Site icon Sanchika

పాదచారి-6

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి‘ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 6వ భాగం. [/box]

[dropcap]“అ[/dropcap]ద్దానికి అవలితీరం

అద్దానికి ఈవల మోహం

అద్దంలో నీ ప్రతిబింబం

వెలుగుతున్న మిధ్యారూపం”

“ఓ పాదచారీ! నీ వేదాంతం వెనుకగా, నీ ప్రకృతి బాటల వెనుకగా, నీ ఊహల రాగాల వెనుక, నీ వేదన పాఠాల వెనుకా నిన్ను నీవు చూసుకున్నావా! ఓడిపోయిన వ్యభిచారీ! నీ మనస్సు చలించలేదంటావా! మరైతే సౌందర్యపు లోతులు కొలుస్తావెందుకు? కళ్లల్లో కాంతులు వెదుకుతావెందుకు?” కోపంగా అన్నాడు సత్యమూర్తి.

అశల స్కూటరెదురుగా వచ్చి ఆగింది. ఠీవిగా దిగాడు స్వప్నమూర్తి.

“మిగతా వాళ్లెక్కడ?”

“నేను ఆలోచిస్తున్నాను… నీ గురించే” అన్నాడు విజ్ఞానాచార్యులు.

“నేనూ అనుభవిస్తున్నాను” అన్నాడు జీవనమూర్తి.

“జవాబు చెప్పు?” ముక్కు పుటాలెగరేస్తూ అన్నాడు విప్లవమూర్తి.

విశ్వాసం కుక్కపిల్ల నిటారుగా నిలబడి తోకాడించి “గుర్ గుర్” అన్నట్లుగా “ కుఁయ్! కుఁయ్” అంది.

“సరే!”

“మరి చెప్పవేం?”

“చెప్తాను”

“అగాను… నేనూ వస్తున్నాను!” పరిగెడుతూ వచ్చింది కవితాకుమారి.

“జీవన్‌మూర్తి! నేను నీకు మొదటి నుంచీ తెలుసుగా!” అడిగాడు పాదచారి.

“అందుకు సందేహం లేదు.”

“అయితే కారణం నువ్వే చెప్పు”

“నేనేం చెప్పను? నాకేమీ ప్రత్యేకత లేదే.”

“ప్రోత్సహించింది నువ్వేగా?”

“అది నా లక్షణం.”

“ఏ లక్షణం?” విప్లవమూర్తి అడిగాడు.

“అతనితోనే ఉన్నాను, అయినా అతన్ని నా ఊహల్లో నడిపించాను….”

నవ్వాడు పాదచారి “సరే!… నీ ఊహలు ఏమో చెప్పనా, అవకాశపు దారులు తొక్కడం.”

“అవునా! సరే! నడిపించింది నీవు… నడిచింది నేను. ఎలా నడిచాను? నాకు నేను తెలీక. నేను చేసేదీ చూసేదీ నాకే అర్థంగాక… అవునా?”

“అవునేమో?”

“ఏమో అంటే?” కరుగ్గా అడిగింది కవితాకుమారి.

“నువ్వు తనలాంటి దానివే! నువు మాత్రం నీ కొంగున అతన్ని ముడి పెట్టుకోలేదూ! చెట్టు వెంటా.. పుట్ట వెంటా… పాటలు పాడిస్తూ పరిగెత్తించలేదూ! వెదవ ప్రశ్న. వెధవ ప్రశ్న.” గట్టిగా అరిచాడు విప్లవమూర్తి.

“ఆమె మీద అరవకు. తను స్త్రీ. సరే… చెట్టూ పుట్టా వెనుకే తిప్పించింది. నువ్వేం ఏడిశావు? లోకంలోని అన్యాయానికీ, అసహయతకూ అతడే కారమమన్నట్లు రాత్రీ పగలూ ఏడ్పించలేదూ అతన్నీ? నిద్ర పోనిచ్చావా? ఏం జన్మమోయి నీది? తూటాలూ… తుపాకులూ… కల్లోలాలూ… ఓహ్!” ఈసడిస్తూ అన్నాడు సత్యారావు.

చిరునవ్వు నవ్వి “సైలెన్స్” అన్నాడు స్వప్నమూర్తి.

