[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘పచ్చదనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ప[/dropcap]చ్చపచ్చని చీర చుట్టుకుంది
అలల కొలను
ఆ క్యాన్వాస్ పై జవరాలి నడకలు
తేలి తిరుగాడ
ప్రాణాధార జీవగంజి పోసి
జిగితో నేసినవి నీటి పై పొరను
ఆల్గీ ఫంగీ సూక్ష్మ వృక్షజీవులు
చెమ్మగిల్లిన మట్టి గోడలు పులుముకొన్నవి
సుందర ఆశలు ఊయలూగినవి నేలపై
ఊహల అందాలన్నీ పూచినవి కళలెన్నో
కొండలు గుట్టలు పరుచుకున్నవి
గడ్డి మొక్కల సోయగాలన్ని
తలలూపెను గాలికి కొండకొమ్మున స్వేఛ్ఛతో
ఊపిరి బతికిన ప్రకృతి
ఆక్సీజన్ చిగురేసిన గాలి
చెట్లన్నీ బ్రాండ్ అంబాసిడర్లే పచ్చదనానికి
చెట్ల అస్తిత్వానికి సజీవ సంతకం
పచ్చదనం
కాలుష్యమైన పర్యావరణానికి
విరుగుడు మాత్ర చెట్టూచేమ
ఎద సొదల పంటపొలాలన్నీ
తీవ్ర భూతాపానికి చెక్ మేట్సే
పచ్చదనపు చిరునామాలో పొదిగుంది
పర్యావరణ పరిరక్షణ ఔషధం
ప్రకృతి సంరక్షణలో
మనిషి ఆరోగ్యం బతుకు