ఒడిశా రాష్ట్రంలో రాయగడ పట్టణం జిల్లా కేంద్రం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులు. ఆంధ్రప్రదేశ్ దగ్గరగా ఉండడం, వైద్యం, విద్య కోసం విశాఖపట్నం; వ్యాపార లావాదేవీల కోసం విజయనగరం, వైజాగు మీద ఆధార పడడం మూలాన తెలుగు సంస్కృతి మా ఊర్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తెలుగు వార్తాపత్రికలు, తెలుగు సినిమాలకు కొదవలేదు.
ఉగాది వస్తుందంటే ఊపందుకొంటుంది మా రాయగడ. స్థానికంగా ఉన్న కళ్యాణమండపంలో కపిసేన… సారీ… కవులం చేరతాం. అక్కడ రామోజీరావు, పరుచూరి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి పాత్రలు కనపడుతాయి. దినపత్రిక స్టింగర్ ఒకతను కవిసమ్మేళనానికి తానే కారకుడినని అన్నట్టు గోరోజనం చూపెడతాడు. ధోవతి, కండువా ధరించి అసలు సిసలైన ఆంధ్రుడిని నేనేనంటూ పండితుల వారొకరు పరుచూరిలా పరవళ్ళు తొక్కుతాడు. పురోహితుడి రాకతో పంచాంగ శ్రవణం ఆరంభమవుతుంది. కవితా పఠనంలో పాల్గొన్న కవులకు కండువా వేసి ఫోటోలు తీసుకోవడం ఒక సరదా. ఉగాది పచ్చడి, పులిహోర సేవించి ఎవరి ఇళ్ళకు వాళ్ళు తరలి వెడతాం. రాయగడలో ఉన్న ఆరేడు సంస్థలన్నీ కలిసి ఉత్సవకమిటీగా ఏర్పడి ఉమ్మడిగా యీ పండుగని నిర్వహిస్తాయి. అక్కడికి పక్షం రోజుల తర్వాత వస్తుంది ‘పనా సంక్రాంతి’. అది ఓఢ్రుల నూతన సంవత్సరం. పెరుగు, అరటిపళ్ళు, మిరియాల పొడి, పంచదార పలుకులు వేసి చిక్కగా పానకం చేసి పంచుతారు. కవితా గోష్ఠి ఉంటుంది.
ఉగాది నాటి సాయంత్రం కళ్యాణమండపం ప్రాంగణంలో వేదిక మీద వినోద కార్యక్రమం ఉంటుంది. ఒక ఏడాది సినీ నటుడు బాబూమోహన్, మరో ఏడాది సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ జనాలను తన వైదుష్యంతో రంజింపజేసారు.
రాష్ట్ర, కేంద్ర, పంచాయితీ ఎన్నికలుంటే ఆ ఏడాది ఏ సందడి ఉండదు, కారణం ఈ వేడుకలను జరిపించేది రాజకీయ పార్టీలు. నెటిజన్స్‌కి అర్థమయి ఉంటుంది.
మా ఊరికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘జయపురం’కి ఒక చరిత్ర ఉంది. విక్రందేవ్‌వర్మ పరిపాలించిన పట్టణం ఇది. తెలుగు అంటే ఆయనకి పంచప్రాణాలు. స్థానిక ఎమ్.ఎల్.ఏ. ఉగాది వేడుకల్లో మమేకమైపోయి వచ్చిన కళాకారులతో స్టెప్స్ వేసి ప్రజలని అలరిస్తూంటాడు. తెలంగాణ శకుంతల, గొల్లపూడి మారుతీరావు, ఏ.వి.ఎస్. బాబూమోహన్, కళ్ళు చిదంబరం, వైజాగ్ ప్రసాదు తదితర సినీనటులు ప్రదర్శనలు ఇవ్వడం ముదావహం.
మాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘బరంపురం’కి సిల్క్‌సిటీ అని పేరు. బరంపురం పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి. అధిక శాతం తెలుగువాళ్ళున్న ఈ పట్టణంలో ఉగాది వేడుకలు చూడాలి. ఆంధ్ర భాషాభివర్ధని సమాజం, ఆంధ్రా సంస్కృతీ సమితి లాంటి సంస్థలు పిల్లలకు, మహిళలకు ముగ్గుల పోటీలు, క్విజ్ కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు పంచుతారు. కవి సమ్మేళనాలతో కనుల పండువగా సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడం చెప్పుకోదగ్గ విషయం.
400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని ‘భువనేశ్వర్’కి ఒక ప్రత్యేకత ఉంది. సిటీ ఆఫ్ టెంపుల్స్ అని మరో పేరు. నగరం నడిబొడ్డునున్న యూనిట్ ఫోర్‌లో ఆంధ్రా కల్చరల్ అసోసియేషన్ షష్ఠిపూర్తి చేసుకున్న సంస్థ. పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి సేవనం, మహిళల ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో తెలుగువాళ్ళకు ఆ రోజు ఆటవిడుపు. ఇక్కడికి ఇరవై, పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ అతి పురాతన పట్టణం. తెలుగువాళ్ళు అత్యధికం. ఒక వీధికి తెలంగా బజారు అని కూడా పేరు. ఐక్యత అన్న సంస్థ ఉగాది పండగని అతి గొప్పగా చేస్తుంది. సంబరాలు అంబరాన్ని తాకుతాయి.
ఖుర్దా రోడ్డు, సంబల్‌పూరు, సునాబెడా తదితర పట్టణాల్లో కూడా ఉగాది వేడుకలు బాగానే జరుపుకుంటారు ప్రవాసాంధ్రులు.
– ఆనందరావ్ పట్నాయక్
ఉత్కళాంధ్రలో ఉగాది వేడుకలు
గీతలో చెప్పినది శాసనప్రాధాన్యము
శాసనప్రాధాన్యము అనగా పై అదికారులు లేక గురువులు చెప్పిన దానిని తు.చ తప్పకుండ అమలు పెట్టుట. ధర్మమును నిలబెట్టుటకు ఇది మిక్కిలి ఆవశ్యకము. ధర్మ సంస్థాపనము కొఱకు అవతరించిన శ్రీకృష్ణపరమాత్మ, అర్జునుని చేత యుద్ధము చేయించుటకు కోల్పోయిన ఉత్సాహమును పురిగొల్పుటకు అనేక పద్ధతులను ఉపయోగించి యున్నాడు. దీనిని Englishలో Crisis Management అన్నారు. శ్రీధరస్వామి గీతావ్యాఖ్యానములో Management అనునర్థంలో, ధర్మశాస్త్రము (Administration) నకు వ్యతిరేకమయిన అర్థశాస్త్రము అను పదమును ప్రయోగించాడు. అర్థశాస్త్ర మనగా result oriented management అని మనము గ్రహించుకొనవలెను.
