పసిఫిక్ పదనిసలు – 2

    1
    6

    [box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు’ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]

    ఆ తర్వాత ఉదయం ఐదున్నర కల్లా అలారం మోగటంతో మెలకువ వచ్చింది. రాత్రే స్నానాలు ముగించాం కాబట్టి ముఖం కడుక్కుని, దుస్తులు మార్చుకుని బయల్దేరడమే. అందుకే ఇంకో అరగంట పడుకుందాం అనుకుని బద్ధకంగా పడకమీదే ఉండిపోయాం. కాలం కరగడం ఎంత సేపు! ఆరింటికల్లా మళ్ళీ అలారం గోల పెట్టింది. తప్పదనుకుంతూ నేను ముందు లేచి తయారవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత  మా లగేజ్ అంతా సరి చూసుకుని, ఒక్కొక్కటి కారు ట్రంక్‌లోకి చేర్చాం. ఆ పైన ఛార్ట్ మీద ‘వెరీ కంఫర్టబుల్, వుయ్ ఎన్‌జాయ్‌డ్ ఆల్ ది ఎమినిటీస్…’ వగైరా రాసేసి బయటకి వచ్చాం. ఇక పైకెళ్ళి ఛక్ గారితో ఓ మాట చెబ్దామనుకునేంతలో మా సందడికి ఆయనే బయటకు వచ్చాడు. “మీ వసతి ఎంతో బాగుంది. చక్కటి విశ్రాంతి తీసుకున్నాం” అని దీప ఇంగ్లీషులో చెప్పింది. “అయితే మళ్ళీ రండి” ఆనందంగా అన్నాడాయన. అలా ఆయన దగ్గర సెలవు తీసుకుని, కారెక్కి రెండో రోజు యాత్రకు నాంది పలికాం.

    ముందుగా కారుకు గ్యాస్ కొట్టుకుని, స్నాక్స్ తిని, ‘మారో బే’ నుంచి ‘మాంటెరీ’కి ప్రయాణమయ్యాం. మళ్ళీ ప్రకృతి సౌందర్యం కన్నుల పండుగ చేయసాగింది. రవితేజాన్నలంకరించుకొన్న ఆకాశం మనసుని ఉత్తేజపరుస్తోంది. కొంత దూరం వెళ్ళాక ‘మెక్‌వే ఫాల్స్’ వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తోందో జలధార కొండ పై నుంచి సముద్రంలో పడుతోంది. అదో రకం ఆకుపచ్చని సముద్రపు నీటిలో తెల్లని జలపాతపు ధార కమనీయంగా ఉంది. చుట్టూ ప్రకృతి చూపు తిప్పనీయడం లేదు. కొద్ది సేపు చూసి మళ్ళీ కారెక్కాం. అందరూ చూడాలని తహతహలాడే ‘బిగ్‌సర్’ వైపు మా ప్రయాణం.

    అమెరికన్ నేషనల్ సీనిక్ బైవే అది. అలాగే కాలిఫోర్నియా సీనిక్ హైవే కూడా. ప్రపంచంలోని అత్యుత్తమ తీరరేఖలలో ఇదొకటి. శాంటాలూసియా పర్వతాలు ఒక వైపు కొలువు తీరాయి. 90 మైళ్ళ పొడవున రెడ్‌వుడ్ వృక్ష సముదాయం రెప్పవాల్చనీయడం లేదు. మాంటెరీ పైన్ కంట్రీగా పేరొందింది. అన్నట్లు ఈ మధ్య ‘బిగ్‌సర్’ వార్తలో ప్రముఖంగా నిలిచింది. 2017 ఫిబ్రవరిలో వర్ష బీభత్సం కారణంగా అక్కడ ల్యాండ్‌స్లైడ్స్ ఏర్పడ్డాయి. అయితే అక్టోబరు 2017 నుంచి పైఫర్ కాన్యన్ బ్రిడ్జిని మాత్రం పునరుద్ధరించారు. ల్యాండ్‌స్లైడ్ ప్రాంతాన్ని పునరుద్ధరించడానికి ఇంకా ఏడాది పడుతుందట. ద్రాక్షతోటలతో నిండిన పాసో రాబుల్స్ కొండలు మరో ఆకర్షణ. ‘బిగ్‌సర్’ను ఏటా 4.6 మిలియన్ల మంది సందర్శిస్తారు. ఇక్కడ ఉన్న ‘బిక్స్ బి బ్రిడ్జ్’ను 1932లో నిర్మించారు. ప్రపంచంలో ఎత్తయిన సింగిల్ స్పాన్ బ్రిడ్జిలలో ఇది ఒకటని తెలుసుకున్నాం.

    ఆ పైన కారులో ముందుకు సాగగా దారిలో ‘గరాపాట’ బీచ్ వచ్చింది. అక్కడ దిగి అలల వైపు కదిలాం. అలలు ఆప్యాయంగా వచ్చి పాదాలను తడుపుతూ పలకరించాయి. కొంతమంది పిల్లలు సైతం అలలను రారమ్మన్నట్లుగా ముందుకెళ్ళి నిల్చున్నారు. బాల్యానికి భయం దూరం కాబోలు. నేనూ ముందుకెళ్ళాను. పరుగుపందెంలో అభ్యర్థుల్లా అలలు దూసుకువచ్చి మళ్ళీ వెనుదిరుగుతున్నాయి. కొన్నిసార్లు ఊపుగా వచ్చి నిలుచున్నవారిని దాటి ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ అంతే వూపుతో వెనుదిరుగుతున్నాయి. ఆ క్రమంలోనే ఓ సారి వచ్చిన అల తిరిగి వెళ్తూ నన్ను బలంగా తాకింది. ఏమయిందో తెలియదు కానీ ఓ క్షణం కళ్ళు చీకట్లు కమ్మాయి. కూలబడ్డాను. అల అల్లరిగా నవ్వి వెనుదిరిగినట్లుంది. అంతలోనే నిలదొక్కుకుని లేచాను. అలల పట్ల ఆకర్షణ మరింత పెరిగింది. ఇంకొద్దిసేపు అలాగే అలల సయ్యాటను ఆనందంగా వీక్షించాను. ఒడ్డున పెలికాన్లు చేతులు వెనక్కి కట్టుకుని నడిచే పెద్దమనుషుల్లా తిరుగుతూ పోజులిస్తున్నాయి. దీప వాటిని ఫొటోలు తీసుకుంటోంది. నేను ఇసుకను దులుపుకుంటూ తడి ఆరేదాక అక్కడే కూర్చున్నాను. మొత్తటి ఇసుక. రకరకాల చిన్నచిన్న నునుపైన రాళ్ళు. రెండు, మూడు ఏరుకున్నాను. మళ్ళీ వెళ్ళి కారెక్కాం. ఆ దారి పొడుగునా ఎన్నో బీచ్ పాయింట్లు. రెండు, మూడు పాయింట్ల వద్ద దిగి అక్కడి ప్రకృతిని, సముద్రాన్ని వీక్షించి కారెక్కాం.

    ప్రోగ్రామ్ ప్రకారమైతే మేం ఇప్పుడు ’17 మైల్స్ డ్రైవ్’కి వెళ్ళాలి. కానీ మేం అక్కడికి వెళ్ళేసరికి సమయం మించిపోతుందనిపించింది. అందుకే దాన్ని మర్నాటికి వాయిదా వేసి ఆ రాత్రికి మా విడిది అయిన ‘మాంటెరీ పెనిన్సులా ఇన్’కు వెళ్లాం. పెద్ద విశాల ప్రాంగణంలో మధ్యలో బాగా స్థలం వదిలి చుట్టూరా విడిది నివాసాలు నిర్మించారు. చుట్టూ అందమైన చెట్లు. ఎంతో ప్రశాంతంగా ఉంది. కారు పార్క్ చేసి, మేనేజర్ వద్దకు వెళ్ళి వివరం చెప్పాం. ఆయన రిజిస్టర్ చూసుకుని మా రూమ్ నెంబర్ కార్డు (అదే కీ) ఇచ్చాడు. అది తీసుకుని మా బసకి వెళ్ళాం. పెద్ద గది. బెడ్ మీద టవల్స్‌ను బాతుల ఆకారంలో మడిచి అలంకరించడం ముచ్చటగా అనిపించింది. చక్కటి ఫర్నిచర్, గోడకు పెద్ద టీవీ, నీటైన రెస్ట్‌రూమ్… అన్నీ ఎంతో పొందిగ్గా. అలసి ఉన్న మేం వేడినీటి స్నానంతో సేదతీరాం. మా దగ్గరున్న తిండి తినేసి, చాలా కొద్దిసేపు టీవీ చూసి, మర్నాటి ప్రోగ్రామ్‌ను మరొకసారి నిర్ణయించుకుని పడకమీద మేను వాల్చాం.

    మర్నాడు త్వరగా లేచి తయారయ్యాం. ఏడున్నర అవుతోంది. మేనేజర్‌ని కలవాలని వెళ్ళాం కానీ ఆ లాంజ్ ఎనిమిదింటికి తెరుస్తారని అక్కడి బోర్డు చెప్పింది. వెనక్కి వచ్చాం. కారు వంక చూస్తే రాత్రి కురిసిన మంచుకు తడిసినట్లుంది. దాన్ని తుడుచుకోవటం, ఇంజన్ ఆన్ చేసి వేడెక్కించడం వంటి పనులతో కాలం గడిచిపోయింది. ఎనిమిదింటికల్లా లాంజ్‌కు వెళ్ళాం. తెరిచి వుంది.

    అక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కు రకరకాల స్నాక్స్, కాఫీలు, పళ్ళు – టేబుల్ మీద సిద్ధంగా ఉంచారు. మేం పళ్ళు మాత్రం తీసుకుని కౌంటర్‌లో కీ కార్డు ఇచ్చేసి వెకేట్ చేస్తున్నామని చెప్పి బయటపడ్డాం. అక్కడ్నించి గ్యాస్ స్టేషన్‌కి వెళ్ళి ఇంధనం నింపుకుని ’17 మైల్స్ డ్రైవ్’కు వెళ్ళాం. టికెట్ తీసుకుని కారులోనే ముందుకు సాగాం. ఇందులో ఒకవైపు గోల్ఫ్ కోర్సులు, మరో పక్క అడవి అందాలు, విలక్షణమైన భవంతులు… అటువైపు అందాల పెన్నిధి పసిఫిక్… వేటి అందాలను వీక్షించాలో తెలియక కళ్ళకు తికమక. ఇందులో 23 పాయింట్లు ఉన్నాయి. అయితే మేం ముఖ్యమైన కొన్నిటి వద్దే కారు దిగి వివరంగా చూశాం. వాటిలో బర్డ్ రాక్, లోన్ సైప్రస్ ట్రీ ఎంతో నచ్చాయి. ఈ లోన్ సైప్రస్ ట్రీ కనీసం 250 ఏళ్ళ నాటిదట. ప్రపంచంలో అత్యధికంగా ఫొటోలు తీయబడిన చెట్లలో ఇదొకటి.

