back to top
Home Blog Page 3

ఆధ్యాత్మిక అనుభూతులకు ఆలవాలం కురువపురం

0

[ఇటీవల కురువపురంలోని శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆలయాన్ని దర్శించి, ఆ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటున్నారు డా. నర్మదా రెడ్డి]

[dropcap]ది[/dropcap]గంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర

జై గురుదేవ దత్త!

గురు సాంప్రదాయంలో ఏ విద్యకైనా మూలమైనటువంటి విద్య సంప్రదాయం. అలాంటి గురు సాంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనది దత్త సంప్రదాయం. ఆర్ష ధర్మం చెప్పేటివంటి దానిలో దత్త సాంప్రదాయం అగ్రగణ్యమైనది. ఎన్ని ఉపాసనలు ఉన్నా గుర్వాపాసన లేకుండా, గురు అనుగ్రహం లేకుండా పరాయి విద్య లేమి కూడా సిద్ధించవు. కాబట్టి ఈ తరానికి శ్రీపాద శ్రీవల్లభ గురువుల వారు సాక్షాత్తు దత్త స్వరూపం. అలాంటి దత్త స్వరూపులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ గురువులవారి తపోభూమి కురుపురం లేదా కురువపురం.

కురువపురం చాలా అద్భుతమైనటువంటి, దివ్యమైనటువంటి దత్త సాంప్రదాయానికి చెందినటువంటిది. శ్రీ శ్రీపాద వల్లభుల వారు తపస్సు చేసిన స్థలం. శ్రీపాద వల్లభుల వారు నీటిలో ప్రవేశించిన స్థలం కూడా అదే. కాబట్టి చాలా విశిష్టమైనది.

ఈ కురువపురానికి చేరుకోవాలంటే హైదరాబాద్ పట్టణం నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలోని పంచదేవ్ పహాడ్ అనే గ్రామం చేరాలి. ఇది మహబూబ్‌నగర్ నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాయచూరు నుంచి కూడా దాదాపుగా ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రం కృష్ణానది తీరంలో ఉంది. కృష్ణా నదికి ఇవతల తెలంగాణ రాష్ట్రం, ఆవల అంటే దత్తక్షేత్రం ఉన్నటువంటి కురువపురం కర్ణాటక రాష్ట్రం. ఇది నది మధ్యలో ఉంటుంది. చుట్టూ కృష్ణానది నీరు ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే తప్పనిసరిగా పడవను మాత్రమే ఆశ్రయించాలి. కురువపురానికి వెళ్లాలంటే దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ రాయ్‍చూర్. కానీ అక్కడ కొన్ని రైళ్ళు మాత్రమే అగుతాయి. రాయచూరులో రైలు దిగి అక్కడి నుంచి కూడా వెళ్లొచ్చు. లేదు బస్సు నుంచి అయితే హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్లే బస్సుల్లో మక్తల్ దగ్గర దిగి అక్కడి నుంచి ప్రైవేటు ఆటోలో కానీ లేదంటే బస్సుల్లో గాని పంచదేవ్ పహాడ్ చేరుకోవచ్చు.

అక్కడ నుంచి పడవలో మనం కృష్ణా నదికి బయలుదేరాలి. చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణానదిలో పడవ ప్రయాణం. ఎండాకాలంలో అయితే నీళ్లు ఉండవు, నడిచి వెళ్లిపోవచ్చు. కాకపోతే మేము వెళ్ళినప్పుడు డ్యామ్ వాటర్ వదలడం వల్ల నీళ్లు ఉన్నాయి. మధ్యలో రెండు పాయలుగా చీలి ఉంది. రెండుసార్లు మనం పడవ ఎక్కి దిగాల్సి ఉంటుంది. అలాగే వర్షాకాలంలో అయితే ఒకే పడవ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు వెళ్లడం జరుగుతుంది. ఇక ఎండాకాలం మార్చి, ఏప్రిల్, మే నెలలో మనం నడుస్తూ కూడా వెళ్లిపోవచ్చు. కార్లు కూడా అక్కడి వరకు వెళ్తాయి, అది వర్షాలు లేనప్పుడు మాత్రమే. నీళ్లు లేనప్పుడు మాత్రమే.

నదిలో శ్రీపాదులవారు రోజూ సూర్య నమస్కారాలు చేసే స్థలం కూడా ఉంది. దాన్ని కూడా మనం దర్శించవచ్చు అది నీళ్లున్నప్పుడు మనకు కనిపించదు, నీళ్లు లేనప్పుడు మాత్రమే అది మనకు కనిపిస్తుంది.

దేవాలయం నుంచి కొంత దూరం వెళ్ళాక ఒక పురాతనమైనటువంటి మర్రిచెట్టు ఉంటుంది. ఇది కూడా 13వ శతాబ్దంలో పుట్టిన వృక్షంగా చెప్తారు. విశేషంగా దీని ఊడలు విస్తారంగా ఉంటాయి, దీని కాండం కూడా చాలా పెద్దది. ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఆ మర్రి చెట్టుకు ప్రదక్షిణ చేసి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక్కడ ముడుపులు కడితే ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఈ మర్రి చెట్టును ధర్శించుకున్న కూడా ఆ దత్తుని అనుగ్రహం కలుగుతుంది. ఇక దానితో పాటు అక్కడ కొంత దూరంలో, వాసుదేవానంద స్వామి తపస్సు చేసినటువంటి స్థలం కూడా ఉంది. ఆయనను ‘తెంబె స్వామి’ అని కూడా అంటారు. ఆ గుహ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా వెళ్లి అక్కడ చూడవచ్చు.

శ్రీపాదులవారు ఇక్కడ సత్సంగాలు చేసేవారు. అలాగే ఎంతోమంది ఇక్కడ సత్సంగాలు చేస్తూ ఉంటారు. మరి ఈ పంచదేవ్ పహాడ్‍లో కొత్తగా దత్త దేవాలయ నిర్మాణం కూడా జరిగింది. దాన్ని కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ శ్రీపాదులవారు త్రిశూలాన్ని స్థాపించినట్టుగా చెప్తారు. చాలా విశేషమైనది. మీరు కూడా దర్శించండి.

ఇక్కడ అనఘా దత్తాత్రేయ స్వామి మాత్రమే కాకుండా, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతలు ఉంటారు. ఇక్కడ అన్నదానం కూడా ప్రతి నిత్యం జరుగుతుంది. మధ్యాహ్నం 1.00 నుంచి 3 గంటల వరకు. స్వామివారి దర్శనం చేసుకున్నాక ఇక్కడ అన్న ప్రసాదం మీరు కూడా స్వీకరించండి.

క్షేత్రమహిమ – శ్రీపాదుల లీలలు:

శ్రీపాద శ్రీవల్లభులవారు పిఠాపుర క్షేత్రంలో జన్మించారు. ఈ పిఠాపురం పురుహోదికాదేవి శక్తిపీఠం. అలాగే కుక్కుటేశ్వర స్వామి కూడా ఇక్కడ ఉంటాడు. దాంతోపాటు ఇక్కడ చాలా విశేషమైనటువంటి విష్ణుపాదాలు ఉన్నాయి. పాదగయానిధి అంటారు. ఈ క్షేత్రాన్ని దత్త సాంప్రదాయానికి సంబంధించిన తపోభూమిగా పరిగణిస్తారు. ఈ పిఠాపురం క్షేత్రంలోనే అప్పల నరసింహారాజుశర్మగారు సుమతీ దంపతులకు 1320వ సంవత్సరంలో శ్రీపాద శ్రీవల్లభులవారు జన్మించారు. 16 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గరనే గడిపారు. ఉపనయన సంస్కారాలయ్యాకా, 16వ సంవత్సరంలో వారు పాదచారియై, అనేక్ష క్షేత్రాలు సందర్శించి, గోకర్ణం చేరుతారు. మూడేళ్ళ పాటు అక్కడ భక్తులను అనుగ్రహించి, పిమ్మట శ్రీశైలం చేరుతారు. అక్కడ నాలుగు నెలులు ఉండి, అనంతరం కురువపుర క్షేత్రానికి చేరుకున్నారు. ఈ క్షేత్రంలో 14 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు ఆచరించారు.

ఎన్నో మహిమలు చూపారు. ఎందరికో ఆధ్యాత్మికోన్నతి కల్గించారు. ఇక్కడ ఒక రజకుడు స్వామివారికి భక్తుడయ్యాడు. అనేక సేవలు చేశాడు. స్వామివారు నిత్యం అక్కడ చెట్టు కింద తపస్సు చేయడం చూసి ఆ స్వామికి రోజు నమస్కారం చేసుకునేవాడు.

ఒకరోజు నదికి వెళ్లి వస్తుండగా, నదిలో ఒక రాజు తన పరివారం తోటి తన భార్యల తోటి ఒక పెద్ద పడవలో విహారంగా వెళుతూ కనిపించాడు. అది చూసి, ఆహా ఈ రాజుది ఎంత వైభవం! మరి ఇలాంటి జన్మ చాలా విశిష్టమైనది అని మనసులో అనుకున్నాడట ఆ రజకుడు. అదే ఆలోచన తోటి శ్రీపాదులవారి సేవకి వెళ్ళి, స్వామికి నమస్కారం చేసుకోగా, “నాయన ఏమనుకుంటున్నావు నీ మనసులో? నీ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుస్తాను” అన్నారు శ్రీపాదులవారు. అతని కోరికను గ్రహించి, రాజుని చేస్తానని వరమీయగా, “ఈ జన్మలో నాకు వయసయిపోయింది. రాజునైనా భోగభాగ్యాలు అనుభవించలేను. వచ్చే జన్మలో రాజు లాగా పుట్టించండి” అని కోరుకుంటాడు. స్వామివారు వరమిస్తారు. కానీ, దివ్య మైనటువంటి శ్రీపాదుల వారి అనుగ్రహం పొంది, ఆయన సేవలు చేయని నా జీవితం ఎందుకు అని అనుకున్న రజకుడు – “మీ సేవనే నాకు కావాలి” అని అంటాడు. అప్పుడు శ్రీపాదుల వారు, “వచ్చే జన్మలో అన్నీ అనుభవించి తర్వాత నా చరణాలను చేరుకుంటావు” అని దీవిస్తారు. ఇలాంటి అద్భుతమైన కథలు ఎన్నో ఉన్నాయి. అంబిక అనే మహిళ కథ ఉంది. అది కూడా చాలా విశిష్టమైనది.

ఆశ్వయుజ మాసం, కృష్ణపక్ష ద్వాదశి, హస్తా నక్షత్రం రోజున శ్రీపాదులవారు కృష్ణానదిలో అంతర్హితులయ్యారు. ఇక్కడ సిద్ధాసన స్థానం కూడా దేవాలయంలో ఉంది. శ్రీపాదులవారి చరిత్రను మరొకసారి సంపూర్ణంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆలయ సందర్శనం:

ఈ దీవి తాబేలు ఆకారంలో ఉన్నందున దీనికి కురువపురం అని పేరు వచ్చింది. మేము ఇక్కడికిక చేరుకునేసరికి మధ్యాహ్నం 1:30 అయింది. 4.00 వరకు గుడి తెరవరు. కాబట్టి గుడి ప్రాంగణంలో ఒక చెట్టు కింద కూర్చొని తెచ్చుకున్న భోజనాలన్నీ తినేసి, అక్కడే ఉన్న ఒక నలుగురు పనివాళ్లకు అన్నదానం చేశాము. తర్వాత అందరం కలిసి గుడి బయట, కూర్మావతారంలోనూ, రకరకాల భంగిమల తోటి ఉన్న విగ్రహాలను దర్శించాము. వాటి దగ్గర ఫోటోలు దిగాం. మరునాడు దీపావళి కాబట్టి మేము తీసుకెళ్లిన బాణాసంచా అంతా కాల్చి చక్కగా ఎంజాయ్ చేశాం. అక్కడి నుంచి ఒక పడవ దగ్గరికి వెళ్ళాము. నదిని దాటడానికి ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు లెక్కన మాట్లాడారు. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత మాతో పాటు ఎక్కడెక్కడి జనం కూడా ఉన్నారు.

మా టీం లీడర్ దీపా మాకు విడిగా ఓ పడవ మాట్లాడారు, కానీ, వేరే పడవ వాళ్ళు గొడవ పెట్టారు. కాసేపటికి పడవ ఎక్కి కృష్ణా నదిని దాటి కురువపురం చేరుకున్నాం. అబ్బా, మూడు గంటల్లో చక్కగా కర్ణాటక స్టేట్‌కి వచ్చామని చాలా సంతోషం అనిపించింది నాకు.

అందులో ఆ పడవలో పోతూ పోతూ చక్కగా పాటలు పాడుకుంటూ ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఆ నదిని దాటాము. ఆ నదిని దాటిన తర్వాత అక్కడే ఒక గురువుగారి పాదుకలు చూసాము. ఆ ఊరి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే శ్రీపాద వల్లభ క్షేత్రము అని రాసి ఉన్న బోర్డు కనబడింది. నేను ఒక ఫోటో దిగి లోపలికి వెళ్లాను. లోపల పెద్ద గుడి ఉంది. గుడి ప్రాంగణం లోకి వెళ్ళగానే అక్కడ భజనలు జరుగుతున్నాయి. మేము 28 అక్టోబర్ నాడు వెళ్ళాము. ఆ రోజు దత్తాత్రేయ స్వామి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన దినమట! చాలా చక్కగా భజనలు జరుగుతూ ఉన్నాయి. ఒక అమ్మాయి భజనలు పాడుతున్న విధానం నాకు చాలా చాలా నచ్చేసింది. ఆ అమ్మాయి చెప్పే తీరు, ఆ అమ్మాయి చీర కట్టు బావున్నాయి. చక్కటి బొట్టు పెట్టుకుని, చేతులలో భజనకు సంబంధించిన వస్తువుల తోటి తాళముతోటి చక్కగా చెప్పింది. డోలు తదితర వాయిద్యాల ధ్వనులతో ఆ ప్రాంగణం అంతా మార్మోగిపోయింది.

అక్కడ దత్తాత్రేయ స్వామి వెలసిన ఆ గుడిలో అర్చన చేయించుకుని మూడుసార్లు గుడి చుట్టూ ప్రదక్షణ చేసుకొన్నాం. ఓ మర్రి చెట్టు కింద శివుడి విగ్రహము, నంది విగ్రహం ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుని అక్కడే వరండాలో కాసేపు కూర్చుని గుడిని అంత పరీక్షిస్తూ చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుడిని ధ్యానిస్తూ కూర్చున్నాం.

కాసేపటికి గుడి నుంచి బయటికి వచ్చాం. బయటికి రాగానే అక్కడ ఒక గుహ ఉందని మా గైడ్ చెప్పాడు. అబ్బాయి ఆ గుహ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ గుహకి వెళ్లే దారిలో ఓ మర్రిచెట్టు దగ్గర దగ్గర ఒక 1500 గజాలు విస్తరించి కనిపించింది. ఆ మర్రి చెట్టు దగ్గర ఫోటోస్ దిగాం.

అక్కడి నుంచి కొద్ది ముందుకు వెళ్ళగానే కుడి పక్కన దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసే స్థలం చూసాము. అక్కడ అందరం కాసేపు ధ్యానం చేశాము. ఆ మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ గుహ దగ్గరికి వెళ్ళాము. ఆ గుహా చాలా చిన్నగా ఉంది. లోపలికి వెళ్ళాలంటే పాకుతూ వెళ్ళాలి. మోకాళ్ళ పైన చిన్న పిల్లలు పాకినట్టుగా పాకతూ వెళ్లి కిందికి దిగిన తర్వాత మనకు శివలింగం చక్కగా దర్శనమిస్తుంది. ఈ గుహలోకి దత్తాత్రేయ స్వామి ఆ రోజుల్లో తపస్సు చేశారట.

అందులో కాసేపు కూర్చుని అందరం బయటికి వచ్చి అక్కడ నుంచి మళ్లీ పడవ దగ్గరికి వచ్చాము. ఆ పడవ వాళ్ళు మేము వెళ్లేటప్పుడు జరిగిన ఘర్షణ గుర్తుపెట్టుకుని, మళ్ళీ గొడవ చేశారు. డబ్బులు తీసుకున్న పడవ అబ్బాయిని రమ్మని ఎంత పిలిచినా రావట్లేదు. మా దీప చాలా సేపు వాదించిన తర్వాత, అతను బోట్ స్టార్ట్ చేసి మమ్మల్ని ఈ ఒడ్డుకు తీసుకొచ్చాడు.

ఇదంతా జరిగేసరికి సాయంత్రం 6:30 అయింది. మేము మళ్ళా బాణాసంచా పేల్చి చక్కగా ఆనందిస్తూ పాటలు పాడుకుంటూ టీ, కూల్ డ్రింక్స్ తాగాము. మధ్యాహ్నం నుంచి మమ్మల్ని గైడ్ చేస్తున్న అతను అందరి దగ్గర నుంచి కొద్దిగా టిప్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. మేమంతా మా బస్ ఎక్కాం.

అక్కడి నుంచి మేము మెహిదిపట్నం వచ్చాం. మేము తీసుకెళ్లిన భోజనాల సామాగ్రినంత వాళ్లకప్పజెప్పాం. స్నేహ, అర్చన మధ్యలో దిగిపోయారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక క్యాబ్ మాట్లాడుకుని వాళ్ళింటికి వెళ్లిపోయారు. మిగతా ముగ్గురిని వాళ్ళ ప్రాంతాలలో దించి మేము బయల్దేరాము. హబ్సిగూడలో నేను వీణా దిగిపోయాము. అక్కడినుంచి దీప డైరెక్ట్‌గా మౌలాలికి వెళ్లిపోయారు.

ఎంతో సంతోషంతో, అత్యంత విలువైన ఆధ్యాత్మికానుభూతులతో, తియ్యని జ్ఞాపకాల తోటి మేము తిరిగి వచ్చాము.

~

కురువపుర క్షేత్రం అత్యంత మహిమాన్వితమైంది. జీవితంలో ఒక్కసారి అయినా మనం ఈ క్షేత్రానికి చేరుకొని శ్రీపాదులవారి చరణాలను ఆశ్రయిస్తే సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహం కలుగుతుంది.

పుణ్యక్షేత్రాలను దర్శించండి కానీ అక్కడి ఆలయ పరిసరాలను కానీ, ప్రాంగణాన్ని కానీ అపరిశుభ్రంగా చేసి; అక్కడి నియమ నిబంధనలను ఉల్లంఘించి పవిత్రతను పాడు చేయకండి. భక్తితో నియమ నిబంధనలతో క్షేత్రాలను దర్శించాలి. ఆ తపోభూమిని పాడు చేయడం అనేది తప్పు. పవిత్రమైన దేవాలయాలను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం.

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-37

0

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

జీవన రాగాలు:

లబ్..

డబ్..

లబ్, డబ్..

లబ్డబ్..

నా చెవులకు ఈ శబ్దమే వినబడుతోంది. రాత్రి టైమ్ ఎంతైందో తెలియడం లేదు. గదిలో ఏసీ పనిచేస్తున్నట్లు లేదు. ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. నిజానికి నేను ఉన్నది గదిలో కాదు. అది గుండెకు ఆపరేషన్లు చేసే ఓ పెద్ద ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ (ఐసీయు)లో. ఈ సంగతి నిన్ననే తెలిసింది. గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరడం, డాక్టర్లు అనేక పరీక్షలు చేసి గుండెలో నాలుగు చోట్ల రక్తప్రసరణ బ్లాక్ అయిందని తేల్చడం, ఇక బైపాస్ శస్త్ర చికిత్సే శరణ్యమని చెప్పేయడంతో ఓ ప్రముఖ సర్జన్ (జయరాం పే)గారి పర్యవేక్షణతో ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లడం గుర్తుంది. (‘ఎలుక మళ్ళీ పుట్టింది’ – అన్న అధ్యాయంలో ఈ సంఘటన ప్రస్తావించాను) రెండు రోజుల తర్వాత నిన్ననే మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూస్తే ఇదిగో ఈ విశాలమైన గది (ఐసీయు)లో ఉన్నానని కాసేపటికి తెలిసింది. ఆపరేషన్ కాగానే ఐసీయు లోకి తీసుకువచ్చారట. నాకేం తెలుసు? మొండి నిద్రాయె. ఇంత నిద్ర నా జీవితంలో ఎరుగను. ఒక చిన్న మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఇంత నిద్ర పడుతుందా! బోలెడు ఆశ్చర్యం. అంతలో నవ్వు వచ్చింది. అన్నీ తెలిసినా ఒక్కోసారి ఏమీ తెలియని అజ్ఞానంలోకి జారుకోవడమంటే ఇదేనేమో. రెండో రోజు రాత్రి – టైమెంతైందో తెలియడం లేదు. నిద్ర పట్టడం లేదు. చేయి కదిలించాలంటే ఏవో వైర్లు తగిలించి ఉన్నాయి. వెల్లికల పడుకున్న నేను ఎటూ కదలలేని పరిస్థితి. చేతులు పైకి లేపలేను. కాళ్లు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ విపరీతమైన బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. రెండు కాళ్లకు కోతలు పడ్డాయనీ, అక్కడి రక్త నాళాలను చిన్నచిన్న ముక్కలుగా కోసి ఇస్తుంటే బైపాస్ సర్జరీ చేస్తూ బ్లాక్ ఆయిన చోట్ల బైపాస్ (రక్తం సాఫీగా ప్రవహించడానికి ప్రక్క దారి) వేసుంటారని తెలియనంత అజ్ఞానిని కానులేండి. ఎందుకంటే, ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు ‘కులాసా’ పేరిట వారానికి ఓ రోజు ప్రత్యేక పేజీని నడిపేవాడని. దానికి ఇన్ఛార్జ్‌గా ఉన్నప్పుడే విజయవాడలో అనేక మంది డాక్టర్లతో పరిచయాలు అయ్యాయి. డాక్టర్ అయోధ్య గారితో మానసిక రుగ్మతల మీద ఆర్టికల్స్ వ్రాయించాను.

