[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
కృష్ణం వాసుదేవం జగద్గురమ్-4
త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో
యదా ఘనైరంతకరైర్వవర్షహ।
తదాకరోద్యః స్వబలేన రక్షణం
తం గోపబాలం గిరిధారిణం భజే॥1॥
యః పాయయంతీమధిరుహ్య పూతనాం
స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః।
జఘాన వాతాయితదైత్యపుంగవం
తం గోపబాలం గిరిధారిణం భజే॥2॥
నందవ్రజం యః స్వరుచేందిరాలయం
చక్రే దిగీశాన్ దివి మోహవృద్ధయే।
గోగోపగోపీజనసర్వసౌఖ్యం
తం గోపబాలం గిరిధారిణం భజే॥3॥
యం కామదోగ్ధ్రీ గగనావృతైర్జలైః
స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషించత।
గోవిందనామోత్సవకృద్వ్రజౌకసాం
తం గోపబాలం గిరిధారిణం భజే॥4॥
యస్యాననాబ్జం వ్రజసుందరీజనా
దినక్షయే లోచనషట్పదైర్ముదా।
పిబంత్యధీరా విరహాతురా భృశం
తం గోపబాలం గిరిధారిణం భజే॥5॥
బృందావనే నిర్జరబృందవందితే
గాశ్చారయన్యః కలవేణునిస్స్వనః।
గోపాంగనాచిత్తవిమోహమన్మథ-
స్తం గోపబాలం గిరిధారిణం భజే॥6॥
యః స్వాత్మలీలారసదిత్సయా సతా-
మావిశ్యకారాఽగ్నికుమారవిగ్రహమ్।
శ్రీవల్లభాధ్వానుసృతైకపాలక-
స్తం గోపబాలం గిరిధారిణం భజే॥7॥
గోపేంద్రసూనోర్గిరిధారిణోఽష్టకం
పఠేదిదం యస్తదనన్యమానసః।
సముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం
ప్రాప్నోతి దాస్యం గిరిధారిణే ధ్రువమ్॥8॥
ప్రణమ్య సంప్రార్థయతే తవాగ్రత-
స్త్వదంఘ్రిరేణుం రఘునాథనామకః।
శ్రీవిఠ్ఠలానుగ్రహలబ్ధసన్మతి-
స్తత్పూరయైతస్య మనోరథార్ణవమ్॥9॥
(ఇతి శ్రీరఘునాథప్రభుకృత శ్రీగిరిరాజధార్యష్టకమ్)
గోకులంలో ఇంద్రయాగం చేద్దామని అనుకుని నందుడు మొదలగు యాదవ ప్రముఖులు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు. అప్పటికే శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా, వివిధ సందర్భాలలో తన నాయకత్వం ద్వారా గోకులంలో అందరకీ ఆధాపభూతుడిగా పేరు గడిమచాడు. సలహాలు సంప్రదింపులకు ఆయననే బాలుడని తక్కువ చేయక అడగటానికి మొహమాటము పడకుండా ఉండటం అలవాటైంది.
వారిని చూసి బాలకృష్ణుడు ఇలా అన్నాడు.
“మీరేదో యాగం తలపెట్టి వచ్చినట్లున్నారు. ఈ యజ్ఞం వలన ప్రయోజనం ఏమిటి? ఎవరిని ఉద్దేశించి ఈ యాగం? ఈ యాగానికి అధికారి ఎవరు? ఈ క్రతువుకి కావలసిన సంభారాలు ఏమిటి? ఈ యాగం శాస్త్ర సమ్మతమేనా? లేక లోకాచారాన్ని బట్టి వచ్చిందా? మీవంటి సత్పురుషులకు దాచదగిన రహస్యాలు ఉండవు కదా. ఈ యజ్ఞం సంకల్పించిన మీ ఉద్దేశం ఏమిటో నాకు వివరించండి.”
ఇలా అంటున్న యౌవనుడైన కుమారుడితో తండ్రి అయిన నందుడు ఇలా అన్నాడు..
