పాదచారి-8

0
1

[box type=’note’ fontsize=’16’] భువనచంద్ర గారు వ్రాసిన ‘పాదచారి’ అనే నవలను సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 8వ భాగం. [/box]

[dropcap]“B[/dropcap]usiness! వ్యాపారం”

“నీ దృష్టిలో అదే జీవితం. నా దృష్టిలో అది హీనత్వం.”

“How? ఎలా?”

“జీవితం వ్యాపారం కాదు. వ్యాపారం జీవితమూ కాదు.”

“నా దృష్టిలో అంతే! నీ వేదాంతమూ, నీ స్వచ్ఛతా… నీ స్వతంత్ర భావానా… చూశావా? నా వ్యాపార దృష్టి ముందు హుళక్కి” గట్టిగా నవ్వాడు జీవి.

“కాదు జీవీ! కాదు. నాకన్నీ తెలుస్తూనే ఉంటాయి. జాలి అంటే నాకసహ్యం! అయినా తప్పదు నీ మీద జాలి పడక తప్పటం లేదు.”

“Your pity is equal to my gain” పకపకా నవ్వాడు జీవి.

“May be. కానీ నా దృష్టిలో నా జాలీ… my pity is equal to your fate. నా జాలి నీ అదృష్టం… అంతే. నీ లాభం. నీ money…. నా జాలే నీ అదృష్టం… నిజాన్ని చెప్పే గుండె బలం ఉన్నా చెప్పలేదు. ఎందుకో తెలుసా you are not in paradise. You are in a fool’s paradise. నువ్వున్నది స్వర్గంలో కాదు. పిచ్చి వాళ్ల స్వర్గంలో… మూర్ఖుల స్వర్గంలో….”

“హ… హ… హ…” జీవి హేళనగా నవ్వాడు.

నవ్వుతూనే తన దారిన తాను వెళ్లాడు.

“నీవు నా బానిసవి” అన్నది తను.

“కానే కాదు, నీవు నా అనేక భావాల్లో ఒకరివి అంతే.”

“నే చెప్పిందల్లా చేస్తావు! నే రమ్మంటే వస్తావు…. నే పొమ్మంటే పోతావు బానిసవు కాదా?”

“తెలుసుకుని లాభం ఏమిటి?”

“నా మీద నాకు నమ్మకం కలగడానికి.”

నవ్వాడు పాదచారి. “నీ మీద నీకు నమ్మకమే లేనపుడు నీకు నువ్వే బానిసవి. నేనెలా అవుతానూ?”

నవ్వుతూ ముందుకు నడిచాడు. తనూ కొంత దూరం వెంటపడింది. ఆ తరువాత విసుగెత్తి ఆగిపోయింది.

“జీవితంలో మరో ‘link’ తెగింది” నిర్లిప్తంగా ముందుకి సాగుతూ అనుకున్నాడు. ఒకపుడు తను తనకై వచ్చింది. తను తనకై ఇపుడు దారి మార్చుకుంది. జీవితం ఎంత సహజం?”

“నీలో ఉన్న అహంకారానికి అంతు లేదు. నిన్ను నువ్వే పొగుడుకుంటావు… అదెందుకో నీకు తెలుసా? పాదచారీ! మనిషి క్రిందకి జారుతూ పైకి రావాలని చేసే ప్రయత్నం అది” సూటిగా అన్నాడు సత్యమూర్తి. “అవునేమో కానీ సత్యా…. నాలో కనీసం ప్రయత్నమైనా ఉందిగా జారితే జారే ఉంటాను. జీవితపు పాకుడు రాళ్ల మీద అడుగు లేస్తూ జారకుండా ఎలా ఉంటాను? అయినా ప్రయత్నం ఉందిగా? కొంచెం కష్టమైనా కొంత కాలం గడచినా మళ్లీ ఎక్కగలనోయీ!” నవ్వి అన్నాడు పాదచారి

“నీ విశ్వాసంలోనే నీ బలం ఉంది” సాలోచనగా అన్నాడు సత్యమూర్తి.

విశ్వాసం కుక్క పిల్ల ఆనందంగా “కుయ్! కుయ్!” మంది.

“మనిషి విశ్వాసం! మనిషి బలం రెండూ మనిషివే. మనిషే దాన్ని పెంచుకోనూ గలడు…. మనిషే దాన్ని శిథిలం చేసుకోనూగలడు.”

“పెంచుకోవాలన్న తపన గొప్పది. ఆ తపనలో ఉండోయ్ పాదచారీ!”

