back to top
Home Blog Page 1429

ఉగాది

0

చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ
చేయకుండా ఉంటే చాలు అనికాదు
కొత్త తప్పులకి  తలుపులు తెరవక
తీరువుగా నడుచుకోమంటుంది  ఉగాది
మనిషిని మనిషి నమ్మేరోజులు
నమ్మకానికి  అర్ధం మారని రోజులు
వస్తేనేకద నిజమైన పండగ
మానవత్వాన్ని మంట కలపక
కాస్తో కూస్తో ఔదార్యాన్ని
కురిపిస్తే చేతలలో
కలకలలాడుతుంది ముంగిట
కన్నులపండువగా ఉగాది !

 

వైద్య నారాయణీయం

0

[box type=’note’ fontsize=’16’]నవ్య భావాలతో పవిత్ర వైద్య వృత్తికి పవిత్రత ఆపాదించాలని ప్రయత్నిస్తున్న వైద్య నారాయణులిద్దరి కథ “వైద్య నారాయణీయం”.[/box]

ప్రముఖ టి.వి. ఛానెల్ ప్రైమ్ టైమ్‌లో “ముందడుగు” కార్యక్రమం మొదలైంది.

“పవిత్ర వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చి డబ్బు కోసం శవాలకి సైతం… వైద్యులు కార్పోరేట్ వ్యాపారులుగా మారుతున్న ఈ రోజులలో “సేవే” లక్ష్యంగా వైద్యాన్ని సామాన్యుడికి కనీస ఖర్చుతో అందుబాటులోకి తెస్తున్నారు ఇద్దరు వైద్యనారాయణులు. వైద్యం పట్ల ప్రజల్లో నానాటికి పెరిగిపోతున్న భయాల్ని తొలగిస్తూ, అవగాహన కల్పిస్తూ ‘రోగి వద్దకే వైద్యం’ కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యువ డాక్టర్లిద్దరూ మన ముందడుగు కార్యక్రమాని కొచ్చారు” అని చెప్పి, “నమస్కారం” అంది టి.వి. యాంకర్.

“నమస్కారం” అన్నారిద్దరూ.

“మీరిద్దరూ క్లాస్‌మేట్స్, ఫ్రెండ్స్ కదా! మీ వృత్తిలో సారూప్యం లాగే మీ పేర్లూ… సారూప్యంగా వున్నాయి. యాదృచ్ఛికమా? లేక కావాలనే…”

“జస్ట్ కోయిన్సిడెన్స్… నా పేరు రామ్ నారాయణ… ఫిజీషియన్‌ని.”

“నా పేరు లక్ష్మీ నారాయణ… సర్జన్‍ని.”

“మనిషికి అత్యంత ముఖ్యమైన విద్య, వైద్యాల్ని కార్పోరేట్ వ్యాపారంగా మార్చుకుని కోట్లు దండుకుంటున్న ఈ రోజుల్లో మీరిద్దరూ నిస్వార్థంగా, సేవే లక్ష్యంగా వృత్తి ధర్మాన్ని పాటించడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు?” అంది యాంకర్.

“లక్ష్యం ఉన్నవాళ్ళకి లక్షలతో పనిలేదు. ఇలాంటి వాళ్ళు విలువలతో ఇలాగే బ్రతకాలనుకుంటారు. కానీ ఎలాగైనా బ్రతికేయచ్చు. ఎవరేమనుకుంటే నాకేంటి? అనుకునే వాళ్ళకి లక్షల పైనే లక్ష్యం… కోట్లపైనే గురి… ఇలాంటి వాళ్ళతోనే సమాజం నిండిపోతోంది. ఇలాగే బ్రతకాలి అనుకునే వాళ్ళు సమాజంలో చాలా అరుదుగా కనిపిస్తారు. దీనికి ఇన్‌స్పిరేషన్, రోల్ మోడల్‌లతో పన్లేదు. ఎవరికి వాళ్ళు పొందే స్ఫూర్తే… శాశ్వతంగా ఉంటుంది. ఇన్‌స్పిరేషన్ అంటే మరొకర్ని ఇమిటేట్ చెయ్యటమే కదా!” అన్నాడు రామ్ నారాయణ.

“మీరేమంటారు లక్ష్మీ నారాయణ గారూ! ఇన్‌స్పిరేషన్ అంటే ఇమిటేషన్ అంటున్నారు. మీరు ఏకీభవిస్తారా?”

“ఖచ్చితంగా… ఏకీభవిస్తాను. చూడండి. వివేకానందుడిలా నేతాజీ లేడు. అబ్దుల్ కలాంని, మదర్ థెరెస్సాతో పోల్చలేం. ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని ఎ.ఆర్.రెహ్మాన్‌తో కంపేర్ చెయ్యలేం. ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులే. ఇలాంటి వారిని ఒకరితో ఒకర్ని పోల్చలేం. వీళ్ళందరిదీ సెల్ఫ్-మోటివేషన్” అన్నాడు లక్ష్మీ నారాయణ.

“మీ బాల్యం, చదువుల గురించి వివరిస్తారా?”

“ష్యూర్” అన్నారిద్దరూ.

“మానవత్వానికి నవ్యత్వాన్ని జోడించి, వినూత్నంగా ఆలోచించి సామాన్యుడికి అందుబాటులో ఉంటూ వైద్యాన్నందిస్తున్న ఈ వైద్యనారాయణుల బాల్యవిశేషాల గురించి తెల్సుకునే ముందు… చిన్న బ్రేక్” అంది యాంకర్.

***

“వెల్‌కం బ్యాక్… ప్రజల వద్దకే వైద్యం అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యువ డాక్టర్లు తమ బాల్య విశేషాలన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా…”

“రామ్ నారాయణ గారూ! మీ బాల్యం, కుటుంబ నేపథ్యం, ఎడ్యుకేషన్ గురించి వివరిస్తారా?” అంది యాంకర్.

“మాది విజయనగరం సమీపంలో భోగాపురం. మా నాన్న శివయ్య రోజు కూలి. మా అమ్మ సరోజ. నేను ఎనిమిదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. మా ఊళ్ళో మా నాన్నకి కూలిపన్లు సరిగా దొరక్కపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే హైదరాబాదొచ్చి ఉంటున్న మా బంధువుల సలహాతో హైదరాబాదొచ్చాం.

మా నాన్నకి ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్ ఉద్యోగం దొరికింది. నెలకి రెండు వేల జీతం, ఉండడానికి గది ఇచ్చారు. పగలు మా నాన్న కూలిపన్ల కెళ్ళేవాడు. అమ్మ అపార్ట్‌మెంట్ పన్లు చూస్తూ, నాలుగు ఫ్లాట్‌లలో అంట్లు తోమేది. నేను గవర్నమెంటు స్కూల్లో తొమ్మిదో తరగతిలో చేరాను. ఉదయాన్నే లేచి సైకిల్ మీద ఇంటింటికి న్యూస్‌పేపర్స్ వేసి, నా పుస్తకాలకి కొంత డబ్బు సంపాదించేవాడిని.

అపార్ట్‌మెంట్‌లో తొమ్మిదో తరగతి చదివే నా వయసు పిల్లలిద్దరున్నారు. వాళ్ళు సిటీలో మంచి కాన్సెప్ట్ స్కూల్లో చదివేవాళ్ళు. ఎప్పుడూ ఇంగ్లీష్‍లోనే మాట్లాడేవాళ్ళు. నాకు కొంత అర్థమయినా, బదులు మాట్లాడడం తెల్సేది కాదు. వాళ్ళు రాజేష్, సెకండ్ ఫ్లోర్‍లో ఉంటున్న డాక్టర్ మృదుల గారబ్బాయి. సురేష్ థర్డ్ ఫ్లోర్‌లో ఉండే బ్యాంక్ ఆఫీసర్ రామ్మోహన్ గారబ్బాయి. నేను చదివే స్కూల్లో అందరూ తెలుగే మాట్లాడే వాళ్ళు. నాకెలాగైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుండేది. మాకు సైన్సు చెప్పే శంకర్ సారు నాతో చనువుగా ఉండేవారు. ఆయనే నా డౌట్లన్నీ క్లియర్ చేసే ఆయన. నా స్పోకెన్ ఇంగ్లీష్ కోరిక గురించి సార్‌కి చెప్పాను.

“చూడరా! నువ్వు తెలుగు మీడియంలో చదువుతున్నందుకు ఫీలవ్వక్కర్లా! ఇంగ్లీష్ మీడియంలో చదివే వాళ్ళంతా మహా మేధావులేం కాదు. మాతృభాషలో చదువుకుని అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వాళ్ళెంతో మందున్నారు. ప్రపంచ దేశాలు గుర్తించిన సైంటిస్టుగా ఎదిగి, దేశానికి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మారుమూల పల్లెటూళ్ళో మాతృభాషలో చదువుకున్న వ్యక్తే. నీలో టాలెంటుంది. హైదరాబాద్ వచ్చిన ఆరు నెలల్లో హిందీలో మాట్లాడడం నేర్చుకున్న నీకు, ఇంగ్లీష్‌లో మాట్లాడడం కష్టంగాదు. మనసు పెట్టాలంతే” అని నన్ను ఎంకరేజ్ చేసి, సార్ నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ, తప్పొప్పులు సరిదిద్దేవారు. రోజూ నాతో ఇంగ్లీష్ న్యూస్‌పేపర్ చదివించేవారు. పదో తరగతికి వచ్చేసరికి నాకు తెలియకుండానే నాలో ‘ఇంగ్లీష్‌లో మాట్లాడగలను’ అనే కాన్ఫిడెన్స్ వృద్ధయింది.

రాజేష్, సురేష్ ఇద్దరూ ట్యూషన్ల కెళ్ళే వాళ్ళు.

ఓ రోజు సెల్లార్‌లో కూచుని చదువుకుంటున్న నన్ను చూసి నా దగ్గర కొచ్చి, “మ్యాథ్స్ బాగా చేస్తావా?” అనడిగారు.

“చేస్తాను”

“రేపు మాకు స్కూల్లో ఎగ్జాముంది. మ్యాట్రిక్స్‌లో రెండో చాప్టరు సరిగా అర్థం కావడం లేదు… చెప్తావా?” అన్నారిద్దరూ.

వాళ్ళిద్దరికీ మ్యాట్రిక్స్ చెబుతున్న సమయంలో రాజేష్ వాళ్ళమ్మ డాక్టర్ మృదుల ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చింది. సెల్లార్‌లో మా ముగ్గురినీ చూసి, “ఏం చేస్తున్నారిక్కడ?” అంది.

“ఏం లేదు మమ్మీ! వీడు మ్యాథ్స్‌లో డౌట్సు అడిగితే చెప్తున్నాం” అన్నాడు రాజేష్.

నేను వెంటనే “డోన్ట్ టెల్ లైస్… నో మేడం. హి గాట్ డౌట్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ రిక్వెస్టెడ్ మి టు క్లియర్… సో… ఐ యామ్…” అని నేను ముగించే లోపలే… డాక్టరమ్మ కోపంగా వచ్చి రాజేష్‌తో…

“నువ్వు చదివే స్కూలేంట్రా! వీడు చదివే స్కూలేంట్రా! నీకు డౌట్స్ రాకూడదనే వేలకి వేలు పోసి ట్యూషన్లు చెప్పిస్తుంటే… పోయి వీణ్ణి డాట్స్ అడుగుతున్నావా? ముందివతలికి రా!” అని రాజేష్‌ని తిట్టి లాక్కెళ్ళింది.

ఎందుకో అప్పట్నించీ ఆమె నన్ను చూసినా, నేను చదువుకుంటూ ఆమె కంటబడ్డా చిరాకు పడుతూ, ఏదో ఒక పని చెప్పడం లేదా కారు తుడవమనడం, షాపుకెళ్ళమనడం లాంటి పన్లు చెప్పడం మొదలుపెట్టేది. ఆమె కావాలనే తన కొడుకుని నాతో పోల్చుకుంటూ, నన్ను డిస్టర్బ్ చేస్తోందని అర్థమయింది. అయినా ఆమె చెప్పే పన్లన్నీ చేసేవాణ్ణి.

ఆ రోజు అర్ధరాత్రి…”

“ఏం జరిగిందో… చిన్న బ్రేక్ తరువాత తెల్సుకుందాం” అంది యాంకర్.

***

“ఇప్పుడు చెప్పండి రామ్ నారాయణ గారూ!… ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగింది?

“రాత్రి పన్నెండయ్యింది. నేను సెల్లార్‍లో కూచుని చదువుకుంటున్నాను. మా అమ్మ గుండె నొప్పి అని మూల్గుతూ, బాధతో మెలికలు తిరుగుతోంది. మా నాన్న కంగారుగా నన్ను పిలిచి, “పైన డాక్టరమ్మ దగ్గరకెళ్ళి… మాత్రియ్యమని తీసుకురా!” అని పంపాడు.

నేను వేగంగా సెకండ్ ఫ్లోరుకి పరుగెత్తి, డాక్టరమ్మ గారింటి కాలింగ్ బెల్ నొక్కాను. డాక్టరమ్మ భర్తొచ్చి తలుపు తీశాడు. విషయం చెప్పాను. ఆయన లోపలికెళ్ళి, ఆమెతో చెప్పిన పదిహేన్నిమిషాలకి, విసుగ్గా క్రిందకొచ్చి మా అమ్మని చూసి… ‘దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్ళండని’ ఉచిత సలహా ఇచ్చి వెళ్ళింది.

ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే కిషోర్ గారు అమ్మని కార్లో ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ‘గ్యాస్ట్రిక్ పెయిన్’ అని మాత్రిచ్చి పంపారు.

మరుసటి రోజు మా అమ్మని చూసి ‘ఎలా ఉన్నావని’ కూడా డాక్టరమ్మ అడగలేదు. మా నాన్నే వెళ్ళి ఆమెకి చెప్పాడు.

ఆ సంవత్సరం పదో తరగతిలో నాకొచ్చిన మార్కులు (600కి 578) అపార్టుమెంట్ వాళ్ళ దృష్టే కాదు… కార్పోరేట్ కాలేజీల దృష్టి కూడా నా వైపు చూసేలా చేశాయి. న్యూస్ పేపర్లలో నా గురించి రాశారు, టి.వి.లో నన్ను చూపించారు.

నారాయణగూడలో ఉన్న ఓ ప్రైవేటు కార్పోరేట్ కాలేజీవాళ్ళు ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఉచితంగా చదివిస్తామని ముందుకొచ్చారు. నాకు ఇష్టమైన బై.పి.సి. గ్రూపు తీసుకున్నాను. డాక్టర్నవుతానన్న కల నెరవేరుతుందో లేదో కానీ అందుకు కావల్సిన తొలి అడుగు మాత్రం వేశాను. అపార్ట్‌మెంట్లో ఉండే కిషోర్ గారు కాలేజీ వాళ్ళతో మాట్లాడి, నాకు హాస్టల్ ఏర్పాటు చేశారు.

టాపర్స్ బ్యాచ్‌లో ఉన్న నన్ను ఆ రోజు ప్రిన్సిపల్ తన గదికి రమ్మంటే వెళ్ళాను.

సరిగ్గా ఆ సమయంలో ప్రిన్సిపల్ గదిలో రాజేష్, వాళ్ళమ్మ మృదుల ఉన్నారు. వాళ్ళ మాటలు వినిపించి నేను బయటే నిలబడ్డాను.

“మేడం మీ అబ్బాయికి మాథ్స్‌లో 86%, సైన్సులో 70% మార్కులున్నాయి. ఎం.పి.సి. గ్రూపులో చేరుస్తారా?” అడిగారు ప్రిన్సిపాల్.

“లేదండీ! బై.పి.సి.లోనే చేర్చాలనుకుంటున్నాం”.

“సైన్సు కంటే మ్యాథ్స్‌లో ఎక్కువ మార్కులొచ్చాయి గదా!”

“కావచ్చు. కానీ మావాడు బై.పి.సి.లోనే చేరతాడు.”

“మెడిసిన్ చదివిస్తారా?”

“అవును”

“రాజేష్! మెడిసిన్ ఇంట్రస్టా?” ప్రిన్సిపాల్ రాజేష్‌ని అడిగారు.

“లేదు సార్! నేను ఎం.పి.సి.లోనే చేరతా!”

“నోర్ముయ్! చెప్పినదంతా విని మళ్ళీ మొదటి కొస్తావేంటి?” అందామె కొడుకుని కోపంగా చూసి.

“అతన్ని చెప్పనివ్వండి మేడమ్.”

“వాడు చెప్పేదేం లేదండీ! వీణ్ణి మెడిసిన్ చేయించాలని మేం నిర్ణయించుకున్నాం.”

“కరక్టే! అతనికి ఇంట్రస్టుండాలిగా!”

“క్రియేట్ చేస్తారనే మీ దగ్గరికి తీసుకొచ్చింది. పోయిన సంవత్సరం మీ కాలేజీకి మెడిసిన్‌లో ఎక్కువ ర్యాంకులొచ్చాయి. అందుకే వచ్చాం.”

“ఓకె. కాదనడంలేదు. ఎందుకైనా మంచిది… ఒకసారి ఆలోచించండి.”

“ఆలోచించడానికేం లేదండీ! మా రాజేష్‌కి మెడిసిన్‌లో సీటొచ్చేలా చదివించాల్సిన బాధ్యత మీదే… ఎంత ఖర్చయినా పర్లేదు. స్పెషల్ క్లాసులే పెడతారో, స్పెషల్ కోచింగే ఇస్తారో మీ ఇష్టం.” అందామె ధనదర్పంతో.

“అలా కాదండీ! పిల్లల అభిరుచికీ అవకాశం ఇవ్వాలిగా!”

“ఏమిటండీ! వాడి అభిరుచి. ఎం.పి.సి. తీసుకుని ఇంజనీరింగ్ చదువుతాడు. రోజుకో ఇంజనీరింగ్ కాలేజీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. చదివేవాళ్ళు తక్కువై, సీట్లు ఎక్కువై ఖాళీగా పడుంటున్నాయి. రేపు వీడు ఇంజనీరయ్యే సరికి వీధికో ఇంజనీరింగ్ కాలేజీ వస్తుంది. ఒకవేళ మీకు వీలు కాదంటే చెప్పండి, మరో కాలేజీలో చేరుస్తాను” అందామె.

ఆ పై ప్రిన్సిపాల్ మాట్లాడకుండా రాజేష్‌కి అడ్మిషన్ ఇచ్చాడు. రాజేష్‌ని హాస్టల్లో చేర్చారు. రాజేష్ మా బ్యాచ్ కాదు. కాలేజీలో ఎప్పుడైనా కల్సినా మాట్లాడేవాడు కాదు.

హాలిడే రోజు ఇంటికొచ్చినప్పుడు… రాజేష్ వాళ్ళమ్మగారు నన్ను ఇంట్లోకి పిలిచి… “నువ్వు టాపర్స్ బ్యాచ్‌లో ఉన్నావట గదా! మీకు స్పెషల్ కోచింగ్ ఇస్తారట గదా! మా రాజేష్‌కి కూడా మీకు చెప్పే క్వశ్చన్ బ్యాంక్ ప్రశ్నలు చెప్పు…” అంటూ వెంబడించేది. నేను చెప్పినా అవి రాజేష్‌కి అర్థమయ్యేవి కావు. రాజేష్‌ని చూసి… ఆమెకి కోపం వచ్చేది. నా ముందే వాడితో… “చూడరా! వాచ్‌మన్ కొడుకు, తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్లో చదివి, టాపర్స్ బ్యాచ్‌లో ఉన్నాడు. నీకు ఏం తక్కువ చేశాన్రా!” అంటూ వాణ్ణి తిట్టేది.

దసరా సెలవలకి అపార్ట్‌మెంట్లో అమ్మానాన్నల దగ్గర కొచ్చాను. ఆ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తోంది.  నేను సెల్లార్‌లో కూర్చుని మోడల్ పేపర్లు ఆన్సర్ చేస్తున్నా. రాత్రి పదకొండు అయ్యింది. ఉన్నట్టుంది మా అమ్మకి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. వొళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అపార్ట్‌మెంట్లో కిషోర్ గారు ఊరెళ్ళారు. మళ్ళీ డాక్టరమ్మని డిస్టర్బ్ చెయ్యాల్సొచ్చింది. నన్ను చూడగానే ఆమెకి నా చదువు గుర్తొచ్చింది గాబోలు… అసహనాన్నంతా మొహంలోనే చూపిస్తూ… “మీకిదే పనైపోయింది… రాత్రిళ్ళు దెయ్యాల్లా వెంబడిస్తున్నారు. వస్తా పద!” అంటూ పావుగంట తర్వాతొచ్చి, అమ్మని చూసి, గ్యాస్ట్రిక్ నొప్పే అని చెప్పి అంతకుముందిచ్చిన టాబ్లెట్ వేసుకోమని చెప్పెళ్ళింది. అయినా నొప్పి తగ్గలేదు. ఈసారి నాన్న డాక్టరమ్మ ఇంటి కెళ్ళాడు. డాక్టరమ్మ తలుపు తీసి “రాత్రిళ్ళు డిస్టర్బ్ చెయ్యద్దు… తగ్గకపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళండి” అని మొహం మీదే తలుపేసింది. వర్షం పడుతోంది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే రవీంద్రగార్ని రిక్వెస్ట్ చేసి ఆయనొచ్చి ఆ వర్షంలో అమ్మని ఆస్పత్రికి తీసుకెళ్ళేసరికి వాళ్ళు చూసి, “బ్రాట్ డెడ్” అని డిక్లేర్ చేశారు.

