పద్యాద్యవస్థ!!

0
2

[ఈ రచన కేవలం కల్పితం.]

[dropcap]పూ[/dropcap]ర్వ సంధ్యకు కించిత్పూర్వమైన ఘడియలే!!!

పావన ప్రశాంత గోదావరీ తీరం!!

శ్రీ మహాభాగవత రచన తేనెలూరే తెలుగులో వ్రాస్తున్న సహజకవులు, బమ్మెర పోతన గారు రోజూ లాగే  స్నానాదుల కోసం నేడు కూడా వచ్చారు. స్నాన సంధ్యాదులు, యథావిథిగా పూర్తి చేసుకున్నారు.

వారి మనసంతా ఏదో విషయం మీద లగ్నమై, ఇదమిత్థంగా తోచనీ, అయినా మదిలో దోబూచులాడుతూ వేధించే కవితాత్మక మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నట్టుంది.

నిత్య శాంతగంభీరమైన వారి వదనం రవ్వంత వ్యగ్రతతో కనబడుతోంది నేడు!!

దూరాకాశంలో ఏర్పడే వివిధాక్రృతులను, నిర్భావులై చూస్తూ, మౌనంగా కూర్చున్నారు, కాస్సేపు!

నెమ్మదిగా లేచి బయల్దేరారు, గ్రృహాభిముఖులై!

ఇసుకలో నడవటం నేడు మరీ భారంగా అనిపిస్తోంది వారికి.

ఏ విషయమైనా, వస్తువైనా భారమయ్యేదీ, తేలికయ్యేదీ మనోవస్థను బట్టే కదా!!

నాలుగడుగులు వేసేటప్పటికి సోమనాథ సోమయాజి గారు నది వైపు వెళ్తూ, వీరిని చూసి దగ్గరకు వచ్చి, నమస్కరించి, పలకరించారు. ఏవో వీరభద్రేశ్వర ఆలయం సంగతులు వారు చెప్పారు, వీరు విన్నారు! వాగ్వ్యవహారం అంతా సోమయాజి గారిదే, పోతన గారు మౌనంగా విని, తల ఆడించారు అంతే! ఇద్దరూ కదిలారు, వ్యతిరేక దిశల్లో, ఒకరు గోదావరి వైపు, మరొకరు వారి ఇంటి వైపు!

కవి గారు ఏమిటి చెప్మా, ఇవాళ అన్య మనస్కులై ఉన్నారు, ఆలయ వార్షిక ఉత్సవాలు గురించి చెప్తుంటే, అని అనుకోక పోలేదు, యాజి గారు! అయినా మహాత్ముల అంతఃకరణాల లోతులు, ఊహల ఎత్తులు, సామాన్యులకు అందుతాయా ఏం, అని సమాధానం చెప్పేసుకున్నారు  కూడా!!

***

ఇల్లు చేరగానే, బావి దగ్గర కాళ్ళు కడుక్కొని, అమ్మాయి శాంత ప్రేమగా, బట్టతో కాళ్ళ తడి అద్దగా, లోపలికి వెళ్ళారు.

లోపలికి వెళ్ళడమే, శ్రీ మహాభాగవతం మూలం తీసి తనకు, ఆ పాటికే కంఠోపాఠమైనా, మళ్ళీ ప్రతి శ్లోకం తాను ప్రస్తుతం ఆంధ్రీకరిస్తున్న గజేంద్రమోక్షణ ఘట్టంలోవి, చదువుకోసాగారు!! చదివి భక్తి పరవశులై పోయారు. ఆహాహా, ఇటువంటి సంపూర్ణ చైతన్య స్వరూప భగవత్సంస్తుతి వ్రాసిన వ్యాసుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణాంశ కాక మరేమిటి, యని మరొక్కసారి ఆ పారాశర్యుని పదాలకు, పాదాలకు మనస్సులోనే నమస్కారాలు సమర్పించి, గ్రంథం యథా స్థానంలో ఉంచేశారు!!

