back to top
Home Blog Page 13

అమ్మ దగ్గరకి..

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కస్తూరి రాజశేఖర్ గారి ‘అమ్మ దగ్గరికి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]మ్మ దగ్గరకి వెళ్లనివ్వటం లేదుగా..?!” మొహం గంటు పెట్టుకుని నిష్ఠూరంగా అన్నాడు పురుషోత్తం భార్య శ్యామలతో.

భర్త వంక చురుగ్గా చూసి గయ్యిమంది శ్యామల.

“ఇలా దెప్పిపొడవటం.. ఇప్పటికిది పన్నెండోసారి ఇవ్వాళ. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతి వారం వెళ్లాల్సిన అవసరం ఏముంది? దగ్గరా; దాపా? హైదరాబాద్ నుంచి తెనాలి.. అక్కడ్నుంచీ కనగాల.. పోనీ ఆవిణ్ణే మన దగ్గరికి రమ్మంటే.. ఊరు విడిచి రానంటుందాయే! అయినా.. అక్కడ మీ అన్న వదినలు ఉన్నారుగా.. బాగానే చూసుకుంటున్నారాయే ! మీకు ఎందుకు బెంగ? ముందు మీ గుండె జబ్బుకు మందు వేసుకుని ఈ కాఫీ తీసుకోండి..” అంటూ కాఫీ గ్లాసు అతని ముందున్న స్టూలు మీద పెట్టింది.

మందు బిళ్ళ వేసుకుని, కాసిన్ని మంచినీళ్లు త్రాగి, కాఫీ గ్లాసు తీసుకుని కుర్చీలో జారగిలబడి కూర్చున్నాడు పురుషోత్తం.

“నిజమే.. కానీ.. సంతానంలో ఆఖరి వాణ్ణని.. పసితనం నుంచీ ‘పండూ’ అంటూ నన్ను గారాబంగా చూసింది మా అమ్మ.. అందుకే..” తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు పైకే అనేసాడు.

“ఆహాఁ.. అంటే.. మీరింకా పసివాణ్ణే అని అనుకుంటున్నారా? రిటైరై ఐదేళ్లయింది.. పిల్లలకు పెళ్ళిళ్ళయి, మనవళ్ళు కూడా.. అందరూ తలో మూలా .. మనిద్దరం ఇక్కడ హైదరాబాద్‌లో.. అయినా మీ అమ్మగారికి ఈ ‘పండు’ అంటే అంత ప్రేమే ఉంటే ఇక్కడికి రావచ్చు కదా.. మహారాణిలా చూసుకుంటాను”

“అదేం కాదు శ్యామూ.. ఎన్నో ఏళ్లుగా ఉన్న ఊరు.. ఆవిడ వయసు బంధువులందరూ అక్కడే ఉన్నారు. తొంభై ఏళ్ళు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే ఆవిడ కదలదు..”

“అలా అని? మీరు కూడా.. గుండాపరేషన్ జరిగిన మనిషి.. ప్రతి వారం పరిగెత్తుతానంటే అర్థం ఉందా ఏమైనా? సర్సరే.. వాకింగ్‌కి బయలుదేరండి.. వస్తూ వస్తూ మీకిష్టమైన కూరలు నాలుగు పట్రండి.. ఈ లోపు నేను నా పూజ ముగిస్తాను” అంటూ చేతి సంచీ తీసి ఇచ్చింది.

పురుషోత్తం లేచి కొడుకు పంపించిన ట్రాక్ సూట్ వేసుకుని బయటికి నడిచాడు.

***

పార్కులో బెంచీ మీద కూర్చుని యోగా చేస్తున్న తన వయసు వాళ్ళని చూస్తున్నాడు పురుషోత్తం. చూపు అటువైపు ఉన్నదే కానీ, మనసు అమ్మ వైపు మళ్లుతోంది.

‘కుటుంబంలో చివరివాడవటం వల్లనేమో, చాలా సున్నితంగా పెరిగాడు తను. తనకన్నా పైవాడు రామం గొడ్డులా చాకిరి చేస్తున్నా తనను మాత్రం అల్లారుముద్దుగా చూసేవాళ్ళు వాడితో సహా.

తనకు చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేది అమ్మ. అమ్మకు చిన్న జ్వరం వచ్చినా ఆవిడని అంటిపెట్టుకుని ఉండిపోయేవాడు తాను. స్కూలుకి కూడా వెళ్ళేవాడు కాదు. అమ్మ తప్ప తనకు వేరే లోకమే ఉండేది కాదు. నాన్న, అన్నలు, అక్కలు పెద్ద సంసారమే కానీ, తనకు మాత్రం అమ్మ దగ్గర మాత్రమే చనువు. కాలేజీలో చదివే సమయంలో కూడా అమ్మ ఒక్కతే తన స్నేహితురాలు. అప్పుడప్పుడు అమ్మే గారాబంగా అంటూ ఉండేది – “ఇలా అయితే చాలా కష్టపడతావురా పండూ.. నేను పైకి పోతే, నిన్నెవరూ పట్టించుకోరు.. అందరితో కలుస్తూ వుండు..” అని

తానూ అంతే మొండిగా అంటూండేవాడు – “నిన్ను క్రిందకు తీసుకొస్తా.. లేదా నేనే పైకి వచ్చేస్తా నీతో బాటు.. నాకెవరూ అక్కర్లేదు..”

“నీ మొహంలే.. ఇంద.. ఈ సున్నుండ తిని పోయి చదువుకో ఫో..” అంటూ ముద్దుగా కసురుకునేది. పైవాళ్ళు పనిచేస్తూ ఉంటే, తాను చదువుకునేవాడు.. అలా మంచి చదువులు చదివి సిటీలో స్థిరపడ్డాడు.

పెళ్లయ్యింతర్వాత, శ్యామల తనను నిరంతరం కనిపెట్టుకుని ఉంటూ, తన ఆప్యాయత, అనురాగంతో కట్టి పడేసింది. తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేసింది. తన వైపు వాళ్లందరికీ అవసరానికి అన్నీ తానే అయి చేదోడుగా ఉంటూ వచ్చింది. అమ్మ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఉంటుంది. అమ్మ కబురు చేస్తే చాలు, తనకంటే ముందే బయల్దేరిపోయేది.

అలాంటిది, తనకు గుండాపరేషన్ జరిగింది మొదలు ఇలా అభ్యంతరాలు చెప్పటం మొదలైంది.

అలా మనసు మరో లోకంలో విహరిస్తున్నపుడే సెల్ ఫోన్ మ్రోగింది.

***

నీరసంగా ఇంట్లోకి అడిగిపెట్టిన పురుషోత్తంను చూసి శ్యామల ఎదురెళ్ళింది.

“ఏమైందండీ.. అలా ఉన్నారు? ఇలా కూర్చోండి” అంటూ కుర్చీలాగి ఫ్యాన్ వేసింది.

లోపలికి వెళ్లి కాచిచల్లార్చిన నీళ్లు గ్లాస్‌తో తెచ్చి ఇచ్చింది.

“ఏమైందండీ..?” అతని వీపు నిమురుతూ లాలనగా అడిగింది శ్యామల.

పురుషోత్తం ఆమె కేసి చూసాడు. అతని కళ్ళలో నీళ్లు.

“అమ్మ దగ్గరికి వెళ్ళాలి.. శ్యామూ..”

“తప్పకుండా వెళ్దాం.. నేనేమీ వద్దనలేదుగా? ఇంత మాత్రానికేనా అంతగా బాధపడుతున్నారు?” వెన్నెల్లా చల్లగా నవ్వింది శ్యామల.

“అది కాదు.. అమ్మ నిన్న రాత్రి బాత్రూంలో జారి పడిందిట. తెనాలి హాస్పటల్లో ఉంచారట. వెన్నెముక క్రింది భాగం విరిగిందిట. నాకెందుకో భయంగా ఉంది శ్యామూ.”

“అయ్యో అవునా..” అని అతని మొహంలో దిగులు చూసి సర్దుకుని, “మీరేం కంగారు పడకండి.. అలా కూర్చోండి. అన్నం కూడా వండేసాను. ఇప్పుడే బట్టలు సర్దేస్తాను. ఒక గంటలో ఏదో ఒకటి ఎంగిలి పడి బయలుదేరుదాం.. అత్తయ్య గారికి ఏం కాదు.. మీరు ఈ లోపు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని రండి.. నేను కూడా ఒకసారి బావగారికి, తోడికోడళ్లకి ఫోన్ చేసి మాట్లాడతాను” అంటూ హడావిడి పెట్టేసి, అతని ఆలోచనలకు అడ్డుకట్ట వేసి లోపలికి నడిచింది.

***

శ్యామల, పురుషోత్తం లను చూడగానే తల్లి శాంతమ్మ గాజు కళ్ళలో చిన్నపాటి మెరుపు.

తోడికోడళ్ళు శ్యామలను పలకరింపుగా చూసి భుజం తట్టి, బయటకు నడిచారు.

పురుషోత్తం తల్లి చేతుల్ని పట్టుకొని గుండెలకద్దుకున్నాడు. లోపల్నుంచీ బాధ ఎగదన్నుతోంది. తల్లి అతని బుగ్గలు నిమిరి మెల్లిగా తట్టింది ఓదార్పుగా! మంచం పైన ఓ మూలగా కూర్చుండిపోయాడు ఏడుపు దిగమింగుకుంటూ!

శ్యామల అత్తగారి పక్కనే కూర్చుని తలని ఆప్యాయంగా నిమిరింది. శాంతమ్మ ప్రేమగా చూసింది.

“ఏంటి అత్తయ్యా! తలకు నూనె పట్టించుకోవడం లేదా? మేమంతా జుట్టూడుతోందని బాధలు పడుతుంటే, మీరు ఉన్న బారెడు జుట్టుకు పోషణ లేకుండా చేస్తున్నారేంటి?” అంటూ పురుషోత్తం వైపు చూసి,”ఏవండీ, మీరెళ్లి అత్తయ్య గారికి ఇష్టమైన చందనాది తైలం తీసుకురండి.. ఇలా చూస్తుంటే నేను పేషెంట్ అయ్యేట్టు ఉన్నాను” అని గలగల మాట్లాడేసరికి శాంతమ్మ మొహంలో వెలుగు వచ్చింది.

పురుషోత్తం కూడా ఉత్సాహంగా లేచి, బయటకు నడిచాడు. వరండాలో అన్న వదినెలతో మాట్లాడి షాపుకి బయలుదేరబోతూ జేబులు తడుముకునే సరికి పర్సు, ఫోను శ్యామల దగ్గర ఉన్న బ్యాగులో ఉన్నట్టు అర్థమైంది. వెనక్కి వచ్చి గదిలోకి అడుగుపెట్టబోయి తన గురించిన మాటలు వినబడటంతో ఆశ్చర్యంగా నిలబడిపోయాడు పురుషోత్తం!

శాంతమ్మ, శ్యామలని కావలించుకుని ఏడిచేస్తోంది. శ్యామల సముదాయిస్తోంది.

“ఊరుకోండి అత్తయ్యా, ఎందుకలా బేలగా అయిపోతున్నారు? నేనున్నానుగా..”

“అదే తల్లీ! నీవున్నావన్న ధైర్యంతోనే నేను ఇంతకాలంగా సంతోషంగా ఉన్నాను. మా పండుగాడు ఎవరితోనూ కలిసే మనిషి కాదు. నేనే వాడి లోకం. ‘నాకు ఏదన్నా అయితే వాడు ఉండలేడు’ అని తెలుసు. అందుకే నీకు విషయం చెప్పి, నన్ను మరిచిపోయేలా చేయమని మాట తీసుకుని పండుగాడిని పెళ్లినాడే నీకు వదిలిపెట్టేశాను.

నీవు కూడా అంతే బాధ్యతగా, అందరూ ఎన్ని మాటలు అంటున్నా, ఆడిపోసుకుంటున్నా నా మాట దక్కించావు. నా పండును కాపాడుకుంటూ వచ్చావ్! ఇంక నాకు ఏమైనా పర్వాలేదు. వాడికి నువ్వు ఉన్నావు. అది చాలు!”

“అయ్యో అత్తయ్యా, మీరు అంతగా చెప్పాలా? అది నా బాధ్యత”.

‘దబ్బు’మని శబ్దం వచ్చేసరికి, ఇద్దరూ గుమ్మం వైపు చూశారు. పురుషోత్తం గుండె పట్టుకొని క్రింద కూలబడ్డాడు.

శ్యామల ‘ఏవండీ’ అంటూ పరిగెత్తింది. శాంతమ్మ మెల్లిగా లేచి కూర్చొని ఆందోళనగా చూడసాగింది. అన్నలు, వదినలు కూడా హడావుడిగా డాక్టర్ను పిలిచి, పురుషోత్తంను స్ట్రెచర్ మీద ఎక్కించి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించారు.

***

పురుషోత్తం కళ్ళు తెరచేసరికి ఎదురుగా అక్కలు, అన్నలు, వదినెలు, బావలు, తన పిల్లలు ఉన్నారు. శ్యామల తన కాళ్ల దగ్గర కూర్చుని ఉంది. తను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నాడు. గుండెలకు తలకి ఏవో వైర్లు తగిలించి ఉన్నాయి. చుట్టూ చూసాడు.

పెద్దన్నయ్య, దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేశాడు.

“సారీ రా పండూ! నీవు స్పృహ కోల్పోయి మూడు రోజులైంది. అమ్మ అదే రోజు కాలం చేసింది. నిజం చెప్పొద్దూ.. నీ పరిస్థితి చూసి నాకైతే ‘నువ్వు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతావేమో’ అని భయం వేసింది. అందుకే పిల్లల్ని కూడా పిలిపించాను.

నీవా – మూసిన కన్ను తెరవడం లేదు. మీ ఆవిడా – తెరచిన కన్ను మూయలేదు. కంటికి రెప్పలా చూసుకుంటూ నిన్ను కాపాడుకుంది. నువ్వు బ్రతికి బట్టకట్టావు. హమ్మయ్య! ఇప్పుడు నా ప్రాణం కుదుటపడింది. మీరు మాట్లాడుతూ ఉండండి” అంటూ తల నిమిరి బయటకు నడిచాడు.

‘తల్లి లేదు’ అన్న మాట విని పురుషోత్తానికి జీవితం శూన్యంగా అనిపించింది. బయట పెద్దన్నయ్య కుటుంబ సభ్యులతో తల్లికి జరగాల్సిన నిత్య కర్మల గురించి చర్చించటం వినబడుతోంది.

దీర్ఘంగా నిట్టూర్చి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. చివరగా తల్లి తనను చూసిన చూపు, ఆ కళ్ళలో మెరుపు సజీవంగా కనిపించసాగాయి. శ్యామల వంక చూశాడు. అదే మెరుపు ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. ఆర్ద్రంగా చేయి చాపాడు. అంతే! ఉప్పెనంత ఉద్వేగంతో అతన్ని చుట్టేసింది.

ఆమె పొదివి పట్టుకుని ఆప్యాయంగా నిమురుతూ, నీరసంగా నవ్వుతూ అన్నాడు – “అమ్మ దగ్గరకి వెళ్ళనివ్వలేదుగా..”

అభిమన్యుడు

7

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన అనిశెట్టి శ్రీధర్ గారి ‘అభిమన్యుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]దు[/dropcap]రదృష్టానికి సారధి అంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్ సీటు ఒక్క ర్యాంకులో తప్పించేసింది. ఇప్పుడున్నట్టు వెయ్యిన్నూట పదహారు కాదు కదా అప్పట్లో కనీసం పదహారు ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఉండేవి కావు. పైగా దురదృష్టానికి ఎంత ముందు చూపంటే అప్పట్లో వరం, ఇప్పుడు శాపం అయిన బ్యాంక్ ఉద్యోగం సారధికి వచ్చేలా చేసింది.

ఈ సంస్థలో ఉద్యోగం రాకపోతే అడుక్కు తినేవాళ్ళమని రొమాంటిసైజ్ చేసుకునే కొందరిలా కాకుండా తనకి జీతం ఇస్తున్నందుకుగాను బ్యాంక్ కోసం అహర్నిశలు కష్టపడుతూ పదోన్నతులు పొందుతూ మంచి స్థాయికి చేరాడు సారధి. నీకింకా తొమ్మిదేళ్ళు సర్వీస్ ఉంది. మరో మూడు ప్రమోషన్లు కొడితే జి.ఎమ్. అయిపోవచ్చు, కనీసం డి.జి.ఎమ్. అవ్వొచ్చు. నువ్వు కొడతావు, నీకా ప్రతిభ ఉంది అని పొగిడారు.

అన్నేళ్ళూ ఓపిక పట్టిన దురదృష్టం ‘సారధి, చీఫ్ మేనేజర్’ అని రాసి ఉన్న కేబిన్ తలుపు తోసుకుని ఖద్దరు బట్టలు వేసుకున్న నరసింహారావు రూపంలో లోపలికి వచ్చింది. ఖద్దరు బట్టలవాణ్ణి చూస్తే తనకి గౌరవం అనుకుంటాడు సారధి. కానీ అది తెలియని భయం అని పాపం అతనికి తెలియదు.

“మీకు నేనేం సేవ చెయ్యగలను” అని తన సహజ సిద్ధమైన వినమ్రతతో కూడిన స్వరంతో అడిగాడు ఖద్దరుని.

“గట్టు సుధాకర్, జక్కుల సుబ్రమణ్యం అని చెరో కోటిరూపాయల లోన్లు ఉన్నాయండి. ముగ్గురు హామీదారుల్లో నేనొకడినండి. తొంభైతొమ్మిది లక్షల చొప్పున విడుదల చేసారండి. మిగిలిన లక్షా ఇప్పించేస్తే చేపలకి మేతెయ్యాలండి” అన్నాడు. ఆఫీసర్‌ని ఫైల్స్ తీసుకు రమ్మన్నాడు. నెల్లూరు జిల్లావాసులకి అక్కడ చేపల పెంపకానికి గుంటూరు జిల్లాలో తమ బ్రాంచ్ ఎందుకు రుణాలు ఇచ్చిందో అర్థం కాలేదు సారధికి.

“వాళ్ళు రాలేదేం?” అడిగాడు సారధి.

“చేపలు బెంగెట్టుకుంటై సార్” అని ఫెళ్ళున నవ్వాడు. పైగా ఈ లోన్లకి విశాఖపట్నంలో బంగారం లాంటి ఇళ్ళ స్థలాల్ని తనఖా పెట్టారు అన్నాడు. సారధి ఆఫీసర్ కేసి చూసాడు. అతను అవునన్నట్టు తలూపాడు. వ్యవసాయ రుణాలకి ఇళ్ళ స్థలాలు తనఖా అంటే ఆ ఆకర్షణే వేరు.

“ఇన్‌స్పెక్షన్ ఎప్పుడు జరిగింది?”

“పాత మేనేజరు వెళ్ళే ముందు అంటే పోయిన నెల చేసారు సార్. రిపోర్ట్స్ ఉన్నాయి”

చెరో లక్ష ఖాతాల్లో జమచేయించుకుని చక్కాపోయాడు.

***

వేరే ఊళ్ళో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న శంకర మూర్తి వచ్చాడు. సారధికి ఆప్తమిత్రుడు.

అతన్ని ముదురు మూర్తి అంటారు. మహా మేధావి, ఏదైనా తప్పు ఇట్టే పట్టేస్తాడని పేరు. మంచి మాటకారి. దొంగని దొంగ అనడానికి ఏమాత్రం మొహమాట పడనివాడు.

“హైదరాబాద్‌కి బదిలీకి దరఖాస్తు పెట్టుకున్నావంట” మూర్తి.

“అవున్రా. మా అబ్బాయికి అక్కడ ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చింది”

“హైదరాబాద్ రీజియన్ అంటే ఏ వరంగల్లో, కరీంనగరో వేస్తే ఏం చేస్తావు”

“లేదు అడిగించాను. హైదరాబాద్ సిటీ ఇస్తామని చెప్పారు”

“అక్కడ ఆర్.ఎమ్. ఎవరో తెలుసుగా. వాడక్కడ ఉన్నంతకాలం వెళ్ళకు. వాడికి మీ కులం వాళ్ళంటే పడదు”

“ఆయన మేనేజర్‌గా ఉన్నపుడు నేను పనిచేసాను. నన్ను చాలా మెచ్చుకునేవాడు”

“అప్పుడు వాడికి అవసరం. ఇప్పుడు మీ వాళ్ళనందరినీ తొక్కేస్తున్నాడు. మీ అబ్బాయి కాలేజ్ ఎక్కడ?”

