[dropcap]ఒ[/dropcap]క ప్రయాణం అనేక అనుభవాలను కలిగిస్తుంది. ఈ అనుభవాలు జీవితం కొనసాగింపులో ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్ని పరుచుకొంటూపోతాయి. నేను ప్రతి ఏటా ఒక్కో ప్రదేశానికి వెళ్లి చూసినప్పుడు కేవలం ఆ ప్రదేశంలో ఆందాలను చూసి ఆహ్లాదం చెందటమో.. సముద్రంలో అలలతో కేరింతలు కొట్టి.. ఇసుక దులుపుకొని వెనక్కి రావటమో జరుగదు. ఏ ప్రదేశానికి వెళ్లినా ప్రతిసారీ.. అనేక అనుభూతులు నా మస్తిష్కంలో శాశ్వతంగా ముద్రవేసుకొని నా నీడలా వెన్నంటి నాతోపాటే వస్తాయి. నా తోడై నిలుస్తాయి. అలాంటి అనేక భావనాత్మకమైన అనుభూతులు నన్ను ఆవరించిన మరో ప్రయాణం పడమటి కడలి. భారత దేశానికి పడమరవైపు ఉన్న కడలి అరేబియా మహాసముద్రం. ఈ సముద్రానికి దాపున ఉన్న ప్రముఖ ప్రదేశాల్లో ఒకటి ద్వారక. దానితోపాటే ఈ విశ్వానికి అహింసామార్గాన్ని ప్రబోధించిన మహాత్ముడు జన్మించిన పోర్‌బందర్.. భారతదేశ సుసంపన్నమైన ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైన సోమ్‌నాథ్.. పోర్చుగీసువారి రాజరికపు ఆనవాళ్లను చూపించే డయ్యు.. వీటితోపాటు.. మరికొన్ని కలగలసిన నా ఈ యాత్ర. ఈ ప్రపంచానికి క్రియాయోగాన్ని అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు నడయాడిన నేల ద్వారక. దాదాపు ఐదున్నర వేల సంవత్సరాల వేలక్రితమే మోస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో శ్రీకృష్ణుడు నిర్మించిన కాస్మోపాలిటన్ సిటీ ద్వారక. ఈ ద్వారకకు వెళ్లాలని చాలాకాలంగా అనుకొంటున్నా. ఎందుకో.. ఆలోచించిన ప్రతిసారీ.. ఏదో ఒక అవాంతరం. చివరినిమిషం దాకా అన్వేషణ. చివరలో మరో గమ్యాన్ని నిర్ణయించుకోవటం.. అక్కడికి వెళ్లిపోవటం.. ఇలాగే కాలం గడిచిపోయింది. 2019 జూలై పది. నా వివాహం జరిగి ఇరవై ఏండ్లు పూర్తయిన సందర్భం. అదే సమయంలో నేను తాజాగా రచించిన విలయ విన్యాసం పుస్తకం చేతికి అందివచ్చింది. శివుడి తత్త్వం మీద సుదీర్ఘంగా ఉన్న మొట్టమొదటి వ్యాసం ఇందులోని కీలక వ్యాసం. ఈ గ్రంథాన్ని జగద్గురువైన శ్రీకృష్ణుడికి సమర్పించాలన్నది బలమైన సంకల్పం. అంతే.. ఆ సంకల్ప మాత్రం చేతనే ద్వారక ప్రయాణం ప్రారంభమైంది.
ఎప్పటిలాగే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని జూలై 9వ తేదీన ప్రయాణం ప్రారంభించాం. మొత్తం 12 మంది. అందులో ఇద్దరు పిల్లలు. అంతా కలిసి హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు అహ్మదాబాద్‌కు చేరుకొన్నాం. విమానాశ్రయం బయట ముందుగానే ఏర్పాటుచేసుకొన్న టెంపో ట్రావెలర్ సిద్ధంగా ఉన్నది. ఉదయం స్నానాలు చేసే బయలుదేరాం కాబట్టి కాలకృత్యాల బాధలేకుండా పోయింది. విమానాశ్రయంలోనే కాస్త రిఫ్రెష్ అయి ట్రావెలర్‌లోకి షిఫ్ట్ అయ్యాం. విమానాశ్రయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పెట్రోల్‌పంప్‌లో డీజిల్ నింపుకొని.. అక్కడే బండిపై టీ తాగాం. ప్లాస్టిక్ గ్లాస్‌లు అక్కడ ఉన్నప్పటికీ.. ఎక్కువగా గాజు గ్లాస్‌లోనే టీ తాగుతారు. ఆ గ్లాస్ కూడా మనం హైదరాబాద్ వీధుల్లో ఇచ్చే గాజు గ్లాస్‌కు రెట్టింపైనా సైజు ఉంటుంది. అల్లం ఇలాచీతో కూడిన టీ బాగానే ఉంది. టీ తాగి మా ప్రయాణం ద్వారకవైపు కొనసాగింది.
అహ్మదాబాద్ నుంచి ద్వారకకు 480 కిలోమీటర్ల దూరం ఉన్నది. ద్వారక దగ్గర ఒక విమానాశ్రయం ఉన్నది కానీ.. అక్కడికి గుజరాత్ బయటి నుంచి విమానాల రాకపోకలు లేవు. అహ్మదాబాద్ నుంచి అడపాదడపా నడుస్తుంటాయి. ద్వారకకు సమీపంలో జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్ విమానాశ్రయాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌తో పోలిస్తే ఈ విమానాశ్రయాలకు చార్జీలు మూడు రెట్లు ఎక్కువ. హైదరాబాద్ నుంచి మేం ఏప్రిల్‌లో టికెట్ బుక్‌చేసుకొంటే.. ఒక్కో వ్యక్తికి 1690 రూపాయలు ఒకవైపు చార్జి వేశారు. అదే రాజ్‌కోట్, పోర్‌బందర్, జామ్‌నగర్‌లకు అదే సమయంలో విచారిస్తే.. ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయల చార్జి ఉన్నది. ఈ మూడు ప్రాంతాల నుంచి ద్వారకకు చేరుకోవడం సులభమే. ఎందుకంటే.. ఈ మూడు చోట్ల నుంచి 150 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణిస్తే ద్వారక వస్తుంది. కానీ.. అహ్మదాబాద్ నుంచి ఏకంగా ఏడున్నర గంటల ప్రయాణం. రైల్లో ప్రయాణానికి, టెంపో ట్రావెలర్‌లో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. రోడ్డు పై ప్రయాణంలో తొందరగా అలిసిపోతాం. పైగా పగటిపూట ప్రయాణం రైల్లోనే అలసట కలిగిస్తే.. ఇక ట్రావెలర్‌లో చెప్పేదేముంటుంది?
అహ్మదాబాద్ నగరం నుంచి మా ప్రయాణం ద్వారకకు మొదలైంది. ఉదయం 11.30 గంటలకు మొదలైన మా ప్రయాణం సిటీ దాటడానికే రెండు గంటలు పట్టింది. పెద్ద పెద్ద రోడ్లు ఉన్నప్పటికీ అంత సమయం పట్టిందంటే.. నగరం ఎంత మేర విస్తరించి ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మౌలికంగా నేను జర్నలిస్టును కాబట్టి నా ప్రయాణంలో.. నా దృష్టికోణం అంతా నేను చూస్తున్నదానిని నాలో నేను విశ్లేషించుకోవటంపైనే ఉంటుంది. 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే గుజరాత్ మోడల్ అన్నది ఓ జాతీయంగా స్థిరపడిపోయింది. నా ద్వారక ప్రయాణం ఈ గుజరాత్ మోడల్ అంటే ఏమిటో కండ్లారా చూడటానికి ఉపయోగపడింది. అహ్మదాబాద్ నగరం సాదాసీదా నగరం కాదు. నిస్సందేహంగా మహానగరాల జాబితాలో చేరాల్సిన నగరం. దాదాపు కోటి మంది జనాభా ఉన్న నగరం. దేశంలో హైదరాబాద్ తర్వాత జీవనది పారే నగరం అహ్మదాబాద్. సాబర్మతి నదీ తీరంలోనే అహ్మదాబాద్ నగరం ఉండటం విశేషం. తూర్పు పడమర నగరాలను కలపడానికి గుజరాత్ ప్రభుత్వం సాబర్మతి నదిపై ఏకంగా తొమ్మిది వంతెనలు నిర్మించింది. ఈ వంతెనలపై నుంచి ప్రయాణం నిజంగా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ నిజంగా అద్భుతమైన నగరం. మౌలిక సదుపాయాల కల్పనకోసం అక్కడి ప్రభుత్వం చూపించిన శ్రద్ధ అసాధారణమైంది. విశాలమైన రహదారులు.. నాణ్యమైన విద్యుదుత్పత్తి.. భారీ భవన సముదాయాలు.. చూస్తుంటేనే దేశంలో ఆరో కాస్మొపాలిటన్ సిటీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. భారీ భవన సముదాయాలపైన సౌర విద్యుత్ ఫలకాలు విశేషంగా కనిపించాయి. ప్రతి రహదారి నాలుగులేన్ల రహదారి కావడం ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం. దీంతోపాటు మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణం కూడా కొనసాగుతున్నది. దీనికితోడు సాబర్మతి నది కారణంగా నీటి కొరత కూడా పెద్దగా లేదు. అహ్మదాబాద్ నుంచి ఒక సుదీర్ఘ ప్రయాణం మొదలైంది. టెంపో ట్రావెలర్.. ఆ వెహికిల్ కష్టాలు అన్నీ ఇన్నీకావు. నా కొడుకు వల్లభ సినిమాలు చూద్దామని పెన్‌డ్రైవ్ నిండా సినిమాలు నింపుకొని వచ్చాడు. తీరా వెహికిల్ మొదలైన తర్వాత అందులో వీడియో ఆప్షన్ పనిచేయలేదు. ఏసీ లోని కొన్ని విండోల నుంచి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. ఏదోలా సర్దుకుంటూ.. బయలుదేరాం. మా బృందంలో చాలామంది భోజనప్రియులు కావడంతో తగినంత ఆహార భాండాగారాన్ని వెంటబెట్టుకొచ్చుకొన్నారు. వాహనం బయలుదేరగానే నోళ్లలో పళ్లు నిరంతరంగా కదలడం ప్రారంభమయ్యాయి. దాదాపు ఏడున్నర గంటల ప్రయాణం. దారి పొడవునా ప్రత్యేకంగా చూసేందుకు ఏమీలేవు. దక్షిణ భారతదేశంలో మనం ఎక్కడికి వెళ్లినా యాభై కిలోమీటర్లకు ఒక పర్యాటక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం కనిపిస్తుంది. గుజరాత్‌లో ఆ పరిస్థితి కనిపించదు. గుజరాత్ రాష్ర్టంలో దర్శనీయ స్థలాలు అనేకానేకం ఉన్నప్పటికీ అవి దూరంగా విసిరేసినట్లు ఉంటాయి. గుజరాత్ భౌగోళిక స్వరూపమే ప్రత్యేకంగా ఉంటుంది. గుజరాత్ పశ్చిమంవైపు మూడు పాయలుగా సముద్రంలోకి దూసుకుపోయినట్లు ఉంటుంది. అందువల్ల వడోదర ఒకవైపు ఉంటే.. జామ్‌నగర్ ఇంకోవైపు ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే చాలా సమయమే తీసుకుంటుంది. హైదరాబాద్ నుంచి ద్వారకకు నేరుగా డొమెస్టిక్ విమానాలు లేవు. ద్వారకకు సమీపంలో ఒక విమానాశ్రయం ఉన్నప్పటికీ అది అంత యాక్టివ్ ఎయిర్‌పోర్ట్ కాదు. ద్వారకకు హైదరాబాద్ నుంచి నేరుగా విమానంలో వెళ్లాలంటే.. ద్వారకకు 100 నుంచి 200 కిలోమీటర్ల మధ్య దూరంలో ఉన్న జామ్‌నగర్ లేదా పోర్‌బందర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఎకానమీ పరంగా చూసుకుంటే.. హైదరాబాద్ నుంచి జామ్‌నగర్ లేదా పోర్‌బదర్ విమాన చార్జీలు.. అహమ్మదాబాద్‌కు అయ్యే చార్జీలతో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. కేవలం ఈ కారణంగానే మేము హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. పగటిపూట రోడ్డుపై సుదీర్ఘ ప్రయాణం నిస్సందేహంగా కష్టమే. అహమ్మదాబాద్ నుంచి బయలుదేరిన మేము.. మధ్యాహ్నం 3 గంటలకు మార్గమధ్యంలో ఒక హోటల్ (దాని పేరు దర్శన్) దగ్గర ఆగి ఎంగిలిపడ్డాం. అక్కడ గుజరాతీ వంటకాలు ప్రత్యేకం. రాజ్‌కచోరీ, పానీపూరి, చాట్, భేల్‌పూరితో పాటుగా గుజరాతీ స్పెషల్ లంచ్‌కూడా ఏర్పాటుచేశారు. కానీ.. దక్షిణ భారత్‌లో చక్కని భోజనానికి అలవాటు పడ్డ వారికి గుజరాత్ భోజనం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. గుజరాత్ భోజనం గురించి ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏ హోటల్‌లో భోజనం చేసినా ఒక పెద్ద గ్లాస్ నిండా చిక్కటి మజ్జిగ తప్పనిసరిగా ఇస్తారు. భోజనంలో జనరల్‌గా ఆలుగడ్డ (బంగాళాదుంప) కూర ఉంటుంది. కాకపోతే.. టేస్టే కాస్త డిఫరెంట్.. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి భోజనానికి అలవాటుపడితేనే హాయిగా ఉంటుంది. లేకపోతే.. నరకమే కనిపిస్తుంది.
జామ్‌నగర్ శివారులోనే ఎస్సార్ వాళ్ల అతి పెద్ద పవర్ ప్లాంట్ ఉన్నది. జామ్‌నగర్‌కు ముందు.. వెనుక దాదాపు రెండు వందల కిలోమీటర్ల విస్తీర్ణంలో వందలకొద్దీ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ ఇక్కడ కనిపించాయి. అన్ని రంగాల పారిశ్రామిక వాడలను గుజరాత్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వాటన్నింటినీ చూసుకుంటూ.. మా ప్రయాణం ముందుకు సాగింది. ఇక్కడ పరిశ్రమలు తప్ప దర్శనీయ స్థలాలు ఏవీ లేవు. జామ్‌నగర్‌లో ఒక సరస్సులో రాజ్‌మహల్ ఉన్నది. అది సాయంత్రం ఐదు గంటలకు మూతపడుతుంది. చూస్తే ఇదొక్కటి చూడాల్సిందే తప్ప మరేమీలేదు. అక్కడి నుంచి ద్వారకకు చేరుకొనేసరికి రాత్రి 9 గంటలైంది. ద్వారకలో దేవభూమి లాడ్జిని ముందుగానే బుక్‌చేసుకొన్నాం. అందులో నాలుగు గదులను తీసుకొన్నాం. హోటల్ అడ్రస్ కనుక్కొని మొత్తానికి గదుల్లోకి చేరాం. ఇక్కడ అద్భుతం ఏమిటంటే.. గోమతి నది సముద్రంలో సంగమించే తీరాన హోటల్ ఉన్నది.
హోటల్ బాల్కనీలో కూర్చొని నదీసాగర సంగమాన్ని చూస్తూ.. హోరును వింటూ జీవితాంతం గడిపేయాలనిపిస్తుంది. ఎంత అద్భుతమైన ప్రదేశం.. ఎకనమికల్‌గా హోటల్ పొదుపైనది. గదులు చిన్నవైనా కంఫర్ట్‌గానే ఉన్నాయి. చిత్రమేమిటంటే.. బాత్‌రూంలోకి మంచినీటితోపాటు.. సముద్రపు నీరు కూడా వస్తుంది. అలల గురించి భయపడేవారు.. హోటల్‌లోనే సముద్రస్నానం చేయవచ్చన్నమాట. రాత్రి గదుల్లోకే భోజనాన్ని తెప్పించుకొని తినేసి పడుకున్నాం. అలా మా మొదటి రోజు గడిచిపోయింది.
ద్వారకకు చేరుకొనేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. ముందుగానే బుక్‌చేసుకొన్న హోటల్‌కు చేరుకొని ఎవరి గదుల్లో వారు రిలాక్స్ అయ్యాం. హోటల్ మేనేజర్‌కు భోజనం ఆర్డర్ ఇస్తే తెచ్చిపెట్టాడు. తినేసి హాయిగా నిద్రపోయాం. ఇదంతా బాగానే ఉన్నది. ఇక్కడే చెప్పుకోవలసింది చాలా ఉన్నది. తెలుసుకోవలసింది కొండంత ఉన్నది. మేం ఎంచుకొన్న హోటల్ సరిగ్గా సముద్ర తీరాన ఉన్నది. గోమతి నది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశాన్ని ఆనుకొని ఈ హోటల్ గది ఉన్నది. సరిగ్గా గోమతి నది.. సముద్రంలో కలిసే ప్రదేశమది. ఓ వైపు సముద్రం.. మరోవైపు నది.. ఎంత అద్భుతమైన సన్నివేశం? సముద్రపు అలలు హోటల్ మెట్లను తరుచూ తాకుతుంటాయి. హోటల్ గది బాల్కనీలో కూర్చొని సముద్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు. నిరుపహతిస్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు క..ప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెల మంచముంటే కవిత్వం పొంగుకొస్తుందని అల్లసాని పెద్దన కవి అన్నట్లు ద్వారకలోని ఆ హోటల్ బాల్కనీలో.. సముద్రపు హోరు నిరంతరంగా వినిపిస్తుంటే.. ఆరామ్ కుర్చీలో కూర్చొని.. ఆ సముద్రాన్ని చూస్తూ.. ఆ హోరు వింటూ.. ఇరవై ఏండ్ల వివాహ వార్షికోత్సవం జరుపుకొన్న ఈ రచయిత అనుభూతికి అక్షరాలేముంటాయి? ద్వారకకు వెళ్లిన వారిలో మేము.. మా పిల్లలతో పాటు.. మా ఆవిడ అమ్మనాన్న.. వారి సంతానం కూడా రావడంతో కొంత సందడిగా ఉన్నప్పటికీ.. మా ఇద్దరికి మేమిద్దరుగా మాత్రమే గడపడానికి సమయం దొరకలేదనే చెప్పాలి. మొత్తం మీద రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే నిద్రలేచి ఆరున్నర గంటలకల్లా ద్వారకాధీశుని దేవాలయానికి వెళ్లడానికి సిద్ధపడిపోయాం.
ఆలయం ఉన్నది అచ్చంగా ఆరేబియా సముద్రతీరంలో.. బంగాళాఖాతంతో పోలిస్తే.. అరేబియా సముద్రంలో అలల తీవ్రత చాలా ఎక్కువ. దీనికి తోడు సముద్రం మీది నుంచి వీచే గాలుల్లో వేగమూ అసాధారణంగా ఉన్నది. బంగాళాఖాతం నుంచి వీచే గాలులు అరేబియా సముద్రం నుంచి వీచినంత బలంగా ఉండవు. ఈ గాలులకు తోడు అలలు కూడా నాలుగు మీటర్లకు పైగానే ఎత్తుకు ఎగిసి పడుతుంటాయి. తీరం దగ్గర నిలబడి ఉంటే.. అసలు సమయమే తెలియదు. రోజుల తరబడి ఆ అలలను చూస్తూ అలాగే ఉండిపోవాలపిస్తుంది. అలాంటి తీవ్రమైన గాలులను తట్టుకొంటూ.. 51 మీటర్లు అంటే సుమారు 150 అడుగుల మేర గోపురాన్ని అలవోకగా ఎక్కి పతాకాన్ని మార్చేసి కిందకు దిగడమనేది నిశ్చయంగా అద్భుతమే. స్పైడర్‌మ్యాన్‌లు.. సూపర్‌మ్యాన్‌లు.. బ్యాట్‌మ్యాన్‌లు.. ఇట్లా ఏవేవో పేర్లతో సూపర్ హీరోల కామిక్ క్యారెక్టర్లను చూసి ఎంజాయ్ చేస్తాం.. కానీ.. ఇది నిజంగా మన కండ్ల ముందు జరిగే మహాద్భుత విన్యాసం.. సూపర్ హీరోలను మించిన సాహసమిది. ద్వారక గోపురంపై పతాకాన్ని అవనతంచేసి మరో పతాకాన్ని ఆవిష్కరించిన సన్నివేశాన్ని మేం జూలై 10, 2019న సాయంత్రం చూశాం. మళ్లీ గుడిలోపల విషయాల్లోకి వద్దాం. ద్వారకాధీశుడి గర్భాలయాన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత.. ఆలయ ప్రాంగణంలో ఇతర ఆలయాలను దర్శించుకొన్నాం. బలరాముడు, సుభద్రతోపాటు.. శ్రీకృష్ణుడి అష్టభార్యలకు మందిరాలు ఉన్నాయి. అంతేకాకుండా.. శ్రీకృష్ణుడి వ్యూహాలుగా చెప్పుకొనే వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఆలయాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ చిన్న చిన్న ఆలయాలు. దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఈ ఆలయాల్లో శిల్పకళ పెద్దగా కనిపించదు. కానీ నిర్మాణ వైచిత్రి అద్భుతంగా ఉంటుంది. ద్వారక ఆలయం కూడా నాకు అలాగే కనిపించింది. గర్భగుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆలయమంతా అనేక స్తంభాలు కనిపించాయి. ఒక్కో స్తంభాన్ని లెక్కించుకొంటూ వెళ్తే.. 72 స్తంభాలు లెక్కతేలాయి. మొత్తం ఐదంతస్తుల ఎత్తున్న ఈ ఆలయం 72 స్తంభాల ఆధారభూమికగా నిర్మించారు. ఆలయం మొత్తం ఎత్తు సుమారు 78 మీటర్లు ఉంటుంది. అందులో ప్రధాన గోపురం ఎత్తే 51 మీటర్లు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి మనుమడైన వజ్రనాభుడు కలియుగం ప్రారంభంలో నిర్మించాడు. 1472 లో ముస్లిం దురాక్రమణదారు సుల్తాన్ బేగడ దీన్ని ధ్వంసంచేశాడు. ఆ తర్వాత చాళుక్యుల కాలంలో 16వ శతాబ్దంలో ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు.
లాంచిలో మనిషికి ఇరవై రూపాయలు చార్జీ తీసుకొన్నారు. లాంచిపై ప్రయాణం ఓ పదిహేను నిమిషాలు ఉంటుంది. ప్రయాణం పదిహేను నిమిషాలే అయినా.. అలల తెరలపై.. ఒడిదుడుకులకు లోనవుతూ సాగే ప్రయాణం చక్కని అనుభూతిని కలిగిస్తుంది. బెట్ ద్వారకలో లాంచి దిగిన తర్వాత ఓ నాలుగైదు ఫర్లాంగులు నడుచుకుంటూ వెళ్తే ద్వారకాధీశుడి మందిరం కనిపిస్తుంది. ఇస్కాన్ సంస్థ ఈ ఆలయ బాగోగులు చూసుకుంటున్నట్టు అనిపించింది. ఎక్కువ మంది ఇస్కాన్ కార్యకర్తలు ఈ ఆలయ పరిసర ప్రాంగణంలో కనిపించారు. మేము ఆలయంలోకి వెళ్లిన సమయానికి స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు. ఒక పదిహేను నిమిషాలు వేచి చూసిన తర్వాత స్వామి దర్శనం కలిగింది. ద్వారకలో శ్రీకృష్ణుడి నిజనివాసంగా బెట్ ద్వారకను గురించి చెప్తారు. ఐదున్నర వేల ఏండ్ల నాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక మహానగరం మునిగిపోయింది ఈ బెట్ ద్వారక దగ్గరే. బెట్ ద్వారక తీరంలోనే ఆనాటి మహానగరం మునిగిపోయింది.
1963లోనే అరేబియా సముద్ర గర్భంలో ద్వారక నగర అవశేషాలను కనుగొన్నారు. ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఆర్ రావు నేతృత్వంలో 1960ల నుంచే ఇక్కడ సముద్ర గర్భంలో మునిగిపోయిన నగరం గురించిన అన్వేషణ జరిగింది. 1963లో పూణెలోని దక్కన్ కాలేజీ ఆఫ్ ఆర్కియాలజీకి చెందిన పరిశోధక విద్యార్థులు ఇక్కడ తొలిసారి అన్వేషణ చేశారు. అప్పట్నుంచి ఈ అన్వేషణ కొనసాగింది. 1984లో అప్పటి ప్రధానమంత్రి నేరుగా నిధులను మంజూరుచేయడంతో దాదాపు 45 రోజుల పాటు సముద్ర గర్భంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మహాభారత కాలంనాటి మహత్తరమైన కాస్మొపాలిటన్ నగరపు అవశేషాలను కనుగొన్నారు. సుమారు 192 కిలోమీటర్ల పొడవు.. 36, 864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. బారులు తీరిన వెడల్పాటి వీధులు.. వీధుల వెంట బారులు తీరిన వృక్ష సముదాయాలు.. దారి పొడవునా రాజమందిరాలు.. రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులు.. సాటిలేని ఆర్కిటెక్చర్‌తో నిర్మాణమైన మహానగరాన్ని కనుగొన్నారు. నగరంలో మొత్తం 7 లక్షల వరకు నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు. మౌలిక సదుపాయాలు కూడా అద్భుతంగా ఉన్నట్లు కనుక్కొన్నారు. ఇది కృష్ణుడు నిర్మించిన ద్వారక అంటూ బెట్ ద్వారక ద్వీపంలోని ద్వారకాధీశుడి మందిరంలో ఇస్కాన్ కార్యకర్త ఒకరు ఈ సముద్రగర్భంలో బయటపడ్డ మహానగరానికి సంబంధించిన విశేషాలను వివరించి చెప్పారు. ఆయన అలా వివరించి చెప్తుంటే.. ఆయన ముఖంలో కనిపించిన వర్చస్సు అద్భుతం. ఆయన్ను చూసిన కొద్దీ చూడాలనిపించింది. శ్రీకృష్ణుడి ద్వారక నగర అవశేషాలను చూడటానికి భారత ప్రభుత్వం అంతర నీటి పర్యాటకాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకొంటున్నది. త్వరలోనే సముద్రం నీటిలోని జగద్గురువు నిర్మిత మహానగరం ద్వారకను చూసే అవకాశం మనకు లభించవచ్చు.
బెట్ ద్వారక నుంచి తిరిగి హోటల్ గదికి వచ్చేసరికి మధ్యాహ్నమయింది. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని సరిగ్గా నాలుగు గంటలకు మళ్లీ బయటకు వచ్చాం. సరదాగా టెంపుల్ స్ట్రీట్‌లో నడుస్తూ ఉంటే.. తోవలో పానీపూరీ బండి కనిపించింది. దాన్ని చూడగానే అందరికీ ప్రాణం లేచొచ్చినట్టుంది. దాదాపు పది మంది మూడు వందల రూపాయలకు పైగా పానీపూరిని లాగించేశారు. అక్కడి నుంచి గోమతి నదిపై రిలయన్స్ అంబానీ నిర్మించిన వేలాడే వంతెన మీదకు వెళ్లాం. వంతెన మీదుగా నదిని దాటుకొంటూ ఈ తీరం నుంచి ఆ తీరానికి చేరుకొన్నాం.. అక్కడ సముద్రతీరంలో ఒంటెల బండ్లు ఉన్నాయి. దగ్గరలో ఉన్న బీచ్‌కు ఆ ఒంటెల బండెక్కి పోవాలి. ఒక్కొక్కరికి యాభై రూపాయల వరకు తీసుకొంటారు. మనం బేరం ఆడితే తగ్గవచ్చు. ఒక బండిలో పదహారు మంది వరకు కూర్చోవచ్చు. బీచ్ వరకు తీసుకెళ్లి.. ఓ అరగంట పాటు అక్కడ వేచి ఉండి తిరిగి తీసుకొస్తారు. మేమంతా ఆ బండిలో ఎక్కడం ద్వారా ఎడారి ఇసుకలో ఒంటె ప్రయాణపు అనుభూతిని పొందాం. ఇసుకలో ఒంటె నడుస్తుంటే.. దానికి బండి అటూ ఇటూ ఊగుతుంటే.. ఆ ప్రయాణమే వేరు. ప్రయాణం ఐదు నిమిషాలకు మించి లేదు. కానీ చక్కని ప్రయాణం. బీచ్‌కు చేరుకొని అక్కడ అంతా సరదాగా అలల తరగల్లో మునిగితేలారు. కేరింతలు కొట్టారు. ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలకైతే లెక్కేలేదు. దాదాపు 45 నిమిషాల పాటు సముద్రపు బీచ్‌లో మా సందడి సందడే కాదు. పిల్లలు ఇసుక గూళ్లు కట్టడం.. కెరటాలు వాటిని తనలోకి లాక్కొని పోవడం.. ఇసుకను పిడికిల్లోకి తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకోవడం.. మళ్లీ ఎగిసిపడే అలల్లో ఆ ఇసుకను తొలిగించుకోవడం.. మొత్తం మీద ఆ నలభై ఐదు నిమిషాలు తెలియకుండానే గడిచిపోయాయి. తిరిగి మళ్లీ అంబానీ వంతెన దగ్గరకు వచ్చాం. అక్కడ ఇసుకలో బైక్ రైడింగ్ ఉంది. ఒక్కొక్కరికి వంద రూపాయలు తీసుకొన్నారు. ఇక ఆగేదేముంది.. దానిపైనా రైడింగ్ కొనసాగింది. అక్కడి నుంచి నిదానంగా హోటల్ గదికి వచ్చి కాస్తంత ఎంగిలిపడి పడుకొన్నాం.
