ప్రాంతీయ సినిమా – 9: మూతబడ్డ థియేటర్లతో పహారీవుడ్!

    0
    3

    [box type=’note’ fontsize=’16’] “పాతతరం వారు తప్ప, మొత్తానికి మొత్తం ఆ తర్వాతి తరం వెండి తెర మీద సినిమాలే చూడని తరంగా ఎదిగారు” అంటూ పహారీవుడ్ కళ కోల్పోయిన కారణాలనీ, జరుగుతున్న పునరుద్ధరణ ప్రయత్నాలనీ విశ్లేషిస్తున్నారు సికందర్ప్రాంతీయ సినిమా – 9: మూతబడ్డ థియేటర్లతో పహారీవుడ్” వ్యాసంలో. [/box]

    [dropcap]ప్రాం[/dropcap]తీయ సినిమాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా  విస్తరించి వున్న సంగతి తెలిసిందే. ప్రాంతీయ సినిమాల్లో మళ్ళీ ఉపప్రాంతీయ సినిమాల ఆవిర్భావం కూడా కనిపిస్తోంది. కన్నడలో ఉపప్రాంతీయం తుళు భాషా సినిమాల్లాగా, తమిళంలో ఉప ప్రాంతీయం బడుగ భాషా  సినిమాల్లాగా,  ఝార్ఖండ్‌లో సంథాలీ, నాగపురీ ఉప ప్రాంతీయాల్లాగా, జమ్మూకాశ్మీర్ లోనూ మూడు  ఉపప్రాంతీయ సినిమా రంగాలున్నాయి. డోగ్రీ,  లడఖ్, కశ్మీరీ. జమ్మూ – కాశ్మీర్ రాష్ట్రం ఈ మూడు భాషల ప్రాతిపదికన మూడు ప్రాంతాలుగా వుంటుంది. జమ్మూలో డోగ్రీ భాష, లడఖ్‌లో లడఖీ భాష,  కాశ్మీర్లో కశ్మీరీ భాష మాట్లాడతారు. డోగ్రీ భాషీయుల్ని డోగ్రా లంటారు. మొత్తం – జమ్మూ కాశ్మీర్‌లో డోగ్రాలది యాభై లక్షల జనాభా. జమ్మూతో పాటు, ఉత్తర పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆజాద్ కాశ్మీర్ ప్రాంతాల్లో డోగ్రీ చెలామణీలో వుంది. ఇండో – ఆర్యన్ భాష అయిన డోగ్రీలో మొదటి సినిమా నిర్మించడమే బాగా ఆలస్యమైతే, ఆ తర్వాత రెండోది  నిర్మించడం మరీ ఆలస్యమైపోయింది. గానగంధర్వుడు, హిందీ సినిమా నేపధ్య గాయకుడూ అయిన కె.ఎల్. సైగల్ జన్మ స్థానం జమ్మూయే అయినా,  ఇక్కడ సినిమా ప్రాణం పోసుకోవడానికి ఏళ్ళ కేళ్ళు పట్టింది.

    1966లో మొట్టమొదటి డోగ్రీ  భాషా చలన చిత్రంగా ‘గలన్ హోయి బిటియా’ వెలువడింది. దీని నిర్మాత, దర్శకుడు కులదీప్ కుమార్. దీని తర్వత 44 ఏళ్లకు రూప్ సాగర్ దర్శకత్వంలో 2010లో ‘మా నీ  మిల్దీ’ విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి ఒకటీ రెండు చొప్పున ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ప్రాంతీయ సినిమా రంగాల ట్రెండ్‌లో భాగంగా దీనికీ ‘పహారీవుడ్’ అని పేరు పెట్టుకున్నారు.