“బాచుపల్లిలో”

“నీకు హయత్‌నగర్ బ్రాంచ్ పోస్టింగ్ ఇస్తాడు. మీ అబ్బాయి ఇంటినుండి కాలేజ్‌కి ఒకసారి వెళ్ళి రావడానికి ఒక సెమెస్టర్ సమయం పడుతుంది. దానికన్నా హాస్టల్లో పెట్టెయ్”

సాయంత్రం అవడంతో బయట టీ తాగడానికొచ్చారు. పక్కనే క్షణం విరామం లేకుండా బజ్జీల బండి. చాలా మంది బ్యాంక్ మేనేజర్ల లాగే సారధి బజ్జీల బండివాడిని ఈర్ష్యగా చూసాడు.

“నీకెందుకు ప్రమోషన్స్ రాలేదురా. ఆసక్తి లేదా?” మూర్తిని అడిగాడు సారధి.

“జి.ఎమ్. సుందర్రావు తెలుసుగా. వాడు నొక్కేసాడు. ఆరేళ్ళ క్రితం వాడు మేనేజర్‌గా పనిచేసిన బ్రాంచ్ నేను తనిఖీ చేసి బోలెడు అవకతవకలు బయటపెట్టాను. నేను గతంలో పని చేసిన బ్రాంచ్లన్నిటికీ వాడు ఫోన్ చేసి ఇప్పుడు పనిచేస్తున్న మేనేజర్లని ‘మూర్తి ఇచ్చిన రుణాలన్నీ సక్రమంగా ఉన్నాయా, బొక్కలేమైనా దొరుకుతాయా’ అని చూడమన్నాడట.

“నువ్వు అన్నీ జాగ్రత్తగానే చూస్తావు కదా?”

“మనం లక్ష రూపాయలు లోన్ ఇస్తే దీనికి బిల్స్ తీసుకోలేదు, వాడు షాపు పెట్టడా లేదా సరిగ్గా ఇన్‌స్పెక్షన్ చెయ్యలేదు అని వంద ప్రశ్నలు వెయ్యొచ్చు. అంటే మన జీవితమంతా మన ఖాతాదారుడు నీతి, నిజాయితీగా ఉన్నాడా లేడా అని కాపలా కాస్తుండాలన్నమాట. మనం ఆడే వైకుంఠపాళిలో అన్నీ పాముల్నే పెడతారు. నాకో పది సంజాయిషీ మెమోలు ఇప్పించి, ఎందులోనూ ఏం చెయ్యలేక మొత్తానికి ఒక దాంట్లో చార్జ్‌షీట్ చేయించాడు. నేనంటే వాడికి కోపం ఉందంటే అర్థం ఉంది. మొన్నొక ఆఫీసర్ హెడ్డాఫీస్ కారిడార్‌లో నడుస్తూ వీడిని గమనించలేదంట. ఇప్పుడా ఆఫీసర్ పుట్టుపూర్వోత్తరాలు లాగుతున్నాడని తాజావార్త”

కాస్త తీరిక దొరికి బజ్జీల బండివాడు “మేనేజరుగారూ నమస్కారం” అన్నాడు. అదొక్కటే తృప్తి.

“నీమీద హెడ్డాఫీసుకి ఒకసారి తప్పుడు ఫిర్యాదు వెళ్ళింది కదా?” మూర్తి అడిగాడు.

“అవును మూర్తి. ఎంక్వైరీ అంటూ వేసారు కాని పస లేదని వదిలేసారు”

“దొంగపేరుతో ఆ ఫిర్యాదు చేసింది నీ కింద పనిచేసే సిబ్బందే కదా? ఎందుకు చేసారు?”

“నేను పని చెయ్యమంటానని కోపం”

“అదొక్కటే కాదు. అపుడు నువ్వు గ్రేడ్ ప్రమోషన్‌కి వెళ్ళబోతున్నావు. అది చెడగొట్టడానికి”

“అవును మూర్తీ నేను గమనించనేలేదు” అన్నాడు సారధి తెల్లబోతూ.

“అందుకే నన్ను ముదురు మూర్తి అని, నిన్ను సద్గురు సారధి అని అంటారు.”

ఇద్దరూ నవ్వుకున్నారు.

బ్యాంక్ మేనేజరంటే కేబిన్‌లో ఖాళీగా కూర్చునేవాడని చాలామంది అభిప్రాయం. తీవ్రవాదులు ఎటునుండి దాడి చేస్తారో తెలియని సైనికుడిలాంటి వాడని తెలీదు.

***

ఒక్క రూపాయి కూడా కట్టకపోవడంతో చేపల చెరువుల రుణాలు రెండూ రాని బకాయిలయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. బ్యాంకు రుణాలు మొండి బకాయిలుగా చూపించడాన్ని హెడ్ఆఫీసు వాళ్ళు అంత తొందరగా ఒప్పుకోరు. చూపించకుండా ఎలా దాచాలి అనేదాని మీద డాక్టరేట్లు చేసినవాళ్ళు ఉంటారు. అలా విజయవంతంగా మూడేళ్ళు సాగదీసారు.

జక్కుల సుబ్రహ్మణ్యం, గట్టు సుధాకర్ల ఫోన్లు పనిచెయ్యడం లేదు. అదృష్టం కొద్దీ ఖద్దరు నరసింహారావు నంబరు తగిలింది.

“కిస్తీలు కట్టట్లేదాండి. అప్పు ఇప్పించమని చంపుకు తింటారండి. కట్టమంటే కష్టాలు ఏకరువు పెడతారు. నేను పంపుతాలెండి” అని వడ్డీ డబ్బులు నాలుగు లక్షలు పంపాడు. తర్వాత అతనూ మాయం. మొండి బకాయిలుగా చూపించక తప్పలేదు.

నెల్లూరు జిల్లాలో ఓ మారుమూల పల్లెలో జక్కుల సుబ్రహ్మణ్యం ఆచూకీ పట్టుకున్నాడు సారధి.

“బ్యాంకికొచ్చానండి. సంతకాలు అవీ పెట్టించుకున్నారండి. తర్వాత లోను సాంక్షన్ కాలేదంటే కామోసని ఊరుకున్నానండి. మరి ఈ నోటీసులేంటో అర్థం కాలేదండి. అడిగితే మేం కట్టేస్తాంలే అన్నారండి”

సారధికి అర్థమైంది.

రుణం ఇప్పిస్తామని దరఖాస్తు మీద, మరికొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టాలని బ్యాంకుకి తీసుకొచ్చి ఒక్క దరఖాస్తేం ఖర్మ లోన్ డాక్యుమెంట్స్ పైనా, సేవింగ్స్ ఖాతా తెరవడానికి, చెక్ బుక్ కోసం, ఖాళీ చెక్కుల మీద, తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించేసి రుణం మొత్తం హామీదారులుగా ఉన్న ఖద్దరు నరసింహారావు అండ్ కో స్వాహా చేసేసారు.

“మీరు డబ్బులేమీ కట్టకుండానే మీ పేరున విశాఖపట్నంలో స్థలం రిజిస్టర్ చేస్తామంటే ఎలా నమ్మారు?”

“నాకంతగా తెలీదండి. ఆళ్ళే రిజిస్ట్రీ చేయించారండి. దాని మీద లోను వస్తదని చెప్పారండి”

మరో ఊళ్ళో గట్టు సుధాకర్ గురించి అన్వేషణ. తన దగ్గర ఉన్న ఫోటో, ఓటర్ ఐడి కాపీ చూపించాడు.

“గట్టు సుధాకర్ ఇలా ఉండడండి”

“లేదండీ ఇతనే” అన్నాడు సారధి.

“నాకు తెలిసిన గట్టు సుధాకర్ వేరే అండి. తను బ్యాంకులో లోను తీసుకోకపోయినా నోటీసులు వస్తున్నాయని లబోదిబో అంటున్నాడండి”

సారధి వెంటనే గుంటూరులో ఉన్న ఆడిటర్ గారికి బ్యాంక్ రికార్డుల్లో ఉన్న గట్టు సుధాకర్ పాన్ కార్డ్ ప్రతి స్కాన్ చేసి వాట్సప్‌లో పంపాడు. పేరు, పుట్టినతేదీ, పాన్ (నంబర్) అన్నీ సరిపోతున్నాయని చెప్పారు.

ఫోటో సరిపోతుందా అనడిగాడు సారధి ఆతృతగా. ఆదాయపు పన్ను శాఖ సైట్‌లో పాన్ కార్డ్ వివరాల్లో ఫోటో కనపడదట.

సారధి మరోసారి నిర్ఘాంతపోయాడు.

అసలు గట్టు సుధాకర్ దగ్గరికి వెళ్ళారు. అతనికీ రుణం ఇప్పిస్తామని అతని దగ్గర ఆధారాలు అన్నీ తీసుకున్నారట. అయితే జక్కుల సుబ్రహ్మణ్యంలా అన్ని సంతకాలు పెట్టేంత అమాయకుడు కాకపోవడంతో అతన్ని బ్యాంక్‌కి తీసుకెళ్ళకుండా వేరే వ్యక్తి ఫోటో అతని పాన్ కార్డ్ మీద, ఓటరు ఐడి మీద సూపర్ఇంపోజ్ చేసి ఆ నకిలీ వ్యక్తిని బ్యాంకులో గట్టు సుధాకర్‌గా చెలామణీ చేయించి రుణం నొక్కేసారు. బ్యాంక్ నోటీసులు అసలు సుధాకర్‌కి వెళ్ళాయి.

అంటే ఎవరి పాన్ వివరాలతో అయినా ఫోటో మార్చేసి మరో వ్యక్తి అసలు వ్యక్తిగా చెలామణీ అయిపోవచ్చన్నమాట. బ్యాంకర్‌కి ఎలాంటి రక్షణ ఉండదు! రుణగ్రహీత ఇంటికి వెళ్ళి వెరిఫై చెయ్యకపోవడమే పాత మేనేజర్ చేసిన ఘోర తప్పిదమని అర్థమయ్యింది సారధికి.

తను డబ్బులు తీసుకోలేదన్న సుబ్రహ్మణ్యం వాదన కోర్టులో నిలవదు. అయినా అతను రూపాయికి ఠిఖాణా ఉన్నవాడిలా అనిపించలేదు. తన పేరుతో నకిలీ వ్యక్తికి రుణం ఇచ్చారని గట్టు సుధాకరే బ్యాంక్ మీద కేసు వేసే అవకాశం ఉంది. ఇంక రుణ వసూలుకి మిగిలిన ఆధారం బ్యాంక్‌కి తనఖా పెట్టిన విశాఖపట్నం స్థలాలు.

తదుపరి ప్రయాణం విశాఖపట్నం.

బ్యాంక్ రికార్డుల్లో ఉన్న ఫోటోల ప్రకారం ఒక స్కూల్ దగ్గర్లో ఉన్న ఆ స్థలాలని తేలికగానే గుర్తించారు. బాగా అభివృద్ధి చెందిన ఆ ప్రాంతం చూడగానే బ్యాంకు బాకీ తీరడానికి ఈ స్థలాలు అమ్మితే సరిపోతాయని సారధి మనసు కుదుటపడింది.

సర్ఫాసి చట్టం ప్రకారం ఆ స్థలాల్లో బ్యాంకు స్వాధీనత చేసుకున్నట్టు బోర్డులు పాతి ఫోటోలు దిగాడు సారధి. ఏంటి సార్ అని అడిగాడు దారినపోయే దానయ్య. సారధి వివరించాడు.

“అది ప్రభుత్వ స్థలం కద సార్. నీళ్ళ ట్యాంక్ కోసం వదిలిపెట్టారు” అన్నాడు దానయ్య. తెల్లబోయిన సారధి బ్యాంక్ లాయర్‌ని తీసుకుని ఎమ్మార్వో ఆఫీస్‌కి పరిగెత్తాడు.

విశాఖపట్నంలో సంబంధిత కార్యాలయంలో ఎమ్మార్వో, రెవెన్యూ సర్వేయర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అందరూ మహిళలే. మహిళా సాధికారత చూసి సారధికి గర్వం కలిగింది. ఇలాంటి రుణాలు ఎలా ఇస్తారండి అనడిగింది ఎమ్మార్వో. సారధి బలహీనంగా నవ్వాడు. సర్వేయర్ గారు సెలవుట. కూడా ఆరై గారు వచ్చారు బ్యాంకుకి తనఖా పెట్టిన స్థలాల పరిశీలనకి.

“ఈ సర్వే నంబరు వేరండి” ఆరైగారు పెదవి విరిచారు.

“మా దగ్గర ఫోటోల్లో ఉన్న స్థలం ఇదేనండి” అన్నాడు సారధి.

“ఏవండీ ప్రముఖులతో ఫోటోలు దిగి హడావిడి చేస్తే మనం ప్రముఖులమైపోతామా? మీ పాత మేనేజర్ ఈ స్థలం దగ్గర ఫోటో తీసుకుంటే స్థలం బ్యాంకుదైపోతుందా? ఇది ప్రభుత్వ స్థలం. నీళ్ళ ట్యాంక్ కోసం కేటాయించబడింది” కోప్పడింది ఆరై.

“సరేనండి. మాకు తనఖా పెట్టిన దస్తావేజుల ప్రకారం ఆ సర్వే నంబరు ఎక్కడో చూపిస్తారా” సారధి దీనంగా అడిగాడు.

కారెక్కి చాలా దూరం వెళ్ళి ఆ సర్వే నంబర్ దగ్గర దిగారు. అక్కడ ఈ ప్లాట్లలో వేరే ఇళ్ళు వెలిసి ఉన్నాయి.

“స్థలాలు మీవి కావండి. నకిలీ దస్తావేజులు మాత్రమే మీవి” జాలిపడుతూ చెప్పింది ఆరై. అంటే ఎవరివో స్థలాలకి డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారన్న మాట.

“మరి రిజిస్ట్రార్ ఎలా రిజిస్టర్ చేస్తాడు” లాయర్ని అడిగాడు సారధి.

“రిజిస్ట్రార్‌కి సర్వే నంబర్ తన రికార్డుల్లో ఉంటే చాలు. ఎంతమందికైనా రిజిస్టర్ చేసేస్తాడు. ప్రభుత్వానికి ఆదాయం రావడమే ముఖ్యం” సారధి నిర్ఘాంతపోయాడు. బ్యాంకులు నిండా మునిగినా పర్లేదన్నమాట.

“సర్వేయర్ గారితో అలా అని మాకు రిపోర్ట్ ఇప్పిస్తారా” అడిగాడు సారధి.

లాయరుగారు ఇచ్చిన రెండు ఐదొందల నోట్లని ఎందుకండీ అంటూనే అందుకుంటూ “అమ్మో సర్వేయర్ అమ్మగారు చాలా ఖరీదు అండి. మీరు తట్టుకోలేరు” అని నవ్వింది ఆరై.

మహిళా సాధికారత మై ఫుట్ అనుకున్నాడు సారధి.

నరసింహారావు అండ్ కో వాళ్ళు ఇతర బ్యాంకుల్ని కూడా కాపీ పేస్ట్‌గా ఇలానే బురిడీ కొట్టించారని తెలిసింది. మూర్తితో చెప్పాడు జరిగిన విషయమంతా.

లాయరు, ఇంజినీరు, ఆడిటరు, అపరాధ పరిశోధకుడు ఇలా చప్పన్నారు వృత్తులవాళ్ళ కన్నా బ్యాంకు మేనేజరు అనే అమాయకుడు తెలివిగలవాడై ఉండాలి. అతడనేక చట్టములందు ఆరితేరి యుండవలయును. లేకపోతే ఎవడో ఒకడు జెల్ల కొట్టేస్తాడు, ఎర్త్ పెట్టేస్తాడు, కాళ్ళ కింద భూమి లాగేస్తాడు.

రుణం మంజూరు చేసిన మేనేజర్‌కి ఫోన్ చేసి విషయం అంతా వివరించాడు సారధి. ఆ సమయంలో రీజినల్ మేనేజర్ నన్ను ఒత్తిడి చేసి ఇప్పించాడు ఆ రుణాలు అన్నాడు అతను. ఎవరిని నమ్మాలో తెలియదు.

జరిగిందంతా పై ఆఫీసుకి రాతపూర్వకంగా తెలియజేసాడు సారధి. ముందుగా లాయర్‌ని, వేల్యూయర్‌ని ప్యానెల్లోంచి తొలగించారు. వాళ్ళు వేరే బ్యాంకుల ప్యానెల్స్‌లో కొనసాగుతూ హాయిగా డబ్బులు సంపాయించుకుంటున్నారు.

మూడేళ్ళవడంతో ఆ బ్రాంచ్ నుండి బదిలీ కూడా అయ్యాడు సారధి.

ప్రతి సంవత్సరం సారధి పదోన్నతి కోసం పోటీ పడుతున్నా విజయం వరించడం లేదు. మూర్తి దగ్గర వాపోయాడు. చేపల చెరువుల రుణాల్లో సారధిని బ్యాంకు సంజాయిషీ అడగలేదని ధృవపరుచుకున్నాడు.

“పట్టు పరిశ్రమలో అనుభవం ఉండాలి. పైవాడి దృష్టిని ఆకర్షిస్తూ ఉండాలి. పోనీ సుందర్రావులా జనవరి ఒకటిన పైవాళ్ళ ఇంటికెళ్ళి మామూలు బిస్కెట్ల మధ్య ఒక బంగారం బిస్కెట్ పెట్టి ఇస్తావా?”

“ఇలాంటివాళ్ళు ఉన్నా బ్యాంకులు ఎలా మనగలుగుతున్నాయి?”

“ఇతర ప్రభుత్వ సంస్థల్లా కాకుండా బ్యాంకుల్లోమనలాంటివాళ్ళు తొంభైఐదు శాతం ఉండడం వలన”

నాలుగేళ్ళయింది. సారధి ఆ కేస్ గురించే మర్చిపోతున్నపుడు దురదృష్టం నవ్వి ఒక సంజాయిషీ మెమో పంపింది. మూర్తిని సంప్రదించి, ఆఫీసర్స్ అసోసియేషన్ సలహా తీసుకుని సమాధానం పంపాడు.

మరో రెండేళ్ళు గడిచాయి. సారధి ఇంకో నాలుగు నెలల్లో రిటైర్ అవుతున్నాడనగా రుణం మంజూరు చేసిన మేనేజరుకి, ‘రెండు కోట్లలో మిగిలిన రెండు లక్షలు విడుదల చేసి నువ్వు నీ విధిని సక్రమంగా నిర్వర్తించనందువల్ల బ్యాంకుకి రెండుకోట్ల నష్టం వాటిల్లింద’ని సారధికి చార్జ్షీట్స్ వచ్చాయి.

నా కష్టానికి గుర్తింపు లేకపోగా ఈ పిడుగుపాటు ఏంటి అని బాధపడ్డాడు సారధి. ఎవరిని అడిగినా “చిన్నశిక్షతో సరిపెడతారులే. అయినా ఇలాంటివి రాకుండా చూసుకోవాలి” అని ఊరడించారు. కాలుజారి పడినవాడికి అయ్యో అనే సానుభూతి కావాలి కాని సరిగ్గా చూసుకుని నడవాల్సింది అనే మందలింపు కాదు. సారధి అంటే అభిమానం ఉన్న జి.ఎమ్.లు ఉన్నా వాళ్ళు కౌరవులు పాండవులకి అన్యాయం చేస్తుంటే నోరు మెదపలేని భీష్ముడివంటి వారు.

***

చేపల చెరువులకి రుణం మంజూరు చేసిన మేనేజర్ రిటైర్ అయ్యాడు రెణ్ణెల్ల క్రితం. విచారణ జరిపి ఒక ఇంక్రిమెంట్ తగ్గించారు.

“జి.ఎమ్. సుందర్రావు నిన్నరిటైర్ అయ్యాడు తెలుసుగా?” అడిగాడు మూర్తి.

“మరి వాడి మీద ఉన్న చప్పన్నారు కేసులు?”

