[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]
5
[dropcap]“నీ[/dropcap]కు నువ్వే మిత్రుడివి. నీకు నువ్వే శత్రువ్వి.”
మనసు వాడు నవ్వి “ఎలా?” అన్నాడు.
“అదుగో, వాళ్లందర్నీ తన్నాలనుకున్నావు. ఎలా తన్నాలని నిద్రపోలేక పోయావు. వాళ్లు హాయిగానే ఉన్నారుగా? హాయిగానే పడుకున్నారుగా?”
“సరే మిత్రుణ్ని. ఎలా?”
“వాళ్లకే మరుసటి రోజు నాతో గుడ్ మార్నింగ్ చెప్పించావు. వాళ్లు కొంత సందేహించినా తరువాత reply ఇచ్చారు. వాళ్లల్లో వాళ్ళే వాళ్లని మార్చుకుని నిన్ను ప్రేమించారు. నిన్నంటే నిన్ను కాదు, నాలో దాచుకున్న నన్ను!”
“ఓకే పాదచారీ! ఇది నేను నీతో చేయించిన పని! కాదంటావా?”
“మనసు వాడా! నువ్వే చేయించాననుకోకు! నీ పైన ఇంకోటి ఉంది.”
మనసు కొంచెం చిన్న బుచ్చుకుని “సర్లే” అంటూ ఊరుకుంది.
పాదచారి గట్టిగా ఊపిరి పీల్చివదిలాడు.
సీసపు చెట్టు చల్లదనం ఆ యెండలో హాయిగా ఉంది. లేచి చెట్టును కౌగలించుకున్నాడు.
“ఓ సీసపు వృక్షమా! నువ్వే నాకిపుడు తోడువి. నీ నీడలో నేనున్నాను. నన్ను ప్రేమించవూ?” బెరడు నిమురుతూ అన్నాడు.
గలగల ఆకులు శబ్దం చేశాయి.
“ఓ పాదచారీ! నువ్వు మా మనిషివి! నీ మాటలు మాకు తెలుస్తున్నాయి. మా భాష నీకు అర్థమవుతోందిగా?”
సీసపు చెట్టు మీదుగా పాకుతున్న చీమలు కొంచెం ఆగి అతని చేతుల మీదుగా రాస్తా చేసుకు మూందుకి సాగాయి. అవి తనను అర్థం చేసుకుని కుట్టకుండా ముందుకి సాగినందుకు ఆనందించాడు పాదచారి.
“ఇక్కడేం చేస్తున్నావు?” ఆశల స్కూటరు ఆపి ప్రశ్నించాడు స్వప్న మూర్తి.
“ఓహో నువ్వా? రా! రా! ఇటు చూడు. నన్ను కుట్టకుండా చీమ రాజులు ఎలా సాగిపోతున్నారో?” పాదచారి నవ్వుతూ తలకాయ మాత్రం తిప్పి అన్నాడు.
“మిత్రమా! ఎన్నళ్లకెన్నాళ్ల కోయీ నువ్వు కనిపించింది?”
“ఇలారా! ఒక్కసారి నిన్ను కౌగలించుకోని!”
“మరి చీమలబారులు ఆగిపోతాయి!”
“పోతే పోని!”
“సరే!”
మెల్లగా ఒడుపుగా చీమల బారి నుంచి చేతులు తీసి ప్రేమగా సీసపు చెట్టు నోసారి తట్టి స్వప్న మూర్తిని కౌగలించుకున్నాడు. ఇద్దరూ వృక్షానికి చేరబడ్డారు.
“చెప్పు” అన్నాడు పాదచారి.
“చేప్పేదేముంది? తన దారి తాను చూసుకుంది” విచారంగా అన్నాడు స్వప్నమూర్తి.
“ఎవ్వరూ?”
“ఆమే”
“ఆమె ఎవరనే అడిగేది?”
“అలా అడిగితే నాకేం తెలుసు?”
