back to top
Home Blog Page 8

సంచిక పదసోపానం-32

0

[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్‍లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.

ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.

వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.

~

ఈ పజిల్‍ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.

~

పదసోపానం 32
1 గిలిగింతలు
2
3
4
5
6
7
8
9
10
11
12 చిర్రుబుర్రులు

~

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 డిసెంబర్ 17 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘సంచిక పదసోపానం-32 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 డిసెంబర్ 22 తేదీన వెలువడతాయి.

సంచిక పదసోపానం 30 కి పజిల్ నిర్వాహకుల జవాబులు:

1.వైకుంఠపాళి 2. పెళ్ళికూతురు 3. తిరగమోత 4. మాతులకము 5. కమలగంధి 6. గంధమాదని 7. దానిమ్మపండు 8. పండ్రెండవది 9. వేదాంతభేరి 10. భరతవర్షం 11. వార్షిక చందా 12. చదరంగము

సంచిక పదసోపానం 30 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనూరాధా సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • సిహెచ్.వి. బృందావన రావు, నెల్లూరు
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • కాళిపట్నపు శారద, హైదరాబాద్
  • మంజులదత్త కె, ఆదోని
  • రంగావఝల శారద
  • రామకూరు నాగేశ్వరరావు
  • శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
  • శిష్ట్లా అనిత
  • వర్ధని మాదిరాజు
  • విన్నకోట ఫణీంద్ర, హైదరాబాద్

వీరికి అభినందనలు.  జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-36

0

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

నెట్టుకుంటూ అలా.. అలా:

[dropcap]రా[/dropcap]తియుగం – ఇంటర్నెట్ యుగం మధ్య మానవ జీవన వికాసాల నడుమ చాలా అంతరం ఉంది. జాతిగా చూస్తే మానవులంతా ఒకటే కావచ్చు, కానీ – సులువైన జీవనం కోసం ఏం చేయాలన్న విషయంలో పెరుగుతున్న జిజ్ఞాసే – ఆది మానవున్ని ఆధునిక మానవునిగా తీర్చిదిద్దింది. కొత్త సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకున్నప్పుడల్లా మానవ జీవన ప్రగతిలో పెను మార్పులే చోటుచేసుకున్నాయి. ఇదంతా ఒక కోణం. కానీ, మార్పు వస్తున్నప్పుడల్లా అంతే స్థాయిలో ఇబ్బందులు, కష్టాలూ సమాజంలో తప్పలేదు. కొత్త కాంతి వైపు అందరూ పరుగులు పెడుతుంటే, కొంత మంది మాత్రం పాత అనే చీకటిలోనే ఉండిపోతుంటారు. వారు కొత్తని వెంటనే స్వాగతించలేరు. మానవ చరిత్రలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. భూమి గుండ్రంగా ఉన్నదని అంటే కాదనే వారూ, మనిషిని దేవుడు సృష్టించలేదు జీవపరిణామ క్రమంలో ఈ జాతి ఆవిర్భవించిందని చెబితే వినని వారూ, గ్రహణాల గుట్టు విప్పితే నమ్మని వారు ఆనాడే కాదు ఈనాడూ ఉన్నారు.

పెను మార్పులు:

1984 నుంచి నాలుగు దశాబ్దాల నా జర్నలిజం కెరీర్‌లో అనేక సాంకేతిక పరమైన మార్పులు చూశాను. మీడియాలో నిలదొక్కుకోవడం ఇక కష్టమే అనుకున్నాను. నా కళ్ల ముందు అనేక మంది ఈ వృత్తిని వదిలేసి వెళ్ళిపోయారు. మరెంతో మందికి ఉద్యోగాలు పోయాయి. సాంకేతిక మార్పులను పెను భూతంగా అనుకుంటున్న వారు ఇప్పటికీ ఉన్నారు. మానవ జీవనయానం టెక్నికల్‌గా మారుతున్నప్పుడల్లా ఎన్నో ఇబ్బందులు, అవస్థలు తప్పలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. చిత్రమేమంటే, సాంకేతికంగా పెను మార్పులు రానంత వరకు వారంతా సంతోషంగానే జీవనం గడిపారు. ఎందుకంటే ఇంత కంటే మెరుగైన జీవితం తమకు ఆధునిక సాంకేతికత అందించబోతుందన్న ఆలోచన వారికి లేదు కనుక.

ఈ మధ్య ఓ ఎనిమిదేళ్ల బాలుడు నన్ను అడిగాడు.

‘మీ చిన్నప్పుడు మొబైల్ పోన్స్ లేవా? ఇంటర్నెట్ లేదా? టీవీలు లేవా?’

‘లేవు’.

‘మరి మీరంతా సంతోషంగా ఉన్నారా?’

‘ఉన్నాము’

వాడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇవన్నీ వాడి జీవితంలో ప్రధానమైనవి కాబట్టి. కానీ అవేవీ తెలియవు కనుక మాకు అప్పటి జీవనమే పూర్తి సంతృప్తిని ఇచ్చింది. ఎప్పటికప్పుడు మానవుడు తనకున్న జ్ఞానంతోనే సంతృప్తి పొందుతుంటాడు. కొత్త విషయం వెలుగు చూస్తేనే కదా పోల్చుకోవడానికి.

చక్ర మహిమ:

మానవ జాతి వికాసానికి సంబంధించి నేనో పుస్తకంలో చదివాను. అందులో ఒక చోట..

అది రాతియుగం. మానవునికి చక్రం అంటే తెలియని రోజులవి. బండిని లాక్కెల్లడానికి నలుపలకల చెక్కనో, లేదా రాతినో బండి ఇరుసుకు చక్రాలుగా బిగించేవారు. ఆ సమయంలోనే ఒకానొక చోట గుండ్రటి రాయి ఏటవాలుగా ఉన్న ప్రాంతం నుంచి వేగంగా, దొర్లడాన్ని కొంత మంది యువకులు గమనించారు. వీల్ తయారు చేయడానికి ఓ ఆలోచన మెరిసింది. ఫలితంగా బండికి గుండ్రటి చక్రాలు అమిరాయి. దీంతో బండి వేగంగా సునాయాసంగా వెళ్లగలిగింది. పని సులువైంది. అయితే, ఊహకు కూడా అందని ఈ మార్పుని మిగతా వాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాత పద్ధతే మంచిదన్న వాదన నుంచి బయట రాలేక పోయారు. పైగా చక్రం వాడుతున్న యువకులను ఎగతాళి చేశరు. ‘మా పనికి అడ్డు రాకు’ అంటూ విసుక్కున్నారు. కానీ మార్పు ఆగలేదు. ఈ లోగా కొత్త మార్పును మరికొంత మంది స్వాగతించారు. నెమ్మదిగా చక్రం వాడకం పట్ల మోజు పెరిగింది. సునాయాసంగా పని అవుతుంటే కష్టపడటమెందుకన్న భావన మొలకెత్తింది. ఫలితంగా సమాజంలో చక్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రింట్ మీడియా పెను మార్పులకు గురైనప్పుడు ఇంచుమించు కథ ఇలాగే నడిచింది. ఈ మార్పులకు కంప్యూటర్ కారణమైంది. మొదట్లో ఇది మా పాలిట పెనుభూతం. ఎందుకంటే మీడియా రంగంలోకి కంప్యూటర్ ప్రవేశించడంతో ఎంతో మంది ఉద్యోగాలు పోయాయి. బతుకులు భారమయ్యాయి. ఉన్నట్లుండి ఆఫీస్ వాతావరణం మారిపోయింది.

కంప్యూటర్ తెచ్చిన కలకలం:

నేను 1984లో విజయవాడ ఆంధ్రప్రభ ఆఫీస్‌లో సబ్ ఎడిటర్‌గా చేరినప్పుడు ఉన్న పరిస్థితులకు పూర్తి భిన్నమైన వాతావరణం రావడానికి కంప్యూటర్ రంగప్రవేశమే ప్రధాన కారణం. 1990వ దశకం మధ్యలో అనుకుంటా – కంపోజింగ్ సెక్షన్ వారి కోసమే అన్నట్లు కంప్యూటర్లు దిగాయి. అప్పటివరకు హ్యాండ్ కంపోజింగ్, లైనో టైప్ కంపోజింగ్ వంటివి ఉండేవి. ఎప్పుడైతే కంప్యూటర్లు దిగాయో హ్యాండ్ కంపోజింగ్ సెక్షన్‌లో కలవరం. మద్రాసు నుంచి లారీల్లో డెస్క్‌టాప్‌లు, సీపీయులు ఇంకా అనుబంధ పరికరాలు దిగాయి. ఆఫీస్ లోకి కంప్యూటర్లు రావడంతో కొత్త సౌకర్యాలు వచ్చేశాయి. మా కోసం కాకపోయినా కంప్యూటర్ల కోసం ఆఫీస్‌లో కొంత భాగం ఏసీ చేయించారు. ఎందుకంటే పాపం కంప్యూటర్లకు ఎప్పుడూ చల్లగాలి తగులుతుండాలట. లేకపోతే అవి వేడెక్కి పనిచేయడానికి మొరాయిస్తాయట. అప్పుడే ఒక విషయం అర్థమైంది. మనుషుల కంటే యంత్రాలకే విలువ పెరిగే రోజులు వచ్చాయన్న సంగతి. వాటి కోసం అందమైన ఛాంబర్స్ కట్టించారు. గాజు తలుపులు పెట్టించారు. చెప్పులు విప్పే లోపలకు అడుగు పెట్టాలి. అదేదో గుడిలాగా.. విజయవాడలో ఎప్పుడూ ఎండలే, చమటలే. దీంతో మాకు కంపోజింగ్ సెక్షన్ కాశ్మీరంలా అనిపించేది. చమట పట్టినప్పుడల్లా వెళ్ళి కాసేపు కంపోజింగ్ సెక్షన్ లోకి దూరేవాళ్లం. ఈ విషయం యాజమాన్యం గమనించి ‘బయట వాళ్లు’ – అంటే వేరే సెక్షన్ల వాళ్లు ఈ ఏసీ ఛాంబర్లలోకి వెళ్లడం పై రూల్స్ పెట్టారు. అయితే సబ్ ఎడిటర్స్‌కి కొంత మినహాయింపు ఉండేదనుకోండి. ‘కంప్యూటర్ల సెక్షన్లలో పనేచేవారికి అందుతున్న రాజ భోగం (ఏసీ భోగం) సామాన్య సెక్షన్లలో ఉన్న మా బోటి వారికి కూడా అందితే ఎంత బాగుణ్ణో’ అని అనుకునే వాళ్ళం. ఆ కోరిక మరో రకంగా తీరింది. యాజమాన్యం ఓ సారి పిలిచి, సబ్ ఎడిటర్స్‌కి కూడా కంప్యూటర్ల పైనే మేటర్ కంపోజింగ్ చేస్తే బాగుంటుందన్న ప్రపోజల్ తీసుకు వచ్చారు. అది ప్రపోజల్ కాదనీ, నిర్ణయమేనని తెలియడానికి ఆట్టే కాలం పట్టలేదు. మద్రాసు నుంచి తెలుగులో కంపోజింగ్ నేర్పడానికి ఓ మనిషిని పంపారు. అతగాడి రాకతో మా ఎడిటోరియల్ సెక్షన్‌లో కలకలం. అప్పటికే హ్యాండ్ కంపోజింగ్ సెక్షన్ కంప్యూటర్ల ప్రవేశంతో డమ్మీగా మారింది. వారిలో చాలా మందిని వేరే సెక్షన్లకు బదలీ చేశారు. మరి కొంత మందిని ఉద్యోగం వదిలేసి వెళ్ళి పోయారు. కంప్యూటర్లు ఎక్కడ అడుగుపెడితే అక్కడ భారీ మార్పులు తప్పడం లేదు. వద్దని ఎంతగా వారించినా ఈ మార్పు చాపక్రింద నీరులా సాగిపోతూనే ఉంది.

కంప్యూటర్లపై తెలుగు కంపోజింగ్ నేర్చుకోవడమా? లేక మరో ఉద్యోగం చూసుకోవడమా ?? ఇవే ప్రశ్నలు. ఇంత గడ్డు పరిస్థితిలోనూ నాకు ఆ దేవుడు కోరని వరం ఇచ్చినట్లు భావించాను. కంప్యూటర్ కంపోజింగ్‌తో నాకు అప్పటి వరకు ఉన్న అతి పెద్ద ఇబ్బంది తొలిగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని అనిపించింది. అందుకే మేనేజర్ గారు అడగ్గానే ‘నేర్చుకుంటానంటూ’ చేయి పైకెత్తాను.

ఇది తెలుగా.. కన్నడమా?

ఆంధ్రప్రభలో చేరినప్పటి నుంచి రోజూ చాలా వార్తలు వ్రాయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఆఫీస్ లోకి నా సీట్ దగ్గర కూర్చోగానే అటెండర్ తెల్ల కాగితాల బొత్తి ఇచ్చేవాడు. కుర్చీ ఎదురుగా ఓ బల్ల ఉండేది. ఆ రోజుల్లో గుమాస్తా గిరి వెలగబెట్టేవారు కుర్చీకీ బల్లకి మధ్యలో పెద్ద అట్ట వాల్చి పెట్టుకుని కాగితాలమీద వ్రాసేవారు కదా. అలాగే మాకు ఆ సౌకర్యం ఉండేది. కూర్చోగానే పెద్ద అట్టను బల్ల మీద నుంచి కుర్చీ చేతుల మీదకు వాల్చుకుని అటెండర్ ఇచ్చిన తెల్ల కాగితాల బొత్తిని సరి చేసుకుని జేబులోని పెన్ను తీసుకుని ఇష్ట దేవత పేరును ఓ మూడు సార్లు వ్రాసుకున్నాక అసలు పని మొదలు పెట్టేవాడ్ని. ఆఫీస్ లోని ఎడిటోరియల్ సెక్షన్‌లో అనేక ఉప విభాగాలుండేవి. వాటిలో ప్రధానమైనవి జనరల్ డెస్క్, ఎడిటోరియల్ డెస్క్. వీటికి అనుబంధంగా బిజినెస్ డెస్క్, రీజనల్ డెస్క్, స్పోర్ట్స్ డెస్క్, సినిమా డెస్క్ వంటివి ఉండేవి. ప్రాంతీయ వార్తలు విలేఖరుల నుంచి నేరుగా ఆఫీస్‌కు చేరేవి. ఇందుకోసం బస్టాండ్ వద్ద, రైల్వే స్టేషన్ వద్ద డబ్బాలు పెట్టేవారు. విలేఖరులు తమ వార్తలను కవర్‌లో పెట్టి వాటిని బస్సు డ్రైవర్‌కో, లేదా ప్రయాణీకునికో ఇచ్చి డబ్బాల్లో వేయమని చెప్పేవారు. అలా చాలా ఊర్ల నుంచి వార్తలు డబ్బాల్లో పడుతుండేవి.

ఇవన్నీ ఇప్పుడు చెబితే ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో వాట్సప్ ద్వారానే వార్తలు, ఫోటోలు పంపుతున్నారు. వాటిని డెస్క్ వాళ్లు కాపీ చేసుకుని ఉపయోగించుకుంటున్నారు. అసలు కంపోజింగ్ విషయంలోనూ ఇప్పుడు భారీగా మార్పులు వచ్చాయి. టైప్ చేయకుండానే మాట్లాడితే చాలు, ఆ పదాలు స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్నాయి. కొద్ది పాటి మార్పులు, చేర్పులు చేస్తూ వార్తలను పంపే విలేఖరులను చూసి నేను ఆశ్చర్యపోయాను. అలాగే ఇంగ్లీష్‌లో వచ్చిన వార్తలను తెలుగులోకి అనువదించే విషయంలో కూడా అనేక టూల్స్ వచ్చేశాయి. ప్రాథమికంగా అవి అనువదిస్తే కొద్దిగా బుర్ర ఉపయోగించి మార్పులు చేస్తే చాలు ఇంగ్లీష్‌లో ఉన్న వార్త తెలుగులోకి వాడుకునే పరిస్థితి వచ్చేసింది.

కానీ, ఆ రోజుల్లో అలా డబ్బాల్లో పడిన వార్తల కవర్లను ఒక బాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఎడిటోరియల్ సెక్షన్‌కి అందించేవాడు. ఇదంతా ఓ ప్రాసెస్. సంబంధిత డెస్క్ సబ్ ఎడిటర్స్ ఆఫీస్‌కి వచ్చేలోగానే చాలా వార్తలు డెస్క్ ముందు ఉండేవి. వచ్చే వార్తల్లో ఏది ముఖ్యమైనదన్నది చూడటం ఎడిటోరియల్ సెక్షన్ ప్రధాన విధి. సబ్ ఎడిటర్ పైన సీనియర్ సబ్ ఎడిటర్, ఆ పైన ఛీప్ సబ్ ఎడిటర్, ఇంకా డిప్యూటీ న్యూస్ ఎడిటర్, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, ఎడిటర్ ఇలా పై అధికారులు ఉండేవారు. ఎవరి పనులు వారివి. సబ్ ఎడిటర్‌గా శిక్షణ ముగిశాక వార్తల పట్ల అవగాహన వస్తుంది కనుక వార్తల ఎంపిక విషయంలో వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోవాలి. మరీ ముఖ్యమైన విషయమైతేనే పై అధికారిని సంప్రదించాలి. తెలుగులో వచ్చే వార్తలను సరిచేయాలి. అంటే వాక్యాల్లో దోషాలు లేకుండా చూడాలి. దీంతో పాటుగా వార్త యెక్క ప్రాధాన్యతను బట్టి దాని నిడివి ఎంత ఉండాలో నిర్ణయుంచుకోవాలి. విలేఖరి ఒక్కోసారి ఏ కారణంగానైనా ఎక్కువ నిడివితో వ్రాస్తే దాన్ని పసిగట్టి తగ్గించాలి. ఒక రకంగా చెప్పాలంటే, వార్త ప్రాధాన్యతను బట్టే వార్త నిడివి ఉండాలి. ఒక వేళ ఎడిటోరియల్ సెక్షన్ నుంచి అనవసరమైన వార్త ఏదైనా కంపోజింగ్‌కి వెళితే అదే వార్త ప్రింట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఎడిటోరియల్ సెక్షన్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. అందుకే సబ్ ఎడిటర్ పోస్ట్ అన్నది ఒక రకంగా న్యాయమూర్తి పోస్ట్ లాంటిది. ఏ వార్తకు అన్యాయం జరగకూడదు. అలా అని ఏ వార్తను అనవసరంగా మోయకూడదు. అందుకే జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం డెస్క్ ఇంఛార్జ్ పని. నేను జనరల్ డెస్క్, రీజనల్ డెస్క్ లతో పాటుగా స్పోర్ట్స్ డెస్క్‌లో కూడా పనిచేశాను.

వార్తల్లో కొన్ని యుఎన్ఐ, పీటీఐ వంటి వార్తా సంస్థల నుంచి వచ్చేవి. మరి కొన్ని ఇతర సోర్స్‌ల నుంచి వచ్చేవి. వాటన్నింటినీ గమనించి పాఠకునికి అవసరమైన వార్తలను ఎంపిక చేసుకుని తెలుగులోకి అనువదించాలి. ఆంగ్లంలో వచ్చే వార్తలను అనువదించడంలో అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, మక్కీకి మక్కీగా అనువదించకూడదు. అలా అని మన సొంత భావజాలాన్ని కుమ్మరించకూడదు. అందుకే నార్ల గారు ఒక మాట అనేవారట.

‘వార్త పవిత్రం.

వ్యాఖ్య నీ ఇష్టం.’

మంచి జర్నలిస్ట్‌గా ఎదగడానికి ఇలాంటి సూక్తులు మాకు ఉపయోగపడేవి. ఇప్పటి జర్నలిజం గురించి నేను ప్రస్తావించదలచుకోలేదు. ఓ మంచి యుగంలో జర్నలిస్ట్‌గా పనిచేశానన్న తృప్తి మిగిలింది. అది చాలు.

సరే, ప్రతి రోజూ అనేక వార్తలు వ్రాస్తుండటంతో బాల్ పెన్‌లో రీఫిల్స్ అయిపోతుండేవి. అందుకే ఆఫీస్‌లో రీఫిల్స్ ఇచ్చేవారు. అలా వ్రాసి వ్రాసి నా కుడిచేయి మధ్య వేలు పై కనుపు వద్ద ఒక బుడిపి వచ్చింది. ఒక దశకు వచ్చేసరికి అది వాచి నొప్పి పుట్టేది. అలా అని వ్రాయడం మానలేను కదా. ఈ ఇబ్బంది తొలగడానికి ఇప్పుడు – అదేనండి, కంప్యూటర్ల సాయంతో కంపోజింగ్ చేసే మార్గం వచ్చిందన్నదే నా సంతోషానికి కారణం. మరో కారణం కూడా ఉంది. నా హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగోదు. కోడి – గింజలను కెలికినట్లు ఉండేదని అనేవారు. చిన్నప్పుడు అక్షరాలు దిద్దేటప్పుడు శ్రద్ధ పెట్టలేదనుకుంటా. నా చేతి రాత ఒక్కోసారి మా న్యూస్ ఎడిటర్ గారికి చిరాకు పుట్టించేది. ఇంకొన్ని సార్లు నవ్వు పుట్టించేది. అది ఆయన గారి మూడ్‌ని బట్టి అన్నమాట. ఓ సారి మూడ్ బాగున్నప్పుడు నేను వ్రాసిన కాగితాలతో నా దగ్గరకు వచ్చి నా ఎదురుగా కూర్చుని నవ్వుతూ..

‘ఏమోయి నిన్ను బెంగుళూరు ట్రాన్సఫర్ చేయిద్దామనుకున్నానోయ్. కానీ ఈ ఆలోచన మానుకున్నాను. ఎందుకంటే ఇదిగో నీవిలా వ్రాస్తే అది కాస్తా రేపు కన్నడ ప్రభలో ప్రింట్ అవుతుందని.. హ్హాహ్హాహాహా..’ అంటూ నవ్వేశారు.

ఆంధ్రప్రభ – ఇది ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పేపర్. గ్రూప్ పేపర్ కావడంతో అందరికీ జీతభత్యాలు, బోనస్ విషయాల్లో ఒకే విధానం ఉండేది. దీంతో బయట కూడా ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎంప్లాయిగా మంచి గౌరవం దక్కేది. బెంగుళూరు నుంచి ‘కన్నడ ప్రభ’ వస్తుండేది. తెలుగు భాష, కన్నడ భాషల లిపిలో చాలా పోలికలు ఉంటాయి కదా. నన్ను ఒకవేళ బెంగళూరు ఆంధ్రప్రభకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, నేను వ్రాసిన తెలుగు వార్తను అటెండర్ పొరపాటున కన్నడ కంపోజింగ్ సెక్షన్‌కి ఇచ్చేస్తే, అది అక్కడే కంపోజ్ అయి చూసి చూడకుండా, కన్నడ ప్రభ పేపర్లో ప్రింట్ అయితే.. ప్రమాదమే కదా. అందుకని నన్ను ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేస్తాము కానీ, బెంగుళూరుకి మాత్రం చేయమన్నది సదరు న్యూస్ ఎడిటర్ గారి వెటకారంలోని వాస్తవం అన్న మాట. ఇలాంటి అవమానాలు ఎదుర్కుంటున్న సమయంలోనే ఇదిగో కంప్యూటర్ గారు ఆఫీస్ లోకి ప్రవేశించారు. ఇప్పుడేమో సబ్ ఎడిటర్స్‌ని కూడా కంప్యూటర్ లోనే మీమీ వార్తలను తెలుగులో ఎంచక్కా టైప్ చేసుకోవచ్చని యాజమాన్యం అంటున్నది. మిగతా వాళ్ళకు ఇది రుచించలేదు. వారు గుమాస్తాగిరి లాగా హాయిగా కుర్చీలో కూర్చుని వార్తలు వ్రాసే పద్దతికి బాగా అలవాటు పడ్డారాయె. పైగా మరో సౌకర్యం కూడా ఉండేది. స్మోకింగ్ అలవాటైన ప్రాణులు అక్కడే పనిచేసుకుంటూనే స్మోక్ చేయవచ్చు. అదే కంప్యూటర్ మీద కంపోజింగ్ అనగానే ఏసీ రూమ్స్‌లో పనిచేయాలి కాబట్టి, అక్కడ నో స్మోకింగ్ కాబట్టి – ఇలాంటి ప్రాథమిక సౌకర్యాలు పోతాయోమోనని వారి భయం. వ్రాయడానికి అలవాటు పడిన చేతులతో ఏదో కంపోజిటర్స్ వాళ్ల లాగా కంపోజ్ చేయడమా అన్న చిన్న చూపు కూడా ఉండేది. మనసులోని ఆలోచనలను కాగితం మీద చకచకా పెట్టెగలిగే నేర్పు ఉన్న ఇలాంటి వారికి – ఇటు టైపింగ్ మీద శ్రద్ధ పెడుతూనే మరో ప్రక్క వార్త ఏం వ్రాయాలన్న ఆలోచనలను కంప్యూటర్ స్క్రీన్ మీదకు ఎక్కించడమా? అన్నది సమస్య. ఇందులో టెక్నికల్, సృజనాత్మకత రెండూ ఉంటాయి కదా, ఈ రెంటినీ కలపడం సాధ్యమేనా అన్నది ప్రశ్న. ఇది నాకూ ఇబ్బందే. కానీ జరిగిన అవమానాలను తలుచుకుని పట్టుదలతో టైప్ పట్ల పట్టు సంపాదించగానే ఆలోచనలను చాలా తేలిగ్గానే కంప్యూటర్ తెరమీద నిక్షిప్తం చేయగలుగుతున్నాను. ఆనాటి ఆ పట్టుదలే ఈనాటికీ నాకు అక్కరకు వస్తున్నది. ఆంతే కాదు ఆనాడు నేర్చుకున్న ఇన్‌స్క్రిప్ట్ పద్ధతిలోనే నేను మనసులోని భావాలకు తగ్గట్టుగా తెలుగు చకచకా టైప్ చేయగలుగుతున్నాను.

మారని మనుషులు తెరమరుగయ్యారు. మార్పుని గుర్తించి, మోల్డ్ అయిన వారు గుర్తింపు పొందారు. ఇది ఒక్క మీడియాలోనే కాదు ఆ తర్వాత అనేక ఉద్యోగాల్లోనూ జరిగింది.

నెత్తి మీద కత్తి:

కంప్యూటర్ మీద కంపోజింగ్ చేసుకోండని చెప్పిన యాజమాన్యం నిదానంగా మరో టెక్నాలజీని మా మీద రుద్దడానికి రంగం సిద్ధం చేసింది. అదే ‘పేజినేషన్’. అంటే పేజీలు కూడా కొత్త టెక్నాలజీతో మీరే పెట్టుకోవచ్చని అంది. పైగా ప్రూఫ్ రీడింగ్ బాధ్యతా మీదే అంది. దీంతో నెత్తిమీద కత్తి వ్రేలాడుతున్న భావన కలిగింది. ఇక్కడా అంతే, మార్పును స్వాగతించకపోతే వెనక్కి పోతామని గ్రహించిన నాబోటి వారు కొందరు పేజినేషన్‌ను శ్రద్ధగా నేర్చుకున్నారు. కానీ ఈ మార్పుల వల్ల ఆఫీస్‌లో నెమ్మదిగా పేజీలు పెట్టే మాన్యువల్ సెక్షన్, ఫ్రూప్ రీడింగ్ సెక్షన్ డమ్మీలుగా మారిపోయాయి. కొన్నాళ్లకు అదృశ్యమయ్యాయి. ఎడిటోరియల్ సెక్షన్‌లో కొంత మంది ఈ పెనుమార్పులు నచ్చక హుందాగా తప్పుకున్నారు. మరికొంత మంది విషయంలో యాజమాన్యం కఠినంగా వ్యవహరించింది.

కంప్యూటర్లు ఆఫీస్ లోకి వచ్చినప్పుడు వాటిని శీతల వాతావరణంలోనే ఉంచాలని ఏసీ ఛాంబర్స్ కట్టారు. ఆ తర్వాత వాటిని మామూలు వాతావరణంలో కూడా ఉంచడం మొదలుపెట్టారు. దీంతో ఏసీల సంఖ్య తగ్గించారు. మొత్తానికి ఒక విషయం అర్థమైంది. యాజమాన్యానికి కంప్యూటర్ల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదని. సాంకేతిక మార్పులకు పెద్ద పీట వేసి ఉద్యోగుల కుర్చీలు ఎత్తేయడం మొదలైంది. టెక్నాలజీ వర్సెస్ మ్యాన్ పవర్ మధ్య జరిగిన యుద్ధంలో చివరకు టెక్నాలజీనే గెలిచింది. అందుకే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వాల్సిందనేనన్న సూత్రాన్ని నేను ఇప్పటికీ అనుసరిస్తుంటాను. లేకపోతే ఈ 68 ఏళ్ల వయసులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి ఆలోచించడమేమిటి చెప్పండి. సులువుగా పని చేయడం కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలను (టూల్స్)ను ఉపయోగించాలన్న జిజ్ఞాసే నన్ను నడిపిస్తోంది.

కంప్యూటర్‌తో పాటు దాని సిస్టర్ ఇంటర్నెట్ అడుగుపెట్టింది. గూగుల్ అన్న మాట అప్పుడే విన్నాను. గూగుల్ సెర్చ్ ఇప్పుడున్నంత వేగంగా లేకపోయినా దాని ద్వారా అదనపు సమాచారం సులువుగా అందుకోవచ్చని తెలిసింది. తెలుగులో సమాచారం కోసం ప్రయత్నించినా అప్పట్లో పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. దీంతో ఇది కేవలం ఇంగ్లీష్‌కే పరిమితం అనుకున్నాను. ఆంగ్లభాష నుంచి తెలుగులోకి అనువాదం చేసే అలవాటు ఉండేది కనుక అదనపు సమాచారం ఇంగ్లీష్‌లో అందినా దాన్ని సందర్భోచితంగా నా వ్యాసాల్లో వాడుకునే వాడ్ని. ఈ విషయంలో మిగతా వారికంటే ముందడుగు వేయడంతో – ప్రత్యేక వ్యాసాలు వ్రాసే నేర్పు వీడికి ఉందన్న మార్క్ పడింది. పూర్వంలా వ్యాసం వ్రాయాలని అనుకోగానే లైబ్రరీకి వెళ్ళి రిఫరెన్స్ నోట్స్ ఇప్పుడు వ్రాసుకోనక్కర్లేదు. కంప్యూటర్ నుంచే ఆ మేటర్‌ని ప్రింట్ తీసుకోవడం మొదలుపెట్టాను. స్పోర్ట్స్ డెస్క్‌లో పనిచేస్తున్నప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తాజా సమాచారం కోసం ‘క్రిక్ ఇన్ఫో’ వంటి వెబ్ సైట్లు ఓపెన్ చేసి మ్యాటర్ సేకరించి ప్రింట్ అవుట్లు తీసుకుని తాజా వార్తలను చకచకా తెలుగులో కంపోజింగ్ చేసేవాడ్ని. అయితే, ఆఫీస్‌లో ఉన్న అన్ని కంప్యూటర్లకు ఈ నెట్ సౌకర్యం ఉండేది కాదు. కేవలం ఇంజనీర్ల సెక్షన్‌లో మాత్రమే ఈ వెసులుబాటు ఉండేది. అక్కడకు వెళ్ళి కాసేపు కూర్చుని నాకు కావలసిన సమాచారం సేకరించేవాడ్ని. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నాకు తెలియకుండానే నేను అటు కంప్యూటర్లు, ఇటు ఇంటర్నెట్ వైపు ఆకర్షితుడనయ్యానని చెప్పడానికే.

నెట్టింట్లో..:

ఆఫీస్‌లో ఉన్న కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంట్లో కూడా ఉంటే బాగుంటుందని, పని సులువు అవుతుందని అనుకునేవాడ్ని. ఈ కోరిక విజయవాడలో ఉన్నంత కాలమూ తీరలేదు. హైదరాబాద్ వచ్చాక ఇంట్లోకి కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం వచ్చేశాయి. దీంతో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. కొన్ని వెబ్ సైట్ల వారికి తెలుగులో రాజకీయ విశ్లేషణలు, వ్యంగ్య రచనలు ఇవ్వడానికి వీలు చిక్కింది. ఒక దశలో రోజుకు నాలుగు ఆర్టికల్స్ టైప్ చేసి పంపేవాడ్ని. అంత బిజీగా ఉండేవాడ్ని.

మీడియా రంగంలో ఇన్ని రకాల మార్పులు వస్తాయని అనుకోలేదు. ఇంట్లో డెస్క్‌టాప్ కంప్యూటర్ వాడిన నేను తర్వాత లాప్‌టాప్ వాడటం మొదలుపెట్టాను. ఇంటర్నెట్‌తో నెట్టుకుంటూ వస్తున్న నాకు వెబ్ సైట్లు, బ్లాగ్‌లు ఆకర్షించాయి. బ్లాగ్ ఒకటి ఓపెన్ చేసి అందులో నా ఆలోచనలు పంచడం మొదలుపెట్టాను. ప్రింట్ మీడియాలో వ్రాసిన వ్యాసాల సంఖ్య కంటే వెబ్ సైట్స్, బ్లాగ్‌ల్లో వ్రాసినవే ఎక్కువ. ఫేస్‌బుక్ ద్వారా పాఠకులకు మరింత దగ్గర అవ్వచ్చని తెలిసింది. టివీ 5లో పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు పెడుతుండేవాడ్ని. ఈలోగా ఫోన్ల స్వరూపం మారింది. స్మార్ట్ ఫోన్లు రంగప్రవేశం చేశాయి. నేను తరంగా రేడియోలో పనిచేస్తున్నప్పుడు మొదటిసారి ఇలాంటి ఫోన్లు చూసి ఆశ్చర్యపోయాను. అనతికాలంలోనే స్మార్ట్ ఫోన్ నా చితికి చిక్కింది. వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలు కూడా జర్నలిస్ట్‌గా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ ఉపయోగపడుతూనే ఉన్నాయి.

అక్కడితో ఆగలేదు. ఈ లోగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వచ్చేసింది. నా ఆలోచనలు అటు మళ్ళాయి. ఏఐని ఉపయోగించుకుంటూ ఒక జర్నలిస్ట్‌గా ఒక రచయితగా కొత్తకొత్త ప్రయోగాలు చేయడం ప్రారంభించాను. చూద్దాం. ఈ జీవన యాత్రలో ఇంకెన్ని అద్బుతాలు చూడబోతామో, అవి మన జీవితాలను ఎలా మార్చబోతున్నాయో. సమాజంలో వచ్చే సాంకేతిక మార్పులను ఆపలేము. వాటికి తగ్గట్టుగా మనం మారడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఒక్క సారి వెనక్కి పోతే రాబోయే సమాజం నిన్ను అస్సలు పట్టించుకోదు. ఈ సత్యం గ్రహించే నా అడుగులు ముందుకు వేస్తూనే ఉంటాను.

(మళ్ళీ కలుద్దాం)

గొప్ప కథల గొప్ప అనువాదం – ‘సమకాలీన కొంకణీ కథానికలు’

0

[2001లో నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించిన ‘సమకాలీన కొంకణీ కథానికలు’ అనే అనువాద కథల సంకలనాన్ని పరిచయం చేస్తున్నారు. డా. కాళిదాసు పురుషోత్తం.]

[dropcap]కొం[/dropcap]కణీ భాష క్రీస్తు శకం 1500 ప్రాంతంలో సాహిత్య భాషగా వాడుకలోకి వచ్చింది. గోవా 1960 వరకూ పోర్చుగీసు వలస పాలకుల కింద ఉండి, విముక్తి పొంది భారతదేశంలో భాగమైంది. ఒక వైపు కన్నడ భాష, మరొక వైపు మరాఠీ భాషల మధ్య, పోర్చుగీసు పాలకుల అధికారభాష పోర్చుగీసు భాష పెత్తనంలో ఆదరణ లేక వెనుకబడి, ఇరవైయవ శతాబ్దిలో సాహిత్య మాధ్యమంగా, పత్రికా భాషగా నెలకొన్నది.

గోవా విముక్తి ఉద్యమ స్ఫూర్తి వల్ల కూడా గోవా ప్రజల కొంకణీ భాషలో కథ, నాటకం, నవల వంటి ప్రక్రియలు ప్రజాబాహుళ్యం ఆదరణకు నోచుకొన్నాయి.

1930 ప్రాంతంలో కొంకణీ భాషలో ఆధునిక కథానిక ప్రక్రియ మొదలై ప్రజాదరణ పొందింది. 1970-80 కాలాన్ని కొంకణీ కథకు అత్యంత వైభవమైన సమయంగా విమర్శకులు భావించారు. కన్నడ, మరాఠీ రచయితలు కూడా కొంకణీ భాషలో గొప్ప కథలు రాశారు.

కొంకణీ భాషలో సుప్రసిద్ధ రచయిత, కొంకణీ భాషను గోవా అధికార భాషగా చేయాలని ఉద్యమించి విజయం సాధించిన శ్రీ పుండలీక్ నారాయణ్ కొంకణీలో వెలువడిన పాతిక అత్యుత్తమ కథలను ఎంపిక చేసి సంకలనం ‘సమకాలీన్ కొంకణీ లఘుకథా’ పేరుతో ఒక సంకలనం తయారు చేయగా, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, న్యూఢిల్లీ వారు 2001లో దాన్ని ప్రచురించారు.‌

ఈ ఉత్తమ కథా సంకలనాన్ని శిష్టా జగన్నాధరావు చేత తెలుగులోకి అనువాదం చేయించి ‘నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా’ ప్రచురించింది. దాదాపు పాతిక సంవత్సరాల నాటి ఈ సంపుటిలో కథలు చదువుతుంటే ఎంత గొప్ప కథలో, ఎంత గొప్ప అనువాదమో అని సంతోషం పట్టలేక పోయాను. కథలు చదువుతుంటే ఎక్కడా అనువాదమనే భావన మనసులోకి రాలేదు.

ఈ పుస్తకంలో మొత్తం పాతిక కథలున్నాయి. కొన్ని పోర్చుగీసు పాలనలో క్రైస్తవులుగా మారిన కుటుంబాల కథలు, కొన్ని స్థానిక గోవా ప్రజలవి, కొన్ని కన్నడం, మహారాష్ట్ర ప్రభావాలున్న కథలు. గోవా సంకీర్ణ సంస్కృతిని అర్థం చేసుకోడానికి ఈ కథలు బాగా ఉపకరిస్తాయి. ఈ కథల్లో కథా శిల్పం కన్నా సాధారణ ప్రజల జీవితం, వాళ్ళ కష్టసుఖాలు నన్ను ఆకట్టుకున్నాయి.

మొదటి కథ ‘చాకలిబండ కింద అంకురం’ గోవా విముక్తి ఉద్యమ నేపథ్యంలోని కథ.

విఠూ తాళంచెవి పోయింది’ కథలో ఏ మాత్రం ప్రాముఖ్యం లేని తాళం గుత్తి పోవడం సంఘటనను తీసుకొని కథా కథనంలో నేర్పు, శిల్పం ద్వారా చివరి వరకు ఉత్కంఠ వీడకుండా హాస్యం పండిస్తారు కథకులు.

ప్రేమ నగరంలో అతిథి’ కథలో అభిమాన స్త్రీ ఔన్నత్యం ఒక సంఘటన ద్వారా అవగతమౌతుంది. ఎందుకో ఈ కథ చదువుతూవుంటే గురజాడ, మధురవాణి గుర్తుకొచ్చారు.

ఇంటి పెద్ద’ కథ వలస పాలకుల ఏలుబడిలో న్యాయం గురించి, ముడుపు కథలో యువ క్రైస్తవ ఫాదర్‌లో మానవత్వం ఔన్నత్యాన్ని గొప్పగా చిత్రించారు.

కొంచం చలి కొంచం వేడి’ గృహస్థ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు వాటిని గుర్తించలేని భర్త యువ భార్య వద్ద భంగపాటు. చాలా చిన్న సంఘటన కానీ ఎప్పుడూ గుర్తుండే పాఠం.

దేవతా వంశి’ కథలో అకల్మషమైన బాల్యం, పిల్లల చిన్న ఆశలు, ఇష్టాయిష్టాలు, పెద్దవాళ్ళ అదుపాజ్ఞలు, పిల్లల చిన్ని చిన్ని ఆశలు, ఊహలు ఎంత బాగుందో!

పున్నమిరాత్రి గుర్తు’ కథలో తొలి యవ్వనంలో తోటమాలి కూతురిని ప్రేమించి ఆమెతో కలుస్తాడు. తర్వాత ఎవరి దారి వారిదవుతుంది. మళ్ళీ పాతికేళ్ళ తర్వాత కలుస్తారు. అతనికి సంతానం ఉండదు, ఆమె వల్ల తెలుస్తుంది, కాలేజి చదువుతున్న ఆమె కుమారుడు తన సంతానమేనని.

కాలు పోగొట్టుకున్నా నాట్యం చేసే యవకుణ్ణి అతని ప్రియురాలు అల్లాగే అంగీకరిస్తుంది ‘ప్రేమ జాతర’ కథలో.

బ్యూటీఫుల్ లేడీ’ యవ్వనంలో గొప్ప సుందర స్త్రీ. ప్రౌఢ వయస్సులో కూడా ఆమె సౌందర్యం చిన్నెలు చూచి ప్రజలు ఆమెను గమనిస్తూనే ఉంటారు. ఆమె గొప్ప మాడల్ ఏమో, ఆమె వయస్సులో ఉన్నప్పటి ఫొటోలు ప్రదర్శనలో చూచి, కథకుడు తన్మయత్వంతో చూస్తూ అలాగే నిలబడి ఉంటాడు. “ఇవేముంది, నాతో రా!” అని తన ఇంటికి వెంటపెట్టుకొని వెళ్ళి తన యవ్వనంలో అనేక భంగిమల్లో తీసిన ఫోటోల బొత్తి అతని చేతిలో పెడుతుంది ఆమె. అవి చూస్తూ అతను తన్మయత్వంలో తనను తనుమరచి యేవో లోకాల్లో విహరిస్తాడు. “..ఆ మదనంజరి, నా దగ్గరికి రహస్యంగా నిశ్శబ్దంగా వచ్చింది. నా ఆవేశం ఆపుకోలేక పోయాను. ..నేనామెను గట్టిగా కౌగలించుకొని, (ఇద్దరం) రాసక్రీడలో ప్రణయ సుఖం ఇచ్చి పుచ్చుకొన్నాము. నేను చుట్టూ పరిశీలించాను, అన్నీ మొదట వున్నట్లే ఉన్నాయి. ఆ చిరిగిన కిటికీ తలుపులు, పరదాలు ముందున్నట్లే ఉన్నాయి. నేను చాలా సిగ్గూబిడియంలో మునిగిపోయాను. నా మొహం నేనే అద్దంలో చూడడానికి సిగ్గుపడ్డాను. ఈ పెద్ద రాజప్రాసాదం మధ్యలో ప్రవేశించి ఏదో దొంగతనం చేసినట్లు మనస్సు కొట్టుమిట్టాడింది. హడావిడిగా చేతిలోని ఆల్బంలు అక్కడే పెట్టేసి, ఆ బ్యూటీఫుల్ లేడి శృంగార శయన మందిరంలోనించి, ఒక మలయమారుతంలా బయటపడ్డాను. బయటి ద్వారం చేరుకోగానే అస్పష్టంగా ఆమె గొంతుక వినబడింది, ‘ఓ బ్రిగాద్, ఓ బ్రిగాద్!’ (పోర్చుగీసు భాషలో ధన్యవాదాలు!) అని”. ఈ కథలో కల్పన, వాస్తవం మధ్య గీత చెరిగిపోయి ముగింపు పాఠకుణ్ణి రవంతసేపు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి, ఆలోచింప చేస్తుంది. గొప్ప శిల్పం.

అంగవస్త్రం’ – భార్య, వేశ్య మధ్య చిన్న సంఘటనతో.. అప్పు కట్టకపోతే పరువు బజారుకెక్కే పరిస్థితి. ప్రాణం మీదికి వచ్చి భార్య నగలు అడుగుతాడు. ఆమె నిర్మొహమాటంగా ఇవ్వనంటుంది. ఆ రాత్రి నిస్పృహలో ఉంచుకున్న వేశ్య వద్దకు వెళ్తాడు. అతని స్థితి కనిపెట్టి అతను కోరకుండానే తన నగల పెట్టె అతని చేతుల్లో ఉంచుతుంది. మెలోడ్రామా ఎక్కడా తొంగిచూడదు. ఈ కథలో అంగవస్త్రం ప్రతీక. ఒళ్ళు కనపడకుండా కప్పుకొనే చిన్న తుండు.

కుంకుమ ఆధారం’ కథలో తాగుబోతు భర్త హింసలను భరించేది కేవలం తాను పునిస్త్రీ అని చెప్పుకోవచ్చనే. సహనం అనంతం కాదు. ఒకరోజు తాగి పైనపడి కొట్టే భర్తను పట్టుకొని బడితపూజ చేస్తుంది.

భాగ్యం’ గోవా విముక్తి పోరాట యోధుడి కథ. దొంగ తాను దోచినదంతా ఇంట్లో మట్టి బాల ఏసు బొమ్మ లోపల దాస్తాడు. క్రిస్మస్ రోజు విడుదలై అతను ఆ సంపదను అనుభవించాలనే ఆరాటంతో ఇల్లు చేరుతాడు. ఆ రోజు ఆ బొమ్మను ఇంటికి వచ్చిన బంధువుల చిన్న బాబుకు బహుకరించారు ఇంట్లోవాళ్లు. అతను బాధ పడకపోగా, అనంతమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతాడు.

లోతైన మడుగు’ కథలో పిసినారి, భార్య జబ్బుపడి ఉంటుంది. ఆ రాత్రి అతను చిలుము పట్టిన దీపం శెమ్మె తోముతూ వుంటే, మేనల్లుడు అడుగుతాడు – ఎందుకు ఈ రాత్రి వేళ ఈ పనులు? అని. పోతే దీపం పెట్టాలి కదా అంటాడు ఆ హృదయం లేని భర్త.

శవాల మిత్రుడు’ కథలో ఆ వూరికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు ఒక వ్యక్తి. ఊరికంతా తలలో నాలుక. ఊరందరికీ ఏ ఆపద వచ్చినా అతడు ప్రత్యక్షం. అనాథ శవాలకు దహన సంస్కారం చేస్తాడు, మోస్తాడు. చివరకు వృద్ధుడై అక్కడే పోతే ఊరంతా చేరి ఘనంగా అతని అంతిమ యాత్ర జరుపుతారు.

అనీతా’ పాత తెలుగు సినిమా కథ వంటిది. అత్తను బాధలు పెట్టే కోడలికి గుణపాఠం చెప్పే ఆడబిడ్డ.

తెప్ప ఉత్సవం’ కథలో చిన్న ఊరు, ఆరోజు ఊరి కోనేరులో అమ్మ వారికి తెప్ప ఉత్సవం. సంప్రదాయం ప్రకారం ఊరి శూద్ర సేవకులు విగ్రహం, పూజా పీఠంతో సహా కొలను వద్దకు చేర్చాలి. మోతగాళ్ళలో ఒకడు తాగుబోతు తన 14 ఏళ్ళ కుమారుడి భుజం మీద భారం ఉంచి తాను తాగడానికి పోతాడు. ఆ బాలుడు తన శక్తినంతా ఉపయోగించి వయసుకు మించిన భారాన్ని ఎలాగో కోనేరు వరకూ మోస్తాడు. ఉత్సవం పూర్తి అయిన తరువాత భోజనాలు. ఆ చిన్న పిల్లవాడు కూడా పంక్తిలో కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు. ఎవరో శూద్ర పిల్లవాడు పంక్తిలో కూర్చొని తింటున్నాడే అని ఆక్షేపణ చేసి, పోనీలే ఈమాటుకు అంటాడు. ఆ పసివాడు అవమానంతో.. చాలా మంచి కథ, మనం చేయలేని పనులకు వాళ్ళ సహాయం కావాలి, కానీ వాళ్ళు మన సమానస్థులు కాకూడదు.

గుప్పెడు మట్టి’ కథలో 1960 తర్వాత గోవా విమోచనంతో కొత్త చట్టాలు.. ఒక యువకుడు తన ఇల్లు అద్దెకిచ్చి ఏవో గల్ఫ్ దేశాలకు వెళ్లి శ్రమించి అద్దెకున్న వ్యక్తికి పంపి తన ఇల్లు బాగు చేయిస్తాడు. అద్దె కూడా ఆ భవనం బాగు చేయించడానికి ఖర్చు చేస్తున్నానని అద్దెకున్న మనిషి.. అతను తిరిగి వచ్చే సమయానికి భవనంలో అద్దెకున్న మనిషి యజమాని అయివుంటాడు. కొత్త చట్టాలు అద్దెకు ఉన్న వాడికి సహకరిస్తాయి. అసలు యజమాని దుఃఖంతో వెళ్ళిపోతూ గుర్తుగా గుప్పెడు మట్టి మాత్రం పట్టుకొని వెళతాడు.

వైరాగ్యం’ మంత్రసాని సావలీన్ కథ‌. ఆమె యవ్వనం, సౌందర్యం, వయసూ, ఊరందరికీ కాన్పులు చేయడంలోనే గడిచిపోతుంది. చివరకు తనకేం మిగిలింది? సావలీన్ ఒక నిరాశకు, నిస్పృహకు గురై ఇక ఈ వృత్తి చాలని నిశ్చయించుకొంటుంది. అయితే అత్యవసరంగా ఆమె సహాయం అవసరమైన సమయంలో ఆమె మనసు వెళ్ళి సహాయం చేయమని ప్రబోధిస్తుంది. సావలీన్ హృదయంలో సంఘర్షణ, ఉప్పొంగే లావా జ్వాలలు రచయిత్రి చాలా చక్కగా వర్ణించారు. ఈ సపుటానికి మకుటాయమానమైన కథ.

ఇంకా కొన్ని కథల గురించి నేను రాయలేదు. ఈ పుస్తకం నా సొరుగులో 23 సంవత్సరాలుగా నిదురపోతూ తరచూ నా దృష్టిని ఆకర్షించేది. శాప విమోచన ఈ రోజు నాకు కలిగింది కాబోలు. ఎక్కడైనా దొరికితే చదవండి, శిష్టా జగన్నాథరావు గొప్ప చేయి తిరిగిన రచయిత. వారి ఇతర రచనలేమైనా ఉంటే చదవాలని నా అభిలాష.

***

సమకాలీన కొంకణీ కథానికలు
సంపాదకులు: పుండలీక్ నారాయణ్ నాయక్
అనువాదం: శిష్టా జగన్నాధరావు,
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, న్యూఢిల్లీ, 2001.
పేజీలు: 301
వెల: ₹ 95
(ఈ పుస్తకం ప్రస్తుతం కొనుగోలుకి లభిస్తున్నట్లు లేదు)

మనిషి అవలంబించే స్వీయ రక్షణ స్థితిని చర్చించే నవల ‘ది సెన్స్ ఆప్ ఆన్ ఎండింగ్’

0

[జూలియన్ బార్న్స్ రచించిన ‘ది సెన్స్ ఆప్ ఆన్ ఎండింగ్’ అనే నవలని సమీక్షిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]జూ[/dropcap]లియన్ బార్న్స్ ఇంగ్లండ్‌కు చెందిన ఆంగ్ల రచయిత. సొంత పేరుతో గంభీరమైన రచనలు చేస్తూ, మరో పక్క డాన్ కావనాగ్ అనే కలం పేరుతో క్రైమ్ ఫిక్షన్‌ను కూడా ఆయన రాసారు. కొన్ని చిన్న కథలు వ్యాసాలు కూడా రాసిన బార్న్స్ ఇంగ్లండ్‌లో ఎంతో పేరు సంపాదించుకున్న ఈ దశాబ్ద రచయిత. నాలుగు సార్లు బూకర్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యారంటే ఈయన రచయితగా ఎంత ఆదరణ సంపాదించుకున్నారో అర్థం అవుతుంది. ‘ది సెన్స్ ఆఫ్ ఎండింగ్’ 150 పేజీల నవల మాత్రమే. కాని ఈ పుస్తకం చదవడం ఓ గొప్ప అనుభవం.

మనుషులు స్వాభావికంగా సుఖజీవులు. సుఖపడడం కోసం కష్టపడతారు. మన మెదళ్లు కూడా ఈ సుఖానుభూతి దిశగానే పని చేస్తూ ఉంటాయి. జీవితంలో సుఖానిచ్చిన జ్ఞాపకాలను మనసు పదిలంగా తన పొరలలో భద్రపరుస్తుంది. అలాగే మనిషి మరచిపోవాలనుకునే జ్ఞాపకాలను మెదడు సమూలంగా తుడిచివేస్తుంది. మనిషికి అనుకూలంగా పని చేయడం మెదడు స్వభావం. మనల్ని కష్టపెట్టినవాళ్లు మనకు గుర్తుంటారు. కాని మనం చేసిన తప్పులు, చాల సందర్భాలలో మనకు గుర్తుకు రావు. కారణం అవి మనకు నచ్చని అనుభవాలు అని గ్రహించి మెదడు వాటిని అడుగుకు నెట్టేస్తుంది. ప్రతి జీవితంలోనూ ఇలా నెట్టివేయబడిన జ్ఞాపకాలు ఉంటాయి. అవే మన పూర్తి వ్యక్తిత్వాన్ని నిర్దేశించేవి. వాటిని తోడి చూడాలని కూడా మనం ఎప్పుడూ అనుకోం. అందుకే అవి అడుగున ఉండిపోయి మనకు గుర్తుకు రావు. అలా రాకుండా వాటిని మెదడు నియంత్రిస్తుంది.

మానవ సంబంధాలలో ఎవరికీ అర్థం కాని చిక్కుముడులు ఇలా అడుగున పడిపోయిన జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీసి చూసుకుంటే మనలోని మరో మనిషి కనిపించి కొన్ని సార్లు ఇబ్బంది పెడతారు. దీన్ని తప్పించుకోవడానికే గతకాలపు స్మృతులలో కేవలం ఆనందాన్ని ఇచ్చేవాటినే మనుషులు ప్రస్తావిస్తారు. వాటి నడుమ దాచిపెట్టిన కఠిన సత్యాల జోలికి వెళ్ళరు. వెళితే అక్కడ కనిపించే తమ నీడను తామే చూడలేరు.

ఈ ఇతివృత్తంతో బార్న్స్ రాసిన నవల ‘ది సెన్స్ ఆప్ ఎండింగ్’. ఇది ఆయన పదకొండవ నవల. 2011లో బూకర్ ప్రైజ్ వచ్చిన ఈ నవల సినిమాగానూ తెరకెక్కింది. అంతకు ముందు మూడు సార్లు బార్న్స్ ఇదే బహుమతికి మరో మూడు నవలల నేపథ్యంలో బూకర్ ప్రైజ్ కోసం ఎంపికయ్యారు. కాని నాలుగవ సారి నామినేట్ అయి ఈ నవలకు బూకర్ అందుకున్నారు. సర్ జాన్ ఫ్రాంక్ కర్మోడే అనే ఇంగ్లీషు సాహితీ విమర్శకుడి పుస్తకం ఇదే పేరుతో 1967లో ప్రచురితమైంది. ఈ నవలకు అదే పేరు బార్న్స్ ఎన్నుకున్నరని కొందరంటారు. కాని తనకి ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోకుండా తనకీ అదే పేరు తన పుస్తకం కోసం తట్టిందని బార్న్స్ ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

మన జీవితాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయతిస్తున్న మార్గాలను ముందు అర్థం చేసుకోవాలన్న గూడార్థాన్ని ‘ది సెన్స్ ఆప్ ఆన్ ఎండింగ్’ అన్న ఈ వాక్యం సూచిస్తుంది. మనం ఏ మార్గంలో జీవితాన్ని విప్పి చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్న దాని మీదే నిజమైన మన వ్యక్తిత్వం ఆధారపడుతుంది. సాధారణంగా మనుషులు తమ మనసులోని ఉద్దేశాల ఆధారంగానే తమను తాము ప్రపంచం ముందు నిలుపుకుంటారు. అంటే ఏ విధంగా ఇతరులకు కనిపించాలనుకుంటారో అదే బాటలో తమ జీవితాలను విప్పి చూసుకుంటారు. అందువల్ల చాలా సందర్భాలలో నిజమైన వారి వ్యక్తిత్వం ప్రకటితమవదు.

ఈ మానవ నైజాన్ని ఆధారం చేసుకుని కథను నిర్మించుకున్నారు బార్న్స్. నవల రెండు భాగాలుగా కథ నడుస్తుంది. మొదటి భాగంలో నవల ప్రధాన పాత్ర టోనీ వెబ్సటర్ యువకుడు. రెండవ భాగంలో రిటైర్ అయిన వృద్ధుడు. 1960లలో నలుగురు హైస్కూలు విద్యార్ధుల నేపథ్యంతో మొదటి భాగంలోని కథ మొదలవుతుంది. ఈ నలుగురు చాలా తెలివైన వాళ్లు, ఎన్నో విషయాలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్న యువకులు. ఆ స్కూలుకు అడ్రియన్ అనే కొత్త స్టూడెంట్ వస్తాడు. అడ్రియన తెలివితేటలు ఈ ముగ్గురు స్నేహితులను ఆకర్షిస్తాయి. వాళ్లు అతన్ని తమతో నాలుగవ స్నేహితుడిగా కలుపుకుంటారు. ఎప్పటికీ అదే స్నేహంతో మెలగాలని నిశ్చయించుకుంటారు. అడ్రియన్ ఆలోచనలు ఎంతో భిన్నంగానూ లోతుగాను ఉండడంతో అతన్ని టీచర్లు చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా చూస్తారు.

వీరి క్లాస్‌కు సంబంధించిన రాబ్సన్ అనే అబ్బాయి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి ఆమె గర్భం దాల్చిందని తెలిసిన తరువాత ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఆ నలుగురు స్నేహితులకు కొరుకుడు పడని విషయం. ఆల్బర్ట్ కాము రచనల ప్రభావంలో ఉన్న వాళ్లు “ఆత్మహత్య మాత్రమే నిజమైన తాత్విక ప్రశ్న” అన్న కామూ మాటల ఆధారంగా ఈ ఘటనను విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటన చరిత్రలో ఎలా మిగిలిపోతుందో అన్న ఆలోచనతో అడ్రియన తమ చరిత్ర టీచర్‌తో వాదనకూ దిగుతాడు. అడ్రియన్ తల్లి తండ్రులు విడిపోయారు. అప్పట్లో ఇలా విడిపోయిన కుటుంబాలు ఎక్కువ ఉండేవి కావు. అందువల్ల అతని జీవితం, అతని ఆలోచనలు అన్ని సాధారణత్వానికి విరుద్ధంగా ఉన్నాయి అని అనుకుంటూనే అతనిలోని మేధావిని గౌరవిస్తారు మిగతా ముగ్గురు మిత్రులు కూడా. టోని అడ్రియన్‌కు దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం చాలా సందర్భాలలో ఇతరులకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కూడా. స్కూలు అయిపోయాక అందరూ ఊహించినట్లు గానే అడియన్ కేంబ్రిడ్జ్‌లో చదవడానికి స్కాలర్‌షిప్ సంపాదిస్తాడు. టోని చరిత్ర చదవడానికి బ్రిస్టల్ వెళ్లిపోతే మిగతా ఇద్దరూ తమకిష్టమైన రంగాలలో మరో చోటుకు వెళ్లిపోతారు. సెలవుల్లో తప్పకుండా కలవాలని నలుగురూ నిర్ణయం తీసుకుంటారు.

ఆ సమయంలోనే ఆడపిల్లలపై ఆసక్తి సహజంగానే టోనీలో పెరుగుతుంది. అప్పుడే వెరోనికా అనే యువతి టోనికి పరిచయం అవుతుంది. అది ప్రేమ లేదా ఆకర్షణా అన్నది వారికి అర్థం కాని అయోమయంలోనే వారిద్దరి మధ్య ఓ అనుబంధం ఏర్పడుతుంది. కాని వెరోనికా టోనితో శారీరిక సంబంధానికి ఒప్పుకోదు. అది ఆమె పెట్టుకున్న నియమం అని దాన్ని గౌరవిస్తాడు టోని. ఆ రోజులలోనే వెరోనికా తన ఇంటికి టోనీకి వీకెండ్ కోసం ఆహ్వానిస్తుంది. వెరోనికా కుటుంబంతో గడపడానికి వెళ్లిన టోనికి ఆ ఇంటి వాతావారణం వింతగా అనిపిస్తుంది. ఏదీ పట్టనట్లుండే వెరోనికా తండ్రి, కేంబ్రిడ్జ్‌లో చదివే ఆమె అన్న జాక్ లోని అహం, వెరొనికాతో జాగ్రత్త అని చెప్పి టోనిని అయోమయంలో పడేసిన ఆమె తల్లి సారా, వీరి మధ్య ఊపిరి ఆడనట్లు ఉంటుంది టోనికి. వెరోనికా కూడా అతనికి అక్కడ కొత్తగా కనిపిస్తుంది.

అక్కడి నుండి వచ్చాక తన స్నేహితులకు వెరోనికాను పరిచయం చేస్తాడు టోని. అడ్రియన్‌తో వెరోనికా చనువుగా గడపడం అతని స్నేహితులకు వింతగా అనిపించినా టోని దాన్ని పట్టించుకోడు. ఆమె అన్న జాక్ కేంబ్రిడ్జ్ లోనే చదువుతున్నాడని, తన సీనియర్ అని విని అడ్రియన్ అంత గొప్పగా స్పందించడు. తనకు జాక్ తెలుసని కాని అతనితో స్నేహం తనకు సరిపడదని కొంత విసుగునూ ప్రదర్శిస్తాడు. మెల్లిగా వెరోనికా టోనిల మధ్య దూరం పెరుగుతుంది. టోనీ తనకు దూరం అవుతున్నాడని తెలిసిన సమయంలోనే వెరోనికా శారీరికంగా టోనితో కలుస్తుంది. అయినా వారి మధ్య ఆ పాత స్నేహం కనుమరుగవుతుంది. మెల్లగా వెరోనికాని తప్పించుకుని తిరుగుతుంటాడు టోని.

