[box type=’note’ fontsize=’16’] మూస సినిమాలకు భిన్నమైన అర్థవంతమైన సినిమా ‘ప్యాడ్‌మ్యాన్’ ను విశ్లేషిస్తున్నారు ‘పరేష్ ఎన్. దోషి సినిమా విశ్లేషణ’లో పరేష్ దోషి. [/box]
1970లలో హిందీలో ప్రముఖంగా వామపక్ష సిధ్ధాంతాల నేపథ్యంతో పేరలల్ సినెమా రాజ్యమేలింది. కొంత విరామం తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కెరటమే లేచింది హిందీ సినెమా సముద్రంలో. అయితే ఈ సారి మీకు వస్తు-వైవిద్యం చాలా కనిపిస్తుంది. రెండో విషయం యేమిటంటే సీరియస్ చిత్రాలకూ వినోదాత్మక చిత్రాలకూ మధ్య దూరం తగ్గడం, అలాగే ప్రజలు కూడా ఉత్సాహంగా ఈ సినెమాలను చూడటం.
విశ్లేషణకు ప్యాడ్ మాన్ సినిమాను యెంచుకోవడానికి కారణం, ప్రజలు పక్కకు పెట్టేసే విషయాలు, స్త్రీల శారీరిక ఆరోగ్యం, బహిష్టు సమయాల్లో పాటించాల్సిన పారిశుధ్యం. యెనిమిది వరకూ చదువుకున్న లక్ష్మి (లక్ష్మికాంత్ చౌహాన్ కు కుదింపు, అక్షయ్ కుమార్) ఇద్దరు చెల్లెళ్ళు, తల్లితో వుంటున్నా యెప్పుడూ ఈ వ్యవహారం గురించిన ఆలోచనే అతనికి రాదు. (అప్పట్లో అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి, ఇప్పుడు మారింది గాని). అతని పెళ్ళి గాయత్రి (రాధికా ఆప్టే) తో అవుతుంది. మొదటి పాటలోనే అతనికి ఆమెపై వున్న ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తాడు దర్శకుడు బాల్కి. భార్య బహిష్టు సమయాల్లో వాడే పాత గుడ్డలను తన చీర చాటుగా ఆరెయ్యడం చూసి అవాక్కవుతాడు. ఇలాంటి గుడ్డతో నేను నా సైకిలు కూడా తుడవడానికి ఇష్టపడను, నువ్వు ఇంత సాహసం చేస్తావా నీ ఆరోగ్యంతో అంటాడు. పల్లెటూరి బతుకులు వాళ్ళవి. మా ఆడవాళ్ళ విషయాల్లో మీరు తల దూరిస్తే నేను సిగ్గు తో చనిపోవాలి, నలుగురి మాటలూ విని అంటుంది. మార్కెట్ నుంచి తెచ్చిన సేనిటరి ప్యాడ్ లను కూడా తిరిగి ఇచ్చేయమంటుంది, మనకు అంత స్తోమత లేదని. ఇక అతని జీవితంలో వో పెద్ద సమస్యే అతనికి సవాలు విసురుతుంది. తక్కువ వ్యయానికి అలాంటి పరిశుధ్ధ ప్యాడ్లను ప్రతి స్త్రీకీ అందుబాటులో తేవడం. రకరకాల ప్రయోగాలు చేసి, ప్యాడ్లను తయారు చేసి భార్యకిస్తాడు. అవేవీ అనుకూలంగా వుండవు. తన చెల్లెళ్ళు, మెడికల్ కాలేజీ అమ్మాయిలు ఇలా అందరికీ తను చేసిన ప్యాడ్లు ఇచ్చి ఫీడ్బేక్ అడుగుతాడు. అతనికి ఇంటా బయటా యెక్కడా ప్రోత్సాహం దొరక్కపోగా నవ్వులపాలవుతాడు. అతని భార్య కూడా అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. అతను కూడా వూరు వదిలిపెడతాడు, కాని తన ఉత్సాహాన్ని నీరుకారిపోనివ్వడు, పట్టుదల తీవ్రతరం అవుతుంది. ప్రతి చిన్న సూక్ష్మ పరిశీలననూ వదిలిపెట్టకుండా కథను తెరకెక్కించాడు బాల్కి. చివరికి అతను చవకగా ప్యాడ్లు నిర్మించే యంత్రాన్ని కనుగొనడం, ప్రపంచంలోనే పేరు సంపాదించడం, చివరికి కుటుంబం వొకటవడంతో చిత్రం ముగుస్తుంది.
చీని కం, పా లాంటి సినెమాలు తీసిన బాల్కి ఇదివరకు “కీ అండ్ కా” తీశాడు. అందులో సమాజంలో వ్యవస్థీకరించబడిన “ఆడ” “మగ” పాత్రలను తిరగేస్తే యెలా వుంటుందో అన్న వూహతో తీసింది. నవ్వుకోవడానికి బాగానే వుంది, కాని నవ్వులాటగా కూడా వుంది. ఈ సినెమా వో నవ్వులాటగా మారకపోవడానికి కారణం ఇది వొక నిజ జీవితం మీద ఆధార పడిన కథ కావడం కారణం. కోయంబత్తూర్ లో అరుణాచలం మురుగునాథం అన్న వ్యక్తి కథను కొంచెం సినెమాటిక్ స్వేచ్చను తీసుకుని రూపకల్పన చేశాడు. కొన్ని చోట్ల విసుగు కలిగించినా, సోనం కపూర్ పాత్ర ను కొంచెం సత్యదూరంగా మలచడం, కొంత “పాఠం చెప్పే” ధోరణి, కొంత “గణాంకాల గోల” వీటన్నిటినీ క్షమించ వచ్చు, పెద్ద చిత్రాన్ని (larger picture కు వచ్చిన కష్టం) మనసులో పెట్టుకుంటే. వొక సినెమా హీరో ఆడవాళ్ళ డ్రాయర్ను, సేనిటరి ప్యాడ్తోపాటు తొడుక్కోవడం వూహించగలమా? అక్షయ్ కుమార్ చేస్తాడా పని. రాధికా ఆప్టే తో పాటు అతనిదీ సమర్థవంతమైన నటన.
యే మాటకా మాటే చెప్పుకోవాలి. కొన్నేళ్ళ క్రితం నేను అరుణాచలం TedX వీడియో చూశాను. దాని ప్రభావం ఈ సినెమా ప్రభావం కంటే యెన్నో రెట్లు యెక్కువ. కాని ఇక్కడ వొక విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశ్యం, ఆ పై అందరికీ ఆసక్తి కలిగించని వస్తువు తీసుకుని వొక సినెమా తీయడం మనం తప్పకుండా అభినందించి తీరాల్సిందే. ఇలాంటి చిత్రాలు తెలుగులో కూడా రావాల్సిన అవసరం వుంది. ఈ చిత్రం చూడండి, తర్వాత అరుణాచలం మురుగునాథన్ స్పీచ్ కూడా వినండి నెట్లో. ధనరాశులు వచ్చే అవకాశాన్ని సైతం తిరస్కరించి, స్త్రీ జాతికి తక్కువ ధరకే ప్యాడ్లు అందుబాటులో రావాలని చెప్పి, తన పేటెంటును యెవరికీ అమ్మని ఆ మనిషిని గౌరవించకుండా వుండలేము.