Site icon Sanchika

పడమటి కడలి-2

సోమనాథ్

పోర్‌బందర్ నుంచి సోమనాథ్ ప్రయాణం మరో రెండున్నర గంటలు. పోర్‌బందర్ నుంచి మా ప్రయాణం మొదలైంది. మార్గమధ్యంలో ఓ హోటల్ దగ్గర ఆగి భోజనం చేశాం. సాయంత్రం నాలుగు గంటలకు సోమనాథ్ చేరుకొన్నాం. జన్మలో ఒక్కసారి చూసి తీరాల్సిన క్షేత్రం. పోర్‌బందర్ నుంచి బయలుదేరేసరికే ఉదయం పదకొండు గంటలు కావడంతో మార్గమధ్యంలోనే ఓ హోటల్‌లో లంచ్ కానిచ్చేసి మొత్తంమీద సాయంత్రం నాలుగు గంటల సమయానికి సోమనాథ్ ఆలయానికి చేరుకొన్నాం. సోమనాథ్ పెద్ద ఊరేమీ కాదు. అరేబియా సముద్రతీరంలో ఎప్పుడో 649 సీ.ఈ. యాదవరాజు వల్లభి ఈ దేవాలయాన్ని నిర్మించాడు. భారతదేశంలో శివుడికి నిర్మించిన రెండో ప్రాచీన ఆలయంగా సోమ్‌నాథ్‌ను చెప్తారు. అంతకు ముందు ఒక దేవాలయం ఉండేదని.. సర్ జే గార్డన్ మెల్టన్ తన డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. అయితే మొదటి ఆలయం ఏమిటన్నది ఆయన పేర్కొనలేదు. సోమనాథ్ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొలి ఆలయం. ఎర్రని స్యాండ్‌స్టోన్‌తో నిర్మించిన ఈ ఆలయాన్ని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేవాలయంగా దీనికి కీర్తిప్రతిష్ఠలున్నాయి. ఈ ఆలయాన్ని అచ్చంగా అరేబియా సముద్రతీరంలో నిర్మించారు. సముద్రం నుంచి ముప్పు రాకుండా ఉండటానికి నల్లని గండ శిలలతో ఏకంగా ఒక గోడనే నిర్మించారంటే ఆనాటి ఆలయ నిర్మాతల దార్శనికత ఎంత గొప్పదో ఊహించుకుంటేనే అబ్బురమేస్తుంది.

ఈ ఆలయం పూర్తిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉన్నది. ప్రధాన ఆలయానికి దాదాపు 500 మీటర్ల దూరం నుంచే  భద్రతావలయం ప్రారంభమైంది. ఆలయం ముందుకు వెళ్లేసరికి కుడివైపున దేశ ప్రప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం ఉన్నది. లోపల స్వామివారి జ్యోతిర్లింగాన్ని దర్శిస్తున్నట్లుగా పటేల్ విగ్రహం ఆలయంవైపు ముఖంచేసి ఉన్నది. ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటుచేయడానికి ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పుకోవాలి. ఇది అలాంటిలాంటి దేవాలయం కాదు. ప్రపంచానికే ఒక అద్భుతం. సెక్యూరిటీ వలయాన్ని దాటి తొలి గోపురం ఉన్న గదిలోకి ప్రవేశించగానే పక్కనే ఉన్న ఒక గదిలో బ్లాక్ అండ్‌ వైట్ ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోలు సోమనాథ్ ఆలయ చరిత్రను ఆవిష్కృతం చేస్తున్నాయి. భారతదేశంపై ముస్లింల పైశాచిక, విధ్వంసకర దాడులకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. సోమనాథ్ ఆలయాన్ని 725 సీఈ లో అరబ్ రాజ్యం సింధ్ గవర్నర్ అల్ జునైద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఘజనీ మహమ్మద్ 17 సార్లు దండెత్తి సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసంచేశాడు. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా విలువైన సంపత్తిని కూడా దోచుకుపోయాడు. ఇందుకు సంబంధించిన అత్యంత విలువైన చిత్రాలు ఇక్కడ ఏర్పాటుచేయడం చారిత్రక అవసరం కూడా. మన దేశంపైన.. సంస్థానాలపైన, సాంస్కృతిక కేంద్రాలైన మందిరాలపైన ఏడు వందల ఏండ్ల క్రితం జరిపిన విధ్వంసకర దాడులకు ఈ చిత్రాలు సాక్షీభూతంగా నిలిచాయి. ప్రస్తుతం మనం చూసే సోమనాథ్ ఆలయం 1950లో పునరుద్ధరించిన ఆలయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దీన్ని పునరుద్ధరించారు. జీర్ణోద్ధరణ జరిగిన ఆలయం తిరిగి ప్రారంభం కావడానికి ఆరు నెలల ముందు పటేల్ అస్తమించారు. ఆలయ పునర్నిర్మాణానికి పటేల్ తీసుకొన్న చొరవకు జ్ఞాపకంగా ఆలయం ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముందున్న గోపురం నుంచి దాదాపు వంద మీటర్ల దూరం నడిస్తే సోమనాథ్ ఆలయ ప్రధాన మందిరం ఉంటుంది. లోపల గార్డెనింగ్ అద్భుతంగా చేశారు. అక్కడక్కడా కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బెంచీలను ఏర్పాటుచేశారు. ఎండాకాలంలో ఆలయ ప్రాంగణంలో నడువడం కొంత ఇబ్బందికరమే. ప్రధాన మందిరంలోకి అడుగుపెట్టిన తర్వాత  లోపలి శోభ చూడాల్సిందే.

