Site icon Sanchika

పాదచారి-11

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ భాగం. [/box]

[dropcap]“ఓ[/dropcap] మబ్బుడొంకల… మెరుపుబాటల…

మొలచిన మొక్కను నేను…

గాలికి ఎగిరిపోతాను….

కరిగి నేలకు రాలిపోతాను!”

~

“నిలువెల్లా మంటల్లో

బూడిదైన ఆశల్లో

నెత్తుటిమాంసపు ముద్దల

మధ్యన రగిలే మనసున

మల్లెపూలు పూయిస్తా

కనులకాంతి నేనౌతా!”

“అసలు ఏమీ జరగనేలేదు.”

“అలా ఎందుకంటావూ జరిగింది అబద్ధమంటావా? అలా అని నిన్ను మోసం చేసుకోగలవా?”

“దూరం నించి చూస్తే మబ్బులు కొండని మూసి వేసినట్లుగా అనిపిస్తుంది. అసలు ఒక్కోసారి కొండె కనిపించదు. కానీ, ఆ కొండ మీదే నడిచేటపుడు మబ్బులు నిన్ను అడ్డుకుంటాయా? నిన్ను వెనక్కి నెట్టివేస్తాయా? అది మబ్బులే! వాటికి నిశ్చలమైన భావమో, నిర్దుష్ట స్వరూపమో లేవు. కొంచెం వర్షిస్తాయి. గట్టిగా గాలి వీస్తే తేలిపోతూ తొలగిపోతాయీ. నా విషయంలోనూ జరిగింది అంతే!”

“ఓ పిచ్చివాడా! నువు మనిషివి. కొండవీ కాదూ, మబ్బువీ కాదు. పక్కా ప్రాణమున్న మనిషివి.”

“నీ ఉహలు, భావాలూ నిర్ణయాలూ, నిశ్చయాలూ నీవేనోయూ! వీటి వల్ల ప్రజలకు కొంత బాధో సంతోషమో కలిగే మాట నిజం…. నిజం.”

“ఉదాహరణలు చెప్పకు!… నిజాన్ని నిజంగా గుర్తించి నిజం మాట్లాడు! నీతో నువ్వే మాట్లాడుకునే నీకు…. సిగ్గెందుకూ? భయమెందుకూ? ”

“భయం లేనే లేదు… సిగ్గు పడాల్సిన పని చెయ్యనే లేదు… ఇహ నాలో నేను మాట్లాడుకోడం గురించా? నా జీవితాన్ని, నిర్ణయాన్నీ, భావాల్నీ నేనే పరీక్షించుకుని పక్షపాతం లేకుండా తీర్పు నిచ్చుకుందామని! నేను నాలో ఉన్న నాతో ఎప్పుడూ వాదించుకుంటూనే ఉంటాను. ఎప్పుడూ నన్ను… నేను శోధించుకుంటూనే ఉంటాను!….”

“జీవితంలో పెరిగానని అనుకుంటున్నావా?” పకపకా నవ్వింది మానసి.

“పెరుగుతూనే ఉన్నాను…. మానసీ! తప్పటడుగులు వేస్తూ నడుస్తూనే ఉన్నాను…. తప్పొప్పుల పట్టికను కూరూస్తూనే ఉన్నాను. నా తప్పుల్ని నేను ఒప్పుకోటానికి సిద్ధపడ్డాను. నా ఒప్పుల్ని నేను నిర్ద్వంద్వంగా ఎదుటివారి ముందు పెట్టగలుగుతున్నాను…. ఇది పెరగడం కాదా జీవితంలో నిజం తెలుసుకునే ప్రయత్నం చేయడం కాదా!”

“చివరకు మిగిలేది నీకు నువ్వే”

“అంతకంటే నిజం ఏముందీ? ఎవరికి మిగిలినా ఏదైనా ఒకటే. అస్తిత్వం లేని అస్థిరమైన లాభపు పట్టిక! కానీ నాకు నేనే మిగులుతాను! ఎంత అద్భుతం, మానసీ ఆ స్థితి ఎంత ఉత్తమం!