నాన్నగారు రోజూ లాగే భాగవత శ్లోకాలు వల్లించమంటారని ఎదురుచూస్తున్న శాంత, వారు కాస్త అన్య మనస్కంగా కనిపించడంతో, తులసి కోట దగ్గర చేరి, నెమ్మదిగా శ్రావ్య రాగయుక్తంగా తనే చదువుకోసాగింది.

యథావిథి నిత్య పూజా విధానం పూర్తి చేసుకొని, పోతన గారు, మధ్యాహ్నం భోజనం ముగించి, కాస్త విశ్రమించారు.

చేరువ లోనే ఉన్న తమ పొలం నుంచి, పనులు పూర్తి చేసి, సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకు మల్లన్నతో కూడా, ఇవాళ కవిగారు, మౌనంగానే ఉండటం, ఇంట్లో అందరికీ కాస్త ఆశ్చర్యం కలిగించిన విషయమే అనవచ్చు.

రోజూ, మల్లనతో పొలం వ్యవహారాలు, సాగుబడి, నీటి వనరు వగైరా కాస్సేపైనా చర్చించే పోతన గారి మౌనం, ఇంట్లోని వారికీ కొత్తే!!!!

భాగవత రచనారంభం నుంచి వీరు పొలం వెళ్ళడం సక్రృత్తు అయిపోయిందనే చెప్పాలి.

వారు ఏదో యోగ సమాధిలో, ఆంతరిక వైష్ణవ యాగమేదో నిర్వహిస్తున్న వైనంగా ఉంటున్నారు. వారు తలపెట్టిన మహా వాజ్ఞ్మయారాధన ఆంతర్యం తెలిసిన వారే, మహా సంస్కారధనులా యింటి లోని వారంతా!!

అందరూ ఆ యజ్ఞంలో భాగస్వాములు గానే భావించుకొని, పోతన గారికి ఎంత, ఎట్లా సౌకర్యంగా సాధ్యమో, అంతా చేస్తున్నారు, శ్రధ్ధగా!!

సాయం సంధ్యావందనంతో పాటు, ప్రతినిత్యం వారు పఠించే శంకరుల సౌందర్యలహరీ శ్లోక పఠనం కూడా పూర్తిచేసి, పోతన గారు పూజామందిరం నుంచి బయటకు వచ్చారు.

రాత్రి పూట, కేవలం ఒకటో అరో, పండు మాత్రమే వారి భోజనం ఈ రచనా కాలమంతా! అది యొక కాయిక తపస్సులో భాగంగా పాటిస్తు వస్తున్నారు.

ఇవాళ్టికి ఆ ఫలాహారం కూడా పూర్తయిందని అనిపించి, వేసవి కాబట్టి, ఆరుబయట నిద్ర కుపక్రమించారు, రోజూ కంటే కాస్త ముందరే!!

***

గ్రీష్మాతాపానికి పగలంతా ఉడికిన నేల,సేద తీరుతోంది,కాస్త గౌతమీ తరంగాల మీద నుంచి, వచ్చే సన్నని చల్ల గాలికి!

క్రృష్ణార్పిత చిత్తులు పోతన గారికి..

ఆ తెమ్మెర తరగల కదలికలో యదుకుల మణి కమ్మని వేణు గానం వినిపించినట్లు, శ్రవణానంద అనుభవమై తోచింది!

ఆ సమీరబాల తమను స్పృశింపగా, ముంగిటిలోని మల్లెలు, కృష్ణ కర లాలిత గోపికా హృదయ సౌరభాలై గుబాళించినట్లు, నాసాతర్పణగా అనిపించింది.

ఆ శీతల సుఖతల నందించే నదీ తరంగాల హొయలు, కనులు ముందర మెదలి, కాళియోరగ ఫణామండప న్రత్యన్మంజుల సుందర పదుడు,ఆ గోవిందుడే కనుగవ తోచి, నేత్ర సార్ధక్యత కలిగినట్లైనది!

కృష్ణ భావనాప్లుత హృదయులైన పోతన గారికి, వెంటనే నిద్ర పట్టలేదు ఆ రాత్రి!

