Site icon Sanchika

పడిలేచిన కెరటం

[dropcap]“మా[/dropcap]ష్టారూ! ఉగాది శుభాకాంక్షలు” పక్క మీంచి లేవగానే ఫోన్‌లో మొదట నాకు శుభాకాంక్షలు చెప్పిన వ్యక్తి మురళీకృష్ణ.

“నీకు కూడా నా శుభాకాంక్షలు. ఆశీర్వచనములు కూడా” అన్నాను నేను.

“ధన్యవాదాలు మాష్టారు” తిరిగి అన్నాడు.

అక్కడ నుండి ఫోన్లు మీద ఫోన్లు. అందరూ శుభాకాంక్షలు చెప్తునే ఉన్నారు. అందరితో మాట్లాడుతూనే ఉన్నాను.

“వేప పచ్చడి తినండి. ఆ తరువాత గుడికి వెళ్ళివద్దాం” అంది శ్రీమతి.

షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి ఆస్వాదిస్తూ, ఆ పచ్చడితో మన జీవితాన్ని పోల్చుకుంటూ ఆలోచిస్తున్నాను.

పచ్చడిలో తీపి, వగరు, కారం, పులుపు, చేదు ఎలా ఉన్నాయో మన జీవితం కూడా కష్టం, సుఖం, దుఃఖం, సంతోషాల కలయిక అనుకున్నాను. అంతే కాదు మనం చేసే ప్రతీ పనిలో వైఫల్యాలు, పొరపాట్లు దొర్లుతాయి. అలాంటప్పుడు అధైర్యపడి వెనుతిరగకూడదు. అపజయాలు మనల్ని ఆపేసే చిహ్నాలు కాదు. అవి సరియైన గమ్యానికి చేర్చే మార్గదర్శకాలు. వైఫల్యం అనేది విజయానికి పునాదిరాయి. వైఫల్యం నిరాశకు కారణం కారాదు. కొత్త ప్రేరణం నాంది కావాలి. ఈ మాటలు ఒకానొక సమయంలో తను మురళీకృష్ణతో అన్నాను నేను.

***

కొద్ది నెలల క్రితం జరిగిన సంఘటన నా కళ్ల ఎదుట కదలాడుతోంది. ఈ మధ్యనే ప్రభుత్వం నల్లదనం, నకిలీ నోట్ల నిర్మూలన కోసం ఐదు వందలు, వెయ్యి రూపాయల పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ చర్య ప్రజలందరినీ విస్మయానికి గురి చేసింది. ఆవేదనకి కూడా.

తమ దగ్గరున్న పాత నోట్లను మార్చకోడానికి కొందరు, బ్యాంకులో తమ ఖాతాలో ఉన్న డబ్బును జీవితావసరాలు తీర్చుకోడానికి బ్యాంకుకు వెళ్ళినవారు, పెన్షను తీసుకోడానికి వెళ్ళిన వారు ఇలా ఒకళ్ళేంటి అందరూ బ్యాంకుల వేవు పరుగులు తీస్తున్నారు. వాళ్ళతో రోజువారి కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న బడుగు జీవులు కూడా ఉన్నారు.

రెండు మూడు పర్యాయములు బ్యాంకుకు వెళ్ళి అక్కడ చాంతాడంత క్యూ చూసి నిరాశగా వెనుదిరిగిన నేను ఇంకో పర్యాయం బ్యాంకుకు వచ్చాను. క్యూలో వయస్సు మళ్ళినవాళ్ళు, అనారోగ్యంతో బాధపడ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.

“బిక్షగాడికీ మనకీ ఏం తేడా లేదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండి కూడా భిక్షగాడిలా ఇలా పడిగాపులు పడ్తున్నామంటే మనం డబ్బున్న బిక్షగాళ్ళం” క్యూలో ఎవరో అంటున్నారు. వాళ్ళ మాటలు వింటున్నాను నేను. క్యూలో నిలబడ్డ ప్రతీ వాళ్ళలో భావోద్వేగాలు, ప్రతీ వారి వదనంలో అసహనం.

ఇంతలో కలకలం.

‘బ్యాంకు మేనేజరు గారు వస్తున్నారు… బ్యాంకు మేనేజరుగారు వస్తున్నార’నే శబ్దాలు.

