[box type=’note’ fontsize=’16’] పిల్లలన్నా, వారితో సావాసం చేయటమన్నా నాకెంతో ఇష్టం. తరగతి గదిలో, ఆటస్థలంలో, ఇంట్లో, ఎక్కడైనా సరే పిల్లల ఆటపాటలు ఉంటే సందడే సందడి. ఆ సందడి నాకెంతో ఇష్టం. ఉమయవన్ తమిళంలో రాసిన ‘పరక్కుమ్ యానై’ కథలు చదివిన తరువాత అవి బాగా నచ్చి వాటిని మన తెలుగు పిల్లలకు దగ్గరచేయాలనే ఉద్దేశంతో తెలుగులోకి అనువదించాను. అందులోని కథలే మీరిప్పుడు చదువుతున్నది! – రచయిత్రి (అనువాదకురాలు)
~ ~
పన్నెండేళ్ల లోపు పిల్లలకు ఈ పది కథలూ చాలా సరదాగా అనిపిస్తాయి. వీటిలో కల్పన ఉన్నా, పర్యావరణ స్పృహ, సమాజం పట్ల బాధ్యత అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి నీతిని బోధించే కథలు కావు. గంభీరంగా ఉండవు. కాని, చిన్న చిన్న అంశాలతోనే ఎంతో పెద్ద విషయాన్ని పిల్లలకు అర్థమయేట్లుగా, వారు పాటించేటట్లుగా బోధపరుస్తాయి. అదే వీటి విలక్షణత. [/box]
[dropcap]చి[/dropcap]న్నారి రోజీకి చదవటం అంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడు చూసినా ఒక చెట్టు క్రింద నీడలో చేతిలో ఒక పుస్తకం పట్టుకొని కనిపిస్తుంది. ఇది ఆమెకు చాలా ఇష్టమైన, ఆనందదాయకమైన అలవాటు. ఏది ఏమైనా ఆమె మాత్రం ప్రతి రోజూ తప్పకుండా ఇలా పుస్తకం చదువుతూనే ఉంటుంది.
ఒకానొక రోజున రోజూలాగే రోజీ పుస్తకం చదువుకుంటూ చెట్టు క్రింద అలా కూర్చొని ఉండగా ఆ పాప దగ్గరకు ఒక నెమలి వచ్చింది. “నీవు ఇలా చెట్టు క్రింద పుస్తకం చదువుతూ కూర్చొని ఉండటం నేను ఎన్నో సార్లు గమనించాను” అని నెమలి రోజీతో అన్నది. రోజీ చిన్నగా నవ్వుతూ నెమలి తాను చదువుతున్న పుస్తకంలో ఏముందో చూడాలని అనుకుంటున్నదని గమనించింది. రోజీ చదువుతున్న పుస్తకంలో ఏముందో చూసిన నెమలికి చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. సంతోషం పొంగి పొర్లింది. ఇంకో ప్రక్క నుంచి బయటకు చెప్పలేనంత ఆవేదనగా కూడా ఉన్నది నెమలికి. రోజీ నెమలిని బాగా పరికించి చూసి “నీకు ఏమైంది?” అని అడిగింది.
నెమలి నెమ్మదిగా వచ్చి రోజీతో “నా బొమ్మ నీవు చదువుతున్న పుస్తకంలో ఎందుకున్నది?” అని అడిగింది. తన బొమ్మను ఆ పుస్తకంలో మరింత దగ్గరగా చూడాలని ఆ పాప దగ్గరగా కూర్చున్నది. రోజీ నెమలికి ఆ బొమ్మను స్పష్టంగా చూపించడమే కాక పుస్తకాన్ని నెమలికి ఇచ్చింది. నెమలి పుస్తకము పై నుండి తన చూపు మరల్చలేకపోయింది. ‘ఈ పుస్తకంలో ముద్రించినది అచ్చంగా తన బొమ్మే!’ అని అనుకుంది కళ్ళు పెద్దవి చేస్తూ. అప్పుడు చిన్నారి రోజీ నెమలికి కాగితంపై ఇలా బొమ్మలు ఎలా అచ్చు వేస్తారో ఎంతో వివరంగా చెప్పింది.
నెమలికి ఆ పాప చెప్పిన విషయాలు విన్న తరువాత కూడా తృప్తిగా అనిపించలేదు. దాని మనసులో ఇంకా ఏదో తెలియని కోరిక అలాగే ఉండిపోయింది. నెమలికి తనకు తెలిసిన విషయాలను వివరంగా చెప్పడం రోజీకి ఆనందంగానే ఉన్నది. అయితే తాను మళ్లీ ఒంటరిగా తన పుస్తకం తాను చదువుకోవాలని అనిపించింది. ఆమె కొద్దిగా పక్కకు జరిగి తన పనిలో తాను మునిగిపోయింది కాని నెమలి ఆమెను వదిలి వెళ్లే లాగా కనిపించలేదు.
