చాలామంది జనం భయవిహ్వలులై ప్రాణ భయంతో పరుగులు పెట్టిన చప్పుళ్ళు కూడా స్పష్టంగా వినిపించాయి.

నాకు వెన్నులో చలి పుట్టింది.

కవిత నిద్రలోనే కాస్తా ఇబ్బందిగా కదిలింది. ఆమె పెదాలపై చిరునవ్వు మాయమైంది ఈసారి.

ఇంకొద్ది సేపట్లో మాకు జరగబోయే భయానకమైన అనుభవాలు తనకు చూచాయగా తెలిసినా తాను అలా నిశ్చింతగా నిద్రపోయేది కాదు, నేను ఆ మాత్రం నింపాదిగా ఉండేవాడిని కాదు.

భూమి మీద నరకం ఎలా ఉంటుంది అన్నది ప్రత్యక్షంగా మేము చూడబోతున్నాము అన్న విషయం మా ఇద్దరికీ ఏమాత్రం తెలియదు ఆ క్షణంలో.

ఇప్పుడు తిరిగి నిశ్శబ్దం అలముకుంది. అది తుఫాను ముందటి ప్రశాంతి అని నాకు ఎందుకో అనిపించింది ఆ క్షణం.

ఏసీ చేస్తున్న మంద్రమయిన ధ్వని, కవిత ఉఛ్వాస నిశ్వాసలు మినహాయించి గదంతా నిశ్శబ్దం అలముకుంది.

బయట నుంచి కూడా ఏమీ శబ్దాలు వినిపించడం లేదు.

ఇందాక నేను కలగన్నానా?

మిషన్ గన్ తాలూకూ చప్పుళ్ళూ నా భ్రమేనా? ఎందుకో తెలియదు ఆ ఊహ నాకు కాస్త నెమ్మదిని ఇచ్చింది.

వాస్తవానికి కొత్తగా పెళ్ళయిన యువకుడు విపరీతమైన వత్తిడికి గురవుతాడట. ‘ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తించగలనా? జీవితాంతం ఈమెకి నేను న్యాయం చేయగలనా? నన్ను ఇంతగా నమ్ముకుని అందర్నీ వదిలేసి వచ్చిన ఈ స్త్రీ నమ్మకాన్ని నేను నిలుపుకోగలనా?’ ఇలాంటి అలోచనలతో పురుషుడు మానసిక వత్తిడికి గురయితే, స్త్రీ ఇంకో లాగా అలోచిస్తుందట.

‘ఇక నా బాధ్యతంతా ఇతడు చూసుకుంటాడు. నాకే భయం అక్కరలేదు. ఇతడు నా తోడున్నాడు చాలు’ అనే భరోసాతో స్త్రీ నిశ్చింతగా ఉంటుందట.

కొద్దిగా సైకాలజీ తెలుసు అని అనుకునే మిత్రుడు రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

ఈ ఒత్తిడి వల్ల నాకు నిద్రలో మెలకువ వచ్చినట్టుంది అని అనుకుని రిలీఫ్‌గా నిట్టూర్చి బాత్రూంకి వెళ్ళిచ్చి, నీళ్ళు త్రాగబోతున్నాను.

నా నిశ్చింత క్షణమాత్రమే అని నిరూపిస్తూ, అప్పుడు వినిపించింది గుండెలవిసిపోయేలా పెద్ద చప్పుడు. బాంబు పేలిన చప్పుడు ప్రత్యక్షంగా ఎప్పుడు వినకపోయినా చప్పున పోల్చుకోగలిగాను చాలా పెద్ద విస్ఫోటనం సంభవించింది అని.

కవిత దిగ్గున లేచి కూర్చుంది.

నా చేతిలో గ్లాసు భళ్ళున క్రిందపడి పెద్ద చప్పుడు చేస్తూ పగిలిపోయింది.

రెండగ్గల్లో వెళ్ళి కిటికీ తెర తొలగించి బయటకు చూసిన నేను నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. భయంతో మా ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి.

తొమ్మిదో అంతస్తు కిటికీలోంచి చూస్తూ ఉండటం వల్ల మాకు బయట జరిగేదంతా స్పష్టంగా కనిపిస్తోంది.

బయట విద్యుత్ దీపాల కాంతిలో పట్టపగలల్లే వెలుతురు ఉంది. రోడ్డుకు దగ్గరలోనే అరేబియన్ సముద్రం ప్రశాంతంగా కనిపిస్తోంది. కాస్తా ఎడంగా గేట్ వే ఆఫ్ ఇండియా జరగుతున్న వినాశనాన్ని గుడ్లప్పగించి చూస్తోంది.

సుమారు పదిహేను మంది యువకులు సాయుధులై మా హోటల్‌కి ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళను దిగబెట్టటానికి వచ్చిన నౌక సముద్రంలో తిరుగు ప్రయాణానికి సిద్ధమౌతోంది.

ఈ యువకులు అందరు ఆ నౌకలోని వారికి సైనిక వందనం లాంటిది చేసి వీడ్కోలు చెప్పారు.

రాత్రి పడుకోబోయే ముందు కూడా అదే కిటికీలోంచి సముద్రాన్ని, గేట్ వే ఆఫ్ ఇండియాని చూస్తూ కబుర్లు చెప్పుకుని పడుకున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.

తాము సృష్టించబోయే మారణహోమానికి నాందిగా వారు అక్కడే ఆగి ఉన్న ఒక ఖాళీ టూరిస్టు బస్సుని హేండ్ గ్రెనేడ్ వేసి పేల్చేసినట్టుగా అర్థమవుతోంది, ఆ బస్సులోంచి ఎగసి పడుతున్న మంటలని బట్టి.