నేను తలప్రక్కకి త్రిప్పి చూశాను. అతను ఎదురుగా అగుపించాడు. పాపం పోలియోవ్యాధికి ఓకాలు చచ్చుపడిపోయి ఉంది. కర్ర సాయంతో కుంటుకుంటూ నడుస్తున్నాడు. జనాల దగ్గరకి వచ్చాడు.

“ఏంటో మనిషి చక్కగా ఉన్నాడు. ఏంటో ఈ కర్మ. విధి ఆడించిన వింత నాటకంలో మనిషి ఓ పాత్రధారి. విధి చేతిలో మనిషి, కీలు బొమ్మ” అనుకుని నిట్టూర్పు విడిచాను నేను.

“మీరు సహనంగా ఉండండి. ఇప్పటి వరకూ జరిగిన అనర్థాలు ఇకపై జరగవు. అలా జరక్కుండా జాగ్రత్తపడుతాము. అందరికీ డబ్బులు అందుతాయి. నాదీ భరోసా” అతనన్నాడు.

జనాలకి డబ్బులు అందతాయి అన్న బ్యాంకు మేనేజరు మాటలు జనాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాయి. నిరాశను తొలగించి ఆశను కలిగించాయి. నిరుత్సాహం స్థానంలో ఉత్సాహం చోటు చేసుకుంది.

మనిషికి విద్యతో పాటు వినయం విధేయతలతో పాటు బుద్ది కూడా ఉండాలి. అంతకు మించి మంచి సంస్కారం ఉండాలి. ఇవన్నీ బ్యాంకు మేనేజరులో ఉన్నాయి అని నాకనిపించింది.

బ్యాంకు మేనేజరు లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా ఓక్షణం ఆగి నా వేపు ఓ పర్యాయం చూశాడు. అతని కళ్ళలో వింత కాంతి. ముఖంలో సంతోషం. అయితే నా ముఖంలో విస్మయంతో పాటు సందిగ్ధత. ఎప్పుడో ఎక్కడో చూసినట్టు ఉంది అనుకున్నాను.

అతని అవయవానికి అవిటితనం వచ్చింది కాని మనస్సుకి అవిటితనం లేదు. అతని మనస్సు కడిగిన ముత్యం అని నాకు అనిపించింది. మనిషిని చూడగానే కొంత మంది స్వభావాలు తెలుస్తాయి.

పది నిమిషాలు అయిందో లేదో “మూర్తి మాష్టారు ఎవరండి? మేనేజరుగారు పిలుస్తున్నారు” బంట్రోత్తు బయటకు వచ్చి పిలిచాడు. క్యూలో నిలబడిన వారిలో క్యూరియాసిటీ. వెంటనే గుసగుసలు.

“నేనే!” అన్నాను.

“రండి మాష్టారూ నాతో!” అన్నాడు బంట్రోత్తు. అతని వెనుక బయలుదేరాను నేను.

“కూర్చోండి మాష్టారు!” అంటూ బ్యాంకు మేనేజరు తనకి ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. కూర్చున్నాను నేను.

“ఈ నోట్ల రద్దు వల్ల ప్రజలు పడ్తున్న కష్టాలు నాకు తెలుసు మాష్టారూ! అంతే కాదు వాళ్ళ విమర్శలూ తెలుసు. ప్రభుత్వం వారి ఈ చర్య అనుచితమని, అవివేకమైన చర్య అని ప్రజలు భావిస్తున్నారని కూడా నాకు తెలుసు. అయితే ప్రతీ పని వెనుకా ఏదో ప్రయోజనం ఉంటుంది” బ్యాంకు మేనేజరు అన్నాడు.

నేను మౌనంగా అతని మాటలు వింటూనే ఉన్నాను. కాని ఏం జవాబియ్యలేదు.