“చూడండి వ్యభిచారం అన్న పదం సరయింది కాదు. అక్కడికి వినిపించింది ఆ మాట. సౌందర్యాన్ని చూడటం వ్యభిచారమా? లీనమవడం వ్యభిచారమా? ఆరాధించడం వ్యభిచారమా? అయినా అతడేం చేసినా మానసి తోనేగా? ”

“ఏం? మానసితో ఉంటే వ్యభిచారం కాదా?” రోషంగా అన్నాడు విప్లవమూర్తి.

“అలా అయితే సర్వమూ వ్యభిచారమే తనకో ఊహ వచ్చింది. ఆ ఊహని సుందరంగా సౌందర్యపు గంధంతో మల్చుకున్నాడు. భావపు రంగులు పులిమి హృదయపు తీవెలు సవరించాడు. తప్పేముంది? ఓహో? విప్లవమూర్తి! నువు మాత్రం ఆ పని చేయడం లేదా? సమానత్వపు శిలాకృతులను మలచడం లేదా! దోపిడీ దోపిడీ అంటూ ధనం మీద ధ్వజమెత్తడం లేదా! నీకంటూ ఏదీ లేదు కనుక ఉన్న వాళ్ళ మీద ధ్వజమెత్తావు. నీకున్నది నీవు పంచి యివ్వు. ఎందుకులే!” నవ్వాడు స్వప్న ముర్తి.

“అంతా గత జన్మ బంధమే కర్మ! కర్మ మాత్రమే.”

గడ్డం నిమురుకున్నాడు విజ్ఞానాచార్యలు

“కర్మ గాదు… నా తలకాయ. అన్నీ కర్మేనంటారుగా! సరే! గడ్డం ఊడేట్టు గుద్దుతా! కర్మం అనుకుని సరి పెట్టుకోండి” విజ్ఞానాచార్యుల మొహం మీద గుద్దాడు విప్లవమూర్తి.

“స్టాప్ దిస్ నాన్ సెన్స్” అరిచాడు పాదచారి.

“మీరంతా బరిదెగిస్తున్నారు మరీ! నేనంటూ నాకు తెలియనప్పటి మిత్రులు మీరు. వేధించడం… బాధించడం… అయినా కొంత కాలం నాతో గడిపారు. నా క్షణాల్లో కొన్ని క్షణాలు మీరు దాచుకున్నారు. అందుకేనోయీ! మిమ్మల్నెవర్ని చూచినా నాకు ప్రేమే. ఎందుకు? ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం? ఎవరి క్షణాలు వారివి! ఎవరి ప్రత్యేకత వారిది! అందరూ అనుభవించిన వారేగా! నేనూ మీ అందర్నీ అనుసరించిన వాణ్ణేగా! ”

“కరక్టు పాదచారి అదే నా లక్షణం” అన్నాడు జీవన్‌మూర్తి.

విశ్వాసం కుక్కపిల్ల చికాగ్గా ముందుకు నడిచింది.

అది చూచి పాదచారి దాని వెంట నడిచాడు. తుఫాను వెలసిన ప్రశాంతి లాగా ఎవరి దారిన వారు వెళ్ళారు.

“సార్! సార్! ” వెనక్కి చూశాడు పాదచారి.

“ఇవిగో జ్ఞాపకాల గ్రంథాలయం తాళాలు…” మేనేజరు వగరుస్తూ పరిగెత్తుకొచ్చి ఇచ్చాడు…

“వాళ్లంతా చూసారా?”

“ఆ! కొంచెం సేపున్నారు. ఏవేవో వెదికారు. అంతా గజిబిజిగా ఉంది. ఒకపుడు వరుస క్రమంగానే పేర్చాను. ఇప్పుడు మళ్ళీ వరుసగా సర్దుదామంటే కుదరనే లేదు. మరుపు చెదలు పట్టేశాయి. అయినా కొన్ని సరికొత్తగానే కన్పించాయి.”

“నువ్వు ఫో!” శలవిచ్చాడు పాదచారి.

“యస్సార్! అయినా దాన్ని మీరోసారి చూడాలి.”

“సరే! సరే!”