ఆ యువకులు అందరూ ఆజానుబాహులుగానూ, బలాఢ్యులుగాను ఉన్నారు. వాళ్ళ అందరి దగ్గరా భయంకరమైన మారణాయుధాలు ఉన్నాయి.

వాళ్ళలో నాయకుడిలాంటి వాడొకడు, తనెదురుగా నిలబడ్డ మిగతా వారందరికి గాల్లో చేతులు ఎగరేస్తూ ఏవో సూచనలు అందజేస్తున్నాడు.

నాకర్థమయిన దాన్ని బట్టి ఆ మహానగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి మారణహోమం సృష్టించమని చెబుతున్నట్టుగా తోచింది.

సూచనలు అందుకున్న వారు జట్లు జట్లుగా ఆ నాయకుడికి అభివాదం చేసి యుద్ధోన్మాదంతో నిండిన హుంకారాలు చేస్తూ, చిరుతల్లాగా కదులుతున్నారు.

వారందరూ ఒకే విధమైన నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి ఉన్నారు. ముసుగుతో వారి తల మొత్తం కప్పబడి ఉంది, ఉత్తిగా వారి కళ్ళు ఒక్కటే కనిపిస్తున్నాయి.

రోడ్డు పక్కన్ టాక్సీలు ఆపుకుని నిద్రిస్తున్న టాక్సీ డ్రయివర్లను హతమార్చి టాక్సీలను హస్తగతం చేసుకుని , ఇద్దరేసి చొప్పున ఒక్కో కారు ఎక్కి వివిధ దిశల్లో వేగంగా కదిలిపోయారు.

ఆ నాయకుడు లాంటి వాడు, వాడికి తోడుగా ఇద్దరు సాయుధులు మా హోటల్‌కి ఎదురుగా నిలబడి పోయారు కాసేపు. ఆ తరువాత వారు మెల్లిగా మేమున్న హోటల్ ప్రధాన ద్వారం వైపు రావడం మొదలెట్టారు.

ఇదంతా నా కళ్ళ ముందరే జరిగిఉండకపోతే నేను అస్సలు నమ్మి ఉండే వాడిని కాదు ఇలాంటి సంఘటన జరుగుతుందని.

బయట జరుగుతున్న ప్రతీ దృశ్యం మాకు స్పష్టాతి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గదిని ప్రత్యేకంగా మేము ఎన్నుకోవటానికి కారణం ఇదే. నగరాన్ని సముద్రాన్ని స్పష్టంగా చూడ్డానికి వీలుగా ఉంటుందని మా బామ్మర్ది ఎంతో ముందుగా ఆన్‍లైన్‍లో ఈ గదిని ఆ రిజర్వ్ చేయించి ఉంచాడు.

ఈ గదిని ఎన్నుకోవడం ద్వారా నేను కవిత పెను ముప్పును ఎదుర్కొంటామని మాకు అప్పుడు తెలియదు.

నాయకుడు, సాయుధులైన అతని ఇద్దరు అనుచరుల బృందం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరుపుకుంటూ కదిలే మృత్యువులాగా మా హోటల్ ప్రధాన ద్వారం వైపు రాసాగారు.

ఈ పరిణామాన్ని నేను అస్సలు ఊహించలేదు.

సెక్యూరిటీ సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమై ఎదురుదాడికి దిగారు. కానీ ఘర్షణ ఏకపక్షంగా సాగింది. ఒక చిన్నపాటి ముఖాముఖి పోరాటం తరువాత ఆ సాయుధ అగంతకుల బృందం హోటల్ తాలూకు రక్షణ సిబ్బందిని మట్టి కరిపించటమేమిటి, వారిని అత్యంత పాశవికంగా హతమార్చటమేమిటి క్షణాల్లో జరిగిపోయాయి.

ఇప్పుడు ఆ ముగ్గురు హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించి, కోట గుమ్మాలలాంటి హోటల్ మెయిన్ గేట్లను మూసివేసేసారు. వారి ప్రతి కదలికలోనూ ఖచ్చితత్వం, అప్రమత్తత, యుద్ధనైపుణ్య శైలీ తేటతెల్లంగా కనిపిస్తున్నాయి.

ఇవన్నిటికన్నా వారిలో కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న మరో ప్రధాన అంశం మృగత్వం.

‘ముష్కరుల దాడిలో అసువులు బాసిన పౌరులు’ అన్న మాటలని వార్తా పత్రికల పతాక శీర్షికలలో చూస్తూ ఉంటాము, అది ఈ వేళ కళ్ళారా చూస్తున్నాను.

ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం అర్థం అయిపోయింది. ఆ హోటల్ ప్రాంగణం మొత్తం వారి హస్తగతమైంది ఇప్పుడు. మేము అందరం వారి బందీలము.

ఆ వాస్తవాన్ని జీర్ణం చేసుకోవటానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. భయంతో కవిత నన్ను బలంగా కౌగిలించుకుని, నా భుజం మీద తలపెట్టి ’ఇప్పుడెలాగండీ’ అన్నది బేలగా. ఆమె తల నిమురుతూ ఉండటం మినహా నేనేమి సమాధానం చెప్పలేకపోయాను. నాకు కూడా చాలా అయోమయంగా ఉంది.

నేను కిటికీ గాజు తలుపు గుండా వారినే గమనిస్తున్నాను. నా కనుచూపు పారినంతమేరా వారి కదలికలను గమనించగలిగిగాను. వారు చివరికి హోటల్ తాలుకూ పోర్టికోలోకి, అట్నుంచి హోటల్ రిసెప్షన్ విభాగం వైపు కదిలి చివరికి హోటల్లోనికి ప్రవేశించారు.