పోర్‌బందర్ టు సోమ్నాథ్
మూడోరోజు 11 జూలై 2019, ద్వారక నుంచి సముద్రతీరం వెంబడి మా ప్రయాణం ప్రారంభమైంది. ద్వారక నుంచి మొదట మా గమ్యం ముందుగా పోర్‌బందర్.. ద్వారక నుంచి సుమారు 150 కిలోమీటర్లు ఉంటుందేమో.. కానీ నాలుగు లేన్ల రోడ్లు వేస్తుండటంతో మా ప్రయాణం నిదానంగా సాగింది. దాదాపు మూడు గంటలకు పైగానే ప్రయాణంచేసి పోర్‌బందర్ చేరుకొన్నాం. ఉదయం ఏడు గంటలకు బయలుదేరితే.. దాదాపు పదిన్నర గంటలకు పోర్‌బందర్ చేరుకొన్నాం. జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన ఊరు ఇది.
పోర్‌బందర్ ఊరి మొదట్లోనే పెద్ద వాహనాలను నిలిపివేశారు. అక్కడి నుంచి ఆటోల్లో బయలుదేరి గాంధీజీ నివాసమున్న ప్రదేశానికి వెళ్లాలి. పోర్‌బందర్ చాలా చిన్న పట్టణం. దాదాపు వ్యాపారవేత్తలే ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ పెద్ద వాహనాలను అనుమతించకపోవడానికి ముఖ్యమైన కారణం.. ఇక్కడ వీధులు చాలా చిన్నగా ఉండటం. దారి పొడవునా దుకాణాలే కాకుండా.. రోడ్లపైనే తోపుడుబండ్లు.. వాటిపైన వ్యాపారంచేసుకొనే వ్యాపారులు.. వీటన్నింటినీ చూస్తే.. హైదరాబాద్‌లో జనరల్ జార్, చార్మినార్ ప్రాంతాలు గుర్తుకువచ్చాయి. పోర్‌బందర్ పట్టణం అచ్చంగా అలాగే ఉంటుంది. ప్రధాన వీధి గుండా ఒకట్రెండు కిలోమీటర్లు వెళ్తే గాంధీజీ పుట్టిన ఇల్లు కనిపిస్తుంది. గ్రౌండ్‌తోపాటు రెండతస్థుల భవంతి అది. దాని పక్కన కొంత ప్రదేశాన్ని ప్రభుత్వం సేకరించి ప్రత్యేక మందిరాన్ని నిర్మించింది. దీన్ని కీర్తిమందిరంగా పిలుస్తున్నారు. గాంధీజీ జన్మించిన ఇంటిని మార్పు చేయకుండా యథాతథంగా ఉంచుతూనే.. పక్కన ఈ మందిరాన్ని నిర్మించారు.
1868లో గాంధీజీ జన్మించారు. ఆ రోజుల్లోనే ఆయన తాతగారికి రెండంతస్థుల భవనం ఉన్నదంటే వాళ్లెంత సంపన్నులో అర్థమవుతుంది. ఇంటి గుమ్మాలు.. తలుపులు అన్నీ కూడా నాణ్యమైన టేకుతో నిర్మించారు. ప్రధాన గుమ్మానికి పైన మధ్యలో తొలిదేవర విఘ్నేశ్వరుడి బొమ్మ చిత్రించి ఉన్నది. లోపల హాలు.. మూడు గదులు ఉన్నాయి. ఒక గదిలోనుంచి పై అంతస్థుపైకి వెళ్లడానికి మనిషి పట్టేంత సైజులో ఏర్పాటుచేసి ఉన్నది. పైకి వెళ్లడానికి చెక్కతోనే మెట్లు నిర్మించారు. ఆ మెట్లమీదుగా ఎక్కడానికి ఊతంగా ఒక బలమైన తాడును కూడా ఆ తాడును పట్టుకొని పైకి వెళ్తే అక్కడ మరో మూడు గదులు.. దాన్నుంచి బాల్కనీ.. బాల్కనీ మీదుగా ముందుకు వెళ్తే మరో రెండు గదులు ఉన్నాయి. దానిపైన మరో అంతస్తుపై తొలి అంతస్తు ప్రణాళికతో నిర్మించారు. ప్రతి గదికీ వెంటిలేషన్ ఇబ్బంది లేకుండా అడుగడుగునా కిటికీలు ఉంచారు. కిచెన్‌లో పొగ బయటకు వెళ్లిపోవడానికి అవసరమైన ఏర్పాటు కూడా ఉన్నది. ప్రతి గదిలోనూ పడక ఉయ్యాల వేసుకోవడానికి వీలుగా కొక్కేలు అమర్చి ఉన్నాయి. ఇంటి వెనుక హ్యాండ్ బోర్ పంప్ కూడా ఉన్నది. ఇప్పుడది పనిచేయడంలేదు. గవర్నమెంట్ కొత్తగా వేరే బోరు వేసింది. గోడలన్నీ డంగు సున్నంతో నిర్మించారు. ఇంట్లో గాంధీ తాతగారు, తల్లిదండ్రుల చిత్రపటాలను ఉంచారు. గాంధీజీ జన్మించిన ప్రదేశంలో స్వస్తిక్ గుర్తును వేసి పవిత్రంగా ఉంచారు. కీర్తి మందిరంలో గాంధీజీ ఇంటికి సంబంధించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌తోపాటు గాంధీ జన్మించిన కాలంనాటి పాత్రలు.. ఇతర వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. గాంధీజీకి అత్యంత ఇష్టమైన రాట్నాన్ని కూడా ప్రదర్శనలో ఏర్పాటుచేశారు. దాని పక్కన గాంధీ పుస్తక ప్రదర్శన ఉన్నది. అక్కడ కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవచ్చు.