“ఒక్కోసారి నాకూ ఇదంతా trash గా కనపడుతుంది. విశ్వాసమో, లాభమో, నష్టమో, బలమో, ప్రేమో, ద్వేషమో, అసూయో… ఏమున్నది వీటిలో? ఇవి అందరిలోనూ ఉన్నవే, ఇవి కాక ఇంకేదో వెదకటం, దొరికిందనో, దొరకలేదనో వ్యథ చెందడం, ఇదంతా పిచ్చితనం కదూ సత్యా.”

“వీటన్నిటి వెనుకా ఇంకా ఎన్నో ఉన్నాయి.”

“అలా అనుకోవడమే గానీ నిదర్శనాలు లేవుగా?”

“సేవ! సేవ పాదచారీ! నీకు తెలీకుండా నీవు ఇందాక చెప్పిన అన్నిటినీ సేవిస్తూనే ఉన్నావు. వాటిల్లో ‘నా’ అన్న భావన ఉంది. అది లేకుండా సేవ చెయ్యి, ప్రతిఫలం కోరని సేవ. సర్వానికీ సమదృష్టితో చేసే సేవ. అందులో ఖచ్చితంగా ఆనందమైన శాంతి ఉంది.”

“శాంతి మనిషిలోనే ఉందోయ్! దాన్ని వెలికితీయాలంతే”

“నిజమే! గదిలో గాలి ప్రవేశించాలన్నా గదిలోంచి బయటకు రావాలన్నా తలుపు తీయాలి. అలాగే శాంతిని నీలో నీవు గుర్తించడానికే ‘సేవా’ మార్గం.”

మౌనం మనసు నిండి పొంగి పొరలి ప్రవహించింది. కాలంలో కనిసి ముందుకు సాగింది. ఏళ్లూ ఊళ్లూ ఏమీ లేవు. అంతకు ముందెవరో నడిచన గుర్తులూ లేవు.

“నా దారి నేనే వేసుకుంటూ వెళ్లాలి. అసలెక్కడికి వెళతానో? ఎక్కడికీ వెళ్లడం? మృత్యువు ముంగిలికు! అది సత్యం! అది ధర్మం! అదే ఓ మోక్షం. అయితే ఎలా వెళ్లడం అన్నది ఇప్పుడు తెలుసుకోవాలి.

ఇవిగో! ఈ ముళ్లన్నిటినీ తొలగిస్తాను. వెనుక యిపుడో ఎవరైనా వస్తే వారి మార్గం సుగమం అవుతంది.

నా పాదాల్లో చాలా ముళ్లు దిగాయి. కొన్ని తొలగించుకున్నా. చాలా మిగిలే ఉన్నాయి. అయితే నేం? నేను నడవగలను గదా! నడుస్తూనే ఉంటాను.

శూన్యంలో నడుస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లాడు పాదచారి.

రాత్రులూ పగళ్లూ వరుసగా గడిచాయి.

“ఎంత చిత్రం! నేనిందుకిలా వచ్చాను? అంతా అక్కడే ఉన్నారు. ఈ లోకాన్ని నేనింత ప్రేమించానూ? ఎంత ప్రేమించానూ? మరెందుకిలా ఇప్పుడు నడుస్తూ వచ్చేశానూ? గుర్తే లేదు…. అదేదో నా లక్షణం అయి ఉంటుందనుకుంటాను, తనలో తనే అనుకున్నాడు. సాయం సంధ్య తన కురులు విప్పింది. చిక్కని జుత్తులా చిమ్మ చీకటి పరుచుకుంది. రాత్రిలో నక్షత్రాలు దీపాల్లా వెలుగుతున్నాయి. వాటి వెలుతురులోనే ముందుకు నడిచాడు పాదచారి.

దూరంగా ఓ పెద్ద దీపం!

పాదచారి స్ఫురణకి వచ్చింది.

అది తన కోసం ఏర్పడ్డ విడిది అని.

గబగబా నడిచాడు.

చందమామలా నవ్వుతూ అమృత అక్కడ నిలబడి ఉంది.

***

“నువ్వెప్పుడూ నా కంటే ముందే ఉన్నావు. ఎందుకు నడుస్తున్నానో కూడ తెలీకుండా నడిచాను. నీవు వచ్చిన గుర్తులే లేవు. అయినా నడిచేది నీ కోసమేనని ఇపుడనిపిస్తోంది” ఆమె పాదల చెంత కూర్చుని అన్నాడు పాదచారి.

“నేను నీ ముందగానే వచ్చిచేరాను…. నీవు వస్తావనీ తెలుసు….”

“ఎలా?…”

“తెలుసుకో…”

“ఊఁ అర్థమయిందిలే…. నీవు పిలిచిన పిలుపే నన్నిక్కడకు నడిపించింది.”