ఇక మా ప్రాణాలు ఉండటం లేదా పోవటం పూర్తిగా అదృష్టం మీద ఆధారపడి ఉంది అన్నది అర్థమయింది.

నన్ను చుట్టేసుకున్న కవిత స్పష్టమైన కంఠస్వరంతో మృత్యుంజయ స్తోత్రం చదువుకుంటోంది.

కిటికీలోంచి మరోసారి బయటకు దృష్టి సారించాను.

రోడ్ జంక్షన్ నిర్మానుష్యంగా ఉంది. నిశ్చేతనంగా పడిఉన్న టాక్సీ డ్రయివర్ల శరీరాలు, కాలిపోయిన టూరిస్టు బస్సు ఇందాకటి సంఘటనకి సాక్ష్యాలుగా ఉన్నాయి.

ఇంతలో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పోలీసు వాహనాలు కుయ్…కుయ్ మని సైరన్ మ్రోగించుకుంటూ వచ్చేశాయి. చీమల పుట్టలోంచి బయటపడ్డ చీమల్లా అనేక మీడియా వాహనాలు వచ్చేసాయి.

కెమరా వంక చూసుకుంటూ టక టకమని టీవీ విలేకరులు మాట్లాడేస్తున్నారు. కేమెరామెన్లు ఆ విధ్వంసాన్ని చూపుతూ విలేకరుల మాటల్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు.

మీడియా వారికి పండగే కద ఇక.

మీడియా వారికి కానీ, పోలీసులకు కానీ తెలియని విషయం ఏమిటంటే ఆ దుండగులలో ముగ్గురు మా హోటల్లోకి ప్రవేశించారని.

హోటల్ తాలూకు సెక్యూరిటీ గార్డుల శరీరాలు హోటల్ కాంపౌండ్‌లో ఉండిపోయాయి. ఇక్కడ ఘర్షణ జరిగింది అనేదానికి సంబధించిన ఏ ఆనవాలు హోటల్ గేట్ బయట దొరకకుండా జాగ్రత్త పడ్డారు ఆ దుండగులు.

నాకు మొదటి సారి తుపాకి మోత వినిపడి మెలకువ వచ్చినది లగాయతు ఈ క్షణం వరకు కేవలం పదే పది నిమిషాలు గడిచాయి. ఈ సంఘటనలన్నీ వరుసక్రమంలో ఇంత తక్కువ సమయంలో జరిగిపోయాయంటే వాళ్ళు ఈ ప్రక్రియని ఎంత ఖచ్చితత్వంతో నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు, పారామిలిటరీ దళాలు, పత్రికలవారు అంతా వచ్చారు. ఇక మేము ఏమాత్రం ఒంటరివారం కాదు అన్న భరోసా అయితే లభించింది కానీ, ఇక్కడ ఒక చిక్కేమిటంటే మా హోటల్లోకి ఉగ్రవాదులు ప్రవేశించినట్టు పోలీసులకు తెలియదు.

అదే విధంగా ఒక డజను మంది నరరూప రాక్షసులలాంటి ఉగ్రవాదులు నగరంలోని వివిధ ప్రాంతాలకు నిశ్శభ్దంగా వెళ్ళిపోయినట్టు కూడా వారికి తెలుసోలేదో నాకు తెలియదు.

ఈలోగా పోలీసులతో పాటు వచ్చిన వాసన చూసే శునకాలు (స్నిఫర్ డాగ్స్) మా హోటల్ గేట్ ముందుకు వచ్చి భీకరంగా మొరగసాగాయి. పోలీసులు అప్రమత్తమత్తులై గేటు ముందు అర్ధ వలయాకారంలో నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించిని విధంగా అప్పుడు జరిగింది ఆ సంఘటన.

ఉగ్రవాదుల్లో ఒకడు హోటల్ కాంపౌండ్ లోకి వచ్చి గేటు మీదుగా బయటకు ఏదో విసిరాడు. చాలా పెద్ద శబ్దంతో పెద్ద విస్పోటనం జరిగింది.

అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.

దాంతో పోలీసులకు, పారా మిలటరీ వారికీ అర్థం అయింది, తాము ఎదుర్కుంటున్నది సామాన్యులను కాదు, ఏదో పెనుముప్పే పొంచి ముందని.

వారు క్షణాల్లో రోడ్డుకి అటువైపుగా వెళ్ళి పోయి, తమ వాహన శ్రేణులవెనుక నక్కి కూర్చున్నారు. క్షణాలు యుగాలలాగా గడుస్తున్నాయి.

ఏమి జరగబోతోందో ఎవ్వరికీ అర్థం అవ్వటం లేదు.

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం।
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్॥

కవిత నోటి వెంట నిరంతరాయంగా మహా మృత్యుంజయ మంత్ర పఠనం కొనసాగుతోంది.

అప్పుడు వినిపించింది ’టక్…టక్’ మని ఎవరో తలుపు తడుతున్న ధ్వని. భయంతో నా నవనాడులు స్తంభించిపోయాయి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

కవిత వంక చూశాను.

అసలే పెద్దవైన తన కళ్ళు భయంతో మరింత పెద్దవయ్యాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి మాకు.

తలుపు తడుతున్న ధ్వని క్రమక్రమంగా పెద్దదైంది. ఎటువంటి మర్యాద, పద్దతీ పాఠించకుండా చాలా బలంగా మోదుతున్నారు బయట నుంచి. ఆ తలుపు మోదే విధానంలోనే వారి మొరటుదనం అర్థం అవుతోంది.

ఇక తలుపులు తెరవక తప్పదన్నట్టు కదలబోయాను తలుపు వంక. తలుపుదిశగా కదలబోతున్న నన్ను ‘వద్ద’న్నట్టు నిలువరించింది కవిత.