పురుషోత్తముని బోధనలో నిష్కామకర్మ యోగము ప్రధాన ప్రాత్రను షోషించినది.
సాంఖ్యాయోగము అను పేర జ్ఞాన యోగము చెప్పబడగా అత్మజ్ఞాన లాభము చేత ఆత్మ విశ్వాసలాభాము కానున్నది అని పరమాత్మకు తెలిసియున్నది. Self-awareness అటుపై Self-confidence, అటుపై self-management అను సోపానములను గీతోపదేశములో గమనింపగలము. 16వ అధ్యాయం అయిదవ శ్లోకములో “అర్జునా, దుఃఖింపకు, నీవు దైవీ సంపదగల వాడవు” అని చెప్పి భగవంతుడు అర్జునునకు ఆత్మ విశ్వాసమును రగుల్కోన జేయిచున్నాడు.
కర్మాచరణ ప్రాధాన్యమును నొక్కి చెప్పుచు “పూర్వము జనక మహారాజు మున్నగువారు కర్మ మార్గమునే అవలంబించారు” అని భగవంతుడు ఉదాహరణమును ఇచ్చుచున్నాడు. 3వ అధ్యాయం 20వ శ్లోక పరామర్శ చేయగలము – ఇదియు ఆత్మవిశ్వాసం దృఢం చేయడానికే.
18వ అధ్యాయం 47వ శ్లోకములో – అహింసా బుద్ధిని సరిగా తెలుసుకోవలె, సహజ కర్మలోని దోషము అయినను ఫరవాలేదు గాని కృత్రిమంగా తెచ్చుకోని వచ్చిన వృత్తిలోని హింసని భయంకరము – అని తెలియజేసి శ్రీకృష్ణుడు ముందుగానే ఊహించుకొని అర్జునుని సంశయ నివారణ చేస్తున్నాడు.
ప్రభువులకు లోక సంగ్రహము అతిముఖ్యము. తన్ను జూచి ఇతరులు చెడిపోరాదు. తృతీయాధ్యాయ శ్లోకాలను చూడ వచ్చును. ఇది రాజ్యశాసన కర్తలకు అతి ముఖ్యమగు సందేశము.
10వ అధ్యాయములో ‘నరాణాంచ నరేంద్రోఽహమ్’ అని రాజు అయినవాడు తన అంశతో ధర్మరక్షకు జన్మించును అనుచు ఆదిదేవుడు అర్జునుని ఆత్మ విశ్వాస జాగరణం చేస్తున్నాడు.
దిత్వీయాధ్యాయంలో 26వ శ్లోకం నుండీ 38వ శ్లోకము వరకు శ్రీకృష్ణపరమాత్మ, అన్నివిధాల నచ్చజెప్పుచు అర్జునునకు do or die అను శాసనమును (ధర్మమును) ప్రధానముగా చెప్పుచున్నాడు.
అసంగయోగము ప్రజాశాసనములో నున్న వ్యక్తులకు అత్యంత ప్రధానము. దాని చేతనే వాళ్లు ధర్మ కర్తలు (custodians) గా వ్యవహరించి, నిస్వార్ధ బుద్ధితో పాలనము చేయదురు. ఈ కారణంగా భగవద్గీత, ధర్మప్రధానమయిన శాసనప్రణాళిని నోక్కి చెప్పుచున్నది. గీతలో అనుషంగికము (subsidiary) గా వచ్చిన వేదాన్త బోధ ప్రధానమై కూర్చున్నది. క్షత్రియవంశ నాశము కాగా గీతను ప్రభువులకు ఉద్దేశించి బోధించుట వెనకబడిపోయినది.
ప్రథమాధ్యాయములో 32వ శ్లోకము నుండి 46న శ్లోకము వరకు అర్జనుని పాపభీతిని మనము అర్థం చేసి కొనవలె. ఆ పాపభీతిని తొలగించుటకు సూటిగా 18వ అధ్యాయము 66వ శ్లోకములో భగవంతుడు అభయము ఇచ్చుచున్నాడు. అభయమును ఇవ్వగా అర్జునుడు నిర్భయుడై యుద్ధానికి సిధ్దమయినాడు. కాగా మొత్తము గీతాసారంశము ధర్మసంస్థాపన కోసరము భగవంతుడు చేసిన ఉపదేశము, లేక ఆదేశము.
అభయప్రదానములో భాగముగా విశ్వరూపదర్శనము చేయించాడు. చేయించి తాను కాల స్వరూపుడునై సర్వ సంహారానికి పూనుకున్నాను అని విశదం చేశాడు. ధర్మరక్షణ అత్యావశ్యకము అనునది గీతాప్రధానోద్దేశ్యము కాగా దానిలోని, భాగముగా దుష్టసంహారము అనివార్యము. దానివల్ల లోకక్షయమైనను ఫరవాలేదు.
దుష్టసంహారము శ్రీరామ ప్రభువు చేసినాడు. అంతకు ముందు పరశురాముడు దుష్ట క్షత్రియ సంహారమును 21 మారులు చేసియున్నాడు. దీనిని సరిగా అర్థం చేసికొనలేక తన గీతావ్యాఖ్యలో పరశురాముడు 21 మారులు క్షాత్ర వధ చేయడానికి బదులుగా ఆత్మహత్య చేసికొని ఉంటే బాగుండేది అని వినోబా జీ వ్రాశారు. ఇలాగా ప్రత్యుదాహరణము చెప్పడం చేత విషయం విస్పశష్టం కాగలదు అన్నదియే అస్మదాశయము. పరనింద కాదు. గుణదోష వివేచనం అవసరము కదా.
ప్రస్థాన త్రయములో గీత మూడవది. మెదటిది ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మ సూత్రములు. శ్రుతి అనగా వేదము. వేదములోని భాగములే ఉపనిషత్తులు. వానిలోని వాక్యాలకు పరబ్రహ్మ మందు సమన్వయము చూపునది బ్రహ్మ సూత్రగ్రంథము. శ్రుతిప్రస్థాన మనగా ఉపనిషత్తులు, న్యాయప్రస్థానము లేక సూత్రప్రస్థాన మనగా బ్రహ్మసూత్ర గ్రంథము. వానిని స్మరించి శ్రీకృష్ణడు చెప్పినది గనుక భగవద్గీత స్మృతి ప్రస్థానమయినది. త్రయోదశాధ్యాయంలో 4వ శ్లోకమును పరామర్శ చేయచ్చును.
ఇక బృహదారణ్యకములోని శ్రవణమనన నిదిధ్యాసనాలను మనసులో పెట్టుకొని అక్కడ మూడు ఇక్కడ మూడు అని ముడి పెట్టిన పండితులను కొందరను చూచియున్నాము. శ్రుతిప్రస్థానము శ్రవణం కోసము, న్యాయ(సూత్ర) ప్రస్థానము మననము కోసము, ఇక భగవద్గీత నిదిధ్యాసనం కోసమని చెప్పుచున్న వారిని ఏమనవలయును? గీతోపదేశం విన్న తరువాత అర్జునుడు లేచి యుద్ధము చేసెనుగాని ధ్యానములోనికి వెళ్లలేదుకదా!
శ్లో: “సర్వోపనిషదోగావో దోగ్ధా గోపాలనందనః
పార్ధో వత్సః సుధిర్భోక్తా దుగ్ధం గీతామృతంమహత్”
అను శ్లోకం ప్రకారం గీత ఉపనిషదర్థమునే చెప్పినది. గీతలోని నిష్కామ కర్మయోగం కూడా ‘నకర్మలిప్యతే నరే’ అను ఈశావాస్యములోనిదే.
ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రములు, గీతయు ఉపబృంహణము చేయునట్టివే కదా! వేరుప్రస్థానము లెట్లగును?
వాస్తవమేమి అనగా ‘అన్నం చతుర్విధమ్’ అన్నట్లుగా ప్రస్థానము ఒక్కటే మూడు విధాలు
- ఉపనిషన్మంత్రాలు
- సూత్రములు
- శ్లోకాలు
ప్రస్థానం త్రివిధముగాక ప్రస్థానత్రయము అనునది శిథిలపదబంధము (loose construction). దీని వలన వచ్చిన అనర్థమును మనము సవరించుకోవలెను.
ఇక గీత యెక్క మహిమ ఎలాంటిది అనగా అనేక విధాలుగా వర్ణకాలను (interpretation) ఇచ్చుకొంటూ పోవచ్చును.
జ్ఞాన యోగం ప్రధానమని భక్తియోగం ప్రధానమని కర్మయోగం ప్రధానమని ప్రపత్తి ప్రధానమని రాజయోగం ప్రధానమని ఎన్నో విధాలుగా చెప్పవచ్చును. కాని ధర్మ సంస్థాపనం కోసం దుష్ట సంహారం కోసం నిలబడి అర్జునుని యుద్ధానికి ప్రేరణ చేయడంలో అన్నింటిని మించి అన్నిటికి ముందుగా శాసనప్రాధాన్యము చెప్పబడినది అను ముఖ్య విషయమును మనము మరువరాదు.
-డా. వి.ఎ. కుమారస్వామి
మనం ఎటు పయనిస్తున్నాం?
‘నగరాజధర నీదు పరివారులెల్ల ఒగి బోధన చేసెడి వారలు కారే, యిటులుండిరే, నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవ రా రాదా’ అన్నాడు త్యాగయ్య.
పూర్వీకులు చేసిన బోధలు తప్పా? లేక ప్రతి చిన్న విషయాన్నీ తర్కించుకుంటూ పోతేనే తప్ప మూర్ఖులకు గుర్తింపు లభించదేమో అనే ఆలోచన కలుగుతోంది. సర్వేజనాః సుఖినోభవంతు అనే మాట మరోలా మారింది. జనం యావత్తూ సర్వేలకు పరిమితమైపోయి జీవితం లోని ఏ అంశమూ వ్యక్తిగతం కాకుండా పోయి సార్వజనికమై పోయి కూర్చుంది.
ఆ మధ్య ఒక సభలో సినీ కళాకారులు, నేపథ్య గాయకులు వేదిక మీద కూర్చున్నారు. నిర్వాహకులు ఓ స్వామిజీని ఆహ్వానించి ఆయన్ని స్టేజి మీద ఓ ప్రక్కగా కూర్చోపెట్టారు. వీళ్ళల్లో కొందరు చేతులు కట్టుకుని, కొందరు కాళ్ళు జాపుకునీ కూర్చున్నారు. మంత్రిగారు ఇంకా రాలేదని బాధపడుతూ ఓ చిన్న కుర్రాడి చేత అటు మూల ఓ బ్రేక్ డాన్స్ చేయించారు. ఆ కుర్రాడు పాపం ఆ ప్రదర్శనలో క్రింది పడి దొరలి కాళ్ళు అటు ఇటూ కదపవలసి వచ్చింది. ఏమనుకున్నాడో ఏమో స్వామీజీ వైపు కాళ్ళు జాపకుండా జాగ్రత్తపడి ఎలాగో అలాగా కార్యక్రమం ముగించి అవతలికి వెళ్ళాడు. నాకు ఓ ఆలోచన వచ్చింది. కాలం ఎలా పరుగులు తీసినా ముందు తరం ఓ సారైనా ఒక పునశ్చరణ చేసుకునే అవకాశం ఈ భరతభూమి మీదనే ఉంటుంది. అందుచేతనే ఎంత మంది ఎంత ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలబడదు.
స్వామీజీ ఇచ్చిన సందేశంలో ఓ మాట చెప్పారు – ‘వాస్తవం ఏమిటి? అవాస్తవం ఏమిటి అనేది ఎలా ఉంటుందో అక్కడున్న సినీ ప్రముఖులను చూపించి వీరందరూ తెర మీద ఎలా ఉంటారో గుర్తు తెచ్చుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నారో గమనించండి’. వాళ్ళంతా కొద్దిగా ఇబ్బంది పడ్డారు.
ఇంతలో సర్దుకుని, ‘అలా కూడా కాదు, అసలు మన శరీరంలో ఉన్న వాటన్నింటినీ బయట పెట్టేస్తే మనమందరం ఎంత అందగాళ్ళల్లా కనిపిస్తామో ఆలోచించండి’ అన్నారు!
కాకపోతే ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే. ఎవరి గురించి ఉదహరించినా వారు అలాగ, వీరు ఇలాగ, అక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఇలా అన్నాడు… ఇలా ఎముకలూ, నరాలూ, చీమూ, నెత్తురూ అన్నీ సార్వజనికం చేసేసి, తర్కించి, అరుచుకుని, కొట్టుకుని చివరికి ఇచ్చే సందేశం ఏమిటంటే అందరూ చక్కగా ప్రేమించుకుంటే బాగుంటుంది అని చెప్పడం, చెప్పుకోవడం జరుగుతోంది.
పరస్పరం గౌరవించుకోవాలన్నా, ఆదరించుకోవాలన్నా, స్నేహంతో ఉండాలన్నా ఈ సార్వజనికమైన విన్యాసాలు సాధ్యమెలా చేస్తాయి?
‘పర’వచనమా, ప్రవచనమా?