    ప్రారంభం నుంచీ ఇప్పటికి చూసుకుంటే మొత్తం ఈ 52 ఏళ్ళల్లో 13 సినిమాలే నిర్మించగల్గింది పహారీవుడ్. 1989లో కాశ్మీర్‌లో పెచ్చరిల్లిన ఉగ్రవాదం కారణంగా జమ్మూలో మొత్తం 19 థియేటర్లు మూతబడ్డాయి. సోపోర్, అనంతనాగ్, బారాముల్లాలతో బాటు శ్రీనగర్లో థియేటర్లు మూతబడ్డాయి. ఒక్క  శ్రీనగర్లోనే 9 థియేటర్లుండేవి. ఈ నేపధ్యంలో పాతతరం వారు తప్ప, మొత్తానికి మొత్తం ఆ తర్వాతి తరం వెండి తెర మీద సినిమాలే చూడని తరంగా ఎదిగారు. బుల్లితెర మీద ఇంట్లో కూర్చుని మొదట వీడియో టేపుల మీద, తర్వాత విసిడిల మీద, ఆ తర్వాత సీడీల మీదా,  తాజాగా ఇప్పుడు నెట్ లోంచి డౌన్ లోడ్ చేసుకుని సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. దేశంలో థియేటర్లలో సినిమాల మొహం చూడని ప్రేక్షకులు వీళ్ళే. మూతబడ్డ సినిమా హాళ్ళు సెక్యూరిటీ  క్యాంపులుగా, ఆస్పత్రులుగా, హోటళ్ళుగా మారిపోయాయి. వేర్పాటువాదం  లేని కాలంలో శ్రీనగర్‌లోని బ్రాడ్వే థియేటర్లలో ఇంగ్లీషు సినిమాలు ఆడేవి. ఈ  విధంగా జమ్మూ కాశ్మీర్లో సినిమా సంస్కృతి మొత్తం భూస్థాపితమై పోయింది.

    గత సంవత్సరం నుంచే పునరుద్ధరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియాలో సినిమా రంగాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టినట్టు జమ్మూ కాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం కూడా కాశ్మీర్లో సినిమా హాళ్ళు తెరిపిస్తామని ప్రకటించారు. గత సంవత్సరం రెండుసార్లు కాశ్మీర్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్స్ విజయవంతంగా నిర్వహించారు. పునరుద్ధరణ కార్యక్రమాలకి ప్రజా మద్దతు కూడా లభిస్తోంది.

    ఫెస్టివల్స్‌కి క్రిక్కిరిసి హాజరైన ప్రేక్షకుల్లో 80 శాతం యువతే వున్నారు. యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా అపే శక్తి సినిమాలకుందని చెప్పొచ్చు. ఫెస్టివల్స్‌లో భాగంగా ప్రసిద్ధ దర్శకులు గోవింద్ నిహలానీ,  సయీద్ మీర్జా లాంటి వారు నిర్వహించిన వర్క్‌షాప్‌లో సినిమా కళ నేర్చుకోవడానికి యువత భారీ సంఖ్యలో హాజరవడమే ఇందుకు తార్కాణం. ఈ ఫెస్టివల్స్‌లో బాలీవుడ్, హాలీవుడ్. ఇరానియన్ పాత  క్లాసిక్స్‌తో బాటు, కొన్ని డోగ్రీ, లడఖీ, కశ్మీరీ సినిమాలని కూడా ప్రదర్శించారు.

    డోగ్రీ సినిమాల మార్కెట్ పొరుగున ఉత్తర పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆజాద్ కాశ్మీర్‌లో ఉన్నప్పటికీ సినిమాల నిర్మాణం అంతగా లేదు. పైగా ప్రారంభంలో తీసిన సామాజిక కథాంశాలతో ఇప్పుడు తీయడం లేదు. 2014లో రాహుల్ శర్మ తీసిన ‘గీతియాఁ’ అనే యాక్షన్ మూవీని యువత విరగబడి చూసి హిట్ చేశారు. ఫెస్టివల్‌లో కూడా ప్రసంశలందుకుంది.  జమ్మూ ప్రాంతంలో గ్యాంగ్ వార్స్, వాటి ఫలితంగా చెలరేగే భావోద్వేగాలు, తెగిపోయే కుటుంబ సంబంధాలు ఈ యాక్షన్ మూవీ కథా వస్తువుగా వుంది.

    దీని ఘన విజయం తర్వాత నాలుగేళ్ళకి ఇప్పుడు ‘సిల్సిలే  ప్యార్ దే’, ‘మిగి తేరే కన్నే  ప్యార్ హోయీ గయా’ రెండు కమర్షియల్స్ నిర్మాణంలో వున్నాయి. ఎందరో  కొత్త టాలెంట్స్  ఈ రంగంలో కొస్తున్నారు. అయితే విరివిగా సినిమాలు తీసి ప్రదర్శించడానికి థియేటర్లు లేవు. నిర్మాణ వ్యయం లక్షల్లోనే వున్నా, ఏడాదికి ఒకటి రెండు మాత్రమే తీస్తూ ఎక్కువ రోజులు ప్రదర్శించుకుని లాభాలు గడిస్తున్నారు.

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here