[box type=’note’ fontsize=’16’] పర్యటన వినోదాత్మకము, విజ్ఞానాత్మకమూ మాత్రమే కాదు మనిషి తనలోకి తాను చూసుకుంటూ తనని తాను అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. సీనియర్ జర్నలిస్టు జొన్నలగడ్డ శ్యామల అమెరికా పర్యటనానుభవాల సమాహారం ‘పసిఫిక్ పదనిసలు‘ ఈ సత్యాన్ని నిరూపిస్తుంది. [/box]
[dropcap]మ[/dropcap]ర్నాడు ఉదయాన్నే లేచి యథాప్రకారం పనులు ముగించుకుని, విక్కీ పాస్కల్‌కు టెక్స్ట్ పంపి, కీస్ టేబుల్‌పైన ఉంచి కారెక్కాం. ముందుగా కారుకు ఇంధనం ఇప్పించి, అక్కడ్నుంచి శాన్‍లూయిస్ పెచిస్పో కౌంటీలో ఉన్న ‘పిస్మో’ బీచ్‌కు వెళ్ళాం. కారులోనే కుకీస్, పళ్ళు తిన్నాం. పిస్మో బీచ్ రానేవచ్చింది. అక్కడ నీళ్ళ మధ్యలో ఉండే పియర్‌పై పసిఫిక్‌ను చూడడం ఎంతో బాగుంటుందని, అది నాక్కూడా నచ్చుతుందని దీప అనుకుంది. కానీ మేం వెళ్ళేసరికి పియర్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందని, అది 2019లో కానీ మళ్ళీ సందర్శకులకు అందుబాటులోకి రాదనీ తెలిసింది. ఏం చేస్తాం. మామూలుగానే బీచ్ వైపు నడిచాం. అక్కడ పసిఫిక్‌లో కొంతమంది సర్ఫింగ్ చేస్తున్నారు. చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కొన్నిసార్లు ఉవ్వెత్తున అలలు లేచినప్పుడు వాళ్ళు మాయమై, మళ్ళీ అంతలోనే వాళ్ళు పైకి రావటం చూసి, ఆ అలలతో పాటు సయ్యాటలాడడానికి ఎంత నేర్పు ఉండాలో కదా అనుకున్నాను. ఒడ్డున మధ్య వయస్కులైన జంట హాయిగా వాలుకుర్చీల్లో కూర్చుని సముద్రాన్ని వీక్షిస్తున్నారు. మరో యువతి ఇసుకలో బోర్లా పడుకుని ఏదో రాసుకుంటోంది. బహుశా పొయెట్రీ రాసుకుంటోందేమో. ఇదే ఇండియాలో అయితే ఈ దృశ్యం ఊహక్కూడా అందదేమో. మరో తల్లి తన చిన్నారితో ఒడ్డునే తడి ఇసుకలో చేయి పట్టుకు నడిపిస్తోంది. ఆ పాప మధ్యలో కూర్చుని ఒండ్రుతో ముద్దలు చేస్తూ ఆడింది కాసేపు. తర్వాత తల్లి, పాప చేతుల్ని దులిపేసి మళ్ళీ నడిపించసాగింది. మరికొంతమంది పిల్లలు తరుముకొస్తున్న అలలతో ధైర్యంగా ఆటలాడుతున్నారు. పిస్మో బీచ్ ఎంతో బాగుంది. సీగల్స్ సందడి సరే సరి. కాసేపు అటు ఇటు నడుస్తూ సముద్రుణ్ణి, సూర్యుణ్ణి ఆరాధించాం.
లంచ్ వేళవుతోంది. దీప రెండు హోటల్స్‌కు ఫోన్ చేసి వెజిటేరియన్ ఫుడ్ గురించి అడిగింది. జవాబు తనకి తృప్తి కలిగించలేదు. అంత దూరం వెళ్ళి, కావలసినవి దొరక్కపోతే, కష్టం అనిపించింది. అంతలో పిస్మో బీచ్ ప్రాంగణంలోనే ఉన్న హోటల్ ఊలీస్ ఊరిస్తూ కనిపించింది. సరే ఇదేదో బాగుందని అటుగా నడిచాం. దీప వెజ్ బర్గర్స్ ఆర్డర్ చేసింది. మనీ పేమెంట్ అయిపోయాక, 14వ నెంబరు ఉన్న స్టాండ్ ఒకటి అందించింది కౌంటర్‌లోని అమ్మాయి. దీప దాన్నందుకుని ముందుకు దారి తీసి, ఓ ఖాళీ టేబుల్ పై స్టాండ్‌నుంచి తాను కూర్చుని, నన్నూ కూర్చోమంది. మాకు సర్వ్ చేసే లోపల కాలక్షేపానికి అందరినీ గమనించసాగాను. రకరకాల వేషభాషల వాళ్ళు, రకరకాల ఆహారపదార్థాలు తింటూ, డ్రింక్స్ తాగుతూ… అంతా కోలాహలం. మా ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గరున్నామె పెంపుడు కుక్కని సైతం తెచ్చింది. అది ఉండి ఉండి పైకి ఎగురుతూ ఆమె ప్లేట్‌లోని పదార్థాలను రుచి చూడాలని ఆశపడుతోంది. ఆమె చిన్న చిన్న ముక్కలని దానికందిసూ నిలువరిస్తోంది. అక్కడ నుంచి పసిఫిక్‌ను వీక్షిస్తూ కూర్చోవటం ఇంకా బాగుంది. ఇంతలో సర్వర్ మా ఐటమ్స్ తెచ్చాడు. వెజ్ బర్గర్‌లను తినడం మొదలుపెట్టాం. అలా తిండి వ్యవహారం ముగించడంతోనే వెయిటర్ వచ్చి ఆ నెంబరు స్టాండ్ తీసేశాడు. మేం లేచి మళ్ళీ పిస్మో బీచ్ వైపు నడిచాం. మా అదృష్టం, తట్టుకోలేని చలి తలుపులు తెరుచుకురాలేదు. అందుకే అలా నడుస్తూ విజిటర్స్ సెంటర్ దగ్గరకు వెళ్ళాం, బట్టర్‌ఫ్లయ్ పార్క్ గురించి కనుక్కుందామని. కౌంటర్‌లో ఆమె మాకు ఒక బ్రోషర్ అందించింది. బట్టర్‌ఫ్లయ్ పార్క్ ఎంత దూరం ఉంటుందని దీప అడిగింది. బట్టర్‌ఫ్లయ్ పార్క్‌కు నడిచి వెళితే ఇరవై నిమిషాలు పడుతుందనీ, ఆ టైమ్‌లో నడక కూడా ఎంజాయ్ చేయవచ్చనీ ఆమె చెప్పింది. దీప ‘కారు ఇక్కడ పార్కింగ్ చేశాం, వదిలేసి వెళ్ళవచ్చా’ అని అడిగింది. ‘పార్కింగ్ ఫీ పే చేశారా’ అని అడిగింది. ”ఆ విషయం మాకు తెలియద’ని చెప్పింది దీప. అయితే వెళ్ళి కారు చూసుకోమని, అక్కడ స్లిప్ ఉంటే సరే, లేదంటే డబ్బు పే చేసి వెళ్ళొచ్చని చెప్పింది. సరే అని కారు దగ్గరకి వెళ్ళాం. అక్కడ స్లిప్ ఏమీ లేదు. ‘హమ్మయ్య’ అనుకుని చూపు సారిస్తే, కొద్ది దూరంలో పార్కింగ్ రెంటల్ పేమెంట్ మెషిన్లు కనిపించాయి. మొదట వచ్చినప్పుడు మేం గమనించలేదు. ఫ్రీ పార్కింగ్ అనుకున్నాం. సరే అని ఆ మెషిన్ వద్దకు వెళితే, ఇంత వ్యవధికి ఇన్ని డాలర్లు అని వివరం ఉంది. మాకు రెండు గంటలు సరిపోతుందని దీప ఆ లెక్కన కార్డ్ పేమెంట్ చేసింది.
ఆ తర్వాత మెల్లగా మోనార్క్ బటర్‌ఫ్లై పార్క్‌కు నడవసాగాం. బీచ్ నుంచి ముందుకు వెళ్ళి, ఆ తర్వాత కొద్ది దూరం మైదాన ప్రదేశంలో నడిచాకా ఓ కర్రల వంతెన వచ్చింది. కింద నీటిలో నల్లబాతులు గోల గోల చేస్తున్నాయి. ఆ వంతెన దాటి మరింత ముందుకు నడిస్తే, మెయిన్ రోడ్ వచ్చింది. అక్కడ కుడివైపుకు తిరిగి నడకసాగిస్తే ‘మోనార్క్ బటర్‌ఫ్లై పార్క్’ రానే వచ్చింది. పెద్ద ఆవరణ. అక్కడ మోనార్క్ సీతాకోకచిలుకల గురించి వివరించే అనుభవజ్ఞులు సైతం నిర్ణీత వేళల్లో ఉంటారనీ అక్కడి బోర్డు చదివి తెలుసుకున్నాం. అయితే మేం వెళ్ళిన సమయంలో ఎవరూ లేరు. ఇందులో కూడా సందర్శకులకు ప్రవేశ రుసుమేమీ లేదు. ముందుకు వెళితే యూకలిప్టస్, పైన్, సైప్రస్ వృక్షాలు పెద్దవి కనిపించాయి. సందర్శకులందరూ తలలెత్తి పైకి