Site icon Sanchika

పద్మజ 91xxxxxx89

[box type=’note’ fontsize=’16’] ఓ అమ్మాయి ఒక పది రూపాయల నోటు మీద పద్మజ 91xxxxxx89 అని వ్రాసి మార్కెట్లోకి పంపింది. ఆ నోటు దొరికిన ఓ రచయిత ఆమె అసలు అలా ఎందుకు వ్రాసిందో, ఏం ఆశించి వ్రాసిందో తెలుసుకుని కథ వ్రాయలనుకుంటాడు. కానీ…. ఆ తర్వాత ఏమయ్యిందో తోట సాంబశివరావు వ్రాసిన “పద్మజ 91xxxxxx89” కథ చెబుతుంది. [/box]

[dropcap]ఉ[/dropcap]దయం ఆరు గంటలకే విశాఖ ఆర్.కె. బీచ్‌లో జాగింగ్ ముగించుకుని ఇంటికి చేరుకున్న కిషోర్ “అమ్మా” అంటూ పిలిచి తను వచ్చినట్లు తెలియజేశాడు తల్లి శారదాంబకు.

“ఆ… డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్‌జూస్ పెట్టాను. త్రాగు” చెప్పింది శారదాంబ.

“అలాగే” అంటూ జ్యూస్ తాగుతుండగా శారదాంబ వచ్చి “ఇది నువ్వు ఈ రోజు తీసుకోవలసిన కూరగాయల లిస్టు. వెళ్ళి తీసుకురా… ఆ! త్వరగా రా.. అవతల నాకు బోలెడు పనులున్నాయి..” అంటూ చీటి ఇచ్చింది.

“అమ్మా! పనిమనిషి పనులు చేస్తుంది. సరే… వంటమనిషిని కూడా పెట్టుకుంటే నీకు శ్రమ తగ్గుతుంది కదమ్మా” అని సలహా ఇచ్చాడు కిషోర్.

“ఆ… మనిద్దరి వంటకి ప్రత్యేకంగా ఒక మనిషి కావాలా…. అవసరం లేదు. నేను చేస్తాలే” అని చెప్పి వెళ్లబోయిన శారదాంబ వెనక్కి తిరిగి కొడుకుతో “అయినా.. నాకు శ్రమ తగ్గించాలనుకుంటే.. నాకో కోడలిపిల్లని తీసురా… అప్పుడు ఇద్దరం కలిసి చక్కగా ఇంటి పనులన్నీ చేసుకుంటాం..” అని వెటకారంగా అంది.

“నేనూ అదే చూస్తున్నానమ్మా.. కాని… నాకు మంచి భార్య దొరకడం పెద్ద కష్టం కాదు. నీకు మంచి కోడలు దొరకడమే చాలా కష్టం” కొంచెం ఇబ్బందిగా చెప్పాడు కిషోర్.

“అంటే.. ఏంట్రా.. నీ ఉద్దేశం” అర్థమవనట్లు అడిగింది శారదాంబ.

గద్గద స్వరంతో కిషోర్ “అవునమ్మా! నా చిన్నప్పుడే నాన్న యాక్సిడెంట్‌లో పోయారు. అప్పటి నుంచి నువ్వే నాకు అమ్మా నాన్న అయి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడ్ని చేశావు. అలాంటి నిన్ను జీవితాంతం అపురూపంగా చూసుకోవాలి. నీకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని నా కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే నాకు భార్యగా వచ్చే అమ్మాయి కూడా నిన్ను ఎల్లప్పుడూ ప్రేమానురాగాలతో చూసుకోవాలి. నిన్ను అర్థం చేసుకుంటూ నీకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా మసలుకోవాలి” అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు కిషోర్.

శారదాంబ కిషోర్‌ని దగ్గరకు తీసుకుని “బాధపడకు నాన్నా.. మనింటికి తప్పకుండా మంచి కోడలే వస్తుంది… సరేనా!” అంటూ కిషోర్‌ని సముదాయించింది కూరగాయల మార్కెట్‌కి బయలుదేరాడు కిషోర్.

