Site icon Sanchika

పాదచారి-20

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 20వ భాగం. [/box]

[dropcap]ఓ[/dropcap] కల ఇంకిన చోట మరో కల మొదలవుతుంది…

“ఇప్పుడేమంటావు పాదచారీ? కరిగి వెన్నలా ప్రవహించినదనుకున్న పాషాణం కరడుగట్టుకుపోయిందే? అది వరకు కనీసం లోపల్లోపలైనా కాస్త మొత్తదనం ఉండేదనుకున్నా! మానవలూ మానవలూ అంటూనే మహాపాషాణానివయ్యావు గదూ” చిద్విలాసంగా నవ్వింది మానసి.

మౌనంగా నడుస్తున్నాడు పాదచారి.

“నాకు తెలుసు! నువ్వు నోరు విప్పలేవు!… ఎందుకో తెలుసా? నిజం కఠినమైంది కాబట్టి!…” కవ్వించింది మానసి.

“ఏది నిజం? అసలా నిజానికున్న స్వరూపం ఏమిటి?” నిర్లిప్తంగా తనలో తను అనుకున్నట్టు అన్నాడు పాదచారి.

“తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని ముక్కలు చేస్తే వచ్చే భయంకరమైన బాధలాంటిదే నిజం కూడా. ఆ నిజం పక్కనే భయం కూడా ‘ధర్మాధర్మ వివక్షత’ ముసుగువేసుకుని నడుస్తూ ఉంటుంది…. కనుక పాదచారీ, నిజమే కాదు, భయం కూడా సత్యమైనవీ నిత్యమైనవీ… నువ్వు స్నేహ బాధని చూస్తూ కూడా మురిపిచటానికి ధైర్యం చెప్పావు. కానీ నువ్వు మాత్రం చలించలేదు… కనీసం అప్పుడైనా నీకు అర్థం కాలేదా… నీలో మానవత్వం ఇంకిపోయిందనీ?” తీవ్రంగా అంది మానసి.

“నువ్వు చెప్పే బాధ బాధే అవుతుంది.

Ex: కాలు విరిగి బాధతో ఏడ్చేవాడు స్వప్నంలో నడుస్తున్నట్లుగా కల కంటాడు. ఆ స్వప్నంలో యీ జాగృతిలోని బాధ ఉండదు. అంటే యీ బాధ జాగృతి కాదు.”

“కానీ సత్యం కాదు. సత్యం వేరు, నిజం వేరు. నిజం అనేదో అబద్ధం అనేదో వాచకాన్ని బట్టో, ఉపాధిని బట్టో, ప్రవర్తనని బట్టో ఉంటాయి. సత్యం అన్ని కాలాలకీ మారనిది. ఇహ ధర్మాధర్మ వివక్షత ‘భయం’ నుండి ఏర్పడినవే. ఆ భయం అనేది మాత్రం సత్యం కాదు. భయం వేరు సత్యం వేరు.”

“గుడ్… తర్కం బాగుంది. ఎలానో కొంచెం సెలవిస్తావా పాదచారీ? నువ్వు కప్పుకునే ముసుగు ఎంతందంగా ఉందో చూడాలనుంది” ఎగతాళిగా అంది మానసి.

“మానసీ, నువ్వు ఎగతాళి చేసినా ఏం చేసినా ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. జీవితంలో ఒకే ఒక్క సత్యం మృత్యువు. దానికి అనేక విధాలు. అనేకానేక స్వరూపాలు. కానీ తప్పనిదీ సర్వజనీకమైందీ అదొక్కటే. ఇక మిగతావన్నీ సందేహాస్పదాలే. చావు సత్యం…. పుట్టుటలో సత్యమే. ఇందులోనూ ఓ విచిత్రం ఉంది…. పుట్టిన వాడికి చావు సత్యాతి సత్యం. కానీ చచ్చిన వాడికి పుట్టుక అనేది సందేహాస్పదం” తనలో తాను అనుకుంటున్నట్లు అన్నాడు పాదచారి.

“శభాష్ పాదచారీ. నేను అడిగింది ఒక మాటైతే నువ్వు మాట్లాడేది మరొకటి. దీన్ని వాక్యం అనాలా, తర్కం అనాలా లేక పలాయన వాదం అనాలా? నేను అడిగింది నీ మానవత ముసుగు గురించి…. నువ్వు చప్పేది అనంత సత్యాల గురించి…. బాగుంది” ఎగతాళిగా చప్పట్లు చరిచింది మానసి.

