[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత శ్రీ ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు రచించిన 60 కార్డు కథల సంపుటి ఇది.
***
“‘పకోడి పొట్లం’! మెత్తని పకోడినా… గట్టి పకోడినా.. ఉల్లిపాయ పకోడినా… మసాలా పకోడినా… ఆలూ పకోడినా… ఇలా ఏమీ వెతకక్కర్లేదు. అన్ని రకాల రుచులు గుత్తిగా కలిపి ఉన్న ‘పకోడి పొట్లం’ ఇది. ఎక్కువ పకోడి ఉందేమో, తినలేమని భయపడవలసిన అవసరం లేదు. ఇందులో వున్నవి తక్కువ మోతాదులో (తక్కువ నిడివిలో) ఉన్న పకోడినే. గబగబా తినేయవచ్చు. తిన్నవన్నీ వెంటనే అరగించవచ్చు, ఆనందించవచ్చు.
ఈ ‘పకోడి పొట్లం’లోవి చిన్న కథలు… 1982 నుంచి వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు… ఆలస్యంగా వెలువడుతున్న కథలు. అందుకే పాత వాసనతో పాటు కొత్త సొబగులు ఇందులో చూస్తాం. గమ్మత్తేమిటంటే… రాజుల కాలం నాటి కథలు ఇందులో ఉన్నా, ఆ కథలలో వస్తువు, ఇతివృత్తము ఈ నాటి సామాజిక కాలం నేటివిటినీ పోలి మనకి కనిపిస్తాయి. ఇవి చూడడానికి చిన్న పిల్లల కథల్లా కనిపిస్తాయి గాని నేటి రాజకీయ పాలనా విధానానికి కూడా వర్తిస్తాయని ఈ కథలు చదివిన పాఠకులకు అనిపించక మానదు.” అని తమ ముందుమాట ‘చిన్న కథలు… పిల్లల కథలే కాదు… ప్రజా క(ళ)థలు’లో వ్యాఖ్యానించారు శ్రీ చలపాక ప్రకాష్.
***
ఈ పుస్తకంలోని కథలు చిన్నా పెద్దా చదువుకోడానికి ఆసక్తిగా ఉంటాయనేందుకు నిదర్శనం ‘కోడి కూత‘ అనే ఈ చిన్నకథ.
~
ఊర్లోని ఒక కోడి తెల్లారేసరికి ఇంటి చూరెక్కి కూత కూసేది. ఊర్లోని మిగతా కోళ్లు మేము కూసినట్లే నేల మీద నిలబడి కూయవచ్చు కదా అని అడిగాయి. అయినా ఆ కోడి వాటి మాటలను ఖాతరు చేయలేదు. అలా కూత కూయడం వల్ల యజమాని మన్ననలు పొందవచ్చని భావించింది. తన కూతను మెచ్చి మంచి తిండి గింజలు పెడతాడని ఆశించింది. ఊరంతా ఒక తోవ అయితే ఉలిపికట్టె దొక తోవ మాదిరి వుంది దీని వ్యవహారం అని తిట్టుకున్నాయి.
మంచి వర్షాకాలం వచ్చింది.వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వానకి భయపడి ఆ కోడి ఇంటి చూరెక్కి కూత కూయలేక పోయింది. కోడికి పొగురు పట్టిందని భావించిన యజమాని దానిని రాళ్లతో చితక బాదాడు. మిగిలిన కోళ్లు దాన్ని ఓదారుస్తూ ఏదైనా మితంగా చేయాలి, అతి చేయకూడదు. ఉత్సాహం ఉండాలి, అత్యుత్సాహం పనికిరాదు అని హెచ్చరించాయి. అతి వద్దు మితం ముద్దు అని తెలుసుకున్న కోడి అప్పటినుంచి జాగ్రత్తగా వ్యవహరించసాగింది.
(సాక్షి దినపత్రిక, 25/3/2020)
~
ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన చిన్న కథలు ఉన్న ఈ పుస్తకం ఆసక్తిగా చదివిస్తుంది.
***
పకోడి పొట్లం (కార్డు కథలు)
రచన: ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పేజీలు: 111
వెల: ₹ 100
ప్రచురణ: మల్లెతీగలు, విజయవాడ
ప్రతులకు:
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు