Site icon Sanchika

పాదచారి-10

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ భాగం. [/box]

[dropcap]కా[/dropcap]లం గడియారం వెనక్కు వెనక్కి నడుస్తోంది.

‘అక్కడ నేను పసిబిడ్డని. అదుగో… అయ్యో! అక్కడ నేను మరో ప్రక్క రాక్షసుణ్ని!…. ఎంత క్రోధం? ఎంత స్వార్థం! ఎంత వికారం? అయినా ఆ మూర్ఖత్వంలోనే కనిపించని పట్టుదల! అయినా ఆ మూర్ఖత్వంతోనే అందుకున్నాను మోక్షం! తలనిండా దెబ్బలే! వంటి నిండా వాతలే! ఎంత చంటి బిడ్డని? ఎంతటి మూర్ఖ రాక్షసుణ్ని!….’ తనలో తనుగా అనుకున్నాడు పాదచారి.

“అక్కడ నా కళ్లు వర్షించాయి… ఒకోసారి అశ్రువులూ, మరోసారి నిప్పులూ. అక్కడ నా మనసు తానుగా అయింది. ఒకోసారి వెన్నగా…. మరోసారి పాషాణంగా! అక్కడెంత మంది? హితులూ స్నేహితులూ వాళ్లే బంధువులూ…. వాళ్లే జీవితంలో పూసిన పువులు… ఆ పువ్వులు నావే.

రెండు చేతులు… సున్నితంగా…. ప్రేమగా…. ధారగా… రెండు కళ్లు…. చిరునవ్వుగా…. దయగా…. రెండు పాదాలు…. దైవాలు…. భూమికి అలంకారాలుగా ఎంత సుఖం! ఎంత కష్టం! ఎంత అదృష్టం! ఎంత దైవత్వం….”

“జీవితపు అమూల్య కాంతి గదూ” మళ్లీ అనుకుంటూ కూర్చున్నాడు. “జ్ఞాపకాలు తవ్వకో” అన్నట్లు మోఘాలు చక్కగా ముసురుకున్నాయి. నీలి నీలి ఆకాశంలో నల్ల నల్లని మబ్బులు ఎక్కడ చూసినా ఆహ్లాదం! సన్న సన్నని తుంపరా! చల్ల చల్లని గాలి!…. వర్షం పెద్దదయింది. అడవిలో వృక్షాలు, లతలూ, మొక్కలూ, మానులూ వర్షంలో స్నానం చేసి అంగాంగాల ధూళినీ వదిలించుకుని ఆకుపచ్చగా మెరిశాయి. పువ్వులు వర్షరాణికి స్వాగతంగా తలలు ఊపుతూ పాటలు పాడాయి.

“అహాహా… అద్భుతం” అని ప్రకృతిని మెచ్చుకున్నట్లు వెదుళ్లు పచ్చగా ఊగాయి. నేల మీద జీవులు మెత్తగా పాకిపోయాయి. పచ్చ గడ్డి తివాసిని ఋతుకన్య పరిచింది. ఆమె పాదాలు అందంగా తివాసీపై కదులుతూ పూవుల రంగులు వేశాయి.

వర్షపుధారలు నిరంతరం కురుస్తూ ఏళ్లు…. సెలయేళ్లుగా మరాయి. ఎండిపోతున్న జలపాతం మరింత ఉత్సాహంగా ఉరికింది. వెచ్చని గూళ్లల్లో కూర్చున్న పక్షులు పాదచారిని చూసి కిల కిలా నవ్వాయి. తడి రెక్కలతో అపుడపుడూ ఎగురుతూ అల్లరిగా గాలిలో నాట్యం చేశాయి.