తదేకంగా ఆకాశం వంక చూడసాగారు.

పౌర్ణమి కావటంతో, వెన్నెలలు ఆకాశమంతా శ్రీకృష్ణస్వామి లీలా విలాస సంబంధులై తోచసాగాయి!

గోపికారమణుల నాట పట్టించేందుకు మాలతీ లతల చాటుకు పారిపోయి దాగినప్పటి బాలకృష్ణుని నవ స్మేర మనోహరత లాగా,

తన తీరంలో విలాసంగా విహరిస్తూ వేణువు నూదుతున్న రాసవిహారి గాలి, అల్లన సోకగా, నల్లని కాళింది తెల్లని ఫేన మనోజ్ఞ కాంతిలతాంత విస్తారం లాగా,

గోవర్ధన గిరినే మహచ్ఛత్రంగా చేసి వ్రజ కులాన్ని కాచే వేళ, వజ్రి దర్పఛ్ఛేదిత శౌరి చక్రధారా రవిద్యుతులు శాంతించి, దివి భువుల చాంద్రీ ప్రభలై చెన్నొందిన విధాన,

వరుణాలయం గ్రసించిన సుతుని, ప్రాణాలతో శిష్యుడు కృష్ణుడు శోధించి యప్పగించిన సమయాన, గురు సాందీపని ముఖంలో పర్విన ఆనందోద్వేలం వలె, మధురానగరిలో, వక్ర వపువు బాపి కుబ్జకు రూపలావణ్య శ్రీల నీయగా, ఆ యువతి ప్రాణ వల్లి కలధౌత సుమ భరితయై నింగి కెగబాకినట్లు,

ముష్టి కాసుర చాణూర కువలయాపీడమర్దన విశారదుడై కృష్ణ కిశోరం సభాంగణాన కులపాంసుని కంసుని చంపగా,

ముదిత ద్విజవర వేదపఠన వేళా శోభిత శబ్ద దీప్తుల లాగా,

విప్ర సందేశము విని, కృష్ణదేవు డేతెంచి ఆర్యా మహా దేవియె సాక్షిగ కరము చాపి రథము లోకి గొనిన, ఆ శ్రియః కాంతావతారము వైదర్భి హృదంబరవీథి, చల్లనై పాయలై విరిసిన ధైర్య కాంతులట్లు,

కౌరవ గోమాయు తండ పరివృత హరిణి, ద్రౌపదిని స్వామి అక్షయ వస్త్రధార నిడి కాపాడగా, ఆ యాజ్ఞసేని ఆభిజాత్య దీప మనంత కృతజ్ఞతా రోచులు, ఆ శీతాంశువుల జేరినట్లు, సుగుణచేలుడు, బాల్యమిత్రుడు కుచేల నాముడింటికి రాగా, ఆదరించి, మేలమాడి, కోరి యటుకులను భుజించి, అర్థించకుండానే, ఐశ్వర్యముల నిచ్చిన ఆ దేవదేవు మైత్రీ గుణ ధాళధాళ్యములట్లు,

భయసేనామధ్యస్థిత రథమున, కర్తవ్యతాబోధల క్రుంగిన క్రీడికి, హరి తాను గురువై గీత చెప్పగా,ఏ స్మృతి జ్ఞాన కిరణము మెరిసిందో ఆ  శిష్యుడి  మదిలో, అది అనంత గుణాల భూమ్యాకాశములను నిండి, నిశ్చల, నిర్మలతలను వితరణ జేసినట్లు,

ఆ శ్యామమోహనాంగుడి పాండుర రుచి పరిపూర యశో సంవ్యాప్తి లాగ వెన్నెలలు కనబడ సాగాయి,ఆ కవిలోక చంద్రుని మనోనేత్రానికి!!

చివరిగా తోచిన గీతా జ్యోత్స్న మహిమో, శాంకరీ ప్రసాదమో అన్నట్లు, తనను వేధిస్తున్న విషయంలో హఠాత్తుగా వారికొక సమాధానం, మెరిసింది!