“నాయనా! ఇంద్రుడు వర్షాధిపతి, గొప్పవాడు. అతనికి ఇష్టమూర్తులు అయిన మేఘాలు అన్నీ, అతని ఆజ్ఞచే సర్వజీవులకు సంతోషం కలిగిస్తూ నేలమీద వర్షాలు కురుస్తాయి. ఆ నీటి వలన పంటలు పండుతాయి. ఆ పంటల వలన ధర్మార్థ కామాలు సిద్ధిస్తాయి. జనులు హాయిగా జీవనం సాగిస్తారు. కనుక, మేఘాలకు అధిపతి అయిన ఇంద్రుడు మెచ్చేటందుకు, రాజులు అందరూ ‘ఇంద్రయాగం’ చేస్తారు.
కామం వలననో, లోభం వలననో, భయం వలననో, ద్వేషం వలననో ఈ యజ్ఞం చేయకపోతే, మానవులకు శుభాలు కలుగవు. అంతే కాకుండా యాగం చేస్తే వజ్రాయుధుడైన దేవేంద్రుడి మనసు సంతోషిస్తుంది. ఆయన సంతోషిస్తే, వర్షాలు కురుస్తాయి. వాన కురిస్తే భూమిపై గడ్డి బాగా పెరుగుతుంది. పశువులు సుఖంగా బ్రతుకుతాయి. తండ్రీ! ధేనువులు హాయిగా బ్రతుకుతుంటే, పాడి సమృద్ధిగా లభిస్తుంది. తద్వారా మానవులు క్రతువులు నిర్విహించగల సమర్థులౌతారు. దేవతలు సంతృప్తిగా పడతారు.”
ఇలా చెప్తున్న నందగోపుని మాటలు విని, దేవేంద్రుడుకి అహం దెబ్బతినేలా రాక్షసాంతకుడు అయిన కన్నయ్య తండ్రితో ఇలా అన్నాడు.
“కర్మమునఁ బుట్టు జంతువు
కర్మమునను వృద్ధి బొందుఁ గర్మమునఁ జెడుం
గర్మమె జనులకు దేవత
కర్మమె సుఖదుఃఖములకుఁ గారణ మధిపా!”
“కర్మములకుఁ దగు ఫలములు
కర్ములకు నిడంగ రాజు గాని సదా ని
ష్కర్ముఁ డగు నీశ్వరుండును
గర్మవిహీనునికి రాజు గాఁడు మహాత్మా!”
(పోతన భాగవతము)
“నంద మహారాజా! తాను చేసిన కర్మము చేతనే ప్రతి ప్రాణి పుడుతున్నది. కర్మము చేతనే వృద్ధి పొందుతున్నది. ఆ కర్మము చేతనే లయిస్తున్నది. కనుక, కర్మమే జనులకు దైవం. కర్మమే జీవులకు దుఃఖానికీ, సుఖానికీ హేతువు.
కర్మములు చేయడానికి తగిన ఫలాలు ఆయా కర్మములే, ఇస్తాయి. మధ్యలో ఈశ్వరుడి ప్రసక్తి ఎందుకు. ఈశ్వరుడు కూడా కర్మములు చేసే వానికి మాత్రమే ఫలితములను ఇస్తాడు. అంతేగాని, ఏ కర్మము చేయని వానికి ఎన్నటికీ ఫలితము ఈయడు కదా!
కాబట్టి, కర్మానుగుణంగా సుఖదుఃఖాలు అనుభవించే ప్రాణులు ఇంద్రుని వలన భయపడవలసిన పనిలేదు. పూర్వజన్మ సంస్కారాలు కుప్పల వలె కప్పగా జీవులు కర్మలు ఆచరిస్తున్నారు. అట్టి కర్మఫలాలు తప్పించడం కడకు ఆ పరమేశ్వరుడికైనా శక్యం కాదు. ఇక ఇతరుల మాట చెప్పడం ఎందుకు.
దేవతల తోనూ, రాక్షసుల తోనూ, మనుష్యుల తోనూ కూడిన ఈ జగమంతా తన స్వభావమునకు అధీనమై మెలుగుతూ ఉంది. ఇందులో అనుమానం లేదు. జీవుడు తన స్వభావానికి అనుగుణమైన కర్మము చేతనే కర్మానురూప మైన నానావిధ దేహాలను పొందుతూ విడుస్తూ ఉంటాడు. గురువు, దేవత, మిత్రుడు, శత్రువు, బంధువు, అంతా కర్మమే.