“ఆ టెర్రరిస్టులైతే ఎలా?” బేలగా ప్రశ్నించింది కవిత

నా ఉద్దేశంలో, తలుపు అవతల ఉన్నది టెర్రరిస్టులు అయిన పక్షంలో తలుపులు తెరవటమే మంచిది. లేని పక్షంలో వారి సహనాన్ని పరీక్షించడమే అవుతుంది. తలుపులు బద్దలు ఎలాగూ బద్దలు కొడతారు, ఆ ఉక్రోషంలో మమ్మల్ని హతమార్చినా ఆశ్చర్యం లేదు.

అందువల్ల వారికి సహకరించటమే సరి అయిన పని అని అనిపించింది. భరోస ఇస్తూ, కవిత చెయ్యి నెమ్మదిగా ఒత్తి, తనని విడిపించుకుని తలుపు తీశాను.

తలుపు తెరవడం ఆలశ్యం, ఓ ఇద్దరు మా గదిలోకి బలవంతంగా తోయబడ్డారు.

‘భగవంతుడా ఏమి జరుగుతోంది?’ అనుకుంటు వారి వంక చూశాను. మా పక్క గదిలోని జంట వారు. వారిని ఉదయాన్నే చూశాను.

చూస్తుండగానే మా గదంతా ఇలా బలవంతంగా లోనికి తోయబడ్డవారితో నిండిపోయింది.

నాతో కలిపి కనీసం ఓ ఇరవై మందిమి ఉంటాము. అంత మందిమి ఉన్నాకూడా ప్రాణభయంవల్ల ఎవ్వరూ మాట్లాడటం లేదు. నిశ్శబ్దం రాజ్యం ఏలుతోంది.

చూస్తుండగానే మళ్ళీ తలుపు తెరచుకుంది. ఈ సారి ఆ టెర్రరిస్టుల నాయకుడు, అతని ఇద్దరు అనుచరులూ లోనికి ప్రవేశించారు.

ఆ నాయకుడి లాంటి వాడు నింపాదిగా ఎటువంటి టెన్షన్ లేకుండా లోనికి వచ్చేసి, ఓ కుర్చీ లాక్కుని నేను ఇందాక నిలబడ్డ కిటికీ పక్కగా కూర్చున్నాడు.

అతను మమ్మల్నెవర్నీ పట్టించుకోకుండా నింపాదిగా బయటకు ఏకాగ్రతగా చూస్తుండిపోయాడు. అతడి వద్ద బైనాక్యులర్స్, ప్రాణాంతక ఆయుధాలు, సెల్ ఫోన్ ఉన్నాయి.

వాడు సెల్ ఫోన్ లో స్వచ్ఛమైన ఉర్దూలో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాడు.

మిగిలిన ఇద్దరూ తలుపు దగ్గరే నిలబడి పోయి మమ్మల్ని అందర్నీ అప్రమత్తంగా గమనిస్తూ ఉండి పోయారు.

వారు అంతా ఒక పదిహేను మంది మోటార్ బోట్ లో అరేబియా సముద్రం మీదుగా గేట్ వే ఆఫ్ ఇండియా వరకు వచ్చారని, వారు అంతా ఏదో పెద్ద ప్రణాళికతోనే వచ్చారని అర్థం అయింది వారి సంభాషణని బట్టి.

ఆ పెద్ద ప్రణాళిక ఏమిటి అన్నది అర్థం అవ్వలేదు. కాకపోతే అ ప్రణాళికలో భాగంగా మమ్మల్ని బంధిలుగా పట్టుకున్నారు అని అర్థం అయింది. ఇది గుడ్డిలో మెల్ల అని కాసేపటికి అర్థం అయింది. కాసేపటి క్రితమే వారు కింది అంతస్తులలో దాదాపు యాబై మందిని పొట్టన పెట్టుకున్నారని అర్థం అయింది వాడి మాటల వల్ల.

వాడు ఫోన్లో నివేదిక ఇస్తున్నాడు. మిగతా అందరు ’అనుకున్న గమ్యాలకు’ చేరుకున్నారని, ‘అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతున్నాయని’ చెబుతున్నాడు.

మా అందర్నీ ఎందుకు బందీలుగా పట్టుకున్నారో, మమ్మల్ని ఏమి చేయబోతున్నారో నాకు ఆ క్షణంలొ అర్థం కాలేదు కానీ త్వరగానే అర్థం అయింది.

మమ్మల్ని అందర్నీ చేతులు వెనక్కు పెట్టుకుని కూచోమని ఆఙ్జాపించారు.

ఆ తరువాత వారిలో ఒకడు వచ్చి బలమైన టేపులతో మా చేతులను కట్టేశాడు.

వాడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది.

గుబురు గడ్డం దట్టంగా పెరగడం వల్ల నాకు పోలిక చిక్కడం లేదు, కానీ బలంగా తెలుస్తోంది వాడిని ఎక్కడో చూశాను అని. వాడు నాతో బాగా దగ్గరగా తిరిగిన వాడే అని తెలుస్తోంది.

పోలిక చిక్కినట్టే చిక్కి తిరిగి మళ్ళీ గుర్తు రావడం లేదు.

వాడి నుదుటిపై గాయం, పిల్లి కళ్ళూ.. కోల మొహం. ఇవన్నీ ఏదో ఙ్జాపకాల్ని తట్టి లేపుతున్నాయి.

వాడు కూడా ఉండుండి నా వంక చూసి, నాతో చూపులు కలిసిన తక్షణం తల తిప్పేసుకుంటున్నాడు. వాడు ఒక్కొక్కరికి చేతులు బంధించి, నోటిపై టేపు వేసుకుంటూ వస్తున్నాడు.