***

కాలపు గడియారం గుండెలపై వ్రేలాడింది. ఓ జీవం లేని నవ్వుని పెదాల కానించుకున్నాడు పాదచారి. ఓ క్షణం ప్రకృతి పరవశంగా దరిచేరింది. మరుక్షణంలో విచలితమై నిట్టూర్చింది. విరిసీ విరియని మొగ్గ ఒకటి రేకలు రాలుస్తూ రాలిపయింది.

“అదే సుమా నా జీవితం కూడా!” ఊహారాణి నవ్వుతూ పాదచారితో అంది.

“ఆ పువ్వు రాలిపోయింది. ఊహా!… కానీ నువ్వు రాలిపోవు…. రాల్తూనే ఉంటావు…. అయినా మళ్లీ మళ్లీ చిగురుస్తోనే ఉంటావు… నవ్వుతూనే ఉంటావు… అవునా?”

“ఆ నవ్వు వెనక దాగిన దుఃఖం నీకు తెలుస్తుందా పాదచారీ?” అడిగింది ఊహ.

“ఊ!!… అది దుఃఖపు భావనే కానీ దుఃఖం కాదు.”

“ఊహ దుఃఖం కూడ సుఖం లాంటిదే… మళ్లీ మళ్లీ తలచుకొంటే మళ్ళీ మళ్లీ ఊరిస్తూంది.”

“ఏమిటి కన్నీళ్లనా?”

“ఊహు మనస్సుల చిరునవ్వుల్ని కూడా!”

“నేను నాదాన్ని!”

“అందుకే నీకు దుఃఖం ఉండదు. రగిలినా వగిలినా నీకు నువ్వుగానే” ఊహారాణి కళ్లల్లో చివ్వున నీరు చిమ్మింది.

పెదాలు వణుకుతూంటే అంది “ఈ ప్రపంచం నాతో ఆడుకుంది… నన్నో ఆటబొమ్మనో… మూగ జీవినో చెసింది… నాదంటూ నాకు మిగల్నీ లేదు… నాకు అక్కరలేనిది ఇస్తానని కావాలనుకున్న దాన్ని లాగివేసింది… అందుకే, అందుకే పాదచారీ!… నా దుఃఖం సృష్టించిన నాలోకంలో నేను నాదాన్ని!”

ఓ గాలి తెర వేడిగా ఊగులాడింది. గూట్ల ఉన్న గిజిగాడు చికాగ్గా బయటికొచ్చి రెక్కలల్లార్చింది.

దూరంగా ఓ మంకెన పువ్వు నిప్పులు కురుస్తూ నేలకు రాలింది.

అడవి మల్లె నిశ్శబ్దంగా నవ్వింది. “నేను రాలిపోతానుగా” అనుకుంటూ!

విశ్వాసం కుక్క నిస్తేజంగా నిలబడింది ఎండకి నురగలు కక్కుతూ!

“నేను మీ తల్లిని… నా ఱెక్కలు చాచి ఈ వేడి పారద్రోలుతాను…. చల్లిని నా కొమ్మల కొంగుతో మీకు విసురుతాను” దయగా ప్రకృతి చల్లని గాలిని వీచింది.

“ఆమె వెంటే నేనూ ఉంటాను” అంటున్నట్లుగా ఓ మబ్బు ఊగుతూ సూర్యుడికీ ప్రకృతీకీ అడ్డునిలిచింది. సూర్యుడు కొంచెం చిన్న బుచ్చుకుని పక్కచూపులు చూస్తూ తల వంచాడు.

విశ్వాసం గుక్క తిప్పుకుని తోకాడిస్తూ కళ్లు చికిలించింది.

పాదచారి తనలోదేన్నో వెతుక్కుని అన్నాడు “ఊహా నేనూ నీకు దుఃఖాన్నే కలిగించానేమో” అని.

“నువ్వూ ప్రపంచంలోని వాడివేగా, నిన్నెంతో ఎదిగిన వ్యక్తి అనుకున్నాను…. అయినా… అయినా నాకు మిగిలింది దుఃఖమే… కనీసం కొంత శాంతిని వెదుక్కున్నా నేమో అదీ కరిగిపోయింది” ఊహారాణి నిర్లిప్తంగా అంది.