కాలం గడియారం చూపించింది. క్షణాల్లో ఆకాశం తారుమారైంది. మొక్కలు గాలికి ఊగి విరిగిపోయాయి. వ్రేళ్లతో ఏవో చెట్లు కూలిపోయాయి. ఎక్కడ చూచినా భీభత్సం! కిలకిలా నవ్విన పుక్షలు కొమ్మల చాటున చిక్కుకొని కాళ్లూ, రెక్కలూ విరిగి వికృతంగా రోదించాయి. రెక్కలు రాని వాని బిడ్డలు నిర్జీవాలయ్యాయి. ఫెళ ఫెళ ఉరుములు ఉరిమి భూమినాశ్రయించాయి. కార్చిచ్చు అలుముకుంది. ఓ వైపున రేగే జ్వాలలు జ్వాలలు మరో వైపున భయంకరంగా వరుణ దేవుని వికృత వికటాట్టహాసం ప్రళయ తాండవం. కన్నుపోడుచుకున్న కనిపించని చీకటి, గుడ్డి వాడిలా నడిచే పాదచారిపై ఓ చెట్టు కొమ్మ విరిగి పడింది. నుదుట గాయమై రక్తం వర్షపు ధారలతో కలిసి స్రవించింది. కుక్కపిల్ల వణుకుతూ అతని కాళ్ల మాటున దాగింది.

కుంభ వర్షంతో నీరు నదిలా ప్రవహిస్తూ అలుముకుంది.

విశ్వాసాన్నెత్తుకుని మోకాళ్లు దాటిన ప్రవాహంలో ముళ్లకంచెలపై నడుస్తూ ముందుకు సాగాడు.

“నేను విషాన్ని కంఠంలో దాచుకున్నాను. నేను మూర్ఖుణ్ని. నా వాగుడే నన్ను నాశనం చేసింది.”

ప్రకృతి ప్రళయ శబ్దంలో అతని మాటలు కలిసిపోయాయి.

“నేను విషాన్ని కంఠంలో దాచుకున్నాను. ఓ ప్రకృతీ! విన్నావా! ఈ ప్రపంచాన్ని నేను నమ్మాను. మనిషిని మనిషిగా గౌరవించాను. ఆ మనిషే అబద్దమాడితే అన్నిటినీ క్షమించగలిగే నన్నేనా అమాయకత్వానికి ఎరగా పెడితే? కట్టు కథలతో నిజాన్ని కప్పి పుచ్చి నా జీవితాన్ని పాదల క్రింద త్రొక్కి వేస్తే? హూఁ! నీ ప్రళయం ఎంత? ఆ ప్రళయాన్నయితే ప్రకృతీ నీవు భరించనే లేవు.

అయినా మింగలేక కక్కలేకా విషాన్ని గొంతులోనే దాచుకున్నాను. అయినా సర్వాన్నీ నాలోనే ఇముడ్చుకున్నాను. ఇపుడు స్రవించేది నుదుటి రక్తం మాత్రమే. కానీ మనస్సు హృదయామూ అన్నీ తూట్లు తూట్లుగా ఏరక్తం కార్చాయో తెలుసా ఏ గుండేకోతని భరింతానో తెలుసా?

శివుని కంఠాన్ని చల్లార్చటానికి గంగ ఉంది. నా కంఠంలోని గరళాన్ని చల్లార్చటానికి కన్నీళ్లే మిగల్లేదు.”

“మోసం! దగా! వంచన!…” అన్నీ నన్ను ముంచివేశాయి.

“నన్ను నేనే శిక్షించుకున్నాను.

నన్ను నేనే ఓదార్చుకున్నాను…”

“అవును పాదచారీ నీ నిజం మాటలు నీ శత్రువులయ్యాయి… నీ ఆశయాలు నీకు విషాన్ని పెట్టాయి… నీ మానవత్వం నిన్ను మాడ్చివేసింది… అయినా నేస్తం. నీవు ఓడిపోలేదు. ఇదుగో…. ముళ్లమీదయినా నడుస్తూనే ఉన్నావుగా?….” సత్యారావు అతని భజం తట్టి అన్నాడు.

“ఈ భీభత్సంలో ఎక్కడి నించి వచ్చావు సత్యా.”

“నాలోనే ఉంటానోయ్ నేనెప్పుడూ నీలోనే ఉంటాను.”

“హూఁ!” విరక్తగా నవ్వాడు పాదచారి.

“అన్నావు కానీ ఏం జరిగింది కళ్లు తెరిచే గుడ్డి వాడివయ్యావు.”

సత్యారావు అనునయంగా అన్నాడు “నీ జీవితం వేరు. దేవతలందరూ ఉన్నా, దానవులు అందరూ ఉన్నా గరళం మిగింది శివుడే.”

“దానికి ప్రతిఫలంగా సర్వనాశనమయిందీ అతడే” అన్నాడు పాదచారి.

