back to top
Home Blog Page 7

జీవితమొక పయనం-16

0

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాఘవ ఆ ఆవాస విద్యాలయంలో చేరి మూడు నెలలకు పైనే అవుతుంది. ఓ ఆదివారం నాడు బాబాయ్ వాళ్ళింటికి వెళ్తామని అనుకుంటాడు. ప్రధానాచార్యుల వారి వద్ద అనుమతి తీసుకుని హనుమకొండ లోని మాధవరెడ్డి గారింటికి వెళ్తాడు. పిన్నీ బాబాయిలు ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళతో కబుర్లు చెప్పి, మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, సాయంత్రం వరంగల్‌కి వచ్చి ఓ థియేటర్‍లో పాత సినిమా ఆడుతుంటే వెళ్తాడు. సినిమా పూర్తయ్యేసరికి రాత్రవుతుంది. తామరగుంత వెళ్ళాల్సిన బస్సులు ఎంతకీ రావు. చివరికి ఓ షేర్ ఆటోలో ఎక్కి తామరగుంట రోడ్డు మీద దిగుతాడు. బండి మీద ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని కాసేపు అక్కడే నిలుచుంటాడు. ఎంత సేపయినా ఎవరు రాకపోయేసరికి, నడవడం మొదలుపెడతాడు. కొంతదూరం నడిచాకా, కాస్త అలసట కలిగి, ఓ రాతి మీద కూర్చుంటాడు. అక్కడ వందలాది మిణుగురులు ఎగురుతూ, ఆ ప్రాంతాన్ని కాంతివంతం చేయడం చూస్తాడు. వాటి నుండి స్ఫూర్తి పొంది, ఆవాస నిలయం చేరుకుంటాడు. దసరా పండకి పాఠశాలకి సెలవలు ఇవ్వడంతో సొంతూరికి బయల్దేరుతాడు రాఘవ. ఈసారి ఇంటికి వెళ్ళడానికి అతనిలో ఏ సంకోచాలు లేవు. ఇదివరకులా నిరుద్యోగి కాదు, ఇప్పుడో ఉద్యోగం ఉంది. తన కాళ్ళ మీద తను నిలబడ్డాడనే ఆత్మస్థైర్యం ఉంది. ఇంటికి చేరాకా తల్లిదండ్రులని, తమ్ముడిని ప్రేమగా  పలకరిస్తాడు. మర్నాడు తన ఆత్మీయ నేస్తం శ్రీకర్‍ని కలుస్తాడు. సొంతూరికి దూరంగా, ఎక్కడో ఓ చిన్న ఉద్యోగంతో తృప్తి పడి ఆత్మవంచన చేసుకుంటున్నావని శ్రీకర్ అంటాడు. తనది ఆత్మవంచన కాదని, ఆత్మపరిశీలన అని చెప్తాడు రాఘవ. తన సామర్థ్యాలేమితో తనకి పూర్తిగా తెలుసనీ, అందుకే తనకి తెలిసిన మార్గాన్ని ఎంచుకున్నానని రాఘవ చెప్పగా, శ్రీకర్ నిట్టూరుస్తాడు. – ఇక చదవండి.]

31. పెళ్లికి నిరాకరణ

[dropcap]రా[/dropcap]ఘవ దసరా సెలవులకు ఇంటికొచ్చినప్పటినుండి ఎందుకో శంకరయ్య మనసు స్థిమితంగా ఉండటం లేదు. రాఘవ ఉద్యోగానికి వరంగల్‌ వెళతానని చెప్పి వెళ్లిన తర్వాత.. తమను పూర్తిగా మర్చిపొయ్యాడు. రోజులు గడిచేకొద్దీ అతని నుండి సమాచారమేదీ రాక తామెంత కంగారుపడ్డారో తమకు మాత్రమే తెలుసు. ఆ మాధవరెడ్డిగారి చిరునామా రాసుకోబట్టి సరిపోయింది కానీ, లేకపోతే కొడుకు ఆనవాలు తెలియకనే ఉండిపొయ్యేదేమో?

ఎందుకో రాఘవ జీవితంలో ఏదీ సరిగ్గా జరగటం లేదు. డిగ్రీ అయితే చదివాడు కానీ ఒక మంచి ఉద్యోగం వచ్చే అదృష్టం లేకుండాపొయ్యింది. ఇంత చిన్న వయసులోనే ఎందుకో అతనిలో అంతటి నైరాశ్యం, విరక్తి గూడుకట్టుకున్నాయి. సకాలంలో ఏదీ జరగలేదనే కోపం, ఆవేశం.. అతనిలో అణువణువూ నిండిపోయి ఉంది. అందుకే వాడు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. తనే ఉద్యోగం వెతుక్కున్నాడు. ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న తపనతో వాడు అంత దూరప్రాంతానికి వెళ్లిపోయాడు. ఆ వెళ్లటం వెళ్లటం తమకు దూరమైపోతున్నాడేమోనన్న భయాన్ని కలగచేశాడు.

దాంతో అతను అసలు జీవితం నుండి కూడా ఎక్కడ దూరమైపోతాడోనన్న దిగులు పట్టుకుంది శంకరయ్యకు. జీవితం పట్ల ఆశ, ఇష్టమూ కలగాలంటే అతనికి పెళ్లి చెయ్యటమొక్కటే మార్గమని భావించాడు. అందుకే తన బామ్మర్ది కూతురునిచ్చి పెళ్లిచేస్తే కొడుకు కంటి ముందరే ఉంటాడు. అంతేకాదు రేపు పిల్లలంటూ పుడితే సంసారం, కుటుంబం అన్న ఒక బాధ్యతా పెరుగుతుంది. అప్పుడు జీవితం పట్ల ఒక పట్టు, అవగాహన ఏర్పడతాయి. లేదంటే తెగిన గాలిపటంలా ఎటు పోతాడో, ఎక్కడ చిక్కుబడిపోతాడో తెలియదు. కనుక కొడుక్కు ఎలాగైనా పెళ్లి చెయ్యాలన్న తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు శంకరయ్య.

ఆరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక రాఘవ.. తమ పాఠశాల గురించి చెబుతూంటే ఆసక్తిగా వింటూ కూర్చున్నారు శంకరయ్య, వనజమ్మ.

కొంతసేపు గడిచాక.. “రాఘవా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని కోప్పడకుండా వింటావా?..” అన్నాడు ఉపోద్ఘాతంగా శంకరయ్య.

‘తననెందులోనో ఇరికించే పని మొదలుపెట్టాడు నాన్న. జాగ్రత్తగా ఉండాలి’ అనుకుని అలాగే అన్నట్టుగా తలూపాడు.

“నాకా వయసు పైబడుతోంది. ఈ మధ్యనే నేను కంటి ఆపరేషన్‌ చెయ్యించుకున్నాను. అప్పుడప్పుడూ గుండెల్లో కాస్త నొప్పిగా కూడా ఉంటోంది. మాత్రలు వేసుకుంటున్నాననుకో. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా? ఇలాగే చూస్తూ ఊరుకుంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. అది ఎవరి కోసమూ ఆగదు, అంతే! తర్వాత బాధపడి ఏ ప్రయోజనమూ ఉండదు. కనుక ఏదైనా ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితేనే బాగుంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమవుతోందా రాఘవా? నీ పెళ్లి గురించే చెబుతున్నాను..” కొడుకు ముఖంలోకి చూస్తూ అన్నాడు శంకరయ్య.

తన పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి కోపం నషాళానికెక్కింది రాఘవకు. కానీ తండ్రి ఏం మాట్లాడుతాడో మాట్లాడనీ తర్వాత తన అభిప్రాయాన్ని చెబుదామని మిన్నకుండిపోయాడు.

“మీ మామ కూతురు మమత పదవ తరగతి వరకూ చదువుకుంది. ఇప్పుడు టైపు నేర్చుకుంటోందట. ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుందని మీ అమ్మ చెప్పింది. పెద్దలంటే భయమూ భక్తీ ఉన్నాయి. నువ్వు ఊ అన్నావంటే ముహూర్తాలు చూసి ఇంకో రెండుమూడు నెలల్లో నీకు పెళ్లి చేసెయ్యాలన్నది మా ఇద్దరి ఆలోచన.” అంటూ భార్యవైపు చూశాడు శంకరయ్య.

వనజమ్మ ఔనన్నట్టుగా తలూపింది.

కోపాన్ని బాగా అణచుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు రాఘవ.

“చూడు నాన్నా. నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ఈపాటికే నాకొక గవర్నమెంటు ఉద్యోగం వచ్చుంటే మీ కోరికను తీర్చి ఉండేవాణ్ణి. కానీ అది జరగలేదు. ఇప్పుడు ఉద్యోగం ఉంది కదా అని మీరనవచ్చు. అది నిజమే. కానీ ఈ ప్రయివేటు వాళ్లిచ్చే రెండువందల యాభై రూపాయల జీతంతో నేను నా కుటుంబాన్ని పోషించగలనా చెప్పండి. రేపు మీ కోడలు ‘తనకు అది కావాలి, ఇది కావాలి’ అని నోరు తెరిచి అడిగిందనుకో, నేను తీర్చగలనా? తీర్చలేననుకో.. అప్పుడు, ‘అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు?’ అని మొహమ్మీదే అడిగిందనుకో! ఎంత అవమానం? ఆలోచించండి. అందుకే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. అప్పటిదాకా నా పెళ్లి ప్రసక్తి తీసుకురాకండి.” అని స్థిరంగా అన్నాడు.

“అది కాదురా, ఈ రోజుల్లో గవర్నమెంటు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటానంటే అది సాధ్యమయ్యే పనేనేరా. ఉద్యోగం లేకపోయినా ఎంతమంది పెళ్లిళ్లు చేసుకోవటం లేదు. అయినా నీకేదైనా అవసరమైతే ఆదుకోవటానికి మేము లేమట్రా..”

“అవసరానికి ఒకరి ముందు చెయ్యి చాపటం నాకు ఇష్టం లేదు నాన్నా..”

“పోనీ, వద్దు. ఎవరినీ అడగొద్దు. ఒక తండ్రిగా నన్ను అడగటానికి నీకేమైనా అభ్యంతరమా ఏం?”

“అదే, ఇందాకా చెప్పాను కదు నాన్నా, నాకు ఎవరినీ అడగటం ఇష్టముండదనీ.”

“ఏం నా పెన్షనులో కొంత నా కొడుక్కు ఇవ్వటానికి నాకు హక్కు లేదా? ఇక నీ జీతం ఉండనే ఉంది. అవసరానికి ఈ ఇల్లుంది, ఇంకేం కావాల్రా? పాపం మీ మామ నీ సమాధానం కోసం కాచుక్కూర్చున్నాడు. వాళ్లనలా ఏళ్ల కొద్దీ ఎదురుచూసేలా చెయ్యటం అంత మంచిది కాదురా.” కొడుకును ఎలాగైనా ఒప్పించాలన్న ఆలోచనతో అన్నాడు శంకరయ్య.

“నాన్నా, మామ కూతురి గురించి నా అభిప్రాయమేమిటో నేను చెప్పలేను. నాకోసం వాళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని చెప్పేయండి. ఏదైనా మంచి సంబంధం వస్తే వాళ్లమ్మాయికి చేసెయ్యమనండి. నాకు పెళ్లి అంటే ఇష్టంలేదు.”

“ఒరేయ్‌, నాకొక అనుమానం కలుగుతోంది. నీకు పెళ్లి అంటే ఇష్టం లేదా, లేక మీ మామ కూతురంటే ఇష్టంలేదా? అది చెప్పు ముందర?” అంటూ నిలదీశాడు శంకరయ్య. మౌనం వహించాడు రాఘవ.

“ఒకవేళ మీ మామ కూతురంటే ఇష్టంలేకపోతే చెప్పేయి, మానేద్దాం. బలవంతం ఏమీ లేదు. ఇంకో అమ్మాయిని చూద్దాం. ఇంకా బాగా చదువుకున్న అమ్మాయిని చూద్దాం. దొరక్కపోతుందా, ఏం? నువ్వు పెళ్లికి ఒప్పుకోవటం ముఖ్యంరా.”

తండ్రి తన ముందరి కాళ్లకు బంధం వేస్తున్నట్టుగా గ్రహించాడు రాఘవ.

ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. “చూడు నాన్నా, ఈ జీతంతో నేను పెళ్లి చేసుకోలేను. మా విద్యా సంస్థ వచ్చే వేసవి సెలవుల్లో హైదరాబాదులో కొత్తవాళ్లకు ట్రైనింగు ఇచ్చి పర్మనెంటు చేస్తుందట. అంతేకాదు పర్మనెంటు అయినవాళ్లకు జీతం కూడా పెంచుతుందట. అప్పుడు ఈ విషయం గురించి ఆలోచిద్దాం. అంతవరకూ నా పెళ్లి ప్రసక్తి తీసుకురాకండి. అంతేకాదు, మీకు కొడుక్కు పెళ్లి చెయ్యాలన్న ముచ్చట ఉంటే తమ్ముడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లిచేసి దాన్ని తీర్చుకోండి. అంతేకానీ, నన్ను విసిగించకండి, నాకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, అంతే!” అని చెప్పి అక్కణ్ణుండి లేచి బయటికెళ్లిపోయాడు రాఘవ.

చేసేదేమీలేక దీర్ఘంగా నిట్టూర్చాడు శంకరయ్య, కళ్లనీళ్లు పెట్టుకుంది వనజమ్మ.

32. చెవిలో పురుగు

దసరా సెలవులు ముగిశాక మళ్లీ తామరగుంటకు చేరుకున్నాడు రాఘవ.

అప్పటికి మోహనరావు, కె.కె. ఇద్దరు తప్ప తక్కిన టీచర్లందరూ పాఠశాలకు చేరుకున్నారు. ప్రధానాచార్యులు, వంటమాస్టరు వెంకటయ్య, అంకయ్యలు ముందురోజే వచ్చేశారట.

పాఠశాల పునఃప్రారంభమై రెండు రోజులవుతున్నా పిల్లలు మాత్రం వంద శాతం హాజరు కాలేదు. తర్వాత వచ్చే సోమవారానికి పిల్లలందరూ పాఠశాలకు చేరుకుంటారని అనుకుంటున్నారు. దాంతో ఈపాటికే వచ్చేసిన పిల్లలకు బాగా ఆటవిడుపు దొరికిందనే చెప్పాలి. సంఖ్య తక్కువగా ఉండటంతో అధ్యయనం తరగతులు కూడా వెంటనే ప్రారంభించలేదు ప్రధానాచార్యులు.

మొదటిరోజు సాయంత్రం పాఠశాల అయ్యాక ఉపాధ్యాయులందరూ కె.సి.కెనాల్‌ దగ్గరకు వ్యాహ్యాళికి బయలుదేరారు. ఎవరూ ఊహించని విధంగా అవ్వాళ ప్రధానాచార్యులు కూడా వాళ్లతో పాటు బయలుదేరారు. రాఘవ ఆశ్చర్యపోయాడు.

“ఏం మీకేమైనా అభ్యంతరమా రాఘవగారూ..” అని నవ్వుతూ ప్రశ్నించారు ప్రధానాచార్యులు.

“అయ్యో, ఎంతమాట ఆచార్యజీ. మా మాటలూ, జోకులూ మీకు నచ్చుతాయా అని ఆలోచిస్తున్నాను, అంతే!” అని నసుగుతూ అన్నాడు రాఘవ.

“నేనూ మీ వయసు నుండి ఈ వయసుకు వచ్చినవాణ్ణే కదా రాఘవగారూ, నచ్చకుండా ఎలా ఉంటాయి? కాకపోతే నా రాక మీకే కొంత ఇబ్బందిని కలిగిస్తుందేమోననుకుంటున్నాను.” అంటూ రాఘవ ముఖంలోకి తేరిపార చూశారు ప్రధానాచార్యులు.

“అటువంటిదేమీ లేదు ఆచార్యజీ..” అని నవ్వుతూ ప్రధానాచార్యుల వైపు చూశాడు రాఘవ.