మర్నాడు ఉదయం డాక్టరమ్మ కిందకొచ్చి సంతాపం తెలుపుతుంటే… ‘దేవుళ్ళు – దెయ్యాలు’ గుర్తొచ్చారు నాకు.

అంతే! నాన్న వాచ్‌మన్ ఉద్యోగం మానేసి, మా ఊరెళ్ళిపోయాడు. నేను హాస్టల్‌ కెళ్ళిపోయాను.”

“ఆ తర్వాత రామ్ నారాయణగారి జీవితం ఎలా మలుపు తిరిగిందో చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం”… యాంకర్ బ్రేక్ ఇచ్చింది.

***

“ఎలాగైనా డాక్టర్నవ్వాలన్న పట్టుదల రోజు రోజుకీ పెరగసాగింది. నా పట్టుదల, కృషికి మా అమ్మ పై నుండి ఆశీస్సులు పంపింది కాబోలు… ఎంసెట్లో 209 ర్యాంకు వచ్చింది. గాంధీ మెడికల్ కాలేజీలో సీటొచ్చింది.

నా చదువుకి పునాది వేసిన అపార్టుమెంటుకెళ్ళి అందర్నీ కలిశాను. అందరూ అభినందిస్తుంటే… ‘కంగ్రాట్స్’ అని డాక్టరమ్మ నా మొహం మీదే తలుపేసింది. ఎందుకంటే రాజేష్ ఇంటర్ రెండో సంవత్సరం ఎగ్జామ్స్ క్లియరవలేదు. డాక్టరమ్మని చూడగానే నాకు మరోసారి ‘దేవుడు – దెయ్యం’ గుర్తొచ్చారు.

నాలుగేళ్ళు తపస్సులా చదివి ఎం.బి.బి.ఎస్ మెరిట్లో పాసై, ప్రమాణం చేసి డిగ్రీ తీసుకుంటుంటే మనసంతా మా అమ్మే నిండిపోయింది.

నా వల్ల మరొకరి ప్రాణానికి హాని కలగకూడదని… ఆ విషయం నాకు ఎల్లప్పుడూ గుర్తుండేలా నాకు నేనే ఓ మంత్రం రాసుకున్నాను.”

భగవంతుడా! ఇతరుల అనారోగ్య పరిస్థితిపై నా వృత్తి, భుక్తి ఆధారపడి ఉండటం విచారకరం. అయితే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు. ఇది నాపై నువ్వు ఉంచిన బాధ్యతగా స్వీకరించాను. దీనిని నేను ‘బరువు’లా ఎప్పుడు, ఎట్టి పరిస్థితిలోనూ భావించే ఆలోచన రానీయకు.  ఈ  బాధ్యత పరిపూర్ణంగా నిర్వర్తించగల మనోశక్తిని, మానవత్వాన్ని నాకు ప్రసాదించు.“అని రాసుకున్నాను.

“నాలోని ప్రలోభాలు నాలోని మానవత్వాన్ని చంపేయకుండా కుడి చేతి బొటనవేలికీ, చూపుడు వేలికి మధ్య నుండే పై భాగంలో నాకు కన్పించేలా, నేను స్టెత్ పట్టుకున్నప్పుడల్లా ఈ మంత్రాన్ని నాకు గుర్తు చేసేలా… చిన్న పచ్చబొట్టు పొడిపించుకునాను. అదే ఇది” అంటూ చూపించాడు రామ్ నారాయణ.

క్లోజప్ షాట్‌లో పచ్చబొట్టుని… వీక్షకులకు చూపించాక… యాంకర్…

“మీరిద్దరూ మెడిసిన్‌లో ఫ్రెండ్సా?” అంది.

“అవునండీ! ఇతనూ, నేను మెడికోలుగా ఉన్నప్పట్నుంచే ఫ్రెండ్సయ్యాం. అతను ఆర్థికంగా నాకంటే ఎత్తులో ఉన్నా అత్యున్నత భావాలున్న వ్యక్తి. ఇద్దరి  అభిప్రాయాలూ, ఆశయాలూ ఒకేలా ఉండడంతో సన్నిహితమయ్యాం. మెడిసిన్‌లో మెరిట్ మార్కులున్న నాకు ఎం.డి.లోనూ సీటు సులభంగానే దొరికింది. లక్ష్మీ నారాయణకి సర్జరీలో ఇంట్రస్టు. సర్జరీలో పి.జి. చేశాడు.

పి.జి. అయ్యాక, ఏదైనా కార్పోరేట్ ఆసుపత్రిలో చేరాలని ఆలోచిస్తున్న సమయంలో…

“రామ్! నేను ప్రాక్టీస్ చేసి కోట్లు సంపాదించవలసిన అవసరం లేదు. ఇంకో రెండు తరాలకి సరిపడా మా తాత ముత్తాతలే సంపాదించి వెళ్ళారు. నాకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో పని చెయ్యాలనీ, లక్షలు గడించాలనీ లేదు. మనం ఇద్దరం కలసి… నువ్వు పదేళ్ళ తర్వాత ప్రారంభించాలనుకున్న డ్రీమ్ ప్రాజెక్టు ఇప్పుడే మొదలుపెడదాం” అన్నాడు.

“అప్పటి మా ఆలోచన రెండేళ్ళలో కార్యరూపం దాల్చింది. లక్ష్మీ నారాయణ వాళ్ళకి మారేడ్‌పల్లి సమీపంలో రెండెకరాల స్థలం ఉంది. దానిని అందమైన ఆస్పత్రిలా మార్చాం. అందులో కనీస వసతులతో సామాన్యుడికి అందుబాటులో ఉండేలా… పది పడకలతో ఆస్పత్రి ప్రారంభించాం.”

“విన్నారుగా! ఇప్పటి వరకూ రామ్ నారాయణ గారి బాల్యం, చదువు విశేషాలు. చిన్న బ్రేక్ తర్వాత లక్ష్మీ నారాయణ ఏం చెబుతారో విందాం…” అంది యాంకర్.

***

“లక్ష్మీ నారాయణ గారూ! మీ బాల్యం, ఎడ్యుకేషన్ల గురించి చెప్పండి”

“మాది హైదరాబాదే. ఆర్థికంగా ఉన్నవాళ్ళమే కాబట్టి మెడిసిన్ చదవడానికి కష్టాలేం పడలేదు. ఫస్టియర్‌లో మొదలైన మా స్నేహం… కొనసాగుతూనే వుంది. ఇద్దరి ఆలోచనలూ, ఆశయాలూ ఒకటే కాబట్టి  మేం ముందడుగు వేయగలిగాం. మాతో మా బ్యాచ్‌మేట్స్, మా జూనియర్స్ కొందరు, వివిధ విభాగాలలో స్పెషలైజ్ చేసినవాళ్ళు… మేం ఎప్పుడు కాల్ చేసినా వచ్చి ఉచితంగా వైద్యం చేసెళ్తారు” చెప్పాడు లక్ష్మీ నారాయణ.

“అంటే పేషంట్ల వద్ద నుండి డబ్బు తీసుకోరా?”

“తీసుకుంటాం. చాలా మినిమమ్‌గా తీసుకుంటాం, అదీ హాస్పిటల్ మెయిన్‌టెనన్స్ కోసం నామమాత్రంగా తీసుకుంటాం. మేం తీసుకునే ప్రతీ రూపాయికీ… ఎందుకు తీసుకున్నామో రోగికి వివరాలతో బిల్లు అందిస్తాం. మేం మొబైల్ సర్జికల్ వ్యాన్ ఏర్పాటు చేశాం. ప్రతీ చిన్న యాక్సిడెంట్‌కీ అవసరం ఉన్నా లేకపోయినా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే పని లేకుండా… మాకు కాల్ చేస్తే… అతి తక్కువ ఖర్చుతో వాళ్ళ ఇళ్ళ వద్దకే వెళ్ళి, మా వ్యాన్‍లో సర్జరీ అవసరపడితే చేసి, తీసుకోవాల్సిన జాగ్రతలు, పరిశుభ్రత గురించి చెబుతాం. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టే వాతవరణాన్నికల్పిస్తాం. అవసరమైతే… మా ఫ్రెండ్స్ పని చేస్తున్న ఆస్పత్రులకి రిఫర్ చేసి తక్కువ ఖర్చులో అయ్యేలా చూస్తాం. అలాగే వ్యాధులు, జ్వరాలు పట్ల ప్రజలలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్‍లు కండక్ట్ చేస్తున్నాం…”

“అవేర్‌నెస్ ప్రోగ్రామ్‍ల గురించి వివరిస్తారా?” అంది యాంకర్.

“ఉదాహరణకి డెంగీ జ్వరం. ఇది దోమ కాటు వలన వచ్చే జ్వరం. ఇంటి చుట్టూ పారిశుద్ధ్యం లోపించడం వలన దోమలు చేరి, అవి మనిషిని కాటేయడం వల్ల వస్తుంది. దాని గురించి అవగాహన కల్పిస్తాం. డెంగీ జ్వరం వచ్చిన రోగుల మీద చిన్న చిన్న క్లినిక్‌లు మొదలు పెద్ద పెద్ద కార్పోరేట్ ఆస్పత్రుల వరకు వ్యాపార దృక్పథంతోనే… లక్షలు వసూలు చేస్తున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తక్కువ ఉన్నయనో, ప్రాణాంతక వ్యాధఓ ప్రజల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి.  పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి వైద్యం అందనంత ఎత్తులో ఎక్కి కూచుటోంది. మా దగ్గరికి వచ్చే రోగులకి ముందు మేం అవగాహన కల్పిస్తాం. చిన్న చిన్న జ్వరాలకి లక్షల్లో ఎలా కోల్పోతున్నారో వివరంగా చెబుతాం. డెంగీ జ్వరం పట్ల రోగికి అవగాహన, ఆలోచనా ఉంటే… అతి తక్కువ ఖర్చుతో తగ్గించగల జ్వరం. ఒక్కసారి రోగికి ఈ అవగాహన కల్పిస్తే, తన కుటుంబానికి, తన తోటివారికి, తర్వాత తన ఊరికి ఉపయోగపడేలా… మార్పు కోసం… ప్రయత్నం చేస్తున్నాం.”

“ప్రాక్టికల్‌గా ఇదంతా సాధ్యమేనా?” యాంకర్ అడిగింది.

“అసాధ్యం అయితే కాదు. నేడు విద్య, వైద్యం, కార్పోరేట్ వ్యాపారాలుగా మారిపోయాయి.  ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యాపార కోరలలో చిక్కుకుని బలవుతున్న మధ్యతరగతి, పేద ప్రజలకి వ్యాధుల పట్ల, నివారణ పట్ల, ముందు జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించి… ప్రతి చిన్న అస్వస్థతలకి ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా, తక్కువ ఖర్చుతో ప్రకృతి ప్రసాదించిన వనరులతో ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చో తెలియజేస్తున్నాం…”

“అయితే మందుల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ విషయంలొ ఎలాంటి అప్రమత్తత కలగజేస్తున్నారు?” యాంకర్ ప్రశ్న.

“చూడండి. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి గాని అందని తాయిలాలుగా మారకూడదు. ఒకప్పుడు సెల్ ఫోన్ రేటు వేలల్లో ఉండేది. ఇవ్వాళ టెక్నాలజీ పెరిగి వందల్లోకి దిగి సామాన్యుడి చేతిలోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకోవటం ప్రజల్లో రావలసిన మార్పు.”

“ఈ మార్పు అందరికీ వర్తిస్తుందంటారా?”

“ఖచ్చితంగా అని చెప్పలేము. మా టార్గెట్ వైద్యం పేరుతో మోసపోతున్న సామాన్యుల గురించే.”

“మీకు కార్పో’రేట్ల’ నుండి ఒత్తిడి, బెదిరింపులు వస్తుంటాయా?”

“ఆఁహా… మమ్మల్ని కొనాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ మా లక్ష్యాలకి అడ్డుగోడలుగా భావించడం లేదు. ఈ చైత్యన్యం మాతోనే ఆగిపోకుండా… రాబోయే వైద్యులకి స్ఫూర్తి కావాలి. వైద్యుడికి రోగికి మధ్య ‘ధనం’ ఇంధనంలా మారకూడదని… శవాల్ని పీడించి, జీవించేలా వైద్యుడు దిగజారకూడదని; ప్రాణం కాపాడి బ్రతికించే… ‘దేవుడి’లా ప్రజల మనసుల్లో నిలిచిపోవాలని, అప్పుడే… వైద్యులకి, వైద్య వృత్తికి పవిత్రత ఉంటుందని… మా భావన. విజ్జానాన్నిచ్చే చదువుని, ప్రాణాల్ని కాపాడే వైద్యాన్ని సామాన్యుడి అందుబాటులోకి తీసుకెళ్ళడమే మా ధ్యేయం” అని ముగించాడు రామ్ నారాయణ.

“చూశారుగా! నవ్య భావాలతో పవిత్ర వైద్య వృత్తికి పవిత్రత ఆపాదించాలని ఈ వైద్యనారాయణులిద్దరూ ‘ముందడుగు’ వేశారు. మరి మనమూ వీళ్ళ వెనుక అడుగులు కలుపుదాం” అని యాంకర్ వాళ్ళిద్దరి వైపు తిరిగి… “థ్యాంక్యూ! మీ విలువైన సమయాన్ని మా ముందడుగు కార్యక్రమానికి కేటాయించి… ప్రజలకి వైద్యం, వైద్య వృత్తిని కొత్త కోణంలో ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు” అంది యాంకర్.

– ఎం. వెంకటేశ్వరరావు

శివాజీ -స్వరాజ్యం నుంచి సురాజ్యం దాకా

0

మాజీ కేంద్ర మంత్రి, ఆరెస్సెస్ ప్రచారక్ అనిల్ మాధవ్ దవే రచించిన ‘స్వరాజ్య్ సే సురాజ్ తక్’ పుస్తకానికి తెలుగు అనువాదం ఈ పుస్తకం. శ్రీ కస్తూరి రాకా సుధాకర రావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు.

శివాజీ పాలన నుంచి నేటి తరం నేర్చుకోవాల్సిన అంశాలను ఈ పుస్తకంలో స్పృశించారని, నాటి పరిస్థితులను, నేటి వాస్తవాలను అన్వయిస్తూ రచించిన ఈ గ్రంథం మార్గ నిర్దేశక గ్రంథమని ప్రకాశకుల మనోగతం. ఈ పుస్తకం పీఠికను ఇప్పటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాశారు. ‘ఈ పుస్తకం శివాజీ పాలనా సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన పాలన వల్ల ప్రజా జీవనంలో ఎలాంటి మార్పులు కనిపించాయో ఈ పుస్తకం చెబుతుంది. ఆనాడు సుపరిపాలన ఎంత తప్పనిసరో నేడు కూడా అంతే తప్పనిసరి. ఎలాంటి పాలనావ్యవస్థకైనా ఇది అవసరం. ఆ విధంగా శతాబ్దాల తరబడి తరం తరం నిరంతరం చెరగని ముద్రవేసి, శతాబ్దాలుగా ప్రేరణనిస్తున్న గొప్ప జాతి నిర్మాత శివాజీ’ అని శ్రీ నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తపరిచారు. ‘నేను ఈ పుస్తకాన్ని నాయకులందరికీ, పాలకులందరికీ, అభిమానులందరికీ, ఉద్యోగులందరికీ, ముఖ్యంగా యువతకు సిఫార్సు చేస్తాను. వారు ఈ పుస్తకంలోని లోతైన పాఠాలను, శివాజీ ముందుకు తెచ్చిన అభివృద్ధి సూత్రాలను అధ్యయనం చేయాలి. రాబోయే అనేక తరాల నేతలకు, ముఖ్యంగా ఈ దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చాలని కోరుకునే వారందరికీ శివాజీ ప్రేరణగా, మార్గ దర్శకుడిగా ఉంటారు.’ అని రాశారు. రచయితను అభినందించారు.

పుస్తకాన్ని పరిచయం చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సర్ సంఘ్ చాలక్ మోహనరావ్ భగవత్ సమాజ నిర్మాణంఓ శివాజీ ప్రదర్శించిన గుణాలను నేటి సమాజమనుకూలమైన వ్యవస్థ నిర్మాణ సమయంల్ దృష్టిలో ఉంచుకోవాలని, ఈ పుస్తకం ఆ దిశగా అధ్యయన అవలోకనాల ప్రక్రియకు వేగాన్నందిస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ముందుమాట’ రాసిన బాబా సాహెబ్ పురందరే, ‘పుస్తకంలోని ప్రతి అధ్యాయం పాలనావ్యవస్థలోని ఒక్కొక్క అంగాన్ని గూర్చి వివరిస్తుంది. రచయిత అత్యంత సరళమైన భాషలో శివాజీ పాలనా వ్యవస్థను, దాని సామర్థ్యాన్ని, దాని నిత్య జాగరూకతను, శివాజీ లక్షణాలను గురించి వివరించారు’ అని రాస్తూ, ‘నాకు ఇది ఆధునిక ఆచార్య చాణక్యుడు వ్రాసిన కొత్త శివ పురాణంలా, జ్జాన సామర్థ్యాల అధిష్ఠాత అయిన శ్రీకృష్ణుడు వివరించినట్టు ద్యోతకం అవుతోంది’ అని అభిప్రాయపడ్డారు. ‘భారత పార్లమెంటు లోని ప్రతి సభ్యుడు, రాష్ట్రాల శాసనసభల్లోని ప్రతి సభ్యుడు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదివి తీరాల’న్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

శివాజీ

స్వరాజ్యం నుంచి సురాజ్యం దాకా

మూల రచయిత: అనిల్ మాధవ్ దవే

అనువాదం: కస్తూరి రాకా సుధాకర రావు

వెల: రూ. 200/-

పేజీలు: 238

ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852

బర్కత్ పురా, హైదరాబాద్ – 29. ఫోన్: 040-27563236

~ సంచిక బుక్ డెస్క్

వేగిరా విళంబి

0
కాలం అనంతమైనా
ఇది కాలానికి ఒక కొలత
మనం కొలిచే కాలదేవత
కొత్త సంవత్సరం
షష్ఠి పూర్తి చేసుకొని
వస్తుంది నిండు ముత్తైదువులా
కొత్తవెలుగులు వెలిగిస్తూ
కొంగ్రొత్త ఆశలు చిగురిస్తూ
పులకరించే పులుపు వలపు
మమకారం పంచే కారం
వగరు చిగురులు పూయిస్తూ
చప్పటి బతుకులో ఉప్పు కలిపి
చేదు నిజాలు చెప్తూనే
తీపి కబుర్లు అందిస్తూ
నీ షడ్రుచుల పచ్చడిని
వేగిరా మా ముంగిళ్ళకి
హేవళంబికి వీడుకోలు
విలంబము చేయక రమ్మని
విళంబికి మా వేడుకోలు
అరవై సంవత్సరాలు గడిచినా
నిత్య నూతన వధువు వలే
మా వాకిట తలుపు తట్టు
మా చీకటి వదలగొట్టు
– శంకరప్రసాద్

కటికపూలు

0

ప్రచురితమైన నెలలోగా ద్వితీయ ముద్రణకు నోచుకుని సంచలనం సృష్టిస్తున్న ఇండస్ మార్టిన్ రచన ‘కటికపూలు’. ‘భాషాభివృద్ధి నాటకాలు, యాసల పెత్తనాలకు వ్యతిరేకంగా జరిగే పొరాటాలు కూడా ఆయా నాయకుల కులాల భాషా యాసల్ని అజమాయిషీలోకి తెచ్చుకోవడానికి మాత్రమే చేస్తారని తెలిసాక గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల, రేపల్లె, తెనాలి, నది అవతల క్రిష్ణా జిల్లా లంకల్లోని దళిత భాషకు, నుడికారానికీ, దళిత జీవన విధానానికి చెల్లు కాలం వచ్చిందని బోధ పడిన నేపథ్యంలో ఈ కథలు రాయడానికి నిర్ణయించుకున్నాన’ని కటికపూలు రచనకు కారణం ముందుమాటలో వివరించారు రచయిత ఇండస్ మార్టిన్.

‘కటికపూలు’ కథల్లోని ప్రతి సంఘటనా సత్యమనీ, వీటిల్లో పాత్రల పేర్లు యథార్థమైనవనీ, కటికపూలు మా ఎండిన బ్రతుకుల్నీ, కట్టు మాటల్నీ కటికతనంగా ప్రచారం చేసి, మాంసం కోసే వృత్తిలో ఈ సమాజానికి వేల ఏళ్ళుగా సేవ చేసిన జనాలకు కటికోళ్ళు అని పేరు పెట్టి, ఆ పేరునే ఒక అవమానకరమైన పద ప్రయోగంగా వాడుకుంటున్న ఈ సమాజపు విలువల వ్యవస్థకు మా కటికతనంలో ఉన్న నికార్సుతనాన్నీ, నిజాయితీనీ నేలతనాన్నీ, మాకే సొంతమైన ఆకలిని, పంచుకు తినే మనస్తత్వాన్నీ, కన్నీళ్ళను, కరుణను, మమ్మల్ని దోచుకోవాలనుకునేవాళ్ళకు వేలాది ఏళ్ళుగా వుపయోగపడ్డ అమాయకత్వాన్నీ, దాన్నుండి రోజు కూలీగా దొరికే అవమానాలను కలిపి ఒక్క మాటలో చెప్పే ప్రయత్నమే ఈ శీర్షిక అని కటికపూలు రచన లక్ష్యాన్ని, నేపథ్యాన్ని వివరించారు రచయిత.

‘వెలివాడల మట్టి పరిమళాలు’ పేరిట రాసిన పరిచయంలో డా. చల్లపల్లి స్వరూప రాణి ‘ఇవి కటికపూలు కావు. వీటికి మట్టి వాసన, మనిషి వాసన ఉన్నాయి. ఇండస్ కథా రచనలో కవిత్వం ఉంది. సున్నితమైన హాస్యం ఉంది. అన్నింటినీ మించి దళిత జీవితం పట్ల ప్రేమ, కన్సర్న్ ఉన్నాయ’ని వ్యాఖ్యానించారు.

డా. గోపీనాథ్, డా. గుర్రం సీతారాములు ‘ఆత్మ గౌరవం భూమికగా కటికపూలు’ అన్న అభిప్రాయంలో “కటికపూలలో ఆధునిక దళిత సాహిత్య ఉన్నత స్థితి ఉందనీ, దాని వెనుక  వందేళ్ళ క్రింద ‘ఇక్టోరియా’ తరం వేసిన ఆత్మగౌరవ పునాది ఉందనీ, ‘ఈ మన స్వంత భాష’ను రక్షించుకోవాలంటే మార్టిన్ లాంటి రచయితలు ఎందరో ముందుకు రావాలి” అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కటికపూలు

రచయిత: ఇండస్ మార్టిన్

వెల: రూ.100/- పేజీలు: 134

ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్ అన్ని శాఖలు,  అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

~ సంచిక బుక్ డెస్క్

వాత్సల్య గోదావరి

0

రచయిత్రి మణి వడ్లమాని తొలి కథా సంపుటి ‘వాత్సల్య గోదావరి’. ఈ సంపుటిలో 24 కథలున్నాయి.

ఈ సంపుటిలోని కథా వస్తువులన్నీ ఇంటింటా జరుగుతున్న రామాయాణాలు, మహాభారతాలూ కొన్ని కొన్ని మహా భాగోతాలు అంటూ ‘కథల్లో మణిగారి అధ్యయనశీలం, సమాజ పరిశీలనా దృష్టీ, జీవితానుభవాల సారం – విస్తృతంగా ప్రతిఫలిస్తున్నాయని ‘తోటి మనుషుల సుఖదుఃఖాలు’ అన్న ముందుమాటలో విమర్శకులు విహారి రాశారు. కథానికకి అనువైన నేపథ్యాన్నీ, వాతావరణాన్ని కూర్చటం – మణి గారి రచనాశిల్పంలో కొట్టవచ్చినట్టున్న మెరుపని ఆయన అభిప్రాయపడ్డారు.

‘మరపురాని మంచి ముత్యాల సమాహారం -మణి వడ్లమాని కథా సంకలనం’ అన్న పరిచయంలో రచయిత్రి మంథా భానుమతి “వైవిధ్యమైన కథా వస్తువు నెన్నుకోవడం మణి ప్రత్యేకత. కథలో తిలక్‌, చలం, అజంతా, అడవి బాపిరాజు, కృష్ణశాస్త్రి వంటి ప్రముఖ రచయితల వాక్యాలను, కవితలను సందర్భానుసారంగా ప్రస్తావిస్తూ, ఆ విధంగా కథకు అలంకారాలను అద్దటం కూడా తన విశిష్టత. విలక్షణమైన కథనం మణిది. కథకి పేర్లు ఎన్నుకోవడంలోనే రచయిత్రి ప్రతిభ కనిపిస్తుంది. ఈ సంకనంలో ఉన్న ఇరవై నాలుగు కథల్లోనూ, కథాంశంలో కానీ, శైలిలో కానీ దేని ప్రత్యేకత దానిదే” అని వ్యాఖ్యానించారు.

ఈ సంపుటిలోని 24 కథలలో ‘మేనిక్విన్’, ‘సరస్వతీ నమస్తుభ్యం’, ‘వాత్సల్య గోదావరి’, ‘కృష్ణం వందే జగద్గురుం’ వంటి కథలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.

వాత్సల్య గోదావరి

వెల: రూ.100/-

పేజీలు: 200

ప్రతులకు: జ్యోతి వలబోజు, ఫోన్: 80963 10140,

అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

~ సంచిక బుక్ డెస్క్

 

విజయం నీదే..!

0

కాలగమనంలో
మరో యేడుకరిగిపోయింది
కాలం కాన్వాసుపై
కొంతభాగం చెరిగిపోయింది
ఉన్నంతలో కొంత ఆయుష్షు తరిగిపోయింది
జీవిత సత్యాన్ని విస్మరించిన ఓ మనిషీ !
జీవన తత్వాన్ని తెలుసుకో !!
‘హేవిళంబి’పంచిన మంచీ చెడుల్ని
బేరీజు వేసుకుంటూ
సంక్షేమాన్ని కాంక్షిస్తూ
‘విళంబి’ని ఆహ్వానించు
అవరోధాలను అధిగమించు
ఉన్మాదాన్ని వ్యతిరేకించు
ప్రేమనుపెంచు,కరుణనుపంచు
అసహనాన్ని తుంచు
అన్ని చెడులనూ విసర్జించు
మంచిని మాత్రమే స్వీకరించు
విలువలను ఆచరించు
పుడమిపైశాంతిని ప్రతిష్టించు
సత్యధర్మ స్థాపనకు ప్రయత్నించు
విశ్వప్రభువుకు భయపడుతూ
జీవన యానం సాగించు
జయం నీదే… విజయం నీదే..!
ఇహ పర సాఫల్యం నీదే..నీదే..!!

యండి.ఉస్మాన్ ఖాన్

 

తెలుగు వికీపీడియా కథ

0

ఒకరు జంటనగరాల్లో పేరొందిన డాక్టరు, మరొకరు విశాఖపట్టణంలో భవన నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టరు, వేరొకరు ఉద్యోగార్థి, ఇంకొకరు గృహిణి. ఒకాయన ఉండేది అమెరికాలో, చేసేది,మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలు. వేరే పెద్దాయన ఉండేది హైదరాబాదులో, గడుపుతున్నది ప్రభుత్వ ఉద్యోగం తర్వాత విశ్రాంతి జీవితం.
వీరి వృత్తులు, ప్రాంతాలు, అభిరుచులు, సామర్థ్యాలు వేర్వేరు. కానీ వీరందరినీ ఒకటి చేసే పని ఒకటి ఉంది.
వీరంతా ఒక్క నయాపైసా పారితోషికం ఆశించకుండా, తమ రచనా నైపుణ్యాలు, నిర్వహణా సామర్థ్యం పెట్టుబడిగా పెట్టి, కాపీహక్కులు కూడా వదులుకుని వందల కొద్దీ వ్యాసాలు రాస్తూ, రాసిన వ్యాసాలలో సమాచారం చేరుస్తూ, తమ శక్తియుక్తులను, ఖాళీ సమయాన్ని ధారపోసేది, వీరందరినీ కలిపే బంధం – తెలుగు వికీపీడియా.
గత పధ్నాలుగు సంవత్సరాల నుంచి వేరు వేరు సమయాల్లో ప్రారంభించి వీరందరూ స్వచ్ఛందంగా, తమ కాపీహక్కులను కూడా వదులుకుని అభివృద్ధి చేస్తున్న ఈ తెలుగు వికీపీడియా ఏమిటి? దీనిలో వీరు ఎదుర్కొంటున్న కష్టనిష్టూరాలు, సాధించిన విజయాలు, వేసుకున్న ప్రణాళికలు ఏమిటన్నది చాలా ఆసక్తికరమైన కథ.

అసలేమిటి ఇది?
వికీపీడియా అన్నది ఒక ఆన్లైన్ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఎవరైనా స్వేచ్ఛగా ఎవరి అనుమతుల అవసరం లేకుండా పంచుకోగల విజ్ఞాన సర్వస్వం ఇది, అంతేకాదు దీనిలో రచన, నిర్వహణ కూడా ఎవరైనా చేయవచ్చు. అలా స్వచ్ఛంద రచయితలు, కార్యకర్తల సహకారంతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వికీపీడియా 2001జనవరి 15న జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ ఆంగ్ల భాషలో ప్రారంభించారు. అంతకుముందు న్యూపీడియా అన్న ఆన్లైన్ విజ్ఞాన సర్వస్వాన్ని పాశ్చాత్య విజ్ఞాన సర్వస్వాల నిర్మాణ పద్ధతిలో నిపుణులతో రాయించి సంపాదకులతో సరిజూపించి రూపొందించే ప్రయత్నం చేసి విఫలమయ్యాకా, జిమ్మీ వేల్స్ ఎవరైనా రాయగలిగిన విజ్ఞాన సర్వస్వానికి పునాది వేశాడు. దీని ఆలోచన జిమ్మీ వేల్స్ ది కాగా సాంకేతికంగా రూపకల్పన చేసింది లారీ సాంగర్. ఇంతకీ వికీ అంటే హవాయి భాషలో వేగం అని అర్థం. పీడియా అన్న పదం ఎన్సైక్లో పీడియా నుంచి తీసుకున్నారు. వేగంగా రాయగలిగింది, వేగంగా మార్చగలిగింది, వేగంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ పేరు సార్థకమైంది.

తెలుగులో వికీపీడియా
వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం సామాన్యమైన వెబ్సైట్ కాదు. దీని వెనుక ఓ ఉదాత్తమైన లక్ష్యం ఉంది – అదే ప్రపంచంలోని సమస్త మానవాళికి సర్వ మానవ విజ్ఞానం స్వేచ్ఛగా పంచుకోవాలన్నది. ఆ లక్ష్యానికి భాష అడ్డు రాకూడదన్న సదుద్దేశంతో 2004లో వికీపీడియా స్థాపకుడు జిమ్మీ వేల్స్ తెలుగులో పద్మ అన్న లిప్యంతరీకరణ (ట్రాన్స్ లిటరేషన్ – ఆంగ్లంలో తెలుగు స్పెల్లింగులు రాస్తే తెలుగు లిపి వచ్చే) ఉపకరణం రూపొందించిన వెన్న నాగార్జునను తెలుగులో వికీపీడియా రూపొందించే ఉద్దేశం వ్యక్తం చేస్తూ మెయిల్ పంపారు. దాని ఫలితంగానే వెన్న నాగార్జున తెలుగు వికీపీడియా రూపొందించి, తెలుగు వికీపీడియా ప్రారంభించిన వ్యక్తిగా నిలిచారు.
దీని తొలి దశలో చావా కిరణ్, వైజాసత్య, చదువరి, కాసుబాబు, త్రివిక్రం, వీవెన్, రవిచంద్ర, అహ్మద్ నిసార్, మాకినేని ప్రదీప్, మాటలబాబు, అర్జునరావు, నవీన్, సి.చంద్రకాంతరావు, డాక్టర్ రాజశేఖర్, జె.వి.ఆర్.కె.ప్రసాద్, టి.సుజాత, దేవా వంటివారు తెలుగు వికీపీడియా ప్రాజెక్టు పునాదులు ఏర్పరిచారు. వీరిలో కొందరు పది, పన్నెండేళ్ళ నుంచి ఈనాటికీ తెవికీలో తమ కృషి కొనసాగిస్తున్నారు. తర్వాతి దశలో తెలుగు వికీపీడియా తీర్చిదిద్దడం ప్రారంభించిన కె.వెంకటరమణ, పాలగిరి రామకృష్ణారెడ్డి, రహ్మానుద్దీన్ షేక్, భాస్కరనాయుడు, ప్రణయ్ రాజ్, పవన్ సంతోష్, నాయుడు గారి జయన్న, భాస్కర నాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, మీనా గాయత్రి, యర్రా రామారావు, వుక్కం మహేష్ కుమార్, ఎన్.రహంతుల్లా, కట్టా శ్రీనివాస్, తదితరులు ఎందరో వికీపీడియా మరిన్ని వ్యాసాలతో, మరింత సమాచారంతో, నాణ్యతతో విస్తరించడానికి కృషిచేశారు.

ఏమైనా రాయవచ్చా?
కూడదు. ఎవరైనా రాయవచ్చు కానీ ఏమైనా రాయడం, ఎలాగైనా రాయడం కుదరదు. వికీపీడియాలో వ్యాసాల రచనకు నిబంధనలు, పద్ధతులు వుంటాయి. వాటినే విధానాలు (పాలసీలు), మార్గదర్శకాలు అంటారు. ఈ పాలసీలు, మార్గదర్శకాలు అన్నీ వికీపీడియా మూల స్తంభాలు అని పిలిచే 5 మూల సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి.

1. వికీపీడియా అన్నది ఒక విజ్ఞాన సర్వస్వం. స్వంత అభిప్రాయాలు, కవిత్వం, కథలు రాసే బ్లాగ్ కాదు, నిర్వచనాలు రాసే నిఘంటువు కాదు, ఏమైనా ఉద్యమాలు, సంస్థలు, వ్యక్తుల గురించి ప్రచారం చేసే వేదిక కాదు, తాజా వార్తలు ప్రచురించే వార్తాపత్రిక కాదు, ఏయే ఊళ్ళలో ఏ హోటళ్ళు ఉన్నాయో, వాటి ఫోన్ నెంబర్లేంటో రాసేందుకు ప్రయాణ మార్గదర్శిని కాదు, ఇలా మరేవో కాదు. విజ్ఞానాన్ని అందించే విజ్ఞాన సర్వస్వం మాత్రమే.

2. వికీపీడియా తటస్థ దృక్కోణం అనుసరించాలి. వ్యక్తులుగా ఏ వివాదాస్పదమైన అంశంపైనైనా ఏదోక పక్షం మనం అనుసరించవచ్చు, కానీ వికీపీడియా వ్యాసం రాసేప్పుడు ఏదోక పక్షాన్ని సమర్థించడమో, వ్యతిరేకించడమో చేయకూడదు. ఉదాహరణకు వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేదా నారా చంద్రబాబు నాయుడు వంటి రాజకీయనాయకుని మీద మనకు అనుకూలమో, ప్రతికూలమో ఏదోక దృక్పథం ఉండవచ్చు. కానీ వ్యాసం రాసేప్పుడు ప్రామాణికమైన మూలాల నుంచి అతని మీద వచ్చిన విమర్శలు, ఆయనపై ప్రశంసలు వేర్వేరు విభాగాల్లో రాసి, తటస్థంగా ఊరుకోవాలి. అంతేతప్ప ఒక పక్షం తీసుకుని ప్రశంసించడమో, విమర్శించడమో లక్ష్యంగా వ్యాసం తయారుచేయకూడదు. ఒకవేళ అలాంటి వ్యాసాలేమైనా వికీపీడియాలో ఉంటే సరిజేయాలి.

3. వికీపీడియా స్వేచ్ఛగా పంచుకోగలిగింది, ఎవరైనా మార్పులు చేయగలిగింది. ఒక వ్యాసాన్ని కానీ, వాక్యాన్ని కానీ రాసి వికీపీడియాలో ప్రచురిస్తూండగానే మనం దీనిని ఎవరైనా, ముందస్తు అనుమతి లేకుండా వికీపీడియా నుంచి తీసుకున్నది అని, ఓ లింకు ఇచ్చి వాడుకునేందుకు కాపీహక్కుల పరంగా అనుమతిస్తున్నామనే అర్థం. అంతేకాదు ఆ వ్యాసంలో ఈ ఐదు మూలస్తంభాలు, పాలసీలకు వ్యతిరేకం కాని మార్పులుచేర్పులు ఎవరైనా చేసి మెరుగుచేయవచ్చు. అలాంటి సందర్భంలో ఇది నాది, దీనిలో వారు ఎందుకు మార్పులు చేస్తున్నారన్న దృక్పథం కాక, వికీపీడియా వ్యాసాన్ని అభివృద్ధి చేసేందుకు వారు ముందుకు వచ్చారన్న అభినందన నిజమైన వికీపీడియన్ ప్రతిస్పందన అవుతుంది. అలా మెరుగైన మార్పుచేర్పులు చేసినప్పుడు ఎవరినీ నిరోధించకూడదన్నది, ఎవరు పంచుకున్నా ఒప్పుకునే రాయాలన్నది ఈ సూత్రం.

4. వికీపీడియాను పైన చెప్పినట్టు ఎందరో వికీపీడియన్లు కలిసి అభివృద్ధి చేస్తారు. కాబట్టి వారితో మనకు అభిప్రాయ భేదాలు ఉంటే విభేదించవచ్చు కానీ గౌరవిస్తూనే విభేదించాలన్నది ఈ సూత్రం. అలాంటి సహకార స్ఫూర్తితోనే తయారైన వ్యవస్థను కాపాడుకునేందుకు గౌరవంగా ప్రవర్తించడం చాలా కీలకమైన అంశం. నిజానికి వికీపీడియాలో ఎన్నో వ్యాసాలు, పాలసీలను పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తులు తమ తమ దృక్పథాలు, అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే అభివృద్ధి చేశారు. అలా చేయడానికి ఒకరినొకరు భిన్నాభిప్రాయాలు ఉన్నా నిబద్ధత కలిగిన సభ్యులుగా గౌరవించుకోవడమే కారణం.

5. పై నాలుగు సూత్రాలు తప్ప మరే ఇతర స్థిరమైన నిబంధనా లేదన్నది ఐదో సూత్రం. అంటే ఏ ఇతర విధానమైనా, మార్గదర్శకమైనా ఈ నాలుగు సూత్రాల ఆధారంగానే, వికీపీడియా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందాలి. ఈ మూలసూత్రాల స్ఫూర్తిని నిలుపుకున్నంతవరకే వాటికి విలువ. అంతేకాదు ఈ ఐదో సూత్రం సభ్యులను వికీపీడియాను అభివృద్ధి చేయడానికి చొరవగా ముందుకు రమ్మని చెప్తోంది. వికీపీడియాలో ఏ మార్పు అయినా తిరగదోడవచ్చు, కాబట్టి వ్యాసం పాడవుతుందని భయపడకుండా దాని అభివృద్ధికి కృషిచేయమంటోంది.

ఈ ఐదు మూలస్తంభాలు వికీపీడియా నిర్వహణలో రాజ్యాంగ ప్రవేశిక వంటివి, వికీపీడియా స్ఫూర్తి ఈ ఐదింటిలోనూ ప్రతిబింబిస్తుంది. ఈ ఐదు మూలసూత్రాలను అనుసరించి పలు పాలసీలను, మార్గదర్శకాలను తెలుగు వికీపీడియా సముదాయం రూపొందించింది. ఏ కొత్త సభ్యులు అయినా ఈ ఐదింటిని దృష్టిలో ఉంచుకుని రాస్తూ ఉంటే, తోటి సభ్యుల ద్వారా సందర్భవశాత్తూ అన్ని అంశాలూ నేర్చుకోవచ్చు. కాబట్టి తెలుగు వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, దానికి ఏ అర్హతా అక్కరలేదు. కానీ ఎలా రాస్తున్నారు, ఏం రాస్తున్నారు అన్న రెండు విషయాల్లో ఈ మూలసూత్రాలను అనుసరించాలి.
అలాగే ఇప్పటికే ఉన్న తెలుగు వికీపీడియా వ్యాసాలు ఈ మూల సూత్రాలు (మరీ ముఖ్యంగా కంటెంట్ పాలసీలైన విజ్ఞాన సర్వస్వ పరిధి (మొదటిది), తటస్థ దృక్పథం (రెండు), కాపీహక్కులు ఉన్న పాఠ్యం (మూడు)) ఉల్లంఘిస్తూంటే దాన్ని ఎవరైనా సరిజేయవచ్చు.

తెలిసిన విషయాలు రాయవచ్చా?
పై మూల సూత్రాలను అనుసరిస్తూ నిస్సందేహంగా రాయవచ్చు. కానీ తెలియడం అన్నదాంట్లో కొన్ని అంతరాలు ఉంటాయి. ఉదాహరణకు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని మన అందరికీ (కనీసం చాలామందికి) తెలుసు కదా. ఎలా తెలుసు మనకు, చాలామందిమి కళ్ళతో చూడలేదు కదా. పుస్తకాల ద్వారా తెలుసు. అలా తెలిసిన విషయాలను, ఏవోక పుస్తకాన్ని మూలంగా ఇచ్చి రాయవచ్చు. అదే ఎవరో ఫలానా వ్యక్తి స్వాతంత్ర సమర యోధుడు అన్న సంగతి మనకు నేరుగా తెలుసు, మన ఊరి అతనే కాబట్టి తెలుసుకోవడానికి ఎక్కడా చదవనక్కరలేదు. కానీ ఈ విషయం అలానే మనకు తెలిసినట్టుగా రాసేయడానికి వీలు లేదు. ఎక్కడో ఒకచోట ప్రచురితమై ఉంటుంది కదా. ఏదైనా స్థానిక చరిత్రకు సంబంధించిన పుస్తకం, వార్తాపత్రికలో ఏదో సందర్భంలో పడిన వ్యాసం, లేదంటే మరేదైనా ప్రామాణిక ఆధారం, దాన్ని మూలంగా సమర్పించాల్సివుంటుంది. మనకు తెలుసు అన్న విషయాన్ని ఏదోలా ప్రచురించిన, ప్రామాణికమైన ఆధారం మూలంగా ఇచ్చే రాయాలి. ఎందుకంటే ఇది విజ్ఞాన సర్వస్వం రూపొందించేప్పుడు పరిశోధనను, పరిశీలనను నేరుగా రాసేయకూడదు, ఇప్పటికే ప్రచురితమైన ఆధారాలను ఉపయోగించుకుని రాయాలి. అలాగే కొన్ని పరిధులు ఉంటాయి, తెలుగు వికీపీడియాలో రాయదగ్గ అంశమా కాదా అన్నది కూడా చూసుకోవాలి.

