back to top
Home Blog Page 9

విష్ణు నిలయం

0

[మణి గారు రాసిన ‘విష్ణు నిలయం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]రా[/dropcap]త్రి 11 అవవస్తోంది. అంతా నిశ్శబ్దం అలముకొంది. అష్టమి చంద్రుడు, చీకట్లను తరిమికొట్టడానికి, తన వంతు ప్రయత్నం చేస్తూనే వున్నాడు.

అందరినీ నిద్ర, తనలోకి లాక్కుంటోంది, ఒక ఇల్లు మినహాయించి. అది పెద్ద ఇల్లు. దాని పేరు విష్ణు నిలయం. చుట్టూ పెద్ద తోట. పెద్ద పెద్ద చెట్లతో అడవిని మరిపిస్తోంది.

ఆ ఇంటి దగ్గరకి, ఇంకా నిద్ర చేరలేకపోయింది. దానికి కారణం వుంది.

***

చాలా ఏళ్ళుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. దానితో, ఆ ఇంటి చుట్టూ వున్న స్థలం, విచ్చలవిడిగా పెరిగిన గడ్డీ, మొక్కలతో అడవిలా తయారయింది. మనుష సంచారం లేకపోవడంతో, చాలా రకాల జీవాలు అక్కడకి చేరాయి.

కానీ అనుకోకుండా, మూడు రోజుల నుంచి, మనుష సంచారం ఎక్కువ అయింది. గడ్డి కొట్టి వేయడం, మొక్కలు కొట్టివేయడంతో పాటు ఇంటిని, తోటనీ అంతా శుభ్రం చేయడం. ఒకటే హడావిడి..

అన్ని ఏళ్ళు భయం లేకుండా అక్కడ సుఖంగా వుంటున్న జీవాలలో అలజడి రేపింది. కొత్తగా ఏర్పడ్డ పరిస్థితికి, ఆ రాత్రి అందరూ అక్కడ సమావేశం అయ్యారు.

 ఒక కుందేలు మొదలు పెట్టింది. “రెండు అడవి కుందేళ్ళని పట్టుకుపోయారు. చాలా ఏళ్ళనుంచి ఏ భయమూ లేకుండా వున్నాము” మాటలు రాక దాని గొంతు గద్గదమయింది.

మళ్ళీ అంది, గొంతు పెకలించుకొని, “భయం వేస్తోంది!” ఇంక దానికి మాటలు రాలేదు.

“అడవి కుందేళ్ళు ఎప్పుడూ అనేవి, ‘అడవి కన్నా ఇక్కడ బాగుంద’ని! ‘అడవిలో ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలి. ఇక్కడ ఏ భయమూ లేకుండా వున్నామ’ని.”

“చివరకి, వాళ్ళు మనకి లేకుండా అయిపోయారు” దానికి మళ్ళీ దుఖం ముంచుకు వచ్చింది.

“అవును! భయంగానే వుంది” అంది ఒక పక్షి.

“జరగరానిది ఏదయినా జరిగితే, పిల్లలతో ఎక్కడకి వెళ్తాము!? రెక్కలు రాని పసి కూనలు. కొందరు ఇంకా గుడ్లు పొదగలేదు. వదిలి వెళ్ళగలమా!” దానికీ దుఖం వచ్చింది.

ఇంకో పక్షి అందుకుంది, “అన్నిటినీ మించి, మాకు ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన మిమ్మల్ని తలచుకుంటే ఇంకా బాధగా వుంది. మీకు ఏదయిన జరిగితే.. ఊహించుకోడానికి కూడా బాధ గానూ, భయం గానూ వుంది. మీతోనే మా ఉనికి..” అని, అక్కడ తాము గూడు కట్టుకున్న చెట్లని ఉద్దేశించి అంది.

జమ్మి, వేప, రావి, మామిడి, నేరేడు, మారేడు, అక్కడ పెద్దగా విస్తరించి వున్నాయి. అందుకే చాలా పక్షులు అక్కడ చేరి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

చెట్లన్నీ, మౌనంగా వుండిపోయాయి.

“మీరు ఇక్కడే పెరిగి పెద్ద అయ్యారు. మీ గురించి కూడా, కాస్త అలొచించరే?” ఒక పక్షి నిష్ఠురంగా అంది.

“నేను చూసాను! యజమానిలా వున్నాడు. పెద్ద అయ్యని. ప్రేమగా ముట్టుకుని, ‘వీటిని నేనే వేసాను! మా నాన్న నాతో వేయించాడు’ అంటూ మిగిలిన వాళ్ళతో చెప్పడం చూసాను” ఇంకొక పక్షి అంది.

“అవును. అతనే! నన్ను తాకినప్పుడు, అతన్ని గుర్తు పట్టాను. మమ్మల్ని మొక్కలుగా ఇక్కడ వేసాడు. మాతోనే, పెరిగాడు. మాతో, చాలా కబుర్లు చెప్పేవాడు. ఆటలు ఆడేవాడు” రావి చెట్టు అంది.

మళ్ళీ అంది, “చిన్నప్పుడు వేరు. పెద్ద అయ్యాక మారుతారు. చిన్నప్పుడు, అన్నిటితోనూ కబుర్లు చెప్తారు, ఆడతారు. పెద్ద అయ్యాక, తమని తాము అన్నిటినుంచి వేరుగా, ఆవిష్కరించుకుంటారు. అందుకే, ప్రకృతికి కూడా దూరం అవుతారు.”

కాస్సేపుండి, మామిడి చెట్టు అంది “మాదేముంది! మీ గురించే మాకూ ఆందోళన. పిల్లలని వదలి ఎలా వెళ్తారు? ఎలా, ఎక్కడకని తీసుకుపోతారు!?”

“మా బతుకులు, ఈ మనుషులతోనే, ముడి పెట్టాడు దేవుడు. మేము వున్నా ఈ మనుషుల కోసమే! మరణించినా వారి కోసమే! వారి తోనే, ఏదో ఒక రూపంలో వుంటాము.. చివరకి మనుషులు మరణించినా వారితో మేమూ కాలాల్సిందే! ఇది మా నుదుట రాసిన రాత.”

“మాలో, స్థితప్రజ్ఞత పెంచడానికే ఏమో, దేవుడు మమ్మలని, స్థాణువులుగా చేసాడు. అదే, మమ్మలని ఎప్పుడూ తపస్సులో వుండే టట్లు చేస్తుంది” అంది జమ్మి చెట్టు.

మిగిలిన చెట్లు తలలు ఊపాయి, “అవును!” అన్నట్లు.

“మీరు ఎంతయినా, తపస్విలు. కాస్త కూడా కోపం రాదు మీకు! మీ గురిచి కూడా మీరు ఆలోచించాలని అనుకోరు. దేనినీ వ్యతిరేకించరు. అందుకే మిమ్మల్ని, జ్ఞానులు పూజిస్తారు.”

వున్నట్లుండి, కొత్తగా రెక్కలు వచ్చిన ఒక పక్షి, చెట్లని ఉద్దేశించి, “మీకు ఏదయినా జరుగుతుందేమో అనే ఆలోచన కూడా నేను భరించలేక పోతున్నాను” అంది.

“ఏమీ చేయలేమా?”

“ఎందుకు చేయలేము?”

“పెద్ద అయ్యలని రక్షించుకుంటే మనమూ క్షేమంగా వుంటాము.”

“అవును!” అందరూ అంగీకారంగా తలలు ఊపారు.

“ఏదయినా, నేను ఇక్కడే ప్రాణాలు వదులుతాను. పిల్లలని వదలి వెళ్ళలేను” అంది ఒక పక్షి.

“మనము ఊహిస్తున్నట్లు ఏమీ జరగక పోవచ్చు” అంది కళ్ళ గుడ్లు, గుండ్రంగా తిప్పుతూ, ఒక ఉడత.

“ఎన్ని చోట్ల చూడలేదు. చెట్లు కొట్టేయడం! ఇళ్ళు కట్టడం! అనుభవాలని దృష్టిలో పెట్టుకొని, ఆలోచించడం మంచిది కదా!” ఒక పక్షి అంది.

“అలా అని కీడుని, ఊహించుకొని దాని మీదే దృష్టి పెట్టుకోవడం కన్నా, ఏమి చేయాలని ఆలోచిస్తే మంచిది అని నా ఉద్దేశం” చెప్పింది ఇంకొక పక్షి.

“ప్రకృతిలో మనకంటూ ఏమీ లేదా? మనము ప్రకృతిలో భాగస్వాములం కామా? ఎప్పుడూ ఇలా మనుషుల మీద ఆధారపడి బతకడమేనా?” ఆక్రోశించింది ఒక కుందేలు.

“నేను చచ్చిపోయి పైకెళ్తే, దేవుడిని అడుగుతా ‘ఈ మనుషులకే, అందరి మీద ఎందుకు ఆధిపత్యం కలిగించావు?’ అని” అంది ఇంకో కుందేలు.

“దేవుడు అందరికి సమాన అధికారాలే ఇచ్చాడుట! నేను అడవిలో ఉన్నప్పుడు విన్నాను. మనుషులకి ఆశ ఎక్కువ. దురాశ కూడాను.”

“మననే కాదు వాళ్ళల్లో వాళ్ళు కూడా, బలిష్టులు, బలహీనులని హింసిస్తూనే వుంటారుట”.

“వాళ్ళల్లో, స్వార్థం ఎక్కువ అంటారు, అడవిలో అందరూ!” తోట శుభ్రం చేసేడప్పుడు, వాళ్ళ కంట పడకుండా తప్పించుకున్న, అడవి కుందేలు ఒకటి, ఆరిందాలా అంది.

అందరూ ఎవరికి తోచింది వాళ్ళు చెపుతూ.. అలా జరుగుతోంది వాళ్ళ సంభాషణ.

***

ఇంక.. అక్కడ ఇంట్లో కూడా, ఉద్విగ్నత నెలకొంది. కానీ అది ఎక్కువ ఉద్వేగం వల్ల వచ్చింది.

చాలా ఏళ్ళ తర్వత వచ్చిన విష్ణుకి, ఆ ఇల్లు, తోట చూసాక చిన్నప్పటి విషయాలు ఒక్కొకటీ గుర్తుకు వస్తూంటే ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ఎంతో ఉత్తేజంగా మాట్లాడుతున్నాడు భార్యతో, వీడియో ఫోన్‌లో. వచ్చినప్పటి నుంచీ ఇల్లు, తోట అంతా ఫొటోలు, వీడియోలు, తీసి పంపుతున్నాడు.

విష్ణు చాలా ఏళ్ళుగా, అమెరికా లోనే వుంటున్నాడు. అతనికి తల్లీ, తండ్రీ పోయాక, ఇండియాకి రావాల్సిన అవసరమూ కలగలేదు. ఆసక్తీ కలగలేదు. ఇండియాలో వున్న, ఇంటి గురించి కూడా మర్చిపోయాడు.

వున్నట్లుండి చిన్నప్పటి స్నేహితుడు వాసు ఫోన్ చేసి, ఇల్లు అమ్మకం గురించి ప్రతిపాదించడం, ఒక వారం రోజులలోనే, అంతా అయిపోయేటట్లు ఏర్పాటు చేస్తానని భరోసా కల్పించడంతో, విష్ణు ఇండియాకి, ఇంటికీ రావడం జరిగింది.

వచ్చినప్పటి నుంచి, వాసునే అన్ని ఏర్పాటులు చేస్తున్నాడు. ఇల్లు, తోట శుభ్రం చేయడం, ఇంట్లో తను వుండడానికి అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పించడం, అన్నీ వాసూనే, దగ్గర వుండి చూసుకుంటున్నాడు.

విష్ణు హోటల్‌లో వుంటానంటే, “ఇల్లు అమ్మేస్తావు కదా. మీ ఇంట్లోనే వుండు. జ్ఞాపకాలు వుంటాయి.” అంటూ వాసు, ఇంట్లో ఉండటానికి అవసరం అయిన అన్ని ఏర్పాటులు చేసాడు. అదే చెప్తున్నాడు భార్య రమతో

“రమా! అంతా వాసూనే చూసుకుంటున్నాడు. అతను చెప్పినట్లే వారం రోజుల్లో, అంతా అయిపోయేలా వుంది. ఈ రోజు ముగ్గురు వచ్చి చూసారు. సీరియస్ బైయర్స్ లానే వున్నారు.” అంటూ చెప్తూ వున్నాడు. ఈ లోపల పిల్లలు శ్రీ రాం, అపర్ణ, కూడా ఫొన్ దగ్గరకి వచ్చారు.

“డాడీ! తోట బాగుంది. చేట్లు ఎంత పెద్దవి” పిల్లలు ఇద్దరూ పోటీ పడుతున్నారు, మాటాడడానికి.

విష్ణు కూడా, వాళ్ళకి, ఉత్సాహంగా చెప్పసాగాడు. తన తండ్రి, తనతో ఆ మొక్కలు ఎలా వేయించిందీ, తను వాటికి ఎంత శ్రద్ధగా నీళ్ళు పెట్టిందీ, తను వాటి నీడలో, చదువుకున్నదీ, ఆడుకున్నదీ, వాటితో కబుర్లాడిందీ, అన్నీ, చాలా ఆసక్తిగా చెప్పసాగాడు.

“మా నాన్న ఈ ఇంటిని నేను పుట్టినపుడు కట్టాడు. అందుకే ఈ ఇంటి పేరు ‘విష్ణు నిలయం’ అని పేరు పెట్టాడు. ఆయనకి చెట్లన్నా, మొక్కలన్నా చాలా ఇష్టం. అందుకే ఊరికి దూరంగా పెద్ద స్థలం తీసుకొని, ఇల్లు కట్టించాడు.”

పిల్లలు కూడా చాలా కుతూహలంతో వినసాగారు. “విష్ణు నిలయం! బాగుంది పేరు” పిల్లలు సంబరపడుతూ అన్నారు.

వాళ్ళు జ్ఞానం వచ్చేక, ఇక్కడకి రాలేదు. అందుకే, ఆ ఇంటి గురించిన విషయాలు, ఎక్కువగా వాళ్ళకి తెలియవు. అందుకే, ఆసక్తిగా వింటున్నారు.

వున్నట్లుండి శ్రీరాం అన్నాడు – “ఇప్పుడు, నువ్వు ఆఇల్లు అమ్మేస్తే, కొనేవాళ్ళు, ఆ చెట్లని కొట్టేస్తారేమో డాడీ!”

“అయ్యో! అవును డాడీ!” అపర్ణ కోరస్.

“వాటికి ఏమైనా అవుతే నీకు బాధ వుండదూ?”

“ఉష్! ఉష్!…” అంటూ వాళ్ళని వారించింది రమ. విష్ణు, శ్రీరాం మాటలకి కాస్సేపు అవాక్కయ్యాడు.

పిల్లలు, వాళ్ళకి చిన్నప్పుడు కొనిపెట్టిన బొమ్మలు, ఇంకా ఇప్పటికీ, పక్కలో వుంచుకొని పడుక్కుంటారు. వాళ్ళవరకూ, అవి జీవంతో వున్నట్లే. అందుకే వాళ్ళకి అలా అనిపించడంలో, అటువంటి ప్రశ్న రావడంలో, ఆశ్చర్యం ఏమి లేదు.

చిన్నప్పుడు తనూ, ఆ చెట్లతో, తన పిల్లల లాగే, ఆడుకున్న వాడే. కానీ మధ్యలో, ఆ కనెక్క్షన్, పోయింది. చదువులూ, ఉద్యోగాలు! ఇలా, రకరకాల ఒత్తిళ్ళు, ఆ బంధాన్ని మరుగుపరిచాయి. మర్చిపోయేలా చేసాయి.

అందుకే, ఇల్లు అమ్ముదామనుకున్నప్పుడు కూడా ఎటువంటి ఫీలింగ్ కలగలేదు. ఇక్కడకి వచ్చాక కానీ, ఆ ఇంటితో, తనకి వున్న అనుబంధం గుర్తుకు రాలేదు.

గిల్టీగా అనిపించసాగింది అతనికి, ఆ చెట్లు తనతో పాటు పెరిగాయి. వాటితో ఆడుకున్నాడు, పాడుకున్నాడు. కానీ అన్నీ మర్చిపోయాడు.

“నీతోనే పెరిగాయి కదా! నీకు సిబ్లింగ్స్‌లా కదా. వాటికి ఏమయినా అవుతే నీకు బాధ కాదూ!”

“అబ్బా!, శ్రీరాం! అపర్ణా! వుండండి!.. ఇప్పుడు వాటిని ఎవరు ఏమి చేస్తున్నారు?” అంటూ పిల్లలని గదమాయిస్తోంది రమ.

“నీకు తెలియదు మమ్మీ! వాళ్ళు, వాటిని కొట్టేస్తే? డాడీకి వాటితో వున్న కనెక్షన్ వాళ్ళకి వుండదు.”

“చాల్లే, చెప్పొచ్చేరు!” రమ వాతావరణాన్ని తేలిక చేస్తూ అంది.

“వాళ్ళ మాటలు పట్టించుకోకండి. ఇంక పెట్టేస్తా. వీళ్ళని స్కూల్‌లో దింపాలి” అంటూ ఫోన్ పెట్టేసింది రమ.

పిల్లల ప్రశ్నలు, ఇంకా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తాయి విష్ణులో. పిల్లలు అమాయకంగా మాట్లాడినట్లు వుంటుంది కానీ ఆ మాటల్లో చాలా నిజాయితీ వుంటుంది. కల్తీ లేని నిజాయితీ!

‘అవి నాతో పాటే పెరిగాయి కదా. శ్రీరాం చెప్పినట్లు సిబ్లింగ్స్ లానే. కానీ, వాటికి ఒక మాట కూడా చెప్పకుండానే, ఇల్లు అమ్మెయ్యాలని అనుకున్నాడు, అది ఎంత వరకు సరైనది? వాటికీ, నాలానే ఈ స్థలం పైన హక్కు వుంటుందిగా.’

‘మాటాడలేవనేగా, వాటిని పక్కకి పెట్టేస్తాము.. మాటలు వస్తే అవీ గొడవ పెట్టేవి. కోర్టుకి వెళ్ళేవి. వాటిని ఇంత వరకూ ప్రేమగా పలకరించను కూడా లేదు నేను.’ ..మనసులోకి, తెరలు తెరలుగా, అలా ఆలోచనలు వస్తూనే వున్నాయి.

ఉన్నట్లుండి, దుఖం పెల్లుబికి వచ్చింది విష్ణుకి. ఏదో కోల్పోయినట్లు అనిపించింది.

ఇంతలో రమ ఫోన్. “పిల్లలని స్కూల్‌లో దింపాను” అంటూ.

రమ గొంతు వినగానే, దుఖం వెల్లుబికింది. తనని తాను తమాయించుకుంటూ, దుఖంతో పూడుకుపోయిన గొంతుని, సరి చేసుకుంటూ, – పిల్లల ప్రశ్నలతో తన మనసులో పుట్టుకొచ్చిన ఆలోచనలు, భావాలు, తనలో కలిగిన అపరాధ భావన.. – అన్నీ చెప్పాడు. అంతా ఓర్పుగా వింది రమ.

“విష్ణూ! అసలు ఇప్పుడు, అంత అర్జెంట్‌గా ఆ ఇంటిని అమ్మాల్సిన అవసరం ఏముంది? ప్రశాంతంగా, ఎటువంటి ఒత్తిడులకీ, ప్రభావితం కాకుండా, అలోచించి, నీకు ఏమి చెయ్యలని అనిపిస్తే అది చెయ్యి. సరేనా? నేను ఇంక పెట్టేస్తా. నాకు, ‘బాక్ టు బాక్’ మీటింగ్స్ వున్నాయి” అంటూ రమ ఫోన్ పెట్టేసింది.

రమతో మాట్లాడేక, కాస్త ఉపశమనం పొందాడు విష్ణు. ఆలోచిస్తూనే, నిద్ర లోకి ఒరిగాడు.

***

జెట్ లాగ్‍తో, తెలతెలవారుతూంటేనే, మెలుకువ వచ్చేసింది విష్ణుకి.

లేచి, కాఫీ కలుపుకొని, తనకి అవసరమయిన అన్ని ఏర్పాటులూ చేసిన, వాసూకి మనసు లోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాకిలి తలుపు తెరిచాడు, కళ్ళ ముందు దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు.

***

వాకిలి నిండా, రక రకాల పక్షులు నిలబడి వున్నాయి. మాములుగా కాస్త శబ్దానికే, బెదిరి ఎగిరిపోయే పక్షులు, కాస్త కూడా చలించకుండా, అలాగే నిల్చున్నాయి.

విష్ణు, పక్షులని.. పక్షులు, విష్ణుని.. అలా చూస్తూనే వుండి పోయారు కాస్సేపు.

‘అవి, నన్ను ప్రశ్నిస్తున్నాయా? ఏమయినా చెప్పాలని అనుకుంటున్నాయా?’ అవి, కాస్త కూడా జంకకుండా వుండడం ఆశ్చర్యంగా అనిపించింది.

‘ఇంగ్లీష్ సినిమాలో లాగ నా మీద దాడి చేయవు గదా?!. అన్నీ, అంత కలిసికట్టుగా అలా నిలబడ్డాయంటే, ఏదో ఒక ప్రత్యేకమయిన ఉద్దేశం తోనే, అయి వుంటుంది’ అనుకుంటూ వాటినే చూస్తున్నాడు.

విష్ణుకి, కాస్త భయం, కాస్త విస్మయం, ఇంకా అయోమయం. అచేతనంగా అలానే చూస్తూ వుండి పోయాడు.

కాస్సేపటికి, వుండి వుండి, వెనకకి తిరిగి, తన వైపే చూస్తూ, పక్షులు గుంపుగా, తోటలోకి దారి తీసాయి. అవి తనని పిలుస్తున్నట్లే అనిపించింది విష్ణుకి. మంత్రముగ్ధుడిలా వాటిని వెంబడించాడు.

