[box type=’note’ fontsize=’16’] ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతం… విక్టోరియా ఫాల్స్‌ని సందర్శించి తాము పొందిన అనుభూతిని, తమ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు నర్మద రెడ్డి. [/box]
నమీబియా తర్వాత మా గమ్యం జింబాబ్వే.
విక్టోరియా ఫాల్స్ ఏడు వింతలలో (Natural Wonders) ఒకటైన అతి పెద్ద జలపాతం. జాంబెజి నది, ఇలా జలపాతంగా పడుతోంది. దక్షిణాఫ్రికాలో జాంబియా మరియు జింబాబ్వే దేశాల మధ్యన వున్నది.
మేము నమీబియా నుండి విక్టోరియా ఫాల్స్ చూడడానికి విమానంలో వెళ్ళాము. అక్కడిక మధ్యాహ్నం 3 గంటలకి చేరుకున్నాము. అక్కడికి మేము వెళ్ళగానే హోటల్ వాళ్ళు ఒక షటిల్ బస్‌లో ఉచితంగా ప్రతి గంటకి విక్టోరియా ఫాల్స్‌కి తీసుకొని వెళ్తున్నారని తెలిసింది. అందులో మేము కూడా విక్టోరియా ఫాల్స్ చూడడానికి వెళ్ళాము.
అక్కడి ప్రవేశ రుసుము చెల్లించి విక్టోరియా ఫాల్స్ నేషనల్ పార్క్ లోకి వెళ్ళి 2 గంటలు ఆ అడవిలో అన్ని మార్గాల ద్వారా ఫాల్స్‌ని చూడవచ్చు. అన్ని ఫోటోలు తీసుకున్నాము. ఈ విక్టోరియా ఫాల్స్ నీళ్ళు ఎంతో ఎత్తు నుండి పడ్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్టు వరకు దీని (fog) మంచుతెరలని చూడవచ్చు. ఎన్నో కిలోమీటర్ల వరకు ఈ తుంపరలు పడ్తూ వుంటాయి. మనము పార్కుకి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాలి. లేకుంటే వచ్చేలోపు తడిచి ముద్ద అయిపోతాము.
ఇక్కడ అలా పై నుండి నీరు పడ్తూ వుంటే “చినుకు చినుకు పడూ వుంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి…” అనే పాట గుర్తు వచ్చింది. మేము రెయిన్ కోట్ తీసుకొనలేదు. తడిచి ముద్దయి పొయ్యాము.
ఆ నీటి ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ తెల్లటి పాలనురుగులా ఉంది. పైనుండి పాలధార పడ్తుందా అని అనిపించే తెల్లటి జలధార చూచి పరవశించిపొయ్యాము. ఆ దృశ్యాన్ని నా మనోఫలకాలపై ముద్రించుకున్నాను. ఆ దృశ్య కావ్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే. మేమిద్దరం ఫొటోస్, వీడియోలు తీసుకొని 7 గంటలకి హోటల్‌కి తిరిగివచ్చాము.
రాత్రి అక్కడ జింబాబ్వే ఆదిమ జాతికి చెందినవారు, వారి వస్త్రధారణతో, వారి వంట రుచులతో వండిపెట్టే ఒక రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఎన్నో రోజులముందే ఈ రెస్టారెంట్‌లో బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అంత రద్దీగా వుంటుంది. భోజనానికి వీరు వారి సాంప్రదాయ పద్దతిలో (drums) తప్పెట్లు తాళాలతో మనల్ని స్వాగతం పలుతారు. తర్వాత అక్కడి భోజనాలు సూపులు, సలాడ్స్, బార్బెక్యూలో తయారయిన వెజ్., నాన్-వెజ్ పదార్థాలు చాలా వున్నాయి. అన్ని కుండలలో వెదురు కట్టె గ్లాసులతో లేక రాగి పాత్రలలో! మనము అన్నీ వడ్డించుకోవచ్చు. సుమారుగా 100 మంది పైనే వున్నారు. అందరూ భోంచేస్తూ వుండగానే వారి సాంప్రదాయ నృత్యాలు చేశారు. అందరికి ఒక శాలువాతో వారి బట్టలు అలంకరణతో మమ్మల్ని తయారు చేశారు.
నాకు చెంపమీద ఆదిమ జాతులు ముఖంపై వేసుకొనే ఒక పక్షి ఈకను చెంపమీద చిత్రీకరించారు. అది ఒక ఫొటో తీసుకొని వారి విందు భోజనాన్ని ఆస్వాదించి హోటల్‌కి వచ్చి పడుకున్నాము. మేము వున్న హోటల్ ఒక రిసార్టు, ఆ చీకట్లో 2 కి.మీ.లు నడిచి బిక్కు బిక్కుమని హోటల్‌లో పడుకున్నాము.
