Site icon Sanchika

పాదచారి-19

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 19వ భాగం. [/box]

[dropcap]సూ[/dropcap]ర్యుడు ఉదయిస్తూ తనని చూసే పుష్పకన్నెలకి కిరణాల చూపుల్తో కన్నుకొట్టాడు.

“ఊ…” మురిపంగా విసుక్కుని సిగ్గుతో ఆకుల మాటున ఒదిగాయి పుష్పకన్నెలు.

“ఆలాగా? చెప్తానుండండి…” అంటూ కిరణపు చూపుల్ని తీవ్రతరం చేశాడు సూర్యుడు.

“చూశావా పాదచారీ యీ సూర్యూడి అల్లరితనం మితిమీరుతోంది” గాలి పైట వేసుకుని తన కన్నె హొయల్ని మరింత దాస్తూ అంది చెట్టు తల్లి.

“నువ్వు దాచినా, నీ చిలిపి కన్నెలు సూర్యుడ్ని చూస్తూనే ఉన్నారు లేవమ్మా!…. అయినా కాబోయే భర్తని దొంగ చూపులు చూడకుండా ఎలా ఉంటారూ?” కలకలా నవ్వాడు పాదచారి.

“చీ… పో… సిగ్గు లేని మాటలు!” అన్నట్టు తెచ్చి పెట్టుకున్న కోపంతో ఒక్కసారి రివ్వున ఊగి, ముసి ముసి నవ్వులు నవ్వినట్టు ఆకులు గలగల మనిపించింది పూల తల్లి.

“ఇట్రా బిడ్డా!…. ఇవిగో … కాస్త ఫలహారం చెయ్యి!”… దయగా పళ్ళు రాల్చింది ఓ వృక్షమాత.

చెట్టుని కావలించుకుని “నువ్వు మా అమ్మవి కదూ! అందుకే రాయి విసిరినా కాయలిస్తావు… రాయి విసరకపోతే పళ్ళే రాలుస్తావు!” బెరడుని ముద్దు పెట్టుకున్నాడు పాదచారి.

“పిచ్చి బిడ్డా… ముందు కడుపు నింపుకో… ఎప్పుడు తిన్నావో ఏమో?…” జాలిగా కొమ్మల వీవన వీస్తూ అంది వృక్షమాత. కళ్ళ వెంట అశ్రువులు జారుతుండగా, పెదాలు ఒణుకుతుండగా, ఓ పండును అందుకున్నాడు పాదచారి.

“నేనూ రానా?” పరిగెత్తుకొచ్చింది వేదనలత.

“ఊహూ!… వొద్దన్నట్లుగా తలతిప్పుకున్నాడు పాదచారి. పాదచారి హృదయాన్ని అర్థం చేసుకుని విషాదంగా అస్తమించాడు సూర్యుడు.

***

“యీ ప్రకృతి నీ తల్లి ఒడి అని మాకు తెల్సు…. కానీ, పాదచారీ, నీ అన్వేషణ ఎక్కడికో అది మాత్రం తెలీదు! కాస్త చెప్పవూ?” ఎక్కడికో ఎగిరిపోతున్న మేఘాలు ఓ క్షణం ఆగి పాదచారితో అన్నాయి.

“నాకు తెలీదు” తల పైకెత్తి చూసి అన్నాడు పాదచారి

“ఇష్టం లేకపోతే చెప్పొద్దులే!”… చిన్నబుచ్చుకుని ముందుకి సాగుతున్నట్టు రెక్కలు విప్పుకున్నట్టు విచ్చుకున్నాయి మేఘాలు.

“ఇష్టం లేక కాదు నేస్తాల్లారా… నిజంగా నాకు తెలీదు!…” నిజం మొఖం మీద ప్రతిఫలిస్తున్నట్లుగా అన్నాడు పాదచారి.

“ఎందుకు తెలీదు?” అప్పుడే గుంపులో కలుస్తున్న బుల్లి మేఘం అడిగింది.

“మీ రూపాలు క్షణానికీ మారిపోవట్లా? అట్లాగే నా ఆలోచనలూ, మార్గాలూ, అంతెందుకూ, గమ్యాలే మారిపోతున్నాయి! ఓ క్షణం ‘ఇదే సర్వస్వం’ అనిపించి మైమరపించినా, మరో క్షణం ‘ఉహూ…. అది కాదు… పదపద’ అంటూ అదిలిస్తున్నది… ఏం చెప్పగలను మరి” వివరించాడు పాదచారి.

“That is called life!…. జీవితం అంటే అదే” విలాసంగా నవ్వుతూ పాదచారి వీపు తట్టాడు జీవన్ మూర్తి.

“అంటే?”

“నీ అన్వేషణ ఏమిటో తెలుసా పాదచారీ?”