పక్షులన్నీ, గుంపులు గుంపులుగా విడిపోయి, తలో చెట్టు దగ్గర, నిలబడ్డాయి. వాటి దృష్టి తనని కాసింత మాత్రం కూడా వదలటం లేదు. అతను వాటిని సమీపించగానే, అవి ఎగిరి కొమ్మల మీద నిలబడ్డాయి.

తల ఎత్తి చూసిన విష్ణుకి, విస్తరించిన కొమ్మల మీద పక్షి గూడులు, లెక్కపెట్టలేనన్ని గూడులు, కనిపించేయి.

కొన్ని గూడుల లోంచి, వచ్చి రానీ రెక్కలతో, పక్షి పిల్లలు. కొన్ని, శబ్దాలు చేస్తూ మెడలు బయటకి పెట్టి చూస్తున్నాయి.

విష్ణుకి, వేరే ప్రపంచం లోకి వెళ్ళినట్లు అనిపించింది. కాస్సేపు అలానే చూస్తూ వుండిపోయాడు.

అతనికి అర్థమయింది, తనని, పిల్లలు ప్రశ్నించినట్లే అవీ ప్రశ్నిస్తున్నాయి “ఎక్కడకి పోవాలి మేము?” అని. ఆ అలోచనకి, అతనికి ఇంక నిలబడడానికి కూడా శక్తి చాలలేదు. అక్కడ, ఆ వేప చెట్టు మొదట్లో కూలబడ్డాడు.

చెట్టు మొదలుకి, నడుం వాల్చి కళ్ళు మూసుకున్నాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళ నుంచి, నీళ్ళు జాలువారాయి.

గుండెలోంచి దుఃఖం పొంగి వచ్చింది, వాటి నిస్సహాయతకి, తన స్వార్థానికి సిగ్గుగా అనిపించింది. దేని గురించీ ఆలోచించకుండా తను తీసుకున్న నిర్ణయానికి, తను సిగ్గుపడాల్సిందే కదా.

మెడ పైకెత్తి, పక్షుల కేసి, చెట్ల కొమ్మల లోకి చూస్తూ అన్నాడు “నన్ను క్షమించండి.”

లేచి, అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి, ఒకసారి కౌగలించుకున్నాడు, “నన్ను క్షమించండి!” అంటూ చెట్ల మొదలుని, చేతితో నిమురుతూ “మీరంతా నన్ను క్షమించండి. నాతో సమానంగా పెరిగారు. మీరంతా నాకు తోబుట్టువులు.”

“ఈ స్థలం పైన నాతో సమానంగా మీకూ హక్కు వుంది. మీతో ఒకమాట కూడా చెప్పకుండా, ఈ ఇల్లు అమ్మేద్దామనుకున్నా. తప్పే! “

“దేవుడి దయ వల్లో, తల్లి తండ్రుల ఆశీర్వాదం వల్లో, ఇల్లు అమ్మాల్సిన అవసరం నాకు లేదు. రాదనే అనుకుంటున్నా. మీ హక్కుని నేను గౌరవిస్తాను. మీరు ఆశ్రయం ఇస్తున్న ఈ ప్రాణులందరికీ కూడా చెప్పండి. నేను మిమ్మలని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టను. వింటున్నారా?”

విష్ణు తల పైకెత్తి, ఆగి ఆగి గట్టిగా చెప్తున్నాడు, ఉద్విగ్నతతో, ఆ చెట్లతో, ఆ పక్షులతో, ..అక్కడ జీవాలన్నిటినీ, ఉద్దేశిస్తూ, అవన్నీ విన్నాయో లేదో, అసలు వింటాయా అనే సందేహం కాస్త, కూడా లేకుండా.

విష్ణుని, ఆ పరిస్థితిలో చూసేవాళ్ళు ఎవరయినా, ‘అతనికి పిచ్చి గాని పట్టలేదు గదా’ అని అనుకోకుండా వుండలేరు.

విష్ణుకి శరీరం అంతా ప్రకంపనలు, కాళ్ళు బలహీనమయ్యాయి. మళ్ళీ, ఒక చెట్టు మొదటలో కూలబడి, చెట్టుకి, తల ఆనించి భారంగా కళ్ళు మూసుకున్నాడు ‘నాకు ఏమైంది?’ అనుకుంటూ.

శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోడానికి, ప్రయత్నిస్తూ కళ్ళు తెరిచాడు. కళ్ళముందు మునపటిలానే, పక్షుల గుంపు, నిలబడి తననే చూస్తున్నాయి.

నెమ్మదిగా తనని సమీపించాయి. ఒకటి భుజాలమీద, ఒకటి ఒళ్ళోను, మరొకటి తన చేతి మీద, తల మీద కొన్ని, వాలాయి. అలా అన్నీ అతనిని కప్పి వేస్తున్నాయి..

ఇంతలో ఒక పక్షి దాని నోట్లో వున్న నేరేడు పండుని తన చేతిలో వుంచింది. అలా ఒక్కొక్కటి, ఒక్కొక్క పండు తెచ్చి తన చేతిలో జార విడుస్తున్నాయి. గుప్పిడి నిండింది పళ్ళతో.

విష్ణుకి అర్థమైంది, అవి తన మాటలు విన్నాయని, కృతజ్ఞతని తెలియ చేసుకుంటున్నాయని.

దగ్గరగా వస్తున్న, వాటిని ప్రేమగా నిమిరాడు. అతనిలో, అంత వరకూ అతనిని ఉద్విగ్నపరచిన గిల్టీనెస్ పక్కకి జరిగింది. అతని హృదయాన్ని, ప్రేమ వెల్లువలా ముంచెత్తింది.

కళ్లనుంచి నీళ్ళు అతనికి తెలియకుండానే ఆగకుండా చెంపల మీదకి జారిపడసాగాయి. అలౌకిక అనుభూతితో తనని తానే మర్చిపోయి చాలా సేపు ఉండిపోయాడు.

పక్షులు కూడా ఎటువంటి భయం లేకుండా, అతన్ని కప్పి వేస్తున్నాయి, కాస్సేపు వాటి ముక్కులతో, అతనిని ప్రేమగా తాకుతూ. రెక్కలతో అతనిని నిమురుతూ.

నెమ్మదిగా పొద్దు పొడవడంతో, భానుని కిరణాలు తీక్షణంగా మారాయి. పక్షులన్ని వారి వారి స్థానాలకి వెళ్ళిపోయాయి. వాటి వాటి పనులలో మునిగిపోయాయి.

***

 ఆ అలౌకిక స్థితి నుంచి బయటకి వచ్చిన విష్ణుకి, శరీరం, తేలిక అయినట్లు అనిపించింది.

లేచి, రెండు చేతులలో నేరేడు పళ్ళతో, ఇంట్లోకి వచ్చాడు. పళ్ళు అక్కడే వున్న బల్ల మీద పెట్టి, చాలా సేపు మంచం మీద అలానే పడుక్కుండి పోయాడు. మనసు కూడా తేలిక అయింది, తెలియని అనందంతో.

కాస్సేపటికి తేరుకొని, జరిగినది అంతా నెమరు వేసుకుంటూ, ఫోన్ చేసి, రమకి జరిగినది చెప్పాడు. చెప్తూంటే, మళ్ళీ భావోద్వేగానికి గురి అయ్యాడు.

“ఇది, నిజమో, కలో తెలియటం లేదు. నాకు ఏమైనా అయింది అంటావా?” అంటూ.

విష్ణు చెప్తూండగానే, పిల్లలు అక్కడకి చేరారు. అంతా వింటున్న రమ, పిల్లలు దిగ్భ్రాంతి చెందారు.

“డాడీ! అయ్యో మేము, మిస్ అయ్యాము. ఈసారి మేమూ వస్తాము.”

“అలాగే! ఈసారి నుంచి అందరమూ ప్రతి సంవత్సరమూ వద్దాము.”

“డాడీ! నువ్వు ఎందుకు వీడియో తీయలేదు?..”

పిల్లల హడావిడికి, తమని మాట్లాడనిచ్చేలా లేరని, “మీరు పొద్దున్నే లేవాలి. వెళ్ళండి ఇంక! పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో రాకూడదని ఎన్ని సార్లు చెప్పాలి?” అంటూ పిల్లలని అదిలించి అక్కడ నుంచి, వెళ్ళగొట్టింది.

పిల్లలు వెళ్ళిపోయాక, “ఇల్లు అమ్ముతున్న విషయం అవి ఎలా గ్రహించాయి?” ఆశ్చర్యపోతూ అంది.

మళ్ళీ అంది. “అందుకే మనుషులకి వున్న జ్ఞానం, ప్రాణులన్నిటికీ కూడా వుంటుంది అంటారు. ప్రకృతి మన ఆలోచనలు, మాటలు, వింటుందంటారు. అది నిజమే అనిపిస్తోంది.”

ఊ!.. కొట్టాడు విష్ణు.

“పిల్లల వల్ల, నేను పెద్ద పాఠం నేర్చుకున్నాను” ఉండుండి చెప్తున్నాడు, విష్ణు.

“ప్రకృతి అందరిదీను. ఆ సత్యాన్ని గౌరవించాలి. అందరికీ హక్కులుంటాయి. మూగవి అని వాటి హక్కుల గురించి ఆలోచించక పోవడం, లక్ష్య పెట్టక పోవడం, నిరంకుశత్వమే అవుతుంది..”

విష్ణు మాటలకి నవ్వింది, రమ.

మళ్ళీ అన్నాడు, “పిల్లల మాటలని పట్టించుకోము గానీ, వాళ్లు చెప్పేవి అన్నీ నిజాలు. మన కండిషనింగ్‌తో, మనం వాటిని ఒప్పుకోకపోవచ్చు. అంత మాత్రాన, అవి నిజం కాకుండా వుండవు.”

“అయితే, ఇల్లు అమ్మనట్లేగా! “

“అవును.”

రమ మాటలకి తడుముకుంటూ, వుండుండి అంది,..

“నీది మంచి మనసు విష్ణూ! అందుకే ఇటువంటి అపురూపమయిన అనుభవం నీకు కలిగింది. నాకూ, వింటూ ఉంటేనే, ఒళ్ళు జలదరించింది. తలుచుకుంటే కూడా.. ఇటువంటి అనుభవాలని మనసు లోకి ఇంకించుకోవడం కూడా కష్టమే. నీ పరిస్థితి నాకు అర్ధమవుతోంది. మంచి నిర్ణయమే తీసుకున్నావు!”

కాస్సేపు, ఇద్దరూ, నిశ్శబ్దంగా వుండి పోయారు.

“ఎప్పుడు తిరుగు ప్రయాణం?” మళ్ళీ అంది రమ.

“బుక్ చేసుకున్న డేట్‌నే! ఇంకా నాలుగు రోజులుంది. ఇప్పుడు, ఇక్కడ ఎవరూ లేరనే భావన లేదు. వీళ్ళతో, నాలుగు రోజులు ఇట్టే గడచి పోతాయి”, మైకం లోంచి ఇంకా బయటకి రానట్లే వుంది విష్ణుకి.

