Site icon Sanchika

పాదచారి-4

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. [/box]

అమృత

[dropcap]“అ[/dropcap]డవిలోని పూలవోలె

ఆకసాన పక్షివోలె

విరిసి, ఎగసి ఏనాడో

అలిసి నేలరాలిపోదు”

“అమృతా! ఏదీ మరోసారి పలుకు నీ మాటలు! ఆత్మా! ఏదీ మరో సారి వినిపించు నీ గొంతు! నీ ఎదుట తలపగల గొట్టుకున్నాను. నీ పాదాల దగ్గర నా జీవితాన్ని బాటగా పరిచాను. నేననే అహంభావాన్ని వదిలి నీ కోసం నేనుగా నిలిచాను. సరేనోయీ!… సరే! ఆఖరికి విరిసింది అమృతం. అది తాగాక అనంతం నాదయింది. అనంతం నేనయ్యాను. ఈనాడు నాకు నేను ఉన్నానన్న స్పృహే లేదు ఊహుఁ.”

మళ్లీ ఓసారి చూడనీ సరిగ్గా!

జీవితపు మనసక తెరల్ని ఓసారి విడదియ్యనీ!

నీవూ…

నేనూ…

ఏవీ అప్పటి క్షణాల్ని మళ్లీ ఓసారి

బ్రతికియ్యనీ!

పాదచారి నడుస్తూ ఓ సరోవరం దగ్గర కలువల్ని చూస్తూ అనుకున్నాడు.

మెహమూ… ముద్దులూ

శరీరమూ… సువాసనా

తమకమూ… తాదాత్మ్యమూ

అన్నీ ఓసారి అతన్ని గాలిలా స్పృశించి వెళ్లాయి.

“అయినా గడచిన గోతుల్లో ఏముంది?” నిర్లిప్తంగా నవ్వాడు పాదచారి.

కుక్కపిల్ల పాదాలు నాకింది.

“ఊహూఁ. నువ్వు ఉన్నావన్నమాట నాతోనే…! సరే ఉండు!” మెల్లగా దాని ముఖం నిమిరాడు.

“ఇక్కడ నించి ఇంకెక్కడికి?” అనుకున్నాడు పాదచారి.

“నాతో రా! నాతో రా! ” నవ్వుతూ నిలిచింది వేదనలత.

“నువ్వూ వచ్చావా? నాతో ఇంకా ఏం పని ఉంది?”

“ఇదిగో పాదచారీ, నన్నెందుకు దూరంగా నెట్టేస్తావు. నీలో ప్రతీక్షణమూ బ్రతికేది నేనే! నీతో ప్రతీక్షణము గడిపేది నేనే. నేను లేకుండానే ఇన్ని యుగాలు గడిపావా? నీ ఆలోచనలో, ఆర్బాటంలో, ఊహల్లో, మాటల్లో, కవితలో, కథలో, అనుభూతుల్లో, ఆరాధనలో నేను లేనిదెక్కడా? నేను కానిదెక్కడా?”

కోపంగా అన్నది వేదనాలత.

“అవును…” కొంచెం తల వంచి తనలో తాను అనుకున్నాడు.

“నువ్వే నాలో లేకపోతే నేనూ అందరిలా హాయిగానే ఉండేవాణ్ణి. వాళ్లంతా బ్రతుకుతున్నారు. వారి లాభనష్టాల్లో వారి చిరునవ్వులూ రోదనలో. మరి నేనూ? అన్నిటిలోనూ, అన్నిటి వెనుకా ఏమో తెలియని, ఏదో తెలియని దేన్నో దేన్నో అన్వేషిస్తూ నాలో నేనే ఆక్రోశిస్తూ సాగుతున్నాను.”

సర్లే పోనీ!

ఇప్పటికయినా వదిలిపోవా?

నన్ను నేనుగా బ్రతకనీయవా?

వేదనలత కోపంగా విసవిసా నడిచిపోయింది.

“క్రీ క్రీ” మంటూ వికృతంగా అరిచిందో కొంగ. ఒడ్డునున్న కప్పలూ, వెన్నెల్లో ఎగిరే చేపలూ బుడుంగుమని నీళ్లల్లోకి దూసుకుపోయాయి. అలలు కదిలాయి.

సరికొత్త ఊహలు విరుస్తూంటే సాగిపోయాడు పాదచారి.

***

“నా జీవితం మళ్లీ మొదలైతే నేనేం చేస్తాను?” అనుకున్నాడు పాదచారి.

ఫక్కుమని నవ్వింది మానసి. నవ్వి నవ్వి అంది.