“ఈ నోట్ల కష్టాలు తొందర్లోనే సమసిపోతాయి. అయితే మనకి ఒకటి కావాలంటే మరోటి వదులుకోక తప్పదు. అవనీతి నల్లధానాన్ని అరికట్టాలంటే ప్రభుత్వం నిర్ణయం సమర్థించక తప్పదు. మరో విషయం గులాబీ మొక్కకి వాడియైన ముళ్ళు ఉన్నా, వాటి మధ్య అందమైన గులాబీ పువ్వు పూస్తుంది. ఆ అందమైన పువ్వుని చేజిక్కించుకోవాలంటే ముళ్ళు గుచ్చుకుంటున్నా బాధను అనుభవిచక తప్పదు. ఇప్పుడు ఈ నోట్లు రద్దు విషయం అంతే” బ్యాంకు మేనేజరు అన్నాడు.

‘చిన్నవాడయినా ఎంత బాగా చెప్తున్నాడు ఈ నోట్ల రద్దు గురించి’ మనస్సులో అనుకున్నాను.

“మాష్టారూ! మొదట్నించి మీరుంటే నాకు గౌరవం అబిమానం. నా చిన్నప్పటి నుండి నా పిడికెడంత గుండెలో ఆ అభిమానం అలాగే ఉండిపోయింది. సమాజంలో మనుషులు రకరకాలుగా ఉంటారు. తమ పనులను కూడా విడిచి పెట్టి ఇతరుల పనులుకి ప్రాధాన్యత ఇచ్చి నెరవేర్చేవారు సత్పురుషులు. తమ పనులు తాము చేసుకుంటూ ఇతరుల పనులు చేసేవారు మధ్యములు. తమ పనులకోసం ఎదుటి వారి పనులను చెడగొట్టేవారు మనుష్యుల్లో రాక్షసులు. తమకు ఏమాత్రం ప్రయోజనం లేకున్నా పరుల పనులను చెడగొట్టేవారిని ఏ పేరుతో పిలవాలో తెలియదు. వాళ్ళు అంత నికృష్టులు. మీరు మాత్రం రెండవ కోవకు చెందినవారు మాష్టారు” బ్యాంకు మేనేజరు నాతో అన్నాడు.

ప్రజలు మంచివారే కాని ఒక హద్దు వరకూ వారిలో సహనం ఉంటుంది. అది నశిస్తే వాళ్ళు ఎంతకేనా తెగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ చర్యను విమర్శిస్తూ క్యూలో నేను నిలబడి ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అనుకుంటున్న మాటలు నాకు తెలుసు.

బ్యాంకు మేనేజరు ఇన్ని విషయాలు చెప్తున్నాడంటే ఇతను మా స్కూల్లో చదివిన విద్యార్థి అయిఉంటాడు. వయస్సుతో పాటు శారీరకంగా వచ్చిన మర్పులకి చదువువల్ల వచ్చిన సంస్కారం వల్ల చప్పున నేను అతడ్ని గుర్తు పట్టలేకపోతున్నాను. ఇలా అనుకుంటున్న నా మెదడులో అనేక ఆలోచనలు అవి కూడా గతానివి.

చిన్నప్పుడే పోలియో వ్యాది వలన కాలు చచ్చుబడిపోయి కుంటివాడయి కర్ర సహాయంతో నడుస్తూ తన అవిటితనాన్ని అందరూ అవమానపరుస్తూ ఉంటే చిన్నబుచ్చుకుని బాధపడ్తున్న ఓ అబ్బాయి రూపం నా కళ్ళెదుట కదలాడింది. అతని గురించే నా ఆలోచనలు. ఆ అబ్బాయే బ్యాంకు మేనేజరు అని నాకు స్పష్టంగా తెలిసింది.

“నీవు మురళీకృష్ణవు కదూ” అన్నాను.

“అలా నన్ను ఆప్యాయతగా పిలిచిన వారు మీరు ఒక్కరే మాష్టారూ! అందరూ కుంటి కిష్టిగా అని పిలిచినవారే!”

అలా అంటున్న సమయంలో బ్యాంకు మేనేజరు కళ్ళల్లో కన్నీటి తెర నన్ను విచలితుడ్ని చేసింది.

“ఛ..ఛ.. అలా బాధపడకు. నవ్విన ఊళ్ళే పట్నాలవుతాయి” అలా అంటున్న నా ఆలోచనలు గతం వేపు తిరిగి పరుగులు పెడ్తున్నాయి.

