[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ భాగం. [/box]
[dropcap]చీ[/dropcap]కటి విడీ విడకుండా బంధన సడలిస్తుంటే, కిరణపు బ్రెష్‌తో సూర్యుడు వెలుగు పెయింట్ ప్రకృతిపై పూస్తూంటే “మా రంగులు మాకున్నాయి నీ రంగు రుద్దకు మాపై” అంటూ చిన్న పిల్లల్లా తల అందకుండా తప్పించుకుంటూ అటూ ఇటూ వంగుతోన్న పూవులు దొరక్కుండా పోతుంటే “ఏయ్ అల్లరి పూవుల్లారా! రండి రండి! నేనూ మీతో ఆడుకుంటాను! ప్టటుకోండి నన్ను చూద్దాం” అన్నట్లు చల్లనిగాలి విడతలుగా వీస్తుంటే “మా తియ్యని కంఠాల్తో ప్రకృతి తల్లికి సుప్రభాతాలు” వినిపిస్తాం అంటూ పక్షులు కిలకిలలాడుతూ బద్దకాల్ని పోగొట్టుకోవటానికి రెక్కలు అల్లార్చుతూ కొమ్మల మీదికి ఎగురుతూ, కిరణ ప్రవాహంలో చక్రికలు కొడుతూ గాన సాధన చేస్తుంటే “ఎంత హాయి! పరిశ్రమ శరీరానికి మంచిది” అన్నట్లు గరిక వీరులు గాలి వాటుకు కవాతు చేస్తుంటే “బద్ధకంగా నిద్రగన్నేరు ఆకుల్ని విప్పకొంటూ నీడలు పరుస్తుంటే దేవుని కవే మా నమస్సులు శిలలపై అంతరించము మాలో భగవంతుని ఇముడ్చుకొంటాం” అంటూ గడ్డి పువులు వినయంగా ప్రార్థనతో విచ్చుకొంటుంటే అతి నిద్ర శత్రువు పరిశ్రమ మిత్రుడు అందుకే “క్రిమికీటకాదులు, ఆహారాన్వేషణకి చకచకా నడుస్తూ పరుగులు పెడుతూ పోతుంటే మేము “మావి సున్నిత మనస్కులం!, చల్లని కాంతికి ఆనందించగలం కానీ వేడిమిని భరించలేము క్షమించండి మరి….” అన్నట్లు కలువపూలు ముడుచుకుపోతుంటే “మా పూర్వీకుడు విష్ణువుకే పాన్పు అయి ప్రియ సేవకుడైనాడు… మహావిష్ణువుకి సేవ చేసిన వంశం మాది… అదే కాదు శివునికీ ప్రియాతి ప్రియమైన ఆభరణాల మయ్యాం. మా వంశ ప్రతిష్ఠ తెలుసా?” అన్నట్లు మహా నాగులు పడగలెత్తి గాలిని ఆస్వాదిస్తుంటే “అనంతకాలవాహినిలో అల్ప జీవులు అనేకం మేము అమరులం కాదు…. అయినా కాలప్రవాహపు వాడీ వేడీ ఉధృతాన్ని… విలాసాన్ని… మరింత సేపు చూశాం! అనుభవసారం మాలోనూ చాల ఉంది” అన్నట్లు ఊడల్ని ఊపుతూ భావాలు తెలుపుతున్నట్లు మర్రి వృక్షాలు అనుభవ పత్రాల్ని రాలుస్తుంటే “మేం మాత్రం రాయి విసిరినా కాయ నిస్తాము పాషాణం ప్రయోగించినా పళ్లనే ఇస్తాము ఓయీ తల్లి ఓర్పు మాది” అంటూ ఫలవృక్షాలు ప్రేమగా నీడల చాపలు పరుస్తూంటే పగలయినా రాత్రయినా వర్షమయినా వేడి అయినా మా ప్రేమ అనంతం మాతో పుడుతుంది మా మృత్యవులోనే నశిస్తుంది. ప్రేమించిన బేల హృదయలం…. తమకంగా మా పురుషులకి కౌగిలి బంధిస్తాం! జన్మంతం జోడుగానే, తోడుగానే, నీడగానే ఉంటాం. నీడలోనే ఉంటాం అన్నట్లు లతలు వృక్షాల్ని మరింత పెనవేసి సరికొత్త హస్తాలతో వృక్షపురుషుల్ని బంధిస్తుంటే, మేమూ కాలప్రవాహపు గతుల్ని చూశాము. వేడిలో వేగిపోతాము. చలిలో జలదరిస్తాము. మీ కంటే ఎక్కువ జీవితం మాది. ఎందుకంటే మేము చలించం మేము భాషించమూ మౌనం మా కిష్టం అందుకే అలానే అన్నిటికీ సాక్షిగా నిర్వికారంగా నిలచిపోతాం అన్నట్లు మహా శిలలు నిర్వికారంగా నిశ్శబ్దంలో నిండిపోతుంటే పాదచారి నవ్వాడు.
