పాదచారి-15

1
2

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ భాగం. [/box]

[dropcap]“ఎ[/dropcap]న్నేండ్లు గడిచాయి పాదచారీ!”

“లెక్క తేలీదు… అసలు లెక్కపెట్టడం ఎందుకు?”

“ఇంకా నిర్లిప్తతే మిగిలిందా?”

“ఉహూఁ! నిర్లిప్తతే కాదు…. నిర్విచారం…. నిర్వేదం… నిర్లజ్జ… నిర్మొహమాటం… నిర్మోహం కొద్ది గొప్పో నిర్మలత్వం.”

“అయినా అహంకారం చావలేదుగా!”

“నీ యిష్టం వచ్చిన పేరు పెట్టుకో!”

“కానీ పాదచారీ! నీలో ఏదో నిస్పృహ కూడా కనబడుతోందోయీ! కాలప్రవాహం నిన్నూ ఒరుసుకుంటూపోయి నిన్ను నీకు తెలీని బలహీనత్వమో, నీకు తెలీని నిరాశో నిన్ను కౌగిలించిన గుర్తులు కన్పిస్తున్నాయోయ్.”

“ఏమో!”

“అంటే?”

“నాకే తెలియదని నువ్వే అన్నావుగా, నీకు తెలియకనే నువు మళ్లీ ప్రకృతి ఒడిలోంచి విడివడ్డావు!”

“లేదు… ప్రకృతి ఒడిలోనే విశ్రమించటానికో వినోదించటానికో వచ్చాను.”

“ఏమా కథ?”

“నేను ప్రకృతి ఒడిలో బిడ్డని … సర్వమూ అంతే!”

“ప్రకృతి భ్రాంతి అనో, మిధ్యారూపమనో తెలీదా?”

“రూపం కనిపించటం ముఖ్యం. అద్దంలో రూపం మిద్యాబింబమైనా అది ప్రతిఫలిస్తున్నది నన్నే కదా?”

“కనీసం నన్ను నేను పరికించుకోగలను!”

“ఆ విశ్వాసం కుక్క నన్ను మూర్ఖుణ్ని చేస్తోంది!”

“ఆ మూర్ఖత్వమే మోక్షం అనుకుంటే!”

“అపుడు అది నీ ఖర్మ!”

“కాదు అది just కర్మ.”

“కర్త ఎవరు?”

“నువ్వూ, నేనూ, మరొకరూ కానిది.”

“అంటే?”

“నీలోనూ నాలోనూ మరోకరిలోనూ నిత్యంగా సత్యంగా ఉండేది.”

“ఏమిటి అది?”

“అది తెలిస్తే అసలు అన్వేషణ ఎందుకూ?”

“నీ అంత పిచ్చి వెధవ లేడు!”

“Thank you for the best complement!”

విసుక్కుంటూ దారిన పోయే దానయ్య దిశ మార్చి సాగిపోయాడు.

పాదచారి నవ్వుతూ ముందుకి నడిచాడు.

ముందుకి ముందుకి

మున్మున్ముందుకి…

నడిచీ నడిచీ

నడుస్తూ పోయాడు.

***

“పాదచారీ!”

“ఊఁ!”

“సాగవోయీ! నీకు తెలిసిన గమ్యాల్లోకి… నీకు తెలియని మార్గాల్లో!… సాగిపో!”

“ఎందుకుట?”

“గమ్యం చేరాలిగా మరి?”

“నాకేమి తొందర లేదు!”

“పోనీలే!”

“నేస్తమా! జీవితాన్ని వెనుతిరిగీ ముందుకి చూపు సారిస్తూ చూస్తూనే ఉన్నాను… అన్నీ కనిపించినా, అంతా తెలిసినట్లే ఉన్నా ‘నేను’ ఎక్కడ ఉన్నానో, ఎందుకు ఉన్నానో నాకే తెలియడం లేదు.”

“ఆత్మాన్వేషణా?”

“అదేమో నాకేం తెలుసు?”

“అదే నిన్ను నువ్వు వెదుక్కోవడం!”

“నేనెవరో నాకు తెలియనంత కాలం నన్ను నేను ఉంటానుగా!’

“తెలిసేదెపుడు?”

“అది తెలిస్తే అన్వేషణ ఎందుకు?”

“చెప్పలేని దాని కోసం జీవితాన్ని ఖర్చుచేసుకుంటావా పాదచారీ!”

“అందులోనూ ఆనందాన్నో విచారాన్నో అనుభవిస్తూనే ఉన్నానుగా!”