కొన్నాళ్లకి వెరోనికా తల్లి నుండి టోనికి ఓ ఉత్తరం అందుతుంది. టోని వెరోనికా విడిపోయినందుకు ఆమె బాధపడుతూ, అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అందిస్తూ ఆమె రాసిన ఉత్తరం టోనికి పూర్తిగా అర్థం కాదు. టోని మరో అమ్మాయితో స్నేహం మొదలెడతాడు. ఆ సమయంలోనే అడ్రియన్ నుండి టోనికి ఓ ఉత్తరం వస్తుంది. వెరోనికాతో తాను సంబంధం కొనసాగించాలనుకుంటున్నానని దానికి టోని అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం అది. దానికి తనకేమీ అభ్యంతరం లేదని వెరోనికాను దాటి తన జీవితం ముందుకెళ్లిపోయిందని తిరుగు జవాబు రాసి తన చదువులో పడిపోతాడు టోని. డిగ్రీ వచ్చిన తరువాత ఆరు నెలలు దేశాలను చూడాలని వెళతాడు. ఆనీ అనే అమ్మాయితో డేట్ చేస్తాడు. కాని అదీ ముగిసి చివరకు ఇల్లు చేరతాడు.

ఇంటికి వచ్చిన టోనికి అడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలుస్తుంది. చదువుకునే రోజుల్లో ఆత్మహత్య అనేది ప్రతి స్వేచ్ఛాప్రియ వ్యక్తులకు సరైనదని, ప్రాణాంతకమైన అనారోగ్యం లేదా వృద్ధాప్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అదో తార్కిక చర్య, హింసను ఎదుర్కొన్నప్పుడు లేదా ఇతరులు తప్పించుకోదగిన మరణాలను ఎదుర్కొన్నప్పుడు ఒక వీరోచిత చర్య, నిరాశ చెందిన ప్రేమ విషయంలో ఆకర్షణీయంగా కనిపించే చర్య అని ఒకప్పుడు నలుగురు రాబ్సన్ విషయంలో వాదులాడుకోవడం, అతని ఆత్మహత్యకు కారణాన్ని వెతకడం టోనికి గుర్తుకొస్తుంది. ఇప్పుడు అడ్రియన్ మరణం వెనుక కారణం గురించి ఆలోచించడం మొదలెడతారు ముగ్గురు మిత్రులు. అతను చేతి నరాలను కోసుకుని చనిపోయాడని తెలుసుకుంటాడు టోని. బాత్ రూమ్ తలువు వేసుకుని తలుపు పైన పోలీసులను పిలవమనే ఉత్తరం అంటించి అతను చనిపోయాడని, తన రక్తపు మడుగులను ఇతరులు చూసి భయపడకుండా జాగ్రత్త పడ్డాడని తెలుస్తుంది టోనికి. అప్పటిని వెరోనికాతో ప్రేమలో ఉన్నాడని స్నేహితులు టోనికి చెబుతారు. ఈ మరణం వెనుక ఏదో రకంగా వెరోనికా బాధ్యత ఉంటుందని టోని అనుకుంటాడు.

మెల్లగా అతను తన జీవిత ప్రయాణంలో పడిపోతాడు. మార్గరెట్ అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు, వీరికి సూసి అనే కూతురు కూడా. తరువాత మార్గరెట్ టోనితో విడిపోతుంది. సూసిని ఇద్దరూ కలిసే పెంచుతారు. ఆ తరువాత సూసి వివాహం ఓ డాక్టర్‌తో జరుగుతుంది. వారికి ఇద్దరు పిల్లలు. మార్గరెట్ టోని ఇద్దరూ స్నేహితుల్లా మసలుతూ ఉంటారు. టోని రిటైర్ అయి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు.

ఇప్పుడు నవల రెండవ భాగం మొదలవుతుంది. టోనికి ఓ లాయర్ నుండి ఓ నోటీసు వస్తుంది. సారా ఫోర్డ్ అనే స్త్రీ అతనికి మరణానంతరం ఐదు వందల పౌండ్లు వదిలి వెళ్లిందని దానితో పాటు ఓ డైరీ కూడా వదిలిందని అది ఆమె కూతురి అధీనంలో ఉందన్నది ఆ ఉత్తరం సారాంశం. ఎంతో ఆలోచిస్తే కాని సారా వెరోనికా తల్లి అన్నది టోనికి గుర్తు రాదు. ఒక ఐదు వందల పొండ్లు పెద్ద ధనమూ కాదు మరి తనకి ఆమె ఎందుకు వదిలిందో ఆ డైరీ ఏంటో కనుక్కోవాలనే పట్టుదల అతనిలో పెరుగుతుంది. వెరోనికా అడ్రస్సు లేకపోవడంతో ఆమె అన్న జాక్ ఈ మెయిల్ పట్టుకుని ఉత్తరం రాస్తాడు టోని. వెరోనికా ఈ-మెయిల్ దొరకడంతో తనకు ఆ డైరీ కావాలని ఆమెకు ఉత్తరం రాస్తాడు. అది అడ్రియన్ డైరీ అని అతనికి అర్థం అవుతుంది. చాలా ఉత్తరాల తరువాత ఆమె ఆ డైరీలో ఓ పేజీ అతనికి పంపిస్తుంది. అది అతనిలో ఇంకా కుతూహలాన్ని కలిగిస్తుంది. అతని ఒత్తిడికి తల వంచి వెరోనికా అతన్ని కలుస్తుంది. అప్పుడు అడ్రియన్‌కు టోని ఒకప్పుడు రాసిన ఉత్తరాన్ని ఆమె అతనికి చదవమని ఇస్తుంది.

ఆ ఉత్తరం ఆడ్రియన్ వెరోనికాతో బంధంలోకి వెళ్లాలని అనుకుంటున్నానని దానికి టోని అనుమతి కోరుతూ రాసిన ఉత్తరానికి టోని ఇచ్చిన జవాబు. అందులో ఎంతో కసితో వెరోనికా అతనికి సరైనదని, ఆమెతో సంబంధం కలుపుకోవాలంటే ఆమెకు దూరం అవ్వాలని అప్పుడే ఆమె శారీరికంగా అడ్రియన్‌కు దగ్గరవుతుందని, తాము అలానే కలిసామని చెబుతూ ఆమె అసలు గుణం తెలియాలంటే ఆమె తల్లిని కలవమని ఆమె వెరోనికాతో జాగ్రత్తగా మసలమని తనకు ముందే చెప్పిందనే విషయాన్ని రాస్తూ చివర్లో “అయినా మీరిద్దరూ ఒకరికొకరు సరిపోతారులే” అనే వ్యంగ్యంతో టోని ఉత్తరాన్ని ముగిస్తాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ ఉత్తరాన్ని చూస్తే అది తానే రాసానా అన్న అనుమానం టోనిలో కలుగుతుంది. ఇంత కసి కోపంతో తాను ఉత్తరం రాసిన సంగతే తాను మర్చిపోయానని అతను వెరోనికాతో చెప్తాడు. అంత దారుణంగా తాను వెరోనికాను ఎలా చిత్రించగలిగాడన్నది టోనికి ఇప్పుడు ఈ వయసులో అర్థం కాదు. కోపంతో రగిలిపోతూ తాను ఇలా ఉత్తరం రాసానన్న విషయాన్ని తాను మర్చిపోవడం గురించి ఆలోచిస్తాడు. తనలో ఇంత క్రూరత్వం ఉండిందా అన్న ఆలోచన అతన్ని స్థిమితంగా ఉండనివ్వదు. అంతే కాదు అడ్రియన్‌కు తాను అభినందనలు తెలుపుతూ పంపిన కార్డు క్లిప్టన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ది అని అప్పుడు అతనికి గుర్తుకు వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుండి ప్రతి సంవత్సరం ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కార్డును తాను ఎందుకు అడ్రియన్‌కు పంపాడో టోనికి అర్థం కాదు. అడ్రియన్‌ను ఆత్మహత్య దిశగా తానే తెలియకుండా మళ్ళించానా అన్న ఆలోచన మొదటిసారి అతనిలో కలుగుతుంది.

అడ్రియన్ జీవితపు ముగింపులో తన ప్రమేయం ఎంతో కొంత ఉండే ఉంటుందని టోనికి అర్థం అవుతుంది. అసలు అడ్రియన్ జీవితపు ముగింపులోని సత్యాన్ని శోధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వెరోనికాని మళ్ళీ కలుస్తాడు. ఆమె అతన్ని ఓ చోటుకు తీసుకువెళుతుంది. అక్కడ ఓ మెదడు ఎదగని యువకుడిని చూస్తాడు టోని. అతను ఇంకా నిజాన్ని చూడలేకపోతున్నందుకు, అర్థం చేసుకోలేకపోతున్నందుకు వెరోనికా కోపంతో అక్కడే అతన్ని వదిలిపోతుంది. అప్పుడు అక్కడ నుంచుని ఆలోచిస్తున్న టోనికి నెమ్మదిగా విషయం అర్థం అవుతుంది. ఆ మతి స్థిమితం లేని యువకుడు అచ్చు అడ్రియన్ పోలికలతో ఉండడంతో అతను విషయాన్ని తన పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వెరోనికా అడ్రియన్ ఇద్దరికి పుట్టిన బిడ్డ మతిస్థిమితం లేనివాడని, అది భరించలేక అడ్రియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతనికి అర్థం అవుతుంది.

కాని ఆ యువకుడిని మరోసారి చూడాలని అతను కనిపించిన చోట బార్‌కి హోటల్‌కి వెళుతూ ఉంటాడు టోని. ఆ యువకుడిని చూసుకుంటున్న వ్యక్తితో సంభాషించినప్పుడు కాని అతనికి పూర్తి విషయం అర్థం కాదు. ఆ యువకుడు వెరోనికా తమ్ముడని, ఆమె తల్లికి మరెవరికో పుట్టినవాడని అతనికి తెలిసినప్పుడు అసలు కథ పూర్తిగా అతనికి అర్థం అవుతుంది.

అడ్రియన్‌కు వెరోనికా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆమె తల్లిని అడగమని తాను అడ్రియన్‌తో ఉత్తరం ద్వారా చెప్పడం అతనికి అప్పుడు గుర్తుకు వస్తుంది. అడ్రియన్ వెరోనికా తల్లిని కలుసుకోవడానికి ఒంటరిగా వెళ్లి ఉంటాడని ఆమె మాయలో పడి ఉంటాడని అప్పుడు టోనికి పూర్తిగా అర్థం అవుతుంది. వెరోనికా వింత ప్రవర్తన వెనుక అమె తల్లి కారణం అని తనతో వెరోనికా కలిసి ఉన్నప్పుడు కూడా కూతురు గురించి ఆమె అనుమానాలను రేకెత్తించే విధంగా మాట్లాడడం అతనికిప్పుడు అర్థం అవుతుంది. వారికి పుట్టిన ఆ యువకుడు మతి స్తిమితం లేకుండా పుట్టడం, దిగజారిన అడ్రియన్ జీవిత ప్రమాణాలు, ఇవన్నీ అతని ఆత్మహత్యకు కారణం అని అతనికి పూర్తిగా అర్థం అవుతుంది. అప్పటి దాకా తాను విష కన్యగా భావించిన వెరోనికా ఆ యువకుడి బాధ్యత తీసుకోవడం, అతని బాగోగులు చూడడం గమనించాకా తాను ఇప్పటి దాకా అనుకున్నదేదీ నిజం కాదని, తెలిసి టోని నిర్షాంత పోతాడు.

టోని కథ చెప్తున్నంత సేపు వెరోనికా మనకూ అంటే పాఠకులకూ మరో విధంగానే అర్థం అవుతుంది. ఆమెను పొందలేక, తాను అసూయపడే అడ్రియన్ ఆమెకు దగ్గరవుతున్నాడని తెలిసి కసితో ఆమె గురించి అవాకులు చెవాకులు రాసి ఆ తరువాత అన్నీ మర్చిపోతాడు టోని. కాని ఆ లేఖ అడ్రియన్ జీవితాన్నే మార్చేస్తుంది. సారా అతన్ని వెరోనికాకు కాకుండా చేస్తుంది. వెరోనికాతో కలిసి తిరిగిన టోనీ కూడా ఆమె గురించి తప్పుగా చెప్పడం, దానికి సాక్షిగా ఆమె తల్లిని పరిచయం చేయడం, కూతురు ప్రేమించిన వ్యక్తిని తనవాడిగా మలచుకునే నైజం ఉన్న సారా అడ్రియన్‌ను లోబర్చుకోవడం ఫలితంగా పుట్టిన బిడ్డ అంగ వైకల్యుడవడం ఇవన్నీ అడ్రియన్ తప్పించుకోలేని తప్పిదాలు. వీటికి జవాబుగా అతను ఆత్మహత్యను ఎన్నుకున్నాడు. జీవితాన్ని చాలించాడు. అడ్రియన్‌తో పరిచయానికి కారకుడయిన టోనికి తన దగ్గర ఉన్న డబ్బు పంపి సారా తన జీవితపు ఆ కాస్త మాధుర్యానికి కృతజ్ఞత చూపించుకుంటే, అన్ని విధాలుగా మోసపోయి కూడా ఆ తల్లికి అడ్రియన్‌కు పుట్టిన బిడ్డ భాద్యత తీసుకుని తన ఉదాత్తతను చాటుకుంటుంది అప్పటి దాకా మనం కూడా ఇష్టపడని వెరోనికా.

వెరోనికాను టోని తాను అనుకున్న దృష్టిలోనించే చూసాడు. అందుకే ఆమెలోని ఆ ఉదాత్త కోణం అతనికి కనిపించలేదు. ఆ తరువాత అన్నిటినీ వెరోనికాకు విరుద్ధంగా చూస్తూనే వెళ్లాడు. అడ్రియన్‌పై అతనికున్న అసూయ అతనికే తెలీదు. అతని స్నేహాన్ని కోరుతూనే అతని విద్వత్తుపై టోనిలో పేరుకున్న అసూయ సమయం వచ్చినప్పుడు ఆ ఉత్తరంలో బైటపడి అడ్రియన్ జీవితాన్నే మార్చివేసింది. ఇది కొన్నేళ్ళ తరువాత మళ్లీ ఆ ఉత్తరం చూసే దాకా టోనికి కూడా అర్థం కాని విషయం. తనలో అంత క్రూరత్వం ఎలా ఉండిందో అని ఆ ముదుసలి వయసులో ఆశ్చర్యపోతాడు టోని.

మానవ సంబంధాలలో ఎన్నో రహస్యాలు, అందుకే వాటిని అర్థం చేసుకోవడానికి ఆ రహస్యపు ముళ్లు విప్పడానికి మనం ఏ దారిని ఎంచుకుంటున్నామో కూడా విశ్లేషిస్తే తప్ప మనం నిజం వైపు ప్రయాణిస్తున్నామా లేదా మనం సృష్టించుకున్న మన వ్యక్తిత్వానికి అనుగుణంగా విషయాలను మరల్చుకుంటున్నామా అన్నది అర్థం కాదు.

సెలెక్టివ్ మెమరీతో మనం చాలా సార్లు మనల్ని మనం రక్షించుకుంటాం. మనల్ని మనం ఎలా ప్రదర్శించుకోవాలనుకుంటామో ఆ దిశగానే అన్ని ఆలోచనలూ పనులనూ చేస్తాం. అందుకే చాలా సంబంధాలు అనుబంధాల మధ్య ఉండే వాస్తవాలు వెలుగులోకి రావు. మనిషి మేధ వాటిని పైకి రానివ్వదు. ఇది మనిషి అవలంబించే స్వీయ రక్షణ స్థితి. ఈ నవల ఆ స్థితిని చర్చిస్తుంది. మనిషి ఇలా బతకడంలోని స్వార్థాన్ని బట్టబయలు చేస్తుంది.

ఆప్తుడు

1

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింగీతం ఘటికాచల రావు గారి ‘ఆప్తుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]రు గంటల నుంచి కాచుకుని కూర్చున్నా ద్వారపూడి నుంచి పిఠాపురం వెళ్లే బస్సు ఇంకా రాలేదు. ఓపిక నశించి వెంటనే పక్కనే ఉన్న సామర్లకోట బస్సు ఎక్కేసాడు సదాశివం. నేరుగా వెళ్లే బస్సు ఎక్కితే ఒక పది రూపాయలు మిగల్చుకోవచ్చు అనుకున్నాడు కానీ అలా కుదరలేదు. ఇక గత్యంతరం లేక సామర్లకోట బస్సు పట్టుకోవాల్సి వచ్చింది.

బస్సు చాలా రద్దీగా ఉంది. ఎక్కువగా అక్కడ చుట్టుపక్కల పల్లె వాళ్ళు తమ తమ ఉత్పత్తులతో గంపలు గంపలుగా కాయగూరలు వేసుకుని ఎక్కుతున్నారు. బస్సు లోపల గంపలు. బస్సు పైన మూటలు. స్థానికంగా రాజమండ్రి మార్కెట్ లోనే అమ్ముకునే వాళ్ళు కొందరు ఉంటే మరి కొంతమంది ఇలా బస్సు పట్టుకుని చుట్టుపక్కల కొంచెం దూరంగా ఉన్న ఊర్లకు వెళుతుంటారు. బస్సు రద్దీ ఎక్కువగా ఉన్నా ఎలాగోలా కూర్చునేందుకు కిటికీ పక్కన సీటు దొరికింది.

ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. కాబట్టి బస్సు ఎక్కువ భాగం రైతులతోనే నిండి ఉంది. ఎవరి మానాన వాళ్ళు ఇద్దరు ముగ్గురుగా గుంపులు చేరి తమ తమ సమస్యలను వెళ్ళగక్కుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. కొంతమందికి ఎరువుల సమస్య అయితే కొంతమందికి నీటి సమస్య. మరికొంతమందికి నీరు ఉన్నా కరెంటు లేమి. ఇంకొంతమందికి పండిన పంటను దాచుకునేందుకు స్థలాభావం. ఆ బస్సు ఎందుకు అంత రద్దీగా ఉందో అప్పుడు కొద్దిగా అర్థమైనట్టు అయింది. ఎందుకంటే సామర్లకోట పక్కనే ఎఫ్సీఐ ధాన్యాగారాలు ఉన్నాయి.

బహుశా అక్కడ పక్కన మార్కెట్ యార్డ్ కూడా ఉండే ఉంటుంది. అందువల్ల అందరూ ఉదయాన్నే తమ తమ ఉత్పత్తులతో అక్కడికి వెళుతున్నట్టు ఉన్నారు అనుకున్నాడు సదాశివం.

పక్కనే మరొకతను కూర్చుని ఉన్నాడు. అతను అక్కడున్న వాళ్ళందరినీ భృకుటి ముడివేసి అదోరకంగా చూస్తున్నాడు. తాను చాలా ధనవంతుడు, అక్కడ కూర్చున్న మిగతా వాళ్లంతా తనకన్నా చాలా పేదవాళ్ళు అన్న భావన అతని చూపుల్లో కనిపిస్తుంది. “ఈ లెక్కన సామర్లకోట చేరాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది” అన్నాడా మనిషి విసుగ్గా.

సదాశివం మౌనంగా వింటున్నాడు. చూడ్డానికి బాగా ధనవంతుడని కనిపిస్తున్న అతను హాయిగా తన సొంత కారులో వెళ్లకుండా బస్సులో ఎందుకు వస్తున్నాడో అనుకున్నాడు సదాశివం.

“వీళ్ళ కోసమే స్పెషల్ గా ఒక బస్సు వేస్తే బాగుంటుంది. రైతు బజారు లాగా రైతు బస్సు ఎందుకు ఉండకూడదు? అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఏదైనా ఒక డిమాండ్ పెడితే కదా వీళ్ళకి కావాల్సిన అనుకూలం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు వీళ్ళ మూలంగా మనకంతా టైం వేస్ట్ అవుతుంది. ఎవరికీ టైం విలువ తెలీదు. టైం సెన్స్ లేనేలేదు. ఇలాగైతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది” అన్నాడు అతను మళ్ళీ మరింతగా విసుక్కుంటూ.

“అన్ని నిర్ణయాలు ప్రభుత్వం ఆలోచించుకోవాలంటే కుదరని పని. సలహాలు, సంప్రదింపులు, సమాలోచనలు అన్ని జరిగితేనే కదా ప్రభుత్వం సక్రమంగా పనిచేయగలిగేది” అన్నాడు మళ్ళీ.

సదాశివం వింటున్నాడే తప్ప మాట్లాడదలచుకోలేదు. అందులోనూ రాజకీయాల గురించి అస్సలు నోరు తెరవదలుచుకోలేదు.

“మాస్టారు మీరు కూడా సామర్లకోటకేనా” ఎలాగైనా సదాశివం నోటి నుంచి మాట పలికించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టున్నాడతను.

“కాదండి పిఠాపురం వెళ్లాలి” అనేసి అంతలోనే నొచ్చుకున్నాడు ఎందుకన్నా చెప్పానని. పక్కనున్న మనిషికి మాట్లాడేందుకు బ్రహ్మాస్త్రం దొరికినట్టు అయింది.

“అదేంటి సార్ ఇది సామర్లకోట వరకే కదా. పిఠాపురం అంటే వేరే బస్సు ఎక్కాలి కదా” అతని కంఠంలో ఏదో ఉత్సాహం.

“అవును కానీ అరగంట నుంచి చూస్తున్న ఏ బస్సు రాలేదు పిఠాపురానికి. అందువల్ల సామర్లకోటలో దిగి అక్కడినుంచి వేరే బస్సు పట్టుకోవాలనుకున్నాను”

అప్పటికి బస్సు బయలుదేరి సుమారు అరగంట అయింది .

“భలేవాళ్లే. నేను ఎక్కే ముందే చూసాను పిఠాపురం బస్సు పక్కనే ఉంది” అతను అలా అంటుండగానే తాను ఎక్కిన బస్సు పక్కనుంచి పిఠాపురం బస్సు దాటి ముందుకు వెళ్ళింది. నిరాశగా చూసాడు సదాశివం.

ఎలాగైనా ఆ వెళ్ళే బస్సును ఆపగలిగితే అందులో ఎక్కేయవచ్చు. డ్రైవర్ తో ఒక మాట మాట్లాడితే బాగుంటుందేమోనన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ డ్రైవర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. బస్సు చాలా రద్దీగా ఉంది. పోనీ కండక్టర్ తో చెప్తామంటే అతను కూడా చాలా దూరంగా వెనక ఎక్కడో టిక్కెట్లు వేస్తూ ఉన్నాడు. కాసేపు తన దురదృష్టాన్ని నిందించుకున్నాడు సదాశివం.

“పోనీ డ్రైవర్తో చెప్పి కాస్త ముందుకు వెళ్లి ఆ బస్సును ఆపమని చెప్పొచ్చు కదా” పక్కనున్న మనిషి మాట్లాడిన మాటలవి. తన మనసులోని మాట ఇట్టే పట్టేసాడతను.

“లాభం లేదండి బస్సు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది ఇక సామర్లకోటలో దిగి వేరే బస్సు, బహుశా ఆ ముందు వెళ్లే బస్సే పట్టుకోవాల్సి ఉంటుంది” అన్నాడు.

అంతలో కండక్టర్ అక్కడికి వచ్చాడు టికెట్లు అడుగుతూ. ఒకసారి అతన్ని అడిగి చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది సదాశివంకు. వెంటనే అమలు చేశాడు.

“కండక్టర్ గారు ముందు వెళ్లే ఆ పిఠాపురం బస్సును ఆపగలరా. నిజానికి నేను పిఠాపురం వెళ్లాలి” అన్నాడు సౌమ్యంగా అభ్యర్థిస్తూ.

“వీలుపడదు సార్” ముక్తసరిగా చెప్పాడు కండక్టర్.

“ఏమయ్యా, మీ అందరి దగ్గర ఒకరినొకరు కాంటాక్ట్ చేసుకునేందుకు మొబైల్స్ ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయకూడదూ” దర్పంగా అడిగాడు పక్కనున్న పెద్దమనిషి.

“అలాంటివేవీ లేవండి” నిర్లక్ష్యంగా అనేసి ముందుకెళ్ళిపోయాడు కండక్టర్.

“చూశారా మరొకరికి సహాయం చేయాలన్న ఆలోచన మనసులో ఉండనే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే మీరు దిగి వెళ్ళిపోతే తనకు టికెట్టు తగ్గిపోతుందని వీడి భావన. పరోపకారం అనే ఆలోచన మచ్చుకైనా ఉండదేమో. ఏం మనుషులు” అంటూ ఈసారి బాగానే విసుక్కున్నాడు.

అయినా తనకు లేని ఇబ్బంది అతనికెందుకు కలిగిందో సదాశివం కు అర్థం కాలేదు. అయితే పరోపకారం అన్న ఒక మాట మాత్రం అతనికి బాగా నచ్చింది. పరవాలేదు మంచివాడే అనుకున్నాడు మనసులో. అంతలో ముందర ఏదో ఒక గొడవ జరుగుతోంది. కండక్టర్ ఎవరినో అరుస్తున్నాడు.

“ఎక్కేటప్పుడు చిల్లర తెచ్చుకోవాలని తెలియదా. రూపాయిలు రెండు రూపాయలు నేనెక్కడినుంచి తేను. మా ఇంట్లో ఏమన్నా చిల్లర మిషన్ ఉందా”

“తొందర ఏమి లేదులే సామీ. దిగేపాల తీసుకుంటాను” అంటున్నాడా రైతు.

“సరిపడా చిల్లర తెచ్చుకోవాల్సిన బాధ్యత కండక్టర్ ది. అలాంటిది ఎలా మాట్లాడుతున్నాడో చూడండి” విసుక్కున్నాడు ఆ పెద్దమనిషి.

“బస్సులో ఉన్న మొత్తం మంది చిల్లర లేకుండా వస్తే ఆయన మాత్రం ఎంత ఇస్తాడు చెప్పండి” సమర్ధించాడు సదాశివం.

“అదీ నిజమే కష్టాలు రెండువైపులా ఉన్నాయి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. ఈ గొలుసు తెగదు ఇలాగే ఉంటుంది” వైరాగ్యంగా మాట్లాడాడు పెద్దమనిషి.

బస్సు దారిలో ప్రతి నాలుగైదు కిలోమీటర్లకు ఆగుతూనే ఉంది దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్లు ఎక్కుతూనే ఉన్నారు. సదాశివానికి విసుగు అధికమైంది. కానీ మరో గత్యంతరం లేదు వెళ్లి తీరాలి అంతే. అరగంట ఆగిన తను మరొక ఐదు నిమిషాలు ఆగి ఉంటే బాగుండేదేమో అనిపించింది.

సుమారు ఒక గంట ప్రయాణం ముగిశాక బస్సు ఒకచోట ఆగింది.

పక్కనున్న పెద్దమనిషి ఠక్కున లేచి గబగబా బస్సు దిగాడు. అతను దిగడమే తరువాయి, పక్కనుంచి వేగంగా ఒక కారు వచ్చి అతని పక్కన ఆగింది. అతను అందులో ఎక్కబోయి ఆగి బస్సు వంక చూశాడు.

బస్సులో ఉన్న సదాశివం అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ‘అంటే ఇతనికి కారు ఉందన్నమాట. ఉన్నా కూడా బస్సులో వచ్చాడు. అదేం కక్కుర్తి? ఎలాగూ కారు ఇంత దూరం వస్తూనే ఉంది. అలాంటప్పుడు బస్సులో రావడం టిక్కెట్టు డబ్బులు దండగ కదా’ అనుకుంటూ ఆ పెద్దమనిషినే చూస్తూ ఉన్నాడు.

బస్సు వంక చూసిన పెద్ద మనిషి సదాశివాన్ని చూసి రమ్మని పిలిచాడు. అతను పిలిచేది తననేనా అన్న విషయం సదాశివానికి అర్థం కాలేదు. తన చుట్టుపక్కల చూశాడు.

ఈసారి అతను సూటిగా వేలు చూపించి “మాస్టారు మిమ్మల్నే. లేచి రండి” అన్నాడు.

అయోమయంగా ఉన్న సదాశివం లేచి బస్సు దిగాడు.

“రండి వెళదాం. సామర్లకోట వరకు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను” అన్నాడు.

“వద్దండీ. నేను బస్సులోనే వెళ్ళిపోతాను” అన్నాడు మొహమాటంగా.

“మీరు మరీ మొహమాట పడవద్దు. కారు ఖాళీగానే ఉందిగా ఎక్కండి. పైగా నాకు మాట తోడు కూడా ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఈ బస్సులో వెళ్తే ఇంకో గంటకు గాని మీరు సామర్లకోట చేరుకోలేరు. ఆ తర్వాత ఇంకా పిఠాపురం కూడా వెళ్లాలి మీరు” అన్నాడు పెద్దమనిషి.

మొహమాటపడుతూనే కారులో ఎక్కి కూర్చున్నాడు సదాశివం. అతనికేమీ అర్థం కావడం లేదు. కారు బయలుదేరింది. సదాశివం ఇక ఉండబట్టలేక అడిగేశాడు.

“మీకు కారు ఉండగా మరి బస్సులో ఎందుకు వచ్చారు?”

సన్నగా నవ్వేశాడు పెద్దమనిషి. “ఎక్కడికి వెళ్ళినా కారులో ఒంటరిగా వెళ్లి చాలా బోర్ కొట్టింది. అందువల్ల అలా సరదాగా బస్సు ఎక్కాను. అంతేకాకుండా సామాన్య ప్రజల మధ్య జీవనం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి జీవితాన్ని కూడా జీవించాలి. దీనికన్నా ట్రైన్‌లో జనరల్ బోగీలో ప్రయాణం అద్భుతం. అయినా ఇవన్నీ అసలు కారణాలు కావు. మా డ్రైవర్ కూతురు కాన్పు కోసం కారు తీసుకెళ్ళమన్నాను. వీడు మరీ సిన్సియర్‌గా అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చి వెంటనే మళ్ళీ వచ్చేసాడు. ఎందుకంటే కాన్పు రేపో మాపో అన్నారట” అనేసి మరింతగా నవ్వాడు పెద్దమనిషి.

సదాశివం ఆ మనిషిని ఒక పట్టాన అర్థం చేసుకోలేక పోతున్నాడు.

“ఏం పని చేస్తుంటారు మాస్టారు” అడిగారు పెద్దమనిషి.

“రైల్వేలో ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను”

“అలాగా. అది సరే ఇప్పుడు ఏం చేస్తుంటారు? సమయం అంతా ఖాళీయే కదా”

చెప్పకూడదు అనుకుంటూనే చెప్పేసాడు సదాశివం.