“జీవితం అంటే ఏమిటో అని! అవునా?” చిద్విలాసంగా అన్నాడు జీవన్ మూర్తి.

“ఊహూ! కానేకాదు! నిన్నిటి దాకా గడిచింది జీవితం కాదూ? నేడు గడుస్తున్నది జీవితం కాదూ? నిన్నా ఇవ్వాళ ఎట్లా గడిచిందో రేపు అలానే గడుస్తుంది! అందుకే జీవితం అంటే ఏమిటంటే అన్వేషణ నాకు లేనే లేదు!

నేనే జీవితాన్ని…. నాలోని ప్రతి అణువూ, నేను జీవించిన ప్రతి క్షణమూ జీవితమే. మరి ఎందుకు నేను జీవితం కోసం వెదుకుతానూ?” జవాబిచ్చాడు పాదచారి.

“అంతేనా?” విహ్వలంగా అన్నాడు జీవన్ మూర్తి.

“అంతే! కానీ జీవన్ మూర్తీ, నేను నిన్ను హేళన పరుస్తున్నానని అనుకోకు! నీవంటే నాకు ప్రమే కానీ, ద్వేషం లేదు. కాని సత్యం కూడా అంతే… జీవితం అంటే ఏమిటో తెలిసినా, యీ జీవితం ఎక్కడి నించి పుట్టిందో, మళ్ళీ ఎక్కడికి వెడుతుందో తెలియదు. పుట్టుక, చావుల మధ్యనున్నదే జీవితం. ఆ పుట్టుకకు ముందు, ఆ చావు తరవాతా ఏమిటన్నదే నా అన్వేషణ కావచ్చు…”

“You are wasting your time my dear paadachariee, నీ సమయాన్ని వృథా పుచ్చుచున్నావు…. అది అర్థం లేని అన్వేషణ” కోపంగానూ, హేళనతోను అన్నాడు జీవన్ మూర్తి.

“అర్థం ఉంది, అర్థం లేదు, ఈ రెండు మాటలలోని అర్థం అనే పదం ఉందిగా, అంటే ఉందనుకోవటం, లేదనుకోవటం, ఇదే తేడాలన్న మాట. అర్థం ఏదో ఉదన్న వాడికి, ఆ అర్థం తెలియకనూ పోవచ్చు! అర్థం లేదు అనుకునే వాడికి ఆ అర్థం బోధపడనూ వచ్చు. ఒక విషయం ఉన్నదీ, లేదూ, అనుకోవటంలోనే ఉంది… ఉన్న చిక్కంతా. నేనేదో ఉందనే అనుకుంటున్నాను!…. లేకపోవనూ వచ్చు….ప్రయత్నంలో తప్పేమి ఉంది? అర్థం లేదనే అనుకుందాం… నా కొచ్చిన నష్టం ఏముంటుందీ” నవ్వాడు పాదచారి.

“నీ జీవితం నాశనం కావట్లా? waste కావట్లా?”

“ఎలా? నువ్వు చెప్పినట్లు అనుభవించటం నేర్చుకున్నా అది అంతం కాక తప్పదుగా? waste అయేదేముందీ?”

“నీ శరీరం… తద్వారా నీ కోర్కెలు!”

“నా శరీరం ఎలానూ మట్టి కాకాతప్పుదు!… ఇహ కోర్కెల సంగతంటావా? సామాన్యమైన కోరికలు క్షణభోగాన్నిచ్చేవే కానీ, అదంతా అన్వేషణకి పూనాది కాజాలవు…. అలాంటపుడు ఆ అల్పమైన కోరికల కోసం నేనెందుకు అనంతాన్ని మథించటం మానుకోవాలీ?” ప్రశ్నించాడు పాదచారి.

“అది అనంతం కనుక!… నువ్వు మథించలేవు కనక!…” జవాబిచ్చాడు జీవన్ మూర్తి.

“ఊహూ!… ఎక్కడికక్కడే అంతం, ఎక్కడికక్కడే అనంతం! నా జీవితంలోని అనుభవం కేవలం నాదేగా? అందుకే నా వరకూ ఆ మథించటం సత్యమే. చూడు, ఓ గురుడపక్షి ఎంతో ఎత్తుకి ఎగరగలదు. ఓ చిన్న పిచ్చుక కూడా అదే ఆకాశంలో ఎంతో కొంత ఎత్తుకు ఎగరగలదుగా? గరుడ పక్షి ఆకాశం పెద్దదనీ పిచ్చుక ఆకాశం చిన్నదనీ అనగలమా? ఆ ఆకాశపు రూపం రెండిటికీ ఒకటేగా?” జవాబుగా అన్నాడు పాదచారి.