“ఊ!..” అంటూ నవ్వింది రమ

“సరే! ఇంక ఫొన్ పెట్టేస్తాను. పొద్దునే లేవాలి” అంటూ ఫోన్ పెట్టేసింది రమ.

అంతలో, వాసు వచ్చాడు, టిఫిన్‌తో.

ఇద్దరు టిఫిన్ తిన్నారు. విష్ణు కాఫీ కలిపి వాసుకి ఒక కప్ ఇచ్చి, తను ఇంకొక కప్ తీసుకొని, కాఫీ తాగుతూ పొద్దున్న జరిగిన సంఘటన చెప్పుతూ అన్నాడు,

“మూగ జీవాలకి, మన ఆలోచనలు చదివే జ్ఞానం వుంటుందేమో అనిపిస్తుంది. మన మాటలు అర్థమవవు, అని అనుకుంటాము, కానీ అర్థం అవుతాయి, అని చెప్పడానికి, ఇంతకన్న సాక్ష్యం ఏమి కావాలి?”

విష్ణు చెపుతూంటే వాసు విస్మయంతో, విభ్రాంతి చెందుతూ విన్నాడు. అవాక్కయ్యాడు.

ఇద్దరూ చాలాసేపు మౌనంగా వుండిపోయారు. ఆ నిశ్శబ్దాన్ని భంగపరచాలని కూడా అనిపించలేదు ఇద్దరికి. అలా ఎంత సేపు గడిచిందో కూడా ఇద్దరూ గమనించలేదు.

వాసు ఫోన్ మోగడంతో, ఇద్దరూ ఈ లోకం లోకి వచ్చారు.

వాసు ఫోన్‌లో “హలో” అంటూ.. అటువెంపు వాళ్ళు చెప్పింది విని, “నేను మళ్ళీ ఫోన్ చేస్తాను” అని పెట్టేసాడు.

నెమ్మదిగా అన్నాడు, మాటలు వెతుక్కుంటూ “ఇప్పుడు. ఏమి చేద్దామని?”

“ఏముంది. ఇల్లు అమ్మడం విషయం, ఇంతటితో వదిలేద్దాం. నోరు లేని ఈ జీవాలకి కూడా హక్కు వుంటుందని విషయాన్ని నా పిల్లలు నాకు చాలా సున్నితంగా తెలియచేసారు. నేను ఇంక అది మర్చిపోను. నా నిర్ణయాన్ని, వ్యతిరేకించడానికి నాకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు లేరు. ఏమంటావు?” నవ్వుతూ అన్నాడు విష్ణు.

“పిల్లలే, నాకిప్పుడు, గురువులు. నేను నా భార్య, వాళ్ళు చెప్పిందే వినదల్చుకున్నాము ఈ విషయంలో.”

“ఊ!” అన్నాడు వాసు.

 బల్ల మీద, తను అంతకు ముందు పెట్టిన రేగి పళ్ళు కొన్ని, వాసు చేతిలో వేసాడు, విష్ణు. “తిను!” అంటూ.

“పక్షులు. ఈ పళ్ళు ఇచ్చి, వాటి కృతజ్ఞత తెలియచేసాయి.” అన్నాడు విష్ణు, నవ్వుతూ.

“ఊ!..” అంటూ నోట్లో వేసుకున్నాడు, వాసు. “అదృష్టవంతుడివి. ఒక అపురూపమయిన అనుభవాన్ని పొందావు. మంచి నిర్ణయం తీసుకున్నావు.”

కాస్సేపు ఉండి, వాసు మళ్ళీ అన్నాడు “ఈ ఇల్లు అమ్మకం విషయం కదిపి, అనవసరంగా, నిన్ను ఇబ్బంది పెట్టినట్లు అయింది.”

“లేదు వాసూ! నాకూ ఇది మర్చిపోలేని అనుభవం. నేనే థేంక్స్ చెప్పాలి. నువ్వు ఈ విషయం కదపకపోతే, నేను ఇక్కడకి రాకపోతే, నేను ఈ అనుభవాన్ని పొందేవాడినీ కాదు. ఇంత విలువైన సత్యాన్ని, ఎప్పటికీ నేను గ్రహించి వుండేవాడిని కాను. ఇటువంటి అలౌకికమయిన అనుభూతి, చాల అరుదైంది, విలువ కట్టలేనిది, మర్చిపోలేనిది, నాకు దక్కేదే కాదు!” ఉదయాన జరిగిన సంఘటనని, పునశ్చరణ చేసుకుంటూ, మైమరచి మాట్లాడుతున్నాడు, విష్ణు.

“ఇంకా నాలుగు రోజులుంది, నీ తిరుగు ప్రయాణానికి.. నీ ప్లాన్? టికెట్ మార్చుకుంటావా?”

“పర్వాలేదు. ఇక్కడే, ఈ నాలుగు రోజులు గడుపుతాను. నువ్వు మాత్రం, నాకు ఒక సాయం చేయాలి. ఈ ఇల్లూ, తోట, తోటలో అన్నీ క్షేమంగా వుండేటట్లు, అప్పుడప్పుడు చూసుకుంటూ వుండాలి!”

“తప్పకుండా!”

మళ్ళీ విష్ణు అన్నాడు. “ఇంక నుంచి మేము అందరమూ ప్రతీ సంవత్సరం వస్తూ ఉంటాము.”

“ఊ!.. ఊ!” అంటూ, వాసు అన్నాడు, “నువ్వు చెప్తున్నది విన్నాక, నాకూ అనిపిస్తోంది, మన ఆలోచనలని, మనము ఎప్పుడూ ప్రశ్నించుకోము. ఏది, ఎంత వరకూ సమంజసం అంటూ ఎప్పుడూ అనుకోము. అటువంటిది, మూగ జీవుల మాటకి వస్తే, వేరే చెప్పేది ఏముంటుంది? అన్ని హక్కులూ బేషరతుగానే, అని భావిస్తాము.. తప్పే మరి!.. నాకూ ఇది మరపురాని అనుభవమే!”

“ప్రకృతిలో ప్రాణులందరికి, సమాన హక్కులు వుంటాయి. మనము ఆ విషయాన్ని విస్మరించినంత మాత్రాన అది నిజము కాకుండా వుండదు కదా. పూర్వ కాలం ఋషులు, ప్రకృతిలో అన్నిటినీ గౌరవించమనే చెప్పారు. మనము తినే ఆహారం కూడా, అన్నిటికీ, పెట్టే తినాలి అని చెప్పారు.”

“ఆ సంస్కృతికి దూరం అయ్యాక, మనం ప్రకృతినే కాదు, ఎవ్వరిని గౌరవించడం మానేసాము. ఎవ్వరి గురించి ఆలోచించడమూ మానేసాము” నవ్వుతూ అన్నాడు, వాసు.

విష్ణు “అవును”, అంటూ తల ఊపి అన్నాడు, “మనమంతా, ‘నేను’లో చిక్కుకు పోయాము. అందరమూ అనే మాట కూడా మర్చిపోయాము.”

కాస్సేపు మౌనంగా వుండి, ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, కాస్త ఆగి, మళ్ళీ అన్నాడు వాసు.

“పని అయిపోయింది, ఇంతటితో సరి, అన్నట్లు కాదు, విష్ణూ!, నువ్వు వెళ్ళేవరకూ నీతోనే వుంటాను. సరేనా!”

ప్రేమగా నవ్వాడు విష్ణు. “థేంక్స్ వాసూ! ఈ నాలుగు రోజులు, చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ, నీ తోనూ, ఈ తోటతో.. ఈ తోటలో గడిపేస్తాను. నేనిప్పుడు ఇక్కడ ఎవరూ లేరు అని అనుకోవటం లేదు. ఇప్పుడు, ఇటువంటి ఆత్మీయులని, ఎలా వదలి వెళ్ళాలా అని అలోచిస్తున్నా.”

“ఊ..!” అంటూ వాసు తల ఊపాడు.

“అయినా, చిన్నప్పటి విషయాలు, చిన్నప్పటి స్నేహితునితో, నెమరు వేసుకోవడం కన్నా, సంతోషకరమైనది ఏముంటుంది!?.. వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాను. ఏమంటావు?” నవ్వుతూ అన్నాడు విష్ణు.

వాసు కూడా నవ్వాడు “ఖచ్చితంగా!” అంటూ.

ఇద్దరూ ఆ మాటలకి హాయిగా నవ్వుకున్నారు. ఆ రోజు రాత్రి తోటలో ప్రతీ జీవి, ఇంట్లో విష్ణు, చాలా ప్రశాంతంగా నిద్ర పోయారు.

లోన్ కావాలా సార్!

0

[చెన్నూరు హరి నారాయణ రావ్🌿 గారు రాసిన ‘లోన్ కావాలా సార్!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ట్రిం[/dropcap]గ్ ట్రింగ్..”

సీరియస్‌గా రాసుకుంటున్న నాకు చాలా విసుగనిపించింది. ఒక్కసారిగా కోపం చివ్వెత్తున లేచింది. అటూ ఇటూ చూసాను ఏవరన్నా కాల్ అటెండ్ ఐతే బాగుంటుందని. ఎవరైనా అంటే ఇంకెవరు, తనే! తనొచ్చి ఫోన్ తీస్తుందేమోనని పక్కకి చూసాను. అబ్బే, అలికిడి లేదు. మనలో మాట, గతంలో మా అన్నయ్యో, గన్నయ్యో ఫోన్ చేసిన ఒకానొక సందర్భంలో తనని, అదే ఈమెని, చురుగ్గా చూసిన దుస్సందర్భాలు లేకపోలేదు. నంబర్ చూస్తే చంటిగాడు లోకల్. అదే, వినయంగా తలొంచుకున్న తొమ్మిదితో మొదలైన నంబర్. తప్పదని ఫోన్ తీసాను,

“హలో?”

“నమస్తే సార్. మేము ఫలానా ఫైనాన్స్ కంపెనీ నుండి కాల్ చేస్తున్నాం. మీకు బోలెడు లోను శాంక్షన్ అయ్యిందండి. తీసుకుంటారా?”

“వద్దండీ, సారీ.”

“తీసుకోండి సార్. వడ్డీరేటు కూడా చాలా తక్కువ.”

బాంకులో పనిచేసి రిటైర్ అయిన నాకు ప్రైవేట్ రంగ ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీరేట్ల మాయాజాలం కొత్త కాదు. మరి, ఈ విషయం అవతలి వారికి తెలియదు కదా! ఐనా, అపరిచితులతో అర్థం లేని వాగ్వివాదాలు మానుకుని చాలా కాలం అయ్యింది. విక్రమాదిత్యుడు ఎంతో వినమ్రంగా ఓపిగ్గా చెప్పినట్టు మళ్ళీ అదే సమాధానం, “వద్దండీ.”

ఒక వయసొచ్చాక అపరిచితులు చిరపరిచితులు అనే తరతమ భేదభావం లేకుండా అందరితోను ఒకే విధంగా విభేదించడం అనేది పుర్రెకో బుద్ధేమో! మళ్ళీ కంప్యూటరులో తల దూర్చాను. ఏ సందర్భంలో ఉన్నానో గుర్తు లేదు. ఏ కారెక్టర్ ఏ సంభాషణో. రెండు లైన్లు వెనక్కెళ్ళి చదవాల్సొచ్చింది. కోపం రాలేదు కానీ బాగా కన్ఫ్యూజ్ అయ్యాను.