“ఏమీ చెయ్యవు. మళ్లీ ఇలాగే ఇంకోసారి జీవిస్తావు.”

“కాదు. ఖచ్చితంగా కాదు.”

కళ్లల్లో నిప్పుల రవ్వలు రాలుస్తూ అన్నాడు వింత వ్యక్తి.

“నువ్వెవరివి?” అడిగాడు పాదచారి.

“నేనా? నన్నే గుర్తుపట్టలేదా? అవునులే! మానసి తోడు దొరికాక నేనేందుకు? సరే! మళ్లీ పరిచయం చేసుకోనా? నా పేరు విప్లవమూర్తి” నిర్వికారంగా అన్నాడు.

“నువ్వా?” ఓ క్షణం నిర్ఘాంతపోయి మళ్లీ అన్నాడు పాదచారి. “నీవు… నీవింకా జీవించే ఉన్నావా?”

“నువ్వు ఉన్నావుగా… నేనూ ఉంటాను.”

మానసి చికాగ్గా విప్లవమూర్తిని చూసి అన్నది –

“ఆయన బ్రతుకు పై మీ అధికారం ఏమిటి?”

“నీకున్న అధికారమే నాదీ! మళ్లీ తను మొదటి నుంచీ జీవించటం జరిగితే నా తోడుగా నడుస్తాడు. లోకాన్ని తిరిగి తిరిగి చూస్తాడు. లోకపు నాడినీ వేడినీ పరీక్షిస్తాడు. ఈ లోకపు స్వార్థచింతనకీ, దోపిడీకీ, అన్యాయానికీ శస్త్రచికిత్స చేస్తాడు!”

“ఓహో?” హేళనగా అంది మానసి.

“హా… హా…?” అన్నాడు విప్లవమూర్తి ఈసడింపుతో.

“ఆ శస్త్రచికిత్స ఏదో నువ్వే చెయ్యరాదూ!”

“తను తోడుంటేనే అది సాధ్యం! అయినా నువు కులుకుతున్నావుగా అతడితో?”

“సరిగ్గా మాట్లాడు! నేనేం అతన్ని నీ దగ్గర్నించి లాక్కుపోలేదు. అసలు నువ్వెవరో నాకు గుర్తే లేదు.”

“ఎందుకు గుర్తుంటుంది? మూర్ఖురాలా! ”

“ఒకపుడు నీవూ నాతో ఉన్నావు!”

“హూఁ!” హేళనగా నవ్వింది మానసి.

“నీతో విసుగెత్తే మళ్లీ అతనితో వచ్చి ఉంటాను” అంది వేదనలత.

కళ్లల్లో నిప్పులు కరుపించాడు విప్లవమూర్తి.

“నీ సంగతి నాకెందుకు?” యీసడించి అని పాదచారి వేపు తిరిగింది మానసి.

“పాదచారీ! చెప్పు! నేను చెప్పింది నిజమే!”

“అవునా?” అనునయంగా అంది మానసి.

“ఏమో!” అన్నాడు పాదచారి అలోచిస్తూ.

“నువు నన్ను పట్టించుకోవడమే లేదు, అవునా?” అడిగాడు విప్లవమూర్తి.

“లేదు నేస్తం! నీ గురించీ ఆలోచిస్తున్నాను.”

“మరి నా గురించి?” గబగబా వచ్చాడు జీవన్ మూర్తి

“తమరెవరు?”

“నేనెప్పుడూ నిన్ను చూస్తూనే ఉంటానోయ్! అయితే నీతో మాట్లాడను. ఎపుడో తప్ప. అందుకే గుర్తుండను.”

“ఇపుడెందుకు దయ చేశారు?”

“ఓ సారి పలకరించి పోదామని” నవ్వాడు జీవన్ మూర్తి.

“మీ అందరి పేర్లూ నాకు తెలియకనే తెలుస్తున్నాయి. ఎప్పుడో చిన్నప్పటి నేస్తాల్లాగా ఉన్నారు… సరే… ఏదో చెప్పమంటునారు? ఏం చెప్పను? నా జీవితం మళ్లీ మొదలయితే కొన్ని క్షణాలు మళ్లీ దాచుకుంటాను. కొన్ని క్షణాల్ని దూరంగా విసరేస్తాను.”

“మమ్మల్ని విసిరేసినట్లుగానా?” అడిగాడు విప్లవమూర్తి.

“అప్పుడూ మీరుంటారేమో! ఎందుకో మరి! మీరంతా నా తోడు లేకపోతే జీవితం అసంపూర్ణమనిపిస్తోంది.”

“Thank you” అన్నాడు విప్లవమూర్తి.

