back to top
Home Blog Page 14

సంచికలో 25 సప్తపదులు-26

0

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
రమణీయం
స్మరణీయం
రాముని చరితం యుగయుగాలకు ఆదర్శం, అవిస్మరణీయం!

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి

2
చేతన
వేతన
హాలికులైనా, కందమూలాదులు తిన్నా, భాగవతోత్తముడు పోతన

ఉమాదేవి పోచంపల్లి గోపరాజు
రిచ్మండ్, టెక్సస్, యు.ఎస్.ఎ.

3
జ్ఞానం!
అజ్ఞానం!!
జీవితంలో అభివృద్ధికి కావాలి పరిసరాల పరిజ్ఞానం!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ

4
బాలుడు
భూపాలుడు
అందరివాడైనా, అందరికీ సులువుగా అందనివాడు గోపాలుడు..!!

శ్రీమతి భారతీకృష్ణ
హైదరాబాద్

5
ఒప్పదు
నప్పదు
అత్యాశకు పోతే బోర్లా పడక తప్పదు

రాయవరపు సరస్వతి
చోడవరం, అనకాపల్లి జిల్లా

6
కాలం
గాలం
స్త్రీలపై గృహహింసకు కారణం పురుషాధిక్యత భావజాలం!

డాక్టర్ శైలజ మామిడాల
హనుమకొండ

7
శేషం
విశేషం
కొన్ని జీవిత కథలు ఎప్పటికీ సశేషం

శేష శైలజ(శైలి),
విశాఖపట్నం

8
అవమానం
స్వాభిమానం
ఈ సమాజంలో మంచి చెప్పే వారిపైనే అనుమానం

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

9
గాత్రము
పాత్రము
మానవత్వమే మనిషి సుఖజీవనానికి సరైన సూత్రము

సింహాద్రి వాణి
విజయవాడ

10
హితము
నిరతము
ఉన్నతి సాధించిన జీవితము ఆనంద భరితము

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

11
ప్రచారం
విచారం
ఒకరి గురించి మననుండి కారాదు అనాచారం.

శ్రీమతి ఎస్.కమలా దేవి
మాదాపూర్.హైదరాబాదు.

12
బ్రతుకు
చితుకు
సమస్యలకు కృంగక స్ధిరచిత్తంతో పరిష్కారం వెతుకు

జె.విజయకుమారి
విశాఖపట్నం

13
కుదురు
అదురు
ఎక్కడైనా, ఎలాఉన్నా కొందరు కావచ్చు ముదురు.

డాక్టర్. షహనాజ్ బతుల్
హైదరాబాద్

14
తరంగం
అంతరంగం
నిర్ణయాలకు మదిలోని సంఘర్షణ కనబడని రణరంగం

వి నాగమణి
హైదరాబాద్

15
చేదోడు
వాదోడు
మనకు జీవితాంతం కొనసాగే రక్తసంబంధం సైదోడు

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

16
పొలికట్టు
తలకట్టు
మూర్ఖులను విడిచిపెట్టు ఒక్క పండితునితోనైనా జతకట్టు

అంజనీ దేవి శనగల
విశాఖపట్నం

17
పాలు
పాపాలు
శ్వేతవిప్లవంతో భారత్ అగ్రస్థానం నేడు కల్తీపాలు

అచ్యుతుని రాజ్యశ్రీ
హైదరాబాదు

18
తాళము
మేళము
పిల్లలు కలిస్తే చేస్తారు ఇల్లంతా గందరగోళము

కానుకొలను లక్ష్మీ సీత
హైదరాబాదు

19
కలిసికట్టు!
గొలుసుకట్టు!!
అవగాహనతో సమస్య, తాలూకు పరిష్కారాన్ని ఒడిసిపట్టు!!!

ఎమ్మెస్సార్ షణ్ముఖ ప్రియ
విజయవాడ

20
ఉపకారం
మమకారం
అంతా మనదనుకుంటే ఆనందం – నాదనుకుంటే అహంకారం

సుధాస్వామి
విశాఖపట్నం

21
తిరస్కారం
పురస్కారం
ప్రపంచమంతా అనుకరిస్తున్నది మన అభివాదమైన నమస్కారం

బెన్నూరి వనజాక్షి
హైదరాబాద్

22
వారు
వీరు
నోరు మంచిది కాకపోతే అనాథలుగా మిగులుతారు..

పంతుల లలిత-నీలాంజన
విశాఖపట్నం

23
ఇష్టము
కష్టము
జీవితమంటే సుఖదుఃఖాల సంగమం అన్నది స్పష్టము

డి.రమా సత్యా దేవి.
కొలకత్తా

24
జతకన్నులు
జడకన్నులు
న్యాయన్యాయాలు చూస్తుంటాయి, నిజంచెప్పలేని మూగకన్నులు

జి.శైలమ్మ
కుప్పం

25
వరి
జనవరి
సంకురాత్రి నాటికి రైతన్నల చేతుల్లో సిరి!!

నమ్మి ఉమాపార్వతీ నాగ్,
చెరుకువాడ.

~

(మళ్ళీ కలుద్దాం)

వెన్నెల అడవిది!

0

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘వెన్నెల అడవిది!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]


~
[dropcap]అ[/dropcap]డవి కాచిన వెన్నెల అని ఎందుకంటావు నువ్వు?
పచ్చని.. అవ్యక్త .. బీభత్స.. సమ్మోహక సౌందర్యంతో నిండిన
అడవిలో వెన్నెల వర్షించకూడనిది ఎందుకయ్యింది?
అడవి వెన్నెలని ప్రేమించకూడనిది.. పరాయిదీ ఎందుకయ్యింది?
వెన్నెల నీ ఇంటిమీదో.. నీ మీదో..
నగరంలో మాత్రమే కురవాలని నువ్వెలా చెబుతావు?
చంద్రుడికీ.. అడవికీ మధ్య జల్లెడనెందుకు పడతావు?
వెన్నెల దిశని ఎందుకు మళ్లిస్తావు??
***
వెన్నెల అడవి మీద మాత్రమే..
అడవి లోపల.. మాత్రమే పరుచుకోవడానికి ఇష్టపడుతుందేమో?
వెన్నెలకీ అడవంటేనే ప్రేమేమో.. మోహమేమో?
పాములు.. తోడేళ్ళు ఉంటాయంటావా, ఉండనీ..
వాటినీ స్పష్టంగా చూపిస్తుంది.. వెన్నెల కదా మరి?
వెన్నెల అడవితో పాటు వాటినీ ప్రేమిస్తుంది.
నీకు తెలీదు.. అడవి వెన్నెలను కొత్తగా నిర్వచిస్తుంది.
లేకపోతే వెన్నెలే అడవికి కొత్త రంగునద్దుతుంది!
అడవి యుగాల దాహంతో వెన్నెలను తాగేస్తుంది..
తనలో తాదాత్మ్యం చేసుకుంటుంది.
అడవి వెన్నెలని ఆవాహనం చేసుకుంటుంది.
అడవి వెన్నెల దుప్పటిని కప్పి
క్రూరమృగాలను మచ్చిక చేసుకుంటుంది.
***
అవును.. నువ్వనే అడవి కాచిన వెన్నెల…
మోదుగ పూలకి మెరుపునిస్తుంది.
వెన్నెల, కనిపించని రుధిర సరస్సులని
ఈ లోకానికి చూపిస్తుంది.
వెన్నెల దారి దీపంలా అమరత్వాన్ని
అడవి శిఖరం మీద వెలిగిస్తుంది.
రాత్రి అడవి కాచిన వెన్నెల
తెల్లవారేకల్లా కొత్త సూర్యుళ్ళను కంటుంది.
అడవి కాచిన వెన్నెలేం చేస్తుందో తెలుసా..
అడవి కన్న రహస్యపు స్వప్నాలను
అరణ్యాన్ని దాటిస్తుంది.
వెన్నెల ఇంకా ఏం చేస్తుంది..
అడవిని ఆదివాసీ నృత్య డమరుకాలతో..
భయద సౌందర్యవంతురాలిని చేస్తుంది.
వెన్నెల అడవికి పుస్తకాలని ఇస్తుంది.
పలక మీద అక్షరాలని దిద్దిస్తుంది.
వెన్నెల.. అడవి తనదైన రాజ్యాన్ని నిర్మించుకోవడం
కళ్ళారా చూస్తూ పులకరిస్తుంది.
అందుకే.. వెన్నెల అడవిన కాచిందని అని వాపోకు!
చంద్రుడు నేరుగా వెన్నెలను అడవి మీదే గుమ్మరిస్తాడు!
వెన్నెల అడవి మీదే కాయాలి!
వెన్నెల అడవిది మాత్రమే!
వెన్నెల అడవిని ఎన్నడూ మనిషిలా మలినపరచదు!
గుర్తు పెట్టుకో..
అడవి కాచిన వెన్నెల ఎప్పటికీ వృథా కాదు!