సత్వారావు మౌనంగా చీకట్లో కలిసిపోయుడు.

నీళ్లల్లో పాదచారి కాలికో పాము చుట్టుకుంది. అలానే నడిచాడు. అది అతన్ని కరవనూ లేదు, విడవనూ లేదు.

ఎక్కడో ఓ రాతి బండ తగిలింది. మెల్లగా పైకి ఎక్కాడు. నీళ్లు అతన్ని రాసుకుపోతూనే ఉన్నాయి.

రాతి బండ పై ఎక్కి ఆనీళ్లల్లోనే విశ్వాసాన్ని గుండెలదుముకుని కూర్చున్నాడు పాదచారి.

ఎన్ని హేళనలు ఎన్ని అవమానాలు ఎన్ని భరించాను? ఎవరి కోసం? అందరి కోసమో వారే…

క్రింద పడి ఊబిలో ఉన్న వాడికి చేయి అందిస్తూ నేను కూరుకుపోయాను. వారు మాత్రం నా బుజాలు పైకెక్కి బయట పడ్డారు. నేనక్కడే అందులోనే నిస్సహయంగా మనిగిపోయాను. కళ్లవెంటనీరు కారలేదు.

మనసు ద్రవించింది

“అయినా కాలమా? సంతోషమే, ఎవరో ఒకరైన బ్రతికారుగా.”

“నువ్వు చస్తూ ఎవరో బ్రతకడమేమిటి? మూర్ఖుడా!… నీకు కావల్సింది నీవు తెచ్చుకోలేవు. నీకు అక్కర లేనిది నీ అక్కర లేనిదీ మెడకో కాలికో చుట్టుకున్నా వదిలించుకో లేవు. ఎంత ధైర్యహీనుడివి?” ఉరుములా వినిపించాయి.

“నీవు మానవతను చూడలేదు. నేను దాన్ని చవి చూశాను. ఒకరి కోసం సర్వమూ ధారపోస్తూ చిరునవ్వుతో వెలిగే దీపాన్ని నీవు చూడలేదు. నేను చూశాను…. అది నా అశక్తత కాదోయీ!…. ఎదుటి వారు తన్నినా అయ్యో ఎందుకు తన్నడం అన్న మానవత అది.”

“గాంధీ సిద్ధాంతమా? గాడ్సే ఏం చేశాడూ?” అరిచాడు విప్లపమూర్తి.

“గాడ్సే గాడ్సేగానే అంతరించాడు. ఉపవాసంతో నీరసించి, ప్రజలకై సర్వమూ ధారపోసి రామనామంలో తన్ను తామరచిన గాంధీ “హేరామ్” అంటూనే ప్రణాలు విడిచాడు… తుచ్ఛశరీరం కోసం అబద్ధాలు ఎందుకోయీ? ఈనాడు ఉంటుందనీ, రేపు ఉంటుందో ఉండదో తెలియని ప్రాణం కోసం మోసపు బాటలు ఎందుకోయీ? సరే… ఒకరిని నీవు తెలిసీ నాశనం చేశావు. ఏం లాభం! దేన్ని బావుకుందామని? నీ ఇంటి వెలుగు కోసం ఇంకొకరి శరీరాన్ని కాల్చి ఆ వెలుగులో సంతోషంగా ఉంటావా? ఉండనీ! నిజం నాకే తెలీదు. తెలిసింది భగవంతుడికి!”

“ఎక్కడున్నాడోయ్ భగవంతుడూ? నువ్వేమి అపకారం చేశావని శిక్ష! నా మాట విను. శాంతి పన్నాలూ గాంధీయీజాలూ కట్టి పెట్టు…. నిర్భయంగా నీ దారి నువ్వు చూసుకో” విసుగ్గా అన్నాడు విప్లవ మూర్తి.

“ఇదంతా నిజం కాకపోతేనో?”

“ఇంకా నీకు మనష్యుల పై నమ్మకమా?”

“నేనూ మనిషినేగా?”

“నీవు మనిషివే! నీ మనసు నెరిగినట్లు ఇతరుల్ని తెలుసు కోగలనంటూన్న అహంభావివి!”

“అహం లేనిది ఇహం లేదు.”

“అహం కానిది బ్రహ్మమూ కాదు.”