మార్కెట్లో కూరగాయలు కొనుక్కుని వందరూపాయలు యిస్తే… తిరిగి పది రూపాయలు ఇచ్చాడు కూరగాయలబ్బాయి. ఆ పదిరూపాయల నోటుపై ఉన్న తెల్లటి ఖాళీ స్థలంలో ఏదో వ్రాసివున్నట్లు కాకతాళీయంగా చూశాడు కిషోర్. తీరా చూస్తే…

“పద్మజ 91xxxxxx89” అని వ్రాసివుంది.

ఇంటికి బయలుదేరిన కిషోర్‌కి ఏవేవో ఆలోచనలు.

“ఎవరీ పద్మజ.. ఎందుకిలా సెల్ల్ నెంబరు వ్రాసింది. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేస్తే తెలియజేయడానికా… లేక తను కష్టాల్లో వున్నాను… సహాయం చేయమని అడగడానికా… ఏమైవుంటుంది”

బ్యాంక్‌లో ప్రోబెేషనరీ ఆపీసరుగా పనిచేస్తున్న కిషోర్‌కి కథలు వ్రాయడం ఒక హాబీ. అందుకే ఈ సెల్ నెంబరు విషయం కొంచెం లోతుగా వెళ్తే తన కథకో మంచి సబ్జక్టు దొరుకుతుందనే ఆశతో, ఇంటికి చేరుకొగానే ఆ నెంబరుకు ఫోన్ చేశాడు. అవతలి నుండి ఓ పురుష కంఠం… “హలో… ఎవరండీ” అని పలకరించింది.

“నా పేరు కిషోర్ అండి.”

“ఆ… చెప్పండి.”

“పద్మజగారున్నారాండి.”

“ఆ..వున్నారు.”

“ఇంతకీ మీరెవరండి.”

“నేను యం.వి.పి కాలనీలో వుంటాను. సమాజానికి ఉపయోగపడే కథలు వ్రాయడం నా హాబీ.”

“అయితే మా అమ్మాయితో పనేంటి?”

“ఏం లేదండి… ఈ మధ్య మీ అమ్మాయి ఒక పది రూపాయల నోటు మీద పద్మజ 91xxxxxx89 అని వ్రాసి మార్కెట్లోకి పంపింది. ఆ నోటు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు నా వద్దకు చేరింది. అసలు అలా ఎందుకు వ్రాసిందో, ఏం ఆశించి వ్రాసిందో… ఆ విషయం తెలుసుకుంటే నా కథకు ఒక మంచి సబ్జెక్టు దొరుకుతుందనే ఆశతో ఫోన్ చేశాను. దయచేసి మీరు వేరుగా అలోచించకండి” అంటూ వినయపూర్వకంగా ప్రాధేయపడ్డాడు కిషోర్.

“సరే.. మీరేదో మంచి వారిలా మర్యాదస్తుల్లా వున్నారు. పద్మజను పిలుస్తాను, మాట్లాడండి.”

“ఆ..ఆ.. వద్దండి. నేనే మీ యింటికి వస్తాను. డైరెక్టుగా మాట్లాడితేనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు.”

“సరే.. ఎప్పుడొస్తారు?”

“సాయంత్రం 5గం వస్తాను. మీకు ఓ.కే. నా అండి.”

“సరే..రండి..”

“కొంచెం అడ్రసు చెప్తారా”.

“గిరిధర్ లెక్టరర్… సీతమ్మధార, అంజనేయస్వామి గుడి ప్రక్కసందులో కుడి ప్రక్క రెండో ఇల్లు.”

“థాంక్స్ అండి… వచ్చి కలుస్తాను…”

“ఓ.కె.”