పోర్‌బందర్ గుర్తుగా ఒక రాట్నాన్ని కొన్నా. గాంధీ నివాసాన్ని వెనుకవైపు ఓ మూడు వందల అడుగులు వెళ్తే.. అక్కడ సాధారణ నివాసాల మధ్యలోనే మరో ఇల్లు ఉన్నది. ఇది గాంధీజీ భార్య కస్తూర్భా గాంధీ ఇల్లు ఉన్నది. ఇది రెండంతస్థుల భవనం. ఇందులో ప్రవేశించగానే ఒక గదిలో చిన్న ఆఫీసు ఉన్నది. దీనికి ముందు హాలు.. దానికి అటాచ్డ్ టాయ్‌లెట్ ఉన్నది. నాకు ఆశ్చర్యమేసిందేమిటంటే.. ఇక్కడ మూడు నాలుగు వంటగదులు కనిపించాయి. ఒక ఇంట్లో ఇన్ని వంటగదులు ఉండటమేమిటని అనిపించింది. ఆ ఇంటి సంరక్షకుడిగా ఉన్న క్యూరేటర్‌ను అడిగాను. ఇన్ని కిచెన్లు ఉన్నాయేమిటని.. ఆ ఇంట్లో చాలామంది సోదరులు ఉండేవారట. ఎవరి వంటగది వారికే ప్రత్యేకంగా ఉండేదిట. అందరూ ఒక ఇంట్లో ఉన్నప్పటికీ.. వంట మాత్రం ఎవరికి వారే వేరుగా చేసుకొనేవారని సదరు క్యూరేటర్ చెప్పారు. గాంధీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ సుగంధ ద్రవ్యాలు అమ్మే దుకాణాలు ఉన్నాయి. అగర్‌బత్తులు.. ఇతర సుగంధ ద్రవ్యాలకు పోర్‌బందర్ ప్రత్యేకం. అక్కడి నుంచి దేశ విదేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు అవుతాయి. ఇక్కడ కావలసినన్ని అగరుబత్తీలు, ధూప్ స్టిక్‌లు ఇలా తీసుకొన్నాం. పోర్‌బందర్‌లో ఎండుమిర్చీ వ్యాపారం కూడా గణనీయంగానే ఉన్నది. ఇక్కడి నుంచి ఎండుమిర్చీ గుజరాత్ రాష్ట్రమంతటికీ సరఫరా అవుతుందిట. పోర్‌బందర్ మార్కెట్‌లో ప్రధానంగా కనిపించింది మిర్చీయే. తిరిగి ఆటోల్లో బస్‌స్టాండ్ చేరుకున్నాం.
బస్ స్టాండ్ పక్కనే సుధామ దేవాలయం ఉన్నది. ఈ సుధామ దేవాలయం భాగవతంలో మనకు కనిపించే కుచేలుడికి సంబంధించింది. కుచేలుడు, శ్రీకృష్ణుడు బాల్యస్నేహితులుగా తెలుసు. ఈ కుచేలుడు లేదా సుధాముడు పోర్‌బందర్‌కు చెందినవాడే. ఈ ఇద్దరు సాందీపని ఆశ్రమంలో కలిసి చదువుకున్నారు. సుధాముడు పోర్‌బందర్ నుంచి బెట్ ద్వారకకు నడుచుకుంటూ వెళ్లి శ్రీకృష్ణుడిని కలిసి ఆయన సేవలను అందుకొని భాగ్యవంతుడయ్యాడు. పోర్‌బందర్ బస్‌స్టాండ్ దగ్గర ఈ సుధాముడి ఆలయం ఉన్నది. దీని దగ్గరే శ్రీకృష్ణుడి గురువు సాందీపని ఆలయం కూడా ఉన్నది. వీటన్నింటినీ చూశాక.. మా ప్రయాణం సోమ్‌నాథ్ వైపు సాగింది.
(సశేషం)