“రాఘవగారూ మీకు కొత్త కానీ, మన ప్రధానాచార్యులగారు అప్పుడప్పుడూ మాతో వచ్చి కలుస్తూ ఉంటారు.” చెప్పాడు సుందరం.

“ఓ అలాగా, వారు రావటం ఇదే మొదటిసారి అనుకున్నాను.” అన్నాడు రాఘవ.

“కాదు..” అంటూ ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ ముందుకు నడవసాగారు.

ఇంతలో రైతులు పొలం పనులు పూర్తిచేసుకుని ఇండ్లకు తిరిగి వెళుతూ ఎదురుపడ్డారు.

దాదాపు అందరూ ప్రధానాచార్యులకు చేతులు జోడించి నమస్కరించారు. కొందరు “బాగున్నారా ఆచార్జీ..” అంటూ ఆయన్ను పలకరించారు. ఆయనా అడిగివాళ్లందరికీ సమాధానాలిస్తూ ముందుకు నడిచాడు.

“రాఘవగారూ.. రైతులు నిష్కల్మషులు, నిరాడంబరులు. నిజానికి వీళ్లంతా ఎలాగెలాగో ఉండవలసిన వాళ్లు.”

“అవును ఆచార్యజీ. వీళ్ల అమాయకత్వం, అజ్ఞానం, అవిద్య.. వీళ్లను ఈ స్థాయిలోనే ఉంచేసిందేమోనని భావిస్తున్నాను.”

“సరిగ్గా చెప్పారు. ఆదినుండి కూడా వీళ్లకు శ్రమించటమొక్కటే తెలుసు. ఇక దేనిమీదా వీళ్లకు మోజు లేదు. వీళ్లకు నలుగురికీ పెట్టటమే తెలుసు. నలుగురి ముందూ చెయ్యి చాచటం తెలీదు. ఆ పరిస్థితే వస్తే చావనైనా చస్తారు కానీ, దేహీ అని మాత్రం ఎవరినీ అడుక్కోరు. మంచి మనసున్న మారాజులు ఈ రైతన్నలు..”

“అవును. అలాంటి రైతులను ఇప్పుడెవరూ పట్టించుకోకపోవటమే బాధాకరం. రైతు దేశానికి వెన్నెముక అదీ ఇదీ అంటూ ఏవేవో పోలీకలు చెబుతారుకానీ, వాళ్లకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది.” నిట్టూరుస్తూ అన్నాడు రాఘవ.

“వాళ్లకే కనుక అన్ని సౌకర్యాలూ కల్పిస్తే.. ఈ ప్రపంచానికంతా అన్నం పెట్టగలరు. కానీ దురదృష్టం.. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రకృతి – వాళ్లపట్ల చిన్నచూపు చూస్తూనే ఉంది.”

అలా మాట్లాడుకుంటూ కె.సి.కెనాల్‌ దగ్గరికొచ్చి ఒకచోట అందరూ కూర్చున్నారు.

“అలాంటి రైతుల కష్టాలు కడగండ్లపై చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి ఒక సినిమాను నేనీమధ్య మరాఠీలో చూశాను. నిజానికి భాష రాకపోయినా అది నన్నెంతగానో కదిలించింది.” అన్నారు ప్రధానాచార్యులు.

“ఆ సినిమా పేరేంటి ఆచార్యజీ.” అడిగాడు మోహనరావు.

“ఏంటో నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు. కానీ దాన్నిచూశాక నాకొక్కటే అనిపించింది. రైతు ఏ ప్రాంతంవాడైనా వాళ్లు అనుభవించే కష్టాలలో ఏ మాత్రం తేడాలు లేవనీ. రైతుల కష్టాలు అన్ని చోట్లా ఒకటేననీ.” అంటూ ఉండగానే ఆయన గొంతు మూగబోయింది. అక్కడున్న వాళ్లందరిలోనూ ఏదో స్తబ్ధత ఏర్పడింది.

“ఏటికి ఎదురీది.. ఎయి పుట్లు పండిరచి..” అంటూ రాఘవ ఒక పాట అందుకుని చక్కటి ఫీల్‌తో పాడాడు.

అతను పాడుతున్నంతసేపు మౌనంగా ఉండి తర్వాత చప్పట్లు చరిచారు ప్రధానాచార్యులు. మిగతావాళ్లు జత కలిపారు.

“ఆచార్యజీ, మన రాఘవగారు చక్కటి గాయకులు కూడానూ. సినిమా పాటల్ని బాగా పాడతారు. రాఘవగారూ ఇంకో పాట పాడండి.” అని దామోదరం అనగానే “ఔను, బాగా పాడారు. వింటూంటే ఏదో తెలియని బాధను మనసును మెలి పెట్టేసింది. ఇంకో పాట పాడండి రాఘవగారూ..”అని ప్రధానాచార్యులు అనగానే మరో పాటను అందుకున్నాడు రాఘవ.

పాటను ఆసాంతం విని అందరూ అతణ్ణి ప్రశంసించారు.

ఉన్నట్టుండి ఈమారు రాఘవ ఒక తమిళపాటను అందుకున్నాడు. భాష అర్థం కాకపోయినా అతని గానాన్ని మైమరచి విన్నారందరూ. అతను పాడటం ఆపాక అందరూ మళ్లీ చప్పట్లు చరిచారు.

“రాఘవగారూ మీకు తమిళం కూడా వచ్చా? చాలా బాగా పాడారు.” మనస్పూర్తిగా ప్రశంసించారు ప్రధానాచార్యులు.

“ఏదో కొంచెం కొంచెం వచ్చు ఆచార్యజీ..” అంటూ సిగ్గుపడ్డాడు రాఘవ.

చీకటి పడుతూ ఉండగా అందరూ పాఠశాలకు బయలుదేరారు.

“ఖాళీ సమయాల్లో మన పిల్లలకు ఏవైనా భక్తి పాటల్ని నేర్పండి రాఘవగారూ.. ఇది నా విన్నపం.”

“తప్పకుండా ఆచార్యజీ.” అంటూ మనస్పూర్తిగా అంగీకరించాడు రాఘవ.

పాఠశాలకు తిరిగొచ్చి మంచినీళ్లతో స్నానం చేశాక ఎంతో హాయిగా అనిపించింది రాఘవకు.

ఆ రాత్రి భోజనాలయ్యాక త్వరగా నిద్రలోకి జారుకున్నాడు. బాగా నిద్రపట్టేసింది రాఘవకు.

దూరంగా ఎవరో ఏడుస్తుంటే రాఘవకు మెలకువ వచ్చింది. టైమెంతో చూశాడు. రెండు గంటలు కావస్తోంది.

ఆ ఏడుస్తున్నవాడు తమ విద్యార్థేనని నిర్థారించుకుని గబగబా తలుపు తీసుకుని బయటికొచ్చాడు. కణ్వ నిలయం బయట లైటు వెలుగుతోంది. ఒక విద్యార్థి చెవినొప్పికి తట్టుకోలేక నేలమీద పడి దొర్లుతున్నాడు. పాపం, రాజారావు వాడి అవస్థనూ, ఏడుపునూ చూసి కంగారుపడుతున్నాడు. ఏం చెయ్యాలో తోచక దిక్కులు చూస్తున్నాడు. కొంతమంది పిల్లలు వాడి చుట్టూచేరి వాణ్ణి సముదాయించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ వాడు ఉన్నట్టుండి గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు.

వాడి ఏడుపు శబ్దం విని ప్రధానాచార్యులు కూడా నిద్రలేచి గబగబా అక్కడికి వస్తున్నారు.

“రాజారావుగారూ ఏమైందట వాడికి?” అని అడిగారు ప్రధానాచార్యులు.

“ఏంటో తెలియటం లేదు ఆచార్యజీ. చెవి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఏదో దూరిందని చెబుతున్నాడు. చీమ దూరిందేమోనని చెవిలో నీళ్లుపోసి కాసేపు మూసి ఉంచమన్నాను. కానీ వాడు నీళ్లు పొయ్యకనే గట్టిగట్టిగా ఏడుస్తున్నాడు. చెవిని మూసి ఉంచలేకపోతున్నాడు. ఏమిటో ఏమీ అర్థం కావటం లేదు.” ఆదుర్దాగా అన్నాడు రాజారావు.

“సమయానికి మన నిరంజన్‌గారు కూడా లేరు చూశారా. ఉండి ఉంటే దానికి సరైన మందేమిటో ఆయనకు తెలిసి ఉండేది. సరే. నా గదిలో ఇయర్‌ డ్రాప్స్‌ ఉందేమో చూసొస్తాను.” అంటూ ఆయన గబగబా తన గదికేసి నడిచారు.

రాఘవ ఆ విద్యార్థికేసి వెళ్లాడు. టార్చిలైట్‌ వంటిదేమైనా ఉందాని అడిగాడు. ఒక విద్యార్థి తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ లైటు వేసి చూసేందుకు కూడా ఆ పిల్లవాడు సహకరించటం లేదు. చెవిని పట్టుకోగానే ఏడుపు మరింత పెంచేస్తున్నాడు.

రాఘవ గబగబా వెంకటయ్య గదికెళ్లి అతణ్ణి నిద్రలేపాడు. “వెంకటయ్యా, ఒక గరిటెలో కొద్దిగా మంచినూనె తీసుకుని వేడిచేసి అందులో రెండు వెల్లుల్లిపాయలు వేసి పట్టుకురా. తొందరగా తీసుకురా.” అని మళ్లీ ఆ విద్యార్థి దగ్గరికొచ్చాడు.

అప్పటికే ప్రధానాచార్యులు రిక్తహస్తాలతో వచ్చి ఇయర్‌ డ్రాప్స్‌ లేనందుకు తెగ బాధపడిపోతున్నారు.

ఈలోపు వెంకటయ్య రాఘవ చెప్పినట్టుగా మంచినూనె కాచి తీసుకొచ్చాడు. రాఘవ ఆ విద్యార్థిని మాట్లాడిస్తూ.. నూనె వేడి తగ్గాక వాడి చెవిలో రెండు చుక్కలు వేసి దూది అడ్డుపెట్టాడు. అయినా వాడు ఏడుస్తూనే ఉన్నాడు.

కొంతసేపటికి కాస్త ఉపశమనం కలిగినట్టుంది. వాడు ఏడుపును ఆపాడు.

నిజానికి వాడి చెవిలో ఏ పురుగూ దూరలేదనీ, అది చెవిపోటనీ చెప్పాడు రాఘవ.

పిల్లవాణ్ణి రాజారావుకు దగ్గరగా పడుకోబెట్టుకోమని చెప్పారు ప్రధానాచార్యులు.

అందరూ ఎవరి నిలయాలకు వాళ్లు వెళ్లిపొయ్యారు.

(ఇంకా ఉంది)

అద్వైత్ ఇండియా-39

0

[శ్రీ చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ (సిహెచ్. సియస్. శర్మ) రచించిన ‘అద్వైత్ ఇండియా’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[చామంతి రాజమండ్రి చేరి, తన పుట్టింటికి వెళ్లి తల్లీ తండ్రీ మామయ్యలకు తాను ఎంతో ప్రయాసతో తెచ్చిన శ్రీమహాలక్ష్మి బంగారు విగ్రహాన్ని చూపిస్తుంది. వారు ఆమె సాహసాన్ని మెచ్చుకుంటారు. బాలయ్య, రంగయ్యలు రామిరెడ్డిగారిని కలసి మాత విగ్రహాన్ని వారికి అప్పగించి, చామంతి చెప్పిన వివరాలు తెలియజేస్తారు. రామిరెడ్డి గారు సుల్తాన్‍తో కలిసి, శాస్త్రిగారింటికి వచ్చి విగ్రహం దొరికిందని చెప్పగా, ఆయన ఎంతో సంతోషించి చామంతి సాహసాన్ని అభినందిస్తారు. తల్లి దశదిన కర్మను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తాడు అద్వైత్. రాబర్ట్ ఇచ్చిన 15 రోజుల గడుపు సమీపిస్తుండడంతో సీత ఓ రాజు రాత్రి కుటుంబ సభ్యులందరినీ పిలిచి, తాను జైలుకి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని, మావగారి బదులు తను కూర్చుంటానంటేనే, రాబర్ట్ మామగారిని విడిపించడానికి ఒప్పుకున్నాడనీ చెబుతుంది. సీత బదులుగా తాను వెళ్తానని అద్వైత్ చెప్తాడు. ఆ రాత్రి పాపకి భవాని అని పేరు పెడతాడు అద్వైత్. మర్నాడు రాబర్ట్ దగ్గరకి వెళ్ళి సీత బదులు తాను వచ్చానని చెప్తాడు. రాఘవ గురించి అడిగితే, తనకు తెలియదంటాడు అద్వైత్. ఈ రోజుకి వెళ్ళి రేపు రా అని అంటాడు రాబర్ట్. ఆ రాత్రి సీత లండన్ విశేషాలను అడుగుతూ, ఇండియా ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు హఠాత్తుగా ఇండియా, సీతకి ఇవ్వమని తనకిచ్చిన కానుక గుర్తొస్తుంది అద్వైత్‌కు. గబగబా బ్యాగ్ నుంచి ఆ బాక్సుని తీసి సీతకి ఇచ్చి – తమ షిప్ బయల్దేరేముందు నీకివ్వమని ఇండియా ఇచ్చిందని చెప్తాడు. తెరిచి చూస్తే, అందులో ఒక బంగారు గొలుసు ఉంటుంది. మర్నాడు రాబర్ట్ రాఘవ గురించి ఏమి అడుగుతాడో అని దిగులు పడుతుంది సీత. రాఘవ మంచివాడే గాని ఆవేశం అతని చెడ్డ గుణమని చెప్తాడు అద్వైత్. రాఘవ ఆలోచనలతోనే నిద్రిస్తారు ఇద్దరూ. – ఇక చదవండి.]

అధ్యాయం 77:

[dropcap]అ[/dropcap]ద్వైత్.. మరుసటి రోజు వుదయాన్నే రాబర్ట్ కార్యాలయానికి బయలుదేరాడు.

దార్లో అతనికి సుల్తాన్ కొడుకు అంజాద్ ఎదురైనాడు. వాడి తత్వం తెలిసి వున్న అద్వైత్.. చూడనట్లు నేరుగా ముందుకు పోబోయాడు.

అంజాద్.. “అరే అద్వైత్!.. ఆగరా!..” అంటూ అద్వైత్ ముందుకొచ్చి నిలబడ్డాడు.

“ఏమిటి అంజాద్!”

“ఓ సాలా!.. నీ బామ్మరిది రాఘవ ఎక్కడరా!..”

“ఎక్కడ వున్నాడో నాకు తెలియదు..”

“నీకు తెలియకుండా వాడు ఏడవుంటాడ్రా!..”

“నేను అబద్ధం చెప్పను..”

“అట్టాగా!..” వెటకారంగా అన్నాడు అంజాద్.

“అవును..” గట్టిగా చెప్పాడు అద్వైత్. రెండు క్షణాల తర్వాత..

“చూడు అంజాద్!.. నీ మాటల తీరు నాకు నచ్చదు. నీతో వాదించడం నాకు యిష్టం లేదు. నీ దారిన నీవు వెళ్ళు.. నా దారిన నన్ను వెళ్ళనీ!..” అనునయంగా చెప్పాడు అద్వైత్.

“ఏడకి పోతావుండావ్!..”

“మిస్టర్ రాబర్ట్‌ను కలవడానికి..”

“విషయం ఏమిటో..” వ్యంగ్యంగా నవ్వాడు అంజాద్.

“అది నీకు అనవసరం!..”

“పో.. పో.. ఇక తిరిగి రావులే!..” వికటంగా నవ్వాడు అంజాద్.

అద్వైత్ అతని ముఖంలోకి తీక్షణంగా చూచి వేగంగా ముందుకు వెళ్ళిపోయాడు.

అద్వైత్ రాబర్ట్ కార్యాలయాన్ని చేరాడు. దాని ముందు ఒక వ్యాన్ నిలబడి వుంది. వెనక క్యాబిన్‌లో ముగ్గురు వ్యక్తులు వున్నారు. గడ్డాలు మీసాలతో వారి ముఖాలు కళావిహీనంగా వున్నాయి.

అద్వైత్ రాబర్ట్ గదిలో అతను పిలవగా ప్రవేశించాడు. అక్కడ ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ నిలబడి వున్నాడు. “హి యీజ్ ద ఫెలో. పుట్ హిం హండ్‍కఫ్స్” కర్కశంగా చెప్పాడు రాబర్ట్. ఇన్‌స్పెక్టర్ అద్వైత్ చేతులకు సంకెళ్ళు వేశాడు. అద్వైత్ ఆశ్చర్యపోయాడు.

“టేక్ హిమ్ టు అండమాన్..” శాసించాడు రాబర్ట్.

ఇన్‌స్పెక్టర్ అద్వైత్‌ను ఆ వ్యాన్లో ఎక్కించాడు. వ్యాన్ కదలి ముందుకు వెళ్ళిపోయింది.

రాబర్ట్ చర్య.. అర్థంకాని అద్వైత్ ఏమీ మాట్లాడలేక పోయాడు.

“టెక్ హింటు అండమాన్..” అన్న మాట వల్ల అద్వైత్‌కు అర్థం అయింది.

రాఘవ వారికి దొరకనందున.. నిన్న తియ్యగా మాట్లాడి యీరోజు తనకు యీ శిక్షను విధించాడని అనుకొన్నాడు అద్వైత్.

దార్లో సుల్తాన్ కనుపించడంతో.. తన చేతులకున్న బేడీలను పైకెత్తి ‘సుల్తాన్ భాయ్..’ అని అరిచాడు అద్వైత్. అతని గొంతు విన్న సుల్తాన్ తన్ను దాటి ముందుకు దూసుకు పోయిన వ్యాన్‌ను.. అందులో వున్న అద్వైత్‌ను చూచాడు. నేరుగా స్టేషన్‌కు వెళ్ళాడు. సబ్ ఇన్‌స్పెక్టర్‌ను అద్వైత్‌ను గురించి అడిగాడు.

“అతని బావమరది.. రాఘవ హంతకుడు. అతనికి సంబంధించిన వివరాలు అడిగితే.. అద్వైత్ గాని.. అతని తండ్రిగాని.. నిజాన్ని దాచి.. మాకు తెలియదన్నారు. ఆ కారణంగా అద్వైత్‌ను ప్రభుత్వ ద్రోహిగా పరిగణించి అండమాన్ కారాగారానికి పంపారు మా తెల్లదొరలు. రాఘవ మాకు చిక్కిన నాడే.. అద్వైత్‌కు విముక్తి. వాడు దొరక్కపోతే.. వీరు జీవితాంతం అండమాన్ జైల్లో కృంగి.. కృశించి చావవలసిందే!..” వికటాట్టహాసంతో నవ్వాడు సబ్ ఇన్‌స్పెక్టర్.

సుల్తాన్‌కు విషయం పూర్తిగా అర్థం అయింది. అతని ముఖం విలవిలబోయింది. బదులు మాట్లాడలేని స్థితి మౌనంగా స్టేషన్ నుండి రామిరెడ్డిగారి యింటి వైపుకు నడిచాడు.

అద్వైత్ బేడీలతో వ్యాన్ ఎక్కేటప్పుడు చూచిన పాల విక్రయదారుడు సోము చూశాడు. నరసింహశాస్త్రిగారి ఇంటికి వెళ్ళి తాను చూచిన దృశ్యాన్ని గురించి శాస్త్రిగారికి చెప్పాడు. శాస్త్రిగారు ఆ వార్తను విని.. కన్నీటితో వరండాలో కుర్చీలో ఒరిగిపోయారు.

రామిరెడ్డి సుల్తాన్ చెప్పిన విషయాన్ని విని.. రాబర్ట్ కార్యాలయానికి సుల్తాన్‌తో కలిసి వెళ్ళాడు.. పూర్వపు మాదిరే.. రాబర్ట్ వారితో మాట్లాడేదానికి నిరాకరించాడు. వారికి వినపడేటట్లుగా..

“టేక్ దోస్ ఫెలోస్, కమ్ విత్ రాఘవ..” ఆవేశంగా బిగ్గరగా అరిచాడు.

కుటుంబంలో ఎవరైనా ఒకరు చేయరాని నేరాన్ని చేస్తే దాని ప్రభావం.. ఆ కుటుంబ సభ్యుల మీద ఎలా పరిణమిస్తుందనే దానికి రాఘవ చర్య.. అద్వైత్‌కు రాబర్ట్ వేసిన శిక్ష ప్రత్యక్ష సాక్ష్యాలు.

సావిత్రమ్మ మరణంతో.. ఎంతో వేదనతో వున్న నరసింహశాస్త్రి గారికి యీ విషయాన్ని ఎలా తెలియజేయాలని.. రామిరెడ్డి.. సుల్తాన్లు ఎంతగానో మథనపడ్డారు. కానీ.. తమకు తెలిసిన విషయాన్ని వారికి చెప్పకుండా ఎంతకాలం దాచగలం!?.. ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్ళిన అద్వైత్ రెండు మూడు గంటల్లో ఇంటికి చేరకపోతే.. శాస్త్రి గారు.. సీత.. పాండు ఏమనుకొంటారు?.. ఎంతగా బాధపడతారు?.. యీలోగా మరెవరన్నా విషయాన్ని వారికి చెప్పి వుంటే.. వారు ప్రస్తుతం ఏ స్థితిలో వున్నారు!.. విషయం తెలిసిన వారిని ఓదార్చే వారెవరు? వూరడించే వారెవరు?..

ప్రశ్నలతో సతమతమౌతూ రామిరెడ్డి.. సుల్తాన్లు శాస్త్రిగారి ఇంటిని సమీపించారు. లోన ప్రవేశించారు. వారిని చూడగానే.. శాస్త్రిగారు..

“సుల్తాన్.. రెడ్డిగారూ.!.. మా ఇంటికి గ్రహణం పట్టింది..” గద్గద స్వరంతో కన్నీటితో చెప్పారు శాస్త్రిగారు. వారి మాటల వలన.. సుల్తాన్ రెడ్డిగార్లు.. వారి చెవికి విషయం చేరిందనుకొన్నారు.

వీరి రాకకు పది నిముషాల ముందు బయట పనికి వెళ్ళి వచ్చిన పాండుతో విషయం శాస్త్రి గారు చెబుతూ వుండగా విన్న సీత ‘బావా!..’ అంటూ కుప్పలా నేల కూలింది. సుమతి.. పాండు ఆమెను గదికి చేర్చారు.

“శాస్త్రిగారు.. తమరు అన్నీ తెలిసినవారు.. మీకు మేము చెప్పేటంతటి వాళ్ళము కాము. మీరన్నట్లు ప్రస్తుతం మీకిది గ్రహణ కాలమే!.. ధైర్యంతో పరిస్థితిని ఎదుర్కోవలసిన సమయం. కాలచక్రభ్రమణతో.. మార్పులు సహజం కదా స్వామీ!.. దుఃఖాన్ని మీరు దిగమ్రింగి సీతమ్మకు మీరే ధైర్యాన్ని చెప్పాలి.. ఆ బాధ్యతను మీకన్నా వేరెవరూ సవ్యంగా నెరవేర్చలేరు” ఎంతో అనునయంగా రెడ్డిగారు చెప్పారు. శాస్త్రిగారు కళ్ళు మూసుకొని తల ఆడించారు.

అధ్యాయం 78

రాఘవ రాబర్ట్ మనుషులకు దొరకని కారణంగా.. ఆలోచించి.. రాబర్ట్ అద్వైత్‌ను దోషిగా చేసి అండమాన్ జైలుకు పంపాడు.

ఆ సన్నివేశం జరిగిన మరుదినం నుండీ సుల్తాన్ తెల్లదొరల కొలువుకు స్వస్తి చెప్పి నరసింహశాస్త్రితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. తనకు తెలిసిన వేదాంతాన్ని వారికి చెప్పేవాడు. వుదయం సాయంత్రం తప్పనిసరిగా శాస్త్రిగారిని కలిసేవాడు. త్వరలో గ్రహణం విడిపోయి మంచి రోజులు వస్తాయనీ.. చిన్న బిడ్డ తల్లి సీతను, మనమందరం జాగ్రర్తగా చూచుకోవాలని ఆమెకు ధైర్యం చెప్పి, పరిస్థితికి ఎదురు నిలిచేలా చేయాలని.. ప్రస్తుత తమరి కర్తవ్యం అదేనని శాస్త్రిగారికి ఎంతో సౌమ్యంగా చెప్పేవాడు సుల్తాన్.

నేరం చేసి.. దూరంగా వెళ్ళిపోయిన రాఘవ.. మన ఇంటి పరిస్థితులను తెలుసుకొంటే తెగించి ఎక్కడ వున్నా.. మీ అందరి ఆనందం కోసం.. తన బావను అండమాన్ జైలు నుంచి విడిపించేటందు కోసం.. తప్పక వస్తాడని.. రెడ్డిగారు ఎంతో ఆశాజనకంగా శాస్త్రి గారికి చెప్పేవాడు.

వారిరువురి భవిష్యత్తు జాతకరీత్యా తెలిసిన నేను.. సావిత్రి ఎన్నిసార్లు అడిగినా నాకు తెలిసిన విషయాన్ని ఆమెకు చెబితే తట్టుకోలేకపోతుందని చెప్పలేకపోయానని.. నన్ను ఎదిరించి ఎదురు ప్రశ్నలు వేయడం తెలియని సావిత్రి.. తన ఆవేదనంతా హృదయంలోనే దాచుకొని.. నేను జైలు పాలు కావడంతో గుండె ఆగి చనిపోయిందని.. ఆమె మరణానికి నేనే కారకుడనని శాస్త్రిగారు వాపోయేవారు.

ఎంతో ప్రీతిగా అనునయ వాక్యాలను చెప్పి రెడ్డిగారు సుల్తాన్ వారిని ఓదార్చేవారు.

సీత.. జీవితం.. అంధకార బంధురమయింది. సుమతి ఆమెను అనుక్షణం వెంటవుండి.. అన్నయ్యను రాబర్ట్ త్వరలో విడిపిస్తాడని అతను తిరిగి వస్తాడని ఓదార్చేది.. పాపను సీతను తన ప్రాణ సమానంగా ఎంతో ప్రీతిగా చూచుకొనేది.

పాండురంగ.. తన మామగారి వద్ద చిన్నతనం నుండి నేర్చుకొని ధర్మసూక్తులు.. మానవ నిర్ణయాలు.. దానికి పరమేశ్వరుని తీర్పులను గురించి చెబుతూ.. “అన్నీ తెలిసిన మీరు ఇలా వుండే.. మేమంతా ఏం కావాలి మామయ్యా!.. మాకు దిక్కు దైవం మీరే కదా!.. మా కోసం మీరు గతాన్ని మరచి.. మాకు మంచీ చెడ్డా చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించవలసిన వారు.. మీరే కదా!..” అని దీనంగా శాస్త్రిగారి కళ్ళల్లోకి చూచేవాడు. ఇద్దరూ పాపలను వారికి చూపిస్తూ.. “అమ్మలూ.. మీ తాతయ్య గారురా.. వారిని చూడండి.. మాట్లాడండి..” అని చెప్పేవాడు.

ఆ బోసినవ్వుల పాపల అమాయక ముఖాలను చూస్తూ.. వారిని ఎత్తుకొని.. వారితో ముచ్చట్లు ఆడుతూ శాస్త్రిగారు.. తన హృదయ వేదనను మరిచేవారు.. అది తాత్కాలికమే.. అయినా.. సర్వం తెలిసిన తాను.. హృదయభారంతో మౌన ముద్రతో కూర్చుండిపోతే.. సీత పరిస్థితి ఏమిటి?.. ఆమెను అనునయించడం.. ధైర్యం చెప్పడం.. తన బాధ్యత కాదా!.. ‘ఆమెకు నేను కాక.. దగ్గరగా మరెవరున్నారు. సీత నా యింటి కోడలు.. ఆమె ఆనందంగా వుండేలా చేయడం నా ధర్మం. పరిస్థితులకు నేను ఎదురు నిలవాలి. నాతో వున్న నా వారికి.. నా మాటలతో ధైర్యాన్ని.. పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కల్పించాలి.. కాలచక్ర గమనంలో మార్పులు తథ్యం.. సహనంతో నిబ్బరంతో సమస్యను ఎదుర్కోవాలి..’

ఆ నిర్ణయానికి వచ్చిన శాస్త్రిగారు సీతను పిలిచారు. సీత వారి దగ్గరకు వచ్చింది. సీత దీనంగా వారి ముఖంలోకి చూచింది.

“కూర్చో అమ్మా!..”

వారు కూర్చున్న కుర్చీ ప్రక్కన నేల కూర్చుంది సీత.

శాస్త్రిగారు లేచి.. ఆమె చేతిని పట్టుకొని లేపి.. “తల్లీ!.. నీవు నా చెల్లెలి బిడ్డవు.. నాకు కోడలివే కాదు.. కూతురుతో సమానం.. నన్ను జాగ్రర్తగా చూచుకొనవలసిన బాధ్యత నీ మీద ఉంది.. కుర్చీలో కూర్చో..” అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.

సీత కుర్చీలో కూర్చుంది. విచారంతో తల దించుకుంది.

“సుమతీ!..” పిలిచారు శాస్త్రిగారు.

“ఏం పెదనాన్నా!..” పరుగున వచ్చింది సీత.

“నా పెద్ద మనుమరాలు!..

“నిద్రపోతూ వుంది..”

“చిన్న తల్లి!..

“మేల్కొని వుంది..”

ఆమెను ఇలా తీసుకురామ్మా!..

సుమతి లోనికి వెళ్ళి సీత పాపను తీసికొని వచ్చి.. శాస్త్రిగారికి అందించింది.

“అమ్మా!.. భవానిరా!..” నవ్వుతూ పాపను అందుకొన్నారు శాస్త్రిగారు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టి.. “నా బంగారు తల్లి!..” అంటూ సీత ముఖంలోకి చూచాడు.

సీత క్షణంసేపు వారి కళ్ళల్లోకి చూచి తల దించుకొంది. “అమ్మా సీతా!..”

“చెప్పండి మామయ్యా!..”

“యీమె ఎవరమ్మా!..”

“మీ మనుమరాలు..”

“కాదు..”

సీత ఆశ్చర్యంతో శాస్త్రిగారి ముఖంలోకి చూచింది.

శాస్త్రిగారు నవ్వుతూ.. “ఈ ఇంటికి వారసురాలు.. మా అమ్మ.. ఈమెను జాగ్రర్తగా చూచుకొంటూ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత. చూడు ఎంత అందంగా నవ్వుతూ వుందో నా చిట్టి తల్లి.. పాపను చేతికి తీసుకో..” అన్నారు.

సీత వారి చేతుల నుండి తన చేతుల్లోకి పాపను తీసుకొంది..

“అమ్మా!.. పరిస్థితుల ప్రభావం ఎప్పుడూ ఒకే రీతిగా వుండదు. మార్పు జరుగుతుంది. నీ భర్త త్వరలో తిరిగి వస్తాడు.” చెప్పి కళ్ళు మూసుకొన్నారు శాస్త్రిగారు.

సీత వారి ముఖంలోకి చూచింది ఆశగా.

“తప్పక వస్తాడు తల్లీ!.. నా మాట నమ్ము. నీవు రేపటి నుంచి స్కూలుకు వెళ్ళు. ఆ సమయంలో పాపను నేను.. సుమతీ చూచుకొంటాము. మంచి వ్యాపకం.. మనస్సుకు శాంతిని కలిగిస్తుంది”

“అలాగే మామయ్యా! మీ మాట ప్రకారమే నడుచుకొంటాను” అంది.

పాప ఏడ్వడంతో పాలు ఇచ్చే దానికి పాపతో సీత ఇంట్లోకి వెళ్ళింది.

సుల్తాన్ రావడంతో.. శాస్త్రిగారు సుల్తాన్ గోదావరీ నది ఒడ్డుకు వాహ్వాళికి బయలుదేరారు.