“నీకు తెలియని తన ఊరూ పేరూ నాకేం తెలుస్తాయి.”
“తను స్త్రీ. స్వప్న మూర్తి అనబడే నన్ను ఒదిలి… తన దారి తాను చూచుకున్న స్త్రీ! అంతే నాకు తెలుసు!”
పక పకా నవ్వాడు పాదచారి.
“సరే! తన దారి తాను చూసుకోవడం అంటే?”
“నన్ను మర్చిపోయిందని కాదు”
“మరి!”
“నన్ను విడిచి వెళ్లిందని కాదు.”
“మరి”
“నాలో ఐక్యం కాలేదు”
“అంటే”
“హూ” నిట్టూర్చాడు స్వప్న మూర్తి
“ఓహో” అనుకున్నాడు పాదచారి.
మాటా పలుకూ లేక ఆశల స్కూటరెక్కి అర్జంటుగా వెళ్లి పోయాడు స్వప్న మూర్తి.
పాదచారికి విసుగేసింది. సీసపు చెట్టు చుట్టు తన చేతుల మాల వేశాడు.
కిసుక్కున కుట్టిందో చీమ.
చెయ్యి ఛర్రున వెనక్కు లాక్కుని చీమని దులిపి “ఎందుకు కుట్టావు?” అనుకున్నాడు. పాదచారి.
“నువు మళ్ళీ మానవుల్లో పడ్డావు. ప్రకృతి ఒడిలోంచి విడివడ్డావు!” అన్నట్లు వంకరటింకరగా నడిచాయి చీమలు.
“అవునేమో!” అంటూ గలగల్లాడాయి ఆకులు.
“నేను నేనే!” అనుకుంటూ ముందుకు నడిచాడు పాదచారి.
ఎక్కడ్నించో ‘కుఁయ్’ ‘కుఁయ్’ మంటూ బుల్లి కుక్క పిల్ల ఓటి వెంటబడింది.
“నువ్వు నాతో నడవలేవు” అన్నాడు పాదచారి.
“నడుస్తా! నడుస్తా!” అన్నట్లు తోకాడించింది కుక్కపిల్ల.
“సరే పద!” అన్నట్లు యీల వేస్తూ ముందుకు సాగాడు పాదచారి.
“ఆవ్! ఆవ్!” అంటూ అరుస్తూ ఎగిరి దారి చూపిందో కాకి.
పేడ పురుగు ఒకటి పెద్ద మట్టి ముద్దని దొర్లిస్తూ కనిపించింది పాదచారికి.
కాసేపు ఆగి దాని శక్తి సామర్ధ్యాలు చూశాడు. కుక్కపిల్ల ఆగి, పాదచారి పాదాలు నాకింది.
ఓ రేగి చెట్టు గాలికి ఊగి “ఇదిగోనోయ్ మానవుడా! ఇవి నా తయారీ! తిను!” అన్నట్లు పళ్లును రాల్చింది. పళ్ళేరుకుని జేబులో వేసుకుని ముందుకు నడిచాడు.
“ఇదుగో! ఇక్కడే నీ బస!” అంటూ ఊడల్ని ఊగించింది మఱ్ఱి చెట్టు. ఊడల్ని గుండెలకానించుకుని కాసేపు నిలబడి, మెల్లగా నడిచి, చెట్టు మొదట్లో కూలబడ్డాడు పాదచారి.
మౌనంగా, ఒబీడియంట్‌గా పక్కన జేరి పాదాల దగ్గరగా ముడుచుకుని తోకడిస్తూ పడుకుంది కుక్కపిల్ల!
మళ్ళీ నక్షత్రాలు! ఆకుల సందుల్లోంచి మినుక మినుకుమంటూ!
మళ్లీ చంద్రుడు! ఇంకొంచెం పెరిగి!
పాదాలు నాకింది కుక్క పిల్ల!
“నువ్వెవరూ? నేనెవరూ? నా దగ్గర కెందుకొచ్చావు?” ప్రశ్నించాడు పాదచారి.
