సమసమాజ నిర్మాణంలో రచయితలది గొప్ప పాత్ర – రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖామంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్
[dropcap]స[/dropcap]మసమాజ నిర్మాణంలో రచయితలది క్రియాశీలక పాత్ర అని రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, యువజన సర్వీసులు, పురావస్తు, పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖా మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్ 5 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో జరిగిన పాలమూరు సాహితి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా అంటేనే కవుల జిల్లా అని, సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన నేల అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర విస్మరించరానిదన్నారు. ఎందరో కవులు, రచయితలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు. ఆనాడు మన కవులను ఎక్కిరించిన ఆంధ్ర కవులను నిరసిస్తూ ‘గోల్కొండ కవుల సంచిక’ ను 354 మంది కవులతో వెలువరించడం తెలంగాణ పౌరుషాన్ని చాటుతుందన్నారు. మన సమాజంలో ఇంకా నెలకొని ఉన్న భావజాడ్యాలను తొలగించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కవులు విశేషంగా కృషి చేయాలన్నారు.
అనంతరం 2020 సంవత్సరానికి “కవిత్వమే ఓ గెలాక్సీ” కవితాసంపుటిని రచించిన ఐనంపూడి శ్రీలక్ష్మికి, 2021 సంవత్సరానికి “ప్రాణదీపం” కవితాసంపుటిని రచించిన గాజోజు నాగభూషణానికి మంత్రి పాలమూరు సాహితి పురస్కారాలను మెమంటో, శాలువాలతో పాటు 5116/- నగదు పురస్కారాలను అందజేశారు. పాలమూరు గడ్డ నుంచి పాలమూరు సాహితి సంస్థ ప్రతి సంవత్సరం పురస్కారాలను లబ్ధప్రతిష్టులైన కవులకు ఇవ్వడం ప్రశంసనీయమన్నారు.
అలాగే యువకవి డాక్టర్ వెలుదండ వేంకటేశ్వరరావు రచించిన ‘వేంకటేశ శతకం’ను మంత్రి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా కళాకారుల సంస్థ అధ్యక్షులు వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మేలిమి సాహిత్యాన్ని సృజిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితి పురస్కారాలను అందజేయడం అభినందనీయమన్నారు.
విశిష్ట అతిథి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ పాలమూరు జిల్లా సాహిత్యం తెలంగాణ సాహిత్యానికి దిక్సూచి అని కొనియాడారు. అప్పకవి జన్మించిన నేల నుంచి పాలమూరు సాహితి పురస్కారాలను అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎంతోమంది ఉద్ధండులైన కవులు, రచయితలు, పరిశోధకులు, విమర్శకులు పుట్టిన నేల పాలమూరు జిల్లా అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా కవుల పాత్ర గొప్పదన్నారు.
పాలమూరు సాహితి అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో బలమైన సామాజిక కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు గత పన్నెండు సంవత్సరాలుగా పాలమూరు సాహితి పురస్కారాలను అందజేస్తున్నామన్నారు.
ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వేంకటేశ్వర రెడ్డి, ప్రముఖ విద్యావేత్తలు కె.లక్ష్మణ్ గౌడ్, వాగ్దేవి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్ రెడ్డి లు మాట్లాడారు. పురస్కార గ్రహీతలైన ఐనంపూడి శ్రీలక్ష్మి, గాజోజు నాగభూషణంలు మాట్లాడారు. అనంతరం వేంకటేశ శతకం పుస్తకాన్ని డాక్టర్ విరివింటి సురేష్ బాబు సమీక్ష చేసారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ గుంటి గోపి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.