సీత మరుసటిరోజు నుంచీ స్కూలుకు వెళ్ళడం ప్రారంభించింది. తొమ్మిది గంటలకు స్కూలుకు వెళ్ళి ఐదు గంటలకు తిరిగి వచ్చేది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంటికి వచ్చి.. భోంచేసి రెండు గంటలకల్లా స్కూలుకు వెళ్ళేది. ఆమె స్కూలుకు వెళ్ళి సమయంలో పాపను సుమతి.. శాస్త్రిగారు చూచుకొనేవారు.

కాలచక్రం వేగంగా తిరగసాగింది.. అటు స్కూలు.. ఇంటికి వచ్చాక పాపతో కాలక్షేపం.. సీతకు వేరే ఆలోచనలకు తావు లేకుండా చేశాయి. కానీ.. రాత్రి పాప నిద్రపోయిన తర్వాత సీత.. అద్వైత్‌ను తలచుకొంటూ కన్నీరు కార్చేది.

పన్నెండు నెలలు మహా భారంగా గడచిపోయాయి. ఆండ్రియా స్థాపించిన అనాథ బాలబాలికలు ఆశ్రమానికి సుల్తాన్ పాండురంగతో కలసి మూడుసార్లు వెళ్ళి చూచాడు. తన శేష జీవితాన్ని ఆ అనాథ బాల బాలికల ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకొన్నాడు. అతని భార్య గతించి అప్పటికి పది సంవత్సరాలు. వుద్యోగాన్నీ విరమించుకొన్నాడు.

తన నిర్ణయాన్ని తెలియజేస్తూ సుల్తాన్ ఆండ్రియాకు వుత్తరం వ్రాశాడు. ఆ వుత్తరంలో సావిత్రమ్మ మరణాన్ని.. రాబర్ట్ అద్వైత్‌ను అండమాన్ జైలుకు పంపిన విషయాన్ని కూడా వ్రాశాడు.

(ఇంకా ఉంది)

పూచే పూల లోన-80

0

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ రోజు జో ఫోన్ చేస్తాడు. అడక్కూడదు, కానీ అడుగుతున్నాను అని అంటాడు. నీ అడుగులు జాగ్రత్తగా పడుతున్నాయా అని సమీర్‍ని అడుగుతాడు. రజనీశ్ గురించి, సారిక గురించి అడుగుతాడు. సారికతో ఉన్న బంధం గురించి అడుగుతాడు. తనదీ సారికదీ కేవలం స్నేహమేననీ, రజనీశ్‍కి తనకీ ఏ గొడవలూ లేవని చెప్తాడు సమీర్. తప్పుగా అనుకోవద్దనీ, అన్ని వేళలు ఒకలా ఉండవని హెచ్చరిస్తాడు జో. ఇంతకీ సారిక, రజనీశ్, నా గురించి ఈ సందర్భం ఈ రోజే ఎందుకు ముందుకు వచ్చిందని అడుగుతాడు సమీర్. సారిక తండ్రి మలేసియాలో పెద్ద వ్యాపారస్థుడనీ, ఆయన సమీర్‍ని కలవడానికి ముంబయి వస్తున్నాడని చెప్తాడు జో. ఎందుకని అడిగితే, సారిక సంగతి అంటాడు జో. మేము అలాంటిదేమీ అనుకోలేదని అంటాడు సమీర్. జో నవ్వేసి, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సారిక, సమీర్‍ల మధ్య – చక్కని డైలాగులు ఉన్న ఓ అద్భుతమైన సన్నివేశాన్ని చిత్రీకరించి, కట్ చెప్తాడు రజనీశ్. – ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap] దృశ్యం చలన చిత్ర చరిత్ర లోని పుటలలోకి ఎక్కేసింది. కాలేజీలో స్త్రీ స్వాతంత్ర్యం, పురుషుని రక్షణ అక్కరలేదు వంటి వాదనలతో హీరోకి విరుద్ధంగా చేష్టలు చేసిన ఓ అమ్మాయిని ఆ విధంగా వివాహం నిర్ణయమైన వారం రోజులలో ఆ అపార్ట్‌మెంట్‌లో నిలదీస్తాడు హీరో. బాక్‌డ్రాప్‌లో ఎన్నో చర్చలు అమ్మాయి గొంతులో వినిపిస్తాయి. వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతానికి ఈ సందర్భంలోంచి బయటపడితే చాలు అని నిర్ణయించుకుని క్షమించమని అడుగుతుంది అమ్మాయి. అక్కడ నటించిన ఇద్దరికీ చాలా పేరు వచ్చింది.

ఎండాకాలం రోజులవి. సారిక ప్రతి ఏటా నైనీ తాల్ వెళ్ళిపోతుంది. నన్ను రమ్మన్నా నాకు షూటింగ్ షెడ్యూల్స్ వలన ఇబ్బంది కలిగి వెళ్లలేక పోయాను. నిజమో, అబద్ధమో తెలియదు, ఎందుకో సారిక ఓ రెండు నెలలు కలవదు అని అనుకున్నప్పుడల్లా బాధ గానే ఉంది. ఒంటరిని కాను అని జో వలన ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఒకరి వలన ఒంటరితనం మాయమవుతుందా? ఏమో! ‘ముసిరే చీకట్లు’ అనే ఒక కొంకణి కథలో రోజూ చీకటి పడే వేళకి ఒక వ్యక్తికి వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి. కథలో ఎన్నో జరుగుతాయి, కానీ చివరికి కంటిచూపు పూర్తిగా సన్నగిల్లినప్పుడు ఆలోచనలు మూగగానే అతను చీకటి పడుతోంది అనుకుంటాడు. చివరి దశలో తెలుసుకుంటాడు – చీకటి వలన ఆలోచనలు ముసరసరటం లేదని! ఆలోచనలు తనలో గుమిగూడినప్పుడు సరైన ఆలోచన ఏదీ మెరవలేదు కాబట్టి చీకటి కమ్ముకుందని!

కాలింగ్ బెల్ మ్రోగింది. నేనుండే ఇంట్లో నలుగురు పనివాళ్ళు ఉంటారు. కాలింగ్ బెల్ కొట్టేదాకా ఎవరినీ రానీయరు. గేటు ముందున్న లాన్ లోనే అపాయింట్‌మెంట్లన్నీ అయిపోతాయి. ఇంతగా ఎవరు దూసుకొని వచ్చారా అనుకున్నాను. తలుపుకున్న పరికరం నుంచి చూసాను. బెర్ముడా షార్ట్స్‌లో ఒకతనున్నాడు. నల్ల కళ్లద్దాలు ధరించాడు. ప్రక్కన పని కుర్రాడున్నాడు. ఎంతో సేపు వారించి, తప్పదనుకున్నప్పుడే అతను తలుపు దాకా రానిస్తాడు. ఆ నమ్మకం నాకున్నది.

తలుపు తెరిచాను. ముందు కుర్రాడు లోపలి చ్చాడు.

ఆయన్ని అక్కడే ఉండమని సైగ చేసాడు. నన్ను కొద్దిగా లోపలికి రమ్మన్నాడు.

“మీకు చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వాలని బలవంతం చేసాడు.”

“ఈయన పేరు?”

“కుల్వంత్.”

“ఊ. సరే. నువ్వెళ్ళు. నేను చూసుకుంటాను.”

అతను వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వచ్చి నమస్కారం చేసుకొన్నాడు.

“కూర్చోండి”, అన్నాను.

నిలబడే చుట్టూతా చూసాడు.

“అయామ్ కుల్వంత్”, అంటూ కూర్చున్నాడు.

ఎదురుగా కూర్చున్నాను.

“ఏం చేస్తూ ఉంటారు?”

మర్యాదస్థుడిలా ఉన్నాడు. జాగ్రత్తగా పర్సులోంచి ఓ కార్డు చేసి ఇచ్చాడు.

‘కుల్వంత్ సింగ్, అర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్’ అని వివరాలున్నాయి,

నవ్వాడతను. నాకు నవ్వొచ్చింది. ఈయన నాకు ఒక ముఖ్యమైన సమాచారం ఇస్తాడా?

“నాకు ఇవేమీ అవసరం లేదు”, అన్నాను.

నిజమే అన్నట్లు తల ఊపాడు.

“నా వృత్తికి నేనొచ్చిన పనికి సంబంధం లేదు” అన్నాడు.

“ఏం పని మీద వచ్చారు?”

“మీరు సినీ ఇండస్త్రీలోకి ఎలా వచ్చారో గుర్తుందా?”

“అవును. గుర్తుంది”, చెప్పాను.

“జరుగుతున్న ఒక ప్రాజెక్టు లోంచి అప్పటికే చాలా మటుకు షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఒక హీరోని తీసేసి, మిమ్మల్ని పెట్టుకున్నారు.”

“అవును.”

“ఆ హీరో నాకు తమ్ముడవుతాడు.”

“ఓ. అతనికి సినిమాలు బాగానే ఉన్నాయి కదా?”

“నో. నో. అది కాదు సమస్య. సమస్య సారికతో ఉన్నది.”

“సారిక తోనా? ఏంటది?”

“నా తమ్ముడిని ఎందుకు తీసేసారో మీకు తెలుసు కదా?”

“రకరకాల కారణాలు చెప్పారు. అయినా ఇప్పుడవన్నీ ఎందుకు?”

“ఇప్పుడే కావాలి. సారికకు దగ్గరయిన వారెవరూ రజనీశ్‍కు నచ్చరు.”

“నేను ఆయనతో ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నానే?”

ఆయన తల ఆడించాడు.

“నో. రజనీశ్ మామూలు మనిషైతే మీకు అర్థమవుతాడు. అతను వింత సైకో.”

ఆలోచించాను.

“ఇంతకీ ఏం చేస్తాడు?”

“బాగా దగ్గరకి రానిస్తాడు. మిమ్మల్ని పెళ్ళి కూడా చేసుకోమంటాడు. కావలిస్తే ముహూర్తం కూడా పెట్టించి ఏర్పాట్లన్నీ చేస్తాడు. అంతా అయ్యాకా, తరువాత..”

“తరువాత?”

అతను ఏమీ మాట్లాడలేదు.

“కానీ నా తమ్ముడితో అలా చెయ్యలేదు.”

“ఏం చేశాడు?”

“ఇద్దరిలో ఒకరు పైకెళ్ళిపోకుండా ఉండాలంటే సారికకు దూరమవమని చెప్పాడు. వాడు ఆమె వద్ద నుండీ, సినిమా నుండీ తప్పుకున్నాడు.”

“నాకు అలాంటివేమి చెప్పలేదు.”

“చేసి చూపిస్తాడు.”

“సారికను ఇష్టపడ్డాడా?”

“అలాంటివి సినీ ఇండస్ట్రీలో నడవవు.”

“అంటే?”

“ఇదంతా టైం పాస్.”

“సారిక ఇష్టపడిందా?”

“అదీ టైం పాసే.”

“మీరు అర్థమయ్యేటట్లు మాట్లాడితే బాగుంటుంది.”

“సాలెపురుగు ఏం చేస్తుంది? తన గూటిలోకి ప్రవేశించిన ఈగని కొద్ది సేపు అలా వదిలేస్తుంది. అది బయటకు వెళ్లాలని గిలగిలా తన్నుకుని మరి కాస్త ఇరుక్కుంటుంది. అప్పుడు దగ్గర కొచ్చి పని పూర్తి చేసుకుంటుంది.”

“మీరు చెప్పే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ నేనెందుకు నమ్మాలి?”

“మీరు నమ్మాలని నేను బలవంతం చెయ్యలేను. సారిక గిలగిలా తన్నుకుంటోంది, బయట పడటానికి. మిమ్మల్ని ఆసరాగా తీసుకుంది.”

ఆలోచించాను. ఏదో తిరకాసు ఖచ్చితంగా ఉంది.

“నిజమే అనుకుందాం. నన్నేం చెయ్యమంటారు?”

“సూటిగా చెబుతున్నాను. సారికతో పని వెయ్యటం మానెయ్యండి.”

“రజనీశ్‌నూ వదిలేయవచ్చు కదా?”

“అలా చెయ్యకూడదు. మీ ఉనికిని మీరు కాపాడుకోవాలి.”

“చాలా చక్కగా చెప్పారు. ఒక్క ప్రశ్న..”

అతను లేచాడు.

“ఈ మాట ఇప్పుడే, ఇక్కడే ఇలా మీరు నాకు చెప్పేందుకు గల ప్రధాన కారణం, ఏదైనా సంఘటన ఉంటే కనుక తెలుసుకోవచ్చా?”

అతను లాన్ వైపు నడిచాదు. వెనకాలే వెళ్ళాను.

“మంచి ప్రశ్న” అంటూ అటూ ఇటూ చూశాడు.

అక్కడ ఎవరూ లేరు.

“మీరు సినిమాల్లోనే నటిస్తారు కదా?”

“అవును. నిజ జీవితంలో నటించటం నా వల్ల కాదు.”

“అదలా ఉంచండి. సంగీతం, నృత్యం, పెయింటింగ్.. ఇలా ఏ కళ తీసుకున్నా దైనందిన జీవితానికి కొద్దిగా దూరంగా నిలబడి ఆస్వాదించమంటాయి. కానీ సినిమా అలా కాదు. ఇక్కడ జరిగేది అక్కడ, అక్కడ కనిపించేది ఇక్కడ కనిపించాలని అనుకున్నత్లు కలిసిపోయి సాగుతూ ఉంటుంది.”

మనిషికి ఆలోచనా శక్తి బాగానే ఉన్నట్లుంది.

“అవును. అందులో సందేహం లేదు.”

“అలా పూర్తిగా కలిపేసి వ్యూహాలు పన్నేసే వారూ, మరో కథో లేక ఇంకేదో సినిమాలో తీసేసేవారూంటారు.”

“ఉంటారు. రజనీశ్ అలాంటివాడు కాదు.”

ఆపాడు.

“కాడు. ఖచ్చితంగా కాడు. కానీ ఎంత పిచ్చివాడంటే ఒక అద్భుతమైన వ్యూహం సినిమాలో పని చేసి అందరినీ మెప్పించినట్లు నిజ జీవితంలో కూడా అలా జరిగిపోవాలని ఆశించి పిచ్చి పిచ్చి తెలివితేటలను ఉపయోగిస్తాడు. చెల్లాచెదురు చేస్తాడు. అలా కనిపించడు.”

“మీకు ఇవన్నీ మీ తమ్ముడు చెప్పాడా?”

“కొన్ని చెప్పాడు. కొన్ని వాడి కోసం నేను కష్టపడి తెలుసుకున్నాను. అందుకే ముందు జాగ్రత్తగా ఆ సినిమాని నుండి నేనే వాడిని తప్పించాను. అందరూ మరో విధంగా అనుకున్నారు.”

గేటు దాకా వచ్చాం.

“నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు”, అన్నాను.

“అవును. చెప్పకుండా వెళ్లను. రజనీశ్‌కి తన మేధస్సు మీద విపరీతమైన నమ్మకం.”

“అది తెలుస్తునే ఉంటుంది.”

“మొన్ననే మైసూరు గుర్రపు పందేలలో నా మిత్రుడూ, అతనూ కలుసుకున్నారు. ఇద్దరికీ ఆ పిచ్చి ఉంది.”

“ఓ.”

“వివరీతంగా ఆడి సంపాదించి ‘సదర్న్ స్టార్’, మైసూరులో జల్సా చేసుకున్నారు. ఇండస్ట్రీ.. అంటే సినీ ఇండస్ట్రీ నీ చేతిలో ఉంది కదా రజనీశ్, ఏంటి నీ తదుపరి ప్లాన్? – అన్నాడు నా మిత్రుడు.”

“ఇంటరెస్టింగ్. ఆ ఒక్కటి చెప్పండి. నిజంగా రజనీశ్ ఈ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్నాడా?”

“సందేహం లేదు. అతని తల అందుకే ఇక్కడుండదు. గొప్ప జాతకుడు.”

“ఇంతకీ ఏమైంది?”