‘కుఁయ్ కుఁయ్!’ మంది కుక్కపిల్ల.
నిమురుతూ నిమురుతూ నిద్రపోయాడు.
నిద్రలో కథల్లాంటి కలలు!
ఊహల పల్లకీలు!
ఆశల రథాలు!
ఆచరణలో అవరోధాలు!
6
“నా జీవితం నాకే ఓ కలలాగ అనిపిస్తోంది.”
“ఇంకా”
“నేను శరీరంలో లేను. మరెక్కడో ఉండి ప్రపంచాన్ని నన్నూ కూడా చూసుకుంటున్నట్లు గానూ, గమనిస్తున్నట్లుగానూ కూడా ఉంది.”
“ఇంకా.. ఇంకా?”
“ఓ ఇంకా ఇంకా అనే వాడా! నువ్వూ నీ ప్రపంచం కూడా పిచ్చిది అనిపిస్తోంది.”
సత్యమూర్తి ఆ మాటకి గట్టిగా నవ్వాడు.
“సరేనోయ్! పాదచారి! నేనూ నా ఊహలూ ప్రపంచమూ అన్నీ అబధ్ధమే! అంతా పిచ్చివాళ్లమే. మరి ఆమె?”
పాదచారి మెల్లగా బుగ్గ మీద వేలితో కాసేపు గోక్కున్నాడు. కాసేపు ఆకాశాన్ని చూశాడు. ఎక్కడో ఏదో వెతుక్కున్నాడు.
“మాట్లాడవేమి? ఆమె కూడ ప్రపంచంలో భాగమే కదా?”
“అవునవును, నిజమే నిజమే! ఆమె ఆమే!”
“అంటే పిచ్చిదనా? కాదనా? అబద్ధమనా? నిజమనా?”
“తను నిజమే”
పాదచారి తన్ని తాను చూసుకుంటూ మళ్ళీ అన్నాడు “ఆమె ఒకటే నిజం! నేనూ అబద్ధాన్నే!”
సత్యమూర్తి నవ్వి అన్నాడు -“నువ్వు అబద్ధానివని నీకెలా తెలుసు?”
“నేను తన నీడనే! నాకు నేనైన Existence లేదుగా?”
“తను ఆమాటే అనగలదా?”
“అసలు నేను అనే నేను తనకి తెలిస్తేగా?”
“నీ వనే నీ వంటే?”
“ఇందాకా చెప్పాను చూడు! నేను శరీరంలో లేకుండా ఎక్కడ్నించో చూస్తూ చేస్తూ ఉంటున్నానని?”
“పోనీ తనైనా తను నీకు తలుసా?”
“ఆహా!”
“ఎలా?”
“ఏమో మరి! ఆమె పాదాలో, వేళ్ళో, గోటి అంచు దీర్ఘ శిరోజపు వంపులో తాకితే తనైన తాను నాకు తెలిసినట్లే ఉంటుంది!”
“Sheer nonsense!”
“May be!”
“మరెందుకలా మాట్లాడుతావు?”
“నువ్వడిగావు గనుక!”
“సరేనోయ్, నీకు ఆమె ఉన్నట్లుగా ప్రతి మగవాడికీ ఓ స్త్రీ ఉండి, ఆమెలో అతడు తననూ, సర్వాన్నీ చూడవచ్చుగా?”
“చూడవచ్చును!”
“అలాగే ప్రతి స్త్రీ కూడా తన పురుషునిలో తన Existence ను మరచి సర్వాన్నీ చూడవచ్చుగా?”
“By all means!”
“అపుడు ప్రపంచం పిచ్చిదీ, అబద్ధపుదీ ఎలా అవుతుందీ?”
“నిజమే”
“మరి నువ్వు నేనూ నా మిగతా ప్రపంచమూ అబద్ధం అని ఎలా అనగలిగావూ?”
“పిచ్చిది గనక!”