మర్నాడు. అంటే, అర్ధరాత్రి ఫోనులో ఠంఛనుగా తారీఖు మారినట్టు వెంఠనే అని కాదు. ఓ.. రెండు రోజుల తర్వాత అన్నమాట.

Netflix లో ‘టామ్ హాంక్స్’ సినిమా ‘ఎ మాన్ కాల్డ్ ఓట్టో.’ బాగా లీనమైపోయాను. నిజమేనేమో, వయసు పెరిగాక ఎవరిమీదనో అకారణంగా కోపం వస్తుందేమో. నేనేమీ ప్రత్యేకం కాదు, మ్యూజియంలో పెట్టవలసిన వింత మనిషిని కాదు అనిపించి కొంత ఊరట పొందాను. నేను ఒంటరివాణ్ణి కాదన్నమాట. నా ఆలోచనలు, ప్రవర్తన తప్పు కావన్నమాట. మీడియా పుణ్యమా అని అర్థంలేని వాస్తవం కాని బంధుత్వం కలుపుకున్నాక కొంచెం ఉపశమనం అనిపించినా మళ్ళీ ఆ కధానాయకుణ్ణి చూసేకొద్దీ నా కళ్ళకింద ఏదో బరువుగా గూడు కట్టుకోసాగింది. ఎన్నాళ్ళో అయిందన్నట్టు ఒక్కసారిగా భారంగా గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలాను.

“ట్రింగ్ ట్రింగ్..”

కొత్త నంబర్. ఎవరో ఏవిటో అనుకుంటూ ఫోన్ తీసా.

“సార్, మేం ఫలానా కంపెనీనుండి మాట్లాడుతున్నాం. మీకేదైనా లోన్ కావాలా?” ఎవరిదో ఆడ గొంతు.

“..వద్దమ్మా, ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తారు? అసలు నా నంబర్ మీకెవరిచ్చారు?

“అది కాదదండీ, లోన్ కావాలేమోనని..”

“వద్దండీ.”

ఆమె మళ్ళీ ఏదో చెప్పబోతుండగా మళ్ళీ నేనే,

“ఎనే వే, థాంక్ యూ ఫర్ కాలింగ్” అంటూ కాల్ కట్ చేసాను. రాగము, భావము, ద్వేషము, క్రోధము, వీలైనంతకాలం ఇంకోళ్ళతో అవసరము రాకుండా లేకుండా ‘టచ్ మి నాట్’ అని నాలుగ్గోడల మధ్య బతికేవాడు స్థితప్రజ్ఞుడు.

***

ఇంటికి డైరెక్ట్ బస్సు దొరికేసరికి బాగా లేటయ్యింది భావనకి. ఏడేళ్ళ వంశీ ఏదో చెబుతుంటే ‘ఊ’ కొడుతూ ఫ్రిజ్ లోనుండి చేతికందిన కూరలు తీసి బైట పెట్టి స్నానానికి బాత్రూంలో దూరింది. ఐదు నిమిషాల్లో కానిచ్చి నైటీ సరి చేసుకుంటూ తలుపు తీసిన భావనకి బాత్రూం గుమ్మం బయటే చేతులాడిస్తూ నిల్చున్నాడు వంశీ. వాణ్ణి ఆమాంతం ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి గాట్టిగా నవ్వాలనిపించినా మళ్ళీ ‘ఊ’ కొడుతూ వాడు వెనకే వస్తుంటే దీపారాధన చేసి చేతులు జోడిస్తూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఎందుకో మరి, చెప్పడం ఆపి వంశీ కూడా ఒక్క క్షణం అమ్మ వంక చూసాడు. లిప్తపాటు ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది భావన. దేవుడికి మౌనమే తెలుసు, వీడికి మాట్లాడ్డమే తెలుసు.

“పద నాన్నా” అంటూ కిచెన్ లోకి వెళ్ళి ఈ రోజు ఆఫీసులో తాను చేసిన ఫోన్ కాల్స్ గుర్తుకొస్తుంటే గరిటేపాటు తల కూడా అడ్డంగా అసహనంగా తిప్పింది.

ఎప్పుడొచ్చాడో, అలికిడి లేని రాంబాబు స్నానం చేసి ఒక చేత్తో ఫోన్ చూస్తూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. మౌనంగా ఇద్దరికీ వడ్డించి వంశీని ఒళ్ళోకి తీసుకుని తినిపిస్తూ “ఊ, అప్పుడేమైంది?” అంది. ఈరోజు క్లాసులో జరిగింది అమ్మకి చెప్పాలనే ఉత్సాహం వాడిలో కట్టలు తెంచుకుంది.

“నీ అన్నం చల్లారిపోతోంది” ఫోను లోనుండి తలెత్తకుండానే అన్నాడు రాంబాబు. నవ్వి ఊరుకుంది భావన. ఆమెలో అలసట లేదు. విసుగు లేదు. ఉన్నవి లేనివి అన్నీ గుర్తొచ్చి మళ్ళీ నవ్వింది.

***

స్టాఫ్ మీటింగ్.

తెరపై రంగుల స్లైడ్-షో కదులుతోంది. ఒకే విషయం వేర్వేరు గ్రాఫుల్లో కనబడుతోంది. జీవితాలని నిర్దేశించి శాసించే గీతలు కొన్ని పైకి కొన్ని కిందకి. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు లాప్-టాప్ ముందు కూర్చున్న ఏరియా సేల్స్ మేనేజర్ ఉగ్ర నరసింహావతారం లైవ్‌లో చూపిస్తున్నాడు. విచిత్రం ఏవిటంటే ఈఊరి కాపు పక్కూరి వెట్టి అనే విషయం ప్రతీసారీ ఇట్టాంటి మీటింగులు అయ్యాక ఆయనకి అనుభవంలోకి వస్తూంటుంది. ఈ మాత్రం వివేకం లేని మనిషి కాదు ఆ అధికారి. వ్యవహారంలో ‘న క్రోధో న మాత్సర్యం న లోభో న శుభామతిః’ అనేది దేవుడికీ జీవుడికీ ఒకటే.

‘గుసగుసలు ఆపండి’ అన్న సంకేతంగా నెమ్మదిగా దగ్గుతూ లేచి నిల్చున్నాడు ఆ సేల్స్ మేనేజర్.

“ముందుగా, కంగ్రాట్యులేషన్స్ టు గౌతమ్! ఈనెల విన్నర్” అంటూ ఆ అధికారి తన సహ ఉద్యోగికి కరచాలనం చేయడం అందరి కరతాళధ్వనుల మధ్య ఆశ్చర్యానికి గురి చేసింది భావనకి. అతని గ్రాఫ్‌కి తన గ్రాఫ్‌కి మధ్యన కనిపించీ కనిపించని సూక్ష్మ దూరాన్ని గుర్తించడం కష్టమయ్యింది ఆమెకి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినంత ఉత్సాహంగా బొకే అందుకుంటూ మిగిలిన సహోద్యోగుల వంక నిస్సహాయంగా చూసాడు గౌతమ్.

“జీతాలు తీసుకుంటున్నామనే ఇంగితం, జ్ఞానం ఏమాత్రం లేవు మీకు. గతనెల సేల్స్ నుండి ప్రోగ్రెస్ లేదు. జీతం మాత్రం గత నెల తీసుకున్నారు, ఈ నెలా తీసుకుంటారు” ఫోన్ తీసుకుని “నీకు బుద్ధుందా లేదా, గడ్డి తింటున్నావా” అంటూ ఎవరినో అరిచాడు.

అందరూ తల వంచి వింటున్నారు. కొందరి మొహాలు వడిలి వాలిపోతే ఇంకొందరు అలవాటే అన్నట్టుగా. తనని కాదు అన్నట్లుగా ఏదో ఫైల్‌లో తల దూర్చాడు గౌతమ్.

“మిస్ భావన, ఏం చేసున్నారు మీరు?”

తల వంచుకుని కళ్ళు మూసుకుని పెన్నుతో అచేతనంగా అనాలోచితంగా చక్రాలు తిప్పుతున్న భావన ఉలిక్కి పడింది.

“సర్?” అంటూ నిల్చుంది.

“ఏం చేస్తున్నారు అంటున్నాను. మీ టార్గెట్ ఎంత, మీరు రీచ్ అయ్యింది ఎంత? రోజూ సాయంత్రం ఆరింటికే వెళ్తున్నారట! రాజమండ్రి బ్రాంచిలో ఖాళీ ఉంది వెళ్తారా?” ఉరుములు లేని ఉప్పెన అది.

కాళ్ళకింద భూమి కదిలినట్లైంది భావనకి. తన సమాధానం టార్గెట్‌ని మరపించలేదని తెలుసు ఆమెకి. అంత నిశ్శబ్దంలోనూ ఎవరో కిసుక్కున నవ్వినట్లు వింత భావన. కూర్చో అంటాడని దీనంగా చూసింది. హావభావాలకి అతీతుడు ఉన్నతాధికారి.

“డియర్ కలిగ్స్, మీకిదే లాస్ట్ వార్నింగ్. వచ్చేనెల ఎవరినీ ఉపేక్షించేది లేదు. నవ్ యు కెన్ గొ” అంటూ మళ్ళీ లాప్-టాప్ లోకి దూరాడు. తన పై అధికారులతో సమావేశానికి సిద్ధమౌతున్నాడు. ముచ్చెమటలు పోస్తుంటే తినబోయే తిట్ల విందుకు సిద్ధమౌతున్నాడు. కొందరు ఆయన చుట్టూ చేరి భజన మొదలుపెట్టారు.

మీటింగ్ పేరుతో టైం గుర్తించని భావనకి ఆఫీసు వాల్-క్లాక్ ఆరున్నర చూపించింది. అధికారి ఉండగా తను వెళ్ళవచ్చో లేదో అనే మీమాంసతో తన కుర్చీలో కూలబడింది. ఏడు దాటితే తనుండే ఏరియాకి బస్సులుండవని తెలుసు ఆమెకి.

***

“ట్రిగ్ ట్రింగ్.”

‘ఆదిత్య హృదయం’ చదువుతూ పక్కనున్న ఫోన్లోకి మెడ సారించాను. ‘పనిపాట లేని మనుషులు’ అనుకుంటూ మళ్ళీ పుస్తకంలోకి మెడ దించాను.

“ట్రింగ్ ట్రింగ్.”

రెండుసార్లు చేశారంటే ఎవరో తెలిసినవాళ్ళే ఎంతో అర్జెంటైతేనే చేసుంటారు. ప్చ్, తప్పేలా లేదు. ‘మన్నించవయ్యా రామచంద్రా’ అని స్వగతంలో అనుకుంటూ ఫోన్ తీసాను,

“హలో, ఎవరండీ?”

“సార్ కారు మీద లోన్ తీసుకుంటారా?” అవతలి స్వరం.

“అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి.”

“కారు మీద లోన్ తీసుకుంటారా అని అడుగుతున్నాను సార్” అట్నుంచి వివరణ.

మూర్ఛపోవడం నా వంతయ్యింది. ఇన్నేళ్ళ నా బాంక్ సర్వీసులోను బైట మార్కెట్లోను ఇళ్ళపై రుణాలు ఇవ్వడం చూసాను. దాన్ని మార్టుగేజ్ లోన్ అంటాము. ఇలా కార్లపై కూడా ఇస్తున్నారా? హతవిధీ, ఎంత గడ్డుకాలం వచ్చింది అని వాపోతూ అడిగాను,

“ని నిజ్జంగానే కారు మీదే ఇస్తారామ్మా లోను?”

“అదే సార్, కారు కొనుక్కోడానికి లోన్ ఇస్తాం అనే చెపుతున్నాను.”

“మరి, ఇందాక కారు మీద లోన్ అన్నావ్?” ఈనాటి కుర్రకారు కంగారు బేజారు తెలుసు కాబట్టే అడిగాను చిరునవ్బుతో.

“పొరపాటుగా అన్నా సార్. తీసుకోండి సార్, ప్లీజ్.”

“వద్దమ్మా, నాకు ఆల్రెడీ ఒక ఖరీదైన కారు కొని మావాడు అమెరికా వెళ్ళాడు. దాన్ని నడిపే ఉత్సుకత మోజు నాకు లేకపోయినా దుమ్ముధూళి పడితే పిచ్చిముండ పాడౌతుందని నేనే రోజూ దాన్ని తుడుస్తూంటాను. లేనిపోని చాకిరీ తలమీదకి తెచ్చుకున్నాను.”

“ఇంకో కారు తీసుకోండి సార్.”

“నీకు తెలుగు అర్ధమైనట్టు లేదే! ఇంకోటి తీసుకుని ఏం చేసుకోమంటావ్? పోనీ ఒక పని చెయ్. లోన్ వద్దు కానీ ఏదన్నా అప్పు ఇస్తావా?” వాతావరణాన్ని ఆహ్లాదపరచాలని చమత్కారాన్ని జోడించా.

“సారీ సార్” అంటూ అట్నుంచి ఫోన్ క్లిక్ మన్న శబ్దం. సేల్స్-మాన్ ఉద్యోగంలోని కష్టాలు గుర్తుకొచ్చి నా మొహంలో చిరునవ్వు, మాటల్లో వ్యంగం మాయమయ్యాయి.

..యుద్ధేషు విజయిష్యషి.

ఏది యుద్ధమో ఎవరు విజేతలో అర్థం కాలేదు నాకు. తెలుసుకునే ప్రయత్నమూ చెయ్యదల్చుకోలేదు. నేను యుద్ధంలో లేనప్పుడు తెలుసుకుని ఏం చేస్తానట!

***

ఫోన్ కట్ చేసి లిస్టులోని మరో నంబరుకి కాల్ చేస్తోంది భావన.

“హలో సార్, కంగ్రాట్యులేషన్స్. మా లక్కీ డ్రాలో మీకు ఐదు లక్షల లోన్ శాంక్షన్ అయ్యిందండీ. ఈరోజే వచ్చి సంతకాలు చేసి పండగ చేసుకోండి సార్.”

“ఏ ఏ లోనండి, ఎక్కడ మీ ఆఫీసు? సాయంత్రం రావచ్చా? కొంచెం ఎడ్రస్ చెప్పండి.”

“అవసరం లేదండీ, ఈ రోజు సాయంత్రం మా ఏజెంట్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు. మీరు పత్రాలతో సిద్ధంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ నంబర్‌కి కాల్ చెయ్యండి. దిస్ ఈజ్ భావన విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.”

టైం ఆరు దాటుతూండగా భుజాన బేగ్ వేసుకుంటూ ఆఫీసు కలయచూసింది భావన. ఉన్నవారిలో కొందరు ఫోన్లలో ఎవరికో భూతలస్వర్గం చూపిస్తుంటే ఇంకొందరు దస్తాడు పేజీలు ముందేసుకుని వచ్చిన కష్టమర్ల చేత ఒక్కో పేజీలో కనీసం రెండు సంతకాలు చేయిస్తున్నారు. వడివడిగా బస్టాండ్ వైపు ఆమె అడుగులేస్తుంటే తూరుపు దిక్కు తన నల్లటి జుత్తుని విరబోసుకుంటోంది, పశ్చిమ దిక్కు తన నల్లటి శిగలో మల్లెలు తురుముతోంది.

***

దేవుడి భృకుటి ముడి పడింది. “ఆ పెద్దాయనకి హృదయం లేదల్లే ఉందే! లోన్ తీసుకొమ్మని ఆ అమ్మాయి అన్నిసార్లు అడుగుతుంటే ఈయనకొచ్చిన కష్టం ఏంటంట? తీర్చగలడు కదా, మరింకేంటి నొప్పి?”

“నారాయణ! అతను వయసులో ఉన్నప్పుడు, సంపాదన బాగున్నప్పుడు, పిల్లల ఫీజులకి ఇంటి కిస్తీలకి ఈ ఫైనాన్స్ కంపెనీల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఎవడూ లోను ఇచ్చిన పాపాన పోలేదు. తీర్చే స్తోమత ఉన్నా ఇప్పుడీ వయసులో పెన్షన్ డబ్బులతో కొత్త లోన్లు తీసుకుని మళ్ళీ ఆ జంఝాటం ఎందుకని మానుకున్నాడేమో. శేషజీవితాన్ని కృష్ణా రామా అనుకోక ఈ వయసులో మళ్ళీ కొత్త లోన్లు, కొత్త బంధాలు ఎందుకు, ఖర్చు తగ్గించాలి అనుకున్నాడేమో” సందేహం వెలిబుచ్చాడు పక్కనే ఉన్న నారదుడు.

దేవుడు తల పంకించాడు. “ఐతే మాత్రం, తన గతం మర్చిపోయాడా!”

మళ్ళీ ఇలా అన్నాడు నారదుడు “స్వామీ! వయసులో ఉన్నప్పుడు, అవసరాలు కష్టాలు వచ్చినప్పుడు వరాలివ్వని దేవుళ్ళు, ఫైనాన్స్ కంపెనీలు జీవితపు చరమదశలో కరుణించి వెంటపడినా ఏమి ఫలితం ప్రభూ, నెత్తినేసి కొట్టుకోడానికా!”

ఎక్కడో చివుక్కుమనిపించి నారదుని వంక చురచురా చూశాడు దేవుడు.

“నారాయణ నారాయణ..” మహతి మ్రోగిస్తూ నిష్క్రమించాడు నారదుడు.

లోను ఇవ్వగలడా సత్యాపతి।

చేసి తీర్చగలడా మహీపతి॥

(సమాప్తం)

సంస్కారం

1

[వల్లూరి విజయకుమార్ గారు రాసిన ‘సంస్కారం’ అనే చిన్న కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఆ[/dropcap]ఫీసుకి కొత్త బాసు వచ్చాడు, బదిలీ మీద.

రావడానికి ముందే మహా పొగరుబోతు, దూర్వాసుడు, లెక్కచెయ్యడు అని, స్టాఫ్ అతని జాతకం చదివేసింది.

వస్తూనే గమనించాడు, అందరూ లేచి విష్ చేయడం..

తల తృప్తిగా ఆడించే లోపల, ఆఖరి సీటు అమ్మాయి మీద పడ్డాయి కళ్ళు..

తను లేవలేదు, సరికదా పెదవిమీద స్వాగతిస్తున్నట్టు ఒక చిరునవ్వు.. అంతే.

‘బాసు’ కాబిన్ లోకి వెళ్ళిపోయాడు.. తన ఆఫీసులో ఆడ స్టాఫ్ ఆమె ఒక్కతే అని అటెండెన్స్ రిజిస్టర్ చెప్పింది. పేరు వసుంధర.

ఇంటర్‍కమ్‌లో పిలిచాడు రమ్మని.

#🌹#

వసుంధర వచ్చినట్టు తెలుసు.. కానీ చూడనట్టు ఫైల్స్ చూస్తున్నాడు బాస్.

చిన్న దగ్గు.. “నమస్తే సార్”..

అది వసుంధర గొంతు.

తలెత్తిన కొత్త ‘బాస్’ తల వంచుకున్నాడు ఆమెను చూడగానే..

పొగరుతో కాదు.. పశ్చాతాపంతో!

వసుంధరని, మళ్ళీ ఆమె సీటు వరకు దిగపెట్టి వచ్చాడు కొత్త బాస్, వీల్ చెయిర్‍ని తనే తోసుకెళ్లి గౌరవంగా.

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-12

0

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

153.
ఉ:
శ్రీమదహోబిలాగ్రమున శ్రీసతి గూడుచు నిల్చియున్న, ఆ
కామితసిద్ధిదాయకుడు ఖండిత పాపలతా సమూహుడున్
మామక సర్వజీవన సమాశ్రయ కారకుడా నృసింహునిన్
ఏమరుపాటు లేక భజియింతును నిత్యము రాగముక్తికై

154.
వన మయూరము:
భక్తజన కల్ప సురవంద్య, మధునాశీ
వ్యక్తనిజ దివ్య పావన సురూపా
ముక్తి ప్రద హస్తయుగ పోషిత ప్రపంచా
రక్తి నిను గొల్వ నఘ నాశమగు శౌరీ!

155.
తే.గీ.:
సుదతి దితి గర్భమున బుట్టిరి దనుజులు, హి
రణ్యకశిపుండు జ్యేష్ఠుడు రాక్షసాధి
పతి, హిరణ్యాక్షుడాతని యనుజుడు, ఘన
వర పరాక్రమ గర్వులై వాసి గనిరి

156.
తే.గీ.:
ఆ హిరణ్యాక్షు డవనిని బంతి చేసి
వేదముల మ్రుచ్చిలించుచు వేగజనగ
ఘోర వారాహ రూపంబు గూడి యపుడు
దునిమె శ్రీనాథుడాతని దోర్బలమున.

157.
మ:
తన తమ్ముండటు ఘోర మృత్యుగతుడై తానట్లు ధన్యాత్ముడై
చన, కోపంబున గ్రాలు మానసమునన్ సాధించగన్ పెంపగన్
ఘన దైత్యుండు హిరణ్యకశ్యపుడు చీకాకుంబొంది, వ్యగ్రాత్ముడై
తన సైన్యమ్ము, వికుంఠ పట్టణముపై దాడింజేయ సంసిద్ధుడై

158.
వచనము:
నిరంతర హరిద్వేష జ్వలిత మానసుండైన హిరణ్యకశిపుండు, తన ప్రియ సోదరుండు మాధవు చేత హతుడైన కతంబున, అగ్నికి అజ్యము తోడైన రీతిని మండుచుండెను. అప్పుడు అసురగురుండు, దానవ సంక్షేమాభిలాషి, శుక్రుడేతెంచి, నిలింపవైరి చక్రవర్తితో నిట్లు పలికె.