“విప్లవమూర్తికి ఫార్మాలిటీనా?” పకపకనవ్వి ముందుకు సాగాడు పాదచారి.

“ప్రస్తుతాని కెవరూ లేరు. నేనూ, యీ నిశ్శబ్ద ప్రకృతీ” కుక్కపిల్ల ముందు నడుస్తుండగా వెనుకనే సాగాడు బాటసారి.

“నేను మానవుణ్ని. శరీరం లోపల, బయటికి కనపడని అద్భతాన్ని దాచుకుంటూ చిరిగిన శరీరాలు విప్పి పారేసి కొత్త శరీరాలు తొడుక్కుంటూ యుగ యుగాలుగా ఇలా సాగిపోతూనే ఉన్నాను. ఈ లోకమూ పాతదే! నాతోనే, నాలానే, తనూ తన రూపులు మార్చుకుంటూనే వస్తున్నది. కానీ, ఎంత చిలిపిదనం! ఎప్పటికపుడు మేం కొత్తగా కలిసినట్లే ఉంటుంది. పలుకరింపులు నవ్వుల వెనక!”

“మర్చిపోలేదు లేవోయ్ పిచ్చివాడా!” అన్న యమన్ రాగమూ వినిపిస్తూనే ఉంటుంది.

నడుస్తూ నడుస్తూ ఓ కొంటె కొమ్మ వెక్కరించినట్లు తలూపగా నవ్వి, చెట్టు కానుకుని కూర్చున్నాడు పాదచారి.

“ఏమంటావు బుల్లి చెట్టా!” కాండాన్ని స్పృశించి పలకరించాడు.

“ఏమంటానూ! రాకరాక వచ్చావు నావాడా! కూర్చో కూర్చో అంటాను” అన్నట్లు శబ్దంతో ఆకులు గలగలలాడాయి. గాలి జతగా పాడింది.

గబగబా నడచిపోతున్న చీమరాజులు ఓ క్షణం ఆగి, నేలని వాసన చూచి, చిన్న తలలను మోరలెత్తి ఆకాశాన్ని చూసి “ఉహూఁ వర్షం రాదు. కనుక భయం లేదు” అని స్థిమితపడి ముందుకు సాగాయి.

“మీతో పాటు నేనూ మీ సౌధంలోకి రానా? రానిస్తారా?” ఓ చీమరాజుని ఆపి మర్యాదగా అడిగాడు పాదచారి.

“ఉహూఁ! నువ్వు పట్టవుగా! అయినా ఇలా అటకాయించి అడగవచ్చునా? అవతల పనికి ఆలస్యం కావటంలా?” మెత్తగా మందలించి ఆదరాబాదరాగా సాగిపోయింది చీమ.

కుక్కపిల్ల కళ్లు పెద్దవి చేసుకుని వరుసగా నడచిపోతున్న చీమయోధుల్ని చూస్తోంది.

“ఇంకేమిటోయ్ కబుర్లూ?” తట్టి అడిగింది చిరుగాలి.

“ఏమీ లేవు” నవ్వాడు పాదచారి.

“లేవా! లేవా” అన్నట్లు “టాలా టాలా” అంటూ కూసింది చిత్రికీపిట్ట.

“లేవాలి, లేవాలి… ముందుకి ముందుకి సాగాలి. దూరం… దూరం… దగ్గర దగ్గర… లోకానికి దూరంగా పచ్చని ప్రకృతికి దగ్గరగా… ” కవితా, పాటా కాని అక్షరాలకి ప్రాణం పోసేస్తూ. తాళం వేస్తూ లేచినడక సాగించాడు పాదచారి.

“నీ మీద ప్రేమతో నిన్ను స్పృశించి పట్టుకుంటే, నన్ను పలకరించి నా వాళ్ల దగ్గర వదలకండా ఎక్కడికా పరుగు?” అన్నట్లు చిటుక్కుమని కుట్టిందో చీమరాణి.

“సారీ! సారీ!” అని మెల్లగా దాన్ని తీసి సాగి పోతున్న యోధ పటాలంలో వదలిపెట్టాడు పాదచారి.

ఓ సారి నవ్వి మందుకి నడుస్తూ నీలాకాశానికి కవితలు వినిపించాడు!

“జీవితం క్షణమే! ఇప్పుడే మొదలు! ఇప్పుడే సిసలు… చివరికి మిగిలేది ఏదీలే దు.” ఓ కానుగపువ్వు రాలిపడుతూ అంది పాదచారితో. వంగి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు పాదచారి.

“ఇది నా చివరి శ్వాస పాదచారీ! నీ చేతుల్లో ఇంకిపోతున్నాను… ఇమిడిపోతున్నాను… ఆశ్వాసించు. మళ్లీ ఎపుడో కలుస్తా – మరో రూపంతో, మరో రంగుతో.” చేతుల్లో ఒదిగి ఒడిలిపోయింది పువ్వు.

దుఃఖంతో కళ్లు చెమర్చి కళ్లు ఓ చేత్తో తుడుచుకుని పువ్వుని జేబులో దాచుకుని ముందుకి నడిచాడు పాదచారి. ఆశ్రువు తెర అడ్డుపడగా లోకం అలికినట్టు కనపడింది పాదచారికి.

“నేనూ అంతే! ఎక్కడో, ఎప్పుడో యీ సువాసన నిండిన మట్టిలో మట్టిగా కలిసిపోతాను, ఊహా విశ్వంలో ఓలలాడుతాను….” నిర్వికారంగా ముందుకడుగు వేశాడు.

“ఉత్సాహం బిడ్డా! ఉత్సాహం నింపుకో. గతించిన, గతించే క్షణాలకి ఆశల రంగులు పూసి ఊహల మాటలు వేసి ఉత్సహాంగా సాగిపో! నిరుత్సాహం కూడదు. నేను చూడు, అనుభవపు ఆకుల్ని రాల్చుకుంటూ సరికొత్త ఊహల పచ్చని చిగుర్లని తోడుక్కోవడం లేదా! నువ్వు అలానే ఉండాలి” అనునయంగా ఊడల చేతుల్ని ఊగిస్తూ పెద్దరికంతో ఆప్యాయంగా బోధించింది మఱ్ఱిచెట్టు.

ఓ బుల్లి పక్షి యీ కొమ్మ మీంచి ఆ కొమ్మ మీదకీ, ఆ కొమ్మ మీంచి యీ గూటి మీదకి ఎగిరే ప్రాక్టీసు చేస్తూ “ఎగరడం నేర్చుకుంటూ ఉన్నాను. అమ్మ అయితే రెక్కలు చాచి రివ్వున ఎగిరిపోతుంది. మరి నా రెక్కలు చిన్నవిగాదా!… అందుకే యీ సాధన…” అన్నట్లు బుల్లి బుల్లి కేకలు వేసింది.

వెలుగూ నీడా కలిసిన సాయం సంధ్యని చూస్తూ మైమరిచిన గరిక వీరులు ఆనందంగా తలల నూగిస్తూ ఉండగా, ఎండ తాపం తగ్గింది బాబూ… అని మహా వృక్షాలు వెచ్చని నిట్టూర్పు విడిచి “రండి! రండి! తొందరగా పడుకోండి” అన్నట్లు ఆకుల వేళ్లూ, కొమ్మల చేతులూ ఊపి పక్షి వీరుల్ని పిలుస్తూ ఉండగా. “అబ్బ! వెధవ్వెలుగులో ఏమీ కనిపించి చావదు… ఆకలేస్తోంది. అన్నం వెతుక్కోవాలి” అన్నట్లు నిశాచరాలు గూళ్లని వదిలి బద్దకంగా కళ్లు విప్పి లోకాన్ని సర్వే చేయడానికి ఆయత్తమవుతూ ఉండగా “ఇవాల్టికి చాలు! మళ్లీ రేపు సూర్యునికి తొందరగా మేలుకొలుపు పాడాలి” అన్నట్లు నిద్రగన్నేరు ఆకుల షామియానాని చుట్టివేసి ముడిచి వేస్తూండగా “చల్లని గాలికీ వెన్నెల రాణీకీ ఇదే మా స్వాగతం” అన్నట్లు నైట్ క్వీన్ పువ్వులు రెక్కలు విప్పి సువాసన వెదజల్లుతూండగా చల్లగాలికి “ఉఫ్! ఉఫ్! ఇహ పుట్టల్లో ఉండటం మా చేతగాదు… ఎంత చల్లని గాలీ” అంటూ మహా సర్పాలు తోకలపై నిలబడి ఊగుతూ వాయుభక్షణ చేస్తుండగా, “ఇహ తిరగ్గూడదు, పరిశ్రమ తరువాత విశ్రాంతి గొప్ప మజా” అనుకుంటూ చీమలు పుట్టల్లోకి దూరి మట్టి తలుపుల్ని మూసివేస్తూండగా ‘మేమూ బావిలోని నక్షత్రాలమే… ఇపుడు చూడండోయ్ మా అందమూ చందమూ’ అన్నట్లు మిణుగురు పురుగులు మినుక్ మినుక్ మంటూ సందడి చేస్తూండగా ‘మీ అందం మా ముందెంత’ అన్నట్లు తళుక్ తళుక్ మంటూ తారలు పకపకా నవ్వుతూ పక్కవాళ్ళని పిలుస్తూ ఆకాశంలో వెలుగులు నింపుతూండగా, “నేనూ ఆశలాంటి దాన్నే, మెల్లమెల్లగా పెరిగి వెన్నెల ఉత్సాహాన్ని నింపేస్తాను. అయితే ఆశతో మీరు విఱ్ఱవీగేటపుడు మళ్లీ మిమ్మల్ని సరిదిద్దటానికి నా వెన్నెల కిరణాల్ని వెనక్కి లాక్కుంటూ మెల్లగా మిమ్మల్ని నిరాశలో నింపేస్తాను… అయినా జాలి తలచి మళ్లీ రేఖలా, ఇదుగో ఇలానే మళ్లీ మిమ్మల్ని అలరిస్తూనే ఉంటాను” అన్నట్లు నెలవంక సన్నగా నవ్వుతూ లోకానికి ఆశల వెన్నెల కురిపిస్తూ ఉండగా, “సైలెన్స్ ప్లీజ్ ఇది విశ్రాంతి వేళ” అన్నట్లు నిశాకన్య మందలిస్తూ ప్రకృతిపై చీకటి పమిట కప్పి నిద్రాదేవతకి పానుపులు సిద్దం చేస్తూ ఉండగా పచ్చని గడ్డిపై పడుకుని ప్రకృతి కూర్చిన సంధ్యాహారాన్ని అనందంగా వీక్షించాడు పాదచారి. విశ్రాంతిగా పాదచారి పాదాలు నొత్తుతూ వేళ్లతో ఆడుకొంది కుక్కపిల్ల.