ఎందుకంటే ఆ రిసార్ట్‌లో అక్కడక్కడ విడిగా ఇళ్ళు ఉన్నాయి. మాకు తక్కువ ధరలో ఇస్తే మారుమూలలో ఒక బెడ్రూం హౌజ్ తీసుకున్నాము. ప్రొద్దున్నే ఉప్మా వండుకొని తిని సిటీకి బయలుదేరాము. మాకు ఆ సిటీలో బ్రిడ్జ్ టౌన్ ప్యాకేజ్ తీసుకొని వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ టౌన్ జింబాబ్వే జాంబియా దేశాల మధ్యన వున్నది. మాకు ఒక రోజుకి స్పెషల్ పర్మిషన్ ఇమ్మిగ్రేషన్ తీసుకొని జాంబియా లోకి అడుగుపెట్టాము.
ఈ బ్రిడ్జిని 1905లో నిర్మించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రడ్జి అట. అక్కడికి వెళ్ళగానే ఈ బ్రిడ్జి క్రింది భాగాన నుండి చాలామంది (“బంగీ” జంపింగ్) పై నుండి దూకడం చేస్తున్నారు. వారిని వీడియో తీసుకొని నేను అక్కడ మాకు కూడ ఆ బ్రిడ్జి క్రింది భాగాన నడవాలంటే బంగీ జంపింగ్ చేసినట్లుగా అన్నీ బెల్ట్ పెట్టారు. ప్రతి స్థంభం దగ్గర ఈ క్లిప్స్‌ని మార్చుకుంటూ 2 అడుగులు మార్గం ఆ బ్రిడ్జి క్రింద వున్న దాని మీద నడుస్తూ 2 గంటలు ఆ బ్రిడ్జి చరిత్ర వింటూ ఎక్కడ పడిపోతామో అనే భయంతో నడుస్తూ, అక్కడక్కడ ఫొటోలు తీసుకొంటూ ఆ వంతెనని దాటాము. అక్కడ చూచిన విక్టోరియా ఫాల్స్ అతి అద్భుతంగా వుంది. దానిపై “ఇంద్ర ధనస్సుతో శోభిల్లుతోంది. ఆ రెండు గంటలు ఉద్వేగ పూరితమైన నడక.
బ్రిడ్జి క్రింది భాగాన నడిచాము. 364 అడుగుల ఎత్తులో వుంది. ఇక్కడ ఒక ఆస్ట్రేలియా అమ్మాయి ప్రమాదవశాత్తు పడిపోయిందట. 79 అడుగులు దుంకితే క్రింద జాంబెజి నదిలో మొసళ్ళు వుంటాయట. ఇక్కడ నుండి పడి తను బ్రతికింది.
ఈ బ్రిడ్జి గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. దీనికి అంత చరిత్ర వుంది. ఈ బ్రిడ్జి మీద అక్కడ హెలికాప్టర్స్ మీద, పారా గ్లైడింగ్‌తో, బంగీ జంపింగ్‌తో బ్రిడ్జిమీద, బ్రిడ్జి క్రింద నడుస్తూ, ట్రెయిన్లో వెళ్తూ, ఈత కొడుతూ, రాఫ్టింగ్ చేస్తూ ఎన్నో రకాలుగా ఈ విక్టోరియా ఫాల్స్‌ని తిలకించవచ్చు.
ఈ బ్రిడ్జి మీద నడిచేటప్పుడు ‘ఎవరికి ఈత రాదు’ అని అడిగితే నేను ఒక్కదాన్ని చేతులెత్తాను. ‘సరే నువ్వు ఫస్ట్ ఫాలో అవ్వు’ అని అన్నారు. మా బృందంలో 9 దేశాల మనుషులు వున్నారు. మాతో పాటు నడవడానికి ప్రతి అడుగు జాగ్రత్తగా బెల్ట్‌ని ఒక రోప్‌కి వేసి 10 అడుగులు వేయగానే ఒక స్థంభం వద్ద మళ్ళీ ఆ క్లిప్స్‌ని మార్చి అవతలి ప్రక్కన త్రాడుకి వేసి మళ్ళీ నడవాలి.
