పలాస ప్యాసింజర్

0
1

[box type=’note’ fontsize=’16’] కొడుకు వదిలేసిన ఓ అమ్మలో తన తల్లిని చూసుకున్నాడో రైల్వే ఉద్యోగి – శంకరప్రసాద్ వ్రాసిన “పలాస ప్యాసింజర్” కథలో. [/box]

[dropcap]టైం[/dropcap] పన్నెండుంపావు అవుతోంది. విజయగరం రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నెంబరు 2 మీద, సిమెంటు బల్ల మీద కూర్చొని ఉందొక ముసలావిడ. నిండుగా ఉన్న గుడ్డ సంచి ఆమె పక్కనే ఉంది. దానిలో బట్టలు ఇంకా ఏవో ఇతర వస్తువులు బాగా కుక్కిపెట్టినట్టుగా కనిపిస్తుంది. స్టేషన్ ప్లాట్‌ఫాం పైకప్పుకున్న ఇనప దూలానికి వేలాడుతున్న పాతకాలం నాటి రైల్వే ఫ్యాన్లు ఇష్టం లేని గానుగెద్దుల్లా, నెమ్మదిగా, చప్పుడు చేసుకుంటూ మూలుగుతూ తిరుగుతున్నాయి. అసలే విజయనగరం, ఆపై మద్యాహ్నం పన్నెండు దాటింది. ఉక్కపోత, గాలివీత లేదు. ఆ ముసలావిడ ముఖంలో ఏదో తెలియని ఆర్తి, ఆందోళన, విచారం, చింత గూడు కట్టుకొని కనిపిస్తున్నాయి.

ఇంతలో స్టేషన్‌లో అనౌన్సుమెంటు, ఏదో ఎక్స్‌ప్రెస్ రైలు కొద్ది సేపట్లో వస్తుందని. కాసేపటికి, హడావిడిగా, పొగలు కక్కుతూ, చెవులను కోత కోస్తూ, కూత కూస్తూ, ఆ ఎక్స్‌ప్రెస్ బండి వచ్చి స్టేషన్‌లో ఆగింది. దిగేవాళ్ళూ, ఎక్కేవాళ్ళతో టీ, కాఫీలు, కూల్ డ్రింకులు అమ్మేవాళ్ళ అరుపులతో స్టేషన్ హడావిడిగా ఉంది. సిమెంటు బల్ల మీద కూర్చొని ఉన్న ముసలావిడ అలానే కూర్చొని ఉంది. కొద్ది సేపటికి ఎక్స్‌ప్రెస్ బండి, మెల్లగా బయల్దేరి స్టేషన్ వదిలింది. ప్లాట్‌ఫాం మళ్ళా యథాస్థితికి వచ్చింది.

టైం గడుస్తోంది. ముసలావిడ మాత్రం అలానే కూర్చొని ఉంది. నా డ్యూటీ రాత్రి 10 గంటల వరకు.  డ్యూటీ చేస్తూ మధ్య మధ్యలో ముసలావిడను చూస్తున్నాను. ఆవిడ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు కలిగింది. డ్యూటీలో నిమగ్నమయ్యాను. రాత్రి 10 గంటలయ్యింది. నా రిలీవర్ రామకృష్ణ వచ్చాడు. అతడికి కౌంటర్లో ఉన్న పని అప్పగించేసి, హడావిడిగా ఇంటికి బయల్దేరి వెళ్ళిపోయాను. ముసలావిడ సంగతి మరచిపోయాను. మళ్ళా పొద్దున్న 8 గంటల డ్యూటీకి రావాలి, ఇంటిలో ఒంటరిని కదా, వంటపని ఇంకా చాలా పనులు ఉంటాయి, ఆ ఆలోచనల వలన ముసలావిడ సంగతి మరచిపోయాను. అన్నట్టు చెప్పడం మరచిపోయాను. ఆ రోజు రావాల్సిన పలాస ప్యాసింజర్ క్యాన్సిల్ అయ్యింది. ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వలన.

మరుసటి రోజు ఉదయం ఉరుకుతూ స్టేషన్ చేరుకున్నాను. టైం 8 అవుతోంది. రామకృష్ణ కౌంటర్లో నా కోసం ఎదురుచూస్తున్నాడు. డ్యూటీ అప్పగింతల కార్యక్రమం పూర్తయింది. రామకృష్ణ వెళ్ళిపోయాడు. నేను మళ్ళా కౌంటర్ దగ్గర యథాప్రకారం కూర్చున్నాను. సడన్‌గా నిన్నటి ముసలావిడ గుర్తుకొచ్చింది. ఆత్రుతగా ప్లాట్‌ఫాం వంక చూసాను. ఆవిడే అనుకుంటా, సిమెంటు బల్ల మీద అటు తిరిగి పడుకొని ఉంది. సంచీ ఆమె తలకింద ఉంది. నాకు గుండె చివ్వుమంది. కొద్దిసేపు తటపటాయించి, నిర్ణయించుకున్నాను ఆ ముసలావిడతో మాట్లాడాలని.