    ’17 మైల్స్ డ్రైవ్’ సరిగ్గా 17 మైళ్ళ పొడవు ఉంటుంది. పెబుల్ బీచ్ కంపెనీ దీన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇక్కడ 7 ఛాంపియన్‌షిప్ గోల్ఫ్ కోర్సులున్నాయి. మాంటెరీ పెనిన్సులాలో పెబుల్ బీచ్, పసిఫిక్ గ్రోవ్‌ల గుండా వెళ్ళే సీనిక్ రోడ్ ఇది. ఇందులోని ప్రతీ పాయింట్ దగ్గర, నెంబర్ వేసి, దాని పేరును, వివరాన్ని సూచించే బోర్డులున్నాయి. ‘బర్డ్ రాక్’ అసంఖ్యాక సముద్రతీర పక్షుల ఆవాసం. అలాగే సీల్స్, సీ లయన్స్‌కు కూడా ఇదే ఇల్లు. 1881లో ఛార్లెస్ క్రాకర్ ఈ ’17 మైల్స్ డ్రైవ్’ను రూపొందించాడట. మా రౌండ్‌ను ముగించుకుని బయటకు దారితీశాం. మా తర్వాతి గమ్యం సన్నీవేల్.

    సో, దీప సన్నీవేల్‌కు జిపిఎస్ సెట్ చేసింది. ఆ ఆశ అంతా అక్కడి మెడ్రాస్ కేఫ్‌లో మన తిండిని రుచి చూడాలనే. ముఖ్యంగా నాకు దక్షిణ భారత టిఫిన్లను తృప్తిగా తినిపించాలని మా అమ్మాయి కోరిక. అలా అలా వెళ్ళగా… వెళ్ళగా… సన్నీవేల్ రానే వచ్చింది.

    ఇంకా ముందుకు వెళ్ళగా మెడ్రాస్ కేఫ్ దర్శనమిచ్చింది. దాని ముందు చాంతాడంత క్యూ. మనకు కావలసినవి ఆర్డరిచ్చి, డబ్బు చెల్లించి, బిల్లు తీసుకోవడానికే ఆ క్యూ. తప్పేదేముంది అనుకుంటూ క్యూలో నిలుచున్నాం.  ఆనియన్ మసాల దోశె, ఇడ్లీ, పొంగల్, కాఫీ ఆర్డరిచ్చాం. అంతేకాదు ఊతప్పం, మేదు వడ ప్యాక్ చేసి ఇవ్వమన్నాం. ఆ కేఫ్‌లో 90 మంది మాత్రమే కూర్చుని తినే వసతి ఉంది. కాబట్టి లోపల ఉన్నవాళ్ళు తినడం ముగించి వస్తేనే మళ్ళీ వరుస ప్రకారం పేర్లు చదువుతారు. పేరు పిలిచినప్పుడే వెళ్ళాలి కానీ ఎవరంతట వారు దూసుకుపోకూడదు. మొత్తానికి మా వంతు వచ్చి పేరు పిలిచారు. హమ్మయ్య అనుకొని లోపలికి నడిచి ఓ ఖాళీ టేబుల్ వద్ద భైఠాయించాం. వేడి వేడిగా, రుచికరంగా ఉన్నాయి టిఫిన్లు. ‘అబ్బ! ఎన్నాళ్ళయిందో’ అనుకుంటూ తృప్తిగా తిన్నాం. ఫిల్టర్ కాఫీని స్టీలు గ్లాసులో అందించారు. చల్లార్చుకునేవారి కోసం వెడల్పు గిన్నె కూడా ఉంది. కాఫీని ఆస్వాదించి, ఆ పైన మా పార్సెల్స్ అందుకుని బయటకు వచ్చాం.

    శాన్‌ఫ్రాన్సిస్కో లోని మా విడిదిని చేరుకోవటానికి సమయాన్ని లెక్క చూసింది దీప. చెప్పిన టైమ్ కంటే ముందుగా అతిథి గృహానికి వెళితే ఇబ్బంది కావచ్చని పక్కనే ఉన్న మెడ్రాస్ స్టోర్‌లో కాసేపు అన్నీ చూసి, అవసరమైనవి కొనుక్కున్నాం. తినడానికి పనికి వస్తాయని దీప పరాటాలు కూడా కొంది. ఇప్పుడు మేం వెళ్ళాల్సింది శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ‘అమెథిస్ట్ వే’లోని ఓ అతిథిగృహానికి.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here