“ఏ విషయం? నన్నడుగు. నేం చెపుతాను” గంభీరంగా అన్నడు విజ్ఞానాచార్యలు.

“ఓహో!… డిఫెన్సు లాయర్‌వా? ఇంతకీ తమరెక్కడి నించి ఊడిపడ్డట్టు?” వెక్కిరించింది మానసి.

“నీలాగే నేనూ ఊడిపడ్డాను. నీక్కావసిందిదేదో అడుగు… ఎగతాళి కాసేపు పక్కన పెట్టు” తీవ్రంగా అన్నాడు విజ్ఞానాచార్యులు.

“ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ కోసం వెదికాడే పెద్ద మనిషి. ఆ ప్రేమ కోసం అల్లల్లాడాడు, దేబిరించాడు. అన్వేషణా అంటూ ఆగమ్మకాకిలా తిరిగాడు. ఆ ప్రేమ ఎదురైనప్పుడు, నువ్వు తప్ప నాకింకేమీ ఒద్దు అన్నప్పుడు, నీకోసం నా సర్వస్వాన్ని ధార పోస్తానని సాష్టాంగపడ్డప్పుడు పాషాణమైపోయి పక్కదారి పట్టాడు… ఏవిటయా అంటే నిత్య సత్యమైంది మృత్యువంటూ పలాయిన తర్కాన్ని వల్లిస్తున్నాడు… ఇప్పుడు చెప్పు…. ఏం చెపుతావో” నిలదీసింది మానసి…

“ఏం పాదచారీ… ఆవిడ చెప్పేది నిజమేనా?” ఆశ్చర్యంగా అన్నాడు విజ్ఞానాచార్యులు.

పకపకా నవ్వాడు పాదచారి. ఆ నవ్వు నవ్వులా లేదు. కుబుసం విడుస్తున్న పాము వేదనలాగా, గర్భవిచ్చిత్తి అయిన పడతి రోదనలాగా, ఒడ్డున పడ్డ చేపగిలగిలా తన్నుకుంటూ మెప్పుతో ఘోషించే మృత్యునాదం లాగా, హాలాహలాన్ని మింగిన శివుని కంఠంలో భగ్గుమన్న ఓంకారం లాగా, నేల రాలుతున్న ఉల్కలో క్షీణించే కాంతి లాగా, ఊబిలో కూరుకుపోతున్న మానవుడి ముక్కు నుంచి వెలువడే చివరి నిశ్వాసంలాగా, చచ్చిపోతున్నతల్లి, చివరి సారిగా బిడ్డను తాకటానికి చేసే విశ్వప్రయత్నపు వైఫల్యంలాగా ఉంది.

“అతన్ని వేధించకండి!… మీకు పుణ్యం ఉంటుంది… అవసరమైతే మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను… నా పాదచారిని వేధించకండి…” సుడిగాలిలా పరిగెత్తు కొచ్చి అరుస్తూ, పాదచారిని వాటేసుకోబోయింది వేదనలత.

“భౌ” మంటూ భీకరంగా గర్జించింది విశ్వాసం.

విశ్వాసం కళ్ళు రూక్షణంగా మెరిశాయి. ఠక్కున ఆగిపోయింది వేదనలత. నిశ్చేష్టులై నిలిచారు మానసీ, విజ్ఞనాచార్యులూ.

విశ్వాసం తల నిమిరాడు పాదచారి.

“మీకందరికీ సమాధానం చెప్పాలి మానసీ… నిజంగా చెప్పాలి. వేదనలతా, నువ్వూ సమయానికే వచ్చావు. కొంచెం ఎడంగా రా… నాతోనే ప్రయాణించు. కానీ కొంచెం దూరంగా… ఈ విశ్వాసం నిన్ను రానివ్వదు. ఇదీ ఓ భాగమేగా కానీ నువ్వు నా నీడవే…” నడుస్తునే అన్నాడు పాదచారి. మౌనంగా అందరూ అనుసరించారు.

