[కమలా దాస్ రచించిన కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీమతి గీతాంజలి. Telugu Translation of Kamala Das’s poem ‘Words’ by Mrs. Geetanjali.]
~
[dropcap]నా[/dropcap] చుట్టూ పదాలు..
పదాలు ఒట్టి పదాలు ముప్పిరి గొని ఉన్నాయి.
నా మీద అవి ఆకుల్లా పెరుగుతాయి.
పెరగడం ఎప్పటికీ ఆగదు.
నా లోలోపలి నుంచి అతి మెల్లిగా పెరుగుతూనే ఉంటాయి.
పదాలు.. పోనీ మాటలు..
వాటి గురుంచి నాకు నేను
చెప్పుకుంటూ హెచ్చరించుకుంటూనే ఉంటాను.
ఈ పదాలు చిరాకైనవే కాదు
ప్రమాదకరమైనవి కూడా వాటితో జాగ్రత్త సుమా అని!
ఈ మాటలు చాలా అర్థాలతో ఉంటాయి..
పరిగెత్తే కాళ్ళని ఆపేస్తాయి.
లేదా పదాలు సముద్రం లోని అలల్లాంటివి..
మనిషిని ఏమీ చేయనివ్వని పక్షవాతంతో
కుప్ప కూల్చే పదాలు కూడా అయి వుండొచ్చు.
కొన్ని భళ్ళున బద్దలయ్యే దావానలం
లాంటి పదాలు ఉంటాయి.. కాల్చేస్తాయి.
లేదా నీ ప్రియమైన స్నేహితురాలి
గొంతు కోసే కత్తి లాంటి పదాలుంటాయి..
అవును.. నా లోలోపల సుళ్ళు తిరిగే పదాలు
ఒట్టి చిరాకైనవి.. కానీ..
అవి నా మీద చెట్ల మీద ఆకులు పెరిగినట్లే పెరుగుతాయి మరి!
ఎప్పటికీ.. అవి పెరగడం.. మొలకెత్తడం ఆపనే ఆపవు!
నిశ్శబ్దంగా లోనుంచి.. ఎక్కడో లోలోతుల నుంచి..
మాటలు.. నా దేహం మీద..
నా లోలోపల నుంచి.. నా లోంచి..
జాగ్రత్త సుమా పదాలు ప్రమాదకరమైనవి!
~
మూలం: కమలా దాస్
అనుసృజన: గీతాంజలి