“నేనేమో నా పుస్తకం చదువుకుంటున్నాను. నీవు ఎందుకని ఇంకా ఇక్కడే కూర్చున్నావు?” అని రోజీ నెమలిని ప్రశ్నించింది. “మరి పుస్తకంలో నా బొమ్మ దగ్గర ఏమి రాసి ఉన్నదో చదివి చెప్పవా?” అని నెమలి రోజీని అడిగింది. “అదా? ఇక్కడ రాసి ఉన్న విషయాలన్నీ నెమలి పక్షిని గురించిన సంగతులు” అన్నది రోజీ. తన జాతిని గురించిన సంగతులు అని చిన్నారి పాప చెప్పగానే నెమలికి ఆ విషయాలన్నీ తెలుసుకోవాలనే ఉబలాటం కలగసాగిందిప్పుడు.
సరే! కాదనకుండా రోజీ పుస్తకంలో ఉన్న విషయాలన్నీ ఇలా చదవసాగింది- “నెమలి మన భారత దేశపు జాతీయ పక్షి. ఆడ నెమలి కంటే మగ నెమలికి చాలా ఎక్కువ ఈకలు ఉంటాయి. మగ నెమలి తన పెద్దదయిన పురి విప్పి నాట్యం చేస్తుంటే మానవులు ఎంతో మైమరచిపోయి ఆ నాట్యాన్ని ఎంతో ఆనందంతో అలా చూస్తూ ఉంటారు….” అంటూ ఎన్నో విషయాలు నెమలికి చెప్పింది చిన్నారి రోజీ. రోజీ అలా చదువుతూ చెబుతూ ఉంటే నెమలికి తమ జాతి భారతదేశపు జాతీయ పక్షి అని, తమ జాతి సుబ్రహ్మణ్య స్వామికి వాహనమని తెలిసి చెప్పలేనంత సంతోషంగా, ఎంతో గర్వంగా కూడా అనిపించింది.
నెమలి రోజీకి తన ధన్యవాదాలు తెలియజేసి అక్కడినుంచి లేచి ఎగురుకుంటూ వెళ్లి చెట్టుకొమ్మ పైకి ఎక్కి కూర్చుంది. అలా కూర్చున్న నెమలికి తనకు తెలియకుండానే ఎందుకో చాలా దిగులుగా అనిపించసాగింది. అదే చెట్టుపైన కూర్చున్న ఒక చిలుకమ్మ నెమలిని “ఎందుకంత విచారంగా ఉన్నావు?” అని అడిగింది. తన బాధను నెమలి చిలుకమ్మతో ఇలా పంచుకోసాగింది –
“అసలు మన పక్షులు కాని, ఇతర ప్రాణులు కాని మనుషుల లాగా ఎందుకని ఉండలేవు? ఎందుకని పుస్తకాలు చదవలేవు? ఆ పుస్తకాలలోని అనేక విషయాలు మనం ఎందుకని తెలుసుకోలేక పోతున్నాము?” అని అడిగింది!
నెమలి అడుగుతున్న ఆ వింత ప్రశ్నలకు చిలకమ్మకు నోట మాట రాలేదు. “అలా ఎలా సాధ్యపడుతుంది అసలు…?” అని చిలుకమ్మ నెమలిని అడిగింది. “….మనం కూడా మనుషులలాగా చదవాలంటే, అడవిలో ఉండే పక్షులు, జంతువులు అన్నీ కూడా బడికి వెళ్లి ముందు అక్షరాలు నేర్చుకుని తర్వాత పుస్తకాలు చదవటం మొదలు పెట్టాలి. అంతే కాదు, పక్షుల కోసం, జంతువుల కోసం ఇలా చదువు నేర్పే ప్రత్యేకమైన పాఠశాలలు ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మనుషులు పక్షులను, జంతువులను తమ బడిలోకి రానివ్వరు కనుక!” అంటూ చిలకమ్మ నెమలితో చెప్పింది.
ఈ మాటలు విన్న నెమలికి ఎంతో నిరుత్సాహంగా అనిపించింది. “అంటే మనం ఎప్పటికీ మనుషుల లాగా పుస్తకాలు చదవనేలేమా?” అన్నది చిలుకమ్మతో. అప్పుడు చిలుకమ్మ ఎగతాళిగా, “నీ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలుసా? నువ్వు నీ సొంత బడిని మొదలు పెట్టి అన్ని పక్షులకు, జంతువులకు పాఠాలు నేర్పగలిగినప్పుడు!” అన్నది.