“ఉబుసుపోకకు ఏవో రచనలు చేస్తూ ఉంటాను”

“ఓహో రచయిత అన్నమాట. మరింకేం. సమాజాన్ని ఉద్ధరించే పెద్ద బాధ్యత మీపైనే ఉంది నిజమేనంటారా”

నవ్వేసాడు సదాశివరావు “ఎవరూ ఎవరినీ ఉద్ధరించలేరండి. అది అసాధ్యం. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒకరు చెప్తే వినాలి అన్న నిర్బంధం ఎవరికీ లేదు. మాకున్న అనుభవాలు క్రోడీకరించి రాసే రాతలవల్ల అందులోని మంచి ఎవరికైనా కనిపిస్తే, అది ఆచరణ యోగ్యమైతే, దానివల్ల వాళ్ళ జీవితాలకు ఒక దిశా నిర్దేశం లభిస్తుందని అనిపిస్తే, వాళ్లు దాన్ని అనుసరించవచ్చు. అంతే. అంతకన్నా మరి ఏమీ లేదు”

“ఒక్క వాక్యంలో జీవిత సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారండి అందుకే రచయిత అయ్యారు”

సదాశివానికి అప్పుడు అడగాలనిపించింది ఆ పెద్దమనిషి గురించిన వివరాలు. “మీరేం చేస్తుంటారండి?” అనడిగాడు.

మళ్లీ గట్టిగా నవ్వేశాడు పెద్దమనిషి. “తాత తండ్రులు సంపాదించిన ఆస్తి పెద్దగా లేకపోయినా ఎంతోకొంత దాచుకున్నాను. పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేయలేదు. ఎందుకు చదువుకోలేదు అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. పదో తరగతితో చదువు ఆపేశాను. కొద్దిగా పొలం ఉండేది. చేసినన్ని రోజులు పొలం పనులు చేశాను. కానీ విలాసాలు ఎక్కువవ్వడంతో ఖర్చులు పెరిగి ఆదాయం తరిగింది. దాదాపుగా పొలం అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కానీ సరైన సమయంలో బుద్ధి తెచ్చుకుని దాన్ని అమ్మలేదు. ఇదివరకే చెప్పాను కదా తాత తండ్రుల ఆస్తి ఎంతో కొంత ఉందని. ప్రస్తుతం దానివల్ల బతుకు నెట్టుకు వస్తున్నాను” చెప్పడం ఆపి నిట్టూర్చాడు.

సదాశివానికి ఎందుకో ఆ పెద్దమనిషి చెప్పిన మాటలు అతికినట్టు కనిపించలేదు. కారులో విలాసంగా తిరిగే పెద్దమనిషి గత చరిత్ర ఇలా ఉంటుందా అనిపించింది.

పెద్దమనిషి సదాశివం వంక అదోలా చూసి “ఏంటి నేను చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదా” అన్నాడు నవ్వుతూ. అవునన్నట్టు తలాడించాడు సదాశివం.

“సరే మీరేమనుకుంటున్నారో చెప్పండి” అన్నాడు కుతూహలంగా.

“నేనేం చెప్పగలనండి మీ గురించి” అన్నాడు సదాశివం.

“రచయితలు కదా, ఏదో ఒకటి ఊహించండి పర్వాలేదు. ఇదంతా ఒక టైం పాస్ కదా మనం ఊరు చేరేవరకు” మళ్ళీ అదే కల్మషం లేని నవ్వు.

సదాశివానికి కుతూహలం పెరిగింది అప్పటిదాకా ఆ పెద్దమనిషి గురించి ఏదో ఏదో అనుకుంటున్న అతను హఠాత్తుగా మరో విధంగా ఆలోచించసాగాడు

బస్సులో అతని ప్రవర్తన చూస్తే మంచివాడ లాగానే అనిపించింది. రైతుల కోసం ప్రత్యేక బస్సు సదుపాయం కలిగించాలి అన్న అతని ఆలోచన అతనిలో ఏదో ఒక నాయకుడిని చూపించింది. చిల్లర కోసం బస్ కండక్టర్ గొడవ పడడం సరిగా అనిపించకపోయినా చిల్లర సమస్య అన్ని చోట్ల ఉండేదే కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదనిపించింది. ఇక హఠాత్తుగా బస్సు దిగి కార్ ఎక్కిన అతను నిజంగానే ధనవంతుడు అనిపించింది. డ్రైవర్ కోసం తన కారును త్యాగం చేసిన అతనిలో ఒక మానవతావాది కనిపించాడు. ఇలా అనేక రకాలైన స్వభావాలు కలబోసిన అతను ఏమై ఉంటాడు అన్నది బుర్రకు తట్టలేదు.

“సార్ మీ టైం పాస్ ఆట బాగుంది కానీ మీరు ఎవరో నాకు మాత్రం అర్థం కావడం లేదు మీరే చెప్పేయండి” అన్నాడు సదాశివం. అంతలో సామర్లకోట వచ్చింది.

“మాస్టారు మిమ్మల్ని ఎక్కడ దింపమంటారు? బస్టాండులోనేనా. అన్నట్టు మీరు పిఠాపురం వెళ్లాలి కదూ బస్టాండులోనే దిగాలి. డ్రైవర్ బస్టాండ్ కి పోనీ” అన్నాడు పెద్దమనిషి.

కారు దిగేముందు “మాస్టారు గారు మీ పరిచయం చాలా బాగుంది. ఒక సెల్ఫీ తీసుకుందాం” అంటూ తన ఫోన్లో నుంచి ఒక సెల్ఫీ తీసుకున్నాడు పెద్దమనిషి. దాన్ని సదాశివం నంబరు తీసుకుని అతనికి పంపించాడు.

సదాశివానికి ఆ ప్రయాణం చాలా ఉత్సుకతగా విచిత్రంగా అనిపించింది. బస్సు ఎక్కినప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తిగా పరిచయమైన అతను కారు దిగేసరికి ఎంతో ఆప్తుడుగా అనిపించాడు.

సదాశివం పిఠాపురం చేరుకునేసరికి పది గంటలయింది. బస్టాండులో బస్సు దిగగానే తాను దిగిన బస్సు పక్కనే ఒక కొత్త రంగుల బస్సు కనిపించింది దానిమీద రైతు బస్సు అని రాసి ఉంది. ఆశ్చర్యపోయాడు సదాశివం బస్సులో తన పక్కన కూర్చున్న పెద్దమనిషి కూడా ఈ మాటే అన్నాడు ‘రైతు బజార్ లాగా రైతుబస్సు ఎందుకు ఉండకూడదు’ అని. ఇదేంటి నిజంగానే రైతు బస్సు ఉంది ఇక్కడ అనుకున్నాడు.

ఇంటికి వెళుతూ ఆ రోజు పేపర్ తీసుకుని చంకలో పెట్టుకుని ఇల్లు చేరుకున్నాడు. స్నానం చేసి నిదానంగా కుర్చీలో కూర్చుని ఈ పేపర్ తిరగేసాగాడు రెండో పేజీలో ఒక ఫోటో ఒక వార్త.

“మాజీ ఎమ్మెల్యే సాంబయ్య గారి కోరిక మేరకు రైతుబస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి” వార్తకు పక్కనే ఉన్న ఆ ఫోటో కింద పేరుతో సహా చూసి ఆశ్చర్యపోయాడు సదాశివం.

అది మరెవరో కాదు తన పక్కన కూర్చున్న పెద్దమనిషి.

ఆదర్శపు అనుబంధాలు

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జగన్ మిత్ర గారి ‘ఆదర్శపు అనుబంధాలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే నేనూ మా ఆవిడా బాల్కనీలో కాఫీ తాగుతూ, కబుర్లాడుకుంటూ ఉంటాము. మా ఆవిడ ఉదయపు ఎండలో నడవడమో కూర్చోవడమో చేస్తే మంచిదని, డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు.

మా ఇంటి చుట్టూ వందెకరాల్లో, రకరకాల చెట్లతోనూ గుబురు పొదలతోనూ పచ్చదనం పరుచుకొని ఉంటుంది. పెద్ద సంఖ్యలో పావురాలు తిరుగాడుతూ ఉంటాయి. మా బాల్కనీలోనయితే, మూడునాలుగు జతలు పగలంతా తచ్చాడుతూ ఉంటాయి. మేము ఏమారితే, వంటగదిలోని మన చేతికి అందే ఎత్తులోని, స్టవ్ హూడ్ పై, వాటిల్లో ఏదో ఒక జత కాపురం పెట్టేస్తాయి. నాకు భలే ముచ్చటేస్తుంది. ప్రేమలు పంచుకోడానికి మనుషులకే కాదు. పశు పక్ష్యాదులక్కూడా అభినివేశముంటుందని. మాయావిడకు తెలియకుండా పాతబడుతూ ఉండే ఫుట్ మేట్స్‌ను, హూడ్ మీద వేస్తాను, మెత్తగా ఉంటుందని. ఎప్పుడైనా తన కంటపడి, నన్ను వారించబోయినా, పోనీలేవే, వాటికయినా ఆశ్రయమిద్దాము, పుణ్యమైనా దక్కుతుంది అంటూ వంకరగా నవ్వేస్తాను. నా నవ్వులోని అంతరార్థం తనకూ తెలుసు. ఆవిణ్ణి సంతోషపెట్టడానికి రకరకాల ఫీట్లు. అర్థం కాని అందమైన అబద్ధాలు.

మా ఆవిడ ఆరోగ్యం బాగుండక పోవడంతో, నేనే తనకు సర్వస్వం అయ్యాను. నా పనులు, ఆవిడ పనులూ చేసేసి, ఇంటిపని వంటపనీ ముగించుకొని, హుషారుగా ఆఫీసుకు వెళుతూ ఉంటాను. మరో పని పెట్టుకోకుండా, సాయింత్రానికి ఠంచన్‌గా చాయ్ బిస్కట్‌తో ఆవిడముందు కూర్చుంటూ ఉంటాను.

అప్పుడప్పుడు మా అత్తగారు వచ్చినా, ఎక్కువ రోజులుండే పరిస్థితి కాదు. మామయ్య ఆరోగ్యo అంతంత మాత్రం. పల్లెటూళ్లో డాక్టర్లు అందుబాటులో ఉండక,  అతనికి తోడుగా, ఒక మెయిడ్‌ను పెట్టి, మా దగ్గర వారం పదిరోజులుండి పోతూఉంటుంది.

“బాబూ! ఏ జన్మలోనో మా అమ్మాయి చేసుకున్న పుణ్యమే, నువ్వు దానికి దొరకడం. దాని కోసం, ఆసుపత్రులకు తిరగడం, వేళకు మందులు అందివ్వడం, చూస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్న పది రోజులూ, ఇంటిపని వంట పని నేను చూసుకుంటూ ఉన్నా, ఆ తర్వాత, నువ్వు పడే కష్టమేపాటిదో నాకు తెలుస్తూనే ఉంది”

“అదేముంది లే అత్తయ్యా! బయట తిరిగే నాకు, ఏదైనా జరిగితే, నాకు మీ అమ్మాయి తోడుండదా? మీరు నన్ను దూరం  పెట్టేస్తారా?”

“ఏమండీ! అవేం మాటలoడీ” అంటూ మా ఆవిడ,

“నట్టింట అపశకునాలు పలక్కూడదయ్యా?” అంటూ అత్తయ్య ఒకేసారి అడ్డుతగిలారు.

నేను పైకి చూసి, ఈశాన్యపు దిక్కుకెసి నడుస్తూ, “అదేం కాదులే అత్తయ్యా! మీ అమ్మాయి రోజూ శుభాలు పలుకుతూ, పూజలు చేస్తూనే ఉంటుంది. మరి మనింట ఈ అశుభకరమైన అనారోగ్యమెందుకు అడుగుపెట్టిందా అని!?”

“తర్కం కాదు గాని నాయనా. మా అమ్మాయితో నువు పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నానయ్యా!”

“మరేం చెయ్యమoటారత్తయ్యా?”

“చేస్తున్నదే మహద్భాగ్యం. నీ పన్లు నువు చేసుకుంటూ, ఆఫీసు పన్లు చూసుకుంటూ, ఆడవారి పన్లూ సరిపెట్టడం ఎంతటి ఇబ్బందో నాకు తెలవదా బాబూ1? మేమే ఏదో ఒకటి చెయ్యాలయ్యా!”

“అమ్మా! మనింట్లో చేరిన సరోజను, కొన్నాళ్లు మాకు తోడుగా పంపించగలవా? పల్లెటూళ్ళో మీకయితే కేకెయ్యంగానే ఎవరో ఒకరు పలుకుతారు. సాయంగా దొరుకుతారు”

“వొద్దు వొద్దు వొద్దనే వొద్దత్తయ్యా! మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకోగలను. ఈ సేవలో నాతో వేరే వాళ్ళు పోటీ పడడం నాకిష్టం లేదు. ఇంకెంత. నాకు రిటైర్మెంట్ దగ్గరపడుతోంది. ఆ రోజునుండి నేను మరో పనేమీ పెట్టుకోను”

“అమ్మాయి తన కష్టాన్ని నీతో చెప్పుకోడానికి సిగ్గు అడ్డమొస్తోందట. ప్రత్యేకమైన సందర్భాల్లో నీతో సేవ చేయించుకోవడం కష్టంగా ఉంటోందట. నాతో చెప్తూనే ఉంది. ఇప్పటికే లేటు చేశాను”

“సరోజకు నా వయసు ఉంటుందా అమ్మా?”

“నీకంటే చిన్నదే అయ్యుంటుంది. చూడ్డానికి మాత్రం నాకంటే చిన్నదిగా అనిపిస్తుంది. మనూరి ఎడ్మాష్టారమ్మకు సరోజ సాయంగా ఉండేది. పనిమనిషీ కాదు. వంటమనిషీ కాదు.  అక్కో చెల్లో వదిన, అంతకు మించిన ఇంటి మనిషి. ఇంట్లో మనిషి. అబ్బో చాలా చెప్పింది ఎడ్మాష్టారమ్మ”

“అవునా అమ్మా?”

“మనింటికి వచ్చాక మీ నాన్నాను నాన్న అంటుంది. నన్ను నోరారా అమ్మా అనిపిలుస్తుంది. ఇంటి పనుల్లో నన్ను చెయ్యిపెట్టనివ్వదు. నాన్న పాదాలకు నూనెతో మర్దనా చేస్తుంది. నాకు తలకు నూనె పూసి, ఎప్పుడైనా అడక్కుండానే పేలు దువ్వెన పట్టుకుంటుంది. మా ఇద్దరికీ వండి పెడుతుంది. మనింట్లో ముద్ద ముట్టదు. పోయి వండుకు తింటుందట. అభిమానస్థురాలని చెప్పింది మేష్టారమ్మ”

“మొత్తానికి మంచి మనిషినే కుదిర్చారు మేడమ్ గారు”

“నువు ఇంజనీరింగ్ చేసిన కాలేజీ ఏవూరు? నోటికి ఆ పేరు తిరగదు”

“గబుక్కున మీ అమ్మాయికీ తిరగదు లే అత్తయ్య. రాజాం లో ఉంది ఆ కాలేజీ. గ్రంధి మల్లిఖార్జున రావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి” అన్నాను నవ్వుతూ.

“ఆఁ రాజాం అనే చెప్పింది. అక్కడ్నుండి అచ్చుతాపురం పరవాడ సముద్రపొడ్డుకు వచ్చేసి, అక్కడున్న ఏదో మందుల కంపెనీలో అతను కేజువల్‌గా చేరాడట. ఆ మజ్జెన గేసు డ్రమ్మేదో పేలి, ఆ గేసు పీల్చి భర్త చనిపోయాడట. పిల్లా పాపా లేరని చెప్పింది. అలా జరిగిన ఇంట్లో పిల్లలుంటే, వారి భవిష్యత్తు నరకమే కదమ్మా! అలాంటి కష్టం పగవారిక్కూడా రాకూడదమ్మా! ఏమిట్లో మరి. నేనడగలేదు!”

“అవునా పాపం! అయినా పిల్లలు లేకపోవడం అనేది వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలమీద ఆధారపడి ఉంటుంది. అదేమీ శాపం కాదు. అయినా వాళ్ళు ఏమిట్లయితే ఏం?”

“అది కాదమ్మా. పల్లెటూళ్లలో ఇటువంటి ఆరాలన్నీ మామూలే కద. నీకు తెలవదా. ఊళ్ళో ఎవరైనా ఏమిట్లయినా అందరూ అందర్నీ వరసలతోనే పిలుచుకుంటారు. సరోజ నీలాగ గుణవతి అనుకో. ఇక్కడికొచ్చి, మీతో బాటు ఇరవయ్యి నాలుగు గంటలూ తిరిగే మనిషి గురించి, మీకు తెలియాలి కదమ్మా! అందుకని!”

“నీకు తెలుసు కదమ్మా, నాకూ మీ అల్లుడికీ అటువంటి పట్టింపులంటే గిట్టవని!”

***

“అక్కా! నీళ్ళు కాగాయా? చిల్లర సొరుగులో ఉంటుంది కదా. నేనే ఇవ్వాలా. రెండొందలు తీసుకెళ్లు. పాలు కూరలకు సరిపోతాయి. ముందు ఆయనకు టిఫిన్ పెట్టేసెయ్. ఆయన వెళ్ళాక మనం తిందాము. ఆయన వచ్చే టైమవుతోంది. పకోడీయో నాలుగు బజ్జీలనో చేసి పెట్టు. టీ తో బాటు ఇష్టంగా తింటారు. రేపటికి పెసరట్లకు నానబెట్టు. ఉప్మాతో ఉల్లి పెసరట్టు బాగా ఇష్టపడతారు” ఇలా ఇంటి అవసరాల్లో, బజారు పనుల్లో అంతా తానై కుదిరిపోయింది సరోజ.

***

రోజులు గడుస్తున్నాయి. ఓ ఆదివారం నాడు నేనూ మా ఆవిడా బాల్కనీలో కూర్చున్నాము. సరోజ మాకు కాఫీ అందించి, మా ఇంటి దగ్గరలోని శివాలయానికి వెళ్లింది. ప్రతి రోజూ శుభ్రంగా స్నానం చేసేసి, పూజ చేసుకునేది. తన  పూజకు అన్నీ రెడీ చేసేసి, ఆది సోమ మంగళ శుక్రవారాల్లో గుడికి వెళ్లొస్తూ ఉంటుంది.

“మా అమ్మ అన్నట్టుగా సరోజ గుణవతి కదండీ?!? నా వల్ల మీమీద పడే భారాన్ని పూర్తిగా తనే తీసుకునేసింది. మీ అవసరాలను కూడా తనే చూసుకుంటోంది కదండీ. నాకు చేసినట్టే, సరోజ పేర కెనరా బేంక్‌లో ఏంజెల్ అకౌంట్ ఓపెన్ చేయించండి. తన డబ్బుల్లోని ముప్పై వేలు జమ చేస్తే, ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కదండీ?”

“అవునవును. నేనూ గమనిస్తున్నాను. మేడమ్ గారు అత్తయ్యకు చెప్పినదానికంటే, అత్తయ్య నీకు చెప్పిన దానికి మించి పనిమంతురాలు. ఎక్కడివక్కడే ఉంటున్నాయి. డబ్బులో బంగారమో అని కాదు గాని, అన్నీ ఇంటాక్ట్‌గా ఉంటున్నాయి. మంచి మనిషి. ఒకేమనిషికి ఇన్ని కష్టాలేమిటా అని రేపు ఆదివారం సూర్ణారాయణమూర్తిని నిలదియ్యి”

“కర్మ సిద్ధాంతాలను ఎవరూ మార్చలేరండీ! ఏవండీ. వాళ్ళ సొంత ఊళ్ళో ఎవరైనా ఉన్నారో లేదో చెప్పలేదు. భర్త వైపు వాళ్ళో, తనవైపు వాళ్లెవరైనా ఉన్నారో లేదో తెలియదు. తనదీ నా వయసో, నాకన్నా పెద్దదో చిన్నదో? ఏమో. వయసుతో పనిలేకుంటా, నాకు లాగా, ఎవరికైనా ఎప్పుడైనా సుస్తీ చేస్తే చెయ్యొచ్చు. మన దగ్గర ఉన్నంతకాలం మనమే చూసుకోవాలి కదండీ”

“మన దగ్గరే ఉంటుందని ఏముందీ? ఎవరైనా మనకంటే మంచిగా ఆఫర్ చేస్తే మనం అడ్డు చెప్తామా?”

“ఇన్ని నెలలుగా మనతో ఉన్న సరోజలో డబ్బు మనిషిని చూడలేదండి. జీతం తీసుకోవడం లేదు. అవసరపడితే అడుగుతానంటోంది. డబ్బుల కోసమైతే, మనల్ని విడిచి పెడుతుందని నేను అనుకోను”

“సర్సరే! ఇంతకీ ఏమి చెప్పదలచుకున్నావో చెప్పరాదూ?”

“మన వంతు సాయంగా ఆమె పేర, ఎల్.ఐ.సి పాలసితో బాటు, మెడికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోండీ”

“బావుంది. చాలా బావుంది. కెనరా బేంక్ అన్నావు బావుంది. ఇంటి పనిమనుషులకు ఇన్స్యూరెన్స్ పాలసీలను తీసుకోమనే యజమానురాళ్లను నీలోనే చూస్తున్నాను”

“అది కాదండీ”

“అవును. నేను చెప్పేదీ అదికాదనే. చూడు మదర్ మేరీ! నేను రిటైరయ్యాక, నీతోనే నాలోకం. ఆనక ఈమెతో మనకు పనేం ఉండదు. ఇప్పటికీ ఈ విషయానికి ఫులుస్టాప్ పెట్టు”

***

నేను రిటైరయిన రోజున ఆనవాయితీగా నా మిత్రులందరూ ఇంటివరకూ సాగనంపారు.  హుషారుగా ఉన్న నేను మా ఆవిడతో అన్నాను, “ఈ క్షణం నుండి నేను నీ దాసుణ్ణి. నేను నీకే అంకితం. ఈజిట్ ఓకే” అంటుండగా, సరోజ టీ స్నాక్స్ తెచ్చిపెట్టి, తన పనిలోకి వెళ్లిపోయింది.

ఆమె వెళ్ళిన వైపు చూస్తూ, “ఇక మీ అమ్మగారితో చెప్పేద్దామా ఈమెను ఊరుకు పిలిపించేసుకొమ్మని”

మా ఆవిడ నన్ను కళ్ళతోనే వారించింది. “తొందరపడకండి. పండగలకు మా అమ్మను రమ్మంటాను. సరోజ విషయాన్ని చెప్పి, సలహా అడుగుదాము. అక్కడికి అవసరమో లేదో తెలియాలి కదండీ”

మేం మాట్లాడుకుంటుండగా నా ఫోను రింగయ్యింది. “థేంక్స్ రా” అంటూ బాల్కనీలోకి నడిచాను. నా మిత్రుడు యలమంచలి  సత్యం. యలమంచలి వాడి ఊరు పేరు. ఆఫీసులో నాకు వన్నియర్ సీనియర్. వాడితో ఎప్పుడు మాట్లాడినా, వాడిని ఎప్పుడు కలుసుకున్నా, మరో ఆర్నెల్లకు సరిపడా ఎనర్జీ ఇస్తాడు.

“ఎవరండీ అంత హేపీగా ఉన్నారు?”

“యలమంచలి సత్యం. నీకు తెలుసుకదా. రిటైర్మెంట్ ఫంక్షనుకని వచ్చాడు. రిటర్న్ గోదావరి ఎక్కేసాడట”

“ఇంటికి తీసుకు రాలేకపోయారా? అతనే కదా? పెళ్లికాని సత్తిగాడు అంటూ ఉండేవారు?” అంటూ నవ్వేసింది.

“ఇక వాణ్ని అలా పిలవడానికి లేదు. పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వాడే చెప్పాడు. పేపర్లో ఇష్టం లేదట. మేరేజ్ బ్యూరోవాళ్ళకు, తెలిసిన ఫ్రెండ్స్‌కు చెప్తున్నాడట. గవర్న్మెంట్ లో రిటైరైన వాళ్ళకోసం ఆర్టీసీ X రోడ్స్ లో ఒక మేరేజ్ బ్యూరోకు మార్నింగ్ అటెండ్ అయ్యి, నా ఫంక్షనుకు వచ్చాడు. ఇక్కడికి దగ్గరలోనున్న హఫీజ్ పేటలో మరొకటి ఉందట. కనుక్కోమన్నాడు. ఎవరైనా ఉంటే రిఫర్ చెయ్యమని అడిగాడు. కుదిరితే, సింపుల్‌గా అన్నవరం గుడిలో కానిచ్చేసుకుంటానన్నాడు. మనం తప్పకుండా అటెండవ్వాలి”

“రిటైరయ్యేదాకా ఎందుకని చేసుకోలేక పోయాడండీ?”

“నీ ప్రశ్నలోనే జవాబుంది. చేసుకోలేకపోయాడు. కుటుంబ బాధ్యతలతో చేసుకోలేకపోయాడు. బాధ్యతలు తీరేనాటికి వీడికి వయసు తీరిపోయింది. వద్దనుకున్నాడు. ఎవరు నచ్చచెప్పారో, ఎవరు మనసు మార్చారో, ఇప్పుడు చేసుకుందామనుకుంటున్నాడు. తనకు నచ్చిన అనాథనో, అభాగ్యురాలినో, విధవరాలినో, డైవర్సీనో చేసుకొని, తనకో జీవితాన్నిద్దామనుకుంటున్నాడు. ఈ రోజు తన మనసు విప్పాడు. మనసున్న మనిషి. గొప్ప స్నేహితుడు”

“మీరు చెప్పేదాని బట్టి అతనో సంఘ సంస్కర్త అనే కితాబివ్వాలి. చేసుకోబోతున్నామెకు మీ డిపార్ట్మెంటు  భార్య హోదా ఇస్తుందాండి?”

“ఆఁ ఆఁ! ఇస్రో వారు ఇటీవల ఒక ఆర్డరు పాస్ చేశారు. రిటైర్ అయ్యేవరకూ పెళ్లి చేసుకోని వారు, రిటైరయ్యాక పెళ్లి చేసుకున్నాచెల్లుబాటవుతుంది. సర్వీసులో ఉంటుండగా పెళ్లి చేసుకొని, స్పౌస్‌ను కోల్పోయినా, విడాకులు ఇచ్చిపుచ్చుకున్నాక, సర్వీసులో ఉన్నా, రిటైరయినా పెళ్లి చేసుకోవచ్చును. డెపార్ట్మెంటు గుర్తిస్తుంది అనేది ఆ ఆర్డరు”

“అవునాoడీ!” అంటూ సంతోషపడిపోయింది.

“ఆఁ! ఆ మంచి ఆశయముతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. వివరంగా చెప్పాడు. వినగానే, ఆగలేక, అందరిముందు, నా మెళ్ళో ఉన్న మాలను వాడి మెళ్ళో వేసేశాను”

***

ఓ రోజు మా ఆవిడ ఆయాసంతో తెగ హైరానా పడిపోతోంది. అటువంటి సమయాల్లో ఎలా మేనేజ్ చెయ్యాలో డాక్టర్లు చెప్పినట్టుగానే చేస్తున్నాను. సరోజ కూడా తను ధైర్యంగా ఉంటూ, నాకూ మా ఆవిడకూ ధైర్యం చెప్తూ, సపర్యలు చేస్తోంది. డాక్టర్ సంజన కలిమిరెడ్డికి ఫోన్ చేశాను. ఆమె వచ్చింది. అప్పటికి గండం తప్పించింది. తర్వాత వారం రోజులుగా  డాక్టర్ చెప్పినట్టుగానే, సరోజ మా ఆవిణ్ణి రాత్రింబవళ్ళు కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటోంది.

ఆ రోజు సరోజ బజారుకు వెళ్లింది. నేను మా ఆవిడ పక్కనే కూర్చున్నాను. ఆమె నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఏకధాటిగా ఏడుస్తోంది. మాట్లాడగలిగే స్థితి ఉన్నా, మాట్లాడలేక పోతోంది.

“ఏమీలేదు. ఏమీకాదు. డాక్టర్ సంజన కూడా చెప్పింది. ఈరోజు వస్తానంది. రానీ. అడుగుతాను”

“ఏమైనా అయితే?”

“నీకేమైనా ఉందా. ఇంజనీరింగు చదివావు. వాస్తవాలు చూస్తూ, వింటూ కూడా ఎందుకిలా మాట్లాడుతున్నావు?”

“చదువుకున్నాను. జాబ్ చేస్తానన్నాను. నీకేంటే మహారాణివి. ఎవరైనా నీకోసం పనిచేయాలి గాని, నువ్వు ఎవరికోసమో పనిచెయ్యడమేoటన్నారు. ఎన్నేళ్ళైనా పిల్లలు కలగలేదని దిగులు పడుతూ ఉంటే, మనకెందుకే పిల్లలు, నేను నీకు చాలనా అన్నారు. ఈ మాయదారి జబ్బొచ్చి తడవతడవకూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, విసుక్కోకుండా నెలల తరబడి సెలవులు పెట్టేసి, నాకోసం హాస్పిటళ్ళమ్మట తిరుగుతూ, సేవ చేస్తూ ఉన్నారు. దాచుకున్నదంతా నా కోసమే తగలేస్తున్నారు”

“అదే మరి. దాన్నే మేజిక్స్ ఆఫ్ మేరీడ్ లైఫ్ అన్నారు” అంటూ తేలిగ్గా నవ్వేశాను, ఆమెను తేలికపరచాలని.

“కాదండీ! నా పరిస్థితి నాకర్థమవుతూ ఉందండి. నాకేమైనా అయితే మీరు ఒంటరి అయిపోతారు. ఏవండీ! నాకేమైనా అయితే, మీరు మళ్ళీ పెళ్లి ఛేసుకోవాలి. అంతే!” అంటూ లిప్తపాటులో, తన చేతిలో ఉన్న నా చేతిని, తన తలమీద పెట్టుకునేసింది.

“హా! వాటీజ్ దిస్. ఆర్యూ మేడ్! మళ్ళీ సీరియల్స్ చూస్తున్నావా ఏం?”

“మీరు మాటివ్వకపోతే నేను పిచ్చిదానిగానే చనిపోతాను”

ఆ మాటతో నేనక్కడనుండి బయటకు వచ్చేశాను.

***

పండగల్లో మా అత్తగారు వచ్చి వెళ్లారు. ఆ నాల్రోజులూ మా ఆవిడ బాగానే తిరుగాడింది. కోలుకుoటున్నాదనే డాక్టర్ సంజన అభిప్రాయపడింది. మా ఇంటి బాల్కనీలోనూ, చుట్టు పక్కలా తిరుగుతున్న పావురాలను గమనించి, ఓ మాటంది. “వీటివల్ల కూడా ఊపిరి తిత్తుల వ్యాధులు అగ్రివేట్ అవుతాయి, మేడమ్‌కు మంచిది కాదు. నెట్స్ వేయించుకోండి” అనేసి వెళ్లిపోయింది.

తెల్ల వారింది. మా ఆవిడతో కబుర్లు పెట్టుకున్నాను. రిటైరయ్యాక మరో పనేముంటుంది?

“ఏమండీ! నా కిప్పుడు బాగానే ఉంది. ఓ నాల్రోజులు ఏవైనా గుళ్లూ గోపురాలూ తిప్పి తీసుకురండీ”

“నాకూ అలాగే ఉంది. వెళ్తూ వెళ్తూ చెంగాళ పరమేశ్వరి, వేనాడు దర్గా, అక్కడ్నుండి చెన్నై చేరుకొని, అష్ట లక్ష్మిదేవాలయం, వేళoకిణ్ణి చర్చి చూసుకొని వద్దాము. డాక్టరును అడుగుదాము, ఏమంటుందో విన్నాక ప్లాన్ చేద్దాములే”

“అలాగనే. మీ ఇష్టం. కాఫీ తాగుదామా?”

“అక్కా అక్కా!” జవాబు లేదు. “పాలు నిండుకున్నాయేమో. బజారుకు పోయుంటుంది”

కాసేపట్లో తిరిగొచ్చిన సరోజ, కొల్హాపూరు మహాలక్ష్మి దేవిలా అనిపించింది. చేతిలో ప్రసాదం మరో చేతిలో కుంకుమ పొడి ఉన్న తమలపాకు.

“చెప్పకుండా వెళ్లావేమక్కా?”

“వార్తలు విందామని టీవీ పెడితే, ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకునే రోజు అని చెప్తున్నారు. మీ పేర అర్చన చేయించాలనిపించింది” అంటూ చేతిలోని వాటిని టీపోయ్ మీద పెట్టింది.

చాలా ఆశ్చర్యమేసింది. ఆనందమనిపించింది. బొట్టు పెట్టమన్నట్టుగా మా ఆవిడ సరోజ ఎదురుగా నిలబడింది.

“నేను పెట్టకూడదు. నువ్వే పెట్టుకోమ్మా” అన్నట్టుగా చూసింది సరోజ.

“నువ్వు మాకోసం పూజలు చేయించవచ్చు. మాకు సేవలు చెయ్యొచ్చు. మాకు వండి పెట్టొచ్చు. తోడబుట్టిన లాంటి దానివైనా, నా నుదుటున సింధూరం పెట్టకూడదంటావు!? అంతేనా?? అంతా ట్రాష్. అలాంటి ఆచారాలూ అపచారాలు ఈ ఇంట్లో కుదరనే కుదరవు. పెట్టక్కా!” అంటూ బొట్టు పెట్టించుకుంది. నాకు మా ఆవిడే పెట్టింది.

ఆ సంతోషంలో సరోజ చేతిలో కొన్ని ఐదు వందల నోట్లు పెట్టింది.

“ఇన్ని నాకెందుకమ్మ. అన్నీ మీరే చూసుకుంటున్నప్పుడు డబ్బులతో పనేముంటుంది”

“మా సంతోషం కొద్దీ ఇస్తున్నాము. మహాలక్ష్మిని కాదనగూడదక్కా! అవసరపడితే అప్పిద్దువుగాని”

***

రోజులు గడుస్తున్నాయి.

అప్పుడప్పుడే, కరోన కలకలం మొదలైంది. భయపెడుతున్న టీవీని చూడడం మానుకున్నాము.

“నిన్ను చూసుకోడానికి నేనున్నానుకదా. ఈ టైములో ఇక్కడుంటే ఇబ్బంది పడుతుందేమో. సరోజను ఊరు వెళ్లిపోమందామా?”

“ష్! వినబడుతుంది. వినిందేమో ఖర్మ. ఇన్నాళ్లూ చేయించుకొని, ఈ పరిస్థితుల్లోనా వెళ్లిపోమనేది? కాని కాలంలో కఠినంగా ఆలోచించడం భావ్యం కాదండీ”

“సరే” అయిష్టంగానే అన్నాను.

పోనుపోనూ కరోనా ఫీవరు ముదురుతున్నట్టుగా తెలిసి, జనాల అలికిడి తగ్గుతోంది. దేశ ప్రజానీకం సంసిద్ధం కాని ఒకానొక రోజున, దేశం మొత్తం  లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. దేశం తన ఊపిరిని తనే బిగబట్టుకునేసింది. జనజీవనాన్ని అష్ట దిగ్బంధనం చేసేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే. ఎక్కడి రైళ్లు అక్కడే. ఎక్కడి విహంగాలు అక్కడే. ఎక్కడి మనుషులు అక్కడే. ఎక్కడి ఫైళ్ళు అక్కడే. షాపులు మూసుకున్నాయి. పరిశ్రమల సైరెన్లు మూగబోయాయి. ఆసుపత్రులు మినహా అన్నీ బంద్.

దేశం మాట అటుంచి, మా ఆవిడ విషయo లోనే నాకు ఆందోళన మొదలైంది. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే? డాక్టర్ సంజనను రమ్మనలేను. ఈవిణ్ణి తీసుకెళ్లలేను. మందూ మాకూ ఎట్లా? కరోనా భయంతో, సాయం చేయగలిగే వాళ్ళు కూడా అందుబాటులోకి రారు. హోల్‌సేల్‌గా కొని తెచ్చుకుంటాము కాబట్టి వెచ్చాలకు ఇబ్బంది ఉండదు. పాలపిండితో టీ కాఫీలు గడిచిచిపోతాయి గాని, కూరగాయలు? పక్కింటి గాలి సోకినా కరోనా తగులుకుంటుందనే పుకార్లు రౌండ్లు కొడుతున్నాయి. అందరూ తలుపులు బిగించేసుకుంటున్నారు. మనిషికి మనిషి ఎదురైతే, ఇద్దరిలో ఒక్కడే మిగులుతాడనే బెదురు సర్వవ్యాపితమైపోయింది. ఇటువంటి వార్తలతోనే జనాలు సగం చచ్చిపోతున్నసందర్భం.

ఏ పరిస్థితి ఎదురు రాకూడదనుకుంటానో అదే ఎదురైంది. చాలా రోజుల తర్వాత, ఆ రాత్రి మా ఆవిడ పరిస్థితి దిగజారడం మొదలైంది. దానికి తోడు జ్వరము జలుబు దగ్గు ఒళ్ళు నొప్పులు, విపరీతమైన ఆయాసoతో మాట రావడం లేదు. గుండె దడ అంటూ సైగలు చేస్తోంది.

“నేను రాలేని పరిస్థితి. పోలీస్ పికెటింగు. మరో పక్క కర్ఫ్యు. బీపీ పల్సు ఆక్సీజెన్ టెంపరేచరు చూశారా?”

చెప్పాను.

“మీరు చెప్పిన రీడింగ్స్ చూస్తుంటే, ఇది కరోనా లాగానే అనిపిస్తోంది. చూద్దాం. గంటగంటకు రీడింగ్స్ నోట్ చేస్తూ ఉండండి. ఏం ఫర్వాలేదు. యెర్లీ మోనింగ్ మీ కార్లో కిమ్స్‌కు తీసుకెళ్ళండి. పోలీసులు అడ్డుకుంటే నాకు ఫోన్ చేయండి. వాళ్ళతో మాట్లాడతాను. డాక్టర్ రాజేశ్ కంచర్ల గారికి  వివరంగా చెప్తాను” అనేసి ధైర్యం చెప్పింది డాక్టర్ సంజన.

కరోనా మాట వినగానే, “సరోజా! ఈ రూమును ఐసొలేట్ చేస్తున్నాను. నువ్వు రావద్దు. నీ రూములోనే ఉండు. ఏమైనా అవసరపడితే ఫోన్లో అడుగుతాను. డోరు బయట పెడుదువుగాని”

నా మాటలను పట్టించుకోకుండా, సరోజ వేడి నీళ్లని, పాలని, గ్లూకోజ్ అంటూ అటూ ఇటూ తిరుతోంది. గంటకోసారి పాదాలనూ, అర చేతులనూ కొబ్బరి నూనెతో మర్దనా చేస్తోంది. నుదుటిమీద అమృతాంజనం రుద్దుతోంది. నేను ఒకటికి రెండు సార్లు చెప్పి చూశాను.

“ఏవండీ!” అంటూ నా చేతిని తట్టింది. సరోజా హాల్లో కూర్చుంది. టైము నాలుగు దాటింది. బ్రహ్మకాలం. మా ఆవిడ నా చేతిని తన చేతిలోకి తీసుకొని, ఆరోజు మాదిరిగానే నా చేతిని తన తలపైకి లాగి పెట్టుకుంది.

“మీరు చేస్తున్న సేవకు, పంచిన ప్రేమానురాగాలకు బదులుగా నేను మీకేమి తిరిగివ్వలేను. మీ రుణం తీర్చుకునే అవకాశం నా చేతుల్లోంచి జారిపోతోతున్నట్టుగా అనిపిస్తూ ఉందoడీ. ఈ క్షణంలో, మిగిలిన మీ వందేళ్ల జీవితాన్ని సంరక్షించుకునే ఏర్పాటే, నేను ఆరోజూ  కోరుకున్నాను, ఈరోజూ గుర్తు చేస్తున్నాను” ఆయాసపడుతూ చెప్తోంది.

“సరోజా సరోజా”

లోపలికోస్తూ, “ఏం కాదమ్మా. ధైర్యంగా ఉండు. నీకు మేమున్నాo” సరోజ మాట్లాడుతూనే ఉంది.

తెల్లారే లోపల, ఏమనుకుంటాడో ఏమో అనుకున్నా, ఏమనుకున్నా ఫర్వాలేదు అనుకుంటూ, కిమ్స్ డాక్టర్ రాజేష్‌కు ఫోన్ చేశాను. తను నా కొలీగ్ కంచర్ల వెoకటేశ్వర రావు కొడుకే.  ఫంక్షన్స్‌కు తండ్రితోబాటు వచ్చేవాడు.

“చెప్పండంకుల్. మీ నంబర్ నాదగ్గరుంది. వై. కృష్ణప్రసాద్ కొడుకు పెళ్ళిలో ఇచ్చారు. ఈ టైములో కాల్ చేశారేం?”

విషయమంతా వివరంగా చెప్పాను.

“శిల్పా పార్క్ మా యింటికి టెన్ మినిట్స్ డ్రైవ్. మీరు హాస్పిటల్‌కు రావడం అంటే, హెక్టిక్ టాస్క్. నేనే వస్తున్నాను. కరోనాలో సీరియస్ కేసులను అటెండవడానికి సీనియర్‌గా నాకు పర్మిషన్ ఉంది. మీ లొకేషన్ షేర్ చేయండి”

లక్ష్మణుడి వైద్యానికి, సంజీవ పర్వతాన్ని అవలీలగా ఎత్తుకొచ్చిన అభయాంజనేయుల వారిలా అనిపించాడు.

డాక్టర్ రాజేశ్ తో బాటుగా, మదర్ ధెరేశా ఎన్.జి. వో టీముకూడా, మా ఇంట అడుగు పెట్టింది.

“నథింగ్ టు వర్రీ ఆంటీ. నేనున్నాగా” ఏడుస్తున్న పేషెంటు పక్కనే కూర్చున్నాడు తలనిమురుతూ.

నా దగ్గర నెంబరు తీసుకొని, డాక్టర్ సంజనతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు.

మెడికల్ యెక్విప్మెంట్ తో వచ్చిన మదర్ ధెరేశా టీము, డాక్టర్ డైరెక్షన్‌లో చేసుకుపోతున్నారు.

“అంకుల్. నేను ఫోను తీసుకోలేకపోతే, మా నాన్నకు ఫోన్ చేయండి నన్ను అలర్ట్ చేస్తారు. తన ఫోన్ తీసుకోకపోయిన రోజున, నాకు అక్షింతలే” అంటూ నవ్వేసి, “ఈ టీము ప్రతి రోజూ ఉదయమూ సాయింత్రమూ వచ్చి, మోనిటర్ చేస్తారు. డాక్టర్ సంజనాకు అప్డేట్ చేస్తూ ఉంటారు. వస్తాను. అమ్మా! తొందరలో నాకు భోజనం తినిపిస్తావు” మోగుతున్న మొబైల్‌ను తీసుకొని, మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు, డాక్టర్ రాజేష్. అంతా కల లాగా జరిగిపోయింది.

***

మరో పదిహేను రోజులవరకూ బాగా ఇబ్బంది పడినా, సరోజ సమకూర్చిన సౌకర్యాలతోనూ, ఆమె ఇచ్చిన మానసికమైన బలంతోనూ, తన పనులు తను చేసుకునేందుకు శక్తి కూడుకుంది. మామూలు మనిషి కావడానికి బాగా టైము పట్టింది.

మామూలు స్థితికి చేరుకునేనాటికి, లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్టు పాలకులు ప్రకటించారు. ఫ్రీజయినవన్నీ మోషన్ లోకి వచ్చేశాయి. ఆ రాత్రి రాత్రంతా మా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాణాసంచా వెలుగుల్లో పట్టపగలుగా మారిపోయాయి.

మర్నాడు ఉదయం లేటుగా లేచాను. లేచేసరికి సరోజ కనిపించలేదు. పిలిచాను. పలకలేదు. పూజ గదిలో దీపాలు వెలుగుతున్నాయి. పూజ ముగించుకొని గుడికి వెళ్ళుంటుంది. లేదా పాలకు కూరలకో పోయుంటుంది అనుకున్నాను. నా తెల్లవారి కార్యక్రమాలకోసం, అటూ ఇటూ తిరుగుతుండగా, సరోజ ఊరునుండి మా ఇంటికి వచ్చినప్పుడు తెచ్చుకున్న చందనా బేగు, నా కళ్లబడింది.

శంకతో చూడగూడదు అనుకుంటూనే చూశాను. ఆమె కున్న రెండు చీరేలు, చీరల మధ్యన నాదీ మా ఆవిడదీ కలిసున్న పెద్ద సైజు ఫోటో ఉన్నాయి. అడుగున చిన్న మనీ పర్సు, అందులో ఆమె ఆధార్ కార్డు, వరల్డ్ మేరేజ్ డే న ఇచ్చిన ఐదువందల నోట్లూ ఉన్నాయి. అంటే, ఈమె మామూలు మనిషయింది, లాక్‌డౌన్ ఎత్తేశారు కాబట్టి, మాకు  తన అవసరం లేదనుకుని, ఊరికి బయలుదేరుతోందన్న మాట.

సరోజ సెంట్రిగ్గా నాలో ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు.  ప్లస్సులు, మైనస్సులు, మల్టిప్లికేషన్లు!!

నిద్రపోతున్నమా ఆవిడను లేపాను. సరోజ వెళ్లిపోవడానికి రెడీ అయ్యింది అని చెప్పాను. తుళ్లిపడింది. గబగబా రూము బయటికి వచ్చి, హాల్లో ఉన్న చందనా బేగును మా రూములోకి మార్చేసింది.

కాసేపటికి ఆమె గుడి నుండి వచ్చినట్టుగా, చేతిలోని ప్రసాదాన్ని తమలపాకులోని కుంకుమను టీపోయ్ మీద ఉంచుతూ, “స్నానం చేశాక బొట్టు పెట్టుకొని, ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తీసుకొండి” అన్నది.

“సరోజా! మనం అన్నవరం వెళ్లొచ్చాక నీ ఇష్టం. మాతో ఉండాలన్నా, ఊరుకు వెళ్లిపోవాలన్నా నిర్ణయం నీదే!” తనతో నేను మాట్లాడిన పొడవైన వాక్యం కూడా ఇదే!

***

మర్నాడు ముగ్గురం అన్నవర సత్యదేవుని పుణ్యక్షేత్రానికి బయలుదేరాము.

చీకటి ముదురుతుండగా, కారు ఎటుపోతోందో ఆడవాళ్ళిద్దరికి తెలియడo లేదు.

ఓ మూడంతస్తుల మేడ ముందు కారాగింది.

కారు దిగకుండానే ఫోన్ చేశాను.

“ఏంట్రా ఈ వేళప్పుడు కాల్ చేశావు. నేనే నీకు చేద్దామనుకున్నాను”

“సరే! నేను మీ ఇంటి గేటు ముందున్నాను”

“ఆఁ!”

“ఆఁ!!”

పండక్కి డెకోరేట్ చేసున్నట్టుగా, బిల్డింగు మొత్తo పైనుండి కిందివరకూ లైట్లు వెలిగాయి.

రావడం రావడం నన్ను చుట్టేశాడు సత్తిగాడు. పరిచయాలయ్యాయి. భోజనాలయ్యాయి.

తమలపాకులకు సున్నం రాస్తూ, వక్కల్ని ముక్కలుగా చేస్తూ కాస్తంత చక్కెరను చల్లుతూ అన్నాడు, “ఇంటి ఇల్లాలు లేక నేనే పనులన్నీ చేసుకోవాల్సి వస్తోందిరా” నవ్వేస్తూ.

నేను తమలపాకును సమోసా షేపులోకి చుట్టి, “తాంబూలాలను మార్చుకోడానికే మేము వచ్చాము రా” అంటూ, వాడి నోటికి అందించాను.

వాడితో బాటు మా ఆవిడ కూడా ఆశ్చర్యంగా నన్ను చూసింది.

అప్పటివరకూ చూసుకోని సత్యం సరోజా, అరవిరిసిన కళ్ళతో ఒకరినొకరు చూసుకున్నారు.

మాటల్లో పడి రాత్రి పన్నెండు దాటింది.

“ఇక పడుకొoడి. త్వరగా లేచి బయలుదేరాలి. తెలతెలవారే సరికి అన్నవరపుణ్యక్షేత్రం చేరుకుంటే, రత్నగిరి కొండల్ని పావనం చేస్తూ పారే పంపా నదిలో స్నానం చేసి, సత్యదేవుని సన్నిధిలో పూజాదికాలు పూర్తి చేసుకుంటే, ఆ పూజాఫలాలు జన్మ జన్మలకు మనలను దీవిస్తూనే ఉంటాయి”

***

మేమిద్దరమూ బాల్కనీలో కాఫీ తాగుతున్నాము. ఇంతలో మొబైల్ ఫోను మోగింది.  స్క్రీన్ మీద సరోజా సత్యం పేరు కనిపించింది.

“అన్నయ్యా! ఈరోజు ప్రపంచ వివాహ దినోత్సవ వేడుకలు జరుపుకునే రోజు. మీరు మాకు పెళ్లి జరిపించాక, ఇది నాలుగో సంవత్సరం”

“అట్లాగా! మెనీ మోర్ హేపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా!”

“మీ జంటకు కూడా అన్నయ్యా!”

సరోజ పలికిన మాటతో అప్పటి రోజులన్నీ మాకు వరుసగా గుర్తుకు వచ్చాయి.

ఆత్మశాంతి

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వేలూరి ప్రమీలాశర్మ గారి ‘ఆత్మశాంతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]గ[/dropcap]డియారంలో ముల్లులు కదులుతున్న శబ్దం తప్ప, గదిలో ఏ చప్పుడూ లేదు. రెండు రోజులుగా అదే నిశ్శబ్దం. జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా మంచం మీదనే ఉండిపోయాడు గోపాలం. టాబ్లెట్ వేసుకోవడానికి మంచినీళ్ల కోసం లేచి, నీరసం వల్ల కాళ్లు వణుకుతుంటే తూలి పడబోయాడు.

‘ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఈ బ్రహ్మచారి బ్రతుకు?’ నిట్టూర్చాడు. ఉద్యోగం వచ్చి ఆరేళ్లవుతున్నా పెళ్లి గురించి ఆలోచించలేకపోయాడు. తన ఆశయాన్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరికే వరకు పెళ్లి చేసుకోకూడదని దృఢంగా నిశ్చయించుకోవడమే అందుకు కారణం. పట్టించుకునే వాళ్లులేని లోటు, మనిషి అవసరం గోపాలానికి ఇప్పుడు తెలుస్తోంది. ఆకలికి కడుపులో పేగులు మెలిపెడుతుంటే గోడను ఆసరాగా చేసుకుని, మెల్లగా వంటగదిలోకి నడిచాడు. స్టవ్ పక్కనే ఉన్న అలమరాలోనుంచి బ్రెడ్ ప్యాకెట్ తీసి వెచ్చ చేసుకుని తిందాం అనుకునే లోపు.. మంచం మీదున్న ఫోను అదే పనిగా మోగుతుండడంతో వెనక్కి తిరిగి చిరాగ్గా చూశాడు.

ఆగకుండా మోగుతున్న ఫోన్ తీసుకుని హలో అనగానే.. “ఒరేయ్ గోపీ! నాన్న కండిషన్ చాలా సీరియస్‌గా ఉంది. నిన్న రాత్రి నుంచి వెంటిలేటర్ మీద ఉంచారు. షుగర్ కూడా డౌన్ అయిపోయింది. యూరిక్ యాసిడ్ లెవెల్స్‌లో మార్పు వల్ల పాక్షికంగా కోమాలోకి వెళ్ళిపోయారు“ ఏడుస్తూ చెబుతున్న చంటి గొంతు వినగానే, గోపి గుండె.. దడదడలాడింది.

“మావయ్య.. మావయ్యకి ఏమైంది? ఇంత సడన్‌గా ఎందుకిలా అయ్యింది? ఇంతవరకూ బాగానే ఉన్నాడు కదా! అంతలోకే..” దుఃఖంతో గొంతుపూడిపోయి, మాట పెగలక ఆగిపోయాడు.

“నిన్నటి నుంచీ ఫోన్ చేస్తూనే ఉన్నాను.. ఎత్తవేమిరా? ఎక్కడున్నావు? వెంటనే బయలుదేరి రా! నాకెందుకో చాలా భయంగా ఉంది” చెబుతున్న చంటి గొంతు వణుకుతోంది.

“కంగారు పడకు.. వెంటనే బయలుదేరుతాను” అంటూ హాస్పిటల్ వివరాలు నోట్ చేసుకున్నాడు గోపాలం. కాస్త ఓపిక చేసుకుని రెండు మగ్గుల నీళ్లతో స్నానం పూర్తయిందనిపించి, గబగబా షర్టు తగిలించుకుని బయలుదేరిపోయాడు.

***

విజయవాడలో బస్సుదిగి హాస్పిటల్‌కి చేరేసరికి మెల్లగా చీకట్లు ముసురుకుంటున్నాయి. గాభరాకి కడుపులో నుంచి పులకరం మొదలయ్యి, ఒళ్ళు వేడెక్కుతుంటే ఆటోలో కూర్చునే జ్వరం టాబ్లెట్ చింపి వేసుకొని, కాసిని మంచి నీళ్లు తాగాడు. గొంతులో అడ్డుపడిన మాత్ర ఊపిరాడనివ్వలేదు. దగ్గుతో ఉక్కిరిబిక్కిరవుతూ.. తెచ్చుకున్న బాటిల్లో నీళ్లు అయిపోవడంతో ఆటో ఆపమన్నాడు. రోడ్డు పక్కనే ఉన్న షాపులో వాటర్ బాటిల్ కొంటుంటే, గోపాలం దృష్టిని పక్కనే ఉన్న అరటిపండ్ల గెల ఆకర్షించింది.

‘మావయ్యకి అమృతపాణి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం’ అనుకుంటూ తినే పరిస్థితిలో ఉన్నా, లేకపోయినా మావయ్య కోసం డజను పళ్ళు కొని, తిరిగి ఆటో ఎక్కాడు.

అరగంట క్రిందటే ఐసీయూ నుంచి మావయ్యని రూమ్‌కి షిఫ్ట్ చేశారని చంటి ఫోన్ చేసి చెప్పడంతో ‘హమ్మయ్య! ఇక మావయ్య మనలోకి వచ్చినట్టే.. దేవుడా! నా ఆయుష్షు కూడా పోసి మావయ్య బ్రతికేలా చూడు’ మనసులోనే వేడుకున్నాడు గోపాలం.

“మీరు చెప్పిన హాస్పిటల్ ఇదే! దిగండి సార్!” అన్న ఆటో డ్రైవర్ మాటలతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చాడు గోపాలం. హాస్పిటల్ రిసెప్షన్లో వివరాలు చెప్పి, తన మేనమామను ఉంచిన రూమ్‌కి చేరుకున్నాడు. లోపలకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న బెడ్‌పై ఈ లోకంతో సంబంధంలేనట్టు పడుకొని ఉన్న మేనమామ శ్రీనివాసమూర్తిని చూసి.. దుఃఖం తన్నుకొచ్చింది గోపాలానికి. ముక్కులో నుంచి గొంతులోకి సన్నని గొట్టాలు అమర్చబడి ఉన్నాయి. భుజానికి పక్కగా  ఆ గొట్టం మొదలు వద్ద ఉన్న చిన్నగరాటు నుంచి, ద్రవహారాన్ని లోనికి పొయ్యడం చూసి తట్టుకోలేకపోయాడు. మావయ్య తనని ఒళ్లో కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిన రోజులు గుర్తుకొచ్చి, గోపాలం మనసు భారంగా అయిపోయింది.

మరోపక్క గోడవారిగా ఉన్న అటెండెంట్ బెడ్‌పై, మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని కూచుని మౌనంగా రోదిస్తున్న అత్తయ్యని చూసి చలించిపోయాడు.

‘మావయ్య లేకుండా అత్తయ్య ఎలా బ్రతకగలదు?’ అనుకుంటూ తన చెంపలపై నుండి కారుతున్న కన్నీరు తుడుచుకుని, అత్తయ్య భుజం మీద చేత్తో మెల్లగా తట్టాడు గోపాలం. మేనల్లుడిని చూడగానే ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది. అతని చేతిని తన రెండు చేతులతో నువ్వు పట్టుకుని, నుదుటికి ఆనించుకుని ఏడ్వసాగింది. వైద్యానికి స్పందించడం లేదని, ఇంటికి తీసుకుపోమని ఆసుపత్రి వైద్యులు చెప్పారని తెలిసి, నివ్వెరపోయాడు. ఆ స్థితిలో అత్తయ్యనెలా ఓదార్చాలో గోపాలానికి అర్థం కాలేదు.

“ఆయన చూడరా! బంధాలన్నీ తెంచుకొని వెళ్లిపోతున్నారు. ఇక నేను బ్రతికుండి ప్రయోజనం ఏముంది?” తల కొట్టుకుని ఏడుస్తున్న అత్తయ్యను దగ్గరకు తీసుకున్నాడు గోపాలం. ఆ వేదన తన చెవికి సోకినట్టు, శ్రీనివాసమూర్తి నోటినుంచి నురుగుతో కూడిన గురక శబ్దం సన్నగా బయటకు వచ్చింది.

వెంటనే మావయ్య దగ్గరకు వెళ్లి, ఆయన బెడ్ మీద కూర్చుని, గుండెలపై చేత్తో ప్రేమగా రాసాడు గోపాలం. బాటిల్ ఫ్లై క్లిప్పులోకి గుచ్చిన సూది నుంచి, ఒంట్లోకి ఎక్కుతున్న సెలైన్ ట్యూబ్ లోకి రక్తం వెనక్కు తన్నింది. తన స్పర్శకు మావయ్య గుండె వేగంగా కొట్టుకోవడం గమనించాడు గోపాలం. చిన్నప్పుడు తనకు జ్వరం వస్తే రాత్రుళ్ళు.. తనని మామయ్య పొదువుకుని పడుకోబెట్టుకున్న రోజులు గుర్తుకు వచ్చి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి.

***

మగ పిల్లవాడు కావాలంటూ నలుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత, మరోసారి కాన్పుకి సిద్ధమైంది గోపాలం తల్లి. అదృష్టం బాగుండి ఐదవ సారి మగబిడ్డ పుట్టినా.. చాలీచాలని జీతాల వల్ల పిల్లల్ని పెంచడం కష్టమయ్యింది ఆ దంపతులకి. దాంతో ఆడపిల్లలు హైస్కూల్ చదువుతూనే పుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అప్పటికే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న శ్రీనివాసమూర్తి, గోపాలం చదువు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెల్లెలికి నచ్చచెప్పి గోపాలాన్ని తనతోపాటు తన ఊరికి తీసుకుపోయాడు. కాలేజీ చదువు పూర్తయ్యేవరకూ అక్కడే పెరిగిన గోపాలం అంటే.. శ్రీనివాసమూర్తికి ప్రాణం.

“ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని గమ్యం చేరేవరకూ వెనుతిరిగి చూడవద్దు” అంటూ క్రమశిక్షణతో పెంచిన మామయ్య పెంపకంలో, గోపాలం వృద్ధిలోకి వచ్చాడు. అలా ఆ ఇంటి నీడలో ఇంకా ఎందరో పెరిగారు. తన సంపాదన అంతా నలుగురి ఉన్నతి కోసం ఖర్చు చేసిన శ్రీనివాసమూర్తి, తనకంటూ సొంత ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయాడు. రెక్కల కష్టం మీద ప్రయోజకుడైన కన్న కొడుకు కట్టించి ఇచ్చిన మూడు గదుల ఇల్లే వృద్ధాప్యంలో వారికి నీడనిచ్చింది.

మర్రి చెట్టులా.. ఓ మహా వృక్షంలా ఎందరికో నీడనిచ్చిన మామయ్యని, ఈరోజు ఈ పరిస్థితిలో చూసి గోపాలం తట్టుకోలేకపోయాడు. వైద్యానికి స్పందించని శ్రీనివాసమూర్తిని తీసుకుని ఇంటికి బయలుదేరారు. ఇల్లు చేరక ముందే కారులో వెనక సీట్లో గోపాలం ఒడిలో తల పెట్టుకున్న శ్రీనివాసమూర్తి శరీరం నల్లగా చల్లబడుతూ, కిందకి జారిపోయింది. ఉప్పెనలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని లోలోపలే అణుచుకోక తప్పలేదు గోపాలానికి.

అచేతనంగా మారిన శ్రీనివాసమూర్తి దేహం, అలసి నిద్రిస్తున్నట్టుగా ఉంది. ఎప్పుడూ జాగ్రత్తలు చెప్పే మామయ్య చెయ్యి.. తన చేతిచుట్టూ బిగుసుకుని ఉండడం గమనించి, ఆ చేతిని మెల్లగా ముద్దాడాడు గోపాలం.

“నువ్వు వెళ్ళిపోతే.. రేపు నాకు మార్గం చూపించే దిక్కెవరు?” అంటూ కుళ్ళికుళ్ళి ఏడ్చాడు.

***

అంతిమ సంస్కారానికి పాడె మోసి, రుణం తీర్చుకున్నాడు గోపాలం. పెద్దకర్మ రోజున బంధువులూ, పరిచయస్థులూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మౌనంగా గదిలో మూలన కూర్చుని ఏడుస్తున్న అత్తయ్యని పలకరించి, హల్లోకి వస్తున్నవారందరినీ తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు గోపాలం. చెరగని చిరునవ్వుతో చిత్తరువుగా మారిన మామయ్య ఫోటో వంక కన్నీళ్లు నిండిన కళ్ళతో చూసాడు. అపరాహ్నం వేళ కాకి పిడచ ముట్టకపోవడంతో, విస్తళ్ళు వెయ్యడానికి సంశయించి ఆగిపోయారు.

