[dropcap]ప[/dropcap]ల్నాడు.. పౌరుషాలకు పెట్టింది పేరు!
కోడి పందాల పోటీలతో ఈ ప్రాంతం రాష్ట్రంలో ప్రసిద్ధి!
పల్నాడు.. శౌర్య పరాక్రమాలకు పోరాటాలకు.. పురిటిగడ్డ!
వర్ణ భేదాలు అంతమొందించేలా..
బ్రహ్మనాయుడు ‘చాపకూటి’ మహా మానవత్వయజ్ఞంతో..
జనుల మధ్య వున్న అసమానతలు తొలగించగా..
మానవత్వాన్నే తన అభిమతం గా మార్చుకున్న..
పల్నాటి బ్రహ్మనాయుడు ‘ కీర్తి ‘ అజరామరమయ్యేను!
గుత్తికొండ బిలాన బ్రహ్మనాయుడు అదృశ్యమయ్యేను!
‘తెలుగు తేజం ‘ లా ప్రజల మదిలో నిలిచేను!
మగువ మాంచాల ..’స్రీ’ జాతిలో రత్నమై
ఈ ప్రాంతంలో మెరవగా ..
‘పల్నాటి యుద్దం ‘ చరిత్రలో నిలిచిపోయే ‘స్రీ’ శక్తికి నిదర్శనం!
నాయకురాలు నాగమ్మ ‘రాజనీతి’ నేర్పరితనం ..
బాలచంద్రుడి కత్తి పదును..
సమర రంగాన శత్రుశేషాల్ని తుదముట్టిస్తూ సాగిన వైనం ..
కన్నమదాసు వీరత్వం..
పల్నాటి ప్రాంత రోషాలకు నిదర్శనం!
నాగులేరు, చంద్రావతి నదులు..
జల సిరులతో ఉరకలెత్తే కృష్ణవేణమ్మ పరవళ్ళ గలగలలు..
పల్నాటి సీమను సస్యశ్యామలం చేస్తుంటే..
వరి, ప్రత్తి, మిరప సాగుతో ఈ ప్రాంతం సుభిక్షం!
శ్రీ లక్ష్మీచెన్నకేశవ ఆలయం.. పల్నాటి ప్రాంతానికే మణిహారం!
ఎత్తిపోతల జల విన్యాసాల సౌందర్యాలు..
ఆధునిక దేవాలయం ‘నాగార్జున సాగర్’ సుందర నదితీరం..
ఇక్కడ దర్శనీయ స్థలాలు!
ఆచార్య నాగార్జునుడు అడుగిడిన పుణ్యస్థలి !
మిర్చిఘాటుతో మమేకమైన ఘనచరిత్ర కలిగిన ఈ ప్రాంతం..
ఊరకలెత్తే ఉత్సాహం.. నిత్య చైతన్యం.. ఇక్కడి ప్రజల జీవనవిధానం!
మాటలలో ఆప్యాయత.. మనస్సులో చెదరని మమత.. ఇక్కడి జనుల ప్రత్యేకత!
నా పల్నాడు.. జగం మెచ్చిన ‘ధైర్య సాహాసాల’కు ప్రతీక!