ఈ మాటలు విన్న నెమలి ఒక్క ఉదుటున సరిగా కూర్చున్నది. మళ్లీ దానికి చెప్పలేనంత సంతోషం కలిగింది. “నీవు ఎంత గొప్ప సలహా చెప్పావో తెలుసా? నీకు నా ధన్యవాదాలు” అన్నది చిలుకమ్మతో. చిలుకమ్మ నెమలి మాటలకు పెద్దగా నవ్వుతూ అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. నెమలికి ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో స్పష్టంగా తెలియసాగింది. అదేమిటంటే – తను వెంటనే అడవి పక్షులకు, జంతువులకు, ఇతర ప్రాణులకు వెంటనే ఒక పాఠశాల ప్రారంభించాలి. తాను చేయబోతున్న ఈ పని వల్ల అడవిలోని ప్రాణులన్నిటికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది అనుకున్నది నెమలి.
ఆ మరునాడే నెమలి అడవిలోని జంతువులు, పక్షులు, ఇతర ప్రాణులు అందరినీ పిలిచి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తన మనసులోని ఆలోచనలను ప్రకటించి, వారందరి అభిప్రాయం తెలుసుకున్నది. వెంటనే పాఠశాలను ప్రారంభించాలని చెప్పింది. వాళ్ళంతా నెమలి అభిప్రాయాన్ని సమర్థించి దానికి తామందరూ ఏమి చేయాలో చర్చించారు. ముందుగా, అడవిలో ఇటువంటి పాఠశాల ప్రారంభించాలంటే తగిన స్థలం ఎక్కడుందో చూడాలని నిశ్చయించుకున్నారు. తాము నడపబోయే పాఠశాలకు జంతువులన్నీ నెమలిని అధ్యక్షుడిగానూ, ఏనుగును ప్రధానోపాధ్యాయుడిగానూ ఎన్నుకున్నాయి. ఇక సింహం, జిరాఫీ, వానరం, నక్క, చిలుక, కుందేలు – ఇవన్నీ ఉపాధ్యాయ బృందంగా ఏర్పరచబడ్డాయి.
అతి త్వరలోనే, నెమలి కోరుకున్నట్లుగానే, చరిత్రలోనే మొట్టమొదటి అటవీప్రాంతపు పాఠశాల సిద్ధమవసాగింది. నక్క ఆ అడవికి దగ్గరలోనే ఉన్న మరికొన్ని అటవీ ప్రాంతాలకు వెళ్లి అక్కడి జంతువుల పిల్లలను తాము ప్రారంభిస్తున్న పాఠశాలల్లో చేర్పించమని ఆయా తల్లిదండ్రులను ప్రార్థించింది. జంతువుల కోసం ఇలాంటి ఒక పాఠశాల ఉంటుందన్న విషయం తెలుసుకుని ఆ క్రొత్త అడవి జంతువులు ఆశ్చర్యంతో తల మునకలవడమే కాక ఈ వార్తను మరింత వేగంగా మిగిలిన అన్ని ప్రాణులకు కూడ తెలియపరచసాగాయి.
పాఠశాల ప్రారంభోత్సవ శుభదినం రానే వచ్చింది. అధ్యక్షుడైన నెమలి, ప్రధానోపాధ్యాయుడైన ఏనుగు పాఠశాల ముఖద్వారానికి రెండు వైపులా నిలబడి విద్యార్థులు వస్తారో రారోనని ఆత్రుతగా ఎదురుచూడసాగారు. మొట్టమొదటిగా లోపలికి అడుగు పెట్టింది చిలుకమ్మ- అది తన ఇద్దరు పిల్లలను తీసుకొని మరీ వచ్చింది. ఇంతలో తన బిడ్డలను వెంట తీసుకొని కోతి, దాని వెనుక జింక, దాని వెనుక చిరుతపులి – ఇలా ఎందరో, ఎందరెందరో లోపలికి వస్తున్నారు.
తాను కలలో కూడా ఊహించని ఇంతటి విజయానికి నెమలి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యింది. పాఠశాలలో ప్రోగైన అన్ని రకాల జంతువుల పిల్లలను చూచి దాని మనసు పులకరించి పోయింది. తరువాత కొద్ది రోజుల వరకు తమ తమ ప్రణాళికలను అనుసరించి పాఠశాలను చక్కగా నడుపుతున్నాయి ఆ అడవి జంతువులన్నీ. వారు ఆ పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ చదవడం, పదనిర్మాణం చేయడం, ఉచ్చరించడం, వ్రాయడం లాంటి ఎన్నో విద్యలు ఎంతో చక్కగా బోధించసాగారు.
