[గీతాంజలి గారు రచించిన ‘పదాలెందుకు..?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]వి మనసేమి బాగోలేదు
పిచ్చి పిచ్చిగా కవిత్వం రాసేస్తున్నాడు.
అతని హృదయం పగిలినట్లు..
కవిత్వం నేల మీద భళ్ళున పడి
ముక్కలు ముక్కలవుతుంది..
చెల్లా చెదరవుతుంది..
కవి విచలితుడైపోతాడు.
ప్రతీ ముక్కలో ఒక పదం కనిపించి
దుఃఖం రెట్టింపవుతుంది.
కవిత్వం.. విడి విడి ముక్కలుగా మాట్లాడుతుంది.
అన్నింటినీ చేరదీస్తాడా..
కవిత్వం ముద్దగా గడ్డ కట్టిపోతుంది..
చదవనీయకుండా..
అక్షరాలు పదాలు కనపడనే కనపడవు.
పదాల వెతుకులాటలో.,
పెనుగులాడుతున్న కవి అనుకుంటాడు కదా..
అసలు కవిత్వానికి పదాలు ఉండాలా..
సువాసన ఉంటే సరిపోతుంది..
రంగు ఉంటే బాగుంటుంది..
తనదైన సంగీతపు ధ్వని ఉంటే.. మహాద్భుతం..
కంటి చూపులా.. దృష్టి ఉంటే..
ఇంకేం.. అర్థమైపోతుంది!
ఈ పదాలు గందరగోళ పరుస్తాయి..
కవిని శాసిస్తాయి.
మనసుని స్తంభింపచేస్తాయి.
పదాలెందుకు..
మౌనంతో కవిత్వం రాధ్ధాం అనుకుంటాడు.
కవి ఇక మౌనమై పోతాడు..