పలికే మౌనం!!

0
2

[dropcap]ఆ[/dropcap] గగనాస్తరణం ఉలకదు
ఆ అరుణారుణం పలకదు
ఆ సలిలాలయం ఏమనదు
ఆ విటపావృతం కిమ్మనదు

ఆ కుధరాతిశయం ఉలకదు
ఆ సికతావరణం పలకదు
ఆ పాషాణశకలం ఏమనదు
ఆ ప్రకృతి సర్వము, మౌనఘనం!
***
మౌనమా?! ఇది మన అజ్ఞానమా?!
ప్రకృతి ఓ నిరంతర సుభాషి!
వినగలిగే ఆ చెవులే ఉంటే,
కనగలిగే ఆ మానసముంటే!!
***
ఆ రసాయనాలనే విషానుపానాలతో
విరసం చేసేస్తే, జలాశయాలన్నిటినీ
నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని
వర్షించని గర్జలు, హెచ్చరిక ప్పల్కులే!!
~
గగనం యెదలోని చల్లని పల్కరింపే, వర్షం!!
నీ నడవడిపై ఆకాశం ఇచ్చే, ఉత్తీర్ణపత్రం!
***
కొరగానివన్నిటితో నింపే కూపం చేసి
ఆ రత్నాల కలశి, సంద్రాన్ని పాడుచేస్తే
నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని
ధర ముంచే, ఆ సునామీ క్రోథావేశ ప్పల్కే!!
~
కట్టడిలో తానిచ్చే బహుమానమే, శాంతతీరం!
నీ నడవడిపై, కడలి ఇచ్చే, ఉత్తీర్ణపత్రం!
***
ఏ గొంకు లేక తరు సంపద కూల్చివైచి
నిశ్శంకగ గిరి, ఖనిజాల దోచి వేస్తే
నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని
మారిపోయే ఆవరణం, విప్లవ ప్పిలుపే!!
~
వృక్షాలను రక్షిస్తే, ఆ నవ్వే హరిత సుందరం!
నీ నడవడిపై ఆ వని ఇచ్చే, ఉత్తీర్ణపత్రం!
***
ఆకాశం, పెనుసంద్రం, ఈ భూమి, ఆ తరులు
ఏ యుగమూ, ఏ దినమూ, కావవి మౌనాలు!
కనులు విప్పార్చి, చెవులు రిక్కించి వింటే
అనునిత్యం విన్పిస్తాయి, నిశ్శబ్ద ప్రబోధాలు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here