“పిచ్చి వేదాంతీ!… కళ్లు తెరుచుకో! ఇంకా కళ్లు మూసుకుంటానంటావా? సరే! చావు!… నీ ఊబిలోనే శ్వాస ఆడక నశించిపో. అందుకే అంటాను…. బలం గల వేదాంతి కంటే బలహీనుడైన రౌడీ మేలు! వీడిని ప్రజలు చవటలా చూస్తారు…. ఫక్కున నవ్వి పది మందీ చులకన చేస్తారు. వాడు బలహీనుడు కావచ్చు కానీ వాణ్ని చూసి ఒదిగి ఒదిగి పోతారు. వణికి వణికి గౌరవం ఇస్తారు. ఎందుకీ కంఠశోష?” చిరాగ్గా తానూ చీకట్లో కలిశాడు విప్లవమూర్తి.

“అన్నీ విన్నాను నేను అయినా ఏమీ చెప్పను…. నిర్ణయం నీదే!…” అంది మానసి తనూ తన దారిన పోతూ…

“ఇదంతా క్షణికం… ఏ జన్మ కర్మ ఫలమో అదృశ్యాదృష్టాలకి ఎవరు నిర్ణయకర్తలు?” గడ్డం నిమురుకుంటూ సాగిపోయాడు విజ్ఞానానంద.

“కలలన్నీ కూలి పోయాయి. పాదచారీ! నాలో ఏ మాత్రం ఉద్విగ్నత లేదు. ఉన్నది ఆశా కాదు. నిరాశా కాదు. నిర్లిప్తత! ఇంకిన కన్నుల్లోంచి ఏ కలల అశ్రువులు రాల్చను” ప్రశ్నిస్తూ సాగిపోయాడు స్వప్నమూర్తి.

“నువ్వేడ్చేటపుడు నవ్వటం నా లక్షణం” పకపకా నవ్వుతూ పక్కకి సాగిపోయాడు జీవన్‌మూర్తి.

“నీ చేతుల్లోంచి ఆవిశ్వాసపు కుక్కపిల్లని వదిలేస్తే నిన్ను కౌగిలించుకుంటాను పాదచారి! ఎప్పటికీ నీ తోడుంటాను” ఎదురుగా నిలిచింది వేదనలత.

విశ్వాసం మక్కు పుటాలెగరేసి సూటిగా పాదచారిని చూసింది.

తల వంచుకుని విశ్వాసాన్ని గుండెలకదుముకుని అన్నాడు పాదచారి.

“నాకు నేనే తోడు!

నాకు నేనే నీడ!

ఎందరెందరు వచ్చారో?

అందరూ సాగిపోయారు. ఇది మాత్రం మిగిలింది. దీన్ని నాతోనే ఉండనీ!”

వేదనలత ఉక్రోషంగా నడిచి వెళ్లింది.

“ఇక మిగిలింది నేనూ….. ఈ భయంకర ప్రకృతీ” అన్నాడు పాదచారి.

“అయినా భయం లేదు. ఒకప్పుడిదే ప్రకృతి అవ్యాజమైన అనురాగం ఒలికించింది. కాల ప్రవాహాన కోపించి ఇలా విలయతాండవం చేస్తున్నది! సరే కాదీ. ఇది స్పందించేది నా మనస్సుకనే! ఇది వర్షించేది నా బాధనే?” అతని అంతరాత్మను ప్రతిఫలిస్తున్నట్లు మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరిమాయి. తల మీదగా శిరోశాల ధారలుగా వర్షం కురుస్తూనే ఉంది. ఆ ప్రకృతి వడిలోనే నిశ్చలంగా నిర్వికారంగా నిశ్శబ్దాన్ని అనుసరిస్తూ గడిపాడు పాదచారి.

ఉషోదయంలో నిద్ర లేచాడు పాదచారి. అది నిద్రా కాదూ సుషుప్తీ కాదు.

వాతావరణం ప్రశాంతంగా ఉంది. రాత్రంతా వణికిన విశ్వాసపు కుక్కపిల్లా ఎండకి వళ్లారబెట్టుకుని కొంత హుషారుగానే ఉంది.

మెల్లగా గుర్తు వచ్చింది పాదచారికి.

తానిపుడున్న చోటు ఒకపుడు తనున్నదే!