ఆ సమాధానం, ఒక శ్లోకం!

ఎవ్వరికి నిద్రాభంగం కాకుండా, నిత్యమూ పఠించే శంకరకృత సౌందర్య లహరీ స్తోత్రంలోని, ఈ కింది శ్లోకం ఒకసారి మనసులో మననం చేసుకున్నారు!

సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే
మణిద్వీపే నీపోప వనవతి చింతామణిగృహే
శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్ (8)

మననం చేసుకోవటం తరువాయి, వారికి ఒక ఊరట కలిగినట్లు అయింది. ఒక హాస రేఖ వారి ముఖాన విరిసి, వెన్నెల వాకలో కలిసిపోయినట్లూ అనిపించింది!!

ఒకింత సేపు యిక నిద్ర పోదామనుకుని, అటు ఒత్తిగిలి పడుకున్నా రప్పుడు, నిశ్చయాత్మక బుధ్ధితో!!

***

పోతన గారు గజేంద్రమోక్షణ ఘట్టం దాదాపుగా తనదైన మాధుర్య గుణ ప్రధానంగా దాదాపుగా పూర్తి చేశారు, మూలాన్ని ఆమూలాగ్రమూ వంటపట్టించుకొనీ, వ్యాస విరచితాల్లో కొన్ని వదిలి వేసీ, కొన్ని అదనపు సొబగులు, అందాల తెలుగు నుడికారంలో జత చేసీ, ఇతర ఘట్టాల్లాగే!!

వారికి చిక్కు వచ్చిందల్లా, గజరాజు మొర పెట్టిన సమయంలో, శ్రీహరి ఏ స్థితిలో తన వైకుంఠపురంలో ఉన్నాడు, భక్తుడి ఆర్తి విని, ఎంత సత్వరంగా వచ్చాడు – అన్న విషయం, ఈ పురాణకథలో, కావ్య పరీమళం వెదజల్లేట్టు, ఎట్లా చెప్పాలి, అని!!

నిజానికి, పోతన గారి చేతిలో భాగవతంలోని ఏ ఘట్టం కావ్యమాధురితో నిండి లేదూ?!! ప్రతి పద్యమూ, రసప్లావితమే,శబ్ద సురభిళమే, తెలుగు తీయదనాల మాకందమే!!

మూలంలో, ‘నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హరి రావిరాసీత్’ అని ముక్తసరిగా ముగించారని, భావించారు.

[సకలమునకు ఆత్మరూపుడు, సకల దేవతా స్వరూపుడు శ్రీహరి అపుడు (గజేంద్రుని మొర విని) అక్కడ ఆవిర్భవించెను-..]

మకరగ్రస్తమై అంత బాధ ననుభవించిన, కరిని రక్షించటానికి, తప్పకుండా ఆ దేవదేవుడు ఎంతటి దూరంలో, ఏ స్థితిలో ఉన్నా, అన్నీ వదలి వచ్చాడని వ్రాస్తే, ఆ నారాయణుడి భక్త పరాధీనతకు పరాకాష్టగా ఉంటుందని భావించి, ఆ ఘట్టంలో మార్పు చేయనే చేశారు.

గరుడుణ్ణి ఎక్కి, చక్రాయుధాది ఆయుధాలతో సహా బయల్దేరారని మూలంలో ఉంటే దానికి గొప్ప నాటకీయ శిల్పం జోడించి, ‘సిరికిం జెప్పడు, శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింప డే పరివారమును జీర డభ్రగపతిన్ మన్నింపడు.. గజప్రాణావనోత్సాహియై’ యని మార్చారు. ఎవ్వరికి చెప్పకుండా, ఏ పరివారమూ తోడు లేక, ఆయుధాలు కూడా లేకుండా వెళ్ళాడు, భక్త రక్షణ ఎక్కడ ఆలశ్యం అయిపోతుందో అని!!