చిక్కగా పేరుకున్న చీకటినీ, గూళ్లు వెదుక్కునే పక్షుల అలజడినీ వింటూ నిశాకన్య విన్యాసాల్ని వీక్షించాడు పాదచారి.

“ఎంత చక్కని చిక్కని నిశ్శబ్దమూ?” ఆనందంగా అనుకున్నాడు పాదచారి.

“యస్స్! యస్స్!” అన్నట్లు బుస్ బుస్ మంటూ ప్రక్కనించి పాకి పోయిందో బుల్లి పాము.

గాలి జోల పాడుతూ “నిద్రపోవా పిచ్చీ!” అంటూ చల్లగా మందలించింది.

“నా పాదచారి ఏం చేస్తున్నాడూ” మెల్లగా ఆప్యాయతలా పక్కని చేరి చిరునవ్వుల వెన్నెల కురిపించి నిశాకన్యని పరిహసిస్తూ పాదచారి పక్కగా కూర్చుంది అమృత.

నోట మాట రాక ఆనందంతో కళ్లు చెమర్చగా పక్కకి దొర్లి ఆమె పొట్టకి తలనానించి కాగిలించుకున్నాడు పాదచారి.

“నా పిచ్చివాడా! ఏం చేస్తున్నావూ? ఎలా ఉన్నావూ? ” అతని తలని గుండెలకు హత్తుకుని వేళ్లతో తల నిమురుతూ నుదుటినీ కనురెప్పలనీ ముద్దులు పెట్టింది అమృత.

ఆమె వంట్లో నించి అద్భతమైన సువాసన యుగయుగాల తరతరాల ఆత్మసౌందర్యాన్ని స్వచ్ఛ పరిమళాన్ని వెదజల్లింది.

ఆమె సన్నని వేళ్ల అంచుల్లో వెచ్చని మానవత్వపురేఖ దైవత్వపు అలల్ని అతని శరీరంలో ప్రవహింప చేసింది. ఆమె కళ్లల్లో దయ.

ఆమె పెదవులు నిండుగా ఓర్పుకీ దయకీ సౌందర్యానికీ, సౌశీల్యానికీ అనురాగానికీ, ప్రేమకీ, ఆరాధనకీ ఆలవాలాలుగా…

ఆమెను ఆబగా చుట్టి వేశాడు పాదచారి. అమృతా! ఎంత ఆనందం నువ్వు? యింత అద్భుతం నువ్వు! నీ ఊహాలతో, నీ ఊర్పులతో నన్నెపుడూ చుట్టి వేసి నీ బాహువుల్లో నన్ను రక్షిస్తూ నా అలసట తీరుస్తూ… ఓహ్ ఓ దేవతా! ఓ దేవతా!

తనలో తానే ఇదీ అని తెలియని భావాన్నో భావోద్వేగాన్నో ఆమెకు వినిపించాలని ప్రయత్నం చేస్తూ పాదచారి!

(సశేషం)

Exit mobile version