back to top
Home Blog Page 6

రచయిత మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

0

[‘శివస్య కులం’ అనే పుస్తకాన్ని రచించిన శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారూ.

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్: నమస్కారం.

~

ప్రశ్న 1. మీకు ఇలాంటి పుస్తకం రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: నేను నిత్య విద్యార్థిని, ఒక యాదృచ్ఛికమైన రచయితను. గతంలో కాస్ట్ గురించి తెలుసుకుందామని అనేక పుస్తకాలు చదివాను, 19-20వ శతాబ్దాలలో వ్రాయబడిన అనేక గ్రంథాలలో హిందూ కాస్ట్ గురించి ఇచ్చిన వివరణలు అసంబద్ధంగా, సగం సమాచారంతో కూడి విపరీతమైన అయోమయంతో నిండి ఉన్నాయి. ఎక్కువ శాతం గ్రంథాలలో కాస్ట్ వివరణ పాశ్చాత్య సిద్ధాంతాలు, సమాజం ఆధారంగా చేయబడ్డది. కాస్ట్ ముసుగులో హిందూ సమాజ దూషణ కనిపించింది. అదే విధంగా జాతుల మధ్య భేదాలకు కారణాలు కూడా సరిగ్గా వివరించబడలేదు. మన శాస్త్రాలు చెబుతున్నదొకటైతే, వారు చెబుతున్నది మరొకటి. ఈ అయోమయాన్ని ఉపయోగించుకుని, అనేకులు సమాజంలో చిచ్చు రగల్చడానికి నిత్యమూ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దృష్టికోణంలో జాతుల మధ్య నెలకొన్న ఆచారభేదాల గురించి, వాటి వెనుకాల ఉన్న ఉపాసనాభేదాల గురించి సమాజానికి చెప్పడం ద్వారా వ్యవస్థలో నెలకొన్న అయోమయాన్ని కొద్దిగానైనా తొలగించవచ్చనిపించడంతో దీని గురించి వ్రాయడం మొదలుపెట్టాను. నాకు ఆంగ్లంలో పుస్తకాన్ని వ్రాసే ఉద్దేశం లేదు, ఈ అంశాలపై ఆంగ్లంలో వ్యాసాలను రాయాలనిపించింది. అలా వ్రాసిన వ్యాసాలను శ్రీమతి సహనాసింగ్ గారికి పంపాను, ఆమె సూచనలతో ఆ వ్యాసాలను పొడిగించాల్సి వచ్చింది. చివరకు ఆవిడ ఈ పుస్తకం బాగుంది, దీన్ని ఎడిట్ చేయించు అని సలహా ఇచ్చారు. ఆవిడ ఆ మాట అనడంతో, అమ్మవారే ఆవిడ రూపంలో పుస్తకం రాయి అన్నట్లు చెప్పిందనిపించడంతో ఈ పుస్తకం తయారయింది.

ప్రశ్న 2: ఈ ఆలోచన వచ్చిన తరువాత మీరు ఈ పుస్తకానికి సంబంధించిన పరిశోధన ఎలా చేశారు?

జ: గతంలో శ్రీ పి. రంగారెడ్డి గారితో కలిసి ‘కుహనామేధో నియంతలు’ అనే పుస్తకాన్ని వ్రాసాను. ఆ సమయంలో దక్షిణాది జాతుల గురించి బ్రిటిష్ వారు వ్రాసిన గ్రంథాలను చదివాను. అప్పుడు కొన్ని జాతుల ఉపాసనలను బ్రిటిష్ వారు వర్ణించిన తీరు చూసి, వారికి ఆయా జాతుల ఉపాసనలపై లోతైన అవగాహన పాశ్చాత్యులకు లేదని అర్థమయింది. పైగా ఎక్కువగా ఈ జాతులు శక్తిని, భైరవుడిని ఉపాసించేవని బ్రిటిష్ గ్రంథాలు సూచించాయి. దాంతో ఆ ఉపాసనలను వివరించిన గ్రంథాలను వెదకడం మొదలుపెట్టాను. అలా తాంత్రిక గ్రంథాల గురించి, వాటి సిద్ధాంతాల గురించి పరిశోధన సాగింది. వీటికి చెందిన కొన్ని గ్రంథాలను, వ్యాసాలను వెదికి సంపాదించాను, దీనికి కొందరు మిత్రులు కూడా సహాయపడ్డారు. అలా పరిశోధన సాగింది.

ప్రశ్న 3: పుస్తక రచన ప్రణాళిక ఎలా వేసుకున్నారు? ఎంత కాలం పట్టింది మీకు ఈ పుస్తకం రాయటానికి?

జ: ఈ సబ్జెక్టు ను నేను 2017 నుంచి పరిశోధిస్తున్నాను. 2018లో వ్రాసిన ‘కుహనామేధో నియంతలు’ అనే పుస్తకానికి కొనసాగింపే ఈ పుస్తకం. తెలుగులో ప్రస్తుతం వ్రాస్తున్న పుస్తకమే అసలు పుస్తకం, ఆంగ్లంలో 2022లో అచ్చయిన పుస్తకం, దేశీయ దృష్టికోణాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయడం కోసం అప్రయత్నంగా వ్రాయబడింది. తెలుగులో ప్రస్తుతం వ్రాస్తున్న పుస్తకం ఆంగ్ల పుస్తకం కన్నా మరింత లోతైనది, విస్తారమైనది. తెలుగు పుస్తకంలో మొత్తం 15 అధ్యయాలు, ఒక్కో అధ్యాయం ఒక్కో పుస్తకం. ఇవన్నీ అచ్చులోకి రావడానికి మరొక సంవత్సరం పట్టవచ్చు.

ప్రశ్న 4: ఈ పుస్తక రచనలో మీ లక్ష్యం ఏమిటి? పుస్తక రచన ద్వారా ఆ లక్ష్యం నెరవేరిందనుకుంటున్నారా?

జ: తెల్లవారు మనకన్నా గొప్పవారు, తెలివైనవారు, తెల్లవారి సంస్కృతి మనకన్నా గొప్పది అని హిందువులు మూర్ఖంగా నమ్మడం వలన స్వదేశీ విజ్ఞానం, దృష్టికోణం పట్ల ప్రస్తుతం తీవ్రమైన వివక్షాభావం, అపనమ్మకం, అయోమయం నెలకొని ఉంది. ఇంతేకాదు, సామ్రాజ్యవాదులు పాలించే సమయంలో జరిగిన దుష్ప్రచారం, నిరుత్సాహపరిచే చర్యలు స్వాతంత్రానంతరం కూడా కొనసాగడం వలన అనేక జాతులు తమతమ సంప్రదాయాలకు, ఆచారాలకు దూరమవడంతో, ధార్మిక పరంపరకు దూరమైన వారిలో తమ ఉనికిపై అయోమయం నెలకొంది, ఇది ఇతర మతాలకు ఆయా జాతులను మతం మార్చడానికి వరంగా మారింది. ఈ అయోమయం ధార్మిక వ్యతిరేక శక్తుల ప్రోద్బలంతో సృష్టించబడిందని చరిత్ర సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలను పొందుతున్న స్వదేశీ దృష్టికోణాన్ని వెలుగులోకి తేవడం ద్వారా జాతులలో సృష్టించబడిన అయోమయాన్ని, వారి మధ్య సృష్టించబడిన అపనమ్మకాన్ని తొలగించి, వారికి ధర్మం పట్ల, ఉపాసన పట్ల సరైన సమాచారాన్ని ఇవ్వడంతో బాటుగా, సమాజంలో ఆయా జాతులను వారి పూర్వపు ఆచారాల- ఉపాసనల ఆధారంగా వారిని ధార్మిక పరంపరతో జోడించడం ఒక లక్ష్యం. ఒక నాగరికత అనే ప్రవాహం, దాని ప్రగతి అందులో జరిగే పరిణామాలు భూత-భవిష్యత్ వర్తమాన కాలాలను కలుపుతూ సాగాలి. ఈ ప్రవాహాన్ని చీల్చి పాశ్చాత్యులకు అనుకూల ప్రవాహాలను తయారుచేసే ప్రయత్నం బ్రిటిష్ వారి కాలంలో జరిగింది, అలాంటి పాయలను తిరిగి ధార్మిక పరంపరాప్రవాహంలో కలపడం ఈ పుస్తకపు మరో లక్ష్యం. ఈ లక్ష్యం వైపు ఆంగ్లంలో వచ్చిన పుస్తకం ఒక అడుగు. శివుడి ప్రేరణతో ఈ పని మొదలుపెట్టానని నా భావన. ఆ శివుడిచ్చిన పనిని యథాశక్తి చేయడానికి ప్రయత్నించాను, లక్ష్యంవైపుకు సమయమొచ్చినప్పుడు ఆ శివుడే తీసుకెళ్తాడు.

ప్రశ్న 5: ఈ పుస్తక రచనలో మీ టార్గెట్ రీడర్లెవరు? వారిని చేరారనుకుంటున్నారా?

జ: ఆంగ్ల పుస్తకం, ప్రస్తుతం రాస్తున్న తెలుగు పుస్తకం రెండూ మేధావి వర్గాన్ని ఉద్దేశిస్తూ వ్రాయబడ్డాయి. ఆంగ్ల పుస్తకం కొందరు మేధావుల దృష్టిని ఆకర్షించింది. కానీ వారి సంఖ్య అతి స్వల్పం, చేరాల్సిన వారి సంఖ్య చాలానే ఉంది!

ప్రశ్న 6: ‘శివస్య కులం’ అన్న పేరు పెట్టటం వెనుక మీ ఆలోచన ఏమిటి?

జ: తెలుగు ప్రాంతాలలో కులం అనే పదాన్ని జాతి స్థానంలో ఉపయోగిస్తారు. కులం అంటే వంశం అనే అర్థం అందరికీ తెలిసిందే. కానీ కులం అనే పదానికి ఇంకా అనేక అర్థాలున్నాయి. మన వ్యవస్థలో పూర్వం తాంత్రికం పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో ఉండేదన్న విషయం అందరికీ విదితమే. తాంత్రిక గ్రంథాలు కులం అనే పదానికి శక్తి అనే అర్థాన్ని చెప్పాయి. ‘శివస్య కులం’ అంటే, శివుడి శక్తి అని అర్థం. లలితా సహస్రనామస్తోత్రం అమ్మవారిని కులేశ్వరి ఇత్యాది పేర్లతో స్తుతించింది. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న కులం సాధన లేక ఉపాసనకు చెందింది. ఈ సాధన వైదిక-తాంత్రిక భేదంతో ఉంది. కులం అంటే శివుడి శక్తిని వంశపారంపర్యంగా పూజించే వారి సమూహమని అర్థం. శివుడి శక్తిని, శక్తి ఉపాసనను ఉద్దేశిస్తూ ‘శివస్య కులం’ అనే పేరు పెట్టాను.

ప్రశ్న 7: ఈ పుస్తకంలో మీరు అందించిన విషయాలు, ఇచ్చిన రిఫరెన్సులు చూస్తూంటే ఎంతో శ్రమపడ్డారీ రచనకు అని తెలుస్తుంది. కానీ, ఇన్ని అంశాలు ఒకే పుస్తకంలో పొందుపరచటంవల్ల సామాన్య పాఠకుడు అయోమయంలో పడి, మీరు చెప్పిన సత్యాలను గ్రహించలేకపోతాడేమో?

జ: శ్రమ అంతా ఈశ్వరుడి ప్రేరణ, అమ్మవారి దయ! ప్రస్తుతం పుస్తకాలు చదివే అలవాటు, అందులోనూ గంభీరమైన అంశాల గురించి చదివే ఓపిక అందరికీ లేదు. అందువల్ల, ఇది అందరికీ అర్థమయ్యే పుస్తకం కాదు. ముందు చెప్పినట్లు ఇది మేధావి వర్గాన్ని, అకడమిక్ వర్గాలను ఉద్దేశిస్తూ వ్రాసిన పుస్తకం అందువల్లనే అన్ని రిఫరెన్సులు ఇచ్చాను.

ప్రశ్న 8: సాధారణంగా కులభావనను సమర్దించటానికి కానీ, వ్యతిరేకించటానికి కానీ పురుష సూక్తాన్ని వాడటం ఆనవాయితీ. కానీ, మీ పుస్తకంలో పురుషసూక్తం ద్వారా వర్ణ భావనను వివరించటం కన్నా, కులం, వర్ణం వంటి పదాల వివరణపై దృష్టి అధికంగా కనిపిస్తుంది. కుల/వర్ణ భావనలో పురుష సూక్తం ప్రాధాన్యం ఏమిటి మీ దృష్టిలో?

జ: పురుష సూక్తం మన సృష్టిని విరాట్ పురుషుడి రూపంలో వర్ణించింది. ఇది అర్థం కావాలంటే మన సృష్టి క్రమం అర్థం కావాలి. ఇది ఒక పెద్ద అంశం, ఇక్కడ వివరించలేను. దీనిపై తెలుగులో విస్తారంగా వ్రాసాను. ఔత్సాహికులు దీనిని తెలుసుకోవాలంటే శ్రీ కోటా వెంకటాచలం గారు వ్రాసిన ఆర్య విజ్ఞానం-బ్రహ్మాండ విజ్ఞానం అనే గ్రంథాన్ని చూడండి.

వర్ణం-జాతి విషయపు చర్చలో స్మృతులపై పంచాయితీ పెట్టడం బ్రిటిష్ వారు మొదలుపెట్టిన పద్ధతి. అయితే అధికారి భేదంతో కూడిన మన సమాజంలో ఆయా జాతులకు తమతమ ఉపాసనలను, ఆచారాలను పాటించే స్వేచ్ఛ అనాదిగా ఉంది. ఈ ఉపాసనలతో కూడిన ఆచారాలు ఆయా జాతుల సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేసేవి. ధర్మాధర్మ నిర్ణయంలో లోకాచారం కూడా ప్రమాణమైనది. ఆ లోకాచారాలు ఆయా జాతుల పరంపరాగత ఆచారాల ద్వారా ప్రభావితమై ఉంటాయి. స్మృతులు సాత్త్విక లక్షణాలను, సత్త్వగుణాన్ని పెంచే కోణంలో రచించబడ్డాయి. కానీ వ్యవస్థలో రజస్తమో గుణాలతో కూడిన ఉపాసనలు కూడా ఉండేవి. ఉపాసనలలోని ఈ గుణభేదాలను పక్కనబెట్టి, కేవలం పాశ్చాత్య దృష్టికోణంతో భారతీయ ధార్మికతను నిర్వచించే ప్రయత్నం జరిగింది. ఈ పాశ్చాత్య చట్రంలోనుండీ బయటపడాలంటే అధికారభేదంతో కూడిన ఉపాసనా పద్ధతులను వెలుగులోకి తేవడం అతి ముఖ్యం. తద్వారా అన్ని జాతులు బ్రాహ్మణులపైనే ఆధారపడి ఉండేవి కావని, ఆయా జాతులకు ప్రత్యేక ఆచారాలు, వారికి ప్రత్యేక గురువులు ఉండేవారన్న విషయం ఆయా జాతులకు అర్థమైనప్పుడే వారికి ధార్మిక పరంపర యొక్క విశిష్టత అర్థమవుతుంది. వర్ణాలు గుణకర్మల ద్వారా ఏర్పడ్డాయని భగవద్గీత చెబుతోంది. సత్త్వగుణం జ్ఞానాన్ని, సుఖాన్ని ఇస్తుందని తమోగుణం మోహాన్ని, అజ్ఞానాన్ని కలుగచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఏ విధమైన సాధన చేస్తున్నారోనని గమనిస్తే, మనకు ఆయా జాతుల ఆచారాల ద్వారా వారు చేస్తున్న సాధన ఏ గుణాన్ని వృద్ధి చేస్తుందో కూడా అర్థమవుతుంది. తద్వారా వ్యవస్థ అమరిక కూడా అందరికీ అర్ధమయ్యే అవకాశముంది.

ప్రశ్న9: మీరు పుస్తకంలో ఒక చోట Varna system was created by Vedic framework and Kula system by Tantrik framework అన్నారు. తంత్ర కన్నా ముందు కులం లేదా?

జ: జాతి గురించి పలువురు వ్రాసారు, కానీ సాధన గురించి కొందరే వ్రాసారు. వర్ణంలో జాతి అంతర్భాగం, జాతిలో కులం అంతర్భాగం. కులం అంటే ‘సజాతీయానం మాతృ మానమేయానాం సమూహః కులం’ అనే నిర్వచనం భాస్కరరాయలిచ్చారు. ఒక జాతిలో వంశపారంపర్యంగా శక్తిని పూజించే వారి సమూహమే కులమని అర్థం. కులం అనే పదం అమ్మవారితో, ఉపాసనతో ముడిపడి ఉంది. తంత్రం ఒక ఉపాసనాశాస్త్రం. మనది నిగమాగమ సంప్రదాయం. వేదాలు, వాటినుండీ పుట్టిన ఆగమాలు-తంత్రాల ద్వారా మన వ్యవస్థలో విభిన్న ఆచారాలు నెలకొన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పై మాట చెప్పబడింది.

ప్రశ్న 10: మీ పుస్తకంలో బ్రిటీష్ వారు మన పద్ధతులను సరిగా తెలుసుకోలేదన్నారు. కానీ, ఈనాటికీ మనవారు బ్రిటీష్ వారి తీర్మానాలనే ప్రామాణికంగా భావిస్తున్నారు. ఎందుకని? మన దృక్కోణంలో మన సమాజాన్ని, మన చరిత్రను మనం అర్థం చేసుకోలేమా?

జ: అవును, మన వ్యవస్థలకు చెందిన సిద్ధాంతాలను బైబిల్ కథనాలలోకి, పాశ్చాత్య సమాజపు చరిత్రలోకి బ్రిటిష్ వారు ఇరికించి, ఆ విధంగా వ్యాఖ్యానించడంతో, విద్య ద్వారా చిన్ననాటి నుండీ ఆ చెత్తను మన మెదళ్లలో ఎక్కించి వాటిని విషయమయం చేయడంతో మనలో పరస్పర ద్వేషభావం పెరిగింది. బ్రిటిష్ పాలనలో మనలో నెలకొన్న అసమానతలు ఈ ద్వేషభావానికి ఆజ్యం పోశాయి. ఈ రావణ కష్టం నిత్యమూ రగిలేలా చేయడానికి మన రాజకీయ చట్రాలు బ్రిటిష్ వారి ద్వారా నిలబెట్టబడ్డాయి. ఉదాహరణకు జస్టిస్ పార్టీ రాజకీయాల ద్వారా మిషనరీలు, బ్రిటిష్ వారు ఏర్పాటు చేసిన సిద్ధాంతాల పునాదులపై రాజకీయ సౌధం నిర్మించబడ్డది. ప్రస్తుత దక్షిణాది రాజకీయాలకు ఇవే ఆధారం. ఇలాంటి దృష్టికోణం పాలకులలో ఉన్నప్పుడు వారికి స్వదేశీ దృష్టికోణం పూర్తిగా వివక్షాపూరితమైనది అనే ఆలోచన ఉండటం సహజం. అలాంటి వారు మనలను పాలించినంతకాలము మన దృష్టికోణాన్ని పాశ్చాత్య సిద్ధాంతాలే ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన చరిత్రను మన దృష్టికోణంలో అర్థం చేసుకోవాలంటే ముందు మేధో సంకెళ్లను తద్వారా ఈ రాజకీయ సంకెళ్లను బద్దలు కొట్టాలి, అప్పుడే మనదైన దృష్టికోణంతో మన చరిత్రను, మహర్షుల దృష్టికోణాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. లేదంటే ఇంకో వందేళ్ల తరువాత కూడా మనం ప్రశ్నకు చెందిన చర్చలోనే ఉంటాము!

ప్రశ్న11: మీరు ఆర్య ద్రవిడ సిధ్ధాంతానికి మద్దతిస్తారా? ఈ పుస్తకంలో శంకరాచార్యులు తాను ద్రవిడశిశువునని చెప్పుకున్నారన్నారు. శంకరాచార్యుడి ద్రవిడ భావనకూ, బ్రిటీషువారు ప్రచారంలోకి తెచ్చిన ద్రవిడ భావనకు తేడా ఏమిటి?

జ: నేను మద్దతు ఇవ్వను. ఎందుకంటే శాస్త్రాలలో ఆర్య అనే పదానికివ్వబడిన అర్థాలు, ద్రావిడ అనే పదానికి మిషనరీలిచ్చిన అర్థాలను, ఇంతవరకూ వాటికి లభించిన ఆధారాలను చూస్తే ఆర్యుల వలసవాద సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడం అనవసరం అనిపిస్తుంది. కానీ గతంలో దేశభక్తుడైన తిలక్ గారు ఆర్య సిద్ధాంతానికి మద్దతిచ్చారు, అలాగే బ్రాహ్మణులను తిట్టిపోసిన అంబేద్కర్ గారు ఆర్య సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఇక్కడ ఆ సిద్ధాంతానికి మద్దతిచ్చామా, కాదా అన్నది ముఖ్యం కాదు. ఆ సిద్ధాంతాన్ని మనం సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తున్నామా లేదా అన్నది ప్రశ్న అని గతంలో ధర్మరాజ్య అనే దార్శనిక గ్రంథాన్ని రాయడానికి కృషిచేస్తున్న ఖండవల్లి శంకర్ భరద్వాజ్ గారు నాతో అన్నారు.

శంకరాచార్యులవారు చెప్పిన ద్రావిడ అన్న భావన ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. మిషనరీలు ప్రతిపాదించిన ద్రావిడ అన్న భావన భాషాశాస్త్రం ఆధారంగా సృష్టించబడింది. ఇది ఒక జాతిని సూచిస్తుంది. ఈ ద్రావిడ జాతి వాద సిద్ధాంతంలో అనేక రకాలైన వక్రీకరణాలున్నాయి. దక్షిణాదిలో శైవాన్ని, శైవంలో అంతర్భాగమైన శాక్తేయాన్ని ధార్మిక పరంపరనుండీ విడదీయాలనుకున్న మిషనరీలు సృష్టించిన వక్రీకరణే ఈ ద్రావిడ మతం. ఈ అంశాన్ని వివరిస్తూ నేను వ్రాసిన ‘మిషనరీ మాయాజాలం-ద్రావిడ మత స్వరూపం’ అనే గ్రంథం త్వరలో విడుదలవుతున్నది. అది చదివితే ఈ సిద్ధాంతంలో ఉండే వక్రీకరణలు అర్ధమయ్యే అవకాశముంది.

ప్రశ్న12. పుస్తక రచనలో మీరు మీ దృష్టిని దక్షిణ భారతంపై అధికంగా కేంద్రీకరించానన్నారు. కానీ, ప్రాచీన భారతంలో ఉత్తర భారతం, దక్షిణ భారతం అన్న తేడాలుండేవా?

జ: ఉత్తరభారతదేశంలో పూజలు ఎక్కువగా వేదపరంపరకు, దక్షిణాదిలో ఎక్కువ ఆగమ పరంపరకు చెందిన పద్ధతులుండేవని కొందరు పండితులు చెబుతారు. నేను పెరిగిన దక్షిణాది సమాజంపై ఈ పుస్తకం ఎక్కువగా దృష్టిపెట్టింది. కానీ పూర్వం ఉత్తరభారతదేశంలో పుట్టిన అనేక సంప్రదాయాలు దక్షిణాదిలో బాగా ప్రాచుర్యంలో ఉండేవని. ఆ సంప్రదాయాలు ఉత్తరాదిలో పుట్టినా వాటి కీలకమైన గ్రంథాలు దక్షిణాదిలో రచించబడ్డాయని చరిత్ర చెబుతున్నది. పుస్తకంలో కేవలం పుస్తక పరిశోధన పరిధి కోసమే దక్షిణాది-ఉత్తరాది అనే మాటను ఉపయోగించాను తప్ప, సంస్కృతి-సంప్రదాయాలను ఉత్తర-దక్షిణ పేర్లతో విడదీసే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. ఆసేతు హిమాచలం ధార్మిక పరంపరకు చెందిన పుణ్య భూమి మన భారతదేశమని అని మన పూర్వులు చెప్పారు, అదే నిజమని నా ప్రగాఢ విశ్వాసం.

ప్రశ్న13. మీరు పుస్తకం చివరలో those who are genuinely looking for answers about Hindu society need only to look for the Origin of Grama devata worship అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యను మరింత స్పష్టంగా వివరిస్తారా? అలాగే భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవటంలో గ్రామదేవతల ప్రాధాన్యాన్ని వివరిస్తారా?

జ: గ్రామదేవతల ఉపాసన చాలా కీలకమైనది. ఇది ద్రావిడ ఉపాసన అని రాబర్ట్ కాల్డ్వెల్ వంటి మిషనరీలు తీర్మానించారు, ఈ అభిప్రాయాన్ని బ్రిటిష్ వారు అధికారికంగా ఉపయోగించడం వలన నేటికీ భారతీయులు గ్రామదేవతల ఉపాసన ద్రావిడులకు చెందిందని భావిస్తున్నారు. గ్రామదేవతల ఉపాసనను కూకటి వేళ్ళతో పెకలించాలని మిషనరీలు అనేక గ్రంథాలలో వ్రాసారు. ఆ గ్రామదేవతల గుడులను నాశనం చేస్తే, ఆ గుళ్ళ శకలాలపై చర్చిలు వెలుస్తాయని హెన్రీ వైట్ హెడ్ వంటి మిషనరీలు ఏనాడో ప్రణాళికలు వేశారు. నేడు జరుగుతున్నదిదే. బ్రిటిష్ అధికారులుగా పనిచేసిన వారు వ్రాసిన గ్రంథాలలోనే ఈ గ్రామదేవతల పూజలు ఆగమాలకు చెందినవనే వివరాలు కనిపిస్తాయి. దీనికి చెందిన మరిన్ని వివరాలకోసం ‘మిషనరీ మాయాజాలం-ద్రావిడ మత స్వరూపం’ అనే రాబోయే గ్రంథాన్ని చూడండి. ఈ గ్రామదేవతలు కేవలం ఆగమాలతోనే కాక, వివిధ జాతుల సాధనతో, వైద్యంతో ముడిపడి ఉన్నారు. గ్రామదేవతలతో ఉన్న ఆధ్యాత్మిక, ఆయుర్వేదపరమైన సంబంధాలను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే ద్రావిడ మతం యొక్క అసలు స్వరూపం అర్థమవుతుంది. అప్పుడు మిషనరీల సిద్ధాంతపు డొల్లతనం కూడా అర్థమవుతుంది. అప్పుడు అధికారిభేదంతో కూడిన ధార్మిక పరంపర అసలు తత్త్వం గోచరించే అవకాశముంది.

ప్రశ్న14. ఇంతకీ, భారతీయ సామాజిక వ్యవస్థనుంచి కుల భావనను తొలగించటం సాధ్యమేనా? కులభావనను నిర్మూలించాలంటే ఏం చేయాలి?

జ: ప్రస్తుతం కులం పోవాలనే భావన కేంద్రీకృత పెట్టుబడిదారీ వర్గాలకు, కమ్యూనిస్టు వర్గాలకు అనుగుణంగా ఉండేవారు, వీరి ప్రచారానికి లోబడిన వారు, వారికి సమాధానం చెప్పలేని వారు రేకెత్తుతున్న వాదన. ప్రకృతి భిన్నత్వంతో కూడుకున్నది. ఆ భిన్నత్వాన్ని సరిగ్గా సమన్వయము చేయలేని వారు కులభావనను నిర్మూలించాలంటారు. ప్రకృతి తత్త్వాన్ని, ఉపాసనను, జీవేశ్వరుల సంబంధాన్ని అర్థం చేసుకున్నవారెవరైనా కులం పోవాలి అనరు.

ప్రశ్న15. మీరు సతి సహగమనాన్ని, కారుణ్య హత్య( యూథనేశియా) తో పోల్చారు. ఇది సమంజసమా?

జ: పతివ్రతల సతీత్వ దీక్షను తక్కువచేసే ఉద్దేశం నాకేకోశానా లేదు. సహగమనానికి అనేక కారణాలున్నాయి, అందులో ఒకటి వైద్యంతో ముడిపడి ఉంది. సతీసహగమనం ద్వారా అనేకమంది స్త్రీలు చంపబడ్డారు, ఇది మతం ద్వారా స్త్రీల మీద హిందువులు ఆపాదించిన శిక్ష అన్నది మిషనరీలు సృష్టించిన అపవాదు. ఈ ప్రచారాన్ని నమ్మిన అనేకమంది ధార్మిక పరంపరను శల్యపరీక్ష చేయడంతో బాటుగా, నిత్యమూ దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ సృష్టి కారణ-కార్య భావంతో నడుస్తుంది. దీనినే మనం కర్మ అంటాం. కారణం లేకుండా కార్యం పుట్టదు. స్త్రీలు సహగమనానికి పాల్పడటానికి కారణం వారి భర్తలు చనిపోవడం వలన. అనేక సందర్భాలలో అనేకమంది పురుషులు మశూచి, విశూచి, కలరా ఇత్యాది వివిధ అంటురోగాల వలన చనిపోయారని, అలా చనిపోయిన పురుషుల భార్యలు సహగమనం చేసారని చరిత్ర చెబుతున్నది. ఇలా పురుషులు పెద్ద ఎత్తున చనిపోవడానికి కారణం రోగాలు వ్యాపించడం, ఆ రోగాలకు తగిన చికిత్స లభించకపోవడం. భారతదేశంలో ఇస్లామిక్ పాలనలో, క్రైస్తవ పాలనలో ఆయుర్వేదం నిర్లక్ష్యం చేయబడిందని, ఆ కాలంలో నెలకొన్న దుర్భిక్షం వలన అనేక రోగాలు ప్రబలాయని చరిత్ర పుస్తకాలు ఘోషిస్తున్నాయి. మరి ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేసిన వారిని మీరెందుకు ఆక్షేపించడం లేదు? పైగా ముస్లిములు తమ వైద్యాన్ని వ్యాప్తిచేయడానికి, పాశ్చాత్యులు, తమ వైద్యాన్ని వ్యాప్తిచేయడానికి ఆయుర్వేదానికి అన్నిరకాల ఆటంకాలు కల్పించారని చరిత్ర పుస్తకాలూ స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ప్రక్రియను కోవిడ్ వాక్సీన్ సమయంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడిపై జరిగిన ప్రచారంపై కూడా చూడవచ్చు. సతీసహగమనంపై నెలకొన్న వివాదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అప్పటి అబ్రహామిక్ ప్రభుత్వాల విధానాలను, వ్యవస్థలోని రోగాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడే విషయాన్ని సమగ్రంగా అర్థంచేసుకోగలము. పైగా చికిత్స లేని రోగాలున్నవారు అప్పట్లో వివిధ రకాలుగా కారుణ్య హత్యలకు పాల్పడేవారు. ఈ పద్దతి ముస్లింలలో కూడా ఉంది. ఈ ప్రక్రియ నేటి పాశ్చాత్య సమాజాలలో పెద్ద ఎత్తున ఉంది. ఈ మధ్యకాలంలో కెనడాలో సుమారు 10,000 మందికి పైగా కారుణ్య హత్యకు పాల్పడ్డారు. వైద్యం లేనప్పుడు మనుషులు చనిపోవడం తప్పైతే, ఇప్పుడు జరుగుతున్న కారుణ్య హత్యలు ఒప్పెలా అవుతాయనేది ప్రశ్న!

ప్రశ్న16. ఈ పుస్తకానికి స్పందన ఎలావుంది? మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి?

జ: స్పందన క్రమంగా పెరుగుతోంది. అది అలా ఉండటమే సమంజసం. గతంలో శ్రీ బెల్లంకొండ రామారాయ కవిగారు ఎన్నో అద్భుతమైన పుస్తకాలు వ్రాసి, ఆ పుస్తకాలలో విద్వత్తు ఉంటే, అవి సమాజానికి అవసరమైతే ఆ అమ్మవారే వాటిని ముందుకు తీసుకెళ్తుందనే నమ్మకంతో వాటిని పక్కనపడేసారు. ఆయన నమ్మిక లాగానే సుమారు 100 సంవత్సరాల తరువాత కూడా ఆ పుస్తకాలు నేటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వారే నాకు ఆదర్శం, ఈ పుస్తకంలో మన నాగరికతకు పనికొచ్చే అంశాలుంటే మన సమాజమే దానిని ముందుకు తీసుకెళ్తుంది, లేదంటే చాలా పుస్తకాల లాగానే ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఏది జరగాలన్నా అంతా ఈశ్వరేచ్ఛ. ప్రస్తుతం వ్రాస్తున్న తెలుగు పుస్తకాన్ని ముగించడమే నా ముందున్న లక్ష్యం. ఆ తర్వాత శివుడి ఆజ్ఞ.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు సుధామోహన్ గారు.

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్: ధన్యవాదాలు.

***

రచయిత పరిచయం:

మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ వ్రాసిన ‘శివస్య కులం’ అనే పుస్తకం 2022లో విడుదల అయింది. ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించింది. మైలవరపు సుధామోహన్ వృత్తి రీత్యా ఏవియేషన్ విభాగంలో పనిచేస్తున్నారు. బ్రిటిష్ పాలనలో, ఆ తరువాత సెక్యులర్ ముసుగులో ధార్మిక పరంపర సిద్ధాంతాలను వక్రీకరిస్తూ చేయబడుతున్న వ్యాఖ్యానాలను, సిద్ధాంతాలను ఖండించే దిశలో ఈయన కృషి ఉంది. గతంలో ఈయన ‘కుహనామేధో నియంతలు’ అనే గ్రంథాన్ని, అంతర్జాలంలో వివిధ పోర్టల్ లలో హిందూ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కొన్ని వ్యాసాలు కూడా వ్రాసారు.

జన్మస్థలం తిరుపతి. తండ్రి డా॥ మైలవరపు శ్రీధరరావు గారు, తల్లి మైలవరపు (రాయప్రోలు) సుబ్బలక్ష్మి గారు. హైదరాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మెయిన్‌టెనెన్సు ఇంజనీరింగ్ చేసారు, అదే విభాగంలో UK లో డిగ్రీని పొందారు. భార్యపేరు గుమ్మరాజు నాగప్రతిభ, ఇద్దరు పుత్రికలు.

sudhamohan@yahoo.com

***

Sivasya Kulam

Author: Mylavarapu VNL Sudha Mohan

Publisher: Samvit Prakashan

Pages: 342

Price: ₹ 599

For copies:

Ajeyam Strategy & Marketing Pvt. Ltd.
91-8248281150.

https://www.amazon.in/Sivasya-Kulam/dp/819504865X

 

 

~

‘శివస్య కులం’ పుస్తక సమీక్ష లింక్:
https://sanchika.com/sivasya-kulam-book-review/

సమకాలీన సమాజానికి ఆవశ్యకమైన పుస్తకం – ‘శివస్య కులం’

0

[శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారు రచించిన ‘శివస్య కులం’ అనే పుస్తకం సమీక్ష అందిస్తున్నాము.]

[dropcap]మై[/dropcap]లవరపు సుధా మోహన్ రచించిన ‘శివస్య కులం’ లాంటి పరిశోధనాత్మకమూ, విశ్లేషణాత్మకమూ అయిన పుస్తకం కులం గురించి తెలుగులో అతి అరుదు అనటం అనృతం కాదు. అతిశయోక్తి కూడా కాదు. పుస్తకం అడుగడుగునా, ప్రతి అక్షరంలో, ప్రతి వాక్యంలో రచయిత నిజాయితీ, దీక్ష, సత్యాన్ని పాఠకులకు చేరువచేయటం ద్వారా సమాజానికి నిజానిజాలు తెలియచెప్పాలన్న తపనలు స్పష్టంగా తెలుస్తూంటాయి. అసత్యాన్ని సత్యంగా భావించి అల్లకల్లోలం సృష్టిస్తూ, సమాజంలో వ్యక్తుల నడుమ కుల విద్వేషాల అడ్డుగోడలు నిర్మించటం పట్ల రచయిత ఆవేశం, ఆవేదనలూ అడుగడుగునా కనిపిస్తూంటుంది.

ఈ పుస్తకం ముందుమాటలోనే రచయిత తన ఉద్దేశాన్నీ, లక్ష్యాన్నీ స్పష్టం చేస్తారు.

‘The progeny of Bharata must realize that, so far, they heard only one side of the story, a side that paints Hinduism in the worst possible light’ అంటూ ‘ఇంతకాలం వేటగాడు తన కథ చెప్పాడని ఇప్పుడు సింహం తన కథ చెప్పాల్సిన అవసరం ఉంద’నీ, ‘Many scholars and great people have already started this journey. I am trying to follow in their footsteps like a child trying to follow his/her father’s steps’ అని స్పష్టం చేస్తారు.

సాధారణంగా విదేశీ పాలనలో గడిపి స్వతంత్రం సాధించిన దేశాలలో ఇది సర్వసాధారణం. ఒక జాతి మరొక జాతిపై ఆధిక్యం సాధించినప్పుడు, తాను గెలచిన జాతిని చులకనగా చూస్తుంది. ఆ జాతి తన చెప్పుచేతల్లో వుండాలనీ, ఆ జాతికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వంటివి వుండకూడదు, వున్నా, అవి తన ఉనికికి భంగం కలిగించే రీతిలో వుండకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అప్పుడే మరో జాతిపై తన ఆధిక్యాన్ని నెరపగలుగుతుంది. అంటే, ఓడిన జాతి తన అసలు రూపును, గుణగణాలను మరచి తనను గెలిచిన జాతి ఆధిక్యాన్ని స్వీకరించి, తనను తాను బానిసగా భావిస్తూ, ఆత్మవిశాస రాహిత్యంతో, ఆత్మన్యూనతా భావంతో విజేతకు ఒదిగివుంటేనే వారిపై ఆధిక్యం సాధ్యం అవుతుందన్నమాట.

ప్రపంచవ్యాప్తంగా, విజేత జాతి, పరాజితుల అస్తిత్వాన్ని సంపూర్ణంగా తుడిచిపెట్టి, వారికి తామివ్వాలనుకున్న నూతన అస్తిత్వాన్నిచ్చి రూపాంతరం చెందించటంలో విజయం సాధించినవారే అధిక కాలం పాలకులలా మనగలగటం చూడవచ్చు. అయితే, ఎంతగా ఏమార్చినా, అస్తిత్వాన్ని రూపుమాపి నూతన గుర్తింపునిచ్చినా, ప్రపంచవ్యాప్తంగా బానిసలుగా అయిన జాతులు ఏదో ఒక రీతిలో తమను తాము పునర్నిర్విచించుకుని, నూతన అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుని స్వతంత్ర పోరాటం చేయటం మానవ సమాజాలన్నిటిలో కనిపిస్తుంది. ఏయే జాతులు తమ అస్తిత్వాన్ని సంపూర్ణంగా కోల్పోయాయో, నూతన అస్తిత్వాన్ని ఏర్పాటుచేసుకోలేకపోయాయో, ఆయా జాతుల నాగరికతలు ప్రపంచంనుంచి అదృశ్యం అయ్యాయి. చరిత్ర పుస్తకాలలో మిగిలాయి. గ్రీకులు, రోమన్ల నుంచి, అరబ్బులు, స్పెయిన్, పోర్చుగల్ ద్వారా ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాల చరిత్రలు ఇందుకు ఉదాహరణలు.

భారతదేశ చరిత్ర ఇతర దేశాల చరిత్రలన్నిటికన్నా భిన్నం.

భారతదేశంపై జరిగినన్ని విదేశీయుల దాడులు బహుశా ప్రపంచంలో ఇతర ఏ నాగరికతపై జరగలేదు. అయితే, భారతీయ నాగరికతలా ప్రపంచంలో ఇతర ఏ నాగరికత కూడా, తనపై దాడులు చేసినవారిని సైతం తన జీవన స్రవంతిలో మిళితం చేసుకుని ముందుకు సాగలేదు. ఇతర నాగరికతలను రూపుమాపిన వారు కూడా భారతదేశంలో ప్రవేశించిన తరువాత ప్రధాన నదిలో మిళితమైపోయే ఉపనదుల్లా ఒదిగిపోయారు. తమ అస్తిత్వాన్నీ, ప్రత్యేకతనూ కోల్పోయారు.

కానీ, ఇస్లామీయులు భారతదేశంలో అధిక భాగాలపై ఆధిక్యాన్ని సాధించినా, ప్రపంచంలోని ఇతర నాగరికతలను రూపుమాపినట్టు భారతీయ నాగరికతను రూపుమాపలేకపోయారు సరికదా, నెమ్మదిగా, గతంలోని అసంఖ్యాకుల్లా, భారతీయ జీవన స్రవంతిలో ఒక భాగమయి అస్తిత్వాన్ని కోల్పోయే స్థితిని ఎదుర్కునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇంతలో బ్రిటీష్ వారు రంగ ప్రవేశం చేశారు. అంటే, ఒక ఎగసిపడే అల తాకిడికి గురై, ఉక్కిరిబిక్కిరయి తేరుకునేలోగా మరో మహా తరంగం వచ్చిపడిందన్నమాట..

ఇస్లామీయులు చంపటమో, మతం మార్చటమో చేసినా, భారతీయుల వ్యక్తిగత, ధార్మిక  విషయాల జోలికి వారు పోలేదు. విగ్రహారాధకులు, కాఫిర్లు అని ఈసడించినా ఒక దశలో భారతీయులతో  కలసి బ్రతకక తప్పదన్న గ్రహింపు కలిగింది ఇస్లామీయులకు. భారతీయులను సంపూర్ణంగా అణచివేయటం కుదరదని వారు అర్థం చేసుకున్నారు. కానీ, బ్రిటీష్ వారు ఇందుకు భిన్నం.

సంపూర్ణమయిన ఆధిక్యభావనతో, ఇతరులందరినీ తామే ఉద్ధరించాలన్న అచంచలమైన విశ్వాసంతో, భారతీయ సమాజాన్ని నాగరీకం చేయాల్సిన బాధ్యత తమదే అన్న నమ్మకంతో వారు ప్రవర్తించారు. భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయటం కష్టమని అర్థం చేసుకుని ఈ సమాజ పటిష్టతకు, ఐక్యతకు కారణమయిన అంశాల ఆయువుపట్టుపై దెబ్బ తీయాలని నిశ్చయించుకున్నారు. ఆ దిశగా భారత దేశ సాంఘిక, ఆర్థిక, ధార్మిక, రాజకీయ చరిత్రను రూపాంతరం చెందించారు. సామాజిక బలహీనతలను, వ్యక్తుల దౌర్బల్యాలనూ, మానవ మనస్తత్వంలోని లోభత్వాన్ని, అభద్రతాభావాలను, ద్వేషాసూయలను ఆధారం చేసుకుని అఖండ వృక్షాన్ని మొదలునుంచి తొలిచివేసే చెదపురుగులా ప్రవర్తించారు. చాప క్రింద నీరులా భారతీయ సమాజంలో ఒకరి వేలితో మరొకరి కన్ను పోడుచుకునేట్టు చేసి, సమాజాన్ని ఆత్మవిహీనం చేసి తమ చెప్పుచేతల్లో వుండే బానిసల్లా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈనాడు మనం అనుభవిస్తున్న అనేక దౌర్బల్యాలకు, వికారాలకు, ద్వేషాలకు, మూర్ఖత్వాలకు, సంకుచితాలకు బీజాలు వెతికితే, ఈ గతంలో లభిస్తాయి.

ఇస్లామీయుల పాలన, ఆపై బ్రిటీషువారి అధికారాలలో ఒదిగివుండటం వల్ల భారతదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నిజానికి బానిసత్వానికి గురయిన ప్రతి సమాజం, ఏదో ఒక దశలో బానిస భావాలను వ్యతిరేకించి, తమను బానిసత్వంలో కట్టివుంచుతున్న వాటన్నిటినీ తృణీకరించి తమ అస్తిత్వాన్ని చాటిచెప్పాలని ప్రయత్నిస్తాయి.

బానిస వాతావరణంలో పుట్టి పెరిగిన అల్బెర్ట్ చినువాలుమోగు అచెబె, తనను మానసిక బానిసత్వంలో ఉంచుతున్నవాటన్నిటిపై తిరుగుబాటు ప్రకటించి, తన పూర్వీకులయిన ఇగ్బో తెగ సంస్కృతి సాంప్రదాయాలను దైవాలను స్వీకరించి తన పేరును సైతం సాంప్రదాయిన పేరుకు మార్చుకుని తన దేశ చరిత్రను తన ప్రజల దృక్కోణంలో రచించాడు. ఇది తమ అస్తిత్వాన్ని నిలుపోకోవాలనుకున్న ప్రతి సమాజంలోనూ జరుగుతుంది. భారతదేశంలోనూ జరిగింది.

అయితే, ఇతర దేశాలకు భిన్నంగా, ఇక్కడ, బానిస మనస్తత్వం ఎంత లోతుగా పాతుకుని పోయిందంటే, మనమూ మనదను మాట చెల్లదని, మనం పనికిరానివారమని, మన గురించి మనకన్నా విదేశీయులకే ఎక్కువ తెలుసని వారు చెప్పినదాన్నే ప్రామాణికంగా తీసుకుని మనదన్న ప్రతిదాన్నీ, చులకన చేస్తూ, పనికిరానిదని తీసిపారేసే వారి మాటలే చెల్లే పరిస్థితులు ఈనాటికీ నెలకొని వున్నాయి. దాంతో మన చరిత్రను, మన సమాజాన్ని, మన దృక్కోణంలో చూసి విశ్లేషించేవారు ఛాందసులయ్యారు. వారిని జాతీయభావాల వారని ఈసడించటం, వారిని హేళన చేయటం, వెక్కిరించి వారు చెప్తున్న విషయాలను సామాన్యులకు చేరనివ్వకపోవటం, ఇంకా మనం పనికిరానివారమనే న్యూనతభావాన్ని మెదళ్ళకెక్కించే వారే పెద్దగొంతుతో ఈనాటికీ వినబడుతూండటం మన సమాజంలో చూడవచ్చు. అయినా సరే, నిజానిజాలు వెల్లడించటం తమ కర్తవ్యంగా భావిస్తూ, ఫలితం కోసం ఎదురుచూడకుండా తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వహించేవారు నిర్వహిస్తూనే వున్నారు. ఎప్పుడెప్పుడు భారతీయత పరాయి ప్రభావానికి గురవుతూన్నా అప్పుడప్పుడు భారతీయతను సజీవంగా నిలిపేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. అందుకనే, ఇస్లామ్, క్రిస్టియానిటీల ప్రభావానికి గురయిన నాగరికతలన్నీ తమ అస్తిత్వాన్ని కోల్పోయి చరితలో ఒక వాక్యంలా మిగిలిపోగా, భారతీయ నాగరికత మాత్రం సజీవనది నిరంతరం ప్రవహించేట్టు సజీవంగా నిలుస్తూనే వుంది. భారతీయ నాగరికతను సజీవంగా నిలిపేందుకు భారతీయులు తరతరాలుగా నిరంతరం కొనసాగిస్తూ వస్తున్న ప్రయత్నాలలో  భాగంగానే మైలవరపు సుధా మోహన్ రచించిన ‘శివస్య కులం’ పుస్తకాన్ని చూడాల్సి వుంటుంది.

ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకం మొత్తం రెండు భాగాలుగా విభాజితమై వుంది. మొదటి భాగంలో మొత్తం ఎనిమిది అధ్యాయాలలో కులం గురించి కూలంకషమూ, సమగ్రమూ అయిన చర్చ వుంది. రెండవ భాగంలో ద్రావిడియనిజం గురించి ఏడు అధ్యాయలలో లోతయిన చర్చవుంది.

కులం అన్న పదం గురించి ఎవరికీ సరయిన అవగాహన కానీ, ఆలోచన కానీ లేదని కులం అన్న పదానికి ప్రాచీన కాలం నుంచీ వున్న అర్థాలను వివరిస్తూ, ఆ పదానికున్న విస్తృతార్థాన్ని ఉదాహరణలతో, రిఫరెన్సులతో నిరూపిస్తూ, కులం అన్న పదం caste అన్న పదానికి సమానార్థకం కాదని వివరిస్తూ, మూలాల్లోకి వెళ్ళి శోధించి ప్రదర్శిస్తుందీ పుస్తకం మొదటి భాగం ఎనిమిది అధ్యాయాలలో.

కులాన్ని పాశ్చాత్యులు ఎలా పొరబాటుగా అర్థం చేసుకున్నారో, భారతీయుల దృష్టిలో వర్ణం, కులం వంటి పదాలకు చారిత్రికంగా వున్న అవగాహన ఏమిటి అన్నదాన్ని వివరిస్తూ ఏ రకంగా విదేశీపాలకులు ఈ పదాలను, అర్థాలను అపార్ధం చేసుకున్నరో విపులీకరించి, అందువల్ల కలుగుతున్న అనర్థాలను వివరిస్తుంది మొదటి అధ్యాయం.

19th century missionaries in India were apparently selectively blind and unreasonably determined to find faults with Hinduism. In that pursuit, they used anything and everything that suited their convenience. Propagating partial information on caste happened to fit in that category. The objective of the desperate attempt to compare the Hindu Varna and Kula system with the European caste or estate system was not to understand the underlying concepts but to attack oppressive caste system and then attach caste to Hinduism.  The key element to remember is that the European version of Indian caste was also heavily leaning on race theory.( పేజీ 29)

ఇది ఈ పుస్తకం మొత్తానికి ఆధారమైన వాదన. ఈ వాదనకు ఋజువులూ, నిరూపణలు అందిస్తూ, కులం భావనకు కారణమయి అంతర్గతంగా ఒదిగివున్న తాంత్రిక సైద్ధాంతిక నేపథ్యాన్ని వివరిస్తూ, కులం, అస్పృశ్యతా భావన వంటి విషయాలను సప్రామాణికంగా నిరూపిస్తారు రచయిత మొదటి నాలుగు అధ్యాయాలలో.  అతి గహనము, నిగూఢమయిన కుల భావనను పైపైన చూసి బ్రిటీష్ వారు  చేసిన అకాండతాండవాన్ని,శైవం, శాక్తం వల్ల సమాజంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆచార భేదాలు, వర్ణాశ్రమ ధర్మాలను విశ్లేషిస్తూ, అస్పృశ్యతను తొలగించేందుకు తరతరాలుగా జరిగిన ప్రయత్నాలను  సోదాహరణంగా వివరిస్తారు రచయిత మిగతా అధ్యాయాలలో. ముఖ్యంగా శక్తి పూజ, ఆచార దురాచారాల నడుమ సంఘర్షణ ఏ రకంగా అస్పృశ్యతకు దారి తీసిందో వివరిస్తూ, ఈ సంఘర్షణలను, సమాజంలో కాలక్రమేణా పలు కారణాలవల్ల కలుగుతున్న మార్పులను విస్మరించి ఏర్పాటు చేసిన ఏ సిధ్ధాంతమయినా అసమగ్రమూ, అసంపూర్ణమూ మాత్రమే కాదు, అనర్థదాయకము కూడా అని రచయిత నిరూపిస్తారు.

అసంపూర్ణమయిన పరిజ్ఞానమూ, అసమగ్రమయిన పరిశోధన,  అవగాహనలతో పాశ్చాత్యులు భారతీయ సమాజం గురించి తీర్మానాలు చేసేసి సమాజంలో చిచ్చుపెట్టటం వెనుక కారణాలను రచయిత స్పష్టంగా వివరించారు.

“19th century Europeans of India did not have all the facts before them. The episode on Bhairava sects suggests that the missionaries and the colonial rulers ignored and perhaps also concealed the real reasons for the untouchability. It helped them immensely to do so and enabled the economic loot of Hindus, which it turn, paved the way to conversion” (page 163-64)

ద్రావిడ భావనను యూరోపియన్లు అర్థం చేసుకున్న విధానాన్ని, వారి లక్ష్యాలనూ రెండవ భాగం వివరిస్తుంది.

“the European theories are heavily influenced by their own experiences in various countries such as North and South America.” అని వివరిస్తూ, ఏ రకంగా క్రీస్టియానిటీని స్థానిక మతాల స్థానంలో ప్రత్యామ్నాయంగా అందించి అణచివేయటంవల్ల స్థానికులను సంపూర్ణంగా రూపాంతరమొందించారో వివరిస్తూ, అదే పధ్ధతిని భారతదేశంలోనూ ప్రయోగించారని నిరూపిస్తారు రచయిత వివిధ వాదనలు, ఉదాహరణల ద్వారా. ఆర్య ద్రావిడ విభజనలో భాగంగా ఏ రకంగా గ్రామదేవతల ఆరాధనను దయ్యాలు, భూతాలు, క్షుద్రపూజలతో ముడిపెట్టి , ఏ రకంగా సంస్కృతం బ్రాహ్మణులది అంటే, ఆర్యులది, ఇతర భాషలు అనార్యులవి, అంటే,  ద్రావిడులవి అన్న అభిప్రాయాలను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా  స్థిరపరచారో వివరిస్తారు రచయిత.

“But none of these Europeans could back their arguments by quoting any textual or scriptural or inscriptional authority or such prominent evidence. The only authority they had was the Christian missionary ruler/colonizer status. Many of their conclusions were mere assumptions based on biases. It appears from their writings that they did not understand Hinduism or Hindu society. They simply abused missionary power backed by colonial power to colonize Hinduism intellectually”( page No. 193)

ఈనాటికీ మేధావులుగా గుర్తింపు పొందే అనేకులు అడ్డదిడ్డంగా, ఆధారాలు, నిరూపణలు లేని విదేశీ రచయితల రచనలను ప్రామాణికంగా తీసుకుని అసంబధ్ధ, విధ్వంసకర, న్యూనతాభావన కారక తీర్మానాలు చేసేయటం కనిపిస్తుంది. ఆధారాలు నిరూపణలు నిలదీసి అడిగితే, ‘ఇది నా నమ్మకం’, ‘నా భావన’ అంటూ కప్పదాట్లు వేయటం, అదీ కుదరకపోతే, బ్రాహ్మణిజం, ఆరెస్సెస్, బీజేపీ, రైట్ వింగ్ అని పడికట్టు పదాల వాడకంతో వాదనను తప్పుదారి పట్టించటం గమనించవచ్చు. ఇలాంటి కుహనా దురర్ధక నిరర్ధక నిరాధార వాదనలు చేసేవారే మేధావులుగా గుర్తింపు పొంది సన్మానాలు పొందటం, వేదికలెక్కి మాట్లాడిందల్లా ప్రామాణికంగా పరిగణించటం అర్థం చేసుకుంటే రచయిత వాదనలోని సత్యం బోధపడుతుంది.

భారతదేశంలో సామాజిక సంస్కరణల పేరిట సంభవించినవన్నీ భారతీయులను అనాగరికులుగా చిత్రించి వారిని తామే సంస్కరిస్తున్నామన్న ఆధిక్య భావనను స్థిరపరచటం ద్వారా, భారతీయ సమాజాన్ని న్యూనతాభావానికి గురిచేసి తమకు విధేయులుగా చేసుకోవటంలో భాగమే అంటారు రచయిత. సతి నిషేధం ద్వారా, భారతీయ మహిళలపట్ల తమ సానుభూతిని చాటుకున్న బ్రిటీష్ వారు భారతీయ మహిళలను లైంగిక బానిసలుగా, ఎలాంటి గౌరవం లేకుండా వాడుకున్న విధానాలను ఎత్తి చూపించి మరీ సంస్కరణల్లో నిజాయితీని ప్రశ్నిస్తారు రచయిత.

“Missionaries did an extensive propaganda to justify their presence in India, on the other hand colonial atrocities on Indian women were either denied, ignored or downplayed.” (page No. 200)

ఈ పుస్తకంలో భూతవిద్య, తంత్ర, గ్రామ దేవతపూజ వంటి విషయాల గురించి ఎంతో లోతుగా చర్చ వుంది. ఎన్నెన్నో ఆలోచనలు కలిగిస్తూ, ఆశ్చర్యకరమైన సత్యాలను ఆవిష్కరిస్తాయి ఈ అధ్యాయాలు. ఈ అంశాలకు సంబంధించి రచయిత ఎంతో లోతయిన పరిశోధన అధ్యయనాలు చేశారన్నది ఈ అధ్యాయాలు చదువుతూంటే స్పష్టమవుతుంది. భారతీయాత్మ గురించి తెలుసుకోవాలంటే వేదాలు, ఉపనిషత్తులు అధ్యయనం చేయాల్సినట్టే, భారతీయ సామాజిక మనస్తత్వాన్ని, సామాజిక పరిణామక్రమాన్ని గురించి అవగాహన సాధించాలంటే, నాలుగు విదేశీ పుస్తకాలు చదివితే సరిపోదు. శైవం, వైశ్ణవం, తంత్రం, పలు విభిన్నమయిన ఆచారాలు, వీరగల్లులు, గ్రామదేవతారాధనలు, భూత పూజలు, ఇతర పద్ధతులు, కాళీపూజ, మాతృభావనలతో సహా అనేకానేక అంశాలను సూక్ష్మంగా, లోతుగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఈ పరిజ్ఞానానికి వేదాలు, ఉపనిషత్తులు పురాణాలకూ నడుమ అన్వయం సాధించాల్సివుంటుంది. అప్పుడే భారతీయ సామాజిక పరిణామక్రమం గురించి అణువంతయినా ఆలోచించే అర్హత కలుగుతుంది. అలాకాక, నోటికెంతొస్తే అంత, మెదడుకేది తోస్తే అదే పరమసత్యం అన్నట్టు ప్రకటించి పదిమందినీ కూడగట్టుకుని అదే నిజమని అరచి గోల చేస్తే తామున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులు కూడా వీరిని చూసి సిగ్గుపడతారు. అందుకే, ఎంతో పరిశోధనచేసి, నిరూపణలతో తన వాదాన్ని, ఆలోచనలను అందించిన  ‘శివస్య కులం’ రచయితను మనస్ఫూర్తిగా అభినందించాల్సి వుంటుంది.

ఈ నిజం గ్రహించేవారికి మనసుంది. లేనివారికి నాలిక వుండనే వుంది.

అయితే, ఈ పుస్తకం సామాన్య పాఠకుడు చదివి ఆనందించటం కొంచం కష్టం. తాను తెలుసుకొన్న విషయాలనన్నిటినీ పుస్తకంలో పొందుపరచి పాఠకుడిని ఒప్పించాలన్న తపనతో రచయిత ఎంతో సమాచారాన్ని అందించారు. అయితే, ఒక వాదన ఆరంభించి, ఉదాహరణలిస్తూ, మరో వైపు మళ్ళి, మళ్ళీ ఈ వైపు రాకపోవటంతో, అనేక సందర్భాలలో రచయిత చెప్పే విషయాలు గొప్పగా అనిపిస్తున్నా పాఠకుడిలో అయోమయం మిగిలిపోతుంది. ఈ పుస్తకంలో  ఒక రీసెర్చ్ పేపర్‌లా, విపరీతంగా ఫుట్ నోటులు, రిఫరెన్సులూ అందించటం వల్ల పుస్తకాన్ని చదవటం కష్టమవుతుంది. అందువల్ల, ఈ పుస్తకం సామాన్య పాఠకుడిని చేరక కొందరికి మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం వుంది. రచయిత టార్గెట్ పాఠకులెవరో స్పష్టంగా నిశ్చయించుకోవాల్సి వుంది. ఎందుకంటే, మేధావులమెదళ్ళన్నీ తాళాలుపడ్డ మెదళ్ళు. వారి మెదళ్ళ ద్వారాలు తెరచుకోవు. తెరచిన మెదళ్ళతో ఆలోచనలను ఆహ్వానించేది సామాన్యుడే.

ఈ పుస్తకంలోని అంశాలనే మరింత సరళతరం చేసి, సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అందించటం ఆవశ్యకమయిన విషయం. ఎందుకంటే, మన ధర్మం గురించి, ధర్మంపై జరుగుతున్న దాడి, దుర్వ్యాఖ్యానాల గురించి సామాన్యుడికి అవగాహన కలిగించాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతో వుంది. సామాన్యుడిని నమ్మించి, తన స్వీయధర్మంపై వైముఖ్యాన్ని కలిగించి పరధర్మానికి ఆకర్షించటం అధికంగా సాగుతోంది. కాబట్టి, ఈ పుస్తకంలోని అంశాలు సామాన్యుడిని చేరాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది. అలాగే, ఈ పుస్తకాన్ని తెలుగులోనూ, యథాతథంగా కాక సరళీకృతం చేసి అందించాల్సిన అవసరమూ వుంది.

***

Sivasya Kulam

Author: Mylavarapu VNL Sudha Mohan

Publisher: Samvit Prakashan

Pages: 342

Price: ₹ 599

For copies:

Ajeyam Strategy & Marketing Pvt. Ltd.
91-8248281150.

https://www.amazon.in/Sivasya-Kulam/dp/819504865X

~

శ్రీ మైలవరపు వి. ఎల్. ఎన్. సుధామోహన్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ లింక్:
https://sanchika.com/special-interview-with-mr-mvln-sudhamohan/

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-25 – తంగ్ ఆ చుకే హై

0

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘లైట్ హౌస్’ (Light House, 1958) చిత్రం లోని ‘తంగ్ ఆ చుకే హై’. గానం ఆశా భోస్లే. సంగీతం ఎన్. దత్త.

~

ఒక కవి రాసిన ఒకే కవితను రెండు సినిమాలలో రెండు భిన్నమైన సందర్భాలలో స్త్రీ, పురుష పాత్రలిద్దరి చేత పాడించి ఆ పాటను హిట్ చేసిన సందర్భాలు మరే సినీ కవి జీవితంలో ఉన్నాయో లేదో తెలీదు కాని సాహిర్ లుధియాన్వి సినీ జీవితంలో ఇది జరిగిన సందర్భాలు అనేకం. ఆయన పాటలలోని సాకిలను వివిధ సందర్భాలలో భిన్నమైన సందర్భాలలో భిన్నమైన సినిమాలలో వాడుకోవడం చాలా సార్లు జరిగింది. కాని ఆయన రాసిన ఒక గజల్‌ను రెండు భిన్నమైన సందర్భాలలో గురు దత్ ‘ప్యాసా’ సినిమాలోనూ నూతన్‌పై ‘లైట్ హౌస్’ అనే చిత్రంలోనూ ఉపయోగించుకున్నారు. సాహిర్ రాసిన పూర్తి గజల్‌లో కొన్ని చరణాలు ఒక సినిమాకి మరొకొన్ని చరణాలు మరో సినిమాకి వాడుకుని ఆ రెండు సందర్భాలలోనూ ఆ పాటను హిట్ చేసారు సంగీత దర్శకులు. ఇది సాహిర్ సాహిత్యానికి దక్కిన అరుదైన గౌరవం. తన కవిత్వ పదును తెలుసు కాబట్టే ఆయన తన స్వీయ విద్వత్తును తప్ప ఏ గాయకుడినీ, సంగీత దర్శకుడినీ నమ్ముకోలేదు. ఎవరికీ లొంగకుండా సినీ ప్రపంచంలో అందరినీ తన దగ్గరకు వచ్చేలా చేసుకున్నారు తప్ప తానుగా ఎవరి ప్రాపకం కోసం ప్రయత్నించలేదు. అత్యంత ఆత్మవిశ్వాసంతో జీవించినందువల్ల ఆయనను వ్యక్తిగా చాలా మంది ఇష్టపడేవారు కాదు. అలాగే ఆయనను విస్మరించగలిగే వాళ్లు కూడా కాదు. సినీ ప్రపంచానికి నాతో అవసరం కాని నాకు మీతో కాదు అన్నట్లుగానే జీవిస్తూ ఆయన చివరి దాకా సినీ కవిగా కొనసాగగలిగారు.

ఇప్పుడు మనం చర్చించుకోబోయే పాట ‘తంగ్ ఆ చుకే హై కష్మకషే జిందగీ సే హమ్’ అనే వాక్యంతో మొదలయ్యే సాహిర్ గజల్. దీన్ని ‘ప్యాసా’ సినిమా కోసం ఎస్.డి.బర్మన్ సంగీత దర్శకత్వంలో రఫీ పాడితే, లైట్ హౌస్ సినిమాకు ఎన్. దత్తా సంగీత దర్శకత్వంలో ఆశా భోస్లే పాడారు. ఈ కవిత గురు దత్‌కు ఎంతగా నచ్చిందంటే ప్యాసా సినిమాకు ముందుగా కష్మకష్ అనే పేరునే ఆయన ఖరారు చేసుకున్నారు. మనం లైట్ హౌస్ సినిమాలో ఆశా గానం చేసిన కవితను ఇక్కడ చర్చించుకుందాం.

లైట్ హౌస్ ప్యాసా వచ్చిన సంవత్సరానికి రిలీజ్ అయ్యింది. అంటే ప్రజలు రఫీ గొంతులో విన్న కవితను మర్చిపోకపోముందే మళ్ళీ ఆశా అదే కవితను మరో రకంగా, వేరే చరణాలతో గానం చేసింది. రెండు సందర్భాలలోనూ ఈ పాట శ్రోతలకు నచ్చింది. ఇది మరే కవి విషయంలోనూ జరిగి ఉండదు.  హిందీ సినిమాలలో సాహిర్ ఒక్కరే ఇలాంటి ప్రయోగాలను చేసి తన సత్తా చాటుకున్నారు. ఒక సినిమాలో వాడుకున్న హిట్ పాటను వెంటనే మరో సినిమాలలో అంతే గంభీరమైన సందర్భంలో వాడుకోవడం, రెండు సందర్భాలలోను ఆ పాటను శ్రోతలు మెచ్చడం గమనిస్తే సాహిర్ కలం పదును అర్థం అవుతుంది.

తంగ్ ఆ చుకే హై కష్మకష్ – ఎ – జిందగీ సే హమ్

ఠుకరా న దే జహాన్  కొ కహీన్  బేదిలీ సే హమ్

తంగ్ ఆ చుకే

(ఈ జీవిత సందిగ్ధతతో విసిగిపోయాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను)

కష్మకష్ – ప్రస్తుత సమాజంలో మనిషి జీవన విధానాన్ని వివరించే గొప్ప పదం. సందిగ్ధ స్థితిలోనే జీవితాన్ని పూర్తిగా గడపవలసి రావడం మనసున్న, ఆలోచించగల వ్యక్తికి నరకప్రాయం. ఆ స్థితికి చేరాక ఈ ప్రపంచం అవసరమా అన్న ఆలోచన మనిషికి వచ్చి చేరుతుంది. అందుకే ఇక్కడ కవి నేను గాయపడ్డ హృదయంతో ఈ ప్రపంచాన్నితిరస్కరించవచ్చు అని తనకు ఈ ప్రపంచానికి నడుమ ఏర్పడుతున్న దూరాన్ని తెలియజేస్తున్నాడు.

లో ఆజ్ హమ్నే  తోడ్ దియా రిష్తా – ఎ – ఉమ్మీద్

లో అబ్ కభీ గిలా నా కరేంగే కిసీ సే హమ్

ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్

తంగ్ ఆ చుకే

(నేను అన్ని బంధాలపై నమ్మకాన్ని విరిచేసాను. ఇక ఇప్పుడు ఎవరిపైనా నేను ఫిర్యాదులు చేయను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను. విసిగిపోయాను మరి)

మనకు చుట్టూ  ఉన్న బంధాలపై కొన్ని ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నప్పుడే, అవి విఫలమయినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది. అందుకే నేను అన్ని రకాల బంధనాల నుండి విముక్తుడవడానికి, వాటిని మనసులోనే విరిచేసాను. ఇక ఎవరిపై ఫిర్యాదు చేసే అవసరం నాకు రాకపోవచ్చు. ఏ ఫిర్యాదు అయినా సంబంధం ఉన్న మనుషులతోనే చేస్తాం. ఏ బంధమూ లేకపోతే అందరూ పరాయివారే కదా. పరాయివారి నడుమ ఫిర్యాదులవసరం ఏం ఉంది.

ఈ వాక్యాలు నాకు చాలా ఇష్టం. ఇందులో వైరాగ్యం ఉంది అలాగే ఒక తాత్వికత కూడా ఉంది. ఈ ప్రపంచం నుండి మనల్ని మనం కొంచెం కొంచెంగా విడదీసుకుంటే తప్ప మనసుకు ప్రశాంతత చిక్కదు. ఎన్ని బంధాలలో మునిగి ఉంటామో అన్ని గాయాలను మనసు మోయవలసిందే. అందుకే రమణ మహర్షి నుండి అరబిందో దాకా నిన్ను నువ్వు అర్థం చేసుకుని నీకు నువ్వుగా ఈ ప్రాపంచిక బంధాల నుండి విముక్తి వైపుకు ప్రయాణించాలని చెప్తారు. సాహిర్ కలం కూడా దీన్నే ఎన్నో సార్లు ఎన్నో సందర్భాలలో చాలా పదునుగా ప్రస్తావించింది.

గర్ జిందగీ మె మిల్ గయే ఫిర్ ఇత్తఫాక్ సే

పూఛేంగే అప్నా హాల్ తేరీ బేబసీ సే హమ్

ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్

తంగ్ ఆ చుకే

(జీవితంలో ఎప్పుడన్నా మళ్ళీ యాదృచ్ఛికంగా కలిస్తే, నీ నిస్సహాయతను  నా పరిస్థితి  గురించి అడుగుతాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను విసిగిపోయి ఉన్నాను.)

ఈ మొత్తం కవితలో ఈ చరణంలోని పై రెండు వాక్యాలు ప్రత్యేకంగా సాహిర్ వ్యక్తిత్వాన్ని ప్రస్తావిస్తాయి. సాహిర్‌లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతి నిస్సహాయ స్థితిలో కూడా మానవత్వాన్ని, మనిషితనాన్ని కోల్పోకపోవడం. అదే ఆయన కవిత్వంలోని బలం. అన్ని బంధాలపై నమ్మకాన్ని వదులుకుంటున్నానని అంటూనే తన మనసులోని ప్రేమతత్వాన్ని ఏ సందర్భంలోనూ దూరం చేసుకోడు సాహిర్. ఏ బంధం నుండి ఆశించిన ప్రేమ దొరకకపోయినా, దానివల్ల మనసుకెంత గాయం అయి ఒంటరితనం తప్పకపోయినా, తనను అన్ని విధాలుగానూ నిరాశపరిచిన వారు నిస్సహాయిలయి ఉంటారని, వారికి సంబంధించిన సమస్యలు, వారి ప్రాధాన్యతల విషయంలో వాళ్లలోని అలజడి ఉండి ఉంటుదని ప్రకటిస్తాడు. మనకు దూరం అయిన వారిపై కోపం కన్నా జాలి కలిగి ఉండడం, వాళ్లను దాటి ఎదగడమే కదా. వారిని నిస్సహాయులుగా చూడగలగడం సాహిర్ లోని అనంతమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. మోసం చేస్తున్నవాళ్లు, దూరం అవుతున్న వాళ్లు నిస్సహాయులని ఒప్పుకోవడంలో తనను వారి కన్నా మానసికంగా ఉన్నత స్థాయిలో నిలుపుకోవడం సాహిర్‌కు తనపై ఉన్న విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. ఈ విశ్వాసాన్ని ఎంతటి విషాదంలో కూడా వదులుకోక దాన్ని తన పాత్రలకు ఆపాదించడంతో ఆ పాత్రల నైతిక స్థాయిలో ఎంతో మార్పు వస్తుంది. సాహిర్ పాటలని వినే వాళ్ల ఆ వ్యక్తిత్వానికి విశ్వాసానికి దాసోహం అవుతారు.

ఆ పై చరణంలో ఎప్పుడో యాదృచ్ఛికంగా మళ్ళీ మనం కలిస్తే నీ నిస్సహాయతనే నా క్షేమాన్నిగురించి, నేలాగున్నానో  అడుగుతాను అంటూ సాహిర్ తన జీవితపు విషాదానికి అవతలి వారే కారణం అని ప్రకటిస్తూనే, వారి నిస్సహాయతను తాను గుర్తించానని, తన ప్రశ్న వ్యక్తులకు కాదు వారి స్థితిగతులు, ఆలోచనా విధానంపై అంటూ తనలోని ఆ మానసిక పరిపక్వతను చూపుతారు. ఏ దుఖాన్ని అయినా సామాజికంగా చూడడం సాహిర్ నైజం. అదే ఆతన్ని ఓ విశిష్ట కవిగా నిలబెట్టింది.

ఓ ఆస్మాన్ వాలే కభీ తో నిగాహ్ కర్

అబ్ తక్ యె జుల్మ్ సహతే రహే ఖామేషీ సే హమ్

ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్

తంగ్ ఆ చుకే

(ఓ ఆకాశంలో ఉన్నవాడా ఎప్పుడో ఒకసారన్నా ఇటువైపు దృష్టి సారించు. ఇప్పటిదాకా ఈ అన్యాయాలను మౌనంగా నేను భరిస్తూ వచ్చాను. ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను, విసిగిపోయాను)

చాలా సందర్భాలలో దేవుడిని ప్రస్తావించేటప్పుడు రకరకాల పదాలను వాడతారు. భగవాన్, దాతా, ఈశ్వర్ అలాగే ఉర్దూ పదాలను ఉపయోగించేటప్పుడు ఖుదా, పర్వర్దిగార్ లాంటి పదాలను కవులు ఉపయోగిస్తారు. ఈ పర్యాయపదాలన్నిటిలోనూ ఓ లోతు ఉంటుంది. అందుకే కవిత్వంలో ఒకే వస్తువును సంభోధించడానికి రకరకాల పదాలను ఉపయోగిస్తారు కవులు. ఇక్కడ ఆ దేవుడు తనని పట్టించుకోవట్లేదన్న కోపం, నిస్సహాయతను కవి పలికించాలి. దానికి ‘ఆస్మాన్ వాలే’ అన్న పదం చాలా గొప్పగా సరిపోయింది. అంటే అంత దూరాన ఉన్న దేవుడు అని అర్థం, దేవునికి తనపై కృప లేదని, ఆయనని తనకు మధ్య చాలా దూరం ఉందని ఓ నిష్ఠూరం కూడా ధ్వనింపచేయడానికి ఇక్కడ ఆస్మాన్ వాలే అన్న పదాన్ని సాహిర్ ఉపయోగిస్తారు. చాలా సందర్భాలలో ఆయన దేవుడికి ఆస్మాన్ వాలే అన్న పదాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.

“అరే ఓ ఆస్మాన్ వాలే బతా  ఇస్మే బురా క్యా హై

ఖుషీ కే చార్ ఝోంకే గర్ ఇధర్ సే భీ గుజర్ జాయే” అంటూ ఓ పాటలో దేవుడిని ప్రశ్నించగలగడం సాహిర్‌కే చెల్లింది.

“ఆస్మాన్ పే హై ఖుదా ఔర్ జమీన్ పే హమ్

ఆజ్ కల్ వో ఇస్ తరఫ్ దేఖతా హై కమ్” అంటూ మరో సందర్భంలో ఆ పైవాడిపై చలోక్తులు విసరడం సాహిర్ శైలి..

“బతా ఐ ఆస్మాన్ వాలే తేరే బందే కిధర్ జాయే” అంటూ మరో పాటలో ఆ దేవుడిని ప్రశ్నించారు సాహిర్.. అన్ని సందర్భాలలోనూ ఆ పైవాడికి తనకూ మధ్య పెరుగుతున్న దూరాన్ని ఎత్తు చూపడం ఆయన ఉద్దేశం,

అదే బాటలో ఇక్కడ ఓ పైనున్న వాడా ఎప్పుడో ఒక్క సారన్నా ఇటువైపు దృష్టి సారించవచ్చు కదా. నేను ఇంత కాలం మౌనంగా అన్ని అన్యాయాలను భరిస్తూనే వచ్చాను. ఇక నాకు ఓపిక నశించింది. ఈ భారం నా వల్ల కాదు అని స్పష్టంగా తన కోపాన్ని అసహాయతను కవి ఇక్కడ ప్రకటిస్తున్నారు.

తంగ్ ఆ చుకే హై కష్మకష్ – ఎ – జిందగీ సే హమ్

ఠుకరా న దే జహా కొ కహీ బేదిలీ సే హమ్

తంగ్ ఆ చుకే

(ఈ జీవిత సందిగ్దతతో విసిగిపోయాను.ఈ ప్రపంచాన్ని గాయపడ్డ హృదయంతో తిరస్కరిస్తానేమో నేను. విసిగిపోయాను మరి)..

ఈ పాటను ఇక్కడ స్త్రీ సందర్భంలో ఉపయోగించుకున్నారు దర్శకులు. సాహిర్ ఎక్కువగా మనుషుల భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే పాటలను రాసారు. అందుకే వాటికి లింగ భేదం ఉండదు. మనసుకు లింగ బేధం ఉండదని నమ్మిన కవి అతను. ఆయన పాటలన్నీ ఓ మనసు వ్యక్తీకరించే భావాలు మాత్రమే. అందుకే ఈయన గీతాలను యధాతథంగా స్త్రీ పాత్రలకు పురుష పాత్రలకూ కూడా ఉపయోగించుకునేవారు సినీ దర్శకులు. సాహిర్ గీతాలు మానవ భావోద్వేగాలకు ప్రతీకలు. ఆఖరికి శృంగార గీతాలలో కూడా లింగ భేదాన్ని తన పదాలకు అంటించని కవి సాహిర్.

గర్ జిందగీ మె మిల్ గయే ఫిర్ ఇత్తఫాక్ సే

పూఛేంగే అప్నా హాల్ తేరీ బేబసీ సే హమ్..

మనమూ ఇంత విశ్వాసంతో మన చుట్టూ ఉన్నవారితో సంభాషించగలిగితే, జీవితంలో అన్ని విషాదాలకు అతీతంగా ఎదిగినట్లే కదా..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

మరుగునపడ్డ మాణిక్యాలు – 106: కోడక్రోమ్

0

[సంచిక పాఠకుల కోసం ‘కోడక్రోమ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]కు[/dropcap]టుంబానికి అన్యాయం చేసే తండ్రులు తరచు తారసపడుతుంటారు. అవసానదశలో వారు కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఇలాంటి కథ తెలుగులో ‘గోరింటాకు’లో చూశాం. అయితే అందులో పశ్చాత్తాపం ఉండదు, స్వార్థం తప్ప. అందరూ ఇలాగే ఉంటారా? ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అయితే బిడ్డల కోపం మాత్రం ఏ కథలో అయినా ఒకేలా ఉంటుంది. అలాంటి తండ్రీకొడుకుల కథ ‘కోడక్రోమ్’ (2017). ‘కోడక్రోమ్’ అనేది ఒకప్పుడు కోడాక్ కంపెనీ వారు కెమెరాల్లో వాడేందుకు ఉత్పత్తి చేసిన ఫిల్మ్. డిజిటల్ కెమెరాలు రావటంతో కొన్నేళ్ళ క్రితం ఆ ఫిల్మ్ ఉత్పాదన ఆపేశారు. ఈ చిత్రంలో తండ్రి పాత్ర బెన్ ఒక ప్రపంచప్రఖ్యాత ఫొటోగ్రాఫర్. రాజకీయాలు, యుద్ధాలలో కీలక ఘట్టాలను ఫొటోలు తీసి పేరు గడించాడు. డిజిటల్ కెమెరాలు వచ్చినా అతను పాత కెమెరాలే వాడతాడు. అతనికి కుటుంబం కన్నా తన కళే ముఖ్యం. అతని కొడుకు మ్యాట్. ఇద్దరూ ఏళ్ళ తరబడి మాట్లాడుకోలేదు. అయినా ఇద్దరూ కలిసి బెన్ ఫొటోలు తీసిన పాత కోడక్రోమ్ ఫిల్మ్ డెవలప్ చేయించటానికి మైళ్ళ దూరం ప్రయాణించి వెళతారు. అప్పడు ఏం జరిగిందనేది కథ. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ ‘Over time, everything develops’. అంటే కాలం అన్నిటినీ మారుస్తుంది అని. డెవలప్ అనే పదాన్ని ఫిల్మ్‌కి కూడా అన్వయించుకోవచ్చు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

మ్యాట్ న్యూయార్క్ ఒక రికార్డుల కంపెనీలో పనిచేస్తుంటాడు. సంగీతకళాకారులతో ఒప్పందం చేసుకుని వారి పాటలు రికార్డు చేసి అమ్మటం ఆ కంపెనీ పని. మ్యాట్ బాధ్యత తీసుకున్న ఒక గాయకుడు ఆ కంపెనీతో తెగతెంపులు చేసుకుంటాడు. దాంతో మ్యాట్ ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. కొత్తగా వచ్చిన మరో బ్యాండ్ (సంగీతకారుల బృందం)తో ఒప్పందం చేసుకుంటానని మాట ఇచ్చి మ్యాట్ తన ఉద్యోగం కాపాడుకుంటాడు. అయితే ఆ బ్యాండ్‌కి అప్పటికే మరో కంపెనీతో ఒప్పందం ఉంది. వారిని ఎలా ఒప్పించాలో తెలియక మ్యాట్ అయోమయంలో ఉంటాడు. ఒప్పించాలంటే ముందు వారు మ్యాట్‌ని కలవటానికి ఒప్పుకోవాలి. అదే గగనంగా ఉంది.

ఇదిలా ఉండగా మ్యాట్ తండ్రి బెన్ తన అసిస్టెంట్ జోయిని మ్యాట్ దగ్గరకి పంపిస్తాడు. బెన్‌కి క్యాన్సర్. ఎంతో కాలం బతకడు. కోడక్రోమ్ ఫిల్మ్ డెవలప్ చేసే చివరి షాపు కాన్సస్ రాష్ట్రంలో ఉంది. త్వరలో మూసేయబోతున్నారు. బెన్ తన దగ్గరున్న పాత ఫిల్మ్ డెవలప్ చేయించాలని కాన్సస్ వెళ్ళాలనుకుంటాడు. ఆ ఫొటోలతో ఒక ప్రదర్శన పెట్టాలని అతని కోరిక. న్యూయార్క్ నుంచి కాన్సస్ రెండు వేల మైళ్ళ దూరం. విమానంలో ప్రయాణం చేయనంటాడు. కారులో వెళతానంటాడు కానీ మ్యాట్ తోడు రావాలంటాడు. మ్యాట్ ససేమిరా రానంటాడు. బెన్ వ్యవహారాలు చూసే ల్యారీ మ్యాట్‌తో “నువ్వొప్పుకుంటే నువ్వు కలవాలనుకుంటున్న బ్యాండ్‌తో మీటింగ్ నేను ఏర్పాటు చేస్తాను” అంటాడు. తన ఉద్యోగం కాపాడుకోవటానికి మ్యాట్ ఒప్పుకుంటాడు.

ఇంతకీ బెన్‌కీ, మ్యాట్‌కీ గొడవ ఏమిటి? బెన్ తన వృత్తి కోసం ప్రపంచం తిరిగేవాడు. ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బెన్ భార్య అతన్ని క్షమించింది. కానీ చివరికి అతను దగ్గర లేకుండానే మరణించింది (ఆ సమయంలో తాను ఆఫ్రికాలో ఉన్నానని, అక్కడ అంతర్యుద్ధం వల్ల రాలేకపోయానని బెన్ తర్వాత అంటాడు). మ్యాట్‌కి అప్పుడు పదమూడేళ్ళు. బాబాయి దగ్గర పెరిగాడు. చిన్నప్పుడు డ్రమ్స్ వాయించేవాడు. అది కూడా వదిలేశాడు. తండ్రిని క్షమించలేదు. అంత కోపం ఉంటే అసలు వెళ్ళకుండా ఉండొచ్చు కదా? తన ఉద్యోగం కాపాడుకోవటానికి వెళతాడు. అమెరికా లాంటి దేశాల్లో పట్టుదలలు కూడా షరతులతో ఉంటాయి. ‘నాకు లాభం ఉంటే పట్టు సడలిస్తాను’ అనే సంస్కృతి. అందరూ అలా ఉండరు కానీ చాలామంది అంతే. ఇప్పుడు ఇదే సంస్కృతి మన దేశంలోనూ వ్యాపిస్తోంది. మ్యాట్‌కి ఇంతకుముందే విడాకులైపోయాయి. అతని విడాకుల గురించి బెన్ వేళాకోళం చేస్తాడు. “నువ్వు ఏ పిట్టతోనైనా కక్కుర్తిపడ్డావా లేక మీ ఆవిడ కక్కుర్తిపడిందా?” అంటాడు. నోటికెంత మాటొస్తే అంత మాట అంటాడు. కళాకారులు ఎలా ఉన్నా వారి కళని గౌరవించాలని మొండిగా ఉంటాడు. ఇది తరతరాలుగా జరుగుతున్న చర్చ. కళాకారులు మంచి సృజన చేయటం ముఖ్యమా? మంచివారుగా ఉండటం ముఖ్యమా? బయటివారైతే కళాకారులు ఎలాంటివారినా వారిని కళని దృష్టిలో పెట్టుకుని వారిని గౌరవిస్తారు. కానీ ఇంట్లోవాళ్ళు వారి వ్యసనాలని భరించలేరు కదా?

జోయి బెన్‌కి అసిస్టెంటే కాక నర్సు కూడా. బెన్‌కి రోజూ ఇంజెక్షన్లు ఇవ్వాలి కాబట్టి ఆమె కూడా వారిద్దరితో బయల్దేరుతుంది. మొత్తం ఏడు రోజుల ప్రయాణం. రాత్రిపూట హోటళ్ళలో ఆగుతారు. మొదటి నుంచే బెన్, మ్యాట్ కీచులాడుకుంటూ ఉంటారు. బెన్ “నా నీడలో ఉండిపోవటం వల్ల నీకు ఈర్ష్యగా ఉంది. నేను పోయినా నా కళ బతికి ఉంటుంది. నువ్వేం సాధించావు?” అంటాడు. జోయిని కూడా కించపరుస్తాడు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్‌లో ఫోటోలు తీయటానికి వెళ్ళానని చెబుతూ “అప్పుడే ఆ అభిశంసన పెంటంతా ముగిసింది” అంటాడు. జోయి “పెంట అనకండి. ఆయన అక్రమసంబంధం పెట్టుకుని పైకి మాత్రం పవిత్రుడిలా నటించాడు” అంటుంది. “ఎవరూ పవిత్రులు కారు. అందరూ గ్రంథసాంగులే. నీకు తెలీదా? నీకు విడాకులెందుకయ్యాయి?” అంటాడు బెన్. జోయికి కూడా విడాకులయిపోయాయన్నమాట. ఆ మాటతో ఆమె వెనక్కి తగ్గుతుంది. బెన్ ఇంకా ఏదో అనబోతుంటే మ్యాట్ “ఆమెని వదిలెయ్. నీ సొల్లు కథలేవో చెప్పుకో” అంటాడు. తర్వాత జోయి మ్యాట్‌తో “ఆయన మీద అలా మండిపడకండి” అంటుంది. ఆమె ఇంకా బెన్‌ని వెనకేసుకురావటం మ్యాట్‌కి ఆశ్చర్యంగా ఉంటుంది. “చచ్చిపోతున్నాడు కదాని నోరుపారేసుకునే హక్కు ఆయనకి లేదు” అంటాడు.

ఇంతకీ మ్యాట్‌కి విడాకులెందుకయ్యాయి? జోయితో మాట్లాడుతూ అతను “నా భార్య నేను ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తానని, వర్తమానాన్ని అస్వాదించనని అనేది. అదొక్కటే కాదులే, ఇంకా ఏవో కారణాలున్నాయి” అంటాడు. గతంలో ఏదైనా గట్టి ఎదురుదెబ్బ తగిలినా, చిన్నప్పుడే విషాదాలు ఎదురైనా మరచిపోవటం కష్టం. చిన్నప్పటి చేదు అనుభవాలయితే మనిషి స్వభావాన్నే మార్చేస్తాయి. మనుషుల మీద నమ్మకం పోయేలా చేస్తాయి. లేక తన మీద తనకే నమ్మకం లేకుండా చేస్తాయి. బంధాలు కాపాడుకోవటం కష్టమైపోతుంది. పిల్లల కోసం పెద్దలు కలిసి ఉండకపోతే జరిగే విపరిణామాలివి. బెన్ తన వృత్తిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. వృత్తి ముఖ్యమే, కానీ అందులో మునిగిపోకూడదు. కొందరికి ధనకాంక్ష అయితే కొందరిది కీర్తికాంక్ష. బెన్ తన కీర్తికాంక్ష వదులుకుని నెలలో కొన్ని రోజులు కుటుంబం దగ్గర ఉంటే అతని దాంపత్య జీవితమూ బావుండేది, కొడుకు ప్రేమా దక్కేది. ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. క్యాన్సర్ బారినపడ్డాడు. దైవం ఇచ్చే తీర్పులో తేడా ఉండదు.

బెన్ తమ్ముడు డీన్ (మ్యాట్‌ని పెంచిన బాబాయి) తను పుట్టి పెరిగిన ఊరిలోనే ఉంటున్నాడు. ఆ ఊరు దారిలోనే ఉందని అందరూ అక్కడికి వెళతారు. తమ్ముడిని ఆఖరిసారి చూస్తానని బెన్ అంటాడు. అయితే డీన్‌కి కూడా అన్నగారి మీద కోపమే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని. అయినా అన్నగారిని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఆ దంపతులకి మ్యాట్ అంటే ఎంతో ప్రేమ. మ్యాట్ గది అలానే ఉంచారు. ఆ గదిలో బోలెడు క్యాసెట్లు, రికార్డులు ఉంటాయి. మ్యాట్‌కి చిన్నప్పటి నుంచి సంగీతం మీద మక్కువ. అందుకే అతను రికార్డుల కంపెనీలో చేరాడు. అసలు డ్రమ్మర్ కావాలనుకున్నాడు కానీ తల్లి చనిపోవటం, తండ్రి దూరమవటంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. ఇక్కడో చిన్న ఉపకథ వస్తుంది. డీన్ భార్య యుక్తవయసులో డీన్‌తో డేటింగ్ చేయటానికి ముందు ఒకసారి బెన్ ఆమె సమ్మతితో ఆమెతో శృంగారానికి ప్రయత్నించాడు. అయితే అతను తాగి ఉండటం వల్ల శారీరక సంబంధం ఏర్పడలేదు. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచింది. అది కాస్తా ఇప్పుడు బెన్ అందరి ముందూ బయటపెట్టేస్తాడు. ‘నేను చనిపోతున్నాను కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు’ అన్నట్టు ఉంటుంది అతని ప్రవర్తన. ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తుంది. కొడుకుని పట్టించుకోనివాడు ఇలాగే ఉంటాడు అని కూడా అనిపిస్తుంది. ‘న బ్రూయాత్ సత్యమప్రియమ్’ (అప్రియమైన సత్యాన్ని చెప్పవద్దు) అనేది పాటించకపోతే అనర్థాలు జరుగుతాయి. కానీ బెన్ లాంటి వాళ్ళకి చుట్టూ అనర్థాలు జరగుతుంటే అదో తుత్తి! యుద్ధరంగాల్లో, రాజకీయాల్లో అవే కదా ఎక్కువ జరిగేది.

మ్యాట్ తక్కువ వాడేమీ కాదు. జోయితో శృంగారానికి ప్రయత్నిస్తాడు. విజయాల మత్తులో విశృంఖలంగా ఉండేది కొందరు, వైఫల్యాలు చిత్తు చేస్తే క్షణికసుఖాలలో ఆనందం వెతుక్కునే వారు కొందరు. జోయి అతన్ని వారిస్తుంది. వారిద్దరూ ఒకే గదిలో ఉండటం బెన్ చూస్తాడు. కసి ఒక పక్క. అయినా వారిద్దరి మధ్యా ఏమీ జరగలేదని తెలిసి కొడుకుని వేళాకోళం చేస్తాడు. కారులో, జోయి అక్కడ ఉండగానే. అతని పద్ధతి చూసి “నువ్వెప్పుడైనా సంతోషంగా ఉన్నావా?” అని మ్యాట్ అడుగుతాడు. “పికాసో, హెమింగ్‌వే లాంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏ గొప్ప కళాకృతీ సంతోషంగా ఉన్న కళాకారులు సృష్టించినది కాదు. మితిమీరిన ఆకాంక్షలు, మితిమీరిన స్వీయప్రేమ, మితిమీరిన శృంగారం, మితిమీరిన కోపం – ఇవే గొప్ప కళాకారులని, గొప్ప మనుషుల్ని నడిపే ఇంజన్లు. అందుకే మేమందరం నికృష్టులం” అంటాడు బెన్. “నువ్వు నికృష్టుడివని నీకు తెలుసన్నమాట” అంటాడు మ్యాట్. “నేనేం మూర్ఖుడిని కాదు. నాకు తెలుసు” అంటాడు బెన్. కళాకారులు కళాసృజన చేస్తారు కాబట్టి వారి ప్రవర్తన ఎలా ఉన్నా భరించాల్సిందే అన్నట్టు మాట్లాడతాడు. తర్వాత మ్యాట్‌తో ఒంటరిగా ఉన్నప్పుడు “నేను మంచి భర్తని, తండ్రిని కాదని నాకు తెలుసు” అంటాడు. “అది పక్కన పెట్టు. నువ్వు నా మీద ఎప్పుడూ దృష్టి సారించలేదు” అంటాడు మ్యాట్. “నా దృష్టే నా జీవనాధారం” అంటాడు బెన్. అంటే మంచి ఫొటోకి కావలసిన విషయం లేకపోతే దాని మీద దృష్టి పెట్టడన్నమాట. ఇలా మాట్లాడేవాడు మ్యాట్‌ని తోడు రమ్మని ఎందుకడిగాడు? అదే మిగతా కథ.

ఈ చిత్రానికి జొనాథన్ ట్రాపర్ స్క్రీన్‌ప్లే రాయగా మార్క్ రాసో దర్శకత్వం వహించాడు. బెన్‌గా ఎడ్ హ్యారిస్, మ్యాట్‌గా జేసన్ సుడేకిస్, జోయిగా ఎలిబబెత్ ఓల్సన్ నటించారు. ఎడ్ హ్యారిస్ ఎంతో పరిణతి గల నటుడు. నెగటివ్ ఛాయలున్న పాత్రని అద్భుతంగా పోషించాడు. చిత్రం మొదటి భాగం కంటే రెండో భాగమే ప్రభావవంతంగా ఉంటుంది. మొదట్లో బోరు కొట్టినా ఓపిగ్గా చూస్తే మంచి చిత్రం చూసిన తృప్తి కలుగుతుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మ్యాట్ కలవాలనుకుంటున్న బ్యాండ్ షికాగోలో ప్రదర్శన ఇవ్వబోతోంది. షికాగో వీరు వెళ్ళే దారిలో ఉంది. అక్కడ బెన్ మ్యానేజరు ఆ బ్యాండ్‌కి, మ్యాట్‌కి సమావేశం ఏర్పాటు చేస్తాడు. సమావేశానికి ముందు ప్రదర్శన చూడటానికి ముగ్గురికీ టికెట్లు కూడా ఏర్పాటు చేస్తాడు. వెళ్ళే ముందు బెన్ మ్యాట్‌ని “ఆ బ్యాండ్‌ని మీ కంపెనీతో ఒప్పందం చేసుకోవటానికి ఎలా ఒప్పించబోతున్నావో చెప్పు” అంటాడు. “’మాది లాభాల కోసం చూసే కార్పొరేట్ సంస్థ కాదు. కళాకారుడంటే అమ్మకానికి ఒక ఉత్పత్తి కాదు, కళాకారుడంటే ఒక ద్రష్ట’ అని చెబుతాను” అంటాడు మ్యాట్. “అదేం వద్దు. వాళ్ళని పొగిడేవారు చాలామంది ఉంటారు. వాళ్ళ సంగీతంలో నీకేం నచ్చలేదో చెప్పు. ఆ లోపాన్ని నువ్వు సవరించగలనని చెప్పు” అంటాడు బెన్. మ్యాట్ కొట్టిపారేస్తాడు.

తర్వాత ఆ బ్యాండ్‌ని కలిసినపుడు మ్యాట్ వారితో మాట్లాడుతుంటే బెన్, జోయి కాస్త దూరంలో కూర్చుని ఉంటారు. బ్యాండ్‌లో డ్రమ్మర్, గిటారిస్ట్, బేసిస్ట్, గాయకుడు ఉంటారు. గాయకుడు జాస్పర్ మ్యాట్‌తో “మేం ప్రస్తుతం వరుస విజయాలతో ఉన్నాం. ఇప్పుడున్న కంపెనీని వదిలి మీ కంపెనీకి ఎందుకు రావాలి?” అంటాడు. బెన్ మాటలు గుర్తొచ్చి మ్యాట్ “మీ మొదటి ఆల్బమ్ గొప్పది. కానీ రెండో ఆల్బమ్ ఏం బాలేదు. అందులో డ్యాన్స్ పాట ఒకటి పెట్టారు. ఎవరి కోసం? పిల్లకాయల కోసం. అది మీకు కూడా నచ్చలేదని నాకు తెలుసు. మా కంపెనీకి వస్తే మీ ప్రత్యేకత నిలబెట్టుకునేలా సహాయం చేస్తాం. లేకపోతే మీరు ప్రవాహంలో కొట్టుకుపోతారు” అంటాడు. జాస్పర్ ఆలోచనలో పడతాడు. చివరికి సరే అంటాడు. ఇంతలో కాస్త దూరంలో కూర్చుని వీరి మాటలు వింటున్న బెన్ అప్రయత్నంగా బట్టల్లోనే మూత్రవిసర్జన చేస్తాడు. అది చూసి బ్యాండ్ సభ్యులందరూ నవ్వుతారు. ఎగతాళి చేస్తారు. జోయి బెన్‌ని తీసుకుని బాత్రూమ్‌కి వెళుతుంది. మ్యాట్ జాస్పర్‌తో “మీరు కొత్తవాళ్ళు కాబట్టి పొగరుగా ఉన్నారు. ఇంకా ఏ మూలో మీతో ఒప్పందం చేసుకోవాలని ఉంది. కానీ మీ మీద నాకు గౌరవం పోయింది” అని వచ్చేస్తాడు. ఇది జోయి వింటుంది. కాసేపటికి విషయం మ్యాట్ కంపెనీ యజమానికి తెలిసిపోతుంది. మ్యాట్ ఉద్యోగం ఊడిపోతుంది.

హోటల్‌కి తిరిగి వచ్చాక మ్యాట్ బార్‌కి వెళతాడు. బెన్ జోయితో “మ్యాట్ పిచ్చి పని చేశాడు. ఒప్పందం చేసుకోవాల్సింది” అంటాడు. జోయి “మీ అవమానాన్ని సహించలేకపోయాడు. అతనికి థ్యాంక్స్ చెప్పండి” అంటుంది. బెన్ పట్టించుకోడు. జోయి “మీరు ఈ కాస్త దయ కూడా అతని మీద చూపించకపోతే నేను మీకు సాయం చేయను. మీ నర్సుగా ఉండను” అంటుంది. బెన్ అసహనంతో “నేనే నిన్ను తీసేస్తున్నాను” అంటాడు. అతను ఇలా చాలాసార్లు అన్నాడు. కానీ ఈసారి ఆమెకి తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదు. ఆమె బార్‌కి వెళ్ళి మ్యాట్‌ని కలుసుకుంటుంది. తర్వాత ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు.

మ్యాట్‌కి మంచి సలహా ఇచ్చింది బెన్. ఆ సలహా పాటించబట్టి మ్యాట్‌కి తన ఉద్యోగం కాపాడుకునే అవకాశం వచ్చింది. కానీ బెన్ గౌరవానికి భంగం కలగటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. అలా వదులుకోవటం బెన్‌కి నచ్చలేదు! చూశారా? మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో? ఒక వృధ్ధుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే పరిహాసం చేసే మనుషులకు మానవత్వం ఉన్నట్టేనా? మానవత్వం లేనివారి కళలో మానవత్వం ఎలా ఉంటుంది? అంటే కళ ప్రపంచానికి చూపించే మెరుగు మాత్రమే, మనసు మాత్రం సంకుచితం. బెన్ లాంటి వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్పరు. వారు మంచి మనుషులు కాకపోవచ్చు కానీ మంచి కళాకారులు. కొందరు కళాకారులు పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం చౌకబారుగా ఉంటారు. అలాంటివారికి పతనం తప్పదు. అలాంటివారిని ప్రోత్సహించేవారు కూడా వారితో పాటు జారిపోకతప్పదు. మ్యాట్ చేసింది ఉన్నతమైన పని. అందుకే జోయి అతనికి దగ్గరయింది. మానవత్వం లేకపోవటం తప్పు కాదని బెన్ నమ్మకం. కానీ మ్యాట్ మానవత్వం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. పైకి మాత్రం దాన్ని అసమర్థత అని కొట్టిపారేశాడు. నాలుకతో ఏమైనా అనవచ్చు, అంతరాత్మ మాట ఎలా విస్మరించగలం?

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మర్నాడు జోయి హడావిడిగా బయల్దేరుతుంది. మ్యాట్ ఆపటానికి ప్రయత్నిస్తాడు. ఆమె “పొరపాటు చేశాను. నేను ఈ బంధానికి సిద్ధంగా లేను” అంటుంది. “నేను నీ మనసుని గాయపరచను. నీ మాజీ భర్తలా కాదు” అంటాడతను. “అతను తప్పు చేయలేదు. నేనే ఇంకొకరితో కలిసి తప్పు చేశాను. కారణం లేకుండానే!” అంటుందామె. స్క్రీన్‌ప్లే పకడ్బందీగా రాసుకోవటం వలన ఇది అనూహ్యంగా అనిపిస్తుంది. జోయి ఎంతో సౌమ్యంగా, సహనంగా ఉంటుంది. కానీ ఆమెలో కూడా లోపాలున్నాయి. వెనక్కి వెళ్ళి ఈ వ్యాసం చదివితే క్లింటన్ ప్రసక్తి వచ్చినపుడు బెన్ ‘క్లింటన్‌ని తప్పుబట్టటానికి నీకేం అధికారం ఉంది?’ అని ఆమెతో అనబోయాడు. కానీ మ్యాట్ అడ్డుపడటంతో ఆ మాట అనలేదు. తర్వాత బెన్ మోటుగా వారిద్దరినీ వేళాకోళం చేసినపుడు జోయి మౌనంగా ఉండటం విచిత్రంగా ఉంటుంది, కానీ దానికి కారణం ఇదీ. అసలు జోయి తన వ్యక్తిగత విషయాలు బెన్‌కి చెప్పిందంటే ఆమెకి అతని మీద ఎంత ఆప్యాయత ఉందో తెలుస్తుంది. తనలో ఉన్న లోపం తెలుసు కాబట్టే ఆమె బెన్ లోపాలని అర్థం చేసుకోగలిగింది. మ్యాట్ తన లోపాలకి తండ్రి కారణమని అనుకున్నాడు. మనుషుల అనుబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఒక దశ వచ్చాక మనుషులని క్షమించేయాలి. లేకపోతే మనకే నష్టం.

మ్యాట్ ఎంత చెప్పినా జోయి వినకుండా వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాట్ బెన్ గదికి వెళితే అతను అపస్మారక స్థితిలో ఉంటాడు. మ్యాట్ అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తాడు. డాక్టరు అతను ఇంక ఎంతో కాలం బతకడని, అతన్ని హాస్పిటల్లోనే ఉంచడం మంచిదని అంటుంది. ఆ రాత్రి బెన్ మ్యాట్‌తో మాట్లాడతాడు. “నువ్వు నెలల బిడ్డగా ఉన్నప్పుడు నేను రాత్రివేళల్లో నీకు పాలు పట్టేవాడిని. నిన్ను గుండెలకి హత్తుకుంటే నీ ఊపిరి తెలుస్తూ ఉండేది. నీకు ఎన్నో బాసలు చేశాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తానని, రక్షిస్తానని. నా గుండెలో అంతులేని ప్రేమ ఉప్పొంగేది. తర్వాత నాకు ఏమైందో, ఏ దయ్యం పట్టిందో, నా స్వభావమే అంతేమో.. కానీ అవకాశం వస్తే గతంలోకి వెళ్ళి ఆ క్షణాల్లో ఎప్పటికీ జీవించాలని అనుకుంటూ ఉంటాను. నన్ను క్షమించమని అడగను. నీ మీద ప్రేమ మాత్రం ఉంది” అంటాడు. మ్యాట్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎట్టకేలకు తండ్రిని క్షమిస్తాడు.

తర్వాత మ్యాట్ హాస్పిటల్ వాళ్ళకి తెలియకుండా బెన్‌ని కాన్సస్ తీసుకువెళతాడు. అక్కడ బెన్ షాపులో తన దగ్గరున్న ఫిల్మ్ డెవలప్ చేయటానికి ఇస్తాడు. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు. బెన్ అభిమానులు చాలామంది ఉంటారు. బెన్‌తో మాట్లాడి తమ అభిమానం వ్యక్తం చేస్తారు. అయితే డెవలప్ చేసిన ఫొటోల్లో ఏముందో చూసుకోకుండానే బెన్ మరణిస్తాడు. కానీ తాను తీసిన ప్రతి ఫొటో తనకి గుర్తుందని అంతకు ముందు అన్నాడు. చనిపోయే ముందు మంచం మీద కూర్చుని కెమెరా చూసుకుంటున్న బెన్ “ఆ శబ్దం విన్నావా?” అంటాడు. మ్యాట్ అప్పుడు బాత్రూమ్‌లో ఉంటాడు. చనిపోయే ముందు అనుభవం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. మరణంలో అందరూ ఒంటరివారే. బెన్ చివరి ఫొటో ప్రదర్శన ఇవ్వాలనుకోవటం అబద్ధం. అతను డెవలప్ చేయించిన ఫొటోలు మ్యాట్ చిన్నప్పటివి. ఆ ఫొటోల్లో బెన్, అతని భార్య, మ్యాట్ ఉంటారు. కొడుకు కోసం ఆ ఫొటోలు డెవలప్ చేయించాడు. ఉన్నోళ్ళకి పోయినోళ్ళు మిగిల్చిన తీపి గుర్తులవి. చివరికి మ్యాట్ జోయికి ఫోన్ చేస్తాడు. “నేను సంగీతం వదులుకున్నాను. నా భార్యని పోగొట్టుకున్నాను. తండ్రిని పట్టించుకోలేదు. ఇప్పుడు సంగీతసాధన మళ్ళీ మొదలుపెడుతున్నాను. నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు” అని వాయిస్ మెసేజ్ పెడతాడు. ఆమె అతని దగ్గరకి రావటంతో చిత్రం ముగుస్తుంది.

జీవితం బావుండాలంటే గతాన్ని గతంలోనే వదిలెయ్యాలి. అవతలి వారు సుముఖంగా ఉంటే బంధాలు మళ్ళీ కలుపుకోవచ్చు. లేకపోతే క్షమించి సాగిపోవటమే మంచిది. ఒకవేళ మనమే తప్పు చేస్తే? క్షమాపణ అనగానే వేరొకరిని క్షమించటం అనే అనుకుంటాం. మనల్ని మనం కూడా క్షమించుకోవలసిన సందర్భాలు దాదాపు అందరి జీవితాలలోనూ ఉంటాయి. అది ఎంతో ముఖ్యం. అయితే మళ్ళీ ఆ తప్పు చేయననే సంకల్పం ఉండాలి. తప్పులు చేస్తూ పోయి బెన్ క్షమాపణా అడగలేదు, తనను తానూ క్షమించుకోలేదు. ‘నేనింతే’ అనుకున్నాడు. మ్యాట్ తండ్రిని క్షమించి కొత్త జీవితం ప్రారంభించాడు. జోయి తనని తాను క్షమించుకుని మ్యాట్‌కి తోడుగా నిలిచింది. డీన్ భార్య లాగ ఆమె నిజాన్ని దాచలేదు. కాబట్టి ఆమె భయపడాల్సిన పని కూడా లేదు.

సిరివెన్నెల పాట – నా మాట – 74 – కన్నీళ్ళకు సరికొత్త భాష్యాన్ని చెప్పిన పాట

0

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి

~

చిత్రం: ఆహా

సంగీతం: వందేమాతరం శ్రీనివాస్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం : ఉన్ని కృష్ణన్, సుజాత, బృందం

~

పాట సాహిత్యం

పల్లవి:
ఆమె : సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ॥ 2 ॥
కోరస్ : సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥
ఆమె: నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
ఆమె: నవ్వి నవ్వి తడికానీ నీ కంటి పాపలు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
అతడు: ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన
చిక్కులెన్ని రానీ కరిగిస్తుంది చప్పున
కోరస్: సువ్వి సువ్వమ్మా సువ్వి సువ్వి ఆహా
॥ నవ్వులైన ॥

చరణం:
ఆమె: మావిపళ్ళు ఇవ్వదా మండువేసవి పైరుపాట పాడదా వానపల్లవి
అతడు: మంచుబాటలో సంకురాత్రిని తెస్తుంది కాదా చలి!
కాళరాత్రిలో కాంతిరవ్వలై వస్తుంది దీపావళి పండుగలన్నీ కనువిందుగ అల్లి ఋతువుల హారం
అందించే కాలం దేవుడు పంపిన దీవెన అనుకుంటే
ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే ॥ దేవుడు ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

చరణం:
అతడు: నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా
నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా
ఆమె: రేకులు వాడని పున్నమి నవ్వులు
రేపటి ఆశల ఊపిరి గువ్వలు
ఆలపించే సంగీతంలో సంగతులే గుండెలలో హాయి కచేరీ చెయ్యాలి
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి, ఆహా!
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

సుఖస్యానంతరం దుఃఖం
దుఃఖస్యానంతరం సుఖం
న నిత్యం లభతే దుఃఖం
న నిత్యం లభతే సుఖం

భారతంలోని ఈ శ్లోకానికి అర్ధం- ‘సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం వస్తాయి. దుఃఖమూ సుఖమూ ఎవరికీ, ఎప్పుడూ నిత్యం కాదని అర్థం. సుఖమంటే రెండు దుఃఖాల మధ్య తాత్కాలిక విరామం. బాధల వెంటే సంతోషాలు, కన్నీళ్ళు వెంటే ఆనందభాష్పాలు. కొంచెం ఓపికతో వేచి చూస్తే కన్నీళ్ళను తుడిచే సంతోషాలు, బాధలను మరిపించి ఆనందభాష్పాలు మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. మనలో కలిగే ఉద్వేగాలకు అసంకల్పితంగా వచ్చే హృదయ స్పందనే కన్నీరు. గుండెలోని తడి, కళ్ల ద్వారా చంపల పైకి చేరుతుందన్నమాట. మానవుల భావోద్వేగాలను లాక్రిమల్ గ్రంథులు ప్రేరేపించినప్పుడు కన్నీళ్లు వస్తాయి. నవ్వినా ఏడ్చినా అందుకే సందర్భంతో పని లేకుండా కన్నీళ్ళు బయటికి వస్తాయి. మరో విషయం! రోజూ సుమారుగా 300 మి.లీటరు కన్నీళ్ళు స్రవించి, కళ్ళను తడిగా ఉంచుతాయిట!

When you are joyous, look deep into your heart and you shall find it is only that which has given you sorrow that is giving you joy. When you are sorrowful look again in your heart, and you shall see that in truth you are weeping for that which has been your delight.. అంటారు ఖలీల్ జిబ్రాన్.

చిరునవ్వు, కన్నీళ్ళు ఈ ప్రపంచంలో అందమైన జోడి అయినా ఈ రెండూ కలిసి చాలా అరుదుగా కనిపిస్తాయి. మనసుకు ఏ స్పందన వచ్చినా ముందు ఇవే వస్తాయి. నవ్వు వచ్చినప్పుడు, ఆనందంతో కన్నీరొస్తే, బాధొచ్చినప్పుడు బాధతో కన్నీరొస్తుంది. ఏది చేసినా వచ్చే కన్నీరు ఒక్కటే! కానీ అది మనసు లోతుల్లో నుండి వచ్చే సహజసిద్ధమైన స్పందన కాబట్టి చాలా, బలమైనది, చాలా విలువైనది.

ఈ వారం మనం కన్నీళ్లు, చిరునవ్వులకు సంబంధించిన ‘ఆహా’, అనే చిత్రంలోని పాట గురించి విశ్లేషించుకుంటున్నాం. మంచి అనుబంధాలతో జీవిస్తున్న ఒక కుటుంబంలో; నాన్నమ్మ, అమ్మ, నాన్న, ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లి ఉంటారు. ఆ చెల్లెలు కాస్త అంగవైకల్యం కలిగి ఉంటుంది. పెళ్లయిన అన్నా, వదినలకు ఒక కొడుకు ఉంటాడు. వాడి బర్త్ డే పార్టీ రోజున తెలిసీ తెలియక, తన మేనత్తకు సంబంధించిన లోపాన్ని గురించి ప్రశ్నిస్తాడు. దాంతో ఆమె మనసు ఎంతో నొచ్చుకుంటుంది. అప్పుడు ఇంటిల్లిపాదీ, ఆమెను ఓదారుస్తూ ఈ పాటను ఆలపిస్తారు. ఈ పాట ‘సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి..’ అనే సంప్రదాయపు జానపద శైలితో ప్రారంభమవుతుంది.

ఎన్నో శతాబ్దాలుగా సజీవంగా ప్రాణం పోసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నాయి జానపదాలు. వాస్తవిక జీవితానుభవాలూ, ఆ అనుభవాలు రేపిన ఆవేశాలూ, ఆ ఆవేశాలు ప్రేరేపించిన భావన, ఆ భావన కల్పించిన చిత్రాలూ, ఆ చిత్రాల్ని నిర్మించిన మాటలూ, ఆ మాటలు మళ్ళీ పాటలై జనాల నోళ్ళలో నిరంతరం నర్తిస్తూనే ఉన్నాయి. సరళతతో, నిరాడంబరతతో, అందమైన దరువుతో, సహజమైన తెలుగు తీయదనాన్ని ఈ విశిష్ట సంస్కృతి చాటుతూనే ఉంది. ఈ జానపదాలకు ఊతగా,’ సువ్వి సువ్వి, సందమామ, వెన్నెల, తుమ్మెద, సిరిసిరిమువ్వ’.. వంటి పదాలు ఎక్కువగా ఈ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి.

పెండ్లిలో నలుగులు పెట్టేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు.. ఈ సువ్వి పాటలు ఎక్కువగా కనిపిస్తాయి.

1.సువ్వి సువ్వి సువ్వినీ
సుదతులు దంచెదరోలాలా ఆహుం..
~
అన్నమయ్య కీర్తనల్లోనూ ఈ జానపద శైలి మనకు తరచూ దర్శనమిస్తుంది.
2. సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె||
……………
కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె –
~
చుట్టాలబ్బాయి చిత్రంలో కూడా ఒక పాట ఇలా మొదలవుతుంది.
3.సువ్వి సువ్వి సుందరాంగిరో
కవ్విస్తూ ఉంటే నవ్వుతాదిరో..
~
స్వాతిముత్యం చిత్రంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాట మనందరికీ ఎంతో సుపరిచితమే.
4. సువ్వి సువ్వి సువ్వాలమ్మ, సీతాలమ్మా
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ..

ఉన్నికృష్ణన్, సుజాత, బృందం ఆలపించిన ఆహా చిత్రంలోని ‘సువ్వి సువ్వమ్మ’ పాటకు వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారు. సిరివెన్నెల గారు ఈ పాట ద్వారా తను అందించాలి అనుకున్న సందేశాన్ని మనకు అందించనే అందించారు. ఇక పాట సాహిత్యంలోకి వెళ్దాం!

పల్లవి:
ఆమె: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ॥ 2 ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥


ఆమె: నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
ఆమె: నవ్వి నవ్వి తడికానీ నీ కంటి పాపలు
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
అతడు: ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన
చిక్కులెన్ని రానీ కరిగిస్తుంది చప్పున
కోరస్: సువ్వి సువ్వమ్మా సువ్వి సువ్వి ఆహా

Then a woman said,
Speak to us of Joy and Sorrow.
And he answered:
Your joy is your sorrow unmasked.
And the selfsame well from which
your laughter rises was oftentimes
filled with your tears.
And how else can it be? –

అంటారు Kahlil Gibran.

‘నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులు’ అన్న సిరివెన్నెల గారి ఉపమానమే మనకు జిబ్రాన్ మాటల్లో కూడా వినిపిస్తుంది.

అసలు భగవంతుడు విశిష్టమైన మానవజన్మ ఇచ్చిందే, ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం.

‘చిదానంద రూపం.. శివోహమ్.. శివోహమ్’ అని నిర్వాణ షట్కములో చెప్పినట్టు శివాత్మకమైన ప్రతి మానవుడు చిదానంద రూపుడే! మనసులో ఎప్పుడూ సహజమైన ప్రశాంతతతో ఉంటూ, ఆనంద అనుభవంలో ఉండడమే చిదానందం. కానీ, ఆ సహజత్వానికి భిన్నంగా, లేనిపోని కృత్రిమత్వంలో చిక్కుకొని, మన జీవితాన్ని మనమే దుఃఖమయం చేసుకుంటున్నాం. కాబట్టి, వాటన్నిటినీ పక్కకు నెట్టి, నవ్వుతూ, తుళ్ళుతూ, హాయిగా, ఆశావహంగా ఉండమంటున్నారు సిరివెన్నెల.

మనం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టు, నవ్వినా, ఏడ్చినా కంట్లో నుండి నీళ్లయితే వస్తాయి. అందుకని కన్నీళ్లు కారేంతగా తుళ్ళి తుళ్ళి నవ్వమంటున్నది సిరివెన్నెల అంతరంగం.

‘ఎక్కెక్కి ఏడ్చే కన్నీళ్ళు ఉప్పన

ఫక్కుమన్న నవ్వే ఒక తేనె ఉప్పెన’

అంటున్నారాయన. వెక్కిళ్లు పెట్టి ఏడ్చినప్పుడు వచ్చే కన్నీళ్లు ఉప్పగా ఉంటాయనీ, మనసారా నవ్వినప్పుడు వచ్చే కన్నీళ్లు తేనె ఉప్పెనంత తీయగా ఉంటాయని, కన్నీళ్ళకు సరికొత్త భాష్యాన్ని, కన్నీటి రుచిని చెప్పారాయన. మానవ జీవితంలో కష్టాలు చుట్టాల్లా వస్తూ పోతూనే ఉంటాయి. కానీ మనసారా హాయిగా నవ్వగలిగితే, ఆ చిక్కులన్నీ చిటికలో సమసిపోతాయని ఒక పరిష్కారం మార్గాన్ని కూడా సూచిస్తున్నారు.

చరణం:
ఆమె: మావిపళ్ళు ఇవ్వదా మండువేసవి పైరుపాట పాడదా వానపల్లవి
అతడు: మంచుబాటలో సంకురాత్రిని తెస్తుంది కాదా చలి!
కాళరాత్రిలో కాంతిరవ్వలై వస్తుంది దీపావళి పండుగలన్నీ కనువిందుగ అల్లి ఋతువుల హారం
అందించే కాలం దేవుడు పంపిన దీవెన అనుకుంటే
ఈ జీవితమన్నది నవ్వుల జేగంటే ॥ దేవుడు ॥
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా
॥ 2 ॥ ॥ నవ్వులైన ॥

Nature is the best Teacher. మనసుపెట్టి ఆలోచిస్తే, ప్రకృతిలోని అణువణువు మనకు జీవితానికి కావలసిన అనుభవ సారాన్నంతా ఇస్తుంది, గురువై పాఠాలు చెబుతుంది. అదే విషయాన్ని బలంగా నొక్కి చెబుతున్నారు సిరివెన్నెల. అంత రుచికరమైన మామిడి పండ్లు కావాలంటే, అంత ఘుమఘుమలాడే మల్లెలు విరియాలంటే, అంత చల్లదనాన్ని ఇచ్చి కర్బూజ కాయలు కావాలంటే, మండిపోయే ఎండలు ఉండాలి. ఆ ఎండ కష్టాన్ని ఇష్టంగా ఓర్చుకున్నప్పుడే, ప్రకృతి మనకివన్నీ అందించగలుగుతోంది. ఇతరులందరికీ ఇబ్బందిగా అనిపించే వానాకాలం రైతులకు పచ్చటి పైరుల పండగలు తెస్తుంది. భరించలేని చలికాలంలో, వణికించే చలిలో, మంచులో.. సంబరాల సంకురాత్రి వస్తుంది. చిమ్మ చీకటి అమావాస్య రోజున వెలుగుల పండుగ దీపావళి, మనందరి జీవితాలను వెలిగిస్తుంది. నిజంగా ఆలోచిస్తే ప్రతి ఋతువులోనూ కష్టమూ, ఉంది సుఖమూ ఉంది. కష్ట సుఖాల మధ్య విడదీయలేని ఒక తీయటి బంధం ఉంది. ఈ ఋతువుల హారం మధ్యలో పండుగల పరమానందాన్ని అల్లి, దేవుడు మనకు చల్లటి దీవెనలు అందిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగిన రోజు, ఈ వేదాంత సారాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న రోజు, మన జీవితమే నవ్వుల జేగంటలా మోగుతుందని గట్టి భరోసా ఇస్తున్నారు సిరివెన్నెల.

చరణం:
అతడు: నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా
నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా
ఆమె: రేకులు వాడని పున్నమి నవ్వులు
రేపటి ఆశల ఊపిరి గువ్వలు
ఆలపించే సంగీతంలో సంగతులే గుండెలలో హాయి కచేరీ చెయ్యాలి
కోరస్: సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి, ఆహా!
॥ 2 ॥

ఇక రెండవ చరణానికి వచ్చేసరికి, మనం సంతోషంగా ఉంటే ప్రపంచం ఎలా కనిపిస్తుందో వివరిస్తున్నారు సిరివెన్నెల. Every Individual is a Universe in himself.. అన్నట్లు మనమే మన ప్రపంచం. అందుకే సిరివెన్నెల ‘నీ ఉల్లాసమై ఈ ప్రపంచమే ఉయ్యాలలూగాలిగా.. నీ సంతోషమే ఓ సందేశమై తారల్ని తాకాలిగా.. అంటారు. నీ ఉల్లాసం, నీ ఆనందం, ఈ సంతోషం, ప్రకృతికే వన్నెలు అద్దేలా ఉండాలంటారు. ఎవరి ప్రపంచానికి వారే మెరుగులు దిద్దుకోవాలి, అందాల్నీ, ఆనందాల్నీ అద్దుకోవాలి. అలసిపోని నవ్వుల్లో రేపటి ఆశల పున్నమి రెక్కలు చిగురిస్తూ ఉంటాయట. ఆ ఆశల ఊపిరి గువ్వల్లా ఎగురుతూ సంగీతం ఆలపించాలట. ఆ సంగీతంలోని సంగతులు గుండెల్లో హాయిగా కచేరి చేయాలట! ఎంత హృద్యమైన వ్యక్తీకరణ! ఎంత సున్నితమైన భావ కవిత్వం!

గొప్ప కవిలో ఉండాల్సిన సార్వజనీనత, విశ్వమానవత, సిరివెన్నెల సాహిత్యంలో అడుగడుగునా మనకు దర్శనమిస్తాయి. ఆయన సూక్ష్మ పరిశీలనా దృష్టి, భావుకత, మనిషితనం, అవ్యాజమైన ప్రేమ – ప్రతి పదంలోనూ ప్రకటితమవుతుంది. సజీవమైన సానుకూల దృక్పథమే పాటగా, బాటగా మారిన‌ మధురమైన పాటసారికి, ఇదే నా అక్షర నివాళి!!

Images Source: Internet

సినిమా క్విజ్-119

0

[dropcap]‘సి[/dropcap]నిమా క్విజ్’కి స్వాగతం.

పాత కొత్త తెలుగు హిందీ సినీ అభిమానులను అలరించే ఈ శీర్షిక తమ సినీ అవగాహనను, విజ్ఞానాన్ని పాఠకులు పరీక్షించుకోదగిన ప్రశ్నలతో అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాము. శ్రీ శ్రీనివాసరావు సొంసాళె ఈ ‘సినిమా క్విజ్’ శీర్షికను నిర్వహిస్తున్నారు.

ప్రశ్నలు:

  1. తమిళచిత్రం ‘పాపమణిప్పు’ ఆధారంగా, 1970లో ఏ. భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే కుటుంబం’ చిత్రంలో ఎన్.టి.ఆర్., కాంతారాఅవు, లక్ష్మి, రాజశ్రీ, నాగభూషణం తదితరులు నటించారు. ఈ సినిమాలో ‘ఇస్మాయిల్’ పాత్రలో నటించినదెవరు?
  2. శూద్రకుడు రచించిన 5వ శతాబ్దపు నాటకం ‘మృచ్ఛకటికం’ ఆధారంగా బి.ఎస్. రంగా దర్శకత్వంలో, అక్కినేని, అంజలీదేవి, పద్మిని (తెలుగులో ఆఖరి చిత్రం) నటించిన ఈ 1967నాటి చిత్రానికి మాటలు సదాశివబ్రహ్మం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు అందించారు. ఈ చిత్రంలో వసంతసేనగా నటించినదెవరు?
  3. కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., దేవిక, రామకృష్ణ, శోభన్ బాబు, ఎస్. వరలక్ష్మి నటించిన ‘శ్రీకృష్ణావతారం’ (1967) సినిమాలో జాంబవతిగా నటించినదెవరు?
  4. అంజలీదేవి సతీ సుమతిగా, సతీ అనసూయగా ద్విపాత్రిభియనం చేసిన ‘సతీ సుమతి’ (1967) చిత్రంలో అక్కినేని, జగ్గయ్య, సావిత్రి, జమున, కృష్ణకుమారి అతిథి పాత్రలలో కనిపిస్తారు. ఈ సినిమాలో ఈశ్వరునిగా నటించినదెవరు?
  5. సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కాంతారావు, కైకాల సత్యనారాయణ, సావిత్రి, ఉదయ్ కుమార్, నాగయ్య తదితరులు నటించిన ‘కంచుకోట’ (1967) చిత్రంలో శౌర్యవర్మ కుమార్తె జయంతి పాత్రలో నటించినదెవరు?
  6. విజయారెడ్డి దర్శకత్వంలో కాంతారావు, శారద నటించిన ‘శ్రీమతి’ (1966) చిత్రానికి మాటలు వీటూరి అందించారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు?
  7. బి. హరినారాయణ దర్శకత్వంలో 1970లో కాంతారావు (తొలిసారి ద్విపాత్రాభినయం), రాజశ్రీ, రాజనాల, లక్ష్మి నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల. కథ మాటలు జి. కృష్ణమూర్తి. ఈ సినిమా పేరేమిటి? (క్లూ: ‘భళిరా భళిరా ఫణం ఫణం’ పాట ఇందులోనిదే)
  8. హిందీ సినిమా ‘పాకెట్ మార్’ (1956) ఆధారంగా, సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్.టి.ఆర్., కైకాల సత్యనారాయణ, చలం, విజయనిర్మల నటించిన ఈ చిత్రానికి రచన భమిడిపాటి రాధాకృష్ణ. సంగీతం టి.వి. రాజు. ఈ సినిమా పేరేమిటి?
  9. డి. యోగానంద్ దర్శకత్వంలో 1970లో అక్కినేని, కృష్ణంరాజు, భారతి (ద్విపాత్రాభినయం), సూర్యకాంతం, జి.వరలక్ష్మి నటించిన ‘జై జవాన్’ చిత్రానికి కథ అందించినదెవరు?
  10. బసవరాజు పద్మనాభం దర్శకత్వంలో వాణిశ్రీ, హరనాథ్, శోభన్ బాబు నటించిన ‘కథానాయిక మొల్ల’ (1970) చిత్రానికి ఎస్. పి. కోదండపాణి సంగీతం అందించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలిగా నటించినదెవరు?

~

ఈ ప్రశ్నలకు జవాబులను 2024 డిసెంబర్ 17వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సినిమా క్విజ్ 119 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త క్విజ్‌తో బాటుగా 2024 డిసెంబర్ 22 తేదీన వెలువడతాయి.

సినిమా క్విజ్ 117 జవాబులు:

1.కైకాల సత్యనారాయణ 2. పెళ్ళిరోజు 3. భలే రంగడు 4. సి. నారాయణరెడ్డి 5. రేలంగి 6. షెరేడ్ (Charade) 7. వ్యాసుడు 8. లోగుట్టు పెరుమాళ్ళకెరుక 9. రమణారెడ్డి 10. స్వర్ణ

సినిమా క్విజ్ 117 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • మంజుల దత్త కె., ఆదోని
  • పి.వి.రాజు
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి, తెనాలి
  • సునీతా ప్రకాశ్, బెంగుళూరు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • వనమాల రామలింగాచారి, యాదగిరిగుట్ట

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. సినిమా క్విజ్ ఏదైనా ప్రశ్నకు నిర్వాహకులు ఇచ్చిన జవాబు మరొక సరైన జవాబు కూడా ఉన్న సందర్భంలో – ఆ జవాబు రాసిన వారిని కూడా సరైన జవాబులు రాసినవారిగా పరిగణించాము.
  2. ఈ సినిమా క్విజ్‍కి సంబంధించి ఏవైనా సందేహాలు కలిగితే క్విజ్ నిర్వాహకులు శ్రీనివాసరావు సొంసాళె గారిని 9182112103 లో సంప్రదించగలరు.
  3. క్విజ్ ఆధారాలకు సంబంధించిన సందేహాలకు క్విజ్ నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

అలనాటి అపురూపాలు – 250

0

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

~

దిగ్గజ సరోద్ విద్వాంసురాలు జరీన్ దారూవాలా శర్మ:

18 ఏళ్ళ వయస్సులో సినిమాల కోసం సరోద్ వాయించటం ప్రారంభించినప్పుడు, బొంబాయి సినీ స్టూడియోస్‌లో అప్పట్లో అందరూ పురుషులే ఉండటం, మహిళలు లేకపోవడంతో, జరీన్ గారిని ‘ఆ పార్శీ పిల్ల’ అని పిలిచేవారట. తరువాతి కాలంలో జరీన్ గొప్పగా రాణించి, పాటలో అయినా, నేపథ్య సంగీతంలోనైనా సరోద్ వినిపించాలంటే, తనే కావాలి అనేంతగా పేరు తెచ్చుకున్నారు. ఉన్నతస్థాయి కళాకారిణిగా, సరోద్ విద్వాంసురాలిగా కీర్తిప్రతిష్ఠలు పొందారు.

9 అక్టోబరు 1946న జన్మించిన జరీన్‌ను, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించమని పోలీసు అధికారైన ఆమె తండ్రి ప్రోత్సహించారు. నాలుగు సంవత్సరాల వయస్సు నుండి హార్మోనియం నేర్చుకోవడం ప్రారంభించి, ఆరేళ్ళ వయసు నుంచి వేదికలపై ప్రదర్శనలివ్వసాగారు. అయితే, 1952లో స్వామి హరిదాస్ సంగీత సమ్మేళనంలో రవిశంకర్-అలీ అక్బర్ ఖాన్ జుగల్బందీ విన్నప్పుడు ఆమె సరోద్‌‌ని ఇష్టపడ్డారు. పండిట్ హరిపాద ఘోష్ వద్ద మౌలిక శిక్షణ పొందారు, తరువాత పండిట్ భీష్మదేవ్ వేది, గాయకుడు ఎస్.సి.ఆర్. భట్, లక్ష్మణ్ ప్రసాద్ జైపూర్వాలే, ఎస్.ఎన్. రతంజన్కర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు వి.జి. జోగ్ వంటి వారి నుంచి కూడా మెలకువలు నేర్చుకున్నారు.

బాల మేధావిగా గుర్తింపు పొందారు. 50వ దశకం చివరిలో ‘మాసూమ్’ (1960లో విడుదలైంది) కోసం టైటిల్ మ్యూజిక్‌ని ప్లే చేయడం ద్వారా ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. ఈ చిత్రంలో ‘నానీ తేరీ మోర్ని కో’ పాట అత్యంత జనాదరణ పొందింది. అయితే, నాలుగు సంవత్సరాల తర్వాత సినీ పరిశ్రమతో ఆమె అనుబంధం బలపడింది. పీరియడ్ డ్రామా ‘చిత్రలేఖ’ (1964) టైటిల్ మ్యూజిక్ కోసం సంగీత దర్శకుడు రోషన్ ‘సితార్-సరోద్’ల యుగళం కోరినప్పుడు, సితార్ వాద్యకారుడు ఇమ్రత్ ఖాన్, జరీన్ గారి పేరు సూచించారు. జరీన్, ఆమె తండ్రీ దీన్ని ఊహించలేదు. సరేనన్నారు. రికార్డింగ్ బాగా జరిగింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డ్ చేయడానికి మరుసటి రోజు జరీన్ రాగలరా అని రోషన్ ఆమె తండ్రిని అడిగారు.

దాంతో, మర్నాడు, తండ్రీ కూతుర్లిద్దరూ బాంద్రా పరిసరాల్లోని మెహబూబ్ స్టూడియోకి వచ్చారు. ఈసారి ఆర్కెస్ట్రా మొత్తం బృందం అక్కడే ఉంది. దాంతో యువ జరీన్ కాస్త బెదిరిపోయారు. మరైతే వెళ్ళిపోదామా అని తండ్రి అడిగితే, అది మంచిది కాదని ఆమె భావించారు, వేచి ఉన్నారు.

కొన్ని గంటల తర్వాత, ఆమె వంతు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత, ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, “నేను సరోద్ వాయించడం ప్రారంభించినప్పుడు, చుట్టూ నిలబడి ఉన్న సంగీతకారులందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను స్త్రీని, సరోద్ వాయించే స్త్రీలు చాలా చాలా అరుదు. పైగా, సినీరంగంలో చాలా తక్కువ మంది మహిళలు ఉన్నారు, కాబట్టి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఇంతకు ముందెన్నడూ సరోద్‌ని చూడలేదేమోనని అనిపించింది. నేను సినిమాల కోసం సరోద్ వాయిస్తున్న 18 ఏళ్ల పార్సీ అమ్మాయిని కాబట్టి నా గురించి ప్రజలు తెలుసుకున్నారు” అని చెప్పారు జరీన్.

సరోద్‌ నేర్చుకోవడం కష్టమని చాలా మంది అనుకుంటారనీ, ఎందుకంటే దాన్ని వాయించడానికి ఎంతో ఓర్పు అవసరమని అన్నారు జరీన్. “సరోద్‌పై నైపుణ్యం సాధించటం కష్టం అనటం ఒక అపోహ. సితార్‌కు మెట్లు ఉంటాయి, దాన్ని వాయించేవారు ఐదు లేదా ఆరు నోట్‌ల వరకు ఒత్తిడి కలిగించడానికి ఒకే మెట్టుని ఉపయోగిస్తారు. అంటే, ప్రతి వాయిద్యానికీ దానికంటూ స్వంత మార్గం ఉంటుంది” చెప్పారామె.

సినీ సంగీత విద్వాంసుల పట్ల ఆ రోజుల్లో శాస్త్రీయ సంగీత కళాకారులకు చిన్న చూపు ఉండేది. సినీ సంగీత కళాకారులు – స్వరకర్తలు, మ్యూజిక్ కండక్టర్స్ వ్రాసిన నొటేషన్స్ ద్వారా సంగీతం వాయించే సెషన్ మ్యుజీషియన్స్ అనీ, వారికి సొంతంగా సృజనాత్మకత ఉండదనే దురభిప్రాయం ఉండేది. జరీన్ దారువాలా శర్మ రెండు చిత్రాలలో మెరిసారు, అలాగే శాస్త్రీయ సంగీతంలో కూడా విశేషంగా రాణించారు.

“నేను దృఢ సంకల్పంతో సంగీతం నేర్చుకున్నాను, జైపూర్‌వాలే ఒకసారి ఓ టప్పా (ఉత్తర భారతదేశపు జానపద గీతం) హమ్ చేయడం గమనించాను. నాకు నేర్పించమని అభ్యర్థించాను. ఆ కష్టమైన నమూనాలను సరోద్‌పై పలికించటం సాధ్యం కాదని ఆయన భావించారు. కఠోరమైన అభ్యాసం తరువాత, నేను దానిని చేయగలను” ఆమె తెలిపారు. జరీన్ సరోద్‌పై టప్పాలను అలవోకగా ప్రదర్శిస్తూ, తనదైన శైలిని రూపొందించుకున్నారు – గాయని, వాద్యకారిణిల ఆకర్షణీయమైన సమ్మేళనం అది.

మొదటిసారిగా ‘మాసూమ్’ (1960) సినిమాకి టైటిల్ స్కోర్‌ ఇచ్చారు జరీన్. తర్వాత, ఆమె రోషన్, శంకర్ జైకిషన్, రవీంద్ర జైన్, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్.డి. బర్మన్ మొదలైన అగ్రశ్రేణి స్వరకర్తలందరితోనూ పనిచేశారు.

 

బాంబే ఫిల్మ్ స్టూడియోలో పరిచయమైన సితార్ విద్వాంసుడు, హుస్న్‌లాల్ – భగత్‌రామ్ స్వరకర్తల జోడీ లోని భగత్‌రామ్ గారి కుమారుడు, పండిట్‌ అశోక్ శర్మను జరీన్ వివాహం చేసుకున్నారు. పండిట్ జైరామ్ ఆచార్య, ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్, ఉస్తాద్ రైస్ ఖాన్ తదితర సితార్ కళాకారుల సితార్ నైపుణ్యాలకు తన సరోద్ నైపుణ్యాలని జోడించారు జరీన్.

జరీన్ దారువాలా అనేక పాటల్లో సరోద్‌పై ఎన్నో సోలో పీస్‌‌లు వాయించారు. ఆమె సరోద్ పలికించిన కొన్ని పాటలను చూద్దాం:

బోలే రే పాపిహార | ఇస్ మోడ్ సే జాతే హై | నామ్ గమ్ జాయేగా | మేరే నైనా సావన్ భాదో | పియా బావరి | మన్ రే తు కాహే నా | బేచారా దిల్ క్యా కరే | కోయీ మత్వాలా ఆయా మేరే ద్వారే | సజన్వా బైరి హో గయే | బీతీ నా బితాయి రైనా | ఆ రి పవన్ డుంఢే కిసే | హుమే తుమ్సే ప్యార్ కిత్నా |

జరీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర గౌరవ్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలను గెలుచుకున్నారు. హర్ మెజెస్టీ, బ్రిటీష్ క్వీన్ – భారతదేశాన్ని సందర్శించినప్పుడు వారి ముందు ప్రదర్శన ఇచ్చే అవకాశం జరీన్ గారికి లభించింది.

ఏప్రిల్ 8, 2011న ముంబైలో జరిగిన ‘స్వర్ ఆలాప్‌’ అనే కార్యక్రమంలో, పండిట్ జరీన్ దారువాలా శర్మ, పండిట్ అశోక్ శర్మలను ఘనంగా సత్కరించారు. లెజెండరీ కంపోజర్ రవీంద్ర జైన్, డాక్టర్ సుశీలా రాణి పటేల్, పద్మశ్రీ డాక్టర్ ఎన్. రాజం, ప్రముఖ హాస్యనటుడు జానీ లీవర్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. పండిట్ జరీన్ దరువాలా శర్మ మాట్లాడుతూ.. “ప్రతి పాటకు సమాన విలువలు ఉంటాయి. నేను ‘స్వర్ ఆలాప్‌’కు కృతజ్ఞురాలిని. వారు మా ఇద్దరి పట్ల గౌరవంగా ఉన్నారు. స్వర్ ఆలాప్ భవిష్యత్తులో మరింత విస్తరించి ఉన్నత స్థితికి చేరుతుందని ఆశిస్తున్నాను. వారి ప్రయత్నాలు గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సరోద్ విద్వాంసురాలిగా ఆమె కృషికి – పండిట్ జరీన్ దారువాలా శర్మను సంగీతంపై అభిరుచి ఉన్నవారు; ఎంచుకున్న రంగంలో తమ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడే మహిళా సంగీతకారులు ఆమెను స్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఆమెను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. తరువాతి కాలంలో, పంటిట్ జరీన్ దారువాలా తన భర్త అశోక్ శర్మతో కలిసి అంధేరిలో నివసించారు. జరీన్ 20 డిసెంబర్ 2014 తేదీన మరణించారు.

శ్రీవర తృతీయ రాజతరంగిణి-37

4

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ సర్గ

అత్యుంచ పాతకృన్నీచోన్నతిదం చ నిరంకుశమ్।
అసీదపథగం సత్యం తదా జలవిజృంభితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 10)

నీళ్లల్లో అలలు ఎంత ఉధృతంగా వస్తున్నాయంటే, క్రింద ఉన్న వాటిని పైకి ఎత్తుతున్నాయి. పైన ఉన్న వాటిని క్రిందకు తెస్తున్నాయి. ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ జలాలు విజృంభిస్తున్నాయి.

పదాలతో దృశ్యాలను కళ్ళ ముందు నిలుపుతూ, ఆ దృశ్యాలలో తానూ ఓ భాగమైన అనుభూతిని మనస్సుకు కలిగించే అత్యద్భుతమైన రచనా సంవిధానం ఇది. నీటి అలలు ఎగసి పడుతున్నాయి. ఆ అలలను వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. అలలు ఎగిసి పడేటప్పుడు ద్రోణులు, శృంగాలు ఏర్పడతాయి. అల పైకి ఎగసినప్పుడు అలలు క్రింద ద్రోణిలో ఉన్నవాటిని పైకి లేపుతాయి. ఆ వెంటనే అల ద్రోణి ఏర్పడినప్పుడు ఆ పైన ఉన్న వాటిని క్రిందకు తెస్తాయి. ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాయట అలలు. ఎగసిఎగసి పడే అలలను చూసిన వారందరికీ ఈ వర్ణన ఆ అనుభవాన్ని తాజా చేస్తుంది. అలలు నిరంకుశమే కాదు,  అల్లరి కూడా చేస్తున్నాయి. ఎవ్వరి మాట వినవు. నిరంకుశమైనవి.

మృదోర్జలస్య తత్కాలేద్రి వృక్ష విటపాలిశు।
కేనోపదిష్టం తత్కాలే మలోత్పాటనపాటవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 11)

జలం మృదువైనది. ఒక పలచటి కాగితాన్ని చింపేందుకు కొంతయినా శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. కాగితాన్ని చింపేటప్పుడు వ్యతిరేక ఘర్షణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, నీళ్లు అలా కాదు, నీళ్లల్లోకి చేతులు సునాయాసంగా దించవచ్చు. నీళ్లను చీల్చవచ్చు. చొచ్చుకుపోవచ్చు. అంత మృదువైనవి నీళ్ళు. అలాంటి నీళ్ళకు – చెట్లను మూలాలతో సహా పెకిలించి వేయటం ఎవరు నేర్పారు? ఆశ్చర్యపోతున్నాడు శ్రీవరుడు.

పర్వత పాదాల వద్ద నున్న మట్టిని తొలిచేస్తూ, చెట్ల వ్రేళ్లతో సహా చెట్లను పెకిలించి వేసే శక్తి మృదువైన నీటికి ఎలా వచ్చింది? ఇలా వ్రేళ్లతో సహా పెకిలించి వేయటం నీటికి ఎవరు నేర్పారు అని ఆశ్చర్యపోతున్నాడు శ్రీవరుడు.

పర్వత ప్రాంతాలలో భూపాతాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి నీరు మట్టిని కోస్తూ, చెట్లను వ్రేళ్లతో సహా పెకిలించి వేయటం మరింత బాగా అర్థమవుతుంది. గుట్టలు, చెట్లు నీటి తాకిడికి కరిగిపోయి నీటి ప్రవాహంలో భాగం అయితాయి. ఓ వైపు భయం కలిగిస్తున్నా, మరో వైపు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే దృశ్యం అది.

శ్రీవరుడు ఈ సందర్భంగా రచించిన శ్లోకాలు కూడా ఈ రకమైన పరస్పర విభిన్నమైన, అనుభూతిని కలిగించే రీతిలో ఉండటం గమనార్హం.

ఊళ్ళూ, ఇళ్లూ, చెట్లు, గుట్టలను ప్రవాహం పెకిలించుని పోతుండటం ఎంతగా భయాన్ని కలిగిస్తుందో, అంతగా అద్భుతం అనినిపిస్తుంది.

మనిషి మనసులో కలిగే ఈ పరస్పర భిన్నమైన భావనలే మనిషిని సాహసం వైపు ఉసిగొల్పుతాయి. ప్రాణ ప్రమాదం ఉందని తెలిసినా పర్వతారోహణకు సిద్ధమవుతాడు మనిషి. అనేక సాహస కృత్యాలు చేస్తాడు. అలలపై నీటిపై జాలువారాలని తపన పడతాడు. ప్రకృతి శక్తిని ఎదిరించి నిలవాలని తహతహలాడతాడు. ఇలాంటి భావన కలుగుతుంది శ్రీవరుడి వర్ణనలు చదువుతుంటే.

ఓ వైపు ఊళ్ళూ, ఇళ్ళూ కొట్టుకుపోతున్నాయి. ఆస్తినష్టం, ప్రాణనష్టం కలుగుతోంది.

మనిషిగా ఈ పరిస్థితికి బాధపడుతూనే, కవిగా ప్రకృతిలో నిబిడీకృతమైన ఉన్న ఈ సర్వనాశక శక్తిని చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఆ వినాశక శక్తి సౌందర్యాన్ని దర్శించి దాన్ని తన అక్షరాలలో బంధించి ప్రదర్శించాలని తపన పడుతున్నాడు.

తుఫాను లోకి ప్రయాణించాలనే సాహసికుడిలో, దాన్ని తన కెమెరాలో బంధించాలని తపన పడే ఛాయాచిత్రకారుడిలో ఎలాంటి తపన కనిపిస్తుందో, ఎగసిపడే అలలతో నిరంకుశంగా ప్రవర్తిస్తూ, తీవ్రమైన కోపంతో సర్వం ముంచెత్తుతున్న నదుల ఆగ్రహావేశాలను అక్షరాలలో బంధించి ప్రదర్శించాలనే శ్రీవరుడి తపన కూడా అలాంటిదే. ఆనందం, ఆశ్చర్యం, బాధ, విషాదం కలగలిసిన అపూర్వ రచన ఈ వర్ణనలు.

మృదువైన జలాలకు ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?

గుట్టలను సైతం కొట్టుకుపోతూ, చెట్లను వ్రేళ్లతో సహా తీసుకుని వెళ్ళిపోవటం మృదు జలాలకు ఎవరు నేర్పించారు అని ఆశ్చర్యపోతున్నాడు. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మని రెమ్మరెమ్మకు’ అని ఆశ్చర్యం ప్రకటిస్తున్న కవి ప్రకృతిని చూసి ఎంతగా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నాడో, సర్వం తనలో కలిపేసుకుని ప్రవహించే నీటి వినాశక శక్తిని చూస్తూ శ్రీవరుడు కూడా అంతే సంభ్రమాశ్చార్యాలకు గురవుతున్నాడు. అయితే విరిసే పూలను చూసిన కవి హృదయంలో ఆనందాశ్చర్యాలుంటే;  శ్రీవరుడి హృదయంలో భయం, భక్తి కనిపిస్తాయి.

అగ్రాగ్ర పశుగోప్రాణిగృహధాన్యాధిహారకః।
భయదోభూజ్జలాపూరః స మ్లేచ్ఛోప్తింజసం నిభః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ సర్గ, 12)

నీటి ప్రవాహం పశువులను, ఊళ్లను, ప్రాణులను, ధాన్యాన్ని – సర్వం నాశనం చేస్తూ ప్రవహిస్తుంది. ఇది మ్లేచ్ఛుల హింసను తలంపుకు తెస్తూ భయావహంగా ఉంది.

ఈ శ్లోకం చదివిన తరువాత ఆగకుండా ముందుకు పోవడం కష్టం. ఈ ఒక్క శ్లోకంతో శ్రీవరుడు రాజతరంగిణి స్థాయిని విపరీతంగా పెంచివేశాడు. మనసు లోలోతుల్లోంచి దీర్ఘమైన నిట్టూర్పు వెలువడుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను గ్రహించకుంటే, వర్తమానంలోనూ అవే పొరపాట్లు జరగటంవల్ల, భవిష్యత్తు నాశనమవుతుందంటారు. గతం, భవిష్యత్తులో ప్రాణం పోసుకుంటుందంటారు.

అన్నింటినీ ముంచెత్తుతూ, దేన్ని వదలకుండా సర్వనాశనం చేస్తున్న వరద జలాలను చూస్తూంటే శ్రీవరుడికి ‘మ్లేచ్ఛుల హింస’ సజీవంగా కళ్ళ ముందు నిలిచిందట. మ్లేచ్ఛుల హింస అంత భయంకరంగా ఉందట ఆ ప్రళయ కాలం. ‘మ్లేచ్ఛులు’ అని శ్రీవరుడు ఎవరిని సూచిస్తున్నాడో చెప్పనవసరం లేదు.

కశ్మీరుపై భారతీయ రాజుల అధికారం తొలగిన తరువాత నుంచి కశ్మీరీయులకు దుర్దినాలు ప్రారంభమయ్యాయి.

ఆరంభంలో అధికారానికి వచ్చిన సుల్తానులు పరమత సహనం ప్రదర్శించారు. కానీ కశ్మీరులో ఇస్లామీయులు అధికారానికి వచ్చిన వార్త తెలిసిన వెంటనే పలు ఇస్లామీ పండితులు, ముఖ్యంగా హమదానీ వంటి సూఫీలు  కశ్మీరు వచ్చి చేరారు. కశ్మీరుకు అలవాటు లేని సంకుచితత్వాన్ని, అసహనాన్ని కశ్మీరులో ప్రవేశపెట్టారు. ఇస్లామేతరులపై హింసను, అత్యాచారాలను జరిపేందుకు ప్రేరణనిచ్చారు. దానికి ధార్మిక సమర్ధననిచ్చారు.  ఫలితంగా ఒక పద్ధతి ప్రకారం ఇస్లామేతరులపై దమనకాండ తీవ్రస్థాయిలో చెలరేగింది. ‘దులచా’ కశ్మీరును సృష్టి ఆరంభం స్థితికి తెచ్చి వెళ్ళాడు. సికందర్ బుత్‌షికన్, అల్లీ షాహల పాలనా కాలంలో ఇస్లామేతరులకు మతం మారటము, ప్రాణాలు వదలుకోవటం తప్ప మరో మార్గం లేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోవాలనుకునే వారి ప్రయత్నాలను భంగం చేసేందుకు కశ్మీరీ సైనికులు సరిహద్దులను కట్టుదిట్టం చేసి చిన్న పురుగు కూడా కశ్మీరం సరిహద్దులు దాటకుండా చూశారు. ఈ రకంగా ఇస్లామేతరుడన్న వాడు లేకుండా కశ్మీరును పూర్తిగా ఇస్లామికీకరణ చేయాలన్న పట్టుదల ఫలితంగా జైనులాబిదీన్ అధికారానికి వచ్చేసరికి కశ్మీరులో కేవలం 13 పండితుల కుటుంబాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వారు కూడా బిక్కుబిక్కుమంటూ దినదినగండం నూరేళ్ళ ఆయుష్షులా బ్రతికి ఉన్నారు.

ఇలా మహిళలు, వృద్ధులు, పిల్లలు, పండితులు, కళాకారులు వంటి తేడాలేమీ లేకుండా, సమాజంలో వ్యక్తి స్థాయి, గౌరవం వంటి వాటితో ఏ మాత్రం సంబంధం లేకుండా, ఎలాగయితే వరద నీరు ఇల్లు వాకిలిని, చెట్టు, గుట్ట అన్న తేడా లేకుండా అన్నిటినీ తనలో కలిపేసుకుంటూ పోతుందో, అలాగ ఇస్లామ్ మత సంకుచితవాదం కశ్మీరీ భారతీయులందరినీ మతం మార్చటమో, హతమార్చటమో చేస్తూ పోయింది. అన్నిటినీ ముంచెత్తుతున్న ఉధృతమైన వరద నీటిని చూస్తుంటే శ్రీవరుడికి ఇస్లామీయుల హింస గుర్తుకు రావటంలో ఆశ్చర్యం లేదు.

ఈ శ్లోకం చదువుతూ, ఆలోచిస్తుంటే ఆనాడు భారతీయ సమాజాన్ని ఇస్లాం ఓ తుఫానులా ముంచెత్తుతూన్న సమయంలో భారతీయుల హృదయాలలో చెలరేగిన భీతావహ జ్వాలలు, వారు కార్చిన నిస్సహాయ అశ్రువులు, వారి మనస్సులలో చెలరేగిన ఆవేశ వీచికలు మనస్సు గ్రహిస్తుంది. తెలియని ఆవేదన మనస్సుని చుట్టుముడుతుంది. ఎంతటి భయంకరమైన, దారుణమైన పరిస్థితులను , భయంకరమైన దమనకాండను, రాక్షసమైన మారణకాండనూ తట్టుకుని మరీ వారు తమ ధర్మాన్ని నిలుపుకుని భావితరాలకు సజీవంగా అందించారో ఆలోచిస్తే, హృదయం కరిగి నీరైపోతుంది.

ఆనాడే కాదు, ఈనాడు మన కళ్ళ ముందు జరుగుతున్న విషయాలను గమనిస్తే, మనసు భవిష్యత్తు పట్ల భయంతో గడ్డకట్టుకుపోతుంది.

1990 ప్రాంతాలలో మన కళ్ళ ముందే కశ్మీరులో పండితులను పద్ధతి ప్రకారం హత్యలు చేస్తూ, భయభ్రాంతులను చేస్తూ కశ్మీరు నుండి వెడలగొట్టటం సంభవించింది. ఆనాడు కశ్మీరు వదిలిన పండితులు ఇంకా స్వంతంత్ర భారతంలో కాందిశీకుల్లా బ్రతుకుతున్నారు. వారిని కశ్మీరులో స్థిరపరిచే ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇస్లామీ  తీవ్రవాదుల తుపాకుల నీడలో బ్రతికేందుకు బయటి వారెవరికీ కశ్మీరులో ధైర్యం సరిపోవటం లేదు. తీవ్రవాదుల హింసనుండి రక్షిస్తామన్న విశ్వాసాన్ని భారత ప్రభుత్వం కలిగించలేకపోతోంది.

ప్రస్తుతం మన కళ్ళ ముందే బంగ్లాదేశ్‍లో ఇస్లామీ సంకుచితవాదులు కంకణం కట్టుకుని మరీ హిందువులపై దాడులు చేయటం, దేశంలో జీవించాలంటే ఇస్లామ్ స్వీకరించటం తప్పనిసరి అని ప్రకటించి బెదిరించటం, ప్రస్తుతం జరుగుతున్న దారుణ దమనకాండలను చూస్తుంటే, ఇస్లామీయుల సంఖ్య ఎంతగా పెరిగితే అంతగా ఇస్లామేతరుల మనగడ ప్రమాదంలో పడుతుందన్న చేదు నిజం బోధపడి భయం తుఫాన్ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

అంతేకాదు, ఇస్లామీయులు అధికంగా ఉన్న దేశాలలో సైతం అంతఃకలహాలవల్ల  నెలకొంటున్న అరాచక పరిస్థితుల ఆధారంగా  ప్రాణాలు అరచేత పట్టుకుని ఇస్లామీయులు ఇతర దేశాలకు కాందిశీకులుగా చేరుతున్నారు. అక్కడ వారి సంఖ్య ఒక స్థాయికి చేరగానే సంఖ్యాబలం ఆధారంగా ఆయా దేశాలలో అరాచకం సృష్టిస్తున్నారు. తమ బల ప్రదర్శనతో ఆయా దేశాలపై ఆధిక్యం సాధించాలని చూస్తూన్నారు. ఇస్లామేతరులపై ‘హింస’ నెరపుతున్నారు. పలు యూరప్ దేశాలలో నెలకొంటున్న అరాచక పరిస్థితులు ఈ చేదు నిజాన్ని నిరసిస్తున్నాయి. ఫ్రాన్స్, ఇంగ్లండ్, అమెరికాతో సహా వలస వస్తున్న ఇస్లామీయులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలన్నీ ఇప్పుడు మ్రింగ లేక కక్కలేక, పెరుగుతున్న ఇస్లామీయుల ప్రాబల్యం వల్ల కలుగుతున్న దుష్పరిణామాలను ఎదుర్కొనలేక సతమతమవుతున్నాయి.

అయితే దీన్ని ‘ఇస్లామోఫోబియా’ గా కొట్టి పారేస్తున్నారు కొందరు. కానీ ఇది ఫోబియా కాదు, ఇది ‘స్కేరీ ట్రూత్ ఆఫ్ ఇస్లాం మెజారిటీ’ అని ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా మేధావులు గుర్తిస్తున్నారు.

కానీ శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలో ఈ శ్లోకం కళ్ళకు కట్టుకున్న గంతలను తొలగించి వేస్తుంది. కళ్ళకు క్రమ్మిన కుహానా లౌకికవాద పొరలను కరిగించి వేస్తుంది. చేదు నిజాన్ని నగ్నంగా చూపుతుంది.

అనాడు కశ్మీరులో జరిగిందే ఇటీవల కశ్మీరు లోనూ జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. ఆనాడు కశ్మీరులో జరిగిందే ఇప్పుడు, బంగ్లాదేశ్ లోనూ జరుగుతోంది. బంగ్లాదేశ్‌గా గుర్తింపు పొందిన ప్రాంతం భారతీయులది. ఇస్లామీయులు అధిక సంఖ్యలో ఉన్నారన్న కారణంతో అది బంగ్లాదేశ్ అనే ఇస్లాం దేశంగా అవతరించింది. ఇప్పుడు అక్కడ నుంచి హిందువులను మతం మారకపోతే చంపుతాం, తరిమి కొడతాం అంటున్నారు. మధ్యయుగం కాదిది. ఇరవయ్యొకటవ శతాబ్దం. కానీ మధ్యయుగపు దౌర్జన్యం, సంకుచితం  ఈనాడూ చలామణీ అవుతోంది. ఆనాడు కశ్మీరులోనూ కశ్మీరులో ఆరంభంనుంచీవుంటున్న పండితులను కశ్మీరునుంచి వెడలగొట్టారు. ఈనాడూ అది ఇంకా కొనసాగుతోంది.

వంగదేశం బంగ్లాదేశ్‍గా మారటంలో ప్రధాన పాత్ర పోషించింది సంఖ్యాబలం. ప్రజాస్వామ్యంలో అన్నిటికన్నా శక్తివంతమైనది సంఖ్యాబలం. శ్రీవరుడి రాజతరంగిణిలోని  ఈ శ్లోకం ఇలాంటి అనేక ఆలోచనలకు ప్రేరణనిస్తుంది.

నీరు మామూలుగా వున్నప్పుడు మృదువయినది. ఒడ్డు దాటని ప్రవాహంతో ఆనందం కలిగిస్తుంది. కానీ, నీరు అధికమైనప్పుడు, ఒడ్డుకు ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. ఇంకా అధికమైతే, అన్నిటినీ ముంచెత్తుతుంది, మ్లేచ్చుల హింసలా!!!

అందుకే ఓ కవి అన్నట్టు “ఈ ప్రపచం మారదు. అది కొత్తగా కనపడినా దాని ముఖం పాతదే!”. ఈనాడు ‘ఏక్ హైతో సేఫ్ హై’, ‘బటోగీ తో కటోగీ’ వంటి నినాదలు ప్రజలలో స్పందన కలిగిస్తున్నాయంటే, దాని వెనుక కొన్ని వేల, వందల సంవత్సరాల ‘హింస’, ‘దౌర్జ్యన్యం’ తాలూకు ఆనవాళ్ళు,  జ్ఞాపకాలు, అనుభవాలు ఉన్నాయి. కళ్ల ఎదురుగా నడుస్తున్న చరిత్ర తాలూకు అవగాహన ఉంది. అవకాశం దొరికితే చాలు, వరదలా ముంచెత్తే ‘మేచ్ఛ హింస’ పొంచి ఉందన్న  గ్రహింపు ఉంది. ఆ గ్రహింపునిస్తున్నది చరిత్ర ద్వారా  శ్రీవరుడి రాజతరంగిణి. అందుకే ‘గతాన్ని మరచిన వారికి వర్తమానం లేదు, భవిష్యత్తు ఉండదు’ అంటారు. గతంలో పొరపాట్లే, చేసిన పొరపాట్లే చేస్తూంటారంటారు.

(ఇంకా ఉంది)

వసంత లోగిలి-7

0

[శ్రీమతి బంటుపల్లి శ్రీదేవి రచించిన ‘వసంత లోగిలి’ అనే నవలను ధారావాహికగా అందిస్తున్నాము.]

[నిత్య తనకి చెప్పిన వివరాలని తన భర్తకి చెబుతూంటుంది శారద. ఆస్థానంలో లెక్కలు రాసే ఉద్యోగి కొడుకు సుధీర్ వర్మ. నిత్య తండ్రి. అతను నిత్యకి తన గత జీవితం గురించి చెప్తుంటాడు. చిన్నప్పుడు తండ్రితో తానూ కోటకి వెళ్ళి, అక్కడి పిల్లలతో ఆడుకునేవాడినని చెప్తాడు. తిలక్ బహదూర్ గారి సోదరి అంజన భర్తని కోల్పోయి, కొడుకు ధనుంజయ్‍తో సహా అన్నగారి దగ్గరకి వచ్చేస్తుంది. దుందుడుకు స్వభావం గల ధనుంజయ్ అందరితోనూ గొడవలు పడుతూండేవాడు. ఒకరోజు ఆటలో ఓడిపోయిన ధనుంజయ్ సుధీర్ వర్మను చంపేస్తానంటూ మీదకి వస్తే, అతని తండ్రి అడ్డుకుంటారు. అప్పుడు ధనుంజయ్, సుధీర్ తండ్రిని కొడతాడు. అది చూసిన తిలక్ బహాదూర్ ధనుంజయ్‍ని తీవ్రంగా మందలిస్తారు. అది అంజనకి నచ్చదు. సుధీర్‍ని కోట లోకి రానీయకుండా చూడాలని ప్రయత్నించి విఫలమవుతుంది. రాజగురువు మార్తాండ పిల్లలందరినీ కథలు చెప్పేవాడు. ఒకరోజు అక్కడికి స్వప్నికను తీసుకువస్తుంది ఆమె తల్లి నందిని. అది అలవాటయి, రోజూ కథలు వినడానికి వచ్చేది స్వప్నిక. సుధీర్ పక్కనే కూర్చునేది. ఆమెకి ఎన్నో సందేహాలు కలిగేవి. అవన్నీ మార్తాండగారిని అడిగి తీర్చుకునేది. స్వప్నిక సుధీర్‍తో స్నేహంగా ఉండడం ధనుంజయ్‍కి నచ్చేది కాదు. పిల్లలంతా పెద్దవాళ్ళవుతారు. స్వప్నిక ధనుంజయ్‌ల మద్య వైరం కూడా పెరుగుతుంది. మార్తాండ నేర్పుతున్న విద్యలలో సుధీర్ రాణిస్తాడు. ఓ రోజు స్వప్నికతో వాగ్వాదం జరిగి, తాను ఆమెను పెళ్ళి చేసుకుని తీరుతానని అందరి ముందూ గట్టిగా అరుస్తూ చెప్తాడు ధనుంజయ్. అది విన్న నందిని, స్వప్నికను బయటకు పంపటం మానుకుంటుంది. పిల్లను అలా బంధించి ఉంచటం మంచిది కాదు. రాచరికపు ఛాయల నుంచి మనం బయటపడాలని తిలక్ బహాదూర్ అనేవారు. అందుకు సమయం రాలేదని నందిని అంటుంది. రాబోయే స్వప్నిక 18వ జన్మదినం రోజున ఆమె భవిష్యత్తుకు మార్గం వేసే తన నిర్ణయాన్ని చెబుతానంటాడు తిలక్ బహాదూర్. అందరూ ఎదురు చూసిన పుట్టినరోజు రానే వస్తుంది. నందిని వెళ్ళి స్వప్నిక గది తలుపు తట్టి, నిద్ర లేచి బయటకు రమ్మని పిలుస్తుంది. కానీ బదులు రాదు. అంజన కూడా ప్రయత్నిస్తుంది. కానీ జవాబు లేదు. తిలక్ బహాదూర్ ఆ గది తలుపులని బలవంతంగా తెరిపించి చూస్తే, లోపల స్వప్నిక ఉండదు. తాను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నట్టు ఒక లేఖ ఉంటుంది. అది చదివిన ఆమె తల్లిదండ్రులు దుఃఖంలో కూరుకుపోతారు. స్వప్నిక కోట వదిలిపోయింది అన్న వార్త అందరికీ తెలిసిపోతుంది. ధనుంజయ్ కోట బాధ్యత అంతా తనదే అన్న స్థాయిలో హడావిడి చేస్తాడు. మార్తాండ తిలక్ బహాదూర్‍ని ఊరడించే ప్రయత్నం చేస్తాడు. ఇక చదవండి.]

[dropcap]పే[/dropcap]లవంగా నవ్వుతూ.. “నా గారాలపట్టి, నా వంశాంకురం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది.. తరాల శాపం నా ముద్దుల తనయను దారి మళ్ళించింది.. ఈ ఎడబాటు భరించడం చాలా కష్టంగా ఉంది మార్తాండా, ఏంటి మార్తాండా ఇది?.. ఎందుకిలా జరుగుతోంది” అన్నారు తిలక్ బహుదూర్.

“విధి బలీయమైనది తిలక్ బహుదూర్.. ఎంతటి వాడైనా ‘విధి’ని ఓడించడం సాధ్య౦ కాదు సుమా!” అంటూ స్వాంతన వాక్యాలతో సముదాయిస్తున్నారు మార్తాండ.

“నా ఆశలు, ఆశయాలు అడుగంటి పోయాయి, నా కలలు కల్లలైపోయాయి.. నా ప్రాణానికి ప్రాణం నన్ను వదిలి ఎలా వెళ్ళింది? కాసింతైనా మా గురించి ఆలోచించకుండా అలా ఎలా వెళ్ళిపోయింది” అంటూ రోదిస్తోంది నందిని.

అదే అదునుగా తన కొడుకు ధనుంజయ్‌కి దక్కాల్సిన స్వప్నిక దక్కలేదన్న కసితో “అందర్నీ ఈ కోటలోకి రానివ్వద్దని ఎన్నో సార్లు అన్నా, వదినలకు చెప్పి చూశాను. తరాలు మారినా రాచరికం రాచరికమే కదా!, ఆధునిక పోకడలు అంటూ, ప్రపంచం గురించి తెలుసుకోవాలంటూ.. కోట బయటకు పోనిచ్చారు. ..కోటని, కన్న తల్లి తండ్రులను వదిలేసి, బహుదూర్ వంశపు పరువు తీసింది. బిడ్డ ఎవరి మీద మోజు బడ్డదో- ఏమో! రెండో కంటికి చిక్కకుండా ఉడాయించింది” అని అంటున్న అంజన వైపు అదోలా చూసింది నందిని.

‘మనసులో అనుకోవాల్సిన మాటలు, బయటకు అనేసానేంటి?’ బాధలో ఉన్న వదినమ్మ విన్నదని గమనించి నోరు కరుచుకుంది అంజన.

“మన చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికి చూసాం.. కాని ఎక్కడా జాడ లేదు.. పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చి వస్తున్నాం, వాళ్ళు కూడా గాలిస్తున్నారు.. రెండు రోజులైంది.. ఏమై పోయిందో ఏమో! అర్థం కావట్లేదు అంటూ చెబుతున్నారు వెతకడానికి వెళ్లి వచ్చిన కొంత మంది వ్యక్తులు” అంది అంజన.

‘నేను మనువాడాలనుకున్న స్వప్నిక ఇలా ఎలా చేసింది? ఎందుకు చేసింది?ఈ కోటని ఆస్తుల్ని వదిలి పోవాలని ఎలా అనిపించింది?ఈ స్వప్నికకి’, అనుకుంటూ.. ‘ఏమి జరిగినా మన మంచికే.. స్వప్నిక కూడా లేదు కాబట్టి, తిలక్ మామకి, నందిని అత్తకి, నేనే దిక్కు. స్వప్నిక ఎంత వెతికినా దొరకకుండా ఉంటే బాగుణ్ణు కానీ, కొద్దిగా ఎక్కడో వెలితి, స్వప్నిక కూడా నాదైతే ఎంతో బాగుండు కదా’ అనుకున్నాడు ధనుంజయ్ మనసులో. ‘స్వప్నిక చాలా పెంకిఘటం, తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. బయటకు పోయి మంచి పనే చేసింది.. ఇక రాకూడదు తను.. ఈ కోటలో అడుగుపెట్టకూడదు, అత్తా మామకి నేనే దిక్కవ్వాలి.. ఈ ఆస్తిని నేనే అనుభవించాలి’ అని మనసులో ఆనంద పడుతున్నాడు ధనుంజయ్.

“స్వప్నిక.. ఈ రాజసాన్ని, సామ్రాజ్యాన్ని వదిలి ఎక్కడికిపోయి ఉంటుంది, ఎంత వెతికినా దొరకడం లేదేంటి బహుదూర్ మామా?” అన్నాడు ధనుంజయ్.

“అదే అర్థం కావటం లేదు ధనుంజయ్” అన్నాడు బహుదూర్.

ఆనంద డోలికల్లో ఊరేగుతున్న ధనుంజయ్‌కి అర్థం కాని ప్రశ్న, స్వప్నిక ఎందుకు వెళ్లి పోయింది? ఎలా వెళ్ళిపోయింది?.. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తల్లి తండ్రులను శోక సముద్రoలో వదిలేసి అంత ప్రశాంతంగా ఎలా వెళ్ళిపోయింది? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇలాంటి ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదే మాట తల్లి అంజనతో అన్నాడు కొడుకు ధనుంజయ్.

“కొంపదీసి మన ప్లాన్ గాని స్వప్నికకి తెలీదు కదా!.. అవసరమైతే తిలక్ బహుదూర్‍ని, నందిని అత్తని ఒక రూమ్‌లో బంధించి.. స్వప్నిక మెడలో తాళి కడతా! అని మనం చర్చించుకున్న విషయం తెలిసి పారిపోలేదు కదా, అమ్మా” అన్నాడు ధనుంజయ్ .

“అదేరా! నాకు అర్థం కావటం లేదు. పాపం మా అన్నయ్య, వదినలు స్వప్నిక వెళ్ళినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదు. కూతురు కోసం బెంగ పెట్టుకున్నారు” అంది అంజన.. “అయినా! మన ఆలోచన ఏంటో వాళ్లకి ఎలా తెలుస్తుంది?” ..మళ్ళీ అంది అంజన తేరుకుని.

“ఈ కోటలో మార్తాండ గురువు గారు తప్ప మిగిలిన వాళ్ళు అంతా మనం చెప్పినట్లే ఆడుతారు.. ఆ మార్తాండ గురువు మాత్రం మామయ్య చెప్పు చేతల్లో ఉంటాడు. మిగిలిన వాళ్ళని మెల్లిగా నేను బుట్టలో వేసుకున్నాను” అన్నాడు ధనుంజయ్. కాని లాభం ఏముంది.. స్వప్నిక లేదు..

“అయితేనేం? ఇక ఆస్తులు ఎలా మన పేరుమీద రాసుకోవాలో ఆలోచించాలి, ఓ పథకం రచించాలి.. అసలు ఏమేమి ఆస్తులు.. ఎక్కడెక్కడున్నాయో సమాచారం రాబట్టాలి.. అప్పుడు ఒక ప్రణాళిక వెయ్యాలి.. పథకం ప్రకారం పని జరగాలి” అంది అంజన

“అదే ఆలోచిస్తున్నా అమ్మా! ఇప్పుడు మనకు పని ఇంకా సులభతరం కావచ్చు.. ఇదివరకు స్వప్నిక ఉండేది. తనతో పాటు ఆస్తులు పొందాలనుకున్నాం.. కాని ఇప్పుడు తను లేదు. కాబట్టి, తన ఆస్తిపాస్తులన్నీ మామ తిలక్ బహుదూర్ నాకే ఇస్తాడు.. ఇక ఇవ్వక తప్పదు.. అత్తా, మామ బతికేది ఇంకా కొన్ని నాళ్ళే. అదీ మనం బతకనిస్తే! వీళ్ళని ఈ ప్రపంచానికి తెలియకుండా మట్టుపెట్టాలి” అన్నాడు ధనుంజయ్.  “ముందు గుట్టు తెలుసుకునే మార్గం చూడాలి ధనుంజయ్.. తరువాత అలోచించి చూద్దాం” అంది అంజన.

“అమ్మా! స్వప్నిక ఎప్పుడైనా వస్తే?..”

“అసలు దానిని రానీయకూడదురా ధనుంజయ్” అంది తల్లి సంజన.

“హ.. హ.. హా.. అందుకే స్వప్నిక ఎక్కడికెళ్ళింది, ఏమైంది.. తన జాడ తెలుసుకోవాలి. మట్టు పెట్టాలి. అదే పనిలో ఉన్నా అమ్మా!.. మన ఊరిలో నా పాత స్నేహితుల ‘టీం’ కి ఆ పని అప్పజెప్పా.. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. అది కూడా మన నుంచి తప్పించుకోలేదులే” అన్నాడు ధనుంజయ్. “ఒక వేళ స్వప్నిక చిక్కితే, నాతో పెళ్ళికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆస్తి మొత్తం నాది అవుతుంది. దానికి ఒప్పుకోకపోతే, ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అమ్మా!” అన్నాడు ధనుంజయ్.

“అమ్మా! తిలక్ మామ, నందిని అత్తయ్యల దగ్గరే నువ్వు ఉండి, స్వప్నిక జాడ గురించి ఎవరైనా ఏదైనా చెబితే నాకు తెలియ జేయ్యు” అని, తల్లి అంజనకి పురమాయించాడు ధనుంజయ్.

“అయ్యో నీ గారాలపట్టి ఎక్కడికి పోయింది, ఏమైపోయింది వదినా” అంటూ వల్లమాలిన జాలి జూపిస్తూ.. వచ్చి పోయేవారిని ఒక కంట కనిపెడుతూ అక్కడే తచ్చాడుతోంది అంజన.

కోటలో ధనుంజయ్, అంజనల మద్య జరుగుతున్న ప్రతి చర్చని, వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉన్నారు మార్తాండ.

***

అడవుల మద్య ఉన్న ఆశ్రమంలో.. వేదమంత్రాల సాక్షిగా సుధీర్ – స్వప్నికల వివాహం సాదాసీదాగా జరిగిపోయింది. అక్కడ పిల్లలకు వేదాలు చెబుతూ, ఈ ప్రపంచానికి దూరంగా సుధీర్ – స్వప్నికలు కాలక్షేపం చేస్తున్నారు. ‘ఎంతో ప్రేమగా పెంచుకున్న అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాను, ఎందుకో తెలీదు! నన్ను సహధర్మచారిణిగా చేసుకున్న సుధీర్ వర్మకి దగ్గరగా ఉన్నా, ఎందుకో తెలీదు! నాకు సుధీర్ వర్మకి పెళ్లి ఒక కలలా ఉంది. ఒకరంటే ఒకరికి ఇష్టం.. కాని పెళ్లి చేసుకునేంత ఇష్టం ఉందా! ఏమో. ఆ ప్రశ్నకి సమాధానమే లేదు నా దగ్గర. ఇదా నా జీవితం? ఈ ప్రపంచాన్ని చూడాలనుకున్నాను, రాజసం వదిలెయ్యాలని అనుకున్నాను, సామాన్యురాలిలా బతకాలనుకున్నాను. సమాజం పరిగెడుతోంది.. దాని వెంట పరిగెట్టాలని ఆశపడ్డాను.. కాని ఇక్కడ.. ఇలా దొంగలా బతకాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇంతలా బాధ పడుతూ, బతకునీడుస్తూ.. కోట, ఆ రాచరికపు గురుతులు వాటితో పాటు నా ప్రాణమైన అమ్మానాన్నలను వదిలేసి ఉండాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కాని, ఎందుకు ఇలా జరిగింది’ అని మథనపడుతోంది సుమిత్ర పేరుతో చలామణి అవుతున్నస్వప్నిక.

“అసలు.. అసలు నా పుట్టిన రోజు.. ముందు ఏమి జరిగింది సుధీర్” అని అడిగింది సుమిత్ర.

“అదే నాకు అర్థం కాలేదు స్వప్నికా.. కాదు కాదు.. సుమిత్రా..” అన్నాడు సుధీర్.

“నీ పుట్టిన రోజుకి వారం ముందే.. నీ 18వ పుట్టిన రోజు వేడుక బాగా జరగాలని, మీ కుటుంబమంతా క్షేమంగా ఉండాలని మా నాన్నగారు చాలా సేపు పూజలు, వ్రతాలు చేసారు.

ఎందుకింత ప్రత్యేకంగా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు.. కాని నీ పుట్టిన రోజుకి ముందు రోజు రాత్రి నువ్వు మా ఇంట్లో ఉన్నావు తెలుసా! కాని, ఒంటి మీద తెలివి లేకుండా ఉన్నావు.. మత్తులో ఉన్నావు. ‘ఏమి జరిగింది స్వప్నికకి’ అని అడిగిన నాకు నాన్నగారు వెళ్తూ వెళ్తూ.. ‘ఇక్కడ స్వప్నిక ఉంది అన్న విషయం ఎవ్వరికీ తెలియరాదు.. ఇది ప్రభువు ఆజ్ఞ.. మూడో కంటికి తెలియకూడదు.. నువ్వు ఇంట్లోనే ఉండు.. ఎవ్వరికీ అనుమానం రాకూడదు.. మూడు రోజులు గడిచిన తరువాత విషయం చెబుతాను’ అని బయటకు వెళ్ళిపోయారు.

కాని ధనుంజయ మనుషులు ఊరు, వాడ నీ కోసం గాలిస్తున్నారు అని నాకు తెలిసింది.. నాతో నువ్వు ఉంటావని గ్రహించినట్టున్నారు, నా కోసం మనుషులను పంపారు. అది తెలిసిన మా నాన్న ఆ మనుషుల ముందే.. ‘సుధీర్ వర్మ.. నీకు గాని స్వప్నిక ఏమైనా చెప్పిందా!.. ఎక్కడికి వెళ్లిందో తెలియటం లేదు’ అని నన్ను పిలిచి అడగడమే కాకుండా.. ‘నువ్వు కూడా స్వప్నిక ఎక్కడికి వెళ్ళిందో కాస్తా వెతికి పెట్టే పనిలో ఉండు’ అన్నారు.. దానితో నామీద అనుమానం రాలేదు వాళ్ళకి.

పోనీ నిన్ను అడుగుదామంటే నీకు తెలివి రాలేదు.. నాలుగవ రోజు అర్ధరాత్రి.. నగరం నిద్ర పోతున్న వేళ.. మనల్ని అక్కడ నుంచి వేరే చోటుకు తరలించారు.. బహుశా ఈ అడవుల్లో ఉన్న ఆశ్రమానికే మనల్ని తెచ్చినట్టు ఉన్నారు. కాని మనల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఈ ఆశ్రమ పెద్దతో మా నాన్న ఏదో మాట్లాడారు.. కాని ఏంటి అనేది నాకు తెలియదు.

అక్కడ నుంచి వచ్చి.. నా పక్కనే కూర్చున్న నాన్న ఓ మాట నాకు చెప్పారు.. అది నేను జీర్ణించుకోలేని విషయం.. అదేంటి అంటే మనిద్దరి వివాహం.

‘స్వప్నిక (సుమిత్ర) రాజకుమార్తె, భోగ భాగ్యాల మద్య పెరిగిన పిల్ల.. తనని నేను వివాహం చేసుకోవడమేంటి? మీకు మతి గాని పోలేదు కదా!’ అన్నాను. ‘అయినా ఈ విషయం స్వప్నికకి తెలుసా!’ అన్నాను.. అందుకు నాన్నగారు ఏమి చెప్పారో తెలుసా! సుధీర్ – స్వప్నిక ల వివాహ౦ అవశ్యం.. అది జరగాలి అంతే. కొన్నిటికి కారణాలు ఉండవు.. పోను పోను మీకే తెలుస్తుంది.. ప్రస్తుతం ఆ విషయాలు తెలుసుకోవలసిన వయసు రాలేదు’ అన్నారు” చెప్పాడు సుధీర్.

“అయితే నాతో వివాహం జరగుతోందని నీకూ తెలియదా సుధీర్” అంది స్వప్నిక.

“తెలియదు స్వప్నికా.. నీకు కూడా తెలీదా?” అన్నాడు సుధీర్

“ఉహు.. నాకు కూడా తెలీదు” అంది స్వప్నిక.

“కొన్ని రోజుల క్రితం నాన్నగారు అమ్మ.. మనిద్దరి స్నేహం గురించి అడిగారు.. సుధీర్ వర్మ చాలా మంచివాడు అని చెప్పాను.. బాధ్యత గల వ్యక్తి అని చెప్పాను”

“అటువంటి వ్యక్తి, నీ పక్కన ఉంటే.. బాగుంటుంది కదా అన్నారు నాన్నగారు.”

“ఆ.. అవును అన్నాను”

 “అటువంటి వ్యక్తి.. మన పక్కనే ఎందుకు? ..తననే మన అల్లుడిగా ప్రకటిద్దాం, మన పక్కకి తెచ్చుకుందాం అంది అమ్మ”

“ఇదంతా తమాషా సంభాషణలా.. మా మధ్య జరిగింది.. నీ మీద ప్రేమ ఉంది అని గాని, ప్రేమిస్తున్నా అని గాని నేను చెప్పలేదు. వ్యక్తిగా నీపై ఉన్న గౌరవాన్ని వ్యక్తపరిచాను అంతే.” అంది స్వప్నిక

“జీవితంలో వచ్చిన ప్రతి మార్పుని ఆహ్వానించాలి. ఆ మార్పుని మనకి అనుకూలంగా మార్చుకోవాలి.. అదే జీవితం. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దాన్ని ఆస్వాదించు, అంతా మంచే జరుగుతుంది అని నాన్నగారు అన్నారు. ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇంతలో నా పుట్టిన రోజు రావడం.. ఇలా దొంగలా ఊరు, వాడ వదిలి రావడం.. ఎవరూ లేకుండా, చివరికి మన మద్య ‘ప్రేమ’ కూడా లేకుండా వివాహం జరగడం విచిత్రంగా ఉంది సుధీర్” అంది స్వప్నిక.

“అసలు.. అసలు ఈ అజ్ఞాతవాసం ఇంకా ఎన్నాళ్ళు? స్వప్నిక.. సుమిత్రగా ఎందుకు ఉండాలి? ..ఎవరూ లేకుండా మన పెళ్లి ఇక్కడ జరగడమేమిటి? అసలు మన ప్రాంతానికి దూరంగా మనం ఎందుకు ఉంటున్నాం ఇక్కడ?” అని అడుగుతున్న స్వప్నికతో..

“నువ్వు సుమిత్ర గానే ఉండాలి.. మనం ఇక్కడ రహస్యంగా ఉంటున్నాం.. మన వివరాలు ఎవరికీ తెలియరాదు.. సుమిత్రా” అన్నాడు సుధీర్ వర్మ.

“మన మధ్య ప్రేమే లేదంటావా స్వప్నికా” అంటున్న సుధీర్ వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయింది స్వప్నిక.

‘నువ్వు మౌనంగా ఉంటే ఏమనుకోవాలి ప్రేమ ఉందానా! లేదనా!’ అని మనసులో అనుకున్నాడు.. మౌనం అర్ధాంగీకారం కూడా అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు.

అన్నట్టు “ఈ రోజు రాత్రి మార్తాండ గారు మనల్ని కలవడానికి రాబోతున్నారు.. వారితో మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి.. ఇది రహస్య సమావేశం.. ఈ సమావేశంలో నువ్వు, నేను, రాజగురువు మార్తాండ మాత్రమే ఉండబోతున్నాం.. ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని చెప్పాడు సుధీర్ వర్మ.

“సరే” అని తల ఊపింది సుమిత్ర.

తన మదిలో మెదులుతున్న చాలా ప్రశ్నలకు సమాధానాలు కావాలి.. మార్తాండని అడిగి తీరాలి అని గట్టిగా అనుకుంది సుమిత్ర.. సాయంత్రం ఎప్పుడు అవుతుందా! అని ఎదురు చూస్తోంది సుమిత్ర.

