పడక్కుర్చీ

2
2

[dropcap]మూ[/dropcap]డు రోజులనుంచి ఇల్లంతా చుట్టాల కోలాహలంతో మారుమోగి పోతోంది. కేరింతలు, కిల కిలలు, నవ్వుల పువ్వులు, కేకలు, అరుపులు… సందడే సందడి. వంటలు వడ్డనలు, గిన్నెలు తోముకోవటాలు ఇదే పని సీతకు. ముందు గదిలో ఆడపడుచు పిల్లలు, మరిది పిల్లలు పడక్కుర్చీలో పోటీలు పడుతూ కూర్చుంటూ కిరు కిరు మని శబ్దం వస్తుంటే పెద్ద పెద్దగా నవ్వుతూ ఊగుతున్నారు. అంతలో ధన్ మని చప్పుడు! పిల్లల అరుపులు. ఏమైందంటూ వంటింట్లోంచి ఆడవాళ్లంతా హడావిడిగా వచ్చారు. పడక్కుర్చీ గుడ్డ చిరిగిపోయి మరిది గారబ్బాయి ఏడేళ్ల చింటూ పడిపోయాడు. వాణ్ణి ఓదార్చి కుర్చీ పైకెత్తి పెట్టారు.

సీతకి ప్రియమైన పడక్కుర్చీ! వాళ్ళ నాన్న పోయాక అమ్మ అన్నయ్య దగ్గరకు వెళ్లిపోతుంటే, గుర్తుగా అదొక్కటి తెచ్చుకుంది. ఆ కుర్చీ వాల్చి ఖాళీగా ఉంటే, అందులో నాన్న కూర్చుని తనతో మాట్లాడుతున్నట్లు ఉంటుంది. తనందులో కూర్చుంటే, నాన్న తన తల నిమురుతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఇంటికెవరొచ్చినా అందులో కూర్చోవటానికే ఇష్టపడతారు. ఇప్పుడు భర్త వెంటనే కొత్తది వేయిస్తారా అని సీత సందేహం! అందరూ వున్నారనేమో, మూర్తి కూడా ఆ సాయంత్రమే కొత్తది కొనుక్కోచ్చి కుర్చీకి వేసేశాడు. ఆడవాళ్లు పనిలో ఉన్నంతసేపు, మగవాళ్ళు బైటకి వెళ్లినంత సేపు దానిమీద పిల్లలదే హక్కు! పెద్దవాళ్లకు తీరిక దొరికిందంటే పిల్లలని లాగేసి ఎవరో ఒకరు కూర్చుంటారు. పడక్కుర్చీకి మాత్రం విశ్రాంతి లేదు!

ఆ రోజే అందరూ టిఫిన్లు తిని, పులిహోర, దద్యోజనం డబ్బాల్లో పెట్టిస్తే తీసుకుని వాళ్ళ ఊళ్ళకి తరలివెళ్లారు. పెద్ద వాన వెలిసినట్లుగా ఉంది.ఆ రోజు ఇంట్లో వంట ముగించేసి ఒంటిగంట కంతా తినటాలు పూర్తి చేసి వంటింటి పని కానిచ్చుకుని సీత ముందు గదిలోకి వచ్చేప్పటికి రెండయింది. కళ్ళు కూరుకు పోతున్నాయి.

పడకుర్చీలో భర్త గురక పెట్టి నిద్ర పోతున్నాడు.

“ఏమండీ, లోపల మంచం మీద పడుకుంటారా” అంది సీత.

లేవలేదు. గాఢ నిద్రలో వున్నాడు. మళ్ళీ పిలిచింది. ప్రయోజనం లేకపోయింది.

సీతకు మధ్యాహ్నం పనయ్యాక ఓ పది నిముషాలు పడక్కుర్చీలో వాలటం ఎన్నో ఏళ్ల అలవాటు. అందులో కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది. పదంటే పది నిముషాలే! తర్వాత రోజంతా హుషారుగా ఉంటుంది  పగటిపూట మంచం మీద కాని, నేల మీద కాని పడుకుంటే నిద్రరాదు. వస్తున్న నిద్ర కూడా ఎగిరిపోతుంది.ఆ టైంలో పడక్కుర్చీ ఖాళీ లేకపోతే సీత బాధ వర్ణనాతీతం. ఈ వారం రోజుల నుంచి పగలు నిద్రా లేదు. పడక్కుర్చీ వంక చూసే తీరికా దొరకలేదు.

భర్తకు ఎక్కడ ఏ టైంలో పడుకున్నా నిద్ర వస్తుంది. పిలిస్తే పలుకుతుంది. మంచం మీద పడుకోవచ్చుగా. సీత ఉదయం ఐదింటికి లేచిందంటే వరస పనులు. పనయ్యాక మిషన్ కుడుతుంది. జాకెట్లు బాగా కుడుతుందని పేరు. మధ్యాహ్నం భోజనం అయ్యాకే పడుకుంటుంది. ఆ లోపల ఎప్పుడైనా నీరసంగా వున్నా, నిద్రగా అనిపించినా పడుకోదు.

తను పడక్కుర్చీలో తప్ప పడుకోలేనని తెలుసుగా! తెలిసి ఎందుకలా చేయాలి? కసి, కోపం, బాధ, ఉక్రోషంతో మంచం మీద పడుకుంది. నిద్ర రాలేదు. తలనొప్పి వచ్చింది. అటూ ఇటూ దొర్లుతు ఐదు నిముషాలు గడిపింది. కొడుకు రాజా కూడా వాళ్ళ నాన్నని లేపటానికి ప్రయత్నించాడు. మూర్తి గురక నాలుగు వీధుల దాకా వినిపించేట్లుంది. వారం రోజుల నుంచి అమ్మ అంత చాకిరీ చేస్తే ఈయన కెందుకో ఇంత అలసట! అనుకున్నాడు రాజా. సీత లేచి టీ పెట్టుకుని తాగింది. నాలుగింటికి మూర్తి లేచాడు.

“నాన్నా! అమ్మకి పడక్కుర్చీలో గాని నిద్ర రాదు కదా. నువ్వెక్కడైనా పడుకోవచ్చుగా” అన్నాడు రాజా.

“అయ్యో! నిద్ర పట్టేసింది. లేపచ్చుగా” అన్నాడు మూర్తి.

“లేపాం” అన్నాడు రాజా.

“కొంచెం గట్టిగా లేపాల్సింది” అన్నాడు మూర్తి.

“పక్కింటి వాళ్లకు వినిపించి తొంగి చూసారు కూడా” అన్నాడు కోపంగా రాజా.

సీత ఏం మాట్లాడలేదు.

“సారీ సీతా” అంటూ లోపలికి వెళ్ళిపోయాడు మూర్తి.

రాత్రిళ్ళు ఎప్పుడైనా కరెంటు పోయినా  గుమ్మం ముందు చల్లగాలిలో పడక్కుర్చీలో కూర్చోవటం సీతకు అలవాటు. అప్పుడు కూడా కుర్చీ ఖాళీ లేకపోతే మనసు కష్ట పెట్టుకుంటుంది.

మర్నాడు, ఇంకో ఆడపడుచు భర్త వచ్చాడు. పక్క ఊరే! ఏదో పనుంటే చూసుకుని మూర్తి వచ్చాక ఇద్దరూ భోజనాలు చేసారు. సీత కూడా తినేసింది.

“మంచం మీద పడుకోండి అన్నయ్యగారు” అంది.

“ఎందుకమ్మా, ఈ కుర్చీలో బాగుంది. ఓ కునుకు తీసి బయలుదేరతా” అన్నాడాయన.

సీత పని చేసుకుని వచ్చేటప్పటికి పడక్కుర్చీలో గాఢ నిద్రలో ఆడపడుచు భర్త!

‘ఇక మధ్యాహ్నం పూట పడుకోనే పడుకోను’ అనుకుంది కోపంగా, కళ్ళలో నీళ్లు వస్తుంటే సీత!

‘పాపం అమ్మ!’ అనుకున్నాడు రాజా.

రెండు రోజుల తర్వాత, ఆ రోజు సీత పుట్టినరోజు.

పొద్దున్నే లేచి సీత స్నానం చేసి గుడికి వెళ్లి వచ్చింది. భర్త ఆఫీసుకు, రాజా కాలేజీకి వెళ్లిపోయారు. వాళ్ళ కిష్టమని వంటతో పాటు పులిహోర, బొబ్బట్లు చేసింది. మధ్యాహ్నం రాజా కాలేజీ నుంచి వచ్చి,”అమ్మా, ఒకసారిలా రా” అంటూ గట్టిగా పిలిచాడు. మూర్తి అప్పటికే వచ్చి వున్నాడు. ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు.

కొత్త పడక్కుర్చీ, అచ్చంగా ఇంట్లో వున్నలాంటిదే!

“అమ్మా, నీ పుట్టినరోజుకి నా బహుమతి” అన్నాడు రాజా.

“ఇంట్లో ఒకటుండగా ఇదెందుకురా, మతి పోయిందా నీకు! అసలే ఈ నెల్లో ఖర్చు లెక్కువయ్యాయనుకుంటుంటే…” అరిచాడు మూర్తి. సీత కూడా అలాగే అంది.

“నాన్నా, అమ్మ రోజంతా పని చేస్తూనే ఉంటుంది. జాకెట్లు కుట్టి డబ్బు సంపాదిస్తోంది. ఇంటిని ఇంత చక్కగా నడుపుతోంది. అమ్మ అలసిపోయిన శరీరం ఒక్క పది నిముషాల పాటు పడక్కుర్చీ లోనే విశ్రాంతి పొందుతుంది. అది దొరకని రోజున అమ్మ ఎంత బాధ అనుభవిస్తుందో ఈ మధ్య బాగా చూసాను. ఈ డబ్బులు మీరు పాకెట్ మనీగా ఇచ్చిన వాటిలో అప్పుడప్పుడు మిగిలినవే!”

“అమ్మా, ఆ పడక్కుర్చీ పాతదైపోయింది. పాడయిపోయింది. ఇంక ఎక్కువ కాలం ఉండదు. అది తాతయ్య గుర్తుగా ఇన్నాళ్లు వాడావు. ఇది నేను ప్రేమతో ఇస్తున్నది. ఈ కుర్చీ పూర్తిగా నీది. దీన్ని ఎవ్వరూ ముట్టుకోవటానికి వీల్లేదు. నాన్నైనా, చుట్టాలైనా, ఎవరైనా సరే! ఇంట్లో ఎంత మందున్నా నువ్వు మధ్యాహ్నం ఇందులోనే పడుకో. బెడ్ రూంలో పెట్టుకో. బైటకి తేవద్దు. మధ్యాహ్నం ఆ పది నిముషాలు పడుకుంటే నువ్వు ఎంత ఉత్సాహంగా ఉంటావో, పడుకోని రోజు నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది నీ సొంతం” అంటూ సీతను కుర్చీ వాల్చి కూర్చోపెట్టాడు.

ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అని సీత కళ్ళలో కన్నీళ్లు ఆనందంతో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here