గర్భాలయంలో అన్ని జ్యోతిర్లింగాల మాదిరిగానే సోమ్‌నాథుడు కూడా చిన్నగా.. కిందకు ఉన్నాడు. (ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ చిన్నగా.. ఎత్తు తక్కువగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాల్లో శివలింగాలు చాలా ఎత్తుగా ఉంటాయి. కాళహస్తితో పాటు తమిళనాడులోని పంచభూత శివాలయాల్లో  మహాద్భుత శివలింగాలు ఉంటాయి. వీటిని చూసేందుకు వెయ్యి కన్నులు కూడా చాలవు) దర్శనానంతరం స్వామికి అభిషేకం చేయడానికి ఆలయ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గర్భాలయానికి ముందు భక్తుల వరసను పరిమితం చేసే చోటునుంచే జలాన్ని పోసేందుకు ప్రత్యేక పైపును ఏర్పాటుచేశారు. గర్భాలయానికి ముందు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటుచేసిన రంధ్రాలలో నీళ్లు పోస్తే.. అవి నేరుగా పైపు ద్వారా వెళ్లి సోమనాథ్ శివలింగంపై పడుతాయి. దీని వల్ల భక్తులందరికీ స్వామివారికి అభిషేకం చేసే అవకాశం లభిస్తుంది.

దక్షిణ ధ్రువ సూచిక

సోమ్‌నాథుడికి అభిషేకం చేసిన తర్వాత గర్భ గుడి నుంచి బయటకు వచ్చాం. గుడికి ఎడమవైపు సముద్రాన్ని ఆనుకొని నిర్మించిన ప్రహరీ గోడ వద్ద ఒంటిస్తంభం ఉన్నది. ఈ స్తంభంపై భూగోళం.. ఆ భూగోళం నుంచి ఒక బాణం గుర్తు సముద్రంవైపు సూచిస్తూ ఉన్నది. ఆ స్తంభంపై రాసి ఉన్న సమాచారం చూస్తే నా కొడుకు ఆశ్చర్యపోయాడు. ఈ బాణం గుర్తు సముద్రంమార్గం లోతుల్లోంచి భూమి దక్షిణ ధ్రువాన్ని సూచిస్తుంది. మనకు పైన కనిపిస్తున్న సముద్రం లేకపోతే.. ఈ బాణం సూచిక నేరుగా భూమి దక్షిణ ధ్రువాన్ని తాకుతుందన్నమాట. ఎప్పుడో ప్రస్తుతం మనం అనుసరిస్తున్న శకం మొదలుకావడానికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఒకానొక దేవాలయంలో భూమి దక్షిణ ధ్రువాన్ని  కనుగొనేంత శక్తిసామర్థ్యాలున్న శాస్త్రవేత్తలున్నారా? ఇదిగో ఈ స్తంభం దీన్ని నిరూపిస్తున్నది. ఈ  ఒక్క స్తంభాన్ని చూసేందుకైనా ఒకసారి సోమనాథ్ ఆలయానికి వెళ్లిరావాలనిపిస్తుంది. ఈ స్తంభాన్ని చూస్తుండగానే.. ఒక వ్యక్తి సోమనాథ్ ఆలయ గోపురంపైకి అలవోకగా ఎక్కి దానిపైన ఉన్న పతాకాన్ని దించి.. కొత్త పతాకాన్ని ఆవిష్కరించాడు. ద్వారకలో మాదిరిగానే ఇక్కడ కూడా రోజూ పలుమార్లు పతాకాన్ని మారుస్తారు. మొత్తంమీద సోమనాథ్ ఆలయ సందర్శనం ముగించుకొని.. వెలుపలికి వచ్చాం. కాసేపు ఫొటో సెషన్ నడిచింది. అక్కడి నుంచి సుమారు 5.30 గంటల ప్రాంతంలో బయలుదేరిన మేము.. రాత్రి 9.30 గంటల వరకు కేంద్ర పాలితప్రాంతం డయ్యుకు చేరుకున్నాం.

డయ్యు

గుజరాత్ రాష్ట్రపు అంచుల్లో.. అరేబియా సముద్రంలో ఉన్న దీవి డయ్యు. వలస పాలన కాలంలో పోర్చుగీసుల ఆధీనంలో ఉన్న దీవి ఇది. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నది. ఇక్కడ చూడటానికి టూరిజం స్పాట్లు పెద్దగా లేకపోయినప్పటికీ.. సముద్రతీరంలో బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లేవారికి.. తక్కువ ధరల్లో మందు తాగాలనుకొనేవారికి డయ్యు ప్రయాణం ఉపయుక్తమే తప్ప అక్కడ చూడటానికంటూ పెద్దగా ఏమీలేదు. సోమనాథ్ నుంచి డయ్యు చేరుకొనేసరికి రాత్రి 9.30 గంటలయింది. అక్కడ ముందుగా బుక్‌చేసుకొన్న హోటల్‌లో దిగి.. కాస్త రిఫ్రెష్ అయి.. బయటి నుంచి భోజనాలు తెచ్చుకొని తినేశాం. తెల్లవారి మా కారు డ్రైవర్ కాస్త చిరాకు పెట్టాడు. ఎలాగోలా సర్దిచెప్పి.. డయ్యు ట్రిప్‌కు సిద్ధమయ్యాం. ముందుగా దగ్గర్లో ఉన్న ఒక హోటల్‌లో టిఫిన్ చేసి బయలుదేరాం. ఇక్కడ మన సౌత్ టిఫిన్లు దోశ.. పూరీ వంటివి బాగానే దొరికాయి. కావలసినంత తిన్నాక.. మంచి మజ్జిగ లభించింది. 20 రూపాయలకు ఒక పొడవాటి గ్లాసు నిండా కమ్మటి మజ్జిగ ఇస్తారు. ఇది అలాంటిలాంటి మజ్జిగ కాదు. కమ్మగా.. చిక్కగా.. వెన్నె పొరలు పొరలుగా తేలుతూ ఉండే మజ్జిగ. తాగినంత తాగి.. పార్శిల్ చేయించుకొని బయలుదేరాం.

మొట్టమొదట అక్కడొక చర్చి ఉన్నది. దాని పేరు సెయింట్‌పాల్ చర్చి. ఇది 1610లో నిర్మించిన చర్చి. ఇవాళ్టికి కూడా దాని వాస్తవ ప్రయోజనం కోసం వినియోగపడుతున్న ప్రాచీనమైన చర్చి ఇది. ఇప్పటికీ ఇందులో ప్రార్థనలు జరుగుతున్నాయి. మాకు ప్రార్థనలు చేయడం తెలియదు కాబట్టి.. చర్చి లోపలికి వెళ్లి దాని నిర్మాణ శైలిని పరిశీలించాం. సరిగ్గా అంతకు ముందురోజే నా మిత్రుడు, జర్నలిజం వృత్తిలో సహచరుడు.. కురసాల సురేశ్‌బాబు (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు సోదరుడు) హఠాత్తుగా గుండెపోటుతో మరణించినాడన్న వార్త తెలియడంతో చాలా బాధ కలిగింది. మా ఇతర మిత్రులు ఫోన్‌లలో ఇదే విషయమై సంప్రదింపులు జరుపుతుండటంతో వారితో మాట్లాడటమే సరిపోయింది. మేము మారేడుమిల్లి విజిట్‌కు వెళ్లినప్పుడు సురేశ్ ఇచ్చిన ఆతిథ్యం అంతాఇంతా కాదు. ఈ ట్రిప్ గురించి మరోసారి మాట్లాడుకుందాం. దీంతో కొంత అప్‌సెట్ అయిన మాట వాస్తవమే.. ఇందువల్లే చర్చిని చూడటంలో కాస్త కాన్‌సన్‌ట్రేషన్ తగ్గింది. అయినా.. చర్చిని బాగానే చూశాం. చర్చి బయటకు వచ్చిన తర్వాత కుడివైపు బయట దాని నిర్వాహకుల్లో ఒకరు కనిపించారు. ఆయనతో చర్చి గురించి తెలుసుకున్నా. నిస్సందేహంగా ఈ చర్చి నిర్మాణం అద్భుతమనే చెప్పాలి. ఆయన చెప్పిన ప్రకారం ఈ చర్చిని 1601 వ సంవత్సరంలో బరోక్ నిర్మాణశైలిలో నిర్మించారు. 1610లో దీని నిర్మాణం పూర్తయింది. సాంస్కృతిక పునరుజ్జీవన కాలంనాటి నిర్మాణశైలి ఈ చర్చి నిర్మాణంలో ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఎక్కువగా పోర్చుగీసువారే ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన నిర్మాణాలను చేపట్టారు. బ్రిటిష్‌వారి హయాంలో గోవా, డయ్యు, డామన్ పోర్చుగీసు వారి ఆధీనంలో ఉండటంవల్ల ఇక్కడి సెయింట్‌పాల్ చర్చి కూడా ఇదేవిధంగా నిర్మించారు. నిర్మాణశైలి అద్భుతంగా ఉన్నది.

డయ్యు కోట

  

అక్కడినుంచి బయటకు వచ్చిన తర్వాత డయ్యు కోటను చూడటానికి వెళ్లాం. ఈ కోట నిస్సందేహంగా శత్రు దుర్భేద్యమైంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోటల తర్వాత ఇంత దుర్గమమైన కోటను నేను చూడటం బహుశా ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్‌లో బొబ్బిలి రాజావారి కోట ఒకటి మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రాంతంలో కానీ, డయ్యులో కానీ ఉన్న కోటలు కొండలపై ఉన్నవి. బొబ్బిలిరాజావారి కోట నేలపై ఉన్నది. సముద్రమార్గంద్వారా పోర్చుగీసు వారు భారతదేశాన్ని కనుగొన్నారు. వారి రాకపోకలకు అనువుగా సముద్రతీరంలోనే ఈ కోటను నిర్మించారు.  పోర్చుగీసు నుంచి సముద్రమార్గంలో వచ్చే ఓడ నేరుగా కోట దగ్గరే దిగేట్టుగా దీన్ని నిర్మించారు. సముద్రమార్గం నుంచి శత్రువులు దాడిచేయకుండా పటిష్ఠమైన నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటుచేశారు. కోటలోకి ప్రవేశించడానికి మూడు ద్వారాలు దాటాక పైకి వెళ్లడానికి మెట్లున్నాయి. వీటిద్వారా పైకి వెళ్తున్న కొద్దీ అడుగడుగునా ఫిరంగులు కనిపిస్తాయి. ఫిరంగుల్లో వాడే మందు గుండ్లు కూడా మాకు అక్కడ కనిపించాయి. కోట చాలా పెద్దది. విశాలమైనది. లోపల రాణివాసపు గదుల వంటివి అనేకం కనిపిస్తాయి. స్నానపు గదులు.. దర్బారు హాల్ వంటివి చూడచక్కగా నిర్మించారు. మొత్తం మీద కోటను చూసి తిరిగి కిందకు వచ్చాం. బయట టాటూలు వేసేవాళ్లుంటే.. మా వాళ్లలో కొందరు సరదాపడ్డారు. అక్కడ బండిపై కొబ్బరినీళ్లు.. నిమ్మకాయ సోడాలు తాగి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. గుజరాత్‌లో నిమ్మకాయ సోడాలు మసాలాతో తాగితే అబ్బ ఎంత హాయిగా ఉంటుందంటే చెప్పలేం. గుజరాత్ సహజంగా వేడి ప్రాంతం కావడంతో  మంచినీటి వినియోగం చాలా ఎక్కువ. కాస్త దూరం ప్రయాణిస్తే చాలు దాహం వేయడం ఖాయం. దీంతో మంచినీళ్లు, నిమ్మకాయసోడాలు, కొబ్బరిబోండాలను  ఈ పర్యటనలో చాలా ఎక్కువగా తాగామనే చెప్పాలి. వీటికి తోడు చిక్కని, కమ్మని మజ్జిగను.. దాదాపుగా వెళ్లిన ప్రతి హోటల్లో తాగాం.

మొత్తం మీద డయ్యు కోట నుంచి మా ప్రయాణం  ఒకానొక గుహల వైపు సాగింది. ఈ గుహల పేరు నైదా గుహలు. డయ్యులోని జలంధర్ బీచ్ సమీపంలో ఈ గుహలు ఉన్నాయి. డయ్యు చాలా చిన్న పట్టణం. దాని మొత్తం విస్తీర్ణమే 40 చదరపు కిలోమీటర్లు. ఈ చివరి నుంచి ఆ చివరకు ఒక గంటలో చుట్టేసి రావచ్చు. ఈ ప్రదేశమైనా సముద్రాన్ని ఆనుకొనే ఉంటుంది. 1509 నుంచి ఇది పోర్చుగల్ ఆధీనంలో ఉన్నది. మనదగ్గర ఉన్న బొర్రా గుహలు, బెలుం గుహలవంటివి కావు. అవి సున్నపురాయి, నాపరాయి పొరల్లో ఏండ్ల తరబడి కలిగిన మార్పుల వల్ల ఏర్పడినవి. డయ్యులోని నైదా గుహలు  సహజంగా భౌగోళిక మార్పుల వల్ల జరిగినవా? లేదా అన్నదానిపై వివాదాలు ఉన్నాయి. పోర్చుగీసు వారు తమ నిర్మాణాల కోసం  ఈ కొండను కోయడం వల్ల ఏర్పడినవని ఒక వాదన ఉన్నప్పటికీ, భౌగోళిక మార్పుల వల్ల ఏర్పడినవేనని ఎక్కువమంది అంటారు. ఈ వాదోపవాదాల మాటెలా ఉన్నప్పటికీ.. నైదా గుహలు ఫొటోగ్రాఫర్ల పాలిటి స్వర్గమనే చెప్పాలి. కెమెరాకు పనిచెప్పటానికి ఇంత గొప్ప లొకేషన్ మరోచోట కన్పించదేమో అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఈ గుహలు. పలు కొండరాళ్ల మధ్యనుంచి ముందుకు సాగే సొరంగాలు.. ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయి. ఒక చోటి నుంచి మన ప్రయాణం మొదలుపెట్టి మరోవైపు నుంచి బయటకు రావచ్చు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏమిటంటే.. సూర్య కిరణాలు నేరుగా ఈ కొండ గుహల్లోకి ప్రసరించడం అద్భుతమైన ఫొటోజెనిక్ దృశ్యం. అలసట అనుకోకుండా కాస్త ఓపికగా తిరిగితే అద్భుతమైన చిత్రాలను మన కెమెరాలో బంధించడానికి వీలవుతుంది. ఏమైతేనేం.. అందరికీ ఆకళ్లవుతుండటంతో.. తొందరగానే బయటపడ్డాం.

 

అక్కడి నుంచి మా ప్రయాణం మళ్లీ సముద్ర తీరం వైపు సాగింది. డయ్యు పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఫుదమ్ గ్రామం దగ్గరున్న సముద్రతీరంలో గంగేశ్వర్ అన్న శివక్షేత్రం ఉన్నది. శివక్షేత్రం అంటే అదేమంత ఆధ్యాత్మిక ప్రదేశం కాదు. సముద్రపు తీరంలోనే  ఐదు శివలింగాలు ప్రతిష్ఠించిన ప్రదేశమిది. ప్రతి సముద్రపు  అల ఈ ఐదు శివలింగాలను అభిషేకం చేసి వెనక్కి వెళ్లడం ఇక్కడి ప్రత్యేకత. ఈ శివలింగాలకు ప్రత్యేకమైన గుడి ఏమీలేదు. ఐదారు మెట్లు కట్టి వాటి దగ్గరకు వెళ్లే ఏర్పాటుచేశారు. ఈ శివలింగాలను పాండవులు ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ సముద్రతీరం చాలా అందంగా  ఉన్నది. హనీమూన్ కపుల్‌కు ఈ బీచ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇస్తుందనడంలో సందేహంలేదు. ఇక్కడ సేదతీరడానికి కావలసినంత స్పేస్ ఉంది. టీ, స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఎంతసేపు గడిపినా సముద్రాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ ఫొటోగ్రాఫర్లకు కూడా పండుగే..

గంగేశ్వర్ శివలింగాల దర్శనం అనంతరం.. దగ్గర్లోనే ఉన్న మరో బీచ్‌కు వెళ్లి కొద్దిసేపు గడిపాం. ఇక్కడ పెద్దగా చూడటానికి ఏమీలేదు. బీచ్ కూడా గొప్పగా అనిపించలేదు. కొద్దిసేపు అక్కడ ఉండిన తర్వాత మా ప్రయాణం అహ్మదాబాద్‌కు ప్రారంభమైంది. సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభమైన మా ప్రయాణం దాదాపు ఏడున్నర గంటలపాటు సాగి రాత్రి 3.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకున్నాం. అహ్మదాబాద్‌లో మేం ముందుగా హోటల్‌రూం బుక్‌ చేసుకోలేదు. డయ్యు నుంచే ట్రిప్ అడ్వైజర్ ద్వారా అహ్మదాబాద్‌లోని హోటల్‌ను బుక్ చేసుకొని నేరుగా హోటల్‌కు చేరుకొన్నాం. ఉదయం 10 గంటల వరకు హోటల్‌లో రెస్ట్ తీసుకొని.. చెకౌట్ అయి.. సబర్మతి ఆశ్రమానికి బయలుదేరాం. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొనే ఆశ్రమానికి బయలుదేరాం.