పైన ఉదహరించిన అంశం ప్రకారం భిన్నమైన విషయాలను, పంథాలను, మనోరంజనానికి చెందిన సాధానాలను ఒకచోట చేర్చి వాటికి కుదరని అనుబంధాన్ని ముడిపెట్టేసి ప్రజలను రంజింపజేసాం అనుకోవటం ఎంత పిచ్చితనమో, వాళ్ళని ఆలోజింపజేసాం అనుకోవడం కూడా అంతే వెర్రితనం.
‘వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్…’ ఈ మాటలలో ఎంతో గూడార్థం ఉన్నది. వేదములు, శాస్త్రములు, ఆ వరుసన విజ్ఞానం అని చెప్పడం జరిగింది.
ఒక విధంగా ఆలోచిస్తే వైదిక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ శాస్త్రార్థం జరిపే ఒక సాధనామార్గంలో విజ్ఞానం అనేది అంతర్లీనంగా స్ఫురించేది అని అవగతం కావచ్చు. ధర్మశాస్త్రాలకు భిన్నంగా వైజ్ఞానికపరమైనవి అధ్యయనం చేయటం సనాతన ధర్మంలో కనిపించకపోవచ్చు. అలా అని పూర్వీకులు విజ్ఞానవంతులు కారు అని లోకం చెప్పుకోవడం లేదు కదా!
ఇటు ప్రక్కకు వద్దాం. యాంత్రికపరమైన సాధానాలను సమకూర్చుకుని శ్రమించి, జీవన విధానాన్ని మార్చేసిన పాశ్చాత్యులు పిచ్చివారు కాదు. మహాభారతంలో శాల్వుని నగర విమానం గురించి చూశాం. కానీ అటువంటి నగర విమానం (స్పేస్‌క్రాఫ్ట్) మనం స్వయంప్రాతిపాదిక మీద లేదా సాంకేతికపరమైన అంశాలను అనుసంధానం చేసి నిర్మించుకోలేకపోయాం! దీనికి అనేకమైన కారణాలు కావచ్చు. స్వర్ణయుగం తరువాత చరిత్రలో ఎన్నో గ్రంథాలు మాయమైపోయినట్టు, ధనుర్వేదంలోని ఎన్నో గూఢమైన విషయాలను ఇతరులు దగ్ధం చేసినట్టు మనకు తెలుస్తోంది. అలా అని సాంకేతిక రంగంలో మేము పాశ్చాత్యుల కంటే ముందరే ఏమీ తయారు చేయలేకపోయినా మేమే గొప్ప అని చెప్పుకోవడం సమంజసం కాదు. ఇటీవల ధనుర్వేదం నుంచి ఎంచుకొన్న కొన్ని అంశాల నుంచి వైమానిక విజ్ఞానం భారతదేశంలో ఎంతో పురోగమిస్తోంది అని చెప్పవలసి ఉన్నది.
అదలా ఉంచి ధర్మశాస్త్రాల విషయం గురించి ప్రస్తావిస్తూ ప్రతి అంశం ఈ రోజు పుస్తకాలలో చదువుకుంటున్న విజ్ఞానాన్ని అనుసరైస్తూ వాటితో అనుబంధం ఉంటేనే అది సరైనది అనే ఒక అనవసరమైన ఒరవడిని కొందరు సార్వజనికంగా తీసుకుని వస్తున్నారు. ఏ సందర్భంలోనైనా ఏది చెప్పారు అని క్షుణ్ణంగా గురువుల వద్ద తెలుసుకుని అవసరమైనంత వరకే అన్వయించటం ఎల్ల వేళలా శ్రేయస్కరం.
ఎబోలా, జీకా లాంటి వైరస్‌లకంటే దారుణమైన వైరస్ మన పండితులను పట్టుకుని పీడిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ వైరస్ ఏంటంటే మూల గ్రంథంలోని విషయాలను పూర్తిగా మార్చేసి మాట్లాడడం, అందులో లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పడం, ఏదో కొత్త విషయం, గొప్ప విషయం కనుక్కున్నట్లు అనవసరమైన భాష్యం చెప్పి ప్రజలను మోసం చెయ్యడం కూడా కనిపిస్తోంది.
ఒకసారి రైల్లో చోటు దొరక్క, ఒక ట్రంక్ పెట్టె మీద కూర్చోబోయాను. అది ఒక మహ్మదీయుని సామాను. అతను వెంటనే, “సార్, దాని మీద కూర్చోకండి. అందులో ఖురాన్ ఉంది” అన్నాడు. ఆ మాటకొస్తే, గురుద్వారాలలో పూజించేది గురుగ్రంథ్ సాహిబ్‌ను! అంత గౌరవం గ్రంథం పట్ల ఉంటుంది. వైదిక సంప్రదాయంలోని మూల స్తంభాలైన రామాయణ, మహాభారత భాగవత భగవద్గీత గ్రంథాలకు మనం అటువంటి ఆదరణ ఇవ్వకపోవటం నేటి ఈ దుస్థితికి కారణం. చాలామంది అడగవచ్చు – వాటిని పూజిస్తే ఏమొస్తుంది అని! ఇక్కడే కీలకం ఉంది. తరతరాలుగా ఆ విధానం కనుక నరనరాల్లో జీర్ణించి ఉండి ఉంటే ఆ గ్రంథాలలో ఉన్న విషయాల మీద ఇష్టారాజ్యంగా సంభాషించే సందర్భం ఉండేది కాదేమో ఒక పరి ఆలోచించవలసిన అవసరం ఉంది.
శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చెందిన ఒక మిత్రుడు నాతో ఒకసారి చెప్పాడు – శైవులలో ఎక్కువగా వైష్ణవ మతం తప్పు అని చెప్పే సందర్భాలు ఎక్కువ ఉండవు. కానీ శ్రీవైష్ణవులలో చిన్నప్పటి నుంచే వాళ్ళ పద్ధతి తప్పు అని బోధించే వారున్నారు. దీనికి కారణం ఏమిటంటే కొన్ని పరిస్థితులలో మనది చాలా గొప్పది అని చిన్నప్పటి నుండే బుర్రలలో నాటకపోతే కొన్ని తరాల తరువాత ఆలోచనా విధానం మారుతుంది. దీనికి సహాయకంగా ‘వాళ్ళది సరైన పంథా కాదు’ అని చెప్పే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తారు. ఇది సమాజంలో సామాన్యం. భారతదేశంలో ఇస్లాం మతం ఎక్కువగా హిందువులు చేసె ప్రతీ పనికీ విరుద్ధంగా చేయటంతో ముడిపడి ఉంటుంది. క్రైస్తవ మిత్రుడొకరు నాతో చెప్పటం జరిగింది – ‘ఈ దేశంలో మా మత ప్రచారం చెయ్యకుండా ఉంటే మేరీ మాతను ఒక దుర్గ అవతారంగానూ, ఏసుక్రీస్తును ఎక్కడో ఏదో పురాణంలో ఉన్న యోగిగానో చెప్పి ఒక స్తోత్రం ఎవరో వ్రాసేసి చివరకి చర్చ్‌లను దేవాలయాలుగా మార్చేసి మొత్తానికి మతాన్నే హిందూమతంలోకి తీసేసుకుంటారు. అప్పుడు మా పరిస్థితి ఏం కావాలి?’ అన్నాడు. ఆలోచించవలసిన విషయం ఇది. షిర్డి సాయిబాబా విషయం ఈ సందర్భంలో వేరుగా ప్రస్తావించవలసిన అవసరం లేదు.