ఇంతలో ఒక రోజు చిలుక మాస్టారికి ఒక పాఠంలో ఒక చిన్న సందేహం కలిగింది. ‘దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి?’ అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకి చిన్నారి రోజీ గుర్తొచ్చింది. ఎప్పుడూ చేతిలో పుస్తకం పట్టుకొని చెట్టు క్రింద కూర్చునే చిన్నారి రోజీ దగ్గరకు ఒక్క ఎగురులో వచ్చి చేరాడు ఆ చిలుక మాస్టారు. తన సందేహాన్ని రోజీకి వివరిస్తూ తన చేతిలోని పుస్తకాన్ని రోజీకి అందించాడు. చిలుక చేతిలో పుస్తకాన్ని చూసిన రోజీ ఆశ్చర్యం ఆ పుస్తకంలోని విషయాన్ని చూసి రెండింతలు అయ్యింది! ఆ పుస్తకంలో ఎంతో మంది మానవుల బొమ్మలు, వారు అడవి జంతువులను, పక్షులను వేటాడడానికి ఉపయోగించే అనేక రకాల ఆయుధాలు, సాధనాలు, అడవి జీవులు మానవుల నుండి తప్పించుకోవడానికి అనుసరించే అనేక ఉపాయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన విషయాలన్నీ చక్కగా ముద్రించబడి ఉన్నాయి!! అంతే కాదు, పక్షులు అడవులను వ్యాప్తి చేయడానికి ఏమేమి చేయాలి, నేలలో బొరియలు చేసుకుని నివసించే జంతువులు చెట్ల వ్రేళ్ళకు, చెట్లకు ఎలా ఇబ్బంది కలిగించకూడదు – ఈ మొదలైన ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఎంతో వివరంగా ముద్రించబడి ఉన్నాయి.
ఆ విషయాలన్నీ చదివి రోజీ ఆనందంతో పొంగిపోయింది. అందులో వ్రాయబడిన కొన్ని వాస్తవాలను చదివి ఆశ్చర్యపోయింది. చిలుక మాస్టారు అడిగిన సందేహాలను చక్కగా తీర్చింది. చిలుక మాస్టారు ధన్యవాదాలు చెప్పి తను వచ్చిన దారినే వేగంగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు. తాను ఎప్పుడూ పక్షులకు, జంతువులకు, ఇతర ప్రాణులకు ఇబ్బంది కలుగకుండా ఎలా మసలుకోవాలో ఆలోచించుకుంటూ రోజీ కూడా తన ఇంటికేసి నడిచింది.
అడవి జంతువులు, పక్షులు, ఇతర ప్రాణుల కోసం ప్రారంభించబడిన ఆ పాఠశాల ఎన్నో సంవత్సరాల పాటు నిరాఘాటంగా నడిచింది. ఆ పాఠశాల విద్యాసంఘంవారు తమ సొంత కళాశాలను కూడా ప్రారంభించుకోవాలని నిర్ణయించారు. గతంలో కంటే ఇప్పుడు ఆ వన్యప్రాణులన్నీ ఎంతో వివేకాన్ని, అవగాహనను కలిగి ఉన్నాయి. నెమలి ద్వారా తమకి ఇటువంటి ప్రేరణను, చదువుకోవాలనే మహా ఆశయాన్ని అందించిన చిన్నారి రోజీని ఆ వన్యప్రాణులు తమ క్రొత్త సంస్థకు అధిపతిగా ఉండమని అభ్యర్థించాయి. అంతే కాదు – కఠోర పరిశ్రమ, పట్టుదల, స్వీయ నియంత్రణ, ఓర్మి వంటి లక్షణాలను పెంపొందించుకున్న నెమలికి గౌరవ డాక్టరేట్ ను బహూకరించి అతనిని ఎంతగానో సత్కరించుకున్నాయి. ఇప్పుడు ఆ పాఠశాలలో వన్య పశు పక్ష్యాదులే కాక చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు కూడా విద్యాభ్యాసం చేస్తున్నారు.
‘విద్య’ ప్రపంచాన్ని మార్చి వేయగలదు, ఇందులో సందేహం లేదు!
మూలం: ఉమయవన్ రామసామి
తెలుగు: వల్లూరు లీలావతి