“ఎదగటమో తరగటమో నాకు తెలీదు…నేను నాలాగే ఉన్నాను!…. ఈ ప్రపంచం నాకు ఇష్టమైనదే!

నన్నూ తన కౌగిలిలో బంధించినదే… అయినా ఊహా! ఈ పిచ్చి ప్రపంచం నాకు చేయలేని దాన్నో ఇవ్వలేనిదాన్నో ఇవ్వాలనో చెయ్యాలనో ఆశించలేదు! ఎన్ని మార్లు సరిదిద్దింది నన్ను? ఎన్నిమార్లు క్షమించింది నన్నూ?”

“ఆ ప్రేమో క్షమో నాకు దక్కలేదోయి. అందుకే నా ప్రపంచమే వేరు….”

“ఊహా! నీవే దాన్ని నిర్లక్ష్యం చేశావు. నీ దారాల్లో నువ్వే గూడు కట్టుకున్నావు. నీకు నీవే ఆదారాలు విప్పుకోలేక అవస్థ పడుతున్నావు…”

“అది నీ ఊహ మాత్రమే.” రోషంగా అంది.

“కాదు అది ముమ్మాటికీ నిజం!”

“ఎదుటి వారిని అర్థం చేసుకోలేని నీమూర్ఖత్వం పాదచారీ అది!” గట్టిగా కోపంతో అరిచింది.

“ఏం అర్థం చేసుకోవాలీ? మీ స్వార్థాలు మీవి. మీ ఊహలోకాలు మీవి… మీరు గిరిగీసుకున్న పరిధుల్లోనో మీరల్లుకుని అదే ప్రపంచం అనుకున్న సాలగూళ్లల్లోకో నన్ను రమ్మంటే, నేను రాకపోతే? అది నా మూర్ఖత్వం ఎలా అవుతుందీ? మీకు ఆ నా జీవితపు క్షణాలు కుంచాను… మీరు ఎత్తి చూపిన తప్పులు సరిచేసుకున్నాను… మరి మీరెందుకు మార్చుకోరూ? అంటే… మీ మాటలే రైటనే ఆహంభావమా? ఆ అహంభావానికి మూర్ఖత్వమని పేరు పట్టి నాకు అంటకట్టడం ఎందుకు?” అరిచాడు పాదచారి.

పెదాలు గట్టిగా బిగించి “హూ” అని రోషంగా చూసింది ఊహ.

ఆమెని అక్కడే వదిలి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు పాదచారి.

“ఆనాడు నన్ను రోడ్డు మీద వదిలివేసి వెళ్లావు గుర్తుందా?” గట్టిగా ఊక్రోషంగా అరిచింది ఊహ

“ఆనాడూ నువ్వు అలానే ఆలోచించావు. ఈనాడు అలానే ఉన్నావు. ఊహారాణీ…. ప్రపంచంలో ఏదీ ఎప్పుడూ మారినట్లు కన్పడినా నిజంగా మారదు నువ్వైనా నేనైనా ఏది అయినా అంతే!”

“సరే ఫో!” కోపంగా తల పక్కకు తిప్పుకుంది.

“మళ్లీ కనబడకు.”

“ఎన్నాళ్ల వరకూ?” నవ్వుతూ అన్నాడు పాదచారి.

“ఎప్పటికీ ఎదురురాకు!”

“నిజంగానా?”

“నిజంగానే మూర్ఖుడా… నిజంగానే!”

“సరే అయితే!”

నవ్వుతూ నడవడం మొదలెట్టాడు.

పరుగెత్తి వచ్చి కౌగలించింది ఊహ… “నువు రాస్కల్‌వి! నువు పాషాణనివి!… నీలో ప్రేమా, జాలీ… ఆత్మ మనస్సూ ఏమీ లేవు. అన్న ఉన్న మానవుడిగా మానవతనీ రూపుగా కనిపిస్తావో! పాదచారీ!”

I know you… నా కంటే నిన్ను తెలిసినవాళ్లు లేరు.

You are a fake…

You are a fraud…

You are a devil…

కానీ నీకు తెలీని నువ్వు ‘నీ’లోనే ఉన్నావు.

ఆ ‘నువ్వు’ అద్భుతం! అందుకే నిన్ను వదలుకోలేను.