గోలి మధు మినీ కవితలు-34

0

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. ప్రతిబింబం

గంతలు విప్పిన
న్యాయ దేవత
కంటి పాపలో
నిరపరాధుల
చిత్రాలు ప్రతిబింబించేనా!

~

2. అనిత్యం

ఈరోజు రేపయ్యే క్షణాన
తీసుకున్న
ఉచ్ఛ్వాస నిశ్వాసగా పిల్లనగ్రోవిలో
నీ నామామృతాన్ని
గానం చేస్తుంది
వినిపిస్తుందా!

~

3. సవరం

దేశం నెత్తికి
అప్పుల సవరం
ప్రశ్నల సమరంతో
సవరించేదెందరో!

~

4. మనిషి

మనో సంకెళ్ళపై
స్వేచ్చా సంతకం చేసుకుని
పెంచుకున్న
రెక్కల్ని తుంచుకుని
తుంచుకున్న రెక్కల్ని
మొలిపించుకునే విహంగం

నమస్కారం

0

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘నమస్కారం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నీ[/dropcap] నమస్కారానికి
ప్రతి నమస్కారం రాలేదని
చిన్నబుచ్చుకోకు
చింతించకు

కనిపించినప్పుడల్లా
నమస్కరిస్తూనే ఉండు

అతని ఆలోచనలో
అతని అంతరాత్మలో
ఇక నిరంతరం
పరిభ్రమిస్తూనే ఉంటావు

ఏదో ఒకనాడు
నీ సంస్కారం ముందు

అతని అహం
పటాపంచలవుతుంది
నమస్కారం
మానవతా సంస్కారం

క్రమశిక్షణ..

0

[శ్రీ మరింగంటి శ్రీకాంత్ రచించిన ‘క్రమశిక్షణ..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ప్రా[/dropcap]రంభమూ, ముగింపు రెండూ ప్రాధాన్యాలే
ఏదీ లోపభూయిష్టం కారాదు
రసవత్తర ఘట్టాలన్నీ రంజింప జేసేదంతా మధ్య లోనే
చావు పుట్టుకలన్నీ నిజాలే
నట్టనడిమి బతుకే ఓ నాటకము
పాత్రోచితంగా అభినయిస్తేనే ప్రేక్షక కరతాళ ధ్వనులు
పలువురి మన్ననలు
బాల్యం పెద్దల బుద్ధులతో గడిపినా
కౌమారం వివిధ శిక్షణ లతో అడుగిడినా
యవ్వనానికి మాత్రం పూర్తి స్వేచ్ఛనందించకు
అతుకుల, గతుకుల సవాలక్ష దారులన్నీ అగుపడుతుంటాయి,
రా.. రమ్మని పిలుస్తాయి
ఏ దారి నిన్ను గమ్యం చేర్చగలదో దాన్నే ఎంచుకోవాలి
గతాన్ని, భవిష్యత్‌ను బేరీజు వేసుకుని
వర్తమానపు బాటలో ముందడుగు వేయాలి
లక్షణమైన గుణంతో సలక్షణ జీవితం ముందుంది
ఆలోచించి అవలోకనం చేసుకుంటే
కన్నకలలతో కన్నవారికి పుత్రోత్సాహం కలుగు..

వెలుగు దివ్వెల విత్తనాలు..!

0

[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘వెలుగు దివ్వెల విత్తనాలు..!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కసారి ఆకుపచ్చని సముద్రమైన
దట్టమైన అడవిలోకి వెళ్ళాను
అపూర్వమైన స్వాగతం పలికింది
గాయాలతో గూడు చెదిరిన
జీవుల గాథలను వినిపించింది..!

ఒకానొక సమయాన నది తీరానికి వెళ్ళాను
వడి వడిగా ఒడ్డును తాకుతున్న అలలు
చిరునవ్వులతో పలకరించాయి
అవిశ్రాంతమైన నది యానాన్ని గూర్చి
బోధకుల్లా విశ్లేషణాత్మకంగా చెప్పినవి..!

సాయంత్రమోసారి రోడ్డు మీదికి వెళ్ళాను
ఆత్మీయులైన మిత్రులందరు
ఆనందోత్సాహాలతో కరచాలనం చేశారు
అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన జ్ఞాపకాలను
కుప్పగా పోసి కానుకగా అందించారు..!

ప్రత్యేకమైన రోజున పాఠశాల ఆవరణలోకి
అలుపులేని బాటసారిలా అడుగుపెట్టాను
చెట్ల కొమ్మలు ముక్తకంఠంతో ఆహ్వానించాయి
చెరిగిపోని పాద ముద్రల్ని తడుముతుంటే
రాలిపోయిన క్షణాలు హత్తుకున్నాయి..!

ఒక గాఢాంధకారమైన రాత్రిలో రహదారి పైన
చంద్రోదయ కిరణంలా వెళ్ళుతున్నాను
మెరుస్తున్న నక్షత్రాలు కౌగలించుకున్నాయి
వెలుగు దివ్వెల విత్తనాలను చల్లుకుంటూ
శాంతిమంత్రాన్ని జపిస్తూనే సాగమన్నాయి..!

మహాభారత కథలు-85: దివ్యక్షేత్రాల వర్ణన – దర్శన ఫలము-2

0

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

పుణ్యక్షేత్ర దర్శనం- దర్శన ఫలము-2

‘బ్రహ్మతీర్థం’లో స్నానం చేసిన ఇతర వర్ణాలవాళ్లు బ్రాహ్మణులవుతారు. అక్కడ బ్రాహ్మణులు స్నానం చేస్తే బ్రహ్మలోకం కలుగుతుంది.