“శభాష్… దీన్నే లాజిక్ అంటారు!…” హేళనగా అన్నాడు అపుడే వచ్చిన విప్లమూర్తి.

“పోనీ నిజం ఏమిటో నువ్వు” చెప్పు నవ్వాడు పాదచారి.

“తర్కం కాదు కావాల్సింది!… హేతువాదం!…” equalగా అన్నాడు విప్లవమూర్తి.

“హేతువూ అంటే కారణమేగా? కార్యం జరిగాక కారణాన్ని వెతుకుతానా? లేక కారణాన్ని ఆలోచించి కార్యం చేస్తానా? రెండూ ఒకదానిపై మరొకటి ఆధారపడ్డవేగా? మరి యీ కార్యకారణాల మూలం ఆలోచించటం మూర్ఖత్వమా?” సూటిగా అడిగాడు పాదచారి.

“Stop that logic” ఆవేశంగా అన్నడు విప్లవమూర్తి.

“అరుపులతో సత్యాన్ని గుర్తించలేవు విప్లవా… సత్యం తెలిసేది సంయమనంతో, సత్తర్కంతో! నువ్వు అరిచావు గనక నేను మౌనం వహించవచ్చు!…. దానికి అర్థం నువ్వు చెప్పేది వెంఠనే వొప్పేసుకున్నానని కాదు!…” చెప్పాడు పాదచారి.

“నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోనూ లేదు!… ఎందుకంటావా? నువ్వు మానసి బందీవి కనుక! దాని కులుకూ, చెళుకుల్తో నిన్ను ముంచేసింది గనక” యీసడించాడు విప్లవమూర్తి.

“ఊ!… అతడే నా బందీ అయి ఉంటే, నువ్వు మా ముందుకు వచ్చే వాడివే కాదు… ఓ మూర్ఖుడా…, ఆ పాదచారి నీకెంత అర్థమౌతాడో, నాకు అంతే… అతను నాకు బందీకాడు…నువ్వు నేనూ, ఇరుగో, యీ జీవన్ మూర్తీ, అందరూ అతని బందీలమే…” ఉక్రోషంగా అంది మానసి.

“Good… వెరీ గుడ్… అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట… దూరం నుంచే మీ మాటలు విన్నాను!… మీరందరూ ఇతనికి బందీలయినా, నేను మాత్రం కాదు!… ఎందుకంటే, నా పేరు వేదాంతాచార్యులు” గర్వంగా అన్నాడు వేదాంతి.

“ఊ… అతనెప్పుడో వెళ్ళిపోయాడు… మనం మనం మాత్రం కొట్టుకు ఛస్తున్నాం…. అడుగో ఆ వెధవ విశ్వాసం కుక్క ఒకటి….” దూరంగా అందర్నీ ఒదిలి వెళ్ళిపోతున్న పాదచారినీ విశ్వాసాన్నీ వేదాంతికీ, విప్లవమూర్తికీ, జీవన్ మూర్తికీ చూపిస్తూ అంది మానసి.

ఆమోమయంగా నిలబడ్డారు అందరూ!…

***

“నా మనస్సు జ్వలిస్తూనే ఉంది… నా హృదయం ఎందుకో తెలీకుండా స్పందిస్తూనే ఉంది. అనేకానేక ఊహలు ఆ మంటలో రాలిమాడిపోతూనే ఉన్నాయి. అవి మాడిపోతూనే ఆ జ్వాలని మరింత ప్రజ్వరిల్లింపజేస్తూనూ ఉన్నాయి!…. అమృతా, ఒక్కక్షణం నీ గుండెల్లో తలదాచుకోనీవూ!… ఒక్క క్షణం నీ మొత్తని రొమ్మల మధ్య నిశ్చింతగా నన్ను విశ్రాంతి తీసుకోనీవూ!”

మనస్సులోనే అమృతని ఊహించకుంటూ ఆర్తిగా అనుకున్నాడు పాదచారి బండరాయి పై కూర్చుని.

“పిచ్చీ! నేనిక్కడే ఉన్నాగా!… నన్ను గమనించకుండానే ఎలుగెత్తి పిలుస్తావెందుకూ?” లాలనగా జుట్టు నిమిరి అంది అమృత…

ఆ వేళ్ళల్లోంచి తలలోనికీ ఆపైన శరీరంలోనికీ అణువణువునా పాకిన ఓ వెచ్చని చల్లదనం. యుగయుగాలుగా పట్టిన గుణ ధూళిని వదలించుకున్న ఆత్మ స్వచ్ఛత లాంటి అమృతత్వం.

ఆమె రెండు పాదాలనీ గుండెలకు ఆర్తిగా అనించుకుని గట్టిగా హత్తుకున్నాడు పాదచారి.