***

చూశావుటోయ్! ఇదంతా భ్రమ! కాస్సేపు నిజం అనిపిస్తుంది. మరి కొంచెం సేపు నిన్నేడిపిస్తూనో ఆనందంలో ముంచివేస్తూనో ‘ఆహం’కారాన్ని అంటగడుతుంది…

ఇంకోసారి నిన్ను ఆలోచింప చేసి ‘అయ్యే నా చేతిలో ఏమీలేవే?” అన్పించి విషాదంలోకి విసిరి వేస్తుంది. అసలందుకే నిజాన్ని శోధన చెయ్యాలి… శోధించి నిజస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి…. అపుడు దుఃఖమే అంటదు… ఇప్పుడు ప్రపంచంలో నీవు ఉన్నావు… అపుడు ప్రపంచమే నీలో ఉంటుంది. విశ్వమే నువ్వు… సర్వమూ నిండినది నీ స్వరూపమే…. అది కాలబద్ధం కాదు…. శరీర బంధనం లేనే లేదు… నవ్వుతూ అన్నాడు వేదాంతి.

“బాగా వినవోయ్. మళ్లీ మర్చిపోతే అయనకు కోపం వస్తుందిట.” వెక్కిరించింది వేదనలత.

“నిజమే వేదనా నేను ఉన్న చోట నీకు స్థానం లేదు. అందుకే నీ కంత ఉక్రోషమూ. వెక్కిరింపూ!…”

“నేను లేకుండా నువ్వెక్కడనుంచి వచ్చావు వేదాంతీ నీజన్మకీ నేను మూలం… నీ ఉనికికీ నేను మూలం… నేను లేని చోటు… నేను నివసించని చోటు నువు ఎరగనే ఎరగవు. నేనెప్పుడూ నీకన్నా ముందు ఉన్నదానినే! పాదచారినే అడుగు. నీవు అతనికి తెలీని రోజులలో కూడా నాకతడు స్నేహితుడే. మొట్టమొదటి స్నేహపు కౌగిలి నాదే మరి” వెక్కిరిస్తూ నవ్వింది వేదనలత.

“దాన్నే అహంకారం అంటారు. ఓయీ! సర్వాజగత్తుకీ మూలం సత్తు! దానికి రూప గుణ శబ్ద రస నామాలు లేవు. అది సర్వత్రా నిండిన సూక్ష్మాతిసూక్ష్మమైనది. సర్వమూ దానియందే సృష్టించబడి, దానితోనే రమించి దానిలోనే లయమై…”

“నువ్వు చూశావా వేదాంతీ?”

పకపకా నవ్వుతూ మధ్యలోనే అతని మాటని ఆపుతూ అంది “చెప్పు నువు చూచావా? సర్వమూ అదే అయినపుడు నీలోనూ నాలోనూ తేడానే లేదుగా!  మరి నన్ను దూరంగానూ నిన్ను నీవు గొప్పగానే ఊహించుకుంటావెందుకు? రూపరసశబ్దగుణనామాలు లేవంటున్నావుగా? పంచేంద్రియాలూ శరీరమూ విశ్వమూ భ్రమ అంటున్నావుగా! ఎవరు కల్పించిన భ్రమ అది? ఎవరు రమించే భ్రమ అది? ఎవరు లయమయ్యే భ్రమ అది? నీవా? నీకు అస్తిత్వమే లేదుగా మరి? చాలించమంటే కోపం ఎందుకు నీకు?”

“నేనున్నది నిన్ను దూరంగా ఉంచటానికి!”

“ఎందుకు దూరంగా ఉంచాలిట?”

“నీవు భ్రమలో ముంచుతావు గనక.”

పకపకా నవ్వింది వేదనలత.

“పిచ్చి వేదాంతీ భ్రమ నేను కల్పించింది కాదు.”

సర్వమూ సత్తు అయినపుడు నేనూ అందులో భాగాన్నే! సముద్రమూ అలా వేరు కాదు. రెండూ ఒకటే…

ఒకటి ఉవ్వెత్తున తేస్తుంది… మరొకటి నిశ్చలంగా ఉంటుంది” అని అనటమో అనుకోవటమో అర్థం లేని వాదన. సముద్రం నపుడు అలలేదు… అల సముద్రానికి వేరైనది కాదు…”

వేదాంతి మాట్లాడలేదు.