మంకణుడు అనే బ్రహ్మఋషి దర్భ పట్టుకున్నప్పుడు అతడి చేయి తెగింది. అందులోంచి ఆకుకూర ద్రవం కారింది. సంతోషంతో ఆ ముని నృత్యం చేయడం మొదలుపెట్టాడు.

మంకణ మహాముని ఆపకుండా చేస్తున్న నృత్యాన్ని చూడలేక దేవతలు, మునులు శివుడి దగ్గరికి వెళ్లి “మహాదేవా! మంకణమహాముని నృత్యం ఆపేట్లు చెయ్యి” అని మొరపెట్టుకున్నారు.

శివుడు ఋషి వేషంలో వెళ్లి “మహర్షీ! నువ్వు ఆపకుండా ఎందుకు నృత్యం చేస్తున్నావు? నువ్వు చూసిన వింత ఏమిటి? నీకు చెప్పాలని అనిపిస్తే చెప్పు” అన్నాడు.

మంకణమహర్షి “నా చేతి నుంచి శాకద్రవం వస్తే ఆశ్చర్యంతో ఆనంద తన్మయత్వంతో నృత్యం చేస్తున్నాను” అన్నాడు.

ఋషి రూపంలో ఉన్న శివుడు “అది కూడ వింతేనా?” అంటూ తన బొటనవేలిని వేలితో కొట్టాడు. అందులోంచి మంచులా తెల్లగా బూడిద రావడం కనిపించింది.

మంకణమహాముని సిగ్గుపడి “నువ్వు మహేశ్వరుడివి” అని నమస్కరించి వేదమంత్రాలతో ప్రస్తుతించాడు. “దేవా! నాకు ఇంకా తపస్సు చేసుకోగలిగే శక్తిని ప్రసాదించు” అని ప్రార్థించాడు. ఈశ్వరుడు కరుణించి “నీకు తపోవృద్ధి కలుగుతుంది. నేను నీ ఆశ్రమంలోనే ఉంటాను” అని చెప్పాడు.

అలా ఏర్పడిన ‘సప్త సారస్వతాల’ అనే తీర్థంలో స్నానం చేస్తే సారస్వతంలో సమగ్రప్రాప్తి కలుగుతుంది. బ్రాహ్మాదిదేవతలతో అధిష్టింపబడిన ‘ఔశనసము, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయ’ మనే తీర్థాల్లో స్నానం చేస్తే పాపాలనుంచి విముక్తి కలిగి సత్యలోకాన్ని పొందుతారు.

వేదాల్లో చెప్పబడిన ‘పృథూదకతీర్థం’ దేవేంద్రుడు మొదలైన దేవతలకీ, వ్యాసుడు మొదలైన యోగులకి నివాసస్థలం (నెలవు) కనుక గొప్ప పుణ్యతీర్థం. అక్కడ దేహం విడిచినవాళ్లకి పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. బ్రాహ్మణులు సంపూర్ణ యోగులవుతారు.

‘గంగానది సరస్వతి’ కలిసేచోట స్నానం చేస్తే బ్రహ్మహత్యపాతకం వంటి పాపాలు పోతాయి. దర్భి నిర్మించిన ‘అర్ధకీల’ తీర్థంలో స్నానం చేస్తే శూద్రులు బ్రాహ్మణులవుతారు. ‘శతం, సహస్రం’ అనే తీర్థాల్లో చేసిన జపాలు, దానాలు, ఉపావాసాలు లక్ష పుణ్యాలు ఇస్తాయి.

‘తైజసము’ అనే తీర్థంలో దేవతలందరు కలిసి శ్రీ కుమారస్వామిని సేనాపతిగా పెట్టారు. దాన్నీ, దానికి తూర్పువైపు ఉన్న ‘కురుతీర్థాన్ని’, ‘స్వర్గద్వారం’ అనే తీర్థాన్ని చూసినవాళ్లకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

‘రుద్రపత్ని’ అనే తీర్థంలో శివకేశవుల్ని అర్చిస్తే అన్ని దుఃఖాల నుంచి విముక్తి దొరుకుతుంది. ‘స్వస్తిపురం’ అనే తీర్థం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వేయి ఆవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుంది. ‘గంగమడువు’ అనే తీర్థంలో ఒక నూతిలో మూడుకోట్ల తీర్థాలు చేరి ఉంటాయి. అందులో స్నానం చేస్తే తీర్థాలన్నింటిలోను స్నానం చేసిన పుణ్యం వస్తుంది.

‘బదరీవనం’ అనే తీర్థంలో వశిష్ఠాశ్రమం అనే తీర్థంలో మూడు రాత్రులు రేగుపండ్లు తింటే పాపాలు పోతాయి. ‘ఏకరాత్ర’ అనే తీర్థంలో ఒకరాత్రి ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది. ఆదిత్యాశ్రమం అనే అరణ్యంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోకప్రాప్తి కలుగుతుంది.

‘దధీచ’ తీర్థంలో కన్యాశ్రమంలో మూడురాత్రులు నివసించినవాళ్లకి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. బ్రహ్మదేవుడు, దేవతలు, మునులు, సిద్ధులు, గరుడులు, పాములు అనే జాతులకి చెందిన దేవతలు, భూమిమీద ఉన్న సన్నిహిత అనే పేరుతో విలసిల్లే తీర్థాన్ని ప్రతి నెల దర్శిస్తారు. సూర్యగ్రహణకాలంలో ‘సన్నిహిత’ లో స్నానం చేసినవాళ్లు నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం పొందుతారు.

యమధర్మరాజు తపస్సు చేసిన ‘ధర్మతీర్థం’లో స్నానం చేస్తే ధర్మస్వభావం కలిగి ఉంటారు. ‘జ్ఞానపావనం, సౌగంధిక’ అనే తీర్థాల్లో స్నానం చేసినా, దర్శించినా సర్వ పాపాలనుంచి విముక్తులవుతారు. ‘దేవశ్రవ’ మనే సరస్వతీ హ్రదంలో ఉన్న పుట్టనుంచి వెలువడే జలప్రవాహంలో స్నానం చేసి పితరులకి శ్రాద్ధకర్మలు నిర్వహించినవాళ్లు అశ్వమేధయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.

‘సుగంధ, శతకుంభ, పంచయక్ష, త్రిశూలఖా’ అనే తీర్థాల్లో స్నానం చేస్తే నరకబాధ ఉండదు. పూర్వం పార్వతీదేవి శాకాహారం తీసుకుని దేవమానం ప్రకారం వేయి సంవత్సరాలు తపస్సు చేసిన ‘శాకాంభరి తీర్థం’ లో ఒకరోజు శాకహార వ్రతం నిర్వహిస్తే పన్నెండు సంవత్సరాలు శాకాహార తపస్సు చేసిన పుణ్యం పొందుతారు.

‘సువర్ణం’ అనే తీర్థంలో శివుణ్ని అర్చిస్తే కైలాసం సిద్ధిస్తుంది. ధూమావతి అనే తీర్థంలో రథావర్తం, ధార అనే తీర్థంలో స్నానం సేసినవాళ్లు దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు. మునులతో సేవించబడేది, స్వర్గానికి ప్రవేశద్వారమయిన ‘గంగాద్వారం’ అనే క్షేత్రంలో స్నానం చేసిన ధన్యులకి నూరుకోట్ల తీర్థాల్ని సేవించిన భాగ్యం దక్కుతుంది.

‘సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం’ మొదలైన పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తే పుణ్యలోకాలు; భద్రకర్ణేశ్వరంలో రుద్రపూజ, అరుంధతి నాటిన మర్రిచెట్టు గల స్థలం, అరుంధతీవటం, సింధునది పుట్టినచోటు, యమున పుట్టినచోటు వంటి పుణ్యస్థలాలు సేవిస్తే సర్వసిద్ధులు; ’వేదిక, ఋషికుల్య, కృత్తిక, మఘ, విద్య, వేతసి’ అనే తీర్థాల్ని సేవిస్తే పాపాలు పోతాయి.

‘బ్రహ్మతీర్థం’ లో స్నానం చేస్తే పద్మవర్ణం కల విమానంలో సత్యలోకానికి చేరుకుంటారు.

నైమిశంలో మహాభారత పురాణ ప్రవచనం సత్రయాగసందర్భంగా పన్నెండు సంవత్సరాలు జరిగింది. భారతీయ వాఙ్మయంలో సుప్రసిద్ధమైన క్షేత్రమహత్య ప్రవచనాలు; వ్రతాలు ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు వంటి ప్రబోధాలు జరిగాయి. ఈ విధంగా నైమిశానికి భారతీయ సాహిత్యంలో సాటిలేని గొప్పతనం ఏర్పడింది.

గంగానది ఉద్భవించిన స్థలం ‘గంగోద్భేదం’ అనే తీర్థం, ‘ఇందీవర’ తీర్థం, గంగానది భూమికి దిగిన గంగాద్వారం అనే ‘హరిద్వార’ తీర్థం, ‘దిశాపతి’ తీర్థాల్లో స్నానం చేస్తే వాజపేయయాగం చేసిన పుణ్యం కలుగుతుంది. ‘బహుద’ అనే తీర్థంలో స్నానం చేస్తే అనేక సత్రయాగాలు చేసిన పుణ్యం కలుగుతుంది.

శ్రీరాముడు స్వర్గాన్ని చేరిన సరయూనది ప్రదేశంలో ‘గోప్రదానము’ అనే పేరుగల పుణ్యతీర్థంలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యాన్ని ఆర్జిస్తారు. ‘కోటితీర్థం’ లో శ్రీకుమారస్వామిని ఆరాధించినా, కాశీలో శివుడిని పూజించినా, ‘కపిలహ్రదం’లో స్నానం చేసినా రాజసూయయాగం చేసిన పుణ్యం దొరుకుతుంది.

మార్కండేయమహర్షి నిర్మించిన ‘గంగా గోమతి సంగమం’ అనే క్షేత్రంలో స్నానం చేసినా, బ్రహ్మ నిర్మించిన యూపస్తంభానికి ప్రదక్షిణ చేసినా వాజపేయయజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది.

ధర్మరాజా! ఎక్కువమంది కొడుకులు కలగాలని అందులో ఏ ఒక్కడైనా గయకు వెడతాడా అని, అశ్వమేధయాగం చేస్తాడా అని, తెల్లని ఆబోతుని దానంగా విడిచిపెడతాడా అని నిర్మలమైన హృదయం కలిగిన గృహస్థు కోరుకుంటాడు.

అటువంటి పుణ్యక్షేత్రమైన గయకి వెళ్లి ఒక నెల రోజులు నివసిస్తే తండ్రివైపువాళ్లని, తల్లివైపువాళ్లని ఉద్ధరించినవాళ్లవుతారు. అక్కడ పిండప్రదానం చేస్తే దేవతల దయవల్ల చరితార్థులవుతారు. అక్కడ ఉన్న ‘ఫల్గుతీర్థం’ లో స్నానం చేసినవాళ్లకి గొప్ప పుణ్యఫలంతోపాటు అభ్యున్నతి కూడా కలుగుతుంది.

‘యక్షిణీ’ తీర్థంలో నీళ్లని తాగితే బ్రహ్మహత్య మొదలైన పాపాలనుంచి విముక్తులవుతారు. ’ ‘మణినాగం’ అనే తీర్థంలో స్నానం చేసినవాళ్లకి సర్పాల వల్ల హాని కలుగదు. గౌతమవనంలో ‘అహల్యాహ్రదం’ లోను, ‘ఉదపాన’ అనే తీర్థంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం కలుగుతుంది.

రాజర్షి జనకుడి పేరుమీద వెలిసిన ‘జనకకూపం’లో స్నానం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ‘కంపన, మహానద’ అనే తీర్థాల్లో స్నానం చేసినవాళ్లు పౌండరీక యాగం చేసిన ఫలితాన్ని, ‘దేవపుష్కరిణి, మహేశ్వరధర, మహేశ్వరపద’’ నీటిలో స్నానం చేసినవాళ్లకి అశ్వమేధయాగం చేసిన ఫలం పొందుతారు.

పూర్వ కాలంలో ఒక రాక్షసుడు తాబేలు రూపంలో కోటితీర్థాల్ని దొంగిలించాడు. విష్ణుమూర్తి వాటిని తెచ్చి మహేశ్వరపథంలో ఉంచాడు. ఆ నీటిలో స్నానం చేస్తే, విష్ణుస్థానమైన ‘సాలగ్రామం’ అనే తీర్థంలో స్నానం చేసి విష్ణువుని పూజిస్తే, అందులో నాలుగు సముద్రాలు చేరిన నూతిలో స్నానం చేస్తే వైకుంఠానికి వెడతారు.

భరతాశ్రమంలో చంకారణ్యంలో దేవీసమేతుడైన శివుడిని పూజిస్తే మిత్రావరుణలోకం పొందుతారు. ‘కన్యాసంవేద్యం’ అనే తీర్థంలో కన్యాదానం చేస్తే అక్షయపుణ్యం లభిస్తుంది. ‘దేవకూటం’ అనే తీర్థంలో స్నానం చేస్తే సత్యలోకం సిద్ధిస్తుంది.

విశ్వామిత్రుడు తపస్సిద్ధి పొందిన ‘కౌశికహ్రద’ లో స్నానం చేస్తే, ‘కుమార వీరాశ్రమం’ లో ఒక నెల నివసిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. ‘అగ్నిధార’ అనే తీర్థంలోను బ్రహ్మసరస్సునుంచి పుట్టిన ‘కుమారధార’ అనే తీర్థాల్లో స్నానం చేసి మూడు రాత్రులు ఉపవాసం చేసినవాళ్లు బ్రహ్మహత్య మొదలైన పాపాలనుంచి విముక్తులవుతారు.

గౌరీశిఖర కుండంలోను, నందినీకూపంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. ‘కాళిక, కౌసిక’ అనే తీర్థాలు కలిసినచోట మూడురాత్రులు ఉపవాసం చేసినవాళ్లు అన్ని పాపాలనుంచి విముక్తులవుతారు. ’ఊర్వశీ’ తీర్థంలో స్నానం చేసినవాళ్లు పూజలన్నింటికీ యోగ్యులవుతారు.

‘గోకర్ణ తీర్థం’లో స్నానం చేసినవాళ్లకి పూర్వజన్మస్మృతి లభిస్తుంది. సరస్వతీ తీర్థంలో స్నానం చేసినవాళ్లు, వృషభద్వీపంలో కుమారస్వామిని అర్చించినవాళ్లు దేవతల విమానాలని అధిరోహిస్తారు.