ఈ మధ్య కొందరు ధర్మశాస్త్రాల మీద, ఆచార వ్యవహారాల మీద గంటల తరబడి మాట్లాడుతూ తెరకెక్కుతున్నారు. జనంలో కొందరు భయభ్రాంతులవుతున్నారు. కొందరు కొత్త సందేహాలతో సతమతమయిపోయి చేస్తున్న మంచి పనులు కూడా మానుకుంటున్నారు. కొందరు మాకెందుకివి అని అనుకుంటున్నారు. కానీ ప్రజలలో మరో వర్గం ఉంది. ఇలా ప్రవచించే వారి మాటలను చక్కగా పొందుపరచుకుని ఆ జ్ఞానవేదిక అని, ఈ ఆధునిక వేదిక అని చెప్పుకుంటూ చక్కని మసాలా దొరికిందని తలచి సార్వజనీకంగా ఆడిపోసుకుంటున్నరు. ఇది అవసరమా?
పదవీ విరమణ కావించిన ప్రతీ వాడూ ఏవో మేనేజ్‌మెంట్ తాలూకు విషయాలు పురాతనమైన వాటితో మేళవించి గొప్ప ఆవిష్కరణ చేసి చూపించినట్లు కాలర్లు సద్దుకుంటున్నారు. ఒకరిని మోసం చేసి మభ్యపెట్టడం ఎలా అనే ప్రాతిపాదిక మీద ఎన్నో ఆధునిక పరమైన బోధనాంశాలు, విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూళ్ళు ఉంటాయి. ఏదైనా అమ్మాలి, నిన్ను నువ్వు నమ్మాలి, అమ్మించాలి… ఈ సిద్ధాంతంలో మిగిలింది ఏమిటి? అలా జరిగాక మనిషి మరణించాడని అర్థం.
సత్యం, ధర్మం మీద ఆధారపడ్డ కర్మ భూమి ఇది, పుణ్య భూమి మనది. సదాచారానికి కావలసిన ఈ మూల స్తంభాలను మూలకి తోసి పనికిమాలిన టెక్కునిక్కులను మనోరంజకంగా ముందుకు తోసి, గొప్ప ప్రొఫెషనల్ ట్రెయినర్లుగా వ్యాపారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం?
పెద్దలందరూ – కవులూ, వక్తలూ, పండితులూ… ఇలా ఎందరో ప్రతిభావంతులందరూ ఒక్కసారిగా వారి గురువులను తలచుకుని వారి ఒరవడులను మార్చుకోవలసిన అవసరం ఉన్నది.
ముఖ్యంగా కొన్ని సాధనా మార్గాలు, షోడశోపచార పూజా విధానాలు, ఉపాసనా విషయాలు, స్వధర్మాన్ని ఆచరిస్తు సన్మార్గం మీద నడిచేవారి విధానాలు – వీటి మీద అనవసరమైన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేయటం ఇప్పటి సమాజానికి శ్రేయస్కరం కాదు.
భక్తులెవరు?
క్షేత్రాలలోనూ, దేవాలయాలలోనూ మైకులో వినిపిస్తూ ఉంటుంది – ‘భక్తులకు విజ్ఞప్తి’ అని!
ఎవరండీ భక్తులు? సందర్శకులనండి. ‘భక్తుడు’ అనే పదం చరిత్రలోనే అతి తక్కువ మందికి వర్తిస్తుంది. ఈ క్షేత్రం నుంచి ఏదో పొందాలని, అంతర్జాలంలో, టివీలో చూపించారు కాబట్టి తోపులాటల్లోకి చేరిపోయి అక్కడికి వచ్చిన అమ్మాయిలను, ఇతర స్త్రీలను తొక్కిసలాటలలో తాకాలనే ఆశతో వచ్చినవారు, ఏదో ఒక కార్యం – ఈ సంవత్సరం పుష్కర స్నానం చేసాననో, మరేదో లెక్క వేసుకున్నాననో ఎందుకు ఈ జనసందోహం? ఎవరి వ్యాపారం అభివృద్ధి కావడం కోసమే కదా?
ఇన్ని తంతులు, తతంగాలు, వ్రతాలు, క్షేత్రదర్శనాలు నిరంతరం మారుమ్రోగుతున్న సందర్భంలో సగటు భారతీయుని నైతికత, కరుణ, సదాచారం ఎంత పెరిగిందని చెప్పుకోవాలి?
మీడియాకు ఒక వివాదం కావాలి. దానికి అమ్ముడుపోయే వ్యవహారంలో సగటు భారతీయుడు ఇరుక్కోకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది.
శాస్త్ర సంబంధిత విషయాలలో దేశ కాల పరిస్థితులను అనుసరిమ్చి సరైన నిష్కర్షను చెప్పగలగటం ఒక కళ.
వైదిక కాలంలో జీవనదులు ప్రవహిస్తున్న రోజులల్లో ఏర్పర్చిన అంశాలను మూసీనదీ, హుస్సేన్‌సాగర్‌లను ప్రక్కన పెట్టుకుని ఉపదేశించడం ఎంత సమంజసం?
ప్రతీ సంవత్సరం వినాయక ఉత్సవాల పేరిట అరుపులు, కేరింతలు, చీకటి పడ్డాక నిమజ్జనాలు, భీభత్సం – ఇవన్నీ ఎంత అపచారాలన్న విషయం ప్రజల స్ఫురణలోకి ఎందుకు తీసుకుని రాలేకపోతున్నారు? మాకు ఏంటి సంబంధం? మాకు ఆ అధికారం లేదని మీరంటే మరి మీ ప్రవచనాలన్నీ మీరు చేసే వ్యాపారంలో భాగం కాదని ఎందుకు నమ్మాలి?
జ్యోతిషం
ఒక పెద్దాయన వారఫలాలిస్తూ అన్ని రాశులవారికి ఏదో చెప్పాడు. ఆయనే మరల ప్రతీ రోజూ దినఫలాలిస్తూ వాటికి విరుద్ధంగా చెప్పాడు. ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిషం ఇలా కేవలం ‘ఆ రంగు తొడుక్కో’, ‘ఈ సంఖ్య వాడుకో’ అని చెప్పటానికయితే అది వేదాంగమా? ఏమో! ఆ స్థాయికి ఎవరో తీసుకుని వచ్చి నవ్వులపాలు చేశారు!