కళ్లు మరింత విప్పి ప్రకృతి సందేశాలని మరింత సంభ్రమంగా విన్నాడు చూసాడు.
***
“కాస్సేపు నాలో నేనుగా ఉంటాను” అని అనుకుంటూ బూరుగు వృక్షపు వాలున నడుంవాల్చాడు పాదచారి.
“నేను ఎప్పుడూ నీతోడుగానే ఉంటాను” అన్నట్లు విశ్రాంతిగా పడుకుని కుతూహలంగా అతని వైపు చూసింది విశ్వాసం.
“సరే! నేనీ కాలపు గతుల్నో ప్రవాహాలనో, ఒడిదుడుకులనో, ఎండమావులనో చూశాను…. ఐతే అదే జీవితమని నేననుకోవటం లేదు. వేదాంతిగానో, విశృంఖలంగానో జీవితాన్ని చవి చూశాను…. ఆత్మనో, శరీరాన్నో నిశ్చయమూ నిజమూ అనుకున్నాను కూడా. అయినా నాకు తృప్తి కలుగ లేదు. ఎవరి శరీరాన్నో ఎఱువు తెచ్చుకున్న భావన పోలేదు. నా కోసం నేను అన్వేషిస్తూనే ఉన్నాను. నన్ను నేను తెలుసుకోలేని స్థితిలో అలమటిస్తూనే ఉన్నాను.”
నిర్లిప్తంగా నిట్టూర్చాడు పాదచారి.
“నేనిక్కడే ఉన్నాను పాదచారీ, నేనే నీ భావనని… నేనే నీ బంధాన్ని…” విలాసంగా నవ్వింది మానసి…
“నీవు నీడవి మానసీ! నా వెనుక నుంచుని నీనీడ నాకంటే పెద్దదిగా ప్రసరిస్తావు. నా ముందున నుంచుని నా వెనుకనే రూపం తెలియక పారిపోతావు. నీ అస్తిత్వం నీది కాదు…. ముందు వెనుకలనున్న వెలుగుది. ఆ వెలుగు నాది కాదు… నాలో వెలుగు దానిని గుర్తిస్తుంది. ముందు వెనుకల వెలుగు గుర్తింపబడుతుంది. వెలుగు ఒక్కటే అయినా అనుభవ స్వరూపం వేఱు” నిష్కపటంగా అన్నాడు పాదచారి.
“నేను నీ జీవితాన్ని…. రకపకాలుగా, విధవిధాలగా మలుపులు తిరుగుతూ నిన్ను మలుపులు తిప్పుతాను నీ తోటి వాడనైనా… నీ కన్నా అధికుడను… అయినా పాదచారీ అది నా స్వభావం…”
నవ్వాడు జీవన్ మూర్తి.
“నీవూ కాదు. ఎన్ని మలుపులు తిరిగినా నేను నా లాగానే ఉన్నాను. ఉద్విగ్నతో, ఉద్వేగమో లేనే లేదు. … పరిమళం పువ్వు కాదు. పరిమళం వల్ల పూవు ఉనికి తెలియవచ్చు…. పూవు లేకపోతే పరిమళానికి అస్తిత్వమే లేదు….” జవాబిచ్చాడు పాదచారి.
చిన్న బుచ్చుకున్నాడు జీవన్ మూర్తి.
“ఒక్క క్షణం మీరంతా అతన్ని వదిలి వెళ్లండి. నేనతనితో మాట్లాడాలి…. ”
“ఎందుకు?”
“అతడు జీవితంలో ఎంతో కొంత అలిసిపోయాడు… సేదదీర్చాలి….”
“అందుకు అమృత ఉంది!”