“టేబిల్ మీద బాటిల్స్ పెట్టిన వాడిని రూపాయి కాయిన్ అడిగాడట. అతను నవ్వుతూ ఇచ్చాడు. నా మిత్రుడిని చూసి ‘హెడ్స్ సమీర్, టెయిల్స్ సారిక’ అన్నాడట. పైకి ఎగరేసి అంత ఎత్తులోనూ ఎడమ చేతిలోకి పట్టుకుని కుడివేలితో కప్పి ‘ఏంటి?’ అన్నట్లు కళ్ళెగరేసాడు. మా వాడు భయంగా చూసాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. చెయ్యి తీసేసి కాయిన్ అతనికి ఇచ్చేసాడు. ఎగిరెగిరి పడటం జీవితం కాదు.. టాస్, పైకి ఎగరెయ్యి.. నీ ఎత్తుగడని ఎగరెయ్యి.. తిరిగి నీ ఒడిలోనే పడనీ! జీవితం గెలిచే గుర్రం కాదు! గెలువ లేని గుర్రాలని గుర్తించి వాటి మధ్యలో నిలబెట్టిన డార్క్ హార్స్‌ని గమనించటం!”

(ఇంకా ఉంది)

చిరుజల్లు-146

0

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ధనమేరా అన్నిటికీ మూలం

[dropcap]‘మ[/dropcap]నీ ఈజ్ హనీ’ అన్నారు.

డబ్బు బంధాలను తెంపుతుంది. కొత్త బంధాలను కలుపుతుంది.

పుట్టి పెరిగిన ప్రదేశాన్ని, దేశాన్నీ, కన్నవారినీ, నా అనుకున్న వారినీ అందరినీ వదిలేసి ప్రపంచం నలుమూలలకీ ఎగిరిపోతున్నారు సంపాదన కోసం.

కానీ ఆ ఆశ అయినా తీరుతోందా అంటే, ఏదో కొద్ది మంది విషయంలో తప్పిస్తే, చాలామంది విషయంలో నిరాశనే మిగిలిస్తోంది. పైగా అయినవారినందరికీ దూరమై, ఏకాకిగా మిగిలిపోయామన్న చింత, ఇంతై, ఇంతింతై వేధిస్తోంది.

వెంకట్ వంకాయల ఉద్యోగం కోసం, భార్యతో సహా ఆమెరికా వెళ్లి ఏడేళ్లు అయింది. ఇద్దరూ సంపాదిస్తూనే ఉన్నారు.. అయినా తాము కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా మారిపోయామన్న అసంతృప్తి లోలోపల రంగులుతోంది.

అందుచేత, సంపాదనకు అంతు ఏముంది? ఇద్దరం కష్టపడితే ఈ మాత్రం ఎక్కడయినా సంపాదించుకోలేమా – అన్న జ్ఞానోదయం కలిగింది.

స్వదేశం వెళ్లిపోవాలన్న ఆలోచన కలిగాక, వెంకట్ వంకాయల తన మేనమామ నేతి సీతారామయ్యకు ఫోన్ చేశాడు. ఈ పదేళ్ల కాలంలో బంధువులు చాలా మంది దూరమైనారు. మరి కొంతమంది జ్ఞాపకాల నుంచే దూరమైనారు.

వెంకట్ వంకాయల మేనమామతో తన అభిప్రాయం వెలిబుచ్చాడు.

“హైదరాబాదు వచ్చేసి, అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాం. ఏదైనా మంచి లొకాలిటీలో మంచి ఇల్లు కొందామనీ అనుకుంటున్నాం. అంచేత, మంచి ఇల్లు ఒకటి చూడు. నేను డబ్బు పంపిస్తాను. వీలైనంత తొందరలో ఇల్లు కొనేద్దాం” అన్నాడు.

“నువ్వు రావాలనుకోవటమే గొప్పవిషయం. ఇంక ఇంటిదేముంది? రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? చేతిలో డబ్బు ఉండాలే గానీ ఇళ్లకేం కొదవ? రేపటి నుంచీ ఎంక్వయిరీ చేసి చెబుతాను. నెల రోజుల్లో కొనేద్దాం” అన్నాడు నేతి సీతారామయ్య.

మర్నాటి నుంచీ ఇంక ఆ పనిలో పడిపోయాడు.

హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలు వెల్లివిరుస్తున్నాయి. అయితే, ఈ అపార్ట్‌మెంట్ కల్చర్ అందరికీ సరిపడక అక్కడి సాధక బాధకాలు చెప్పుకునేవారు ఎక్కువయ్యారు. డబ్బు ఉంటే విల్లా కొనుక్కోవటం నయం అని సలహా ఇచ్చారు.

నేతి సీతారామయ్య విల్లాల కోసం వెతకటం మొదలు పెట్టాడు. కానీ అవి కొంచెం దూరంగా ఉండటంతో, ఆలోచనలో పడ్డాడు.

ఇలా ఇంటి కోసం వెతుకుతున్న సమయంలో- “మీరు విల్లాలు కొనాలనుకుంటున్నారా?” అంటూ ఒక మృదు మధురమైన స్వరం ఆయన్ను పలకరించింది.

“విల్లాలను ఇల్లాలిని కొనాలనుకుంటున్నా” అంటూ నేతి సీతారామయ్య సరసమాడాడు.

“అయితే, మీ అన్వేషణ పూర్తి అయినట్లే” అన్నదా కోకిల కంఠం.

“ఎలాగ?” అని అడిగాడు నేతి సీతారామయ్య.

“ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్ట్ నుంచి పదినిముషాల దూరంలో అత్యంత అధునాతనమైన వరల్డ్ క్లాస్ కంపర్ట్స్‌తో విల్లాలు నిర్మిస్తున్నాం, చాలా సరసమైన ధరలలో” అన్నదా అమ్మాయి.

ఇక అక్కడినుంచీ విషయం ముదిరి పాకాన పడింది.

“మీకు స్థలం కావాలనుకుంటే, స్థలం ఇప్పిస్తాను. అపార్ట్‌మెంట్ కావాలనుకుంటే, ఇప్పించగలను. ఇండిపెండెంట్ ఇల్లు కావాలనుకుంటే, అదీ ఇప్పించగలను.. మీ రిక్వైర్‌మెంట్ ఏమిటో చెప్పండి” అన్నది.

“మాకు విడిగా, ఇండిపెండెంట్‌గా కొత్తగా కట్టిన ఇల్లు కావాలి” అన్నాడు నేతి సీతారామయ్య.

“రేపు మీ ఇంటికి కారు పంపిస్తాను. రండి” అన్నది.

మర్నాడు నేతి సీతారామయ్య ఇంటికి పదింటికి కారు వచ్చింది.

కారు ఆయన్ను ఆ కంపెనీ ఆఫీసుకు తీసుకు వెళ్ళింది. అక్కడ ఆయనకు ఒక పాతికేళ్ళ అమ్మాయి ఎదురుపడి, షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలికి తన ఛాంబర్ లోకి తీసుకు వెళ్లింది.

“నా పేరు మేకా మాధురి, చెప్పండి. మీకు నేను ఎలాంటి ఇల్లు అయినా సరే ఇప్పిస్తాను.”

“విల్లా కావాలి” అన్నాడు నేతి సీతారామయ్య,

“అలాగే చూపిస్తాను” అంటూ ఒక బ్రోచర్ ముందు పెట్టింది. అందమైన బిల్డింగ్ ఫోటోలన్నీ ఉన్నయి. ఇంటి ప్లాన్ చూపించింది.

“మీకు తూర్పు వైపు పేసింగ్ ఇల్లు కావాలంటే కొంచెం ఎక్కువ ఖరీదు” అన్నది మేకా మాధురి.

“ఎంత అవుతుంది?”

“రెండున్నర కోట్లు ఒక్క విల్లా, ఈస్ట్ ఫేసింగ్ అయితే మూడు కోట్లు..”

“అంత కన్నా తక్కువ ఖరీదులో లేవా?” అని అడిగాడు.

“అంటే కొత్త వెంచర్ వేస్తున్నాం. ప్రీ-లాంచింగ్ రేటు అయితే ఒకటిన్నర కోటి.. చాలా ప్రైమ్ లొకాలిటీ.. అన్నీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్..” అంటూ మేకా మాధురి ఇంకో బ్రోచర్ ఆయన ముందు పెట్టింది.

మళ్ళీ అన్నది “ఈ ముందు మూడు వరసలు బుక్ అయిపోయినయి. నాలుగో వరస నుంచీ ఉన్నాయి..”

“ముందు వైపు లేవా?” అని అడిగాడు నేతి సీతారామయ్య.

మేకా మాధురి నవ్వింది.

స్వరం తగ్గించి రహస్యంగా అన్నది “మీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను. కానీ కొంచెం విడిగా మాట్లాడుకుందాం.. ఒక గంట ఆగండి” అన్నది.

ఒక గంట తరువాత మేకా మాధురి, నేతి సీతారామయ్యను కారులో ఒక స్టార్ హోటల్‍కు తీసుకు వెళ్ళింది.

పక్కనే కూర్చుంది.

“మీకు మెయిన్ రోడ్ వైపు, కాలనీ మొదట్లో కోటి రూపాయలకే ఇప్పిస్తాను. అయితే నా కమిషన్ పది లక్షలు.. అంటే మనకు నలభై లక్షలు లాభం.. ఏమంటారు?” అన్నది మేకా మాధురి, నేతి సీతారామయ్యకు తన తనువు తాకిస్తూ.

“అలాగే” అన్నాడు నేతి సీతారామయ్య.

వారం రోజులు అమెరికాలోని వెంకట్ వంకాయలతో ఫోన్లో మాట్లాడాకా, అతను ఒకటిన్నర కోటి డబ్బు పంపించాడు.

అప్పుడు నేతి సీతారామయ్యకు ఇంకో ఆలోచన వచ్చింది.

విల్లా మేనల్లుడి పేరు మీద కాకుండా తన పేరు మీద బుక్ చేసుకుంటే మాత్రం అడిగేదెవడు? వాడు వచ్చినప్పటి సంగతి చూడొచ్చులే – అని తన మనసుకు నచ్చ చెప్పుకున్నాడు.

పది లక్షల రూపాయలు మేకా మాధురి తీసుకుంది. నలభై లక్షలు నేతి సీతారామయ్య ఉంచేసుకున్నాడు. కోటి రూపాయలు విల్లాకు ప్రీ-లాంచింగ్ మొత్తం కట్టేశాడు – తన పేరు మీద.

రెండు నెలల తరువాత –

ఆ కంపెనీ అక్కడ లేదు. ప్రీ-లాంచింగ్ లేనే లేదు. మేకా మాధురికి ఫోన్ చేసినా – ఇప్పుడా ఫోన్ పని చేయటం లేదు.

ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం-25

0

[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]

సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వామి (1700 – 1772):

18వ శతాబ్దమునకు చెందినవారు. నివాసము కుంభకోణం వద్ద గల ‘తిరుతై నెరూర్’ గ్రామము. కామకోటి పీఠాధిపతి యగు శ్రీ పరమ శివేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యుడు. పినతండ్రి రామభద్ర దీక్షితారు వద్ద విధ్య యొనర్చెను. భక్తి, రస ప్రధానమైన అనేక కర్తనలే గాక గ్రంథాలు కూడా వ్రాసిన సమర్థురు. రోజుల తరబడి సమాధి యందు యుండెడి వారు. అమరావతి, కావేరి తీరములో గల నేరూరు, కొడుముడి మొదలగు పల్లెలందు దిగంబరుడై మౌనవ్రతముతో నివసించెడివారు. తన మరణ కాలం ముందుగానే తెలిపిన తపస్సంపన్నుడు. ఈయన వార్షికోత్సవములు నెరూరులో నేటికిని జరుగుచున్నవి. కొత్తకోట సంస్థానాధీశ్వరులు పేరి శిష్యకోటికి చెందినవారు కాబట్టి వీరి సమాధికి నిత్యోత్సవాలు జరిపిస్తున్నారు. ఈయనచే సంస్కృతములో రచింపబడిన ఆధ్యాత్మ కీర్తనలు ‘పరమహంస ‘ముద్ర కల్గియుండును.

వాటిలో సామరాగంలోని ‘మానస సంచరరే బ్రహ్మణి’ అను కీర్తనయు, ‘బ్రూహి ముకుందేతి రసనే’ అను వేరొక రాగము లోని కీర్తనలు మిగుల ప్రసిద్ధి చెందినవి.

ఆ కాలపు దేశ పరిస్థితులు:

అశోకుని కాలంలో శాతవాహన సామ్రాజ్యం బలిష్టమగుట, మౌర్య రాజ్యం పతనం అవడంలో శాతవాహన రాజ్యము భరత ఖండమున ప్రధాన రాజ్యమయ్యెను.

మొదటి తెలుగు సామ్రాజ్యము – శాతవాహన రాజ్యం (క్రీ. శ. 220). కాకతీయ సామ్రాజ్యం – వరంగల్ ముఖ్య పట్టణంగా. అదే రెండవ తెలుగు సామ్రాజ్యము.

విజయనగర సామ్రాజ్యము (1336 – 1564) మూడవ తెలుగు సామ్రాజ్యం. 1564లో తళ్లికోట యుద్ధమున ఈ రాజ్యం అణచి వేయబడింది.

1360 మధురై:

మధుర ప్ర్రాంత ప్రదేశము తెలుగు విజయనగర రాజుల సామంతులచే పాలింపబడింది. కృష్ణదేవరాయలు (1509 – 1529) కన్యాకుమారి అగ్రము వరకు గల దేశము అంతయు జయించి పాలించెను. అరవ దేశమున తెలుగు రాజుల పాలన యున్న కారణమున ఉత్తర తెలుగు దేశమందలి ఆంధ్రులు తమిళ ప్రాంతములకు బోయి అచ్చట స్థిర నివాసం ఏర్పరుచుకుంటు వచ్చారు. ఈ విధముగనే 3వ శతాబ్దము కాలమున ఎపుడో సదాశివ బ్రహ్మేంద్రుని పితామహులు మధుర ప్ర్రాంతమున కేగి అచట స్థిరపడిరి. త్యాగయ్య పితామహులు గిరిరాజు సమకాలికులు. ఇంటి పేరు మోక్షము వారు. తండ్రి సోమనాథ యోగి. తల్లి శాంత, బాల్యదశ యందు సదాశివుల పేరు శివరామకృష్ణశాస్త్రి.

సదాశివునికి జ్ఞానోదయం కల్పిన సంఘటన:

సదాశివునికి భోజనమునకు కాలాతీతం అవటంతో సకాలమున దొరకక బాధకు గురికావలసి వచ్చింది. జీవితమంతయు ఇలాగే దుఃఖిస్తూ, భరించరానిదిగా వుండునని గృహస్థాశ్రమము వీడి సన్యాసాశ్రమము స్వీకరించారు.

అణిమాది శక్తులు, ఆకాశయానము, దూర గమనము, దూర శ్రవణము సదాశివులకు అలవడెను.

అతని జీవితం మహానుహిమానిత్యం అని చెప్పుటకు చాలా సంఘటనలు, ఉదాహరణలు వున్నాయి. కొన్నింటిని మనం గమనిద్దాం.