“అవి ఏం నేర్పాయీ?”

“జీవితం ప్రవహిస్తుందన్న విషయం తెలిపాయి జీవమూ, జీవితమూ, జీవించటమూ వేరు వేరని తెలిపాయి….”

“అవి తెలుసుకున్నందు వలన లాభం?”

“జీవితం లాభనష్టాల పట్టిక కాదోయీ!…జీవితం జీవితమే!”

“మరి అన్వేషణా?”

“అదీ ఒక రకమైన ఉప శాంత విధానమే!”

“So, you are a desert?” అవునా! ఎడారి వోయీ!… ఎండమావులు నిండిన ఎడారివి. వర్షం కోసం తపనతో ఆకాశం వంక అఱ్ఱులు చాస్తావు!…. ఇతరులు తమ దాహం తీరుతుందనే భ్రమలో ఎండమావులని సెలయేళ్లుగానో ఒయాసిస్సులుగానో భావిస్తారు… ఆ భ్రాంతిని వారి భ్రాంతిని నిజమనుకునీ, నీలో అంతులేని ప్రతిభని నువ్వే ఊహించుకుంటూ నీ అంతట నీవు భ్రాంతి శృంఖలాలను తగిలించుకుంటావు… అవునా?”

పకపకా నవ్వి అన్నాడు పాదచారి.

“ఆ తరువాత?”

“ఏముందీ? నీలో లేని ఔన్నత్యాన్ని ఉందని నువ్వూహించుకుంటూ… ఇదుగో…. అన్వేషణ పేరుతో నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటావు.

నిన్ను నువ్వు దాచుకుంటావు. నీలో నువ్వు రగులుతూ ఉంటావు…. నీలో నువు రోదిస్తూనూ ఉంటావు….

పైకి ప్రకృతి విలాసం! లోపల విపరీత విలాపం! కాదనగలవా?”

“ఇంత కాలమూ నువ్వు నాతోనే పయనించావు ఊహరాణీ! నువ్వు మాత్రం నా పేరుకు తగ్గట్టు ఊహాగానే మిగిలిపోయావు. సరేనోయీ! నన్నూ పరీక్షించావుగా! ఏడ్చాను, నవ్వాను, రోదించాను, విలపించాను, విశృంఖలంగా అనుభవించాను. ఆనందించాను, నన్ను నేనే అసహ్యించుకున్నాను, నన్ను నేనే ప్రేమించాను, సర్వాన్నీ నాలోనే నేను వెదుక్కున్నాను…. అది మాత్రం సాధన కాదా?”

“అది వేదన.”

“ఊహూఁ!”

“కాదని నువ్వు బుకాయించినా అది వేదనా స్వరూపామే!”

“అతడు తనుగానే ఉన్నాడు. నాకు తోడు రాలేదు. అతన్ని అతనిగానే ఉండనీ” గబగబా వస్తూ అంది వేదనలత.

“క్షమించండి… మీలో నేనో కొత్త వ్యక్తిగా అగుపించే పాత స్నేహితుణ్ని…. గుర్తుపట్టారా? గుర్తు లేకపోయినా ఫర్వాలేదు!… పాదచారీ! నీకు మాత్రం నేను గుర్తే కదూ! పేరు మర్చిపోయావనుకుంటాను!… సర్లే! పేరులో ఏముంది? కొంచెం సేపు నాతో మాట్లాడవూ!” కొత్త వ్యక్తి నవ్వింది.

ఊహరాణీ, వేదనలతా యామె యెవరు అన్నట్లు పాదచారిని చూశారు.

పాదచారి కళ్లల్లో ఓ స్నేహపు మెరుపు మెరిసింది.

చటుక్కున లేచి నడకసాగిస్తూ వచ్చన ఆమె చెయ్యి పట్టుకొని ఆప్యాయంగా నొక్కుతూ, ముందుకు సాగాడు పాదచారి.

ఓ క్షణం వేదనా, ఊహా తమను తాము మరచి అతనితో సాగారు.

విశ్వాసం హుషారుగా పాదచారినే వెంబడించింది.

ఎండా, గాడ్పూ ప్రకృతిని దహించి వేస్తూ సెగలతో భూమిని బీటలు వారుస్తూంటే, ఆకాశం ఓ క్షణం ప్రియురాల్ని పరికించి చూసి జాలిపడి ఓ మేఘపు తెరని సూర్యుని కెదురుగా లాగి ఓ క్షణం గుక్క తిప్పుకునే వీలును ప్రకృతికి కల్గించింది.

