Site icon Sanchika

పచ్చందనాల పిలుపు

[dropcap]1[/dropcap]
కంటి కిటికీలోంచి
అనంత రూపుల ఆకుల సడి
నాలోని కొత్త లోకంలోకి దారి తెరుస్తుంది
వ్యామోహాలు, వ్యాకులతలతో
పాకుదేరిన గుండెకొండను గాలించి
సంజీవని మూలికల్ని వెలికితీస్తుంది
నింగి గుబురుల్లోకి చూపుల్ని జొనిపి
జడకొమ్మల్లోంచి వెలుతురు చినుకుల్ని జులిపి
యోగనిద్ర వీడే ఒక్కో చెట్టు
చిలికే మంత్రజలానిది ఎంతటి మహిమో గానీ
వింతగా తనువంతా రెక్కలు మొలుస్తాయి
ఉరకలతో కొత్త నీటిని గిలకొట్టే
“సమద్ బెహరంఘీ” నల్లచేపపిల్లలా
నాకు నేను సరికొత్తగా పరిచయమౌతాను
2
ఎర్రమన్ను ఓరేలతో అడవిదారి స్వాగతిస్తుంటే
వరిపీక ఒత్తిచేసి చీకటిమాన్యంలో దీపం వెలిగించిన
కళింగ కారువమ్మ తోబుట్టువులంతా జ్ఞప్తికి వస్తారు
కోవ దాటి, మరో కోనకు చేరే దారిలో
హరిత నేత్రుడి రుధిర బాష్పధార
దుఃఖవాగులా ఎదురుపారుతుంది
మోదుగ మెరకల్లో
జల్లెడలాంటి దేహంతో
రెపరెప జ్ఞాపకాల పాటొకటి ఎక్కిళ్లు పెడుతుంది
కానలో కాసులు వెతికే దురాశ
క్షయవ్యాధి సోకిన నేలతల్లి ఊపిరితిత్తుల్లో
ఒక్కొక్కటిగా కనుమూస్తున్న వాయుగోనుల చితిపై
స్వకీయ అంత్యక్రియలకు సిద్ధపడుతుంది
3
పొదల పొదరింట క్రూర మృగాలెన్ని పొంచివున్నా
అరణ్యమెపుడూ కారుణ్య ధామమే!
అడవి పొత్తిళ్ళలో పాదం మోపగానే
నడి వయసు నదిలో మునిగి
పసి ప్రాయమై పైకి లేచినట్టుంటుంది
సుతారంగా పలికే గాలి సితార
నిలువెత్తు ముళ్లపొదల్ని నిచ్చెన రాగాలుగా పేర్చి
బాట పరుస్తుంది
దారి వెలుగయ్యే అడవి పరిమళం
చీకటి తావుల్లో కలియదిరిగి
ఎదనింగిలో ఎన్నెల దీపాన్ని వెలిగిస్తుంది
పరవశంతో కాలం, ప్రాణానికి ఊయలవుతుంది
మహత్వపూర్ణమైన వర్ణశాస్త్ర విద్వత్తేదో
గురు సన్నిధిలా పచ్చని వదనంతో చేరదీస్తుంది
4
అడవిలో ఆరారా తిరిగి రావాలేగాని
ఒళ్ళంతా సరికొత్త చివురింత!
అడవిలో నడవడమంటే
నాలోకి నేను నడిచి వెళ్ళడమే!
వనంలో తిరగడమంటే
చూపుల తడి గెలుచుకోవడమే!
చెట్ల మధ్యకలా సాగిపోవడమంటే
గుండెపొలంలో కొత్త చేను నాటుకోవడమే!
ఎక్కడ ఏ ప్రత్యేకత దాగుందో గానీ
చెట్టు దాటి మరో చెట్టును చేరేసరికి
అడుగులు తేలికవుతాయి
లోవ దాటి మరో లోయను చేరేసరికి
మనసు కొత్త జీవమై మొలకెత్తుతుంది
ఎక్కడెక్కడి పక్షులో కువకువ గింజల్ని చల్లి
అద్భుత వర్ణాలై అడవికి రెక్కలు తొడగడం చూస్తే
నేనో కొత్త మనిషినౌతాను
5
సోయగాలనూ, సుగంధాలనూ కూర్చికట్టిన
వృక్షమాలను చేపట్టి దీక్షలో కూచుంటే
శ్వాస శ్వాసలో బతుకు బోధ ఆకళింపుకొస్తుంది
ఆకుల అరిచేతుల్లో పళ్ళుపెట్టి
అతిథుల్ని ఆహ్వానించే చెట్లు
ఎన్నో అభిజాత్యాలను హరించేస్తాయి
ఒక చిన్న చిగురుకు పురుడుపోస్తున్న
ప్రకృతి దృశ్యం
ఎన్నో విశ్వ సంకేతాలను వెల్లడి చేస్తుంది
ఎన్నెన్నో జీవ జాతులు
హాయిగా పొద్దుపుచ్చే చోట
దాచుకోవాల్సినవేవో, పారేయాల్సినవేవో
మరింత స్పష్టంగా తెలిసివస్తుంది

Exit mobile version