“అమృత అమృతే! అతనిలో అతనికి విశ్వాసం సన్నగిల్లినపుడు మరలా తన విశ్వాసాన్ని తన ధైర్యాన్ని జీవింప చేసేది అమృత… నేను అమృతని కాదు…. అమృత నాకు తెలియదు. కానీ…. అతనికి విశ్రాంతి కావాలి… దాహం గొన్న మానవుడికి చల్లని నీటిలాగా ఆవేశంతో రగిలే తనకి శాంతి కావాలి. నేనివ్వగలననే నా ఉద్దేశం!… నాకు కావల్సిందీ అదే…. తన సౌఖ్యం!…. తన మనశ్శాంతి.”
అందరూ పక్కకి తొలగి పోయారు.
“పాదచారీ! నేను గుర్తున్నానా?”
పాదచారి నవ్వాడు. మెల్లగా ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆమె చేతులని ముఖానికానించుకుని అరచేతులను ముద్దుపెడుతూ అన్నాడు….
“నీవూ నా జీవితంలోని కొన్ని అద్భుత క్షణాల యజమానివి. జీవితాంతమూ నీవు, నీ ఆత్మీయత నా హృదయంలోనే పూలు పూస్తూ ఉంటాయి…. నిజంగా నిన్ను వెదుక్కున్నాను నేస్తమా! నీ చల్లని ఒడిలో విశ్రాంతి నిజంగా కావాలి. నీవు పరిశుద్ధమైన స్త్రీమూర్తివి… నీ అంశ నాలోనూ…. నా అంశ నీలోనూ… ఉండాలనుకుంటున్నా కొంచెం స్వార్థం నాది…. ఎంత ఉన్నతురాలివి? ఎంత చక్కని స్నేహితురాలివి?”
ఆమె అందంగా మల్లెపువులా నవ్వింది.
“నేస్తమా! ఎంత విచిత్రమీ జీవితం, గడుస్తున్న వర్తమానం గతాన్ని తనతో లాక్కొస్తుంటుంది. ఊహ భవిష్యత్తులో ఉయ్యాల లూగుతుంటుంది. నేనెవరూ నీవెవరూ? ఎందరో! అందరూ మనస్సనే చాపను పరిచి విశ్రాంతిగా కూర్చున్నారు. మరి నేను? నాకు స్థలమే మిగల్లేదు పోనీలే…. ఎన్ని ఊహలు కురిశాయి ఎన్ని ఆశలు విరిశాయి?”
“మళ్లీ ఏమీ మిగలనే లేదు. కురిసిన ఊహాలా విరిసిన ఆశలూ అన్నీ నావే. నాలోనివే… అవి కురిసిందెక్కడ? ఆవిరై ఇగిరి ఎగిరిపోయిందెక్కడ?” ఆమె వేళ్ళను స్పృశిస్తూ మాట్లాడి, మళ్లీ మౌనాన్ని ఆశ్రయించాడు పాదచారి.
“మాట్లాడు పాదచారీ! మాట్లాడు! నీ వేదననో అనుభవాన్నో నీలో నీవే విశదీకరించుకో… నీ మాటలూ నీవే… నీవు మాట్లాడేదీ నీకోసమే” లాలనగా తలనిమురుతూ అంది.
“ఇంతకీ నీ పేరేమిటి నేస్తం” అడిగడు పాదచారి.
“పేరుతో పనేమి ఉంది, అయినా అసలు పేరెందుకు?”
“నా జ్ఞాపకాలో నేనో నీలో ఉన్నంత వరకూ పేరెందుకు, చెప్పకు నేస్తమా! అయినా పేరులోనూ ఓ చిత్రం ఉంది ఆ పేరే మరొకరికి ఉండి వినటం తటస్థించితే… వ్యక్తి వేరైనా ఉనికి నీవే అవుతుందిగా… అలాగే… ఆరాధించి… ఆరాధించి అహాన్ని చంపుకుని నా ఉనికిని నేనే మరచి ‘అమృత’ కోసమే అన్నేళ్లు తపస్సు చేశానా ఎక్కడ చూసినా ఇప్పుడు ‘అమృతే’ ఎన్నో వేల రూపాల్లో తన గోటి వంపునీ, శిరోజపు అంచునీ…. ఓహ్ ఆ అన్వేషణ ఎంత అద్భుతం! విశాలమైన ప్రకృతిలో భిన్న వ్యక్తుల్లో నేను చూసుకునే స్వరూపం మాత్రం ఒక్కటే ఆ స్వరూపంలోని కోటి వంతైనా అందర్లోనూ ఎక్కడో ఓ చోట కనపడుతుంది. అందుకే నాకు ప్రపంచమే అమృతమయం! నీవూ అందులోని అతి చక్కని అతి దగ్గరి భావానివే నేస్తమా!”