 “నేనూ మరి! అంటూ వాడిగా వేడిగా ఉన్నా చూపుల చల్లదనం విరిసే గాలి పిల్ల పయ్యోదను ఎగురవేస్తూ ముందుకు సాగింది.”

“మాకీ క్షణంతో తృప్తి తీరలేదు ఆకాశమా! ఇంకొంచెం దయ చూపించవూ? అన్నట్లు జాలిగా మహావృక్షాలు ఆకాశాన్నో క్షణం కొమ్మ లెత్తి చూసి మళ్లీ కొమ్మలు దించుకున్నాయి. వేడిని భరించలేక ఓ గిజిగాడు గబగబా గూట్లోంచి బయటపడి ఓ క్షణం గాలిలో చక్రికలు కొట్టి “ఇక్కడా ఉక్కగానే ఉంది” అనుకుంటూ విసుగ్గా మళ్లీ గూటికి చేరాడు.

సుదీర్ఘంగా నిట్టూర్చి ఆఖరి శ్వాస విడిచి ఓ లతను పూసిన పువ్వులు టపటపా కన్నీళ్లలా నేలకు రాలాయి. వృక్షాన్ని పెనేసుకున్న లతా రాణి దుఃఖంతో నిస్సత్తువగా పెనవేసుకున్న తీగెలబలం పోయి నీరసంగా నేలకు వాలింది.

 “రండి… రండి… పాపం ఆ లత ఎలా వాలి పోయిందో?” జాలిగా అరుస్తూ మేఘపు తెర తన స్నేహితుల్ని పిలిచింది.

సమ్మె చేసిన కార్మికుల్లా మేఘబాలలు గుంపు గూడి సూర్యుని అడ్డుకున్నాయి.

ఆ సందడికి మేల్కొన్న గాలి కన్యలు అల్లరిగా పరుగులు తీస్తూ మేఘ బాలల్ని చేరుకున్నాయి.

ఆనందంతో ఆకాశం పెద్ద పెద్ద బాష్పాల్ని పుడమి తల్లిపై వర్షించింది.

ఊపిరి పీల్చుకున్న పుడమి తల్లి సువాసనల్ని వదులుతూ తన గాయాలకి పట్టీ వేసుకుంది.

తొలి వర్షపు చినుకుల్లో పక్షీ – పువ్వూ, చెట్టూ – చేమా అన్నీ ఆనందంగా తడుస్తూ ఆందంగా ఊగుతూ ఆనందంగా అభినందించాయి.

పక్షులు పైపై కెగిరి ఆకాశపు పెదవుల్ని రెక్కలతో చుంబించాయి.

ఓ ఋతువు ఱెక్కలు విదిల్చి ఆకాశాని కెగసింది.

మరో ఋతువు పచ్చని ఱెక్కలు చాచి భూమికి అలంకరణ చేసింది.

“ఎన్నేళ్లు గడిచినా ప్రశ్న ప్రశ్నగనే ఉంది కాదా మరి వెతుకులాట ఎందుకు పాదచారీ!”

ప్రశ్నించింది కుతూహలం!

“బిందువులు వేరు వేరు ప్రవాహం ఒక్కటే! అట్లాగే ప్రశ్నలు అనేకం జవాబు ఒక్కటే!

“ఆ జవాబు నీకు తెలుసా?”

“తెలియటం అంటే బిందువులు బిందువులుగా విడిపోవటం లాంటిది!”

“నువు చెప్పేది పోనీ నీకైనా అర్థం అవుతున్నదా?”

“అనేక ప్రశ్నలకి జవాబు అందులోనే ఉంది. అయినా కుతూహలమా! భాషా భాష్యం ఇవన్నీ కృత్రిమంగా సృష్టించకున్నవే! స్పష్టమైనదీ, సహజమైనదీ మౌనం ఒక్కటే… అర్ధమూ అనంతమూ కూడ అందులోనే ఇమిడి ఉన్నాయి.”

“నాకు తెలిసిన భాషలోనే భావాన్ని చెబుదూ!”