మేనేజర్ వెళ్లిపోయాడు.

పాదచారి దీర్ఘంగా ఓ సారి ముందుకు చూసి వెనక్కి తిరిగి నడిచాడు. విశ్వాసం అతని వెనుక మెల్లగా నడుస్తూ తోక ఊపింది.

***

“వారంతా నన్ను మోసగించారు. కనీసం అలా అనుకొని సంతోషపడ్డారు. కానీ ఏమీ కానే కాలేదు.”

“ఎలా?” అడిగింది మానసి.

“నా దగ్గర ఉన్నవి వారు తీసుకున్నారు. అది తెలివిగా తీసుకున్నారు. ఇందులో మోసపోవడం ఏముంది?”

“ఎందుకు లేదు?”

“ఓ మానసీ! వారు తీసుకున్నవి నా దగ్గర ఉన్నవే కనుక. నా దగ్గర ఉన్న దాన్ని నేనిచ్చి వేయగలను. ”

“అవి మామూలుగానే అడిగి తీసుకోవచ్చుగా? మరి మోసం చెయ్యటం ఎందుకు?”

“అది వారి లక్షణం! అదే పిచ్చితనం. ఆహా! ఇలా చెయ్యగలిగాను గదా అనుకునే అహంభావం.”

“అలా అనుకుని నీ బ్రతుకలేనితనాన్ని కప్పెట్టుకుంటూ ఉండు” కోపంగా అంది మానసి.

“సరే నోయీ! అలాకాక ఇంకెలా ఉండనూ?”

“ఎవరికి తగినట్లు వారికి చెయ్యాలి.”

“అప్పుడు మళ్ళీ జీవితం లాభనష్టాల చిఠా అవుతుంది. నా స్మృతి నేనే మర్చిపోతాను.”

“ఓ మూర్ఖుడా! లాభనష్టాల చింతనే మేలు. కనీసం అది భౌతికం. నీ ఊహలూ, వైరాగ్యమూ తిండి పెడతాయా? శాంతినిస్తాయా? అందరి చేతా మోసాలూ, అవమానాలూ భరిస్తూ నేనేదో గొప్పవాణ్ని అనుకుంటూ జీవితాన్ని నీళ్ళల్లా జారవిడుచుకో” మానసి కళ్ళు క్రోధంగా మెరిశాయి.

“శాంతి! శాంతి!” నవ్వుతూ అన్నాడు పాదచారి.

“శాంతి శాంతి కాదు కావాల్సింది క్రాంతి క్రాంతి”

“దేని మీద, ఎవరి మీద.”

“ఆ మనుషుల మీద… ఆ మనసులేని మరల మీద నమ్ముతున్నాడు గదా అని నానా చెత్తా చెప్పి నమ్మించడానికి ప్రయత్నంచే మూర్ఖుల మీద. నీ బలహీనతలు తెలిసి నిన్ను ఉపయోగించుకునే స్వార్ధపరుల మీద… అవకాశపు గుఱ్ఱానెక్కి ఆనందించే భ్రష్టుల మీద. తిరగబడు! పాదచారీ, తిరగబడు! వారి మీద విరగబడు!”

నిస్తేజంగా నవ్వాడు పాదచారి.

“ఎందుకు మానసీ, ఆవేశం. నన్నూ లోకం చాలా సార్లు అపార్థం చేసుకుంది నన్ను లోకం చాలా సార్లు అవమానించిది. అయినా ఏం చెయ్యగలను? ప్రతీ అర్థానికీ అపార్థాలుంటాయి మానసీ! ఎన్నో మలుపులు తిరిగింది జీవితం. మలుపు తిరగేటపుడు అది మలుపు అని తెలీదు. ఏదైనా ఓ ఘటన జరిగాక ఎలా జరిగిందీ ఎందుకు జరిగిందీ అలా కాక ఇలా జరిగితే బాగుండేదేమో అని తరువాతే విచక్షణ జరుగుతుంది కానీ ముందే తెలియదు కదా. అలా తెలిస్తే మనిషికీ మనిషికీ మధ్య ప్రేమ తప్ప ఏం ఉంటుంది? అప్పుడు సృష్టి విచిత్రం ఏమిటీ? అందుకే అన్నాను వారంతా మోసగించామని అనుకుంటున్నారు. ఎంత నికృష్టం?”