వికీపీడియా ఎవరిది?
వికీపీడియాని కొందరు గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థల్లాగా ఏదోక వాణిజ్య సంస్థల అధీనంలో ఉందనుకుని ఎవరిది ఇది అని అడుగుతూంటారు. వికీపీడియా దాన్ని ఉపయోగించుకునేవారే, రాసే వ్యవస్థ, దానిని రాసే వారే నిర్వహించే సంస్థ వ్యవస్థ. అలానే వికీపీడియాలోని సమాచారం రాసి ప్రచురించేప్పుడే వికీపీడియన్లు “వికీపీడియా నుంచి” అంటూ పేజీకి లింకు ఇవ్వడం ద్వారా గుర్తింపునిస్తే ఇంక ఎవరి అనుమతులూ అక్కరలేని స్వేచ్ఛా నకలు హక్కుల్లో విడుదల చేస్తారు. సమాచారం వాడుకుని, పంచుకునేందుకే కాదు మొత్తం ప్రాజెక్టు వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని వ్యాసాలూ వేరే వెబ్సైటు తయారుచేసుకోవడానికైనా, పుస్తకాలుగా ప్రచురించుకోవడానికైనా తగిన గుర్తింపు ఇచ్చేస్తే కాపీహక్కుల పరంగా ఏ సమస్య ఉండదు. మరోలా చెప్పాలంటే వికీపీడియా సమాచారం సమస్త మానవాళిదీ. వికీపీడియాలోని సమాచారం మాత్రమే కాదు నిర్వహణపరంగానూ, ఇతరేతర అంశాలలోనూ వికీపీడియా ప్రధానంగా దానిని నిర్వహిస్తూ, రాస్తూండే సముదాయ నియంత్రణలో ఉంటుంది.

వికీపీడియాను ఎవరు నిర్వహిస్తారు?
తెలుగు వికీపీడియా (ఆమాటకొస్తే అన్ని వికీపీడియాలూ) ఐదు మూలస్తంభాలను వికీపీడియా అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి రూపొందించే విధానాలు (పాలసీలు), మార్గదర్శకాల నియంత్రణలో ఉంటాయి. ఆ విధానాలు, మార్గదర్శకాలు రూపొందించేది తెలుగు వికీపీడియా సముదాయమే. తెలుగు వికీపీడియాలో రాసేవారు, దాని అభివృద్ధి కోసం కృషిచేసేవారిని క్లుప్తంగా తెలుగు వికీపీడియా సముదాయం అంటారు. ఏదైనా అంశాన్ని లేవనెత్తినప్పుడు వికీపీడియన్లు ఆ అంశంపై వ్యాఖ్యానించి, సూచనలు తెలియజేస్తూ విధానాలు రూపకల్పన చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా పెద్దగా సమాచారం లేని పేజీ సృష్టిస్తే, అభివృద్ధి చేయమని ఎలా సూచించాలి, ఎన్నాళ్ళు వేచిచూసి తొలగించాలి అన్న అంశం ఉందనుకుంటే వికీపీడియన్లు ఈ అంశంపై రచ్చబండ అన్న పేజీలో కానీ, విధానాల ప్రతిపాదనకు వాడే రచ్చబండ (పాలసీలు) అన్న పేజీలో కానీ ప్రతిపాదించి చర్చిస్తారు. చర్చల అనంతరం ఏకాభిప్రాయం ద్వారా తగిన నిర్ణయం తీసుకుంటారు.

ఫలానా వ్యాసంలో సమాచారం లేదు-తొలగించాలి, ఈ వాడుకరి (స్వచ్ఛంద రచయితను ఇలా కూడా అంటారు) నిష్పాక్షికత దెబ్బతీసే రచనలు చేస్తున్నాడు హెచ్చరించాలి, ఈ బొమ్మ కాపీహక్కుల వల్ల వికీపీడియాలో ఉండకూడదు లాంటి అనేక నిర్వహణ సమస్యలను ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వికీపీడియా గురించి తెలుసుకుంటూ పరిశీలించి, పనిచేయవచ్చు. వారు చేసే చర్చల తర్వాత సముదాయం సమిష్టిగా తీసుకునే నిర్ణయాలను కానీ, విధానాల పరంగా చేయాల్సిన పనిని కానీ అమలుచేసేందుకు మాత్రం నిర్వాహకులు, అధికారులు అన్న ప్రత్యేక బాధ్యతలు స్వీకరించినవారు సాంకేతికంగా చేయగలుగుతారు. ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో, విధానాలను అన్వయించే విషయంలో, వ్యాఖ్యానించే విషయంలో నిర్వాహకులు, అధికారులకు ఏమీ ప్రత్యేక హోదా ఉండదు. వాళ్ళూ ఆ విషయంలో అందరు వికీపీడియన్లతో సమానమే, కానీ ఆ నిర్ణయాన్ని అమలుచేయడానికి మాత్రం వీరు చేసిపెట్టగలుగుతారు. కాబట్టే వికీపీడియన్లు నిర్వాహకత్వం హక్కు కాదు బాధ్యత అంటారు. ఇలా మొత్తం వికీపీడియాలో నిర్వహణ కూడా అందరిదీను.

వికీపీడియా నాణ్యతను కాపాడేందుకు వికీపీడియన్లు కొత్తగా వచ్చిన వ్యాసాలను పరిశీలించి (అలా చూసేందుకు తెలుగు వికీపీడియాలో ఎడమచేతి వైపు కొత్త వ్యాసాలు అన్న బటన్ ఉంటుంది, గమనించండి) అవి నాణ్యమైనవి కాకుంటే సమస్య ఏమిటో ఒక మూస పెట్టడం ద్వారానూ, వ్యాసం సృష్టించినవారి చర్చ పేజీ (ప్రతీ వికీపీడియా పేజీకి దానిని గురించి చర్చించేందుకు ఒక చర్చ పేజీ ఉంటుంది, పేజీ పేరు పైన చూడండి ఈసారి – అలానే వికీపీడియాలో రాసేవారిని సంప్రదించేందుకు వారికీ చర్చపేజీ ఉంటుంది)లో రాయడం ద్వారానూ తెలియపరుస్తారు. ఆ వ్యాసాన్ని రాసినవారు కానీ, మరెవరైనా కానీ అభివృద్ధి చేయడానికి ఈ పని ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈ వ్యాసంలో ఇతర వికీపీడియా పేజీలకు లింకులు లేవనో, మూలాలు లేవనో, ఈ వ్యాసం పాక్షిక దృక్కోణంతో రాసివుందనో ఆ మూస చెప్తుంది. అలానే రాసినవారు చేసిన మార్పులు వికీపీడియా పాలసీలకు వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా, ఎపుడైనా దానిని తిరగ్గొట్టి పాత కూర్పుకు తిరిగి వెళ్ళవచ్చు. అంతేకాక మొదటి పేజీలో పాఠకులకు కనిపించే ఈ వారపు వ్యాసం, మీకు తెలుసా, ఈ వారపు బొమ్మ వంటి శీర్షికలకు తగిన నాణ్యమైన వ్యాసాలు, ఫోటోలు, తగిన అంశాలు ఎంపికచేయడం వంటివీ నిర్వహణ బాధ్యతల్లోకే వస్తాయి. ఉదాహరణకు కె.వెంకటరమణ అన్న తెలుగు వికీపీడియా స్వచ్ఛంద రచయిత ఇలాంటి కృషిని కొన్ని కొన్నిసార్లు కొందరు సభ్యుల సాయంతోనూ, ఒంటరిగానూ ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. ఆంగ్ల వికీపీడియాలో నెలనెలా దాదాపు 12 వందలమందికి పైగా నిర్వాహకులు, వేలాది అత్యంత చురుకైన రచయితలు, 30 వేలమంది స్వచ్ఛంద రచయితలు కృషిచేస్తూండగా, తెలుగు వికీపీడియాలో మాత్రం నెలనెలా 16-20 మంది అతిచురుకైన స్వచ్ఛంద రచయితల కృషితో, అతికొద్దిమంది నిర్వాహకుల సహకారంతో ఈ పనులన్నీ చేసుకుంటూండడం ఎంత విశేషమో గమనించవచ్చు. ఇలా నిర్వహణా పరమైన సహకారం అందించేందుకు మరింతమంది తెలుగు వారు ముందుకువస్తారని వెంకటరమణ వంటివారు ఆశిస్తూ ఉన్నారు.

వికీమీడియా ఫౌండేషన్ అనే లాభాపేక్ష రహిత సంస్థ పలు భాషల వికీపీడియాల సహా స్వేచ్ఛా విజ్ఞానం అందించే తన ప్రాజెక్టులకు హార్డ్ వేర్ మద్దతు అందించడానికి, వాటి విస్తరణకు కృషిచేస్తూంటుంది. వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డులోనూ ముగ్గురు ప్రపంచవ్యాప్తంగా వికీపీడియన్ల ద్వారా ఎంపికైన సభ్యులు, ఇద్దరు ప్రపంచ వ్యాప్తంగా వికీపీడియా సముదాయాలు ఏర్పాటుచేసుకున్న చాప్టర్లు, థీమాటిక్ ఆర్గనైజేషన్ల నుంచి ఎంపికైన సభ్యులు, నలుగురు బోర్డు నియమించినవారు, వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ సహా పదిమంది ఉంటారు. ఐతే వికీపీడియాల్లో సమాచారాన్ని చేర్చడం, తొలగించడం వంటివాటిపై వికీమీడియా ఫౌండేషన్ కు అధికారం ఉండదు. వికీపీడియాల్లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వదు, వికీపీడియా పాఠకులు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే విరాళాలు ఉపయోగించుకునే వికీపీడియా సర్వర్లు సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ఉపకరణాల సృష్టి వంటివి చేస్తూంటుంది.

తెలుగులో ప్రామాణిక రచనలు దొరకకపోతే?
మనకి ఆసక్తి ఉన్న అంశాలను చదివి, నిష్పాక్షికమైన శైలిలో రాయవచ్చు. అందుకు ఎలాంటి మూలాలు వాడాలి అంటే
పరిశోధన పత్రాలు, ప్రామాణిక గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, విజ్ఞాన సర్వస్వాలు, చారిత్రక పత్రాలు (లేఖలు, మౌలిక డాక్యుమెంట్లు), పత్రికల వార్తలు, నివేదికలు, మేగజైన్ వ్యాసాలు, జనగణన వంటి గణాంకాలు, పీహెచ్.డి. సిద్ధాంత వ్యాసాలు, సంపాదకుల నియంత్రణ ఉన్న వెబ్సైట్లు, లాంటివి.

తెలుగు భాష గత కొన్ని వందల సంవత్సరాలుగా విద్య, పరిపాలన, ఉపాధిలాంటి వాటిలో నిర్లక్ష్యానికి గురి అవుతూండడం వల్ల విచిత్రమైన పరిస్థితి దాపురించింది. కొన్ని దేశాల జనాభా కన్నా ఎక్కువమంది మాట్లాడుతున్న తెలుగు భాష, మరికొన్ని దేశాల బడ్జెట్ల కన్నా ఎక్కువ వసూళ్ళు చేసే సినిమాలు నిర్మాణం అవుతున్న భాష విజ్ఞానం, విద్య లాంటి మౌలిక అంశాల్లో నిర్లక్ష్యానికి గురవుతోంది. సంస్థలు, వ్యక్తులు తెలుగులో విజ్ఞానాభివృద్ధికి, నాణ్యమైన పరిశోధనాత్మక వ్యాసాలు, ప్రామాణిక గ్రంథాలు ముద్రించే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలకు పాలన, విద్య, పరిశోధనా రంగాల్లో ప్రభుత్వపరంగా తెలుగు భాషకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు, ప్రణాళికలు లేకపోవడంతో ప్రతీ రంగంలోనూ జరుగుతున్న కృషి, పరిశోధనలు, వెలువడుతున్న విజ్ఞానం, సమాచారం తెలుగులో అందుబాటులో లేదు. వార్తాపత్రికల స్థాయిలోనూ, పాఠ్యపుస్తకాల స్థాయిలోనూ కొరత కనిపించకపోవచ్చు, పరిశోధన పత్రాలు, ప్రామాణిక గ్రంథాలు తెలుగు వారి జన సంఖ్యలో ఏమేరకు లభ్యమవుతున్నాయన్న ప్రశ్న వేసుకుంటే నిరాశే సమాధానంగా వస్తుంది. అంతేకాక ఇప్పటివరకూ వ్యక్తులు, సంస్థలు, కొంతమేరకు విశ్వవిద్యాలయాలు రూపొందించిన ప్రామాణిక పుస్తకాల విషయంలోనూ డిజిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో ఇంగ్లీష్ లాంటి భాషలతో పోలిస్తే తెలుగు చాలా దూరంలో ఉంది.
సహజంగానే లోటు ప్రామాణిక రచనల ఆధారంగా జరగాల్సిన విజ్ఞాన సర్వస్వ రచనపై ప్రభావం చూపించింది. కానీ ముందు అన్ని శాస్త్రాల్లోనూ ప్రామాణిక రచనలు తెలుగులో ప్రచురణ జరిగాకా, అవి అంతర్జాలంలో డిజిటైజ్ అయి పూర్తిగా అందుబాటులోకి వచ్చాకా తాపీగా తెలుగు వికీపీడియా నిర్మాణం సాగిద్దాం అని వికీపీడియన్లు ఊరుకోలేదు. మూలాల లభ్యత ఉన్నంతమేరకు వ్యాసాలను రూపొందించడం మాత్రమే కాక లభ్యం కాని తావుల్లోనూ కొత్త దారులు వెతుక్కున్నారు.
ఈ సమస్య అధిగమించడానికి కొందరు అనువాదాల బాట పట్టారు. ఆంగ్లంలో వివిధ కారణాల వల్ల విజ్ఞానాభివృద్ధి విస్తారంగా జరిగివుండడం, అలానే ఆంగ్ల వికీపీడియాలో లక్షలాది మంది వికీపీడియన్లు పనిచేస్తూ వ్యాసాలను అభివృద్ధి చేస్తూండడంతో ఆంగ్ల వికీపీడియాలోని వ్యాసాల్లో చాలా సమాచారం లభ్యమవుతోంది. విశేష వ్యాసాలు (ఫీచర్డ్ ఆర్టికల్స్), మంచి వ్యాసాలు (గుడ్ ఆర్టికల్స్) స్థాయి పొందిన వ్యాసాలు అయితే సమవుజ్జీ సమీక్ష (పీర్ రివ్యూ) కూడా పూర్తిచేసుకుని అత్యున్నత నాణ్యతతో ఉంటాయి. ఆంగ్ల వికీపీడియా నుంచి అనువదించి తెలుగు వికీపీడియాలోకి వ్యాసాలను తెచ్చి రాయడంలో ఏ అనుమతులూ ఉండవు, ఆమాటకి వస్తే ఇది వికీపీడియా నుంచి అని ప్రస్తావించి రాస్తే ఎవరైనా, ఎక్కడైనా ప్రచురించుకోవచ్చు. కాబట్టి అలా అనువాదాల్లో కృషిచేస్తున్నవారిలో ముఖ్యులు చెన్నై నుంచి తెలుగు వికీపీడియాలో కృషిచేస్తున్న టి.సుజాత. విస్తారమైన సమాచారం లభ్యమవుతున్న ఆంగ్ల వికీపీడియా నుంచి సుజాత దాదాపు పదేళ్ళ నుంచి అనువాదాలు చేసి తెలుగు వికీపీడియాను అభివృద్ధి చేస్తున్నారు. శాన్-ఫ్రాన్సిస్కో నగర వ్యాసంతో మొదలుపెట్టి ప్రపంచ నగరాలు, భారతీయ నగరాలు, భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు, భారతీయ మహిళా శాస్త్రవేత్తలు వంటి వారిపై వ్యాసాలు ఎన్నో అనువదించారు. ఈ క్రమంలో ఆమె మొత్తం భారతదేశంలోని అన్ని జిల్లాల వ్యాసాలనూ, ప్రపంచంలోని అన్ని దేశాల వ్యాసాలనూ తెలుగులోకి అనువదించి భారీ విజ్ఞాన యజ్ఞం చేశారు. ఇంతకీ ఆమె డిగ్రీ వరకూ కూడా చదవలేదని, వికీపీడియా కోసం స్వంతంగా అభివృద్ధి చేసుకున్న అనువాద నైపుణ్యం ఇందుకు వెచ్చిస్తున్నారనీ తెలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది.

గూగుల్ సంస్థ 2009-11 తెలుగు వికీపీడియా సహా కొన్ని భారతీయ భాషల వికీపీడియాల్లో గూగుల్ తన అనువాద ఉపకరణం (గూగుల్ ట్రాన్స్ లేట్) వాడి అనువదించిన వ్యాసాలు ప్రచురించడం ద్వారా ముఖ్యమైన వ్యాసాలు అనువదించే ప్రాజెక్టు చేపట్టింది. ఐతే వికీపీడియా సముదాయంతో సంప్రదించకుండా రూపొందించిన ఈ కార్యక్రమం అమలులో లక్ష్యాలను చేరుకోవడం మాని, తెలుగు వికీపీడియాలో ఉడికీ ఉడకని అనువాదాలను ప్రచురించి వికీపీడియా నాణ్యత దెబ్బతీసింది. కొద్ది వ్యాసాలు మటుకే యాంత్రిక అనువాదం తర్వాత మనుషులు శుద్ధి చేసి ప్రచురించడంతో, అలా చేయని అనేకానేక వ్యాసాలు భారీగా, నాణ్యతలేమితో భారమయ్యాయి. ఇలాంటి వ్యాసాలను నాణ్యమైన వ్యాసాలుగా అభివృద్ధి చేయడానికి ఎందరో వికీపీడియన్లు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అర్జునరావు అనే వికీపీడియన్ మొదలుకొని ఎందరో ఈ ప్రయత్నాలు సాగించారు. ఆ క్రమంలో ఒక ఉపకరణం వాడి మొత్తం వ్యాసాలను తిరగరాస్తూ మీనా గాయత్రి అనే మరో మహిళా వికీపీడియన్ పలు వ్యాసాలను అనువదిస్తున్నారు. వికీపీడియన్ సుజాత చేసిన కృషి తనకు స్ఫూర్తి అని చెప్తున్నారామె. ఇంకెందరో వికీపీడియన్లు అనువాదాన్ని నాణ్యమైన సమాచార సృష్టికి ఒక మార్గంగా ఎంచుకున్నారు.

సమాచారం అరచేతిలోకి తెచ్చేందుకు
ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవడానికి దాన్ని వికీపీడియన్లకు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా తెలుగు సమాచారం అందుబాటులోకి అన్న ప్రాజెక్టులో భాగంగా డీఎల్ఐలో సరైన ఇండెక్సింగ్ లేకపోవడం వల్ల ఉపయోగపడని ఆరువేల పుస్తకాల సూచిక అభివృద్ధి చేయడం, తెలుగు గ్రంథాలయం అన్న ప్రాజెక్టు ద్వారా పలు గ్రంథాలయ సూచిక పేజీలను తెలుగులోకి అనువదించడం వంటి ప్రయత్నాలు తెలుగు వికీపీడియన్లు పవన్ సంతోష్, బి.కె.విశ్వనాథ్ వంటివారు చేపట్టారు. తెలుగులో ప్రచురితమైన ప్రతీ కాయితాన్నీ డిజిటైజ్ చేసి భవిష్యత్తరాలకు, ప్రస్తుత పరిశోధనలకు అందించాలన్న సంకల్పంతో కృషిచేస్తున్న మనసు ఫౌండేషన్ సహకారంతో ఈ దారిలో మరింత ముందడుగు పడింది. సినిమాల వ్యాసాలు అభివృద్ధి చేస్తున్న “స్వరలాసిక” కోడిహళ్ళి మురళీమోహన్, రోజుకో వ్యాసం చొప్పున ఏళ్ళ తరబడి వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ రాజ్ లాంటి వారి ప్రయత్నాలకు మనసు ఫౌండేషన్ వారు డిజిటైజ్ చేసి అందిస్తున్న పత్రికలు, పుస్తకాలు ఒకానొక చోదక శక్తిగా ఉపయోగపడుతున్నాయి. కాపీహక్కుల పరిధిలో లేని పుస్తకాలను యూనీకోడ్ పుస్తకాల దాకా రూపొందించే వికీపీడియా సోదర ప్రాజెక్టు తెలుగు వికీసోర్సు కూడా తెలుగు వికీపీడియా వ్యాసాల రచనకు మూలాలుగా ఉపయోగపడే ప్రామాణిక పుస్తకాలను డిజిటైజ్ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తెలుగు వికీపీడియా సముదాయం కాక తెలుగు భాషలోని పుస్తకాలను స్కాన్ చేయడంలోనూ, డిజిటైజ్ చేయడంలోనూ కృషిచేస్తున్న సంస్థలు, ప్రామాణికమైన వ్యాసాలను అందిస్తున్న ఈమాట, భూమిక వంటి అంతర్జాల పత్రికలు కూడా పరోక్షంగా ఈ సమస్య తీర్చేందుకు సాయం చేస్తున్నాయి.