లోపం ఎక్కడ జరిగిందో తెలియజేయమని కళ్ళు మూసుకుని, మావయ్యకి మనసులోనే దణ్ణం పెట్టుకుని, వేడుకున్నాడు గోపాలం. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. హాల్లో శ్రీనివాసమూర్తి ఫోటోను ఉంచిన కుర్చీకి ఎదురుగా వేసిన కుర్చీల్లో.. వచ్చిన వారందరూ కూర్చున్నారు. తన తండ్రికి ఎంతో ఇష్టమైన సింహాచలం సంపంగి పూలను గుత్తిగా గుచ్చి, ఆయన ఫోటోకి వేసిన మల్లెల దండ మధ్యన ఉంచింది బిందు.

చంటీ, బిందూ ఇద్దరూ.. ఆయన కన్నబిడ్డలు. వారితోపాటే ఆ ఇంట్లో పెరిగిన గోపాలానికీ, మరో ఐదుగురికీ కూడా సమానమైన ప్రేమాభిమానాలు పంచిన శ్రీనివాసమూర్తి అంటే అందరికీ ఎంతో గౌరవం.

చెట్టు మీదనుంచి కిందకి దిగిన కాకి.. గోడ మీద ఉంచిన పిడచను చూస్తోందే తప్ప, ఒక్క మెతుకు కూడా ముట్టడంలేదు. నోరు తెరిచి కా.. కా అని అరుస్తున్న కాకిని చూస్తే.. మామయ్య తనతో ఏదో చెప్పాలని అనుకున్నట్టుగా అనిపించి,  గోపాలం తల ఎత్తి అటే చూస్తూ నుంచుండిపోయాడు.

శ్రీనివాసమూర్తి చిరకాల మిత్రుడు, పార్థసారథి గారు.. లేచి చేతికర్ర సాయంతో నాలుగు అడుగులు ముందుకు వేసి నుంచున్నారు. తన స్నేహితుడి ఫోటో ముందర కాసిని పువ్వులుంచి, ఒక్క క్షణం మౌనం తర్వాత గొంతు సవరించుకుని చెప్పడం ఆరంభించారు. ఆయన ఏం చెప్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

“శ్రీనివాసమూర్తికీ, నాకూ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎంతో సౌమ్యుడు, మితభాషి అయిన నా మిత్రుడు.. ‘చెయ్యాలనుకున్న పనిని ఆచరణలో చేసి చూపించాలే తప్ప, వ్యర్థ ప్రసంగాలు అనవసరం’ అనేవాడు. ఎందరికో తాను బాసటగా నిలిచి, వారి వ్యక్తిత్వాలను తీర్చిదిద్దాడు. తన వల్ల ఉన్నతంగా తీర్చిదిద్దబడిన వారందరి ఊపిరిలోనూ, వాడింకా సజీవంగానే ఉన్నాడు. నా మిత్రుడికి మరణం లేదు.” ధారాపాతంగా చెంపలపై కారుతున్న కన్నీటిని ఆపే ప్రయత్నం చేయలేదు ఆయన.

అక్కడ ఉన్న వారందరి మనసులూ బరువెక్కాయి. ఒకరి తర్వాత ఒకరు తన మామయ్య చేసిన మంచి పనుల గురించి చెబుతుంటే.. గోడకి జారబడి అలాగే చూస్తూ నుంచుండిపోయాడు గోపాలం. కాకి.. పిడచముద్దనుంచిన ఆకు ముందు నుంచుని, అలాగే చూస్తోంది తప్ప.. మెతుకు ముట్టడంలేదు.

అప్పుడు లేచి నుంచున్నాడు చంటి. తన తండ్రి ఫోటోకి నమస్కరించి, తాను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టాడు. అతని గొంతులో తీవ్రమైన ఆవేదన గూడుకట్టుకుని ఉండడం గమనించిన గోపాలం, ఏం చెబుతాడోనని వింటున్నాడు. దుఃఖం గొంతు పెగలనియ్యకపోవడంతో.. మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు చంటి. తమ్ముడి పరిస్థితి గమనించిన బిందు.. ముందుకు వచ్చి.. తన తండ్రి ఫోటోతో పాటు, అక్కడ ఉన్న అందరికీ నమస్కరించి చెప్పడం ఆరంభించింది.

“మా నాన్నకి మేమిద్దరమే కన్నబిడ్డలం. ఆయనకొచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని ఓ ఒడ్డున పడెయ్యడానికి ఆయన ఎంత కష్టపడేవారో ఈరోజు మీ అందరికీ తెలియాలి. మాకు ఊహ తెలిసినప్పటి నుంచీ, మాతోపాటు.. మా ఇంట్లో మా దగ్గర బంధువుల పిల్లలు కూడా ఉండేవారు. పల్లెటూర్లలో ఉంటున్న తన తోబుట్టువుల పిల్లలని, అక్కడ వారికి హైస్కూల్ సదుపాయం లేదంటూ.. తెచ్చి తన దగ్గర పెట్టుకుని చదివించారు నాన్న. అలా ఒక్కొక్కరు నాలుగైదేళ్లకు తక్కువ కాకుండా మా ఇంట్లో ఉన్నారు. నాన్న సంపాదించిన ప్రతి రూపాయినీ, ఇంతమందికీ కడుపు నింపడానికే ఖర్చు పెట్టారు. కన్నబిడ్డల కోసం ప్రత్యేకించి ఆయన నిలువ వేసింది ఏమీలేదు. నాకూ, తమ్ముడికీ చాలా ఉక్రోషంగా ఉండేది..” వెక్కిళ్ల మధ్య చెప్పడం ఆపేసి కాసిని మంచినీళ్లు తాగింది బిందు. అక్కతో పాటు,  తానూ గొంతు కలిపాడు చంటి.

“నాన్న తన చేతులతో ఎంతోమందిని పైకి తీసుకొచ్చారు. మా ఇల్లు ఎప్పుడూ ఓ సత్రంలాగానే ఉండేది. చిన్నప్పుడు ఎన్నోసార్లు అనుకునేవాడిని.. ‘నాన్న మా కోసం..  కేవలం మాకోసమే ప్రేమగా ఏదైనా తెస్తే బాగుండు’ అని.. కానీ ఆ ప్రేమను అందరితో పాటే మాకూ పంచారు తప్ప, కన్నబిడ్డలుగా మాపై ప్రత్యేకించి ఏ శ్రద్ధా చూపలేదు. ఆయన పంచిన ప్రేమలో లోపం లేదు. కానీ ఏది తెచ్చినా దానిని అందరితోపాటే మాకూ ఇచ్చేవారు తప్ప.. ప్రత్యేకించి అక్క కోసం, నాకోసమంటూ ఏదీ తెచ్చేవారు కాదు. నాకు చాలా కోపంగా ఉండేది. అక్క కూడా చాలాసార్లు చాటుగా ఏడ్చేది” చెబుతున్న చంటి మాటలకి అక్కడున్న వారి కళ్ళు చమర్చాయి.

“అవును. మా తమ్ముడు చెప్పినదంతా నిజం. మాకంటూ ఓ సొంత ఇల్లు లేదు. వాళ్ళ పిల్లల్ని మా దగ్గర వదిలేసిన వాళ్ళందరూ ఈరోజు బాగానే ఉన్నారు. కానీ ఇంతమందిని పెంచడానికి.. మా నాన్న, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా.. ఒక్క రూపాయి అయినా ఇచ్చి, మమ్మల్ని ఆదుకున్నవాళ్ళు లేరు. ఆయన మాకు ఆస్తులేవీ ఇవ్వలేదు.. కష్టపడడానికి రెక్కలు మాత్రమే ఇచ్చారు. ఆ రెక్కలే మాకు ఆధారం.” ఎన్నో ఏళ్లుగా వారి మనసుల్లో గూడు కట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది.

అందరూ నిశ్శబ్దంగా వారు చెప్పేది వింటున్నారు. ఒకరిద్దరు పెద్దవాళ్ళు.. లేచి వెళ్లి, వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. చూపుడువేలితో కళ్లద్దాలు పైకి తోసుకున్న పార్థసారథి గారు ఏదో చెప్పడానికన్నట్టు గొంతు సవరించుకున్నారు.

“మా శ్రీనివాస మూర్తి చాలా ఉత్తముడు. ఆ ఇంటి ఇల్లాలు మహాసాధ్వి. తన భర్త ఆశయాలకు చేదోడుగా ఉన్నదే తప్ప, ఒక్క మాటైనా పెదవి విప్పి, ఏనాడూ తన కష్టాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ఆ ఉత్తమురాలికి ఈరోజు, ఈ క్లిష్ట పరిస్థితి రావడం బాధాకరం. రత్నాల్లాoటి బిడ్డలున్నారు. కన్న బిడ్డలకన్నా ఎక్కువగా ఈ యింట పెరిగినవారూ ఉన్నారు. ఇంతమంది ఉండగా ఆమెకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారనే భరోసా ఉందనే అనుకుంటున్నాను.”

పెద్దాయన మాటలూ.. చంటీ, బిందూ అన్నమాటలూ గోపాలం మనసుకి ముల్లులా గుచ్చుకున్నాయి. దోషిలా తలదించుకుని నుంచున్నాడు. తోబుట్టువులా ఆత్మీయత పంచిన బిందు మనసులో, ఇంత బాధ ఉందని ఊహించలేకపోయాడు. ఉక్రోషంతో ముఖం ఎర్రగా మారిన చంటి పరిస్థితి సరేసరి.

“మా నాన్న గురించి, నువ్వు కూడా నాలుగు ముక్కలు మాట్లాడితే బాగుంటుంది.” ఆ మాటలు.. చంటి తనని ఉద్దేశించే అన్నాడని, గోపాలానికి అర్థమయ్యింది.

అంతవరకూ గోడ మీద కూర్చుని ఇదంతా గమనిస్తున్న కాకి.. మరి కొంచెం వెనక్కి జరిగి నుంచుంది. తల పైకెత్తి చూసిన గోపాలానికి.. నడినెత్తిన ఉన్న సూర్యుడి కిరణం సూటిగా కంట్లో గుచ్చుకుని, కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. కళ్ళు తుడుచుకుని రెండు చేతులూ జోడించి నమస్కరించాడు. హుషారుగా రెండు అడుగులు ముందుకు వేసిన కాకి.. పిడచముద్ద ఉంచిన ఆకు దగ్గరగా వచ్చి, తలపంకించి చూస్తోంది. నోరు తెరచి, క్రా.. క్రా అని అరుస్తున్న ఆ కాకిని చూస్తే, తన మేనమామ తనతో ఏదో చెప్పాలనుకున్నట్టుగా అనిపించింది గోపాలానికి.

కాసిని పువ్వులు తీసి, మావయ్య ఫోటో ముందు ఉంచి, “నావల్ల ఏదైనా లోటు జరిగితే మన్నించు..”  అంటూ స్వచ్ఛమైన, నిండు మనసుతో చేతులు జోడించి వేడుకున్నాడు. ఒక్కక్షణం తర్వాత గోపాలం మాట్లాడడం మొదలుపెట్టాడు.

“నిజమే! మా మామయ్య చేరదీసి, చదువులు చెప్పించిన వాళ్ళందరం.. ఈరోజు మంచిమంచి ఉద్యోగాలు సంపాదించి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళమే. మేమెవ్వరం ఒక్క రూపాయి కూడా మామయ్యకు తిరిగి ఇవ్వలేదు. వారి రుణం తీర్చలేనిది. మా చంటీ, బిందూ చెప్పినట్టు.. వారు అందంగా ఉండాలని కోరుకున్న వారి బాల్యాన్ని, మేము ఎవ్వరం తిరిగి ఇవ్వలేము. అందుకు క్షoతవ్యుడ్ని. కానీ అన్నపూర్ణమ్మ తల్లిలా ఆదరించిన అత్తయ్య చేతివంట తిని, మామయ్య నేర్పిన క్రమశిక్షణను వంటపట్టించుకుని, చక్కని వ్యక్తిత్వం ఉన్నవారిగా ఎదగలిగాం. మావయ్య ఎప్పుడూ అంటూ ఉండేవారు.. ‘మన వ్యక్తిత్వం నలుగురిలోనూ మంచి గంధం చెక్కలా, పరిమళం వ్యాపింప చేసేదిగా ఉండాలి’.. అని.

ఆ మాటలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి, అందుకే ఆ ఇంటి రుణం ద్రవ్య రూపేణా తీర్చలేకపోయినా.. మావయ్య ఆశయాలను గౌరవిస్తూ, నాకు చేతనైనంత వరకూ పేద విద్యార్థులకు అండగా నిలబడుతున్నాను. ఇప్పుడు నా వయస్సు ముప్పై నాలుగు సంవత్సరాలు. నేను ఇంతవరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. నా ఆశయాలను గౌరవించి, మా అత్తయ్యలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకాలని ఆగిపోయాను. “

“..ప్రతినెలా నా సంపాదనలో మూడవ వంతు, ఆసరా కోరుకునే వారికి అందజేస్తూ, ఆర్థికంగా అండగా నిలబడుతున్నాను. ఇలా నేను ఇంతవరకూ దాదాపు పన్నెండుమంది జీవితాలు నిలబెట్టగలిగాను. నన్నూ, నా లక్ష్యాలనూ అర్థం చేసుకుని,  నా ఆశయాలను గౌరవించి, నాకు సహకరించే అమ్మాయి దొరికే వరకూ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే రేపు నా పిల్లలకి.. ఏ లోటూ కలగదని వివరించి చెప్పగలిగే వ్యక్తిత్వం ఆమెకి ఉండాలి. అలా అయితేనే రేపు నా పిల్లలు కూడా, మావయ్య నేర్పిన ఆశయాన్ని నెరవేర్చేందుకు సహకరించగలుగుతారు.”

గోపాలం మాటలు పూర్తి కాకుండానే, అంతవరకూ మౌనంగా ఇదంతా చూస్తున్న కాకి.. గబగబా వచ్చి పిడచముద్ద పెట్టిన ఆకులో ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా, తృప్తిగా తిని, రివ్వున ఎగిరి.. తిరిగి చెట్టు మీద వాలింది.

గోపాలంతోపాటు అక్కడున్న వారందరి కళ్ళూ ఆశ్రుధారలతో నిండిపోయాయి.  పుణ్యగతులు కలగాలని కోరుకుని, ఆ ఇంటికి వచ్చిన వారందరూ తృప్తిగా భోజనం చేసి, ఎవరిళ్లకు వారు వెనుదిరిగారు.

లోపలి గదిలో ఓ పక్కగా కూర్చుని, ఈ మాటలు వింటున్న శ్రీనివాసమూర్తి భార్య, చీర చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

“నేనూ ఈ ఇంటి బిడ్డనే అత్తయ్యా!” అంటూ ఆమె చేతిని, తన చేతిలోకి తీసుకుని ధైర్యం చెప్పాడు గోపాలం. ఆ ఆలంబన చాలన్నట్లు ఆమె తృప్తిగా నిట్టూర్చింది.

అస్తమించని సూర్యుడు

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కొత్తపల్లి రవి కుమార్ గారి ‘అస్తమించని సూర్యుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంత్రం 5 గంటలవుతోంది. జగన్నాథం పడక కుర్చీలో కూర్చొని పొద్దున్న చదవగా మిగిలిపోయిన న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సావిత్రి ఒక కప్పులో టీ తీసుకొచ్చి జగన్నాథం ఎదురుగా ఉన్న టీపాయ్ పై పెట్టింది. టీ తో పాటు మారీ బిస్కెట్లు తినడం జగన్నాథానికి అలవాటు. టీ పక్కన బిస్కెట్లు ఏవని వెతుకుతున్నాడు.

“ఏంటి వెతుకుతున్నారు? లేవని నిన్ననే చెప్పాను కదా! ఈ రోజు ఉదయానికే వస్తాయి, వెళ్ళి తెచ్చుకోండి అంటే బద్ధకించారు. రేపటికయినా కావాలంటే టీ తాగి బయల్దేరండి.” అంది సావిత్రి.

నిన్ననే వెళ్దామనుకున్నాడు. ఒంట్లో కాస్త నలతగా ఉండి వెళ్ళలేదు. టీ తాగి చొక్కా వేసుకుని బయల్దేరాడు జగన్నాథం.

“మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత అది తేలేకపోయేరా, ఇది తేలేక పోయేరా అని ఏకరువు పెడతావు. తేవాల్సినవి ఏవైనా ఉంటే రాసివ్వు.” అని అడిగాడు జగన్నాథం. సావిత్రి రాసిన సరుకుల లిస్టు తీసుకుని బజారుకి బయల్దేరాడు జగన్నాథం.

సైకిల్ మీద జగన్నాథం రావడాన్ని చూసి “ఒరేయ్! జగన్నాథం మాస్టారు వస్తున్నార్రా! ఆ కుర్చీ ఇలా వేయి!” అని అరిచాడు కిరాణా కొట్టు సుబ్బయ్య.

“కబురు పెడితే నేనే పంపించే వాడినిగా మాస్టారూ! పని కట్టుకుని మీరు ఎందుకండీ రావడం?” అని అడిగాడు సుబ్బయ్య, అప్పుడే వచ్చిన జగన్నాథాన్ని.

“ఏం లేదులే సుబ్బయ్యా! పొద్దుట్నించీ ఇంట్లో కూర్చుని, కూర్చుని విసుగు వచ్చింది. సాయంత్రం అయ్యేసరికి అలా బయటికి వచ్చి చల్లగాలి పీల్చుకుని, ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకెళ్ళొచ్చుగా అని బయలుదేరాను. ఇదిగో లిస్టు. అన్నీ జాగ్రత్తగా కట్టు. లేకపోతే సావిత్రి నన్ను మళ్ళీ నీ దగ్గరకు పంపిస్తుంది.” అని తనతో తెచ్చిన సరుకుల చీటీని సుబ్బయ్య చేతిలో పెట్టాడు జగన్నాథం.

సరుకుల చీటీ తీసుకుని అందులో ఉన్న అన్ని సరుకులు శ్రద్ధగా సంచిలో సర్ది జగన్నాథం చేతికి అందించాడు సుబ్బయ్య.

జగన్నాథం వెళ్ళిపోగానే కిరాణా కొట్టులో పనిచేసే కుర్రాడు “అయ్యగారూ! జగన్నాథం మాస్టారి గారింట్లో ఆయనొక్కరే కదా ఉంటారు. మరి ఇన్ని సరుకులు ఎందుకు తీసుకెళ్తున్నట్టు?” అని అడిగాడు సుబ్బయ్యని.

“పాపం! మాస్టారి గారి భార్య సావిత్రమ్మ గారు పోయినప్పటినుండి ఆయన ఒంటరి జీవి అయిపోయారురా! ఇంకా సావిత్రమ్మ గారు బతికే ఉన్నట్టు, ఈయనతో మాట్లాడుతున్నట్టు ఫీలవుతూ బతుకుతున్నార్రా! ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరూ ఆయనకి పిచ్చి పట్టిందన్నా, నాకు మాత్రం ఆయన అలా కనపడరురా! మహానుభావుడు. మాస్టారు, సావిత్రమ్మ గారి లాంటోళ్ళు కోటికో, నూటికో ఒక్కళ్ళు ఉంటారు.” అని గాల్లోనే దణ్ణం పెట్టాడు సుబ్బయ్య.

మాస్టారికి అవునో కాదో తెలియదు కానీ మా అయ్యగారికి మాత్రం పిచ్చి పట్టిందనుకున్నాడు ఆ కుర్రాడు.

***

జగన్నాథం మాస్టారు హైస్కూల్ టీచర్‌గా తన సర్వీసుని ఆ ఊళ్ళోనే ప్రారంభించి ఆ ఊళ్ళోనే రిటైరయ్యారు. ఇంచుమించు 50 ఏళ్ళుగా ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. అందుకే ఆ ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి కూడా జగన్నాథం మాస్టారు అంటే తెలియని వారుండరు. ఆయన రిటైరయ్యి సుమారు పదిహేనేళ్ళు అవుతుంది. ఆయన దగ్గర చదివిన ఎంతోమంది మన దేశంతో పాటు వివిధ దేశాల్లో ఉన్నత పదవులలో కొలువుదీరి ఉన్నారు. అందులో ఆయన్ని గుర్తుంచుకున్నవారు కొందరు, మరిచిపోయిన వారు మరికొందరు. గుర్తుంచుకుని వచ్చి పలకరించిన వారిని చూసి మురిసిపోలేదు, అలాగని మరిచిపోయిన వారిని తలచుకొని కుంగిపోలేదు. ఎందుకంటే ఆయన్ని మరిచిపోయిన వాళ్ళల్లో ఆయనిద్దరి కొడుకులు కూడా ఉన్నారు కాబట్టి.

***

అవి జగన్నాథం మాస్టారికి ఉద్యోగం వచ్చి ఆ ఊరు వచ్చిన కొత్త రోజులు. అప్పుడు ఆయన జీతం 65 రూపాయిలు. ఆ జీతంలోనే ఆయన చాలా పొదుపుగా ఉండేవారు. అనవసరమైన ఆర్భాటాలకు గానీ, చెడు వ్యసనాల వైపుగానీ ఎప్పుడూ ఆయన పోలేదు. ఎందుకంటే ఆయన పెరిగిన కుటుంబం వాతావరణం అలాంటిది. ఆయన ఒకటే ఫిలసఫీని ఫాలో అయ్యేవారు. “అవసరమైతే లక్ష రూపాయలైనా ఖర్చు చెయ్యి. అనవసరమైతే ఒక్క రూపాయి కూడా తీయకు.”

ఆయన లెక్కల మాస్టారు అవ్వడం, అందరికీ అర్థం అయ్యేటట్టు చెప్పడంతో అందరూ ఆయన దగ్గరకే ట్యూషన్‌కి వెళ్ళేవారు. ఏ రోజు ఎవరినీ ఫీజు కోసం అడిగేవారు కాదు. ఎవరు ఎంత ఇస్తే అంతే తీసుకునేవారు. అలాగని ఫీజు ఇచ్చిన వాళ్ళకి ఒకలాగ, ఫీజు ఇవ్వని వాళ్ళకి ఒకలాగ పాఠం చెప్పేవారు కాదు. కులమత భేదాలు, పేదధనిక ఆంతర్యాలు లేకుండా స్కూల్లో అందరి పిల్లలు ఆయన దగ్గరకే వెళ్ళేవారు. ఆయన పాఠాలు ఎంత బాగా చెప్తారో మార్కుల్లో తేడా వస్తే అలాగే పనిష్మెంట్‌లు ఇచ్చేవారు. అందుకే అందరూ తమ పిల్లలు జగన్నాథం మాస్టారు దగ్గరకు వెళ్తేనే బాగుపడతారు అనే నిశ్చయానికి వచ్చేవారు. ఇదంతా చూసి ఆయనంటే ఈర్ష్య పడినవాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటివారు వాళ్ళ సహోద్యుగులలోనే ఉండేవారు. కానీ ఆయన మంచితనానికి, ముక్కుసూటితనానికి ఎవరూ బయట పడేవారు కాదు. అందులో చెప్పుకోదగిన ఒకరు మరో లెక్కల మాస్టారు సుదర్శనరావు. ఈయన పాఠాలు విన్న విద్యార్థులు కూడా జగన్నాథం మాస్టారు వద్దకు వెళ్తున్నారనే ఈర్ష్యతో రగిలిపోయేవాడు. సమయం దొరికినప్పుడల్లా తన ఈర్ష్యను వెళ్ళగక్కేవాడు కూడా.

జగన్నాథం మాస్టారి అర్థాంగి పేరు సావిత్రి. భర్త మనసుని ఎరిగి మసలుకునేది. భర్త లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సమస్తం సమకూర్చేది, ఆఖరికి బాత్ రూమ్‌లో స్నానానికి నీళ్ళు, టవల్ సిద్ధం చేయడంతో సహా. ఎందుకంటే జగన్నాథం మాస్టారికి కనీసం బిందెలో నీళ్ళు తీసుకుని తాగడం కూడా చేతకాదు. ఏ రోజూ ఆయన జీతాన్ని ఆమె చేతిలో పోయలేదు. ఎందుకంటే తను తెచ్చిన చాలీ చాలని జీతంతో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అవుతుందని. ఇంట్లో సరుకులు కూడా ఆవిడ చీటీ రాసిస్తే ఈయన తేవడం అంతే. ఇంటి లెక్కలన్నీ జగన్నాథం మాస్టారే దగ్గరుండి చూసుకునేవారు, చివరికి చాకలి పద్దుతో సహా. అందుకే ఉన్న దాంట్లో చాలా సంతృప్తిగా బతికేవారు.

జగన్నాథం మాస్టారికి ఇద్దరు పుత్రరత్నాలు. పెద్దవాడు సాకేత్, చిన్నవాడు సుందర్. జగన్నాథం మాస్టారికి శ్రీరాముడంటే మహా ప్రీతి. అందుకే ఇద్దరు కొడుకులకి రామనామాలు పెట్టుకుని మురిసిపోయారు. అందరూ ఆయన దగ్గరకే ట్యూషన్‌కి వచ్చేవారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా అందరితో పాటే పాఠాలు చెప్పేవారు. ఏ రోజూ విడిగా కూర్చోబెట్టి నేర్పలేదు. అందరి పిల్లలలాగే నా పిల్లలు నేర్చుకోవాలనేది ఆయన భావన. అందుకే అందరి పిల్లలలాగే వీళ్ళకీ జగన్నాథం మాస్టారు అంటే చాలా భయం ఉండేది. ఏ చిన్న విషయం చెప్పడానికైనా భయపడేవారు. అందరూ మీ కొడుకులని మరీ కంట్రోల్ లో పెడుతున్నారు అంటే “క్రమశిక్షణ లేని జీవితం దారం తెగిన గాలిపటం లాంటిది” అనేవారు.

కాలంతో పాటు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఇద్దరూ హైస్కూల్ చదువులకి వచ్చారు. ఇద్దరూ జగన్నాథం మాస్టారు పనిచేసే స్కూల్లోనే చదివేవారు. అందుకే ఇద్దరూ మరింత జాగ్రత్తగా ఉండేవారు. ఏ చిన్న తేడా పని చేసినా జగన్నాథం మాస్టారికి తెలిసిపోయేది. తన పిల్లలని కూడా చూడకుండా అందరిముందే పనిష్మెంట్ ఇచ్చేవారు. అందరి టీచర్లకి కూడా “నా కొడుకులని చూడకండి. అందరి పిల్లలని చూసినట్టే వీళ్ళనీ చూడండి.” అని చెప్పేవారు. అది నచ్చేదికాదు కొడుకులిద్దరికీ. క్రమక్రమంగా నాన్న మీద భయంతో ద్వేషం కూడా పెరిగింది. వాళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా తండ్రి మీద మరింత ద్వేషాన్ని పెంచాయి.

***

జగన్నాథం మాస్టారు పెద్ద కొడుకు సాకేత్, సుదర్శనం మాస్టారి ఒక్కగానొక్క కూతురు స్వాతి క్లాస్‌మేట్స్. ఒకళ్ళ మీద మరొకళ్ళకి ఇష్టం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. వారి ప్రేమ వ్యవహారం స్కూల్లో పిల్లలందరితో పాటు జగన్నాథం, సుదర్శనం మాస్టార్ల చెవిలో కూడా పడింది. జగన్నాథం మాస్టారి గురించి, వారి ఫ్యామిలీ గురించి బాగా తెలుసు గనుక సుదర్శనం మాస్టారు మౌనంగానే వారి ప్రేమను అంగీకరించాడు. కానీ సుదర్శనం మాస్టార్ని, అతని కపటబుద్దిని బాగా తెలుసుకున్నవాడై జగన్నాథం మాస్టారు సాకేత్‌ను ఈ విషయంలో మందలించేవారు. కానీ తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు సాకేత్.

***

సాకేత్ పదవతరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నాడు. స్క్వాడ్ వచ్చి అందరినీ చెక్ చేస్తున్నారు. సాకేత్ పరీక్ష రాసే రూమ్‌లో ఒక అబ్బాయి స్క్వాడ్ వచ్చిందన్న భయంతో తన కూడా తెచ్చిన స్లిప్పులు ఎవరూ చూడకుండా విసిరేసాడు. అవి సాకేత్ కూర్చున్న బెంచీ వద్దకు వచ్చి పడ్డాయి. స్క్వాడ్ వచ్చి ఆ స్లిప్పులు సాకేత్‌వే అని నిర్ధారించి మాల్ ప్రాక్టీస్ కేసు కింద బుక్ చేసారు. స్క్వాడ్ టీమ్ ప్రిన్సిపాల్ రూమ్‌లో పంచాయతీ పెట్టారు. జగన్నాథం మాస్టారి పెంపకంలో పెరిగిన సాకేత్ ఈ పని చేయడని అక్కడ అందరికీ తెలుసు, జగన్నాథం మాస్టారితో సహా. కానీ తన కొడుకు దగ్గర స్లిప్పులు దొరికేటప్పటికి తలదించుకున్నారు జగన్నాథం మాస్టారు.

“సారీ సార్! మీ అబ్బాయి అని మాకు తెలియదు. మీరేంటో, మీ సిన్సియారిటీ ఏంటో, మీ క్రమశిక్షణ ఏంటో మాకు మాకు బాగా తెలుసు. ఏమీ జరగనట్టు మేము ఉంటాం. మీరూ ఈ సంఘటన మర్చిపోండి. మీ అబ్బాయి యథావిధిగా ఎగ్జామ్స్ రాసే ఏర్పాటు మేము చేస్తాం” అని స్క్వాడ్ టీమ్ జగన్నాథం మాస్టారితో చెప్పారు.

“వద్దు సార్! మీ డ్యూటీ మీరు చేయండి. ఇప్పుడు మీరు వదిలేస్తే అందరికీ నీతులు చెప్పి తన కొడుకు విషయంలో నీతి తప్పాడన్న అపకీర్తి నాకు వద్దు. మీరు చేయవలసిన ప్రాసెసింగ్ మీరు చేయండి.” అని స్క్వాడ్ టీమ్, తోటి టీచర్లు ఎంత చెప్పినా వినకుండా కన్న కొడుకునే డిబార్ చేయించారు జగన్నాథం మాస్టారు.

ఇది సాకేత్ మనసులో చెరగని ముద్ర పడిపోయింది. దీన్నే అదునుగా తీసుకుని సుదర్శనం మాస్టారు స్క్వాడ్ ఆఫీసుకి వెళ్ళి తన పలుకుబడితో ఏదో నచ్చజెప్పి సెప్టెంబరు లోనే ఎగ్జామ్స్ రాసేటట్టు ఆర్డర్స్ పట్టుకొచ్చాడు. ఈ విధంగా సాకేత్ దృష్టిలో జగన్నాథం మాస్టారిని ఒక మెట్టు కిందికి దించి తను ఒక మెట్టు పైకి ఎక్కాడు సుదర్శనం మాస్టారు. ఆ రోజు నుంచి సుదర్శనం మాస్టారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా స్వాతికి మరింత దగ్గరయ్యాడు సాకేత్. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇద్దరు కొడుకులకు జగన్నాథం మీద ద్వేషాన్ని పెంచేలా చేసాయి.