“ఇటురా బిడ్డా… నేను ఎండి మోడునైపోయాను… ఏవో చిగుర్లు మళ్ళీ వచ్చాయి! కానీ నీ ఊహాల్లానే అవీ మాడిపోయాయి! అయినా నేను చావలేదు. నా వేళ్ళల్లో ఇంకా కొంత జీవం మిగిలే ఉంది! ఎప్పుడో తప్పక మళ్ళీ పుంజుకుంటాను! ఆనాడు మళ్ళీ నీకు పచ్చని నీడ పరుస్తాను!! ఇప్పుడు నా దగ్గర నీడ లేకపోవచ్చు!!! కానీ, నువు నా వాడివన్న ప్రేమ ఉంది!!! రా!…. రా నేస్తమా రా… నీ ఎండిపోయిన నీ నేస్తపు కాండానికే నీ వీపు ఆనుచుకుని విశ్రాంతి తీసుకో!… కూర్చొని నీ కథ నీ వాళ్ళకి చెప్పు…” అంటూ ఎండిన కొమ్మల్ని ఊపుతూ పిలిచింది బూరుగు చెట్టు.

గబగబా పరుగెత్తి ఆ వృక్ష మాతని కౌగలించుకున్నాడు పాదచారి.

ఎండి పగిలిన బీడులా ఎండి పగలిన తన బెరడు అతని చెంపకు గుచ్చుకొకుండా జాగ్రత్తపడింది వృక్షమాత. కాసేపు అలానే ఆ చెట్టుని కౌగలించుకుని మెల్లగా తల్లి వొడిలోకి జారినట్టు ఆ వృక్షపు మొదట్లో కూలబడ్డాడు పాదచారి. మండుటెండలో అతని పాదాల దగ్గర వొగరుస్తూ కూలబడింది విశ్వాసం.

గాలి లేక స్తంబించిన కొమ్మల్లా చుట్టూ నిలబడ్డారు మనస్వీ, వేదలనలతా, విజ్ఞానాచార్యులూ.

“సరే!… చెప్తాను…నా నేస్తాల్లారా… చెప్తాను. ప్రేమ నన్ను ప్రేమించింది. ప్రేమ నన్ను నీడలా అనుసరించింది. అంతెందుకూ తనది అనే ధ్యాస లేక సర్వస్వాన్నీ నా పాదల ముందు పోగుపోసింది. కానీ..” మౌనం వహించాడు పాదచారి.

“కానీ, ఆ ప్రేమను గుండెకు హత్తుకునే ధైర్యం నీకు లేదు. ఆ ప్రేమకి ఆసరాగా నిలబడే మానవత్వం నీకు లేదు. ధర్మాధర్మ వివక్షతా, లోకన్యాయపు కఠోరలూ అంటూ దాని ఖర్మానికి దాన్ని ఒదిలి మహా వీరుళ్ళాగా నీ ప్రయాణం నువ్వు మొదలెట్టావు! అంతేనా?” అగ్నిలాగా చెలరేగుతూ అన్నాడు విప్లమూర్తి.

“శభాష్!… ఇన్నాళ్ళకి నువ్వు నచ్చావు” మెచ్చుకోలుగా అంది మానసి… విప్లవమూర్తి వంక చూసి.

“ఆగాడు… నేను వస్తున్నా…” పరిగెత్తకుంటూ వచ్చాడు జీవనమూర్తి.

“స్వప్నమూర్తేడీ?” enquire చేసింది మానసి.

“వాడికిక్కడ పనిలేదు…” జవాబిచ్చాడు జీవనమూర్తి.

“మరి సత్యారావూ?”

“నేను లేకుండా ఎలా?” నవ్వుతూ వచ్చాడు సత్యారావు.

అందర్నీ ఓ సారి చూశాడు పాదచారి.

“మీరందరూ గొప్పవాళ్ళే. మీరందరూ నా ప్రాణస్నేహితులే. కానీ నేస్తాల్లారా, మీకు ఒకటి తెలీదు. మీరెవ్వరూ చూడని మరో జీవి ఉంది. అది మనతోనే వస్తోంది. మీరు చూడలేరు. కానీ నేను చూశాను. అది మాట్లాడదు. అది వినదు. అది చూడదు. కానీ గుడ్డిది కదు. సరే… అదంతా ఎందుకూ? మీకు సమాధానం కావాలి అంతేగా?” ప్రశ్నించాడు పాదచారి. కానీ ఆ ప్రశ్నలో ఉద్విగ్నత లేదు.

“అవును. మాకు సమాధానం కావాలి. నువ్వు చెప్పితీరాలి.” ముక్తకంఠంతో అన్నారు అంతా.