“ఎవర్రా అది… వచ్చి కలుస్తానంటున్నావు” అడిగింది శారదాంబ.

“మా ఫ్రండ్… విజయవాడ నుండి వచ్చాడమ్మా… సాయంత్రం కలుస్తానని చెప్తున్నాను” బదులిచ్చాడు కిషోర్.

టంఛన్‌గా 5 గంటలకు గిరిధర్ ఇంటి ముందు కాలింగ్ బెల్ కొట్టాడు కిషోర్. తలుపు తెరిచిన గిరిధర్ “మీరు కిషోర్‌గారే కదూ!” అని అడిగాడు. అవునన్నట్లు తలాడించాడు కిషోర్. “లోపలికి రండి” అంటూ సాదరంగా ఆహ్వానిచాడు గిరిధర్. ఇద్దరూ సోఫాలో కూర్చున్న తరువాత “పద్మజా… ఒక సారిలా రామ్మా” అని పిలిచాడు గిరిధర్.

“ఏంటి నాన్నా…” అంటూ వచ్చింది పద్మజ “నే చెప్పానే… వీరే కిషోర్‌గారు” అంటూ కిషోర్ వైపు తిరిగి “మా అమ్మాయి.. పద్మజ.. ఇంటర్మీడియడ్ పైనల్ ఇయర్ చదువుతుంది.”

“నమస్కారమండి” వినయంగా నమస్కరించింది పద్మజ.

“నమస్తే. అమ్మా…” చెప్పాడు కిషోర్. ఇంతలో గిరిధర్ భార్య కృషవేణి, పెద్దమ్మాయి నీరజ అక్కడకు చేరుకున్నారు.

“ఈమె నా భార్య కృష్ణవేణి… మా పెద్దమ్మాయి నీరజ… డిగ్రీ వరకు చదువుకుంది. ప్రస్తుతం డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో క్లర్క్‌గా జాబ్ చేస్తుంది.” అంటూ ఇద్దర్నీ కిషోర్‌కి పరిచయం చేశాడు గిరిధర్. నమస్కారాలు, ప్రతి నమస్కారాల తరువాత అందరూ అక్కడే కూర్చున్నారు.

“మీరు డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో పని చేస్తున్నారా… నేనూ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లోనే ప్రొబెేషనరీ ఆఫీసరుగా పని చేస్తున్నాను.” చెప్పాడు కిషోర్ నీరిజతో.

“అవునా… ఏ బ్రాంచిలో” అడిగింది

“ఆర్.కె.బీచ్ బ్రాంచిలో… మరిమీరు”

“నేను హెడ్డాఫీసులో”

“వెరీగుడ్.. ఒక విధంగా మనం ఒకే గూటి పక్షులమన్నమాట…” అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు కిషోర్.

“కరెక్టేనండి” అంటూ చిరునవ్వులు చిందించింది నీరజ.

కొంచెం సేపు ఎవరూ మాట్లాడలేదు. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ గిరిధర్..

“బాబూ మీరు ఎవరబ్బాయి. మీ తల్లి దండ్రులు ఏం చేస్తుంటారు. అడిగాడు కిషోర్‌ని.

“మా నాన్న నా చిన్నతనంలోనే యాక్సిడెంట్‌లో పోయారు. మా అమ్మ శారదాంబ మహాత్మా డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తుంది. నేను పోస్ట్ గ్యాడ్యుయేషన్ తరువాత బ్యాంకులో ప్రోబేషనరీ ఆఫీసరుగా చేరాను. మా అమ్మ నాన్నల నేనొక్కడినే.” అంటూ తన గురించి తన కుటుంబం గురించి చెప్పాడు కిషోర్.

“అయితే లెక్చరర్ శారదాంబ మీ అమ్మగారా.. నేనూ అదే కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేస్తున్నాను.. అరే!.. చాలా విచిత్రంగా ఉందే.. మనమంతా బాగా తెలిసిన వాళ్లమన్న మాట..” సంతోషంగా చెప్పాడు గిరిధర్.

కుశల ప్రశ్నలతో కాసేపు గడిచింది, అప్పుడు కిషోర్‌కి తాను వచ్చిన పని సంగతి గుర్తొచ్చింది. వెంటనే జేబులోని ఆ పది రూపాయల నోటు పద్మజకు చూపిస్తూ..

“ఆ… పద్మజా… చెప్పమ్మా… అసలు నువ్వు ఈ పదిరూపాయల నోటు మీద పేరు వ్రాసి సెల్ నెంబరు ఎందుకు వేశావు. అసలు నీ ఉద్దేశ్యం ఏంటి… ఏం ఆశించి అలా చేశావు. వివరంగా చెప్పు” అడిగాడు కిషోర్.

అప్పడు పద్మజ భయం భయంగా “మా అక్కా… నేను.. ఒక పందెం వేసుకున్నాం… ఈ పది రూపాయల నోటు మీద నా పేరు… సెల్ నెంబరు వ్రాసి మార్కెట్లోకి పంపిస్తే, దాన్ని పట్టుకుని ఎవడో ఒక బకరా మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాడని నేనూ… అలా ఎవరూ రారని మా అక్కా… పందెం వేసుకున్నాం… ఈ రోజు మీరు వచ్చారు” అంటూ నిజం చెప్పేసింది.

“అంటే ఆ బకరా నేనన్నమాట నవ్వుతూ అడిగాడు కిషోర్.”

పద్మజ మాటల్లోని పొరపాటును గ్రహించిన నీరజ “సారీ… కిషోర్‌గారు.. అదేదో పోరపాటున తప్పుగా మాట్లాడింది. చిన్నపిల్ల… కొంచెం అల్లరి చేస్తుంటుంది. తప్పుగా అనుకోకండి, దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను” అని సర్ది చెప్పింది.

“దాందేముందండి.. చిన్న పిల్లలు అల్లరి చేయడం సహజమే కదా.. ఏ ఏమైనా ఈ పందెంలో పద్మజే గెలిచింది” హుందాగా అన్నాడు కిషోర్.

ఇంతలో పద్మజ కల్పించుకుని… “అక్క ఎప్పుడూ ఇంతే… నన్ను గెలిపించడానికి తను ఓడిపోతూనే వుంటుంది. నిజానికి ఈ రోజు గెలిచింది.. అక్కే…” గట్టిగా చెప్పింది.

“అదెలాగా… నువ్వు కదా గెలిచావు” అడిగాడు కిషోర్..

అందుకు పద్మజ “నేను ఎవడో ఒక బకరా వస్తాడు అన్నాను. కాని ఈ రోజు వచ్చింది బకరా కాదు. బంగారు బాబు… అది మీరే… అందువల్ల అక్కే గెలిచినట్లు” అని వివరణ ఇచ్చింది.

“దీంతో నెగ్గలేం బాబూ… గడుగ్గాయి” అంటూ పొంగిపోయింది తల్లి కృష్ణవేణి.

“సరే ఇక నేను బయలుదేరుతానండి. ఈ రోజు మీలాంటి మంచి వాళ్ల మధ్య కాసేపు గడపడం నా అదృష్టం. మీ అందరికీ నా కృతజ్ఞతలు” అని చెప్పి బయలుదేరాడు కిషోర్.

కొంచెం సేపాగి నీరజతో… “ఈ సారి హెడ్డాఫీసుకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను.” చెప్పాడు కిషోర్.

“తప్పక కలవండి” చెప్పింది నీరజ.

“శారదాంబగారిని అడినట్లు చెప్పు బాబూ” అంటూ బయటవరకూ వెళ్ళి కిషోర్‌కి వీడ్కోలు పలికాడు గిరిధర్.