చూస్తున్నారు. అసంకల్పితంగా మేమూ పైకి చూశాం. ఆ చెట్లకు ఎండిన ఆకుల కొమ్మల గుత్తులు ఎన్నో వేలాడుతూ కనిపించాయి. ‘మరి సీతాకోకచిలుకలెక్కడబ్బా’ అనుకుంటుండగా, పక్కనున్న ఓ పెద్దమనిషి అక్కడున్న టెలిస్కోప్‌లోంచి చూడమన్నాడు. అందులోంచి ఎలా చూడాలో ముందర రాసి వుంచారు. టెలిస్కోపుని తాకకుండా కొద్దిగా వంగుని, చేతులు వెనక్కి కట్టుకుని, టెలిస్కోప్‌లోంచి చూడాలట. మేం అలాగే చేశాం. అద్భుతం. విడిగా ఎండుటాకుల్లా కనిపించివన్నీ టెలిస్కోప్‌లోంచి ఆరెంజ్, బ్లాక్ రంగుల్లో చిత్ర విచిత్రమైన డిజైన్లతో కూడిన మనోహరమైన సీతాకోకచిలుకల్లాగా దర్శనమిచ్చాయి. ఇక్కడకు వేల సంఖ్యలో మోనార్క్ బటర్‌ఫ్లైలు వలస వస్తుంటాయట. నవంబరు నుంచి ఫిబ్రవరికి వరకు వీటికి సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించి సందర్శకులను, విద్యార్థులను చైతన్యపరుస్తారట. సందర్శకులు మోనార్క్ బటర్‌ఫ్లైలను వీక్షించడానికి వీలుగా అక్కడ మూడు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. మేం మళ్ళీ మళ్ళీ వాటిని వీక్షించి వెనుతిరిగాం. అలా నడుస్తూ మళ్ళీ పిస్మో బీచ్ చేరుకుని ఓ బెంచీ మీద కూర్చున్నాం. కొద్ది సేపటికి సూర్యాస్తమయ సమయం రానే వచ్చింది. ఆ దృశ్యాన్ని సంతృప్తిగా తిలకించి, అక్కడ నుంచి కదిలాం. షెడ్యూల్ ప్రకారం ఈ రోజుకు మా ప్రోగ్రామ్ ముగిసింది. నిన్నటిలా కాకుండా కాస్తంత వెలుగు ఉండగానే మా బసకు చేరుకోవాలనుకున్నాం. ఈ పూట మేం వెళ్ళాల్సింది పీటర్ గారింటికి. దీప కారు స్టార్ట్ చేసింది. ట్రాఫిక్ మరీ అంత ఎక్కువగా లేదు. వెళ్ళగా వెళ్లగా గమ్యం రానే వచ్చింది. మేం ఆ ఇంటి ముందు దిగగానే పీటర్ గారు ప్రత్యక్షమయ్యారు. మాకు స్వాగతం పలికి కారు ఇంటి ముందే పార్క్ చేసుకోవచ్చన్నారు. ముందు వైపు ఆయన కారు గ్యారేజ్ వుంది. దాని వెనుక ఆయన నివాసం. అది దాటితే అతిథుల విడిది. పక్కనుంచి ఉన్న చిన్న కారిడార్ గుండా లోపలకు ప్రవేశం. ఆయన లోపలకు దారి తీయగానే పెంపుడు పిల్లి వచ్చింది. దాని పేరు ఫ్లాపీ. ఆయన మా రూమ్ చూపించి, తానుండేది పక్కనే కాబట్టి ఇంకేమైనా కావాలంతే అడగవచ్చని చెప్పి నిష్క్రమించారు. గది బాగుంది. టీవీ ఓ వైపుకు. ఇంకో వైపు రాసుకునేందుకు ఓ టేబుల్. ఇంకో వైపు టేబుల్ ల్యాంప్ ఉంచిన మరో టేబుల్. చిన్న కిచెన్. కాఫీ మేకర్. రకరకాల కాఫీ పాడ్‍లు వగైరాలు, కూకీలు ఉన్నాయి. కిచెన్ పక్కనే దుస్తుల హేంగర్లు ఉంచిన చిన్న క్యాబిన్. మరో వైపు రెస్ట్ రూమ్. అందులో ఏకకాలంలో ఇద్దరు బ్రష్ చేసుకునేందుకు వీలుగా వాష్ బేసిన్లు ఉన్నాయి. ట్యాప్‌ల క్రింద పెద్ద పెద్ద లైట్ గ్రీన్ గ్లాస్ బౌల్స్ అమర్చారు. బాత్ షవర్ మామూలే. మా రూమ్ బయటకు వచ్చి చూస్తే ఎడమ వైపు ట్రీ హౌస్ ఆకర్షించింది. ఓ పెద్ద చెట్టు, దానికి మెట్లు, ఆ పైన చిన్నపాటి పాక. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి అనిపించింది. మేం ముందుగా కాఫీమేకర్‌లో కాఫీ తయారు చేసుకుని తాగాం. ఆ పైన హాయిగా షవర్‌బాత్ చేశాం. పరాటాలు పాస్కల్ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉంచి మరచిపోయాం అన్నది గుర్తొచ్చి, వేరే స్నాక్స్ తిని, పళ్ళు తిని ఆత్మారాముణ్ణి శాంతింపజేశాం. ఇది మా ట్రిప్‌లో చివరి మజిలీ. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కొద్దిసేపు గడిపి, మర్నాడు త్వరగా లేవాలని అలారం సెట్ చేసుకుని పడుకున్నాం.
(ఇంకాఉంది)