‘నంద, ఔలకం, కరతోయం, గంగాసాగరసంగమ’’ అనే తీర్థాల్లో స్నానం చేసినవాళ్లు నూరు అశ్వమేధయాగాల్ని చేసిన పుణ్యం పొందుతారు. ‘శోణనది, నర్మదానది’ పుట్టిన చోట్లో ‘బదరీతీర్థం’ లో స్నానం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.

‘మహేంద్ర, రామతీర్థ, మతంగ, కేదార, వంశ, గుల్మల’ అనే తీర్థాల్లో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యాన్ని పొందుతారు.

పుణ్యక్షేత్రాల్లో గొప్పదైన శ్రీశైలంలో గల ‘దేవహ్రదం’ అనే మడుగులో స్నానం చేసి, ఆదిదేవుడైన శివుడిని పూజిస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది.

పూర్వం దేవహ్రదలో ఇంద్రుడు నూరుయాగాలు చేశాడు కనుక మిగుల పవిత్రమైన కృష్ణవేణిలో ఉన్న దేవహ్రదం తీర్థంలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి. పాండ్య పర్వతంలో ఉన్న కావేరీ తీర్థంలో, తుంగభద్రలోను, సముద్రతీర్థంలోను, ఆ సమీపంలో ఉన్న కన్యకుమారీ తీర్థంలోను స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం దక్కుతుంది.

గాయత్రీస్థానంలో మూడురాత్రులు గాయత్రీ మంత్రజపం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. ‘పెన్న’ అనే మహానదిలో స్నానం చేస్తే నెమలి, హంస రూపాలతో ఉన్న విమానాల్లో విహరిస్తారు. గోదావరీ స్నానం చేస్తే పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం దక్కుతుంది.

పయోష్ణితీర్థంలోను, దండకారణ్యం, శరభంగాశ్రమం, శుక్రాశ్రమం, జమదగ్ని మహర్షి సేవించిన శూర్పారకం, దక్షారామ క్షేత్రంలో సప్తగొదావరీ తీర్థ’ లోను స్నానం చేసిన పుణ్యాలకి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి.

రాక్షసుల భయంతో అణిగిమణిగి ఓకారం మొదలైన వేదాలని ఉద్ధరించి, అంగిరసుడు, సారస్వతుడు మొదలైన ముఖ్యులతో ఎక్కడ చదివించాడో, భృగుమహర్షి దేవతలతో నియోగింపబడి ఎక్కడ యజ్ఞం చేశాడో అటువంటి అందమైన తుంగకారణ్యాన్ని గౌరవపూర్వకంగా చూస్తే చాలు పాపాలన్నీ పటాపంచలౌతాయి.

కాలంజరము అనే పర్వతంలో ఉండే దేవహ్రదంలో స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ‘మేధికం’ అనే తీర్థంలో స్నానం చేస్తే మేధావులవుతారు. చిత్రకూటంలో మందాకినిని సేవించి, పితృస్థానంలో కుమరస్వామిని పూజించి, అగ్రస్థానంలో శివుడిని అర్చించి, శ్రీరామచంద్రుడు ఒకరోజు నివసించిన శృంగిబేరపురంలో గంగాస్నానం చేసి, శివుడిని అర్చించిన వాళ్లకి పాపాలన్నీ పోతాయి.

ప్రయాగ బ్రహ్మదేవుడి యజ్ఞవేదిక. అందులో నిరంతరం మూడు అగ్నికుండాల్లో త్రేతాగ్నులు వెలుగుతూ కనిపిస్తాయి. అంతేకాదు, వేదాలు, యజ్ఞాలు సాకారాలై అరవైకోట్ల పదివేల తీర్థాలు కలిసి చేరి, గంగా యమునా సంగమంలో ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తూ ఉంటాయి. అక్కడ స్నానం చేసినవాళ్లు రాజసూయ అశ్వమేధ యాగాలు చేసినవాళ్లకి, సత్యవ్రతం ఆచరించేవాళ్లకి, చతుర్వేదాలు అధ్యయనం చేసేవాళ్లు పొందే పణ్యలోకాల్ని పొందుతారు.

వివరంగా తీర్థాల్ని గురించిన వర్ణన చదివిన, ఆలకించిన ధన్యులైన సజ్జనులకి మంచి జరుగుతుంది. సమస్త తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం, అనేక క్రతువులు చేస్తే కలిగే పుణ్యం దక్కుతుంది.

వ్రతాలు చెయ్యనివాళ్లు, ఉపవాసాలకి విముఖత చూపించేవాళ్లు, చెడ్డవాళ్లు, శుచిత్వం లేనివాళ్లు తీర్థయాత్రలు చేయలేరు. నువ్వు మంచి గుణాలు కలిగినవాడివి, అన్ని ధర్మాలు తెలిసినవాడివి. కనుక తీర్థాలు సేవించి వస్తే నీ కోరికలు నెరవేరుతాయి.

పులస్త్యమహర్షి చెప్పిన పుణ్యతీర్థాల వృత్తాంతం విని భీష్ముడు అన్ని పుణ్యతీర్థాలు సేవించి ధన్యుడయ్యాడు. ధర్మరాజా! నువ్వు కూడా తీర్థయాత్రలు చేసి పూరుడిలా, పురూరవుడిలా, భగీరథుడిలా, శ్రీరాముడిలా కర్తవ్యాల్ని నెరవేర్చి ఈ భూమిని కాపాడు.

రోమశుడు అనే దేవఋషి నీ దగ్గరికి వస్తాడు. ఆ మహర్షి చెప్పినట్టు నీ పురోహితుడు ధౌమ్యుడి అనుమతి తీసుకుని తీర్థయాత్ర చెయ్యి” అని చెప్పి నారదమహర్షి వెళ్లిపోయాడు.

యాపిల్ కవర్లతో బొమ్మలు

0

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘యాపిల్ కవర్లతో బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఫో[/dropcap]మ్ షీట్లు ఇప్పుడు ఆర్ట్ షాపులలో దొరుకుతున్నాయి. పిల్లలకు కావాల్సిన ప్రాజెక్టులు, నోటీసు బోర్డులు, ప్యాకేజీ, పార్టీ డెకరేషన్, క్రాఫ్ట్స్ అన్నిటికీ ఫోమ్ షీట్లను వాడుతున్నారు. మేము కూడా మా ఆసుపత్రిలో నేమ్ ప్లేట్ల కొరకు ఫోమ్ షీట్లనే వాడాము. ఇందులో గ్లిట్టర్ ఫోమ్ షీట్లతో ఎన్నో బొమ్మలు తయారు చేశాను. వీటిని సులభంగా మనక్కావాల్సిన ఆకారంలోకి కత్తిరించుకోవచ్చు. అందుకే క్రాఫ్ట్స్‌లో బాగా ఉపయోగిస్తున్నారు. అయితే నేను ఎక్కువగా వ్యర్థ పదార్థాలతోనే బొమ్మలు చేస్తాను కదా. ఫోమ్ షీట్లను కొనడం ఎందుకని ప్రత్యమ్యాయం కోసం చూశాను. అప్పుడే పండ్లకు దెబ్బ తగలకుండా వచ్చే వల లాంటి ఫోమ్ కవర్లు కనిపించాయి. యాపిల్, జామ, డ్రాగన్ వంటి పండ్లు ఫోమ్ వలల్లో పెట్టుబడి వస్తున్నాయి. అందుకని ఇంట్లోకి తెచ్చే పండ్ల కవర్లన్నీ తీసి దాచి పెడుతున్నాను. ఎంతో అందంగా వలలా ఉండే యాపిల్ కవర్లు అనేక రంగుల్లో సైతం లభ్యమవుతున్నాయి. నేను వాటిని దాచి రకరకాల బొమ్మలు తయారు చేస్తున్నారు. మీకూ చూపిస్తాను రండి.

