back to top
Home Blog Page 4

ఆమె ఆశయానికి కంచె

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన భానుప్రియ గారి ‘ఆమె ఆశయానికి కంచె’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]స[/dropcap]త్యనారాయణ, లక్ష్మిలది మద్య తరగతి పల్లెటూరి కుటుంబం. ముగ్గురు పిల్లలు. ఇద్దరు అబ్బాయిలు, ఒక ముద్దుల కూతురు మయూరి. పేరుకు తగ్గట్టుగానే నాట్యాన్ని అభ్యసించి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనే ఆరాటం తనది. పల్లెటూరు, దానికి తోడు చాలిచాలని జీతంతో చాలా కష్టంగా జీవనం సాగేది. నాట్యం నేర్చుకోవాలనే మయూరి కోరికను తల్లి కూడా ఎలాగైనా సరే నెరవేర్చాలని అనుకునేది..

నాట్యం నేర్చుకోవాలంటే బస్సు సౌకర్యం లేని మూడు కిలోమీటర్లు దూరంలో గల మండల ప్రాంతానికి వెళ్ళాలి. నేర్చుకోవాలనే మయూరి సంకల్పం ముందు నడక ఆటంకం కాలేదు. రోజు అలా వెళ్ళి చాలా కష్టపడి నేర్చుకునేది. పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మెదటి బహుమతి అందుకునేది. ఊర్లో మాత్రం కొందరు ఆడపిల్లలకు అవసరమా ఈ డాన్సులు అన్నప్పుడు మయూరి ‘ఆడపిల్లకు అడుగడుగున ఆంక్షాలేనా అవని అంతా ప్రేమను పంచే ఆమెకు, ఆమె ఆశయానికి కంచె వేస్తున్నారు, ఎందుకు?’ అని బాధపడేది. ‘నేను మాత్రం పెద్దయ్యాక ఈ కంచె నుంచి విముక్తి చెంది నా ఆశయాన్ని నేర్చుకుంటా’ అని మనసులో సంకల్పం చేసుకుంటుంది.

తన పట్టుదల, కృషికి పోగిడేవారు కొందరు, మాటల తూటాలతో గాయపరిచేది మరికొందరు, కాని మయూరి వారి ఇంటి సభ్యులు అవేవి పట్టించుకునేవారు కాదు.

పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని సార్లు వచ్చిన ఆర్థిక స్తోమత లేక వెళ్ళలేక తన పరిధి మేరకు నాట్యం చేస్తూ పేరు కు తగ్గట్టుగా నాట్యమయూరిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా ముందుకు సాగుతుండగానే యుక్త వయస్సులోకి అడుగు పెట్టింది.

తన తండ్రి పరిస్థితి బాగోలేక తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకుంది. అలా తన ఆశయానికి పెళ్లి అనే కంచె వేయడం వలన మధ్యలోనే నాట్యానికి అంతరాయం ఏర్పడింది.

కాని తాను మాత్రం వివాహం అనంతరం తన భర్త ద్వారా తన ఆశయాన్ని సాధించాలని అనుకుంది.

నగరంలో తను, భర్త కార్తీక్ అత్త, మామలతో వారికి సరిపడే ఒక చిన్న సొంత ఇంట్లో మయూరి కాపురం ఆరంభమైంది.

కార్తీక్ మృదు స్వభావి. ఒక కంపెనీలో మేనేజర్‍గా పని చేసేవాడు. తనకు ఇష్టమైన నాట్యం వైపు మయూరి మనసు మళ్ళింది.

తన భర్తతో మాట్లాడి చిన్న పిల్లలకు నాట్యం నేర్పించాలని అనుకుంది.

సాయంత్రం కార్తీక్ రాగానే తన మనసులోని  మాటను చెప్పింది.

అది విన్న కార్తీక్ “నాట్యమా ఎక్కడ నేర్పిస్తావు ఎలా? ఎందుకు రిస్క్? నువ్వు హ్యాపీగా వుండు. అమ్మ వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి కదా” అని చెప్పాడు.

“కేవలం రెండు గంటలు మాత్రమే పిల్లలకు నాట్యం నేర్పిస్తాను. నాకేమి రిస్కు లేదండి. నాకిష్టమైన నాట్యాన్ని పదిమందికి పంచాలని నా చిన్నతనం నుంచి ఎన్నో కలలు కన్నాను.” అని బేల ముఖం వేసుకొని భర్తతో చెప్పింది.

అది విన్న కార్తీక్ “చూద్దాంలే, బాధపడకు. అమ్మానాన్నలను కూడా  ఒక మాట అడుగుదాం” అని తనని ఓదారుస్తాడు.

వంట గదిలో పని చేస్తు మయూరి ఆలోచనలో పడుతుంది. ‘వివాహం అనే బంధంతో కట్టుబాట్లు, సాంప్రదాయాలు స్త్రీ జీవితంలోని ఆశయాలను కోరికలకు ప్రతిబంధకమై తన చుట్టూ ఒక ‘కంచె’ ఏర్పాటు అవుతుంది కదా!’ అని తన మనసులో అనుకొని చిన్న నిట్టూర్పుతో బాధపడింది.

అలాగే వారం రోజులు గడిచాయి. కార్తీక్‌కి మయూరి మరొకమారు గుర్తు చేసింది. “ఏమైంది? మీరు మీ అమ్మగారితో మాట్లాడారా? ఏమన్నారు అత్తయ్య గారు, నేను నాట్యం నేర్పించడానికి ఒప్పుకున్నారా!” అని అడగగా

“అయ్యో మయూరీ, నేను ఆ సంగతి మర్చిపోయాను. రోజు నేను వచ్చేసరికి రాత్రి అవుతోంది కదా. సరేలే రేపు అడుగుతానులే” అన్నాడు.

మరునాడు మయూరి ఇంటి దగ్గర దేవాలయానికి వెళ్ళగా అక్కడ కూర్చున్న తనకు గుడి కింది ఒక విశాలమైన ప్రాంగణం కనబడగా ఇక్కడ తన నాట్య తరగతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి, పూజారి గారికి తన మనసులోని కోరికను చెప్పింది.

అది విన్న పూజారి “చాలా మంచి ఆలోచన తల్లీ”, అని, “మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నువ్వు సంతోషంగా తరగతులు ప్రారంభించుకో” అని చెప్పగా మయూరి మది అవధులు లేని సంతోషంతో మునిగిపోయింది.

మయూరి ఎంతో కష్టపడి 20 రోజులపాటు ప్రచారం చేసి కొంతమంది విద్యార్థులను రప్పించుకోగలుగుతుంది..

ఇంట్లో వాళ్ళని ఒప్పించి నాట్యాన్ని ప్రారంభించి, ఇంట్లో పని చేసుకుని అత్తయ్య, మామయ్య విశ్రాంతి సమయంలో తాను తరగతులకు వెళ్ళేది. అలా నెల రోజులు గడిచాక మయూరికి రెండు రోజులు ఆరోగ్యం బాగోలేక డాక్టర్ని సంప్రదించగా డాక్టర్ మయూరిని పరీక్షించి ఆమె తల్లి కాబోతుందనే శుభవార్త చెప్పింది.

ఆ శుభవార్తతో మయూరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు. మయూరి మాత్రం తన రూమ్‌లో కూర్చుంది. తన మనసులో ఒకవైపు సంతోషం, మరోవైపు తన నాట్య తరగతులు ఎలాగూ అని బాధ! ‘ఆడపిల్ల అంటే వివాహం అనంతరం బాధ్యతలు, కట్టుబాట్లు, అనే కంచెలో బందీ అయ్యి తన ఆశలను, ఆశయాలను చంపుకొని మనస్సాక్షితో నిరంతరం యుద్ధం సల్పుతూండాలసిందేనా? అలుపెరుగని పోరాట సమరమే కదా ఆడదాని జీవితం…’ అని తన అంతర్మథనంలో బాధపడింది. మళ్ళీ, ‘అమ్మా అనే పిలుపు నా దరి చేరునులే’ అని మనసులో సంతోషపడుతు కన్నీరు తుడుచుకుంది.

***

ఇది ఒక్క మయూరి కథనే కాదు. ఏదో సాధించాలని, కలలు కన్న లక్ష్యాన్ని అందుకోవాలని ఎంతో సాధన చేసి అనుబంధానికో, సాంప్రదాయానికి, కట్టుబాట్లకో, బందీ అయ్యి కంచెలో పడిన లేడిపిల్లలా అనునిత్యం విలపించే ఎందరో పడతుల యథార్థ సంఘటన.

పుట్టినరోజు

0

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘పుట్టినరోజు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap] రోజు ఉదయాన్నే మోహన్ డ్యూటీకి బయలుదేరుతుంటే..

“రేపు పాప పుట్టినరోజు. సెలవు పెట్టండి.” అని ఓ లిస్టు చేతికిచ్చింది భార్య. ఖర్చంతా కలిపితే వేలల్లోనే ఉంది. అంత డబ్బు చేతిలో లేదు.

‘ఏదో ఒకటి చేయొచ్చులే’ అనుకుని పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ దుర్గారావుకి సెల్యూట్ కొట్టి, “సార్! జీతం రాగానే ఇస్తాను. కొంచెం డబ్బు అప్పుగా కావాలి” అన్నాడు.

“అప్పుతో పనేంటయ్యా? అలా ఊళ్ళో రౌండ్స్‌కి వెళ్ళు. ఏ బైకో, లారీనో ఆపు. ఎవడో ఒకడు తగలకపోతాడా? నువ్విలా అమాయకంగా ఉంటే.. ఎలాగయ్యా” అన్నాడు.

రౌండ్స్‌కి బైక్ మీద బయలుదేరాడు మోహన్.

జంక్షన్లో నిలబడ్డాడు. ఓ బైక్ ఆపి పేపర్లన్నీ చూశాడు. అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి. ఏం చెప్పాలో తెలియక పంపించేసాడు. ఆ తర్వాత మరో రెండు బైకులుని ఆపాడు. ఏదైనా లోపం కనిపిస్తుందేమోనని డేగ కళ్ళతో వెతికాడు. లేని కారణాల్ని సృష్టించటానికి మనస్సాక్షి అంగీకరించలేదు. ఆ తర్వాత ప్రయత్నించినా ఫలితం శూన్యం.

తన అవసరాన్ని అడ్డుపెట్టుకుని అవకాశం కోసం వెతుకుతుంటే.. గంటలు గడుస్తున్నాయే తప్ప ఒక్క కేసు పట్టుబడడలేదు. టైం పదకొండయింది.

పోస్టాఫీస్ సెంటర్‌కి వచ్చాడు.

పెళ్ళైన నాలుగేళ్ల తర్వాత పుట్టిన కూతురుకి పుట్టినరోజు ఘనంగా చేయాలనుకోవటంలో భార్య తప్పులేదు. ఎదుగూ బొదుగూ లేని మధ్య తరగతి జీవితం. తన కిష్టమైన మిలిటరీ సి.డి.ఎస్. పరీక్షలకు సిన్సియర్‌గా అప్పియరయ్యాడు. కానీ ఫలితం దక్కలేదు. దొరికిన కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం నెట్టుకొస్తున్నాడు.

పోస్టాఫీస్ వైపు గుడి పూజారి చేతిలో పెద్ద కవరు పట్టుకుని వెళ్తున్నాడు.

“ఏయ్! పంతులూ! ఇలా రా!”

“లెటర్లు డబ్బాలో వేసి వస్తాను”

“ముందు రా!”

పూజారి వచ్చాడు. అతనికి నలభై ఏళ్ళుంటాయి.

“ఏంటా కవరు?”

“ఎవరో ఎవరికో రాసింది”

తీసుకుని చూశాడు మోహన్.

“ఇది నీ చేతికి ఎలా వచ్చింది?” గట్టిగా అడిగాడు.

పూజారి మొహంలో భయం కనిపించింది. అతని భయం కానిస్టేబుల్ మోహన్‌కి ధైర్యాన్నిచ్చింది. తన కూతురు పుట్టినరోజుకి కావలసిన డబ్బులో కొంతైనా పూజారి దగ్గర నుంచి గుంజాలనుకున్నాడు.

“ఈ లెటర్ నీ చేతికి ఎలా వచ్చింది?” గద్దించి అడిగాడు.

“……….”

“గొంతు చించుకుని అడుగుతున్నాను కదా! చెప్పు.”

“………..”

“నువ్వు ఇక్కడ చెప్పవులే కానీ స్టేషన్‌కి పద. అక్కడ నాలుగు తగిలిస్తే నిజం దానంతట అదే బయటకు వస్తుంది” అన్నాడు.

స్టేషన్ మాట వినగానే పూజారికి చెమటలు పట్టాయి. నా టైం బాగలేదివ్వాళ అనుకున్నాడు.

“నేను చెప్పేది సావధానంగా వినండి.”

“చెప్పు” అన్నాడు మోహన్ నిర్లక్ష్యంగా.

“గుడి పక్కన ఉన్న పోస్ట్ డబ్బాలో ఈ కార్డు వేద్దామని వెళ్లాను. కార్డు లోపలికి పడకపోవడంతో వంగి చూశాను. పోస్ట్ డబ్బా ద్వారంలో ఈ పెద్ద కవరు సగం బయటికి, సగం లోపలికి వేలాడుతోంది. దానిని తీసినా నా పోస్ట్ కార్డు లోపలికి వెళ్లడం లేదు. రెండూ కలిపి పోస్టాఫీస్ దగ్గరున్న పెద్ద డబ్బాలో వేద్దామని తీసుకొస్తున్నాను. అంతకుమించి నాకేం తెలియదు. నేను ఏ తప్పూ చేయలేదు.”

“అబద్ధం అతికేటట్టు చెప్పాలి”

“.. .. .”

“ఇంతకీ నీ పేరేంటి?”

“రామశర్మ”

“రామశర్మకి, రషీద్‌తో లింకేంటి? ఈ లెటర్ లో ఏం రాశావు?”

“భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ లెటర్ ఎవరిదో నాకు తెలియదు. నన్ను నమ్మండి”

“ఇదంతా స్టేషన్లో చెబుదువు గాని నడువు”

మోహన్‌ని అనుసరించాడు రామశర్మ.

తెలిసినవాళ్ళెవరైనా చూస్తే పరువు పోతుంది. అంతకు ముందే ఈ పోలీస్‌ని బ్రతిమాలితే.. అనుకుని..

“నేనే తప్పూ చేయలేదు. నన్ను నమ్మండి.” అభ్యర్థించాడు.

“స్టేషన్‌కి వచ్చి ఇన్‌స్పెక్టర్ దగ్గర ఇదే విషయం చెప్పు”

“తప్పు చేయలేదని చెప్తున్నాను కదా!”

“హెడ్ కానిస్టేబుల్ దగ్గర చెప్పి నీ మీద కేసు లేకుండా చెయొచ్చు. కానీ ఆయన డబ్బు మనిషి. చెయ్యి తడపకపోతే..” నసిగాడు మోహన్

“చెయ్యి తడపడం ఏమిటి?”

“అదే పంతులూ! లంచం”

“లంచమా?!?”

“ఇష్టమైతేనే ఇవ్వు. లేదంటే లాకప్పు, కేసు, కోర్టు” అన్నాడు.

రామశర్మ మౌనంగా నడుస్తున్నాడు.

“మాట్లాడవేంటి పంతులూ?”

“లంచానికి నేనెక్కడికెళ్ళాలి? నా దగ్గర అంత డబ్బు లేదు”

“తీవ్రవాదులు మారువేషాల్లో, ఊళ్ళలో తిరుగుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఎవరు? ఎక్కణ్ణుంచి వస్తున్నారో.. తెలియటంలేదు. స్టేషన్‌కి పద”.

త్రోవలో పంతుల్ని భయపెట్టాలని ఎంతో ప్రయత్నించాడు మోహన్.

అవేవీ పట్టించుకోకుండా మౌనంగా నడుస్తున్నాడు రామశర్మ.

ఇద్దరూ పోలీస్ స్టేషన్ సమీపానికి వచ్చారు.

“పంతులూ! కేసు లేకుండా చూసుకుంటాను. హెడ్‌కి ఎంతో కొంత ఇవ్వు”.

“ఎన్నో ఏళ్ల నుండి స్వామికి నిత్య కైంకర్యాలు చేస్తున్నాను. ఆయన్నే నమ్ముకున్నాను. నన్ను జైలుకు పంపాలనుకుంటున్నాడు కాబోలు. లోపల వేసిన వాడికి, బయటికి తీసుకురావడం తెలియదా?” అన్నాడు నిర్భయంగా.

“నువ్వేమీ అంబానీ, అదానీ కాదు. హెడ్‌కి చెప్పి, కేసు లేకుండా చేయిస్తా” అన్నాడు.

“అంత డబ్బుంటే పూజారిగా ఎందుకుంటాను?”

మోహన్‌కి కోపం వస్తోంది. ఇద్దరూ స్టేషన్ ముందుకు వచ్చారు. ఏ తప్పు చేయని రామశర్మను ఎలా కేసులో ఇరికించాలో తెలీలేదు. నిర్భయంగా నిలబడ్డ పూజారిని చూస్తుంటే.. ఇప్పుడు ఎలా వదిలించుకోవాలనే ఆలోచనలో పడ్డాడు మోహన్.

“పంతులూ! పనుంటే వెళ్ళు. నీ కేసు తర్వాత చూద్దాం” అన్నాడు.

“అదెలా!?! తేల్చుకోకుండా వెళ్తే, ఏ అర్ధరాత్రో వచ్చి అరెస్ట్ చేసి, ఊరూరూ తిప్పి, జైల్లో వేస్తే.. అప్పుడేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్లాలి? ఇక్కడైతే నాకు తెల్సినవాళ్ళు కొంతమందైనా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ దగ్గరికి వెళ్తే తేలిపోతుంది కదా!”

“నిన్ను వదిలేస్తున్నాను. వెళ్లిపో!” అన్నాడు.

అటుగా వెళ్తున్న ఓ పెద్దాయన ఆగి..

“ఏమైంది?” అన్నాడు.

“రేపు నా కూతురు పుట్టినరోజు. పూజలు, హోమం చేయించాలని పంతుల్ని అడుగుతున్నాను” అంతకని అబద్ధం చెప్పాడు మోహన్.

రామశర్మ అది విన్నాడు.

“ఓహో! ..ఇదా! సంగతి!?” అని పెద్దగా నవ్వాడు.

“పంతులూ! వెళ్ళమంటే వెళ్లకుండా, నిలబడి నవ్వుతున్నావేంటి?” అన్నాడు కోపంగా.

“పుట్టినరోజు, హోమం, పూజ ఇవన్నీ నిజమేనా?!” అన్నాడు నవ్వుతూ.

“అవన్నీ నీకనవసరం. ముందు వెళ్లిపో.. స్వామీ! నీకో దండం” అన్నాడు దణ్ణంపెట్టి.

“మీకు అసలేం కావాలో చెప్పండి.” అన్నాడు రామశర్మ.

“…….”

“పర్లేదు చెప్పండి” అన్నాడు.

“రేపు నా కూతురు పుట్టిన రోజు. కొత్తగా ఈ ఊరికి వచ్చాను. ఇక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు. హెడ్డుని అప్పు అడిగితే.. ఏదైనా కేసు బుక్ చేసి తీసుకురమ్మన్నాడు. అందుకే మిమ్మల్ని..” అన్నాడు తలొంచుకుని.

“పాప పేరేంటి?!”

“అతులిత”

“హనుమ పేరే.”

“నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది స్వామీ! ఇలా ఏనాడూ అలవాటు లేదు” అన్నాడు తలొంచుకుని.

“మంచివాళ్ళు తప్పు చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. దానికాయన సహకరించడు”

“నన్ను క్షమించండి!” అని మోహన్ వెళ్లబోతుంటే..

“ఆగండి” అని పంచముడిలో ఉన్న డబ్బు తీసి ఇవ్వబోయాడు.

“మిమ్మల్ని ఏకవచనంలో అమర్యాదగా మాట్లాడినందుకే సిగ్గుపడుతున్నాను. డబ్బులిచ్చి నన్నింకా..”.

“పర్లేదు.. తీసుకోండి”

“స్వామీ! ఇప్పటికే సిగ్గుతో చచ్చిపోతున్నాను. మీ ముందు నిలబడే అర్హత కూడా నాకు లేదు.” అన్నాడు చేతులు జోడించి.

“మీలో మానవత్వం ఇంకా ఉంది. మీరు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది. నాకు కాదు. మీ మనస్సాక్షికి.

రేపు మీ భార్యని, పాపని గుడికి తీసుకురండి. పాప పేర అర్చన, ఆకు పూజ చేయిస్తాను. దక్షిణ ఏమీ తీసుకోను” అని వెళ్తున్న రామశాస్త్రి కనుమరుగయ్యేదాకా చూశాడు మోహన్.

***

కొంతమంది పరిచయం, మాటలు జీవితంలో ఎంతో మార్పు తెస్తాయి. మోహన్ జీవితంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన మోహన్ జీవితాన్నే మార్చేసింది.

పోలీసు ఉద్యోగంలో ఇమడలేక బ్యాంకు పరీక్షలు రాశాడు. బ్యాంకు క్లర్క్‌గా సెలెక్ట్ అయ్యాడు మోహన్.

అప్పటినుంచీ.. ఏ ఊళ్ళో ఉన్నా.. కూతురి పుట్టిన రోజుకు తప్పనిసరిగా ఆ ఊరు వచ్చి, రామశర్మతో పూజ చేయించి ఆశీర్వాదం తీసుకోవటం ఆనవాయితీగా మారింది.

ఇప్పుడు మోహన్ ఉద్యోగ జీవితం మేనేజర్ స్థాయికి ఎదిగింది.

అతులిత చదువులో మంచి ర్యాంకులు సాధిస్తోంది.

***

ఆరోజు మోహన్ భార్య, కూతురుతో గుడికి వచ్చాడు. పూజ సామాగ్రితో పాటు ఒక కవర్ కూడా పెట్టాడు.

“ఏమిటిది?” అడిగాడు రామశర్మ.

“చూడండి. మీకే తెలుస్తుంది”

కవర్ తీసి చూసి ఆశ్చర్యంగా

“చదువుల తల్లీ! ఐ.ఏ.ఎస్. కి సెలెక్ట్ అయ్యావా? చాలా సంతోషం. అంతా నీ కృషి, ఆ పైవాడి కృప”

“దానికంటే ముందు ఆ రోజు మీరు మనస్ఫూర్తిగా విద్యా ప్రాప్తిరస్తు అని దీవించిన ఆశీర్వాద బలం” అన్నాడు మోహన్.

రామశర్మ కాళ్ళకు నమస్కరిస్తున్న అతులితను “దీర్ఘాయుష్మాన్ భవ, సకలకార్యసిద్ధిరస్తు” అంటున్న రామశర్మ కళ్ళలో ఆనంద బాష్పపు తడి.

“అసాధ్య సాధక స్వామిన్

అసాధ్యం తవకిం వద

రామదూత కృపాసింధో

మత్కార్యం సాధయ ప్రభో”

అంటూ గర్భగుడిలోకి వెళ్లి లెటరు స్వామి పాదాల దగ్గర ఉంచి ఆకు పూజ ప్రారంభించాడు తరతమ బేధం తెలియని రామశర్మ.

మహాయోగం

3

[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘మహాయోగం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap] ప్రాంతాల్లో తెలుగు చదవగలిగిన వాళ్ళంతా చదివే దినపత్రిక ‘మల్లెపూదండ.’ ఆ పత్రికలో టీవీ చానెళ్లలో దొరకని విరగ్గొట్టబడుతున్న (అదేనండీ, ఈనాటి తెంగ్లీష్‌లో బ్రేకింగ్ అంటారుకదా!) వార్తలు, బోలెడన్ని స్థానిక వార్తలు, మరికొన్ని చలనచిత్ర వార్తలు, నిజమో అబద్ధమో తెలియని తారల వ్యక్తిగత జీవితపు కబుర్లు, ఇంకా కక్షలు-కావేషాలు, మోసాలు-ద్రోహాలు- ఇలా అన్ని  వయసుల వారికీ కావలసిన మసాలా ఉండే విషయాలు అందులో పొందుపరచి, ఆ పత్రికలో ప్రచురింపబడేవి.

ఇక స్థానిక విషయాలకి వస్తే, వార్తలే వార్తలు! ఫలానా వాళ్లింట్లో మండ్రగబ్బ కనిపించిందనో, మరొకరింట్లో బ్రహ్మకమలం పూసిందనో, ఇంకొకరి టెర్రేస్ గార్డెన్ అందాలు చూపిస్తూనో, పేజీలు నిండిపోయేవి. వీటితోబాటు ఫలానా కాలనీలో చెత్త పేరుకుపోయిందని, మున్సిపల్ కార్పొరేషన్‌పై కారాలు-మిరియాలు నూరడం, వానకి కొట్టుకుపోయిన కార్ల పరిస్థితిని గురించిన నివేదిక, పిల్లల నుడికారం, మొదలైన ఎన్నో విశేషాలుండేవి.

వాటిలో ముఖ్యమైనవి మరణవార్తలు. మామూలు వాళ్లవాళ్లు పోయినా పత్రికలో వేసే స్తోమత ఉండదు. పాపం, కొంతమందైతే, అసలు అపరకర్మలకి డబ్బుంటే చాలునని కోరుకుంటారు. మరి వాళ్ళు వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇవ్వాలంటే హడలిపోతారు కదా! అందుకని, ఆ చుట్టుపక్కల అయిదారు జిల్లాల్లో, ధనికుల ఇళ్ళలో ఎవరు పోయినా, ఈ పత్రికలోనే ప్రకటన ఇచ్చేవారు.

ఆ ప్రకటనలు ఎంత ఆసక్తికరంగా ఉండేవంటే, చదువరులు వాటిని మళ్ళీ, మళ్ళీ చదివితేగాని వదిలేవారు కారు.  దానికి కారణం ‘మహాయోగం’ అనే సబ్ ఎడిటర్ భాషాప్రయోగ మహిమ అని ఆ చుట్టుపక్కల ఆరేడు జిల్లాల వారికి ముందరే తెలుసు.

ఆ పత్రికాఫీసులో మహాయోగం కీర్తిశేషుల కీర్తిని కీర్తించడంలో తనదైన నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు! ఒక ధనిక వృద్ధుడు చనిపోయినప్పుడు, ఆయన పిల్లలు ఆస్తి విషయంలో శవం ముందరే పేచీ పెట్టుకున్నారని ఊరంతా తెలిసినా, మహాయోగంతో చెప్పి, ఆయన గురించీ, తమ గురించీ గొప్పగా వ్రాయమని ఆ పిల్లలు కోరారు.

మరునాటి పత్రికలో పెద్దాయనకు అంజలి ఘటిస్తూ ఇలా ఉంది:

“మనిషి పుట్టినప్పుడు వట్టి చేత్తో వస్తాడు

పోయినప్పుడు చేతులను ఖాళీ చేసుకుని మరీ పోతాడు;

కానీ ఈయన తన వెనుక ఒక ఆత్మీయ కుటుంబాన్ని వదిలారు!

ప్రేమాభిమానాలతో అల్లిన కుటుంబాన్ని వదిలారు!”

పొగడ్త అనే అగడ్తలో పడని వాళ్ళెవరు? ఆ పిల్లలు, వాళ్ళ మధ్య ఐకమత్యం లేకపోయినా, ఏకహృదయంతో మహాయోగం ఫాన్స్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడు ఆ ఊరొచ్చినా, మరిచిపోకుండా మహాయోగానికి మాంఛి గిఫ్టులు తెస్తూ ఉండేవారు. అతని గురించి మంచిమాటలు చెప్తూ ఉండేవారు. అతని భార్య, ఇప్పుడు రకరకాల చీరెలూ, నగలూ వేసుకుని తిరగడం సర్వసాధారణం అయిపోయింది.

కులాల పేరిట జనాలని విడదీసిన వాణ్ణి ‘ప్రజానాయకుడ’నీ, ఐకమత్యం కోసం పాటుపడేవాడనీ కొనియాడాడు. పేద రైతులకి అవసరానికి అప్పిచ్చి, వాళ్ళ దగ్గరినుండి పెద్ద మొత్తంలో వడ్డీని వసూలు చేసే వ్యాపారిది ‘ఆపన్నహస్తమ’న్నాడు. ఒక డబ్బున్న నేరస్థుడు పోతే, అతణ్ణి ‘పేదల పెన్నిధి’ అని కొనియాడాడు.

కొన్నేళ్ళకి అతని ప్రఖ్యాతి నలుదిశలా వ్యాపించి, అతనికి కొన్ని దినపత్రికల నుండి ఉద్యోగపుటవకాశాలు తెచ్చిపెట్టింది. మనవాడు వాటిని అడ్డుగా పెట్టుకుని, సంపాదకుణ్ణి బెదిరించి, తన జీతం పెంచే ఏర్పాటు చేసుకున్నాడు.

అలాంటిది, ఒకానొకరోజునుండీ ఆఫీసుకి చెప్పా-పెట్టకుండా రావడం మానేశాడు. తన సహచరులు కనుక్కుంటే, రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి, భార్యాసమేతంగా ఊరు విడిచిపెట్టి, వెళ్ళిపోయాడని తెలిసింది.

***

మహాయోగం ఊరు విడిచిపెట్టిన మరుసటి రోజు..

రైలు వేగంగా కదులుతూ తన గమ్యం వైపు నడుస్తోంది. అంతా అగమ్యగోచరంగా ఉంది మహాయోగానికి. ఆ ముందురోజు జరిగిన విషయాలు గుర్తుకొచ్చాయి అతనికి.

***

తనకి తలనొప్పిగా ఉంది గనుక, త్వరగా ఇంటికి బయల్దేరిన మహాయోగం దారిలో ఒక సందు దాటుతుండగా ఒక దృశ్యాన్ని చూశాడు. అప్పుడే ఒక శవం ఊరే,గి దాటిపోయింది. కొంతమంది బిచ్చగాళ్ళు కింద పడ్డ డబ్బులను ఆబగా ఏరుకుంటున్నారు. బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టు, ఈ దృశ్యాన్ని చూసిన మహాయోగానికి కూడా అలాగే అయ్యింది. ఎటొచ్చీ, తానొక హై క్లాస్ బిచ్చగాడు – అదే తేడా.

అంతే! వచ్చే దారిలోనే కర్తవ్యం ఆలోచించి, భార్యని ఒప్పించి, ఆ పాడు సొమ్ముతో ఆమె కొనుకున్న నగలు, చీరెలు వగైరా దగ్గరలో ఉన్న మురికివాడ వాళ్ళకి ఇప్పించాడు. ఆమె ముందు ససేమిరా అన్నా, తరువాత అర్థం చేసుకుని, అంగీకరించింది. నిజానికి, ఈ సిరి పొందిన తరువాత ఆమె అనుకున్నంత సంతోషం పొందని మాట వాస్తవమే! తనకు సంతోషం ఇవ్వని సిరిని ఇచ్చేసి, సాంత్వన పొందింది.

మహాయోగం, రైల్వే స్టేషన్‌కి వెళ్ళాక, మొదట వచ్చిన రైలుకి రెండు టికెట్లు తీసుకుని భార్యతో సహా ఎక్కేశాడు.

***

ప్రజలకి మేలు చేయడం ద్వారా సార్థక నామధేయుడవాలని కోరుకుని, ఏ సామాజిక వర్గంతోనూ సంబంధం లేకుండా, ఏ ఊరు వెళ్ళి, పేదలకి ఏ విధంగా సహాయపడాలో ప్రణాళికలు వేస్తూ, భార్యతో చర్చిస్తూ, రైల్లా, రైల్లో ముందుకు దూసుకుపోయారు మహాయోగం, అతని మనసూనూ!

ఆమెకు తప్పలేదు.. అయినా తప్పూ లేదు!

0

[శ్రీ పైడిముక్కల వెంకటేశ్వరరావు రచించిన ‘ఆమెకు తప్పలేదు.. అయినా తప్పూ లేదు!’ అనే కథని అందిస్తున్నాము.]

[dropcap]“అ[/dropcap]మ్మా! కానిస్టేబులమ్మా.. నా పేరు సెంద్రమ్మ తల్లీ.. మాది కొత్తగూడెం.”

“అయితే ఏంటి?” టేబుల్ పై కాళ్ళు పెట్టుకుని తీరిగ్గా ప్రశ్నించింది, లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మి.

“కాదమ్మా.. మా వూరు కొత్తగూడెం.. నా పేరు..”

“ఊఁ.. ఇందాక చెప్పావ్‌గా.. నాకేమన్నా చెవుడనుకున్నావా? వచ్చిన పనేంటో చెప్పు.”

చంద్రమ్మ చీర కొంగుతో నుదుటి మీద చెమట తుడుచుకుంది.

“కాదమ్మా.. నా మొగుడు మంచోడు కాడు. రోజూ తాగొచ్చి నన్ను కొడతాడు. అడ్డొచ్చి న పిల్లల్నీ కొడతండాడు. ‘ఇదేటి ఇలా చేత్తన్నావ్’ అని అడిగే దిక్కు కూడా లేదు.”

“ఓహో! మీ మొగుడూ పెళ్ళాల సరసమా?” కానిస్టేబుల్ వరలక్ష్మి తన జోక్‌కి తనే కాసేపు నవ్వుకుంది.

చంద్రమ్మ తరువాత ఏం చెప్పాలో తెలవక మ్రాన్పడి నిలుచుండి పోయింది.

వరలక్ష్మి టేబుల్ మీద కాళ్ళు క్రిందకు తీసి కుడికాలి బూటుతో సిమెంట్ గచ్చు నేలని తన్ని “ఊఁ.. తర్వాత!” అని అడిగింది.

అప్పటికే సగం ఆశ చచ్చిన చంద్రమ్మ “ఏముందమ్మా.. నన్నూ, పిల్లల్ని కొట్టడమే కాకుండా ఇంట్లో ఉండే సామానంతా తాగుడికి అమ్మేత్తన్నాడు. నేను కూలికి బోయి తెచ్చే ఆ నాలుగు రాళ్ళు మాకు మిగల్చట్లేదు. రెండు రోజుల కాడ నుంచీ పిల్లలిద్దరూ.. నేనూ.. పత్తేనమ్మా!” అంది.

“అయితే.. ఏం చెయ్యమంటావ్? మీ ఇంటికొచ్చి నన్ను వంట చేసి పెట్టమంటావా?” వరలక్ష్మి జోక్‌కి అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధప్ప అనే కానిస్టేబుల్ కూడా వరలక్ష్మి నవ్వుతో శృతి కలిపాడు.

చంద్రమ్మకిక మాట పెగల్లేదు.

“ఇదిగో చూడు, పోలీసులు ఖాళీగా స్టేషన్లో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారని అనుకుంటున్నావేమో.. మాకు నెత్తి మీద సవాలక్ష పనులు.. సవాలక్ష కేసులు.. మీ మొగుడూ పెళ్ళాల గిల్లికజ్జాలు, ముద్దుమురిపాలు మా మీద రుద్దకండి.. అసలే ఈ రోజు మండలానికి మంత్రి గారొస్తున్నారు. వెళ్ళెళ్ళు.. మాకు బోలెడు పనులున్నాయ్.”

చంద్రమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. వెంటనే పాదాలు కూడా వెనక్కు తిరిగాయ్.

***

“అయ్యా! హెడ్డు కానిస్టేబుల్ గారూ.. దిక్కులేనిదాన్ని కరుణిచ్చండి.”

“ఆఁ.. ఆఁ.. కరుణిస్తాలే గానీ, ఏంటి విషయం?” అడిగాడు హెడ్ కానిస్టేబుల్ సింహచలం.

“నా పేరు సెంద్రమ్మండి.. మాది కొత్తగూడెం. ఇంతకు ముందు ఓ పాలి ఇక్కడికొచ్చానండి.”

“ఏ ఎదవ పని చేసి..” అన్నాడు హెడ్ సింహాచలం.

“ఏమీ చేసి కాదండి! నా మొగుడు గురించి చెప్పుకుందుకు. అప్పుడు కానిస్టేబులమ్మ ఉన్నారండి. సెప్పిందంతా ఇని మీ మొగుడూ పెళ్ళాల సొద ఇనేదేంటి ఫో.. అన్నారండి.”

“ఓహో! ఆవిడ విన్లేదని.. వెర్రిబాగులోడిని నేనైతే వింటానని నాకు చెప్పటానికి వచ్చావా?”

చంద్రమ్మ చెంపలేసుకుంది.

సింహాచలం సిగరెట్టు వెలిగించుకుని రెండు దమ్ములు లాగి “ఊఁ.. చెప్పు! పోలీసులున్నది అందుకే.. ఎవరేం చెప్పినా వినేందుకు.. ఊఁ చెప్పు” అన్నాడు.

‘చెప్పాలా! మానాలా?’ అని సందేహపడుతూనే కాస్సేపటికి నెమ్మదిగా నోరు తెరిచింది చంద్రమ్మ.

“రెండు రోజుల కితమండీ! నా మొగుడు ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడండి. పిల్లల్నీ, నన్నూ ఇల్లొదిలి పొమ్మంటున్నాడండి. ఏడకు పోతామండి? రెండు రోజుల్నించీ గుడిసే బయటే పిల్లలూ, నేనూ వండుకు తింఉన్నామండి. ఆ ఈగల్లో, దోమల్లో అట్టనే పడుకుంటున్నామండి. ‘నాయం చెయ్యండయ్యా!’ అని ఊళ్ళో అందరి దగ్గరికీ బోయినా, ఎవరూ పట్టిచ్చుకోవట్లే.. బళ్ళో మేష్టారు గారు ‘దాని మీదా, నీ మొగడి మీదా కేసు పెట్టొచ్చు. ఎల్లి పెట్టు’ అన్నారయ్యా! అందుకే ఇలా వచ్చానయ్యా ! మొన్న కానిస్టేబులమ్మ గారు పట్టిచ్చుకోలేదు. మీరైనా కాసింత కనికరించి ఆడికి భయం సెప్పండయ్యా! ఇల్లు వదిలి పోకపోతే నన్నూ, పిల్లల్నీ కూడా సంపేత్తా నంటున్నాడయ్యా! నా సయితి ఆడికి బాగా పురెక్కిత్తాంది. మీరే ఎట్టాగైనా నాయం సేయండయ్యా!”

“అంత ఏడిపించుకు తినేవాడితో కాపురం చేయకపోతే మీ పుట్టింటికి పోరాదా!” అని తీరుబడిగా ఉపాయం చెప్పాడు సింహచలం.

“ఎక్కడ పుట్టిల్లు బాబూ.. ఎప్పుడో పాడడ్డాది. అమ్మా, అయ్యా పోయాక తమ్ముడు మరదలితో ఎక్కడికో ఉత్తర దేశం పోయాడు. ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో తెలవదు. ఆడున్నా బతికిపోదుమేమో!..” కళ్ళనీళ్ళు ఒత్తుకుంది చంద్రమ్మ.

“సర్లే ఇదొకటా.. ఇదిగో నీ పేరు చంద్రమ్మన్నావ్ కదూ!”

“ఆయ్.. సెంద్రమ్మే బాబుగారు.”

“ఊఁ, ఇలాంటి గొడవలకి పోలీసులేం జేస్తారు చెప్పు. మేం వచ్చి నాలుగు దెబ్బలేస్తే మాత్రం.. తాగుబోతు చచ్చినోడు.. వాడిలో మార్పేమొస్తది. మారతాడా! చస్తాడా? నాలుగు రోజులాగితే వాడి మోజు తీరిపోద్ది – నా పెళ్ళాం, నా పిల్లలంటూ మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడు. అప్పటిదాకా ఊళ్ళో ఎవరో ఒకళ్ళని బతిమాలుకుని వాళ్ళ పంచన పడుండండి. అసలే చాలా దూరం నుండి వచ్చావ్. తొందరగా బయలుదేరు. పొద్దుపోతోంది.” అనేసి హెడ్డు, “సిద్ధప్పా.. ఏడప్పా.. ఇవ్వాళ పార్టీ ఏదో అన్నావ్.. ఏదప్పా!” అంటూ లోపలికి నడిచాడు హెడ్ కానిస్టేబుల్ సింహాచలం.

***

రేగిపోయిన జుట్టు, దుమ్ముకొట్టుకుపోయిన ఒళ్ళు, అక్కడక్కడా చిరుగులు పడి మాసిపోయున్న చీరా జాకెట్టు.. దాదాపు పూనకం వచ్చినదానిలా పోలీసు స్టేషన్లోనికి జొరబడి తూలిపడబోయి వణుకుతా నిల్చుంది చంద్రమ్మ ఎస్.ఐ. ప్రతాప్ ముందు. ఆ సమయానికి అక్కడే ఉన్నారు లేడీ కానిస్టేబుల్ వరలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సింహాచలం.

“వచ్చావా?” అంది వరలక్ష్మి

“ఇదొకటి మనకు రెగ్యులర్ కస్టమర్” అన్నాడు సింహచలం, వరలక్ష్మి వైపుకి చూస్తూ.

“ఏంటి విషయం?” చంద్రమ్మను చూస్తూ హెడ్డునడిగాడు ఎస్.ఐ. ప్రతాప్.

“ఏముంది సార్! మన పోలీసులు ఏ కేసులూ, గొడవలూ లేకుండా ఖాళీగా ఉన్నామని ఈవిడ గారు కేసులు పట్టుకొస్తా వుంటదండీ మన కోసం.”

సింహాచలానికి కొనసాగింపుగా “అవునండీ సార్ అవును. ఈవిడ గారూ, ఈమె భర్త గారూ దెబ్బలాడుకున్న ప్రతిసారీ ఆ చిలిపి తగాదా పట్టుకుని కేసు పెట్టడానికి వస్తదండి. మనం చాలా ఖాళీగా ఈమె కేసులు కొసమే పోలీన్ స్టేషన్ నడపుతున్నట్టు” అని గొల్లున నవ్వింది వరలక్ష్మి. హెడ్డు, ఎస్.ఐ. ప్రతాప్ బిగ్గరగా వంత కలిపారు వరలక్ష్మీతో.

నవ్వు నుండి తేరుకున్నాక “ఏమ్మా! ఏం కేసు తీసుకొచ్చావ్. ముఖ్యమంత్రి గారు జిల్లా కొస్తున్నారు. నువ్వేదో రెగ్యులర్ కస్టమర్‌వి అంటున్నారు మనోళ్ళు. పోన్లే సి.యమ్. గారితో మాట్లాడి ఎల్లుండి నుండి ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాల్లో నీ విషయం చర్చకు పెడదాం” అన్నాడు ఎస్.ఐ. ప్రతాప్ వెటకారంగా. మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరూ నవ్వుకున్నారు.

వాళ్ళు నవ్వడం పూర్తి అయ్యేవరకు అయోమయంగా చూసి నోరు విప్పింది చంద్రమ్మ, శరీరమంతా సన్నగా వణికి పోతుంటే.

“నేను.. నాను.. నా మొగుడ్ని.. నా మొగుడ్ని సంపేసా బాబు” అంది.

అదిరి పడ్డాయి ఖాకీ డ్రస్సులు. ఎస్.ఐ. ప్రతాప్ ఐతే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.

“ఏంటి? నీ మొగుడ్ని చంపేశావా!” కాస్త ముందుగా తేరుకుని కీచుగొంతుతో అడిగాడు ఎస్.ఐ ప్రతాప్.

పోలీసుల కంగారుజూసి, నెమ్మదిగా శరీరం వణుకు తగ్గి, మరెందుకో ధైర్యం కలిగి నెమ్మదిగా జరిగింది చెప్పడం మొదలు పెట్టుంది చంద్రమ్మ.

“అవును బాబూ.. నా మొగుడ్ని సంపేసా. పదేను సంవత్సరాల నుండి ఆడి చెర పడతన్నా. ఎప్పటికైనా మారకపోతాడా! అని ఎదురు సూశా. కాని ఏం నాభం? నా కూలి డబ్బులన్నీ పట్టుకెల్లి పిల్లలు పత్తులతో మాడిపోతన్నా పట్టిచ్చుకోకండా తాగేటోడు. మన కర్మలింతేలే అని సరిపెట్టుకుని కల్లో, గంజో తాగి బతుకీడ్చేటోళ్ళం. ఈ మద్దెన ఆడి యవ్వారం మరీ ముదిరిపోయింది. దాన్నెవతెనో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పిల్లల్నీ, నన్నూ ఇల్లొదిలి పొమ్మన్నాడు. అయిునా ఇంటినే పట్టుకుని ఏలాడుతున్నామని మా ముగ్గురినే పట్టుకుని ఆ శని ముండతో కలిసి సావగొట్టాడు. ఇల్లు అమ్మేసుకుని ఆడు, అదీ గలిసి ఏడకో పోతారంట – పోతే పోనీయ్ అనుకున్నా. కాని నా పెద్ద కూతుర్ని కూడా ఆళ్ళతో పాటు తీసుకెళ్తారంట. ‘వయసొచ్చింది. దానికి మంచి మంచి బేరాలొత్తాయ’ని ఆ శని ముండ నా మొగుడితో సెప్తుంటే ఇన్నా. అప్పటి నుండీ నా రక్తం మరిగి పోవడం మొదలెట్టింది. ‘ఎల్లడానికి ఏర్పాట్లు నేసుకొత్తా’ అని ఆ ముండ ఏడకో బోయింది. మొన్నా, నిన్నా నన్ను సావసితక కొట్టి, మా పెద్ద పిల్లని ఆళ్ళ ఎనకాల ఎల్లేలా ఒప్పిచ్చాడు. పిల్ల ఒప్పుకుందన్న సంతోసమో ఏమో.. రాతిరి తప్ప తాగొచ్చి మగతగా నిదరోయాడు. ఆళ్ళిద్దరూ నా కూతుర్ని ఏం చేస్తారో అన్న భయంతో నాకు నిదరట్టింది లేదు. నా పిల్లలిద్దరి కోసమే నేను బతుకుతున్నా. అళ్ళే లేకపోతే నాకింక బతుకేటి? ఎప్పుడా కడుపు నిండా తిండెడ్డని ఎదవకు నా బిడ్డల మీద అధికారమేటి? కడుపున పుట్టిన బిడ్డని లేకుండా ఆ ముండతో కలిసి బేరాలు పెడతాకి సూత్తాడా? నా కడుపు రగిలిపోయింది. ఆడు బతికుంటే నా బిడ్డలు నాకు దక్కరనిపిచ్చింది. మంచి నిద్దట్లో ఉన్నాడు. దగ్గరే రోకలి కనపడ్డాది. ఆడ్ని సంపైనా నా బిడ్డని కాపాడుకోవాలనుకున్నా. నా పుట్టింటి నుండి తెచ్చుకున్నానది. ఆడి దయవల్ల ఎప్పుడూ ఏమీ దంచుకున్ని వండుకుని తిని ఎరగం దానితో.. అదిగో.. దాన్ని పట్టుకొన్నా. కసిదీరా తల మీదా బాదాను సాలా సేపు. నిద్దట్లోనే గిలగిలా కొట్టుకు సచ్చాడు. ఆడ చచ్చి తర్వాత గానీ నాకు తెల్వలేదు, ‘నా పిల్లలు అనాదలై పోతన్నారని’. అందుకే పరుగు పరుగున ఎల్లి మేస్టారి గారి కాళ్ళ మీద పడ్డా, చేసిన పని చెప్పి ‘నా బిడ్డల్ని కాపాడమ’ని. నీ బిడ్డల కేం భయంలేదు. నువ్వొచ్చే వరకు ఆళ్ళ బాధ్యత నాది అన్నాడు మగానుభావుడు. ‘నువ్ సేసిన పని తప్పు. ఎల్లి పోలీసులకి లొంగిపో’ అని సెప్తే.. ఇలా వచ్చాను బాబు! నన్ను ఏం చేస్తారో మీ ఇష్టం. మీ పోలీసులికి చాలా పనులుంటాయని, గొడవలుంటాయని ఇంతకు ముందు ఈ అమ్మా.. అయ్యా… సెప్పారు బాబు. అందుకే మీకు ఖాళీ ఉండి నా కోసం వత్తారో రారో అని నేనే మా వూరు నుంచి నడిసొచ్చాను బాబు – రాతిరి నుండి పచ్చి గంగైనా ముట్టలేదు. కాసిని తాగడానికి నీళ్ళిప్పిచ్చండి బాబూ!” అంటూనే చంద్రమ్మ కళ్ళు తిరిగి అక్కడే కూలబడిపోయింది.

శకునం

0

[శ్రీపార్థి గారు రాసిన ‘శకునం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]ర్త పోయిన తరువాత అనసూయమ్మకు దేవుడి మీద భక్తి, నమ్మకాల మీద ఆరాటం బాగా పెరిగిపోయాయి. ఎంతగా అంటే, బయటికి వెళ్లాలంటే గంటల పంచాంగం చూడాల్సిందే, బల్లి మీద పడితే బంగారు బల్లిని ముట్టుకునేదాకా ప్రాణ భయమే, పిల్లి ఎదురయితే ఇక అంతే.

దానికి కారణం లేకపోలేదు, ఆమె భర్త అకాల మరణం చెందటమే, ఓ రోజు అత్యవసర పని నిమిత్తం ఆందోళనతో బయటికి వెళ్తున్న ఆమె భర్తకు ఇంటి గుమ్మంలో నల్ల పిల్లి ఎదురయింది. అదేమీ పట్టించుకోకుండా ఆయన వెళ్తుంటే

“నల్ల పిల్లి యేదురయింది, అపశకునం. ఈ వేళ మీరు బయటికెళ్లొద్దు” అంటూ అనసూయమ్మ అడ్డుపడింది

“అది పాల కోసం వచ్చినట్టుంది. ఇన్ని పోసి అక్కడ పెట్టు, తాగేసి అదే పోతుంది” అంటూ ఆయన వడివడిగా బయటకు వెళ్లిపోయాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ ఇల్లు చేరకుండానే ఆయన మరణవార్త ఆమె చెవిలో పడింది. పిల్లి ఎదురు రావడం వల్లే ఆయన పోయాడనే నమ్మకాన్ని ఆమె స్థిరం చేసుకుంది. గుండెపోటుతో ఆయన పోయాడని డాక్టర్లు నిర్థారించినా, అవేమీ ఆమె చెవికెక్కలేదు. వయసుతో పాటు నమ్మకాలు కాస్తా మూఢనమ్మకాలు అయి కూర్చున్నాయి. ఇక అప్పటి నుండి ఆమె అనుమానాలన్ని పెను భూతాలు అయ్యాయి.

అనసూయమ్మ నోరు పెద్దదే గాని మనసు మంచిదే. నోరు పెద్దది చేస్తే మాత్రం ఎవరూ ఆ చుట్టుపక్కల ఉండటానికి దడుస్తారు. అలాంటి అనసూయమ్మకు నల్ల పిల్లితో కష్టాలు మొదలయ్యాయి.

***

ఓరోజున మంత్రోచ్చారణ చేస్తూ తులసి చెట్టుకు పూజ చేసి నీళ్లు పోస్తున్న అనసూయమ్మకు ఏదో అలికిడైనట్టుగా వుంటే పక్కకు తిరిగి చూసింది. అంతే ఆమె గుండె గుభేల్‌మంది.

“ఇంకేముంది నా కొంపంతా అపవిత్రం అయింది. రండిరో ఎక్కడ చచ్చారే అంతా” పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టింది.

దీంతో ఇంట్లోవున్న అనసూయమ్మ మనవడు ఇరవై యేళ్ల బండబాబు, అనసూయమ్మ కూతురు సరళ, ఆమె చెల్లెలు సీతమ్మ ఒక్కసారిగా బయట వసారాలోకొచ్చారు.

“చూసారా, మా ఆయనను చంపిన మొద్దు నల్ల పిల్లి ఆ గేటు కన్నంలోంచి మళ్లీ ఇంట్లో కొచ్చింది. దాన్ని చూస్తేనే మహాపాతకం, అది ఇంట్లోకి వచ్చిందంటే మళ్లీ ఎవరికో మూడిందన్నమాటే. ఇహ నా వల్ల గాదు శుభ్రం చేసుకున్నది అంతా మంటగలిసిపోయింది” గగ్గోలు పెట్టడం ప్రారంభించింది.

“ఓరే బండసచ్చినోడ, చూస్తూ అల నిలబడ్డావే, ఆ పిల్లి కాళ్లు విరగ్గొట్టి బయటికి పంపిచేయి”

“ఈ రోజు పండగని నిన్నటి నుండి కాళ్లు చేతులు పోయేలా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను” గట్టిగట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది,

“నువ్వుండవే అమ్మమ్మ” అంటూ పిల్లి వెనకాల పడ్డాడు ఆమె మనవడు బండబాబు.

అది అరుస్తూ గుండ్రంగా అక్కడే తిరుగుతుంది. ఇట్లా కాదని కర్రొకటి పట్టుకొని దాని మీదకు వెళ్లాడు బండబాబు, అది బెదిరిపోయి, ఒక పక్కగా నిలబడి చూస్తూన్న అనసూయమ్మ మీదకి లంఘించుకుంది. ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని ఆమె ఒక్కసారిగా కింద కూలబడిపోయింది. ఈ గందరగోళంలో ఆ మొద్దు పిల్లి అనసూయమ్మను రాసుకుంటూ ఆమె మీద నుండి వెళ్లింది. ఈ పరిణామానికి అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. సందెట్లో సడేమియా అనుకొని ఆ పిల్లి తీసి వున్న గేటులోంచి బయటకు పరుగులు తీసింది.

ఇప్పుడు ఈ ముసల్దాని పరిస్థితి ఏంటా అనుకుంటూ చేతిలో వున్న కర్రకు కాలు చుట్టలా చుట్టి కొయ్యలా నిలబడిపోయాడు బండబాబు.

ఇక అనసూయమ్మ పెద్ద పెద్దగా శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. ఆ శోకాలతోనే సబ్బుతో, పిండితో, ఆవు పంచకంతో, గంగాజలంతో స్నానాలు చేసి ఇల్లంతా శుద్ది చేసుకొని తులసి చెట్టుకు పూజ చేసినాక గాని ఆమె మనసు స్థిమితపడలేదు. అయినా మనసులో ఇంకా ఏదో శంక పీకుతూనే వుంది.

***

“ఓరే బండబాబు, అసలే ఈ రోజు పండగ. నాకు ఒంటి పూట భోజనం, పొద్దుటి నుండి పచ్చి గంగ కూడా ముట్టుకోలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఈ పిల్లి రొదతో ఇంత కాలం అయింది. మేమంతా గుడికి వెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. మళ్లీ ఆ మొద్దు పిల్లి ఇంట్లోకి రాకుండా కాపలా కాయి. ఆ గేటుకు ఏ తాడో వైరో కట్టు”

మనవడికి అన్ని జాగ్రత్తలు చెప్పి అనసూయమ్మ కూతురు చెల్లెలితో కలిసి గుడికి వెల్లింది.

***

“ఇదిగో బండబాబు అనసూయమ్మగారు అరటిపళ్ళు ఇమ్మన్నారు”

చేతిలో పళ్ళ కవరుతో లోపలికొచ్చాడు బండబాబు వయసున్న పక్కింటి డుమ్మెడు. ఈ డుమ్మెడు ఉత్త భయస్థుడు, వట్టి అమాయకుడు.

“ఇదిగో డుమ్మె, మొద్దు పిల్లి ఒకటి రోజు ఇంట్లోకొచ్చి ఇబ్బందిపెడుతోంది. అది లోపలికి వస్తే చెప్పు, పట్టుకొని దూరంగా వదిలేద్దాం” అంటూ పళ్ళ కవరు తీసుకుని తాడు కోసం లోపలికెళ్లాడు బండబాబు.

“అలాగే” అంటూ డుమ్మెడు అక్కడే చిన్న సిమెంటు గద్దె మీద కూచున్నాడు.

చేతిలో తాడుతో బండబాబు బయటికొస్తుండగా కనబడిందా దృశ్యం. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తోక పైకి లేపి గేటు కన్నంలోంచి వయ్యారంగా లోపలికొస్తోంది నల్ల పిల్లి. అది చూసిన బండబాబుకు చిర్రెత్తుకొచ్చింది. మళ్లీ పిల్లి లోపలికొచ్చిందని అమ్మమ్మకు తెలిస్తే ఇక అంతే, అనుకొని దాన్ని పట్టుకోవడానికి తయారయ్యాడు.

“ఒరే డుమ్మె, ఆ గేటు దగ్గర వుండు పిల్లి బయటికి వెళ్లకుండా, అది లోపలికెళ్లకుండా ఇటు నేను తరుముతాను”

ఇద్దరు చెరోవేపు తరుముతున్నారు. వున్న పళంగా ఈ అటాకింగ్ ఊహించని పిల్లి బెదిరిపోయి అక్కడే గుండ్రంగ తిరుగుతూ బయటికి వెళ్లడానికి ప్రయత్నించిది. బండబాబుకు అమ్మమ్మ ఎప్పుడు ఇంటికొస్తుందోనని టెన్షన్ పెరిగిపోయింది.

ఈ లోపు అది బండబాబు కాళ్ల సందులో నుండి ఇంట్లో ఓ గదిలోకి దూరింది, ఇదే అదనుగా అది బయటకు రాకుండా డుమ్మెడిని కాపలాగా వుంచి ఒక్క ఉదుటున వెళ్లి గోనేసంచి ఒకటి తీసుకొచ్చాడు బండబాబు. గదిలో ఓ మూల నక్కి కూర్చున్న దానిపై గోనే సంచి వేసి దాన్ని ఒడిసి పట్టుకున్నాడు. జాగ్రత్తగా దాన్ని ఓ బుట్టలో పెట్టి ఇంటికి తాళం వేస్తుండగా..

అపసోపాలు పడుతూ, ఆయాసపడుతూ అనసూయమ్మ గుడి నుండి ఇల్లు చేరింది కూతురు, చెల్లెలితో కలిసి

“ఈ దరిధ్రం మళ్లీ ఇల్లు చేరింది, దీన్ని వదిలించుకుంటే గాని నాకు మనశ్శాంతి వుండదు. ఒరే నాయనా, మళ్లీ ఈ చుట్టు పక్కల కనపడకుండ దీన్ని ఎక్కడైనా దూరంగా వదిలేసి రండి. మీకు పుణ్యం ఉంటుంది” కాళ్లు కడుక్కుంటు అంది

దాన్ని దూరంగా వదిలేయడానికి తీసుకెళ్లారు బండబాబు, డుమ్మెడు.

***

ఉపవాసాలు, ఒక్కపొద్దులతో షుగరు, బీపీ పెరిగిపోయి కళ్లు తిరిగి నిలుచున్న చోటనే డామ్మని పడిపోయింది అనసూయమ్మ ఓ రోజు. ఇంట్లో వాళ్లు కంగారుపడి ఆమెకు సపరిచర్యలు చేసి కొంచెం స్థిమితపడ్డాక ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్దామని కుర్చిలో కూర్చోబెట్టి బయటకు తీసుకొస్తుండగా..

స్వాగతం-సుస్వాగతం అని పలుకుతున్నట్టుగా ఠీవిగా నడుచుకుంటూ వస్తున్న నల్ల పిల్లి గేటు దగ్గర ఆమెకు ఎదురయింది. అంతే ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి.

“అమ్మ నాయనో, శకునం బాగులేదురో, ఇంకేముంది నల్ల పిల్లి మళ్ళీ దాపురించింది, మా ఆయనలాగే ఇది నన్ను మింగేసేటట్టుంది, ఈ శని నన్ను వదిలేలా లేదురో, నేను ఆస్పత్రికి రాను బాబో” అంటూ పెద్ద పెద్దగా శోకాలు పెట్టడం మొదలుపెట్టింది. దీంతో వున్నది కాస్తా మరింత పెరిగింది బీపీ.

“మ్యావ్ మ్యావ్” అంటూ గోడ మీదకు చేరి అనసూయమ్మను చూస్తూ అక్కడే కూచుంది నల్ల పిల్లి.

అనసూయమ్మను ఉన్న పళంగా ఆస్పత్రికి పట్టుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు.

***

ఆస్పత్రిలో చేరిన నాటి నుండి నల్ల పిల్లి ఆలోచనలే ఆమెను ముసిరాయి. అంతకు ముందు తన మీద నుండి దూకి వెళ్లడం, ఇప్పడు ఎదుర్రావడం ఆమెను తీవ్రంగా భయపెట్టసాగింది. రాత్రి కలల్లోను అది వదల్లేదు. దానివల్ల తనకు కీడు జరుగుతుందని ఆమె నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. దాని ప్రాయశ్చిత్తం కోసం పూజలకు పునస్కారాలకు ఆస్పత్రిలో తావు లేకుండా పోయింది. దాంతో తను మళ్లీ ఇల్లు చేరుతానన్న నమ్మకం ఆమెకు పూర్తిగా అడుగంటిపోయింది.

“అయ్యా! డాక్టరు బాబు, ఇక్కడ నాకు దిన దిన గండం నూరేళ్ల ఆయుషులాగా వుంది. ఇప్పటికి ఆస్పత్రిలో చేరి వారం అయింది. నన్ను తొందరగా పంపిద్దురు, ఇక్కడ ఉండలేక పోతున్నాను” అంది రెండు చేతులతో దండం పెడుతూ వేడుకోలుగా

“ఇక మీ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడింది. మీరు ఈరోజే మీ ఇంటికి వెళ్లొచ్చు” అన్నాడు డాక్టరు.

“ప్రాణం నిలుస్తుందంటారా!”

“మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నిక్షేపంగా ఇంటికెళ్లొచ్చు,”

***

నల్ల పిల్లి గురించి ఆలోచిస్తూనే ఆమె ఇల్లు చేరింది. గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది అనసూయమ్మ, నోట్లో ఎలుకను కరుచుకొని ఎదురుగా గద్దె మీద కూచుని వుంది నల్ల పిల్లి.

దాన్ని చూసిన మరుక్షణం ఆమెకు గుండె ఆగినంతపనయింది. అలా దాన్ని చూస్తూనే ఇంట్లోకి వెళ్లింది.

కొద్ది సేపటికి అనసూయమ్మ గొంతు గట్టిగా వినపడింది గేటుదాకా

“ఒరే! బండబాబు ఆ పిల్లికి ఇన్ని పాలు పొయ్యి.”

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-13

0

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

170.
కం:
గురువర్యుడు శుక్రుండును
వరతపమును జేసి రిపుని వంచెడు విధమున్
సరసిజగర్భుని కరుణను
దొరకొనుమని యానతిచ్చె ధృతమతి నైతిన్

171.
తే.గీ.:
మద్దిచెట్టును వేరును పట్టి నరుక
వృక్షమంతయు నిర్జీవమైన భంగి
విష్ణు జంపిన సురరాజు వెలుగు బాయు
సకల దానవ లోకంబు సుఖము నొందు

172.
వచనము:
“మహాపరాక్రమశీలురైన మీరు, విజృంభించి, లోకముల మీద పడి, శిష్ట శిక్షణంబు సేయుడు. యజ్ఞయాగాదుల ధ్వంసము గావించుడు. మునీశ్వరుల వధి౦పుడు. మునిపత్నుల చెరబట్టుడు. బ్రాహ్మణులను గోవులను హత్య గావింపుడు. వేదపఠనము జరుగుచోట, ఆ వేదములను పఠించువారిని తగులబెట్టుడు” అని దానవేశ్వరుండగు హిరణ్యకశివుండు ఆనతి నివ్వ

173.
శా.:
దైత్యుల్ జృంభిత క్రోధ ద్వేషమదముల్ ధర్మాతి రిక్తంబులై
అత్యాచారము చేయసాగిరి; మునుల్ అత్యంత నిష్ఠాత్ములై
నిత్యాగ్నుల్ జ్వలియించు యాగములపై, నిర్దోషులౌ వారిపై
కృత్యాకృత్యము వీడి పీడనములన్ క్రుంగంగ సర్వుల్ కడున్

174.
కం.:
పురములు బల్లెల గాల్చిరి
వరవృక్షము లెల్ల నఱకి ప్రజల గృహములన్
కొరవులతో ముట్టించిరి
సురవైరులు దీక్షబూని, శోకానలమున్

175.
చం.:
విడిచె తిలోదకంబులను ప్రేమయు దుఃఖము తోడ, తమ్ముకున్
గడచిన నాటి సంగతులు గ్రమ్మగ సోదరపుత్రయుక్తుడై
నడిపెను సాంత్వానాన్విత మనస్కుల జేయుచు వారి నెంతయున్
‘విడుడిక దుఃఖమున్’ యనుచు పెద్దను తండ్రిని మీకటంచు తాన్

176.
చం:
శకునిని, భూతసంతపుని, శంబరు, ధార్ష్ణిని, కాలనాభునిన్
వృకుని, మధోత్కచున్, సుతులమాతను, దుఃఖము దేర జేసె తాన్
సకల సురారి నాథుడు, విశాల మనంబున, స్వీయ మాతనున్
చరిత సమస్తలోక ఘన శౌర్యుని మృత్యువు దుఃఖహేతువే?

177.
కం.
అని రిపు మార్కొని మడిసెను
తన మరణము వీరవరుల దగు యని, దానిన్
కొనియాడ దగును, దుఃఖము
గన నేటికి యనుచు వారి గని యోదార్చెన్

178.
వచనము:
ఈ విధంబున మరదలు వృషద్ధానువును ఆమె పుత్రులను, తన తల్లి దితిని, జ్ఞాన సంపన్నుండైన హిరణ్యకశిపుడు, మృత్యుతత్త్వము నెఱింగించి వారల శోకము బాపెను.

179.
సీ.:
చలి వణకుచు వచ్చి చలిమంట చుట్టును
మూగును ప్రాణులు ముదము తోడ
మంట తగ్గిన తరి మరులుదురటునిటు
జూడ జీవితమును గూడ నిటులె
ఆత్మ నిత్యంబు జీవుండ శాశ్వతుండు
వివిధమైనట్టి మేనుల వెల్గుచుండు
పరమాత్మ తత్త్వంబు ప్రకటంబు గాదిటు
మాయను గ్రమ్మిన ఛాయయగుట
తే.గీ.:
జనని! ప్రవహించు జలమున వనతరువులు
తాము చలియించు నట్టివి ధమది తోచు
చిన్ని కుర్రలు గిరగిర చేరి తిరుగ
భూమియును దిర్గు భ్రాంతిని పొందునటుల

180.
వచనము:
అని, దానవ ప్రభువు, ఉపాధి ధర్మంబుల నుపహితమైన దృష్టాంతముల ద్వారా వారికి వివరించినాడు.

181.
కం:
మరదల! యమునికి మరియును
మరణించినవాని పుత్రు బంధువులకు, నే
జరిగిన సంవాదము, మీ
కెరిగించెద వినుడు మీరు నెంతయు శ్రద్ధన్

సుయజ్ఞుని వృత్తాంతము

182.
చం.:
సమసె సుయజ్ఞుడన్ నృపుడు సంగరమందున శత్రురాజు తోన్
కుములుచు పత్నులున్ సుతులు క్రుంగిన దేహము జూచి రచ్చటన్
అమరిన భూషలున్ కవచమవ్విధి ఛిన్నముగాగ, రక్తముల్
కమలిన మేన చారికలు గట్టగ, మేదిని కూలి యుండగన్

183.
తే.గీ.:
భర్త శవమున బడి ఏడ్చి పత్నులపుడు
తండ్రి నిర్జీవ దేహంబు తనయులచట
మరణ నిశ్చల గాత్రంబు బాంధవులును
కనుచు విలపించుచుండిరి మనము కరుగ

184.
కం.:
రాజును దహనము చేయగ
నిజభార్యలు సమ్మతింప నేరక నడలన్
రాజీవహితుడు కిరణపు
రాజిని తగ్గించి పశ్చిమాద్రిని జేరెన్

185.
వచనము:
ఇది యంతయు తన దివ్యదృష్టితో తెలుసుకున్న పరేతవిభుండు, సమవర్తి, యమధర్మరాజు ఒక బాలుని వేషములో వారి దగ్గరకు వచ్చి, ఇట్లు చెప్పదొడంగెను.

186.
తే.గీ.:
ప్రకృతి ధర్మంబు మరణంబు, రాలు జనుల
చూచుచును మోహపాశాన స్రుక్కువారు
మనుట, మరణించుటయు గూడ మాయ యనెడు
నిత్యసత్యంబు దెలియక మెలగువారు

187.
ఉ.:
ధన్యులు మానవుల్, చనగ తల్లియు దండ్రియు, క్రుంగరెంతయున్
అన్యులు చావ, శోకమది ఆవపుగింజయు రాదు, ఎందరో
గణ్యులు కీర్తిశేషులయి కల్సిరి కాలపుగర్భమందు, ఏ
పుణ్యము జేసినన్ మరణమున్ కనకుండగ బోరు తప్పకన్

188.
తే.గీ.:
ఇంటి యజమాని గృహమున ఎంత యేని
ప్రేమ వసియించినను దాని వీడిపోవు
తనువు సైతము నట్టులే తథ్యముగను
శాశ్వతంబుగ నిలువదు చాల తడవు

189.
సీ.:
దారువు లందుండు దావాగ్ని ఎవ్విధి
మండుచు వేరుగా బ్రకటమగును
మానవ దేహన వ్యాపించు వాయువు
నాసికాదుల వేర నాట్యమాడు
విశ్వమంతయు నిండి వెలుగు యాకాశంబు
వస్తు ధర్మమునెట్లు వదలి యుండు
ఇంద్రియ వ్యాపార మేర్పడు జీవుండు
కాదు శ్రోతయు వక్త, కాదు నెవడు
తే.గీ.:
కర్మబంధము దేహాల కారణంబు
నేను దేహము నను భ్రాంతి నిన్ను విడువ
మాయ తొలగును భ్రాంతియు వదలిపోవు
వస్తు దృశ్యాది సకలము వట్టి మిథ్య

190.
వచనము:
“కావున, ఓ సాధ్వీమణులారా! మీ మృత్యువును మీరు తెలుసుకొనక పతి మరణించెనని బాధపడుచున్నారు. మీరు శత సంవత్సరములు రోదించినను మీ పతిని మరల పొందజాలరు” అని, బాలుని రూపమున యున్న నరకాధిపుడు, సుయజ్ఞుని పత్నులకు తెలిపి అంతర్హితుడయ్యెను. రాణులు, నితర బంధువులు, మరణ తత్త్వమును గ్రహించిన వారై, శోకము నధిగమించి రాజుకు దహన సంస్కారములు జరిపించిరి.

191.
మ.కో.:
పుత్రుడవ్విధి పుత్రశోకము పూని దూరము జేయగా
చిత్రమైనవి చావు పుట్టుక, చేర వీడగ శక్యమే
శత్రు భీకరుడైన పుత్రుడు శౌర్యగౌరవ మొప్పగా
ధాత్రి వీడెనటంచు మాతయు దార దుఃఖము బాయగన్

~

లఘువ్యాఖ్య:

పద్యం 171లో హిరణ్యకశిపుడు, విష్ణువును చంపితే, దేవతలందరూ నిర్జీవులవుతారు అంటూ ఉన్నాడు. అక్కడ ఒక చక్కని ‘ఉపమ’ ఉంది, ‘మద్దిచెట్టు వేరును నరికితే, చెట్టంతా చచ్చినట్లు’. 172 వచనం. తన రాక్షస సైనికులు ఏ విధంగా ప్రపంచం మీద పడి అత్యాచారాలు చేయాలో దిశానిర్దేశం చేస్తున్నాడు. పద్యాలు 173, 174లో వారు సాగించిన దమనకాండ వర్ణింపబడింది. పద్యాలు 175, 176లో తన తల్లిని, సోదరుని భార్యను, ఓదార్చాడు రాక్షసపతి. తన తమ్ముడు వీరమరణం పొందాడని, దానిని చూసి గర్వపడాలని చెప్పాడు. వచనం 178 లో అతని మరదలు పేరు తెలుస్తుంది. (వృషద్ధానువు). అతడు జ్ఞాన సంపన్నుడని, మృత్యుతత్త్వము తెలిసినవాడని తెలుస్తుంది. పద్యం 179 లో ఆత్మ నిత్యమని, శరీరం అశాశ్వతమని చెబుతాడు. చలి మంట చుట్టూ మూగిన జనులు మంట తగ్గిన తర్వాత వెళ్లిపోయినట్లు, అందరూ ఈ లోకాన్ని వీడవలసిందే. జీవితం ఒక భ్రాంతి. పారే నీళ్లలో ప్రతిఫలించే చెట్లు అవి కూడా కదిలినట్లు కనపడతాయి. చిన్నపిల్లలు గిరగిర తిరుగుతూ భూమే తిరిగినట్లు భావిస్తారు (179). హిరణ్యుని జననమరణ వివేకం గొప్పది.

181 నుంచి 191 వరకు హిరణ్యకశిపుడు తన తల్లికి, మరదలికి ఆమె పిల్లలకు సుయజ్ఞుని వృత్తాంతమును వివరిస్తాడు. సుయజ్ఞుడు అనే రాజు యుద్ధంలో మరణిస్తే, అతని రక్త బంధువులు ఎంతో దుఃఖిస్తుంటారు, అతనికి అంత్యక్రియలు చేయకుండా. అప్పుడు మరణానికి అధిష్ఠానదేవత అయిన యమధర్మరాజు ఒక బాలుని వేషములో వచ్చి, వారికి చావు పుట్టుకలలోని రహస్యాలను వివరించి, వారి దుఃఖాన్ని తొలగించి, రాజుకు అంత్యక్రియలు జరిగేలా చూస్తాడు. 186లో ‘మనుట, మరణించుటయు గూడ మాయ’, ‘ప్రకృతి ధర్మంబు మరణంబు’ అంటాడు. ఆప్తులు చనిపోతే తాత్కాలిక దుఃఖమేగాని, తర్వాత మరచిపోవడం మానవుల అదృష్టం అంటాడు యముడు. ‘Grief is brief’ అన్నారు అందుకే. 189లో దేహాలకు కారణం కర్మ బంధమేనని, దానికి దృష్టాంతాలను శరీరానికి, జీవానికి గల తేడాలను కవి చక్కగా వర్ణించారు.

(సశేషం)

అనువాద మధు బిందువులు-3

0

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]


హృదయం ఒక మహాసముద్రం

~
[dropcap]హృ[/dropcap]దయం ఎంతో లోతైన ఒక మహాసముద్రం
అంతరంగాల్లో ఏ రహస్యాలు దాగివుంటాయో ఎవరికెరుక!
తుఫానులు చెలరేగుతుంటే ఓడల గుంపులు
నీటిమీద ప్రయాణిస్తుంటాయి
సరంగులు తెడ్లు వేస్తుంటారు
పృదయాంతరాల్లో బిగువైన గుడారాల వంటి
పద్నాలుగు భూక్షేత్రాలుంటాయి
ఆత్మ సంబంధమైన చేతనకు మాత్రమే
ఆ దివ్య రహస్యాలను తెలుస్తాయి

పంజాబీ మూలం: సుల్తాన్ బహు
ఆంగ్లానువాదం: తసీర్ గుజ్రాల్, సకూన్ సింగ్
తెలుగు సేత: ఎలనాగ

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-32

0

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]


~
311.
ఉయ్యల నూపు వాడతడె; గిల్లువాడతడె; మరల
నుయ్యల నూపి నూరడించి పరుండబెట్టు వాడతడె,
అయ్యారే! లోని తత్త్వమిది, వికట రసికుడెయగు విధాత
అయితిమి బలి, వాడి వికటింపు వర్తనమునకు – మంకుతిమ్మ!

312.
సంధింపవో కాల కారణ కరణ కార్యములవి
ఇందు జేసిన కర్మ లెక్క లిందే ముగియింపక
ముందు జన్మల నవ్వాటిని గొనిపోవగనేల? కర్మశేషముల
బంధించు చున్నాడీ విధి నిన్ను – మంకుతిమ్మ!

313.
లెక్క వేయుటలో నిపుణుడు కాడనిపించు విధాత; మానుండి
దక్కించుకొనుటకు జన్మాంతరములు వేచియుండడ?
దక్కించుకొనగరాదె యన్నియు నిప్పుడే, ఈ జన్మలోనె
దక్కించుకొననని యనునె యంతకుండు – మంకుతిమ్మ!

314.
కర్మఋణశేషములవి మిగిలి బీజములై
మరుజన్మలో నవి మానులై వెలయకున్న
పరబ్రహ్మ యుద్యానవనమది శాశ్వతమెట్లగు?
అరయ సృష్టి మర్మమిది – మంకుతిమ్మ!

315
ధనము నార్జింప ఛలము, దంభముగ మెరయ నిచ్చయు
ఘన గేహంబును గట్టు గోర్కెయు, సుఖసంసారపు నాశయ
వేన వేలవి యున్నవి కోర్కెల వెంపరలాటలు
ఎనలేని బలము నిచ్చుచున్న వివియే జగానికి – మంకుతిమ్మ!

316.
తనదంతటదేదీ లేదని దిర్దిరిగి తానె తూలి పోవు
తన బలంబుడిగిన తరి బొంగరము వాలిపోవు
తనదు బలము సన్నగిల్లిన తరి నరుడును ధర కొరిగిపోవు
యునికి యస్థిరము నరునకీ జగాన – మంకుతిమ్మ!

317.
పాప పుణ్యముల మిశ్రమ మీ నరుడు; నెలసిన నేలయు
లోపలి భావంబులును గొనుపోవునాతని పుణ్యపాపంబుల కడకున్,
పాపపుణ్యములవి నలుపు తెలుపులు – విమర్శింపగా రాదే
నెపంబున నైన నెవరినైన – మంకుతిమ్మ!

318.
విదూషకుడీ విధాత, పరిహాసమాడు వికటంబుగ మన తోడ
వదనమా గాంభీర్యము; నవ్వించు చక్కిలిగిలి వెట్టి,
మృదువుగ నుపచరించు, త్రాగించు మిరియాల కషాయము
ఇదియె వాడి లోకపాలనా రీతి – మంకుతిమ్మ!

319.
పంచభూతములట, పంచేద్రియములట!
పంచమమే యేల? చతుష్ట, షట్కంబులు కాగూడదే!
పొంచియున్నాడు విభుడు, ఏమున్నదో వాడి తంతు
వంచితులే కద మనమందరము – మంకుతిమ్మ!

320.
ఐదో, లేక ఇరవై యైదో, ఈ మూలభూతముల సంఖ్య!
ఏదైననూ, వాటి గుణము లేవైనను చేయునదేమున్నది
అదైనను అరకొఱగా తెలిసిన, పూర్తి తెలిసినటులౌనె?
ఆ ధాత పరతత్త్వము దెలియ సులభ సాధ్యమె – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

ఇల్లు సీక్వెల్ పోయెమ్ – వంటింట్లో ఆమె కథల పుస్తకం!

1

[శ్రీమతి గీతాంజలి రచించిన ‘ఇల్లు సీక్వెల్ పోయెమ్ – వంటింట్లో ఆమె కథల పుస్తకం!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఇం[/dropcap]ట్లో ఒక జాగాని సృష్టించుకుని..
ఆమె కథనో కవితో రాయడం మొదలెడుతుందా..
రెండో కప్పు చాయ్ అని అరుస్తాడతడు.
కథ వేలు విరుగుతుంది.
ఆమె మళ్ళీ కూర్చుంటుంది.
నాలుగు వాక్యాలు రాస్తుందో లేదో..
టిఫిన్ ఏంటో ఈ పూట.. గాల్లో తేలుతూ అతగాడి ఆరా!
బ్రేక్‌ఫాస్ట్ కోసం.. రాస్తున్న కథలో
పాత్రల్ని కొంచెం ఆగండని బ్రతిమిలాడుకొని.. బ్రేక్ అవుతుంది.
ఇక ఆమె కథ ఇడ్లి.. దోశ.. లేదా అతడు తాగే రాగి జావ అవుతుంది
ఆమె కలం జావ కారిపోతుంది.
కాగితం.. కలం విసుక్కుంటాయి.
సరే.. ఇకనైనా అనుకుంటూ ఆమె కలం పడుతుందా..
ఖాళీ లంచ్ కంచం వంటింటి
అలమర దిగి దొర్లుకుంటూ
ఆమె ముందుకొచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టు
అని ఇంటి మగాడిలా రంకెలేస్తుంది.
పుస్తకం జాలిగా ఇంకేం రాస్తావూ వంటింట్లోకి పో.. పొమ్మంటుంది!
సాయంత్రపు అతిథుల కోసం చాయ్ కప్పులు, ఫలహారపు ప్లేట్లు
ఆమె చుట్టూ గింగిరాలు తిరుగుతూనే ఉంటాయి.
లివింగ్ రూమ్ అతని క్రికెట్ కేరింతలతో..
కిచెన్ రూమ్ ఆమె పుస్తకం, కలంతో చేసే
రహస్య దుఃఖ సంభాషణతో..
కొత్త భాషొకటి ఆవిష్కరించబడుతుంది.
ఆమె రాతల పుస్తకం, కలం ఆమె మీద అలిగి,
నోటికి సీలు బిగించుకొని ముడుచుక్కూర్చుంటాయి.
ఆమె కథలో స్రీ పాత్రలు..
ముందు నువ్వు విముక్తి చెందు
అంటూ ఆమెని వెక్కిరిస్తూ ఉంటాయి.
***
రాత్రి డిన్నర్‌కి డైనింగ్ హాల్..
హారర్ సంగీతాన్ని మౌనంగా మెరిపిస్తుంది.
ఆమె మండే గుండెని, కన్నీరించే కళ్లను
పసుపు కారాలంటిన చీర కొంగు దయగా తుడుస్తుంది.
***
రోజంతా వాళ్ల దేహాల్లోని
అన్నపు సంచీలను నింపుతూనే ఉంటుందా..
ఆమె ఖాళీ కాగితాలు మాత్రం అక్షర భిక్ష
వేయమని దీనంగా జోలె చాస్తాయి.
మూసిన కలం లోపల రాయని అక్షరాలు
ఊపిరాడక గిలగిల్లడుతుంటాయి.
టిఫినూ.. లంచ్, డిన్నర్ల అరుపుల మధ్య
ఆమె తన కవితా వాక్యాలనే మర్చిపోతుంది!
ఇక కాగితాలు, కలమూ విసిగిపోయి
ఎగురుతూ వంటింటి పొయ్యరుగు మీదకి
ఎక్కి కూర్చుంటాయి
ఇక ఇక్కడే కథలు రాసుకో అని ఆదేశిస్తాయి!
పోపుల డబ్బా పక్కనే కథల పుస్తకం దీనంగా కూర్చుంటుంది.
***
ఇక ఆమె రాతలకి మిగుల్చుకున్న
రాత్రుళ్ళని కూడా ఇంటి అవసరాలు దోచుకుంటాయి.
రాత్రుళ్ళు అందరూ నిదురపోయాక
ఇన్ని మిణుగురుల్ని ముందేసుకుని
నిదుర కన్నులతో రాసుకుంటుంది.
చంద్రుడు.. పొద్దున్నే లేవాలిక నిద్రపో అని కసురుతాడు.
సూర్యుడు.. ఇంటి ఇల్లాలివి ఆలస్యంగా లేస్తే ఊరుకోను
అని మగ గొంతేసుకుని హుంకరిస్తాడు .
సూర్య చంద్రుల మధ్య మిగిలిన
ఆ కొద్ది చీకటి వెలుగుల కాలాన్ని కాస్తా మొగుడు మింగేస్తాడు!
రాయాల్సిన కథలతో వేడెక్కిన ఆమె మెదడు చిట్లి
ఇంటినిండా ఎగిరే అక్షరాల్ని
అందుకుని ఆమె దాచుకుంటూ ఉంటుంది!
***
ఇక రోజులు.. నెలలు.. సంవత్సరాలు
అతని వంటిల్లు.. ఆమె కథలు రాసే వేళ్ళను విరిచి..
దేహాన్ని వంటింటి బర్నర్ మీద కాలుస్తూ ఉంటుంది.
అక్షరాలు అందని ఆమె కథల పుస్తకం
కాగితాలతో రెపరెపలాడుతూ తల బాదుకుంటుంది.
దుఃఖాన్ని ఆపుకోలేక ఆమె కలాన్ని విరిచి పడేస్తుంది చాలాసార్లు!
కలం మొండిది.. మళ్ళీ మొలిచి ఆమె వేళ్ళ మధ్య అతుక్కుంటుంది.
కలాన్ని, వంటింటిని వదుల్చుకోలేక
ఆమె మండి పోతూ ఉంటుందా..
మరోపక్క ప్రపంచ సాహిత్యాన్ని తీరిగ్గా చదువుతున్న
మగ కళ్ళ ఇంటి యజమాని మాత్రం
ఇల్లంతా బార్బిక్యూడ్ చికెన్ సువాసన
అనుకుని శ్వాస ఎగబీలుస్తూ పరవశిస్తూ ఉండడాన్ని
ఆమె కథల పుస్తకం చూస్తూనే ఉంటుంది.
కలం రాస్తూనే ఉంటుంది.
ఆమె నుంచి కలాన్ని, కాలాన్ని దోచుకున్న అతను
వేదిక మీద సమానత్వపు రంకెలతో ఊగిపోతూ ఉంటాడు.
ఆ రచయిత్రిల్లాలు.,
ఏం చేస్తుందిక?
కుకింగ్ రేంజ్‌నే.. రైటింగ్ టేబుల్‌గా మార్చి..
దివా రాత్రుళ్లలో
రహస్యంగా తోడుకొని దాచుకున్న క్షణాలలోనే..
తన రాయలేనితనాన్నే కవిత్వంగా రాస్తూ
జెండాని ఎగరేస్తూనే ఉంటుంది!

సంచికలో 25 సప్తపదులు-28

0

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
భాగ్యం
సౌభాగ్యం
అనుకున్నట్లు జరగక, ప్రతికూలత ఎదురైతే అభాగ్యం

వి నాగమణి
హైదరాబాద్

2
కాయం
న్యాయం
రాముని ధర్మమార్గానికి పశుపక్ష్యాదులూ చేసాయి‌ సాయం..!!

శ్రీమతి భారతీ కృష్ణ
హైదరాబాద్

3
కలుపు
గెలుపు
నడమంత్రపు సిరితో మిడిసిపాటు, అది బలుపు.

పూడిపెద్ది వెంకట సుధారమణ
విశాఖపట్నం

4
కర్మయోగం
జ్ఞానయోగం
ముక్తి సముపార్జనకై నిత్యకర్మగా ఆచరించదగు సంయోగం!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

5
వేటగాడు
వేషగాడు
అనుభవమనేది సాలెగూడైతే, అనుభూతి ఒక నేతగాడు

శ్రీవాణి
తెనాలి

6
సెగలు
వగలు
పంపకంలో తేడా రూపాయైనా అన్నదమ్ముల పగలు!!

జీ యన్ వీ సత్యనారాయణ
హైదరాబాదు

7
నాడి
మేడి
దేనికైనా ఉండాలి సరి అయిన జోడి.

రాజేశ్వరి కుప్పిలి
విజయనగరం

8
నావి
నీవి
జీవితాన పంచుకున్నట్టి వెలకట్టలేని ప్రతిక్షణమూ మావి!

నరహరి రావు బాపురం
అనంతపురము

9
దాతృత్వము
మిత్రత్వము
కోపాలు జగడాలతో పెట్టుకోకు అందరితో శతృత్వము

ఉదండ్రావు రమణబాబు
నరసన్నపేట

10
శ్రామికుడు
ప్రేమికుడు
దేశంరక్షణ కోసం అహోరాత్రులు శ్రమించేవాడే సైనికుడు

హైమ. కందుకూరి
హైదరాబాద్

11
హోత్రము,
సూత్రము,
పురుషుని జీవితానికొక అర్థాన్ని చేకూరుస్తుంది కళత్రము

దినవహి సత్యవతి
గుంటూరు

12
సమానత్వం
మానవత్వం
అంతరాలులేని తత్వం పెంచును విశ్వమానవ సౌభ్రాతృత్వం..!!

ములగ రాధా కృష్ణ
బొబ్బిలి.

13
రేపు
మాపు
విదేశాలనుంచి పిల్లల రాకకై తల్లిదండ్రుల ఎదురుచూపు

అర్చన కోవూరు
హైదరాబాద్

14
మాన్యులు
సామాన్యులు
నిరంతరం పరుల సేవలో బతికేవారు ధన్యులు

ఆలేటి పరంజ్యోతి
ఖమ్మం

15
కోతలు
మేతలు
వినుతికెక్కిన నేతలు విషపు నవ్వుల పూతలు

కె. చెంచలరావు,
ఒంగోలు

16
వనవాసి
ఆదివాసి
అమాయకత్వం నిర్భయత్వం ప్రేమతో అడవికి సహవాసి

కపిలవాయి అశోక్ బాబు
నాగర్ కర్నూల్

17
పెట్టు
కట్టు
గడప దాటి బయటకు పోనీయకు గుట్టు

సింగీతం విజయలక్ష్మి
చెన్నై

18
అరవడం!
కరవడం!!
జీవితంలో చేసే తప్పు ధర్మాన్ని మరవడం!!!

మన్నవ సుధాకర్
కృష్ణలంక, విజయవాడ

19
పాతకాలు
అహేతుకాలు
ఆపేదెవరు ఆగేదెపుడు ప్రేమ పేరుతో ఘాతుకాలు.

మురళి ఎఱ్రాప్రగడ
పలివెల.

20
విషయము
వినయము
వ్యతిరేక భావాలయినా మెత్తగా వెలిబుచ్చటం నయము

డా.పి.వి.రామ కుమార్
హైదరాబాద్

21
పేరు
ఊరు
ఎంత సంపాదించినా మారకూడదు మనిషి తీరు

ఎస్.గిరిజశివకుమారి
గుంటూరు

22
కలం
హలం
సంకల్పానికి సహనం తోడైతేనే సిద్ధిస్తాయి సకలం!

పట్నాయకుని రామకృష్ణారావు
కంచరపాలెం, విశాఖపట్నం.

23
రాక
పోక
వచ్చేది పోయేది ఎవరికెరుక తగ్గించుకో కాక
(కాక = కోపము)

YLNV ప్రసాద్ రావు,
విఆయనగరం

24
నడవడి
విడివడి
బంధాలకు దూరమవుతారు మంచి నడత కొరవడి

ఇలపావులూరి రాజ్యలక్ష్మి
హైదరాబాద్

25
విషాదం
నిషాదం
కర్మ, జ్ఞాన, యోగముల సమన్వయం గీత, కృష్ణ మోదం!

వీరేశ్వర రావు మూల
అమలాపురం

~

(మళ్ళీ కలుద్దాం)