“పిచ్చీ!… దా!!… నా వళ్ళోకి రా!! చూడు ఆకాశం ఎంత నీలంగా అందంగా ఉందో!!” మెల్లగా తల నిమురుతూ కళ్ళల్లో వెన్నెల కురుస్తుండగా అంది అమృత.

పైకి జరిగి ఆమె వళ్ళో తలపెట్టుకుని వెల్లకిలా పడుకున్నాడు పాదచారి.

ఓ రామచిలుక ఎగిరిపోతూ వారిద్దర్ని చూసి పలకరింపుగా హయ్ హాయ్ అన్నట్లుగా ‘కూయ్… కూయ్…’ అంటూ చక్కర్లు కొట్టి ఇక వెళ్ళొస్తామ మరి… అవతల పిల్లలు ఎదురుచూస్తుంటారు అన్నట్లుగా రెక్కలు టపటప లాడించి ఎగిరిపోయింది. ఓ లేత మబ్బు తెరలాగా ఊగుతూ చల్లగా నవ్వి సాగిపోయింది.

“నన్ను చూస్తే అందరికీ భయమే!… కానీ నేను జీవినే… నాకూ ప్రేమాభిమానాలు ఉన్నాయి… మీకు తెల్సుగా… బోలెడంత మంది పిల్లలు!… ఆహారం సంపాయించాలి!” కొండెలూ డెక్కలూ టకటక లాడించి కదులుతూ ముందుకు సాగిందో కొండతేలు. దాని నడకను గమనిస్తూ కొంచెం దూరం సాగనంపి వచ్చింది విశ్వాసం.

“ఇప్పుడు చెప్పు!… నా బంగారు కొండా, ఎందుకు నీకీ నిర్వేదం?” కనుబొమ్మల్ని సవరించి బుగ్గపుణికి ఓ సారి పొంగిపోయే ఉత్సాహంతో పాదచారిని గుండెలకు హత్తుకుని అడిగింది అమృత.

“ఏమో! ఇప్పుడుదేమీ లేనేలేదు. ఎంతో హాయిగా ఉంది!… ఎంతో శాంతిగా, తృప్తిగా ఇంకేమీ అక్కరలేనంత మధురంగా ఉంది…”

బల్లిలా ఆమె గుండెల్లో తలదాచుకుని అన్నాడు పాదచారి.

“ఎందుకుటా?” నవ్వింది అమృత.

“నువ్వునా పక్కనే ఉండగా, ఎక్కడో ఉన్నవనుకొని ఎలుగెత్తి పిల్చాను… ఆర్తిగా ఏడ్చానేమో కూడా అట్లాగే నాలోనే సర్వం దాచుకుని ఎక్కడో వెదుక్కుంటున్నాను కదూ!”

ఆమో వెచ్చని పొట్టకి బుగ్గ ఆన్చి ఆమె వంటి నించి వచ్చే పరిమళాన్ని హాయిగా ఆఘ్రాణిస్తూ అన్నాడు పాదచారి.

“నేనూ నీలోనే ఉన్నానా?” ప్రశ్నగానో కొంటెగానో అడిగి మధురంగా నవ్వింది అమృత.

“ఆ!… ఇప్పుడు తెలిసింది!… అమృతా నువ్వు నాలోనే ఉన్నావు!… నేను పురషుడ్ని అనే అహంభావమే నిన్ను నాకు కనపడకుండా చేసిందేమో! నువ్వు లేని నేను లేనే లేను!… నాలో నువ్వుండటం ఏమిటి? మనిద్దరం సగం సగం… నువ్వూ నేనూ, నేనూ నువ్వూ… ఊహూ… అసలు ఉన్నది నువ్వూ నేనూ కాని వేరొకటి… ఆ ఒకదాంట్లో మనిద్దరం… ఉన్నాం. ఊహూ… మనం ఒకటేగా ఉన్నాం…” ఆమె వెచ్చని చేతిని ముద్దాడి ముఖానికి భక్తితోనో, గౌరవంతోనో అదుముకుంటూ అన్నాడు పాదచారి.

మౌనంగా ఓ క్షణం నిట్టూర్చింది అమృత.

“అదేం?” ప్రశ్నించినట్లు కళ్ళెత్తి చూసాడు పాదచారి.

“ఏమీ లేదు!… మరో మజిలీ… మరో అన్వేషణ… మరో కలయిక ముందుంది పిచ్చీ…” ఇదమిత్థమని చెప్పలేని భావనలో ఓ తల్లి బిడ్డని కౌగిలించినట్లు అంది అమృత.

ఆబగా అతుక్కుని ఉండిపోయాడు పాదచారి. శరీరంలో వెయ్యేనుగుల బలం నింపుకుంటున్న భావన.

***

(సశేషం)

Exit mobile version