ఆస్ట్రేలియన్ అమ్మాయి పడిపోయింది కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మనస్సులో భయం… ఒక్కొక్క అడుగుకి 5 నిమిషాలు పడ్తుంది. క్రింద చూస్తే పరవళ్ళు తొక్కుతూ జాంబెజి నది. ఎక్కడ పడిపోతామో అని ‘గుండె గుబులు గుబులుగా వుందిరో హాయిరామా హాయిరామా’ అని క్షణం క్షణం లెక్క పెట్టుకుంటూ నడిచాను. అని పాడుకుంటూ ఆ రెండు కొండల మధ్యన విక్టోరియా ఫాల్స్^^ని చూచిన తర్వాత ఈ భయం అంతా పటాపంచలైపోయింది.
ఈ బ్రిడ్జిని కట్టాలని సిసిల్ రోడ్స్ అనే అతను సంకల్పించాడు. ఈ బ్రిడ్జి కట్టి రైలు బండి బ్రిడ్జి మీద వెళ్తు ఉంటే, ఆ తుంపరలు మీద పడ్డూ వుంటే ఆ తుంపర్లని పట్టుకుంటూ ప్రయాణం చేయాలని కలలు కన్నాడట. కాని విధి వక్రీకరించింది. అతను ఈ ట్రెయిన్ ఎక్కకుండానే చనిపోయ్యాడు.
ఈ బ్రిడ్జిని కట్టడం ఒక చరిత్ర. 198 మీటర్ల ఎత్తు, 650 అడుగుల పొడవుతో పైన మద్యన ఆర్చి 156.50 మీటర్ల ఎత్తు (513 అడుగులు) 128 మీటర్ల (420 అడుగులు) పైన జాంబెజి అనే నదిపై కట్టారు. ఇది ఒక లింక్ రోడ్ కూడా. జాంబియాకి జింబాబ్వేకి ఇదొక్కటే నేల మార్గము. 50 సంవత్సరాలుగా యూరప్, రోడీషియా, సౌత్ ఆఫ్రికా, జాంబియా, జింబాబ్వేకి, రాగి, బొగ్గు, చెక్క సరఫరా చేయబడ్తుంది ఈ మార్గం ద్వారా.
మేము 2 గంటలు ఆ బ్రిడ్జికి ఎన్ని నట్స్ (nuts), బోల్ట్ (bolts) ఉపయోగించారో అది ఇనుము expand అవుతే overlap చేసి బ్రిడ్జిని ఎలా కట్టారో చెప్తూంటే వింటూ నడిచాం. ఆ బ్రిడ్జికి 200 మంది ఒక సంవత్సరం పాటు పెయింట్ వేశారట. ఇలా ఎన్నెన్నో విషయాలు చెప్పారు. ఇక్కడికి వెళితే ఈ బ్రిడ్జి టూరు తప్పనిసరిగా వెళ్ళాలి.
ఈ బ్రిడ్జికి నిర్వహణ సమస్య వచ్చింది. రైలు ఆ బ్రిడ్జి మీద వెళితే, ట్రక్స్ 30 టన్నుల కంటే ఎక్కువ బరువు వున్నవి పోకూడదు. అందుకని అక్కడ దాన్ని ఫెర్రీ ద్వారా రవాణా చేశారు. 2006 లో ఈ బ్రిడ్జిని రిపేరు చేసి ఇప్పుడు ఆటంకం లేకుండా నడుపుతున్నారు. రోడీషియా, బుష్ యుద్ధం జరిగినప్పుడు 1975లో దీన్ని చాలా సార్లు మూసివేశారు. 2006 తర్వాత ఈ బ్రిడ్జి మీద నిరాటంకంగా రాకపోకలు సాగుతున్నాయి.
మానవ మేధస్సులో అత్యద్భుత రూపకల్పన ఈ బ్రిడ్జిని సందర్శించాకా మేము బ్రెయిన్ ఎక్కి ఆ తుంపరలు మీద పడ్తూ వుంటే ఆ ట్రెయిన్లో ఆ బ్రిడ్జి మీద ఆ తుంపర్లతో ఆడుతూ ఇంటికి తిరిగి వచ్చాము.
మర్నాడు జింబాబ్వే రాజధాని హారారేకి వచ్చాము. మాకు తెలిసిన మిత్రులు స్వాగతం పలికారు. హరారే సిటీ, వైల్డ్ లైఫ్ చూచి మా మిత్రుల సాదర ఆదర అభిమానాల్ని చూరగొని, వారు ఆప్యాయతతో వండిన వంటలు మన ఇంటి భోజనం రెండు రోజుల తిని ఆనందించాము.
అక్కడి ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాం. అలయం, సంస్థకి చెందిల కట్టడాలు అనేక ఎకరాలలో విస్తరించి వున్నాయి. అన్నీ చూచి మొక్కి అక్కడి నుండి ఉగాండాకి బయల్దేరాము.
ఉగాండా వివరాలతో మళ్ళీ కలుద్దాం.