మా ఇంట్లో యాపిల్స్ తెచ్చుకున్నపుడు వచ్చే ఫోమ్ కవర్లను ఒక పక్కన పెడతాను. రిలయన్స్ ప్రైష్, స్పైన్సర్, డి-మార్ట్ లలో కొన్నపుడు రంగు రంగుల ఫోమ్ కవర్లు వస్తాయి. వాటిని కూడా తెచ్చుకుంటాను. ప్రస్తుతం ఎరుపు రంగు, నారింజ రంగు యాపిల్ కవర్లను తీసుకున్నాను. సాధారణంగా అయితే తెలుపు రంగులో ఫోమ్ కవర్లు వస్తాయి. రంగుల్లో అయితే బాగుంటాయని వీటిని తీసుకున్నాను. ఇప్పుడు కవరును తీసుకుని ఒకవైపు ముడి వేయాలి. రబ్బరు బాండుతో వేయవచ్చు. ఈ ముడిని వెనక్కి తిప్పి మరల మడిచి మరొక రబ్బరు బ్యాండుతో ముడి వేయాలి. ఇప్పుడు కొద్దిగా లావు అవుతుంది. దీనిని రెండు మూడు సార్లు ముడి తిప్పినపుడు యాపిల్ ఆకారంలో వస్తుంది. ఇలా ఐదారు యాపిల్ కాయల్ని చేసుకోవాలి. ఇప్పుడొక ప్లాస్టిక్ కుండీని తీసుకొని మట్టితో నింపాలి. లేదంటే చిన్న చిన్న గులకరాళ్ళతో కూడా నింపవచ్చు. ఒక కర్ర ముక్కను తీసుకొని దానికి ఆకుపచ్చ రంగు వేసుకోవాలి. లేదా ఆకుపచ్చరంగు టేపుతో చుట్టుకోవాలి. పక్కలకు కూడా కొమ్మలు పెట్టుకోవాలి. ప్లాస్టిక్ ఆకుల్ని తెచ్చుకుని కొమ్మలకు చుట్టాలి. ఇప్పుడు ఫోమ్‌లో తయారైన యాపిల్స్‌ను తీసుకుని కొమ్మలకు అతకాలి. ఒక ఫోమ్ యాపిల్‌కు ఒకటి, రెండు ఆకులు వచ్చేలా చూడాలి.

ఇప్పుడు వంగరంగు ఫోమ్ కవర్లు తీసుకోవాలి. ఇలా రంగుల కవర్లు కావాలంటే మాల్స్‌కు వెళ్ళాలి అని అనుకున్నాం కదా! నేను అలాగే తెచ్చుకున్నాను. ఫోమ్ కవరు గుండ్రంగా ఉంటుంది, దాని మధ్యలో కాయ దూరేలా ఉంటుంది కదా! ఇలాంటి కవర్ని తీసుకుని ఒక వైపు కత్తిరించుకోవాలి. ఇప్పుడు నలుచదరపు ముక్కలా తయారవుతుంది. కత్తెర తీసుకుని ఈ ఫోమ్ ముక్కను నిలువుగా సన్నని ముక్కలుగా కత్తిరించాలి. అంటే ఒక చివరి వైపున తెగిపోకూడదు. చాలా సన్నగా కత్తిరించాలి. సన్నని చీపురు పుల్లను గానీ చెక్కపుల్లను గానీ తీసుకోవాలి. దీనికి గ్లూ రాసుకుంటా చీలికల ఫోమ్ షీటును అతికించుకోవాలి. అంటే కర్ర పైభాగం నుంచి గుండ్రంగా తిప్పుతూ అతికిస్తే కొద్ది దూరం వస్తుంది. ఇలాగే మరొక ఫోమ్ కవరును తీసుకుని సన్నని చీలికలుగా కత్తిరించుకుని మరల పుల్లకు చుట్టుకుంటూ రావాలి. రెండు కవర్లయితే సరిపోతుంది. ఇదొక పుల్ల తయారయింది కదా! సన్నని చీలికలు విడిపోయి పూల గుత్తిలాగా వస్తుంది. అలాగే మరికొన్ని పూల కొమ్మలు తయారు చేసుకోవాలి. వీటిని ఒకే రంగుతో చేసుకోవచ్చు. లేదంటే రంగు రంగుల కొమ్మలతో చేసుకోవచ్చు. గ్లూతో అతికించడం కష్టమయితే డబుల్ టేప్ తెచ్చి అతికించుకోవచ్చు ఇలా తయారైన పూల కొమ్మల్ని ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకుంటే బాగుంటుంది.

మా చిన్నప్పుడు ఇలాంటి వల కవర్లు టానిక్ సీసాలకు వచ్చేవి. దానీతో రుబ్బు రోలు అనీ, శివలింగం అనీ తయారు చేసేవాళ్ళం. అవి ప్లాస్టిక్ వలలు నేనీ మధ్య వాటితో అంట్లు తోముకునే ప్లాస్టిక్ పీచులా తయారు చేస్తూన్నారు. ప్లాస్టిక్ పీచు కొనకుండా సరిపోతున్నది. అలాగే ఇప్పుడు తెల్లని ఫోమ్ వలలతో వెడల్పైన సన్ ఫ్లవర్ లాంటి పువ్వుల్ని చేయాలను కున్నాను. ఫోమ్ వలలతో పువ్వులు తయారు చేయడం చాలా సులభం. ముందుగా కవరును కత్తిరించి నలుచదరపు భాగంగా మార్చాలి. ఆ తర్వాత ఒకవైపు మడిచి గట్టిగా ముడి వేయాలి. ఈ ముడిని తిరగేసి మరల ముడి వేయాలి. ఇప్పుడు మధ్యలో ముద్దగా ఉండి చుట్టూ ఖాళీ కవరు కనిపిస్తుంది. విరిసిన రెక్కల మధ్య ముద్దబంతి లాగా కనిపిస్తుంది ఇవి రెండు మూడు పువ్వులు చేసుకున్నా చాలు. ఫ్లవర్ వేజ్‌లో నిండుగా కనిపిస్తాయి. అందుకే చాలా సులభంగా ఐదు నిమిషాల్లో చేసేయవచ్చు.

ఇప్పుడు టెడ్డీ బేర్‌ను చేసుకుందామా! నేను ఇంతకు ముందు స్పాంజి ముక్కలతో టెడ్డీ బేర్లను చేశాను. అదే విధానంలో ఇప్పుడు ఫోమ్ కవర్లతో టెడ్డీ బేర్‌ను చేయటానికి ప్రయత్నించాను, బాగా వచ్చాయి. వీటి కోసం ఫోమ్ కవర్లను తీసుకోవాలి. ఏ రంగు ఫోమ్ కవర్లైనా వాడుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఫోమ్ కవర్లను అలాగే ఉంచాలి. ఒక ఫోమ్ కవర్ లోపలా దూర్చాలి. ఇంకో పోమ్ కవరును తీసుకుని ఆ కవర్ లోపల దూర్చాలి. ఇలా ఐదారు ఫోమ్ కవర్లను ఒక దానిలో ఒకటి దూర్చుకుంటూ రావాలి. లోపల ఖాళీ లేకుండా దూర్చుకోవాలి. ఇప్పుడు ఫోమ్ కవరు లావుగా అవుతుంది. దీనిని తల, శరీరంగా విడగొట్టాలి. కవర్ బండిల్‌కు మధ్యగా గట్టిగా మడివేయాలి. ఇపుడు తల, శరీరంగా విడిపోతుంది. తల వైపు రెండు చివర్లూ ముడులు వేయాలి. అలాగే శరీరం కింది భాగాన రెండు చివర్లూ ముడులు వేయాలి. ఇపుడు టెడ్డీ బేర్ రూపం వస్తుంది. తల భాగంలో ముక్కు, నోరు పెట్టాలి. టెడ్డీ అందగా రేవో తయారయింది.

మరో పూల కొమ్మను తయారుచేద్దాం. ఫోమ్ కవరు డైమండ్ ఆకారపు అల్లికలో ఉంటుంది. డైమండ్ ఆకారపు అల్లిక దగ్గర కత్తిరించుకుంటూ పోవాలి. ఇలా చిన్నచిన్న ముక్కలు తయారవుతాయి. రెండు ముక్కల్ని కలిపి అతికితే చిన్న పూ మొగ్గలా కనిపిస్తుంది. ఇలా రెండు రెండు ఫోమ్ ముక్కల్ని కలుపుకుంటూ వెళ్ళాలి. చాలా పూ మొగ్గలు తయారవుతాయి. ఒక చీపురు పుల్లను తీసుకోవాలి. పుల్లకు ఈ పూ మొగ్గలను అతికించుకుంటూ పోవాలి. పూ మొగ్గలను చీపురు పుల్ల చుట్టా పెట్టుకుంటూ అతకాలి. చీపురు పుల్ల చుట్టూ ఆకుపచ్చ టేప్‌ను అతికించుకుంటూ వెళ్ళాలి. అందమైన పూల కోమ్మ తయారవుతుంది. ఇలా అనేక పూల కొమ్మలు చేసుకుని ఫ్లవర్ వేజ్‌లో పెట్టుకోవచ్చు.

తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ ధ్యాన మహోత్సవం వేడుక – నివేదిక

0

[dropcap]ఆ[/dropcap]నందోత్సాహాలతో ముగిసిన తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ సిల్వర్ జూబ్లీ ధ్యాన్ మహోత్సవ్.

హ్యాపీ థాట్స్‌గా ఆదరంగా పిలవబడే తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్, శాంతిని, ఆధ్యాత్మికతను వ్యాప్తి చేసిన 25 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణపు వేడుకను రజతోత్సవ సంబరాలుగా జరుపుకుంది. 24 నవంబర్ 2024న హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఎఫ్టిసిసిఐలోని కెఎల్ఎన్ ప్రసాద్ ఆడిటోరియంలో జరిగిన సిల్వర్ జూబ్లీ మెడిటేషన్ ఫెస్టివల్ 150 మందికి పైగా హాజరైన ప్రేక్షకులను అలరించి, అద్భుతమైన విజయాన్ని సాధించింది. నేటి జీవితంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను అందరి మనసులో హత్తుకునేలా చెప్పడంలో సఫలత సాధించింది.

ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్, రచయిత, విద్యావేత్త, గౌరవనీయులు ఆకెళ్ల రాఘవేంద్ర – సంస్కార్ ది లైఫ్ స్కూల్ వ్యవస్థాపకురాలు ఆలూరి మధుమతి – ప్రముఖ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, వెల్లాల శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

శ్రీమతి శ్రీవాణీశర్మ పరిచయ కార్యక్రమంతో సభ ప్రారంభమైంది. తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్‌కు చెందిన శ్రీవాణి శర్మ, ఫౌండేషన్ యొక్క దూరదృష్టి గల వ్యవస్థాపకులు తేజ్ గురు సర్ శ్రీ యొక్క లోతైన జ్ఞానాన్ని, మానవాళి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమతో సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. బాహ్య ప్రపంచంలో సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి అంతర్గత శాంతిని సాధించడం కీలకమని ఆమె సర్ శ్రీ యొక్క తత్వాన్ని నొక్కి చెప్పారు. “మీ మొబైల్ ఫోన్లను కాసేపు పక్కన పెట్టి, ధ్యానం చేయడం ద్వారా, మనం కాస్త వ్యవధిని తీసుకొని, మన ఆలోచనలను ప్రతిబింబించి, నిజమైన ఆనందాన్ని అనుభవించవచ్చు,” అనే సర్ శ్రీ సందేశాన్ని ఆమె ఉదాహరించారు.

ధ్యానం యొక్క సారాంశం, దాని రూపాంతర ప్రయోజనాలు, ఇంకా జీవితంలోని అత్యంత ప్రాథమిక ప్రశ్న అయిన “నేను ఎవరు?” గురించి ఆలోచించడం యొక్క ప్రాముఖ్యత గురించి తేజ్ గురు సర్ శ్రీ నుండి ఒక వీడియో సందేశం ఒక ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. సభకు హాజరైన సభ్యులు 21 నిమిషాల గైడెడ్ మెడిటేషన్‌లో ఆసక్తిగా పాల్గొని, లోతైన మానసిక శాంతి,  స్పష్టత యొక్క అనుభవాన్ని చవిచూశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల యొక్క స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు ఎంతో అలరించాయి. ఈ ఆధునిక సాంకేతిక యుగంలో, మానవుడు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సమాధానం ధ్యానమేనని వారు సందేశం ఇచ్చారు. వ్యక్తి సంపూర్ణ అభివృద్ధి కోసం రోజువారీ జీవితంలో ధ్యానాన్ని ఒక ముఖ్య భాగంగా మార్చుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

శ్రీమతి శ్రావణి బాలిచెట్టి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించి, తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ యొక్క ప్రభావవంతమైన 25 సంవత్సరాల వారసత్వం ద్వారా ఆధ్యాత్మిక సాహిత్యానికి ఫౌండేషన్ చేసిన కృషిని జోడించి “జన్మలు నేర్పిన పాఠాలు ఇంకా జ్ఞాపకాల వైద్యం” పుస్తకాన్ని ఆవిష్కరించడం వేడుకలో కీలక ఘట్టం.

దాదాపు  పాల్గొన్న వారందరూ 21-రోజుల ధ్యాన ఛాలెంజ్‌ని స్వీకరించడానికి ఆసక్తి కనబరచడంతో, కార్యక్రమం యొక్క ఆశయం సఫలమైంది. ఇది సంపూర్ణత మరియు శాంతిని స్వీకరించడానికి, సామూహిక సంకల్పానికి ప్రతీక.

ఈ ఈవెంట్‌లో పాటు, తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ భారతదేశంలోని 125 నగరాల్లో ఇలాంటి వేడుకలను విజయవంతంగా నిర్వహించింది, దేశవ్యాప్తంగా శాంతి మరియు ఆనందాల వెల్లువను సృష్టిస్తోంది.

ఈ సిల్వర్ జూబ్లీ మహోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదనీ, ధ్యానం మరియు సామరస్య ప్రపంచపు దిశగా  అడుగులు పడుతున్న చారిత్రక ఘట్టమని పలువురు కొనియాడారు.

కార్తీక వైభవం ప్రవచనములు – నివేదిక

0

[నర్సీపట్నంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో పాణ్యం దత్తశర్మ ధార్మిక ప్రవచనాలు – నివేదికని అందిస్తున్నారు జెట్టి వంశీకృష్ణ.]

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం లోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలోని ప్రవచన మంటపంలో, జ్ఞాన సరస్వతీ సేవా ట్రస్టు వారి ఆహ్వనం మేరకు, పాణ్యం దత్తశర్మ, 25 నవంబరు 2024 కార్తీక సోమవారం నాడు, ‘కార్తీక వైభవం’ అన్న ప్రవచనం చేశారు. సభాధ్యక్షులుగా శ్రీ మంతెన శ్రీరామరాజు గారు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వర్రి గజ్జాలమ్మగారు హజరైనారు. పురప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, సర్వశ్రీ వడలి రామచంద్రరావు, ఉప్పల శ్రీరామ్మూర్తి మాస్టారు, అయ్యగారి భీమశంకరం మాస్టారు వేదిక నలంకరించారు. దత్తశర్మ గారి ఆత్మీయ మిత్రులు శ్రీ జెట్టి యల్లమంద గారు ప్రవచనకర్తను సభకు పరిచయం చేశారు. ప్రవచనకర్తకు కీబోర్డు మీద కనక రాజుగారు, మృదంగం మీద శ్రీ శ్రీనుగారు వాద్య సహాకారం అందించి, ప్రసంగాన్ని రక్తి కట్టించారు.

‘కార్తీక వైభవం’ ప్రవచనంలో దత్తశర్మ శివకేశవులకు అభేదమన్న సత్యాన్ని గ్రహించినవాడే జ్ఞాని అని చెప్పారు. స్కాందపురాణం లోని “న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్” అన్న శ్లోకాన్ని కళ్యాణి రాగంలో ఆలపించారు. శివునికి ‘ఆశుతోషుడు’ అన్న పేరు ఎలా వచ్చిందో వివరించారు. ‘ప్రదోషో రజనీ ముఖం’ అని ప్రదోషాన్ని నిర్వచించి, ఉత్థానైకాదశి ప్రాశస్త్యాన్ని చెప్పారు. తులసీ మహిమను గురించి చెప్పి, ‘తులసీ, జగజ్జనని, దురితాపహారిణి’ అన్న త్యాగరాజస్వామి వారి కీర్తనను సావేరి రాగంలో ఆలపించి శ్రోతలను అలరించారు. కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక దీపం మొదలగు వాటి ప్రాముఖ్యతను వివరించారు. కార్తీక పౌర్ణమికి ‘కౌముది’ అన్న పేరున్నదనీ, మానవుని మనస్సుకు జ్యోతిశాస్త్రములో అధిపతి చంద్రుడని చెప్పారు. ఆకాశదీపం, భగినీ హస్త భోజనం గురించి విశదీకరించారు. “శివుడొక్కటే తలపు, శివుడొక్కటే పలుకు” అన్న అన్నమాచార్యుల వారి కీర్తనను, “శంభో మహాదేవ! శంకర! గిరిజారమణ” అన్న అరుదైన, త్యాగరాజకృత శివ కీర్తనను, కామవర్ధినీ రాగంలో ఆలపించి, శ్రోతల మన్ననలు పొందారు. ఆదిశంకరాచార్య విరచిత ‘శివమానసపూజ’ అన్న స్తోత్రం లోని శ్లోకాలను భూపాలరాగంలో పాడి, భౌతికంగా అశక్తులైనవారు కేవలం ఈ శ్లోకాలు చెప్పుకోంటే చాలు, శివానుగ్రహం లభిస్తుందన్నారు.

తర్వాత శ్రీనాథ మహాకవి ప్రణీతమైన ‘హరవిలాస’ కావ్య ప్రశస్తిని, అందులో చిరుతొండనంబి (భక్త శిరియాళ) కథను, అక్కడక్కడా శ్రీనాథుని పద్యాలను ఆలపిస్తూ వివరించారు. తదుపరి గిరిజా కల్యాణ కథను చెప్పారు అదీ హరవిలాసాంతర్గతమే. మహా లింగోద్భవ సమయంలో బ్రహ్మది దేవతలు స్వామిని ప్రార్థించిన ‘దండకము’ – ‘జయజయ మహలింగ జ్యోతిశ్శివలింగ’ను లయబద్ధంగా పాడగా, వాద్యవిద్వాంసులు దానిని సుసంపన్నం చేయగా, ప్రవచనాన్ని ముగించారు దత్తశర్మ. ఆహ్వానపత్రికలో తనను ‘వేదపండితులు’గా పేర్కొన్నారనీ, ఆ పదానికి తాను అర్హుడిని కాననీ సవినయంగా విన్నవించారు. జ్ఞాన సరస్వతీ ట్రస్టు అధ్యక్షులు శ్రీ బాబూరావు మాస్టారు, శ్రీ ఎ.ఎస్.ఎన్ మూర్తి, ఇతర ప్రముఖులు, దత్తశర్మను శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి, పుష్పమాలాలంకృతులను చేశారు.

అదే రోజు సాయంత్రం, నర్సీపట్నంలోని ప్రముఖ కూడలి అబిద్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన, బహిరంగ వేదికపై, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి దేవస్థానం ఎదుట, పాణ్యం దత్తశర్మ మరొక ప్రవచనం చేశారు. ‘శ్రీ బహ్మేంద్ర, దివ్య తత్త్వము’ పై ప్రసంగించారు. వాద్య సహకారం మరల కనకరాజుగారు, శ్రీను గారు అందించారు. వీరబ్రహ్మంద్ర యోగి కేవలం విశ్వబ్రాహ్మణలకు మాత్రమే ఆరాధ్యుడు కాడనీ, ఆయన మహాయోగి అనీ, కాలజ్ఞాని యనీ, ఆధ్యాత్మ జ్ఞానాన్ని పామర జనానికి సైతం అర్థమయ్యే భాషలో వివరించారనీ చెప్పారు.

‘కాళికాంబ! హంస! కాళికాంబ!’ అన్న మకుటంతో వీరబ్రహ్మేంద్రులు వ్రాసిన పద్యాలను మధురంగా ఆలపించారు. ‘చెప్పలేదంటనక బొయ్యేరు’, ‘ఎందుకురా నీకింత బాధ’, ‘చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే’ మొదలగు స్వామివారి తత్త్యాలను వారు స్వరపరచిన విధంగానే పాడి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. వీరబ్రహ్మేంద్ర దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు శ్రీ బాబూరావు మాస్టారు దత్తశర్మగారిని ఘనంగా సత్కరించారు. జెట్టి యల్లమంద గారు గురువు గొప్పదనాన్ని వివరించే ఒక చక్కని పద్యాన్ని పాడి శ్రోతలను అలరించారు. వారికీ, నిర్వాహకులు సన్మానం చేసి గౌరవించారు.

– వంశీకృష్ణ జెట్టి.

నర్సీపట్నం. 25-11-24