Site icon Sanchika

పదచదరాలు – పుస్తక పరిచయం

పదచదరాలు – విహంగ వీక్షణం

క్రాస్‌వర్డ్ పజిల్ ఎవరు కనిపెట్టారో ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఇదో చిత్రమైన సాహితీ విన్యాసం. అందుకే కాబోలు దీనిని చిలిపి కన్నె హృదయంతో పోల్చాడో సినీ కవి. చిలిపి కన్నె హృదయాన్ని పొందాలంటే కొన్ని చిక్కులు తప్పవు. కానీ ఆమె హృదయాన్ని గెలుచుకున్న తర్వాత ఆ ఆనందమే వేరు కదా! అలాగే, క్రాస్‌వర్డ్ పజిల్ పూర్తి చెయ్యాలంటే కొన్ని చిక్కులు తప్పవు. పూర్తి చేసిన తర్వాత కలిగే అనుభూతి, తృప్తి ఎంతో ఆనందం కలిగిస్తాయి.

ఇరవై ఐదుగురు ప్రహేళికాకర్తల చేత 25 ప్రహేళికలు రూపకల్పన చేయించి గ్రంథస్థం చేయించారు సంపాదకులు శ్రీ కోడిహళ్ళీ మురళీమోహన్ గారు. దానికి ‘పదచదరాలు’ అని నామకరణం చేశారు. నిజానికి ఇదో వినూత్న ప్రయోగం. ఇరవై ఐదు పజిల్సూ విభిన్న రీతులలో ఉన్నాయి.

సాధారణంగా ఒకే రూపకర్త చేత కూర్చబడిన పజిల్స్‌లో వైవిధ్యం ఉన్నా సరే వస్తుతత్వంలో అతని కూర్పు లోని ఒరవడిపై పూరణ చేసే వారికి కొండొకచో కొంత పట్టు లభించే అవకాశం ఉండొచ్చు. ఇక్కడ అటువంటి అవకాశం ఉండదు. ఒక్కొక్కరిదీ ఒక్కో ఒరవడి!

‘పదచదరాలు’ పుస్తకం ఒకటి కొనుక్కుని ఉంచుకుంటే బోలెడు కాలక్షేపంతో పాటు వినోదం, లోకజ్ఞానం కూడా లభ్యమౌతుంది. చక్కని ప్రయోగం చేసిన ‘కోడిహళ్ళీ’ వారు అభినందనీయులు. 134 పుటల ఈ పుస్తకం ఖరీదు రు.140/- సముచితంగా ఉంది. రు.150 పంపిస్తే రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపిస్తారు. సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్: 9701371256.

Exit mobile version