“నాకు తెలుసు పాదచారీ!… కాసేపు నా గుండెల్లో నిద్రపో!” తల నిమురుతూ ఆమె అంది.
“నీవు అనేది నీకు అర్థం కాదు… ఇహ ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది!… ఓయ్ పాదచారీ! జీవితం ప్రవహిస్తోంది…. ఓ క్షణం దాన్ని గుర్తించు… ఆరాధనా ప్రేమా అమరత్వం… మృతత్వం… ఇవన్నీ బాష్ (bash)! కాస్త ప్రపంచంలోకి రా! చుట్టూ పెరిగిన తుక్కునీ మాలిన్యాన్నీ, స్వార్థచింతననీ… పరద్వేషణనీ చూడవేం?”
గాడ్పుల నిట్టూర్పులు వగరుస్తూ అన్నాడు విప్లవమూర్తి.
“అది సరేగానీ కాలం కాలం అంటూ అర్థం లేని అరుపులు అరుస్తావ్ గదా ఏమిటోయ్…. నువ్వు చూసిందీ… చూడందీ?” కొద్దీగా హేళన ధ్వనింపచేస్తూ అన్నాడు విజ్ఞానాచార్యులు.
“హేళనకు జావాబివ్వటం హేళనతోనే. ముందు అతని నోరు మూయించు” అలవోకగా పాదచారిని చూసి అంది వేదనలత.
“మీరెవ్వరూ నన్ను… మీరందర్నీ విడి విడిగా చూసినందుకు ఓ క్షణం నాకు ఆనందం… మరోక్షణం వ్యధ…. మరోక్షణం మీ స్నేహంలోని మాధుర్యం, మరో క్షణంలో నిర్వేదం… ఏ ప్రవాహాన్ని చూసినా అది అంత మవుతున్నది కాల ప్రవాహంలోనే…. మాలిన్యాలూ మాధుర్యాలూ, వ్యధలూ, ప్రేమలూ నిట్టూర్పూలూ అన్నీ అందులోనే… ఏం చెప్పను! ఓ నెల క్రితమే సంవత్సరం క్రితమో యీరోజననే కలిగిన ఉత్సాహమో వ్యధో, భావసంచలనమో ఇప్పుడేవి? కనిపించని కాల బిందువులు వాని వాసనలనో గుణాల్నో తమలో ఇముడ్చుకున్నాయనుకోనా? అయితే ఆ ఇముడ్చుకోవటమూ అసంపూర్ణమే!… మచ్చలు నా వద్దే …. నా మనస్సులోనే…. నా శరీరం పైననే మిగిలి ఉన్నాయి…. బాధో… సంతోషమో పూర్తిగా కొట్టుకునీ పోలేదు… మిగిలీ నావద్ద లేదు… నిన్నటి దాకా నీ సర్వస్వం… నీకే అంకితం… ఈ క్షణం నీది కానే కాదు. ఓయీ కాలమా ఎంత దీనత్వాన్ని ఆపాదిస్తున్నావు… ఎంత శాంతి నిస్తున్నావు.”
“చూశావా? ఇతడు భావుకుడు, భావనలో రగులుతూ, మరుగుతూ మునిగిపోతూ… భావననే వెదుక్కుంటున్న పిచ్చివాడు… నాకేం పని ఉంది ఇతనితో…” వేదాంతి వస్తూ వస్తూ అని మళ్లీ వెనుదిరిగాడు.
“ఒక తల నెప్పి తగ్గినా తగ్గినట్లే” నవ్వింది వేదనలత.
“ఇతను నా చేతుల్లోంచి జారిపోయాడు. చచ్చిన శవానికి ప్రాణం పొయ్యడం లాంటిది ఇతనిలో విప్లవజ్యోతి వెలిగించడం… అయినా మరోసారి చూద్దాం…” విసవిసా విసురుగా నడిచివెళ్లాడు విప్లవమూర్తి.
“రెండో తల నెప్పి వదిలింది” పకపకలాడింది వేదనలత.
“నువ్వెపుడు వదులుతావూ?” యీసడింపుగా అన్నాడు విజ్ఞానాచార్యులు.