మార్తాండ వారికి స్వప్నిక అంటే అమితమైన ఇష్టం. తిలక్ బహుదూర్, నందినిలంటే ఎనలేని అభిమానం. ఎంతో గౌరవం. ఒక రకంగా ఆ కుటుంబానికి మంచి సేవకుడు.. పైగా ఇష్టుడు.. ఆ కుటుంబంలో జరిగే ప్రతి ముఖ్యమైన పని వెనుక మార్తాండ హస్తం ఉండాల్సిందే.. అతని చెవిలో పడనీకుండా ఏ పని తిలక్ బహుదూర్ చెయ్యరు. వాళ్ళ మద్య సాన్నిహిత్యం అంత గొప్పది అని చెప్పాలి. అంతే కాదు తరతరాలుగా మార్తాండ కుటుంబంలో తాత తండ్రులు, తిలక్ బహదూర్ తాత తండ్రుల ఆస్థానంలో ఉండేవారు.. ప్రస్తుత కాలంలో రాజ్యాలు, రాజులు, రాచరికాలకు ‘చెల్లు చీటీ’ ప్రకటించడంతో గత వైభవ ఆనవాళ్ళు మరుగున పడిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వాలకు, ఆనాటి రాజులతో, వారి అభిప్రాయాలతో పనే లేకపోయే. దాంతో రాచరికపు ముసుగు తియ్యకుండా కొందరు, దాన్ని విదిలించుకుని కొందరు, బతుకునీడుస్తున్నారు. పొట్ట కూటికోసం తలో దిక్కు వెళ్ళిపోయి తమ బతుకేదో తాము బతకాలి అన్నట్టు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు.. తిలక్ బహుదూర్ కోటలో తరతరాలుగా సాన్నిహిత్యం కలిగిన మార్తాండ మాత్రం ఎక్కడికీ పోకుండా తిలక్ బహుదూర్‌ని అంటి పెట్టుకునే ఉన్నారు. తన కుటుంబంలో అందరూ భుక్తి కోసం దూర ప్రాంతాలకి వెళ్ళిపోయినా తను మాత్రం ఇక్కడే ఉండిపోయాడు.

మార్తాండ, తిలక్ బహుదూర్ వంశంతో సాన్నిహిత్యం ఉండడమే కాకుండా.. బహుదూర్‌కి కష్టమొచ్చినా, సుఖమొచ్చినా అంతరంగిక సలహాదారునిగానే కొనసాగుతున్నాడు. కాకపోతే ఈ విషయం బహుదూర్, మార్తాండకి తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు. అలా తెలిసేలా ప్రవర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఇద్దరూ.

ఈ రోజు స్వప్నిక, సుధీర్ వర్మలతో ‘రహస్య సమావేశం’ జరపడడానికి ఆశ్రమానికి వస్తున్నాడు మార్తాండ.. ఇది చాల కీలకమైన సమావేశం.

(సశేషం)

శ్రీమద్రమారమణ-5

0

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[గురుశిష్యులిద్దరూ ఇంటికి వెళ్తారు. వైనతేయ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి తేరుకోడు. వాడింత భావావేశానికి లోనవుతాడని ఊహించని దస్తగిరిసారు తన చిన్నప్పుడు తెలుగు మాస్టారు చెప్పిన శ్లోకాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ శ్లోకం గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా శిష్యునిలో గమనించాడు.  భోజనం చేశాకా, కాసేపు గురుశిష్యులిద్దరూ హరికథ గురించి, శర్మగారి గురించి మాట్లాడుకుంటారు. కాసేపాగి పూజారి గారింటికి వెళ్తారు. అక్కడ శర్మగారు, పూజారి గారు కంబళి పరచిన మంచం మీద; హర్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్యాంసుడు ఓబులేశయ్య, క్రింద అరుగు మీద కూర్చుని ఉంటారు. వీళ్ళను చూసి శర్మగారు సంతోషంగా ఆహ్వానిస్తారు. మంచం మీద కంబళి తీసి, కింద పరిస్తే, అందరం కూర్చోవచ్చని అంటారు శర్మగారు. ఆంజనేయశర్మగారు ఆ గురుశిష్యుల పట్ల చూపుతున్న ఆదరణ  పూజారి నీలకంఠ దీక్షితులుగారికి నచ్చదు. పని ఉందంటూ, ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అసలు విషయం గ్రహించిన శర్మగారు నవ్వుకుంటారు. తన బదులుగా హార్మోనియం వాయించి, హరికథకు ఆటంకం కలగకుండా చూసినందుకు ఉరుకుందప్ప దస్తగిరికి ధన్యవాదాలు చెప్తాడు. తను ఎందుకు సమయానికి రాలేకపోయాడో వివరిస్తాడు. శర్మగారు వైనతేయ విషయంలో తన ప్రణాళికను వెల్లడిస్తారు. ముందుగా తమ ఊరిలో రెండేళ్ళు, ఆ పై తిరుపతిలో మరో రెండేళ్ళు హరికథా కోర్సు చేయిస్తానని చెప్తారు. ఆ తరువాత మామూలు చదువు కొనసాగించాలని చెప్తారు. సరేనంటాడు దస్తగిరి సారు. ఇంటికి వస్తూ, దారిలో వైనతేయని అడిగితే, తనకూ ఆయనలా హరికథలు చెప్పాలని ఉందని అంటాడు. మర్నాడు సైకిల్ మీద వైనతేయని యానాదుల దిబ్బకు తీసుకువెళ్ళి దింపుతాడు దస్తగిరి. సారు స్వయంగా వచ్చేసరికి కోనేటయ్య, తిరుపాలమ్మ కంగారుపడతారు. మా వాడేమైనా తప్పు చేశాడా అని తల్లి అడుగుతుంది. అదేం లేదని చెప్పి, జరిగినదంతా చెప్పి – ఆంజనేయ శర్మగారి ప్రతిపాదనని వారికి వివరిస్తారు. నాలుగేళ్ళ పాటు కొడుకుకి దూరంగా ఉండలేమని కోనేటయ్య అంటాడు. తిరుపాలమ్మ మాత్రం, కొడుకుని పంపిస్తానంటుంది. ఆ స్వామి గొప్పోడంటూ చేతులెత్తి మొక్కుతుంది. కోనేటయ్య కూడా సరేనంటాడు. తిరుపాలమ్మ చేసిన జొన్నరొట్టెలు తిని దస్తగిరి ఇంటికి బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

పెద్ద పరీక్షలు (యాన్యువల్) అయిపోయినాయి. ఈ మూడు నెలలూ కొడుకును అపురూపంగా చూసుకోన్నారు వారు. పెదరెడ్డి దగ్గర రెండువందలు అడిగి తెచ్చుకున్నారు. పిల్లవానికి రెండు జతలు నిక్కరు, అంగీ, ఒక టవలు, ఒక కొత్త దుప్పటి కొనిచ్చినారు ప్యాపిలి కోమట్ల బట్టల మళిగెలో. యాభై రూపాయలు దగ్గర పెట్టుకోమని కొడుక్కు ఇచ్చినారు.

ఆంజనేయ శర్మ గారి వద్ద నుంచి పోస్టుకార్డు వచ్చింది, దస్తగిరి సారుకు బడి అడ్రసుకు వ్రాసినారాయన.

“చి. దస్తగిరికి, దీవించి వ్రాయటనది. మనం అనుకొన్నట్లు, చి. వైనతేయను నా దగ్గరికి తీసుకు రావలసినది. సకల ఏర్పాట్లూ చేసినాము. ఇట్లు ఆం.శ. వ్రాలు.”

టి.సి. రాసినాడు సారు. అందులోనే మూడవ తరగతి పాస్ అయినట్లు నమోదు చేసినాడు. తల్లి తండ్రుల కాళ్ళకు మొక్కి, చేతిసంచీలో బట్టలు సర్దుకొని తయారైనాడు వైనతీయ. కోనేటయ్యకు, తిరుపాలమ్మకు ధైర్యం చెప్పడం కోసమని దస్తగిరి సారు స్వయంగా వచ్చినాడు.

గురుశిష్యులిద్దరూ ప్యాపిలిలో పల్లె వెలుగు బస్సు ఎక్కి, గుత్తిలో దిగినారు. గుత్తిలో ఆదోని ఎక్స్‌ప్రెస్ ఎక్కి, గుంతకల్, పత్తికొండ మీదుగా ఆదోని చేరినారు. అటు వెల్దుర్తికి పోయి, కోడుమూరు మీదుగా కూడ పోవచ్చు ఆదోనికి. కాని కొంచెం చుట్టు అవుతుందని సారు ఈ రూటు ఎంచుకొన్నాడు.

గుంతకల్ పెద్ద టవును. రైల్వే జంక్షన్. అక్కడ బోజనానికి బస్సు ఆపినారు. సారు వాటిని బస్టాండు ఎదురుగా ఉన్న ‘ఉడిపి కృష్ణభవన్’కు తీసుకునిపోయి భోజనం పెట్టించినాడు తనతో బాటు. అరటి ఆకులో టమోటా పప్పు, వంకాయ కూర, సాంబారు, పెరుగు వడ్డించినారు. వైనతేయకు ఆ భోజనం అమృతోపమానంగా తోచింది. అటువంటి భోజనం చేయడం వాడి జీవితంలో అదే మొదటిసారి.

“సార్, నా దగ్గర యాభై రూపాయలు ఉండాయి. మా నాయిన ఇచ్చె” అన్నాడు వాడు.

సారు వాని నెత్తిన సున్నితంగా మొట్టి, నవ్వుతూ అన్నాడు “ఉండనీలేరా తిక్కోడా!”

ఆదోని నుంచి కౌతాళం బస్సు ఎక్కినారు. నలభై ఐదు నిమిషాల ప్రయాణం. వారు కౌతాళం చేరేసరికి మధ్యాహ్నం మూడు కావస్తుంది.

కౌతాళం పెద్ద ఊరే. ప్యాపిలి అంత ఉంటుందనిపించింది దస్తగిరి సారుకు. ప్యాపిలి నేషనల్ హైవే మీద ఉండడం వల్ల డెవలప్ అయింది. ‘ఈ ఊరు ఇంచుమించు కర్నాటక బార్డరు’ అనుకున్నాడు.

ఆంజనేయ శర్మగారి ఇల్లు ఎక్కడని అడిగితే, ఒకాయన వారి వెంట వచ్చి చూపించాడు. ఆయన ఇల్లు పెద్ద గేరి (మెయిన్ స్ట్రీట్) లోనే ఉంది. ఇంటి ముందు రెండు అరుగులు, పెద్ద వాకిలికి అటూ ఇటూ ఉన్నాయి. వాటి మీదుగా ‘వారపాగు’ దించి ఉంది. వాటికిందుగా సైడు కాలువపై బేతంచెర్ల నాపబండలు పరచి ఉన్నాయి.

గుమ్మం దాటినంకనే ఒక పడసాల (హలు) ఉంది. అది విశాలంగా ఉంది. మధ్యలో టేకు స్తంభాలు పైకప్పుకు దన్నుగా ఉన్నాయి. వాటికి నల్లని పెయింట్ వేశారు. అవి నున్నగా మెరుస్తున్నాయి. వాటి అడుగు భాగాలను రాతి దిమ్మలపై నిలిపారు.

పడసాల లోని కుర్చీలో కూర్చుని ఆంజనేయ శర్మగారు ఏదో పుస్తకం చదువుతున్నారు. వీళ్లను చూసి లేచి, ఆదరంగా ఆహ్వానించారు.

“రాండి నాయనా, కూర్చొండి” అని గోడకానించి ఉన్న బెంచీ చూపారు. “వెనక జల్లాది (బాత్‍ రూం) ఉన్నది. వెళ్లి కాళ్లు కడుక్కోండి” అన్నారు.

వెనక పెరడు ఉంది. ఒక మూల జల్లాది. దానికి పైకప్పు లేదు. ఒక పెద్ద బాదం చెట్టు, నందివర్ధనం చెట్టు, కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని చెండు (బంతి) పూలమొక్కలు ఉన్నాయి. ఒక చేదబావి ఉంది. ఒక ఇనుప బకెట్, చిన్నది, బావి చప్టాపై ఉంది. దానికి కొబ్బరితాడు బిగించి ఉంది. బావిపైన అడ్డంగా వేసిన దూలానికి గిలక (కప్ప) బిగించి ఉంది.

వైనతేయ, బక్కెటుతో నీళ్లు తోడాడు. నీళ్ళు పైకే ఉన్నాయి. ఇద్దరూ కాళ్లు చేతులూ కడుక్కొని వచ్చినారు. వచ్చి స్వామి ఎదుట బెంచీపై కూర్చున్నారు.

“ఇదిగో, ఒకసారి ఇట్లా రా” అని పిలిచారు స్వామి. లోపల నించి ఒక ముత్తయిదువ బయటికి వచ్చింది. “ఈమె నా శ్రీమతి వల్లెలాంబ. నేను చెప్పానే, వైనతేయ, వీడే ఆ పిల్లవాడు. వీనిని, వీని లోని ప్రతిభను గుర్తించి పోత్సహిస్తున్న వీని గురువు దస్తగిరి” అని ఉభయులకు పరస్పరం పరిచయం చేశారాయన.

ఆయన అంజనేయుడయితే, ఆమె సాక్షాత్తు సువర్చలా దేవిలా ఉంది. గళ్ల నేతచీర కట్టుకుంది. ఆమె ఫాల భాగాన కుంకుమ బొట్టు మెరుస్తూంది. చేతికి మట్టిగాజులు. మెడలో నల్లపూసల పేరు, తాళిబొట్లు అంతే. “మీ గురించి ఈయన అనుకోని క్షణం లేదు నాయనా! చాలా సంతోషం మీరు వచ్చినందుకు! ఉండండి, ఏదైనా ఫలహారం పట్టుకొస్తాను. ఎప్పుడు ప్రయాణమైనారో ఏమో?” అంటూ లోపలికి వెళ్లిందామె.

మూడు స్టీలు ప్లేట్లలో అరిసెలు, వాము కారాలు పెట్టుకొని వచ్చి అందరికీ ఇచ్చింది. తిన్న తర్వాత చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

“పక్కవీధిలోనే సర్కారు వారి ఎలిమెంటరీ స్కూలుంది. పెద్దదే. నాలుగువందల మంది విద్యార్థులుంటారు. మన వాడి గురించి చెప్పాను. హెడ్మాస్టరు పోసెట్టి నా శిష్యుడే. నాలుగో తరగతిలో చేర్చుకుంటానని చెప్పినాడు. ఇంకా ఎండాకాలం సెలవులు నెలకు పైగా ఉన్నాయి కదా! స్కూళ్ళు తెరిచేంత వరకు పిల్లవాడికి స్వరాలు, రాగాలు, ఆరోహణ, అవరోహణ, మంద్రం, ఉచ్చస్థాయి, ఇలాంటి వన్నీ నేర్పిస్తాను” అన్నారాయన.

“వీడు ఉండటానికి బాలుర సంక్షేమ వసతిగృహం ఏదైనా..” అని దస్తగిరి సారు అంటుండగానే శర్మగారు కలుగజేసుకొని “ఎంత మాటన్నావు నాయనా, వాడు హాస్టల్లో ఉంటే నా వద్ద విద్య నేర్చుకునేదెప్పుడు? ఈ రోజు నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు. మేం తిన్నదే తింటాడు. పెరట్లో ఒక కొట్టుగది నిరుపయోగంగా ఉంది. మొన్ననే దానిని మా వల్లి శుభ్రం చేయించి పెట్టింది. అందులోనే వాడుండబోతున్నాడు. రెండేళ్లు ఎంతలో గడుస్తాయి దస్తగిరీ! తర్వాత తిరుపతికి వెళ్లాల్సిందేనాయె” అన్నారాయన. ఆయన విశాల దృక్పథం తెలియక హాస్టలు ప్రస్తావన తెచ్చినందుకు దస్తగిరి సారు పశ్చాత్తాప పడినాడు. శర్మగారు కొంచెం మనసు నొచ్చుకున్నట్లనిపించిది.

“క్రమించండి, స్వామి! మహోన్నతమైన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినాను” అన్నాడు.

“అబ్బాయీ, ఈ కులం పట్టింపులు నాకు గాని, మా వాండ్లకు (శ్రీమతి) గాని లేవయ్యా! అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడనే కదా సాక్షాచ్చంకర మహదేవుడు ఆదిశంకరుల వారికి కనువిప్పు కలిగించింది! మేము స్మార్తులము. అద్వైత సిద్ధాంతాన్ని అవలంబిస్తాము. జీవునికి దేవునికీ అభేదమే కదా అద్వైతమంటే!” అని,

“మాకు ఏ బాదరబందీ లేదు. ఒక్క అమ్మాయి. దానికి వివాహం చేసి పంపినాము. అల్లుడు కర్నాటక బ్యాంకు, రాయచూరులో ఆఫీసరు. వాండ్లకు ఒక కొడుకు. దౌహిత్రుడన్నమాట. పిత్రార్జితం ఈ ఇల్లు, ఒక ఎకరం తరిపొలం (మాగాణి), ఐదెకరాలు వెలిపొలం (మెట్ట) ఉన్నాయి. వాటిని సరికారు కిచ్చినాను. మీవాడే హుసేనప్ప అని నాకు నమ్మినబంటు, మా తండ్రి, గారి కాలం నుండి వాళ్ళే మా పొలాలు సాగు చేస్తున్నారు. వరి మడికి తుంగభద్ర కాలువ నీళ్లు అందుతాయి. సాలుకు ఇరవై బస్తాల వడ్లు. ప్రశస్తమైన ‘ఈతగొలలు’ రకాన్ని పండిస్తాడు మా హుసేనప్ప. గరిసెలో పోసిపోతాడు. మూడు నెలల కొకసారి మర పట్టించి బియ్యం ఇంటికి తెస్తాడు. వాడి భార్య మస్తానమ్మ వాటిని శుభ్రం చేసి యిస్తుంది.

ఇక వెలిపొలంలో బుడ్డలు (వేరుశనగ) పంట వేస్తాము. మధ్యలో కంది మొక్కలు అక్కిళ్లు (వరుసలు)గా విత్తుతాము. సాలుకు సరిపడా కందులు వస్తాయి. ఎకరానికి ఐదు బస్తాల చొప్పున బుడ్డలు, నా భాగానికి 25 బస్తాలు వస్తాయి. వాటిని వసంత గుప్త గారి నూనె మిల్లుకు తోలతాము. సరే నా హరికథా గానాల ద్వారా ప్రతి నెలా ఆ పరాత్పరుడు అంతో ఇంతో ప్రసాదిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆర్థికానికేమీ లోటు లేదు” అన్నాడా విద్వన్మణి.

“ఇక కులం అంటావా? అది మనం ఏర్పరచుకున్నది. భగవంతుడు గొల్లవానిగా పుట్టి గీతోపదేశం చేయలేదా? బోయవాడైన వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించలేదా? రాయల వారు రచించిన ‘ఆముక్త మాల్యద’లోని మాల దాసరి వృత్తాంతాన్ని గురించి వినే ఉంటావు. ఆయన కన్నా జ్ఞానులమా? మా అమ్మ నేను పుట్టగా చనిపోతే, నాకు పాలిచ్చి సాకింది నాగరత్నమ్మ అని మా ఇంట్లో అప్పుడు పని చేస్తున్న ఈడిగె ఆమె (కల్లు గీత కులం). ఆ రోజు ఆమె నన్ను అక్కున చేర్చుకోకపోయి ఉంటే ఈ ఆంజనేయశర్మ ఎక్కడుండేవాడు? ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి’ అన్నారు. ఈ వైనతేయుడున్నాడే, వీడిని చూసినప్పటి నుంచీ నాకో అదొక అనిర్వచనీయమైన ఆపేక్ష కలిగింది. మా హరికథకు రాను రాను ఆదరణ తగ్గుతూంది. ఈ విద్యకు వారసులు లేరే అని మథనపడేవాడిని. ఆ భగవంతుడే వీడిని నాకు తారసింప చేసినాడు.

ఏడవ తరగతి వరకు తిరుపతిలో చదువు, హరికథ కోర్సు చేస్తాడు. తర్వాత జీవికకు పనికి వచ్చి చదువును చదివించే బాధ్యత నీది. వీని తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు తెలియచేయి, మన మీద నమ్మకంతో మనకు ఇంత చిన్న వయసుతో వీడిని అప్పగించినందుకు” అన్నారాయన.

ఆయన సంస్కారానికి ముగ్ధుడైనాడు దస్తగిరిసారు. తాను వారికి మహోపకారం చేయబూనుతూ, పైగా వారికే కృతజ్ఞతలు తెల్పమంటున్నారు!

“మరి నేను, మీరు అనుమతిస్తే, బయలుదేరుతాను స్వామి!” అన్నాడు చేతులు జోడించి.

“నీకేమైనా పిచ్చా? వెర్రా?” అన్నాడాయన. “ఇంత ప్రయాణం చేసి వచ్చి, వెంటనే వెళ్లిపోతానంటావా? రెండ్రోజులుండు. పిల్లవాడు కొత్త తీరి స్తిమితపడేంత వరకు” అని ఆదేశించారాయన.

దస్తగిరిసారు అంగీకరించాడు.

“ఒరేయ్, నాయిన! ఏదైనా ఆలపించు, ఒకసారి”

“మన స్కూలు ప్రేయర్‌లో పాడే పద్యం పాడి వినిపించరా” అన్నాడు సారు.

వైనతేయ ‘ఎవ్వనిచే జనించు..’ పద్యం గొంతెత్తి పాడాడు. వల్లెలాంబమ్మ బైటికి వచ్చి పద్యాన్ని విని, ప్రశంసగా తల ఊపింది.

“బాగుంది. దీన్ని ‘కల్యాణి’లో నేర్పాడు మీ దస్తగిరిసారు. నేను దీనినే ‘మాల్కోస్’ లో పాడతాను. జాగ్రత్తగా విను” అని మాల్కోస్ రాగంలో ఆ పద్యాన్ని ఆలపించారాయన. పిల్లవాడు శ్రద్ధగా విన్నాడు.

“ఏదీ ఈ రాగంలో ఆ పద్యాన్ని పాడు”

వాడు తడుముకోకుండా, అచ్చం ఆంజనేయ శర్మగారు పాడినట్లే, ఆ పద్యాన్ని పాడాడు

“శహభాష్!” అన్నారు శర్మగారు. “ఎక్కడా ఒక్క సంగతి తప్పలేదు. దస్తగిరీ, చూసినావా? వీడు ఏకసంథాగ్రాహి” అని మెచ్చుకున్నారు. వల్లెలాంబ వాడి దగ్గరికి వచ్చి వాడిని అక్కున చేర్చుకుని, తల నిమిరింది.

“యశస్వీ భవ! నాయనా!” అని దీవించింది.

సామాన్లు అన్నీ ఒక మూలకు సర్దించారు కొట్టు గదిలో ఇది వరకే. చిన్న గది. వీధి వైపుకు ఒక కిటికీ ఉంది. గోడకానుకొని ఒక చెక్కభోషాణం పెట్టె ఉంది.

వల్లెలాంబ “నాయనా, నీవు దాని మీద పండుకోవచ్చు. దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఇత్తడి, రాగి పాత్రలున్నాయి. నీకు ఒక పాత జంపభానా ఇస్తాను. దాని మీద పరుచుకొందువుగాని” అని చెప్పి, “దుప్పటి..” అని అంటుండగా,

“మా అమ్మ ఇచ్చిందండి” అని బ్యాగు లోంచి షోలాపూరు దుప్పటి తీసి చూపించాడు వాడు.

“బావి దగ్గర స్నానం చేయవచ్చు. కక్కసు దొడ్డి అటువైపు మూలగా ఉంది. మన వీధి దాటితే రెండు ఫర్లాంగుల దూరంలో ఒక బీడు ఉంది. అక్కడికి బహిర్భూమికి పోయినా సరే!” అన్నాడు శర్మగారు

ఏదో బయట అరుగు మీద పడుకోమనకుండా, పిల్లవాడికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూన్న ఆ పుణ్యదంపతులకు మనసు లోనే ప్రణమిల్లాడు దస్తగిరిసారు.

రాత్రి అందరికీ గుంట పొంగణాలు పోసిందా అన్నపూర్ణమ్మ. మధ్యాన్నం మిగిలిన అన్నం కొద్దిగా ఉంటే, మజ్జిగ, ఊరగాయ వేసి పిల్లవానికి పెట్టింది.

“రాత్రుళ్లు రోజూ మేం ఫలహారమే నాయినా! నీవు చిన్నపిల్లవాడివి, నీకు మధ్యాహ్నమే కొంత అన్నం ఎక్కువ వండి ఉంచుతాలే – ఏదో ఒకటి వేసుకొని కొంచెం తిందువుగాని” అన్నదామె.

వైనతేయకు వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి కంటనీరు తిరిగింది.

రాత్రి గురుశిష్యులిద్దరూ భోషాణం మీదే పడుకొని నిద్రపోయినారు. మర్నాడు సారు వాడిని బజారుకు తీసుకోపోయి, ఒక లైఫ్‌బాయ్ సబ్బు, ఒక ప్లాస్టిక్ సబ్బుపెట్టి, చిన్న అద్దం, దువ్వెన, ఒక ప్లాస్టిక్ బకెటు, మగ్గు, మంచినీళ్ళ కుండ, ఒక వెంకటేశ్వర స్వామి పటం, ఊదొత్తుల పాకెట్టు, అగ్గిపెట్టె, అన్నీ కొనిచ్చినాడు తన డబ్బుతో, క్రింద పరుచుకోవడానికి ఒక చాపతో సహా!

ద్వితీయ విఘ్నం కాకూడదని శర్మగారు వాడితో కొన్ని ఆలాపనలు ప్రాక్టీసు చేయించినారు. వాడికి సంగీత జ్ఞానం లేదుగాని, ఏ రాగాన్నైనా, నేర్పిస్తే, అవలీలగా పలికించగలడు. వాడి గ్రహణశక్తికి, సత్వర స్పందనకు ఆంజనేయ శర్మగారు చకితులవుతున్నారు. తన ఎంపిక సరైనదే అన్న నమ్మకం ఆయనలో బలపడింది.

మర్నాడు దస్తగిరిసారు ఊరికి బయలుదేరినాడు. వైనతేయ బస్టాండుకు వచ్చి సారును బస్సు ఎక్కించినాడు. ఆయన వానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పినాడు.

“ఏ జన్మంలో చేసిన పుణ్యమో, నీవు ఆ మహనీయుని చేతిలో పడినావు రా వైనా! పొరపాటున కూడా వారికి అవిధేయత చూపకు. వారు కోపంతో ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా, పట్టించుకోవద్దు. వారిని సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా భావించి సేవించు. ఆయన అనుగ్రహంతో పెద్ద విద్యాంసుడివి కావాల.”

బస్ కదులుతూ ఉంటే వాటికి ఏడుపు వచ్చింది. దస్తగిరి సారు వెళ్లిపోతున్నాడు! ఆయనకు కూడా వాటిని వదలి వెళుతూంటే హృదయం బరువెక్కింది!

‘భావస్థిరాణి జననాంతర సౌహృదాని!’

(ఇంకా ఉంది)