159.
కం:
బలమే యన్నిట గెలవదు
బలయుతుడగు సోదరుండు మరణించె గదా!
నిలువుము దానవ శేఖర!
తెలిపెద నీ శత్రు గెలుచు తీరును వినుమా!

160.
చం:
కలుగును శత్రునాశనము కల్గు జగత్పరిపాలనంబునున్
తొలగును సర్వభీతులును, ద్రుంపగ వచ్చు మహారి విష్ణునిన్
ఎలమిని నీకు ఘోర తపమే తగు బ్రహ్మను గూర్చి చేయుమా
నలువయె నిన్ను దివ్యవర మండితు జేసి ఘటించు కార్యమున్

161.
వచనము:
అని గురుడానతిచ్చిన, దానిని శిరోధార్యముగా దలంచిన హిరణ్యకశిపుండు

162.
కం:
మండెడు కోపము తనువై
చండతరంబైన దౌష్ట్య సంరంభమునన్
నిండిన గర్వము వెలుగన్
పిండీకృత సర్వభువన భీకరుడగుచున్

163.
సీ:
తన ఘోర విక్రమం బెనలేనిదని చాట
దానవాగ్రణి తాను ఘనత జూప
ఎంతొ ఘనమైన నేన్గుల దంతములను
మ్రోగు బ్రహ్మండ వాయిద్య మోత బోలు
వికృత వికటాట్టహాసముల్ వెడలజేయ
దివిజుల గుండెలు దిగ్గురనగ
నక్షత్ర కాంతులే నవముత్యముల వోలె
జాబిల్లి యాతని ఛత్రమవగ
తే.గీ.:
తేరిపారగ గనలేని తేజమునను
అలఘు నిజ శౌర్యమైశ్వర్య మతిశయింప
సకల జగములు భయమున సంచలింప
హేమకశిపుడు వర్తించె భీముడగుచు

164
చం:
త్రిశిర! త్రినేత్ర! శంబర! యతీత పరాక్రమ! విప్రఛిత్తి! ధీ
ర! శతసుబాహు! ఇల్వల! సురారి పులోముడ! పాకుడా! మహా
భృశగతి! దంష్ట్ర భీకర! ప్రపూర్ణ మనస్కులుగా వినుండు, నా
వశమును జేయ దుష్టుడగు మాయల విష్ణుని, దైత్యులెల్లరన్

165.
కం:
బలహీనులైన దివిజులు
కొలుతురు యా యధము విష్ణు, గుణహీనుని, నా
మేలును కోరెడు తమ్ముని
తల ద్రుంచెను వాడు, దుఃఖ తాపము కలిగెన్

166.
తే.గీ.:
మనకు చిరవైరియున్, సురపక్షపాతి
దొంగ మాయల పందిగా దృటిని మారు
చంచలాత్ముడు, నతని, భావించు తరిని
నాదు చిత్తము దందహ్య మానమగును

167.
వచనము:
దానవ శ్రేష్ఠులారా! ఇదే నా ప్రతిజ్ఞ.

168.
భుజంగ ప్రయాతము:
మహశూలమున్ బూని మాయావి విష్ణున్
సహాయంబు లేకుండ శౌర్యంబు తోడన్
అహో! వక్షమున్ చీల్చి హర్యక్ష భంగిన్
మహత్కార్య సంస్ఫూర్తి మ్రందింతు భీరున్

169.
తే.గీ.:
తప్త రుధిరంబు చేతను తర్పణంబు
చేసి నా కూర్మి తమ్ముని శ్రేష్ఠమైన
యాత్మ దనియింతు మన వైరి యనిని ద్రుంచి
నాదు శపథంబు వినుడు ఓ జోదులార!
~

లఘువ్యాఖ్య:

ఈ భాగములో – పద్యాలు 153, 154 కృతిపతి మహత్తు వర్ణన. ఇది కావ్యలక్షణమే. పద్యం 155 – దితి, కశ్యపుల కడుపున జయవిజయులు హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా జన్మించారని చెబుతుంది. పద్యం 156లో హిరణ్యాక్షుడు లోక కంటకుడై వేదములను అపహరించి, భూమిని బంతిని చేసి పీడించ, విష్ణువతనిని భీకరవరాహ రూపుముతో సంహరిస్తాడు. ఈ పద్యంలో వాడిన ‘మ్రుచ్చిలించుట’ ఒక చక్కని అచ్చ తెనుగుపదం. దొంగిలించడం. అది కూడ తెలుగుపదమే.

పద్యం 157లో తమ్ముని చావుతో వ్యగ్రుడై, క్రోధంతో, వైకుంఠం మీదికి దండయాత్రకు సిద్ధమైనాడు. 158 వచనం. దీనిలో దానవ గురువు శుక్రాచార్యుడు వచ్చి, హితవచనములు పలుకుచున్నాడు. పద్యం 159లో “రాక్షసరాజా! బలమే అన్ని చోట్ల పని చేయదు. నీ తమ్ముడు కూడ మహా  బలశాలి. కానీ చంపబడ్డాడు కదా! కాబట్టి శత్రువుని గెలిచే విధానం చెబుతా విను” అంటున్నాడు. పద్యం 160లో శుక్రాచార్యుడు తపస్సు యొక్క ప్రభావాన్ని చెబుతున్నాడు. “అది సర్వశత్రువులను నశింప చేస్తుంది. కాబట్టి బ్రహ్మను గూర్చి తపస్సు చేయి” అంటున్నాడు. ఈ పద్యము చివర పాదములో ‘నలువ’ అన్నది అచ్చతెనుగు పదం, బ్రహ్మకు పర్యాయపదం. పద్యం 163లో హిరణ్యాక్షుని వైభవము, కోపాతిశయము, తేజస్సు, శౌర్యము వర్ణింపబడినాయి. పద్యం 164లో తన అనుచరులైన వివిధ రాక్షసులను పేర్లతో సంబోధిస్తున్నాడు రాక్షసపతి. పద్యం 168లో విష్ణువుని వధిస్తానని ప్రతిన. ఇది భుజంగ ప్రయాతమనే ఛందస్సు. పాము సాగే విధంగా సాగుతుంది కాబట్టి దానికా పేరు. పద్యం 169లో తమ్మునికి విష్ణువు రక్తముతో తర్పణము చేసి అతని ఆత్మకు శాంతి చేకూరుస్తాడట.

(సశేషం)

అనువాద మధు బిందువులు-2

0

[కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ ఎలనాగ సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా జాతీయ, అంతర్జాతీయ కవితలని అనువదించి ‘అనువాద మధు బిందువులు’ పేరిట అందిస్తున్నారు.]

నోటుపుస్తకపు పుటల్లో

~

[dropcap]చ[/dropcap]క్కెర రేణువులో చక్కగా నర్తిస్తుంది
పచ్చని చెఱకుతోట

ఉప్పురవ్వలో గుసగుసలాడుతుంది
నీలి సముద్రం

ముతక లోహాలు నిండిన మట్టి
ఇనుపమేకులో మంద్రమంద్రంగా పాడుతుంది

నోటుపుస్తకపు పుటమీద
దట్టమైన అడవి ఒకేవస్తువై నిల్చుంటుంది,
అక్షరాల వెనుక దాక్కున్న
ఆకాశాన్ని చూసేందుకు

మరాఠీ మూలం: ప్రఫుల్ శిలేదార్
ఆంగ్లానువాదం: మాయా పండిట్
తెలుగు సేత: ఎలనాగ

తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-31

0

[కన్నడంలో శ్రీ డి.వి.జి. రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

~

301
ఇచ్చట గాదచ్చట, కాదు కాదు యదిగో యచ్చట నున్నది
పచ్చపచ్చని మేతయనుచు, ఒకచో కాలానక తిరిగి తిరిగి
వచ్చి, డస్సి అరగడుపున నిదురించు లేగదూడ వోలె
మెచ్చని పనులు సేయ సుఖమెుక్కడిది నీకు – మంకుతిమ్మ!

302.
మట్టి రేణువుల నొక్కటొక్కటిగ దెచ్చి చెదచీమలవి
పట్టిన పట్టువీడక ఎట్టకేలకు గట్టిన గూటిని,
రెట్టించి, వాటిందూరి, గట్టి చేసుకొను విషోరగములు,
కష్టములకు ఫలము అంతే మనకు – మంకుతిమ్మ!

303.
‘తిరుగు తిరుగు చెల్లప్పా’ యని దిర్దిరిగి తలతిరిగి పడెనొకడు
మరచె నిజప్రపంచంబు నొకడు స్వప్నలోకాల విహరించి,
సరియేది? కానిదేది యని చింతించుచు కూర్చుండె నొకడు
మరీ మువ్వురలోన నరయగ మూర్ఖుడెవ్వడో – మంకుతిమ్మ!

304.
మేరు పర్వతాగ్రమున నొక ఉరు శిలన్ నుంచదలచె సిసిఫస్ గ్రీకు
దొర యొకండు; మరల మరల దొరల వచ్చెనది మరుక్షణంబున
పురుష ప్రగతియు నంతయె, మరల మరల
దొరలి వచ్చు సులభతరము కాదు పురోగమింప – మంకుతిమ్మ!

305.
లోక చరితంబుల కెయ్యవి కారణంబులు? కాకతాళీయమో
కాక, విమర్శల కందని కార్యకారణ సంబంధములో
ఆకర్షించు నయ్యవి మనల: కాని యయ్యవి ఆచరణీయంబులా!
వ్యాకులత కల్గించునవి – మంకుతిమ్మ!

306.
వాసికెక్కిన క్లియోపాత్రా యందచందములకు
దాసులై పోయిరి, వీరులు శూరులు సీజర్, ఆంటోనీలు
దేశ చరితములకు యంకుశములయ్యె వారి వర్తన
వశవర్తులై పోవరే ఎవ్వరైన మగువ సోయగములకు – మంకుతిమ్మ!

307.
సురసభ నందు నడచిన కౌశిక వశిష్ఠుల కక్ష
ధరలోన హరిశ్చంద్రునకయ్యె శిక్ష
ప్రారబ్ధమది ఎచట నుండియో సంక్రమించు
కర్మగతి దాట వశమె – మంకుతిమ్మ!

308.
అలల తాకిడికి సర్కారు పడవ యటునిటు యూగిసలాడ
నిలువరింప, తెరచాప తెడ్డు వేసెడి వారలు పాన మత్తులై యుండ
గాలి దారి మళ్ళింప, జనులు భీతావహులై తల్లడిల్ల
తలక్రిందులుగాక పడవ ముందుకు సాగుటయే యాశ్చర్యము – మంకుతిమ్మ!

309.
వన్య మృగముల నడుమ గోవొకటి చేరిన నేమగు?
పణ్య వీధిని తాత్త్వికునకేమి పని?
అన్యాయ యున్మత్త కోలాహలపు లోకమిది పుణ్యా
పుణ్యముల నాలోచించునే జగము – మంకుతిమ్మ!