కానీ వెంటనే లక్ష్మీదేవి, ఆమె వెంట పరిజనమూ, ఆ వెనకనే గరుడుడూ, సర్వాయుధాలు, వైకుంఠపు ఆబాలగోపాలమూ వాళ్ళంతట వాళ్ళే ప్రభువు ననుసరించి వెళ్ళారని వ్రాసి, నిండుదనం తెచ్చారు.

అసలు వారణరాజు కూయి చెవుల పడ్డప్పుడు స్వామివారు ఆ వైకుంఠంలో ఏమి చేస్తున్నారు, ఎంత సత్వరంగా గజ రక్షకై బయల్దేరారు అన్న విషయం దగ్గరే,వారికి ‘పద్యాద్యవస్థ’, వచ్చిందని చెప్పాలి!!

ఈ అవస్థ, శంకరుల వారి అమ్మవారి ఆవాస స్థానం చెప్పే ఆ ‘సుధాసింధోర్మధ్యే..’ లో.. పాలసముద్రం, దేవతా వ్రృక్షాల పరివ్రృతమైన మణిద్వీపమూ, కదంబవనం మధ్యలో చింతామణులతో నిర్మితమైన భవ్య భవనము,శివాకార మంచమూ, పరమశివ పర్యంకమూ – ఆ క్రమంతో తీరిపోయింది.

వారికి, తన కథాంశానికి తగిన, వైకుంఠపురం, ఆ లోపల నగరి, మందారవనం, అమృత సరం, ఇందుకాంతోపలం, రమతో వినోదం, అన్నీ వరుసగా చక్ర వేగంతో వచ్చేశాయి మదిలోకి!

భావం చిగుళ్ళు వేసిన వెంటనే, ఎట్లా వారికి సుమధుర లలిత శబ్ద సుమాలు తోచి, అవి అప్రయాసంగా సమాస మాలికలై, కోరిన వ్రృత్తంలో అమరి వారి ఘంటం కొసను వాణీ సుప్రభలై నిలుస్తాయో, అట్లాగే ఈనాడూ నిలిచాయి!!

మర్నాడు ప్రొద్దునే, అనుష్టానాదులు పూర్తి కాగానే, శారదా దేవిని మనసారా ప్రార్థించి, తాళ పత్రం మీద శ్రీకారం చుట్టి, చకచకా వ్రాసేశారు.

అదే ఈ మత్తేభరాజ గమన సుందరం!

అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతో
పలోత్పలపర్యంక రమావినోది యగు ఆపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన కుయ్యాలించి సంరంభియై!!

వ్రాసి, ఒక్క నమస్కారం అమ్మవారికి సభక్తికంగా పెట్టి, బయటకు వచ్చి “శాంతా, రామ్మా, శ్లోకాలు చదువుకుందాం” అని సంతోషంగా అన్నారు. నాన్న గారు ఎప్పుడు పిలుస్తారా అని వేచి చూస్తున్న శాంత, ఒక్క ఉదుటున లోపలి నుంచి పరిగెత్తుకొని వచ్చి, తండ్రికీ, తనకూ, తులసి కోట దగ్గర చాప వేసింది.

***

సోదరుడైన శ్యామసుందరుడి నెలవులో, ఆయన వివరాలు, పద్మనాభ సహోదరి ఆ మరకతశ్యామ తానే చెప్పి కాపాడింది, అని మనసులో మళ్ళీ నమస్కరించి, వచ్చి కూర్చున్నారు పోతన్న గారు, పద్య పఠనా నిత్య నైమిత్తికానికి, ప్రసన్నత పరచే శాంత వదనంతో!!

పోతన గారికి బహు ఇష్టులైన వ్యాఖ్యాతృ లోక కేసరి, మల్లినాథసూరి వారి,

‘అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీక్రృతం,

దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం’.. ఇత్యాది గౌరీ స్తుతి శ్లోక శబ్దాలు వారి యింటి తులసీ ముఖంగా ఆ గౌరి  సోదరుడు, వైకుంఠవాసి హరికి చేర  వేయాలని, ఆ మార్గం పట్టాయి!!

స్వస్తి!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here