ఇంటికి వెళ్ళే దారిపోడువునా కిషోర్ ఆలోచనలు కథాంశం కంటే నీరజ చుట్టూ ఎక్కువ తిరుగుతున్నాయి.

“నీరజ అందంగా వినయంగా ఒద్దికగా, పొందికగా, సాంప్రదాయ బద్ధంగా ఉండటమే కాకుండా… మాట, చేత చాలా బాగున్నాయి. నా కోసం, అమ్మ కోసం ఎప్పటి నుండో వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయే అనిపిస్తుంది.. అవును.. ఈ అమ్మాయే!” అనుకుంటూ ఇల్లు చేరుకున్నాడు.

“అమ్మా! అమ్మా!” పిలిచాడు కిషోర్.

“ఏంటో చాలా హుషారుగా వున్నావ్… ఏంటి విషయం” అడిగింది శారదాంబ.

“అమ్మా! నీకో శుభవార్త”

“ఏంట్రా అది?”

“నీకో మంచి కోడలు కోసం నా అన్వేషణ ఈ రోజుకు ఫలించిందమ్మా…”

“అవునా.. ఎంత మంచి వార్త చెప్పావురా. చాల్లగా వుండు నాన్నా… ఇంతకీ ఎవర్రా ఆ ఆమ్మాయి” కుతూహలంగా అడిగింది శారదాంబ.

“ఎవరో కాదమ్మా… మీ కాలేజీలోనే ఇంగ్లీషు లెక్చరర్‌గా పని చేస్తున్న గిరిధర్‌గారి పెద్దమ్మాయి పేరు నీరజ” సంతోషంగా చెప్పాడు కిషోర్.

“నిజమా గిరధర్‌గారిది చాలా మంచి కుటుంబం అని విన్నాను” చెప్పింది శారదాంబ.

“ఆలస్యం అమృతం విషమన్నారు పెద్దలు. ఒక సారి ఫోన్‌లో మాట్లాడమ్మా.”

“ఓ… తప్పకుండా మాట్లాడుతాను. ఇంకో గంటలో నా పని అంతా అయిపోతుంది. అప్పుడు తీరిగ్గా మాట్లాడతాను.. సరేనా.”

“ఆ… ఓకే… ఓకే..”

***

కిషోర్ వెళ్ళిపోగానే గిరిధర్ కుటుంబ సభ్యులంతా సమావేశమై సమాలోచనలు జరిపారు.

“ఏమండీ ఆ అబ్బాయిని చూస్తే మీకేమనిపిస్తుందండీ..” అడిగింది కృష్ణవేణి.

“ఆ… ఏముంది… మంచివాడు… బుద్ధిమంతుడు, తెలివైనవాడు అనిపిస్తుంది.” మామూలుగానే చెప్పాడు గిరిధర్.

“ఏమండీ… ఆ అబ్బాయికి మన పెద్దమ్మాయినిచ్చి పెండ్లి చేస్తే ఎలావుంటుంది… ఒకసారి ఆలోచించండి.” తనలోని ఆలోచనను బయట పెట్టింది కృష్ణవేణి.

“నువ్వున్నది నిజమే… నా మనసుకు తట్టనేలేదు. ఈడూ జోడూ బాగుంటుంది. పైగా మంచి కుటుంబం. మంచి ఉద్యోగం” అంటూ కృష్ణవేణికి వత్తాసు పలికాడు గిరిధర్.

“ఆలస్యం దేనికండి… ఒక సారి శారదాంబ గారితో ఫోన్‌లో మాట్లాడండి” చెప్పింది కృష్ణవేణి.

“రేపు కాలేజీలో డైరెక్టుగానే మాట్లాడతాన్లే… ఇంతకీ నీరజకు ఇష్టమోకాదో తెలుసుకోవాలి కదా…” అంటూ నీరజవైపు తిరిగి “అమ్మా… నీరజా మరి నీకిష్ణమేనా ఆలోచించుకుని మనస్పూర్తిగా చెప్పమ్మా… ఏదైనా నీకిష్టమైతేనే తల్లీ” చెప్పాడు గిరిధర్.

“అమ్మా.. నాన్నా.. మీ ఇద్దరి ఇష్టమే నా ఇష్టం” అంటూ సిగ్గుపడుతూ తన గదిలోకి పరిగెత్తింది. అక్కతో పాటు పద్మజ కూడా పరుగుతీసింది.

గిరిధర్, కృష్ణవేణి… ఇద్దరూ దేవుడి గది దగ్గరకు చేరుకుని, తమ కోరికను నెరవేర్చమని ఆ దేవుణ్ని మనసారా ప్రార్థించారు.

ఇంతలో గిరిధర్ ఫోన్ మ్రోగింది.

“అంకుల్… నేను కిషోర్‌ని. మీతో అమ్మ మాట్లాడుతుందట. లైన్‌లో వుండండి” అంటూ ఫోన్ శారదాంబకు అందజేశాడు.

“గిరధర్‌గారు… నేను శారదాంబని మీరు బాగున్నారా…”

“బాగున్నానమ్మా… మీరెలా ఉన్నారు.”

“నేనూ బాగున్నాను. అన్నట్లు విషయం ఏమిటంటే, ఈ రోజు మా అబ్బాయి మీ ఇంటికొచ్చాడట కదా! మీ పెద్దమ్మాయి నీరజను ఇష్టపడుతున్నాడు మావాడు. పెండ్లి చేసుకుంటానంటున్నాడు. అదే విషయం మీతో మాట్లాడుదామనుకుంటుంన్నాను. మీరేమంటారు” అడిగింది శారదాంబ.

తమకంటే ముందే అవతలి వైపు నుండి పెండ్లి ప్రస్తావన రావడంతో ఆనందం పట్టలేకపోయాడు గిరిధర్.

“ఓ, తప్పకుండా మాట్లాడుకుందాం.” చెప్పాడు గిరిధర్.

“మరి… రేపు రావచ్చా” అడిగింది శారదాంబ.

“లైన్‌లో వుండండి… క్యాలెండర్ చూసి చెప్తాను… ఆ! రేపు తిధి, నక్షత్రం బాగున్నాయ్… రేపు సాయంత్రం ఆరు గంటలకు దివ్యంగా వుంది. ఆ సమయానికి మా యింటికి రండి. మమ్మల్నందర్ని చూసినట్లువుతుంది… అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు.”

“ఆ… అలాగే రేపు కలుద్దాం… సరే… వుంటానండి” అంటూ ముగించింది శారదాంబ.

“దేవుడు మనల్ని కరుణించాడండీ. ఏమైనా మన నీరజ చాలా అదృష్టవంతురాలు” అంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైయింది కృష్ణవేణి.

“ఏమండీ.. ఇంకో విషయం.. మన నీరజ సంగతి వారికి ముందే చెప్తే బాగుంటుందండీ.. లేకపోతే.. తరువాత ఆ విషయం వారికి తెలిసి మనస్పర్ధలు.. లేనిపోని ఇబ్బందులు రావచ్చు.” ఏవంటారు. అడిగింది కృష్ణవేణి.

“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. వాళ్ళు వచ్చేది రేపు సాయంత్రం కదా… నేను రేపు ఉదయమే వాళ్ళింటికి వెళ్ళి నీరజ విషయం చెప్తాను. ఆ తరువాత ఆ దేవుడి దయ” అంటూ పైకి చూశాడు గిరిధర్.

ఉదయం ఆరున్నర గంటలకే గిరిధర్ శారదాంబ ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో కిషోర్ కూడా ఇంట్లోనే వున్నాడు.

“గిరిధర్‌గారూ… ఏంటి… ఉదయాన్నే ఇలా వచ్చారు, ఎటూ సాయంత్రం మేమే మీ ఇంటికి వస్తున్నాం కదా” ఆశ్చర్యంగా అడిగింది శారదాంబ.