నాణ్యత సంగతి ఏమిటి?
వికీపీడియాలో ఉండదగ్గ విషయంపై ఒక వ్యాసాన్ని అవసరమైన సమాచారంతో, నిష్పాక్షికంగా, వ్యాసంలో తగిన చోట్ల ఎక్కడ నుంచి రాశారో ప్రస్తావిస్తూ, కాపీకొట్టిన సమాచారం కాకుండా తగిన విధంగా వికీపీడియా శైలిలో తిరగరాసి, వ్యాసంలో పాఠకుడికి చదువుకునేందుకు వీలుగా లింకులు, వర్గాలు వంటివి ఉంటూ, వ్యాస విషయాన్ని వివరించేలా బొమ్మ చేర్చి వికీపీడియా ఐదు మూలస్తంభాలను స్ఫూర్తిని ప్రతిబింబించే వ్యాసాన్ని నాణ్యమైన వ్యాసం అని చెప్పుకోవచ్చు. ఐతే పైన పేర్కొన్న ప్రతీ విషయంతోనూ సమస్యలు ఉన్న వ్యాసాలు సృష్టి అయ్యాయి. విజ్ఞాన, పరిశోధన రంగాల్లో తెలుగు సమస్యలు కూడా దీనికి తోడువచ్చాయి. తొలినాళ్ళలో ప్రధానమైన అంశాలు అన్నటిపైనా వ్యాసాలు ఉండాలి అన్న పద్ధతిలో ముందుకు సాగడంతో వ్యాసాల్లో ఎక్కడ నుంచో తెచ్చి నేరుగా ప్రచురించడం, వికీపీడియా మూలస్తంభాల స్ఫూర్తి ప్రతిబింబించకపోవడం వంటి సమస్యలతో పాటుగా వ్యాసంగా పరిగణించలేనంత చిన్న పేజీలు సృష్టించడం లాంటి సమస్యలు కూడా ఉండేవి. ఇలా అతితక్కువ సమాచారం ఉన్న పేజీలను మొలకలు అని పిలుస్తూంటారు. ఇలా సమాచారం లేమితో పేజీలు తయారైతే వికీపీడియాలో చదవడానికి వచ్చిన పాఠకులు నిరుత్సాహం చెందుతారు, తెలుగు వికీపీడియా స్థాయిపై పెద్ద గొప్ప అభిప్రాయం ఏమీ ఏర్ఫడదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం తెలుగు వికీపీడియా ప్రాధాన్యతల్లో తొలినాళ్ళ నుంచి ఉంది. 2007లో చంద్రకాంతరావు ఎందుకు ఆ వ్యాసాలు అంటూ ప్రశ్నించినా, 2008, 2009 ప్రాంతంలో మొలక వ్యాసాలను పెంచడంపై సముదాయం దృష్టిపెట్టిందని వైజా సత్య ప్రకటించినా ఇందుకే. తర్వాతి కాలంలో ఈ మొలక వ్యాసాలను విస్తరించేలా, వ్యాసం రాసినవారినే ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఏ నెల తయారైన మొలక వ్యాసాల జాబితా, దాన్ని సృష్టించినవారి పేరుతో సహా ఆ తర్వాతి నెలలోనే ప్రచురించే పద్ధతులు అమలులోకి వచ్చాయి. చాలా తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలను నిర్ణీత వ్యవధిలోపు అభివృద్ధి చేయకుంటే తెలుగు వికీపీడియాలో మొలక వ్యాసాలు తొలగించేలా పాలసీ చేశారు.

ఇది కాక వ్యాసాల్లో సంబంధిత అంశం వచ్చినప్పుడు (ఉదాహరణకు తెలుగు అన్న వ్యాసంలో తెలంగాణ, ఆంధ్రపద్రదేశ్ అన్ణ పదాలు ఉంటే ఆ రెండు వ్యాసాలకు లింక్ ఇవ్వాలి) లింకులు ఇవ్వడం, వ్యాసాన్ని సంబంధించిన వర్గంలోకి చేర్చడం (తెలుగు అన్న వ్యాసం ద్రావిడ భాషలు అన్న వర్గంలోకి చేర్చాలి), అక్షరదోషాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దడం, సరైన నాణ్యతతో లేని వ్యాసాలకు దాని సమస్య ఏదన్నది చెప్పేలాంటి మూసలు (నిర్వహణ టాగ్ ల లాంటివి). వికీపీడియా సోదర ప్రాజెక్టు అయిన వికీమీడియా కామన్సుకు వెళ్ళి సరైన బొమ్మ తెచ్చి వ్యాసంలో చేర్చడం, లేదా వీలైతే మనమే తీసి వికీమీడియ కామన్స్ లో చేర్చి వ్యాసంలో పెట్టడం లాంటి పనులు చిన్న చిన్నగా చేసేవే కానీ ఈ పనుల వల్ల వ్యాసం నాణ్యతలో చాలా అభివృద్ధి కనిపిస్తుంది. పాఠకుడు చదివేందుకు వీలు ఇస్తుంది. కాబట్టే తెలుగు వికీపీడియన్లు వీటి మీదా దృష్టి సారించి వీలైనంత వీటిని అభివృద్ధి చేస్తూంటారు.

కొత్త సభ్యులకు స్వాగతం
వికీపీడియా అన్నది బహిరంగంగా చర్చలు చేస్తూ అభివృద్ధి చేసే నమూనాపై నిర్మించింది కాబట్టి తెలుగు వికీపీడియాలోని సమస్యలను తరచు వికీపీడియన్లే పేర్కొంటూ ఉంటారు. ఈ సమస్యల పరిష్కారంలోనే కొన్ని లక్ష్యాలూ ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఈ కృషిలో పాల్గొంటున్న సభ్యుల సంఖ్య. తెలుగు వికీపీడియా వ్యాసాల్లో వందమార్పులు చేసినవారి సంఖ్య 2017 నవంబరు నాటికి 14 మంది కాగా గత మూడేళ్ళ నుంచి మధ్యలో కొన్ని హెచ్చుతగ్గులతో వందమార్పులకు పైగా చేసినవారు నెలవారీగా సరాసరి 14 మంది వికీపీడియాలో స్వచ్చంద రచయితలే ఉన్నారు. 2005లో ఒక్క సభ్యుడి సంఖ్య నుంచి క్రమేణా ఎందరో వికీపీడియన్ల కృషి ఫలితంగా ఈ సంఖ్య ఇప్పుడు రెండంకెలకు పైన నిలబడింది. కొందరు ఒక్కొక్క సారి వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఇతర అంశాలు ప్రాముఖ్యం వహించడం వల్ల వికీపీడియాలో స్వచ్ఛంద కృషి కొన్నాళ్ళు తగ్గించుతూ ఉండగా, అలా అప్పటివరకూ బిజీగా ఉండి అదే సమయానికి కాస్త తీరిక దొరకగానే తెవికీలో రాయడం పెంచే మరికొంతమంది సభ్యులో, లేక కొత్తగా చేరేవారో ఉండడం వల్ల ఈ సంఖ్య తక్కువగానే అయినా నిలకడగా ఉంటోంది. దీన్ని పరిగెత్తించాల్సిన అవసరం ఎప్పుడూ వికీపీడియన్లు గుర్తిస్తూనే ఉన్నారు. తెలుగు వికీపీడియాలో స్వచ్ఛందంగా కృషిచేస్తూండే సభ్యుల సంఖ్య పెరగడం వల్ల వ్యాసాలు, నాణ్యత, వైవిధ్యం అన్నీ పెరుగుతాయి. వేలాదిగా ఉన్న వ్యాసాలు – లక్షలాదిగా పెరగడానికైనా, వ్యాసాల్లో సమాచారం నాణ్యత, లోతు పెరగాలన్నా, తెలుగువారికి తెలుగులో అందుబాటులో లేని మరెంతో విజ్ఞాన అంశాలపై వ్యాసాలు రావాలన్నా – తెలుగు వికీపీడియాలో రాసే సభ్యుల సంఖ్య పెరగాలన్న విషయం గతంలో వికీపీడియన్లు గుర్తించి, చాలాసార్లు చర్చల్లో వ్యక్తంచేశారు. తెలుగు వికీపీడియా ప్రారంభమై ఏడాది గడిచేలోగానే తెలుగు వికీపీడియన్ చదువరి తెవికీ వ్యాసాలు పెంచాలని చేసిన విజ్ఞప్తికి సమాధానమిస్తూ వైజాసత్య “అన్నింటికంటే ముఖ్య మైనది. సభ్యుల సంఖ్య పెంచడము.” అని ప్రస్తావిస్తూ అది సాధించేందుకు మార్గాల కోసం వెతికారు. అవసరమైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్లలాగా ప్రతీవారికి తెవికీలో రాయమని చెప్పాలనీ ప్రయత్నించారు. 2006-07 నాటికే `ఇ-మెయిల్’ ఉద్యమం పేరిట ప్రతీ వారం ఆ వారపు వ్యాసాన్ని (ఇలా ఓ మంచి వ్యాసాన్ని ఎంపికచేసి మొదటి పేజీలో ప్రచురిస్తూ ఉంటారు) మెయిల్ దారిని తమకు తెలిసిన తెలుగువారికి పంపడం – ఇలాంటి కృషి మీరూ చేయొచ్చని దానిలో రాయడం (మాకినేని ప్రదీప్, కాసుబాబు తదితరులు చేపట్టారు), ఆసక్తి ఉందని భావించిన తమ స్నేహితులకు తెవికీ గురించి చెప్పి తీసుకురావడం (రవిచంద్ర వంటివారు ఎందరో చేశారు) వంటివి చేశారు. ఈ కృషి ఫలితంగా తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకునేవారి సంఖ్య రెండంకెల నుంచి మూడంకెలకు పెరుగుతూ వచ్చింది. 2008ఫిబ్రవరి 3న లక్షలాదిమంది పాఠకులు ఉన్న ఈనాడు పత్రిక ఆదివారం సంచిక ముఖచిత్ర వ్యాసం (మన తెలుగు వెబ్ లో బాగు)లో తెలుగు వికీపీడియా గురించి సమగ్ర వ్యాసం ప్రచురించడంతో హఠాత్తుగా తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకునేవారి సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. 2008 ఫిబ్రవరిలో తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకున్నవారి సంఖ్య మొట్టమొదటి సారిగా 1500 దాటింది, వందమార్పులు చేసినవారి సంఖ్య ఒకే నెలలో 28కి చేరుకుంది. ఈ రెండు అంకెలను మళ్ళీ అందుకోవడం జరగలేదు. సహజంగానే తర్వాతి నెలల్లో ఈ కొత్త సభ్యుల ఒరవడి పడిపోయినా, సంవత్సరంలో నెలలో వందమార్పులు చేసినవారి సగటు సంఖ్య మరి ఎప్పుడూ 2007నాటి స్థాయికి (13మంది) మరి ఎప్పుడూ పడిపోలేదు. ఇందుకు వేరే వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు కానీ ఈనాడు పత్రిక ముఖపత్ర వ్యాసం ప్రభావం కేవలం తాత్కాలికమైనది కాదనే చెప్పాలి. 2009లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక ముఖచిత్ర వ్యాసంలో ప్రస్తావన వంటివి ఈ క్రమంలో మేలు చేకూర్చాయి. 2008 నాటి ప్రభావం ఎలావుందంటే తర్వాతి సంవత్సరాల్లో వికీపీడియన్లు సంఖ్య గురించిన ప్రస్తావన కాస్త పక్కకు నెట్టి వికీపీడియా నాణ్యత పెంచే ప్రయత్నాల్లో నిమగ్నం కాగలిగారు. ఐతే ఈ సహకారం ఏకపక్షం కాదు, నిజానికి తెలుగు వికీపీడియా సమాచారం పరంగా పత్రికలకు ఇచ్చినది, ఈ ప్రచారం రూపంలో తీసుకున్నదానికన్నా ఎక్కువ అనే చెప్పవచ్చు.
అయితే మరింతమంది వికీపీడియాలో రాయడం అన్నది చాలా కీలకమైన అంశం కనుకనే తిరిగి సముదాయం వికీపీడియన్ల సంఖ్య పెంపొందించేందుకు ప్రయత్నాలు సాగించింది. వికీమీడియా ఇండియా చాప్టర్ పేరిట వికీమీడియా ఫౌండేషన్ గుర్తించిన చాప్టర్ ను తెలుగు వికీపీడియన్ అర్జునరావు తొలి అధ్యక్షుడిగా ప్రారంభించారు. అర్జునరావు చొరవతో పలు కళాశాలల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి మరింతమందిని తెలుగు వికీపీడియన్లను చేసే దిశగా కృషి సాగించారు. శిక్షణా కార్యక్రమాలను కృషి రహ్మానుద్దీన్, విశ్వనాథ్, కశ్యప్, పవన్ సంతోష్ వంటివారు వ్యక్తిగత, సంస్థాగత కృషిలో భాగంగా వివిధ హోదాల్లో నిర్వహించారు. ఈ కృషిలో సముదాయంతో కలిసిపనిచేసే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అడ్ సొసైటీ, వికీపీడియన్లకు మద్దతునిచ్చి, నిర్వహణ కృషిలో భాగం పంచుకోగా ఆంధ్ర లొయోలా కళాశాల, విజయవాడ సంవత్సరాల పాటు భాగస్వామిగా విద్యార్థులకు వికీ శిక్షణను ఇచ్చేందుకు సహకరించింది. స్వాగతాలు చెప్పడం మొదలుకొని, వారి సందేహాలు నివృత్తిచేయడం, కొత్త వ్యాసాలు సృష్టించేలా, ఉన్నవి అభివృద్ధి చేసేలా సాయం చేయడం వంటి పనులు చేస్తూ కొత్తగా చేరిన సభ్యులను పలువురు వికీపీడియన్లు ప్రోత్సహిస్తూన్నారు. ఈ క్రమంలో డాక్టర్ రాజశేఖర్, వైజాసత్య, వెంకటరమణ వంటి పలువురు కొత్తవారిని వికీపీడియన్లుగా మలిచే ప్రయత్నాల్లో తమవంతు కృషిచేస్తున్నారు.

వ్యాసాల సంఖ్య పెరిగితే ఏం వస్తుంది?
ఆంగ్ల వికీపీడియాతో పోలిస్తే తెలుగు వికీపీడియా ముందున్న సమస్యలు వేరు, మన వికీపీడియన్లకు అందుబాటులోకి వచ్చిన వనరులు (మనుషులే కానివ్వండి, సాంకేతిక పరిజ్ఞానమే కానివ్వండి) వేరు, ఈ సమస్యలను అందుబాటులోని వనరులతో అభివృద్ధి చేసేందుకు వికీపీడియన్లు అనుసరించిన వ్యూహాలూ వేరు.
గుడ్డు ముందా? పిల్ల ముందా? లాంటి ప్రశ్నలు వికీపీడియన్ల ముందు ఎప్ఫుడూ ఉన్నాయి. వ్యాసాల సంఖ్య పెరిగితే వాటిని చదవడానికి వచ్చేవారు పెరుగుతారు, తెలుగు అంతర్జాలంలో వికీపీడియా స్థానం పెరుగుతుంది తద్వారా ఎక్కువమంది వికీపీడియన్లు పెరుగుతారు. కానీ సంఖ్య పెంచేందుకు నాణ్యత లేని వ్యాసాలు తయారుచేస్తే వికీపీడియా స్థాయి నాణ్యత పడిపోతుంది. మంచి నాణ్యత ఉన్న వ్యాసాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ మంది వికీపీడియాలో రాయాలి. ఇదొక సమస్యల వలయం. కానీ దీన్ని ఎక్కడో ఒకచోట ఛేదించాలి కాబట్టి ముందు వికీపీడియన్లు వ్యాసాల సంఖ్య, సమాచారం పెరగాలన్న దగ్గర దీన్ని ఛేదించారు. వికీపీడియా ప్రారంభించుకుని ఏడాది తిరగగానే దీని చక్రం తిప్పాలంటే తప్పకుండా వ్యాసాల సంఖ్య పెరగాలంటూ బాట్ (ఒకేలాంటి మార్పులను యాంత్రికంగా చేసే ఖాతా) ఉపయోగించి వేలాది గ్రామ వ్యాసాలను కొద్దిపాటి సమాచారంతో వైజాసత్య, మాకినేని ప్రదీప్ వంటివారు సృష్టించారు. సినిమాల వ్యాసాలను కూడా ఇలానే సృష్టించారు. ఈ అడుగుకీ – తెలుగు వికీపీడియా సంఖ్యాపరంగా పెరుగుదల రావడానికి తద్వారా తెలుగు వికీపీడియాకు పత్రికల్లో ప్రచారం రావడానికి, ఆ ప్రచారం ద్వారా వికీపీడియన్ల సంఖ్యపెరగడానికి, వారు తిరిగి సంఖ్యాపరంగానూ, నాణ్యతాపరంగానూ తెలుగు వికీపీడియా అభివృద్ధికి కృషిచేయడానికి సంబంధం ఉందని ఈనాడు పదేళ్ళ తర్వాత వెనుదిరిగి చూస్తే తెలుస్తుంది.

అప్పటి నుంచీ ఈ రెండు వర్గాల వ్యాసాలూ అతి తక్కువ సమాచారం నుంచి మంచి స్థాయికి పెంచాలన్న లక్ష్యాన్ని సమస్య రూపంలో సృష్టించడం, ఆ సమస్య పలువురు వికీపీడియన్లను సృష్టించుకుంది. ఎన్నో ఆలోచనలను నిర్మించింది. నిర్మాణాత్మకమైన పలు ప్రయత్నాలు, విఫలయత్నాల నుంచి నేర్చుకుని కొత్త ప్రణాళికలు రూపొందించడం సాగుతూ వచ్చింది. భాస్కరనాయుడు, గుళ్ళపల్లి నాగేశ్వరరావు, శ్రీరామమూర్తి, చంద్రకాంతరావు, జెవిఆర్కే ప్రసాద్, నాయుడు గారి జయన్న, వైవిఎస్ రెడ్డి, యర్రా రామారావు తదితరులు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామాల వ్యాసాల్లో విస్తారమైన కృషిచేశారు. వీరిలో కొందరు పలకరించని, మార్చని వ్యాసం ఇన్ని వేల వ్యాసాల్లో లేదంటే వారు చేసిన స్వచ్ఛంద కృషిలోని విస్తృతి తెలుస్తుంది. 2017-18లోనూ ఈ కృషి సాగుతోంది. ఈ వ్యాసాలు సమాచార లేమితో ఉండకుండా 2011 జనగణన సమాచారాన్ని ఉపయోగించి విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పండే పంటలు వగైరా సమాచారాన్ని యాంత్రికంగా రూపొందించి మనుషులు చూసి సరిదిద్ది ప్రచురించే కృషి సాగుతోంది.

తెలుగు వికీపీడియాలో తప్పనిసరిగా ఉండాల్సిన వెయ్యి వ్యాసాలు, వికీపీడియాలో ఉండాల్సిన వెయ్యి వ్యాసాలు వంటి జాబితాలు తెలుగు వికీపీడియన్లు అహ్మద్ నిసార్, కాసుబాబు, వైజా సత్య వంటివారు రూపొందించి సంవత్సరాలుగా పెంచుతూ పోగా సమిష్టి కృషితో వాటిలో చాలావరకూ వ్యాసాలు రూపొందించడం జరిగింది.

వ్యాసాల యజ్ఞాలు
సమాచారం పెంచడానికి, కొత్త వ్యాసాలను మరిన్ని రాయడానికి అంతర్జాతీయంగా 100 వికీడేస్ అన్న ఒక ప్రయోగం చాలా సఫలమైంది. ఒక మనిషి 21 రోజుల పాటు ఒక పనిని విడవకుండా చేయగలిగితే దాన్ని అలవాటు చేసుకోవచ్చని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెప్తూంటారు. అలాంటిది అంతర్జాలం, కాలం, విజ్ఞానం, స్వచ్ఛంద కృషి మీద ఆధారపడే వికీపీడియా వ్యాసాల సృష్టి ఒక్కరోజు విడవకుండా వందరోజుల పాటు రోజూ ఒక్కొక్కటి సృష్టించాలన్న నియమంతో 100 వికీడేస్ ప్రారంభమై ప్రాచుర్యం చెందింది. వందలాది భాషలకు చెందిన వికీపీడియన్లు ప్రయత్నించి కొందరు సాధించగలిగితే, మరికొందరు మధ్యలో విఫలమైనా కొన్ని వ్యాసాలను వారి వికీపీడియాలకు అందించగలిగారు. విన్-విన్ పద్ధతిలో రూపొందిన ఈ ప్రయోగాన్ని తెలుగు వికీపీడియన్ ప్రణయ్ రాజ్ వేరే స్థాయికి తీసుకువెళ్ళిపోయారు. వందరోజుల తర్వాత ఆపకుండా 365రోజుల పాటు కొనసాగించి ప్రపంచవ్యాప్తంగా తొలి వికీ వత్సరం పూర్తిచేసినవారిగా ప్రఖ్యాతి పొందారు. అంతేకాక దాన్ని 500 రోజుల పోటీ చేసి దాన్నీ సాధించి, ఇప్పుడు వెయ్యి రోజుల ప్రయాణం మొదలుపెట్టారు. తన పెళ్ళినాడు కూడా వ్యాసం రాసి స్వేచ్ఛా విజ్ఞానం పట్ల నిబద్ధతకు పట్టం కట్టారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా పలు వికీపీడియన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉపరాష్ట్రపతి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు గుర్తించి అభినందించారు. ఇప్పటివరకూ వందరోజులు వంద వ్యాసాలు రాసే వినూత్నమైన ప్రయోగాన్ని తెలుగు వికీపీడియాలో ఒకసారి సాధించింది పవన్ సంతోష్ కాగా, మీనా గాయత్రి రెండు సార్లు, ప్రణయ్ రాజ్ వరుసగా పలుమార్లు సాధించి ఒరవడి పెట్టారు.