“అన్నిటికీ కలిపి ఒక ఇంక్రిమెంట్ కట్ చేసేరుట”

మరుసటి నెల పదవీ విరమణ చేసిన సారధికి కూడా ఒక ఇంక్రిమెంట్ తగ్గించి మర్యాదగా ఇంటికి పంపారు. ఆర్నెలల్లో తేల్చాల్సిన కేసుని ఆరేళ్ళపాటు నొక్కి ఉంచి, అంటే జైళ్ళలో మగ్గే అండర్‌ట్రయల్స్‌లా, పదోన్నతులు రాకుండా తొక్కేసారు. అంతే తేడా.

‘బ్యాంక్ సొమ్ము కోట్లు తినేసినోడిని, కుక్క కాపలా కాసిన నన్ను- ఇద్దర్నీ ఒకే గాటన కట్టేసారు’ అని వాపోయాడు సారధి. “పొలాల్లో అడ్డంగా పడి మేసే పశువులతోపాటు పొరపాట్న అందులో కాలుపెట్టిన మన బోటి సాధుజంతువులకి కూడా దెబ్బలు తప్పవు” అని ఓదార్చాడు మూర్తి.

***

“రిటైర్ అయిపోయారు. మన డబ్బులు మనకి వచ్చాయి. అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండండి” అంది భార్య.

అన్నీ మర్చిపోయి హాయిగా ఉంటున్నాడు సారధి.

కానీ దురదృష్టం సారధిని మర్చిపోతుందా?

కొడుకు ఇంజినీరింగ్ చదువు పూర్తి అయింది. అచ్చం సారధి లక్షణాలు పుణికిపుచ్చుకున్న కొడుక్కి సారధి కోరుకున్నట్టు ఇంజినీర్ ఉద్యోగం రాలేదు. వారసత్వపు వ్యాధిలా బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు.

అనుబంధాల సంకెళ్లు!

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఏ. అన్నపూర్ణ గారి ‘అనుబంధాల సంకెళ్లు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“మధూ! విలేజ్‌లో ఉన్న గ్రానీ ఫోను చేసింది. ఆవిడ చివరి రోజులు మనతో గడపాలని ఆశపడుతోంది. వెడదామా..?” అన్నాడు రోహన్ ఆఫీసునుంచి ఇంటికి వచ్చాక.

“అబ్బా! నాకు అక్కడ తోచదు. నీకు సెలవు దొరకదు” అంది మధు ఆసక్తి లేనట్టు.

“అది కాదు మధూ నీకు చెప్పేనుగా. మా అమ్మా నాన్నా కార్ యాక్సిడెంట్లో చనిపోతే నెలల పసివాడిని నన్ను చేరదీసి పెంచి చదివించింది. ఆవిడ చివరి దశలో వుంది. నువ్వు త్వరలో బిడ్డకు జన్మనిస్తావు. ఆ బిడ్డను చూడాలని ఎదురుచూస్తోంది. నా జాబ్‍కి కొంతకాలం బ్రేక్ ఇస్తాను.”

“ఇప్పుడు మనం చాలా ఖర్చులో వున్నాం. డెలివరీ, బేబీని పెంచడం, మామూలు విషయం కాదు. జాబ్ మానేసి కూర్చుంటే ఎలా?”

“గ్రానీకి నర్సరీ వుంది. గ్రాండ్‌పా ఎప్పుడో ప్రారంభించారు. అందులో పనిచేస్తా. గ్రామంలో పెద్ద ఖర్చు ఉండదు. స్వంత ఇల్లు. ఏమి ఇబ్బంది ఉండదు. ప్లీజ్ మధూ నా కోరిక తీర్చవా?”

“ఏమో బాబూ! నాకు అసలు ఇష్టం లేదు. డాక్టర్ సదుపాయం ఉండదు.”

“సరే. నీ ఇష్టం” అన్నాడు రోహన్.

మధు వాళ్ళ అమ్మ నాన్న కూతురు డెలివరీ కోసం వచ్చారు.

కొద్దిరోజుల తర్వాత రోహన్ చెప్పేడు.

“మధూ నేను గ్రానీ దగ్గిర కొద్దిరోజులు ఉండి వస్తాను. మీ అమ్మా నాన్నలు నీకు తోడు వున్నారుగా!”

“ఐతే నువ్వు ఉండవా?” కోపంగా అడిగింది మధు.

“నీకు నార్మల్ డెలివరీ అని డాక్టర్ చెప్పింది. పర్వాలేదు. అంతా బాగా జరుగుతుంది. నేను వెళ్లితీరాలి” అన్నాడు.

ఆ రాత్రికే రోహన్ గ్రానీ వుండే గ్రామం తోటపల్లి వెళ్ళేడు.

చంద్రమతి మనవడిని చూసి మురిసిపొయింది. ఒక్కడే వచ్చినందుకు బాధపడింది.

“మధూని వదిలి వచ్చావా..” అని మందలించింది.

“మధూ బేబీ పుట్టేక తీసుకుని వస్తుందిలే గ్రానీ. వాళ్ళ అమ్మ-నాన్నలు వున్నారు. నీకు ఎవరూ లేరు. ఎన్ని రోజులుగానో అడుగుతున్నావు. అందుకే వచ్చేసాను.” అన్నాడు.

చంద్రమతి ఇంకా నర్సరీలో పని చేస్తూనేవుంది. కొత్త మొక్కలు తెప్పించడం, వాటి సంరక్షణ, పూల బొకేలు తయారుచేసి వారం మార్కెట్లో అమ్మడం వగైరా.

ఇంటికి రోజూవచ్చి తాజా పూలను కొని తీసుకువెడతారు రెగ్యులర్ కష్టమర్స్. సీజన్ వారీగా కూరగాయ మొక్కలు, పూలమొక్కలు చంద్రమతి దగ్గిరే కొంటారు.

అలా వచ్చే పారిజాత రోహన్ ను చూసి “ఎవరీ బంధువు? ఇన్నాళ్లు కనబడనేలేదు” అంటూ అడిగింది.

“వీడు రోహన్. నా మనవడు. సిటీలో పెద్ద ఆఫీసర్. తీరిక వుండదులే. నేనే వెళ్లి వచ్చేదాన్ని” అంటూ చెప్పింది.

“ఓసోస్.. నాకు తెలియకుండా నువ్వెక్కడికి వెళ్ళేవు? మనవడిని మా బాగా వెనకేసుకు వస్తున్నావులే!” అని చంద్రమతితో అని, “ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా ఈవిడ?” అంటూ దులిపేసింది రోహన్‌ని.

“ఇక ఇక్కడే ఉండిపోతా. ఇంతకీ నువ్వెవరు?” అన్నాడు.

“నేనా ఈ తోటకు రాణిని. గ్రానీ మంచి చెడ్డా చూస్తూ వుంటాను. క్రితం నెల చాలా జబ్బుచేసింది. బతుకుతుంది అనుకోలేదు. నీ కోసం ఎంతగా కలవరించిందో. ఫోను చేస్తాను నంబర్ ఇవ్వమంటే ఇస్తేనా.. నేను ఊరుకుంటానా.. ఇల్లంతా తిరగేసి తెలుసుకుని ఫోను చేస్తే పని అమ్మాయి నువ్వు లేవని చెప్పింది..” అంటూ గల గలా మాట్లాడింది.

“అబ్బా అవన్నీ ఇప్పుడు ఎందుకు పారిజాతా? నీ నోరు క్షణం మూతపడదు కదా!” అంటూ చంద్రమతి అడ్డుకుంది.

“నువ్వు చెప్పవు. నన్ను చెప్పనీయవు. ఈ ఇంటిమీద లోను ఇంకా తీరలేదు. మొన్న పంచాయితీలో వార్నింగ్ ఇచ్చారు. డబ్బు కట్టకపోతే నర్సరీని స్వాధీనం చేసుకుంటామని. కోవిడ్ వచ్చినపుడు చాలా నష్టపోయింది. ఒక్కరోజన్నా వచ్చి చూశావా? ఏమి మనవడివి.. నిజంగా బంధువా కాదా?” అంటూ చీవాట్లు పెట్టింది.

“సారీ పారిజాత. తప్పంతా నాది. కోవిడ్ టైమ్‌‌లో నన్ను వేరే దేశానికి పంపించారు మా ఆఫీసువాళ్ళు. మా స్నేహితుడిని పంపించాను గ్రానీ దగ్గిరకు.”

“ఆఁ.. వచ్చాడులే నీ స్నేహితుడు. ఒంటి స్తంభం మేడలో గ్రానీని కూర్చోబెట్టేడు. ఏడాదిపాటు మాకు ఇద్దరు కనిపించనే లేదు” అంది పారిజాత.

“ఊరుకోవే తల్లి. ఇప్పుడు అంతా బాగున్నాంగా! నువ్వు ఇల్లంతా సర్దు. కూరగాయలు కోసి వండి తీసుకురా. అన్నట్టు రోహన్‌కి బెడ్రూములో దోమతెర కట్టాలి. తెచ్చేవా?”

“ఇవన్నీ చేయడానికి నేను నీ కోడలినా? రోహన్‌తో పెళ్లి చేస్తాను అంటే అలాగే నువ్వు చెప్పినట్టు చేస్తాను” అంది కొంటెగా.

“ఆ ఇంతోటి పనిమంతురాలివి చదువుకున్నదానివి దొరకవని! ఈ పల్లెటూరి మేళాన్ని బంగారంలాంటి మనవడికి కట్టబెడతాను. వాడికి పెళ్లి అయిపోయింది. రేపో మాపో కూతురు పుడుతుంది.”

కళ్ళు తుడుచుకుంది పారిజాత.

‘పిచ్చిదానా! పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావ్. బంధాలు అంటూ లేకుండా పెరిగావ్. నాకు నువ్వు నీకు నేను తోడు అయ్యాము. ముందు రోజులు ఎలా గడుస్తాయి నీకు…’ అనుకుంది చంద్రమతి.

అలా సందడిగా రోజులు గడిచిపోతున్నాయి. నర్సరీ పచ్చగా కళకళలాడింది. ఇంటిమీద లోను తీర్చేసి గ్రానీ భారం తీర్చేసాడు రోహన్.

మధుకి ఆడబిడ్డ పుట్టింది. గ్రానీకి వీడియోలు చూపించాడు.

“ఎప్పుడు వస్తావ్? అక్కడే ఉండిపోతావా ఏం?” అంది మధు.

“నిజమే నాకు ఇక్కడే బాగుంది. రావాలనిపించడంలేదు” అన్నాడు రోహన్.

“అయితే నేను బేబీని తీసుకుని వస్తాను.” అంది మధు.

నిజంగా వస్తే బాగుండును అనుకున్నాడు.

పారిజాతకి అనుమానం వచ్చింది. మధు, రోహన్ విడిపోయారా? అని.

చంద్రమతి ఒకరోజు పూలబొకే కడుతూ చెట్లమధ్య తిరుగుతోంది.

పారిజాత వెదుక్కుంటూ వెళ్లేసరికి నేలమీద పడిపోయి ఉంది. “రోహన్” అంటూ కేకపెట్టింది.

హాస్పిటల్లో చేర్పించారు..అదే సమయానికి మధూ బేబీని తీసుకుని వచ్చింది.

“గ్రానీ ఇదిగో నీ మునిమనుమరాలు, బుల్లి చంద్రరేఖ వచ్చింది. చూడు” అంటూ చూపించాడు రోహన్.

మెల్లగా మగతలోవున్న చంద్రమతి కళ్ళు తెరచి చూసింది. ఆమె పెదవులపై చిరునవ్వు వెలిసింది.

“సమయానికి వచ్చాను. లేకుంటే చాలా బాధ కలిగేది” అంది మధు.

“పారిజాతా! ఈ ఇల్లు నర్సరీ నీ పేరున రాసింది గ్రానీ. నువ్వే అందుకు అర్హురాలివి..” అంటూ పేపర్స్ ఇచ్చాడు రోహన్.

“అప్పుడప్పుడు ఈ వూరు వస్తూవుండు రోహన్” అంది కన్నీళ్లతో పారిజాత.

“నేను చంద్ర కూడా వస్తాం పారిజాత! మాట ఇస్తున్నాను” అంది మధూ మనస్ఫూర్తిగా .

కన్నీటి మసకలో, దూరం అవుతున్న వాళ్ళని కనుచూపు మేరకు చూస్తూ ఉండిపోయింది పారిజాత.

అద్వైతం

9

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నరహరి రావు బాపురం గారి ‘అద్వైతం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap] నాన్నమ్మకు మేమంటే ఎంతో ప్రేమ.

మాకు ఊహ తెలిసినప్పటినుంచీ ఆమె రూపం ఒకే విధంగా ఉంది.. తెల్లగా పొట్టిగా చీర తలపైన నుండి చుట్టుకొని ఉండేది.

మా తాతను మేము పిల్లలం ఎవరం చూడలేదు.. మా నాన్న పెళ్ళికి ముందే చనిపోయారు.

కానీ మా తాత నల్లగా ఉండేవారంట.

పెళ్ళప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ నాన్నగారు ఇచ్చిందేమీ లేదు.. ఇంత పెరుగన్నం కట్టించిచ్చారంటంతే!

తొమ్మిదేళ్ళ వయస్సులో కట్టుకున్న పెళ్లి చీర, రెండు జతల బట్టలు తప్పితే ఇంకేమీ లేకుండా మా తాత వెంట వచ్చింది మా నాన్నమ్మ!

పన్నెండేళ్ళ వయస్సులో మొదటి బిడ్డను కనింది. ఆ తర్వాత ఏడుగురు పిల్లలను కనింది. మధ్య మధ్యలో నలుగురు పిల్లలు పుట్టి చనిపోయారంట!

మా తాత బ్రిటిష్ వాళ్ళ కాటన్ కంపెనీలో పని చేస్తూ ఊరూరా తిరిగేవారు.. ఉత్తర భారతదేశంలో కూడా!

పిల్లలతో పాటు మా నాన్నమ్మ ఒక్కతే బాడుగ ఇండ్లలో ఉంటూ ఉండేది.

మా నాన్నమ్మ అన్న అనంతపురంలో ఉండేవారంట.. ఏదైనా సహాయానికి ఉంటుందని అదే ఊరిలో పిల్లలను పెట్టుకొని వారిని చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది మా నాన్నమ్మ.

మా తాత మా నాన్నమ్మను ఎంతో ప్రేమగా చూసుకొనేవారంట.

మగ పిల్లలు కాలేజీ చదువుకు వచ్చే పాటికి అనంతపురంలోనే సొంత ఇల్లు కట్టించారు మా తాతయ్య.

సెలవులకు వచ్చేవారంట.. అప్పుడే ఒక్కోసారి రెండు మూడు నెలలు ఉండేవారంట.

మా తాతయ్య పిల్లలతో గడపడం అప్పుడే ఎక్కువ!

సంవత్సరం అంతా ఉద్యోగం పని పైనే మహారాష్ట్ర అటువైపే ఎక్కువగా తిరగడం, వచ్చినా రెండు మూడు రోజులకే వెళ్ళిపోయేవారంట.

కొన్ని కొన్ని సంఘటనలు మా అత్తావాళ్ళు.. మా నాన్న కంటే పెద్దవారు.. చెబుతుంటే మేం ఆశ్చర్యంగా వినేవాళ్ళం.

ఒకసారి మా నాన్నమ్మ ఎందుకో అలిగి ‘బావిలో పడి చస్తాను’ అందట.

అంతే! సాయంకాలం నుండి ఆ రాత్రంతా సొంత ఇంట్లో వెనుక వైపు ఉన్న బావి దగ్గరే పొద్దున అయేంతవరకూ కాపలాగా కూర్చున్నారంట మా తాతయ్య.. కోపంతో మా నాన్నమ్మ అన్నంత పనీ చేసేస్తుందన్న భయంతో!

తరచి చూస్తే ఆ భయం వెనుక ఎంత ప్ర్రేమో కదా!?

ఇంకో సారి మంత్రాలయంకు వెళ్ళినప్పుడు తుంగభద్ర నదిలో స్నానం చేసి వస్తున్నారంట.

మిట్టమధ్యాహ్నం అక్కడ బండలు, ఇసుక అంతా కాలిపోతూ ఉంటే నాన్నమ్మ నడచి రావడానికి తడిచిన చీర, పంచలను ఒకదాని తర్వాత మరొకటి పరుస్తూ వచ్చారంట!

పెద్దత్తయ్య ఈ సంఘటన గురించి చెబుతూ అమ్మది అప్పుడు రాజభోగం!.. ‘అహో రాజమాత వేంచుస్తున్నారహో!!’.. అన్నట్లు ఉండిందంట!!

చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా వీళ్ళవైపు చూస్తున్నా అవేవీ పట్టించుకోకుండా తాతయ్య బట్టలను ఒకటి తర్వాత ఒకటి ముందుకు పరుస్తూ వచ్చారంట!

నిజంగా ఎంత ప్రేమ ఉండి ఉండాలి తాతయ్యకు నాన్నమ్మ మీద!?

ఇటువంటి సంఘటనలు ఏవైనా విన్నప్పుడంతా ‘అరే! ఆ ప్రేమైక మూర్తిని చూడలేకపోయామే!?’ అన్న విషయం మమ్మల్ని, ముఖ్యంగా నన్ను బాధ పెట్టేది!

ఎప్పుడూ దేనికీ అరచుకోలేదంటే నాన్నమ్మ తాతయ్యల మధ్యన ఉన్న బాండింగ్ ఎంత ఉత్కృష్టమో కదా!?

నువ్వూ.. నేనూ.. అని పంతాలకు పోకుండా నువ్వే నేను, నేనే నువ్వు అన్న ఏకీకృత భావనను ఎంత చక్కగా తమ తమ జీవితంలో ఆచరించి చూపారో ఆ జంట!

***

తరువాత తరం మా పెదనాన్న, పెద్దమ్మ దంపతులు.

వారిదీ అన్యోన్య దాంపత్యం!

మా పెదనాన్న పెద్దమ్మకు చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు!

పెదనాన్న వెటర్నరీ డాక్టర్‌గా పనిచేసేవారు.. బదిలీల మీద ఊళ్ళన్నీ తిరిగేవారు.

చాలా మటుకు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి సెలవుల్లో వెళ్ళేవాళ్ళం.. చిన్నప్పుడు అంతా!

నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసిన తర్వాత మా చిన పెదనాన్న ఇద్దరు కూతుళ్లు.. అంటే మా అక్కలతో కలసి ఆళ్ళగడ్డ దగ్గర బనవాసికి వెళ్ళడం నాకు బాగా గుర్తు.

అమ్మానాన్నలు లేకుండా మేం ముగ్గురం పిల్లలమే వెళ్ళాం అప్పుడు.

పెద్దమ్మ చేసే వంటకాలన్నీ ఇష్టంగా తినడం.. సాయంత్రాలు సినిమాలకు వెళ్ళడం.. అక్కడ ఉన్నన్ని రోజులూ హాయిగా గడిపేసాం.

పెద్దమ్మ, పెదనాన్నలు ఒకరికొకరు అన్నట్లుగా ఉండేవారు. ఏ విషయంలోనైనా ఇద్దరిదీ ఒకే మాట.. అదే ఆశ్చర్యం అనిపించేది నాకు!

ఇంకో పెదనాన్న సివిల్ సర్జన్. పెద్దమ్మ అప్పట్లోనే బెంగళూరులో మహారాణి కాలేజీలో డిగ్రీ చదివారు.

ఇంగ్లీష్ బాగా మాట్లాడేవారు.

ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతే ఆ ఊర్లకన్నిటికీ ఒకసారన్నా అందరం వెళ్ళి వచ్చేవాళ్ళం.

కడపలో ఉన్నప్పుడు మా పెదనాన్న సెలవులు వచ్చినప్పుడు నన్ను కడపకు పిలుచుకొని వెళ్ళారు.

వారం రోజులు ఉన్నానేమో అక్కడ!

ఇంట్లో పెద్దగా వాతావరణాన్ని గమనించలేదు అప్పుడు.. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాననుకుంటాను. సరిగ్గా గుర్తుకు లేదు.

దగ్గరలో ఉన్న కృష్ణ థియేటర్ కు వెళ్ళాం సినిమాకు.. థియేటర్ పేరు కృష్ణనే అనుకుంటాను, ఇప్పుడు డౌట్ వస్తోంది నాకు.

టెంపుల్స్‌కు వెళ్ళాం. దేవుని కడప, గండి దేవాలయాలు చూసి వచ్చాం. ఆ వయసులో దేవాలయాలను చూడటం ఒక వింత ఆధ్యాత్మిక అనుభవం.

తర్వాత పెదనాన్న చిత్తూరులో ఉన్నప్పుడు అక్కడకు వెళ్ళాను నేను.. మా పెదనాన్నే అనంతపురంకు ఏదో పనిమీద వచ్చినపుడు వెళ్తూ వెళ్తూ నన్నూ పిలుచుకెళ్ళారు.

అక్కడే ఓ పదహైదు రోజులున్నట్లు గుర్తు.

రోజూ పొద్దున్నే పెదనాన్న లేచి బాయిలర్‌లో నీళ్లు పోసి స్నానానికి కాచేవారు. ఫిల్టర్‌లో కాఫీ డికాషన్ వేసి ఉంచేవారు. ఆ తర్వాత పెద్దమ్మ వచ్చి కాఫీ కలిపి ఇచ్చేవారు.

పెదనాన్న, పెద్దమ్మ ఇద్దరూ కాఫీ తాగుతూ హిందూ పేపర్ చదివేవారు. అందులోని వార్తలను గురించి ఇంగ్లీషులోనే మాట్లాడుకునేవారు. నన్నెదుకో ఆ దృశ్యం బాగా ఆకట్టుకుంది.

‘భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని ఉంటే ఎంత అడ్వాంటేజ్ కదా’ అని అనిపించేది.

మా ఇంట్లో కూడా అమ్మా నాన్న చదువుకున్నవారే!

కానీ కాఫీ తాగుతూ ఇంగ్లీష్ పేపర్ చదవడం, వార్తల గురించి మాట్లాడటం అనేది మా ఇంట్లో జరగడానికి అవకాశమే లేదు.

మా ఇంట్లో పేపర్ తెప్పించేవాళ్ళం కాదు.

అదీకాక అమ్మ కాఫీ కలిపి ఇస్తే నాన్న ఆఫీసులో కూర్చుని తాగేవారు.. ఏవో కేస్ ఫైల్స్ అవి చూసుకుంటూ!

మా నాన్న ప్రైవేట్‌గా లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు.

అమ్మా నాన్న కలసి కూర్చుని కాఫీ తాగడం నేను ఇంట్లో చూడనేలేదని చెప్పాలి.

మా పెదనాన్న డాక్టర్‌గా పని చేస్తున్నా ఇంట్లో చిన్న చిన్న పనులలో సహాయం చేస్తూ ఉండటంనాకు బాగనిపించేది.

ప్రేమను ప్రకటించడం అనేది ఆ విధంగా చేయొచ్చని గమనించేవాడిని.

మా పెదనాన్న నల్లగా ఉండేవారు.. మా పెద్దమ్మ తెల్లగా ఉండేది.

‘వీళ్ళకు అచ్చు మా నాన్నమ్మ, తాతయ్య పోలికలున్నాయి రంగు విషయంలో’ అని ఆ వయసులో నేననుకునేవాడిని.

ప్రేమను పొందడానికి కానీ, ప్రేమను పంచడానికి కానీ రంగు రూపాలతో పనిలేదు.. మనసులు కలవాలి, ఇరువురి మధ్యన అండర్‌స్టాండింగ్ ఉండాలన్న విషయం అవగాహనకొచ్చింది నాకు.

పెదనాన్న, పెద్దమ్మలు వ్యక్తులుగా ఇద్దరైనా మానసికంగా ఒక్కరే అని నాకనిపించేది.

ఇక మా అమ్మ నాన్న విషయానికి వస్తే..

నాన్న అక్క కూతురునే పెళ్లి చేసుకున్నారు.

అంటే అమ్మమ్మ నాన్నమ్మ కూతురే!

అందుకే నాన్నమ్మకు మా పైన ఎక్కువ ప్రేమ ఉండేదేమో!?.. ముఖ్యంగా నా పైన ఎక్కువ ప్రేమ చూపించేది నాన్నమ్మ.

నాకలా అనిపించేది.. అదే నిజం అని మా నాన్నమ్మ చనిపోయినప్పుడు మరింతగా ఖరారయింది.

నాది బి. ఎడ్ అయిన తర్వాత ఒకసారి డి.ఎస్సీ రాసినా రాలేదు.

ఎందుకో నాకు అటువైపు ధ్యాస మళ్ళలేదు. వేరే వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వ్రాసేవాడిని.. జాబ్ కోసం.

ఏవీ రావడం లేదు.. మా కంటే ఎక్కువగా మా నాన్నమ్మ చింతించేది.

‘నీకొక జాబ్ వస్తే చాలు..అది చూసి పోతాను’ అనేది నాన్నమ్మ.

నాకు పోస్టల్‌లో జాబ్ వచ్చి మైసూరులో ట్రైనింగ్ కని వెళ్ళగానే ఇక్కడ నాన్నమ్మ చనిపోయింది.. ఎనభై ఏడేళ్ల వయసులో!

అంటే నా జాబ్ కోసం తన ప్రాణాలను ఉగ్గబెట్టుకొని ఉండిందనిపిస్తుంది.

మా అమ్మ పెళ్ళికి ముందు గుంతకల్‌లో రైల్వే స్కూల్‌లో హిందీ టీచర్‌గా పనిచేసేది.. అప్పటికే దక్షిణ భారత హిందీ ప్రచార సభ కింద ప్రథమ శ్రేణి హిందీప్రచారక్‌గా పనిచేస్తుండటం వల్ల ఆ స్కూల్లో టీచర్‌గా అవకాశం సులభంగా వచ్చిందనే చెప్పాలి.

అమ్మ అన్ని విషయాల్లో ఏకసంథాగ్రాహి అవడం వల్ల ఇంగ్లీష్ కూడా ధారాళంగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. పెళ్ళైన తర్వాత టీచర్ జాబ్ మానేసి ఇంటికే అంకితమయింది మా అమ్మ!

అమ్మా నాన్న ఇంట్లో ప్రేమగా మాట్లాడుకోకపోయినా మేం ఎదిగే కొద్దీ వారి మధ్యనున్న ప్రేమ నాకు అవగతమయ్యేది.

ప్రేమను పనికట్టుకొని ప్రదర్శించవలసిన పని లేదు.. వాళ్ళ వాళ్ళ మనసుల్లో గూడు కట్టుకుని ఉంటే చాలని అర్థమైంది కూడానూ!

కానీ ఇప్పటి రోజుల్లో తరాలు మారే కొద్దీ ఆ భావన బలంగా ఉన్నా కూడా ప్రేమను మనకిష్టమైన వారి మీద ప్రదర్శించాలి.. అప్పుడప్పుడైనా!

లేదంటే ప్రతి దాన్నీ మసి పూసి మారేడుకాయ చేస్తున్న నేటి పరిస్థితుల్లో చూపించుకోలేని ప్రేమ అసలు ప్రేమే కాదన్న నిజానికి స్థిర పడిపోయింది.

ఇంట్లోనే ప్రేమ యొక్క బహురూపాలను నేను గమనించడం వలన నాకు ప్రేమ పట్ల ఒకవిధమైన ఇష్టం ఏర్పడింది.

మనం ప్రేమగా ఉంటే మన చుట్టూ ప్రేమ నెలకొని ఉంటుందని నమ్మకం ఏర్పడింది నాకు.

పెరిగే కొద్దీ ఆలుమగల మధ్యన ఉండేది.. ఉండవలసినదీ ఒక్క ప్రేమ ఒక్కటే కాదు, అంతకు మించి ఏదో ఉంది అనే నమ్మకం బలపడింది నాలో!

ఇక నా విషయానికి వస్తే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను.. మా దూరపు బంధువుల అమ్మాయిని!

ప్రేమించినా అది ఇరువైపులా ఇంట్లో చెప్పి అందరి ఒప్పందాలు తీసుకుని మరీ పెళ్లి చేసుకున్నాను.. శాస్త్రోక్తంగా! అంటే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట!

తను గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తుంది.

నేను ఇంటి వద్దే ఉంటూ బిజినెస్ చేస్తున్నాను.. అగరబత్తి, పూజాద్రవ్యాల డీలర్ షిప్ తీసుకుని!

ప్రొద్దున తను లేచి హడావుడిగా పనికి.. ప్రస్తుతానికి మా ఊరు నుండి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెలోని పాఠశాలకు.. వెళ్ళాలి.

అందుకే ప్రొద్దున ముప్పాతిక భాగం ఇంట్లో పనులు నేనే చేస్తాను.

భార్యామణిని బస్ స్టాప్‌లో దింపడం.. ఇద్దరు పిల్లలను స్కూల్లో దించి రావడం.. ఆ తర్వాత నా బిజినెస్ చూసుకోవడం. సాయంత్రం తను స్కూల్ నుంచి వచ్చేపాటికి నేను పిల్లలను ఇంటికి తీసుకుని వచ్చేస్తాను.

పిల్లలిద్దరూ వాళ్ళ హోమ్ వర్క్ లు అవీ చేసుకుంటారు. పాప ఆరవ తరగతి, బాబు తొమ్మిదవ తరగతి చదువుతున్నారు కాబట్టి వారి పనులు వారు స్వంతంగా చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.

ఇద్దరం కలసి సాయంత్రం వంట చేస్తాం. నేను బయటకు వెళ్ళినపుడు మాత్రం తనే చేసేస్తుంది.

శనివారం సాయంత్రం, ఆదివారాలు ఎక్కడికో ఒకచోటుకు వెళ్తుంటాం కాబట్టి బయట తినడమే!

ఇలా తనకు నేనూ.. నాకు తనూ!

తానే నేనూ..నేనే తానూ!!

ఇద్దరం వేరే వేరే కాదు.. ఒక్కరమే!!!

దేహాలు వేరైనా ఆత్మలు ఒకటేనని కవులు రచయితలు వ్రాస్తుంటారు కదా!?

అదీ నిజమై ఉండవచ్చు.. కానీ మా విషయంలో ఇద్దరి శరీరాలు వేరైనా మనసులు ఒకేవిధంగా స్పందిస్తుంటాయని చెప్పవచ్చు.

అలా అని మనస్ఫర్థలూ అవి రానే రావని కాదు!

అవేవి వచ్చినా వాటిని పెరిగి రాద్ధాంతం చేసుకోకుండా మొగ్గలోనే త్రుంచేసుకుంటాం.. ఇద్దరం ఏదో విధంగా కూడబలుక్కొని ప్రయత్నిస్తూ!

అయినా ఆడాళ్ళు సున్నిత మనస్కులంటారు కానీ వారు దృఢచిత్తులని కూడా నేనంటాను.

నాణేనికి రెండు వైపులున్నట్లు వారు దృఢంగా ఉంటారు.. సున్నితంగానూ ఉంటారు.

మగవారే పైకి దృఢంగా ఉన్నట్లు కనిపించినా లోలోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు.. ఏదో విధంగా మానసికంగా ఆడవారిపైనే ఆధారపడి ఉంటారు.

ఇది నేను గమనించి నా వరకూ నేను నిర్ధారణకు వచ్చిన విషయం.. అంతే!

ఇది అందరి పట్లా వర్తిస్తుందని కానీ, అందరికీ ఆమోదయోగ్యమని చెప్పను.. చెప్పలేను. అలా నమ్మడానికి నా కారణాలు నాకున్నాయి.

నాన్నమ్మ తరం నుంచి పెద్దమ్మలు, అమ్మలను గమనిస్తూ వస్తున్నాను కదా!

స్త్రీలు సాధారణంగా పునిస్త్రీలలాగా పోవాలనుకుంటారు కానీ తాము మొదట వెళ్ళిపోతే బలహీన మనస్కులైన మగవారు తాము ఇంట్లో లేకుండా ఏదీ చేయలేరు.. అందుకే పరోక్షంగా దీనికి వ్యతిరేకంగా కోరుకుంటారేమో!?

తాతయ్య మొదట పోయారు.. తర్వాత నాన్నమ్మ!

పెదనాన్నలు ఇద్దరూ మొదట పోయారు.. పెద్దమ్మలు ఉన్నారు.

నాన్న పోయారు.. అమ్మ మాతో పాటు ఇంట్లో ఉంటుంది.

తమ్ముడు వ్యవసాయం చేస్తుంటాడు.. మొదట్నుంచీ తమ్ముడి దగ్గరే ఉండటం వలన అమ్మ ఇప్పటికీ అక్కడే ఉంటుంది.

ఇక లోకం వదలి పోవడం గురించి మా దంపతుల వరకైతే మా ఆలోచనలు వేరు!

ఎవరు ముందు పోతారు!?

ఎవరు తర్వాత పోతారన్నది తెలీదు.

తెలియని వాటి గురించి ఆలోచిస్తూ ఇప్పట్నుంచీ బెంగపడటం అనవసరం అని మేమిద్దరం క్లారిటీగా ఉన్నాం!

ఎవరు ఎప్పుడు పోయినా దాన్ని అలాగే స్వీకరించాలే కానీ బాధ పడుతూ కూర్చోకూడదని ప్రాక్టికల్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం.

కానీ పోయేదేదో పిల్లలు చేతికి అందివచ్చి వారు సెటిల్ అయిన తర్వాతనే జరిగితే మంచిదనీ.. సినిమాటిక్‌గా ఇద్దరం ఒకేసారి పోతే ఇంకా మంచిదనీ.. మనసులో ఏ మూలనో చిన్న భావన మెదులుతూనే ఉంటుంది.

నాన్నమ్మ.. తాతయ్య, పెద్ద పెదనాన్న.. పెద పెద్దమ్మ, చిన పెదనాన్న.. చిన పెద్దమ్మ, అమ్మ.. నాన్న, అన్ని జంటలలో ప్రతిఫలించిన ఏకీకృతభావన.. అద్వైతం.

ఇప్పుడు తను.. నేనులో కూడా ప్రతిఫలించాలనీ, మా జీవితాల కడదాకా ప్రతిబింబిస్తూ ఉండాలనే ఆశే నాది!

అట్టడుగు పొర

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన విజయ్ ఉప్పులూరి గారి ‘అట్టడుగు పొర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]న్నాళ్ళకు నా చిరకాల వాంఛ ఈడేరే సమయం ఆసన్నమయిందండీ! ఇక ఏమాత్రం అలస్యం లేకుండా, కార్యాచరణకు పూనుకోవాలి.

ఏమిటీ! మనోవాంఛా ఫల సిద్ధిరస్తు! అనబోతున్నారా? ఆగండాగండి! అసలు నేను తలపెట్టిన ఘనకార్యం గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా, ఇలా తొందర పడిపోరు. అసలు విషయం ఏమిటంటే నేనో హత్య చేయాలనుకుంటున్నానండీ! అంటే, హంతకుడిగా మారబోతున్నా! బిత్తర పోకండి! తిరిగి తేరుకుని, నావంక జుగుప్సతో చూడకండి! అప్పుడే నేనొక ఘోర పాపినని నిర్ధారించకండి! ముందు నా హృదయ ఘోష సావధానంగా ఆలకించండి! సాంతం విన్నాక, ఛీ! పొమ్మంటారో, ముందుకు సాగమంటారో..? అంతా మీ ఇష్టం!

***

అదిగో! ఆ ఎదురింట్లోంచి కనిపించిన దృశ్యం నన్ను మానసిక కల్లోలానికి గురి చేసిందండీ! ఉప్పెనలా పొంగుతున్న భావోద్వేగాన్ని అదుపులో ఉంచడం కష్టసాధ్యమయింది. నన్నంతగా కలత చెందేలా చేసిన సంఘటన ఏమిటంటారా? చెప్తానండీ! నేను నా గది కిటికీలోంచి అనుకోకుండా చూసినప్పుడు కనిపించిందా కంటగింపు సన్నివేశం.

ఎదురింట్లో రెండేళ్ళ పాప తన తండ్రికి ముద్దులందిస్తూ, కిలకిలా నవ్వుతోంది. అతగాడేమో, పాపను మరింతగా గుండెలకు హత్తుకుని- “మరోసారి నాన్నా! అనమ్మా!” అంటూ పరవశించి పోతున్నాడు. ఇదే! ఇది చూస్తేనే నాకు ఒళ్ళు మండిపోయింది.

ఇదెక్కడి చోద్యం? తీయని అనుభూతిని పంచే అంత చక్కని దృశ్యం చూసి అనందించడం పోయి, కుళ్ళుకోవడమేమిటి? అంటారా?

అవునండీ! నాకు కుళ్ళే! ఆ ‘నాన్న’ అనే పదం ఉంది చూసారూ? ఆ మాట వింటేనే నాకు కంపరంగా ఉంటుంది. ఎందుకంటే.. ఎందుకంటే.. అది నేను ఎన్నడూ పలకని పదం. నా పాతికేళ్ళ జీవితంలో ఏ ఒక్కసారి కూడా ఆ పదం ఉచ్చరించే అవకాశం రాలేదండి బాబూ! ఆ భాగ్యం, ఆ ‘నాన్న’ అనే ప్రాణి నాకు కలిగించలేదండీ! అందుకే, ఆ పదమన్నా, నా నుంచి ఆ పిలుపుకు నోచుకోని ఆ ‘నాన్న’ అనే వాడన్నా, నాకు – కోపం, కసి, మంట, అసహ్యం, పగ, ద్వేషం, ఇంకా.. ఎన్నెన్నో!

ఓహో! అలాగా? అనుకుంటున్నారా? ఏం తెలుసు మీకు? ఏమర్థమయ్యింది మీకు? అసలు గుండెల్లో గడ్డ కట్టిన బాధంటే తెలుసా మీకు? బహుశా మీకు అనుభవం లోకి వచ్చిఉండదు! సరే! అదెలా ఉంటుందో నేను విన్నవిస్తాను..

ఈ లోకంలోకి మీరందరూ ఎలా వచ్చారో, నేనూ అలాగే వచ్చాను. అందరు పసిపాపల్లాగానే, భూమిమీద పడగానే, నేనూ కేర్.. కేర్ అన్నాను. నా తల్లీ నాకు స్తన్యమిచ్చింది. అంతవరకే, మీకూ నాకూ పోలిక! ఆ తర్వాత అంతా తేడా, భేదం, వ్యత్యాసం!

ఇప్పుడు నా బ్రతుకు పుస్తకం చదవాలని మీలో ఉత్సుకత పెరుగుతోందని నాకర్థమవుతోంది. ఇక నా ఉపోద్ఘాతంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా గుండె పుటలు తెరుస్తున్నాను. ముందు మచ్చుకో పేజీ చదవండి!

సూర్యుడు అప్పుడే పైకెగబ్రాకుతూ, తన తీక్ష్ణతను ప్రసరించే పనిలో ఉన్నాడు. ముఖానికి పడుతున్న చిరుచెమటల్ని అద్దుకుంటూ, ఆ మాత్రం ఎండకే కందిన బుగ్గల్ని నిమురుకుంటూ, బుల్లి బుల్లి అదుగులేస్తూ బడికి వెళ్తున్నా! దార్లో ఒక అరుగు బడి ఉంది. రిటైరయిన ఒక ముసలి గుండు మాస్టారు అక్కడ పాఠాలు చెప్తున్నాడన్నమాట. నా ఈడు పిల్లలూ, నాకన్నా బోలెడు పెద్ద పిల్లలూ ఉన్నారక్కడ. ఏం పాఠం చెప్తున్నాడో గాని, నన్ను చూడగానే భళ్ళున నవ్వి, చేయి ఊపి పిలిచాడు గుండు మాస్టారు. నేను వెళ్ళాను. ఆయన నన్ను వాళ్ళందరి ముందూ నించోబెట్టి, గంగాధర్ అనే పిల్లాడ్ని పిలిచి “ఒరేయ్! ప్రపంచ వింతలెన్నిరా?” అని అడిగాడు. నేను గబుక్కున “ఏడు” అందామనుకుని – నన్ను కాదు కదా అడిగింది అని ఊరుకున్నాను! అమ్మో! ఆ గంగాధర్ తెలివైనవాడే! కచ్చితంగా నేను అనాలనుకున్న అంకే చెప్పాడు. గుండు మాస్టారు మెచ్చుకుంటాడనుకున్నాను. కాని, ఆయన వాడి పిర్ర మీద గిల్లి- “ఏడిసావులే!” అన్నాడు. అని ఊరుకున్నాడా? “ఒరేయ్! వెధవాయిలూ! పరీక్షల్లో అలానే రాయాలి. ప్రపంచమంతా మరి ఏడనే ఏడుస్తోంది. వెర్రిమాలోకం! ఎనిమిదో వింత ఇక్కడుందని కనుక్కోలేకపోయింది. అదేదో కనుక్కున్న నేను కనీసం మీకన్నా చూపించాలని వీడ్ని పిలిచాను. ఇదిగో! వీడే ఆ కొత్త ఎనిమిదో వింత!” అని పిల్లలందరికీ నన్ను చూపించాడు. పిల్లలందరూ ఎనిమిదో వింతను – అంటే, నన్ను అబ్బురంగా చూసారు. నిజానికి ఆ క్షణంలో నేను చాలా గర్వంగా ఫీలయ్యాను. కాని, నాకేం తెలుసు? మరో కొద్ది నిమిషాల్లో, జన్మజన్మలకూ మర్చిపోలేని చేదు అనుభవాన్ని చవి చూడబోతున్నానని!

గుండు నిమురుకుంటూ, ఆయన అప్పుడు నన్నడిగాడు- “ఒరేయ్ బడుద్దాయ్! మీ నాన్న పేరేంటిరా?”

కేవలం సత్యం పలకడానికే దేవుడు మనకిచ్చాడని, అప్పట్లో నేను అమాయకంగా నమ్మిన నా నాలుక ఏమాత్రం తటపటాయించకుండా- “తెలీదు” అంది.

అలా అనడమే ఆలస్యం!- పెళ్ళున నవ్వారు గుండు మాస్టారు.

వారు నవ్వాకే, తోచిందేమో- పిల్లలూ శ్రుతి కలిపారు. శ్రుతీ, గతీ తెలియని నేను బిక్కమొగమేసాను.

“ఒరేయ్ సన్నాసులూ! ఎక్కడైనా చూసార్రా నాన్న పేరు తెలియనోడ్ని? ఇలాంటి చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేని గాడిద మీలో ఒక్కడు కూడా లేడని నాకు తెలుసు. అయినా, అడుగుతున్నా! చెప్పండి మీ నాన్నల పేర్లేంటో!”

– అంతే –

“సుబ్బారావు.. పాంచజన్యం.. దంతవక్రం.. ఏసోబు.. సైదులు.. సలాం ఖాన్.. ఏసుపాదం.. పతంజలి.. భగవాన్ దాస్.. క్రిష్టఫర్.. బ్రహ్మాజీ.. సుబ్రహ్మణ్యం.. దీక్షితులు..” ఇలాంటి పేర్లన్నీ నా చెవుల్లో దూరాయి.

“శభాష్ పిల్లలూ! ఇప్పుడు ఈ ఎనిమిదో వింతగాడ్ని ఇంకో సులువైన ప్రశ్న అడుగుతా చూడండి!”- అంటూ నావైపు చూసి, “ఒరేయ్! మీ నాన్ననెప్పుడైనా చూసావా?”

యథార్థం అంటే- “చూడలేదు” అనే అర్థం నా బ్రతుకు నిఘంటువులో ఉంది! అదే చెప్పాను.

ఈసారి గుండు మాస్టారు నవ్వకముందే- పిల్లలే పొట్ట పట్టుకుని నవ్వారు.

అప్పుడు నేను ఏడ్చానండీ! కన్నీళ్ళతో ఒళ్ళంతా తడిచేలా భోరున ఏడ్చానండీ!

పైశాచికానందంతో పొట్ట నింపుకునే వాళ్ళకు అన్నం తినేందుకు కాళీ ఉండదు. గుండు మాస్టారు ఆరోజు భోజనం చేసి ఉండడని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. ఆ మాటకొస్తే- నేనూ ఆరోజు తినలేదు.

కారణం – జ్వరమొచ్చింది.

అమ్మ రాత్రంతా నిద్ర లేకుండా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని నన్ను చూసుకుంది. ఎన్నెన్నో పలవరింతలుట. అవన్నీ- “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న” అన్న పదం చుట్టూనేనట.

ఛీ-

ఆ దరిద్రపుగొట్టు పదాన్ని నేను పదే పదే పలవరించానని గుర్తు చేసుకుంటేనే ఈరోజు నాకు కడుపులో తిప్పుతోంది. తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తోంది. “చాల్లెద్దూ! మరీ ఇంత అతిశయోక్తులు అవసరమా” అంటారా? దయచేసి మీతో నన్ను పోల్చుకుని అంతంత మాటలనకండి! మీరు నా వయసు వాళ్ళయినా, నాకన్నా పెద్ద వాళ్ళైనా, ‘నాన్న’ అనే పదం బ్రతుకులో ఎన్నిమార్లు వాడి ఉంటారు? లెక్కలేనన్ని సార్లు కదా? అలాగే మీరు పుట్టినరోజు లగాయితు, మీ నాన్నల్ని కొన్ని లక్షల సార్లో, కోట్ల సార్లో చూసి ఉంటారు కదా?. (ప్రతిరోజూ లేచింది మొదలు, నిద్ర పోయేదాకా, ‘నాన్న’ అనబడే అవతారం కళ్ళ ముందు కదలాడుతుంటే, పలకక, పిలవక చస్తారా?) మరి నా ఉజ్వలమైన చరిత్ర చూడండి! ఎన్నడైనా చూసానా? పిలవగలిగానా? దొంగచాటున గుళ్ళో పెళ్ళి చేసుకుని, నా తల్లిని తల్లిని చేసి – పుత్ర వాత్సల్యమైనా లేని కసాయిలా, మా ఖర్మానికి వదిలేసి, వేరే చోట సంసార జీవితం వెలగబెడుతున్నాడా ప్రబుద్ధుడు. అలాంటి పురుగంటే ఏహ్య భావం కాకుంటే, గౌరవం పుట్టుకొస్తుందా నాకు?

ఇప్పుడేమంటారు? నాన్న అనే పదంపై నేను అసహ్యం పెంచుకోవడంలో ఏమైనా అపసవ్యత ఉందా?

చెప్పండి!-

మౌనముద్ర దాల్చారా? మరింకేం? నాలో రగిలే బాధ మీరు కొంచెం కొంచెం అర్థం చేసుకోగలుగుతున్నారు. అది చాలు నాకు. ఇప్పుడు నేనూ సగర్వంగా ఒప్పుకుంటున్నాను! నిజంగా నేను ఎనిమిదో వింతనే!

ఇప్పుడు నా దృష్టిలో గౌరవప్రదమైన వస్తువు గురించి చెప్పాలి మరి. అదేమిటో ఊహించగలరా? మిలియన్ డాలర్ బెట్! మీరు జన్మలో కనుక్కోలేరు. సరే! నేనే చెప్తానన్నానుగా?

అది

‘చెత్తకుండీ’

అవునండీ! అదే! మీకు అనునిత్యమూ వీధుల్లో తారసపడే చెత్తకుండీ అంటే నాకు పూజ్య భావం. మా నాన్న విదిలించుకుపోయిన విధంగా, మా అమ్మ కూడా నన్ను విసర్జించి ఉంటే నేను మీ లోకానికి అందులో కనబడేవాడ్ని! నా గురించి పేపర్లో మీ చిన్నప్పుడే చదువుకుని ఉండేవాళ్ళు!

ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే – మా అమ్మనూ చెత్తకుండీ గానే చూసింది పాడు లోకం! ఒక్క విషయం అడుగుతా! గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి! నాలాంటి వాళ్ళకు ఇలా దుస్థితి దాపురించడానికి మీలాంటి వాళ్ళ బాధ్యతారాహిత్యం ఒక కారణం కాదా? మీలో ఒక్కడైనా, ముందుకొచ్చి, ఆ ద్రోహిని నిలదీసి అడిగి, న్యాయం చెయ్యడానికి పూనుకొని ఉంటే- నా కథ ఇలా ఉండేది కాదు. ఇక మా అమ్మను ఈ లోకం ఎన్నెన్ని అవహేళనలకు గురిచేసిందో చెప్పనలవి కాదు. ఊరు కాని ఊరులో ఉద్యోగం చేస్తూ, గత్యంతరం లేక నన్ను తాతయ్య, అమ్మమ్మల దగ్గర వదిలేసి, కాకుల్లా పొడిచి వేధించే పాడు సమాజంతో ఒంటరి పోరు సాగిస్తూ, మా అమ్మ అనుభవించిన నరకయాతన అంచనా వేయగలిగేవారు మీలో ఎవరైనా ఉన్నారా?

దీనస్థితిలో ఉన్న మనిషికి ఆపన్న హస్తం అందించే బదులు మరింతగా మానసిక క్షోభకు గురిచేసి అనందించే మగమహారాజులతో పాటు- అరె! సాటి ఆడది కదా! ఇలాంటి అవస్థే మనకొస్తే తట్టుకోగలమా? అని లిప్తపాటు కూడా అలోచించకుండా, చెవులు చెవులూ కొరుక్కుని, నోళ్ళు నొక్కుకునే మహిళామతల్లులూ, సాధ్వీమణులూ మీలోనే ఉన్నారుగా?

బాధల్ని భరిస్తూ, కష్టాలకు ఎదురీదుతూ, ఒక సజీవ ప్రేతంలా బ్రతుకీడుస్తూ, రోజులు నెట్టుకొచ్చింది మా అమ్మ. నన్ను మాత్రం ఏ లోటూ లేకుండా పెంచింది. విద్యాబుద్ధులు చెప్పించింది.

రాత్రి పూట అందరూ నిద్ర పోతారుగా! నేనూ ఆదమరిచి నిద్రపోయేవాడ్ని. కాని, ఎప్పుడో, ఏ అర్ధరాత్రి వేళో అనుకోకుండా మెలుకువ వచ్చేసరికి, అమ్మ మౌనంగా రోదిస్తున్న దృశ్యం కనిపించేది. దాంతో కసితో నా పిడికిళ్ళు బిగుసుకునేవి. ఆ సమయాల్లో వచ్చిన ఆలోచనే- ‘మా నాన్నను చంపాల’ని!

***

అవునండీ! బుగ్గల మీద నాన్నలు పెట్టే ముద్దులు నాకు తెలియవు. కనీసం పిల్లల దుందుడుకు పనులకు ఆగ్రహించి శిక్షగా, నాన్నలు వీపు విమానం మోత మోగిస్తే పడే చేతి ముద్రలూ నాకు అనుభవంలోకి రాలేదు. ఇవన్నీ నాకు దూరం చేసిన మనిషిపై కసీ, పగా కాకుండా, ఇంకేం పుట్టుకొస్తాయి చెప్పండి? అందుకే, నాలో అలా మొలకెత్తిన ప్రతీకార బీజం నేను ఎదుగుతున్న కొద్దీ, మరింత ఏపుగా పెరిగి బలపడింది.

కక్ష అనే కాలకూట గరళం గుటకలు వేస్తూ పెరిగి నేనూ యుక్తవయసుకు వచ్చాను. ఈలోగా నా చదువయిపోయింది. ఉద్యోగమూ వచ్చింది. ఎప్పుడెప్పుడు వెళ్ళి అతని గొంతు నులిమి కక్ష తీర్చుకుందామా అని మనసు తొందర చేయసాగింది. కాని, నా చిరకాల వాంఛను అణుచుకోక తప్పలేదు. కారణం ఊహించగలరా?- మా అమ్మండీ! ఇప్పుడిప్పుడే- కన్నీళ్ళు ఇంకిన ఆమె కళ్ళలో, నా భవిష్యత్ గురించి కన్న కలలు నెరవేరుతున్నాయన్న సంతోషానికి చెందిన మెరుపు కళ చోటుచేసుకోవడం మొదలయింది. ఇలాంటి తరుణంలో నేను నా ధ్యేయ సాధనకు ఉపక్రమిస్తే – నాకెలాగూ ఉరిశిక్ష తప్పదు. తెలిసి తెలిసీ, ఆమెకు వార్ధక్య దశలో సుఖసంతోషాలు చేకూర్చే బదులు గర్భశోకం కలిగించే పనికి ఎలా పూనుకోగలను?

అందుకే- నా మనసుకు సంకెళ్లు వేసుకోక తప్పలేదు.

కాని, రోజూ నాకో విచిత్రమైన కల రావడం మొదలయింది. ఆ కలలో- ఒక ‘మెడ’- దాని చుట్టూ బిగుసుకుంటున్న బలిష్టమైన నా చేతివేళ్ళు! – దిక్కులు పిక్కటిల్లేలా ఓ చావుకేక!

దాంతో నాకు మెలుకువ వచ్చేసేది. ఇక కునుకు పట్టేది కాదు.

ఇలా తీరని అశాంతితో ఆలమటిస్తూ, ఎడారి బ్రతుకు వెళ్ళదీస్తున్న నామీద గమ్మత్తుగా ఒక స్వాతి జల్లు కురిసింది. ఒక అమ్మాయి నాకు చేరువయింది. నాతో జీవితం పంచుకోవాలనుకుంది. నా గుండెల్లో స్థానాన్ని సింహభాగం పగా, కసీ ఆక్రమించినా, ఎక్కడో ఒక మూల ఖాళీ ఉంది. ఆ చోటు ఆ అమ్మాయికి ఇచ్చేసాను. నా ఆడుగులో అడుగేస్తూ ఏడడుగులు నడవాలని ఉబలాటపడుతున్న ఆ అమ్మాయి మా అమ్మ దృష్టిలో పడనే పడింది. అప్పుడు మా అమ్మ నాతో అన్నది- “ఆ పిల్ల నాకు నచ్చిందిరా! నాకో మనవడ్ని ఇవ్వమని కోరానని ఆ అమ్మాయికి చెప్పు!” అని. “అలాగే! తప్పకుండా!” అని జవాబిచ్చానని అనుకుంటున్నారా? లేదండీ! దండేసిన కొడుకు ఫొటో చూస్తూ, తల్లి కుమిలిపోవడం భరించలేని వ్యక్తి – కోటి ఆశలతో వెన్నంటి వచ్చిన నూతన వధువుకు వైధవ్యాన్ని ఎలా కానుకగా ఇవ్వగలడు? అందుకే, తెచ్చిపెట్టుకున్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ, కావాలని ఆ అమ్మాయికి దూరమయ్యాను. ఫలితంగా, తను వేరొకరి సొత్తయింది.

ఆమె పెళ్ళయిన రోజు రాత్రి నాకొచ్చిన కలలో – ఆ మెడ చుట్టూ ఆక్టోపస్‌లా ఆల్లుకుని నావేళ్ళు సృష్టించిన బీభత్సం అంతా, ఇంతా కాదు.

చివరికి- నేను ఏ రోజు రాకూడదని కోరుకున్నానో, ఆరోజు రానే వచ్చింది. నా తల్లి కన్నుమూసిందని మీకు అర్థమయ్యే ఉంటుంది. నా దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కర్మకాండ ముగిసాక, ఎలాగోలా దుఃఖాన్ని దిగమింగి నిర్వర్తించాల్సిన కర్తవ్యం మీద దృష్టి మరల్చాను. ఎట్టకేలకు ఒక క్షుద్ర జీవిని అంతం చేయడానికి నాకు స్వేచ్చ లభించింది. ఇక నేను ఆలస్యం చేయదలుచుకోలేదు. ‘మెడ’ భోగట్టా సేకరించాను. అడ్రెస్ కనుక్కున్నాను. అతని ముందు ప్రత్యక్షమయి, అతగాడి చివరి క్షణాలు లెక్కించడమే తరువాయి. పొంచుకొస్తున్న ఆపద గురించి, పాపం ఆ కీటకానికి తెలియదు. పాతికేళ్ళ క్రితమే తన మరణశాసనం స్వహస్తాలతో లిఖించాడన్న విషయమే విస్మరించి, నిశ్చింతగా కాలం గడుపుతున్న నీచుడు ఎదురుచూడని మృత్యువు ముందు నిలచి మెడను దొరకబుచ్చుకుంటే, భయంతో ఎలా కంపించిపోతాడో ఊహించుకోండి!

***

అదండీ సంగతి! ఇప్పుడు మీకు విషయం పూర్తిగా అర్థమయింది కదా? నాతో ఏకీభవిస్తున్నందుకు ధన్యవాదాలు.

కూ.. చుక్ చుక్..!

ఇన్నేళ్ళ నిరీక్షణ తరువాత, నా చేతివేళ్ళను ఆ ‘మెడ’ దగ్గరకు చేర్చడానికి శరవేగంతో దూసుకుపోతున్న రైల్లో ఉన్నానండీ ఇప్పుడు! ఇంక కొన్ని గంటల్లో మెడ ఎముకలు విరిగితే వచ్చే శబ్దం ఎలా ఉంటుందో నాతో పాటు మీకూ తెలుస్తుంది.

ఆ..! ఇదేనండి ఆ ఊరు! ఆ పాపిష్టి మనిషి పాద స్పర్శతో అపవిత్రమైన ఆ ఊరి రోడ్ల మీద నా అడుగులు పడుతున్నాయి ఇప్పుడు. అమ్మయ్య! ఎట్టకేలకు చేరుకున్నానండీ! అదే.. ఆ పదమూడు నెంబరున్న ఇల్లేనండి, కొద్ది క్షణాల్లో గొల్లుమనే ఏడుపులకు నిలయం కాబోతున్నది! ఆ ఇంటి గడపలో కాలు మోపబోతున్నవాడినల్లా, ఎక్కడో తీతువు కూసినట్లనిపించి ఆగిపొయాను. చెవులు రిక్కించి విన్నాను. అంతే! నాకు గుండె ఆగినంత పనయ్యింది. కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయి, ముందుకు తూలి పడబోయి అతికష్టం మీద నిలదొక్కుకున్నాను. నాకు వినిపించింది మరేదో కాదు. నిస్సందేహంగా అది మృత్యుదేవత రాగాలాపనే! అదే ఆ ఇంట్లోంచి సన్నగా రోదనల రూపంలో వినిపిస్తోంది. అప్పటికీ నమ్మకం కుదరక, ఆ ఇంట్లోకి పరామర్శకు వెళుతున్న వాళ్ళను అడిగి కనుక్కున్నా! కాలం చేసింది మరెవరో కాదు. తనే! నేను చంపాలని వచ్చిన మనిషే! గంట క్రితమే బూడిదయిపోయాడు. ఈ విషయం తెలియగానే నా మస్తిష్కం మొద్దుబారిపోయింది. చేష్టలుడిగి ఉన్నచోటే శిలా ప్రతిమలా నుంచుండిపోయాను. నాప్రతీకార వాంఛ ఆవిరై, మబ్బుల్లో కలిసిపోయిందన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవడం నావల్ల కాలేదు. అవ్యక్త భావన ఏదో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూ, గుండెల్ని పట్టి కుదపసాగింది. అదింక నన్నక్కడ నిలువనీయలేదు. అయినా, ఇక నేనక్కడ చేసేదేముంది? గిరుక్కున వెనుతిరిగాను. తిరిగి వచ్చిన దారి పట్టాను. భారంగా అడుగులు వేస్తూ నడుస్తున్నాను. సరిగ్గా అప్పుడే మీరు కల్లో కూడా ఊహించని సంఘటన జరిగింది. కరడు గట్టిన పగతో నిత్యం రగిలిపోయే నా కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు జారి పడ్డాయి. ఇదెక్కడి విడ్డూరం అని విస్తుపోతున్నారా? ఔనండీ! పాడు మనసు ఇంతకు తెగిస్తుందని నేనూ ఊహించలేదు. “ఇదేమిటి? మేము ఊహించిందొకటి! ఇప్పుడు జరుగుతున్నది మరొకటి! ఇదేం బాగోలేదు!!” అని నావంక కోపంగా చూడకండి! ఇదేమీ కథ కాదు కదండీ! అనుకున్న విధంగా సాగడానికి? ఇది జీవితం! జీవితంలో జరిగే చర్య, ప్రతిచర్య – అన్నింటికీ మనసే మూలం. మన మనసుల్లో ఏముందో అంతా మనకు తెలుసనుకుంటామండీ! కాని, అది ఒట్టి భ్రమ. పిచ్చి మనసు మనకు తెలియకుండా ఎక్కడెక్కడో, ఏవేవో దాచేచుకుంటుందండీ! అవి ఎప్పుడో ధడేలున బయటకు వచ్చి మనల్ని నిర్విణ్ణుల్ని చేస్తాయండి! ఇప్పుడు జరిగింది అదే కదండీ! ఎంతకాదనుకున్నా నా జన్మకు కారకుడైన వ్యక్తిని చూడాలనే కోరిక నా అంతరాంతరాల్లో గూడు కట్టుకుని ఉందేమో? నాకూ ఇప్పుడే అవగతమవుతోంది. చంపే ముందు- “నువ్వు మాకు చేసిన అన్యాయానికి నిన్ను చంపక తప్పదు” అని చెప్పే మిషతో నైనా “నాన్నా” అని తొలిసారి, తుదిసారి పిలవాలనే కాంక్ష నాలో నిద్రాణమై ఉందేమో? ఇప్పుడు ఆశ నిరాశగా మారిన మారిన పరిస్థితుల్లో, మనసు అట్టడుగు పొరలోంచి అది తన్నుకుని బయటకు వచ్చింది. నా దుఃఖానికి హేతువయింది. ఇంతేనండీ! ఇంతకు మించి మీకు సంజాయిషీ ఇవ్వలేనండీ!

కాకుంటే- ఒక విషయం మీకు చెప్పి తీరాలి! నేనిప్పుడు నడుస్తున్న నేల ఉంది చూసారూ? ఇదే నా నా జన్మకు కారణమైన ప్రదేశం. ఇక్కడే- ఈ ఊళ్ళోనే- నాతో ‘నాన్న’ అని పిలిపించుకోలేని ఆ దురదృష్టవంతుడు మా అమ్మతో కలసి ఏడడుగులు నడిచినది. ఇప్పుడు ఈ నేలపై, ఈ గాలి పీలుస్తూ నడుస్తుంటే- నేను ‘నాన్నా’ అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోవాలనే కొత్త ఆశ నాలో చిగురు తొడుగుతోందండీ! ఎంతైనా, సగటు మనిషిని కదండీ!

ఇచిగో ఇచి.. ఈ క్షణం చేజారనీయకు

1

[శ్రీపతి లలిత గారు రాసిన ‘ఇచిగో ఇచి.. ఈ క్షణం చేజారనీయకు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“డా[/dropcap]క్టర్ ఏమన్నారు?” బయటికి వచ్చిన భర్తని, కోడల్ని ఆత్రంగా అడిగింది శోభ.

పక్కనే ఉన్న నిఖిల్ ప్రశ్నార్థకంగా భార్య అపర్ణ వంక చూసాడు.

“ముందు ఇంటికి వెళ్లి మాట్లాడదాము” ఆగకుండా ముందుకు నడుస్తూ

“నేను కారు తెస్తానమ్మా!” అపర్ణతో అంటూ వెళ్ళాడు నిఖిల్ తండ్రి రమేష్.

కార్‌లో ఎవరూ మాట్లాడలేదు.

ఇంటికెళ్ళాక అందరికీ భోజనాలకి ఏర్పాటు చేసింది అపర్ణ.

భోజనాలయ్యాక అందరూ హాల్ లో కూర్చున్నారు.

“నాన్నా! నేను చిన్న పిల్లాడిని కాదు భయపడడానికి, డాక్టర్ ఏమన్నదీ నిజం చెప్పండి?” నిఖిల్ తండ్రిని అడిగాడు.

“మనం భయపడ్డదే చెప్పారు డాక్టరుగారు. కిడ్నీ మీద చిన్న ట్యూమర్ ఉందన్నారు. ముందు సర్జరీ చేసాక, బయాప్సీ రిపోర్ట్ వస్తే అది ఏ స్టేజిలో ఉందో తెలుస్తుందట” అన్నాడు రమేష్.

ఎంత అనుమానించినా, డాక్టర్ నోట్లోనుంచి ఆ సంగతి వచ్చిందని తెలిసాక నిఖిల్ ముఖం వెలవెల పోయింది.

అపర్ణ కన్నీళ్లు ఆపుకుంటూ నిఖిల్ భుజం మీద చేయివేసి నొక్కింది.

“కంగారు పడక్కర్లేదు అన్నారు. ఎర్లీ స్టేజి లోనే ఉన్నట్టుగా ఉంది, మూడొంతులు ఆపరేషన్ తోనే సరిపోవచ్చు అన్నారు, మనం కొంచెం త్వరగానే వెళ్ళాంగా” అందరివేపు ఓదార్పుగా చూస్తూ అన్నాడు రమేష్.

నిఖిల్ ఏమీ మాట్లాడకుండా రూమ్ లోకి వెళ్ళాడు, అతను లోపలికి వెళ్ళగానే శోభ నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టింది. రమేష్, శోభని ఓదారుస్తుంటే అపర్ణ నిఖిల్ దగ్గరికి వెళ్ళింది.

రమేష్, శోభల పిల్లలు నిఖిల్, నిరుపమ, నిఖిల్ అక్క నిరుపమకి పెళ్లి అయ్యి భర్తతో బెంగుళూరులో ఉంటుంది.

రమేష్ హైదరాబాద్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీలో చేసి రిటైర్ అయ్యాడు. మంచి ఇల్లు, బాగా స్థిరపడ్డ పిల్లలు, దేనికీ లోటు లేకుండా ఆనందంగా ఉన్నారు.

నిఖిల్ ఇంజినీరింగ్ అయ్యాక హైద్రాబాద్ లోనే ఉద్యోగం వచ్చింది, ఇంకో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అపర్ణతో పెళ్లి అయ్యి, నాలుగేళ్ళ కొడుకు దేవాస్‌తో సహా తల్లితండ్రులతోనే ఉంటాడు.

అందరూ వీళ్ళని, చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అంటుంటారు.

ప్రస్తుతం ఉన్న ఆర్థికమాంద్యంలో నిఖిల్ ఉద్యోగం పోయింది. ఉద్యోగం వాళ్లే తీసేసారు కనక, ఆరు నెలల జీతం ఇచ్చారు.

ఉద్యోగం పోయినందుకు కొంత బాధపడ్డా, మళ్ళీ ఇంకోచోట తెచ్చుకోగలననే ధైర్యం ఉన్న నిఖిల్, రెండు నెలలు బ్రేక్ తీసుకుని, కొత్త జాబ్ వెదుక్కుంటాను అన్నాడు.

వెకేషన్‌కి వెళ్తే కొంత మార్పు ఉంటుందని, యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసి దానిలో భాగంగానే ఇద్దరూ మెడికల్ పరీక్షలు చేయించుకున్నారు.

నిఖిల్ ఈ మధ్య బరువు తగ్గితే డైటింగ్ వల్ల తగ్గానని, నీరసంగా ఉంటే తిండి సరిపోక అయ్యిఉంటుందని అనుకున్నాడు.

కానీ ఆ మెడికల్ పరీక్షల రిపోర్ట్ చూసిన డాక్టర్, వెంటనే స్పెషలిస్ట్‌ని కలవమని చెప్తే కంగారుగా కలిశారు.

ఆయన కొద్దిగా అనుమానం వ్యక్తం చేసి, ఆంకాలజిస్ట్‌ని కలవమంటే అందరికీ గుండెలు జారిపోయాయి.

బాగా పేరున్న ఆంకాలజిస్ట్, పరిస్థితి ఉన్నది ఉన్నట్టు చెప్తారు, ఆయన ట్రీట్ చేస్తే జబ్బు తగ్గడం ఖాయం అని అందరూ చెప్తే ఈ డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ముందు నిఖిల్‌ని చూసి నవ్వుతూ “డోంట్ వర్రీ యంగ్ మాన్! యు విల్ బి ఫైన్” అంటూ రిపోర్ట్స్ చూసి పేషెంట్ ని బయట కూర్చోమని ఇద్దరిని ఉండమన్నారు, శోభా, నిఖిల్ బయటికి వెళ్లారు.

రమేష్, అపర్ణలతో, ఆయన వ్యాధి చాలా మొదట్లోనే ఉందని, ఎంత త్వరగా సర్జరీ చేస్తే అంతమంచిది అని చెప్పారు.

సర్జరీ చేసి ట్యూమర్ తీసేస్తే, మళ్ళీ వచ్చే అవకాశం తక్కువని, ఏది ఏమైనా సర్జరీ చేసి, బయాప్సీ రిపోర్ట్ వస్తే కానీ, ఏదీ ఖచ్చితంగా చెప్పలేనని చెప్పారు. ఎంత ఖర్చు అయ్యేది, ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలి, ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం పడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు లాంటివి మాట్లాడి, వీలైనంత త్వరలో ఆపరేషన్‌కి ఏర్పాటు చేసుకోమని చెప్పారు.

రమేష్, డాక్టర్ చెప్పిన విషయాలన్నీ శోభకి, నిఖిల్ కి చెప్పాడు, ఆ సంగతులు విన్న నిఖిల్, రూమ్‌లో కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు, నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది? నేను సర్జరీ చేస్తే బతుకుతానా? ఆ తర్వాత జబ్బు మళ్ళీ తిరగపెట్టకుండా ఉంటుందా? తనకి ఏదన్నా అయితే? ఆ ఆలోచనే భరించలేక దుఃఖం వచ్చింది, కళ్లలో నీళ్లు, బుగ్గలు మీద కారుతున్నాయి, అప్పుడే లోపలికి వచ్చి చూసిన అపర్ణకి గుండె పిండినట్టయింది.

వెంటనే మనసు గట్టి చేసుకుని నిఖిల్ దగ్గరికి వెళ్లి “ఈ యుద్ధం మన అందరిదీ నిక్కీ! మేము అంతా నీతో ఉన్నాం. మనం గెలుస్తాం. నీకు ఏమీ కాదు, ఇది నా ఒక్కదానిదే కాదు, అందరి నమ్మకం” చేతిలో చెయ్యి వేస్తూ అంది.

“కిందటి నెల నా ఉద్యోగం పోయినప్పుడు కూడా ఇలానే అన్నావు, ఏది జరిగినా మన మంచికే అని, ఉద్యోగం పోవడం మంచిదా?” ఉక్రోషంగా అన్నాడు నిఖిల్.

“అవును, ఇప్పుడు కూడా అదే అంటున్నాను. నీకు ప్రతీ సంవత్సరం బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది, నిన్ను తీసెయ్యడం మీ మేనేజర్లకు కూడా ఇష్టం లేకపోయినా తప్పలేదు. నీ ఉద్యోగం పోయింది.. కానీ, నీకు కంపెనీ వాళ్ళు ఆరునెలల జీతం ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లే మనం యూరోప్ వెళదామని మెడికల్ టెస్ట్ చేయించుకున్నాం, అందుకే నీ సమస్య త్వరగా బయటపడింది. ఇప్పుడు నువ్వు నీ ఉద్యోగం గురించిన ఆలోచన లేకుండా ట్రీట్మెంట్ మీద శ్రద్ధ పెట్టచ్చు” అనునయంగా అంది అపర్ణ.

“నాకే ఎందుకు ఇలా అయింది? నేను ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ తీసుకుంటాను” ఉక్రోషంగా అన్నాడు నిఖిల్.

“నాకే ఎందుకు? ఈ ప్రశ్నకి ఎవరిదగ్గరా సమాధానం లేదు, సమస్య ఎవరికైనా రావచ్చు, పరిష్కారం అందరికీ దొరకదు, మనకి మంచి డాక్టర్ దొరికారు, సర్జరీతో నీ సమస్య తీరిపోతుంది అన్నారు, ట్రీట్మెంట్ ఖర్చు మా కంపెనీ ఇన్సూరెన్సు భరిస్తుంది, మనకు అండగా మన అమ్మానాన్నలు ఉన్నారు, ఇంతకంటే మనకి ఏం కావాలి?”

హఠాత్తుగా అపర్ణ మాటలని మధ్యలో ఆపుతూ “దేవాస్ ఏడీ?” కొడుకు గుర్తొచ్చి అడిగాడు.

“అమ్మ దగ్గర ఉన్నాడు, రేపు తీసుకుని వస్తారు, కానీ కొన్ని రోజులు అక్కడే ఉంచుతాను” అంది అపర్ణ, సరే అన్నట్టు తలూపాడు నిఖిల్.

“నిక్కీ! కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది విను. అసలు సమస్య నీకే వచ్చింది, ఏ మాత్రం ఇది ఊహించని నీకు, ఇది పిడుగులాంటి వార్త అన్నది నిజమే! నేనూ ఒప్పుకుంటా ఆ సంగతి. కానీ మనం ఒక కుటుంబంలో ఉన్నాం, సమస్య ఎవరికి వచ్చినా బాధ అందరిదీ. ఉదయం నుంచీ కనిపించని నీ నాలుగేళ్ల కొడుకు నీకు గుర్తొచ్చి, వాడు ఏమయ్యాడో అని కంగారు పడ్డావు, ముప్పయి ఏళ్ళ కొడుక్కి కాన్సర్ అంటే ఆ తల్లితండ్రుల బాధ ఆలోచించు. ఇద్దరూ దుఃఖం దిగమింగుకుని ఉన్నారు, అలాగే మా అమ్మానాన్న కూడా ఎంతో బాధపడుతున్నారు. కొన్ని విషయాలు మన చేతిలో లేవు,వాటి గురించి దిగులు పడి ఉపయోగం లేదు.

అయిపోయిన దాని గురించి నువ్వు ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు, కనీసం నాకు ఉద్యోగం ఉంది, మా వాళ్ళు కొంతకాలం ఇంటి నుంచి వర్క్ చేయచ్చు అన్నారు. డబ్బు విషయం మనకి దిగులు లేదు, మనకి మానసికంగా బలాన్నిచ్చే మనుషులు ఉన్నారు. సంగతి తెలియగానే మీ అక్కా, మా తమ్ముడూ ఇద్దరూ వస్తామన్నారు కానీ నేనే ఇప్పుడే వద్దు అన్నాను, ఇలా పాజిటివ్ సైడ్ చూడు” ఊపిరి తీసుకోడానికి ఆగింది.

“అందరూ వచ్చి నన్ను సానుభూతి చూపులు చూస్తే, నేను భరించలేను” గద్గద స్వరంతో అన్నాడు నిఖిల్.

“నువ్వు చాలా సినిమాటిక్‌గా ఆలోచిస్తున్నావు, మా అందరికీ నువ్వు బావుండాలన్న ఆలోచన తప్ప వేరేది లేదు, నన్ను చూడు, ఏడుస్తున్నానా?” అంది నవ్వుతూ.

“నువ్వు ఏడవ్వు, అందరినీ ఏడిపిస్తావు రాక్షసీ!” అన్నాడు నిఖిల్ కూడా నవ్వుతూ.

అపర్ణ మానసిక దృఢత్వం కలిగిన అమ్మాయి, నిఖిల్ పైకి గట్టిగా కనిపించినా మెత్తటి మనసు, చాలా చిన్న విషయాలకి కూడా బాధపడతాడు. “నీకేమీ కాదు నిఖిల్! నాకు ఆ నమ్మకం ఉంది, నిన్ను కాపాడుకోడానికి ఏం చెయ్యాలన్నా చేస్తాను” నవ్వుతూ అతని నుదిటి మీద చిన్నగా మీద ముద్దు పెట్టింది.

“ఇప్పుడు నీకొక విజయమంత్రం బోధిస్తాను విను మానవా!” అంటున్న అపర్ణని చూసి

“అమ్మో! ఇప్పుడు నా చేత ఏదైనా దేవుడి మంత్రం లక్షల్లక్షలు చేయిస్తావా? నాకు నోరు తిరగదు” అన్నాడు నిఖిల్.

అపర్ణకి దైవ భక్తి ఎక్కువ, నిఖిల్ ప్రసాద భక్తుడు.

“ఇచిగో.. ఇచి.. ఇదీ.. మన మంత్రం”

“అదేమిటీ? ఏ భాష, ఏ దేవుడి మంత్రం” అయోమయంగా అన్నాడు నిఖిల్.

“ఇది జపనీస్ వారి ఆనందమంత్రం, సంతోషమార్గం. ప్రతీ మనిషినీ గతం వేధిస్తుంది, భవిష్యత్తు భయపెడుతుంది, ఆ రెండిటికి మధ్య చిక్కుకుని వర్తమానాన్ని నిర్లక్యం చెయ్యకూడదు, ఈ క్షణం విలువ తెలుసుకుని, ప్రతీ అనుభూతినీ ఆస్వాదించాలి. వదిలేసిన క్షణం మళ్ళీ రాదు అని గుర్తుంచుకుంటే చాలు, అదీ ఇచిగో ఇచి సారాంశం, ప్రతీ కలయికా అమూల్యమే, అది వ్యక్తులతో కావచ్చు, ప్రకృతితో కావచ్చు.. ఈ రోజు మన ‘ఇచిగో ఇచి’ డాక్టర్ గారితో అని నా నమ్మకం.

ఇప్పుడు మన ఇంట్లో అందరం ఈ మంత్రమే పాటించాలి, గతాన్ని మార్చలేము, భవిష్యత్తుని నిర్దేశించలేం.

అందుకే వర్తమానంలో ఉన్న ఆనందం అనుభవిద్దాం. నువ్వు పాజిటివ్‌గా ఉంటే నీకు వైద్యం కూడా బాగా పనిచేస్తుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకో” చెప్పి బయటికి వెళ్ళింది అపర్ణ.

తల్లీతండ్రిని ఓదార్చడానికి వెళ్లిందని తెలుసు నిఖిల్‌కి, అపర్ణ మాటలకి మనసు తేటపడి నిద్రపోయాడు.

సాయంత్రం టీ తాగడానికి హాల్ లోకి వచ్చిన నిఖిల్‌కి, తనకోసం చూస్తున్న తల్లితండ్రి కనిపించారు, ఏడ్చి, ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయిన తల్లిని, దుఃఖం దిగమింగుకుని గంభీరంగా కనిపిస్తున్న తండ్రిని చూస్తే జాలి వేసింది నిఖిల్‌కి.

చిన్న పిల్లాడిలా ఇద్దరి మధ్యలో కూర్చుని, ఇద్దరి భుజాల మీద చేతులు వేసి “మీ కోడలు ఇంకా మంత్రోపదేశం చెయ్యలేదా? మనకి ఇంక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్‌లు లేవు. ఉన్నదల్లా ‘ఇచిగో ఇచి’ ఇదే మంత్రం జపించండి, మీ కోరికలు అన్నీ తీరతాయి, శుభం కలుగుతుంది” అభయ హస్తంతో అంటున్న నిఖిల్ ని చూసి పకపకా నవ్వేశారు అందరూ.

తర్వాత రెండురోజుల్లోనే ఆసుపత్రిలో చేరి, ఆపరేషన్‌కి సిద్దపడ్డాడు నిఖిల్.

చుట్టూ, తనకి మానసిక స్థైర్యాన్నిస్తున్న తనవాళ్లని చూసి, ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు నిఖిల్.

రెండుగంటల తరవాత, డాక్టర్ బయటికి వచ్చి “ట్యూమర్ చిన్నదే, మొత్తం తీసేసాము, మళ్ళీ కాన్సర్ వచ్చే అవకాశాలు లేనట్లే , బయాప్సీ రిపోర్ట్ వస్తే పూర్తి ధైర్యంతో చెప్పచ్చు, కొద్దిసేపటి తరవాత మీరు ఒకొక్కరే వెళ్లి పేషెంట్‌ని చూడొచ్చు” అని చెప్పి వెళ్లారు.

ఐసీయూ లోకి మార్చేముందు చూడమంటే, ఒకరి తర్వాత ఒకరు వెళ్లి చూశారు, ఆఖరున అపర్ణ వెళ్లింది. నీరసంగా ఉన్న భర్తని చూడగానే దుఃఖం వచ్చింది కానీ, కన్నీళ్లు కంట్రోల్ చేసుకుంటూ విజయసూచకంగా థమ్సప్ చూపిస్తే ‘ఇచిగో ఇచి’ బలహీనంగా నవ్వుతూ అన్నాడు నిఖిల్.

ఆ మాట విని సంతోషంగా ‘ఇచిగో ఇచి’ అంటూ నవ్వుతున్న అపర్ణ ని చూసి, “పాపం, భర్త అలా ఉంటే తట్టుకోలేక, ఏదో పిచ్చిగా మాట్లాడినా సంతోషిస్తోంది ఈ పిచ్చితల్లి” అనుకుంది ‘ఇచిగో ఇచి’ అంటే ఇంకా తెలీని అమాయకపు నర్స్.

జతానందులు

1

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘జతానందులు’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

శ్లో:

కాలః పచతి భూతాని కాలః సంహారతే ప్రజాః।

కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమః॥

భా:

కాలమే జీవరాశిని సంహరిస్తుంది, మింగి వేస్తుంది. జగత్తు నిద్ర లోకి వెళితే కాలం మేల్కొని ఉంటుంది. కాలం అతిక్రమిపజాలనిది!!

***

ఓం శ్రీరామ జయరామ జయజయ రామ!

ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ!!

నార్త్ కేరళ కాజంగాడ్ -ఆనందాశ్రమం నుండి శ్రీమతి లక్ష్మీ మహదేవన్ గారి నేతృత్వంలో ప్రణవానంద సేవాశ్రమానికి వచ్చిన పదిమంది బృందంతో పాటు కలసి ఆశ్రమవాసులు చేసిన రామ నామ సంకీర్తనతో మారు మ్రోగిపోతుంది స్వామీ ప్రణవానందుల సమాధి మందిరం. సత్సంగానికి సమయం కావడంతో పారాయణకు విరామం ప్రకటించారు. “పాడిందే పాటరా పాచి పళ్ళ దాసరీ అని ఏమిటీ గోల?” అంది రొంగల భారతమ్మ చిరాగ్గా.

“యు డోంట్ నో ది పవర్ ఆఫ్ రామనామ పారాయణ” అంటూ నావైపు తిరిగి “రెడ్డీ జీ! ప్లీజ్ ఎక్స్‌ప్లైన్ హర్ ది పవర్ ఆఫ్ రామనామ” అంది లక్ష్మీ మహదేవన్.

“అమ్మా భారతమ్మా! ఒక మంచి చర్చకు తెర లేపినందుకు ధన్యవాదములు! పారము అంటే అవతలి తీరం అని అర్థం. పారంగతుడు అనే మాట వినే వుంటారు. దాని అర్థం పండితుడు లేదా ఆవలి తీరం చేరిన వాడు అని. పారాయణం అంటే భవ సాగరాన్ని దాటడం. సముద్రాన్ని దాటడం కంటే సంసారాన్ని దాటడం కష్టం అనే మాట వినలేదా? ‘తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం’ అనే పాట వినలేదా?” వివరించాను.

“ఆత్మను చేరుకోవాలంటే ఎంతదూరం వెళ్ళాలి బాబూ?” మమకారస్వామీ అని పిలువబడే నూలు నారాయణ ప్రశ్న.

“ఎక్కడికీ వెళ్ళనక్కరలేదు. ఆత్మ అంటే.. అనన్యః. అంటే మీకు వేరుగా లేనిది. మీలోపల వున్న సారః.. మీ స్వరూపం. అదే ఆత్మ! అదే దేవుడు! అదే మీరు!”

“తపస్సు అంటే ఏమిటి?” గునివాడ అప్పలరాజు ప్రశ్న.

“శీతోష్ణ సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించడమే!”

“సంసారం – సంసారి అనే మాటల్ని బాగా వివరించండి” రాజుల కాంతమ్మ ప్రశ్న.

“ఒకదానిని కోరి మరోదాన్ని ద్వేషించేవాడే సంసారి. సినిమాల్లో వుండే బొమ్మలు, దృశ్యాలు ఎటువంటివో సంసారంలో సంభవించే ఘటనలు అటువంటివే! సుఖాలు మాత్రమే కావాలి దుఃఖాలు వద్దు అనుకొనేవాడే సంసారి! మురికి గుంటలోని పురుగులు ఆ గుంట లోని మురికినీ – కంపునూ ఎలా ప్రేమిస్తాయో అలా సంసారి సంసారాన్ని ప్రేమిస్తుంటాడు” వివరించారు రెడ్డిగారు.

“ఈ మన ఆశ్రమవాసుల్లో సంసార భవ సాగరాన్ని దాటినవారివరైనా ఉన్నారా?” కోలా సత్యనారాయణ ప్రశ్న.

“నేనున్నాను. నా భార్య, నా కొడుకు, కోడలు, మనవలు కరణం గారి జంక్షన్‌లో నేను కట్టించిన ఇంట్లో వుంటారు, నేను ఒంటరిగా గాంధీనగర్‌లో నా కొడుకు కొన్న సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్‌లో వుంటూ గత సంవత్సరంగా ఈ ఆశ్రమ కుటీరం లోనే వుంటున్నాను. నేను సంసార భవ సాగరాన్ని దాటినట్టే కదా?” వివరించి ప్రశ్నించాడు శ్రీమాన్ కాటమరెడ్డి సత్యనారాయణ.

“కాదు! భార్యా బిడ్డలతో కలసి లేనంత మాత్రాన నీవు సంసారి కాకుండా పోవు. నా భార్య అన్నావు. నా కొడుకు, నా కోడలు, నా మనవలు, నేను కట్టించిన ఇల్లు అన్నావు. అంటే నీలో అహంకార మమకారాలు ఎంత మాత్రం నశించలేదు. అంటే నీవు సంసారివే! మనసా, వాచా, కర్మణా నీవు, నేను, నాది అనే భావాలను విడిచి పెట్టినవాడు మాత్రమే సంసార సాగరాన్ని దాటిన యోగి అవుతాడు! కుటుంబ సభ్యులతో కలసి జీవించవచ్చు. ఈ భావాలను మాత్రం జయించాలి! ప్రతీ భావం వెనుకా భగవంతుడు ఉంటాడు. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు ‘పడవ నీటిలో ఉండాలి గానీ నీరు పడవలో ఉండరాదు’. అలానే మనం సంసారంలో ఉండవచ్చు గానీ సంసారిగా, అంటే సంసారం మనలో ఉండరాదు. కుక్క తన తోకను ఆడించాలి గానీ కుక్క తోక కుక్కను ఆడించరాదు. మనిషి చిత్తంలో రెండే ఉంటాయి. ఒకటి సంసారం, రెండు ఈశ్వరుడు. సంసార భావాన్ని మనం తొలగించుకుంటే మిగిలేది ఈశ్వర భావమే! మానవ జన్మ వచ్చింది సంసార కూపంలో ఈదులాడడానికి కాదు – ఈశ్వరుణ్ణి పొందడానికే!” వివరంగా చెప్పారు శాంతిరెడ్డి గారు.

“అవును. ఎడారిలో పుట్టిన నది ఎడారి లోనే ఇంకిపోయినట్టు మనిషి జీవితం సంసారం తోనే ముగిసిపోరాదు.” అన్నారు కరుటూరి ప్రకాశరావు.

“అసలు.. ఈ సంసారం ఎలా పుట్టింది?” భారతమ్మ ప్రశ్న.

“సంసారం అన్న వృక్షం అవ్యక్తం నుండి ప్రభవించింది. ఆ చెట్టు యొక్క మొదలు బుద్ధి, అహంకారం దాని శాఖలు, పంచ మహా భూతాలు దాని ఉప శాఖలు, ఇంద్రియాలు దాని తొర్రలు, ఎడ తెగని ఆశలే దాని చిగుళ్ళు, శుభాశుభాలే దాని ఫలాలు, అట్టి సంసార వృక్షాన్ని జ్ఞానం అనే కత్తితో శేషం లేకుండా తెగనరికిన జీవుడు అహంకార మమకార రహితుడై ఆవశ్యం బ్రహ్మపదం చేరుకోగలడని మహా భారతంలోని అశ్వమేధ పర్వం చెబుతుంది.” చెప్పారు రెడ్డిగారు.

“ఈ సంసార దుఃఖాలను అదిగమించడానికి మనిషి ఏం చేస్తున్నాడు?” రొంగల భారతమ్మ అడిగింది.

“ఇప్పుడు మనం చేస్తున్నదే! సంసారంలో వచ్చిన కష్ట నష్టాలను అదిగమించడానికి జనులు ఆశ్రమాలకు, స్వాముల వద్దకు, దేవుడమ్మల వద్దకు, జ్యోతిష్యుల వద్దకు పరుగు పెడతారు. కానీ వారికి తెలియనిది ఒకటుంది. ఈనాటి ఆశ్రమాలు అతి పెద్ద సంసారాలు, ఈ స్వాములు, దేవుడమ్మలు, జ్యోతిష్యులు అతి పెద్ద సంసారులు!” చెప్పారు రెడ్డిగారు.

“నా ఈ సంసారం శాశ్వతమా?” రొంగల భారతమ్మ

“ప్రకృతి పురుషుడు వున్నప్పుడు మాత్రమే ఈ సంసారం ఉంటుంది. ఎల్లప్పుడూ నీతోనే వుండే దానిని మాత్రమే ‘నాది’ అనాలి. గతంలో నీతో లేనిది – భవిష్యత్తు లో నీతో ఉండనిది ఎప్పుడూ ‘నీది’ కాదు. ఇల్లు, భార్య, కొడుకు, ఉద్యోగం, కార్డు, బాంక్ బాలన్స్‌లు శాశ్వతంగా నీతో వుండవు. నీతో ఉండేది కేవలం ‘నీవు వున్నావు’ అనే ఎరుక మాత్రమే! ఆ నీవు ఎవరో తెలుసుకోడానికి సాధన చెయ్యి. సంసారంలో కళ్ళ నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏముంటుంది? మనసు దాని కదలికలే సంసారం. మనసు దాని నిశ్శబ్దమే ‘ఆత్మ’. బుద్ధుని వచనం ‘బి ఎ లైట్ అన్ టు యువర్‌సెల్ఫ్.’ గుర్తుంచుకో! సాధారణంగా సంసారులు ప్రతి దానికీ తాము భయపడుతూ ఇతరులను భయపెడుతుంటారు. చిన్న చిన్న అడుగులు వేసినవాడు చాలా దూరం వెళ్ళగలుగుతాడు. దూరాన్ని లెక్కలలో మాత్రమే కొలిచేవాడు వున్న చోటునే ఉంటాడు. ఆత్మ జ్ఞానం కలిగితే జీవుడే దేవుడు అవుతాడు. ఆత్మ జ్ఞానం లేని దేవుడు కూడా జీవుడే!! బాహ్యంలో వుండే చీకటి ఎవరికీ ఏ హానీ చెయ్యదు. మన అంతరంగంలో వుండే చీకటి చాలా ప్రమాదం. దాని పేరే అజ్ఞానం.” వివరించారు రెడ్డిగారు.

“మరి ఎలా? సన్యాసమే పరిష్కారమా?” భారతమ్మ.

“కాదు.. కాదు.. కాదు! సన్యాసం సమస్యల నుండి దూరం చేయలేదు. సమస్యలకు పరిష్కారం సన్యాసమే అయితే ఈ జగత్తులో అందరూ సన్యాసులే ఉండేవారు! సన్యాసం సన్యాసిగా రియలైజ్ కావడానికే గానీ తనని తాను ప్రత్యేకంగా పేర్కొంటూ ఇతరుల నుండి వేరు చేసుకోడానికి కాదు” గట్టిగా నొక్కి చెప్పారు రెడ్డిగారు.

“అదీ కాదంటారు ఇదీ కాదంటారు. మరెలా?” భారతమ్మ.

“చాలా ప్రపంచ విషయాలపై మన జ్ఞానం ఎంత వరకంటే మరొక ప్రశ్న అడగటం వరకే! మీలో నలుగురు ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకొనేటప్పుడు మీ కబుర్లు సాధారణంగా అక్కడ లేని ఐదో వాడి గురించే! ఆత్మ జ్ఞానం కలిగే వరకే ఈ చింతన. డూ యూ నో? ఎవ్విరి ప్లెజర్ ఈస్ ఎ సీడ్ ఫర్ ది పెయిన్. దేర్ విల్ బి వెరీ స్మాల్ టైం గ్యాప్ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్!” రెడ్డిగారు.

“ఆత్మ జ్ఞానిని.. అదే బ్రహ్మ జ్ఞానిని ఎలా గుర్తించాలి?”

“పొగిడితే సంతోషం – తెగిడితే దుఃఖం కలిగేవాడు సంసారి. పొగడ్తలకు దుఃఖం విమర్శలకు సంతోషం కలిగేవాడు సాధకుడు. పొగడ్తలను, తెగడ్తలను ఒకేలా భావించేవాడే సన్యాసి. అతనే బ్రహ్మ జ్ఞాని లేదా ఆత్మ జ్ఞాని” చెప్పారు రెడ్డిగారు.

“పవిత్రమైన జీవనం ఏది?” భారతమ్మ.

“నేనూ.. నాదీ (అహం.. మమ) లేని జీవనమే దివ్య జీవనం (డివైన్ లైఫ్)” రెడ్డి గారు.

“యోగాకి – ధ్యానానికి ఏమైనా తేడా వుందా?”

“శరీరం యోగా చేస్తేనే మనసు ధ్యానం చేయగలుగుతుంది.”

“జీవం – మరణం పై మీ వ్యాఖ్య..” భారతమ్మ.

“గాలి పీలిస్తే జీవం. పీల్చిన గాలి విడిచి పెట్టి మళ్ళీ పీల్చలేకపోవడమే మరణం!” రెడ్డిగారు.

“దుఃఖములను వ్యాఖ్యానించండి” కముజు అనంత లక్ష్మి ప్రశ్న.

“ద్వంద్వాలైన సుఖదుఃఖములు వచ్చి పోయేవే గానీ స్థిరంగా ఉండేవి కావు. ఈ ప్రపంచం నుండి మీరు ఏదైనా అపేక్షిస్తే ఒకసారి ఈ ప్రపంచం మిమ్మల్ని నవ్విస్తుంది. అదే సుఖం. మరోసారి ఏడిపిస్తుంది. అదే దుఃఖం. ఆశించిన వారికి మాత్రమే సుఖదుఃఖములు కలుగుతాయి. మనిషి జీవితంలో సుఖ దుఃఖ ప్రవాహములు ఉంటాయి. గుణాతీతుడు ఆ రెండింటినీ సమాన దృష్టితో గమనిస్తాడు. గుణములతో వున్నవాడు జీవుడు. గుణాతీతుడు దేవుడు. చైతన్యం దేహం వంటిదనుకుంటే జీవుడు. దేహాతీతం అనుకుంటే బ్రహ్మ! క్రియా శక్తిని వశంలో ఉంచుకున్నవాడే శివుడు. క్రియా శక్తికి లోబడి ఉండేవాడు జీవుడు!” చెప్పారు సువర్ణ లక్ష్మి.

“మంత్రాల తోనూ, మహిమల తోనూ గురువు జీవుణ్ణి దేవుడిగా మార్చగలడా?” లలిత కుమారి ప్రశ్న.

“సాధకులు తమ మార్గనిర్దేశకుడు అయిన గురువులో ఎలాంటి అద్భుతాలు వెదకరాదు. అంధ విశ్వాసాలలో మునిగిపోనప్పుడు గురుశిష్యులకు చెందిన ఒక ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆదర్శవంతమైన పరంపర స్థాపితమౌతుంది. కర్మచారులంతా కర్మయోగులుగా మారిన నాడు దేశం ఉజ్వలత్వంతో వెలిగిపోతుంది” సువర్ణ లక్ష్మి జవాబు.

“మనం దుఃఖంలో వున్నప్పుడు మన పక్కవారు కూడా దుఃఖం పొందాలా?” అడిగింది శేషారత్నం.

“అవసరం లేదు. ద్రౌపది మాటలు గుర్తు చేస్కోండి ‘నా కొడుకులు పోయి నేను ఏడుస్తున్నాను. అశ్వత్థామను చంపేస్తే నాలాగే కృపి కూడా ఏడవడం నాకు ఇష్టం లేదు’ అంటుంది” ఉదాహరణతో చెప్పారు సువర్ణ లక్ష్మి.

“భగవద్గీత ప్రేమ వేరు, ఆసక్తి వేరు అంటుందేమిటి? ఎవరి మీద నైనా ఆసక్తి వుంటేనే కదా ప్రేమ కలుగుతుంది?” శేషారత్నం ప్రశ్న.

“తేనెటీగ పువ్వుల మీద మాత్రమే వాలుతుంది. కానీ.. ఈగ మిఠాయిల మీదా వాలుతుంది. పుండు మీదా వాలుతుంది. జ్ఞానులు తేనెటీగలైతే సంసారులు ఈగ లాంటివారు. దీపం వెలిగేది, గులాబీ వికసించేది, పసిపాప బోసి నవ్వులు రువ్వేది ఎవరి కోసం? ఏమీ ఆశించకుండా జరిగే క్రియల్లో ప్రేమే ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల మీద ఉండేది ప్రేమ అని చెబుతారు కానీ అది చాలా వరకూ ఆసక్తి మాత్రమే! దీనిని నిరూపిస్తూ ‘ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి’ అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు” అంటూ వివరించారు సువర్ణ లక్ష్మి.

విచారణ చాలా గంభీరంగా సాగుతున్న తరుణంలో జరిగింది ఒక అద్భుతం. అక్కడున్న చాలామంది ఉలిక్కి పడ్డారు. సత్సంగం హాలు గుమ్మంలో నవ్వుతూ నిలబడి వున్నాడు జగదీష్! అందరూ చనిపోయాడనుకున్న మనిషి ప్రత్యక్షమయ్యేటప్పటికి అందరిలోనూ ఉద్వేగం! ఇది ఎలా సంభవం? దెయ్యమై వచ్చాడా? తాము చూస్తున్నది నిజామా? కలా? బెల్లంకొండ మూర్తి తనను తాను గిచ్చుకొని నిజమేనని తేల్చుకున్నాడు. అతని భార్య సుబ్బలక్ష్మి మరో గుమ్మం గుండా బయటికి పరుగేట్టేసింది. అందరిలోనూ ముందుగా తేరుకున్నది శాంతి రెడ్డి గారూ, సువర్ణ లక్ష్మీ.

“మీరు..?” అడిగారు రెడ్డిగారు.

“అవును నేనే! మీ అందరికీ తెలిసిన జగదీష్ నేనే!”

“అదే ఎలా సాధ్యం? మేం విన్నది.. వేరే!” రెడ్డి గారికి మాటలు తడబడుతున్నాయి.

“మీ అందరికీ తెలిసినట్టుగా నేను మూడు సంవత్సరాల క్రితం కరోనాతో చనిపోలేదు. ఆ పుకారు ఎందుకొచ్చిందో, ఎలా వచ్చిందో నాకు తెలియదు. కరోనా మొదటి ఫేస్‌లో నన్ను జతానందులు – నా ఎల్లర్జీ నీ, దగ్గునీ చూసి నాకు కరోనా వైరస్ సోకిందని ప్రచారం చేసి ఆశ్రమం నుండి పంపించేశారు. అదే నా పాలిట వరమై ఇప్పుడు గతంలో వున్న ఎలర్జీ కూడా నయమైంది

మీ అందర్నీ కల్సుకోవాలని ఆశ్రమానికి వచ్చాను. రిసెప్షన్ లోనూ, ఆఫీస్ లోనూ కూడా నన్ను చూడగానే మీలాగే భయపడ్డారు. ఇదంతా చూస్తే నామీద ఏవో పుకార్లు వున్నాయని అనుమానం వస్తుంది. నిజం చెబుతున్నాను నాకు ఏ విధమైన రోగం లేకుండానే నన్ను ఇక్కడినుండి పంపించి వేశారు. మా కుటుంబ సభ్యులు నాకు మాస్క్ వేసి నన్ను వాలంటీర్‍‌కు అప్పజెప్పారు. హాస్పిటల్‌లో నాకు పరీక్షలు చేసాకా నాకు కరోనా వైరస్ సోకలేదని తెలిసింది. అప్పటికి నాకున్న ఎలర్జీకి ట్రీట్మెంట్ ఇచ్చారు.

అంతా నయమయ్యింది! మాతాజీ సద్విద్యానంద సరస్వతి దర్శనం చేసుకొని మిమ్మలనందరినీ కల్సు కోవాలని ఇలా వచ్చాను. దయచేసి ఏవిధమైన అనుమానాలు పెట్టుకోకుండా మీరంతా ఎందుకు కంగారు పడ్తున్నారో చెప్పండి!” అంటూ లోపలికి వచ్చి కూర్చున్నాడు అందరూ కరోనాతో మరణించాడనుకొన్న జగదీష్!

***

గతం అందరి కళ్ళ ముందు సినిమా రీల్‌లా ప్రత్యక్షమైంది. అందరి మనస్సులో జతానందులు వారి బృందం మెదిలారు. మూడు సంవత్సరాల క్రితం జగదీష్ ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు అతనికి మాయాదేవి, పచ్చగడ్డి లక్ష్మి కుటీరాల మధ్యలోని కుటీరం కేటాయించారు. అదే అతనికి పెద్ద శిక్ష! ఒంటరిగా దొరికిన మగాడి మీద వారు పెట్టిన లైంగిక వేధింపులకు అతను అనుకూలంగా స్పందించలేదు. జతానందుల ముఠా కోపానికి గురయ్యాడు. ప్రతీ ఆశ్రమంలోనూ కులం పేరుతోనో, బలం పేరు తోనో ముఠాలుగా ఏర్పడి రాజకీయం చేయడం ఈనాటి ఆధ్యాత్మిక రంగానికి పట్టిన జాడ్యం!

అతని పూర్వ నామం ఎల్లారావో లేక పుల్లారావో! అమలాపురం దగ్గర్లో గోదావరి కాలువలో మూడు మునకలు వేసి, తన పేరు జపానంద అని చాటుకొని జపం చేసుకోడానికి ఈ ప్రణవానంద సేవాశ్రమం చేరాడు. తాతమ్మో, పీతమ్మో అతనికి బాడీ గార్డ్ అయ్యాడు. బాడీ గార్డ్‌ను లోతు గడ్డలో మూడు మునకలు వేయించి అతనికి ‘తపానంద’ అని నామ ప్రదానం చేసాడు.

ఆశ్రమవాసులెప్పుడూ దేన్నయినా నమ్మడానికి సిద్ధంగా వుంటారు. ఇప్పటి ఆశ్రమాలకు అలాంటి వాళ్ళే కావాలి. ఆశ్రమవాసులు నమ్ముతారు గానీ వెర్రివాళ్ళు మాత్రం కాదు. వాళ్ళిద్దరికీ కలిపి ‘జతానందులు’ అని నామకరణం చేసుకున్నారు. జతానందులకు మాయా మేడం, పచ్చగడ్డి లక్ష్మి, బొల్లిముంతల రమ్యా తోడయ్యారు. ఆ ఐదుగురు ఆడింది ఆట – పాడింది పాటగా ఆశ్రమాన్ని పాలిస్తున్నారు.

జగదీష్ ఆశ్రమంలో చేరిన కొత్తలో వారి లైంగిక అవసరాలకు పనికొస్తాడని భావించి అతని మీద చాలా ప్రేమ ఒలక బోసిన ఆ ముగ్గురు స్త్రీమూర్తులు, అతను వారి అంచనాలకు చిక్కడు, వారి కపట ప్రేమకు దొరకడు అని నిర్ణయించుకొన్నప్పటి నుండి అతన్ని ద్వేషించడం మొదలు పెట్టారు. ఎలాగైనా ఆశ్రమం నుండి వెళ్లగొట్టాలని జతానందులను శరణు వేడారు. ముఠా అంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా బెల్స్ మ్రోగాయి.

ప్రజలాంతా భయం గుప్పెట్లో బ్రతకటానికి అలవాటు పడుతున్నారు. ప్రపంచానికి మహమ్మారి అయినా ఈ ముఠా కు సువర్ణ అవకాశం అయ్యింది!

“అవును.. అతను.. అదే ఆ జగదీష్ దగ్గాడు” అంది పచ్చగడ్డి లక్ష్మి

“అతను తుమ్మాడు కూడా!” బొల్లిముంత రమ్య.

“అది కరోనా వైరస్ అయ్యుంటుంది” మాయా మేడం.

ఆ ముగ్గురు కలసి జతానందుల కుటీరానికి వెళ్లి “అతన్ని ఆశ్రమం నుండి పంపించెయ్యాలి. లేకపోతే ఆ వైరస్ ఆశ్రమమంతా పాకిపోతుంది. ఆశ్రమం అల్లకల్లోలం అయిపోతుంది” అంటూ జతానందుల చెవులు కొరికారు. వెంటనే కార్యరంగం లోకి దిగిన జతానందులు మాతా సద్విద్యానంద కుటీరానికి వెళ్లి వున్నవి లేనివి కల్పించి భయపెట్టేశారు. నమ్మిన ఆమె వెంటనే జగదీష్‌ను ఆశ్రమం నుండి పంపించేయమని ఆఫీస్‌కు ఆర్డర్ జారీ చేశారు.

***

ఈ విషయం అంతా తెలుసుకున్న జగదీష్ లేచి నిలబడ్డాడు.

“కూర్చో జగదీష్! కొద్ది నిముషాల్లో మాతాజీ వారి గైడెడ్ మెడిటేషన్ మొదలవుతుంది. “ అన్నారు రెడ్డి గారు.

“ఆ రోజు నన్ను ఆశ్రమం నుండి పంపించివేసి అప్పటికి నేను బాధపడుతున్న ఎలర్జీ ఇన్ఫెక్షన్ నుండీ విముక్తి పొందటానికి కారణభూతులైన ఆ జతానందుల దర్శనం చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకొని ఆఖరి బస్సుకు మా ఊరు వెళ్లి పోతాను” చెప్పాడు జగదీష్.

అందరూ నవ్వారు. జగదీష్‌కు అర్థం కాలేదు.

“దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్! యు కెన్ నెవెర్ మీట్ దెమ్. దె లెఫ్ట్ దెయిర్ బాడీస్ విత్ కరోనా ఇన్ కరోనా థర్డ్ ఫేజ్!” నవ్వుతూ చెప్పాడు ఇంగ్లీష్ అప్పారావు.

ఆశ్చర్యపోవడం జగదీష్ వంతయ్యింది!

“కరోనా మూడవ ఫేస్‌లో ఆ ఇద్దరికి నీలాగే దగ్గు తుమ్ములు మొదలయ్యాయి. టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుందేమోనని భయం. కుటీరాలు విడిచి బయటకు రావడం మానేశారు. భోజనాలు కూడా కుటీరానికే ఏర్పాటు చేసుకున్నారు. వారితో క్లోజ్‌గా వుండే పచ్చగడ్డి లక్ష్మి, బొల్లిముంతల రమ్య, మాయా మేడంలు ముఖం చాటేశారు. ఒక అమావాస్య రోజు కేరేజి పట్టికెళ్లిన అప్పారావు ఎంత కొట్టినా కుటీరం తలుపు తెరుచుకోలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా జపానంద, తపానందలు శవాలై పడి వున్నారు.” చెప్పాడు బెల్లంకొండ మూర్తి

మృత్యు దేవత తన కంటే ముందే ఆ కుటీరానికి వచ్చిందని అప్పారావు అనుకొన్నాడు!!

వారు రోగంతో మరణించలేదు. రోగ భయంతో మరణించారు. మరణం ఎవ్వరిని బాధించదు మరణ భయమే అందరినీ చంపుతుంది.

ప్రాణవానందుల సమాధి మందిరంలో లైట్లు ఆఫ్ చేశారు. మాతాజీ వారి గైడెడ్ మెడిటేషన్ ప్రారంభ మవడానికి సూచనగా!

స్వస్తి

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-11

0

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap] ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ప్రథమాశ్వాసము:

140.
తే.గీ.:
కాన శోకము విడనాడి మనమునందు
నన్ను ధ్యానించి శుభముల నందుకొనుడు
మీకు సాయుజ్యమిచ్చెద బ్రీతి తోడ
దీని బడసెడు పథమును తెలుపుచుంటి

141.
సుగంధి:
వైరులైన మూర్ఖులైన పాపకర్ములైననున్
కోరి నన్ను ధ్యానమెప్డు కూర్మితోడ జేయగన్
వారి జేతు ధన్యులన్ అపార పుణ్యశీలురన్
నీరజాక్ష మగ్నచిత్త మేయొనర్చు సర్వమున్

142.
సీ.:
నాదైన తత్త్వంబు నజ్ఞానమున నెవ్వ
డెఱుగక నన్నెప్డు దూఱునేని
నా చరిత్రంబును మదిని ద్వేషించుచు
నెవ్వాడు నను నింద జేయునేని
నా గుణగానంబు మహనీయ ముక్తిదం
బని యెరుగ కెవ్వడు వదరునేని
నా దివ్యమహిమంబు నచ్చక నిచ్చలున్
విద్వేషమున నన్ను వీడునేని
తే.గీ.:
వాని వైక్లబ్యమది నేను పరిగణింప
నన్ను నామంబున తలువ నదియె చాలు
అట్టి వానిని, దురితంబులన్ని ద్రుంచి
మోక్ష పదమును ఇచ్చెద మోదమునను

143.
కం.:
దితి కశ్యపులకు సంతుగ
నతులితమగు జన్మ నంది మహితయశంబున్
సతతంబును గడియింతురు
అతిలోకం బైన శౌర్య భాసితులగుచున్

144.
చం.:
అని సెలవిచ్చె శ్రీధరుడు, వారును మిక్కిలి మోదమందుచున్
వినతులు చేసి విష్ణునకు వెళ్లగ, కేశవ దర్శనార్థులై
మునిసుర యక్ష కిన్నరులు పూనిక వేచుచునుండ, వారికిన్
తనదగు దివ్య దర్శనము దారతనిచ్చెను, ధన్యులైచనన్

జయ విజయుల పునర్జన్మము

145.
మ.:
దితికిన్ కశ్యప మౌనికిన్ సుతులుగా దివ్య ప్రభామూర్తులై
క్షితి జన్మించిరి రాక్షసాన్వయమునన్, క్షేమంబు లేకుండగన్
వితతంబైన సురాళి దుఃఖగతులై వేమారు చింతింపగన్
సతతంబున్ సుర ద్వేషమగ్నమతులై శౌర్యంబు పెంపొందగన్

146.
వ.:
ఇవ్విధంబున దేవశ్రవ మునీంద్రుండు గాలవ మహర్షికి వెల్లడించె. ఆ జయవిజయులే, హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా దితి గర్భంబున నుదయించిరని ఎఱింగించెను.

ఆశ్వాసాంత పద్య గద్యములు

147.
మాలిని:
సకల మహిమ భాసా, సర్వ ధర్మ ప్రకాశా
చకిత దివిజ కీర్తీ, సత్య వాక్యానువర్తీ
సుకవి వినుతనామా, సుందరానంద శ్యామా
వికసకమలనేత్రా, విశ్వసమ్మోహ గాత్రా!

148.
స్తోత్రం:
మహిత చాంచల్య ధ్వంసీ, విహిత విజ్ఞానహంసీ
సహిత శ్రీమూర్తి ధారీ, సుహిత కల్యాణకారీ

149.
తరువోజ:
నిరతము జగముల నిలుపుచు ఘనత
విరచితమగు తన విభవము దనర
సురముని నరవర సురుచిర నుతులు
తిరముగ దొరకగ దివిజుల యధిప
వరదుడవయి మము పరమును గనగ
చిరమగు ఘనమతి సురపతి, యొసగు
తరతమముల విడి తగ నిను గొలుచు
విరహితగతి గను విధమును తెలియ

150.
కవిరాజ విరాజితము:
నిజకృప లోకము నిత్యము గాచెడు నిర్ణయశీలుని నిశ్చలునిన్
అజుడును సృష్టికి నంచిత భక్తిని ఆ పరమాత్ముని యాన గొనన్
రజత నగాధిప రాజిత నాట్యము రంజిల విష్ణు విలాసముగా
విజిత సురారి నివేదిత శౌర్యము విశ్వహితంబుకు వేదికగా

151.
కం:
అనితర దివ్య ప్రభావా
ఘనతర మహిమా ప్రకాశ! కరుణాపూర్ణా!
వినతాసుత పరివాహా
మనసిజ జనకా! విభూతి పరిపాల! హరీ!

ఇది పృథమాశ్యాసము

152.
గద్యము:
ఇయ్యది బ్రహ్మశ్రీ లక్ష్మీనరసింహశాస్త్రిపుత్ర, అహోబల నృకేసరి దయా లబ్ధపాండిత్య యుక్త, దత్తశర్మ నామధేయ ప్రణీతంబైన, శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము నందు, ప్రథమాశ్వాసము.

~

లఘువ్యాఖ్య:

మహా విష్ణువు జయవిజయల కభయమిచ్చినాడు (140). పద్యం 1421 లో తనను చేరు మార్గమును చెప్పినాడు. ఇక పద్యం 143లో స్వామి యొక్క నిర్వికారతత్త్వమును కవి వర్ణించినారు. ఎవరైనా తనను ద్వేషించినా, దూషించినా, గర్వముతో వదరినా వాని వైక్లబ్యము (మూఢత్వము)ను తాను పరిగణించననియు, తన నామస్మరణ చేస్తే చాలు, వారి పాపాలు హరించి, మోక్షమును ప్రసాదిస్తానని చెప్తాడు హరి. పద్యం 143లో జయవిజయులు దితి, కశ్యపులకు పుత్రులుగా జనించి కీర్తిగాంచెదరని హరి నుడివినాడు.

పద్యం 147 నుండి 152 వరకు కావ్య లక్షణముల ననుసరించి కవి ఆశ్వాసాంత పద్యగద్యములు కృతిపతియైన నారసింహ ప్రభువునకు సమర్పించినారు. ఈ పద్యములలో వృత్తి భేదములుండి, కృతిభర్తను కీర్తించునవై ఉంటాయి. పద్యం 147 మాలిని వృత్తం, స్వామి గుణగణముల వర్ణన. పద్యం 148 ఒక సంస్కృత శ్లోకం. కవి స్వంత ఛందస్సు. నరసింహుడు మనో చాంచల్యాన్ని ధ్వంసం చేస్తాడు.

విజ్ఞానమనే హంస. పద్యం 149 తరువోజ. ఇది దేశీ ఛందస్సు. సర్వలఘు సహితము. ప్రతి పాదములో 30 అక్షరములు, 3. యతి స్థానములు. పద్యం 150 కవిరాజు విరాజిత వృత్తము – దీనిలో చక్కని rhythm ఉంటుంది. 3 యతి స్థానాలు. 151 గద్యము. ఇది అశ్వాసము చివర ఉండును. దీనిలో కవి తన తండ్రి గురించి, నరసింహ కృప గురించి సవినయంగా చెప్పి, తన చేత ప్రణీతము (రాయబడినది) ఐన ప్రథమాశ్వాసము ముగిసినదని చెబుతున్నారు.

(సశేషం)

అనువాద మధు బిందువులు-1

0

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

అమ్మాయి కోరికలు

~

[dropcap]ఆ[/dropcap]మె జీవితం ఊయలనుండి
శ్మశానం దాకా విస్తరించింది
తన శరీరం, మనసు మాత్రమే కాదు
ఆఖరుకు తన కోరికలు సైతం
ఆమెకు చెందవు

శరీరాన్ని ఎంత కప్పుకోవాలి,
ఎంత వదిలెయ్యాలి అన్నది
ఇతరులు నిర్ణయిస్తారు

కానీ అమ్మాయి వయసు పెరిగి,
ముమ్మరించిన యవ్వనం పొంగుతూ
చేరుతుంది ఆమె శరీరంలోకి

తన ఊహాలోకంలో ఆమె
పాడుతుంది నాట్యం చేస్తుంది
తద్వారా
రంగులు నిండిన జీవితాన్ని
కల గంటుంది

కానీ ఆమె పాడితే వేశ్యగా,
నాట్యం చేస్తే నమ్మకద్రోహిగా,
కల గంటే కులటగా కనిపిస్తుంది

అమ్మాయి కోరికలు
భయాలచేత ఆందోళనల చేత
పిడికిలిలో నలిగిపోతాయి

తన కలల్లోని ప్రియుడు ఏదో ఒకనాడు
వచ్చి తీసుకుపోయినా ఆమె శరీరం
చిరిగి చింపిర్లైన చాపలా
ఈడ్చుకుపోబడుతుంది

అమ్మాయి శరీరం యెప్పుడూ
ఉపేక్షకు గురవుతుంది
అందంగా వున్నా ఒక నిషిద్ధ ఫలం అది

ఆంగ్లమూలం: ఈప్సితా సారంగి
అనువాదం: ఎలనాగ

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-30

0

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
291.
నిప్పుపై గవిసిన నివురు గాలి వీచిన గాని బయటపడునే నిప్పురవ్వ!
చప్పట్ల శబ్దము రెండు చేతులు గలిసినగాని యగునె!
చిప్పటిల్లు విషయవాసనలే తల్లి దాని కర్తయె తండ్రి దలప,
తప్పులన్నవి అంతరంగంబుననో బహిరంగంబుననో – మంకుతిమ్మ!

292.
దిద్దుకొనుము నిన్ను నీవు జగమును దిద్దు కార్యమటుంచి
దిద్దుటకొక మితి యున్నదని మరువబోకు
పెద్దగ యొక ఇంచుక పెంచగలవు శరీరమును సాము జేసి
స్పర్ధి కాగలవే త్రివిక్రమునకు – మంకుతిమ్మ!

293.
ధర లేనిదె గిరియు లేదు, నీడ లేక వెలుగు లేదు
మరణంబు లేక జననంబు లేదు, జీవనంబు లేదు
బరగ, గుణోన్నతులకు నిమ్న గుణంబులున్ ఎదురుండు; కడలి
తెరలు పతనమైన మరల లేచు గాదె – మంకుతిమ్మ!

294.
ఉప్పు కొంత, పులుపు కారము తీపి కొంత
ఒప్పుగ నుండెడి భోజనమే జీవితంబును
తప్పు, ఒప్పు; మడ్డి, దొడ్డ; అంద, అనాకారి;
ఇప్పట్టున చేరిననే జీవనము – మంకుతిమ్మ!

295.
కించిత్లోపమున్నను సహింపక కోపించు గుణశాలి,
ఎంచగ గురువింద గింజ నలుపును జూచి యాగ్రహింప దగునె,
మంచిగ తెలియుము నీ స్వేదమది ఉప్పో మరేదియో, తెలిసి
యోచింపుము యా బ్రహ్మమును – మంకుతిమ్మ!

296.
కనికరపూరిత నేత్రాంతరంబున, కఠిన మాటల యందు
లేని క్రూరత యది కాననగు, నొకచో కరవాలమునకు బెద
రని క్రూర హృదయమది కరుణకు కరగి పోవు; ఎన
లేని మనో వికారంబులివి – మంకుతిమ్మ!

297.
ఉత్తమ గుణంబులు నూరారని శాస్త్రములు వక్కాణించినను
ఉత్తమోత్తమ గుణంబులవి రెండు: యతి కఠినములవి
యుక్తమైనవి; దోషిని క్షమించు గుణంబును, నిర్మత్సరత్వమును
యుత్తమ బ్రాహ్మికాభ్యసనంబులవి – మంకుతిమ్మ!

298.
పాదరసము వోలె చంచలము మానవ స్వభావము
కదలక పదిలంబుగ నుండెడి కుడ్యము, దూలమును గాదు
సాధన శపథంబుల చేత నద్దాని నిలువరించ వలనుగాదు
సాధ్యమైనంత దాని సైరింప వలె – మంకుతిమ్మ!

299.
స్థాన మెక్కడీ మనుజ ప్రపంచాన హఠవాదంబునకు
ఎన్నగ సత్యాసత్యములు రెండును మిశ్రమములై యున్నవి,
మన్నిక ఎక్కడిది ఇసుకతో కట్టిన గోడకు! కూలిపోవదే
కాన, కఠినత చెల్లదు జగమున – మంకుతిమ్మ!

300.
విరిదోట పూచిన పువ్వుల నవ్వులవి ప్రకృతి కందము
భార్య తన కురుల తురిమిన విరులు సఖున కందము
అరుదైన విరులు దేవుని కర్పింప యది భక్తికానందము
అరయ పూలమ్మికిచ్చు పణము దానికి ముదము – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)