మురళీకృష్ణ కుటుంబానికీ మాకూ ఏదో దూరపు చుట్టరికం ఉంది. దిగువ మధ్య తరగతి కుటుంబం వాళ్ళది. తండ్రి జ్యూట్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాడు. మిల్లు మూతపడ్డంతో ఆ కుటుంబం వీధిన పడింది. మురళీకృష్ణకి చిన్నతనంలోనే పోలియో వ్యాధి వచ్చింది. ఓకాలు చచ్చుబడిపోయింది. కర్ర పట్టుకుని కుంటుకుంటూ నడిచేవాడు.

ఉపాది కోల్పోయేసరికి ఆ కుటుంబం ఆర్థికంగా విలవిలలాడసాగింది. అక్కడికీ తల్లి ఆ వీధిలో ఉన్న వాళ్ళకి చిన్నచిన్న పనులు చేసే కొద్దిగా అయినా సంపాదించేది. అప్పడాలు, వడియాలు తయారు చేస్తే అతని తండ్రి బజారుకి తీసుకెళ్ళి అమ్మేవాడు. ఇవే వాళ్ళ కుటుంబానికిక జీవనాధారం.

అనుకోకుండా గుండె నొప్పి వచ్చి తండ్రి మరణించాడు. తల్లీ కొడుకు ఈ సంఘటనతో విలవిల్లాడారు. వీధిన పడ్డారు. అయినా తల్లి ధైర్యం తెచ్చుకుని కష్టపడి సంపాదిస్తూ కొడుకుని చదివించసాగింది.

స్కూల్లో పిల్లలు మురళీకృష్ణ మీద అజమాయిషీ చూపించేవారు. అతడ్ని అవమానించేవారు. తిట్టేవారు, కొట్టేవారు. అప్పుడప్పుడు పాపం ఆ అబ్బాయిని కుంటి కిష్టిగా అని పిలిచి ఏడిపించేవారు. పాపం ఆ అబ్బాయి చాలా బాధపడిపోయేవాడు. కన్నీళ్ళు పెట్టుకునేవాడు. నేను అతడ్ని ఓదార్చేవాడిని. ధైర్యం చేప్పేవాడిని. అతడ్ని ఏడిపిస్తున్న పిల్లల్ని మందలించేవాడ్ని.

పిల్లల్నయితే మందలించగలం కాని పెద్దవాళ్ళే తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే ఏం చేయగలను. అవధాని మాష్టారు ఆ అబ్బాయిని కుంటి కిష్టిగా అని పిలిచేవారు. అతనే కాదు ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు కూడా మురళీకృష్ణను అలాగే పిలిచేవారు. ఓ అడుగు ముందుకు వేసి అవధాని గారు మురళీకృష్ణచేత విశ్రాంతి సమయంలో కాళ్ళు కూడా పట్టించుకునేవారు.

“మాష్టారూ! పాపం ఆ అబ్బాయి చేత అలాంటి పని చేయించుకోకండి. అతడ్ని అలా వక్రంగా పిలవకండి దయచేసి. ఈ పద్ధతి మంచిది కాదు” అని అన్నను.

“ఏంటోయ్ మూర్తీ! మీకూ, వాళ్ళకీ ఏదో దూరపు బీరకాయ పీచు చుట్టరికం ఉందని నేను అలా పిలుస్తే బాధపడ్తున్నావా? ఏదో కుర్ర వెధవ, హాస్యానికి అలా అంటున్నాను అంతే. అయినా నువ్వు ఎందుకు అలా బాధపడిపోతున్నావు?” అని అవధానిగారు అన్నారు. అతను నన్నే కాదు మాష్టార్లనందరినీ అలా ఏకవచనంతో పిలుస్తారు. అది అతని నైజం అని అనుకున్నాను.

చదువులో మాత్రం అశ్రద్ద చేయకుండా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు మురళీకృష్ణ. టెన్తుక్లాసు పాసయిన తరువాత తల్లీ కొడుకు ఉపాధి వెదుక్కుంటూ వేరే చోటుకి వెళ్ళి పోవడం వల్ల తరిగి వాళ్ళను కలవడం అవలేదు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇలా మురళీకృష్ణని కలుసుకోవడం అయింది.