ఎవరిదీ విజ్ఞానం?
అందరికీ సమస్త విజ్ఞానాన్ని స్వేచ్ఛగా పంచుకునేలా అందివ్వాలన్న లక్ష్యం సాధించడానికి విజ్ఞానంలో అడ్డుగోడలు, వైవిధ్య రాహిత్యం ఉండకూడదని వికీపీడియా ఉద్యమం గుర్తించేవుంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం అన్ని వికీపీడియాల్లోనూ 8 నుంచి 16 శాతం మధ్యలోనే ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. తద్వారా సమాచారంలోనూ వైవిధ్యం కొరవడి, మహిళల గురించిన సమాచారం 20-30 శాతానికి లోపే ఉంది. తెలుగు వికీపీడియాలో కూడా అతిఎక్కువ మార్పులు చేసిన 40 మంది వికీపీడియన్లలో మహిళలు ముగ్గురే, 25 మందిలో ఇద్దరు, మొదటి పదిమందిలో ఒకే ఒక్కరు. అలానే వ్యక్తుల గురించిన వ్యాసాల్లో మహిళల శాతం బాగా తక్కువగా ఉందని గుర్తించారు. మిగిలిన వ్యాసాల్లో ఈ వైవిధ్యం లేమిని గుర్తించే సాధనాలు తయారుచేసుకోవడమూ కష్టమే.

ఈ సమస్యను తీర్చడానికి తెలుగు వికీపీడియన్లు 2014 నుంచీ కృషిచేస్తూనే ఉన్నారు. 2013 వికీమేనియా (వికీపీడియా అంటే పిచ్చిప్రేమ ఉన్న ప్రపంచ వికీపీడియన్లంతా కలిసే కాన్ఫరెన్స్)లో కెలీనా ప్రస్తావించిన ఆంగ్ల వికీపీడియా వారి మహిళా శాస్త్రవేత్తల వ్యాసాల అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగులో కూడా చేయవచ్చని అర్జునరావు, విష్ణువర్ధన్ వంటివారు భావించారు. సుజాత, రాజశేఖర్, ప్రణయ్ రాజ్, వెంకటరమణ, రహ్మానుద్దీన్ వంటి వారిని కలుపుకుని లీలావతి డాటర్స్ (లీలావతి అన్న ప్రఖ్యాత మహిళా గణితవేత్త వారసులుగా భారతీయ మహిళా శాస్త్రవేత్తలను భావిస్తూ రాసిన పుస్తకం) అన్న పుస్తకం ఆధారంగా జాబితా వేసి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టు రూపకల్పన చేసి, విజయవంతంగా పూర్తిచేశారు. తద్వారా వందమంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల జీవిత చరిత్ర వ్యాసాలను తెలుగు వికీపీడియాలో సృష్టించి, అభివృద్ధి చేశారు. ఈ ప్రయత్నాన్ని అనుసరిస్తూ 2015, 2016 సంవత్సరాల్లో మహిళా చరిత్ర మాసంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే మార్చినెలల్లో తెలుగు వికీపీడియన్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఎడిటథాన్ పేరుతో వ్యాసాల మారథాన్, నోబెల్ బహుమతి అందుకున్న స్త్రీల వ్యాసాలు సృష్టించే మరో సమిష్టి కృషి జరిగాయి. 2017లో తెలుగు వికీపీడియన్ మీనా గాయత్రి వందరోజుల పాటు వంద వ్యాసాలు రాసే వికీ యజ్ఞం – 100 వికీడేస్ అన్నదాన్ని మార్పుచేస్తూ రోజూ మహిళలకు సంబంధించిన, మహిళల గురించిన వ్యాసాలు రాసేలా 100 వుమన్ వికీడేస్ అన్నదాన్ని రూపకల్పన చేశారు. దీన్ని భారతీయ భాషా వికీపీడియాల్లోనూ ప్రాచుర్యం చెందేలా ప్రచారం సాగించారు. మీనా గాయత్రి, ప్రణయ్ రాజ్ ఈ ఛాలెంజ్ విజయవంతంగా పూర్తిచేశారు. స్వరలాసిక కలంపేరుతో రాసే కోడిహళ్ళి మురళీమోహన్ ఈ క్రమంలో పలు వ్యాసాలు రాశారు.

పలువన్నెల పూవుల వెనుక కనిపించని దారం
రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో వివిధ ప్రాంతాలకు చెందినవారు, సాంకేతికం, బోధన, వైద్యం, నిర్వహణ వంటి పలు రంగాల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నవారి నుంచి విద్యార్థులు, గృహిణులు వంటివారూ – ఇలా ఎన్నో విషయాల్లో వైవిధ్యం ఉన్నవారంతా తెలుగు వికీపీడియా విస్తరణ, వికీపీడియా ఉద్యమ వ్యాప్తి కోసం చేయిచేయి కలిపి ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమ వైవిధ్యాలూ, వైరుధ్యాలూ ఎంత తీవ్రమైనవైనా స్వేచ్ఛగా తెలుగులో విజ్ఞానం లభించాలన్న లక్ష్యం వీరందరినీ కట్టివుంచుతోంది. కొద్ది గుప్పెళ్ళ జనం ఇన్నేళ్ళు తమ భేదాభిప్రాయాలను పంచుకుంటూ, వాటిలోని భిన్న కోణాల ద్వారా లాభం పొందుతూ స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియా నిర్మించేందుకు ఎలా పనిచేయగలగుతున్నారన్నది, అందుకు వారు అనుసరిస్తున్న పద్ధతులు, వారిని కలిపి నిలుపుతున్న అంశాలు ఏమిటన్నది విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు అధ్యయనం చేయదగ్గ విషయం.

తెలుగు వికీపీడియా సముదాయం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, తెలియనివి నేర్పించుకుంటూ తెలుగు వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల అభివృద్ధి అన్న ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పనిచేస్తోంది. ఈ క్రమంలో పలు వికీప్రాజెక్టులను ఉమ్మడిగా అభివృద్ధి చేయడమే కాదు, వికీపీడియా మూలసూత్రాలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అనువర్తింపజేసే విషయంలో ఉన్న అభిప్రాయ భేదాలను చర్చించుకోవడం, ఏకాభిప్రాయానికి రావడం వంటివీ చేస్తూంటారు. ఇలాంటి చర్చలకు, తెలుగు వికీపీడియా సముదాయానికి తెలియాల్సిన ప్రకటనలు, వంటివి ప్రచురించేందుకు రచ్చబండ అన్న పేజీని ఉపయోగిస్తూంటారు. అలానే ఒకరినొకరు సంప్రదించుకునేందుకు ఆయా వాడుకరుల (సభ్యులని అలా పిలుస్తారు) చర్చ పేజీల్లో కూడా రాస్తూంటారు.

ఈ చర్చల్లో చాలావరకూ సామరస్యపూర్వకంగా సాగగా, మరికొన్ని అంశాలు భిన్నాభిప్రాయాలు పదునుతేరిన చర్చలకు కారణమయ్యేవి. సాధారణంగా లక్ష్యం మరిచి చేసే చర్చలు మాత్రం అరుదు. పలు వాడివేడి చర్చల్లోనూ చంద్రకాంతరావు, కె.వెంకటరమణ వంటివారు తమ అభిప్రాయాలను పద్యాల రూపంలో మలచి సరదా వాతావరణాన్ని సృష్టించేవారు.
ఒకానొక చర్చలో కె.వెంకటరమణ రాసిన ఈ పద్యం ఒక ఉదాహరణ:

మొలకనైన నేమి మంచి విషయమైన
విస్తరించి దాని విలువ పెంచు
విషయలేమిదైన వివరింపు వ్యాసము
ఎవరికేమి ఫలము! తెవికి ధీర!

తెలుగు వికీపీడియాలో సమాచారాన్ని, నాణ్యతనీ పెంపొందించేందుకు పలు వికీ ప్రాజెక్టులు నిర్వహించారు. అంటే ఒకలాంటి వ్యాసాలపై పనిచేయడం వల్ల వికీపీడియాకు లాభం ఉంటుందని నమ్మి దానిపై ఒక్కొక్కరూ ఒక్కొక్క పనీ పంచుకుని రాయడం అనుకోవచ్చు. అలా తెలుగు ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, తెలుగు సినిమాలు, సాహిత్యం, తెలుగు పుస్తకాలు, పత్రికలు వంటి ప్రాజెక్టులు ఎన్నిటిలోనో చేయిచేయి కలిపి పనిచేశారు.

ఆన్లైన్లోనే కాకుండా బయట పలు సమావేశాలను నిర్వహించుకున్నారు. వీటిలో తెలుగు వికీపీడియా స్థాయిలో పెద్ద ఎత్తున నలుచెరగులా ఉన్న తెలుగు వికీపీడియన్లను కలుపుకుని విజయవాడలో దశాబ్ది ఉత్సవాలు, తిరుపతిలో 11వ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. వీటి నిర్వహణ ప్రధానంగా వికీపీడియన్లే ఆధ్వర్యం వహించి చేశారు. తమ కృషికి సహకరించే వికీమీడియా ఫౌండేషన్, సీఐఎస్ వంటి సంస్థల సహకారం తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కమిటీకి బి.కె.విశ్వనాథ్, 11వ వార్షికోత్సవాల నిర్వహణ కమిటీకి భాస్కరనాయుడు అధ్యక్షత వహించగా, నిర్వహణ కమిటీలో ప్రణయ్ రాజ్, కశ్యప్, టి.సుజాత, రాజశేఖర్ వంటి పలువురు కృషిచేశారు. ఇదిలా ఉండగా 2010 నుంచి మొదలుకొని హైదరాబాద్ నగరంలో తెలుగు వికీపీడియన్లు నెలవారీ సమావేశాలు నిర్వహించుకుంటూండడం కూడా ఉంది. వీటిలో సమీక్ష, వికీపీడియన్లు సాధించిన మైలురాళ్ళకు సంబరాలు, అతిథులను ఆహ్వానించి వారితో సంభాషణ, కొత్త అంశాలు నేర్చుకోవడం వంటి ఎన్నో పనులు చేస్తూంటారు. ఐతే కేవలం ఆన్లైన్లోనే ఉండి, బయట సమావేశాల్లో పాల్గొనని వారూ, ఎక్కడో విదేశాల్లో ఉండి భారతదేశంలో జరుగుతున్న సమావేశాల్లో పాల్గోలేకపోయినా అంతర్జాలంలో నిర్వహణ సహకారం అందించేవారు – సముదాయంలోని వైవిధ్యానికి, సమిష్టి తత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.

వికీపీడియాలో సమాచారంలో తప్పులు, తడకలు చేరుస్తూంటే సరిజూడడం, హెచ్చరించడం చేసినట్టే చక్కని కృషి చేస్తూన్న వారికి చర్చ పేజీల్లోనే వివిధ పతకాలు (అంతర్జాలంలోని డిజిటల్ పతకాలే చాలావరకూ) ఇచ్చి ప్రోత్సహిస్తూంటారు – వాటికి గండపెండేరం, వీరతాడు, తెలుగు పతకం లాంటి పేర్లు పెట్టుకున్నారు. 2014, 15ల్లో రెండు మార్లు మొత్తం పదిహేనుమందికి తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వం నిర్మించిన కొమర్రాజు లక్ష్మణరావు పేరు మీదుగా కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారాన్ని ప్రకటించి, తెలుగు వికీపీడియా, సోదర ప్రాజెక్టుల అభివృద్ధికి కృషిచేసిన 15 మందికి ప్రదానం చేశారు. తెలుగు వికీపీడియా ప్రపంచంలో వికీపీడియాతో పాటు తెలుగు స్వేచ్ఛా అంతర్జాల గ్రంథాలయమైన వికీసోర్సు, స్వేచ్ఛా నిఘంటువు అయిన విక్షనరీ – వంటి ప్రాజెక్టులూ ఉన్నాయి. పైన చెప్పినవారిలో కొందరు, అసలు ప్రస్తావనకే రానివారు మరికొందరు ఈ ప్రాజెక్టుల్లోనూ కీలక పాత్ర వహించి అభివృద్ధి చేశారు. ఎందరో మహానుభావులు – అందరి కృషీ పూర్తిగా ప్రతిఫలించేలా రాయాల్సివస్తే సమగ్ర అధ్యయనంతో పుస్తకాలే రావాలి. ఐతే తెలుగు భాష కోట్లాదిమంది మాతృభాషగా ఉన్నా, వినోదం, వార్తా ప్రసారాలు వంటి కొన్ని రంగాల్లోనే వెలుగుతూ ఉంది. తెలుగులో విద్యాబోధనకు, పరిశోధనలకు అత్యంత కీలకమైన విజ్ఞానాభివృద్ధి విషయంలో వికీపీడియన్లు చేస్తున్న కృషి ప్రాముఖ్యత తెలుగు సమాజం ఇంకా గుర్తించాల్సివుందనే చెప్పాలి.
వినోద భాషగా, వాడుక భాషగా కోట్లాది మంది వాడుతున్నా, విజ్ఞాన భాషగా, పరిశోధన భాషగా మాత్రం ఆ స్థాయి వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్న తెలుగు విషయంలో తెలుగు వికీపీడియా చేస్తున్న కృషి భావి తెలుగు భాషకే పునాదిని నిర్మించడమే.

[1]గృహిణిగా తమ పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళ బాధ్యతలు పూర్తిచేసుకున్న తర్వాతి దశలో అమెరికాలో నివసిస్తున్న కూతురితో ఇంటర్నెట్లో సంభాషించేందుకు 2000 దశకం తొలినాళ్ళలో కంప్యూటర్ చేపట్టారు. ఒక అంశాన్ని వెతుకుతూ తెలుగు వికీపీడియాకు వచ్చి, 2006 నుంచి ఇక్కడ స్వచ్ఛంద కృషి చేస్తున్నారు.

[2] మరీ ముఖ్యంగా 2006 నవంబరు నెలలో వీరి కృషి ఫలితంగా ఈ సంఖ్య 300 దాటింది

[3]వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 12లో “తెవికీ వ్యాసాలు – పత్రికల కాపీ” అన్న విభాగంలో చర్చ ఈ అంశంలో చాలా చిన్న భాగాన్నే స్పృశించింది. తెలుగు వికీపీడియాని స్వేచ్చగా ఎవరైనా వాడుకునేందుకు వీలుంది, కాకుంటే వికీపీడియా నుంచి సమాచారం తీసుకున్నట్టు ప్రస్తావించాలి. ఉద్దేశం ఎవరైనా స్వేచ్ఛగా వాడుకునే విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచేయడం కాబట్టి వికీపీడియాను ప్రస్తావించకుండా చేసిన కాపీని ప్రోత్సహించకపోయినా వికీపీడియన్లు గట్టిగా ఎప్పుడూ వ్యతిరేకించను కూడా లేదు.

కవి హృదయం లో వైశ్విక స్పృహ గురించిన దార్శనికత

0

భావసుమాలు – పుస్తకమందసము
చరము, అచరములు అన్నీ కలిసినదే ప్రకృతి. అంటే చలించే ప్రాణులు, చలించకుండానే పలుకరించే (అ)ప్రాణులు. ఈ రెండు రకాల వాటిల్లో దేన్ని చూసినపుడో వాటి (మనసు)కి, మన మనసుకు మధ్య అనుకోకుండా కలిగే భావప్రకంపనలు ఒక్కోసారి ఎంతో బలమైనవి గా ఉంటాయి. చెట్టు గాలికి ఊగగా ఆకులు, పువ్వులు, పిందెలు, పండ్లు రాలినపుడు వాటిలో మనకు పనికి వచ్చేవి మాత్రమే తీసిపెట్టుకుంటాము. అలాగే భావ ప్రకంపనలు కూడా సువికాసం చెందిన పువ్వుల్లాగానో, పక్వానికి వచ్చిన ఫలాలవలెనో పరిణతి చెంది ఉంటేనే బుద్ధివికాసానికి తద్వారా స్థిరశాంతికీ దోహదం చేస్తాయి. అటువంటి భావసుమాలు, ఫలాలు దాచే మందసాలే పుస్తకాలు. కాబట్టే పుస్తకాలకు అంతటి విలువ. అందరు అభిమానులు. అందరు దాసులు. మరి వీటిలో ఏదుంటే మంచిదో, ఏది కాదో? ప్రాచీన భావుక స్పందనలా? ఆధునిక భావజాలాలా? ఏది అవసరం?
ఏది కాదు?
ఆలోచించి , నిరూపించి భౌతిక ప్రగతికి తోడ్పడే వస్తుప్రపంచపు పుస్తకరాశుల విషయం కాకుండా తమతమ స్థాయిల్లో ఆలోచింపజేసి, నిరూపణకు సిద్ధంచేసి బౌద్ధిక ప్రగతికి తోడ్పడే భావప్రపంచపు పుస్తక రాశుల విషయం ప్రస్తుత చర్చాంశం.
ప్రాచీనకవిత్వమూ ఆధునిక కవిత్వమూ (అది కవిత, వచనం,పద్యం ఏ రూపంలో ఉన్నా) ఒకదానికొకటి శత్రువు కాదు. లేక పాతదంతా పనికిమాలినది, బూజుపట్టినదీ-కొత్తదంతా నవనవలాడేదీ అనే వ్యత్యాసాలేమీ లేవిక్కడ. అది ఒక కోణం అయితే ఇది ఒకకోణం. ఈ విషయం గురించి చర్చించే ముందు కవిత్వపు భిన్న పరిధుల గురించి కొంత.

కవిత్వపు భిన్న పరిధులు-

వ్యక్తిగత పరిధి

స్త్రీని గురించి పురుషుడు , పురుషుని గురించి స్త్రీ ఆదిగా గల పరిమితమైన పరిధుల్లో ఉండే కవిత్వం ఒకటి. పురుషుని అనేకానేక ప్రత్యేకతల్లో ఒకటి సమస్త ప్రకృతినీ ఆరాధించడం/సాధించుకోవడం. రెండింటి ఉద్దేశ్యమూ ఒకటే . చేరుకోవడం ఆ గమ్యాన్ని. సమస్త ప్రకృతి అనగా స్త్రీ కూడా అందులో భాగమని విడిగా చెప్పనవసరం లేదు.
స్త్రీ అనేకానేక ప్రత్యేకతల్లో ఒకటి మాతృత్వం. అంటే బిడ్డను కనడం కాదు. తల్లి కావడం. ఎన్నో దశల్లో ఆమె అమ్మగా మారుతుంటుంది. తనకు తెలిసిన ప్రతీదాన్నీ, ప్రతీవస్తువునీ, ప్రతీమనసునీ,
బిడ్డగా చూడడం మొదలుపెడుతుంది. (మొదట్లో కాకున్నా కొంతకాలం తర్వాతైనా) బాగోగులు చూసుకుంటుంది. బాగోగులు అంటే శరీరాలపోషణ, రక్షణ మాత్రమే కాదు. ప్రకృతినీ, మనసుల్నీ, బుద్ధుల్నీ అవి వెళ్ళే దారుల్నీ అనుక్షణం సురక్షితంగా ఉంచాలనుకుంటుంది. అనుకూలం చేయాలనుకుంటుంది. ఇందుకు కొన్ని సందర్భాలు, వ్యక్తులు అపవాదుగా ఉండవచ్చు.
ఇంకోమాటేమంటే ఒకరి ప్రత్యేకతలు ఇంకొకరిలో ఉండవని కాదు. ఉంటాయి. కానీ ప్రధానంగా స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేంత ప్రాముఖ్యంగా ఉన్న ప్రత్యేకతలను గురించి మాత్రమే చెప్పడం జరిగింది. ఈ ప్రత్యేకతల వలన కొందరిలో సహజంగా వికసించేది రాగద్వేషాలతో నిండిన కవిత్వం. ప్రణయకవిత్వం పట్ల చాలామందికి ఇష్టము ఉంటుంది. చాలాకాలమూ ఉంటుంది. ప్రణయకవిత్వం స్త్రీ పట్ల మాత్రమో పురుషుని పట్ల మాత్రమో గొప్పదయేది కాదు. ప్రణయం గొప్పదంతే. అది ఎవరిలో పుడుతుందో వారిది గొప్పదనం. కదా!
ఈ వ్యక్తిగత పరిధిలో ఉన్న రాగ కవిత్వమైనా కొంతవరకే ఆనందాన్నిచ్చేది. ద్వేషపు రాతల గురించి కొత్తగా చెప్పేదేం లేదు.