నా వద్దకు కూడా వచ్చేశాడు.

ఆ! గుర్తొచ్చేసింది. వీడు నా చిన్నప్పటి క్లాస్మేట్.

“ఒరే!… జావేద్. నువ్వేంటి ఇలా…?” అని ప్రశ్నించబోయేటంతలో నా నోటిపై బలమైన టేప్ వేశేశాడు.

ఇలా అందర్నీ బంధించి వారిరువురూ తిరిగి తలుపు దగ్గర అప్రమత్తంగా నిలబడ్డారు.

జావేద్ నాకు సుస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాడు. వాడు అప్పుడప్పుడూ నన్ను చూసి తత్తరపాటుతో తల తిప్పేసుకుంటున్నాడు.

వీడెందుకిలా మారిపోయాడు?

నా ఆలోచనలు గతంలోకి దారి తీశాయి.

***

అది ఒక చిన్న ఊరు.

అప్పుడు నేను పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాను. జావేద్ నా క్లాస్‌మేట్ ఒకటో తరగతి నుంచి.

జావేద్ గూర్చి చెప్పబోయే ముందు సామవేదం మేష్టారు గూర్చి చెప్పుకోవాలి. నా స్కూలు తాలుకు ఙ్జాపకాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఈ శ్రీ సామవేదం మేష్టారు. ఆయన అసలు పేరు షఫియుల్లా.

సామవేదం ఆయన కలం పేరు. ఆయన కవితలు, కథలు వ్రాసేవారు. ఆయన మాకు తెలుగు చెప్పిస్తుండేవారు. ఆయన మా స్కూలు హెడ్మాష్టరు కూడాను.

శ్రీ సామవేదం మాష్టార్ గారిపై గౌరవంతో చుట్టుప్రక్కల ఉన్న సుమారు ఇరవై గ్రామాల ప్రజలువారి పిల్లల్ని మా పాఠశాలలోనే చేర్పించేవారు.

ఆయనని కేవలం ఒక ఉపాధ్యాయుడు అనో, ఒక స్కూల్ హేడ్ మేష్టార్ అనో పరిచయం చేసి సరిపుచ్చడం ఆయన్ని, ఆయన వ్యక్తిత్వాన్నీ పూర్తిగా చూపకపోవటమే అవుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక విశ్వ మానవుడు.

ఆయన కుల మత బేధాలకు అతీతంగా విద్యార్థులందర్నీ తన స్వంత పిల్లల్లా చూసుకునేవారు. తన పాఠ్యాంశలే కాక ఇతర సబ్జక్టులన్నింటినీ అందరికీ తన ఇంట్లో ఉచితంగా ట్యూషన్లు చెప్పేవారు.

ఆయన్ని ఒక మతానికి చెందిన వ్యక్తిగా బావించలేము. ఆయన పుట్టుక రీత్యా ఒక మతంలో పుట్టినప్పటికీ మానవత్వమే నా మతం అన్నట్టు జీవించేవారు. ఆయన అన్ని పండగలనీ ఆస్వాదించేవారు. అందరితో ఆనందంగా గడిపేవారు. ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నంత సేపు ప్రతి క్షణము పండగే అని అనేవారు.

మనం మరణించిన తర్వాత స్వర్గం నరకం అనేవి ఉన్నాయో లేవో వాటిని చూసిన వారెవరన్నా ఉన్నారో తెలియదు, కానీ ఈ రోజుని నీవు స్వర్గంగా మార్చుకుంటావా లేదా నరకంగా మార్చుకుంటావా అన్న నిర్ణయం తీసుకునే అవకాశం ప్రతి ఉషోదయం నీకు ఇస్తుంది అనేవారు.

తలవ్రాత, ఆలోచనా ధోరణి అన్న రెండు అంశాల గూర్చి ఆయన చెప్పిన మాటలు నా జీవితం పై చాలా ప్రభావం చూపాయి.

తలవ్రాత గురించి ఆయన ఏమంటాడు అంటే, నీవు ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అన్న అంశం వరకే నీ తలవ్రాత. ఆ తరువాత నీ యావత్తు జీవితం నీవు తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఉంటుంది.

నీ విజయాలకైనా నీ అపజయాలకైనా తలవ్రాతని నిందించవద్దు. నీ ఆలోచనలను మార్చుకో అని పదే పదే చెప్పేవారు. దేవుడు ఎక్కడో లేడు, నువ్వు తప్పు చేసినప్పుడల్లా నిన్ను అపరాధ భావనకి గురిచేసే నీలోని అంతరాత్మనే దేవుడు. నీ అంతరాత్మ మాట విను నువ్వు ఎప్పుడు తప్పుడు మార్గంలో వెళ్ళవు అని చెప్పేవారు.

ఈ మాటలని ఊరికే చెప్పటం కాదు ఆయన ఆచరించి చూపేవారు.

జీవితాన్ని ఆయన ఒక పసి పిల్లాడిలా ఆస్వాదించేవారు.

మా చిన్న ఊర్లో మొదటి సారి ఒక పొలంలో బోర్ బావి వేసినప్పుడు ఈయన అక్కడే ఉండి పసి పిల్లాడిలా అక్కడే ఉండి ఆసక్తిగా తిలకించి ఆ కార్మికులందరికీ దగ్గరుండీ భోజనాలు పెట్టి, బోరు బావి లోంచి నీళ్ళు ఎగసి చిమ్మినప్పుడు పసిపిల్లాడిలా గంతులు వేశాడు.

ఆయనకు చినుకు కురిసినా ఆనందమే, మబ్బు పట్టి చల్లగాలి వీచినా ఆనందమే.