జీవుడు స్వభావానురూపమైన కర్మమునే ఆచరిస్తాడు. అతని పాలిటికి కర్మమే దైవతం. కర్మనే అతడు దైవం వలె ఆరాధించాలి. కర్మంచేత జీవిస్తూ దానిని విడిచి మరియొక దానిని భజించడం అనేది పతి వలన బ్రతుకుతూ, అతడిని సేవించకుండా విటుని సేవించే రంకుటాలి విధం అవుతుంది.
బ్రాహ్మణుడు వైదికకర్మ చేత బ్రతుకుతాడు. క్షత్రియుడు పుడమిని పాలిస్తాడు. వైశ్యుడు కృషి, గోరక్షణ, వాణిజ్యం, సొమ్ము వడ్డీకిచ్చుట సాగిస్తాడు. శూద్రుడు త్రివర్ణములవారికీ కార్యములయందు సహకరించి జీవిస్తాడు. సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలు ప్రాణుల పుట్టుకకు పెరుగుదలకూ వినాశనమునకూ హేతువులుగా ఉన్నాయి. రజోగుణంవలన జగత్తు పుడుతుంది రజోగుణం వలనే మేఘాలు వర్షిస్తాయి. వాన వలన ప్రజలు వృద్ధి చెందుతున్నారు. కనుక, ఇందులో మహేంద్రుని ప్రమేయం ఏమీ లేదు.”
ఇక్కడికి ఒకసారి ఆగుదాము.
అసలు ద్వైత వ్యాఖ్యలో సత్యసంధ తీర్థుల వారు ఏమి చెప్పారో చూద్దాము.
॥నియమనాదినా సకలలోక కర్షణాత్ కృష్ణః॥ – నియమనము అనగా అదుపులో ఉంచుకోగలగటం. ఇలా చేయటం ద్వారా సకల లోకములను ఆకర్షించువాడు.
కూర్మ పురాణములో ఈ వియయమే గట్టిగా చెప్పబడినది.
ఈ అదుపులో ఉంచింది ఎవరు?
కృష్ణుడు.
ఎవరిని? ఎల్ల దేవతలను.
కానీ ఇంద్రుడికి తన పేరిట యాగము చేయవద్దని చెప్పిన పిమ్మట అహంకారం రేగి (తన) స్వామికి ఎదురెళ్ళాడు.
భగవద్గీత 5వ అద్యాయములో అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నిస్తాడు.
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి।
యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్॥5.1॥
ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?
దానికి భగవానుడు ఇలా సమాధానమిస్తాడు.
॥శ్రీ భగవానువాచ॥
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే॥5.2॥
జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి।
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే॥5.3॥
సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః।
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్॥5.4॥
కర్మ సన్యాస (పనులను త్యజించుట) మార్గము మరియు కర్మ యోగ (భక్తితో పనిచేయుట) మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగము అనేది కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది. (2)
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసమును మరియు కర్మ యోగమును పోల్చి చూపిస్తున్నాడు. ఇది చాలా నిగూఢమైన/గంభీరమైన శ్లోకం. కాబట్టి ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకుందాం.
ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక, సామాజిక ధర్మాలని రెంటినీ అనుసరిస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో సామాజిక ధర్మాలు పాటింపబడతాయి.
ఎల్లప్పుడూ నీ యొక్క అన్ని పనులను, గురువు మరియు భగవంతుడు గమనిస్తున్నారని భావించాలి. అప్పుడు కర్మలను మనము భగవదర్పణంగా చేస్తూ వాటిని అత్యుత్తమముగా నిర్వహిస్తాము. ఇదే కర్మ యోగ సాధన. దీనితో మనల్ని మనం క్రమక్రమముగా శారీరక దృక్పథం నుండి ఆధ్యాత్మిక దృక్పథం వైపు ఉద్ధరించుకోవచ్చు.
కర్మ సన్యాసము అనేది శారీరక దృక్పథానికి అతీతంగా వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసము. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమగుట వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా ఆధ్యాత్మిక విధులనే (భగవత్ సేవ) నిర్వర్తించే మనిషి కర్మ సన్యాసి. శ్రీ రామచంద్రుడు లక్ష్మణుడిని ప్రాపంచిక విధులను నిర్వర్తించమన్నప్పుడు, ఈ కర్మ సన్యాస భావము లక్ష్మణుడిచే చక్కగా వ్యక్తపరచబడింది:
॥మోరె సబఇ ఏక తుమ్హ స్వామీ, దీనబంధు ఉర అంతరయామీ॥
(రామచరితమానసం)
లక్ష్మణుడు రామునితో అన్నాడు, “నీవే నా స్వామివి, తండ్రివి, తల్లివి, స్నేహితునివి, మరియు నా సర్వస్వమూ నీవే. నీ పట్ల ఉన్న ధర్మాన్నే నేను శాయాశక్తులా నిర్వర్తిస్తాను. కాబట్టి దయచేసి నా శారీరక ధర్మాల్ని నాకు చెప్పవద్దు.”
కర్మ సన్యాసం అభ్యాసం చేసే వారు తమని తాము శరీరము అనుకోరు. తత్ఫలితంగా వారు తమ శారీరక ధర్మాల్ని నిర్వర్తించే అవసరం లేదు అని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు తమ పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు తమకున్న సమయాన్ని ప్రాపంచిక విధులకు, ఆధ్యాత్మిక విధులకు మధ్య విభజించాల్సి ఉంటుంది. అందుకే కర్మ సన్యాసులు భగవంతుని దిశగా వేగంగా వెళ్ళగలుగుతారు, కానీ కర్మ యోగులు సామాజిక విధుల భారంతో నెమ్మదిగా సాగుతారు.
కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు. అర్జునుడికి దానినే అనుసరించమని సిఫారసు చేస్తున్నాడు. ఎందుకంటే కర్మ సన్యాసులు ఒక ప్రమాదంలో చిక్కుకోవచ్చు. ఒకవేళ తమ కర్తవ్యములను త్యజించిన పిదప తమ మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేయలేకపోతే వారు అటూ ఇటూ కాకుండా పోతారు.
భారతదేశంలో, ఇప్పటి కాలంలో ఇటువంటి, ఎన్నోవేల మంది సాధువులు, తమకు వైరాగ్యం కలిగింది అనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు, కానీ వారి మనస్సు భగవంతుని పట్ల పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన వారు ఆధ్యాత్మిక పథంలో దివ్య ఆనందాన్ని అనుభవించలేకపోయారు. కాబట్టి, ఏదో బైరాగులు ధరించే కాషాయి వస్త్రాలు ధరించినా, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతుతనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు.
మరో పక్క, కర్మ యోగులు, ప్రాపంచక విధులు మరియు ఆధ్యాత్మిక విధులను రెండూ చేస్తుంటారు. కాబట్టి ఒకవేళ వారి మనస్సు ఆధ్యాత్మికత నుండి పక్కకి తప్పితే, కనీసం వారి వృత్తి/పని మీద ఆధారపడవచ్చు. ఈ విధంగా కర్మ యోగము అనేది అత్యధిక జనులకు సురక్షితమైన మార్గము. అదే సమయంలో, సమర్థుడైన గురువు గారి పర్యవేక్షణ లోనే కర్మ సన్యాస మార్గమును అవలంబించాలి.
దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులౌతారు. (3)
బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా అనాసక్తత/వైరాగ్యాన్ని అభ్యాసము చేస్తుంటారు. అనుకూల, ప్రతికూల ఫలితాలని రెంటినీ సమదృష్టితో, ఈశ్వర అనుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే అది మన క్రమానుసార ఉన్నతి కొరకు సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవింప చేస్తుంటుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మం మనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచం సహజంగానే క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపు తీసుకువెళ్తుంది.
దీనిని మరింత విశదీకరించేందుకు పెద్దలు ఒక కథ చెప్తారు. బాగుంది కనుక మనమూ అదేమిటో చూద్దాము.
ఒకప్పుడు ఒక కొయ్య ముక్క ఉండేది. అది ఒక కొయ్యబొమ్మలు చేసే శిల్పి దగ్గరికి వెళ్లి, “నన్ను దయచేసి అందంగా చేయవా?” అని అడిగింది.
శిల్పి అన్నాడు, “నేను ఆ పనికి సిద్ధంగా ఉన్నాను. కానీ, నీవు దానికి సిద్ధమేనా?”
ఆ చెక్క అన్నది, “అవును, నేను కూడా సిద్ధమే.”