“ఈ ప్రకృతిని చూడు! ఎంత ఆహ్లదంగానూ విచిత్రంగానూ, ఆప్యాయంగానూ మౌనంగా తనను తన్ను తెలియబరుచుకుంటున్నదో? ఇంకా నీకు ప్రశ్నలు ఎందుకు?… ఆనందించు నేస్తం!… ఆనందించు! పకపకా నవ్వే శబ్దాలు ఎందుకూ? ఓ వంపు తిరిగిన పెదవి అంచు చాలదా పువ్వులు కురిపించేందుకు? తమకం నిండిన గాఢపు కౌగిలింత లెందుకూ? నీ సన్నని వేళ్ల అంచుల స్పర్శ చాందా ప్రేమను ప్రవహింప చేసేందుకు? అందాల్ని అవలోకించవోయీ! మౌనంగా అద్భుతంగా ఆనందాన్ని అనుభూతిగా అనుభవించవోయీ…”

చిరునవ్వుతో సాగాడు పాదచారి.

“నా గుర్తు నీ వద్ద ఉండకూడదు పాదచారీ! అందుకే చెరిపి వేస్తున్నాను.”

“అంత భయమేమి?”

“ఈ ప్రపంచంలో నేటి గుర్తులు రేపటి ప్రపంచపు చరిత్రలు…”

“అయినా కాలం ఏ గుర్తునూ మిగల్చదు. ఓ ఎడారిలో గాలి వీస్తే నడిచిన పాదాల గుర్తులన్నీ ఇసుకతో నిండి సరికొత్త అలలుగా రూపుదిద్దుకొంటాయి…. సముద్రపు ఒడ్డున ఇసుకలో గూళ్లుకట్టి పేర్లు రాస్తే ఏదో ఒ చిలిపి కెరటం అన్నిట్నీ చెరిపి తనదారిన తనుపోతుంది. అంతేగా భయమెందుకోయూ?”

“నీ మాటల్లోనే చెప్పాలంటే అది సర్వజీవ లక్షణం కనుక!”

“కావచ్చు… కానీ అది నా జీవలక్షణం గాదుగా! పెదవుల వెనుక కదిలే మౌనాన్ని కంటి వెనుక కదలాడే భావనా స్వరూపాన్ని దేన్నీ ఎవ్వరూ ఎప్పుడూ చెరుప లేకపోయారు. నేనూ అంతే! చెరిపి తీరాలనే ప్రయత్నంలో కనిపించేది చిలిపి తనమూ పిరికితనమూ…!”

“అది మళ్లీ నీ అహంభావామే!”

“కావచ్చు కానీ అదీ సత్యమే! అదీ నిజమే!

“నీ మనస్సు చంచలం…. ఒకోసారి అది పాషాణం! మరో సారి అది ఇష్టం వచ్చిన చోటుకి అందుకుండా జారిపోయే పాదరసం… అది కఠినం మళ్లీ అది ఆవిరి గడ్డ కట్టి చేతి వేళ్ల సందుల్లోంచి జారిపోతుంది… మళ్లీ ఆవిరై ఆకాశానికి ఎగిరిపోతుంది. అందుకే పాదచారీ అందుకే గుర్తులు మిగల్చడం ఇష్టం లేదు.”

ఓ ధీర్ఘ విశ్వాసం! ఓ అసంపూర్ణమైన చిరునవ్వు!

నవ్వాడు పాదచారి. తనలో తనుగా పగలబడి నవ్వుకున్నాడు.

ఇదుగో… ఇవన్నీ గాయాలు… గాయానికో గేయం అయితే అవన్నీ గాయాలే! ఒకపుడు అవి స్రవించింది రక్తాన్నే! మిగిలిపోయింది మాత్రం మచ్చగానే. సర్లే స్నేహమా! అలాగే కానీ! నీ గుర్తులు నీ చేత్తోనే చెరుపుకుంటున్నానని అన్నావు కదూ! సరే! సరే! చెరుపుకునే భావమూ, శృంఖలమూ నీవే, కాలం కాలి బూడిదను అశ్రువుల్లా రాల్చిన తర్వాత సుగంధాన్ని మాత్రం వెదుక్కోకు సుమా!”

పాదచారి నవ్వుతూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ లోకాన్ని అవలోకిస్తూ ముందుకి సాగాడు.

“ ఓ… ఓ పాదచారీ… నిన్నే !”

“ఏం?” వెనక్కి తిరిగాడు పాదచారి.

“నేను చెరిపి వేసింది నా గుర్తుల్నే నన్ను కాదుగా” అరుస్తూ దరికి చేరింది స్నేహ.

తలను వంచుకొని తనలో తను అనుకుంటున్నాట్లుగా అన్నాడు “ఒకప్పుడు అన్నిటినీ అంతటినీ అర్థం చేసుకోగలిగేవాడిని. అవునో… కాదో! ఆ అహంభావం ఉండేది. ఇపుడు నేను నిస్సహయుణ్ని జీవితమూ, నేనూ కూడా నవ్వుకుంటున్నాము.