ప్లాట్‌ఫాం రెండు మీదకి వెళ్ళి, బల్ల మీద నిద్రపోతున్న ముసలావిడను మెల్లగా తట్టి లేపాను. ఆవిడ ఇటు వైపు తిరిగి కళ్ళు తెరచి నన్ను చూసింది. “అమ్మా ఎవరు నువ్వు, నిన్నటి నుంచీ ఇక్కడే ఉన్నావు, ఏ బండీ ఎక్కలేదు, రాత్రంతా ఇక్కడే ఉన్నావు, నాకు చెప్తే, చేతనైన సాయం చేస్తాను” అన్నాను. ఆమె ముఖంలో ఏవో కదలికలు కనిపించాయి. నెమ్మదిగా లేచి కూర్చుంది. నేను ఆవిడ పక్కనే కూర్చున్నాను. ఇంతలో అటుగా వస్తున్న, క్యాటరింగ్ అబ్బాయిని ఆపి, ఇడ్లీ ప్యాకెట్ తీసుకొని, ఆమె చేతిలో పెట్టాను. “నిన్నటి నుండీ ఏమీ తినినట్లు లేవు, ఇవి తిని నీ గురించి చెప్పమ్మా” అన్నాను.

ముసలావిడ కంటిలో ఆర్ద్రత, కంటి కొనల వెంట నీటిబిందువులు కనిపించాయి.  “తినాలని లేదు బాబు” అంది.

“ఇంతకీ ఎవరమ్మా నువ్వు, ఎందుకు నిన్నటి నుండీ ఇక్కడే ఉన్నావు, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టున్నావు, నాకు చెప్పు, ఏదైనా సాయం చేస్తాను” అన్నాను.

ఆ ముసలావిడ కొంగుతో కళ్ళు తుడుచుకొని, ” నా పేరు అన్నపూర్ణ బాబు, నా కొడుకు కోడలు దుబాయ్‌లో ఉంటారు. నేను ఒక్కతినే ఈ పక్కనే పల్లెటూళ్ళో ఉంటాను. నిన్న నా కొడుకు ఇక్కడికొచ్చి నన్ను తీసుకెళ్తానన్నాడు, వాడి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను ” అని చెప్పింది.

“ఏ బండిలో వస్తానన్నాడు”

“పలాస ప్యాసింజర్”

“అది నిన్న క్యాన్సిల్ అయ్యిందమ్మా”

“అయ్యో దేవుడా నాకు తెలీదు”

“సరే, ఆ బండి ఇప్పుడు వచ్చే టైం అయ్యింది, అందులో వస్తాడేమో చూద్దాం” అన్నాను.

ఇంతలో స్టేషన్‌లో అనౌన్సుమెంట్, “విజయవాడ నుండి పలాస వెళ్ళే ప్యాసింజర్, మరి కొద్ది సేపటిలో 2 వ నెంబరు ప్లాట్‌ఫాం పైకి వచ్చును” అని.

ముసలావిడ దిగ్గున లేచి నిలబడబోయి, తూలింది. నేను ఆవిడ భుజం పట్టుకొని ఆపాను. కొద్ది సేపట్లో ప్యాసింజరు బండి కూత కూసుకుంటూ ప్లాట్‌ఫాం మీదకి వచ్చి ఆగింది. మళ్ళీ అదే తంతు. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, అమ్మేవాళ్ళు, టీ, కాఫీ, టిఫిన్ అమ్ముకుంటున్నారు. ప్యాసింజర్ కదా, కొంచెం ఎక్కువ సేపే ఆగింది. ముసలావిడ ఆత్రంగా చూస్తుంది, తన కొడుకు దిగుతాడేమోనని. ఎవరూ అన్నపూర్ణమ్మ దగ్గరకి రాలేదు. బండి బయల్దేరుతుందని మళ్ళా అనౌన్సుమెంటు వినిపించింది. కాసేపటికి బండి బయల్దేరి స్టేషన్ దాటి వెళ్ళిపోయింది.

అన్నపూర్ణమ్మ కళ్ళలో అశ్రువులు. నేను ఆమె చేతిని పట్డుకొని, సిమెంటు బల్ల మీద కూర్చోబెట్టాను.  “నా కొడుకు రాలేదు బాబు” గద్గదంగా అంది అన్నపూర్ణమ్మ. ” ఊరుకో అమ్మా, ఫరవాలేదు, నీ కొడుకు ఏదో పని ఉండి రాలేక పోవొచ్చు, మళ్ళా వీలైనప్పుడు వస్తాడులే, నువ్వు ఒంటరిగా ఆ పల్లెటూళ్ళో ఉండటమెందుకు, నా ఇంట్లో నీ కొడుకు వచ్చినంత వరకు ఉండు, నన్ను నీ చిన్నకొడుకనుకో” అని ఆమె చేతులు పట్టుకొని, ప్రాధేయపడుతున్నట్టుగా అడిగాను.

“వద్దు బాబు, మా ఊరెళిపోతాను”

“అమ్మా, నాకు అమ్మానాన్న లేరు, నీకు ఇక్కడ ఎవరూ లేరు, నువ్వే నా అమ్మవి అనుకుంటా, నాతో రా, మళ్ళా నీ కొడుకు వచ్చినప్పుడు వెళ్ళిపోదువులే” అని ఆమె సంచిని ఒక చేతిలో తీసుకొని, ఇంకో చేతితో ఆమె చేతిని పట్టుకొని, స్టేషన్ బయటకు అడుగులేసాను.

నా స్వగతం:- “అన్నపూర్ణమ్మ కొడుకు ఎప్పటికీ రాడు తన తల్లిని తీసుకెళ్ళడానికి. ఈ పెద్ద వయసులో ఈమె కొడుకుకి దూరం అయ్యింది. నేను చిన్న వయసులోనే అమ్మానాన్నలకి దూరం అయ్యాను. ఈ రోజు నుండి అన్నపూర్ణమ్మే నా అమ్మ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here