“ఎలా? ఎలా? ”
“ప్రతీ స్త్రీ కీ, ప్రతి పురుషుడికీ తన Existenceలో లేని తాను ప్రేమించిన వారిలో ఎలా సర్వమూ కన్పడుతుందో మిగతాదంతా ప్రతి వారి విషయమంలోనూ అబద్ధమూ, అసత్యమూ, అసందర్భమూ కదా?”
సత్యమూర్తి నవ్వి అన్నాడు “ఇక్కడ లాజిక్ కాదు కావాల్సింది. తర్కం అనేది రెండు వైపులా పదునైనకత్తి.. ఇక్కడ కావల్సింది నిజం! సత్యం!”
పాదచారికి కొంచెం కోపం వచ్చింది.
ఈ సత్యం తనని ఎందుకు వెంటాడుతున్నట్లు?
గభాల్న లేచి చరచరా ముందుకు సాగాడు.
వెనకనించి సత్యమూర్తి నవ్వుగలగలా వినిపించింది.
***
“అక్కడెక్కడో కొండల్లో, కోనల్లో లోయల్లో, అడవి సువాసనలో, జలపాతంలో మెరుస్తూ క్రిందికి దూకే వెన్నెల్లో, రాత్రి వేళ నిశ్శబ్దంగా నిటూర్పులు విడిచీ పాషాణాల్లో, ఎగిరే పక్షి రెక్కల అంచుల్లో, మధ్యాహ్నపుటెండలో పచ్చని చెట్ల క్రింద విశ్రమిస్తూ మత్తుగా నెమరువేస్తున్న గోమాతల అరమోడ్చిన కన్నుల్లో, అంతెందుకూ సాగర గర్భంలో ఆకాశపు నిర్వికారంలో అన్ని చోట్లా నా ఆశలున్నాయి! అన్ని చోట్లా నా నిశ్వాసపు జాడలున్నాయి!”
“పాదచారీ! మరీ ఊహల్లోకి జారిపోతున్నావు సుమీ!”
“అవేమీ ఊహలు కావు. మనస్సులో, మనస్సుతో అనుభవించిన అనుభూతులు!”
“నువ్వు ఎస్కేపిస్టువి!”
“ఎలాగోయ్ వెఱ్ఱివాడా?”
“కళ్లెదురుగా జరిగేవి చూడకుండా, కళ్లెదురుగా జరిగే ఘోరాల్ని ఆపకుండా, కళ్లు మూసుకుని కలలుగనేవాడు ఎస్కేపిష్టు కాక ఏమవుతాడు?”
“నీకళ్లకు కనపడేది దౌర్భాగ్యం! నాకంటికి రుచించేది సౌందర్యం! అది పలాయనమెలాగ అవుతుంది?”
“హుఁ ఎందుకు నీ జీవేశ్వర సిద్ధాంతాలూ? మరెందుకు నీ భావ కవితా సంపుటాలూ? బాధ! బాధోయ్ పాదచారీ! బాధే నిజమైనది. ఆక్రోశం ఉక్రోషం, ఉద్రేకం, కన్నీళ్లు ఇవి సామాన్యుని కడగండ్లు. ఎందుకు నీ వెన్నెల? చూడు! విస్తళ్ల కోసం casual గా ఎగబడే కుక్కల్ని, మనుషుల్ని చూడు. ఎందుకు నీ కొండ కోనలు? చూడు. వంటిని విస్తరిలా పరిచేసిన పసి కన్నెల్ని చూడు. ఆ నిర్భాగ్యపు పడుపుగత్తెల్ని చూడు. ఎందుకు నీ ఆకాశపు అంచులూ, భ్రమరనాదాలూ, కోయిలగీతాలూ. చూడు పాలు లేక ఏడుస్తున్న పసి బిడ్డల్ని చూడు. పాలు కొని పట్టలేని ఖర్మకి ఏడుస్తున్న తల్లి రోదన చూడు. ఫ్యాక్టరీ సైరన్లలా నడుస్తూ ఏడుస్తూ ఏడుపులో నవ్వుతూ నశించి బ్రతుకుతున్న వాళ్ళందర్నీ చూడు. ఇన్నీ చూడక భావంలో రమించే నువ్వు పలాయానవాదివి కావా పాదచారీ” అడిగాడు విప్లవమూర్తి.