“నువ్వే మంటావు పాదచారీ” అడిగింది వేదనలత.

“నేను అనేదేముందీ మిమ్మల్ని వింటున్నాను… ”

“నీకంటూ ఆలోచన లేదా?”

“ఊహూ! నా దృష్టిలో మీరిద్దరూ నా స్నేహితులే!

ఇద్దరూ నాకు తోడున్నవారే! ఎవరికున్న అద్భత బావాలో గుణాలో వారివే! ”

“గోడమీద పిల్లి వాటం!” కిలకిలా నవ్వింది వేదనలత.

“ఏకాగ్రత పాదచారీ… ఏకాగ్రత! ప్రపంచపు విషయాల్లో వాంఛల్నో దూరంగా ఉంచు… నిన్ను నువ్వు బంధవిముక్తుణ్ని చేసుకో!” వేదాంతి హచ్చరించాడు.

“శభాష్!… అన్నింటినీ అబద్దం అనుకుంటూ నిజాన్ని వెతుక్కవోయ్ స్నేహితుడా! అప్పుడూ నిజమూ అబద్దమే అవుతుంది.అంతా అయోమయమే!…

నేను లేనట! నువ్వులేవుట! మరి ఉన్నదేమిటో తెలియదట… తెలియబడదట!… ఆనందంట వాహ్! వాహ్! వినువో… వినువో! మోక్షార్థివై మౌనాన్ని ఆశ్రయించు” పకపకా నవ్వింది.

“ఆ పిచ్చి నవ్వుని కాస్సేపు ఆపు…” చికాగ్గా అన్నాడు వేదాంతి.

“ఏం పిచ్చి మాటల్ని వేదాంతం పేరు మీద ఇంజక్ట్ చేద్దామనా?”

“నీకు తెలియని విషయాన్ని గురించి మాట్లాడకు!”

“ఓహో! ప్రశ్నలు అడగ్గూడదా?”

వాళ్లిద్దర్నీ వాళ్ల మానాన వదిలి మెల్లగా జారుకున్నాడు పాదచారి.

ఆకాశం నిండా మబ్బులు అలుమకున్నాయ్. చల్లని గాలి ఇంకా చల్లగా వీచింది. పువ్వులూ చెట్లూ ఆనందంగా అటూ ఇటూ తలలు ఊపాయి… నెమలి అందంగా అడుగులు వేస్తూ వెనుకనే రమ్మని వర్షరాణిని ఆహ్వానించింది.

చినుకుల చెలికత్తెలు ముందు నడవగా వర్షరాణి వయ్యారంగా వేంచేసింది.

దాహం నిండిన గరిక కన్య గౌరవంగా తల వంచింది.

మెరుపుల దివ్వెలతో ఉరుముల బాజాల్తో కానుకల డోలీలు వెంటరాగా ప్రకృతి పై కొంగును కప్పింది వర్షరాణి. పరవశిస్తూ చూశాడు పాదచారి!

ఈ అద్భుత మేఘ మాలికలు!

ఈ అద్భుత వాయు వీచికలు!

ఈ అద్భుత వర్షాగమనం!

ఈ అద్భుత ప్రకృతి లాస్యం!

అబద్దం ఎలా అవుతుంది?

ఇవన్నీ ఆ తల్లి కన్నుల్లోని ప్రేమ పాశాలు!

ఇవన్నీ ఆ తల్లి పాదాల్లోని దివ్వరాగాలు!

అబద్దమూ లేదు అసత్యమూలేదు!

జడత్వమూ లేదు చెతన్యమూ లేదు!

సత్తు లేదు అసత్తూ లేదు…

ఉన్నదంతా ఆమె రూపమే!

ఉన్నదంతా ఆమె నాదమే!

ఓ తల్లీ! ఓ తల్లీ!

నీకన్నుల్లో… నీ కాంతుల్లో…

నీవడిలో… నీ పాదలచెంత…

అంతా నీవే… అన్నీ నీవే!…

(సశేషం)

Exit mobile version