ఎండ కాచినా ఆనందమే, మెరుపు మెరిసినా ఆనందమే ఆయనకి.

శ్రీశ్రీ గారు తన శైశవగీతి ఈయనని చూసేవ్రాసారేమో అనిపిస్తుంది నాకైతే.

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!

వయసుతో నిమిత్తం లేదు, ఆయన మానసికంగా ఒక శిశువు అంతటి నిష్కల్మషుడు.

ఆయన దినచర్య చాలా పద్దతిగా ఉంటుంది. ఉదయం నాలుగున్నరకే లేచి అయిందిటికల్లా సిద్ధమయిపోయేవారు. చూస్తుండగానే పిల్లలందరూ వచ్చేస్తారు. వారితో యోగా చేయిస్తారు. ఆ తరువాత భగద్గీతలో శ్లోకాలు రాగయుక్తంగా ఆలపించి అర్థం వివరించేవారు.

రోజు అయిదుసార్లు నమాజు చేసేవారు. రంజాన్ పండగ నెల్లాళ్ళునియమబద్దంగా పండగ నియమాల్ని పాఠించేవారు.

ఇక ఊరికి ఊరి ప్రజలకు ఏదో ఒక సామాజిక కార్యక్రమం చేపట్టేవారు. ఆయన పెట్టిన జ్ఞానభిక్షతో ఎదిగిన ఎందరో జీవితంలో అత్యుత్తమ స్థానాలలో స్థిరపడి ఉండేవారు. వారందరూ ఆయన అడగకనే ఆయన చేపట్టే సామాజిక కార్యక్రమాలలో ఆర్థిక సాయం చేయటమే కాక చేదోడు వాదోడుగా ఉండేవారు.

ఆయనకి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడ్ని కని ఆయన భార్య చిన్న వయసులోనే కన్ను మూసింది. ఆయన మళ్ళీ పెళ్ళీ అన్న మాట ఎత్తుకోకుండా తల్లీ తండ్రీ అన్నీ తానే అయి ఆ కుర్రాడ్ని పెంచుకుంటున్నాడు.

ఆ కుర్రాడే ఈ జావేద్.

అంత మంచి వ్యక్తికి ఈ కుర్రాడు ఎలా పుట్టాడా అని ఊరి వాళ్ళందరూ కూడా బాధపడేవారు.

మొదటి నుంచీ కూడా వాడిది విపరీత ధోరణే. చిన్న చిన్న విషయాలకే అందరితో తగువులాడటం, అందర్నీ నొప్పించడం చేసే వాడు.

అప్పట్లో నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పుడు విశ్లేషించగలుగుతున్నాను, వాడు అప్పట్లో విపరీతమైన ఆత్మన్యూనతా భావముతో బాధపడేవాడు.

మా సామవేదం మాష్టారు వాడికి బుద్ధి చెప్పి సన్మార్గంలో పెట్టాలని ఎంతో ప్రయత్నించాడు కానీ ఆయన ప్రయత్నాలు విఫలమే అయ్యేవి.

వాడు పదవతరగతి పరీక్షలు కూడా గట్టెక్కలేకపోయాడు. అది మొదలు చదువుకు స్వస్తి పలికాడు. చెడు స్నేహాలు, దురభ్యాసాలు, ఊర్లో ఎక్కడ గొడవలు ఉన్నా వాటిలో వాడి పాత్ర ఉండటాలు ఇవన్నీ మాములు విషయాలు అయిపోయాయి.

మనుషుల్ని నాలుగు రకాలుగా విభిజించవచ్చు అని చెప్పేవారు మామేష్టారు.

’అయాం ఓకే, యూ ఆర్ ఓకే ’అని నిరంతరం భావించే వాళ్ళు మొదటి రకం. కంపెనీ హెచ్చార్ మేనేజర్లు ఇలాంటి వ్యక్తులను మాత్రమే ఎన్నుకుని ఉద్యోగాలిస్తారట.

”అయాం ఓకే, యూ ఆర్ నాట్ ఓకే’ అని అనుకునే వారు రెండవ రకం. వీరు అహంభావంతో ఉంటారు.

’అయాం నాట్ ఓకే, యూ ఆర్ ఓకే’ అని అనుకునే వారు మూడవ రకం. వీరు ఆత్మ న్యూనతతో బాధ పడుతూ ఉంటారు.

’నేను బాగాలేను, నువ్వూ బాగాలేవు’ ఈ ప్రపంచమే చెడిపోయి ఉంది అని అనుకునే వారు నాలుగో రకం. ఇలాంటి వారు ఆత్మఘాతుక చర్యలకు, హింసాత్మక చర్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు.

ఏతావాతా మొదటి రకం వారికి మాత్రమే విజయావకాశాలు ఉంటాయని మాకు చిన్నప్పటి నుంచి బోధించేవారు మా మేష్టారు. మిగతా ముగ్గురికీ ఉద్యోగావకాశాలు తక్కువ ఉంటాయని, ముఖ్యంగా నాలుగో రకంకి చెందిన వారు ప్రపంచ శాంతికి హానికారకులవుతారని చెప్పేవాడు.

దీపం తన చుట్టూతా వెలుతురు పంచి ఇచ్చినా, తన క్రిందనే ఉన్న చీకటిని పారద్రోలడంలో విఫలం అవుతుంది అన్నట్టు అయింది ఆయన పరిస్థితి.

ఆ తరువాత నేను పై చదువులకి ఊరు విడిచి వెళ్ళటం , ఉద్యోగ రీత్యా విదేశాలలో స్థిరపడటం ఇలా అనేక సంవత్సరాలు గడచిపోయాయి.