“జీవితాన్ని చూసి నేనూ… నన్ను చూసి జీవితమూ…”

“జీవితమూ నీవూ వేరు వేరు ఎలా అవుతారు?”

“ఈ శరీరం అప్పు తెచ్చుకున్నాను స్నేహా! బహుశా ఇది నాదే నేమో కూడా? అయినా అప్పుతెచ్చుకున్నాననీ ఏనాడో ఓనాడు దీన్ని తిరిగి ఇచ్చివేయ్యాలనీ నాకిపుడూ అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. కానీ ఆ… నన్ను వీడదు. అందుకే దాన్ని కూడ నిజమని నమ్ముతాను. ఒకప్పుడు ఉన్నది ఉన్నట్లు చెప్పే వాడిని. కానీ ఇపుడు దేన్నీ చెప్ప లేకపోతున్నాను. విచారమూ, సుఖమూ ఏమీ అంటడం లేదు. అంటినట్లు అనిపించినా అనుభూతి మాత్రం లేదు! స్నేహ!” పాదచారీ నడుస్తాడు.

“నడవటం తన విధి ఎగిరిపోవటానికో కలల్లోకో ఊహల్లోకో తేలిపోవటానికో నా శరీరం design చేయబడలేదు! చూసావా ఎంత విచిత్రమో!”

“వినవోయ్ ఆహాహా పాదచారీ! నిన్ను నువ్వు ఎంత చక్కగా చెప్పుకుంటున్నావో? కానీ సత్యాన్ని ఎందుకు చెప్పవు భాయీ!” ఎగతాళిగా నవ్వి అన్నాడు సత్యమూర్తి

ఆశల స్కూటరుకి కొత్త రంగు ఉంది.

“నిజమే సత్యా! సత్యానిని చెప్పాలనే నాకోరికానూ… కానీ ఈ లోకం అనేక మందికి బందిఖానా లాంటిది. నాకు అలా అనిపించదు. ఎవరి గూళ్లల్లో ఎవరి శృంఖలాల్లో వాళ్లు దాగుంటారు. ప్రకృతి యిచ్చే రక్షణని పొందుపరచుకుంటారు. నేనో పాషాణాన్ని! నాకు రక్షణ ఎందుకూ? అందుకే నేనేమీ మాట్ల్లాడలేను.”

ఓ క్షణం పాదచారిని చూసి నిట్టూర్చి అన్నాడు సత్యమూర్తి “నీ జీవితం ఓ కల అయితే అది ఓ నిజమైన వర్తమానపు కల.”

“అంతే కాదు… భూతకాలమూ, భవిష్యత్తూ కూడ నింపుకున్న కల అయినా కల కలే నిజమేలా అవుతుంది సత్యా” ప్రశ్నించింది వేదనలత

శరదృతువులో వెన్నెలను మూసి వేసి మేఘాలు చిక్కటి చీకటిని చిమ్ముతూ అలముకున్నాయి.

చీకట్లో కళ్లు మరింత మూస్తూ తెరుస్తూ ముందుకు సాగాడు పాదచారి.

ఓ రాయి తగిలి రక్తం స్రవించిన భావం అతని హృదిలో కదలాడింది. పాదం వేదనతో వణికింది.

విశ్వాసం కుక్క రూక్షణంగా అరుస్తూ పాదచారి వెన్నంటి నడిచింది. తను ముందుకి పరుగెట్టి ఆప్యాయంగా అతని చేతిని మూద్దాడి “భయమెందుకు యజమానీ! బాధ ఎందుకు! నేను మాత్రం నిన్ను విడువనుగా! పద! ముందుకే పద! జీవితంలో ఎన్ని మజిలీలో! పద పద!

అన్నింటినీ ఉత్సాహంగా చూద్దాం అన్నట్లు హుషారుగా “భౌ భౌ” మని అరుస్తూ ముందుకు సాగింది.

పాదచారి కుంటుతూ తనలో తను నవ్వుతూ కంట నీరు కారుస్తూ ముందుకు పరుగు పెట్టాడు.

ముందుకు ముందుకు

మున్మున్ముందుకు

పరుగు తీస్తూ

ఉరకలు వేస్తూ

పరుగెత్తాలోయ్ జీవితమంతా!

ప్రవహించాలోయ్ కాలమునంతా!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here