ఇలా ఆలోచిస్తున్న నేను ఓ సారి మురళీకృష్ణ వైపు చూశాను. నాలాగే అతనూ ఆలోచనా ప్రపంచంలో విహరిస్తున్నాడనిపించింది.

మురళీకృష్ణ ఆలోచన్లు ఇలా సాగుతున్నాయి. తను టెన్తుక్లాసు పాసయిన తరువాత తమ మజిలీ మారింది. లాయరు విశ్వనాథం గారు వృద్ధాప్యంలో ఉన్నారు. అతని భార్య కాలంచేసింది. అతని సంతానం విదేశాల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళడం ఇతనికి ఇష్టం లేదు. తనకింత వండిపెట్టేవాళ్ళు కోసం చూస్తూన్నారు ఆయన.

అటువంటి సమయంలో తన తల్లి అతనికి ఇంత వండి పెట్టడానికి ఒప్పుకుంది. అతనింట్లో ఓ గదిలో తల్లితో పాటూ ఉండేవాడు. అతను ఇచ్చిన డబ్బుతోనే తమిద్దరి జీవితం సాగిపోయేది. తన చదువు కూడా.

విశ్వనాథం గారి జీవితం చూస్తే తనకి ఒకటి అర్థమయింది. జీవితం అందరి పట్లా ఒకేలా ఉంటుంది. పూర్తిగా సుఖాన్ని, సంతోషాన్ని ఎవ్వరికీ ఇవ్వదు. ఇది సృష్టి నియమం కూడా. చీకటి, దాని తరువాత వెలుతురూ వెన్నంటే ఉంటాయి. సుఖం, దుఃఖం పక్కపక్కనే ప్రయాణం చేస్తాయి. చాలాసార్లు పరిస్థితులు మనకు అనుకూలించకపోవచ్చు. జీవితం అంటేనే మలుపులు, అనేక మెలికలు, అయినా నిలదొక్కుకోవాలి. అలా చేసిన నాడే మనకు విజయం లభిస్తుంది. దెబ్బమీద దెబ్బ తగిలినా మనం వెరవకూడదు.

మనం మంచి జీవితం కోసం ప్రయత్నం చేయాలి. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. గతాన్ని తలుచుకుని బాధపడకూడదు. వర్తమానం గురించి ఆలోచించాలి. అవరోధాలు వస్తూ ఉంటాయి. వైఫల్యాలు ఎదురువుతాయి. అయినా సహనాన్ని కోల్పోకూడదు. దాన్ని కోల్పోతే విజయాన్ని కోల్పోయినట్టే.

ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని తను తన లక్ష్యం వేపు అడుగులు వేసాడు. ఇంటర్ అయిన తరువాత విశ్వనాథం గారి దయ వల్ల, సహకారం వల్ల బి.కామ్ చదివాడు. బ్యాంకు టెస్టుకి ప్రిపేర్ అయ్యాడు. తన కష్టం వృథా అవలేదు. ఈనాడు బ్యాంకు మేనేజరు స్థాయికి ఎదిగాడు.

ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాడు మురళీకృష్ణ. మాష్టరుగారు తననే తదేకంగా చూస్తూ ఉండడం గమనించి తడబడ్డాడు.

“ఏవో గతం తాలూకా ఆలోచన్లు వచ్చాయి మాష్టారూ” అన్నాడు.

“గతాన్ని తలుచుకుంటే మనకి మిగిలేదు మనస్తాపమే తప్ప ఏం మిగలదు. గతం వేపు పరుగులు తీయకుండా వర్తమానం, భవిష్యత్తు వేపు నీ దృష్టి కేంద్రీకరించు మురళీకృష్ణా. నీవు మామూలు మనిషివి కాదు. పడిలేచిన కెరటానివి” అన్నాను నేను.

అతను నా పాదాలకి నమస్కరిస్తూ ఉంటే నాడు మనస్సులో అతడ్ని ఆశీర్వదించాను.

***

“పండుగ పూట కూడా మీకు ఆలోచనలే. వాటితోనో కడుపు నింపుకుంటారు. గుడికి వెళ్దామన్నారు రారా” శ్రీమతి ప్రశ్నతో మురళీకృష్ణ ఆలోచన్ల నుండి బయటపడ్డాను నేను.

Exit mobile version