విస్తృతపరిధి

ఇక విస్తృతపరిధి విషయానికొస్తే తాము చూస్తున్నవాటి పట్ల, ఎదురుచూస్తున్నవాటిపట్ల సౌందర్యదృష్టితో, సౌందర్యానుభూతితో మాత్రం స్పందించడం కాకుండా, సమన్వయ భావన కూర్చుకొని విశ్వకల్యాణాన్ని కాంక్షించగల కవి దార్శనికుడు ఔతున్నాడు. సుఖదుఃఖాలు, వేదనానందాలతో నిండిన ఈ ప్రపంచపు అనుభవాలను వ్యక్తీకరించడం మాత్రమే కాకుండా ఆశావహదృక్పథాన్ని నిర్మించడం కర్తవ్యం గా
అటువంటి కవులు భావిస్తారు. ఎదుర్కొన్న ఓటమిపైన, ఆవరిస్తున్ననిరాశపైన దృష్టి కేంద్రీకరించడం కాకుండా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు.

[ad id=’3971′]

స్త్రీని గురించి పురుషుడు, పురుషుని గురించి స్త్రీ వ్రాసుకునే పరిమితమైన పరిధి కాక సృష్టిలో ఉన్న ప్రతి అంశానికీ మిగిలిన ప్రకృతి అంతటితో ఎంతటి బంధమో, వారి(టి)పట్ల ఎంతటి కర్తవ్యమో సూచిస్తూ మేలు కొలపాలనే ఆరాటమే కవిత్వంగానూ, ఇతర కళాప్రక్రియలు గానూ రూపుదిద్దుకుంటుంది. సృష్టిలో ఎవరి గొప్పదనం వారిదేనని, దేని గొప్పదనం దానిదే అనీ కవులందరికీ తెలుసు. గడ్డి పూవు లోనూ గగనతలం పైనూ నిమ్నోన్నతల దృష్టి కాదు వారిది. అయితే, బాహ్యదృష్టితో నిరంతర అన్వేషణలో పరుగులు పెడుతున్న సమాజాన్ని తట్టి అంతర్దృష్టి పెంపొందించుకోమని చెప్పడం దార్శనికులు మాత్రమే చేయగలుగుతారు. తన మనసునీ, స్వభావాన్నీ తాను అర్థం చేసుకొని సరిదిద్దుకోగలిగితే అంతకన్నా లోకకల్యాణం లేదని చెప్పగలిగే శక్తి కవికుంటుంది. దృష్టి గోచరమైన ప్రకృతినంతా స్వస్వరూపంగా ఊహించుకొని , అర్థంచేసుకొని, దానికి కావలసిన అభ్యున్నతి ఏమిటో తెలుసుకొని సాధించగలిగే మార్గాలను అన్వేషిస్తూ అందుకు కావలసిన ఆత్మోద్ధరణకై సంకల్పం చేసుకోవడం, పరబ్రహ్మ స్వరూపంగా భావించే శక్తిని ‘తనలోకూడా అంతటి శక్తి నింపమని ‘ అడగడానికై చేరుకోవాలని తపించడం ఆ కవి స్వభావాలు. ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి.

జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ హిందీ ఛాయావాద కవయిత్రి 1907 లో పుట్టిన మహాదేవీవర్మ కవిత్వం లో అనంత గగనాన్ని, తారలను, పువ్వులను, పక్షులను ఇలా ఎన్ని ప్రతీకలుగా తీసుకున్నా చివరకు అన్నింటిలో తనను తాను దర్శించి , తన వేదనను, ఆనందాలను, వియోగాన్ని, తల్లీనత్వాన్ని వాటిలో దర్శిస్తూ, అన్నింటినీ ఆస్వాదిస్తూ, జీవనాన్ని, మృత్యువునూ, బాధను, సంతోషాన్ని ఒకేరకంగా స్వీకరిస్తూ, వీటన్నింటినీ దాటిన ఒక అవ్యక్త స్థితికి చేరుకోవాలనుకుంటుంది. ఎన్నటికి ముగుస్తుందో తెలియని
అనంత నిరీక్షణలో కొనసాగుతూ ఒక అజ్ఞాత చెలికాని రూపంలో పరబ్రహ్మస్వరూపాన్ని చూస్తుంది. ప్రకృతి పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెందగలిగే అత్యున్నతస్థాయికి చేరుకోవడం కోసం అనంత వేదనలో ఉన్నా నిరాశను దగ్గరకు రానివ్వకుండా, చిరంతన ప్రతీక్షతో నిస్పృహ భావనలు లేకుండా తాత్విక దృష్టిని పెంపొందింప చేస్తుంది.
ఊహించరానంత సృష్టి కీ , లఘుతర మానవదేహానికి మూల కారణం పంచభూతాత్మక తత్వమే అన్న సత్యం మాత్రమే తనను సృష్టిగా, సృష్టిని తనుగా భావించగలిగే ఉదాత్తత నీయగలదు అంటున్న ఈ కవిత చూద్దాం.

नील नभ का असीम विस्तार
अनल के घूमिल कण दो चार
सलिल से निर्झर वीचि-विलास
मंद मलयानिल से उच्छ्वास
धरा से ले परमाणु उधार
किया किस ने मानव साकार?

నా తెలుగు అనువాదం..

నీలాకాశపుటనంతత్వం
అగ్నికణముల తత్వం
నిర్మల జలవిలాసం
మందవాయు ఉచ్ఛ్వాసం
ధరిత్రి కణముల సహవాసం
మానవ రూపావిర్భావం

[ad id=’3971′]

వారి మరొక కవిత దేహేంద్రియకర్మలన్నీ ఆ పరబ్రహ్మకై అర్పణ చేస్తూ…

क्या पूजन क्या अर्चन रे!

उस असीम का सुंदर मंदिर
मेरा लघुतम जीवन रे
मेरी श्वासें करती रहतीं
नित प्रिय का अभिनंदन रे

पद रज को धोने उमड़े
आते लोचन में जल कण रे
अक्षत पुलकित रोम मधुर
मेरी पीड़ा का चंदन रे

स्नेह भरा जलता है झिलमिल
मेरा यह दीपक मन रे
मेरे दृग के तारक में
नव उत्पल का उन्मीलन रे

धूप बने उड़ते जाते हैं
प्रतिपल मेरे स्पंदन रे
प्रिय प्रिय जपते अधर ताल
देता पलकों का नर्तन रे
….
…..
నా తెలుగు అనువాదం..

ఏ పూజావిధులేలా అర్చనలేలా?

అనంతుడగు స్వామికి కోవెల ఈ చిరు జీవనమే
అభివాదనలొనరిచునులే నా ఊపిరులే!
పదధూళిని కడిగేదో నా కంటను కన్నీరే
పులకింతలు అక్షతలైతే నా వేదన చందనమై
అలరారే!
రాగ భరిత మది ప్రమిదను వెలిగించితినే
కనుచూపుల కలువపూలు అర్పించితినే!
సుగంధముల నా స్పందనలే ధూపాలే
అధరాంకిత జప తాళమునకు కనురెప్పల నటనాలే!

కల్పన ఆవశ్యకత

ప్రకృతి (చరాచర జగత్తంతా) వర్ణనలు కనిపించిన కవిత్వం సామాజిక స్పృహ లేనిదన్న నిరసన భావన ఈ మధ్య కాలంలో ప్రాచుర్యానికెక్కిన ఒక దురవగాహన.

సామాజిక స్పృహ అంటే?తన చుట్టూ ఉన్న సమాజాన్ని,దాని యొక్క నందవిషాదాలను,సాధకబాధకాలను ఆవిష్కరించడం తప్పనిసరి అని తెలుసుకుంటే చాలా ? తన చుట్టూ ఉన్న ప్రకృతి యొక్క ఆనందవిషాదాలను, సాధకబాధకాలను ఆవిష్కరించనక్కర లేదా?

[ad id=’3971′]

ఇక్కడ ప్రస్తావించబడుతున్న ముఖ్యమైన అంశం ఏమంటే సామాజిక స్పృహ ఆవశ్యకత తెలుసుకున్నంతగా ప్రాకృతిక స్పృహ ఆవశ్యకత కూడా మనం తెలుసుకోవలసి ఉంది.
సమస్త ప్రకృతినీ తనుగా చూస్తూ తనలో ప్రకృతి వేదననంతటినీ అనుభవిస్తూ ఆ వేదన నుంచి అనంత ప్రకృతి విముక్తి పొందాలని ఆశించే కవికి ఏదైనా ఒక స్పృహ లేదనడం దుస్సాహసం. తన జీవనానికి సహకరించే సమాజం యొక్క స్పృహ ఎంత అవసరమో తన ఉనికికే ఆధారమైన ప్రకృతి గురించి మానవునికి అవగాహన, అనుబంధం, కర్తవ్యం కలిగించే స్పృహ ఉండి తీరాలి. సామాజిక స్పృహలో స్పృశించబడే అంశాలు మనుషుల మధ్య భౌతిక అవసరాలు, లౌకిక ఆధార భూతత్వము అయితే ప్రాకృతిక స్పృహలో స్పృశించబడే అంశాలు మానసిక అనుభూతులు తద్వారా ఆత్మావిష్కరణ.

మళ్ళీమళ్ళీ చెపుతున్నది ఏమంటే ప్రకృతి అంటే సకల చరాచర సృష్టి. అంటే చెట్లు, చేమలు, కొండలు, నీటి నెలవులు, అనంతాకాశంలో ధ్వనించే, ప్రతిధ్వనించే నిశ్శబ్దం, ఈ అప్రాణులతో టుసాటిప్రాణులన్నిటి సహజ స్వభావాలు (మూగజీవాలు కానివ్వండి, సాటి మానవులు కానివ్వండి, సర్వవ్యాపి అయిన పరాశక్తి కానివ్వండి). వీటన్నిటిపట్ల ఉన్న అవగాహన , కర్తవ్యము కూడా ప్రాకృతిక స్పృహ అనే భావనలో ఉన్నాయని తెలుసుకోవలసి ఉంది.

(ఎన్ని రకాల సాహచర్యాలున్నా ఏదో ఒకక్షణంలో ఒంటరితనమో/నిస్సహాయత్వమో బాధించే మనిషికి తోడుగా ఉండేశక్తి పరాశక్తి అంటున్నాను. దాన్ని దేవుడు గా నమ్మే వాళ్ళుండొచ్చు. లేదా స్వశక్తిగా భావించేవాళ్ళుండొచ్చు.)

సాటి ప్రాణుల సహజ స్వభావాలు అన్నవిషయం మరింత వివరించడానికి ప్రయత్నిస్తాను. సామాజిక స్పృహ మాత్రమే గొప్పదని భావించే మేధోవర్గంలో ప్రాకృతిక స్పృహ ను బాధ్యతారాహిత్యమని భావించే క్రమంలో సహజత్వాన్ని చాలా తేలికగా విడిచిపెట్టడం జరుగుతుంది. సమాజంలో ఉన్న ఒత్తిళ్ళను ఎత్తి చూపించే క్రమంలోప్రతీ వాటి సహజత్వం ఎంత చులకనగా తీసివేయబడుతుందనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఒకటి ప్రతి విషయంలో సమానత ప్రాతిపదికగా ఒకే రకమైన ఆనుకూల్యాలు ఉండాలని, ఉంటేనే న్యాయం చేయడమన్న వెఱ్ఱి ఎంతవరకూ చేరుకుందంటే ప్రకృతిలో హాయిగా సంచరించి అన్ని అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఉండగల మూగజీవాలకు దుస్తులు, ఏసీ గదులు, కృత్రిమ ఆహారాలు కల్పించడం. ఎందుకంటే మనుష్యులకు ఏముండాలనుకుంటామో వాటికీ అవే ఉండాలనుకునే మూర్ఖత్వమే. నిజానికి మనుష్యులకు కూడా ప్రకృతి సహజంగా జీవించడం లో లభించే మానసిక, శారీరక ఆరోగ్యాలు ఇప్పటి అత్యాధునిక జీవనశైలిలో లభించవన్నది ఈ మధ్యే మనిషి తెలుసుకుంటున్న సత్యం. అంతలోనే తొందరపడి మూగప్రాణులకూ సౌకర్యాలనే రెండువైపులా పదునున్న కత్తిని మెడకు కట్టబోవడం మూర్ఖత్వం కాదని అనుకోవడం కుదరదు.

ఇక సాటి మానవుల సహజస్వభావాలను గుర్తించకపోవడం కూడా ఎంత దారుణాలకు దారితీస్తోందో ప్రపంచానికి తెలుస్తూనే ఉంది ఒకప్రక్క. వయస్సు సహజ పెరుగుదలను కనిపించకుండా చెయ్యాలనుకోవడం (యౌవనంలో ఎలా ఉంటామో అదే అందరికీ అన్ని వయసులకీ వర్తింపజేయాలనే సమానత్వపు పిచ్చిలోకే ఇదీ వస్తుంది.) , ఇష్టం ఉన్నా లేకపోయినా చదువు/డబ్బుసంపాదిస్తేనే ప్రయోజకులుగా చూడడం, తన స్వార్థం విడిచి సమాజం కోసం పనిచేసే ఎవరినైనా బెదిరించో, వెక్కిరించో స్వార్థపు దారుల్లోకే లాగాలనుకోవడం, స్త్రీ పురుషుల ప్రత్యేకతలనునిర్లక్ష్యం చేస్తూ కొన్నాళ్ళు స్త్రీలందర్నీ పురుషుల్ననుకరించేలా ప్రేరేపించడం.(పోయిన శతాబ్దపు సమాజం), కొన్నాళ్ళు పురుషులందర్నీ స్త్రీలననుకరించేలా ప్రేరేపించడం(నేటి సమాజం).ఇంక పరాశక్తిని, స్వశక్తిని నమ్మేవాళ్ళు పరస్పరం తమ అభిమతాల్ని గౌరవించుకోకుండా తామున్నట్టే అవతలివాళ్ళుండాలని ఆశించడం.

ఇటువంటివన్నీ సహజత్వాన్ని నమ్మకపోవడం , ఆదరించకపోవడం వల్లే జరుగుతాయి. ప్రకృతి అంటే సహజ స్వభావం. అది చెట్టుకైనా, కుక్కకైనా, మనిషికైనా. వేపచెట్టు ఎలా ఉంటుందో మామిడి చెట్టు అలా ఉండాలంటే ఎలా?
దేని ప్రత్యేకత దానిదే. సరిగ్గా ఈ సహజత్వాన్ని గుర్తించాలంటే మనిషికి ప్రాకృతిక స్పృహ ఉండాలి.

కల్పన పాత్ర
రవిగాంచనిచో కవిగాంచున్ అన్నారు. కవి గాంచు చోటెల్లా ప్రపంచమూ కాంచగలదా? లేదు. కాంచలేదనీ , అర్థం చేసుకోలేదనీ గట్టిగా చెప్పవచ్చు. కవిత్వపు అనుభూతి కవి నుంచి రసజ్ఞుడి వరకూ పోవడంలో కల్పన పాత్ర చాలా ముఖ్యమైనది.కల్పన సహాయం తీసుకున్నప్పుడే రసాత్మక వ్యక్తీకరణ సార్థకంగా ఆవిష్కరింపబడగలదు. కవితా వస్తువుగా కనిపించే ప్రకృతి (అంటే మళ్ళీ ప్రాణి అప్రాణి సమూహమంతా) తో మొదలుపెట్టి పరబ్రహ్మ స్వరూపం వరకూ దేన్ని తీసుకున్నా కవి అనుభూతుల్ని పంచడంలో కృతకృత్యుడు కావాలంటే మరింత ప్రభావవంతంగా స్వభావాదుల్ని వర్ణిస్తూ, పోలికలతో వివరిస్తూ, వెన్నంటి వచ్చే ఆలోచనలను పంచుతూ ఒక శబ్దచిత్రాన్ని ఆవిష్కరింపజేయాలి. కవి అంతరంగం పదాలవెనుక ధ్వనించగలగాలి.

వైశ్విక స్పృహ

ప్రాకృతిక స్పృహ, సామాజిక స్పృహ రెండూ కలిస్తే వైశ్విక స్పృహ అవుతుంది.ఏ ఒక్కటీ అనవసరం కాదు. రెండూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయాలు కాకుండా పూరకాలు కావాలి. నిజానికి ఈ రెండూ కలిస్తేనే వైశ్విక స్పృహ అవుతుంది. ఈ వైశ్విక స్పృహ వైపు జాగృతం చెందినపుడే మనిషి బుద్ధి జీవి అన్న బిరుదుకు అర్హత సాధించుకోగలడు.

రచనల్లో ప్రాకృతిక స్పృహ, సామాజిక స్పృహ రెండింటినీ మెఱుగు పరచుకోవడానికి మనము గుర్తించవలసిన కొన్ని విషయాలు –

1. ప్రాకృతిక స్పృహ లో ముఖ్యంగా చేరవలసినది కర్తవ్యబోధ. ప్రకృతి వర్ణన లక్ష్యంగా కాకుండా, సాధనంగా మలచుకొని మనకొఱకే ప్రకృతి అనే దృష్టికోణం కాక ప్రకృతికై మనము, ప్రకృతిలో మనము అనే భావన పెంపొందించే ధోరణి సునాయాసంగా కర్తవ్య బోధ చేయగలదు. ఈ కర్తవ్యబోధ లోపించిన రచనలు కాలానికి నిలువడం లేదు.
2. సామాజిక స్పృహ లో ముఖ్యంగా చేరవలసినది ఆశాభావము. భీభత్స రసమొలుకుతూ నిరాశ, నిర్వేదము , పరస్పరద్వేషము పెంచుతూ పోతున్న రచనలు కాలానికి నిలువవు. బలమైన సంకల్పంతో నిండిఉండే ఆశావహ దృక్పథంతో ఉంటేనే ఆ రచన చేయి పట్టుకొని దారి చూపించి సమాజాన్ని తద్వారా విశ్వాన్ని సంక్షేమం వైపుకు నడిపిస్తుంది. ప్రగతికి బాటలు వేస్తుంది.

[ad id=’3971’]

ఈ రెండు ప్రతిపాదనలనూ ఈ విధంగా నిరూపించవచ్చు.

1. వేలూ లక్షలూ ఉన్న ప్రాచీన కావ్యాల పరంపరలో కర్తవ్యనిష్ఠను బోధిస్తూ, చీకటివెలుగుల వలె మంచిచెడులు నిరంతర సంచారం చేసే లోకంలో మనవంతు దీపం వెలిగించగలగడం చూపించడం వల్లనే రామాయణం మొదలైన గ్రంథాలు ప్రపంచ దృష్టిని నేటికీ అద్భుతంగా ఆకర్షిస్తున్నాయి.
రామాయణంలో కర్తవ్యనిష్ఠ ఎలా ఉందన్నది నిరూపించడానికి ప్రయత్నిస్తాను. మనిషి స్వతహాగా ప్రేమమయుడు. ఆనందమయుడు. అది తాత్కాలికమైన లౌకికానందం కానివ్వండి, శాశ్వతమైన బ్రహ్మానందం కానివ్వండి. ఆనందం పొందడమే ప్రాణిమాత్రపు ఏకైక లక్ష్యం. ఇది సహజమైనది. కానీ ఈ ఆనందం పొందే క్రమంలో ఇతరుల ఆనందాన్ని ధ్వంసం చేసేదే దుర్మార్గం అనబడుతుంది. లౌకికానందం పొందాలనుకున్న సామాన్యులను, బ్రహ్మానందం పొందాలనుకున్న అసామాన్యులను బాధించి తన ఎల్లలను మీరి నడచుకున్న పక్షానికి ఆ ఎల్లలను గుర్తు చేయడమే అందులో ఉన్న కర్తవ్యనిష్ఠ. ప్రాణిమాత్రపు సహజస్వభావమైన ఆనందాకాంక్ష కు ఆటంకాలు తొలగించడమే ఇందులో ఉన్న ప్రాకృతిక స్పృహ. కొందరికి అవతలి పక్షానికి ఉన్న ఆనందం గుర్తించబడలేదన్న సందేహం ఉంది. గుర్తించబడింది , సహించబడింది. కర్తవ్యపరాయణుడైన శ్రీరాముడు చెడు మార్గగాములను ఎవరినీ పుట్టగానే చంపలేదు . ఘాతుకాలు చెయ్యగానే చంపలేదు. మంచిచెడుల విచక్షణ ప్రతి ప్రాణికీ సహజంగా ఉంటుందన్న నియమాన్ని ఆదరించినవాడై తగు సమయం ఇచ్చాడు. లోకమంతా బాధింపబడుతుంటే ఒక దుర్మార్గ పక్షాన్ని అంతం చేయడమే తన కర్తవ్యంగా తెలుసుకొని చేశాడు. భూదేవి వెళ్ళి మొఱ పెట్టుకుందంటే అర్థం లోకమంతా బాధింపబడుతోందనే. అప్పుడు కూడా ఏ జాతిని మొత్తంగా చంపలేదు. దుర్మార్గులకూ వారికి తోడ్పడే వారికీ మాత్రమే శిక్షవిధించాడు.

2. కోట్లకొలదీ కాగితపు పుస్తకాలు, కాగితం కాని పుస్తకాలు నేడు తయారయినా దాదాపు ఒక శతాబ్దపు పరిధి అంతటిలోకీ స్వాతంత్ర్య సంగ్రామం నాటి ప్రేరణాత్మకరచనలే నేటికీ ఉద్వేగాన్ని , ఆనాటి అదే స్ఫూర్తినీ కలిగిస్తున్నాయి. బయటికి వస్తామో లేదో తెలియని ఆనాటి స్థితి అయిన ఒక చీకటి గుహపయనంలో భారతజాతికి దారిదీపాలై వెలగడమే దీనికి కారణం. నిరాశ, నిర్వేద స్థితికి త్రోయడం కాక ఆశ అనే వెలుగు వైపు ప్రయాణిస్తున్నామన్న నమ్మకం కలిగి ఉండడమే ఆ ప్రకాశానికి అసలైన కారణం.