విశ్వాసం ‘భౌభౌ’ మని అరుస్తూ ముందుకు పరుగెత్తింది. పాదచారి నవ్వుతూ దాని వెనుక పడ్డాడు.

ఎంత చిత్రం!

జరిగినది మళ్లీ జరుగుతున్నట్లుగా ఉంటే ఎంత గగుర్పాటు!

కాలం గడియారం మరి కొంత వెనక్కు నడిచింది.

రాగాలు సరాగాలై నవ్వాయి.

ఊహలు ఉరకలు వేస్తూ ఉప్పొంగాయి.

ఎన్ని ప్రసంగాలు మరెన్ని అద్భుత క్షణాలు?

అనేకానేక నీడలు చుట్టు ముట్టాయి.

గాఢంగా కౌగిలించుకున్నాడు పాదచారి.

“మీరంతా నా మాలలు… ఎంత అద్భుత వ్యక్తులు మీరు?”

ఆప్యాయంగా అన్నింటినీ తట్టి తట్టి చూచాడు.

***

“ఏం పాదచారీ ఏమాలోచిస్తున్నావూ?”

“జీవితంలో ముందుకు ముందుకు వెళ్లాను. మళ్లీ వెనక్కి వెనక్కి పోతున్నాను.”

“విచారిస్తున్నావా?”

“ఊ హుఁ! ఇది ఆనందమే!… ఇదంతా ఉత్సాహామే! కానీ ఇందులోనూ ఎంతో కొంత వేదన లేకపోలేదు…”

“ఎందుకుట?”

 “జీవితంలో ఎన్నో తప్పులు?… మరెన్నో ఒప్పులు? ఈ తప్పొప్పుల పట్టిక మళ్లీ చూచుకుంటే…”

“ఏం బాధగా ఉందా? సిగ్గు వేస్తోందా? మరో సారి మళ్లీ ఒప్పులే చెయ్యాలని ఉన్నదా?”

“మళ్లీ అయినా ఇలానే ఉంటుంది ఇలాగే ఉండాలి. ఇదంతా నా జీవితమే అయినా అలా లేదు!”

“మరెలాగా ఉందీ?”

“నేనెక్కడో ఉన్నాను!… అయినా యీ శరీరంతో అన్నీ చూస్తూ వెడుతున్నాను. ఈ వెళ్లేది నేనుకాదు… అయినా నేనే అన్న భావన కొంచమైనా ఉంది” పకపక నవ్వింది మానసి.

“నవ్వుతావేందుకు? నన్ను నేను వెదుక్కుంటున్నాను మానసీ! నా అణువణువున్నీ మళ్లీ పోగు చేసుకుంటున్నాను.”

“పోగు చేసి ఏం చేస్తావూ?”

“నాలో నేను కలిసిపోతాను…. అపుడీ అన్వేషణ ఉండదు. “

“నువ్వుంటే ఎక్కడో జాలిగానూ, కోపంగానూ కూడా ఉంది….” నవ్వాడు పాదచారి. నవ్వి అన్నాడు

“జాలి అంటే నాకు అసహ్యం…. ఇహ కోపమా? అది నాలోని భాగమే నన్నేం చేస్తుందీ!”

“నీ అహం పోలేదు కదూ!”

“నా బలహీనతవి నువ్వు… నా అహం అమృత. నా జీవితం అమృత. నా సగభగం అమృత మిగిలినదే నేను వెదికేది?”

“హుఁ!” రోషంగా చూసింది మానసి.

“నీ క్రోధంతో నాకు పని లేదు… నీవు నా ఛాయవు మాత్రమే నా ముందు నడిచినా వెనుక నడిచినా పక్కనున్నా నీవు నీవే…. నీ అహం అనుసరిణే.”

మానసి కోపంగా ప్రక్కకి తొలగింది.

పాదచారి ముందుకి నడుస్తూ యీలవేశాడు.

“కనుపించని కలనోయ్ నేనూ

వినిపించని గీతం నేనూ

జగమెరుగని కవితను నేనూ

రవి చూడని రాజ్యము నేనూ

ఈ జీవన సంగ్రామంలో

ఓడిపోని మనిషిని నేనూ

వీడిపోని భావన నేనూ…

నేను ముందుకే వెడతాను…”

నా కళ్లు మనసూ ముందుకే వెడతాయు! ముందుకే చూస్తాయి నా కళ్లు! ముందుకే ప్రవహిస్తుంది నా మనసు.