జ్యోతిష శాస్త్రవేత్త ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా మాట్లాడటానికి వీలులేదు. ఇది ఏస్ట్రోఫిజిక్స్. సృష్టి క్రమాన్ని, కాలగమనాన్ని, ఆత్మవిద్యను అనుసంధానం చేసి వివరించే సంక్లిష్టమైన శాస్త్రం. రేపు ఏమవుతుంది అని చెప్పే అంశాలు ఇందులో వాస్తవానికి చాలా తక్కువ. ఒక అద్భుతమైన గణితం, గ్రహ నక్షత్రాల సంగతులు, తత్వంతో ముడిపడియున్న సిద్ధాంతాలు ఆలోచింపజేసేవిగా ఉండే రంగం ఇది. తెలిసీ తెలియని ఆధునిక విజ్ఞానాన్ని ముందుంచి కొందరు విరివిగా సిద్ధాంతులను హేళన చేసే అవకాశం ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరిచ్చారని చెప్పాలి?
ఆరు మాట్రిమోని సైట్లలో జాతకాల పొంతన ఆరు విధాలుగా ఉంటుంది!
ఒక చక్కటి సంప్రదాయం, కృషి గల కుటుంబం నుంచి వచ్చి ఎంతో పరిశ్రమతో చదువుకుని ఏదో ఉద్యోగంలోకి ఎలాగో అలా వచ్చి తాను చదువుకున్న విషయాన్ని నడిబజారులో అశ్లీలంగా మార్చి వ్యవహరిస్తున్నప్పుడు ‘మేం ఏం తప్పు చేశాం? మాకెందుకు ఈ శిక్ష?’ అని అడుగుతున్నవారికి ఏం సమాధానం చెప్పగలం?
తెర
తప్పుడు వ్యవహారాలకు తెర పడాలంటే అది ఎంతో హాస్యాస్పదమైనదిగా మారిన మాట. సమస్త కర్మలు జ్ఞానమందు పరిసమాప్తి అవుతాయని శ్రీకృష్ణుడు గీతలో చెప్పియున్నాడు.
భారతదేశంలో ఈ రోజు చిన్నవి, గొప్పవి, అన్ని ప్రతిభలూ చివరకు వెండితెర మీద కలుసుకుని చిందు వేయాల్సిన పనే.
ఈ హీరోలు, అమ్మాయిలు పండగలు ఎలా చేసుకుంటారో చూసుకోవటమే సరిపోయింది. యువతరాన్ని తప్పుదారిన తీసుకుపోయే వీరే ఎయిడ్స్ మీద, ఇతర సామాజికపరమైన విజ్ఞాపనల్లోకి వచ్చి మనకు చెబుతుంటారు. ‘నాయనా, నువ్వు ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకుని, ఇంత మంది మహిళలను ఇబ్బంది పెట్టి నాకేం సందేశం ఇస్తావు’ అని అడగలేము!
ప్రభుత్వానికి సాహిత్యాన్ని, సంగీతాన్ని, లలితకళలను సినీరంగానికి దూరంగా పెట్టి ప్రోత్సహించే మాధ్యమమే లేదా? మనకు కూడా ఇంత ఆశ పనికిరాదు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం సినీ ప్రముఖులను వాడుకుంటున్న కాలం ఇది. అకాడమీలు, పురస్కారాలు ఎంత గొప్పగా నిర్వహిస్తారో వేరేగా చెప్పనక్కరలేదు.
ఈ సినీ రంగాన్ని చాలా రంగాలకు దూరం చేయవలసిన అవసరం ఉంది. పాడుతా తీయగా లేదా ఆడుతా తీయగా అని చెప్పేసి చిన్నతనం నుండి కళ్ళకు బుల్లి తెరలు, వెండి తెరలూ కట్టేసి చక్కని పిల్లలను చెక్కబొమ్మల్లా తయారు చేస్తున్న వ్యవస్థ ఇది.
అర్థం కాని ఒక గుర్తింపు కార్డులా తయారైంది ఈ తెర.
పెద్ద మనుషులలో ఉండవలసిన హుందాతనం, చిన్నవారిలో ఉండవలసిన పరిశ్రమ, అంకితభావం, అనుశాసనం దీని ప్రభావం వలన పూర్తిగా ఆవిరై కూర్చున్నాయి.
పోనీ ఆ రంగంలో కొందరు మంచి చిత్రాలు తీస్తూ చక్కని సందేశాలు ఇస్తున్నారు అంటే వారు కూడా అమ్మవారి మెడలోంచి తాళి తీసి వితంతువుకు కట్టేసి కళారంగాన్ని పూర్తిగా ఆకట్టుకొన్నారని భావిస్తున్నారు. సదాచార సంపన్నులు కలలో కూడా అలాంటివి తలపెట్టరు. వీరేశలింగం గారు వితంతు వివాహాలు ఇలానే చేశారా?
ఇమేజరీ, డయాజసిస్ వంటివి వాడాలంటే అనవసరమైనవి ప్రదర్శించవలసిన అవసరం లేదు.
అయినా ఈ రంగం కోట్లలో మునిగి తేలుతూనే ఉంటుంది. దాని మీద అంకుశం ఎవరికీ ఉండదు. ఈ రోజు ఉన్న తరం బజారులో ఎక్కువ, ఇళ్ళల్లో తక్కువ ఉంటున్న తరం. దాని పర్యవసానం ఇంతే.
రాజకీయాలలో ఓట్ల కోసం సార్వజనికమైన ప్రదర్శనలు, ప్రచారం, గ్లామర్ అవసరం. అది ఎప్పుడూ అంతే. సమస్య మరోలా ఉంది. సామాన్యులు కూడా సర్వం సార్వజనికం చేస్తున్న కాలం ఇది. బహుశా అది కూడా కాకపోవచ్చు. అసలు ఎవరికీ సామాన్యుడిలా జీవించాలనే ఆలోచన కలగకపోవటం ఒక వైపరీత్యం.
అందుచేత అందరినీ బలవంతంగా బజారుకెక్కించి తమాషా చూస్తోంది ఈ మీడియా!
ఇలా బజారులోనే ఉండిపోదామా లేక స్వగృహాన్ని మరోసారి వెతుక్కుందామా అని ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా కాకపోతే మరొకరి జీవితాన్ని మనం, మనదైన అరుదైన జీవితకాలంలో జీవిస్తాం!