ఆ శిల్పి తన పనిముట్లు తీసుకుని దానిని చెక్కటం మొదలుపెట్టాడు. ఈ కొయ్య “అయ్యో, ఏం చేస్తున్నావు? దయచేసి ఆపు, చాలా నొప్పిగా ఉంది’ అని అరిచింది.
అప్పుడు ఆ శిల్పి తెలివిగా అన్నాడు, “నీవు అందంగా అవ్వాలనుకుంటే, నీవు బాధని సహించాలి.”
“సరే”, అన్నది కొయ్య. “అయితే చెక్కండి, కానీ దయచేసి కాస్త నెమ్మదిగా, సున్నితంగా చేయండి.”
ఆ శిల్పి తన పని మళ్ళీ ప్రారంభించాడు. ఈ కొయ్య అరుస్తూనే ఉంది, “ఇక ఈ రోజుకు చాలు. మరిక సహించలేను. దయచేసి మళ్ళీ రేపు తిరిగి ప్రారంభించండి,” అని.
ఆ శిల్పి తన పని యందే శ్రద్ధతో ముందుకెళ్ళాడు, మరియు కొద్ది రోజుల్లోనే ఆ కొయ్య, గుడిలో ఉంచతగిన, ఒక అందమైన విగ్రహంగా తయారయ్యింది.
ఇదే విధముగా, అనంతమైన జన్మలలో ప్రపంచంతో మమకారం వలన మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. మనం అంతర్గత సౌందర్యంతో ఉండాలంటే మనం బాధని సహించి, ఈ ప్రపంచాన్ని మనలని పరిశుద్ధం చేసే తన పనిని చేసుకోనివ్వాలి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే తమ మనస్సుని లగ్నం చేయటానికి అభ్యాసం చేస్తుంటారు.
అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము), కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు. (4)
ఇక్కడ, శ్రీ కృష్ణుడు, ‘సాంఖ్య’ అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు, అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవి: ఫాల్గు వైరాగ్యము, యుక్త వైరాగ్యము.
ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు, కష్టాలను, బాధ్యతలను వదిలించుకోవటం కోసం కోసము దానిని త్యజించటాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం, పలాయనవాద దృక్పథంలో ఉన్నది. అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు, దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు.
యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు. తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు.
బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది. కష్టాలకు చలించనిది.
కర్మ యోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే, యుక్త వైరాగ్య భావాలు (స్థిరమైన వైరాగ్యం) పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులగా, భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు. అందుకే ప్రతీదీ భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులౌతారు.
ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక వియయాసక్తులుగా అగుపించినా అంతర్గతంగా నిజ సన్యాసులకు ఏమాత్రం తీసిపోరు.
పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలలో మహోన్నతమైన రాజుల గురించి చెపుతూ, బాహ్యంగా వారు రాజ ధర్మాలను నిక్కచ్చిగా నిర్వర్తిస్తూనే రాజ విలాసాలలో నివసిస్తున్నా, వారు మానసికంగా పూర్తిగా భగవత్ భావన లోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి. ప్రహ్లాదుడు, జనకుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠిరుడు మొదలగువారంతా అత్యుత్తమ కర్మ యోగులే. శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది:
గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి
విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః (వ్యాస 11.2.48)
ఇంద్రియ వస్తు విషయములను, వాటి కోసం ప్రాకులాడకుండా వాటి నుండి పారిపోకుండా, భగవత్ దృక్పథంతో, సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్ని ఆయన సేవకే, అన్న దృక్పథంలో స్వీకరించే వాడు అత్యున్నత భక్తుడు. ఈ విధంగా, కర్మ యోగికి, కర్మ సన్యాసికి మధ్య, నిజమైన జ్ఞానికి, తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా, ఈ రెంటి యొక్క ఫలితములు లభించును.
యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే।
ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి॥5.5॥
కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము మరియు కర్మ యోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు.
ఈ కారణంగానే శ్రీకృష్ణ భగవానుడు గోకుల వాసులను ఇంద్రయాగం చేయనవసరం లేదని చెప్పాడు.
అద్వైత వ్యాఖ్య ప్రకారం కృష్ణ అంటే సచ్చితానంద స్వరూపుడు అని.
ఆ సత్ చిత్ ఆనందుడు ఎవరు? భగవానుడు కాక?
(సశేషం)