310.
సహజమైన దాని మరచి నింగికి నిచ్చెన వేయు ప్రయత్నమ ద
సహజమైనదాని సత్యమని భ్రమించినట్లె యగు
సహజ సౌభాగ్యాల నాశించి, దౌర్భాగ్యముల వరించినట్టగు
ఇహమున నరునకున్న శాపమిది – మంకుతిమ్మ!

(ఇంకా ఉంది)

సంచికలో 25 సప్తపదులు-27

0

[9 జూన్ 2024 నుంచి వారం వారం సంచికలో వివిధ కవుల సప్తపదులు 25 ప్రచురిస్తున్నాము. సప్తపదుల సృజనకర్త శ్రీ సుధామ. నిర్వహణ: శ్రీ విహారి, శ్రీ శాంతమూర్తి. సప్తపదుల నియమ నిబంధనలూ, పంపవలసిన వారి వాట్సప్ నెంబర్ ఇక్కడ చూడగలరు.]

~

1
వహనం
సంవహనం
మనిషికి గౌరవం, విజయాన్నందించేవి ఓర్పు, సహనం.

ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు
సారవకోట

2
యోగo
భోగం
శారీరకశ్రమ కావాలి లేకున్నా వస్తుంది రోగం..

బలివాడ హరిబాబు
విశాఖపట్నం

3
అదిరింది
ముదిరింది
చూపులు కలిసిన శుభవేళ సంబంధం కుదిరింది.

బలివాడ వేణు గోపాల రావు,
హైదరాబాద్.

4
కాంతం
అయస్కాంతం
పొరపొచ్చాలు లేని కాపురం స్వర్గతుల్యం ఆసాంతం.

క్రొవ్విడి వెంకట బలరామమూర్తి
హైదరాబాద్.

5
నియోగి
యోగి
విశ్వవృత్తము కేంద్రీకరణములో, అగుపించును మూలశక్తిగా ఆదియోగి.

పుష్పవేఙ్కటశర్మా.
భువనేశ్వరము.ఒడిశా.

6
గతము!
అంతర్గతము!!
దాచుకున్న విషయాన్ని ఎప్పుడూ చేయకు బహిర్గతము!!!

మన్నవ నాగ లలిత శ్రీదేవి
విజయవాడ

7
మనువు
అనువు
పరిచయాలు అయిన వెంటనే పెరుగుతుంది చనువు

కానుకొలను లక్ష్మీ సీత
హైదరాబాద్

8
తడబాటు
పొరబాటు
ఆలుమగల మధ్య కీచులాటలు శృతిమించితే ఎడబాటు!

గోపరాజు వెంకట సూర్యనారాయణ
హైదరాబాద్.

9
కోపం
శాపం
ప్రకోపిస్తే రక్తపోటు చూపును తన ప్రతాపం

శేష శైలజ(శైలి),
విశాఖపట్నం

10
సరాగం
విరాగం
శిక్షణలో ఎప్పుడూ అడ్డంకి కారాదు అనురాగం.

పూడిపెద్ది వెంకట సుధారమణ
విశాఖపట్నం

11
విడుపు
మడుపు
వీరుని ఒరలో కత్తులెన్నున్నా ఓరచూపుకు దిగదుడుపు.

బెహరా నాగభూషణరావు,
గజపతినగరం

12
పొదరిల్లు
హరివిల్లు
కుదిరాయిలే ప్రియతమా! కురిపించు నీచూపుల విరిజల్లు

బత్తిన గీతాకుమారి
సత్తుపల్లి

13
తట్టుకుంటుంది
అడ్డుకుంటుంది
మితిమీరిన హింసను భరించలేకుంటే బంధాన్ని త్రుంచుకుంటుంది.

పొన్నాడ వరాహ నరసింహులు,
ఆమదాలవలస.

14
ఆహార్యము
చాతుర్యము
వేషధారణ, మాటనేర్పుల చాటున జరుగుతుంది చౌర్యము

డా. పి.వి. రామ కుమార్
హైదరాబాద్

15
వాగకు
వీగకు
ప్రతిది తెలుసును అనుకొని గర్వంతో‌ విర్రవీగకు.

సింహాద్రి వాణి
విజయవాడ.

16
బాలలు!
లీలలు!
చిరునవ్వుల మోము చూడ వికసించిన పూమాలలు!

యలమర్తి మంజుల
విశాఖపట్నం

17
చనువు
తనువు
హద్దుల్లోనుండాలి అయ్యేదాకా పెద్దల అంగీకారంతో మనువు.

డబ్బీరు ప్రభాకర్,
రాయపూర్.

18
యుక్తి
రక్తి
అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది మహిళా శక్తి

డా. పద్మావతి పి.
హైదరాబాద్

19
ఋషులు
కింపురుషులు
ఆనాడు_ అన్నిటా తోడు అండదండగా పురుషులు

అచ్యుతుని రాజ్యశ్రీ
హైదరాబాదు

20
విలాసం
చిద్విలాసం
కష్టించే కూలన్నకు కడుపు నిండితే కైలాసం.

ఆర్ ఎస్ రాజకుమార్
విశాఖపట్నం

21
కూడు
గూడు
అత్యవసరాలు తీరని స్థితిలో కోరుకోవద్దు తోడు

విత్తనాల విజయ కుమార్
హైదరాబాద్

22
ఆటలకా!
పాటలకా!!
దూరదర్శన్ ఎందుకు? పాలక ప్రతిపక్షాల కీచులాటలకా!!!

కృష్ణ తేజ
హైదరాబాద్

23
గెలుపు
మలుపు
అగ్రరాజ్యంలో స్థిరపడిన వలసదారుని మూసుకోబోతున్న తలుపు.

బెహరా నాగభూషణరావు
గజపతినగరం

24
వింటుంది!
అంటుంది!!
ఇష్టం లేనిచో ఇంద్రభవనమైనా ఇరుకుగానే ఉంటుంది!!!

లయన్: కంబాల తిమ్మారెడ్డి
కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా

25
మతి
కృతి
సంసారసారం శ్రీమతి జీవనవ్యాకరణంలోని విసర్గ పురస్కృతి.

డా రామడుగు వేంకటేశ్వర శర్మ.
హైదరాబాదు

~

(మళ్ళీ కలుద్దాం)

మనిషి ఎప్పుడు ఒంటరే!

0

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘మనిషి ఎప్పుడు ఒంటరే!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]చీ[/dropcap]కటి నిండిన అమ్మ జానెడు
పొట్టలో నిద్రాహారాలు లేక
నవమాసములు
రక్త మాంసాలలో ఓలలాడుతూ
ఒంటరి పోరాటం సాగించి
తెలియని బంధాలు బంధుత్వాలతో
పెనవేసుకున్న ఆనందాల మధ్య
ఈ భూమ్మీదకు వచ్చాను
ఏవేవో వరసలు పెట్టి పిలిచారు
నాకు తెలియని వాళ్ళందరూ
నన్ను లాలించి బుజ్జగించారు
ఎత్తుకుని ముద్దు చేశారు
అమ్మ కడుపులో
ఎంత హాయిగా ఉన్నానో
ఇలా ఇలపైకి వచ్చానో లేదో
ఏదో తెలియని స్వార్థం
నాలో పెరిగింది
స్నేహితులు తోడయ్యారు
అపార్థాలు ప్రేమల సాన్నిహిత్యంతో కలిసి ప్రయాణం సాగించాను
నిరంతర పోరాటమే బ్రతుకని అర్థమైంది
కాలచక్రం పరుగులు పెడుతున్నది
సంవత్సరాలు గడిచిపోయాయి
వయోభారంతో కంటిచూపు తగ్గింది
ఒంట్లో ఓపిక సన్నగిల్లింది
అందరూ నా చుట్టూ ఉన్నా
ఒంటరితనం నన్నావహించింది
అప్పుడు పరమాత్మ తలపుకు వచ్చాడు
గడచిదంతా మాయే కదా అనిపించింది
ఈ ప్రపంచ రంగస్థలంలో
నా పాత్ర ముగిసింది
ఇక ప్రయాణానికి సిద్ధం కావాలి
నాడు ఆనందంతో స్వాగతించిన
బంధువులు బంధుత్వాలు వదులవుతున్నాయి
ఒంటరిగానే భూమ్మీద పడ్డాను
అయిన వారి ఆశలు తీర్చడానికి
ఒంటరిగా పోరాడాను
పెనవేసుకున్న బంధాల లతలను
ఒక్కొక్కటిగా తెంచుకుంటూ
ఒంటరిగానే పోతున్నా
ఎవరు వచ్చినా ఏం చేసినా
ఎవరు మోసినా ఎందరు వచ్చినా
ఎక్కడో అక్కడ ఆగిపోయేవారే కదా!
కడదాకా వచ్చే వారెవరు లేరు
మనిషి ప్రయాణము
ఎప్పుడు ఒంటరిగానే
ఆసత్యం తెలిసేటప్పటికి
తిరుగు ప్రయాణ సమయం
ఆసన్నమైనది కదా!

శీతాకాలపు వాక్యం

1

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘శీతాకాలపు వాక్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]శీ[/dropcap]తాకాలం వణికిస్తున్నది
అంతా అదిరిపోతున్నది
అటు భానుడు సెలవు తీసుకోగానే
ఇటు శివతాండవం చేస్తున్నది

తలుపులూ కిటికీలూ
కాల్రెక్కలు ముడుచుకుని
ముసుగుతన్ని మూసుకున్నాయి

పైన గిరగిరా తిరిగే పంకాలు
మూగనోము పట్టాయి

రాత్రంతా కురిసే మంచు వర్షానికి
చెట్టూ చేమా అన్నీ
తెల్లటి దుప్పటి కప్పుకున్నాయి

రోడ్లన్నీ కర్ఫ్యూ పెట్టినట్టు
బిక్క మొఖాలేసుకున్నాయి

వీధుల్లో చలిమంటల
చిరునామా మాసిపోయింది

కాఫీ మగ్గో పెగ్గో హగ్గో
కొంత వూరటనిస్తున్నాయి

రారాజులా రాత్రంతా వణికించిన చలి
ఉషోదయానికి ఉసూరుమంటుంది

నీలిరంగు కొలను లోంచి విచ్చుకున్నట్టు
తూర్పున భానుడుదయిస్తాడు

రాత్రంతా లోకం చలి దుప్పట్లో
ముసుగుతన్ని మూలిగింది

కానీ నా మనసేమో మెలకువగానే వుంది
లోపల కొత్త భావాల విత్తనాలు
మెలితిరుగుతూనే వున్నాయి

ఏవో నాలుగు వాక్యాలు
రూపుదిద్దుకుంటూనే వున్నాయి

గొప్ప వెలుగు చీకటి

0

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘గొప్ప వెలుగు చీకటి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క పేదకు దుప్పటి చీకటి
ఒక బాధకు కంబలి చీకటి
వెలుతురు తెచ్చే వెతలకు
వేదన నిండే కతలకు
ముగింపు ఈ చీకటి
తెగింపు ఈ చీకటి
ఏమిటి ఎందుకు
అన్న ప్రశ్నలకు
సరైన జవాబు చీకటి
ఎవరేమిటి తెలియకుండా
అందరినీ అందంగా
ఉంచే గొప్ప వెలుగే చీకటి