ఇటీవల నా పెళ్ళిపత్రిక ఇవ్వటానికి మా ఊరు వెళ్ళి మేష్టార్ని కలిశాను. ఆయన పడుకుని ఉన్నారు మంచంపై. అంపశయ్య మీద పడుకుని మృత్యువుకై ఎదురుచూస్తున్న భీష్మ పితామహుడిలా కనిపించారు ఆయన నాకు. నా పెళ్ళికి వస్తానన్నారు. అనటమే కాదు. వచ్చారు కూడా.

అయినా ఆయనలో తేజస్సు, శక్తి యుక్తులు ప్రఙ్జా పాటవాలు ఏమాత్రం తగ్గలేదు. గ్రామానికి తనవంతు సేవలు చేస్తూనే ఉన్నాడు. పిల్లలకు పాఠాలు చెబుతూనే ఉన్నారు.

కృంగి పోయి ఉన్నారు ఆయన. వయోభారం వల్ల కాదు. కొడుకు ఇల్లు వదలి వెళ్ళిపోయాడనే దుఃఖం అయన్ని నిలువెల్లా కృంగదీస్తోంది. ఆ కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఏమి చేస్తున్నాడో తెలియదు. క్షేమంగా ఉన్నాడో లేదో తెలియదు. అతని ఆందోళన అంతా జావేద్ గూర్చే.

అదిగో అక్కడ అదృశ్యం అయిన ఆ జావేద్ ఇక్కడ ఇలా ప్రత్యక్షం అయ్యాడు.

ఇందాక చెప్పుకున్న నాలుగో తరహా వ్యక్తులను ఎన్నుకుని శిక్షణ ఇవ్వటమే పనిగా పెట్టుకుని శిక్షణ ఇవ్వటమే టెర్రరిస్ట్ సంస్థల పని అని హెచ్చార్ మేనేజర్‌గా శిక్షణ పొందిన నాకు తెలుసు.

మొదటి తరహా వ్యక్తులను హెచ్చార్ మేనేజర్లు ఎన్నుకుంటే, నాలుగో తరహా వ్యక్తులను టెర్రరిస్టులు ఎన్నుకుంటారు. అదీ సంగతి.

***

పెద్ద శబ్దంతో ఈ లోకంలోకి వచ్చాను.

బయట నుంచి మైకులో పోలీసు వారి ప్రకటన వినిపిస్తోంది.

“నగరంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి విధ్వంసం సృష్టించిన ఉగ్రవాదులను ఎక్కడికక్కడే మట్టుపెట్టాము. మీరు లొంగి పోండి, లేదా మిమ్మల్ని మా కమేండోలు హతమారుస్తారు”

అందుకు సమాధానంగా వీరి నాయకుడు కిటికీలోంచి మరో హేండ్ గ్రెనేడ్ విసిరాడు. అది హోటల్ ఆవరణలోని గోల్ఫ్ కోర్టులో పడింది. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.

తనదగ్గర ఉన్న హేండ్ మైక్ అందుకుని చెప్పాడు “మేము జిహాదీలం. మాకు ప్రాణ భయం లేదు. మాకు వందకోట్ల విలువైన బంగారు బిస్కట్లు, మంచి కండిషన్ లో ఉన్న లాంచీ ఏర్పాటు చేయండి. అప్పుడు ఈ గదిలో ఉన్న బందీలను వదిలిపెడతాము. లేదా వారిని చంపి మేము చస్తాము.”

ఈ చర్చలు సుమారు మూడు రోజులు సాగాయి.

ఈ మూడు రోజులు కూడా మూతికి టేపుతో, చేతుల్ని వెనక్కి విరిచి కట్టబడి, నడవటానికి కూడా వీలు లేకుండా గడిపాము.

నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూశాము.

ఇంత జరుగుతున్నా నాకు ఆ ఉగ్రవాదులపై కోపం రావడం లేదు. జాలి కలుగుతోంది. అవును నాకు జాలే కలిగింది.

నా ఆలోచనలు చరిత్రలోకి, విషయం తాలూకూ మూలాల్లోకి వెళుతున్నాయి.

విభజించు – పాలించు అన్న నియమాన్ని పాఠించి ఆంగ్లేయులు హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టారు. ఇప్పుడు అదే పద్దతిని అందిపుచ్చుకుని కొన్ని పాశ్చాత్య దేశాలు పాక్ – భారత్‌ల మధ్య చిచ్చు పెట్టి, రెండు వర్గాలు నిరంతరం కొట్టుకుచచ్చేలా చేస్తూ, ఇరు వర్గాలకు ఆయుధాలు అమ్ముతూ, ఆ ఘర్షణ తాలుకు మంటల సెగలో చలి కాచుకుంటున్నాయి.

అందుకు గాను అక్కడా ఇక్కడా కూడా హింస కొనసాగిస్తూ, ఒకరిపై ఒకరికి అనుమానం కలిగేలాంటి పరిస్థితులను కల్పిస్తున్నాయి.

పొరుగు దేశం టెర్రరిస్టు దేశం అయితే మరక్కడ కూడా నిరంతరం ఎందుకు బాంబుదాడులు జరుగుతున్నాయి?

ఆయుధ విక్రేతలు ఆడిస్తున్న కుట్రలో భారత్, మరియు పొరుగు దేశాలు పావులవుతున్నాయి.

జావేద్ లాంటి యువకులు సమిధలవుతున్నారు.

ఎలా తెలుపను ఇదంతా జావేద్‌కి?

చెప్పినా అర్థం చేసుకుంటాడా?

నాలుగో రోజు ఉదయం ఒక నాటకీయ పరిణామం జరిగింది.

బయట నుంచి పోలీసులు మైకులో ప్రకటించారు, వీరి కోరికలన్నింటినీ ఒప్పుకుంటున్నామని.