“సాయంత్రం మీరు మా ఇంటికి వచ్చేముందే మా నీరజ గురించి అందరికీ తెలియని ఒక నిజాన్ని మీకు తెలియజేయాలని వచ్చాను” నెమ్మదిగా చెప్పాడు గిరిధర్.

“ఏంటండీ… ఆ నిజం” నింపాదిగా అడిగింది శారదాంబ.

“మా పెండ్లైన చాలా సంవత్సరాల వరకు మాకు సంతానం కలగలేదు. మీ లాంటి శ్రేయోభిలాషుల సలహామేరకు అనాథాశ్రమం నుండి పదినెలల శిశువుని తెచ్చి పెంచుకున్నాము. ఆ శిశువు పుట్టుపూర్వోత్తరాలు మాకు తెలియవు. ఆ బిడ్డే ఈ నీరజ. నాలుగు సంవత్సరాల తరువాత కృష్ణవేణి పద్మజకు జన్మనిచ్చింది. నీరజ ఒక అనాథ అని మీకు ముందే తెలియజేయడం మంచిదనిపించింది” బాధను దిగమింగుకుంటూ చెప్పాడు గిరిధర్.

“చూడండి గిరిధర్ గారు… మీరు నీరజ గురించి చెప్పిన విషయం విన్న తరువాత ఆ అమ్మాయిని తప్పకుండా నా కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమంటావ్ కిషోర్” అడిగింది శారదాంబ.

“నేను కూడా ఆ అమ్మాయినే పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాను” గట్టిగా చెప్పాడు కిషోర్.

“అది కాదు… శారదాంబగారు” ఏదో చెప్పబోయాడు గిరిధర్.

మధ్యలోనే అడ్డుతగిలిన శారదాంబ “మీరింకేం చెప్పనక్కర్లేదు. కన్నబిడ్డ కాకపోయినా మీ ప్రేమానురాగాలను రంగరించి పోసి తనొక అనాథను అనే నిజం తెలియకుండా పెంచారు” ఆవేశంగా చెప్పింది.

“అవునంకుల్.. నీరజ అనాధ కాదు కన్నతల్లిదండ్లుల కంటే ఎక్కువగా అక్కున చేర్చుకుని పెంచిన తల్లిదండ్రులు మీరున్నారు. తోడబుట్టకపోయినా కలకాలం తోడుగా నిలిచే చెల్లెలుంది. పువ్వుల్లో పెట్టి చూసుకోడానికి నేనున్నాను. ఆప్యాయంగా చూసుకోడానికి మా అమ్మ వుంది. అందుకే నీరజ అనాథ కానే కాదు.” అంతే ఆవేశంగా చెప్పాడు కిషోర్.

“ఇక నుండి నీరజ అనాథ అని తనకు ఎప్పటికీ చెప్పొద్దు. మనం ఎవ్వరం తనకు ఎప్పటికీ చెప్పొద్దు. మనం ఎవ్వరం గుర్తు చేసుకోవద్దు. ఇక ఈ అంకానికి తెరదించేద్దాం. మీరు నిశ్చింతగా వుండండి. సాయంత్రం మీ ఇంటికి వస్తున్నాం. మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం.” అంటూ ముగించింది శారదాంబ.

ఊహించని ఆ స్వాంతన వచనాలకు గిరిధర్‌కి నోట మాట రాలేదు. చెమ్మగిల్లిన కళ్ళతో రెండు చేతులు జోడించి శారదాంబకు నమస్కరించి బరువెక్కిన హృదయంతో బయలుదేరాడు.