***

ఇద్దరు కొడుకులు బాగా చదువుకుని ప్రయోజకులయ్యారు. పెద్ద కొడుకు సాకేత్ కన్నా చిన్న కొడుకు సుందర్‌కి ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబు వచ్చింది. ఉద్యోగ రీత్యా బెంగళూరులో పోస్టింగ్ ఇచ్చారు.

ఇంకా పెద్ద కొడుకు సాకేత్ ఉద్యోగ ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఈ మధ్యనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబుకి అప్లై చేసాడు. రిటెన్ టెస్ట్ పాసయ్యాడు. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఆ రోజు జగన్నాథం మాస్టారు మధ్యాహ్నం భోంచేసి పడక కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు.

సాకేత్ కాల్ లెటర్‌తో వచ్చి “నాన్నా! నేను రిటెన్ టెస్ట్ పాసయ్యాను. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది.” అని చెప్పాడు.

“వెరీగుడ్! ఎప్పుడు ఇంటర్వ్యూ? డబ్బులేమైనా కావాలా?” అని అడిగారు జగన్నాథం మాస్టారు.

“అదీ! అదీ! ఇంటర్వూలో సెలెక్ట్ కావాలంటే రెండు లక్షలు కావాలి” అని తడుముకుంటూ చెప్పాడు సాకేత్.

“ఏమిటి? లంచమా? నేను ఇటువంటి వాటికి దూరమని నీకు తెలియదా?” అని గట్టిగా అడిగారు జగన్నాథం మాస్టారు సాకేత్‌ని.

“లంచమని మీరు అంటున్నారు. ఉద్యోగంలో సెక్యూరిటీ డిపాజిట్ అని నేను అంటున్నాను. ఈసారికి మాత్రం మీరు నాకు ఈ డబ్బు ఇచ్చి తీరాల్సిందే!” అని ఖరాఖండిగా చెప్పాడు సాకేత్. ఈ అరుపులు విని ఎదురింటినుండి పరిగెట్టకు వచ్చాడు సుదర్శనం మాస్టారు. “పోనీలేండి! ఆ డబ్బుతో కొడుకు ప్రయోజకుడవుతున్నాడంటే ఇంక అంతకన్నానా? ఈ సమయంలో ఏ తండ్రైనా డబ్బిచ్చే పంపుతాడు” అన్నాడు సుదర్శనం మాస్టారు.

“సుదర్శనం! ఇది మా కుటుంబ విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం” అని గట్టిగా కేకలేసారు జగన్నాథం మాస్టారు.

“ఇన్నాళ్లూ నీతి నిజాయితీ అంటూ వేలాడేరు. ఏమి సాధించారు? మీరు ఇప్పుడు అవునన్నా, కాదన్నా మా అల్లుడికి నేనే ఆ డబ్బు ఏర్పాటు చేస్తాను. తప్పనిసరిగా ఆ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు చేజారితే ఇలాంటి బంగారు అవకాశం మళ్ళీ రాదు. మీరే చూస్తారుగా, మీ అబ్బాయి ఏ స్థాయికి వెళ్తాడో?” అని సాకేత్ చేతిలో రెండు లక్షలు పెట్టి ఇంటర్వూకి సాగనంపాడు సుదర్శనం మాస్టారు.

ఈ సంఘటన జగన్నాథం మాస్టారు, సాకేత్ లను మరింత దూరం చేసింది. సాకేత్‌కి జాబు వచ్చి బొంబాయిలో స్ధిరపడ్డాడు. సాకేత్‌కి నేనే జాబు వేయించానని రోజూ జగన్నాథం మాస్టారి ముందు దర్పం వెలగబోసేవాడు సుదర్శనం. కొడుకు వల్ల సుదర్శనం ముందు ఓడిపోయానని జగన్నాథం మాస్టారు కుమిలిపోయేవారు. చేసేదేమీ లేక సాకేత్, స్వాతిల పెళ్ళి చేసారు. ఒక సంవత్సరం తిరిగే లోపే సుందర్ పెళ్ళి కూడా చేసేసారు. ఎవరి జాబులతో వాళ్ళు బిజీగా ఉన్నారు సాకేత్, సుందర్‌లు.

***

ఆ రోజు జగన్నాథం మాస్టారి రిటైర్మెంట్ రోజు. రిటైర్మెంట్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. తోటి టీచర్లు పొగడ్తలతో జగన్నాథం మాస్టారిని ఆకాశానికెత్తేసారు. ఫంక్షన్ తర్వాత భోజనాల ఏర్పాట్లు కూడా ఊహించని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసారు. కానీ ఒక్కటే పెద్ద లోటుగా కనిపించింది, ఇద్దరు కొడుకులు తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్‌కి రాకపోవడం. మీ అబ్బాయిలు రాలేదేమని ఎవరు అడిగినా సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, దూరంలో ఉంటున్నారు, లీవ్ కుదరలేదని సాకులు చెప్పాల్సి వచ్చింది జగన్నాథం దంపతులకి. ఫంక్షన్ అయ్యి పూల దండలతో ఇంటికి వచ్చారు జగన్నాథం, సావిత్రిలు. వారు ఇంటికి వచ్చేటప్పటికి పొద్దు పోయింది. మధ్యాహ్నం తిన్నదే అరగలేదని కొంచెం మజ్జిగ తాగి పడక కుర్చీలో నడుం వాల్చారు జగన్నాథం మాస్టారు. ఆయన పక్కనే గోడకు ఆనుకుని కూర్చుంది సావిత్రి.

“అందరూ ఒకటే అడగడం, మీ అబ్బాయిల్లో ఒక్కడు కూడా రాలేదా అని. నాకు ఏ సమాధానం చెప్పాలో తెలియక తల కొట్టేసినట్టయ్యింది.” అంది బాధపడుతూ సావిత్రి.

“నా విధిగా రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి వాళ్ళకు తెలియజేసాను. రమ్మని మరీ మరీ ప్రాధేయపడ్డాను. వాళ్ళ దైనందిన జీవితంలో తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ తమ విధి కాదనుకున్నారేమో? బాధపడి ఏం ప్రయోజనం? జాబులు వచ్చి, పెళ్ళిళ్ళయి వాళ్ళ రెక్కల మీద బతుకుతున్నారు. మన అవసరం ఇక లేదనుకున్నారేమో? పిల్లల్ని కనగలం గానీ, వాళ్ళ రాతలను కాదుగా సావిత్రీ! దేవుడిని చూడాలని భక్తులకుండాలి గానీ, దేవుడు మాత్రం తలుపులు తెరిచి దేవాలయంలోనే కొలువై ఉంటాడు. అలాగే వాళ్ళు మనల్ని చూడాలని రావాలే గానీ, మన మనసులు, మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ భక్తులు రాని దేవాలయం మనది సావిత్రీ!” అని జగన్నాథం మాస్టారు ఆర్ద్రతతో అంటూ ఉంటే సావిత్రి ఏడుపు ఆపుకోలేకపోయింది. భర్త ఒళ్ళో తలపెట్టి భోరుభోరున ఏడ్చింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే జగన్నాథం మాస్టారు కూడా ఏడుపుని ఆపుకోలేకపోయారు.

***

రిటైర్మెంట్ అయిన పదిరోజులకి జగన్నాథం మాస్టారు ఇద్దరు కొడుకులకి ఉత్తరాలు రాసారు. “పది రోజుల్లో నాకు రావాల్సిన అమౌంట్ లన్నీ చేతికందుతాయి. ఇన్నాళ్లూ చెమటోడ్చి సంపాదించినదంతా ఒక్కసారిగా చేతికొస్తోంది. మీరు మీ వీలు చూసుకుని, ఇద్దరూ ఒక మాట అనుకొని ఒక రోజు వస్తే మీ ఇద్దరికీ పంచేసి ఉన్నదాంతో మేము మా శేష జీవితాన్ని హ్యాపీగా గడుపుతాం”. ఇదీ ఆ ఉత్తరం సారాంశం.

ఉత్తరం అందిన పదిహేను రోజులకు ఒక ఆదివారం కొడుకులిద్దరూ వచ్చారు జగన్నాథం మాస్టారి ఇంటికి. అల్లుడితో పాటు తోడుగా సుదర్శనం మాస్టారు కూడా వచ్చాడు, ఎక్కడ తన అల్లుడికి అన్యాయం జరుగుతుందోనని. భోజనాలు అయ్యాక లాయర్‌ని పిలిపించారు జగన్నాథం మాస్టారు.

“ఆ మెరక వీధిలో ఉన్న రెండు ఇళ్ళు చెరో కొడుకు పేరున, అలాగే నాకున్న పొలంలో చెరో నాలుగు ఎకరాలు చెరో కొడుకు పేరున రాయండి లాయర్ గారు. పత్రాలు రెడీ చేసి రేపు రిజిస్ట్రేషన్‌కి ఏర్పాట్లు చేయండి సార్!” అని లాయర్ ని పంపించేసారు జగన్నాథం మాస్టారు.

“ఆస్తుల పంపకాలకు వీలు చూసుకుని వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సుదర్శనం గారు మీకు మరీ మరీ ధన్యవాదాలు. విన్నారుగా! ఈ బడి పంతులు తన కష్టంతో తిన్నా, తినకపోయినా సంపాదించిన ఆస్తులు. ఇవి గాక నాకు వచ్చిన రిటైర్మెంట్ గ్రాడ్యుటీ, పి.ఎఫ్. డబ్బును మూడు వాటాలుగా వేసి ఉంచాను. చెరో వాటా మీకు ఇచ్చి ఒక వాటా నేను తీసుకుంటున్నాను. మరి మేమూ బతకాలిగా! ఇంత క్లారిటీగా ఎందుకు చెబుతున్నానంటే ఫ్యూచర్‌లో మా నాన్న మమ్మల్ని మోసం చేసాడని నా మీద అభాండాలు వేయకూడదని. ఈ ఒక వాటా డబ్బు, ఇదిగో ఈ ఇల్లు, నెల నెలా వచ్చే పెన్షనే నాకు, మీ అమ్మకు ఆధారం.” అని చెరొక వాటా డబ్బు ఇద్దరు కొడుకుల చేతుల్లో పెట్టారు.

“మీరు అన్నింటిలోనూ పెర్‌ఫెక్టే బావగారూ!” అని అన్నాడు సుదర్శనం మాస్టారు. ఆ పొగడ్తని తృణప్రాయంగా స్వీకరించారు జగన్నాథం మాస్టారు.

తరువాతి రోజు రిజిస్ట్రేషన్స్ అయ్యి కొడుకుల పేర్ల మీదకి ఆస్తులు ట్రాన్సఫర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్లతో, పంపకాల్లో వచ్చిన డబ్బులతో తమ తమ ఊళ్ళకి బయల్దేరారు ఇద్దరు కొడుకులు.

వెళ్తూ “మీకు చూడాలనిపించినప్పుడల్లా అమ్మను తీసుకు రండి నాన్నా!” అని అన్నారు ఇద్దరు కొడుకులు.

“మీ ఇళ్ళకు మమ్మల్ని రండి అని పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. మీరు సుఖంగా ఉండండి.” అని అందరినీ సాగనంపారు జగన్నాథం మాస్టారు.

ఇది జరిగి సరిగ్గా పదిహేనేళ్ళు అయ్యింది. ఈ పదిహేనళ్ళల్లో కొడుకులు వస్తూ, పోతూ ఉన్నారు. పంపకాల్లో వచ్చిన ఇళ్ళు, పొలాలు అమ్ముకుని వాళ్ళు ఉండే ఊళ్ళల్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. జగన్నాథం మాస్టారు దేనికీ అడ్డు చెప్పలేదు. ఎవరిష్టం వాళ్ళదని సరిపెట్టుకున్నారు. జగన్నాథం, సావిత్రమ్మలు మాత్రం కొడుకుల దగ్గరకు వెళ్ళకుండా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. ఏ రోజూ కొడుకుల ఇళ్ళల్లో చేయి కడగలేదు.

జగన్నాథం మాస్టారికి ఇంట్లో పనులు ఒక్కొక్కటి నెమ్మదిగా నేర్పుతోంది సావిత్రమ్మ.

జగన్నాథం మాస్టారు “నాకెందుకే ఈ పనులు, నువ్వు నా పక్కన ఉండగా?” అంటే “మీకు ఏ పనులు రావాయే. కనీసం బిందెలో నీళ్ళు తీసుకుని తాగడం కూడా రాదు. రేపు నేను పోతే ఈ పనులన్నీ మీకు ఎవరు చేసి పెడతారు? కొడుకుల వరస చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంది” అని బాధపడేది సావిత్రి.

ఇలా కొంత కాలానికి తన పనులు తాను చేసుకునే స్ధాయికి, తనకు తానుగా వంట వండుకుని తినే స్ధాయికి జగన్నాథం మాస్టారిని తీసుకు వచ్చింది సావిత్రమ్మ. ఆయనకి ఒంట్లో బాగోలేనప్పుడు ఆవిడ, ఆవిడకి బాగోలేనప్పుడు ఆయన ఒకరికొకరు సర్దుకుని పనులు చేసుకుంటున్నారు. ఇలా నీకు నేను, నాకు నువ్వు అన్న రీతిన కాలాన్ని వెళ్ళదీస్తున్నారు.

జగన్నాథం మాస్టారికి సావిత్రి అన్ని పనులు నేర్పింది అన్న విషయం తెలిసిందేమో కాలానికి, సావిత్రిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయింది. సావిత్రి కాలం చేసి ఎనిమిది నెలలవుతోంది. కానీ సావిత్రి తనతోనే ఉంది, తన పక్కనే ఉందన్న భ్రమలో బతికేస్తున్నారు జగన్నాథం మాస్టారు.

***

సుబ్బయ్య కొట్టు నుంచి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తూ “ఏమోయ్ సావిత్రీ! నువ్వు రాసిచ్చిన చీటీలో ఉన్న అన్ని సరుకులు తెచ్చానో లేదో చూడు. మళ్ళీ టీ పెట్టి ఇవ్వవోయ్! ఈసారి మారీ బిస్కెట్లు తింటూ టీ తాగుతాను” అని సరుకుల సంచీ టేబుల్ మీద పెట్టారు జగన్నాథం మాస్టారు.

సరుకుల సంచీ పెడుతుండగా టేబుల్ మీద ఒక కార్డు జగన్నాథం మాస్టారి కంట పడింది. పొద్దున్న పోస్ట్‌మాన్ తెచ్చి ఇచ్చిన కార్డు. పడక కుర్చీలో కూర్చుని కార్డు తీసి చదివారు జగన్నాథం మాస్టారు.

“పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మా ప్రియమైన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మీ అందరికీ మా పూర్వ విద్యార్థులు చేసే సన్మాన కార్యక్రమం. పూర్వ విద్యార్థులు చదివిన సంవత్సరం, సన్మానం చేసే రోజు” ఉన్నాయి ఆ కార్డులో.

చదివిన సంవత్సరం చూస్తే గుర్తొచ్చింది జగన్నాథం మాస్టారికి , అది సాకేత్ చదివిన సంవత్సరమని. రేపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనగా సాకేత్ వచ్చాడు వాడి పెళ్లాన్ని, మావగారిని వెంటబెట్టుకుని. అందరూ కలిసి స్కూల్‌కి వెళ్ళారు మరుసటి రోజు.

ఒక్కసారిగా తను పని చేసిన స్కూల్ చూసేసరికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయి జగన్నాథం మాస్టారికి. పువ్వులతో, మామిడి తోరణాలతో పాత స్కూల్‌ని కొత్తగా అలంకరించారు. ఎప్పుడో విడిపోయిన తమ స్నేహ బంధాలు తలచుకొని అందరూ మురిసిపోయారు. టీచర్లందరినీ సన్మానించిన తర్వాత ఒక్కొక్క టీచర్‌ని మాట్లాడమంటున్నారు. ఇప్పుడు జగన్నాథం మాస్టారి వంతు వచ్చింది.

“గౌరవనీయులైన మన లెక్కల మాస్టారు జగన్నాథం గారిని మాట్లాడవలసినదిగా మీ అందరి తరపున కోరుతున్నాను” అని కోయిల కంఠంతో ఒక స్టూడెంట్ సాదరంగా ఆహ్వానించింది జగన్నాథం మాస్టారిని.

అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా మైకు దగ్గరకు వచ్చారు జగన్నాథం మాస్టారు.

“నా తోటి సహోద్యుగులకు నమస్కారాలు. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ శుభాభినందనలు. మరిచిపోయిన జ్ఞాపకాలను మరల గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. నేను కొంచెం సూటిగా మాట్లాడినా సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎవరి మనసైనా నొప్పిస్తే నన్ను క్షమించండి.

ఎప్పుడో మీకు చదువులు చెప్పామన్న కృతజ్ఞతతో మాకు ఈ సన్మానం చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ఇందులో ఎంతమంది మాకు మనస్ఫూర్తిగా మాకు సన్మానం చేయాలనుకుంటున్నారు. నిజంగా మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని గౌరవించాలనుకుంటే దీనికి పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని కాకుండా మా దేవుళ్ళకి సత్కార సభ అని పేరు పెట్టేవారు. ఏదో మీలో మీరు ఎవరు ఎంత ఎదిగారో తెలుసుకోవడానికో, ఎవరు ఎంత పొజిషన్‌లో ఉన్నామో తెలియడానికో ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసారు.

మిమ్మల్ని చూస్తుంటే మీరందరూ బాగా ఎదిగారని అనిపిస్తోంది. ఎంత బాగా ఎదిగారంటే కన్న తల్లిదండ్రులని చూడలేనంత బాగా ఎదిగారు. మీరు చిన్న పిల్లలగా ఉన్నప్పుడు మిమ్మల్ని మేము ఎలా చూసామో ఇప్పుడు మీ తల్లిదండ్రులను అలా చూస్తున్నారా? ఖచ్చితంగా చూడడం లేదు. మీరు సరిగ్గా చూస్తే మేము పిచ్చివాళ్ళం ఎందుకు అవుతాము. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను పిచ్చివాడయి, పోయిన పెళ్ళాంతో మాట్లాడుకుంటున్నాడు అంటున్నారు. అవును. నేను కొడుకులు వదిలేసిన పిచ్చివాడనయ్యాను. ఈ పిచ్చివాడికి, పోయిన నా భార్యే ఓదార్పు అయ్యింది. నా భార్య సావిత్రి బతికున్నంతకాలం ఒక మాట అనేది. భర్త పోయినా భార్య జీవితాన్ని సాఫీగా లాగగలదేమో గానీ భార్య పోయిన భర్త ఒక్క రోజు కూడా మనశ్శాంతిగా బతకలేడు అని. అందుకే నా భార్య సావిత్రి దేవుడిని ఒక్కటే కోరుకునేది. నా కన్నా నా భర్త ముందు పోవాలని. బహుశా భర్త తన కళ్ళ ముందే పోవాలని, తన మాంగల్యం తెగిపోవాలని కోరుకున్నది ఒక్క నా సావిత్రే కాబోలు. కానీ దేవుడు ఆమె మొర వినలేదు. తననే ముందు తీసుకెళ్ళిపోయాడు.

ఇప్పుడు నేను నా భార్య ఇచ్చిన భరోసాతో బతుకీడుస్తున్నాను. నా భార్య సావిత్రి నాకు ఎలా బతకాలో నేర్పి వెళ్ళింది. నేను నా కొడుకులకి రిటైర్మెంట్ తర్వాత అంతా ఊడ్చి ఇచ్చేస్తుంటే అందరూ ఎందుకండీ మీరు అట్టిపెట్టుకోకుండా అలా ఇచ్చేస్తున్నారు, ఈ లెక్కల మాస్టారి లెక్క తేడా వచ్చిందన్నారు. కానీ నా లెక్క ఎప్పుడూ తేడా రాదు. ఆ రోజు నేను అలాగ పంచి ఇవ్వకపోతే వాళ్ళు ఈ రోజుకు కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనిచ్చేవారు కాదు. రాబందుల్లా పీక్కుని తినేవారు. ఆ సతీ సావిత్రి యముడితో పోరాడి మొగుడు ప్రాణాలు కాపాడితే నా సావిత్రి యమకింకరులలాంటి కొడుకుల వద్దకు వెళ్ళకుండా అన్ని పనులు నేర్పింది.

మేము చదువుకున్నాం, మేము బాగా సంపాదిస్తున్నాం అంటున్నారు గానీ దానికి పెట్టుబడి ఎవరిది. మీ తల్లిదండ్రుల కష్టం, చెమట, నెత్తురు. ఇప్పుడు రెక్కలు వచ్చి మేము ఎగిరిపోయాం అనుకుంటున్నారు గానీ ఆ రెక్కలు విచ్చుకోవడానికి మేము ఎన్నిసార్లు డొక్కలు మాడ్చుకున్నామో మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఏ స్ధితిలో ఉన్నారో మాకు తెలుసు. ఇద్దరూ సంపాదించినా జీవితం సాఫీగా వెళ్ళని రోజులు. అందుకే మీకు మా దగ్గరున్న సర్వస్వం అర్పిస్తున్నాం. మీరు మాకు డబ్బులు పెట్టక్కరలేదురా! మేము మీ దగ్గరుంటాం అనేది ఏదో మీ మీద పడి ఎగపడి తిందామని కాదు. మేము మీ దగ్గర నుండి కోరుకునేది కేవలం ఆప్యాయత, అనురాగం, ఎలా ఉన్నావు అనే పిలుపు. చిన్న పిల్లలగా ఉన్నప్పుడు మేము మిమ్మల్ని పెంచలేక రోడ్డు మీద వదిలేస్తే మీరు ఎలా బతికేవారురా? ఇప్పుడు మీరు మమ్మల్ని చూడలేక అనాథలుగా వదిలేస్తే మేము ఎలా బతుకుతామనుకున్నార్రా?” అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు జగన్నాథం మాస్టారు.

ఒక్కసారిగా అందరి మనసులు పశ్చాత్తాపంతో బరువెక్కాయి. అందరి కళ్ళల్లోనూ మాస్టారికి ఏమయ్యిందోనని ఆత్రుత ఆవరించింది. ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే జగన్నాథం మాస్టారు సావిత్రమ్మ చేయి అందుకున్నారు. కానీ అస్తమించని సూర్యుడిలా అందరి మనసులలో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటారు.

అవ్యక్త గాయం

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పొత్తూరి సీతారామరాజు గారి ‘అవ్యక్త గాయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]యంకాలమైంది.. బహుశా వేసవికాలం వలన తొందరగా.. ఇంకా చీకటి ముసురుకోలేదు. స్టేషన్‌లో రైలు దిగేసరికి ఆరు అవుతుంది. మిత్రుడు ప్రభుని రమ్మని ఫోన్ చేసాను. వస్తాను అన్నాడు. ఇంకా రాలేదు. ఎందువల్ల ఆలస్యం జరిగిందని మళ్ళీ కాల్ చేసాను. “స్కూల్లో ఎగ్‌స్ట్రా క్లాస్ తీసుకున్నాను. పిల్లలకు సిలబస్ అవ్వక.. సారీ..” అని, “నీవు సరాసరి ఇంటికి వచ్చేయ్. అడ్రస్ ఆటోవాడికి చెప్పు. గాంధీనగర్ గాంధీ బొమ్మ దగ్గర దింపమను. తూర్పు వైపు వీధిలోకి సరాసరి నడిచి వచ్చేయ్.. చివరన కనిపించే గులాబీ రంగు బిల్డింగ్ మనదే.. అక్కడకు వచ్చి ఎవర్ని అడిగినా చెపుతారు.. మన ఇల్లు. స్నానం చేసి నీవు రెస్ట్ తీసుకో.. ఈలోపుగా నేను వచ్చేస్తాను.”

ఎప్పుడో వచ్చాను ఇక్కడకు. బహుశా పది సంవత్సరాలయి ఉంటుందనుకుంటున్నాను. మళ్ళీ ఇంత కాలానికి.. ఇదే రావడం. నేనూ ప్రభూ ఒకే కాలేజీలో చదువుకున్నాం.. అతనికి ఇక్కడే టీచరుగా ఉద్యోగం వచ్చింది. పి.ఆర్. స్కూల్‌లో పనిచేస్తున్నాడు. నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రభుకు మాత్రం పెళ్ళయి రెండు సంవత్సరాలయింది. ఒక పాప.. ఆరు మాసాలయిందనుకుంటాను. నాతో రోజుకి ఒక్కసారయినా ఫోన్లో మాట్లాడతాడు. చాలా మంచివాడు. అభ్యుదయవాది.. ఇక్కడ అతనికి మంచి పేరుంది. కవిత్వం.. కథలు రాస్తుంటాడేమో.. అప్పుడప్పుడు పత్రికలలో చూస్తుంటాను. మనిషి మితభాషి. ఎక్కువ మాట్లాడడు. నేను మాత్రం ఎక్కువ మాట్లాడతాననే చెప్పాలి. ప్రతి విషయాన్ని చదివిన తరువాత ప్రభు లాంటి మంచి మిత్రునితో కలసి పంచుకుంటాను. వాటి లోతులు తెలుసుకుంటాను.

ఆలోచిస్తూనే ఆటో ఎక్కి ఎడ్రస్ చెప్పాను. దారిలో పరిసరాలన్నీ మారిపోయాయి. కాకినాడకు ఫేమస్ సుబ్బయ్య హోటల్ దారిలో తగిలింది. ఏమీ మారలేదు. అలాగే చిన్న మేడకింద సందులోనే దేశంలో అన్ని ప్రాంతాల వారికీ భోజనం పెడుతున్నారు. ఎవరొచ్చినా ఇక్కడ భోజనం చేసి వెళ్లాల్సిందే, అంత రుచికరంగా ఉంటుంది. ‘వీలుంటే రేపు మధ్యాహ్నం భోజనానికి ఇక్కడకు రావాలి’ అనుకున్నాను.

“సార్ .. గాంధీబొమ్మ వచ్చింది.” అంటూ ఆటో డ్రైవర్ అన్నాడు. “అప్పుడే వచ్చేసిందా. ఎప్పుడో చూసిన మారిపోయిన ఆనవాళ్ళ జ్ఞాపకాలు దూరాన్ని మరిపించాయి.” అంటూ ఆటో దిగి డబ్బులిచ్చి, బేగ్ తీసుకుని బయలుదేరాను.

అప్పుడే వీధిలైట్లు వేసారు.. ఇబ్బంది లేకుండా ప్రభు చెప్పిన తూర్పు రోడ్డు నాకు స్వాగతం పలికింది. నడుస్తున్నాను. నాకు ఏదో కొత్తగా ఉంది ఇక్కడకు రావడం.. చాలా కాలమయిన తరువాత ఇలాగే ఉంటుందేమో.. నాకు పరిసరాలను పరిశీలిస్తూ నడవడం అలవాటు..

అలా నడుస్తూనే ఒకచోట ఆగాను.. దారిలో ఒక శిథిల భవంతి.. చాలా విశాలంగా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పురాతన భవనం నన్ను అబ్బురపరిచింది. అక్కడక్కడ పిచ్చిమొక్కలు మొలిచి ఉన్నాయి. లోపలి ఎత్తైన గోడలకు పెచ్చులూడి వాటి రంగులపై వర్షపు నీరు జారిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అక్కడక్కడా జారిన ఇటుకల మధ్య రావి మొక్కలు మొలిచి ఉన్నాయి. అలా కాసేపు ఆగిపోయాను. ఒకప్పుడు ఎన్నో అందాలతో ఎంతమందో పరివారంతో సంచరించే నాటి రాజుల కాలం నాటి భవనం నా మదిలో మెదిలింది. మనిషికైనా భవనానికైనా భోగం కొన్నాళ్లే.. ఈ రెండూ ఏనాటికైనా కాలగర్భంలో కలవాల్సిందే.. ఆనాడు వేసిన వీధి దీపపుస్తంభం ఇంకా అలాగే ఉంది. అటు ఇటు నడిచే మనుషులకు దారి చూపిస్తుందని ఎవరో దాతలు బాగు చేసుంటారు. చాలా అందంగా ఇంకా ఆనాటి కంటే బాగా వెలుగునిస్తుంది. దాని పక్కనే ఓ పెద్ద పారిజాతం చెట్టు. పరిమళం గుప్పుమని కొట్టింది. ఆగిపోయాను.. అడుగులు పడటం లేదు. ముందుకు శరీరం కదలనంటుంది. రెండు కళ్ళు నా వైపు తదేకంగా చూస్తున్నాయి. నా గుండె జల్లుమంది. ఎందుకోసమో.. ఎవరి కోసమో.. అనుకున్నాను. అటు ఇటు చూసాను.. ఎవరూ లేరు. నాకు సిగ్గుతో భయం వేసింది. మనసు వెళ్లమని చెబుతుంది. మనిషిని కదల్లేక పోతున్నాను. భారంగా అడుగులు ఆమె వైపు వేసాను దగ్గరగా ఆ కళ్ళలోకి చూసాను. ఎందుకలా నిలబడిందో నాకప్పుడర్థమయింది. ఆమె సౌందర్యం పారిజాత సువాసనను మరిపిస్తుంది. ఇంకా పెళ్లి కాలేదని మెడలో ఒంటరిగా వేలాడుతున్న ముత్యాలదండ చెబుతుంది. ఇంకా దగ్గరగా వెళ్ళాను. దూరంగా ఒక పక్కకు ఒరిగిపోయిన సిమెంటు బెంచీ వైపుకు దారి చూపించింది. నేను అటువైపు నడిచాను.. నేను ఏదో లోకంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నాను. ఇప్పటి వరకూ ఇంత సౌందర్యాన్ని చూడలేదు. నాకు నోటిలోనుండి మాటలు రావడం లేదు.

“అలా నిలబడిపోయారేం కూర్చోండి ఎక్కడనుండి వస్తున్నారు” అంది.

బలవంతాన నోరు పెగల్చుకుని, “ఢిల్లీ నుండి” అన్నాను.

“అలా నిలబడిపోయారే కూర్చోండి” అని మళ్లీ అంది. ఇక తప్పదన్నట్లు కూర్చున్నాను.

“మీ పేరు..”

“మహీధర్..”

“ఏం చేస్తుంటారు..?”

“భూమి లోపల ఏమి ఉంటాయో తెలుసుకునే ఉద్యోగం.”

“అంటే..” అంది అర్థం కానట్లు.

“ఆర్కియాలజీ డిపార్ట్మెంట్..”

“అయితే మీకు చాలా విషయాలు తెలిసుంటాయి.”

“మీ పేరు..” అన్నాను. ఎందుకో ఆమెను చూడగానే గౌరవించాలని అన్పించింది.

“మల్లిక..” అంటూ చిరునవ్వు నవ్వింది.

“ఎందుకు నవ్వుతున్నారు..” అన్నాను.