“పాదచారీ! లోకాన్ని వదిలి ఆకాశంలో చక్రికలు కొట్టకు! నీకున్నవి పాదాలు, రెక్కలు కావు. నే చెప్పేది విను. ఈ లోకం నిన్ను తూట్లు తూట్లు పొడుస్తుంది. ఈ లోకం నిన్ను చిత్రవధ చేస్తుంది. నీ మనస్సునూ,శరీరాన్ని బంతిలా ఇష్టం వచ్చిన చోటికి తంతుంది. ఓయీ! నేనూ నిన్ను విడిపోక తప్పదు. ఏనాడో… ఓనాడు…” విసవిసా నడిచి వెళ్లింది మానసి.

ఒంటరి చెట్టు క్రింద ఒంటరిగా నిలబడ్డాడు పాదచారి. కాసేపాగి మోకాళ్ల మీద తల పెట్టుకుని నిట్టూర్పు విడిచాడు.

“అవును ఓనాడు మానసీ వదిలి వెళ్లిపోతుంది. అపుడింకెవరూ ఉండనే ఉండరు. అంతా నిశ్శబ్దమే.” ఆ క్షణాన్ని తల్చుకుని కళ్లవెంట నీళ్లు కార్చాడు పాదచారి.

“నేనున్నాను మిత్రమా నీ వెంట” వేదనలత అతన్ని బాహువుల్లో చుట్టి అతని ఆశ్రువుల్ని పెదాలతో చప్పరించింది.

***

“పేరు చెప్పు”

“అమృత”

“నా పేరెందుకు చెపుతావూ?”

“నేనంటూ లేను కనుక!”

“ఎందుకంత ప్రేమ”

“స్వచ్ఛమైన ఆత్మవు నీవు స్వచ్ఛమైన కాంతివి నీవు!”

“పొగుడుతావెందుకోయ్ పాదచారీ!”

“నిన్ను చూస్తూ నీలో నన్నే చూచుకుంటున్నాను.”

“నేనూ ఒకప్పుడు శిధిలమైపోతాను.”

“అవును అపుడు నేనూ ఉండనుగా. కాలం మన మీదుగా ప్రవహిస్తుంది. అప్పుడు అనంతాన్ని అన్వేషిద్దాము.”

“నువు సుఖంగా ఉండాలి!”

“నేను నీలో ఉన్నాను. సుఖం నేనే!”

నవ్వుతూ అతని తల చెరిపింది అమృత.

“మళ్లీ మళ్లీ ఎందుకలా నన్ను చూస్తావూ?”

“నీ కన్నులు నీ ఆత్మలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆఖరికి నీ పాదాలు కూడా నీ మనస్సులా నున్నగా వెన్నలా ఉన్నాయి.”

“అమృతా నేను బ్రతికిందీ బ్రతికేదీ నీ గోటి వెన్నెలలో”

“నువు నన్ను కామించలేదు. నీవు నన్ను బంధించ లేదు. ఎందుకోయీ ఇంత ఆరాధనా?”

“నాది ఆరాధన అయితే సరే! అయితే ఆరాధన వేరు. నిన్ను ఆరాధించటం అంటే నీవు వేరు నేను వేరు. నేను నిన్ను నిన్నుగా ఆరాధించటం లేదు.”

“మరెలాగు?”

“భాష లేనిది చెప్పటం ఎలా?”

ఆమె చేతిని గుండె కాన్చుకొని అన్నాడు. ఓ వడ్రంగి పిట్ట చెప్పూ చెప్పూ అన్నట్లుగా వృక్షాన్ని టిక్కు…. టిక్కూ మని పొడిచింది. కాలం మెల్లగా పరుగులు తీసింది. చీకటి కాని చీకటి వెలుగులా పరుచుకుంది. ఆమె వంటి పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ అన్నాడు పాదచారి – “ఎన్ని యుగాలు గడిచాయో ఇలా అమృతా! కాలం నాలోంచి ప్రవహిస్తోంది కదూ!”

(సశేషం)

Exit mobile version