“నువ్వూ నీ దారి చూసుకున్న తరువాత” హేళన చేసింది వేదనలత.
“కాసేపు నన్ను నేను చూసూకోవలని ఉంది” నిర్లిప్తంగా అన్నాడు పాదచారి.
“ప్రవహించి ముందుకు సాగిపోయి, సాగరుని కౌగిలిలో కరిగి, ఆవిరై ఇగిరిపోయిన నదిని మళ్లీ ప్రవహింప చేయగలవా పాదచారీ!” ప్రశ్నించాడు సత్యమూర్తి.
“అనుభూతిలో గాఢత లేక పోయినా కొద్దో గొప్పో అంతెందుకు… కొంత ప్రయత్నంలో అనుభూతి వాసన మిగిలిన ప్రవాహాన్ని ప్రవహింపజేయ వచ్చునూ…. సత్యా! సాగరునిలో లీనమై, కరిగి, ఆవిరై ఎగసిన ప్రవాహమేగా… మళ్లీ నూతనత్వంతో ధూళిని వదల్చుకుని ధరిత్రిపై జల్లు కురిసేది! మళ్లీ ప్రవహిస్తుంది…. కొంత విచక్షణతో…. అనుభూతి కాని అనుభూతి వాసనతో” నవ్వాడు సత్యమూర్తి.
“సరేనోయ్! ప్రవహించనీ! మరోసారి… నీ కళ్లల్లోనూ కొంచెం నీళ్లో, రక్తమో కారటం చూస్తాను…”
కంటి వెంట నీరు వస్తుంది! ఆ నీరేమిటో తెలుసా?
“గుండె స్రవించిన రక్తం… ఆవిరై … మళ్లీ కన్నుల్లో ద్రవమై ప్రవహించటం…”
“ఏదో ఓటి… చూపించవూ?”
“చూపించటానికి అతనికేం హక్కుందీ! గతించిన క్షణాల తాళాలు నా వద్ద ఉన్నాయి. అయినా నా పొడే గిట్టదు తనకి” విసురుగా అంది వేదనీలత.
తనో శిల నుంచి జనించింది…. శిలగానే ఉంది కూడ…. ఎపుడో ఎండకి వేడెక్కి…. లోలోపలనే రగిలి రగిలి… పగిలి బ్రద్దలయ్యింది… ఘనీభవించి మళ్లీ…. శిలగానే మిగిలిపోయింది…
“ఇవండీ సాహిత్యపు సొంపులు…” వెక్కిరింతగా అంది కవితాకుమారి.
“ఓహో హో! ఎంత కాలమయిందీ నిన్ను చూసి” స్నేహంగా పలుకరించింది వేదనలత.
“కానీవోయ్ పాదచారీ!…. వ్యధా భరిత జీవజనిత కధారోదనం….” మళ్లీ నవ్వింది కవిత.
“నీ బుద్ది మారలేదే కవితా! తనని నీ కొంగున కట్టి ఉయ్యాలలు ఊపే దుర్బుద్ధి నువు మానలేదు.”
“ఎందుకు మానాలి? నా ప్రియుడోయ్!”
ఏమీ వినకుండా తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు పాదచారి.
“వ్యక్తి లేని ఖాళీ కూర్చీని నిమిరాను. ఉన్నట్లుగానే అనిపించింది… నడిచిన గుర్తులు చెదరిపోయినా పరికించి చూశాను…. పాదల ముద్రులు కన్పడినట్లుగానే చూశాను… మెత్తగా వంగిన గడ్డిపరకలనీ… గాలికి ఊగే గడ్డి పువ్వులనీ… రారమ్మని పిల్చినట్లు ఊగిన వృక్షభంధవుల్నీ మళ్లీ మళ్లీ స్పృశించాను. ఆ స్పర్శలో ఆ అనుభూతీ కలిగింది. మనస్సులో పుట్టి మనస్సులో ఆవిరై మళ్లీ మనస్సులోనే వర్షించిన అనుభూతి….”
“Mood makes a man” నవ్వింది కవిత.
“Mood makes away one mad కొంచెం జాలిగా అంది వేదన.”