అహ్మదాబాద్‌కు ప్రధాన నీటి వనరు సబర్మతి. ఈ నదీ పరీవాహక ప్రాంతంలోనే మహానగరం అభివృద్ధి చెందింది.  ఈ సబర్మతి తీరంలోనే మహాత్మాగాంధీ తన ఆశ్రమాన్ని నిర్మించారు. 1915 నుంచి 1930 వరకు భారత స్వాతంత్య్రోద్యమానికి కేంద్రస్థానంగా సబర్మతి ఆశ్రమమే ఉన్నది. ఇక్కడి నుంచే జాతీయోద్యమ వ్యూహ రచన ప్రధానంగా సాగింది. 1930లో ప్రఖ్యాత దండి యాత్రను మహాత్మాగాంధీ ఈ ఆశ్రమం నుంచే 78 మంది అనుచరులతో చేపట్టారు. దాదాపు 241 మైళ్లు అంటే.. దాదాపు 384 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగింది. సబర్మతి ఆశ్రమంలో అడుగు పెట్టిన ప్రతి భారతీయు ఒక విధమైన భావోద్వేగానికి గురవుతాడు. ఆ ఆశ్రమంలో నాకూ, మా ఆవిడకూ.. మా పిల్లలకూ కలిగిన అనుభూతి దాదాపుగా ఒకేవిధంగా కలుగటం ఒకింత ఆశ్చర్యకరంగానే అనిపించింది.  ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఒక కొత్త వాతావరణంలోకి ప్రవేశించినట్లనిపిస్తుంది. మనం టైం మిషన్‌లో 20వ శతాబ్దపు తొలినాళ్లలోకి వెళ్లిపోతాం. ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే జాతీయోద్యమ భావజాలం మనల్ని శారీరకంగా.. మానసికంగా ఆవరిస్తుంది.

     

గేటులోనుంచి కొంతలోపలికి వెళ్లగానే గాంధీ గ్యాలరీని అద్భుతంగా ఏర్పాటుచేశారు.  ప్రతి ఫొటో భారత స్వాతంత్య్రోద్యమ ఘట్టాలను కండ్లకు కట్టినట్లుగా చెప్తుంది. సబర్మతి ఆశ్రమ నిర్మాతలు, దాతలు, గాంధీజీ స్నేహితులు.. ఇలా అందరి చిత్తరువులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దండియాత్రకు సంబంధించి రూపొందించిన వాక్స్ ప్రతిమ… ఆ చారిత్రక ఉద్యమాన్ని.. దాని వెనుక భావోద్వేగాన్ని ఒక్కసారిగా గుర్తుచేసి ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంది. ఫొటో గ్యాలరీ పక్కనే గాంధీ లైబ్రరీ ఉన్నది. వేల కొలది పుస్తకాలను అందులో పొందుపరిచారు. ఇందులోకి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు మినహా విజిటర్లను అనుమతించలేదు. బయటి నుంచే గ్రంథాలయాన్ని చూసి.. ఆశ్రమం లోపలికి వెళ్లాం.

లోపల గాంధీజీ నివసించిన కుటీరం, ఆయన భార్య కస్తూర్భా ఉన్నకుటీరం, ఆచార్య వినోభా కుటీరం ఇలా ఒక్కొక్కటి వేర్వేరుగా ఉన్నాయి. గాంధీజీ జీవిత కాలంలో తాను స్వయంగా వడికిన రాట్నాన్ని ప్రత్యేకంగా భద్రపరిచారు. దేశ విదేశాలనుంచి ప్రముఖులు వచ్చినప్పుడు ఈ రాట్నం దగ్గరే ఫొటోలు దిగుతుంటారు. (గుర్తుకు వచ్చే ఉంటుంది లెండి). గాంధీ నివసించిన కుటీరంతోపాటు.. అన్ని కుటీరాల్లోనూ వంట చేసుకొనే ఏర్పాటు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. వార్డ్‌రోబ్‌లు కూడా ఉలలన్నాయి. వాటిలో ఆనాడు వాడిన పాత్రలు, కూరగాయలు కోసేందుకు వినియోగించిన కత్తితో సహా భద్రపరచి ఉంచారు. ఒక్కో కుటీరాన్ని చూసుకుంటూ.. గాంధీ గురించి చర్చించుకుంటూ.. ఆయన ఫిలాసఫీని వల్లె వేసుకుంటూ.. ముందుకు నడిచాం. అప్పటికే బాగా దాహం వేస్తుండటంతో.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మంచినీటి ప్లాంట్‌కు వెళ్లి కడుపారా నీళ్లు తాగాం. అవి సబర్మతి నదీజలాలే కావడం విశేషం.

పక్కనే గాంధీ పుస్తకశాల.. చేతితో తయారుచేసిన ఉత్పత్తులను అమ్మకానికి ఉంచారు. ఆ పక్కనే ఖాదీ భండార్ కూడా ఉన్నది. పుస్తకాల షాపులో చేతితో తయారుచేసిన సబ్బులు, ట్రావెల్‌కిట్.. రెండు నోట్‌బుక్‌లు కొన్నాం. మంచి క్వాలిటీ ఉత్పత్తులు.. అద్భుతంగా ఉన్నాయి. ఇక ఖాదీ భండార్‌లో మా అమ్మాయి తనకు నచ్చిందేమిటో కొనుక్కొన్నది. దాదాపు గంటకు పైగానే సబర్మతి ఆశ్రమంలో గడిపాం. ఆశ్రమం ప్రహరీ దగ్గరకు వెళ్లి.. సబర్మతి నది ప్రవాహమూర్తిని చూశాం. ఆ నదీ ప్రవాహం ఎంత సౌమ్యంగా.. ఎలాంటి అరిషడ్వర్గాలకు తావులేకుండా వినమ్రంగా.. తనకు ఏదీ పట్టనట్టు వెళ్తున్న ప్రవాహ సరస్వతి.. ఈ సబర్మతి. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న హోటల్‌లో భోజనం చేశాం. అక్కడి నుంచి మా ప్రయాణం అక్షర్‌ధామ్ దేవాలయం వైపు సాగింది. ఇది మా యాత్రలో చివరి డెస్టినేషన్.

అక్షర్‌ధామ్ అహ్మదాబాద్‌ను ఆనుకొని ఉన్న గాంధీనగర్‌లో ఉన్నది. ఇది హై సెక్యూరిటీ జోన్. గుజరాత్ రాజధాని గాంధీనగరే. అహ్మదాబాద్ సెంటర్ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ ఉంటుంది. ముఖ్యమంత్రి నివాసం, మంత్రుల నివాస సముదాయం, శాసనసభ, మండలి, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. రోడ్డుకు ఒకవైపు ప్రభుత్వ భవన సముదాయాలు.. మరోవైపు అక్షర్‌ధామ్ దేవాలయం ఉన్నది. హిందూ ఆధ్యాత్మిక నిర్మాణాలలో అపూర్వమైన శిల్ప, నిర్మాణ వైచిత్రితో నిర్మించిన అద్భుతమైన మందిరం ఇది. దేశ.. విదేశాల్లో ఒకనాటి బిర్లా మందిరాల పరంపర తర్వాత.. వాటికంటే అద్భుతంగా నిర్మాణమైన అక్షర్‌ధామ్ మందిరాలకు గాంధీనగర్‌లోని మందిరం కేంద్రస్థానం. 2002 సెప్టెంబర్ 24 న అక్షర్‌ధామ్ మందిరంపై ఉగ్రవాద దాడి జరిగింది. ఇద్దరు టెర్రరిస్టులు మందిరంలోకి ప్రవేశించి 30 మంది భక్తులను కాల్చి చంపారు. ఆ ఘటన తర్వాత ఈ మందిరానికి జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జర్నలిస్టును కాబట్టి.. సహజంగానే అక్కడికి వెళ్లగానే ఆనాటి ఉగ్రదాడి గురించే గుర్తుకు వచ్చింది. కారు డ్రైవర్‌ను అప్పటి విషయాలను గురించి ఆరాతీశాను. టెర్రరిస్టులు గుడి వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించిన ప్రాంతాన్ని చూపించాడు. పక్కా ప్రణాళికతో సాయంత్రం ప్రార్థన జరిగే సమయంలో దాడి చేసి అమాయకులను పొట్టన పెట్టుకొన్న ఘటన గుర్తు చేసుకొంటేనే ఒళ్లు గగుర్పొడిచింది. కెమెరాలు.. ఇతర వస్తువులన్నీ బయటే వదిలేసి.. సెక్యూరిటీ చెకప్ పూర్తిచేసుకొని లోపలికి వెళ్లాం. ప్రధాన గేటుకు.. ప్రధాన మందిరానికి మధ్యన దాదాపు 500 మీటర్ల దూరం ఉన్నది. అక్కడ డబ్బులకు ఫొటోలు తీసేవాళ్లున్నారు. ఫొటో వంద రూపాయలు. ఒకటే లొకేషన్.. ఒకరి తర్వాత ఒకరుగా ఫొటోలు దిగి మందిరంలోకి వెళ్లాం. ఒక విధంగా మందిరం ముందునుంచి చూస్తే తాజ్‌మహల్ ముందరి స్ట్రక్చర్ గుర్తుకు వస్తుంది. రెండువైపులా లాన్‌లు.. మధ్యలో ఫౌంటెన్ .. ఆ దారిలో ముందుకు వెళ్తే ప్రధాన మందిరం. టెంపుల్ లాంగ్ వ్యూ అద్భుతంగా ఉన్నది. మొత్తం 23 ఎకరాల్లో విస్తరించిన మందిరమిది. ఆరోజు ఎండ ఎక్కువగా ఉన్నందున పాలరాతి ఫ్లోరింగ్‌పై కాళ్లు సలసల కాలుతున్నాయి. అయినా చెప్పులు నిర్దేషిత ప్రాంతంలో వదిలేసి లోపలికి ప్రవేశించాం. అత్యంత కఠినమైన శాండ్‌స్టోన్‌ను స్తంభాలుగా, శిల్పాలుగా మలచి నిర్మించిన అత్యద్భుతమైన నిర్మాణం. ఇందులో ప్రతి స్తంభం ఒక అనిర్వచనీయమైన నిర్మాణాన్ని కలిగి ఉన్నది. 1781-1830 మధ్యన ఈ భూమ్మీద నడయాడిన స్వామి నారాయణ్ మహరాజ్ భగవంతుడిగా కొలిచే మందిరమిది. 1992లో దీన్ని నిర్మించారు. 97 కఠినమైన శిల్పీకరించిన స్తంభాలతో, 17 గుమ్మటాలతో, 220 రాతి బీమ్లతో 108 అడుగుల ఎత్తు.. 131 అడుగుల వెడల్పు, 240 అడుగుల పొడవుతో నిర్మించిన బహుళ అంతస్థుల మందిరమిది. ఈ మందిరంలో ప్రధానమూర్తి స్వామి నారాయణ్ అయినప్పటికీ, హిందూ ధర్మానికి సంబంధించి 256 మంది ఆధ్యాత్మికమూర్తుల ప్రతిమలను ఈ మందిరంలో ప్రతిష్ఠించడం అత్యంత విశేషమైన సంగతి. పైన ఉన్న అంతస్థులో స్వామినారాయణ్ జీవితానికి సంబంధించిన అంశాలతో చిత్రమాలికను గ్యాలరీగా ఏర్పాటుచేశారు. కింది అంతస్థులో స్వామినారాయణ్‌కు సంబంధించిన సృ్మతులను.. ఆయన వాడిన వస్తువులు. దుస్తులు.. ఆడిన ఆట వస్తువులు.. అన్నీ ఇక్కడ ఏర్పాటుచేశారు. దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం స్వామి నారాయణ్ వాడిన వస్తువులను చెక్కు చెదరకుండా పరిరక్షించడం అనేది నిస్సందేహంగా అపురూపమైన విషయం. వీటన్నింటినీ.. ఒక్కొక్కటి చూస్తూ.. అధ్యయనం చేస్తూ.. చర్చించుకుంటూ.. నడుచుకుంటూ.. నడిపిస్తూ..పైకి వచ్చాం.

మందిరంలో స్వామి నారాయణ్ స్వర్ణ మూర్తిని చూస్తూ అక్కడే కాసేపు కూర్చొని బయలుదేరాం. మందిరంలోనే క్యాంటీన్ ఉన్నది. అక్కడ స్నాక్స్, కూల్‌డ్రింక్‌లు తీసుకొని బయటకు వచ్చాం. ఇక్కడితో మా యాత్ర ముగిసింది. ట్రావెలర్ వాహనం ఎక్కి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాం. ఇక్కడ ట్రావెలర్ ఆపరేటర్‌తో కొంత గొడవ జరిగింది. ఎక్కడికి వెళ్లినా కొంత చికాకు తప్పదు. ముందుగా కిలోమీటర్‌కు 18 రూపాయలు తీసుకొంటానన్నవాడు.. మా బృందంలోని సహచరుడి కమ్యూనికేషన్‌లో జరిగిన పొరపాటు వల్ల 20 రూపాయలు చేశాడు. మొత్తం మీద వాదోపవాదాలు జరిగిన మీదట 19 రూపాయలకు సర్దుబాటు చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కి వచ్చాం. అహ్మదాబాద్ విమానాశ్రయంలో సుమారు గంట పాటు ఎదురుచూశాం. ఈ వెయిటింగ్ చాలా ఖర్చుకు కారణమైంది. పిల్లలు కూల్‌డ్రింక్ తాగినా.. పిజ్జా బర్గర్లు తిన్నా.. చివరకు కాఫీ తాగినా వందల్లో సొమ్ములు ఎగిరిపోయినాయి. వాళ్లను వద్దనలేం. ఏం చేస్తాం. మొత్తం మీద రాత్రి 8.45 గంటలకు గో ఎయిర్ విమానం ఎక్కి.. 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాం. ఇంటికి చేరుకొనేసరికి రాత్రి 12 గంటలైంది.

Exit mobile version