“అవన్నీ అవన్నీ నిజమే విప్లవమూర్తీ. అవన్నీ నిజమే. ఇంకా ఇంతకన్నీ ఘోరాలూ ఉన్నాయి. అవన్నీ చూశాను. బిచ్చగత్తె తన వేళ్ళతో తన బిడ్డ కళ్ళు పొడిచి ‘ఇక నా బిడ్డ మహారాజులా బ్రతగ్గలడు’ అని అన్న దౌర్భాగ్యపు మాటలూ విన్నాను. కన్న కూతుర్ని ఇతరులకి అమ్మి కల్లు తాగి బతికిన తండ్రుల్ని చూశాను. పెళ్లాన్ని పది మందికి తార్చి పదవి పెంచుకున్న వెధవల్నీ చూశాను. అభ్యుదయపు మాటల్ని వెదజల్లుతూ అంతరాంతరాల్లో చాదస్తాల్ని నింపుకున్న చవటల్ని చూశాను. వ్యభిచారం చేస్తూ అనాథ బిడ్డకి తల్లీ తండ్రీ తానే అయి పెంచి పెద్ద చేసి ఆ బిడ్డని సింహాసన మెక్కిస్తే ఆ బిడ్డే ఆ దేవతని అసహ్యించుకున్నపు డామె కళ్లల్లో జాలువారిన గంగలోనూ తడిశాను. విప్లవమూర్తీ! నువ్వొక రాస్కెల్‌వి. ఎందుకు? ఎందుకు ప్రజల మనస్సుల్లో దాగి విప్లవాన్ని రేపుతావు? ఏం ప్రయోజనముందని? ఎవర్ని మార్చగలవు? ఎవర్ని ఏం చెయ్యగలవు? లోకం గతి మారుద్దామనా! కుమ్మరి తయారు చేసిన కుండలు కాదు సృష్టి. విభిన్న బావాలూ విభిన్న ప్రకంపనలూ కలిగిన ప్రపంచం ఇది. నీ ఊహలు బలవంతంగా రుద్ది మార్పు తెమ్మంటావు! అవునా? నువు తెచ్చే ఆ మార్పు కూడా నీతోనే సరి! ఇంకొకడెవరో వస్తాడు. మళ్ళీ మరో మార్పు మొదలవుతుంది.
సమాధాన మివ్వలేదన్నంత మాత్రాన పలాయన వాదిని కాదు. నాకు తెలిసిన దొకటే ఎవరిదారి వాడిది ఎవరి ఆకలి వారిది. విప్లవమూర్తీ! నీ తేజమూ, నీ ధైర్యమూ గొప్పవే, అమాయకుల్ని లేపకు! వాళ్లు ఉత్తేజంతో ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. శాంతిని ఆశ్రయించు, కలిసి ఇద్దరూ ఏం చేసినా చెయ్యండి. కానీ ఒకటి నీ రక్తం నీ వద్ద దాచుకుని ఇతర్లని రక్తం ధారపొయ్యమనకు. నేనూ కొన్నాళ్లు నీ తోడుగా నడిచాను. కాల ప్రవాహం పొరలుతున్న కొద్దీ మబ్బులు వీడి కొంత ప్రశాంతి కనబడుతోంది. నీవుండగా నీకీ సృష్టిలో కనబడింది అన్యాయం. నిన్ను వదిలాక కనబడేవి అనేకం! పలాయనవాదినంటావా! సరే! సరే!
శాంతి నుండి పలాయనం నీది!
విప్లవం నుండి పలాయనం నాది” పకపకా నవ్వుతూ అన్నాడు పాదచారి.
(సశేషం)