  1. పుదుకోట ప్రభువు శ్రీ విజయ రఘునాథ తొండమాన్ మహాభక్తుడు. ఆ కాలమున మహారాష్ట్ర సైనికులు – కలవారిని హింసించుచు వారి సంపదలను దోచుకొనేవారు. ప్రభువు సదాశివుని పాదములపై వాలి ఆశీర్వచనము కోరగా ‘నవనీత తొండమాన్’ అని పుత్రుడు గల్గెను. ప్రజలు చోర రోగ బాధలు లేక సుఖములలో ఓలాడేవారుట.
  2. పొలమున ధాన్యరాశిపై ఆశీనులై, యోగ నిష్ఠ యందు మునిగి యుండగా, చోరుడు అని తలచి కొట్టబోవ, అతని చేయి రాక బాధపడుచుండ యోగనిద్ర నుండి లేచి నిల్చిన తోడనే భూస్వామి చేయి దిగెను.
  3. సదాశివుడు అడవిలో నడుచుచుండగా, కొందరు సైనికులు కట్టెలు కొట్టి గుట్ట చేసి స్వామి నెత్తి మీద పెట్టారు. తుదకు మంటలుద్బవించి సైనికుల యిండ్లను కాల్చివేసెనట.
  4. దిగంబరులగు సదాశివులు సేనానాయకుని భార్యలు విశ్రమించి యున్న డేరా ప్రక్కగా వెడలు చుండగా, సేనానాయకుడు కోపగించి కత్తితోని స్వామి వారిని నఱకగా, స్వామి వారు దాని నెరుగక గమనింపక ఆనందమయులై నడుచుచున్నారట.
  5. ఒక రోజున బాలురు సదాశివుని సమీపించి మధురలో సుందరేశ్వరుని వృషభ వాహనముపై వైభవముతో ఊరేగింతురట, ఆ ఉత్సవము జూడవలె అని కోరగా, కళ్ళు మూయునంతలో అచట కేగి ఆ ఉత్సవమును తిలకించెరట బాలురు, కళ్ళు తెరవగానే తమ స్వగ్రామమున యున్నారట.
  6. ఖండన యోగమున అద్వితీయులు వీరు. రాత్రి వేళలో ఆ శరీరావయములు విడి విడిగా పడియుండి సూర్యరశ్మి సోకగనే కలిసిపోయేవి. ఒక రోజు భయంకర తుఫాను మూలంగా ఆయన మరణించారని జనులు అందరు అనుకోగా కొన్ని నెలలు తరువాత ఆయన సమాధిలో కన్పించి, చిరునగవుతో బయటకు వచ్చిరట.

అన్ని మహిమలు గల వ్యక్తి, మహర్షి గాక మరి ఏమవుతారు?

సదాశివులు వ్రాసిన గ్రంథములు:

  1. బ్రహ్మ సూత్ర వ్యాఖ్యానము
  2. యోగ సూత్ర వృత్తి
  3. శివమానసిక పూజ
  4. ఆత్మ విద్యా విలాసము
  5. సూత సంహిత సారము
  6. అయ్యప్ప దీక్షితుల గ్రంథములకు వ్యాఖ్యానము
  7. పరమ శివేంద్రుల గ్రంధములపై వ్యాఖ్య
  8. సంస్కృతమున ‘పరమ హంస’ అను ముద్రతో 23 కీర్తనలు

కీర్తనలలో పధానమైనవి :

  1. మానస సంచర
  2. బ్రూహి ముకుందేతి
  3. భజరే గోపాలం
  4. గాయతి వనమాలి
  5. పిబరే రామరసం
  6. బ్రహ్మైవాహం

ముఖ్యంగా తొమ్మిది మంది వాగ్గేయకారుల తరువాత తోడి సీతారామయ్య, శంకరాభరణం నరసయ్య, కాక ఇతర తెలుగు పదకర్తలు, తమిళ పదకర్తలు కూడా వున్నారు. వారిని గూర్తి క్లుప్తంగా చర్చించెదము.

తోడి సీతారామయ్య:

18వ శతబ్దానికి చెందినవాడు. సంగీత, సాహిన్యములందు సమర్థుడు. అనేక రచనలను రచించిన వాగ్గేయకారుడు. తోడి రాగాలాపన ఇతని సొమ్ము అని చెప్పవచ్చు. కనుకనే ‘తోడి సీతారామయ్య’ అయ్యారు. కుదువ పెట్టిన తోడి రాగమును వడ్డీతో సహా పైకము చెల్లించి ఈయనచే ఆ రాగాన్ని పాడించి రాజులు సన్మానించెడి వారట.

శంకరాభరణం నరసయ్య:

18వ శతాబ్దానికి చెందినవాడు. శరభోజి కాలము నాటి వాడు. బ్రాహ్మణుడు. ద్రావిడ భాషలో గేయ కల్పనలు విలసిల్లునట్లు పదములు రచించిన గొప్ప ప్రతిభ గలవాడు. శంకరాభరణం రాగాలాపన ఈతని సొమ్ము. ఆనాటి ప్రసిద్ధ గాయకులేమి, ప్రజలేమి తరచుగా చెప్పుకొనెడి వారని ప్రతీతి గలదు. కనుకనే ఈతడు శంకరాభరణం నరసయ్య అని సార్థక నామముతో పిలువబడుచుండెడివాడు.

పరిమళ రంగ పదకర్త:

ఇతడు క్రీ. శ. 1700 ప్రాంతము వాడు. త్రైలింగ్య బ్రాహ్మణుడు. మద్రాసుకు ఉత్తరముగా వుండుటచే ఆంధ్రుడని చెప్పవచ్చు. సంగీత, సాహిత్యములలో గొప్ప సమర్థుడు. ఇతడు ప్ర్రాస యముకములతో రచించిన పదములలో, కీర్తనలలో ‘పరిమళ రంగ’ ముద్ర వుండుటచే పరిమళ రంగడుగా చెప్పుదురు. ఈయన అసలు పేరు తెలీదు. ఏ క్షేత్రము, ఏ గ్రామమో కూడా సరిగ్గా తెలియదు. నరస్తుతికి విముఖుడు, దేవతాంకితముగా రచనలు సాగించాడు. తెలుగులో ఈతని పదములు 40 వరకు కలవు. కీర్తనలు 8 వరకు వున్నాయి. కొన్ని దైవపరంగాను, కొన్ని కొన్ని జతులతో కూడినవిగా యుండి నాయకా, నాయక లక్షణములు కల్గియుండును.

ఇతర తెలుగు పదకర్తలు:

17వ శతాబ్దానికి చెందిన వారుగా తెలియుచున్నది. పేర్లు మాత్రము తెలియుట లేదు. కాని వీరి ఇంటి పేర్లను, వీరి రచనలు ఉదాహరణలతో ఈ క్రింద చెప్పుడింది.

  1. యువరంగని పదములు – ఉదా: చెయిబట్టి నా సిగ్గు చెరవవలెనా (శహన)
  2. కస్తూరి రంగని పదములు – ఉదా: ఇందెందు వచ్చితివిరా . అలదాని యిల్లు
  3. ఘట్టుపల్లి వారి పదములు – ఉదా: తలచుకొంటే తాళజాలనే (కురంజి)
  4. బోల్ల వరము వారి పదములు – ఉదా: మోసమా యెగదనే నా బుద్ధికి (అహిరి)
  5. శోభన గిరి నారి పదములు – ఉదా: చెలియనితో (2) నెలతా (కాంభోజి)
  6. జటవల్లి వారి పదములు – ఉదా: మగవారికి ధర్మమేదదే మగువ వారలనమ్మ
  7. ఇనుకొండ వారి పదములు – ఉదాః నీవే మోడితే నెత నాదానవు (రేగు)
  8. శివరాంపురము వారి పదములు – ఉదా: ఏమి నేయుదు నిషమ మేడాయెనే (కాంభోజి); పోదామా పారిపోదామా (ధన్యాసి)

పై విధముగా ఎందరో పద కర్తలు, ఎన్నో పదములను రచించి కీర్తి చెందియుండిరి. ఇవే గాక వేణంగి వారు, వేణంగి ముద్రతోను, మల్లవారు మల్లికార్జున ముద్రతోను రచించిన పదములు కూడా ఎన్నో కలవు.

తమిళ పద కర్తలు:

వీరిలో వైదీశ్వరన్ కోవిల్ సుబ్బరామయ్యర్, ఘనం కృష్ణయ్యర్, ముత్తు తాండవరు, పాప వినాశ మొదలియార్ మొదలగువారు ముఖ్యులు.

1. వైదీశ్వరన్ కోవిల్ సుబ్బరామయ్యర్:

18-19 శతాబ్దానికి చెందినవాడు. తమిళ బ్రాహ్మణుడు. సంగీతములోను, తమిళ భాషలోను గొప్ప పండితుడు. ఇతడు తమిళములో శృంగార రస ప్రధానమైన అనేక పదములను ‘ముద్దు కుమార’ ముద్రతో రచించి విశేషమైన కీర్తి పొందినవాడు.

2. ఘనం కృష్ణయ్యర్:

18-19 శతాబ్దానికి చెందినవాడు. తమిళ బ్రాహ్మణుడు. తిరుచునాపల్లి జిల్లాలోని ‘తిరుక్కుణం’లో జన్మించాడు. ఉదయార్ పాళయములో నివసించాడు. తండ్రి పేరు రామస్వామి అయ్యర్. తంజావూరు ఆస్థాన విద్వాంసుడు. బొబ్బిలి కేశవయ్య వద్ద కొంత వరకు సంగీత విద్య అభ్యసించినవాడు. పల్లవి పాడుట యందు అతి సమర్థుడు. పదములు రచించుటలో మిక్కిలి ప్రతిభావంతుడు. ఈతని పదములు శృంగార రస ప్రధానమై యుంటాయి. తంజావూరు ఆస్థాన విద్యాంసులతో కలిగిన విభేదము వలన ఉదయార్ పాళయము వచ్చి ఆ రాజు యొక్క ఆస్థాన విద్వాంసుడయ్యాడు. అక్కడ రాజైన యువరంగభూపతి పైనను, మధ్యార్ణనము నేసిన ప్రతాపసింహునిపైన తమిళములో అనేక పదములను రచించి బహు సన్మానములు పొందాడు. త్యాగరాజు ఈతని గానానికి మెచ్చుకొనెడి వారట.

3. ముత్తు తాండవర్లు:

19వ శతాబ్దానికి చెందినవాడు. ద్రావిడ భాషయందును, సంగీతమందు గొప్ప పండితుడు. శివ భక్తాగ్రేసరుడు, చిదంబరనాథునిపై భక్తి, శృంగార రసములలో ఈతడు రచించిన పదములు కీర్తనలు మిగుల ప్రసిద్ధములు. ఇతను అరుణాచల కవి రాయర్ ముందు వాడని చెప్పుదురు.

4. పాప వినాశ ముదలియార్:

18వ శతాబ్దనముకు చెందినవాడు. తులజాబీ మహారాజు సమకాలికుడు. సంగీతమందును, ద్రావిడ భాషయందు విశేష పాండిత్యము గలవాడు. ఇతడు ‘పాప వినాశ’ అను స్వనామ ముద్రతో నిందాస్తుతిగా అనేక పదములను తమిళములో రచించి కీర్తి పొందాడు.

(సమాప్తం)

దంతవైద్య లహరి-24

3

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

పనుదోము పుల్లతో పచార్లు:

ప్ర: డాక్టర్ గారూ, పూర్వం గ్రామీణ జీవనంలో పండ్లను పిడక బొగ్గు’ (కచ్చిక)తో గానీ, ఏదైనా పందుంపుల్లతో గానీ శుభ్రం చేసుకునేవారు. ఆ సందర్భంలో నోట్లో పందుంపుల్ల వేసుకుని ఊరంతా తిరిగి రాజకీయాలు చక్కబెట్టటమో, ఇతర పనులు చూసుకోవటమో చేసేవారు. తిరిగి ఇంటికి వచ్చేవరకూ పందుంపుల్ల సగానికి పైగా అరిగిపోయేది! ఈ ఆధునిక సమాజంలోకూడా కొందరు టూత్ బ్రష్ పైన పేస్ట్ వేసుకుని, ఊరంతా తిరగడం చాలామంది గమనించే వుంటారు. అంతసేపూ నోట్లో వారి బ్రష్ నలుగుతూనే ఉంటుంది. ఇది ఎంతవరకూ సమంజసం?ఈ పద్ధతి దంతాలకు మంచిదా? చెడ్డదా?

-నాగిళ్ల రామ శాస్త్రి,సాహితీ వేత్త, హన్మకొండ.

జ: శాస్త్రి గారూ.. ఈ శీర్షిక ప్రారంభించిన తర్వాత మీరే ఇంత పెద్ద ప్రశ్న వేశారు. ఇక్కడ ఇదొక రికార్డు. తర్వాత ఒక దురలవాటును (వారికి మంచి అలవాటే అనిపించవచ్చు!) గమనించి, నా వంటి వారి దృష్టికి తీసుకు రావడం గొప్ప విషయం. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు. ప్రతి వారం ఈ శీర్షికలోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించి, తగిన సూచనలు చేస్తున్న మీ పెద్ద మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

పూర్వం పల్లెటూళ్లలో దంతధావనానికి ప్రధానంగా పంటి పుల్ల/పనుదోము పుల్ల లేదా పందుంపుల్లను వాడేవారు. టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు విపణిలో ప్రవేశించేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు ఉదయం పొలాల్లో పని చేసుకోవడానికి వెళుతూ, మధ్యలో ఎక్కడో ఒక చెట్టు పుల్ల విరిచి పళ్ళు తోముకుంటూ పొలం వరకు వెళ్లి, అక్కడ పంటకాలువలో ముఖం కడుక్కునేవారు. ఇంట్లో ఉండేవారు పంటి పుల్లను వాడినా, ఎక్కువశాతం మంది, బొగ్గుపొడి, ఇటుకపొడి, ఉప్పు, కచ్చిక వంటి పదార్థాలతో పళ్ళు తోముకునేవారు. తరువాత పళ్ళపొడుల ఆవిర్భావం, ఆ తర్వాత టూత్ పేస్టులు అందుబాటులోకి వచ్చి కొనసాగుతున్నాయి.

పనుదోము పుల్లలు

ఇకపోతే, పందుంపుల్లతో ఎక్కువసేపు గడిపితే ఎదురయ్యే అనర్థాలు ఏమిటీ? అన్నది ప్రశ్న. పుల్లను ఎంతసేపు నమిలినా జరిగే నష్టం ఏమీ లేదు, సమస్య వచ్చేది ఎక్కువ సేపు పళ్ళు తోమినప్పుడే! సాధారణంగా పళ్ళు తోముకోవడానికి, చాలా రకాల చెట్టుపుల్లలు వాడినప్పటికీ, ఎక్కువశాతం మంది వాడేది మాత్రం వేప, గానుగ పుల్లలు. వీటిని నమలడం, వీటితో పళ్ళు తోముకోవడం వల్ల, పళ్ళు శుభ్రపడడమే కాక, వీటిలో వుండే నూనెలు, పంటి చిగుళ్లు ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదపడతాయి. కానీ పంటి పుల్లతో, పళ్ళను ఎక్కువసేపు తోముకోవడం వల్ల పళ్ళు త్వరగా అరిగిపోవడమే గాక అనుకోని రీతిలో చిగుళ్లకు గాయమయ్యే ప్రమాదం వుంది. అంతమాత్రమే కాక, దారి పొడవునా ఉమ్ముతూ పోవడం వల్ల వీరికున్న అనారోగ్య సమస్యలు – పాదరక్షలు లేకుండా నడిచే పాదచారులకు సంక్రమించే అవకాశం వుంది. అందుచేత ఈ అలవాటు మంచిది కాదు. గరుకు పొడులతో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా రావచ్చునేమో గాని, త్వరగా అరిగిపోయి, ఇబ్బందులను సృష్టిస్తాయి. తప్పనిసరిగా పళ్ళపొడిని వాడాలని అనుకునేవారు, మెత్తని పొడులను ఎన్నుకోవడం మంచిది.

పళ్ల పొడులు

ఇకపోతే, పళ్ళు తోముకోవడానికి పందుంపుల్లను ఉపయోగించినా, పళ్ళపొడి/టూత్ పేస్ట్ ఉపయోగించినా, దంతధావనానికి ఒక అయిదు నిముషాలు కేటాయించి, ఒకచోట కూర్చొని లేదా నిలబడి, ఆ పని పూర్తిచేయడం మంచిది.

పళ్ళను ఐదు నిముషాలకంటే ఎక్కువసేపు తోముకోవడం ఆరోగ్యకరం కాదు. అలాగే హార్డ్ బ్రష్‌లు వాడడం, పళ్ళను గట్టిగా రుద్దడం చేయకూడదు. బ్రతికినంత కాలం పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పని సరి!