కలిసిన వేళ:

డాక్టర్ జి.వి. పూర్ణచంద్ గారితో ‘కలసిన వేళలో..’ పేరిట సందేహాలకు జవాబులు వ్రాయించాను. పూర్ణచంద్ గారు ఆయుర్వేద వైద్యులు. వీరు వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ ప్రవృత్తి రీత్యా రచయిత. పైగా తెలుగు భాషాభిమాని. ‘కళారత్న’ పురస్కారం అందుకున్న డాక్టర్ పూర్ణచంద్ గారిని ఆ తర్వాత అంటే 25 సంవత్సరాల తర్వాత ఈ వ్యాసం వ్రాయడానికి కొద్ది రోజుల ముందే (2024 డిసెంబర్ 4) విజయవాడలో కలిశాను. వారెంతో సంతోషించారు.

ఆ రోజుల్లో ఓ మీడియా మిత్రుని సహాయంతో డాక్టర్ రమేష్ బాబు గారిని కలిశాను. అప్పట్లోనే వారు కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు గడించారు. వీరి ఆస్పత్రిలోనే నాకు బైపాస్ సర్జరీ అయింది. సరే, మళ్ళీ ఐసీయు దగ్గరకు వెళదాం..

క్క్యూర్.. క్క్యూర్:

ప్రక్క మంచం మీద పడుకున్నదెవరో తెలియదు. కీచు గొంతుకతో – ‘సిస్టర్.. సిస్టర్..’ అంటూ పదే పదే పిలుస్తున్నారు. కానీ, అటు నుంచి సమాధానం లేదు. పోనీ నేను గట్టిగా పిలుద్దామని ట్రై చేశాను. అప్పటికే నా గొంతు దాహంతో బాగా ఎండిపోయింది. మండుటెండలో ఎడారిలో ఉన్నట్లుంది నా పరిస్థితి. గొంతు పూడుకుపోయినట్లుంది. ఈ సిస్టర్స్ మీద కొపం వచ్చింది. మంచినీళ్ళని సైగలు చేస్తే ఓ చెంచాడు నీళ్లతో నోరు తడుపుతున్నారు. ప్రక్క బెడ్ పేషెంట్‌కి సాయం చేద్దామని నోరు చించుకుని అరుద్దామనుకున్నాను. ఊహూ.. ఆ కీచు గొంతే బెటర్. నా గొంతు ఆ మాత్రమన్నా లేవడం లేదు. ‘క్క్యూర్.. క్క్యూర్’ అంటూ ఏదో వింత శబ్దం మాత్రమే వచ్చింది. ఆ శబ్దం వింటుంటే నాకే భయం వేసింది. ఏమిటో, బైపాస్‌తో నా గుండె బాగవడం మాట అలా ఉంచితే, గొంతు పోయిందా ఏమిటీ.. ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి గొంతు సరిచేసే ఆస్పత్రికి తరలిస్తారేమో.. ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు. సరిగా అప్పుడు అనిపించింది.

శరీరం కదలడం లేదు.

గొంతు రావడం లేదు.

శ్వాస గట్టిగా పీల్చలేకపోతున్నాను.

అయినా.. మెదడు మాత్రం చురుగ్గా పనిచేస్తున్నది. ఎంతగా అంటే, విద్యుత్ ప్రవహిస్తున్న తీగలా చాలా చురుగ్గా. విపరీతమైన చలాకీగా..

ఏమిటిది.. ఆశ్చర్యమే.

మెదడులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. రాత్రి పూట కాసేపు కునుకు పట్టినా కలలో కూడా ఎప్పుడో చిన్నప్పటి సంగతులే కళ్లకు కడుతున్నాయి. పల్లెటూరు.. పెంకుటిల్లు.. ఆవులు.. ఎద్దులు.. తరుముతున్న ఆబోతు.. అంతలో ఎవరో అరుస్తున్నారు. ఎవరు..? ఓ ఆడమనిషి. బామ్మలా అనిపించింది. కానీ జుట్టు విరబోసుకుంది. ఎవరో తెలియడం లేదు. ఆ పెంకుటిల్లు అడవిరావులపాడులోని మా ఇల్లులా లేదు. ఏదో వింతగా ఉంది. ఆకారం నా దగ్గరకు వచ్చింది. మరీ దగ్గరగా.. ఆ వింత ముఖం చూడగానే నేను ఉలిక్కి పడ్డాను. కల చెదిరింది. అంతే ఆ రాత్రికి ఇక నిద్ర లేదు. పిచ్చి ఆలోచనలతో బుర్ర వేడెక్కింది. ఎప్పుడెప్పుడూ తెల్లవారుతుందా అని తూర్పున ఉన్న కిటీకీ వైపు చూస్తున్నాను. అదేమిటో మనం ఎదురు చూసేటప్పుడు సూర్యోదయం ఎంతకీ కాదు.

ఇంకా తెలవారదేమీ..

ఈ చీకటి విడిపోదేమీ?!!

మంచు కడిగిన ముత్యం:

తెల్లవారాక సిస్టర్‌ని పిలిచి మాట్లాడటానికి ప్రయత్నించాను. అప్పటికే కాసిని మంచి నీళ్లు త్రాగడంతోనో మరి దేని వల్లనో తెలియదు కానీ గొంతు లేచింది. సన్నగా నెమ్మదిగా మాట్లాడగలుగుతున్నాను. అడిగాను, సిస్టర్‌ని..

‘రాత్రి నిద్ర పట్టడం లేదు’

‘కొన్నాళ్లు పట్టదు. నిదానంగా మామూలు అవుతుంది’

‘కానీ ఆలోచనలు ఆగడం లేదు. పిచ్చెక్కేలా ఉందే’

‘మీ గుండెకు ఆపరేషన్ అవడంతో రక్తప్రసరణ మామూలు స్థాయికి వచ్చింది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తున్నది.. మీరు ఓ పని చేయండి. మీరు జర్నలిస్ట్‌ట కదా, తెలిసిందిలేండి. పెద్ద డాక్టర్ గారికి కూడా మీరు తెలుసట కదా..’

‘అవును. నేను జర్నలిస్ట్‌ని’ – ఈ మాటలు అంటున్నప్పుడు అంత బాధలోనో ఏదో గర్వం తొణికిసలాడింది.

ఏమిటో నా పిచ్చి. ముందు బతికి బట్టకట్టనీ, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనీ..అనుకుంటూ నాలో నేను నవ్వుకున్నాను.

‘ఏం చేయమంటారు?’

‘మీకు నచ్చిన టాపిక్స్ మీద ఆలోచనలు పెట్టండి. అలా ఆలోచిస్తుంటే మీకు ఉత్సాహంగా ఉంటుంది. పైగా మంచి నిద్ర కూడా పట్టవచ్చు.’

సిస్టర్ ముఖం చూశాను. ఆమె పేరు మాధవి. చలాకీగా ఉంది. చాలా చక్కటి సలహా ఇచ్చినందుకు అమ్మాయి వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను.

అర్థం చేసుకుంది. ప్రేమగా నా చెయ్యి నొక్కింది.

ఆ స్పర్శలో అమ్మ ప్రేమ కనిపించింది.

మూడవ రోజు రాత్రి ఈ సూత్రం పాటించాను. మంచి విషయాల గురించి ఆలోచించాలి. మనసులోని చెడును దూరం చేయాలి. అసలు ఈ గండం నుంచి బయటపడగానే మనసును ఎల్లవేళలా మంచు కడిగిన ముత్యంలా ఉంచుకోవాలి. అలాంటి పనులే చేపట్టాలి.

ఇలా ఆలోచిస్తుంటే – సినిమా పాటలు గుర్తుకు వచ్చాయి. అంతే, నాలో నేను పాటలు పాడుకోవడం మొదలుపెట్టాను. ఒక అంత్యాక్షరి కార్యక్రమాన్ని నేనొక్కడినే.. నాలో నేనే నిర్వహించుకుంటూ కాలాన్ని దొర్లిస్తున్నాను. ఒక పాట వెంట మరో పాట.. దాని వెంట ఇంకో పాట.

చిత్రం.. ఈ సూత్రం పనిచేయడం మొదలుపెట్టింది. అంత్యాక్షరి సాగుతుండగానే ఎప్పుడో నిద్ర పట్టింది.

ఐసీయులో అంత్యాక్షరి!

‘గుడ్ మార్నింగ్’

‘ఓహ్.. గుడ్ మార్నింగ్’

‘రాత్రి నిద్ర పట్టిందా..?’

‘పట్టిందమ్మా, నీవు చెప్పినట్లు చేశాను. అంత్యాక్షరి ఆడుకున్నాను’

‘ఆడుకున్నారా! అంత్యాక్షరా..!!’

సిస్టర్‌కి అర్థం కాలేదు. అయోమయంగా చూసింది. అంతకన్నా వివరంగా నేనూ చెప్పలేదు.

పాటలు పాడుకోవడంతో పాటుగా ఆ పాట ఏ సినిమాలోనిదీ, ఏ సన్నివేశంలోనిది, సాహిత్యం ఎలా ఉంది..? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుంటే, జీవితం మొత్తం ఓ రాగాల అల్లికగా కనబడసాగింది. మున్ముందు ‘జీవనరాగాలు’ పేరిట పుస్తకం వ్రాయడానికి బహుశా ఆ క్షణంలోనే బీజం పడిందేమో.

నాకు బైపాస్ జరిగినప్పుడే (2020) కారోనా మహమ్మారి విరుచుకుపడింది. ఏ క్షణంలో ఎవరి ప్రాణం అనంత వాయువుల్లోకి కలిసిపోతుందో తెలియని పరిస్థితి. అప్పటికి ఇంకా వాక్సిన్ కనుక్కోలేదు. ఎవరి జాగ్రత్తలో వారుండాల్సిందే. అలాంటప్పుడు ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండకూడదంటూ కొద్దిగా కోలుకోగానే పేషెంట్స్‌ని డిశ్చార్జ్ చేసేస్తున్నారు. ఐదు రోజుల తర్వాత నన్ను డిశ్చార్జ్ చేస్తామన్నారు. అయితే ఆ రోజు మంచి రోజు కాదనీ మర్నాడు వెళతామని మా వాళ్లంటే, ఆపరేషన్ చేసిన సర్జన్ మందలించారు.

‘మీకేం తెలియడం లేదు. కరోనా కారణంగా పేషెంట్స్‌ని ఎలా రక్షించాలా అని మేమే భయపడుతున్నాము. క్షేమంగా ఆపరేషన్ జరిగింది. అది చాలు. నో.. నోనో ఇక ఉండకూడదు. ఇంటికి వెళ్ళండి. జాగ్రత్తగా చూసుకోండి’ – అంటూ మందలించారు. దీంతో మర్నాడే డిశ్చార్జ్ చేశారు. కరోనా సమయంలోనే జీవితం విలువ అందరికీ తెలిసి వచ్చింది. ఈ సందర్భంలోనే నాకు ఓ పాట గుర్తుకు వచ్చింది.

‘పోతే పోనీ పోరా

ఈ పాపపు జగతిలో

శ్వాశ్వత మెవడురా..

వచ్చుట ఏలో

పోవుట ఎటకో

వాస్తవమెవరూ కనలేరు.’

– అంటారు కవి అనిశెట్టి. ఇదే పాటలో మరో చోట..

‘ప్రకృతి శక్తుల జయించు నరుడా ప్రాణ రహస్యం కనలేవా?’ అని ప్రశ్నిస్తారు.

ఇంకో చోట..

‘ప్రాణం పోసిన దాతయెరా, ఈ సృష్టికి అతడు కర్తయెరా, ఇల సర్వం దేవుని లీలయెరా’ – అంటారు.

ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మన మెంత? మన జీవితం ఎంత..? అసలు ఈ భూమి ఎంత..? ఈ సౌర కుటుంబం ఎంత..? ఆమాట కొస్తే లక్షలాది నక్షత్రాలను తనతో పాటుగా తీసుకువెళుతున్న పాలపుంత ఎంత..? ఎవరు నడిపిస్తున్నారు వీటిని. విశ్వం అంతు ఎక్కడ?? అన్ని ప్రశ్నలే.. ఇదంతా దేవుని లీల కాకపోతే మరేమిటి? అంటూ సరిపుచ్చుకోవడమే..

‘చెబితే చానా ఉంది,

ఇంటే ఎంతో ఉంది..’

అంటారు వేదాంతులు. అటు శాస్త్రవేత్తలకూ, ఇటు వేదాంతులకు పూర్తిగా అంతు చిక్కని విశ్వ రహస్యాల ముందా మన యీ కుప్పిగెంతులు? ఈ అహంకారం, ఈ స్వార్థం.

అందరిలో గుడి ఉంది:

మనంతా దేవుడు చేసిన బొమ్మలం. బొమ్మకు ప్రాణం పోసినవాడే మనతో ఆడుకుంటాడు. అది అతగాడికి వేడుక. నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. లాలిస్తాడు, పాలిస్తాడు. మనలో జీవన నాదం పలికిస్తాడు. మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు..?

‘అరే, ఎక్కడో లేడురా అబ్బాయి. అడుగడుగునా గుడి ఉంది. మనందరిలోనూ ఆ గుడి ఉంది. ఆ గుడిలో దీపం ఉంది. ఆ దీపమేరా దైవం. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతకడం కంటే నీలోని పరమాత్మను, అలాగే తోటి జీవుల్లోని దైవాన్ని గుర్తించు’ అంటారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు.

అసలు నీలోనే దేవుడు ఉంటే, ఆ దేవుడి కోసం వెతకడమేమిటి? ఒక వేళ ఎక్కడో అక్కడ దేవుడు ఉన్నప్పటికీ, ఈ మనసు లేని మనిషిని చూసి ఆ దేవుడు ఎప్పుడో రాయైపోయాడట. దాగుడు మూతలు సినిమా కోసం వ్రాసిన పాటలో ఆత్రేయ అలా అనేస్తాడు. ఇక ఆ దేవుడు కనబడటంలేదని మనిషేమో నాస్తికుడయ్యాడట. ఎంత అజ్ఞానం, మరెంతటి అవివేకం.

అసలు మనిషికీ, ఇతర జీవులకు పెద్ద తేడా ఉంది. అదేమిటంటే, మనిషికి మాత్రమే బుద్ధి (ఆలోచించే మెదడు) ఇచ్చాడు. దీనికి తోడుగా హృదయాన్ని (మనసు) కూడా ఆ దేవుడే ఇచ్చాడు. ఈ రెండూ ఇచ్చి భూమి అంతా నీదేరా అబ్బాయి, ఏలుకో అని పంపాడట. అయితే బుద్ధికేమో హృదయం లేదు, ఇక హృదయానికేమో బుద్ధే రాక ఈ లోకాన్ని మానవుడు నరకం చేస్తున్నాడట – ఆహా.. ఏమి ఆలోచన అండి. అందుకే, ఆత్రేయ ‘మనసు కవి’ అయ్యారు.

ఈ జీవితం ఎంతో చిత్రమైనది. అందుకు తగ్గట్టుగానే దాని నడత కూడా బహు చిత్రమైనది. ఎప్పుడు పైకెక్కుతామో మరెప్పుడు దిగజారుతామో ఒక్క కాలానికే తెలుసు. అందుకే ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవ్వరూ ఊహించలేరు. విధి విధానాన్ని తప్పించడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాదు. మహా రాజులకైనా, మానవ జన్మ ఎత్తిన మహామహా దేవుళ్లకైనా ఇది తప్పదు. కాలం చెప్పిన సత్యం. లవకుశ సినిమా కోసం కొసరాజు రాఘవయ్య గారు వ్రాసిన పాటలో ఈ సత్యం ఆవిష్కృతమైంది.

జయమ్ము నిశ్చయమ్మురా:

కొసరాజు రాఘవయ్య

కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ప్రతి కష్టం వెంటనే సుఖం ఉంటుంది. కష్టకాలం కాగానే సుఖపడే యోగం వస్తుందిరా అంటూ నిరుత్సాహం పడే వారిలో ఉత్సాహం నింపిన పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. నాకైతే శభాష్ రాముడు సినిమాలో..

జయమ్ము నిశ్చయమ్మురా

భయమ్ము లేదురా

పాట నచ్చుతుంది.

జంకు గొంకు లేకుండా ముందుకు సాగిపోమ్మంటారు కవి. కష్టాలు కోర్చుకుంటేనే సుఖాలు దక్కుతాయి. గాఢాంధకారం అలుముకున్నప్పుడు భీతిల్లికూడదు. వెలుగు దారి కోసం వెతకాలి. సాగిపోవాలి. నిరాశతో జీవితాన్ని కృంగదీసుకోకూడదు. ఎక్కడో అవమానం జరిగిందనీ, మరో సారి ఆరోగ్యం క్షీణించి పోయిందనో ఈ జీవితం వృథా.. వృథా అనుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడి ఈ లోకం నుంచి పారిపోకూడదు. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితంలోని ప్రతి సంఘటన వాడి లీలగా భావిస్తూ కష్టకాలం వెళ్ళేదాకా పోరాడాల్సిందే. చివరకు విజయకేతనం ఎగురవేయాల్సిందే.

నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నప్పుడు ఇలాగే నా బతుకు అంధకారం అయింది. చుట్టూ చీకటి.. నడిచే ఓపికే లేనప్పుడు ఇక పోరాటం కూడానా..అనే నిస్పృహ. ఇలాంటి పరిస్థితి లో ఈ పాట నాకు కరదీపక అయింది. చీకటి మనసులో కొత్త దీపాలు వెలిగించింది. పర్యవసానంగా మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకున్నాక నా సొంత చానెల్ (channel5am) వైపు దృష్టి పెట్టి ఏ పాటలైతే నాకు ఊరట ఇచ్చాయో ఆ పాటలతోనే ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేశాను.

ఏ పాట నే పాడనూ..:

పాట కున్న శక్తిని గ్రహించాను. పాటలో బలమైన సాహిత్యం ఉండి, దానికి తగ్గట్టుగా చక్కటి రాగం ఉంటే ఆ పాట హృదయాలను కట్టి పడేస్తుంది. నిద్ర లేచిన దగ్గరి నుంచి నిద్రలోకి జారుకునే వరకూ నిత్యం మనం చేసే పనులన్నింటికీ ప్రేరణ కలిగించే పాటలు మన తెలుగు సినిమాల్లో ఉన్నాయి.

‘అలలు కదిలినా పాటే

ఆకు మెదలినా పాటే

కలలు చెదిరినా పాటే

కలత చెందినా పాటే..

ఏ పాట నే పాడనూ,

బతుకే పాటైన పసివాడను’

అవును, నేను పాటకు బానిసైన పసివాడను. పాటలోని సాహిత్యం ఎన్నో సందర్భాల్లో నన్ను లాలించింది. ఊరడించింది. కొత్త ఊపిరులూదింది. ఉరకలెత్తించింది. పట్టుదల పెంచింది. పోరాట శక్తిని మేల్కొలిపింది. సాహసాలు చేయమని ప్రోత్సహించింది. పల్టీ కొట్టిన ప్రతిసారీ తట్టి లేపింది. ఇలా ప్రతి చోట పాటే. ప్రతి నిమిషం రాగమే. అందుకే నా జీవితం ఓ పాట, ఓ రాగం.

నాలో నేనే..:

నేను సంగీతం నేర్చుకోలేదు. పాట పదిమందిలో పాడి రక్తి కట్టించాలంటే సంగీతం అవసరం. కానీ పాటని వింటూ సాహిత్యంలోని భావాలను జీర్ణించుకోవడానికి సంగీతం అవసరం లేదు. నేను బయట అందరి ముందూ తరచూ పాడలేకపోవచ్చు. కానీ నాలో నేను ఎక్కువగా పాడుకుంటాను. మురిసిపోతుంటాను. బైపాస్ సర్జరీ అయిన తర్వాత ఈ లక్షణం మరీ ఎక్కువైనట్లు అనిపించింది.

అసలు గానానికి ఓ గొప్ప శక్తి ఉంది. అది ఎలాంటిదంటే..

పులకించని మది పులకిస్తుంది.

వినిపించని కథ వినిపిస్తుంది.

మనసును మురిపిస్తుంది.

రేపటి మీద ఆశలు రేపుతుంది గానం.

చెదిరిపోయిన భావాలను చేర్చి కూర్చును గానం.

నిజమే కదా, నా జీవితంలో ఎప్పుడో మరచిపోయిన సంఘటనలను చేర్చి కూర్చడమంటే ఎంత కష్టం. కానీ పాటలు తలచుకుంటూ నా జీవన యాత్రను అక్షరబద్ధం చేసేటప్పుడు చెదిరిపోయిన సంఘటనలు మళ్ళీ కళ్ల ముందు సాక్షాత్కరించాయి. అందుకే జీవనరాగాలు పలికించ గలుగుతున్నానేమో.

గుండె చెదిరింది.

బతుకుపై ఆశలు చెదిరాయి.

ఆపరేషన్ విజయవంతం అవడంతో ఆశలు చిగురించాయి.

ఏదో చేయాలన్న తపన మొలకెత్తింది.

వెలుగే శ్రీరామ రక్ష:

బైపాస్ సర్జరీ అయ్యాక మూడు నెలలు మంచానికి అంటిపెట్టుకునే ఉన్నాను. ఆ మూడు నెలలు నా చేతికి సెల్ ఫోన్ ఇవ్వలేదు. నందిగామ ఇంటికి చేరాక కూడా రాత్రి పూట ఏదో ఆస్పత్రిలో ఐసీయులో ఉన్నట్లే భావన. ఉలిక్కిపడి లేచేవాడ్ని. శ్రీదేవి అడిగేది..

‘ఎందుకండి ఉలికిపాటు పడుతున్నారు. పీడకల ఏమైనా వచ్చిందా?’

‘పీడకల కాదు కానీ, మళ్ళీ ఆపరేషన్ చేస్తున్నట్లు కల వచ్చింది. నా గుండెను ఎవరో చీలుస్తున్నారు. అంతలో ఓ దేవతలాంటి మనిషి వచ్చి నా చేతిలో ఓ బొమ్మ పెట్టింది. అది కార్డు సైజులో ఉన్న బొమ్మ. ఆంజేయస్వామి తన గుండెను చీల్చాడు.