“పిలుపు వినబడిందా?”

“ఆ పిలుపు వినబడదు… అది ప్రకృతి పిలిచిన పిలుపు”

అమృత అతన్ని హత్తుకుంటూ అంది “నీవు ఎదిగావు పాదచారీ. నీతో నీలోని స్వరూపమూ ఎదిగింది.”

“అది ప్రకృతే”

“అవును…. కానీ అది తేలిగ్గా తెలియదు.”

“మథించాలి…. మరగాలి… కరగాలి…”

“అంతా నీ కోసమే! అన్వేషణే నీ కోసం!”

“ఫలించిందిగా!” నవ్వి అన్నది.

“ఒక అన్వేషణ వెనువెంటనే మరొకటి ఉంటుంది…. ఓ క్షణం ఫలించిన తృప్తి ఉన్నా, మళ్లీ మరో క్షణం మరో అన్వేషణ మొదలవుతుంది.”

“నా పిచ్చీ!…. ఎంత అర్థం చేసుకున్నావూ? ఇక నీ గురించి నాకు విచారమే లేదు… నేనెక్కడున్నా నీవు క్షణాల్లో రాగలవు” అమృత అతని నుదుటిపై ముద్దు పెట్టింది.

“జీవితం ఎంత చక్కని దొంగాట! మళ్లీ మళ్లీ పొందటం… మళ్లీ మళ్లీ అన్వేషించడం…”

“ఎక్కడికక్కడే తీవ్రత! ఎక్కడికక్కడే ఆనందం!” ఆమె కాలి వేళ్లతో ఆడుకుంటూ అన్నాడు పాదచారి. కాసేపాగి మళ్లీ అన్నాడు – “అన్నీ వరుసగానే అనిపించినా వరుస క్రమం కుదరటం లేదు.”

“దేని గురించి?” అమృత అడిగింది

“అన్నీ సంఘటనలే, ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంది. ఓ వర్షం రోజు మొదలయింది నా అన్వేషణ. ఆ తర్వాత ఎన్నో ఎన్నో వర్షాలు గడిచిపోయాయి గుర్తే లేదు. కానీ ఉత్సాహమూ ఉద్రేకమూ అలానే ఉన్నాయి. శరీరం దుర్బలమౌతున్నా మనస్సలానే ఉంది.”

“ఓ నాడు అదీ దుర్బలమవుతుంది!”

“అమృతా… మనస్సు అలిస్తే అదే నిద్రపోతుంది.”

“మళ్లీ అదే నిద్ర లేస్తుంది. అలిసిపోవచ్చు…. దుర్బలం కాబోదు.”

“ఊహించని ఉప్పెనలు దాన్ని ముంచి వేస్తే?”

నవ్వాడు పాదచారి.

“సముద్రాలు ముంచి వేస్తే, ఆ రాశి లోంచి నిటారుగా లేచిన మనో పర్వతాల్లాగా అదే నిద్ర లేస్తుంది అమృతా…. నీ కోసం నీలో ఐక్యం కావటం కోసం… మంటలో విసిరిన చితుకులా వెలుగులో వెలుగులా కలిసిపోవటం కోసం…”

ఆమె అద్భుతమైన పాదాల మీద శిరస్సు ఆన్చి అన్నాడు పాదచారి.

“నీ పిచ్చీ…” అతడి తలను పై కెత్తి తన వెచ్చని గుండెల్లో దాచుకుంది అమృత.

“నీ కీ లోకంతో పనే లేదు కదూ… నా మనిషి… నీ కీ లౌక్యపు దారులే తెలీవు కదూ… కానీ ప్రాణమా, కాలం మారుతుంది.”

“కాలం వేరు చేస్తుంది. క్షణక్షణమూ నీలోనే జీవిస్తూ మళ్ళీ నీకు ఎంతో దూరంలో ఉన్నట్టు భ్రాంతి కలిగిస్తుంది… నీ కళ్ళ వెంట అశృవులు రాల్పించి ఆ చుక్కలతోనే నీ దాహం తీర్చుకోమంటుంది… మరి… మరి అప్పుడూ….” అతడి తల నిమురుతూ అన్నది అమృత.

“నీవున్నావనే సృహ చాలు అమృతా…”

“ఆ ఒక్కటీ చాలు… ” మరింతగా ఆమె గుండెల్లోకి తల దూర్చి అన్నాడు పాదచారి

అతడిలో ఓ ప్రశాంతి!….

***

“ఊహలు ఇంకిన

మోహల మింగిన

మనసును పిండీ

గుప్పెట బట్టీ

ఊహల జల్లులు కురిపిస్తా!

ఆశల స్వారీ చేయిస్తా!”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here