“ఆ ప్రేమను నేను గుండెకి హత్తుకోవటమే కాదు. గుండెల్లో దాచుకున్నాను.” నిర్లిప్తంగా అన్నాడు పాదచారి.

“అబద్ధం” అరిచింది మానసి.

“కానీ అది నిజం ఆ ప్రేమ వేరు నేను వేరు కాదు. మాకు ఉన్నది ఒకే ఉచ్ఛ్వాసం… ఒకే నిశ్వాసం… వేరువేరుగా కనపడుతున్నాం. జీవంలేని భావమూ, భావం లేని జీవమూ లేనట్లే. తనూ నేను వేరుకాదు. నేను కనిపిస్తాను. కానీ నాలోని తను కనిపించదు. ఏడ్చే నోరు నాదైతే ఏడుపు తనది. చూసే కళ్ళు నావైతే కళ్ళలోని చూపు తనది. చెవులు నావైతే శబ్దం తను. శరీరం నేనైదే స్పర్శ తను” నిట్టూరుస్తూ అన్నాడు పాదచారి.

“వాహ్‌వా!… చాలా గొప్పగా సెలవిచ్చావ్” ఎగతాళిగానే గర్జించాడు విప్లవమూర్తి.

“కంటి ఎదురుగా ఉన్న తనని పక్కన పారేసి నడుస్తూ, తనే నా ప్రాణం అనగలుగుతున్న పచ్చి రాస్కెల్‌వి నువ్వు.” ఘీంకరించాడు విప్లవమూర్తి.

“కానీ అది నిజం. విప్లవమూర్తీ, నా శరీరాన్ని మర్చిపోకు. ఆది మట్టి లాంటిదే. కానీ నేను మట్టిని కాను. ఆ మట్టిని తొడుక్కున్నాను. అది వర్షానికి కరుగుతుంది. ఎండకి బీటలు వారుతుంది.”

“ఏ వర్షంట?” తనూ పరవసించింది మానసి.

“ప్రేమ వర్షం. ప్రేమ వర్షానికి తడుస్తుంది. చిగురిస్తుంది కూడా. కానీ, లోకన్యాయమనే ఎండకి బీటలు వారుతుంది. ఆ బీటల్లోంచి బయటకుపోయేదేమిటో తెలుసా ఆవిరైన రక్తం భూమి పగిల్తే వేడి బయటకిపోయినట్టు నాలో నేను పరిగెత్తే రక్తం ఆవిరై వేదనగా వెలువడుతుంది.”

“Too సెంటిమెంటల్. నేను బాగానే ఉన్నాను. నువ్వనే రక్తం మాత్రం నాకు అంటలేదు. కానీ నిన్ను కౌగలించుకోవాలనీ, ఓదార్చాలనీ మాత్రం ఉంది. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నాకనవసరం. నువ్వు నా వాడివి అని అనుకుంటున్నా గనుక నిన్ను సేదతీర్చటకు నా లక్ష్యం” వివరించింది వేదనలత.

చటుక్కున తలతిప్పి వేదనలత వంక చూసింది విశ్వాసం.

“నీ దృష్టిలో నాలో ఉన్నది ప్రేమ కాదు…. వేదన! అవునా? వేదనలతా? నా దృష్టిలో అది ప్రేమ. అయితే ప్రేమ అనంతం కాదు. అదీ ఒక గతం మాత్రమే. కొంత విశిష్టమైంది కావొచ్చు. సుగంధం కావొచ్చు. కానీ అదీ ఓ సుగంధమే. ఇగిరి పోనిదీ కరిగిపోనిదీ కాదు…”

“అంటే? ప్రేమ భగవంతుడనే సత్యాన్ని కూడా విమర్శించే దౌర్భాగ్యుడవయ్యావన్నమాట” కోపంగా అంది మానసి.

“ప్రేమ దైవం ఎలా అవుతుంది? అసలు దైవానితో ప్రేమతో నిర్వచనం ఏమిటీ? క్షమేగా? ఆ క్షమ ద్వారానేగా ఒకసారి దైవం అనో మరోసారి ప్రేమ అనో మీరు నిర్వచించేదీ?”

“గుడ్. రెండిటికి నిర్వచనం చెప్పలేక మూడోదాన్ని లాక్కొచ్చావు. దిసీజ్ షియర్ లాజిక్” ముక్కు పుటాలు ఎగరేశాడు విప్లవ మూర్తి. అవునన్నట్టు తల పంకించింది మానసి.

(సశేషం)

Exit mobile version