పక్కటెముకల గూడుని బలంగా అటూ ఇటూ లాగి పట్టుకున్నాడు. లోపల అంతా ఎర్రటి రక్తం. ఆ ఎరుపులో ఓ మెరుపు. ఆ మెరుపులో ఓ విగ్రహం చూశాను.

శ్రీరాముని విగ్రహం అది. ఆయన చిరునవ్వుతో దర్శనం ఇచ్చారు. కానీ, అంతలో మళ్ళీ చీకటి. ఎవరో కత్తితో నా గుండెను చీలుస్తున్నారు. ఆ చీకటిని తట్టుకోలేకపోయాను..’

శ్రీదేవికి అర్థమైంది. వెంటనే లేచి లైటు వేసి. ‘ఇక లైటు ఆపనులేండి. మీరు నిశ్చింతగా పడుకోండి. ఈ ‘వెలుగే’ మీకు శ్రీరామరక్ష’

ఆ తర్వాత చాలా రోజులు ఆలోచించాను. చీకటిని ప్రారద్రోలే శక్తి ఒక్క వెలుతురుకే ఉంది. ఆ వెలుతురు ఏది? ఇలాంటి ఆలోచనల నుంచి పరిష్కార మార్గం దొరికింది. ఎస్, వెలుగు దారిన సాగడమే. అంటే మంచి పనులు చేయడమే. నాకు శక్తి రాగానే ఇక జీవితంలో మంచి పనులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అవి కూడా సమాజానికి పనికొచ్చే పనులే అయి ఉండాలి. పిల్లలు పెద్దవారయ్యారు. వారి సంసారాలు వారివి. అయినప్పటికీ ఇంటి పెద్దగా కొన్ని బాధ్యతలు మిగిలే ఉన్నాయి. వాటిని ఒక ప్రక్క నిర్వహిస్తూనే సమాజం హర్షించే కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి.

పని ప్రారంభం:

మూడు నెలలు కాగానే మంచం దిగి, ఉత్సాహంగా ల్యాప్‌టాప్ తెరిచాను. ఛానెల్ 5ఏఎం లో సరికొత్త కార్యక్రమాలు రాబోతున్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రకటన ఇచ్చాను.

ఘంటసాల మాష్టారిని స్మరించుకుంటూ పాటల పల్లకీ కార్యక్రమాలను 30 రోజుల పాటు నిర్ణీత వేళల్లో ప్రసారం చేశాను. ఆ తర్వాత పిల్లల కోసం బాలవినోదిని, గురువులను స్మరించుకుంటూ జై సద్గురు, అన్నమయ్య కీర్తనలు, జై శ్రీరామ్ వంటి కార్యక్రమాల్లో దేశ విదేశాల నుంచి వందలాది మంది కళాకారులు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా వ్యాధి కారణంగా కన్నుమూయడం బాధ కలిగించింది. వారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఎస్పీ బాలు గీతాలపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాను. 90ఏళ్ల తెలుగు సినిమా వైభవం పేరిట ఏకంగా 90 రోజుల పాటు విశిష్ట కార్యక్రమాలను అందజేశాను. తెలుగు వారి పండుగ అయిన ఉగాది సందర్భంగా చైత్రమాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలిగాను. పైసా రాకపోయినా పవిత్ర కార్యంగా ఈ పనులు చక్కబెట్టాను.

తెలుగు భాషకు చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. అధికార భాషా సంఘం నుంచి జీవన సాఫల్య పురస్కారం అందుకోగలిగాను.

పాటలు, వాటిలోని సాహితీ విలువలు గ్రహించడానికి చక్కటి అవకాశాలు వచ్చాయి. ‘సునాద వినోదిని’ అనే గ్రూప్‌లో చేరి మహానుభావుల విశ్లేషణలు చదివి ఎంతో ఆనందించాను. అలాగే ‘జనరంజని’ వంటి సోషల్ మీడియా పేజీల ద్వారా తెలుగు పాత పాటలు ఇప్పటికీ వింటూ మురిసిపోతుంటాను. ఇంతలో బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామ (ఆకాశవాణి) వారు అందించిన ప్రోత్సాహంతో మంచి పాట – మనసులో మాట పేరిట సినిమా పాటలను నాదైన శైలిలో విశ్లేషించగలిగాను. ‘తానా’ వారి ప్రపంచ సాహితీ వేదిక పై విశిష్ట అతిథిగా పాల్గొని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి గురించి పదిహేను నిమిషాలు ప్రసంగించగలిగాను. అంతలో అనుకోకుండా వచ్చిన అవకాశం – నా యీ జీవన సాఫల్య యాత్ర రచన. ఇప్పటికి 37 అధ్యాయాలు పూర్తయ్యాయి.

ఇంకా..

లబ్

డబ్

లబ్ డబ్.. లబ్డబ్..

ఈ హృదయ స్పందనలో ఓ రాగం ఉంది.

ఏదో వినిపించాలన్న తపన దాగి ఉంది.

ఈ శబ్దం..

నా ఆయుధం.

నా బలం.

ఈ యాత్రలో ఇంకా ఎన్ని జీవన రాగాలు మిగిలి ఉన్నాయో..

(మళ్ళీ కలుద్దాం)

హిందీ నవలా పరిచయం-1 – దళిత సాహిత్యంలో ఓ ప్రభంజనం ‘మహాభోజ్’

0

[హిందీ నవలల పరిచయం శీర్షికలో భాగంగా ‘మహాభోజ్’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]సా[/dropcap]హిత్యంలో రచయిత్రులు ఎందరున్నా కొన్ని గంభీరమైన విషయాలను చర్చించడానికి స్త్రీలు పనికి రారని వారిలో రాజకీయ విషయాలపై అవగాహన తక్కువని, ఒకవేళ వారిలో కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నా అది ఎక్కడో సెంటిమెంట్ల మధ్య నలిగిపోతూ ఉంటుందన్నది చాలా మంది రచయితల అభిప్రాయం. అందుకే ఇలాంటి విషయాలపై రచనలు చేయడానికి పూనుకున్న రచయిత్రులు చాలా తక్కువ. హిందీ సాహిత్యంలో స్త్రీవాది రచయిత్రిగా గుర్తింపు పొందిన మన్నూ భంఢారి 1979లో ‘మహాభోజ్’ అనే ఓ నవలను రాసారు. దళితవాదాన్ని ప్రధాన విషయంగా తీసుకుంటూ భారతీయ రాజకీయ వ్యవస్థపై గంభీరమైన వ్యంగ్యంతో లోతైన అవగాహనతో ఓ ప్రభంజనంగా సాహితీ ప్రపంచంలో ప్రవేశించిన ఈ నవల స్వాతంత్రానంతరం భారతీయ రాజకీయ వ్యవస్థపై వచ్చిన ఓ గొప్ప నవల అని ప్రశంసలు అందుకుంది. ఒక స్త్రీ ఇంత విశ్లేషనాత్మక శైలితో వ్యంగ్యాన్ని జోడిస్తూ భారత దేశంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను నిష్పక్షపాత ధోరణిలో చర్చకు తీసుకురావడాన్నిచూసి చాలా మంది రచయితలు ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ దళితవాద దృష్టికోణంలో వచ్చిన ఎనో నవలల మధ్య అత్యున్నత స్థానంలో నిలిచి ఉన్న ‘మహాభోజ్’ నవలను సాహితీకారులు ఎన్నో సందర్భాలలో విశ్లేషించారు. దీన్ని ఆంగ్లంలోకి ‘ది గ్రేట్ ఫీస్ట్’ అనే పేరుతో రూథ్ వినీతా అనువదించారు.

‘మహాభోజ్‌’ బీహార్‌లోని బెల్చి ప్రాంతంలో దళితులపై జరిగిన ఊచకోత సంఘటన ప్రభావంతో రాసిన కథ. పదకొండు మంది దళిత యువకులను ఉన్నత కులాలకు చెందిన భూస్వాములు హత్య చేసి వారిని శవాలను అక్కడ తగులబెట్టారు. ఇది అప్పట్లో మన్నూ భండారిని ఎంతగానో కదిలించిన సంఘటన. దీన్ని నేపథ్యంగా తీసుకుని దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, వారిని ఓట్ల కోసం ఉపయోగించుకుంటూ ఎన్నో రకాలుగా మోసం చేస్తున్న రాజకీయ నాయకుల స్వార్థాన్ని ఈ నవలలో చూపించారు రచయిత్రి. ఎన్నికల ప్రచారం నడుమ దళితుల అణిచివేత, వారి రాజకీయ దుర్బలత్వం వెనుక ఉన్న కారణాలను సామాజిక అవగాహనతో ఈ నవలలో ప్రస్తావిస్తారు రచయిత్రి. 2021 నాటికి ఈ పుస్తకానికి సంబంధించి 31 ఎడిషన్‌లు వచ్చాయి అంటే హిందీ సాహిత్యంలో ఈ నవలకున్న స్థానం అర్థం చేసుకోవచ్చు.

ఓ గ్రామం సరిహద్దుల్లోని బ్రిడ్జ్‌పై బిసేసర్ అనే దళిత యువకుడి శవం పడి ఉండగా ఈ నవల ప్రారంభం అవుతుంది. ఆ గ్రామంలో తన వర్గంవారికి వారి హక్కుల పట్ల చైతన్యాన్ని కలిగిస్తూ వారి మధ్య పని చేస్తున్న ఓ చదువుకున్న యువకుడు బిసు. అంతకు ముందు అదే ఊరిలో కొన్ని దళిత గుడిసెలను కాల్చేస్తారు ఊరిలోని అగ్ర కులస్తులు. అందులో చాలా మంది మరణిస్తారు. ఆ కేసును పక్కదారి పట్టిస్తారు రాజకీయ నాయకులు. బిసు దానికి సంబంధించి కొని సాక్షాలను సంపాదించి ఢిల్లి వెళ్ళే ప్రయత్నంలో ఉండగా అతని హత్య జరుగుతుంది. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయం అది. ఈ సంఘటన ఇరు వర్గాల రాజకీయ నాయకులలో కొత్త ఆలోచనలను రేపుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న దా సాహెబ్ గాంధేయవాది. ఇంటి నిండా భగవద్గీత పుస్తకాలు పెట్టుకుని అహింసను ప్రచారం చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటాడు. దేనికి పెద్దగా చలించక తన రీతిలో ఎత్తుగడలు వేస్తూ ప్రత్యర్ధులను చిత్తు చేసే వ్యక్తి. తనకేం కావాలో సూటిగా చెప్పకుండా కావల్సిన విధంగా అధికారులను లోబర్చుకుని పని చేయించుకోవడంలో దిట్ట. మృదు స్వభావం మాటున ఇతని కరుడు కట్టిన రాజకీయనీతి ఆయనతో పని చేసే వారినే ఎన్నో సందర్భాలలో ఆశ్చర్యపరుస్తుంది.

బిసు శవం దొరకడంతో అప్పటి దాకా ముఖ్యమంత్రిగా ఉండి పదవి పోగొట్టుకున్నసుకుల్ బాబు దీన్ని తన ప్రచారం కోసం వాడుకోవాలనుకుంటాడు. బిసు ఊరిలో ఓ సంతాప సభ పెడతాడు. ఆ రోజు బిసు తండ్రి ఆ ఊరులో ఉండకపోవడంతో అతన్ని కలిసే అవకాసం సుకుల్ బాబుకు దొరకదు. కాని సభ మాత్రం దిగ్విజయంగా పూర్తి అవుతుంది. బిసు హత్యకు ప్రభుత్వాన్ని నిందిస్తాడు సుకుల్ బాబు. దళితులలో ఆవేశాన్నికొంత వరకు రగల్చడంలో ఈ సభ విజయం సాధిస్తుంది. దీనికి బదులుగా దా సాహెబ్ ఆ ఊరిలో మరో మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ ఉద్దేశం కుటీర పరిశ్రమల కోసం ఆ ఊరి వారికి ఆర్థిక సహకారాన్ని అందించడం. ఈ నెపంతో ఆ ఊరు చేరిన దా సాహెబ్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ బిసు తండ్రి ఇంటికి వెళ్ళి అతన్ని స్టేజీ మీదకు తీసుకొని వచ్చి అతనితో సభ ప్రారంభింప చేయడంతో దళిత బంధువుగా అతని పేరు ఊరిలో మారు మోగిపోతుంది. అక్కడ అతన్ని ఎదిరించ ప్రయత్నించిన బిసు స్నేహితుడు బిందాతో బిసు మరణం గురించి ఓ ఎంక్వరీ పెట్టిస్తానని, నిజం తెలిసిన గ్రామస్థులందరూ ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాలని దా సాహెబ్ కోరతాడు. ఆ ఊరిలో నిజం తెలిసిన వారెవ్వరూ భయంతో గొంతు విప్పరని బిందాకి తెలుసు. కాని దా సాహెబ్ ఈ రకంగా తప్పంతా దళిత సోదరులదే అంటూ వారు పూనుకుంటే బిసుకు న్యాయం జరుగుతుందని, అలా జరగలేదంటే సాక్ష్యం చెప్పడానికి నిరాకరించిన వారిదే బాధ్యత కాని తమది కాదు అనే విషయాన్ని అక్కడి జనం మనసులలోకి ఎక్కిస్తాడు. మరో పక్కన అతని రౌడీలు సభలో మరెవ్వరూ లేచి మాట్లాడకుండా కాపలా కాస్తూ ఉంటారు.

బిసు ఈ ఊరి దళిత కూలీలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ వారికి రావల్సిన కూలీ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అతన్ని నక్సలైట్ అనే అనుమానంతో ప్రభుత్వం అరెస్టు చేస్తుంది. జైలుపాలయి కొన్నాళ్లకు ఊరు తిరిగి వచ్చాక బిసు తన పనిని ఇంకా ముమ్మరం చేస్తాడు. అతనితో చదువుకున్నఆ ఊరి యువతి రుక్మా బిసుని ఎంతో అభిమానిస్తుంది. ఆమె భర్త బిందాకి బిసు మధ్య గొప్ప స్నేహం కలుగుతుంది. ఇద్దరూ తమ తోటి దళితుల ఉన్నతి కోసం పాటుపడాలనే ఆలోచన ఉన్నవారే. బిసు తాను పోగు చెసిన సాక్షాలను బిందా దగ్గర దాచిపెడతాడు. బిసు మరణంతో బిందా వాటిని ఎలాగన్నా ఢిల్లీ తీసుకువెళ్లాలని, బిసు పోరాటం ఆగకూడగని దృఢ సంకల్పంతో ఉంటాడు.

దా సాహెబ్ ముందుగా ఓ ప్రముఖ పత్రికా ఎడిటర్‌ను తన దగ్గరకు పిలిపించుకుని తన పద్ధతిలో ఆ పత్రికకు తానెలా సహాయపడాలనుకుంటున్నాడో చెప్తాడు. అందులోని అంతరార్థం అవగతమై ఆ ఎడిటర్ దా సాహెబ్‌కు అనుకూలంగా పత్రికలో వ్యాసాలు ఉండేలా జాగ్రత్తపడతాడు. అతన్ని దళిత బంధువుగా, ప్రజానాయకుడిగా చిత్రించడంలో ఆ పత్రిక విశేషంగా కృషి చేయడం మొదలెడుతుంది. తరువాత ఎప్పటి నుండో ప్రమోషన్ రాక దిగాలుపడి ఉన్న పోలీస్ ఆఫీసర్ సిన్హాను బిసు మరణం వెనుక నిజాలు వెలికితీయడానికి ఎంక్వయిరీ నిర్ణయించమని ఆదేశానిస్తాడు దా సాహెబ్. తానేం చేయాలో ఎంక్వయిరీ ఏ దిశలో ఉండాలో సిన్హాకు ముందే అర్థం అయిపోతుంది. అతను సక్సేనా అనే ఓ ఆఫీసర్‌ని ఎంక్వయిరీ కోసం ఆ గ్రామం పంపిస్తాడు.

సక్సేనా బిసు గురించి ఆ ఊర్లో ఆరా తీస్తున్న క్రమంలో బిసు వ్యక్తిత్వం, నిజాయితీ పట్ల అతనికి ఓ స్పష్టత వస్తుంది. తన సాటి వారిని బిసు ఎంతగా ప్రేమించేవాడో బిసుతో గడిపిన యువకులతో మాట్లాడాక సక్సేనాకు అర్థం అవుతుంది. బిందా ముందు ఎంక్వయిరీకి రానంటాడు. కాని బిసు తండ్రి వచ్చి అర్థించడంతో ఒప్పుకుంటాడు. తన భార్యా బిసు స్నేహితులని, అలా కలిసిన తాము తమ ఆదర్శాలు ఒకటవడంతో మిత్రులమయ్యామని చెప్తాడు బిందా. కాని ముందు తాను బిసుతో ఢిల్లీ వెళ్ళడానికి నిరాకరించానని, అదే విషయంగా తమ మధ్య వాదన జరిగిందని, తరువాత తనతోనే భోంచేసి బిసు వెళ్లిపోయాడని, అదే అతన్ని తాను చివరి సారి చూడడం అని దా సహెబ్ అనుచరుడే అతన్ని హత్య చేసాడని అందరికీ తెలుసని ఎంక్వయిరీలో చెప్తాడు బిందా.

సక్సేనా బిందాలో తన కాలేజీ రోజుల్లో కలిసిన ఓ ఉద్యమ మిత్రుడిని చూస్తాడు. ఇద్దరూ కాలేజీ రోజుల్లో ఓ ధర్నాలో పాల్గొంటారు. పోలీసులు లాఠీ చార్జీ చేస్తున్నప్పుడు మితృడిని ఒంటరిగా వదిలి సక్సేనా పారిపోతాడు. అక్కడ పోలీసుల దెబ్బలకు అతని మిత్రుడు చనిపోతాడు. తాను మిత్రుడిని ఒంటరిగా వదిలేసానన్న భావం సక్సేనాను ఎప్పుడూ కలవరపెడుతూ ఉంటుంది. ఇప్పుడు బిందాలో అదే స్నేహితుడు కనిపిస్తాడు. తాను బిసు మరణానికి న్యాయం చేయాలని బిందా ఆక్రోశానికి ముగుంపు ఇవ్వాలని, మరోసారి పిరికిగా ప్రవర్తించకూడదని నిశ్చయించుకుంటాడు సక్సేనా. అలాగే రిపోర్ట్ తయారు చేస్తాడు కూడా.

దా సాహెబ్ అనుచరులు జరుతున్న విషయాలన్నీ అతనికి చేరవేస్తూ ఉంటారు. సక్సేనా తయారు చేసిన రిపోర్టును దా సాహెబ్ సిన్హాతో తెప్పించుకుని చూస్తాడు. బిందా ఓ టీ కొట్టులో ఇద్దరు పక్క ఊరు కుర్రవాళ్లతో టీ తాగుతాడు. అందులో విషం కలుపుతాడు దా సాహెబ్ అనుచరుడు. ఇది స్పష్టంగా ఎంక్వయిరీలో బైటపడుతుంది. అయితే దా సాహెబ్ అండ ఇచ్చిన ధైర్యంతో ఆ అనుచరుడు ఎన్నికలలో నిలబడాలని నిశ్చయించుకుంటాడు. ఈ హత్య ద్వారా తన రాజకీయ మార్గాన్ని ఏర్పరుచుకోవాలన్న స్వార్థం అతనిది. అతని చేతి క్రింద దళిత ఓట్లన్నీ ఉంటాయి. దా సాహెబ్ ఆ అనుచరుడిని ఉపయోగించుకుంటాడు కాని అతన్ని రాజకీయంగా ఎదగనివ్వాలనుకోడు. ఆ రిపోర్ట్ ఆ అనుచరుడికి చూపి అతను తనకై తాను ఎన్నికల నుండి తప్పుకునేలా చూస్తాడు. మరో పక్క అతనికి సహాయపడుతున్నట్లుగా నటిస్తూ సక్సేనా ఇచ్చిన రిపోర్టును సిన్హా ద్వరా మార్పిస్తాడు. సక్సేనా అవినీతిపరుడని, తొందరగా ప్రలోభాలకు గురయ్యే మనిషని చెప్తూ ఆ రిపోర్టును తనకు కావలసిన విధంగా మార్పించుకుంటాడు.

బిందా భార్య రుక్మాతో బిసుకు అక్రమ సంబంధం ఉందని, ఆ కోపంతో విషప్రయోగం చేసి బిందా బిసును చంపేసాడని, ఆఖరి సారి బిందాతోనే బిసు భోంచేసాడని పకడ్బందీగా సాక్షాలు తయారు చేయబడతాయి. బిసు మరణానికి న్యాయం చేసిన పేరు దా సాహెబ్‌కి దొరుకుతుంది. అలాగే బిసు హంతకుడిని శాశ్వతంగా తన బానిసగా మార్చుకుని అతను తనకు పోటీగా ఎప్పటికీ రాజకీయాలలోకి రాకుండా తన దారి సుగమం చేసుకుంటాడు దా సాహెబ్. తన పార్టీలో ప్రత్యర్థులను దా సాహెబ్ డబ్బు పదవులతో కొనడం, తనకు ఎదురు తిరిగిన కార్యకర్తల రాజకీయ జీవితం లేకుండా చేయడానికి పార్టీ పెద్దలతోనే పని జరిపించుకోవడం, ఇవన్నీ నవలలో కనిపించే మరి కొన్ని అంశాలు.

అన్నిటికంటే ఆశ్చర్యం దా సాహెబ్ భార్య అతన్ని దేవుడిగా కొలవడం. తన భర్త దీన బంధు అని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అతన్ని దేవుడిలా కొలుస్తుంది. చుట్టు ఉన్నవారి నమ్మకాన్ని చూరగొంటూ తనకు అనుకూలంగా వారందరినీ మలచుకుంటూ జీవించే దా సాహెబ్ లాంటి రాజకీయనాయకులను ప్రజా బంధువులుగా, దళిత బంధులుగా ప్రజలు నమ్మడం, దా సాహెబ్, సుకుల్ బాబు లాంటి రాజకీయ నాయకులు దళిత చైతన్యానికి దారులు మూసివేస్తూ వారి జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడం ఈ నవలలో స్పష్టంగా చర్చిసారు రచయిత్రి. చివరకు సక్సేనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రుక్మాతో పాటు తనకు లభించిన సాక్షాలతో ఢిల్లీ బయలుదేరతాడు. జైలులో పోలీసుల దెబ్బలు తింటూ బిందా ఈ వ్యవ్యస్థ పై కసితో రగిలిపోతూ ఉంటాడు. అయితే ఢిల్లోలోమాత్రం వీరికి న్యాయం జరుగుతుందా అన్నది పాఠకులు వేసుకోవలసిన ప్రశ్న.

మహాభోజ్ అంటే పెద్ద విందు అని అర్థం. దళిత యువకుల మరణం, బిసు హత్య, బిందా జైలు కెళ్ళడం, వీటన్నిటి తరువాత దా సాహెబ్ అండతో దొరికిన ప్రమోషన్‌కి సంతోషిస్తూ సిన్హా ఓ పెద్ద విందు ఇస్తాడు. మరో పక్క తమ పత్రిక సర్క్యులేషన్ పెరగడం, పేపర్ పర్మిట్ రెండింతలవడంతో సమాచార క్షేత్రంలో విజయం సాధించిన సందర్భంగా ఎడిటర్ మరో చిన్న విందుకి సనాహాలు చేస్తాడు. ఈ రెండు చోట్ల కూడా ఎవరూ ఎవరినీ ప్రశ్నించరు. హఠాత్తుగా వారి జీవితాలు ఇంత ఉన్నత దిశలోకి ఎలా వెళ్లాయన్న అనుమానం ఎవరికీ రాదు. వచ్చినా పైకి దాన్ని ప్రకటించరు. ప్రతిపక్ష నేత సుకుల్ బాబు భారీ ర్యాలి నిర్వహించి దాని విజయంతో తన కార్యకర్తలకు విందు ఏర్పాటు చేస్తాడు. దా సాహెబ్ అన్ని కష్టాలు తొలిగిపోయి తృప్తిగా భార్యతో ఇష్టమైన వంటకాలు చేయించుకుని ఆనందిస్తాడు. ఇన్ని విందుల మధ్య దళిత యువకుల హత్య, బిసు మరణం, బిందా జైలు పాలవ్వడం మరుగున పడిపోతుంది. దళిత వాడలో జీవితం ఏ మార్పు లేకుండా ఇంకొంత అన్యాయాన్ని కలుపుకుని అదే తమ జీవితమనే రాజీతో గడిచిపోతూనే ఉంటుంది. ఆ రక్తపు కూడు అందరికీ ఆమోదమే, స్వీకారమే. అమాయమైన దళిత యువకుల రక్తంతో తడిచిన ఆ విందు, దాన్ని ఆరగిస్తున్న మర్యాదస్థుల జీవితాలను చర్చించిన ‘మహాభోజ్’ హిందీ సాహిత్యంలో వచ్చిన ఓ గొప్ప నవల.

దళిత సాహిత్యం అంటే “దళిత రచయితలు, దళిత సమస్యలపై దళిత దృష్టికోణంలో రాయడం” అనే దృష్టితో ‘మహాభోజ్’ని దళిత సాహిత్యంగా కొందరు దళిత సాహితీకారులే పరిగణించకపోవడం మాత్రం విచారకరం. ఉన్నత జైనుల కుటుంబంలో జన్మించిన మన్ను భండారి దళిత కులస్తురాలు కాదు. కాని కొందరు దళిత రచయితులు చెప్పినట్లు ఉన్నత కులస్తురాలిగా దళిత కథాంశంతో నవల రాస్తూ ఆమె దళిత పాత్రలను అసహాయులుగా, అశక్తులుగా చూపుతూ వారి పట్ల పాఠకులలో జాలి కలిగేలా ఆమె ఈ రచన చేయలేదు. ‘మహభోజ్’ లో ప్రస్తావించిన దళిత పాత్రలు భాదితులే కాని అన్యాయాన్ని ప్రతిఘటించే శక్తి ఉన్న మానవులు.

బిసు, బిందా ఇద్దరు కూడా గొప్ప చైతన్యం ఉన్న వ్యక్తులు. ఎవరికీ భయపడని ధైర్యవంతులు, బిసు తాను అనుకున్నది సాధించడానికి ప్రాణాలను కూడా లెక్క చేయడు. బిందా జైలులో దెబ్బలు తింటూ కూడా ఆ వ్యవ్యస్థకు లొంగడు. అతని ధైర్యమే సక్సేనాను మారుస్తుంది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి న్యాయపోరాటం వైపుకు నడిపిస్తుంది. అంతకు ముందు దళితేతర రచయితలు సృష్టించిన అసహాయ పాత్రలు కావు ఇవి. పాఠకులకు సమాజంలో ఉన్నతంగా జీవిస్తూ ప్రశంసలు అందుకుంటున్న అగ్రకుల నాయకులయిన దా సాహెబ్, సుకుల్ బాబులపై అసహ్యం కలుగుతూ ఉంటే అత్యంత భయంకరమైన వివక్షను అన్యాయలను ఎదుర్కుంటున్న బిసు, బిందాల ప్రదర్శించే పోరాట స్ఫూర్తికి గౌరవం కలుగుతుంది. అందువల్ల దళితేతర రచయితలు తమ రచనలలో దళితులను అసహాయులుగా తప్ప మరోలా చిత్రించలేరనే కొందరు దళిత రచయితల ఆలోచనను ఈ నవల తప్పు అని నిరూపిస్తుంది.

దళిత రచనలు చేస్తూ భాషాపరంగా దళిత పాత్రల సంభాషణలలో యాసను, అనాగరికతను ప్రకటిస్తూ వారిని దళితేతర రచయితలు తక్కువ చేస్తారనే మరో వాదన కూడా ఉంది. ఇది కొన్ని సందర్భాలలో నిజం కావచ్చు కాని ‘మహాభోజ్’ నవలలోని దళిత పాత్రల భాషలో యాస కనిపించినా ఎంతో ఆర్ద్రత, ఆలోచన, ప్రేమ కూడా సమపాళ్లలో ప్రకటితమవుతూ ఉంటాయి. అపారమైన మానవీయ ప్రేమ ఆ సంభాషణలలో కనిపిస్తుంది. సక్సేనా జరిపే ఎంక్వయిరీ సందర్భంగా వచ్చే సంభాషణలలో ఈ విషయం గమనించవచ్చు. సుకూల్ బాబు, దా సాహెబ్‌ల భాషలో నాగరికతో పాటు క్రూరత్వం కనిపిస్తూ ఉంటుంది. పల్లెటూరి యసలో మాట్లాడే దళిత పాత్రల సంభాషణలలో కనిపించే నిజాయితీ పాఠకుల మనసులో దళిత వర్గాల పట్ల అంతులేని గౌరవాన్ని కలిగిస్తుంది. తన వ్యంగ్య శైలితో కథను అసాంతం నడిపిస్తూ మన్ను భండారి దళిత సాహిత్యంలో దళితేతర రచయితల విషయంలో అప్పటి వరకు సాహితీ ప్రపంచంలో ఉన్న అపోహలను తొలగిస్తూ ఓ గొప్ప నవలను సృష్టించగలిగారు.

దళిత సాహిత్యం దళితుల నుండే రావాలన్న వాదానికి విరుద్దంగా ఈ నవల నిలుస్తుంది. కాని ఇప్పటికీ ‘మహాభోజ్’ను దళిత సాహిత్యంగా అంగీకరించని కొందరు సాహితీకారులు తమ వితండవాదంతో దళిత సాహితీ ప్రపంచానికి తీరని అన్యాయం చేసినవారే అవుతారు. భారతీయ రాజకీయ వ్యవస్థపై ఓ మహిళ రాసిన అతి గొప్ప నవలగా దళితేతర వర్గానికి చెందిన ఓ రచయిత్రి సృజించిన అతి గొప్ప దళిత నవలగా ‘మహాభోజ్’ అన్ని రకాలుగా ఉన్నతంగా నిలుస్తుంది అన్నది ఈ నవల చదివిన ప్రతి ఒక్కరూ ఒప్పుకునే నిజం.

***

మహాభోజ్ (నవల)
రచన: మన్నూ భండారీ
తొలి ప్రచురణ: 1979
ప్రచురణ: రాధాకృష్ణ ప్రకాశన్.
పేజీలు: 167
వెల: ₹ 250.00
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/-/hi/Mannu-Bhandari/dp/8183610927

సంచిక పదసోపానం-33

0

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.

ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.

వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

~

ఈ పజిల్‍ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.

~

పదసోపానం 33
1 హేమమాలిని
2
3
4
5
6
7
8
9
10
11
12 జయబాధురి

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 24వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక పదసోపానం-33 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 డిసెంబర్ 29 తేదీన వెలువడతాయి.

సంచిక పదసోపానం 31 కి పజిల్ నిర్వాహకుల జవాబులు:

1.హాహాకారము 2. రామకందము 3. దామోదరుడు 4. రోడ్డు రోమియో 5. మయష్టకము 6. కోమలత్వము 7. తమలపాకు 8. గాలిగోపురం 9. పరమపదం 10. దీపాలమాశ 11. మశకహరి 12. హర్షధ్వానాలు

సంచిక పదసోపానం 31 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • కాళిపట్నపు శారద, హైదరాబాద్
  • మంజులదత్త కె, ఆదోని
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • శిష్ట్లా అనిత
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్

వీరికి అభినందనలు.  జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

సంచిక – పద ప్రతిభ – 146

0

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. 1977లో గిరిబాబు నిర్మాతగా వచ్చిన తెలుగు సినిమా. 1976 నాటి హిందీ సినిమా ‘నాగిన్’ కు రీమేక్ (9)
6. మెట్టతామర, మరిది, దేవరుడు (2)
7. ప్రయాణములో ఒక అక్షరం లేదు (3)
9. పుట్టుక, సమూహము, కులము – మొదలు కోల్పోయి, తరువాతి అక్షరాలు వెనుకా ముందు య్యాయి (2)
10. తిరగబడిన బొంకు, అసత్యము (2)
13. కుడి నుంచి ఎడమకి వచ్చిన కమ్మరి (4)
14. వెనక నుంచి ముందుకు వచ్చిన కృష్ణుడి కన్నతండ్రి (4)
15. చేమటిఆవు (చిత్రవర్ణముగల ఆవు)లో 1, 5 అక్షరాలు (2)
16. గ డు సు కీ ర ము – లో నుంచి 4, 3, 1 (3)
18. బ్రహ్మ, శివుడు, విష్ణువు, పరమాత్మ (5)
21. ముఖం, కుడి నుంచి ఎడమకి (3)
22. పెంపుడు, స్వీకారం (3)
23. గొప్ప ఋషి (3)
25. తారుమారయిన కొండబిలము, గుహ (3)
26. నుతించబడినది (2)
27. మనసు, కోరిక, దయ, హృదయము (2)
28. అతడు, అలయు, ఎండు, కఱవు (2)
30. అటుగా వచ్చిన మరిది, (అటు నుంచి – జూ. ఎన్.టి.ఆర్. ఇటీవలి సినిమా) (3)
32. అందమైనది, నిగవు (2)
33. గాంధారిని తనలో దాచుకున్న ఒక రాగం (5)
34. భవిష్యత్తు, భవితము (2)

నిలువు:

1. కల్పవృక్షము, వేల్పుఁజెట్టు (5)
2. అత్రినేత్రజుడు, చంద్రుడు – చివరి అక్షరం ప బదులు వ వచ్చింది (6)
3. అశ్వశాల (3)
4. రాలేము, మేము రావడం లేదు (2)
5. వింధ్య పర్వతం (2)
6. 1973లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు, ఘట్టమనేని కృష్ణ నటించిన చిత్రం. (10)
8. వ్యాసుడు రచించిన ఒక శాక్తేయ పురాణము (7)
11. నూరే, శతమే (2)
12. శ్రీకృష్ణుడు, గోపాలకృష్ణుడు (7)
14. శరీరము, చక్కని రూపము, దేహము (3)
17. మిత్రవింద, శ్రీకృష్ణుని భార్యలలో ఒకరు, హరివంశంలో ఈమెను — అని పిలుస్తారు (3)
18. నారదుడు, దేవముని (3)
19. అర్జునుడి శంఖం (4)
20. కింద నుంచి పైకి వచ్చిన కృష్ణుడి మేనమామ (3)
24. నాశనము, సంహారము, కొట్టబడినది (2)
28. క్రింద నుంచి పైకి, దేవుడిని పిలవండి (2)
29. క్రింద నుంచి పైకి రాజ్యము, ప్రదేశము, అనేక పట్టణములు గల ప్రదేశము (2)
30. తలక్రిందులైన పదును, ప్రవహాం (2)
31. సస్య విశేషం, శాలిధాన్యము (2)
32. అమ్మవారు (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 24 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 146 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 29 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 144 జవాబులు:

అడ్డం:   

1.పిట్ట కొంచెం కూత ఘనము 6. కయిచూర 7. ముకడగు 8. దౌ 9. దర్పం 10. భా 11. చో 12. రంగు 14. మా 16. హ్మబ్రరప 17. గలగలా 19. గోడ మీద పిల్లిలా

నిలువు:

1.పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం 2. కొండచూలి 3. కూకీ 4. ఘటకము 5. ముసుగులో గుద్దులాట 13. పరగడ 15. పాలవెల్లి 18. ఎద

సంచిక – పద ప్రతిభ 144 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కాళీపట్నపు శారద, హైదరాబాదు
  • మంజులదత్త కె, ఆదోని
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.రాజు, హైదరాబాదు
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి, తెనాలి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 11 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

ఎల్లక

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వజ్జీరు ప్రదీప్ గారి ‘ఎల్లక’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను మా ఊరి హైస్కూల్లో పదవ తరగతి పాసై వ్యవసాయం పనులు చేస్తానని అమ్మ నాన్నతో చెప్పాను. వాళ్ళు గట్టిగా పట్టుబట్టి పై చదువులకు పట్నం బోవాలని లొల్లి బెట్టిండ్రు.

చూడబోతే ఇంట్లో కటిక దరిద్రం. చూరుకు వేళ్ళాడే సాలెగూడు ఎప్పుడూ నా కండ్లలో మెదులుతుండేది. సిటీలో ఉన్న మిత్రులకు ఫోన్ చేసి వెళ్ళాను. కాలేజిలో జేయిన్ కావడమైతే జరిగింది గాని నా మనసెప్పుడు ఇంటి చుట్టే తిరిగేది.

చిన్నప్పటి ఒక సంఘటన ఎప్పుడు నా మనసులో మెదిలేది. ఓ రోజు అమ్మ,నాన్న పొలం పనికి బోయి వచ్చినంక తటపటయించుకుంట ఓ ప్రశ్న అడిగాను.

“ఎదురింటి రామయ్య మామోళ్ళందరు ఎందుకు చచ్చిపోయిండ్రు?”.

“ఎల్లక బిడ్డా!”

“ఎల్లకపోతే చచ్చిపోతారా!”

“అవ్ కొడుక! ఇక్కడంతే బతుకుతే గట్టిగా బతుకాలే. లేకుంటే చావాలే. డబ్బు లేకుంటే ఈ దునియా హీనంగా చూస్తుంది. నువ్ బాగా చదువుకుని మంచి నౌకరీ సంపాదించుకో, ఉన్నంతలోనే బతకాలే, అప్పులకు పోయి ఎల్లకుంటే మనం అంతే” నాన్న బాధగా అన్నాడు.

నేను యావరేజ్ స్టూడెంట్‌ను, మొదట పై చదువులంటే భయం వేసినా, ఇక మొండిగా చదివి ఏదో ఒక జాబ్ సాధించాలనుకుని యూనివర్సిటీలో పిజి వరకు నెట్టుకచ్చాను.

ఎప్పుడు పుస్తకాల పురుగునైన నాకు మా ఊరి అమ్మాయి శ్రావణి పరిచయం అయింది. తనది ఆర్ట్స్ గ్రూప్. అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళచ్చినప్పుడల్లా ఊరి ముచ్చట్లు మోసుకచ్చేది.

మా ఇద్దరి మధ్య పరిచయం కాస్తా, ప్రేమగా మారింది.

ఎగ్జామ్స్ టెన్షన్‌లో పడి శ్రావణిని ఈ మధ్య కలవలేక పోయాను. ఎగ్జామ్స్ వరకు ఒకరికొకరం కలవకుడదని అనుకున్నాము. కాస్త ఖాళీ టైం దొరికేసరికి సెల్‌కి ఏమైనా మెసేజ్‌లు వచ్చాయేమోనని చుశాను. గ్రూప్ మెసేజ్‌లే తప్ప పర్సనల్ మెసేజ్‍లు ఏవీ రాలేదు.

‘ఇప్పుడు తనేం చేస్తుందో! తనెలా రాస్తుందో! తను ఎక్కడుందో! చూద్దాం, ఒక ఫోన్ చేస్తే తెలియదా’ అనుకుంటూ ఆమె నెంబర్‌కు డయల్ చేశాను. ఫోన్ రింగ్ అయింది, ఎందుకు రిసీవ్ చేసుకోలేదో అర్థం కాలేదు.

హాస్టల్‌లో బిజీగుందేమో, లేక ఫ్రెండ్స్‌తో క్యాంటిన్‍కు వెళ్ళిందా? అనుకుంటుండగా ‘టింగ్’ మని మెసేజ్ టోన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే శ్రావణి వాయిస్ మెసేజ్ చేసింది.

“భార్గవ్.. నేను శ్రావణిని, మన ప్రేమ వ్యవహారం తెలిశాక నన్ను ఎగ్జామ్స్ రాయకుండానే ఇంటికి తీసుకొచ్చి బంధించారు. ప్లీజ్ నువ్ ఎక్కడున్న తొందరగా రా..” ఏడుస్తు పంపిన మెసేజ్; నెట్ ప్రాబ్లమేమో ఎప్పడో చేసింది ఇప్పుడచ్చింది.

ఊరెల్లుదామంటే నాన్న అన్న మాట గుర్తుకు రావడంతో ఆగిపోయి రాత్రంతా బాగా ఆలోచించాను.

ఊరెళ్ళితే జరిగే పరిణామాలు ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచనలు మెదడు పొరలల్లో సుడులు తిరుగుతున్నాయి.

మా విషయం నాన్నకు చెప్పి ఒప్పించాలని మార్నింగ్ బస్‌కు భయలుదేరాను.

***

వాకిట్లకు వెళ్ళి బ్యాగు బల్లపై వేసి కూర్చోగానే అమ్మ తిట్ల దండకం మొదలుబెట్టింది, నేను ఇప్పుడు ఏం చెప్పిన వాళ్ళకు అర్థం కాదని కొద్దిసేపు మౌనంగా వున్నాను.

వాళ్ళు స్తిమితపడ్డారనుకున్నాక అరుగు మీద కూర్చుని జరిగిన విషయం చెప్పాను.

“ఆ పిల్లకు ఏదో పెద్దింటి సంబంధం ఒచ్చిందట బిడ్డా! నువ్ దాని మనాది పెట్టుకుని ఎక్కడ ఆగమైతావో అని చెప్పలే” అంది అమ్మ.

“వాళ్లు ఇంటి మీదకు వచ్చి నానా యాగి చేసిండ్రు. రందికి మీ నాన్న తిండి మానేసి ఇగో గిట్లనే కూర్చుంటాండు, నాలుగు రోజుల నుండి ఉలుకు లేదు – పలుకు లేదు”

తాత దగ్గరకచ్చి రందితో మొగురంకు ఒరిగి కూర్చున్న నాన్నను చూపిస్తు అన్నడు.

నాన్న మొఖం చూడాలంటే భయం వేసింది.

“చక్కగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి మాకు ఆసరవుతావ్ అనుకుంటే నువ్వేందిరా గిట్ల చేయబడితివి” అమ్మ నా కళ్ళల్లోకి దీనంగా చూస్తూ అంది.

అమ్మ కళ్ళల్లో నీళ్లు నేల మీద రాలుతున్నాయి

“తిండికి ఎళ్లకపోయినా ప్రేమలు, పెళ్లిళ్లు కావలసి వచ్చిందా అని ఊళ్లో తలో మాట అంటాండ్లు.” తాత బీడీ వెలిగించుకుంటూ అన్నాడు.

“నువ్వేం ఫికర్ బడకు. పిల్ల చక్కగుంటది, పైగా మీ ఈడు జోడు బాగుంటది. ఎట్టైన నేను మాట్లాడుతా” పెద్ద మనిషి ఒకతను అన్నాడు.

శ్రావణి నా మాట వినగానే ఇంట్లో కెళ్ళి పరుగెత్తుకుంటు వచ్చింది, బాగా ఏడ్చి ఏడ్చి కండ్లు చింతపిక్కలా మారినాయి. చెదిరిన జుట్టుతో అంతా పీలగా తయారైంది. ఇంటి ముందుకు వెళ్ళగానే వాళ్ళ నాన్న ఆపిండు.

శ్రావణి బాబాయి మాత్రం తాగి ఉన్నట్టున్నాడు. రువ్వడిగా నాపైకి కోపంగా వచ్చాడు. మరోకతను అతని చేతిలో కర్రను తీసుకుని అతన్ని వారించాడు.

“పోలీస్ స్టేషన్‌లో కేసు బెడుదాం పదండ్రి” శ్రావణి మేనమామ అన్నడు.

ఏమైందో అని అమ్మ,నాన్న ఓ నలుగురిని తీసుకుని ఇటువాడకు వచ్చిండ్రు.

“సామరస్యంగా మాట్లాడుదాము కూర్చోండి” కుర్చీలు చూపించాడు సర్పంచ్ బాలరాజు.

మేం నలుగురం, వాళ్ళో నలుగురు చెరో వైపు కూర్చున్నాము.

“ఊరి సమస్య పోలీస్ స్టేషన్ దాక తీసుకెళ్ళడం దేనికి, రా కూర్చో అన్నా, మాట్లాడదాం” అనడంతో బుసబుసమంటున్నవాడల్లా మెల్లగా చెయిర్లో కూర్చున్నాడు వాళ్ళ మేనమామ.

“ఎవరైన వాళ్ళ బిడ్డను వాళ్ళ కన్న గొప్పింట్లోకి ఇవ్వాలనుకుంటారు. వాళ్ళ ఉద్దేశం తప్పు కాదు గదా, బావా” నాన్నను చూస్తూ అన్నాడు సర్పంచ్ బాలరాజు.

“అవును గాని.. పిల్లలు ఇష్టపడ్డారు, పెండ్లికి డబ్బు కన్న రెండు మనసులు కలవడం ముఖ్యం గదా” నాన్న మెల్లగా అన్నాడు.

“మరి వాళ్ళ తాహతుకు మీరు తూగుతారా? అందుకే బయట జాబ్ ఉన్న అతనికిద్దామనుకుంటున్నారు వాళ్ళు. మరి నీ ఉద్ధేశం ఏంటి?”

బాలరాజు మాటకు శ్రావణి శివంగిలా చూసింది.

“మామా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి,” రెక్వెస్టుగ అడిగాను.

“పోరడు బంగారమసొంటోడు. ఏ అలవాట్లు లేవు, చక్కగా చదువుకుంటాండు, నౌకరి అచ్చేదాక జూసి రాకుంటే మీ ఇష్టమచ్చినోళ్ళకిచ్చుకోండ్లి” కులం పెద్ద రాజయ్య ఓ మాట అన్నడు.

“ఏమంటావు వెంకట్రావు” శ్రావణి వాళ్ళ నాన్న వైపు జూసి అన్నడు సర్పంచ్ బాలరాజు.

“సరే మీరందరంటాండ్లు గాబట్టి ఇయ్యాటి సంది ఓ సంవత్సరం జూద్దాం, ఆ తర్వాత నాకిష్టమైన సంబంధం తెచ్చి చేస్తాను.”

“అందరు విన్నారు గదా” బాలరాజు గట్టిగా చెప్పాక నిబంధనలతో కూడిన ఓ బాండ్ పేపర్ రాసి ఇరువురు సంతకాలు చేశారు.

శ్రావణి ఒక్కసారి తల ఎత్తి నావైపు చూసింది. ఆ చూపులో ఎన్నో నిగూఢమైన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు నా మనసులో ఉత్పన్నమౌతున్న జవాబులు అన్ని కండ్లతోనే చెప్పాను.

***

లోకల్ బస్‍లో వెళ్తుంటే అమీర్ పేట చౌరస్తాలో రామనాథం సార్ బస్ ఎక్కాడు. కాస్త వయసు పైబడిన వార్ధక్యపు ఛాయలేవి కనిపిస్తలేవు. అందుకే గుర్తుపట్టానేమో! నా ముందున్న నలుగురిని తోసుకుంటు వెళ్ళాను. అతను జేబులో చిల్లర తీసి కండక్టర్‌కి ఇచ్చాడు.

“సర్ నమస్తే, నన్ను గుర్తుపట్టారా?”

“గుర్తున్నావ్.. గుర్తున్నావ్.. భార్గవ్ కదు”

“అవును సార్”

“ఏం చేస్తున్నావు?” కండక్టర్ ఇచ్చిన టికెట్ జేబులో పెట్టుకుంటూ అన్నాడు.

“ఇక్కడే కంపెనీలో వర్క్ చేస్తున్నాను”

“ఈ రోజు ఆదివారం సెలవే కదా మన ఇంటికెళ్ధాం పదా”

“మళ్ళీ వీలు చూసుకుని వస్తాను”

“పర్లేదు స్టాప్ వచ్చింది దిగేయ్” అనడంతో ఇద్దరం బస్ దిగి ఓ గల్లిలోనుండి ఇల్లు చేరాము.

టీ తాగాక చిన్ననాటి ముచ్చట్లు, ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడుంటున్నారోనని అందరిని పేరు పేరున గుర్తుచేశాడు.

ఆ తరువాత నేను జరిగిన విషయం మొత్తం వివరించాను.

“భార్గవ్ నా స్టూడెంట్ ఒకరు ఇక్కడే ఇన్‌స్యూట్ పెట్టాడు. అతన్ని కలిస్తే నీకేమన్న హెల్పవచ్చు”

“ఎక్కడుంటాడు సర్, వెళ్ళి కలుస్తాను” నా ఆత్రుతను గమనించాడేమో..

“ఒక్క నిమిషం” అంటూ సెల్ తీసుకుని కాల్ చేశాడు.

అతను ఇక్కడికి దగ్గరలోనే వున్నానని సార్ దగ్గరకే వస్తున్నానని చెప్పి అరగంటలో అక్కడికి వచ్చాడు.

రామనాథం సార్ నన్ను పరిచయం చేసి జరిగిన విషయం కూడా వివరించాడు. చాలా సేపు మాట్లాడాక ఇన్‌స్టిట్యూట్‍కి తీసుకవెళ్ళి మెటీరియల్ బుక్స్ ఇచ్చాడు అరవింద్.

ఎలా ప్రిపేర్ కావాలో వివరించాడు. దాంతో నేను కంపెనీలోనే పని చేస్తు రాత్రుళ్ళు చదువుకునే వాడిని.

నోటిఫికేషన్ రాగానే అప్లై చేయించి తన రూంలోనే వుంచుకుని డౌట్స్ క్లారిఫై చేస్తు ప్రిపేర్ చేయించాడు.

ఈ టైంలోనే నాకు కాలం విలువ తెలిసింది. టెన్షన్ పడినప్పుడల్ల ఉద్యోగం సాధించిన వాళ్ళ యొక్క జీవిత చరిత్రను చెప్పి స్ఫూర్తి నింపి ఎగ్జామ్స్ రాయించి నన్ను ఓ కొత్త లోకంలోకి తీసుకపోయాడు.

మనసుకు కాస్త రిలీఫ్ అయిందిప్పుడు. అమ్మ నాన్నతో మాట్లాడి వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాను.

శ్రావణితో మాట్లాడాలని వుంది. ఎలా వుందో? ఊరెళ్ళుదామంటే ఊరిపెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం గుర్తుకువచ్చి మనసుకు సంకెళ్ళు వేస్తుంది.

ఎప్పటిలానే రూం దగ్గర్లో వున్న సాయిబాబా టెంపుల్‌కి వెళ్ళి బాబాను దర్శించుకుని కాసేపు కూర్చుండి కంపెనీ పని చేస్తు ఈవినింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తున్నాను.

కాలచక్రం గిర గిర తిరుగుతునే వుంది.

“ఎల్లకపోతే మన బతుకింతే” అన్న నాన్న మాటలు, ఉద్యోగం వస్తేనే శ్రావణితో పెండ్లి అన్న వాళ్ళ మాటలతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలి, డబ్బు సంపాదించాలి అని తప్ప నాకు వేరే ఏ ఆలోచన లేకుండా చేశాయి.

ఒక రోజు అనుకోకుండా రామనాథం సార్, అరవింద్ సార్ ఇద్దరు కలసి వచ్చారు.

అరవింద్ సార్ నన్ను ఎత్తుకుని గాల్లో గిరగిర తిప్పాడు.

“కంగ్రాట్స్ భార్గవ్” షేకాండ్ ఇస్తు అన్నాడు రామనాథం సార్.

“కంగ్రాట్స్” చేయందిచ్చాడు అరవింద్ సార్.

స్వీట్ తినిపించి విషయం చెప్పారు. నేను పాస్ అయ్యానని.

“పాస్ కాగానే సరిపోదు గద సార్, మన దేశంలో మెరిట్ కన్న రిజర్వేషన్లకే ప్రాధన్యత ఎక్కువ. దాంతో చేతి వరకచ్చి చేజారినవాళ్ళెంతో మంది ఉన్నరు. రేపు ఉద్యోగంలో చేరే వరకు నమ్మకంలేని వ్యవస్థ మనది” భయంగా అన్నాను.

“భార్గవ్ డోంట్ వర్రీ. ఇక్కడి దాక వచ్చావు. నేను నీకు ఉద్యోగం వచ్చాక నీ ఫియాన్సిని కలిపే బాధ్యత నాదని చెప్పాను గదా” డీలా పడ్డ నా భుజంపై చేయివేసి అన్నాడు అరవింద్.

‘గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః’

చిన్నప్పటి నుండి నేను ఆరాధించిన సాయిబాబా వీరి రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నాడనుకున్నాను.

చూస్తుండగానే తహశీల్దార్‌గా పోస్టింగ్ ఆర్ఢర్ చేతికచ్చింది. ఈ విషయం ముందు అమ్మ,నాన్నకు చెబుతానని ఫోన్ చేస్తుంటే అరవింద్ సార్ “ఫోన్ కన్న డైరెక్టుగా వెళ్ళి చెపితే బాగుంటది” అన్నాడు.

ఇద్దరం కార్లో ఊరు భయలుదేరుతుండగా జేబులో సెల్ రింగయింది. నేను ఫోన్ ఎత్తి షాక్‌తో కుప్పకూలాను.

సార్ ఫోన్ తీసుకుని అమ్మతో మాట్లాడాక కార్ హాస్పిటల్ వైపు తిప్పాడు. అక్కడకు వెళ్ళే సరికి నాన్న ఐ.సి.యు.లో ఉన్నాడు. సార్ వెళ్ళి డాక్టర్‌తో మాట్లాడాడు.

“నీ చదువు కరాబైతదని చెప్పకన్నాడు రా” అమ్మ చాతి కొట్టుకుంటు ఏడుస్తూ అంది.

“నిజమేరా! నువ్ ఉద్యోగం సంపాదించే వరకు ఊళ్ళోకి రానన్న నీ పట్టుదలను అందరికి గొప్పగా చెప్పేవాడు.” చిన్నాన దగ్గరకచ్చి అన్నాడు.

“నీకు డిస్టబెన్స్ కాకుడదనే సంవత్సరం నుండి జబ్బు దాచుకున్నాడే గాని ఎవ్వరికి చెప్పలేదు” సర్పంచ్ బాలరాజు దగ్గరికి తీసుకుంటూ అన్నాడు.

విగతజీవి అయిన నాన్నను అంబులెన్స్ మాట్లాడి ఎక్కించాడు అరవింద్ సార్.

నేను నాన్నను గట్టిగా పట్టుకుని ఏడ్చాను.

తను గిరిగీసుకున్న కట్టుబాట్లను తెంచుకుని నా భుజంపై చేయివేశాడు శ్రావణి వాళ్ళ నాన్న.

ఇప్పుడు ఉద్యోగం ఉంది – చెప్పుకోడానికి నాన్న లేడు.

ఈనాటి ఈ బంధమేనాటిదో

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన మోహనరావు మంత్రిప్రగడ గారి ఈనాటి ఈ బంధమేనాటిదో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ప[/dropcap]డిలేచె కెరటం చూడు.

దూసుకెడుతున్న పడవని చూడు.

వలవిసిరే రంగయ్యని చూడు.

వలలో పడ్డ చేపని చూడు”

అని పాడుకుంటూ హుషారుగా ఒడ్డుకోచ్చాడు రంగయ్య.

ఆ చేపని పట్టుకుని రంగయ్య పట్నం వెళ్ళాడు. ఎప్పుడు ఇచ్చే నాయడుగారి ఇంటికి వెళ్ళాడు. నాయడు గారు చేపని చూసి రంగయ్య చేతిలో వందుంచారు. నాయడుగారి భార్య ఏవో తెచ్చి ఇచ్చింది, రంగయ్య అవి మూట కట్టుకోని, డబ్బులిచ్చి కావలసిన సంబారాలు కొనుక్కోని ఇంటి ముఖం పట్టాడు. రంగయ్య ఇంటికి చెరేసరికి పిల్లలిద్దరు ఎదురొచ్చారు.

రంగయ్య నాయడుగారి భార్య ఇచ్చినవి పిల్లలకిచ్చాడు. ఆ తరవాత వంటచేసి పిల్లలకు పెట్టి తను తిన్నాడు.

ఆ మర్నాడు మామూలుగా వేటకి బయలుదేరాడు. ఆ రోజు ఎందుకో సముద్రం చాలా ఉధృతంగా ఎగసి పడుతోంది. రంగయ్య సంకోచించకుండా పడవ తీసి లోపలకి వెళ్ళాడు. అంతే, పెద్ద కెరటం పడవని తల్లక్రిందులు చేసింది.

రంగయ్య ఇంటికి రాకపోవడంతో పిల్లలు కంగారుపడి, ఊరి పెద్ద దగ్గరకి వెళ్ళి ఏడుస్తు చెప్పారు. రోజు రంగయ్య తెచ్చిన చేప తోటే అన్నం తినే నాయడుగారు అంతవరకూ రంగయ్య రాకపోవడంతో కంగారుపడి తన బండిమీద ఆ గూడెం వచ్చారు. అప్పటికే గ్రామం అంతా పోగై మాట్లాడుకుంటున్నారు.

“ఏమయింది?” అని అడిగారు నాయడు గారు.

“అయ్యగారు, మన రంగయ్య యేటకెళ్ళి తిరిగి రాలేదండి” అన్నాడు గ్రామపెద్ద.

“అయతే నడవండి, సముద్రం దగ్గరకి వెడదాం” అని దారితీసారు నాయడుగారు.

అందరు అక్కడకి చేరారు. సముద్రం ఏమి తనలో దాచుకోదు, పడవ తిరగబడి ఒడ్డుకు చేరింది, అది చూసి అందరు అటు నడిచారు, పడవ మాత్రమే ఉంది.

“అరే, రంగయ్య ఏమైనట్టు?” అడిగారు నాయడు గారు.

“అల్లదిగో దూరంగా ఏదో కనపడతంది” అరిచాడు వాళ్ళలో ఒకడు.

అందరు అక్కడకి వెళ్ళారు. “తాత, తాత,” అంటు అక్కడకి వచ్చారు పిల్లలు.

అందరు దగ్గరగా పరిశీలించారు. “అయ్యా నాయడుగారు, మన రంగయ్య ఇంక లేడండి” అన్నాడు గ్రామపెద్ద విచారంగా.

ఆ మాటకి నాయడు గారు ఉలిక్కిపడ్డారు. ఆ పిల్లలు ఇద్దరూ “మా తాత కేమయింది, లెగటం లేదు” అడిగారు.

“మీ తాత దేవుడి కాడికి పోయాడు రా” అన్నాడు గ్రామపెద్ద.

ఆ పిల్లల్ని చేరదీసి. కొంచంసేపు ఆలోచించి, “ఒరేయ్, ఇదిగో, వెయ్యి రూపాయలు. మీరు వాడికి అంత్యక్రియలు చేయండి” అని డబ్బు తీసిచ్చారు నాయడు గారు.

ఆయన అక్కడుండగానే రంగయ్య కాయాన్ని బూడిద చేసి వచ్చారు. ఆ పిల్లలిద్దరు ఏడుస్తు నాయడుగారి దగ్గరకొచ్చారు. “అయ్యగారు మా తాత ఇంక రాడాండీ” అడిగింది ఆ పిల్లల్లో పెద్దది.

ఆ మాటకు నాయడుగారి మనసు నీరైపోయింది.

“అసలీ పిల్లలు ఎవర్రా? వీళ్ళు రంగయ్య దగ్గరకెలా చేరారు? వాడికి ఏమవుతారు?” అని అడిగారు నాయడుగారు.

“తెల్దండి అయ్యగారు. చాలా రోజుల క్రితం సందలడ్డాక ఈళ్ళిద్దరిని తీసుకొని వచ్చాడండి, ‘ఈళ్ళెవర్రా’ అని అడిగితే ‘దేవుడిచ్చిన బిడ్డల్రా’ అని అన్నాడండి. అప్పటి ఆ పిల్లలు కూడా ఏం చెప్పలేని పరస్తితిలో ఉన్నారండి, ఆ తరవాత మాంకూడా పెద్దగా పట్టించుకోలేదండి” అన్నాడు గ్రామపెద్ద.

“మరేం చేద్దాంరా ఈ పిల్లల్ని?” అని అడిగారు నాయడుగారు.

“తవరే ఆలోసించాలండి, తవరికే మా సంగతులన్ని తెలుసు గదండి. తమవరే ఏదోటి సెయ్యండి” అన్నాడు గ్రామపెద్ద.

నాయడు గారు ఒక్క నిమిషం ఆలోచించారు, “సరే, బండెక్కండి” అని ఆ పిల్లలిద్దర్నీ తనింటికి తీసుకు పోయాడాయన.

నాయడుగారితో ఇంటికొచ్చిన ఆ పిల్లల్నిచూసి, ఆయన భార్య ఆశ్చర్యంగా నాయుడిగారి కేసి చూసింది. ఆ చూపుకి అర్థం గ్రహించిన నాయడుగారు విషయం వివరించారు.

ఆవిడ ఓ క్షణం ఆగి “అయితే వీళ్ళని ఏం చేద్దామని మీ ఉద్దేశం?” అని అడిగింది.

“నేనేం ఆలోచించలేదు, దీనంగా నాకేసి చూస్తున్న ఈ ఇద్దర్ని ఇంటికి తీసుకొచ్చాను, ముందు వీళ్ళకి అన్నం పెట్టు. ఆ తరవాత ఆలోచిద్దాం” అన్నారు నాయడుగారు.

“సరే. ఓయి పిల్లలు మీరు స్నానం చేసి రండి” అని రెండు తువ్వాళ్ళు ఇచ్చింది. ఇద్దరు బైటకి వెళ్ళారు. ఆ తరవాత నాయడుగారు కూడా స్నానానికి వెళ్ళారు.

అందరు భోంచేసారు. పిల్లలిద్దరు చాపమీదే నిద్రపోయారు. అది చూశాక నాయడుగారి భార్య హృదయం చలించింది. “వీళ్ళని పెంచడం ఈ వయస్సులో మనకి సాధ్యపడదండీ, వీళ్ళని ఏదేనా ఆశ్రమంలో చేర్చండి. డబ్బు కట్టండి మంచిగా చదువుకునే ఏర్పాటు చేయండి” అంది కళ్ళు వత్తుకుంటూ.

ఆ సాయంత్రమే నాయడుగారు వాళ్ళని పట్నానికి కాస్త దూరంలో ఉన్న ఆశ్రమంలో చేర్చి వాళ్ళ అవసరాలకు కావలసిన డబ్బు చెల్లించి పిల్లలకి విషయం చెప్పి లోపలకి పంపారు,

“అయ్యగారు మా తాత ఇంక రాడాడండీ?” అడిగాడు అందులో చిన్నవాడు.

నాయడుగారి మనసు వికలమైయింది. అది గ్రహించిన ఆశ్రమ నిర్వాహకుడు కలగచేసుకొని “మీ తాత దేవుడి దగ్గరకే వెళ్ళాడు కద. మీరు పెద్దయ్యాక వస్తాడు, అంతవరకు బాగా చదువుకోండి” అన్నాడు.

ఆ మాటకి పిల్లలు లోపలకెళ్ళిపోయారు.

“అయ్యా పిల్లల్ని బాగా చూడండి. ఏదైనా అవసరమైతే నాకు కబురు చేయండి” అని నాయడు గారు ఇంటిముఖం పట్టారు భారంగా.

ఆయన గుమ్మంల్లో అడుగు పెడుతుండగానే ‘ఈనాటి ఈ బంధంమేనాటిదో’ అనే పాట ఎక్కడనించో వినిపించింది.

నాయడుగారు భారంగా లోపలకి నడిచారు.

ఇసుక గూళ్ళు

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పాలేగారు ఇందుమతి గారి ‘ఇసుక గూళ్ళు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]దు[/dropcap]బాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం.. వేలాది మంది జనాలు లాంజీలలో ఎదురు చూస్తున్నారు.

విమానాలు పక్షుల్లాగా కొన్ని వాలుతుంటే మరికొన్ని ఎగిరిపోతున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్త మార్పులతో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కొత్తగా ముస్తాబై అందరినీ ఆకర్షిస్తూ ఉంది

నా చిన్నప్పుడు ఎయిర్‌పోర్ట్ అంటే సినిమాల్లో వచ్చే క్లైమాక్స్‌లో హీరో/హీరోయిన్ కలుసుకునే చోటని మాత్రమే తెలుసు. కాని నిజ జీవితాల్లో అలాంటి క్లైమాక్స్‌లు ఉండవని ఓ వయోసొచ్చాక కాని తెలీలేదు.

ఫైనల్ బోర్డింగ్ పాస్ చెకింగ్ పూర్తయ్యింది.

ఆఫీసు పని మీద దుబాయ్ వచ్చి వారం రోజులైంది. తెలియని ప్రదేశంలో భాష తెలియక వారం రోజులు గడవడం సాహసంగానే అనిపించింది. ఉన్నన్ని రోజుల్లో చూడగలిగింది బుర్జ్ ఖలీఫా, అక్కడి మాల్స్ మాత్రమే. ఆకాశాన్ని తాకే గాజు మేడలు, ఆ గాజు అద్దాల మేడని తుడుస్తూ అక్కడ పని చేస్తూ ఉన్న విదేశీయుల్లో మన దేశం వాళ్లు ఉన్నారు.

ఫ్లైట్ ఎక్కగానే బ్యాగ్ సర్దే పనిలో బడి నా పక్క సీట్‌లో ఎవరో వచ్చి కూర్చోవడాన్ని కూడా గమనించనే లేదు.

ఎయిర్ హోస్టెస్ అనౌన్స్‌మెంట్స్ పూర్తవగానే విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది.

బయటకి చూస్తూ ఉంటే ఎదురుగా మబ్బులు పలకరించి వెళ్లిపోతున్నాయి. కిందనేమో చూస్తున్నంత దూరం ఇసుక తప్ప మరేం కనబడట్లేదు. అయినా సముద్రపు ఇసుకకి, ఎడారి ఇసుకకి ఎంత తేడా? ఏ మాత్రం ఆర్థ్రత లేని ఈ ఎడారి ఇసుకని చూస్తే నాకెందుకో అంతగా నచ్చదు. అందుకే ఎడారి వైపు అసలు వెళ్లనే లేదు.

నా పక్క సీటులో కూర్చున్న అతను ఏదో కింద పడేసుకుని తీసుకోడానికి ఇబ్బంది పడుతుంటే నా చేతికి సులువుగా అందడంతో తీసి అతని చేతికి ఇచ్చేసాను.

“మీరు తెలుగేనా” అన్నాడు నా వైపు చూసి.

“అవును..” అన్నాను పరిచయం చేసుకుంటూ

మాటల్లోనే తన పేరు రాజా అని, దుబాయ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడని సెలవుల్లో ఇంటికి వెళ్తున్నాడని చెప్పాడు. ఫోన్ లేని కొన్ని గంటల ప్రయాణానికి అతని పరిచయం కాలక్షేపం అనిపించింది.

మాట కలుపుతూ “దుబాయ్, గల్ఫ్ కంట్రీస్‍లో వర్క్ చాలా కష్టంగా ఉంటుందని విన్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవడం కూడా చూసాను. ఏజెన్సీ వాళ్లు మోసం చేసారని, అక్కడ ఉండలేము వెనక్కి తీసుకెళ్లండి అని వీడియోస్ వైరల్ అయ్యాయి” అన్నాను.

“అవును కష్టంగానే ఉంటుంది. వాతావరణానికి జీవన విధానానికి తట్టుకుని నిలబడ్డ వాళ్లు ఉంటారు. ఉండలేని వాళ్లు కూడా ఉండాల్సి వస్తుంది. పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడిలాగా చెప్పింది విని ఇక్కడి రావడం మాత్రం తెలిసి తిరిగి ఎలా వెళ్లాలో తెలీక అక్కడే ఉండిపోయిన వాళ్లు ఎందరో! ఎవరో ఒకరిద్దరూ ఇలా ప్రభుత్వసాయంతో తిరిగి వచ్చేస్తూ ఉంటారు, మిగిలిన వాళ్లు తప్పని పరిస్థితుల్లో గడిపేస్తూ ఉంటారు” అన్నాడు నిస్సారమైన నవ్వుతో.

“అక్కడి వాతావరణానికి మీరు ఎలా అలవాటు పడ్డారు?” అన్నాను.

ఆ మాట విని అతను జీవం లేని ఓ నవ్వు నవ్వి “ఎడారి మొక్కలు తెలుసా మీకు? వాటిలాగానే అలావాటు అయిపోయింది అక్కడి వాతావరణానికి పరిస్థితులకి తట్టుకుని ఉండటం” అన్నాడు.

“అవును.. ఎడారి మొక్కలకి పువ్వులు పూస్తాయా?” అన్నాను సందేహంగా చూస్తూ.

“మీకేమనిపిస్తుంది?” అన్నాడు నా వైపు చూస్తూ.

“నాకు అసలు ఈ ఎడారుల గురించి చిన్నప్పుడు బుక్‌లో చదవడం తప్ప అంతగా తెలియదు. ఏవో కాక్టస్ మొక్కలు పెరుగుతాయని తెలుసు” అన్నాను.

“ఎడారి పువ్వులని చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను” అన్నాడు నవ్వేస్తూ.

ఎడారి పువ్వులు ఏమో కాని చాలా సేపటి తర్వాత అతని మొహంలో నవ్వుని చూసాను.

అతని మాటలు కూడా కొత్తగా లోతుగా ఆలోచించేలా ఉన్నాయి. చుట్టు పక్కల్లో ఉన్న వాళ్లు గల్ఫ్ కంట్రీస్‌కి పనుల కోసం వెళ్లడం గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటాను. సగంలో చదువులు ఆపేసిన వాళ్లు, అక్కడ వేతనం ఎక్కువ అని ఇంకా అక్కడ పనులు ఎక్కువగా ఉంటాయని వర్కింగ్ వీసా మీద ఎంతో కొంత డబ్బులు కట్టి వెళ్ళడం గురించి కూడా తెలిసిన వాళ్ల ద్వారా తెలిసింది.

అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకుందామని “ఇందాక ఎయిర్‌పోర్ట్‌లో కూడా చూసా, ఎక్కడెక్కడి నుండి వస్తున్నారో? అందరూ ఎందుకని మన దేశంలో ఏదో పని చేసుకుని ఉండక, ఇక్కడికొచ్చి కష్టపడుతూ ఉంటారు? సంపాదన ఎక్కువనా?” అన్నాను మళ్లీ.

ఆ మాటకి చివుక్కున చూసి “ఎక్కడి సంపాదనా? ఈ మాట వింటుంటే నవ్వొస్తుందండి! ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ ఉంటుంది. ఎన్నో కష్టాలుంటాయి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నట్టు ఇక్కడి బాధలు కష్టాలు తెలిసినా వాళ్ళ కష్టాల ముందు పెద్దగా అనిపించవు. మీరన్నట్టే ఎక్కువ డబ్బులొస్తాయనే ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఏదో విధంగా కష్టపడి ఎంతో కొంత సంపాదించి బతుకుల్ని మార్చుకుందాం అనుకునేవాళ్లే తప్ప. ఏదో సాధించేయాలని కాదు. ఇక్కడ ఏళ్ళ తరబడి పని చేసుకునే వాళ్లకి సిటిజన్‌షిప్‍౬లు, రిటైర్నెంట్లు లాంటివి ఉండవు. ఈ దేశాల్లో ఎన్నేళ్లు ఉన్నా ఎప్పటికి పరాయి వాళ్లగానే మిగిపోవాల్సిందే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పనుల్లోనూ ఏ మార్పు ఉండదు. ఇంకా వయస్సు ఒంట్లో ఓపిక ఉన్నంత వరకే ఉండగలం. మళ్లీ ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ కాస్తో కూస్తో నాలుగు రాళ్లు సంపాదించి బాగుపడ్డ జీవితాలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా నాణేనికి ఇరువైపులా అన్నట్టు మంచి చెడూ రెండూ ఉంటాయి” అన్నాడు నిస్సత్తువగా నవ్వి.

“ఇదంతా తెలిసి కూడా జనాలు కేవలం డబ్బుల కోసమే వెళ్తున్నారన్న మాట” అన్నాను.

“కేవలం డబ్బుల కోసమే కాదు, డబ్బుల కోసం మాత్రమే వస్తూ ఉంటారు. పూట గడవని కుటుంబాలకి అప్పు అనేది ఒక రకమైన రోగం లాంటిది. డబ్బులు చేతికొస్తే తప్ప రోగం తగ్గదు. మీరన్న కేవలం డబ్బు కోసమే ఈ తిప్పలంతా. సంతోషాన్ని డబ్బులతో కొనలేం అంటూ ఉంటారు. అది విన్న ప్రతిసారి నవ్వొస్తుంది. ఈ పదేళ్లలో మా కుటుంబ సంతోషాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఈ మధ్య గౌరవ మర్యాదలు కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అందుకేనేమో డబ్బు మనిషిని ఎంత దూరమైనా వెళ్లేలా చేస్తుంది” అని అన్నాడు.

అతని మాటలు విన్నాక ఆలోచించి మాట్లాడాల్సిందేమో అనిపించింది. మనుషుల మధ్య ఆర్థిక అసమానతలు ఉంటాయి. పది రూపాయలతో పొట్ట నింపుకునే వాళ్లు ఉన్నారు. అదే పది రూపాయలు టిప్‌గా ఇచ్చేసి వెళ్లిపోయే వాళ్లు ఉన్నారు. అందరి జీవితాలు ఒకలా ఉండవనిపించింది. అదే విధంగా డబ్బుతో కొనలేనివి జ్ఞానం లాంటివి ఉన్నాయని చెప్పాలనిపించింది కాని ఆగిపోయాను.

“అయినా మన దేశంలోను ఎన్నో పనులు ఉన్నాయి కదా. ఇక్కడ చేసే పనులేవో అక్కడే చేసుకోవచ్చు. కుటుంబానికి దగ్గరగా ఉండొచ్చు” అన్నాను సానుభూతిగా.

“మన దేశంలో పనులు ఉన్నాయి కాని అక్కడ పదేళ్లు కష్టపడాల్సింది ఇక్కడ ఐదేళ్లలో సంపాదించుకుని తిరిగి వెళ్లిపోదామనే చిన్న ఆశ. ఇక కుటుంబ విషయం అంటారా? దూరంగా ఉంటున్నామన్న బాధ ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఈ అరబ్బు దేశాల్లో కుటుంబాలు చాలా పెద్దవి. కలిసి ఉండే వాళ్ల కుటుంబాల్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనస్సు కలుక్కుమంటుంది. ఇక్కడి వచ్చి తిరిగి ఊర్లకి వెళ్ళేటప్పటికి ఎన్నో మారిపోయి ఉంటాయి. పిల్లలంతా పెద్దవాళ్లై పోయి ఉంటారు, పెద్ద వాళ్లంతా వయస్సు పై బడిపోయి ఉంటారు. పుట్టుకలు మరణాలు ఎన్నో జరిగిపోయి ఉంటాయి. ఇక్కడ ఉండి పోగొట్టుకున్న కాలం సంపాదించిన సంపాదనకి అస్సలు సరితూగదు” అన్నాడు బాధగా.

అతని మాటల్లో ఏడుపు జీర సన్నగా వినిపిస్తూ ఉంది. కనుసనల్లోను నీటి తేమ కనిపిస్తూ ఉంది.

“ఇన్నేళ్లుగా అక్కడ ఉంటున్నారంటే ఖచ్చితంగా దుబాయ్‌లో ఏదో ఒక్కటన్నా నచ్చి ఉండాలి. అక్కడ ఫ్రెండ్స్ లేదా ప్లేస్” అన్నాను అతన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ.

“ఫ్రెండ్స్.. అంటే అక్కడికొచ్చాక పరిచయమైన వాళ్లే. నాలాగే ఏదో కొంత జీవిత స్థితిగతులని మార్చుకోవాలని వచ్చిన వాళ్లే. నేను ఉంటున్న రూమ్‌లో కలిసి ఉన్న వాళ్లు తప్ప ఇంకెవరూ లేరు. ఇక ప్రదేశాలంటారా దుబాయ్ నచ్చిన ప్రదేశాలంటే రోజు చూసే గాజు మేడలు, అందులోను బుర్జ్ ఖలీఫా.. అని మాత్రం చెప్పను. వాటి నీడల్లో మాత్రమే తిరిగే నాకు అంతగా నచ్చలేదు కూడా. అక్కడి ఎడారి అంటే ఇష్టం. టూరిస్ట్‌లు వచ్చినప్పుడు నైట్ స్లీప్ ఓవర్‌కి ఎడారికి తీసుకెళ్తూ ఉంటాను.

అక్కడ సంపన్నులు, పేదవారు అన్న అసమానతలు ఉండవు. ఆ ఒక్క ఎడారి మాత్రం అందరికీ సమానం అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.

రాత్రిళ్లు ఆ ఇసుక తిన్నెల మీద పడుకుని ఆకాశంలో చుక్కల్ని కలుపుకుంటూ ఎన్నో కలలు కంటాను. కొన్ని కలలు అయితే నిజం అన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ కలని తలుచుకుంటూ గడిపేస్తూ ఉంటాను” అన్నాడు చిరునవ్వుతో.

“ఈ సారి దుబాయ్ వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలిసి ఎడారిని చూస్తాను” అన్నాను నవ్వుతూ.

“తప్పకుండా..” అన్నాడు నవ్వుతూ

“అవును గల్ఫ్ కంట్రీస్‍లో వర్క్ కోసం వెళ్లిన ఆడవాళ్లకి సేఫ్టీ ఉండదని విన్నాను నిజమా?” అన్నాను సందేహంగా చూస్తూ.

“ఎక్కడ ఉందనీ?” అని ఆగిపోయాడు.

ఆ మాట వాస్తవమని అనిపించి మౌనంగా ఉండిపోయాను.

ఇద్దరి మధ్య మౌనాన్నీ చీరుస్తూ “మళ్లీ దుబాయ్‌కి వస్తారా?” అన్నాను మెల్లగా.

“రావాలి.. ఊర్లో ఓ చిన్న ఇల్లు కట్టుకునే వరకూ ఇసుక గూళ్ల చుట్టూనే నా జీవితం” అన్నాడు.

“ఇలా గల్ఫ్ కంట్రీస్‌కి రావాలనుకునే వాళ్లకి మీరేం చెప్తూ ఉంటారు?” అన్నాను ఉత్సుకతతో.

“రావొద్దనే చెప్తాను. ఇప్పటికీ మా ఊర్లో కుర్రాళ్లకి చదువుకోమని బాగా చదువుకోమని చెప్తూ ఉంటాను” అన్నాడు. ఆ మాటలు విన్నాక ఊరటగా అనిపించింది. తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను.

ఎయిర్ హోస్టెస్ అనౌన్స్‌మెంట్‌తో మెలకువ వచ్చింది. నా పక్కనున్న రాజా అప్పటికే దిగడానికి సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. నా వైపు చూసి చిరునవ్వుతో “ఈ కొన్ని గంటలు మీతో మాట్లాడుతూ సమయం గడిచిందే తెలియలేదు” అన్నాడు.

“అవును.. మీతో మాట్లాడాక చాలా విషయాలు తెలుసుకున్నాను” అన్నాను నవ్వుతూ.

“మీ పేరు?” అన్నాడు చివరగా దిగిపోతూ

“శిశిర..” అని చెప్పి అక్కడి నుండి కదిలి వచ్చేసాను.

రోజుకి ఎన్నో మొహాలని చూస్తూ ఉంటాం కాని అందరి మొహాలు గుర్తుండవు. ఎందరో పరిచయం లేని వాళ్లతో మాట్లాడి ఆ రోజుకి అక్కడితో వదిలేస్తూ ఉంటాం. కాని కొన్ని పరిచయాలు మాత్రం మనతో మోసుకెళ్తూ ఉంటాం.

అలాంటి పరిచయాల్లో రాజా, ఇంకా అతను కట్టుకున్న ఇసుక గూళ్లు కూడా ఒకటి!

ఇలలో దేవత

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన గొర్రెపాటి శ్రీను గారి ‘ఇలలో దేవత’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నే[/dropcap]ను వెళ్ళేసరికే పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి.

ఆఫీస్ నుండి వచ్చేసరికి ఆలస్యమయింది.

ఇంటికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి శ్రీమతితో కలిసి వచ్చేటప్పటికి ఏడున్నర అవుతుంది.

నా రాకను గుర్తించిన వికాస్ హడావుడిగా దగ్గరకు వచ్చాడు.

“సార్, నమస్తే. సిస్టర్! ఎలా ఉన్నారు? రండి.. రండి..” అంటూ లోనికి ఆహ్వానించాడు.

భర్తతో కలిసి అక్కడికి వచ్చిన సులోచన చిరునవ్వులతో మా ఇద్దరికి స్వాగతం పలికింది.

మొదటి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు వికాస్, సులోచనల ముద్దుల పుత్రుడికి ఘనంగా సాగుతున్నాయి.

అమ్మమ్మ చేతుల్లో ఉన్న పిల్లాడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

ముచ్చటగా అగుపిస్తున్న దృశ్యాన్ని ఆనందంగా చూస్తున్నాము నేను, రాణి.

నాకు వికాస్ నాలుగేళ్లుగా పరిచయం.

నా దగ్గరే తొలిగా జాబ్‌లో చేరాడు. స్నేహంగా మసలుకుంటాడు. తల్లిదండ్రుల నుండి వారసత్వ ఆస్తులని అందుకోవడంతో ఉద్యోగం చిన్నదే అయినా రిచ్‌గా ఉంటాడు.

దాదాపు వందకు పైగా అతిథులు వచ్చారు.

వాళ్ళు వుండే బిల్డింగ్ పై చక్కని లైటింగ్ అరేంజ్ చేసి కొద్ది భాగం టెంట్ వేసి చక్కని భోజన ఏర్పాట్లు చేశాడు.

ఓ ప్రక్కగా కూర్చున్న వికాస్ వాళ్ళ అమ్మ కాస్త దిగాలుగా కూర్చోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.

పలకరించే ప్రయత్నం చేశాను. నాతో పలకడానికి ఇష్టపడలేదు.

నేను వికాస్ వాళ్ళ బాస్‌ని అని తెలుసు.

గతంలో వెళ్ళినప్పుడు ఆనందంగానే పలకరించింది.

ఇప్పుడేమైందో అర్థం కాలేదు.

“బాబు..”నన్నెవరో పెద్దావిడ పిలుస్తున్నట్లుగా స్వరం వినిపిస్తుంటే అటుగా చూశాను.

వికాస్ వాళ్ళ అమ్మ.

“రాజా! మావాడు నన్ను వృద్ధాశ్రమంలో చేరాలంటూ గట్టిగా అడుగుతున్నాడు. నేనిక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. సాటి మహిళనైన నాతో, అత్త పట్ల గౌరవంగా ఉండాల్సిన సులోచన ఎందుకో నా పొడ గిట్టనట్లుగా ప్రవర్తిస్తుంది. భర్తకి నాపై ఉన్నవి లేనివి చెప్పి కొడుకుని నా నుండి దూరం చేసింది. నాకు మాత్రం తోడెవరు వున్నారు.. భర్త దూరమయ్యాడు, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి తొందరపడి ముందే ఆస్తులు రాసేశాము. ఎప్పటి కైనా ఆ ఆస్తులు వాళ్లవే కదా, కన్న బిడ్డ చూడకపోతాడా అనుకున్నాము. ఈ మద్య వీడి పోరెక్కువైంది. వృద్ధాశ్రమంలో ఎలాగైనా చేర్చాలనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. నాకేమో మనవడి ఆలనాపాలనా చూసుకోవాలని.. కొడుక్కి దగ్గరగా ఉండి శేష జీవితాన్ని గడపాలని..” ఆపై మాట్లాడలేక చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది.

ఆఫీస్‌లో వికాస్ అన్న మాటలు నా హృదయంలో ద్వనిస్తూ.. నా మనస్సును అల్లకల్లోలం చేస్తున్నాయి.

“అమ్మ వృద్ధాశ్రమంలో చేరతానని ఒకటే గొడవ సార్. మేమేమో తనని ఇక్కడే ఉండమని అడుగుతున్నా వినడం లేదు సార్. అక్కడైతే తన ఈడు వాళ్ళు ఉంటారు. చక్కగా బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. సాయంత్రం కాలక్షేపానికి వాకింగ్, వృద్ధాశ్రమ ఆవరణలో ఉన్న గుడిలో హరికథా కాలక్షేపాలు, భజనలు అంటూ నా మాట వినడం లేదు సార్. పైగా తనకు తెలిసిన వాళ్ళు అక్కడే వున్నారు నన్ను అక్కడే చేర్చమంటూ అడుగుతుంది సార్..”

కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాను..

వికాస్ వాళ్ళ అమ్మకి – ‘అమ్మ గొప్పతనం వికాస్‌కి అర్థమయ్యేలా చెప్పే బాధ్యత, అమ్మని బాగా చూసుకోమని చెప్పే బాధ్యత నాద’ని – నమ్మకాన్ని కల్పించేలా నచ్చజెప్పి బయటకు వస్తుంటే.. సులోచన, వికాస్ మా దగ్గరకు వచ్చారు.

ఖరీదైన గిఫ్ట్ పార్సెల్ ఇచ్చారు.

అమ్మతో నేను మాట్లాడటం గమనించాడేమో వికాస్ కళ్ళలో అపరాధ భావం.

నటిస్తున్న మనుషులు ముసుగులు వేసుకుని ప్రవర్తిస్తున్నా.. కళ్ళు మాత్రం వాస్తవాన్ని దాయలేవు.

***

నా ఎదురుగా కూర్చున్నాడు వికాస్.

“బర్త్ డే సెలబ్రేషన్స్ బాగా చేశావోయ్” అభినందించాను.

“థాంక్యూ సర్..” అన్నాడు కృతజ్ఞతా పూర్వకంగా.

ఆరేళ్ల వయస్సులో అమ్మని కోల్పోయి అన్నీ తానై పెంచిన అక్క పెంపకంలో పెరిగిన నన్ను అమ్మలేని లోటు బతుకంతా వెంటాడుతూనే ఉంది.

ఉన్నప్పుడు మనుషుల విలువ తెలియదు.. దూరమయ్యాక తలుచుకుని ఉపయోగం లేదు.

వికాస్‌కి అమ్మ గొప్పతనం చెప్పాలనిపించింది.

“వికాస్ ఓ మాట అడుగుతాను, నిజం చెప్పాలి”

“అడగండి సార్”

“అమ్మ నిజంగా వృద్ధాశ్రమానికి వెళ్ళలనుకుంటుందా. లేదా నువ్వే ఒత్తిడి చేస్తున్నావా?” సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అడిగాను.

మౌనం అతడి సమాధానం అయింది.

అతడి మనస్సు గ్రహించినట్లుగా చెప్పాను.

“నీకు జన్మనివ్వడానికి తనెన్ని తిప్పలు పడి ఉంటుందో. అలాగే నువ్వు పెరిగి పెద్దవుతూ చేస్తున్న ఎంత అల్లరిని భరించి వుంటుందో. నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నీ ఆరోగ్యం బాగుపడాలని ఎంతగా శ్రమించి ఉంటుందో.

ఒక్కసారి ఆలోచించు. అమ్మ గొప్పతనం తెలుసుకో. అదంతా అలా ఉంచు..

మీ నాన్న గారు ఉన్నప్పుడు ఆస్తంతా నీ పేరునే పెట్టారు, మీ నాన్న అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే మీ అమ్మ చెప్పిన మాటల ప్రేరణ తోటే ఆ నిర్ణయం తీసుకుని ఉంటారు.

ఇంకో మాట చెప్పనా, నువ్వు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటేనే కదా నీ కొడుకు నిన్ను బాగా చూసుకునేది.

నేను ఇంతలా చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు.

అమ్మ విలువ నీకు తెలియకపోవచ్చు.. అమ్మ ప్రేమకి ప్రత్యక్షంగా అందుకోలేని.. ఆరవ యేటనే అమ్మని కోల్పోయిన నాకు తెలుసు.

నిజానికి నువ్వు అదృష్టవంతుడవి. అమ్మ అనే దేవత సన్నిధిలో జీవిస్తున్న శుభ జాతకుడవి. నేను చెబుతున్న మాటలు గ్రహించు” అంటూ, కనులలో నిలిచిన సన్నని కన్నీటి పొర తుడుచుంటూ చెప్పాను.

ఆ ఏంటిలే అమ్మ ఎక్కడ ఉంటే ఏముంది.. అమ్మ నలుగురితో కలిసుండే స్నేహశీలి ఎక్కడైనా బాగానే ఉంటుంది కదా.. మరలాంటప్పుడు వృద్దాశ్రమంలో సైతం తనకి ఇష్టమైనట్లుగా స్వేచ్చగా జీవిస్తుందనుకున్నాడు వికాస్.

కానీ తనే లోకంగా బ్రతికే అమ్మ మనసు గాయపడిందా!?

సంశయంలో ఇంతకాలం ఉన్నాడు.. ఓ స్థిర నిర్ణయానికి వచ్చినట్లు లేచాడు.

‘తన తల్లి తన అభ్యున్నతికి అసంఖ్యాక త్యాగాలు చేసిన సంఘటనలు నయనాల ముందు కదులుతున్నట్లు అనిపించిందేమో’, అమ్మ గొప్పతనం గుర్తుచేసిన నా వైపు కృతజ్ఞతగా చూస్తూ తన సీట్ వైపు కదులుతున్నాడు.

వికాస్ వాళ్లమ్మ చల్లని చూపులు నాపై వెన్నెల్లా కురుస్తున్నట్లుగా అనిపించి మనసంతా ఆనందం వరించింది.

ఆమెకు అందిన ఉత్తరం

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సృజన గారి ‘ఆమెకు అందిన ఉత్తరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“నీ[/dropcap]కు తోచింది చేసుకో. ఐ యామ్ నో వన్ టు స్టాప్ యూ.” ఆ ఒక్క మాట అని శేఖర్ విసవిసా బైటికి వెళిపోయాడు. నిత్య అలాగే కూర్చొని వుంది. గేటు తీసిన శబ్దం, బైక్ స్టార్ట్ చేసిన అలికిడి వినిపించాయి. తిరిగి గేట్ వేసిన చప్పుడైతే ఆమెకు వినిపించలేదు. ఆమె ఏదో లోతున పడిపోయిన వస్తువుని వెతుకుతున్నదానిలా ఎటో చూపులు సారించి వుండిపోయింది. ఆమె మనసులో కోటి సెలయేళ్ళు ధారగా ప్రవహిస్తున్నట్టు ఒకటే హోరు. అనేక ప్రశ్నలు ఆమె మెదడును తినేస్తున్నాయి. అలా ఎంత సేపు కూర్చుందో తెలియదు కానీ హఠాత్తుగా ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా లేచి తన పడక గదిలోకి దారితీసింది. ఆ గదంతా నిశబ్దంగా వుంది. ఫేన్ తిరిగే చప్పుడు కూడా లేదు. ఒక మూలన టేబుల్ లైట్ వెలుగుతోంది. అది తప్పా చుట్టూ చీకటి. కిటికీ ఒకటి తెరిచి వుందేమో.. కర్టెన్ గాలికి ఎగురుతోంది. డిసెంబర్ నెల చలి గాలులు ఆ గదిని ఆక్రమించాయి. ఆమె చిన్నగా వణికింది. బైట ప్రపంచం నుంచి గదిలోకి వచ్చిన రెక్క పురుగు ఒకటి నేరుగా వచ్చి టేబుల్ లైట్ చుట్టూ తిరుగుతోంది. అంత నిశ్శబ్దపు గదిలో ఆ పురుగు చేసే శబ్దం నిత్యకు భరింపరానిదిగా వుంది. గాలికి ఎగరని డైరీ ఎదురుగా కూర్చున్న నిత్య పెన్ తీసుకొని ఇలా రాసుకుంది.. ‘ఈ రెక్క పురుగుది కూడా నాలాంటి జీవితమే! ఎంత ఆరాటపడినా ఆ ఆరాటం మూణ్ణాళ్లే’. నిత్య విరక్తిగా నవ్వుకుంది. డైరీ పక్కన కనిపిస్తున్న స్లీపింగ్ పిల్స్ బాటిల్ని చేతిలోకి తీసుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళు.

“అమ్మా వద్దు నాకు టేబ్లెట్స్ అంటే భయం.. నేను వేసుకోను.” యవ్వనంలో తన తల్లిని బ్రతిమలాడడం ఆమెకి ఒక ఫ్లాష్ లాగా గుర్తొచ్చింది. నిత్య గుప్పెట నిండా మాత్రలు. ఆమె చెయ్యి వణుకుతోంది. ఈ రోజుతో నా జీవితం అయిపోతుంది. నిత్య D/o సూర్యారావు & రేవతి జీవితం ముగిసిపోతుంది. ఏం సాధించగలిగింది ఈ ముఫై ఏళ్ళల్లో. కొన్ని పీడకలల్ని తప్పా వేటినీ సంపాదించుకోలేదు.

“నన్ను కాదంటున్నావా..? ఈ తండ్రి నిర్ణయాన్నే కాదంటున్నావా? నేను నీ మంచి కోరే చెప్తానని తెలిసే ఈ పెళ్ళి వద్దంటున్నావా? మరొక్కసారి ఆలోచించు నిత్యా. జీవితం ఏమీ తమాషా కాదు” తండ్రి చేసిన బెదిరింపు మెరుపులా ఆమెను మీటింది.

నిత్యకు ఆ మాటలు జ్ఞాపకానికి వచ్చేసరికి తనని తాను సంబాళించుకోవడం కష్టమైంది. ఇప్పుడు ఈ క్షణం వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి అతడు చెప్పిన అదే మాటని… ‘జీవితం ఏమీ తమాషా కాదు నాన్నా’ అని చెప్పాలన్న కోర్కె కలిగింది ఆమెకి. తను అలా అంటున్నప్పుడు అతడు తల దించుకోవడాన్ని ఆమె ఊహించుకుంది. ఆ ఊహకి ఆమె నవ్వింది. కానీ ఆ నవ్వు ఏడుపుగా ఎప్పుడు మారిందో ఆమెకి కూడా తెలియదు. “నీకు తోచింది చేసుకో..” అన్న శేఖర్ మాటలు గుర్తొచ్చాయి. ఆమె ఏడుపు ఠక్కున ఆగిపోయింది. ఎవరి మీదో కసి. మనుషులందరి పైన కోపం, తనపైన తనకే విరక్తి..ఇన్ని భావోద్రేకాలు ఆమెను సాంతం కదిలిస్తున్నప్పుడు ఆమె కుడి చేత్తో… కళ్ళు తుడుచుకుంది. ఊపిరి బలంగా తీసుకొని.. ఎడమ చేతిలో వున్న టేబ్లేట్లని వేసుకోడానికి సిద్ధపడింది.

ఆమె భవిష్యత్తుని నిర్ణయిస్తున్నట్టు.. గడియారం టిక్ టిక్ శబ్దం చేస్తోంది. అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు కావస్తోంది. గడియారంలో సెకెండ్స్ ముల్లు తొమ్మిదవ అంకె నుంచి పదకుండవ అంకెకి వచ్చేసరికి నిత్య టేబ్లేట్లు వేసుకునేందుకు ఎడమ చెయ్యి పైకి ఎత్తింది. ఒక్క అర సెంకెండు ఆలస్యం అయ్యివుంటే ఆమె గొంతులోకి ఆ మాతర్లన్నీ దిగిపోయేవే కానీ.. అంతలో అంతంటి నిశ్శబ్దాన్ని బద్దలు గొడుతూ.. విచిత్రమైన కేకలు వినిపించాయి. అది ఒకరి గొంతు కాదు. ఒక పది, పదిహేను మంది గొంతులు. నిత్య షాక్‌లో వుంది. ఏం జరిగిందో ఆమెకు అర్థం కాలేదు. ఆ అరుపులకి తుళ్ళిపడి చేతిలో వున్న టేబ్లేట్స్‌ని విసిరేసింది. అవి నేల పైన చెల్లా చెదురై పడి వున్నాయి. నిత్య తేరుకొని కిటికీ దగ్గరకి వెళ్ళింది. అప్పుడే ఆకాశంలో పెద్ద వెలుగు. ఎవరో ఆపకుండా టపాసులు పేలుస్తూన్నే వున్నారు. నిత్యకి ఏం అర్థం కాలేదు. ఏమిటి ఈ హడావిడి అనుకుంది. ఇంతలో ఐదు నిమిషాల క్రితం వినిపించిన విచిత్రమైన అరుపులే మళ్ళీ వినిపించాయి. అది ఒక పదిహేను మంది కుర్ర గుంపు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని అరుస్తూ బైక్ లతో అక్కడి సందులన్నీ చక్కర్లు కొడుతున్నారు. ఈ రోజు న్యూయరా..! అని ఆశ్చర్యపోయింది నిత్య. అసంకల్పితంగా కేలెండర్ వైపు చూసింది. సెప్టెంబర్ 2023 అని వుంది అక్కడ. అంటే ఆ క్యాలెండర్‍ను సెప్టెంబర్ నెల తర్వాత మార్చనే లేదు. ఆ ఆలోచనే తనకి రాలేదంటే.. ఆమె ఏ మానసిక పరిస్థితుల్లో వున్నదో అర్థం చేసుకోవచ్చు. నిత్య తన చుట్టూ ప్రపంచంతో ఎంత డిటాచ్ అయిపోయిందో ఆమెకి అర్థం అయ్యాక తనకి భయం వేసింది. గంట వ్యవధిలో నిత్యకి చాలా ఉద్వేగాలు ఎదురయ్యాయి కానీ.. భయం వెయ్యలేదు. ఇదే తొలిసారి ఆమెకు భయం వెయ్యడం. అయితే ఇంత కన్నా భయానకమైన పరిస్థితి ఆమె కొద్దిసేపట్లోనే అనుభవించబోతుందని అప్పటికి నిత్యకు తెలియదు.

నిత్య చెల్లా చెదురై పడి వున్న టేబ్లేట్లని ఎరాలని కిందకి వంగబోయింది. ఇంతలో.. మళ్ళీ ఆకాశంలో వెలుగు. అది చూడటానికి అన్నట్టు నిత్య తల తిప్పింది. కానీ ఆమె ఆకాశంలో వెలుగును చూడడానికన్నా ముందే తన గుమ్మంలో ఒకటి చూసింది. అది చూసాక ఆమె రెండు నిమిషాల పాటు స్థణువులా నిలబడిపోయింది. మరొక తారాజువ్వ పై కి లేచింది. కిటికీ వూచలని గట్టిగా పట్టుకొని తనకు కనిపిస్తున్నది ఏమిటో తెలుసుకోవడానికి కళ్ళు చిట్లించింది. శేఖర్ వెయ్యకుండా వదిలేసిన గేటుకు వేలాడుతూ ఒక ఆకారం కనిపించింది నిత్యకి. ఆమెలో తెలియని వణుకు మొదలైంది. ఎవరది అనుకుంది మనసులో. వెళ్ళి చూడాలా వద్దా అని కాసేపు ఆలోచించి చివరికి ఒక టార్చ్ లైట్ పుచ్చుకొని గుమ్మం వైపు నడిచింది. మెయిన్ డోర్ వరకూ ఎలాగోలా వచ్చింది కానీ.. అక్కడ నుంచి మెట్లు దిగి గుమ్మంలోకి వెళ్ళడానికి ఆమెతో ఆమె చాలా యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. ఆకాశంలో చంద్రుడు అరవిచ్చి నవ్వుతున్నట్టు వున్నాడు. అది పౌర్ణమి వచ్చిన ఐదవ రోజు. నక్షత్రాలు అక్కడక్కడా మెరుస్తున్నాయి. సిటీ ఇంకా పడుకోలేదని చెప్పడానికి ఆకాశంలోని వెలుగులే సాక్ష్యాలు. ఆమె ముని వేళ్ళని నేల కి గుచ్చి నిలబడి వుంది ఎటూ తేల్చుకోలేక.

“ఏవిటే ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళడానికి అంత ఆలోచిస్తున్నావ్. చీకటిగా వుంటే ఆగిపోతావా.. తెగించి వెళ్ళాలే కానీ!” నిత్య కి గతంలో వాళ్ళమ్మ మాట్లాడిన మాటలు తన వెనుకే నిలబడి మాట్లాడినట్టు వినిపించాయి. ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. కుడి చేతిలో టార్చ్.. ఎడమ చేతిలో ఫోను ఆమె బలమైన పిడికిలిలో నలుగుతున్నాయి. ఇంతలో గుమ్మం దగ్గర ఏదో మూలుగు వినబడింది. నిత్యకి చెమటలు పట్టాయి. తలుపు సందుల్లోంచి పూర్తిగా చీకటి కానీ ఆ ప్రదేశాన్ని అదే పనిగా చూస్తోంది. ఆ ఇల్లు అన్ని ఇళ్ళకి, కేక వేసినా వినపడనంత దూరంలో వుంది. బైటకి వెళ్ళాక ఏదైనా జరిగితే ..సహాయానికి ఎవ్వరైనా రావడం కష్టమని ఆమెకు తెలుసు. మనస్సు ముందుకు వెళ్ళమంటోంది.. బుద్ధి వెనక్కి లాగుతోంది. ఇందులో ఎవరి మాటా వినాలో తెల్చుకునే లోగానే నిత్య ఫోన్ మోగింది. ఆమె తుళ్ళిపడింది. ఆ షాక్ నుంచి తేరుకుని ఫోన్ కట్ చెయ్యడానికి రెండు నిమిషాలు పట్టింది. అయితే అప్పటికే ఆ శబ్దం గుమ్మం వరకూ వెళ్ళిపోయింది.

“హలో! ఎవరైనా వున్నారా..?” ఒక మగ గొంతు వినబడింది.

“ప్లీజ్ హెల్ప్!” మళ్ళీ అరిచాడతడు.

అతడి కంఠంలో ఓపిక లేకపోవడం స్పష్టంగా వినబడుతోంది. “దయచేసి సాయం చెయ్యండి” మళ్ళీ అదే గొంతు. నిత్య ఇక  ఆగలేకపోయింది. ఎదో నిర్ణయించుకున్నదానిలా గుమ్మం దాటి మెట్లు దిగింది. తన చేతిలో టార్చ్ ను వెలిగింది…

“ఎవరూ!” అంది.

“మేడమ్ ప్లీజ్ సాయం చెయ్యండి.” అతని గొంతులో కంగారు. నిత్య టార్చ్ ని ఆ గొంతు వినబడ్డ వైపు చూపించింది. ఒక మధ్య వయసులో వున్న వ్యక్తి.. తన ఇంటి గెట్ దగ్గర కూలబడి వున్నాడు. అతడి పక్కన రక్తపు మడుగు. అతడిలో ఓపిక ఏ కొసానా లేదు. నిత్య ఆ రక్తాన్ని చూసి స్తంభించిపోయింది. ఆమెకు తన కాలి కింది నేల కంపిస్తున్నట్టు అనిపించింది.

“పీరియడ్స్‌లో వున్నప్పుడు ఆటలాడొద్దని చెప్పాను వింటేగా.. చూడు ఇప్పుడు ఎంత రక్తమో”…తన శరీరం పైన రక్తాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయిన నిత్యను లేవదీసినప్పుడు వాళ్ళ బామ్మ అన్న మాటలు.. నిత్యకి ఆ క్షణం గుర్తొచ్చాయి. ఆమె తానకే తెలియని కారణానికి ఏడుస్తోంది.

“దయచేసి యాంబులెన్స్‌కి కాల్ చెయ్యండి.” అతడి అర్థింపు నిత్యని మళ్ళీ వార్తమానంలోకి తెచ్చింది.

అతడి నోటి నుంచి రక్తం ధారగా కారుతోంది. అసలతనికి ఏం జరిగి వుంటుందో ఆమెకి అర్ధంకాలేదు. ఆమె ఆలోచనల్లో ఆమె వుండగా.. ఆ వ్యక్తి ఆమె కాళ్ళ దగ్గరే పెద్ద వాంతి చేసుకున్నాడు. ఆమె కళ్ళు తిరిగి పడబోయి తమాయించుకుంది. చేతులు వణుకుతుండగా..108 కి ఫోన్ చేసింది. వాళ్ళకి విషయం చెప్పగా.. వాళ్ళు పోలీస్ లకి కూడా ఇన్ఫామ్ చెయ్యమని చెప్పారు. “పోలీసులా.. ఎందుకు” అందామె. ఆమె వెన్నులో ఏదో తెలియని వణుకు.

“పోనీలే కదా తెలిసిన పిల్లని మా ఆయన చనువుగా చెయ్యి వేస్తే అతని చెయ్యి కొరికేసి వచ్చింది నీ కూతురు. ఆయన పోలీసు అది మర్చిపోయారా?” నిత్యకి తన పక్కింటి రాజ్యం ఆంటి అన్న మాటలు గుర్తొచ్చాయి.

“హాల్లో మేడం వున్నారా.. పోలీసులకి కాల్ చెయ్యండి మర్చిపోకండి” అని చెప్పి అటువైపు వ్యక్తి కాల్ కట్ చేసారు.

నిత్య మసగ్గా అయినా కళ్ళని తుడుచుకుంటూ.. పోలీసులకి కాల్ చేసింది. మాట్లాడుతున్నంత సేపు ఆమె గొంతు వణుకుతూనే వుంది. నుదిటిపై చెమటలు అంత చలిలోనూ ధార కట్టాయి. అతడు మళ్ళీ వాంతు చేసుకున్నాడు. నిత్య ఏదో గుర్తొచ్చినట్టు…ఇంట్లోకి పరిగెత్తింది. ఒక రెండు నిమిషాల్లో నీళ్ళ బాటిల్ తీసుకొని అదే పరుగుతో వచ్చింది. అతడి చేతికి అందించిన బాటిల్‌ని అతడు లాక్కున్నట్టే తీసుకున్నాడు. చేతులు వణుకుతుండగా తాగడానికి ప్రయత్నించాడు. సగానికి సగం కిందే పడ్డాయి. “యాంబులెన్స్ కి, పోలీసులకి కాల్ చేసాను. వాళ్ళు ఏ నిమిషమైనా వస్తారు. మీరు ధైర్యంగా వుండండి” అంది నిత్య. ఆమెకే లేని ధైర్యాన్ని అతడిలో నూరిపోస్తూ. అతడు ఆయాసపడుతూ తల వూపాడు. ఆమె అతడ్ని నిశితంగా పరిశీలించింది. వంటిపైన ఎక్కడా గాయాలు లేవు. కత్తి గాట్లూ లేవు. ఆమె అనుమానంగా అడిగింది.. ఏం జరిగింది మీకు అని. అతని కళ్ళల్లో ధారగా నీళ్ళు. మాట్లాడనివ్వకుండా ఒకటే దగ్గు. ఊపిరి చాలా కష్టంగా తీసుకుంటున్నాడు. వాటన్నింటి మధ్యలో.. ఏదో అస్పష్టంగా అనబోయాడు. మాట్లాడడం అతని వాళ్ళ కాలేదు. ఓపిక లేనట్టు తూలుతుండగా షర్ట్ జేబులో నుంచి ఒక ఉత్తరాన్ని తీసి ఆమెకి ఇచ్చాడు. అదేంటో ఆమె చూసేలోగానే.. అతడు స్పృహ కోల్పోయాడు. నిత్య భయపడింది. అతడికి దగ్గరగా వెళ్ళి గట్టిగా కదిపింది. ‘హల్లో సార్.. వినిపిస్తొందా’ అంటూ పిలుస్తోంది. అతడు తెలివిలో లేడు. ఆమె అదే భయంతో నెమ్మదిగా అతడి ముక్కు దగ్గర చూపుడు వేలు పెట్టింది. శ్వాస ఆడుతుంది. వెంటనే పక్కన వున్న నీళ్ళ బాటిల్లో అడుగున వున్న కాస్త నీళ్ళని అతడి మొహాన జల్లింది. అతడిలో చిన్న కదలిక. నిత్య కాస్త నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.

“యాంబులెన్స్ వచ్చేస్తుంది కాస్త తెలివిలో వుండడానికి ప్రయత్నించండి ప్లీజ్” అందామె అర్ధింపుగా. అతడు మొద్దుబారిపోయిన నాలికతో ఏదో అంటున్నాడు. ఆమెకు అదంతా స్పష్టంగా వినిపించలేదు. అతడు ఏం అంటున్నాడో వినడం కోసం కొంచెం ముందుకు వంగి అతడి నోటికి దగ్గరగా తన చెవిని పెట్టింది.

“నా.. కు.. బ్రత.. బ్రతకా.. ల.. ని వు.. వుంది.” అన్నాడు. నిత్య నివ్వెరపోయింది. “న.. నన్ను ఎలా అయినా.. బ్రతికించండి ప్లీ.. జ్..” అతడు ఏడుస్తున్నాడు.

“సార్! ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీకేం కాదు. ధైర్యంగా వుండండి” అంది నిత్య ఇంకేం అనాలో తెలియక. వీధి చివరకే చూపు సారించి చూస్తోంది. ఏదైనా వెహికల్ వచ్చే అలికిడి అవుతోందేమో అని. ఒక రెండు నిమిషాల తర్వాత సైరన్ శబ్దం వచ్చింది. నిత్య ఆత్రంగా గేట్ దాటి బయటకు వెళ్ళి రోడ్డు మధ్యలో నిలబడింది. వస్తున్నది యాంబులెన్స్ అని తెలిసి అతడి వైపు నిశ్చింతగా చూసింది. ఆ వెహికల్ ఆమెకు మూడడుగుల దూరంలో ఆగింది. నిత్య చూస్తుండగానే అతడిని యాంబులెన్స్ లో ఎక్కించడం ఆక్సిజన్ పెట్టడం, ఇంజెక్షన్ ఇవ్వడం, సెలైన్ ఎక్కించడం అన్నీ జరిగిపోయాయి. నిత్య శిలా ప్రతిమలా నిలబడి జరిగేదంతా చూస్తూ వుంది. అంతలో అక్కడికి నర్స్ వచ్చింది. ఆయనకి ఎలా వుంది అడిగింది నిత్య. “హి ఈజ్ ఆల్ రైట్ మేడమ్. మీరు పోలీస్ లకి ఇన్ఫామ్ చేసారా” అని అడిగింది ఆ నర్స్.

“చేసాను అండి. ఇప్పటికే రావాలి. వస్తూ వుంటారు” అంది నిత్య వీధి చివర మలుపు వైపే చూస్తూ. ఇంతలో పోలీస్ జీప్ కూడా వచ్చి ఆగింది. ఎస్.ఐ నిత్య కు దగ్గరగా వెళ్ళి..

“మీరేనా ఫోన్ చేసింది?” అని అడిగాడు. నిత్య రెండు అడుగులు వెనక్కి వేసి చూపు నేలకు దించేసి అవునన్నట్టు తలూపింది.

“అతను మీకు ఏం అవుతారు?” అని అడిగాడు మళ్ళీ ఎస్.ఐ..

నిత్య, “అతను నాకేమీ కాడండీ..” అంటూ జరిగిందంతా చెప్పింది.

“ఐసీ.. ఈ ఇంట్లో ఎవరెవరు వుంటారు?”

“నేను నా హజ్బెండ్.”

“మరి ఆయనేరి?” నిత్య తడబడింది.

“అదీ! న్యూయర్ కదా పార్టీకి వెళ్ళారు” అంది.

“మిమ్మల్ని తీసికొని వెళ్ళకుండానా..?” ఆశ్చర్యం, అనుమానం కలగలిపిన స్వరంతో అన్నాడు ఎస్.ఐ.

“అది వాళ్ళ కంపెనీ తరపున ఇచ్చే పార్టీ.. నాకు కంఫర్టబుల్‌గా వుండదు. అందుకే నేనే వెళ్ళలేదు” నిత్య గుండె వేగంగా కొట్టుకుంటోంది.

“మీకెన్నేళ్ళెంది పెళ్ళె?”

ఇక నిత్య వల్ల కాలేదు.

“సర్.. అతనకి ప్రోబ్లం అయితే నన్ను ఇంటరాగేట్ చేస్తారెంటి?” అంది అసహనంగా.

“ఈ ఇన్సిడెంట్ స్పాట్‌లో మీరు వున్నారుగా, పోలీస్ గా ఇది నా బాధ్యత. మేడం ప్లీజ్ కోపరేట్” అన్నాడతను. నిత్య సహనం కోసమన్నట్టు కళ్ళు మూసుకుంది.

“మీరు నా క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యలేదు”. మళ్ళీ గుర్తుచేసాడు ఎస్.ఐ.

“రెండేళ్ళు.”

“వాట్..?”

“మాకు పెళ్ళై రెండేళ్ళు.”

ఒకే. మీ ఇల్లు తనిఖీ చెయ్యోచ్చా?”

డిస్గస్టింగ్ అనుకుంది మనసులో నిత్య.

ఆమె ఏదో అనబోతూ వుండగానే కానిస్టేబుల్ పిలిచాడు వెనకనుంచి. ఏమైంది అటు తిరిగి అడిగాడు ఎస్.ఐ..

“సార్ అతనిది సూసైడ్ అంట..” అన్నాడా కానిస్టేబుల్.

“ఈజ్ ఇట్” యాంబులెన్స్ దగ్గరికి నడిచాడు ఎస్.ఐ.. అది విన్న నిత్య వెన్ను, కొరడాతో ఎవరో కొట్టినట్టు నిటారుగా అయ్యింది. ఆమెకి తన పడక గదిలో చెల్లా చెదురై పడి వున్న స్లీపింగ్ టేబ్లేట్స్ గుర్తొచ్చాయి. వాటిని గనుకా ఈ ఎస్.ఐ. చూస్తే.. ఆ తర్వాత ఏమవుతుందో ఆమె ఆలోచించలేకపోయింది. ఆమెకు పదడుగుల దూరంలో.. అతడు యాంబులెన్స్‍౬లో స్పృహ లేకుండా వున్నాడు. ఆమెకి ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టు ఎడమ చెయ్యి పిడికిలి విప్పింది. అందులో అతడు స్పృహ కోల్పోయే సమయంలో ఇచ్చిన ఉత్తరం వుంది. అది బాగా నలిగిపోయి వుంది. నిత్య నుదిటికి చెమటలు పట్టాయి. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచి చూసింది. మొదట దాన్ని చూసి అతను రాసిన లెటర్ అనుకుంది నిత్య. కానీ తర్వాత అర్థమైంది, అది మరెవరో అతనికి రాసినదని. ఆమె నిమిషం ఆశ్చర్యపోయి అతడి వంక చూసింది. అప్పటికే ఎస్.ఐ… మీ నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు అని అతడ్ని అగుతున్నాడు.

‘మురళి!

నిన్న నీ సూసైడ్ నోట్ చదివాను. సమస్యలన్నిటికీ ఈ జీవితం నుంచి పారిపోవటమే పరిష్కారమైతే నన్ను కూడా పిలవాల్సింది. నేను నీతో పాటు వచ్చేదాన్ని. ఏమనుకుంటున్నావ్ ఇదేమైనా త్యాగం అనుకుంటున్నావా లేదా ఎవరి మీదో తీర్చుకునే పగ అనుకుంటున్నావా. ఈ పనితో నీకు దక్కేది శూన్యం. నిన్ను ప్రేమించేవాళ్ళకి నువ్వు మిగిల్చేది శోకం. నువ్వు ఎవరికో జవాబు చెప్పడానికి ఏదో నిరూపించడానికి చనిపోదాం అనుకుంటున్నావేమో కానీ ఇలా చేస్తే వాళ్ళ దృష్టిలో నువ్వు ఇంకా పతనమైపోతావ్. నీ ఇంటికి వచ్చి, నిన్ను అవమానించి, నీ భార్యని కొట్టి, బాధ పెట్టిన వాళ్ళకి సరైన జవాబు చెప్పకుండా సర్వం చాలించేసి.. నీ ఓటమిని ఒప్పుకొని వెళ్లిపోవడం పతనం కాక మరేంటి. ఈ రోజు నీ జీవితంలో చీకటి రోజే కావొచ్చు. కానీ ఆ చీకటిని  వెలుగుగా మార్చుకునే అవకాశం భవిష్యత్తు ఎప్పుడు ఇస్తుంది. దాన్ని వెతక్కుండా మరింత చీకట్లో కూరుకుపోవడంలో అర్థంలేదు. నీకు ఆవేశం వచ్చినప్పుడు, ఈ జీవితం వ్యర్థం అనిపించినప్పుడు.. ఒక్క నిమిషం ఆగు. నీ నిర్ణయంలో బలం ఎంత వుందో ఆ ఒక్క నిమిషం నీకు చెప్పగలదు. నువ్వు పిరికివాడివి కాదు మురళి. నీలో చాలా ధైర్యం ఉంది. బలహీనతలకి బానిస అయిపోకు. లైఫ్ కి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు. ఇట్ డెసెర్వ్స్ వన్ మోర్ ఛాన్స్. నువ్వు మళ్ళీ తిరిగి వస్తావ్ అన్న నమ్మకం నాకు వుంది. నీకోసం ఎదురుచూస్తూ వుంటాను. నా నమ్మకాన్ని ఒమ్ము చెయ్యకు మురళి.

ఇట్లు

నీ జ్యోతి’

ఆ ఆఖరి వాక్యం పూర్తి చేసేసరికి నిత్య కళ్ళల్లో ధారగా నీళ్ళు. ఆమెతోనే ఒక సన్నిహితురాలు ఈ మాటలు చెప్తున్నట్టు ఏదో సత్యం బొధపడుతున్నట్టు అనిపించిందామెకి. ‘మురలీ హౌ లక్కీ యూ ఆర్” అనుకుంది మనసులో. నిత్య చేతిలో వున్న ఉత్తరాన్ని ఎస్.ఐ. తీసుకోని చదివాడు. తర్వాత నిత్య వైపు తిరిగి “మీరు అవసరమైతే పోలీస్టేషన్ కి రావాల్సి వుంటుంది సరేనా” అన్నాడు. ఆమె చిన్నగా తల వూపింది.

“న్యూఇయర్ కావడం చేత రావడం లేటైంది. బట్ ఇంతలో మీరు అతనికి చేసిన సాయం ఈజ్ అన్ ఫరగెటబుల్ థ్యాంక్యూ!” అంటూ.. అతడు జీప్ దగ్గరకి వెళ్ళాడు. “అతని వైఫ్‍ని కాంటాక్ట్ చెయ్యండి. ఆమెకి జరిగింది చెప్పి హాస్పెటల్‌కి రమ్మనండి. అతని దగ్గర ఒక రిపోర్ట్ తీసుకోండి. సీన్‌లో ఏం జరిగిందో ఈమెని కూడా అడిగి రాసుకోండి. గివ్ హిమ్ ఎ నెససరీ ట్రీట్మెంట్. ఏ హాస్పేటల్‌కి తీసుకొని వెళ్తున్నారో ఇన్ఫామ్ చెయ్యండి. ఇఫ్ పాజిబుల్ ఐ విల్ కమ్ దేర్.” అని ఒక కానిస్టేబుల్ కి చెప్పి.. మురళితో కూడా వుండమని ఆర్డర్ పాస్ చేసి ఎస్.ఐ. వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిన రెండు నిమిషాలకే యాంబులెన్స్ కూడా బయల్దేరబోయింది. ఇంతలో నిత్య కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి..

“నేను కూడా రావచ్చా” అని అడిగింది.

“నువ్వా.. మా సార్ చెప్పలేదు కదమ్మా.. మళ్ళీ అతనికి తెలిస్తే సమస్య అవుతుంది” అన్నాడు.

“అతని వైఫ్ వచ్చేవరకూ వుండి వెళ్ళిపోతాను అండి” ఆమె బ్రతిమాలుతున్నట్టు అడిగింది. అప్పుడే కానిస్టేబుల్‌కి గుర్తొచ్చింది.. ఎస్.ఐ. ఈమెని కూడా ఎంక్వెరీ చెయ్యమన్నాడని.

“సరే రామ్మా” అన్నాడు కానిస్టేబుల్. అప్పుడు సమయం అర్ధరాత్రి రెండు దాటింది. నిత్య కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి. మురళి కళ్ళు మూసుకొని వున్నాడు. తెరిస్తే అతడి కళ్ళు ఆమె కాళ్ళలాగే వుంటాయేమో బహుశా. ఆమె అతడి కను చివరల నుంచి.. కన్నీళ్ళు జారి తలగడను తడపడం స్పష్టంగా చూసింది. ఆమె గుండెని ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్టైంది. మెదడు మొత్తం ఆలోచనలతో నిండిపోయింది. ఏం చెయ్యాలి అనుకుందో.. ఏం చేసిందో.. ఏం చేస్తూ వుందో ఆమెకే అర్థం కాలేదు.

శేఖర్ పొద్దున్న వరకూ రాడని ఆమెకి తెలుసు. ఆమె సహచర్యంలో దొరకని ఆనందాన్ని అతడు మరెక్కడో వెతుక్కుంటున్నాడని కూడా ఆమెకి తెలుసు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలు. ఎందుకిదంతా అని ప్రశ్నిస్తే.. నీకు తెలియదా అని నిలదీస్తాడేమో అని ఆమె భయం. కానీ తను మాత్రం ఏం చేసింది. ఇందులో తన తప్పు ఏముంది. ఏ రోజైనా అసలు నీ సమస్య ఏంటి అని అడిగాడా? నేను ఇలా వుండడాన్ని అసహ్యించుకున్నాడే తప్పా.. ఎందుకో కారణం అడగలేదు, తెలుసుకోవాలని ప్రయత్నమూ చెయ్యలేదు. ప్రేమ లేకపోయినా ఒక మనిషితో బ్రతికుండాల్సి రావడం ఎంత దురదృష్టం. ఆమె కళ్ళ నుంచి రహస్యంగా ఒక నీటి చుక్క.. చెక్కిళ్ళని తడిపి కిందకి జారిపోయింది.

ఒక మామూలు హాస్పటల్ దగ్గర యాంబులెన్స్ ఆగింది. అతడిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్ళారు. కానిస్టేబుల్ నిత్యని బైటనే ఆపి అతడికి కావాల్సిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఆమె మెల్లిగా లోపలికి నడిచింది. రాత్రి కావడం చేత హాస్పెటల్ నిర్మానుష్యంగా వుంది. దూరం నుంచి ఇంకా టపాసుల శబ్దం వినిపిస్తూనే వుంది. అక్కడక్కడా కుక్కల అరుపులు ఆ శబ్దాలకి జత కట్టాయి. అలా ఒక అర్ధగంట గడిచింది. సమయం మూడు కావస్తోంది. నిత్య యథాలాపంగా కారిడార్ వైపు చూసింది. ఏదో ఆటో ఆగిన శబ్దం. ఎవరో ఒక ఆమె పరుగులాంటి నడకతో అటువైపే వస్తుండటం నిత్య గమనించింది. మనిషి కంగారుగా వుంది. పరిగెత్తుతూ రావడం వల్ల శ్వాస భారంగా తీసుకుంటోంది. జుట్టు సరిగ్గా దువ్వుకోలేదని చెదిరిన వెంట్రుకలు చెప్తున్నాయి. సన్నగా పొడవుగా వుంది. ముదురు గోధుమరంగు చీర మధ్యమధ్యలో ముదురాకు పచ్చ పువ్వులు.. ఆమెకు ఒక ముపై పైనే వుంటాయి. నిత్య గుసగుసగా అనుకుంది ‘జ్యోతి’ అని. ఆ పొడవాటి మహిళకు నిత్య పిలుపు వినబడినట్టే.. ఆమె వైపు చూసింది.

“ఇక్కడ మురళి అనే పేషెంట్ జాయిన్ చేసారని”.. అంటూ ఏదో అనేలోగానే నిత్య లేచి.. “అవునండి ఇక్కడే” అంది. అంతలో కానిస్టేబుల్ వచ్చి,

“మీరేనా మురళి భార్య”.. అని అడిగాడు.

“అవునండీ.. అయన ఎలా వున్నారు..” ఆమె గొంతులో కంగారు నిండిన ఆత్రం.

“ఆత్మహత్యా ప్రయత్నం చేసాడు. కానీ త్వరగానే మనసు మార్చుకున్నాడు. పెద్దగా ప్రమాదం ఏం లేదు. మీరు వెళ్ళి చూడొచ్చు. మీరు వెళ్లి వస్తే నేను అడగాల్సిన ప్రశ్నలు కొన్ని వున్నాయి అడగాలి” అన్నాడు కానిస్టేబుల్.

జ్యోతి కంగారుగా లోపలి వెళ్ళింది. నిత్య ఆమె వెళ్లే వైపే చూస్తూ కాసేపు నిల్చుంది. జ్యోతి బైటకి వచ్చేసరికి సమయం తెల్లవారుజాము నాలుగు అవుతోంది. చలి చాలా ఎక్కువగా వుంది. ఆమె శరీరం సన్నగా జలదరిస్తుంది. పెదవులు తన అనుమతి లేకుండానే వణుకుతున్నాయి. చీరను భుజాలు మీదుగా కప్పుకొని బైటకి వచ్చి చుట్టూ చూసింది. దూరంగా కానిస్టేబుల్ కనిపించాడు. ఎస్క్యూజ్ మీ! ఇతన్ని కాపాడింది ఎవరు అని అడిగింది అతని దెగ్గరికి వెళ్లి.  ఒక అమ్మాయి కాపాడిందమ్మ. ఇందాకే వెళ్లిపోయింది. మీరొస్తే ఈ ఉత్తరం ఇమ్మంది అంటూ అతను జ్యోతికి ఒక ఉత్తరం ఇచ్చాడు. జ్యోతి ఆత్రంగా దాన్ని తెరిచి… చదవడం ప్రారంభించింది.

‘జ్యోతి గారు!

మీకు నేను ఎవరో తేలికపోవొచ్చు. కాసేపటి క్రితం మీ ఉత్తరం చదివే వరకూ మీరు కూడా నాకు తెలీదు. దాన్ని మీ వారితో పాటు నేను చదివాను. ఆ ఉత్తరం ద్వారా మీరు నాకు జీవితకాలం గుర్తుండే పెద్ద పాఠాన్ని నేర్పారు. మీకు ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. ఊరు, పేరు తెలియని అనామకురాలు ఏవేవో చెప్తుంది అని మరోలా అనుకోకండి. ఈ వేదనని ఇన్నాళ్లు మనసులోనే దాచుకొని నలిగిపోయాను. ఎందుకో ఈ రోజు క్రితం ఎప్పుడు పరిచయం లేని మీకు చెప్పుకోవాలి అనిపిస్తుంది. నిన్నటి రాత్రి మురళి గారు, నా ఇంటి తలుపు తట్టకపోయి వుంటే.. నా జీవితం ఈ పాటికి ఏం అయ్యుండేదో నేను ఊహించలేను. నేను కూడా అతనిలాగానే చచ్చిపోదాం అనుకున్నాను. ఆ సమయంలోనే ఇదంతా జరిగింది. మీరు అన్నట్టు మనల్ని మనం చంపుకోవడం కన్నా హీనమైన చర్య మరొకటి లేదనుకుంటాను జ్యోతి. అయినా కూడా ఆ స్థితికి నేను దిగజారానంటే.. నేను జీవితంతో ఎంత విరక్తి చెందానో ఆలోచించండి.

మా అమ్మ నాకు చీకటి అంటే భయం అనుకుంది.. కానీ ఆ చీకట్లో జరిగిన ఘోరం ఏమిటో, ఆ చీకటంటే నాకు ఎందుకు భయమో నన్ను ఏ రోజూ అడగలేదు. నా శరీరమంతా రక్తం అంటుకుంటే.. పిరియడ్ టైంలో ఆటలాడి అంటించుకున్నాను అనుకుంది మా బామ్మ, కానీ స్కూల్ స్టాఫ్ రూమ్‍లో ఏం జరిగిందో ఆమెకు తెలియదు. నా చిన్నప్పుడు మా పక్కింట్లో వుండే ఒక పోలీస్ చెయ్యి కొరికాననని చెడామడా తిట్టిన నాన్న, ఒక భయస్థురాలైన కూతురు అంత పని ఎందుకు చేసిందని తెలుసుకోలేదు. పెళ్ళి చేసుకుంటే భార్యని ఏమైనా చెయ్యోచ్చు అనుకునే భర్తకి, అతని ఊపిరి తగిలితేనే చిరాకుపడే నా వింత చేష్ట అర్థం కాలేదు. దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకోలేదు సరికదా నాపై ద్వేషాన్ని చిమ్మడం అలవాటు చేసుకున్నాడు. వీటన్నింటి మధ్యా నలిగిపోయిన నాకు, బ్రతకాలనే కోరిక ఏనాడో చచ్చిపోయింది. ఈ రోజు నేను చంపాలనుకున్నది నాలోని మిగలని నన్ను మాత్రమే.

కానీ మీరు మురళికి రాసిన ఉత్తరం చదివాక నేను చేసిన తప్పేమిటో నాకు అర్థమైంది. ఈ వేదనల వెనుక దాగిపోయిన అసలైన నన్ను వెతుక్కోవడంలో నేను ఎలా ఓడిపోయానో తెలిసింది. మన మౌనాన్ని, మన కన్నీళ్ళని ఏం చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువమందే వుంటారు. కానీ ఆలా వుండాలి అని కోరుకోవడమే ఒక బలహీనత అని అనిపిస్తోంది. నేను బలహీనురాలిని అయ్యింది ప్రపంచం నుంచి కొరవడిన మమతా వల్ల కాదేమో, నా అనే వాళ్ళ ప్రేమ రాహిత్యం వాళ్ళ కాదు ఏమో..  నన్ను నేను ప్రేమించుకోవడం లోనే ఎదో లోపం జరిగింది అనుకుంటాను. ఇకపైన నన్ను నేను ఎంత ప్రేమించుకోగలిగితే అంత ప్రేమించుకుంటాను. ప్రపంచం నుంచి ప్రేమను ఆశించడం కన్నా ముందు అది మనలోనే జనించాలని చెప్పిన మీకు రుణపడి వుంటాను. ఈ కొత్త సంవత్సరం నాకు నిజంగా మరో జన్మనిచ్చింది. నేను మళ్ళీ పుట్టాను. నాకిప్పుడు భయం లేదని చెప్పను. దానితో పోరాడే శక్తిని అలవర్చుకోటానికి ప్రయత్నిస్తాను అని చెప్పగలను. జీవితం పైన జనించిన కొత్త  ఆశతో వెళ్తున్నాను. నా ఆకాంక్ష నెరవేరాలని కోరుకోండి. నన్ను బ్రతికించిన మీ వారికి నా తరుపున కృతజ్ఞతలు చెప్పండి. ఇదంతా మీ ముందు నిలబడి చెప్పడం నేను వున్న పరిస్థితుల్లో సాధ్యం కాదనిపించింది. అందుకే ఉత్తరం రాస్తున్నాను. జీవితం మళ్ళీ మనల్ని కలిపితే కలుసుకుందాం. అంత వరకు సెలవు.

నిత్య.’

ఉత్తరం చదవడం పూర్తి అయినా కూడా అవే అక్షరాలని మళ్ళీ మళ్ళీ చదువుకుంది జ్యోతి. ఏమిటిదంతా.. నేను చదివేదంతా నిజమేనా! ఎంత ప్రమాదం తప్పింది. ఆమె గుండెలపైన ఆ ఉత్తరాన్ని అణుచుకొని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది. రాత్రి మురళి పడుకున్న సమయంలో.. ఏం రాయాలో ఎలా రాయాలో తెలియక ఎన్ని ఉత్తరాలు రాసి చింపేసిందో ఆమెకి గుర్తొచ్చింది. ఇక రాయోద్దు అని నిర్ణయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మనసు మార్చుకుని అర్ధరాత్రి మూడుగంటలకి రాసిన ఉత్తరం అది. అలా గనుక రాయకపోయి వుంటే ఏం జరిగేదో వూహించుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. ఆ నాలుగు వాక్యాలు రెండు నిండు జీవితాల్ని కాపాడాయంటే.. ఆమెకు చాలా ఆనందంగా అనిపించింది. ఆమెకి పరిచయమే లేని నిత్య ఆశించిన జీవితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంది జ్యోతి. నిత్య చేసేది ఒంటరి ప్రయాణమే కావచ్చు.. కానీ ఈ సారి ఆమె ఒంటరితనానికి ధైర్యం తోడుగా వుంటుంది అనుకుందామె.