~

ముందరి పళ్ళమధ్య లావు చిగురు:

ప్ర: డాక్టర్ గారూ.. మా అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. చాలా అందంగా ఉంటుంది. ఆమెకు చిన్నప్పుడు, వేలు చీకే అలవాటు లేదు. కానీ, ఇప్పుడు ముందరి పళ్ళ మధ్య చిగురు లావుగా అయి ఖాళీ ఏర్పడి, చూడడానికి అసలు బాగోలేదు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏమైనా ఉంటే, చెప్పగలరా?

– ఎస్. వి. చలపతి రావు. హైద్రాబాద్.

జ: చలపతి రావు గారు, మీ అమ్మాయికి ‘డయాస్టిమా’ (రెండు పళ్ళ మధ్య గేప్) అనే చిన్న సమస్య వుంది. ఇలా రావడానికి కొన్ని కారణాలు వున్నాయి. 1) దౌడ మామూలుగా వుండి, దౌడ లోని పళ్ళు ఉండవలసిన పరిమాణం కంటే చిన్నగా వున్నప్పుడు 2) వేలు చీకడం అనే అలవాటు వున్నప్పుడు 3) ముందరి పళ్ళమధ్య వుండే సన్నని నరం (ఫ్రీనం) లావుగా మారడం వల్ల పళ్ళ మధ్య ఖాళీ రావచ్చు. మీరు చెప్పిన దానిని బట్టి మీ అమ్మాయికి, మూడవ రకం సమస్యగా నాకు అర్థం అయింది. దీనిని చిన్న శస్త్ర చికిత్స, దాని తర్వాత ఆర్థోడాంటిక్ చికిత్స ద్వారా పరిష్కరించవచ్చును.

ముందరి పళ్ల మధ్య పెరిగిన కండరం

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ అమ్మాయిని, దంత వైద్యులకు (ఓరల్ సర్జన్ + ఆర్థో డాంటిస్ట్) చూపించండి. త్వరలో ఫలితం మీకే తెలుస్తుంది. ఆలస్యం అయ్యేకొద్దీ చికిత్స క్లిష్టతరం అయ్యే అవకాశాలు ఉంటాయి.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

తెలుగుజాతికి ‘భూషణాలు’-41

0

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

[dropcap]గ[/dropcap]త వారం సినీరంగ పద్మశ్రీల ప్రస్తావన చేశాను. ఆ సందర్భంగా పద్మ భూషణ్ అందుకున్న సినీ ప్రముఖుల పేర్లు లేకపోవడంతో కొందరు అవి చేర్చలేదనుకొన్నారు. వారిని గూర్చి ముందుగా ప్రస్తావించాను. వారిలో – కొంగర జగ్గయ్య, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి (పద్మ విభూషణ్), దగ్గుబాటి రామానాయుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, పి. సుశీల, బి. ఎన్. రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు, డా. సి. నారాయణరెడ్డి, పి.లీల, యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రముఖులు. ‘పద్మ శ్రీ’ పొందిన మరికొందరి వివరాలు సంక్షిప్తంగా:

ఘంటసాల వెంకటేశ్వర రావు (డిసెంబర్ 1922 – ఫిబ్రవరి 1974):

సినీ నేపథ్య గాయకులలో మేటి ఘంటసాల. ఆయన గుడివాడ దగ్గర చౌటపల్లిలో జన్మించారు. విజయనగరం సంగీత కళాశాలలో శిక్షణ పొందారు. ‘స్వర్గసీమ’ సినిమాలో బి.ఎన్.రెడ్డి పాడటానికి అవకాశం కల్పించారు. 1951లో ‘పాతాళభైరవి’తో ఘంటసాల విజయం నలుదిశలా పాకింది. భగవద్గీత పాడి అజరామరుడయ్యారు. 1970లో ‘పద్మ శ్రీ’ వరించింది.

అల్లు రామలింగయ్య (అక్టోబర్ 1922 – జూలై 2004):

పాలకొల్లులో జన్మించిన రామలింగయ్య హాస్య నటులుగా సుప్రసిద్ధులు. 1952లో పుట్టిల్లు చిత్రంతో రంగప్రవేశం జరిగింది. సుమారు వేయికి పైగా సినిమాలలో నటించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‍లో నిర్మాతగా సినిమాలు తీశారు. కుటుంబమంతా సినీ రంగ ప్రముఖులే. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష పడింది. 1990లో ‘పద్మ శ్రీ’ అందుకున్న యశస్వి.

కె. విశ్వనాథ్ (1930 ఫిబ్రవరి 19 – 2023 ఫిబ్రవరి 02)

కాశీనాధుని విశ్వనాథ్ రేపల్లెలో జన్మించారు. దర్శకుడిగా విభిన్న చిత్రాలు అందించి, ‘శంకరాభరణం’తో జాతీయ ఖ్యాతి గడించారు. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం, ‘పద్మశ్రీ’ లభించాయి. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే ఆవార్డు దక్కింది. 1951 నుండి సినీ ప్రస్థానం మొదలయింది. ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకుడిగా పనిచేసి సూపర్ హిట్‍లు తీసిన ఘనుడు విశ్వనాథ్.

సాహితీ ప్రముఖులు:

గత 70 సంవత్సరాలలో సాహిత్యరంగము, పత్రికారంగానికి చెందిన 17 మంది ఆంధ్రులు ‘పద్మ శ్రీ’ పురస్కారం పొందారు. ముందుగా పత్రికా సంపాదకుల గూర్చి ప్రస్తావిస్తాను. నేషనల్ హెరాల్డ్ పత్రికా సంపాదకులైన యం.చలపతిరావుకు 1968లో ‘పద్మ భూషణ్’ ప్రకటించగా ఆయన తిరస్కరించారు.

తుర్లపాటి కుటుంబరావు (1933 ఆగస్ట్ – జనవరి 2021):

ప్రముఖ పత్రికాసంపాదకులు. 60 ఏళ్ళ పైబడిన పాత్రికేయ వృత్తిలో పేరు సంపాదించారు. 2002లో ‘పద్మ శ్రీ’ లభించింది. పామర్రు ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు. ఆంధ్రజ్యోతిలో చిరకాలం పనిచేశారు. జ్యోతిచిత్రకు సంపాదకులు. వక్తగా గిన్నిస్ బుక్ రికార్డులలో స్థానం సంపాదించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులయ్యారు.

సయ్యద్ అహమ్మదుల్లా ఖాద్రీ (1909 ఆగస్టు- అక్టోబరు 1985):

ఖాద్రీ స్వాతంత్రోద్యమ కార్యకర్త, పత్రికాసంపాదకులు, హైదరాబాదు జర్నలిస్టు సంఘాధ్యక్షులు, 1966లో వీరికి ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. SALTANAT అనే ఉర్దూ దినపత్రిక సంపాదకులు. సాహిత్యవిమర్శకులు. భారతదేశం అఖండంగా వుండాలని 1946లో వ్యాసం ప్రకటించిన తొలి పాత్రికేయుడు.

ఉర్దూ కవయిత్రి జిలానీ బానో (1936 జులై):

ఎనిమిదో ఏట నుండి ఉర్దూలో కవితలు ప్రచురించారు. ఆమె స్వీయ చరిత్ర ‘అఫ్జానా’ ప్రసిద్ధం. 2001లో ‘పద్మ శ్రీ’ లభించింది. సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు 1985లో అందుకున్నారు. మహిళా హక్కుల కోసం పోరాడే అస్మితకు అద్యక్షురాలు. యన్.టి.ఆర్ జాతియ పురస్కారం వరించింది (2016).

గ్రంథాలయోద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య (1890 జూలై – 1979 మార్చి):

తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆంధ్రప్రాంతంలో అనేక గ్రంథాలయాలు నిర్మించారు. విజయవాడలో రామమోహన గ్రంథాలయం (1911) స్థాపించారు. 1972 లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు. Indian Library Journal 1924 లో అఖిల భారత పౌరగ్రంథాలయ సంఘం తరఫున ప్రారంభించారు.

తెలుగు కవులు:

యస్. టి. జ్ఞానానంద కవి (1922 జూలై – జనవరి 2011):

వీరు విజయనగరం జిల్లాలో జన్మించారు. తొమ్మిదవ ఏటనే కవితలు చెప్పసాగారు. కూలీ నుండి కళా ప్రపూర్ణ స్థాయి వరకు ఎదిగి ఒదిగిన కవి. కవికోకిల, కవిలోకవిభూషణ, సాహితీవల్లభాది బిరుదాలతో బాటు 2001లో ‘పద్మ శ్రీ’ లభించింది. వీరి కుమార్తె శరజ్యోత్స్నారాణి హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా రిటైరయ్యారు. 1947లో ‘తరంగమాల’ రచనతో ప్రారంభించి జీవన పర్యంతం అనేక గ్రంథాలు ప్రచురించారు. క్రీస్తుచరిత్ర, క్రీస్తు ప్రబంధము ప్రముఖాలు. 1975లో ఆమ్రపాలి కావ్యానికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1983లో తెలుగు విశ్వవిద్యాలయం సత్కరించంది. 1974లో కాకినాడలో కనకాభిషేకం చేశారు. 1996లో డి.లిట్ ప్రదానం చేశారు. కాకినాడలో తెలుగు పండితులుగా పనిచేశారు.

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు (1927 అక్టోబరు – 2015 జూన్):

ప్రఖ్యాత సంస్కత విద్యాంసులైన పుల్లెల వారు అమలాపురంలో జన్మించారు. తండ్రి వద్దనే పంచకావ్యాలు అభ్యసించారు. మద్రాసు మైలాపూర్‌లోని సంస్కృత కళాశాలలో వేదాంత శిరోమణి చదివారు. 1957లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము నుండి సంస్కృతం, ఆంగ్ల భాషలలో ఎం.ఎ. చదివారు. పండిత రాజ జగన్నాధ నుండి సంస్కృత ఛందస్సు అనే అంశంపై పి.హెచ్.డి సాధించారు. అమలాపురం కాలేజీలో లెక్చరర్‍గా చేశారు. 1960 నుండి ఐదేళ్లు కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేశారు. 1965 నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కత విభాగంలో వివిధ హోదాలలో పనిచేశారు. సంస్కృత అకడమీ డైరక్టర్‌గా 11 ఏళ్లున్నారు. సురభారతికి కార్యదర్శి, ఆపైన ఉపాధ్యక్షులు. శతాథిక గ్రంథాలు రచించారు. శ్రీ వాల్మీకి రామాయణానికి అనువాదాన్ని పది సంపుటాలుగా ప్రచురించారు. ఆంగ్లం, సంస్కృతం, తెలుగులో రచనలు వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయము, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర సాహిత్య అకాడమీ, గుప్తా ఫౌండేషన్, బిర్లా ఫౌండేషన్ అవార్డులు లభించాయి. 2011 లో ‘పద్మ శ్రీ’ వరించింది. అసాధారణ ప్రతిభాశాలి శ్రీరామచంద్రుడు.

డా. రాధికా జయకర్ (1938):

ప్రముఖ సంస్కత విద్వాంసురాలు. ఋషీ వ్యాలీ విద్యాసంస్థల డైరక్టర్‌గా ప్రముఖులు. ప్రపుల్ జయకర్ కూమర్తె. జిడ్డు కృష్ణమూర్తి, ఇందిరాగాంధీ జీవితచరిత్రులు ప్రచురించారు. టోరంటో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాధించి ఋషీ వ్యాలీ విద్యాసంస్థలో చరిత్ర అధ్యాపకురాలిగా చేశారు. క్రమంగా డైరక్టర్ స్థాయికెదిగారు. 2013లో భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ పురస్కారంతో సత్కరించింది.

తెలుగు కవి పండితులు:

ఆచార్య కొలకలూరి ఇనాక్ (1939 జూలై):

గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్ 2015లో భారతీయ జ్ఞాన పీఠం వారి మూర్తి దేవి పురస్కారం అందుకున్నారు. 2014లో ‘పద్మ శ్రీ’ గ్రహించారు. ప్రభుత్వ కళాశాల ఉపన్యాసకులుగా జీవనగమనం ప్రారంభించి శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయ తెలుగుశాఖలో ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్‍గా వ్యవహరించారు. నవల, నాటకం, కథానిక, కవిత, విమర్శ, పరిశోధనా ప్రక్రియలలో దిట్ట, అజోవిభో, బొమ్మిడాల కృష్ణమూర్తి, జాషువా పురస్కారాలు లభించాయి. శతాధిక గ్రంథకర్త.

శ్రీ భాష్యం విజయసారథి (1931 మార్చి – 2022 డిసెంబర్):

వీరు కరీంనగర్ జిల్లా చేగుర్తిలో జన్మించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కత విద్యాపీఠంలోను, వరంగల్ శ్రీ విశ్వేశ్వర సంస్కృత కళాశాలలోను విద్యాభ్యాసం గావించారు. 2020లో ‘పద్మ శ్రీ’ వరించింది. విషాదలహరి, శబరీ పరివేదనం వీరి ఖండకావ్యాలు. స్వర్ణకంకణధారులు,

శ్రీ బి. రామకృష్ణా రెడ్డి (1942 ఆగస్ట్):

తెలంగాణా లోని రెంటలచేనులో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చేశారు. ఎడింబరో విశ్వవిద్యాలయం నుండి ఎం.పిల్. చేశారు (1977). హైదరాబాదులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజస్ లోను (1970-1972), ఉస్మానియా విశ్వవిద్యాలయం లోను (1977-90), తెలుగు విశ్వవిద్యాలయంలోను ఆచార్యులుగా బోధించారు, భాషాశాస్త్రవేత్తగా 2023లో ‘పద్మ శ్రీ’ పురస్కారం దక్కింది. నిఘంటు నిర్మాణకర్త.

కూరెళ్ల విఠలాచార్య ( 1938 జూలై):

విఠలాచార్య తెలంగాంగాలు రామన్నపేటలో జన్మించారు. 1967లో బి.ఏ. ప్రైవేటుగా పూర్తి చేశారు. 1959 ఆగస్టులో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల మునిపాన్పులలో ఉపాధ్యాయుడిగా చేశారు. 9వ తరగతి చదివేటప్పుడే కుడ్య పత్రిక ‘ఉదయ’కు సంపాదకుడు. తెలంగాణ ఉద్యమం తొలిదశలోను, మలిదశలోను చురుకుగా పాల్గొన్నారు. 1955లోనే ఇల్లిల్లూ తిరిగి గ్రంథాలయం స్థాపించారు. రామన్నపేట మండలంలో నెల్లంకి గ్రామంలో రెండు లక్షల పుస్తకాలతో కూరెళ్ల గ్రంథాలయాన్ని రెండు కోట్ల రూపాయలలో నిర్మించిన భవనంలోకి గవర్నరు తమిళపై సౌందరరాజన్ 2024 ఫిబ్రవరిలో ప్రారంభించారు. 2204లో ‘పద్మ శ్రీ’ ప్రకటించారు.

అవధాన శిరోమణులు:

కవిగా తెలుగులో యస్.టి. జ్ఞానానందకవి 2001లో ‘పద్మ శ్రీ’ అందుకొన్నారు. అవధానిగా ఆశావాది ప్రకాశరావు 2021లో అందుకొన్నారు. ఆ తరువాతి సంవత్సరం గరికపాటి నరసింహారావు అందుకొన్నారు.

ఆశావాది ప్రకాశరావు (1944 ఆగస్టు – 2022 ఫిబ్రవరి):

ఆశావాది అనంతపురం కవి. నండూరి రామకృష్ణమాచార్యుల ప్రియ శిష్యులు. సి.వి. సుబ్బన్న శతావధాని అవధాన గురువు. ప్రభుత్వకశాలలో తెలుగు అధ్యాపకులుగా చిరకాలం పనిచేసి పెనుగొండ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్‍గా రిటైర్ అయ్యారు. 19వ ఏటనే 1963లో అవధాన అరంగేట్రం చేశారు. 170కిపైగా అష్టావధానాలు, ఒక ద్విగుణితావధానము చేశారు. విద్వత్కవి.