నిష్కర్ష
ముఖ్యంగా కవిహృదయాన్ని ఆదరించే రసజ్ఞత తగ్గిపోతున్న ఈ కాలంలో మనం చేయవలసింది- జగత్కల్యాణాన్ని ఆశించే , స్పందించే కవి హృదయాన్ని అర్థం చేసుకోవడం. కవి హృదయపు దార్శనికతను అనుభూతి చెందడం.
మానవజాతి అన్ని జాతుల్లో శ్రేష్ఠమైన బుద్ధి కలిగిన జాతిగా’స్పందించే కవి గుణాన్ని’ నిరాదరించక ప్రోత్సహిద్దాం.
కేవలం ప్రకృతితో మాత్రమే తాదాత్మ్యం చెండడం కానీ కేవలం మనుష్య సమాజంతో తాదాత్మ్యం చెందడం కానీకాకుండా వైశ్వికస్పృహతో కూడిన కవిత్వం నిండిన పుస్తకాలు జగతి నిండితే,
మనసుల్లో నిండిపోతాయి. ఉండిపోతాయి. వాటికే తరాలు మారినా విలువలు తగ్గవు.పెరుగుతూనే ఉంటాయి. ఆదర్శంగా నిలుస్తూనే ఉంటాయి.
______ ____________ _________

సంజీవదేవ్, స్మృతి బింబాలు

0

కళాతాత్త్వికుడిగా సాహిత్య ప్రపంచంలో, చిత్రకళా విమర్శకుడిగా కళారంగంలో ప్రసిద్ధుడైన వ్యక్తి సంజీవదేవ్. తాను అంతరంగంలో దర్శించిన ఒక భావ ప్రపంచాన్ని,తాను తన కళ్ళ ద్వారా దర్శించిన చిత్రకళా ప్రపంచాన్ని వ్యాఖ్యానించిన వ్యక్తి సంజీవ్ దేవ్. ఆయన స్వీయ చరిత్ర మూడుభాగాలు. తెగిన ఙ్ఞాపకాలు ,స్మృతిబింబాలు,గతంలోకి అందులో స్మృతి బింబాలను గురించి ముచ్చటించడం ఈ వ్యాస పరిధి.

తెగిన ఙ్ఞాపకాలను గురించి సంజీవ్ దేవ్ చెబుతూ ఇది ఘటనాప్రధానం. అందువల్ల నవలలా సాగుతుంది అన్నారు. స్మృతి బింబాలు ఆలోచనాప్రధానం. అందువల్ల వ్యాస సంకలనంలా ఉంటుందన్నారు. ’గతంలోకి‘ లో ఘటనలు, ఆలోచనలు రెండూ ఉంటాయి. అందువల్ల చింతనాత్మక ఘటనగా, ఘటనాత్మక చింతనగా కనిపిస్తుంది. ఈ మూడు భాగాల్లోనూ ఉన్న సామాన్యసూత్రం ఏమిటంటే ఆలోచనలు, అనుభూతులు, అనుభవాలు చెప్పుకోవడం. ఈ మూడు స్వీయచరిత్ర వ్రాయాలన్న సంకల్పంతో కాక, అనుభవాలు మిగిల్చిన అనుభూతులను చెప్పాలన్న లక్ష్యంతో సాగినట్లు తెలుస్తుంది. స్వీయచరిత్రను రచించడంలో సంజీవ్ దేవ్ కు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ’’స్వీయచరిత్రలో అతిశయోక్తుల ఆధిక్యం వర్ణనీయం. తాను ఏదైతో కాదో అది అయినట్లు వ్రాసుకోడానికి వ్యక్తి ఇష్టపడతాడు‘‘ అంటూ అతిశయోక్తి స్వభావోక్తుల వివరణలో సంయమనం స్వీయ చరిత్రకారుడికి ఉండాలని అభిప్రాయపడ్డారు.

[ad id=’3971′]

ఆలోచనా ప్రధానంగా సాగిన రెండవ భాగం స్మృతిబింబాలు. ఇందులో సమీక్ష్మాత్మక ఆలోచనలున్నాయని రచయితే చెప్పుకున్నారు. ఆ కోణం నుండి పరిశీలిస్తే వ్యక్తిగతం మొదలు సాంస్కృతికం వరకు ఎన్నో అనుభవాలకు సంజీవ్ దేవ్ ఇందులో చెప్పుకున్నారు .సాంఘిక ఆర్థిక, రాజకీయ విషయాలకంటే సాంస్కృతికచైతన్యం విశేషంగా కనిపిస్తుంది. సాంస్కృతిక స్వీయచరిత్రగా ఈ రచనను చేసిన సంజీవ దేవ్ హృదయం మేధస్సు కలిసిన స్థితి స్మృతిబింబాలు. 1951-1958 మధ్య రచించిన ఈ 52 వ్యాసాలలో 52 అనుభవాలు పరచుకుని ఉన్నాయి.

స్మృతి బింబాలలోకి వెళ్ళేముందు తన స్వీయచరిత్రకు మూడు శీర్షికలుగా తెగినఙ్ఞాపకాలు,స్మృతిబింబాలు,గతంలోకి అని ఎందుకు పెట్టి ఉంటాడని ఆలోచించవలసి ఉంటుంది. వ్యక్తి జీవితంలో తొలిపది ఏండ్లు తెగిన ఙ్ఞాపకాలే. బాల్యవిషయాలు నలుగురూ చెబితేనే తెలుస్తాయి. అందులో ఎక్కువ ఇతరులు చెప్పినవే అయి ఉంటాయి. బాల్యవిషయాలు స్వీయచరిత్రలో ఎన్ని చెప్పడానికి ప్రయత్నించినా అవన్నీ తెగిన ఙ్ఞాపకాలుగానే చెప్పవలసి ఉంటుంది. ’స్మృతిబింబాలు‘ లో ఉన్న స్వీయనుభవాలు సంజీవదేవ్ గారి 38-46 ఏండ్లలోనివి. పక్వదశలో ఉన్నస్థితి. తనలో తాను తనలోని ప్రపంచాన్ని సందర్శించినపుడు బింబరూపాన్ని పొందిన స్మృతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడి ’స్మృతి‘ ఎలిజీకాదు. ’బొమ్మ‘గా తన మదిలో, ఙ్ఞప్తిలో గడ్డ కట్టుకున్న, అక్షరాలుగా ద్రవీభవించి ఆలోచనల రూపం కట్టుకున్న ఘనపదార్థం. ’స్మృతి‘రూపం కట్టింది. రూపం లేనిదే రసానుభవం లేదు. అందుకే ’బింబం‘ అని అంటారు సంజీవదేవ్. మధ్యవయస్సులో బాల్య యౌవనాలు దాటిన ఙ్ఞాపకాలు.అవి రూపం కట్టుకోవడంతో ’స్మృతి‘బింబాలయింది రెండవభాగం. మూడవభాగమంతా చెప్పుకున్నది ఘటనలు ఆలోచనలు కాబట్టి దానికి గతంలోకి అని పేరు పెట్టారు. స్వీయచరిత్రకు శీర్షికను నిర్ణయించడంలో సంజీవదేవ్ తాత్త్వికస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ స్మృతులు బింబత్వాన్ని పొందినప్పుడు అవి మనకు వైయక్తిక అనుభూతులుగా, సాహిత్య, సాంస్కృతిక, కళాత్మక, తాత్త్విక ఆలోచనలు ఆచరణలుగా ఉంటూనే అంతస్సూత్రంగా తన స్వీయానుభవాల అభివ్యక్తి ఇందులో కనిపిస్తుంది.

వ్యక్తిగతం; స్మృతిబింబాల పరంపరను వ్యక్తిగతం, కళాత్మకం, సాహిత్యం, సాంస్కృతికం, తాత్త్వికం అన్న విభాగాలుగా పరిశీలించవచ్చు. ’’కళ్ళుమూసుకొని లోపలి ప్రపంచాన్ని చూడదలచాను. నేనున్న ప్రపంచాన్ని చూడడం మానేసి నాలో ఉన్న ప్రపంచాన్ని సందర్శిస్తాను అని ఒక వ్యాసంలో చెప్పుకున్నా, బయటి ప్రపంచాన్ని కళద్వారా దర్శించి మననం చేసి వ్యాఖ్యానించారు. ఇందులో తాను చెప్పే అభిప్రాయాలూ భాగమే. తాత్త్వికత ఇందులో కనిపిస్తుంది.

• ’నాగరికులలో వృద్ధిపొందే మేధాశక్తి సుగుణాలన్నిటినీ తినివేస్తుంది.
• మనసు అభివ్యక్తి మూలం.పనిముట్టు లేనిదే కవి కవిత్వం వ్రాయలేడు.మనసు పనిముట్టు కావాలి.
• ఫొటో సజీవరూపం.అందులో ఉన్న చిత్రం ఏరితిలో ఉంటే ఆ రీతి ఫొటోలో ప్రతిబింబిస్తుంది.శిల్పం;చిత్రకళ ఊహనుంచీ పుట్టాయి.
• ఊహలో నగ్నసౌందర్యం ఆమోదయోగ్యం అవడానికి కారణాన్ని చర్చించారు.
• ఎక్కువ చదివితే original thinking పోవచ్చు.
• కోపం ఇతరుల మీద వస్తుంది.అలక తన మీద వస్తుంది.

[ad id=’3971′]

ఇటువంటి అభిప్రాయాలు స్మృతిబింబాల్లోవి.ఇలాంటివి మరెన్నో ఉన్నాయి.
1951-59 మధ్య చేసిన ఆలోచనలివి.వీటి వెనుక కాలప్రభావం కూడా ఉంది.నాగరికుల మేధాశక్తి సుగుణాలను చంపుతుందన్న మాటను స్వాతంత్ర్యానంతర కాలంలో సంజీవదేవ్ చెప్పారు.ఇవాళ్ళ’మేధస్సు‘ వికృతరూపాన్ని మనం ఒక్కొక్కసారి చూస్తున్నాం. ఇది ఒక వ్యక్తిత్వం విషయంలో సంజీవదేవ్ దృష్టి అయితే మనసు అభివ్యక్తి మూలం, మనసు పనిముట్టు అన్నది కళాతాత్త్వికుడు చేసే ఆలోచనలకు ప్రతిరూపం. స్వతంత్ర ఆలోచనలున్నదే ప్రతిభ.వ్యుత్పత్తి ప్రతిభను మెరుగుపరచాలి. శాస్త్ర, కావ్య అవేక్షణం వలన ఙ్ఞానవిస్తృతి జరగాలి గానీ స్వతంత్ర ఆలోచనలు పోకూడదు.’ఎక్కువ చదివితే original thinking పోవచ్చు అన్న ఆలోచన ’ప్రతిభ‘ పై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పింది. ఇలా తన అనుభవాలను చెప్పుకునే సమయంలో సార్వకాలీన, సార్వజనీన, సత్యావిష్కరణలు చేస్తుంటారు సంజీవదేవ్.
కళాత్మకం; స్మృతిబింబాలలోని 52 వ్యాసాలలోనూ కళాత్మక అంశాల చర్చ అక్కడక్కడ కనిపిస్తుంది. వీటిలో ఫొటోగ్రఫీ కి చిత్రకారుడికి మధ్య తేడాను చెప్పడం, చిత్రకళకు ఇతర కళలకు మధ్య ఉన్న సాదృశ్యాలను,భేదాలను చర్చించారు

• ‘చిత్రకారుడికున్న అనంతస్వేచ్ఛ పొటోగ్రాఫర్ కు ఉండదు.పులిని మేకతింటున్నట్లు చిత్రించగలడు.చిత్రకారుడు కానీ ఫొటోగ్రఫీ ఆపని చేయలేదు.అని సృజనాత్మక ఎందులో వివరించారు సంజీవదేవ్.
• లలితకళలను దృశ్య,శ్రవ్య,మిశ్రమ అని విభజించి,దృశ్యకళలో చిత్ర,శిల్ప,వాస్తులు,శ్రవ్యకళలు సంగీత సాహిత్యాలని,నాట్యకళ మిశ్రమ కళ అని విభజించి వాటి అంతస్తత్త్వాన్ని విశ్లేషించారు.
• చిత్ర,శిల్పకళలు’రూపకళ‘ ఎప్పుడు అవుతాయో చెబుతూ’రాతిలో మలిచి కాని వర్ణాలు పూసి కాని రూపాలను కల్పించే కళను రూపకళ‘ అన్నారు.
కవి,గాయకుడు,చిత్రకారుడు,సృష్టించే కళలో వర్ణం,భావం ప్రాధాన్యాన్ని చర్చిస్తూ చెప్పిన అభిప్రాయం కళాతాత్త్వికుడి దృష్టిని చెబుతుంది.
• కవి భావానికి రూపం పదాలు.చిత్రకారుని భావానికి రూపం రంగులు.గాయకుని భావానికి రూపం నాదం.నాదం లేని భావం వినిపించదు.రంగులేని భావం కనిపించదు.పదాలు లేని భావం పలుక నేరదు‘‘ రూపం లేకపోతే భావం లేదని చిత్రకళా విమర్శకుడు మాత్రమే అనగలిగే మాట.వస్తువుకు భావం ఉన్నా అది రూపం పొందకపోతే దానికి గౌరవంలేదని చిత్రకళా దృష్టితో వ్యాఖ్యానించారు.
కళాప్రయోజనం ఏమిటి? దీనికి అనేకులు అనేకరీతుల జవాబు చెబుతారు. అయితే సంజీవదేవ్ సౌందర్యాత్మక దృష్టితో దాని ప్రయోజనాన్ని వ్యాఖ్యానించారు. అదెలా ఉంటుందో చెబుతూ
• ’జీవితంలో అన్నం తరువాత సౌందర్యానిదే గొప్పస్థానం. ఆ సౌందర్యం మాటల్లో వ్యక్తమైతే సాహిత్యం అంటాం. ధ్వనిలో వ్యక్తమైతే సంగీతం అంటాం. రంగుల్లో వ్యక్తమైనప్పుడు చిత్రకళ అంటాం. భంగిమలో వ్యక్తమైనప్పుడు నాట్యం అంటాం అని ఆయా లలిత కళలలో ఏది సౌందర్యమో చెప్పడంద్వారా అదే దాని ప్రయోజనంగా ప్రతిపాదించారు. సినిమా,నాటకాల్లోని దృశ్యలయ,శ్రవ్యలయలు మనస్సుకు ఆనందాన్నిస్తాయి.ఇటువంటి అనేక అభిప్రాయాలు ఈ స్మృతి బింబాలలో కనిపిస్తాయి.
సాహిత్యాత్మకం; సంజీవదేవ్ ఎంతటి కళాతాత్త్వికుడో అంతటి సాహిత్యజీవి. ఆయన ఆలోచనలలో రూపుకట్టుకున్న బింబాలలో సాహిత్యాత్మకమైనవి కూడా ఉన్నాయి. ఇందులో అలంకారం సాహిత్యప్రక్రియ, శిల్పం వంటి అంశాల గురించి తన అభిప్రాయాలను చెప్పారు. వాటిలో ఖండకావ్యం,మహాకావ్యం మధ్య తేడాను చెబుతూ ’ఖండకావ్యం వేణుసంగీతం,మహాకావ్యం వీణాసంగీతం.ఖండకావ్యం సెలయేరు మహాకావ్యం గంగానది. ఖండకావ్యం మాలకుంజం మహాకావ్యం వకుళవృక్షం. ఖండకావ్యం సరళత-మహాకావ్యం క్లిష్టత,ఖండకావ్యం లలితసౌందర్యం మహాకావ్యం గంభీరసౌందర్యం అంటూ సంగీతం, చిత్రలేఖనం, శిల్పం, సాహిత్య కళల భూమికతో ఆ రెండింటి మధ్య తేడాను వివరించారు. అతిశయోక్తిని ప్రయోగించినా స్వభావోక్తిని బలపరిచేదిగా ఉండాలి. కానీ స్వభావోక్తిని భంగం కలిగించేదిగా ఉండకూడదు అంటూ అలంకార ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తను చెప్పారు. ’శిల్పం‘జీవితం కొరకు అన్నది మరో మంచి అభిప్రాయం.మేఘుడిని కాళిదాసు అచేతన పదార్థంగా చెప్పడాన్ని సంజీవదేవ్ అంగీకరించలేదు.

సాంస్కృతికం; స్మృతి బింబాలను ఒక సాంస్కృతిక స్వీయ చరిత్రగా సంజీవదేవ్ చెప్పుకున్నారు. సాంస్కృతిక అంశాలలో తనకాలం నాటి పుస్తకాలు,పత్రికలు,వ్యక్తులు,ప్రయాణానుభవాలు,వ్యక్తుల అభిరుచులు వంటివన్నీ చేరుతాయి. తాను అంకితం పొందిన మానస్ మూకుర్, rhythm అన్న త్త్రెమాసిక పత్రిక, view finder అన్న యూరప్ అమెరికాలకు వెళ్ళేపత్రిక, నిరీక్ష అన్న బెంగాల్ పత్రిక, 100 poems from the Japanese golden, Book of Tagore వంటి పత్రికలు, పుస్తకాలు కళా, సాహిత్యరంగాలలో నిర్వహించిన పాత్రను వివరించారు. ఓ.సి.గంగూలీ, పైడిరాజు, అసిత్కుమార్ హల్దార్, వింజమూరి శ్రీనివాసచారి, శ్యామలకృష్ణఘోష్(జియాలజిస్టు) చలం, బెట్రాండ్ రస్సెల్, దామెర్ల రామారావు, చిత్రకారుడు ఎస్.వి.రామారావు వంటి వారితో తనకున్న ఆత్మీయతను అనుబంధాలను, కళాత్మక జీవనాన్ని చెప్పడం ద్వారా తనకాలం,తనముందుకాలం సాంస్కృతిక చరిత్రను వివరించారు.

[ad id=’3971′]

తాత్త్వికం; సంజీవదేవ్ ఆలోచనలు, అనుభూతులు,అనుభవాలు అదే స్థాయిలో ఆగిపోవు. అవి మరింత ముందుకు ప్రయాణిస్తాయి. తాత్త్వికస్పర్శను అందిస్తాయి. స్థూలంగా ఒక ఆలోనను చెబుతున్నట్లు అనిపించినా అందులో తాత్త్వికతను స్ఫురింపచేయడం ఆయనశైలి. వ్యక్తిగతంగాకానీ కళాపరంగా గానీ, ఆనందాన్ని ఎట్లా పొందుతాం అన్న ప్రశ్న వేసుకుని ’’ఆనందం వ్యక్తి అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది‘‘. ఒక కళాత్మక ప్రక్రియ ఒకరికి,మరొకటి మరొకరికి ఆనందాన్నివ్వడానికి కారణం రుచిభేదం అని ప్రాచీనులు చెప్పినదాన్ని అభిరుచి భేదమని ఆధునికంగా సంజీవదేవ్ చెప్పారు. ఈ ఆనందంలో మనుషులిచ్చేది వస్తువులు ఇచ్చేది అని రెండు రకాలుంటాయని, ఏదైనా తన కొరకే జరిగిందని అనుకోవడంలోనే ఆనందాన్ననుభవిస్తాడని సంజీవదేవ్ భావించారు. మానవుడు భూత భవిష్యత్ వర్తమానాల పట్ల తన వైఖరిని నిర్ణయించుకోవలసిన రీతిని చెబుతూ భూతకాలానికి అమితమైన ప్రాముఖ్యం ఇవ్వడం,వర్తమానకాలానికి అసంతృప్తి చెందడం,భవిష్యత్తును గురించి నిరాశచెందడం హానికరం అన్నారు. స్థూల దృష్టికి నీతివాక్యాలనిపించినా కాలస్వభావాన్ని తాత్త్వికంగా చెబుతున్నట్లు గుర్తించవచ్చు. మానవుడు తనను తాను తెలుసుకోవడమే ఆస్తిక, నాస్తిక వాదాల ఆదర్శమని, ఆలోచించడమే అన్నింటికంటే మించినపని అని, మనుషుల్నితినే జంతువుల్ని మనుషులు తినరు. మనుషుల్ని తినని జంతువులను తింటారు.ఎక్కడి న్యాయం అంటూ చెప్పిన మాటలు తాత్త్విక స్ఫురణను కలిగి ఉన్నాయి. ఇటువంటి అభిప్రాయాలెన్నో స్మృతి బింబాలులో కనిపిస్తాయి.

ఏడేండ్ల బాటు ఆంధ్రజ్యోతిలో శీర్షికగా సాగిన స్మృతిబింబాలులో సంజీవ్ దేవ్ ఆలోచనాప్రపంచం, అనుభూతి ప్రపంచం కనిపిస్తుంది. ఆ ప్రపంచంలో మనను మనం మరచిపోయేట్లు చేస్తుంది. ఒక తాత్త్వికమైన కళాత్మకమైన ఆలోచనాబ్ధిలో మనిగి తేలుతాం .సంజీవ్ దేవ్ ఆలోచనా స్ఫురణను అందుకోలేకపోతే ఆ సముద్రంలో మనిగిపోతాం. పాఠకులను మరింత భావుకులను కళను ఆస్వాదించే వీలును తీరును నేర్పిస్తుంది స్మృతిబింబాలు.