అనేక చర్చోపచర్చల అనంతరం మేమంతా మొదటిసారి బయటికి వచ్చాము. చీకట్లోనే ఉండటానికి ఇష్టపడే గుడ్లగూబల్లాగా ఉంది మా పరిస్థితి. వెలుతురు చూడలేకపోయాము. కొద్దిసేపు.

కదలటానికి సహకరించని కాళ్ళని ఈడ్చుకుంటూ, కదలటానికి వీల్లేకుండా కట్టేసిన చేతుల్లోని నొప్పిని సహిస్తూ మేమందరం బలికి తీసుకువెళుతున్న గొర్రెల్లా ఒక మందగా బయటికి వచ్చాము.

మాకు ముందర జావేద్. మా సమూహం వెనుకగా అప్రమత్తంగా ఒక అనుచరుడితో వాళ్ళ నాయకుడు.

ఇలా ముందుకు కదులుతూ గేట్ వే ఆఫ్ ఇండియా దాకా వచ్చాము.

దూరంగా చుట్టూ ఎటు చూసినా మిలటరీ వారు, మీడియా వారు. అక్కడంతా ఒక విధమైన ఉద్విగ్నమైన వాతావరణం నెలకొని ఉంది.

ఒక మిలటరీ జవాను వచ్చి లాంచీ తాలూకు తాళాలు జావేద్‌కి అందించాడు.

“లాంచీలో వంద కోట్ల విలువైన బంగారు బిస్కట్లు ఉన్నాయని. బందీలకు ఎవ్వరికీ హాని తలపెట్టవద్దని” మైకులో ప్రకటన వస్తోంది.

ఇంక వంద అడుగులు వేస్తే మా బృందం లాంచీ దగ్గరకి చేరుకుంటామనగా, టెర్రరిస్టు నాయకుడు చేతి మైకులో ప్రకటించాడు

“పోలీసులు, మిలటరీ అందరూ దూరంగా వెళ్ళిపోండి. మేము లాంచీ ఎక్కే చివరి క్షణం వరకు కూడా బందీలు మాతోనే ఉంటారు. మేము లాంచీ ఎక్కి దూరం వెళ్ళే వరకు ఎవ్వరూ దగ్గరకు రాకూడదు” అని ప్రకటించాడు.

చేసేదేం లేక మిలటరీ వారు పోలీసు వారు వాహనాలతో సహా చాలా దూరం వెళ్ళి పోయారు. అప్పుడు నాకు కాస్తా భయం వేసింది. కవిత నాకు దగ్గరగా వచ్చి ఆనుకుంది.. నేను తనకు కళ్ళతోనే ధైర్యం చెప్పాను.

మా ముందర జావేద్ నడుస్తున్నాడు. నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ వాడు మాట్లాడటం ప్రారంభించాడు. అది కూడా నా ఒక్కడికే వినిపించేలాగా గొంతు తగ్గించి చెప్పడం మొదలెట్టాడు.

“నేను ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను. దాని పరిణామం ఎలా ఉండబోతోందో నాకు తెలియదు.

సంతోష్ నన్ను క్షమించు.

నిన్ను చూడగానే నాకు నా బాల్యం, మన ఊరు, మా నాన్నగారు అన్నీ గుర్తు వచ్చాయి. నేను ఎంత పొరపాటు మార్గం ఎన్నుకున్నానో నాకు అర్థం అయింది. ఇక వెనక్కు తీసుకోలేనంత దూరం వచ్చేశాను. కానీ ఇప్పటికైనా ఒక మంచి పని చేసి చనిపోయానన్న తృప్తితో చస్తాను. అందుకే ఈ నిర్ణయం తిసుకున్నాను. నా సహచరులు, నేను సజీవంగా దొరికిపోయేలా ప్రయత్నం చేస్తాను. మా నాన్నగారికి నా నమస్కారాలు అందజేయి. నన్ను క్షమించమని అడుగు.”

నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోక మునుపే జావేద్ ఒక్కసారిగా తన సహచరుల వైపుకి దూసుకుపోయాడు.

ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ వర్ణించాలి అంటే నాకు మాటలు చాలవు. నేను రచయితను అయి ఉంటే ఆ సంఘటనల్ని ఎంతో అద్భుతంగా చెబుదును. ఒక సాధారణ హెచ్చార్ మేనేజర్ ని కాబట్టి ఏదో నాకు తెలిసిన విధంగా చెబుతాను.

చిరుతకన్నా వేగంగా కదిలి తన సహచరుల చేతులపై, మోకాళ్లపై కాల్పులు జరిపి వాళ్ళు ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపునే వాళ్ళని నిరాయుధుల్ని చేసీ తన అయుధాన్నీ దూరంగా విసిరేసి, రెండు చేతులూ పైకెత్తి మోకాళ్ళపై కూర్చుని మిలటరీ వారి వంక చూస్తూ కూర్చుండిపోయాడు.

ఈ విధంగా క్షణంలో వెయ్యవవంతులో తాము ముగ్గురు నిరాయుధులుగా, సజీవంగా మిలటరీ వారికి దొరికిపోయేలాంటి పరిస్థితులు కల్పించాడు.

మేమంతా స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్నాము.

కొన్ని నెలల విచారణానంతరం మిగతా ఇద్దరు ఉగ్రవాదులకు ఉరిశిక్ష, జావేద్‌కి యావజ్జీవిత ఖైదు విధింపబడింది.

***

తాను నేర్పిన పాఠాలు కాస్తా ఆలశ్యంగా అయినా పని చేశాయి అని గొణుక్కుంటున్నారు సామవేదం మేష్టారు గారు అశ్రునయనాలతో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here