డా. గరికపాటి నరసింహా రావు (1958 సెప్టెంబరు):

ప్రవచనకారుడిగా ప్రఖ్యాతి గడించిన గరికపాటి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో జన్మించారు. తెలుగులో ఎం.ఎ. పి.హెచ్.డి. చేశారు. అధ్యాపక వృత్తిలో మూడు దశాబ్దాలు పని చేశారు. దాదాపు 275 అష్టావధానాలు, 8 శతావధానాలు, మహాసహస్రావధానం దిగ్విజయంగా చేశారు. దేశవిదేశాలలో ప్రవచన ప్రభంజనం సృష్టించారు. ‘సాగర ఘోష’ పద్యకావ్యం ప్రముఖం. దూరదర్శన్‍లో, వివిధ ఛానళ్లలో వీరి ప్రవచనాలు అమోఘం. 2017లో ‘పద్మ శ్రీ’ పురస్కారం వరించింది. భక్తి టి.వి. తదితర ఛానళ్లలో వీరి ప్రసంగాలను శ్రోతలు ఆస్వాదించారు. ఆయన ధారణా బ్రహ్మరాక్షసుడు. వీరి కుమారుల పేర్లు – శ్రీశ్రీ, గురజాడ. గరికపాటి హైదరాబాదులో స్థిరపడ్డారు.

(మళ్ళీ కలుద్దాం)

ఆత్మజ్ఞానం

0

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఆత్మజ్ఞానం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]క[/dropcap]ఠోపనిషత్తు (1.2.18) లో ఒక ముఖ్యమైన శ్లోకం:

న జాయతే మ్రియతే వా విపశ్చిన్
నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్
అజో నిత్యః శాశ్వతో ఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే

ఆత్మ పుట్టేది గాని, చనిపోయేది గానీ కాదు; అలాగని ఒకప్పుడు వుండేదీ, మరొకప్పుడు వుండనిది కూడా కాదు; ఆత్మ జనితమైనది కాదు. ఎప్పుడూ ఒకలాగే వుండేది; నాశనం లేనిది, సనాతనమైనది; అది చంపదు, చంపబడదు; దేహం నశించినా ఆత్మ నశించదు.

ఆత్మ అనే సంపూర్ణ జ్ఞానం సదా చైతన్యపూర్ణమై ఉంటుంది. కనుక హృదయంలో సదా నిలిచి వుండే ఆత్మను భౌతికంగా గుర్తించలేకపోయినప్పటికీ ఆత్మ యొక్క ఉనికిని దాని చైతన్యం ద్వారా గుర్తించడం సాధ్యం. దీనికి కఠోపనిషత్తులో ఒక ఉదాహరణ ఇవ్వబడింది.

దట్టమైన మేఘాల కారణంగా కొన్ని సందర్భాలలో సూర్యుని ఆకాశంలో చూడలేము. అంత మాత్రానా అక్కడ సూర్యుడు లేనట్టు కాదు. అయితే సూర్యుని వేడి, అక్కడ నుండి ప్రసరింపబడే వెలుతురు ద్వారా ఆ సూర్యుడి ప్రభావాన్ని గుర్తించగలం. అదే విధంగా అన్ని జీవులలో, వాటి ఉనికికి ఆధారభూతమైన ఆత్మ వుంటుంది. ఈ ఆత్మను మనం భౌతికంగా ఇతర అంగములవలే చూడలేకపోయినప్పటికీ జీవుల చైతన్యం బట్టి గుర్తించగలం. ఈ ఆత్మ శరీరం నుండి నిష్క్రమించిన వెంటనే జీవుడు చైతన్యం కోల్పోయి జీవరహితంగా, చైతన్యరహితంగా మారుతాడు. అందుకే జీవుడు మరణిస్తే శివుడు శవమయ్యాడన్న ఒక నానుడి ప్రచారంలో ఉంది. జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ కూడా దేహం అనే ఒక చెట్టుపై (హృదయంలో) వున్నారు. భగవంతుని కరుణ వలన శోకములు, ఆందోళనలు, భోగభాగ్యాలనే ద్వంద్వ ప్రవృత్తుల నుండి బయటపడిన సాధకులు మాత్రమే ఆత్మ యొక్క ఉనికిని, ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటున్నారు.

ఆత్మ ఎప్పుడూ పుట్టదు మరియు చనిపోదు; లేదా అది ఎప్పటికీ మారదు, ఒకసారి ఉనికిలో ఉంటే, అది ఎప్పటికీ నిలిచిపోదు. ఆత్మ పుట్టనిది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉనికిలో ఉంది మరియు ఆదిమమైనది. శరీరం చంపబడినప్పుడు అది చంపబడదు. ఆత్మ అన్నది నిత్యం, శాశ్వతం, సనాతనం అని వేదం స్పష్టం చెస్తోంది. సనాతనమైన, నిత్యమైన, శాశ్వతమైన ఆత్మలం మనం.ఈ ముక్కు, నోరు, కళ్ళు, కాళ్ళు చేతులు అనే అంగాలం మనం కాదు. ఈ శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు.ఈ దేహం నశిస్తే దేహంలో వున్న శాశ్వతమైన దేహి నశించదు. సత్-చిత్-ఆనంద అనేది మీలో నివసించే, శాశ్వతమైన, అనంతమైన మరియు మార్పులేని ఆత్మ యొక్క పరమాత్మ యొక్క సారాంశం.

మనలో ఉన్న ఏకైక నిజమైన వాస్తవం ఆత్మ. మిగతావన్నీ అవాస్తవం. ఆత్మ త్రికాలదర్శి, గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి తెలిసినవాడు, అలాగే జరిగే ప్రతిదానికీ చైతన్య సాక్షి అయిన చైతన్యం. ఇదే మౌలికమైన జ్ఞానం ఆత్మజ్ఞానం.

ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం అంటే మన గురించి మనం తెలుసుకోవడం, నేను భౌతిక శరీరం మాత్రమే కాదు, ఆత్మను కూడా అని, నేను మూల చైతన్యం అని తెలుసుకోవటం. వ్యక్తి తన గురించి తాను తెలుసుకుని, తనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించడమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞాన మార్గం కోసం భగవంతుడిని సాధనగా మలచుకోవాలి. ఆయన రూపాన్నే కాదు చుట్టూ వలయంలా అల్లుకున్న దివ్యత్వాన్ని కూడా చూడాలి.

సంచిక – పద ప్రతిభ – 145

0

‘సంచిక – పద ప్రతిభ’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు శ్రీమతి పెయ్యేటి సీతామహాలక్ష్మి గారు ‘సంచిక – పద ప్రతిభ’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1.  – – – – – – తీర్చేవారు కాదు; మాటలతో ఓదార్చేవారేగాని (6)
4. వశిష్ఠ మహర్షి భార్యని పిలవండి (4)
8. అందము, రీతి (2)
9. దేవసంబంధమైనది, దివ్యము (5)
11. సాలెవాని సాధనవిశేషము, చివర లేదు (2)
13. వార్తాకి వృక్షము (3)
15. బొంతరటి చెట్టు (3)
16. కుడినుంచి ఎడమకి – అలుకుట, పూత, భోజనము (4)
18. వ్రతములు (3)
19. తటిని, నది, ఏరు (4)
20. జూదము (3)
21. తడబడిన స్థూలించు, అధికమగు (3)
24. చిన్న (2)
25. కపాలం కలిగిన శివుడు, కానీ మద్యలో అక్షరం మారిపోయింది (5)
26. పాపాయి (2)
29. చలించినది, కదలిక (4)
30. వెంకటేశ్వర స్వామి భార్య (6)

నిలువు:

1. పరితాపము, ఆరటము (4)
2. చిలుక బృహస్పతి, ఉపన్యాసకుడు (2)
3. గొప్పతనం, ప్రేమ, వాత్సల్యము, ప్రీతి (4)
5. రంజు లా ధ్వనించే ఒక విధమైన చర్మవాద్యము (2)
6. – – – – – -. సహాయము చేసే వారు లేరు. అడ్డం 1, తో కలిపితే ఒక నానుడి అవుతుంది. (6)
7. శ్రేష్ఠుడు, అధిపతి, నాటక మందలి ప్రధానపాత్ర (3)
10. పశువులను మందగట్టుట (7)
12. ఒక కొండ, మహేంద్రము (5)
14. కార్యసాధన కోసం మాట్లాడకుండా చేసే దీక్ష (5)
17. తల్లిదండ్రులు (6)
21. శివుడు, క్రింద నించి పైకి వచ్చాడు (3)
22. ఓ ఋషి, ధర్మరాజు సభలో వుండేవాడు. (వ్యాస భారతం, సభాపర్వం నాల్గవ అధ్యాయంలో 14వ శ్లోకంలో ఈయన ప్రస్తావన ఉంటుంది) (4)
23. గంగానది, ముత్త్రోవద్రిమ్మరి (4)
27. బ్రహ్మ, తెలుగు సంవత్సరాలలో పదవది (2)
28. వృశ్చికం (2)

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 17 తేదీ లోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక – పద ప్రతిభ 145 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2024 డిసెంబర్ 22 తేదీన వెలువడతాయి.

సంచిక – పద ప్రతిభ 143 జవాబులు:

అడ్డం:   

1) అతలాకుతలం 6) ఋష్యము/ఋశ్యము 8) పరాభవము 9) ఉష్ణీషి 10) ముర 12) పబ్బము 13) తగాదా 15) చిరుచాప 17) మేను 18) భారం 19) హఈ 21) హవాతమూజీ 22) పరాశరుడు 25) పనస 26) రుడుకహదే 28) తిర్లిక 29) కంచిగరుడసేవ

నిలువు:

1) అపరాజిత 2) తరా 3) లాభము 4) కువరము 5) తము 6) ఋషిపత్ని 7) మునుముకొను 11) చిగురు 14) గాలివాన 15) చిరంజీవ సప్తకం 16) పహరావాడు 18) భామూ 20) ఈశ 23) డువుదేసువ 24) రిమితి 25) పసిక 27) కట్టడ

సంచిక – పద ప్రతిభ 143 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అరుణరేఖ ముదిగొండ
  • భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కర్రి ఝాన్సీ, హైదరాబాద్
  • కాళీపట్నపు శారద, హైదరాబాదు
  • ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
  • మంజులదత్త కె, ఆదోని
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • పి.వి.రాజు
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • రామలింగయ్య టి, తెనాలి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ గళ్ళ నుడికట్టు నింపటంలో ఏవైనా సందేహాలు కలిగితే కూర్పరి శ్రీమతి సీతామహాలక్ష్మి గారిని 0877-2288386 అనే లాండ్‌లైన్ నెంబరులో (ఉదయం 00 – సాయంత్రం 5.30 గంటలో మధ్యలో) సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

పద శారద-18

0

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) ముది, మృతి లేనట్టిది. శాశ్వతమైనది (5)
4) బంకించంద్రుని ప్రసిద్ధ గీత పాదారంభం (5)
8) ఉండని (2)
9) అడవి (2)
11) మొత్తమంతా, చివర లేఖిని (4)
13) కాసు ఉన్న మెలిక (4)
15) ఉత్తరాల శాఖ (3)
17) అడ్డదిడ్డమైన అంగీకారము (3)
19) కలహాశనుడు (3)
21) వ్యవసాయము (3)
22) తారుమారైన పూవు (3)
23) 11 అడ్డం లాంటిదే (3)
24) భూమి మీద పొర్లడం (4)
27) స్వర్గాన్ని ఇలా అనవచ్చు (4)
30) రాజులు పేరుకు జోడించుకునే గుర్తు; ము చేరిసే కవచం (2)
31) తిరిగిన పక్షం (2)
33) వేడుకతో మొదలయ్యే శూరుడు (4)
35) చిన్న పిల్లలు (4)
38) స్వాధీనము (3)
40) అనువదించి చెప్పువాడు (3)
42) తిరస్కారము, ఎదిరించుట (3)
44) ఎల్ల వేళల (3)
45) సాగిన రేయి (3)
46) మేఘ గర్జన (3)
47) మరనావ (4)
50) గున్న ఏనుగు (4)
53) తొలి మలి యరలవశష (2)
54) సింహము, గుర్రము, కోతి, కప్ప (2)
55) లేతది కాని అల్లు అర్జున్ సినిమా (5)
56) ఉద్వాహము (5)

నిలువు:

2) ఆగమించజాలక (3)
3) ఫిలిప్పిన్సు రాజధాని (3)
5) ప్రభువు, జంగమును ఇలా అంటారు (3)
6) చివరిసాగిన ఒక పాతకాలపు కొలమానం (3)
7) మృచ్ఛకటికం నాటకం నాయిక. నాగేశ్వరరావు, పద్మిని లతో సినిమా కూడా వచ్చింది (5)
10) 7 నిలువు ప్రియుడు (5)
11) వందనములు – అన్య భాషలో (4)
12) యాదవకులనాశని (4)
13) అప్పాజీ అని రాయలుచే పిలిపించుకునే ముఖ్యామాత్యుడు (4)
14) ఏ మాత్రం ప్రయాస లేకుండా, అత్యంత సులువుగా (4)
16) అర్ఘ్యం తర్వాతది, చివర అనుస్వారం లోపించింది (2)
18) తిరగబడిన మరీ ఎక్కువ (2)
20) ఉప్మా చేసేందుకు ముఖ్యమైన పదార్థం; వజ్రం (2)
25) నేర్పరి (3)
26) పురుకుత్సుని భార్యను పిలవండి (3)
28) రాక్షసి (3)
29) రెండు ‘వా’ లతో మెచ్చుకోండి (3)
32) అక్కర (5)
33) సమూహమే (4)
34) శివ ప్రియమైన పూస (4)
35) పసరు వన్నె గలది – వేయిపడగలు నవలలోని ఒక విచిత్ర పాత్ర (4)
36) రక్తము (4)
37) ఎడతెగనిది -అంతంలేనిది – ఎల్లప్పుడూ (5)
39) ఈశ్వర (2)
41) విధము – వత్తుపోయింది (2)
43) తిరగబడ్డ ఉరుదూ నాణెము (2)
48) మూడు (3)
49) ఒక ప్రసిద్ధ హిందీ సంగీత దర్శకుడు (3)
51) పెద్ద అల (3)
52) చిన్న డబ్బీ (3)

 

ఈ ప్రహేళికని పూరించి 2024 డిసెంబర్ 17వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-18 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 22 డిసెంబర్ 2024 తేదీన వెలువడతాయి.

పద శారద-17 జవాబులు

అడ్డం:

1) వనౌకసము 4) పోకపలుకు 8) సాని 9) పాట 11) సాయిబాబా 13) అలంకార 15) నిశాని 17) వనట 19) సికత 21) కలడ 22) గాయకా 23) కయ్యర 24) వానకారు 27) మానవత 30) లులి 31) లులు 33) వసుమతి 35) అష్టావక్ర 38) వలన 40) కపిల 42) వ్యాపారం 44) స్వయంభూ 45) మట్టసం 46) దుహిత 47) మినువాక 50) దహనుడు 53) కలి 54) యర 55) క్రమేలకము 56) సాముగరిడి

నిలువు:

2) కసాయి 3) సనిబా 5) కపాలం 6) పటకా 7) ఆధునికత 10) అనంతరము 11) సానిడవా 12) బావగారు 13) అటకామా 14) రసికత 16) శాల 18) నయ 20) కయ్య 25) నలుసు 26) కాలిమ 28) నలుష్టా 29) వలువ 32) వివస్వతుడు 33) వనభూమి 34) తికమక 35) అలసంద 36) క్రవ్యాదుడు 37) నిరంతరము 39) లయం 41) పిట్ట 43) పాహి 48) నుకల 49) వాలిక 51) హయము 52) నురగ

పద శారద-17 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • భద్రిరాజు ఇందుశేఖర్
  • భాగవతుల కృష్ణారావు
  • దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
  • ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • కర్రి ఝాన్సీ, హైదరాబాదు
  • కాళీపట్నపు శారద, హైదరాబాదు
  • ఎం.వి.ఎస్. రంగనాధం, హైదరాబాదు
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మంజులదత్త కె, ఆదోని
  • పి. వి. రాజు
  • ప్రవీణ డా.
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి, తెనాలి
  • రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • శిష్ట్లా అనిత
  • శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
  • వర్ధని మాదిరాజు
  • వీణ మునిపల్లి

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.