ఇంటికి చేరుకుని జరిగినదంతా కృష్ణవేణికి వివరించాడు. ఇక వాళ్ళిద్దరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అనుకున్నట్లే శారదాంబ, కిషోర్ సాయంత్రం ఆరు గంటలకు గిరిధర్ ఇంటికి వచ్చారు. అందరూ సోఫాల్లో ఆశీనులయ్యారు. తనతో తెచ్చిన మంచి నీళ్ళగ్లాసులను అందరికీ అందించి అమ్మనాన్నల మధ్యన కూర్చుంది పద్మజ. మరి కాసేపటికి చీరకట్టులో కుందనపు బొమ్మలా నడుచుకుంటూ వచ్చి అందరికీ కాఫీకప్పులందించి కుర్చీలాక్కుని కూర్చుంది నీరజ.

శారదాంబ నీరజకేసి ఆపాదమస్తకం తనివితీరా చూసి ‘అమ్మాయి మహాలక్ష్మిలా వుంది. మావాడి సెలెక్షన్ సరైనదే’ గర్వంగా మనసులోనే అనుకుంటూ “ఏమ్మా నీరజా… మరి మా అబ్బాయిని పెండ్లి చేసుకోడం నీకు ఇష్టమేనా” ప్రేమగా అడిగింది.

“ఆంటీ మా యింట్లో అందరిదీ ఒకటే మాట, ఒకటే బాట. అందరికీ ఇష్టం కాబట్టే మిమ్మల్ని మా యింటికి రమ్మని హృదయపూర్వకంగా ఆహ్వానిచడం జరిగింది” అంటూ నర్మగర్భంగా చెప్పింది నీరజ… తనకూ ఇష్టమేనని.

“ఇంకెందు కాలస్యం. శ్రావణమాసం వారం రోజుల్లో వుంది. ఒక మంచి రోజున శుభముహూర్తాన పెండ్లి జరిపిద్దాం… ఏమంటారు గిరిధర్ గారు” అడిగింది శారదాంబ.

“అలాగే నండి.. మరి కట్నకానుకలు.. లాంఛనాలు గురించి” అని ఏదో చెప్పబోయాడు గిరిధర్.

“కట్నం అనే మాట మేము వినడానికి కూడా ఒప్పుకోం. ఇక మావాడైతే కట్నం అని మీరు మరల మాట్లాడితే ఇక్కడ నుండి పారిపోయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆ విషయం మరిచిపోండి. ఇక లాంఛనాలంటారా… సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురుకు పెండ్లి బట్టలు మేమిస్తాం. పెళ్లి కొడుకుకు మీరివ్వండి. మీ అమ్మయికి ఎంత బంగారం పెట్టుకుంటారో అది మీ ఇష్టం.. నేనేతే నా కాబోయే కోడలికి కావలిన బంగారు నగలను ఎప్పుడో రెడీ చేసి వుంచాను.. ఆ ఇక పెండ్లి విషయం.. అన్ని ఖర్చులు మావే.. పెండ్లి చేద్దామంటే మాకు ఆడపిల్ల లేదు. మీకైతే పద్మజ కూడా వుంది. అందుకని నీరజ పెండ్లి మేమే చేస్తాం” అంటూ గడగడా చెప్పింది శారదాంబ.

ఆ మాటలన్నీ వింటున్న గిరధర్ కుటుంబం అవాక్కయ్యింది. ఇది కలా.. నిజమా.. అనే మీ మాంసలో పడింది.

“శారదాంబ గారూ… మేము మాట్లాడేందుకు ఏమీ మిగల్చకుండా అంతా మీరే చెప్పేశారు. మీ యిష్టప్రకారమే చేయండి. ఇక ఈ పెళ్ళికి మీరే సూత్రధారి.. మేమంతా… పాత్రధారులం” ప్రశాంతంగా చెప్పాడు గిరిధర్.

“శుభం… ఇంకెందుకాలస్యం… పెళ్ళి పనులు మొదలెడదాం” నవ్వుతూ చెప్పింది శారదాంబ.

అందరి ముఖాల్లో ఆనంద కుసుమాలు వెల్లివిరిశాయి.

Exit mobile version