ఓయీ పాదచారీ! నీవొక ఊహామాతృడవు. నీదంటూ నీకో స్వరూపం లేదు…. ఆకారం లేదు. నీవు తన కనపడేదీ, వినపడేదీ నీ భావాల్లో… నీ ఊహల్లో… నీ చూపుల్లో… నిర్వికారంలో నిండిన నీ కళ్లల్లో ఎవరి కోసమో ఎదురు చూస్తూ నీ మీద విసుక్కుంటూనో… కోపగించుకుంటూనో… చివరగా జాలి పడుకుంటూనో విడిచే నిట్టూర్పుల్లో… వేడిగా… వాడిగా ఆవిరియై అలగా…. అంతే…. నీదంటూ నీకు శరీరం లేదు… మనస్సు లేదు… ఆత్మ లేదు… ఒక వేళ ఉన్నా అవీ నిమిత్త మాత్రాలే… నా మనస్సు చంచలం నీ ఆత్మ అగోచరం… నీ శరీరం బుద్బుదం…!”
నవ్వింది “అమృత”.
నవ్వుతూ ఏడ్చింది అమృత.
ఓ ఒంటరి కాకి రెక్కలు అల్లార్చుతూ ఓ మోడైన చెట్టు మీద వాలింది. పొడుగు ముక్కు చిన్నతలా పైకెత్తి ఆకాశంవంక చూచింది. మళ్లీ మనసు మార్చుకుని ముక్కుతో రెక్కల్ని సరి చేసుకుంది.
“నేను ఇలాగే ఉన్నాను… ఇలాగే ఉంటాను. అవసరమైన నాతోటి వారిని. అరిచి పిలుస్తాను. లేకపోతే ఇలానే… బలంగా ఆకాశానికి దూసుకుపోతాను.”
“అలసిపోయాకా ఇదో… ఇలానే ఎగిరిపోతాను” అంటూ అంటూ ఎగిరిపోయింది.
“కాకి గోల” క్రీర్ క్రీర్ మంది పిచ్చుక ఒకటి.
అమృత వడిలో హాయిగా తల నుంచి ఆమె వేళ్ల మెత్తదానాన్ని పరీక్షిస్తున్నాడు పాదచారి. అతని చెవి వెనుక మెల్లగా మరో చేతి వేలుతో నిమిరింది అమృత.
“అమృతా! నీకీ అమృతత్వం ఎలా వచ్చింది? నీ నవ్వులో, నీ పెదవి వంపులో నీ స్పర్శలో, అణువణువులో యీ అనంతమైన శాంతీ కాంతీ ఎలా నింపుకున్నావు. నీవు దగ్గరుంటే యీ ప్రపంచమంతా ఓ భ్రమగానో రంగుల మయమైన చిత్రంలానో ఉండి ఆహ్లాదం కలిగిస్తుంది… ఈ ప్రపంచంలోని ఆశలూ, నిరాశలూ ఉత్సాహామూ, నిట్టూర్పులూ అన్నీ క్షణికంగానూ నాకు సంబంధించనివిగానూ అన్పిస్తాయి.”
నీవు లేకపోతే ఏదో ఒక చిత్రమైన శూన్యం నన్నావరించుకుంటుంది.
ఎందుకో చెప్పవూ!
చెయ్యెత్తి ఆమె నున్నని బుగ్గని నిమురుతూ అన్నాడు పాదచారి. ఆమె నవ్వింది.
తల్లిలా…
ప్రకృతిలా…
సహజంగా
స్నేహాన్ని పంచుతూ పాదచారిని గుడెలకదుముకుంది. పసి బిడ్డను తల్లి అదుముకున్నట్లు.
“నిద్రపో! నిదురపో నా పాదచారీ! మళ్లీ నీవు చాలా దూరం నడవాలి చూడు… నడుస్తూ నడుస్తూ ముళ్ల కంచెలు తొక్కుతూ నువ్వెంత అలిసిపోయావో నేను నీదగ్గరే ఉన్నాగా…. విశ్రాంతిగా నిద్రపో…. మళ్లీ ఎంత దూరమో వేచి ఉంది”
నుదుటి మీద బుల్లి బుల్లి ముద్దులు పెడుతూ నిద్రపుచ్చింది.
గుండె శబ్దం లయగా వినిపిస్తుండగా ఆమె చేతులు తల నిమరుతుండగా అలానే నిద్రించాడు పాదచారి…. అమృత కన్నుల్లో చల్లని వెన్నెల కాంతిలో అతని పెదవులపై పసిబిడ్డ చిరునవ్వు.
(సశేషం)