నేనెక్కడ ఉన్నానూ?

అక్కడే?

అలసట లేదు!

ఆదేశం లేదు!

ఉక్రోషం లేదు!

ఉద్వేగం లేదు!

క్రోధం లేదు!

శాంతీ లేదు!

మీరందరూ నా భాగాలే!

మీరందరూ నా జీవాలే!

నా ప్రాణం మీదే నండోయ్!

నా జీవం మీరే నండోయ్!

కాన మీకది వద్దే వద్దు!

ఆ మాటన్నెది మీరే మీరే!

సరే సరే అది నాకేం కష్టం!

నా బాటలు నాకే ఉన్నాయ్!

నేనెపుడూ ఒంటరినేనోయ్!

మీరున్నా… ఎవరెవరున్నా!

కాలం వెనక్కి తిరిగుతోంది!

ఓ బాటసారీ నా పాదచారీ!

ఎవరివి నువ్వు? ఎవరి కోసం నువ్వు?

నీ చుట్టూ ఎన్నో చట్రాలో!

అయినా నువు నువ్వే నువ్వే!

నీ కోసం కాలం ఆగదు!

కాలం కోసం నీవూ ఆగవు!

నీ దృష్టికి నీవే దృశ్యం!

నీ దృశ్యం నీ ఆ సృష్టే!

***

“ఏమ్ పాదచారీ! ఏమీ విశేషం?”

కడుంగడు ఆలోచనా పరవశుండవై నీ ఊహలోకంబుల దేలియాడుచున్నావా? ఏదీ నీజీవితం ఓ మూర్ఖ జీవీ! నిన్ను నువ్వొక్కమారు చూచుకో నిన్ను నువ్వుగా భావించుకుని ఆలోచించుకో!”

ఎవరు నీవు?

పిరికివాడివి గదూ!

గడుసు వాడివి గదూ!

అహంకారివి గదూ!

అల్పాతి అల్ప మనస్కుడివి గదూ!

ఏదీ నీ సమానత్వం?

ఏదీ నువ్వు ఘోషిచే ఆ మానవత్వం?

ప్రపంచాన్ని వదిలి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిలో స్వస్వరూన్ని వెదుక్కుంటున్నావు… అవునా!

ప్రకృతిని దాని దారిన దాన్ని వదిలి మళ్లీ ప్రపంచంలోకి పరుగులు తీస్తావు కాదా?

ఏ అర్ధరాత్రిలోనో ఏకాంతంగా ఆకాశం నుంచి రాలే చీకటి ముద్దల్ని ఏరుకుంటూ నక్షత్రాలు మాత్రం నావేనని చూపులు సారిస్తావు!

నీవేదనని ఆనందమనుకుంటూ, నీరోదనని సంగీతమనుకుంటూ నీ ఊహల ప్రపంచపు దారుల్ని నువ్వే మూసివేసుకుని, ఇతర్లని చొరనీయకా, నీవు బయటికి రాలేకా, ఇదీ జీవితపు సారాంశమనుకుంటూ, నీ ప్రయోగాన్ని నువ్వే మెచ్చకుంటూ నిన్ను నువ్వే అగాధంలోకి త్రోసివేసుకుంటూ నీలో నువ్వే ముచ్చటించుకుంటూ మురిసిపోతావు కదూ కరిగి నేలకురాలిపోతావు గదూ!

ఏదీ నీ ప్రపంచం?

చూపించవోయ్ ఓ సారి?

నీ వారెవరు?

నీ ఉనికి ఏది?

నీ ఉత్సాహమూ, దౌర్జన్యామూ ఎక్కడ?

ఏమీ చెప్పలేవు పాదచారీ!

ఎందుకో తెలుసా! నీ గమ్యం నీకే తెలియదోయూ బాటసారీ!

మొదలు గమ్యం తెలుసుకో నీ ఊహల ఉయ్యాలలు మాని, నీ సత్యపు ద్వారాలు తెరుచుకో, నీ ఉన్న తనువును నీవే విశ్లేషించుకో! నిన్ను నీవే పరీక్షగా మరోమారు చూసుకో!

(సశేషం)

Exit mobile version