“పారిజాతం పూలమీద కూర్చున్నాను. అందుకని ఇక్కడ పూలు గాలిలో సుగంధాలు వెదజల్లుతాయి. ముళ్ళు గుచ్చుకున్న కాళ్ళతో పూరేకులపై నిలబడి ఉన్నాను కదా, అందుకని నవ్వొచ్చింది.”

“మీ మాటలు విచిత్రంగా ఉన్నాయే..” అన్నాను.

“చేదు గతం గుండెకు ముల్లె గుచ్చుకుంటే ఇలానే మాట్లాడతారు”

“మీకు పెళ్ళయిందా..” అంది మల్లిక.

“లేదు..” అన్నాను.

“ఎందుకు ఇంతకాలం చేసుకోలేదు..” అంది.

“నచ్చిన అమ్మాయి దొరక్క..” అన్నాను.

“ఆడపిల్లలు దొరకరు.. వెతుక్కోవాలి.” అంది చాలా మృదువుగా.

“నేను దేన్నీ అన్వేషించను. నాకు ఆ సమయంలో ఏది దొరికితే అదే తింటాను. నా హృదయం స్పందించినప్పుడు నా కాళ్ళు వాటికవే ఆగిపోతాయి.. మనస్సు మూగపోతుంది. ఎవరైతే నన్ను అర్థం చేసుకుంటారో వారిని పెళ్లాడాలనుకుంటున్నాను.”

“బాగుంది మహీధర్ గారు.. మీరు చెప్పింది.” అంటూ ఆకాశంలోకి చూసింది. మేఘాలు కురవబోతున్న చినుకుల వానను ఇక ఆపలేము.. అన్నట్లు.. సన్నని వర్షపు జల్లు మొదలయింది.

“రండి.. లోపల కూర్చుందాము.. వర్షం తగ్గిన తరువాత బయలుదేరవచ్చు” అంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపల పాతకాలం నాటి మంచం.. ఎప్పటిదో రంగులు వెలిసిపోయిన చెక్కతో చేసిన పాత బీరువా.. తిరిగీ తిరగనట్లుండే ఒక ఫ్యాను.. దూరంగా పాత బీరువాలో పెద్ద పెద్ద న్యాయశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. పూర్వకాలంలో పల్లెలలో వాడే వస్తువులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి.

“ఇక్కడ మీరు ఒక్కరే ఉంటున్నారా?” అన్నాను.

“ఔను మహీగారు, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను.”

“మీకు భయం వేయడం లేదా?” అన్నాను.

“చాలా కాలం నుండి నేనొక్కదాన్నే ఉంటున్నాను. లోపలికెవరూ రారు.” అని,

“అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను. మీకు కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. వంట చేస్తాను. భోంచేస్తారా?” అంది.

“లేదు మల్లిక గారూ. నా మిత్రుడు ప్రభు ఇల్లు ఇక్కడే. వెళ్ళిపోతాను. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. అయ్యో.. అప్పుడే తొమ్మిదయింది.” సైలెంట్‌లో పెట్టిన ఫోన్ తీసిచూసాను. ప్రభు మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. “నేను బయలుదేరతాను..” అని చెప్పి బయటకు అడుగులు వేసాను.

“రేపోసారి ఇదే సమయానికి రాగలరా..” అంది ముఖం బేలగా పెట్టి.

“ఆఁ.. తప్పక వస్తాను.”

“మర్చిపోకండి మరి..” అంటూ నిశ్శబ్దంగా నడచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.

***

జరిగిందంతా చెబితే పడిపడి నవ్వాడు ప్రభు.. “ఏమయిపోయావు అని కంగారుపడ్డాను. కాల్ ఎత్తడం లేదు.. ఏమయిందోనని..” అన్నాడు.

భోజనాలయ్యాయి. మేమిద్దరం మేడ మీద గెస్ట్ రూమ్‍లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ప్రభు భార్య సౌజన్యను, చిన్నారి పాపను పరిచయం చేసాడు. చాలా సంతోషంగా ఆమె స్వాగత సత్కారం నాకు లభించింది.. మంచి గృహిణి, చక్కటి భార్య దొరికింది ప్రభుకని నా మనస్సు ఆనందించింది.

“మహీ .. రేపు నీ ప్రోగ్రామ్ ఏమిటి” అన్నాడు ప్రభు.

“నేను పిఠాపురం దగ్గరలో చదలాడ తిరపతి అని ప్రముఖ పుణ్యక్షేత్రముందట.. శృంగార వల్లభస్వామి.. ఆ గుడి మీద శిలా శాసనాలు ఉన్నాయి.. వాటిని పరిశోధించడానికి వచ్చాను. రేపు నాకు అది చాలా ముఖ్యమైన పని.”

“అయితే మనం సాయంకాలం కలుస్తామన్న మాట..” అన్నాడు ప్రభు.

“అవును నీవు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదా..” అన్నాను.

“లేదు.. వెళ్ళలేకపోయాను.. నేనూ విన్నాను ఆ గుడి గురించి చాలా వింతలు, విశేషాలు..”

“ఏమిటో నీకు తెలిసిన ఒక విశేషం నాకు చెప్పు..” అడిగాను ఆసక్తిగా.

“ఆ గుడి లోపల స్వయంభూ విగ్రహం.. చాలా వేల సంవత్సరాల నాటిదని.. ఇంగ్లాండ్ రాణి.. ఒక ఇంజనీర్‍ను పంపిందట.. ఆ విగ్రహాన్ని పరిశీలించి.. దాని కొలతలు దూరం నుండి తీసుకుని రమ్మని అతను అలాగే చేశాడు. ఎందుకో రాణి గారికి ఇంజనీరు మాటల మీద నమ్మకం లేక మరొకరిని పంపించింది. ముందు తీసుకున్న ఆ విగ్రహం కొలతలు.. ఆరు అడుగులు అయితే.. ఇప్పుడు ఏడు అడుగులు అని తేలింది. ఆశ్చర్య పోయి ఆమే స్వయంగా ఇండియా వచ్చిందట.. విగ్రహాన్ని చూసి ఆమె షాకయింది. తను ఎంత పొడవుందో.. అంతే ఎత్తులో ఆ దివ్యస్వరూపం దర్శనమిచ్చింది. అంటే ఏ మనిషి ఏ ఎత్తులో ఉంటే ఆ స్వామి అంత ఎత్తులోనూ మనకు కనిపిస్తారు. ఇదీ ఆ క్షేత్రం యొక్క మహిమ. ఇక చాలా.. ఈ వివరాలు.. ఇంకా ఏమైనా కావాలా” అన్నాడు ప్రభు.

“చాలా గొప్ప సమాచారమిచ్చావు. మిత్రమా..” అన్నాను.

“ఇక పడుకుందాం..” అని కిందకు వెళ్లిపోయాడు ప్రభు.

***

“చెప్పిన సమయానికే వచ్చారే..” అంది మల్లిక.

“అవును.. ఈ రోజు మిమ్మల్ని కలిసి రేపు ఉదయమే బయల్దేరాలి.. అందుకనే తొందరగా వచ్చాను.”

“ఇంకోరోజు ఉండటానికి వీలుకాదా.. ఉండొచ్చుగా..” అంటూ ప్రేమగా అడిగింది మల్లిక.

“లేదు, వెళ్ళాలి తప్పదు మల్లిక గారూ. మా ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అందుకే ఉండటానికి వీలవడం లేదు. ఏమిటీ మీరు అదోలా ఉన్నారు నీరసంగా..” అన్నాను.

“చిన్నతనం నుండీ అందినవన్నీ చేజారిపోతున్నాయి. ఇది నా దురదృష్టమేమో బహుశా” అని నిరాశగా అంటూ కాఫీ కలిపి ఇచ్చింది.

“బాధపడకండి.. మల్లిక గారూ.. బాధలు చీకటిరాత్రుల్లాంటివి. వాటికి ఉషోదయమనే అనే ఆశను కలిగిస్తూ వెలుగు అనే ధైర్యాన్ని నింపుకోవాలి. మళ్లీ నన్ను ఎందుకు రమ్మన్నారు. మిమ్మల్నో ప్రశ్న అడగవచ్చా.. ఏమీ అనుకోకపోతే సుమా..” అన్నాను సంకోచంగా.

“ఫరవాలేదు.. అడగండి” అంది మల్లిక.

“ఉన్న ఈ రెండు రోజుల్లో నేను మిమ్మల్ని చాలాసార్లు గమనించాను. మనుషులు నడిచే దారి వైపు.. ఎవరూ లేని ఆకాశం వైపు చూస్తూ ఎందుకు నిలబడతారు..”

బాధగా నవ్వింది. “వాకిట్లో పారిజాతం పువ్వు ఎగురుతూ.. వర్షపు నీటిలో కొట్టుకుపోతుంది. అది అలా ఎక్కడికి పోతుందో.. చూశారా దృశ్యాన్ని..” అంది.

“చూసాను..”

“జీవితం కూడా అలానే సాగిపోతుంది.”

“మీరు మాట్లాడుతుంటే ఒకోసారి ప్రకృతి సమాధానం చెబుతుంది. మొన్న మిమ్మల్ని కలిసినపుడు మధురమైన శబ్దాలు వినిపించేవి.. మీరు ఒక్కో మాట ఒత్తి పలుకుతుంటే.. పక్షుల కుహకుహలు.. గుడిలో గంటల శబ్దాలు.. నేను ఆరోజు ఆశ్చర్యపోయాను. మళ్ళీ ఈ రోజు స్వయంగా చూస్తున్నాను. మల్లిక గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వనికి ప్రతిధ్వని కలిసి సమాధానమిస్తుంది.”

“ఏమోనండి.. నాకయితే మనసులో అన్పించినదే చెబుతాను. అది మీరు తిరిగి ప్రకృతి స్పందనల్లో చూసుంటారు.”

“మల్లిక గారూ.. నేను అడిగిన ప్రశ్న అదే.. శూన్యం లోకి చూస్తున్న మీ కళ్ళు దేని కోసమని..”

“బాధపడరుగా! మరి.. నేను అంతా చెప్పిన తరువాత..”

“నాకు తిరిగి చెప్పడానికి వీల్లేని బాధయితే.. మౌనంగా నడిచి వెళ్ళిపోతాను.” అన్నాను.

“నా బాల్యం, చదువు ఇక్కడే పూర్తయింది. అమ్మ చిన్నతనంలోనే పోయింది. నాన్నగారు.. ప్రముఖ న్యాయవాది అంకాల రాజుగారు.. ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో ఆయనకు చాలా పలుకుబడి, పరపతి ఉండేవి. ఆయన దగ్గర వైభవ్ జూనియర్‍గా జాయిన్ అయ్యాడు. నేను వైభవ్ ప్రేమించుకున్నాము. నాన్నకు తెలిసింది. మా ఇద్దరి ప్రేమకు ఏనాడూ అడ్డు చెప్పలేదు. మంచివాడు – చదువుకున్న యోగ్యుడు. ఇంతకంటే బుద్ధిమంతుణ్ణి మళ్లీ నేను ఎక్కడని వెతకను అని వైభవ్‌ని పిల్చి మీ ఇద్దరి పెళ్లికీ సమ్మతమేనని ఆయన చాలా ఆనందంతో నీవు ఇక్కడే పెళ్లి చేసుకుని ప్రాక్టీస్ కూడా పెట్టుకో అన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వైభవ్ ఆ మాటలకెంతో సంతోషించాడు. ఇంతకాలం అనాథాశ్రమం నాకు విద్య, గురువు, దైవం అయితే ఇప్పటినుండి మీరే నాకు దైవం అని నాన్న కాళ్ళకు నమస్కరించాడు. ఇద్దరం సంతోషంతో రాబోయే జీవితాన్ని ఊహించుకుని ఎన్నో కలలు కన్నాము. ఇది జరిగిన రెండు నెలల తరువాత మద్రాస్ కోర్టులో ఏదో కేసుందని వెళ్ళాడు. వారంలో తిరిగొస్తానని.. నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. అతను మాత్రం తిరిగి రాలేదు. ఎవరితో చెప్పుకోను నా బాధను.. గుండెను అదిమిపెట్టుకుని అలానే ఉన్నాను. మాతో ఇక్కడే ఉంటూ మాలో విడదీయరాని బంధంగా మారిపోయి దూరమవడంతో చాలా కాలం మనిషిని కాలేకపోయాను. నాన్న నాకు చాలా సంబంధాలు చూసారు. కొంతకాలం ఆగుదాము నాన్నా అనేదాన్ని. కాలం మనకోసం ఆగదుగా. ఒకరోజు నాన్న హఠాత్తుగా నన్నొదిలి వెళ్లిపోయారు. మబ్బులు కమ్మిన ఆకాశంలా ఆరోజు నుండి దగ్గరగా ముడుచుకుపోయాను. ఇంతకాలమూ నాన్న ఉన్నరనే ధైర్యంతో ఉన్నాను. ముందు వైభవ్ నన్ను విడిచిపెట్టిన తరువాత నా గుండెపై ఎవరో పెద్ద సుత్తితో మోదినట్లయింది. నాన్న దూరమయిన తరువాత ప్రాణం లేని బొమ్మనయ్యాను. చిరునవ్వుకు దూరమయ్యాను. ఆకాశం లాంటి నాన్న జీవితాన్ని మేఘంలా కరిగించి, నన్ను ఇంతదాన్ని చేసిన నాన్న కోసం నా హృదయం ఈ శిథిల గోడల మధ్య ఒంటరిగా రోదిస్తూంది. పనిమనిషి జోగులమ్మ బయటకి వెళ్ళి అన్నీ తెచ్చిపెడుతుంది. నేను మాత్రం బయట కాలుపెట్టి చాలా ఏళ్ళయింది. అప్పటినుంచి వైభవ్ కోసం అందరూ నడిచే రోడ్డు వైపు చూస్తూ..  ఎప్పటికీ తిరిగిరాని నాన్న కోసం ఆకాశం వైపు చూస్తూ కాలం గడిపేస్తున్నాను.”

“మళ్లీ వైభవ్ కలవలేదా..” అడిగాను.

“కలవకే.. కలిసాడు, నాన్న డైరీ రూపంలో.. ఒకరోజు నాన్న మరణించిన చాలా కాలం తరువాత బీరువా తీసి పుస్తకాలు సర్దుతుంటే, ఆయన డైరీ కనిపించింది. దానిలో ఒక పేజీ చివర మడత పెట్టిఉంది. వైభవ్ ఫొటో కూడా పిన్ చేసి ఉంది. గుండె బరువుతో తెరిచి చూశాను. ‘మద్రాసు నుండి పని పూర్తిచేసుకుని తిరిగి వస్తున్నపుడు తన మిత్రుని కారులో బయలుదేరిన వైభవ్ మార్గమధ్యంలో యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఈ విషయం మా చిన్నారి మల్లికకు తెలిస్తే ప్రాణాలు విడుస్తుంది. ఆమె జీవించాలంటే ఈ నిజాన్ని నా గుండెల్లో సమాధి చేయాలి. ఈ నిజం నాతోనే అంతమయిపోవాలి. ఇంతకాలం రాకుండా ఏమయిపోయాడన్న సందిగ్ధావస్థలో ఉన్న ఆమెను కాలం మరిపిస్తే, వివాహం చేసి పంపించాలన్నది నా ఉద్దేశం. జీవితం ఒక క్షణంలో ముగిసిపోతుందని ప్రాణంతో ఉన్న ఏ మనిషికీ గ్రహించే శక్తి ఇంకా రాలేదు. బహుశా ఎప్పటికీ రాదేమో కూడా’. డైరీ చదివి ఒక్కసారిగా కుప్పకూలిపోయాను ఎందుకిలా జరిగిందని అడుగుదామని నోరు తెరిస్తే ప్రాణం ఉన్న అక్షరాలు కళ్ళెదుట కనిపించి నన్ను ఓదారుస్తూ ‘నన్ను క్షమించు తల్లీ.. ఈ కన్నీటితో భయంకర నిజం నీకు చెప్పకుండా దాచినందుకు’ అని తన చేతులతో నాన్న నా తల నిమురుతూ నన్ను ఓదారుస్తున్నట్లుంది. ఇదంతా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమించండి. దూరమైన బంధాలన్నీ ఎండమావుల్లాంటివి.. దగ్గరగా వచ్చి దూరమవుతాయి.. కొన్ని జీవితాలింతే.”

మౌనంగా ఉన్న నేను.. “మిమ్మల్ని ఒక మాట అడగమంటారా?” అన్నాను.

“అడగండి” అంది.

“మళ్లీ వసంతం మీ ముందు వాలితే ఆహ్వానిస్తారా..?”

“ఏమో.. చెప్పలేను. దైవం నిర్ణయిస్తే కాదనలేను. ఇందాక మీరే అన్నారుగా ప్రకృతి నీవు కలిసి మాట్లాడుతున్నారని.. మీ మనసులో మాట అడగండి” అని కళ్లు మూసుకుంది.

“నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను.”

ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ఉంది. బహుశా ఇంతకాలం ఏకాంతంలో ఉండి ధ్యానం అలవాటై ఉంటుంది.

“మీకు సమ్మతమయితేనే పెళ్లి చేసుకుంటాను. నన్ను మరోలా భావించకండి. ఒకవేళ మీరు కాదన్నా మౌనంగా ఇక్కడనుంచి వెళ్లిపోతాను. నాకు మిమ్మల్ని చూసిన తరువాత ఎగసిపడే అలల అంచున ఒంటరి తీరంలా కనిపించారు. ఉషోదయాన కిరణకాంతిలో మెరిసే శ్వేతశంఖంలా నన్ను పలకరించారు. అదిగో.. ఇప్పటిదాకా చూసిన ఆ పారిజాతం పూలు రాలి వాడిపోవచ్చు. నా మనసులోని మీ రూపం ఎప్పటికీ చెదిరిపోదు. మీ మాటల్లోని అనుభూతి మరో అనుభూతికి దారిచ్చింది. బహుశా అది మీతో కలిసి పంచుకునే జీవితానికేమో..” అంటూ ఆగాను.

మెల్లగా కళ్ళు తెరిచింది. ప్రశాంతంగా విచ్చుకున్న పద్మంలా మెరిసాయి ఆమె కనులు. అప్పుడే మబ్బులు కమ్మిన ఆకాశం నుండి వర్షపు చినుకులు పారిజాతం చెట్టుపై రాలుతున్నాయి. చాలా అందంగా ఉంది ఆ దృశ్యం.

దూరంగా వేణుగోపాలస్వామి గుడిలో గంటలు మ్రోగుతున్నాయి. ఆ గుడిపైపు చూపిస్తూ రెండు చేతులూ జోడించి నమస్కరించింది.

అవిడియాలు అను చోర పురాణం

0

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి.వి.ఆర్.శివకుమార్ గారి ‘అవిడియాలు అను చోర పురాణం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ద్దుట్నించీ ఫాలాక్షుడి మనసేo బాలేదు. కారణం గత కొద్ది నెలలుగా వ్యాపారం బాలేదు. మార్కెట్ టైటయిపోయింది. క్యాష్ ఫ్లో బొత్తిగా మందగించింది. ఎవడి చేతిలోనూ కాసులు గలగలలాడటం లేదు. ఇదివరకు కనీసం నెల మొదట్లోనైనా నిండుగా ఉండే జేబులు ఇప్పుడు నిత్యమూ చిక్కిపోయే ఉంటున్నాయి. నోట్ల కట్టలు కలలోనో, మీడియాలో అవినీతి నిరోధక శాఖల వారి దాడుల తాలూకు ప్రసారాలలోనో తప్ప కనబడటం లేదు. ఇదివరకు కంటికింపుగా కదలాడిన కస్టమర్లు ఇప్పుడు కoటకింపుగా, శత్రుమూకల్లా కనిపిస్తున్నారు. ఎందరి వెంట పడినా శ్రమకి తగ్గ ఫలితం ఉండటం లేదు.

‘దేశాన్ని ఆధునికత వైపు నడుపుతున్నామంటూ సంతోషిస్తోంది తప్ప, తమ వంటి చిల్లర వృత్తి కళాకారుల జీవితాలని చీకట్లోకి నెడుతున్న విషయం ప్రభుత్వం గమనించటం లేదు. తమ వృత్తి ఎంత రిస్కుతో కూడుకున్నది అయినా, తమకి ఏ బీమా, సంక్షేమ పథకాలూ ఏ ప్రభుత్వమూ ప్రకటించదు. తమ వోట్లు మాత్రం ప్రతి పార్టీ కోరుకుంటుంది. అలాగని, బయటపడి సహాయం చేయమని, వాళ్ళని నిలదీసి అడగటానికి కూడా వెసులుబాటు లేని జీవితాలు తమవి! రెండుచేతులా కష్టపడినా, ఒక్క చెయ్యి నోట్లోకి పోవటం గగనంగా ఉంటోంది. రోజులు ఇలాగే సాగితే, తమ వృత్తివిద్యకి నీళ్ళు వదులుకోవలసిందేనా? దేశంలో అంతరించిపోతున్న రాబందుల్లా తాముకూడా అంతరించిపోక తప్పదా?’

చింతాక్రాంతుడై, ఆలోచనలతో సతమతమైపోతున్న ఫాలాక్షుడు చివరి ఊహతో మరింత డీలా పడిపోయాడు.

‘ఈ వృత్తి తప్ప తమకి ఇంకే పనీ రాదే! ఇది కిట్టుబాటు కాకపోతే, ఇంక బతకటం ఎలాగా?’

కంగారుగా, పక్కనే కొద్ది దూరంలో కూర్చుని ఉన్న పార్ట్‌నర్ కేసి చూశాడు.

కొద్ది దూరంలో కూర్చున్న పార్ట్‌నర్, ఫాలాక్షుడి చింత తనకేమి పట్టనట్టు తీరిగ్గా ఏదో పత్రిక తిరగేస్తున్నాడు. అది చూసి, చిర్రెత్తి అరిచాడు ఫాలాక్షుడు,

“ఏం చేస్తున్నావురా తింగరోడా! పొద్దుటినుంచి కస్టపడి, పదారు పరుసులు కొట్టుకొచ్చాo. అన్నిట్లో కలిపి వంద రూపాయలైనా దొరకలేదు. రేపటి సంగతి తెలవదు. ఈ కార్డు పేమెంట్లూ, పేటియములూ, గూగులు పే లూ వచ్చి, మన బుర్రని పేలు కొరికినట్టు గొరిగేస్తూ, బొత్తిగా బిజినెస్ లేకుండా చేసేశాయి. ఎవడి జేబు కొట్టినా, ప్లాస్టిక్ కార్డులే తప్ప పట్టున పది రూపాయలు దొరకటం లేదు. రాబడి పడిపోతోందే అని నేనేడుస్తుంటే, కొత్త యాపార పథకాలు ఆలోచించేది మాని, పెద్ద సాహితీపరుడి లాగా, పత్రిక చదువుతూ కూర్చొన్నావా!”

తింగరోడు తలెత్తి, బిగినెస్ పార్ట్‌నర్ వైపు చూశాడు.

“అదే ఆలోసిత్తన్నానన్నా! రాను రాను ఈ జేబులు కొట్టే యాపారం పాత పరుసులు అమ్మే దుకాణం పెట్టుకోవటానికి తప్ప, మరెందుకూ పనికి వచ్చేటట్టు కనబడటం లేదు. కాస్త పెద్ద దొంగతనాలు ప్రాక్టీసు చేసే లోగా, పార్ట్ టైమ్ బిగినెస్‌గా ఈ పత్రికలోళ్ల కతల పోటీలకి కతలు రాసుకున్నా పదో, పాతికో దొరుకుద్ది కదా అని సూత్తన్నా.”

ఏడుపు మూడ్ లోంచే నవ్వాడు ఫాలాక్షుడు,

“ఎవుడ్రా నీకు సెప్పింది, పత్రికల్లో కతలు రాస్తే డబ్బులొస్తాయని?”

ఉడుక్కున్నాడు తింగరోడు. వాడు ఇంటర్ పాస్. న్యూస్ పేపర్లే కాక, పత్రికలు కూడా, కొట్టేసి మరీ చదువుతాడు. చోర కళ మీద పత్రికలకి కొన్ని ఆర్టికల్స్ కూడా రాసిన అనుభవం ఉంది. (ఆ ఆర్టికల్స్‌కి అచ్చుమొహం చూసే యోగం పట్టకపోవటం ఆయా సంపాదకులకి చోరకళ మీద ఉన్న చిన్న చూపే తప్ప, వాడి తప్పు కాదు.)

ఫాలాక్షుడు హైస్కూలు గడప తొక్కలేదు. అందుకే, తింగరోడి దృష్టిలో అతడో నిరక్షర కుక్షి.

“నీకు తెలవదులేన్నా, మన పక్క ఈధి ‘ఇంజామర’ని సూడు, అదాడి కలం పేరులే, ఇట్టా నవల రాత్తాడు, అట్టా లచ్చ పడతాడు. ఇట్టా కత రాత్తాడు, అట్టా పదేలు పడతాడు. రాసేవోడుంటే, ఏసే పత్రికలూ ఉన్నాయి, అయిచ్చే బగుమతులూ ఉన్నాయి. ఈ చీకటి కస్టం కంటే, పత్రికలో ఎలుగు సూడ్డమే తేలిక గదన్నా.”

“ఆడికి దేముడిచ్చిన బుర్ర ఉందిరా, మన ఇద్దరికీ కలిపినా నాలుగు సేతులు తప్ప ఏమున్నాయి?”

“ఆడికి దేముడిచ్చిన బుర్ర మనం తెచ్చేసుగుందాం. ఈ పత్రికోళ్ళు కొత్త కతల పోటీ ఎట్టారు. పాతిక ఏల ప్రైజు. ఆ ఇంజామర ఎలాగూ ఓ కత రాసేసి ఉంటాడు. ఈ రేత్రికి ఎల్లి, ఆ కత మన తెచ్చేసుకుని, పత్రిక్కి పంపేద్దాం. పాతిక ఏలు పట్టేద్దాం.”

తింగరోడి ఆలోచన తింగరగానే తోచింది ఫాలాక్షుడికి. అయితే, అంతకన్నా మెరుగైన ఆలోచన రెడీమేడ్‌గా ఏది తట్టలేదు. మరో అవిడియా ఏదీ తయారుగా లేకపోవడాన, అయిష్టంగానే అయినా, తింగరోడి అవిడియానే ఒప్పుకునేశాడు.

జేబులు కొట్టే చిల్లర వృత్తి నుంచి, ప్రమోషన్ తీసుకుని, దొంగతనాలకి దిగటం ఇదే ఆరంభం.

ఆ రాత్రే ఇద్దరూ పక్కింటి గేటు ఎక్కి, వణుకుతున్న కాళ్ళని బుజ్జగించి కాంపౌండ్ లోకి దూకారు. పాతకాలపు పద్ధతే అయినా, సాంప్రదాయ బద్ధంగా ఉంటుందని ఇంటి గోడకి కన్నం వేశారు. మెల్లగా లోపలికి దూరారు. ముహూర్తం మంచిది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు, నేరుగా డ్రాయింగ్ రూమ్ లోకే దారితీసింది ఆ చోర మార్గం. సెల్ ఫోనులో టార్చ్ వేసుకుని, అడుగులో అడుగు వేసుకుని, అక్కడున్న టేబుల్ చేరుకుని, దాని సొరుగు లాగాడు తింగరోడు. అందులో కనబడిందొక డైరీ లాంటి నోట్ బుక్. దానిమీద, ‘ఇతివృత్తాలు-సారాంశాలు’ అని వుంది.

“ఇదిగిందులో ఉంటాయి కతలు. పట్టుకుపోదాం.” అన్నాడు.

ఇంతలో ఆ డ్రాయర్ లోనే కనబడింది, అయిదొందల నోట్ల కట్ట. ఆత్రంగా దాన్ని, బయటకు తీసి లెక్క పెట్టాడు ఫాలాక్షుడు. ఇరవై రెండు వేలు ఉన్నాయి.

“ఆహా.. మనకింక డొంకతిరుగుడు అవసరం లేదు. కతా వొద్దు, గితా వొద్దు, నేరుగా నచ్చిందేవే కరుణించేసింది. పద, పద..” అంటూ, తింగరోడి చెయ్యి పట్టి లాగాడు.

తింగరోడి చేతి లోని పుస్తకం కింద పడిపోయింది. ఆ ఊపుకి టేబుల్ సొరుగు పూర్తిగా బయటకు వచ్చి, పెద్ద శబ్దంతో వాడి కాలిమీద పడింది.

“సచ్చాను” అంటూ తింగరోడు పెట్టిన కేకకి బెడ్ రూమ్‌లో పడుకుని, నిద్ర లో ‘కథ’ గంటున్న ‘వింజామర’కి మెలకువొచ్చేసింది. చటుక్కున లేచి, డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. క్రింద పడ్డ సొరుగు మీదా, ఆ వెంటనే ఫాలాక్షుడి చేతిలోని డబ్బుకట్ట మీదా పడింది అతడి దృష్టి.

వింజామరని చూస్తూనే, డబ్బు కట్ట విసిరేసి, బయటకు పరుగెట్టాడు ఫాలాక్షుడు. కిందపడ్డ తింగరోడు, వింజామర చేతికి చిక్కాడు.

“ఎబ్బే, డబ్బు కాదు. అవిడియాల కోసం వచ్చాం – బగుమతి దొరికింది. అంతే..” తడబడుతూ చెప్పాడు తింగరోడు.

వాడేమన్నాడో ఆవగింజంతైనా అర్థం కాక అయోమయంగా చూశాడు ‘వింజామర’.

అతడు అయోమయంలో పడ్డ క్షణాలని సద్వినియోగం చేసుకుంటూ, ఊరకుక్కలాగా అతడి చేతిని కొరికి, వేట కుక్కలాగా గోడకి పెట్టిన కన్నం లోనుంచే బయటికి దూసుకుపోయాడు తింగరోడు.

“సచ్చాను” అంటూ పిచ్చికుక్కలాగా అరవడం ఇప్పుడు ‘విoజామర’ వంతైంది.

పళ్ళు దిగిన చేతిమీద మూతితో గాలి ఊదుకుంటూ వంగి, కిందపడ్డ డబ్బు ఏరుకుంటుండగా అతగాడి కంట బడింది, కిందపడి ఉన్న నోట్ బుక్.

‘యదవలు. ఇది పట్టుకుపోయారు కాదు, బోలెడు ‘ఇతివృత్తాలు, పాయింట్లు’ మిస్సయి పోయేవి. మళ్ళీ మళ్ళీ ఆ ఇంగ్లీష్ నవలలన్నీ చదవలేక చచ్చేవాడిని.’ అనుకుంటూ, నోట్ బుక్ తీసుకుని కళ్ళ కద్దుకున్నాడు.

“లచ్చిందేవి చంచలం గానీ, సరస్పతీ దేవి అలాక్కాదురా, మనకి అంత తేలిగ్గా చిక్కదు. ఇంకెప్పుడూ ఇలాటి పనికిమాలిన సలాలు చెప్పమాకు.”

అనేశాడు ఫాలాక్షుడు ఇంటికి తిరిగొచ్చాక, తింగరోడి మీద మండిపడుతూ.