మనం ఎటు పయనిస్తున్నాం అనే ప్రశ్న సరైనది కాదేమో!
అందరం కలసి ఓ కాలుతున్న పెనం మీద పడి ఎవరి ఉనికి కోసం వారు కాలిపోతూ కూడా, నేను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాలి!
అది కాల ప్రవాహం. ఒక విధంగా సహజం కూడా. ఉన్నవీ, వస్తున్నవీ, వచ్చేవీ… అన్నీ పోయేవే.
‘నచైవ న భవిష్యమః’ – ఉండబోవు. ఒరవడులకు ఒరిగిపోయి మన కాలం తరిగిపోయింది అనుకోవడం పొరపాటు.
అన్ని మందులు మాయరోగం వచ్చిందని వాడేసి తగ్గలేదనుకొన్న రోజున జీవుడు ఓ పురాతనమైనదీ, సనాతనమైనదీ అయిన ఓ షాపు వద్దకు వెళ్ళకతప్పదు. అప్పుడైనా ఆ దుకాణం వాడు దగ్గుకుంటూ అయినా ఆ పాతమధురమైన ఆ పాత చేదు మందు దులిపి కౌంటర్ మీద పెట్టకపోడు.
అవి ఉన్నాయి, ఎక్కడికీ పోలేదు, ఎలా ఉండాలో అలానే ఉన్నాయి అని ప్రజలకు సూటిగా చూపించే ద్వారాలు కూడా కాలానుగుణంగా తెరుచుకుంటూనే ఉంటాయి…
– వేదాంతం శ్రీపతిశర్మ
వసంతగానం
కాలిబాటలు నా స్వర్గద్వారాలు
ప్రొఫెసర్ ఎమ్. ఆదినారాయణ గారు జగమెరిగిన బాటసారి. కాలినడకన యాత్రలు చేస్తూ ‘భ్రమణకాంక్ష‘లు తీర్చుకుంటూ తనకెదురైన అనుభవాలకు, తను పొందిన అనుభూతులనూ పాఠకులకు అందిస్తూ పాఠకులనీ యాత్రికులుగా చేస్తున్నారు. ఆయన వ్రాసిన యాత్రావ్యాసాల, ఇతర వ్యాసాల కూర్పు – “కాలిబాటలు నా స్వర్గద్వారాలు” అనే పుస్తకం. “మనల్ని ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకెళ్ళే వాహనం మన పాదాలే” అంటూ సాగిన ఈ రచన ఆదినారాయణ గారు కాలినడకన చేసిన వివిధ యాత్రల గురించి వివరిస్తుంది.
***
‘కాలిబాటలు నా స్వర్గద్వారాలు‘ అనే వ్యాసంలో- కాలానుగుణంగా పూజలలో ‘పాదాల’ ఆరాధన ఎలా పెరిగిందో తెలిపి, నడక ఒక ఔషధమని చెబుతారు. కాలిబాటలు నేరుగా మనుషుల హృదయ మందిరాలలోకి దారి తీస్తాయని చెబుతారు.
‘హిమాలయాలలో పాదయాత్ర‘ అనే వ్యాసంలో తనకి హిమాలయాలంటే ఎందుకు ఆకర్షణ కలిగిందో చెబుతారు. స్థానికులతో సాంగత్యం ఏర్పరుచుకుంటేనే ప్రయాణాల్లోని సౌందర్యం అవగతమవుతుందని అంటారు. వ్యాసంలో ఓ పిట్టకథ – “రక్షించండి… రక్షించండి…” అన్న కేకలు విని అక్కడికి వెళ్ళిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవం ఆసక్తికరంగా ఉంటుంది.
‘విశాఖపట్నం – అల్లూరు కొత్తపట్నం పాదయాత్ర‘ అనే వ్యాసంలో ఓ రష్యన్ వాకర్ తనకి ఏ రకంగా ప్రేరణిచ్చారో చెబుతారు. 550 కిలోమీటర్ల దూరాన్ని అంచెలంచెలుగా అధిగమించిన వైనాన్ని, మార్గమధ్యంలో ఆదరించి ఆహారం సమకూర్చిన గ్రామస్థులనీ, వారితో జరిపిన చర్చలనీ వివరిస్తుంటే… ఆయా ఊర్లలో తిరుగాడుతున్నట్టూ, ఆ చర్చలలో తామూ పాల్గొన్నట్టూ పాఠకులకి అనిపిస్తుంది.
280 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లోనూ, 720 కిలోమీటర్లు తమిళనాడులోను సాగిన నడక గురించి ‘అల్లూరు కొత్తపట్నం – కన్యాకుమారి పాదయాత్ర‘ అనే వ్యాసంలో వివరిస్తారు. ఈ యాత్రలో ఒక జాలరితో మాటలు కలిపి వాళ్ళ వలల గురించి, వాళ్ళు పట్టే చేపల గురించి తెలుసుకుంటారు, పాఠకులకూ తెలుపుతారు. ఒట్టూరు గ్రామంలోని యువకులతో కబుర్లాడి, అక్కడి పక్షుల గురించి అవగతం చేసుకుంటారు. కొన్ని రకాల గాలుల గురించి తెలుసుకుంటారు. గిద్ద, సోల, అరసోల, తూములు, పుట్టి వంటి కొలమానాలను ఓ ముసలమ్మ నుంచి తెలుసుకుంటారు. తమిళ తీరంలో రచయితకి ఎదురైన అనుభవాలు ఆసక్తిగా చదివిస్తాయి.
కేరళలోని కొన్ని ప్రాంతాలలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ ఎందుకు నిలిచి ఉందో చెబుతారు ‘కన్యాకుమారి – మంగుళూరు పాదయాత్ర‘ అనే వ్యాసంలో. ఈ యాత్రలో భాగంగా ప్రముఖ రచయిత్రి కమలాదాస్ గారిని కలుస్తారు. వేంబనాడు సరస్సు మీదుగా కొచ్చిన్ వరకూ వెళ్ళే పడవ ప్రయాణం హృద్యంగా ఉంటుంది. రకరకాల పడవల గురించి తెలుసుకుంటారు పాఠకులు.
800 పేజీల రాతప్రతిని కుదించి ముద్రణలో సుమారు 34 పేజీలలో అందించిన వ్యాసం ‘కాశీ – తిరువైయ్యారు పాదయాత్ర‘. రాముడి ప్రయాణాలను తెలిపేది ‘రామాయణం’ అని గ్రహించిన రచయిత రాముడిలా ఎక్కువ దూరాలు నడిచే అవకాశం తనకీ లభిస్తే బాగుండని కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరి మూడు నెలల పాటు సాగిన తన పదవ పాదయాత్రకి ‘యాత్రిక్ రామ’ అని పేరు పెట్టుకున్నారు. తులసీదాసు జీవించిన గంగానదీ తీరం నుంచి ప్రారంభించి, గోదావరి ఒడ్డున రామదాసు నడయాడిన చోటుకు చేరి, అక్కడ్నించి మరో గొప్ప వాగ్గేయకారుడు త్యాగయ్య జీవించిన తిరువైయ్యారుకు సాగిన నడక ఇది. తులసీదాసు, రామదాసు, త్యాగరాజుల గురించి ఆసక్తికరమైన సమాచారం లభిస్తుందీ వ్యాసంలో.
‘వాకింగ్ వారియర్’గా పేరుగాంచిన మహాత్మాగాంధీ చేసిన దండియాత్ర మార్గంలో నడక సాగించడం గురించి తెలిపే వ్యాసం ‘సబర్మతి – దండి పాదయాత్ర‘. 15 రోజులలో 400 కిలోమీటర్లు సాగిన యాత్రలో – ఇటుకబట్టీలు ఎక్కువగా ఉండే గజేరా ప్రాంతంలోని పనివారు మండుటెండలో కూడా మొక్కల్ని నాటుతూ కనిపిస్తారు. ‘ఎందుకింత శ్రమ’ అని అడిగితే, మా తరువాత పని చేయడానికి వచ్చేవారి కోసం అంటూ జవాబిస్తారు. పర్యావరణం పట్ల ఈ మాత్రమైనా స్పృహ ఉండబట్టే అక్కడ కొంతైనా పచ్చదనం ఉందంటారు రచయిత. ఈ యాత్ర పొడగునా గాంధీజీని దైవస్వరూపుడిగా భావించే వ్యక్తులని చూస్తాం.
‘మన పాదాల చుట్టూ వల వేయడమే అలల పని’ అంటారు ‘భీమిలి – చిలకాసరస్సు పాదయాత్ర‘ అనే వ్యాసంలో. చేపల కంచేరీ గ్రామం దాటాక ఒకచోట ‘కూర్చుంటే చెట్టునీడ, నడుస్తుంటే మబ్బునీడ’ కావాలని కోరుకునే తన కొడుకుకి నాలుగు మంచిమాటలు చెప్పమంటుందో తల్లి. రకరకాల పడవలు, తెప్పల గురించి తెలుస్తుందీ వ్యాసంలో. తీరం నుంచి ఎంత దూరం వెళితే, ఎంత లోతులో తిమింగలాలు కనిపిస్తాయో తెలుస్తుంది. తాగుబోతులలో నాలుగు జంతువులు ఉంటాయని ఓ మహిళ చెప్పిన మాటలు ఎంతో వాస్తవం!
గొప్ప మానవతావాది, వైద్యులు, విద్యావేత్త అయిన డా. కె.ఎన్. కేసరి గారి స్వగ్రామంలో ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయదలచి, ఆ ఊరి నుంచి వారి కార్యరంగమైన మద్రాసుకు చేసిన యాత్ర విశేషాలు ‘ఇనమనమెళ్ళూరు – మద్రాసు పాదయాత్ర‘ అనే వ్యాసంలో వివరిస్తారు. కేసరిగారు నడిచిన బాటలో 120 ఏళ్ళ తర్వాత ఆయనకు నివాళిగా నడిచారు రచయిత.
తానొక సంచారిగా మారడానికి ప్రేరణగా నిలిచిన ‘సిపాయి మార్కు అగ్గిపెట్టె‘ గురించి, జిప్సీల పట్ల కలిగిన అవగాహన గురించి, చిన్నతనంలో ఏ పనికైనా బాగా దూరాలు నడవాల్సి రావడం గురించి… ఆసక్తికరంగా చెబుతారు.
కళ, ప్రకృతి, ఇంగ్లీషు మీదా తనకి ప్రేమ కలగడానికి కారకులైన గురువులని తలచుకుంటూ నిజమైన విద్య ఏమిటో, నిజమైన గురువులంటే ఎవరో చెబుతారు ‘బడికి వెళ్ళే బాటలో జ్ఞానగంగావతరణం‘ అనే వ్యాసంలో. ప్రకృతి లోని శాశ్వతత్వం గురించి, మానవ జీవితపు తాత్కాలికత గురించి నేర్చుకున్న వైనాన్ని వివరిస్తారు.
దొమ్మరుల గురించి ఎన్నో వివరాలు అందిస్తారు ‘దేశ దొమ్మరులు‘ అనే వ్యాసంలో. జిప్సీల గురించి ప్రజలకు తెలియజేసిన ఎందరో కళాకారులనీ ఈ వ్యాసంలో సంక్షిప్తంగా పరిచయం చేస్తారు.
తనను ప్రకృతి ప్రేమికుడిగా, శ్రామిక సౌందర్య ఆరాధకుడిగా మార్చిన తన గ్రామ పరిసరాలను ‘కాశీయాత్ర మార్గ మజిలీ – చవటపాలెం‘ అన్న వ్యాసంలో వివరిస్తారు.
ఏనుగుల వీరాస్వామి కంటే ఏడు సంవత్సరాల ముందుగా కాశీయాత్ర చేసిన వెన్నెలకంటి సుబ్బారావు గారి గురించి ఒక వ్యాసం, రాహుల్ సాంకృత్యాయన్ గురించి రెండు వ్యాసాలు, శ్రీశ్రీ గురించి ఒక వ్యాసం, లలితకళా చక్రవర్తి లక్ష్మయ్యగారి గురించి ఒక వ్యాసం ఉన్నాయి ఈ పుస్తకంలో. కొంతమంది విదేశీ కళాకారుల గురించి వివరాలతో కూడిన వ్యాసాలున్నాయి. ‘కాకుల ప్రేమికుడు’ అయిన సుకల శ్రీనివాసరావు గురించి ఓ వ్యాసం ఉంది. మనుషుల గురించే కాకుండా మానవాళికి ఎంతో మేలుచేసే గాడిదలు, పిచ్చుకల గురించి వ్యాసాలున్నాయి.
***
ఈ పుస్తకం చదివితే మనకేం వస్తుంది? కొన్ని దార్లు తెలుస్తాయి, ఊర్లు తెలుస్తాయి. మంచితనాన్ని పోగొట్టుకోని స్వచ్ఛమైన మనసులున్న మనుషులు తెలుస్తారు. వివిధ ప్రాంతంలోని అలవాట్లు, ఆచారాలు, విశ్వాసాలు తెలుస్తాయి. పరిసరాల విజ్ఞానం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ‘నడక’ ప్రాధాన్యత తెలుస్తుంది. ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం ఓ పుస్తకం నుంచి?
బాటసారి బుక్స్ ప్రచురించిన ఈ 284 పేజీల పుస్తకం వెల 150 రూపాయలు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది.