[పి.బి. షెల్లీ రచించిన Ode to the West Wind అని కవితని అనువదించి అందిస్తున్నారు ఆర్తి కవి బైరెడ్డి కృష్ణారెడ్ది.]
[dropcap]ఓ[/dropcap] హోరుగ వీచే పడమటి గాలీ!
శరత్తుకు ఊపిరిలూదిన
ఓ ఉచ్ఛ్వసన నిశ్వసనమా!
ఏదో తెగులు బారినట్టు
పసుపు నలుపు
పండుబారిన ఎరుపు
కుప్పతెప్పలుగ పాలిపోయి
ఉవ్వెత్తున ఎగిసే ఎండుటాకులను
ఏ మాంత్రికుని తంత్రయుక్తులో
చాచి తరుముతున్న పిశాచాల వలె
ఏ గట్టుకో ఈడ్చికొడుతున్నది
నీ అగోచర గోచరమే కదా
నీ సీతాకోక నీలి వన్నెల తోబుట్టువు
పలు సొబగుల ఆమని
తన మేలుకొలుపుల మధుర గీతిని
తీపి కలలు గనే
ధరిత్రి యెదపైన మోగించు దాకా
ఆలమందలను
మేపుకోసం అదిలిస్తున్న రీతి
ఆ కొండకోనల వీచికల్లో
పలు వన్నెల సోయగాలను
పరిమళాల మధురిమలను
ముద్దులొలుకు పూమొగ్గల
తనువుల నలరించు దాకా
శ్మశాన వీధి సమాధుల లోతులలో
శవాల రీతి జీవముడిగి
మొద్దువారి నిద్రాణులై వున్న
రేపటి మొక్కల రెక్కలు విచ్చుకునే
నిక్షిప్త బీజాలను మబ్బులు కమ్మిన
శీతరుతు ఒడిలోనికి చేర్చుతున్నది
ఓ హోరుగ వీచే పడమటి గాలీ!
నీ చోదక చోద్యమే కదా
ఓ హోరుగ వీచే గాంధర్వమా!
నా వాక్కును నన్నాలకించు
నువ్వొక భయానక వినాశకారివి
నువ్వొక కనువిందుల సృష్టికారివి
II
ఓ హోరుగ వీచే పడమటి గాలీ!
నీ వీచికల తరగల తాకిడికే
సువిశాలాంబర కోలాహలం నడుమన
భూతలాన చెల్లాచెదరౌతున్న
ఎండుటాకుల వలె
మబ్బుల తునియలు నడయాడుతున్నవి
నీ వీచికల తరగల తాకిడికే
జడివానలూ ఉరుములు మెరుపులూ
దేవకన్యలై
స్వర్గసీమకీ ఆఖాతపు అంచులకీ
చిక్కుకున్న కొమ్మలకు రెపరెపలాడుతున్నవి
చిర్రెత్తిన వారుణి తలపైన పైపైకి ఎగిసేటి
మాసిన చింపురు జుట్టువలె
వినువీధి శిఖరాగ్రము పైని
దృక్కులకందని దిగంత రేఖల నుంచి
తుఫానుల ముంగురులు తరుముకొస్తున్నవి
నీ వీచికల నీలి తరగల హోరుల తాకిడి వల్లనే
నీ ప్రోదిచేసుకున్న జలనిధికి
నిలయమై అలుముకున్న బలీయ
వాతావరణ భాండాగారం వర్షించే
కారు నల్లటి వానకు నిప్పుల వానకు
వడగళ్ళ వానకు ఆలవాలమైన సమాధుల
సువిశాల స్మృతి సౌధాల గోపురానివై
ఓ హోరుగ వీచే పడమటి గాలీ!
నా వాక్కును నన్నాలకించు
ఈ కడపటి రాతిరి కనుమరుగౌతున్న ఒక
వత్సర కాల గతికి నువ్వొక స్మృతి గీతానివి
III
బాయియా సుందర నగర
తీరపు ద్వీపాన అగ్నిశిలను ఒక వేపు
నాచులు నీలి నాచులందలి లేలేత
పరిమళాల పూల మొక్కల గుబురులు
దట్టంగా అలుముకోగా తన
వెల్లువల హోరులలో చలించి తూలిన
రాజప్రాసాదాలను ఆకాశహార్మ్యాలను
మరొక వేపు కలలు గంటున్న
అద్దమంటి తరగల సుడులు జోలపాటల
మత్తిలిన నీలి మధ్యధరాఖాతాన్ని
గ్రీష్మరుతు సుషుప్తి నుంచి
మేల్కొలిపిన మహత్తర శక్తివి
ఓ హోరుగ వీచే పడమటి గాలీ!
నా వాక్కును నన్నాలకించు
ఇరు వేపుల నీ తరగల తాకిడితో
నిట్టనిలువున రొండు చీలికలైన
అట్లాంటిక్ మహా సముద్రపు
అట్టడుగు భాగాన అగాధమందున
పాలిపోయిన వదనాలతో
కడలి వృక్షాలు నీటిపుష్పాలు
కంపించి అల్లాడుతున్నవి
IV
నువ్వు నీతో నన్నెగరేసుకు పోయే
నేనొక ఎండుటాకునైపోతే!
నీతో వడివడిగా ఎగియగల
ఒక మబ్బు తునకనైపోతే!
నీ ధిక్కార స్వరంలో నేనొక
ఊపిరి సలుపని కెరటాన్నైపోతే!
నేనిప్పుడొక నీ సమస్త శక్తుల
అంతరాంతరాన్నైపోతే!
కానీ నీ సమస్త శక్తుల తులతూగలేని
నేనిప్పుడొక జీవముడిగిన అశక్త జీవిని
ఓ ప్రతిహాతీత అమోఘమా!
నేనిప్పుడొక నాటి నా పసితనాన్నై
నీతో జతకట్టి
స్వర్గలోక రహదారులలో తిరగాడే
నీ సహచర సంచారినైపోతే!
నేనిప్పుడొక నాటి నా పసితనాన్నై
నీ వడివడి పరుగుల వెనక్కి నెట్టి
మున్ముందుకు పరుగులు తీస్తే!
ఇప్పుడు నాకదొక చేజారిన స్వప్నం
ఇప్పుడు నేనొక
నాటి నా పసితనాన్నై నా నిష్ఫల
ఆకాంక్షల బడయాలను ప్రయాసల
నీతో పరుగెత్తలేను
ఇప్పుడు నేనొక నా బతుకు
ముళ్ళపానుపు పైన చతికిలపడి
నెత్తురోడుతున్న జీవచ్ఛవాన్ని
ఒక మబ్బు తునకవోలె
ఒక కడలి కెరటమోలె
ఒక ఎండుటాకువోలె
నీ హోరెత్తే వీచికలో
ఉవ్వెత్తుకు నన్నెగరేసుకొనిపో
ఈ లోకపు ఈ నిముషపు
మోయరాని భారమేదో నన్నూ
నీకు మాదిరే సంకెలల బంధించి
ఊపిరి సలపనీయకున్నది
అలసట ఎరుగని పవనమా!
హోరుగ వీచే పవనమా!
తల పైకెత్తుకు తిరిగే పవనమా!
నీ హోరెత్తే వీచికలో
ఉవ్వెత్తుకు నను ఎగరేసుకుపో
V
ఈ అడవికి మల్లే
నన్నూ నీ వీణియగ చేకొనుము
ఈ అడవిన పండుటాకుల వలెనే
నా దేహ పత్రములు రాలిపోతేనేమి
అటు కాననమూ ఇటు నేనూ
మా ఇద్దరి అంతరాంతరాలలో నిగూఢమైన
వ్యధలోనైనా తీపిని గొలిపే శరదృతు
అంతఃశక్తుల నాఘ్రాణించగల గుణ సంపన్న
నీ సమన్వయీకరణ సమర్థ శక్తుల కల్లోలం
ఓ అనంత సృష్టికారినీ!
నీ హోరులో నన్నిముడ్చుకొనుము
నీ ఆవహనలో నన్నొక నిన్ను కానిమ్ము
ఎండుటాకులు పునరుజ్జీవన దిశగా
ఎగిసి పరుగెత్తు రీతిని
నా జవముడిగిన తలపులను తట్టిలేపి
ఈ విశాల జగతి సర్వస్వాన వికసింపజేయి
మంటలార్పివేసిన కొలిమి లోపలి
నివురు గవిసిన నిప్పురవ్వల వలె
నా ప్రబోధాలను
నీ ఈ కీర్తి గీతికనాలపిస్తూ ఈ
విశ్వ మానవ సమస్తాన విస్తరింపజేయి
నిద్రాణమై వున్న ఈ భువిని మేల్కొలుప
నా పెదవిన పలికే భవిష్యద్వాణి
ఎలుగుల శంఖారావానివైపొమ్ము
ఓ హోరుగ వీచే పడమటి గాలీ!
నా వాక్కును నన్నాలకించు
శీతకాలం దాపురించిన
వసంతకాలం అదెంత దూరం
ఆంగ్ల మూలం:
P B Shelley’s
Ode to the West Wind
అనువాదం: ఆర్తికవి బైరెడ్డి కృష్ణారెడ్డి